TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 7th Lesson ఉడుత సాయం Textbook Questions and Answers.

TS 6th Class Telugu 7th Lesson Questions and Answers Telangana ఉడుత సాయం

బొమ్మను చూడండి ఆలోచించండి- మాట్లాడండి. (TextBook Page No. 64)

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం 1

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
బొమ్మలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు ?
జవాబు.
బొమ్మలో నాకు తల్లీకూతుళ్ళు, అన్నాచెల్లెళ్ళు, బాటసారిని రోడ్డును దాటిస్తున్న బాలుడు కనిపిస్తున్నారు.

ప్రశ్న 2.
వారు ఏం చేస్తున్నారు ?
జవాబు.
తల్లి కూరలు తరుగుతుంటే కూతురు సహాయపడుతున్నది. అన్న రోడ్లపై చెత్తను ఊడుస్తుంటే, చెల్లెలు ఆ చెత్తను తట్టలోకి ఎత్తుతున్నది. బాలుడు ఒక అంధుడ్ని రోడ్డు దాటిస్తున్నాడు.

ప్రశ్న 3.
వారు చేసే పనుల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది ?
జవాబు.
వారు చేసే పనుల వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది.

ప్రశ్న 4.
మీరు ఎవరికి, ఎప్పుడు, ఏ సందర్భంలో సహాయం చేశారు ?
జవాబు.
ఒక వృద్ధుడు తన సామానుతో రైలు ఎక్కలేక బాధపడుతున్న సందర్భంలో ‘నేను సహాయం చేశాను.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.66)

ప్రశ్న 1.
‘నిర్మల భక్తి’ అంటే ఏమిటి ?
జవాబు.
‘నిర్మల భక్తి’ అంటే స్వచ్ఛమైన భక్తి. కొంతమంది భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్లు నటిస్తారు. అలాకాకుండా నిజమైన భక్తి కల్గి ఉండటాన్నే ‘నిర్మల భక్తి’ అంటారు. ఉడుతకు రామునిపై గల భక్తి నిర్మల భక్తి.

ప్రశ్న 2.
‘అడుగు దామరలు మనమున జేర్చి’ అంటే నీకేమి అర్థాలు : అర్థమైంది ?
జవాబు.
‘అడుగు దామరలు’ అంటే పాదపద్మాలు అని అర్థం. ‘అడుగు దామరలు మనమున జేర్చి’ అంటే పాదపద్మాలను మనస్సులో నిలుపుకోవడం.
ఉడుత శ్రీరాముని పాదపద్మాలను తన మనస్సులో నిలుపుకొనేది. అంటే ఉడుత శ్రీరాముని తన మనస్సులో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచేదని అర్థం.

ప్రశ్న 3.
ఉడుత నీళ్ళలో మునిగి ఇసుకలో పొర్లాడి వేగంగా వచ్చి కట్టపై రాలుస్తున్నది కదా ! అట్లా ఎందుకు చేయాలని అనుకున్నది?
జవాబు.
ఉడుత రామునిపై అమితమైన భక్తి గలది. అందువల్ల వానరులు నిర్మించే సేతువు తొందరగా పూర్తి కావాలని ఆశించింది. అందుకే అది తన వంతు సహాయంగా నీళ్ళలో మునిగి ఇసుకలో పొర్లాడి, వేగంగా వచ్చి కట్టపై ఇసుకను రాల్చాలని అనుకున్నది.

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.68)

ప్రశ్న 1.
రామలక్ష్మణుల సంభాషణ ద్వారా మీరు ఏమి
జవాబు.
రామలక్ష్మణుల సంభాషణ ద్వారా నేను ఏమి గ్రహించానంటే ..

  1. రామునిపై భక్తితో ఉడుత తనకు మించిన శక్తి అని కూడా తలచకుండా వారధి నిర్మాణంలో సహాయపడిందని గ్రహించాను.
  2. భక్తితో రాముని పాదాలను మనస్సులో నిల్పుకొని గడ్డిపోచంత పని చేసినా అది కొండతో సమానమని గ్రహించాను.

ప్రశ్న 2.
‘ఉడుతాభక్తి’ అంటే ఏమిటి ?
జవాబు.
శక్తికి తగినట్లు, భక్తితో చేతనైన సాయం చేయడాన్ని ‘ఉడుతాభక్తి’ అంటారు.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
పాఠాన్ని (ద్విపదను) రాగ, భావయుక్తంగా పాడండి.
జవాబు.
ఉపాధ్యాయుని పర్యవేక్షణలో సాధన చేయండి.

ప్రశ్న 2.
మీరు ఎవరికైనా సాయం చేశారా ? అప్పుడు వారు ఏ విధంగా స్పందించారు ?
జవాబు.
అది నాలుగు రోడ్ల కూడలి. ఒక ముసలి తాత రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతున్నాడు. అది నేను గమనించాను. వెంటనే ఆయన వద్దకు వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని జాగ్రత్తగా రోడ్డు దాటించాను. అందుకు ఆయన చాలా సంతోషించి నాకొక చక్కని బహుమతి ఇచ్చాడు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం:

1. కింది అర్థం గల పద్యపాదాలు మీ పాఠంలోని పద్యాలలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ పాదాలు రాయండి.

అ. త్వరగా సేతువు నిర్మాణం కావాలి.
జవాబు.
గొబ్బున సేతువు గొనసాగవలయు.

ఆ. తన ఒంటికంటిన యిసుకను రాలుస్తున్నది.
జవాబు.
………… తన మేని యిసుక
వడిగట్టపై రాల్చి …………..

ఇ. పలు విధాల పొగడి.
జవాబు.
పలుతెఱంగుల జాల బ్రస్తుతిజేసి

ఈ. భక్తితో గడ్డిపోచంత పనిచేసినా అది కొండతో సమానం.
జవాబు.
ఎవ్వడు మదినిల్పి యెసగుఁదృణంబు నవ్వేల్పు గిరిబోలు ………….

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

2. కింది పద్యాన్ని చదివి సరైన జవాబును గుర్తించండి.

ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక చేయువాడె నేర్పరి సుమతీ !

అ. అపకారి ( )
క) కీడు చేసేవాడు
ఖ) మేలు చేసేవాడు
గ) సాహసం చేసేవాడు
ఘ) ఏదీకాదు
జవాబు.
క) కీడు చేసేవాడు

ఆ. పద్యం ఎవరి గురించి తెలియపరుస్తున్నది ? ( )
క) ఉపకారి
ఖ) మమకారి
గ) అపకారి
ఘ) నేర్పరి
జవాబు.
ఘ) నేర్పరి

ఇ. గొప్ప విషయం ( )
క) అపకారికి ఉపకారం చేయడం
ఖ) ఉపకారికి ఉపకారం చేయడం
గ) అపకారికి అపకారం చేయడం
ఘ) ఏదీకాదు
జవాబు.
క) అపకారికి ఉపకారం చేయడం

ఈ. పద్యంలో ‘తప్పు’ అనే అర్థం వచ్చే పదం ( )
క) ఎన్నక
ఖ) నెపము
గ) విపరీతము
ఘ) నేర్పరి
జవాబు.
ఖ) నెపము

ఉ. పద్యమకుటం ( )
క) సుమతీ
ఖ) కుమతీ
గ) మందమతి
ఘ) ఏదీకాదు
జవాబు.
క) సుమతీ

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) తొందరగా సేతువు నిర్మాణం కొనసాగాలని ఉడుత అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
రాముడు లంకకు వెళ్ళి రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకొని రాదలచాడు. అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించమని రాముడు వానర సైన్యాన్ని ఆదేశించాడు. ఎంత తొందరగా సేతువు నిర్మాణం జరిగితే అంత తొందరగా రాముడు లంకకు వెళ్ళి, రావణుని సంహరించి సీతను తీసుకొని వస్తాడు. అందువల్ల తొందరగా సేతువు నిర్మాణం కొనసాగాలని ఉడుత అనుకొన్నది.

ఆ) ‘’భక్తితో చేసే చిన్నపనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది.’ సమర్థిస్తూ రాయండి.
జవాబు.
ఉడుత ఎంతో చిన్నది. అది సేతువు నిర్మాణంలో వానరులకు సహాయపడాలనుకుంది. రాముని పాదపద్మాలను మనసులో నిల్పుకొన్నది. అతని ఎదురుగా, నిర్మల భక్తితో సముద్రంలో మునిగి వచ్చి, యిసుకలో పొర్లి, వెంటనే “కట్టపైకి వచ్చి తన ఒంటికి అంటిన యిసుకను విదిలించింది. ఇలా మరల మరల చేసింది. ఇది చూసి రాముడు సంతోషించాడు. ఉడుతను లక్ష్మణునిచేత తెప్పించి పలువిధాల పొగడి తన కుడిచేతితో దాని వీపుపై నిమిరాడు. కాబట్టి భక్తితో చేసిన చిన్నపనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.

ఇ) రాముడు ఉడుత చేసిన సహాయాన్ని మెచ్చుకొని వీపును దువ్వాడు. అట్లాగే మీరు చేసిన సహాయాన్ని ఇతరులు మెచ్చుకొన్న సంఘటన గురించి రాయండి.
జవాబు.
నేను నా స్నేహితులతో కలిసి బడికి వెళ్తున్నాను. అదే సమయంలో ఒక గుడ్డివాడు రోడ్డు దాటి అవతలికి వెళ్ళాల్సి వచ్చింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అతడు పిలిచినా ఎవరూ వినిపించుకోవడం లేదు. అప్పుడు నేను ఆయన వద్దకు వెళ్ళి, చేయి పట్టుకొని రోడ్డు దాటించాను. ఆయన సంతోషించి “చల్లగ ఉండు నాయనా!” అని నన్ను దీవించాడు.

ఈ) ఈ పాఠం ఆధారంగా గోన బుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం ఎట్లా ఉన్నది ?
జవాబు.
ఈ పాఠం ఆధారంగా గోన బుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం అందరికి ఆసక్తి కలిగించే విధంగా సాగింది. సంఘటన కన్నుల ఎదుట జరుగుతున్నట్లుగా ఉంది. పరస్పర సహకారం మనుషులకైనా, జంతువులకైనా అవసరమని తెలియజేస్తుంది. ఉడుతలాగానే అడగకుండానే ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన కలిగిస్తుంది.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

‘ఉడుత సాయం’ పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానరభల్లూకాలు నలుని చేతికి రాళ్ళూ, రప్పలూ, కొండలూ తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత “తొందరగా సేతువు నిర్మాణం జరగాలి. అందుకోసం ఈ వీరులకు చేయూతనిస్తాను” అంటూ శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిల్పుకొన్నది. అతని ఎదురుగా నిర్మలభక్తితో సముద్రంలో మునిగి వచ్చి యిసుకలో, పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి, తన ఒంటికి అంటిన యిసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి యిసుక నంటించుకొని వారధిపై విదిలిస్తూ ఉన్నది.

భక్తితో ఉడుత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి, లక్ష్మణుని పిలిచి “నాపై భక్తితో ఉడుత సముద్రజలాల్లో తడిసి యిసుకనంటించుకొని రాళ్ళమధ్య విదిలిస్తున్నది. బలవంతులైన వానరులు కొండలను, వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత ? తన శక్తి యెంత ? అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది. చూశావా ?” అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు “నీ పాదాలను మనసులో నిలిపి, భక్తితో గడ్డిపోచంత (కొంచెం) పని చేసినా అది కొండతో సమానం (గొప్పది).

భక్తే ప్రధానం కదా !” అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడుతను తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడుతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడుతను పలువిధాల పొగడి తన కుడిచేత దాని వీపుపై దువ్వాడు. ఉడుత వీపుపై మూడురేఖలు చూడడానికి అందంగా ఆనందకరంగా ఏర్పడ్డాయి.

IV. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
ఈ పాఠాన్ని గేయరూపంలో రాయండి.
జవాబు.
ఉడుత సాయం (గేయం)

వానరులెందరో వచ్చారు
సముద్రంపై వారధి నిర్మిస్తున్నారు
వానర భల్లూకాలు రాళ్ళూరప్పలూ
నలుని చేతికి అందిస్తున్నాయి
ఉడుత తానూ సాయం చేస్తానంటూ
సముద్ర జలంలో మునిగివస్తోంది
ఇసుకలో పొర్లి కట్టపైకి చేరుతోంది
ఒంటికి అంటిన యిసుక రాలుస్తోంది
ఉడుత భక్తికి మురిసిపోయాడు రాముడు
ఉడుతను తెచ్చి రామునికిచ్చాడు సుగ్రీవుడు
రాముడు ఉడుతను పొగిడాడు
తన కుడిచేతితో ఉడుతవీపుపై దువ్వాడు
చూడటానికి అందంగా ఆనందకరంగా
ఉడుత వీపుపై మూడురేఖలు అమరాయి.

(లేదా)
ప్రశ్న 2.
కింది బొమ్మను చూసి సంభాషణలు రాయండి.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం 2

జవాబు.
ఉడుత : చీమా ! చీమా ! ఎట్లా ఉన్నావు ?
చీమ : ఉడుతా ! నేను బాగానే ఉన్నాను. నీవు ఎట్లా ఉన్నావు ?
ఉడుత : నేను బాగానే ఉన్నాను. ఎండలు బాగా కాస్తున్నాయి కదా ! నీవు ఎందుకు బయటికి వచ్చావు ?
చీమ : పుట్టలో ఉంటే ఆవిరెత్తిపోతున్నది. నా వద్ద ఉన్న ఆహారం కూడా అయిపోయింది. చల్లటి గాలి కోసం, ఆహారం కోసం బయటికి వచ్చా.
ఉడుత : అట్లాగా. ఇక్కడే ఉండు. నేను చెట్టుపైకి వెళ్ళి ఒక పండు తెచ్చి ఇస్తా.
చీమ : అట్లాగే. ఇక్కడే ఉంటా. నీవు నా కష్టాన్ని గుర్తించావు. నీవు చాలా మంచిదానివి.
ఉడుత : చీమా ! నీ కోసం పండు తెచ్చా. తీసుకో.
చీమ : ఉడుతా ! నీ సహాయాన్ని ఎన్నటికీ మరచిపోలేను. కృతజ్ఞతలు.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

V. పదజాల వినియోగం.

1. ఈ కింది వాక్యాలు చదువండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో రెండు పదాలున్నాయి. ఆ పదాల కింద గీత గీయండి.

అ. హిమాలయపర్వతాల్లోని ఎవరెస్టు శిఖరాన్ని పూర్ణ, ఆనంద్లు ఎక్కి, ఆ అద్రిపై భారత జాతీయపతాకం ఎగురవేసి, కొండంత కీర్తిని పొందారు.
జవాబు.
హిమాలయపర్వతాల్లోని ఎవరెస్టు శిఖరాన్ని పూర్ణ, ఆనంద్లు ఎక్కి ఆ అద్రిపై భారత జాతీయపతాకం ఎగురవేసి, కొండంత కీర్తిని పొందారు.
పర్వతం = అద్రి, కొండ

ఆ. రామాపురానికి, రంగాపురానికి మధ్యన వంతెన కట్టడం వల్ల రెండు గ్రామాల ప్రజలు ఆ వారధి. మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆ సేతువు పుణ్యంకొద్దీ ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది.
జవాబు.
రామాపురానికి, రంగాపురానికి మధ్యన వంతెన కట్టడం వల్ల రెండు గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆ సేతువు పుణ్యంకొద్దీ ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది.
వంతెన = వారధి, సేతువు

ఇ. ప్రజాధనం పచ్చికలా మేసిసవాణ్ణి గడ్డిపోచలా భావించి, వాడికి తృణమే తిండిగా పెట్టాలి.
జవాబు.
ప్రజాధనం పచ్చికలా మేసినవాణ్ణి గడ్డిపోచలా భావించి, వాడికి తృణమే తిండిగా పెట్టాలి.
పచ్చిక = గడ్డి, తృణం

ఈ. సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి. అదే వార్ధిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వనధి నీటి నుండే ఉప్పు లభిస్తుంది.
జవాబు.
సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి. అదే వార్ధిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వనధి నీటి నుండే ఉప్పు లభిస్తుంది.
సముద్రం = వార్ధి, వనధి

2. కింది వాక్యాలలోని ప్రకృతి – వికృతులను గుర్తించి రాయండి.

ఉదా : హనుమంతుడు రాముణ్ణి భక్తితో కొలిచాడు. ఆ బత్తి ఎన్నటికీ తరగదు.
భక్తి – బత్తి

అ. మనుషులు దవ్వుగా ఉన్నా మమతలు దూరం కాకూడదు.
జవాబు.
దూరం (దవీయం) – దవ్వు

ఆ. స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నా వంతు సహాయం చేస్తున్నాను, మీరూ నాలాగే సాయం చెయ్యండి.
జవాబు.
సహాయం – సాయం

ఇ. వానరాల శక్తితో పోలిస్తే ఉడుత శక్తి కొంచెమే అయినా ఆ కొంచెం సత్తువతోనే అది వారధి కట్టడంలో సాయం చేసింది.
జవాబు.
శక్తి – సత్తువ

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. ఖాళీలను సరైన భాషాభాగాలతో పూరించి అవి ఏ భాషాభాగాలో రాయండి.

అ) రవి పుస్తకం తెరిచి పాఠం ____________.
జవాబు.
రవి పుస్తకం తెరిచి పాఠం చదివాడు. – క్రియ

ఆ) రాముడు ____________ కలిసి అరణ్యానికి పోయాడు.
జవాబు.
రాముడు సీతతో కలిసి అరణ్యానికి పోయాడు. – నామవాచకం

ఇ) కిరణ్ పరుగుపందెంలో పాల్గొన్నాడు. ____________ చాలా వేగంగా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు.
జవాబు.
కిరణ్ పరుగుపందెంలో పాల్గొన్నాడు. అతడు చాలా వేగంగా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. – సర్వనామం

ఈ) ____________ ! అంతపని జరిగిందా ?
జవాబు.
అయ్యో ! అంతపని జరిగిందా ? – అవ్యయం

ఉ) పండుగరోజు విమల ____________ బట్టలు కట్టుకున్నది.
జవాబు.
పండుగరోజు విమల కొత్త బట్టలు కట్టుకున్నది. – విశేషణం

2. కింది వాక్యాల్లో విభక్తి ప్రత్యయాలను గుర్తించి వాటి కింద గీతలు గీయండి. అవి ఏ విభక్తులో బ్రాకెట్లలో రాయండి.

అ) మౌనిక మల్లెపూలను ధరించింది.
జవాబు.
ద్వితీయా విభక్తి

ఆ) రాజేందర్ అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చాడు.
జవాబు.
షష్ఠీ విభక్తి

ఇ) చిన్నపిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి.
జవాబు.
తృతీయా విభక్తి

ఈ) కీర్తన ఇంజనీరింగ్ చదువడం కోసం బాసర వెళ్ళింది.
జవాబు.
చతుర్థీ విభక్తి

ఉ) సహాయం చేయడం వల్ల రహీమ్ కష్టాల్లోంచి గట్టెక్కాడు.
జవాబు.
పంచమీ విభక్తి

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

3. కింది పేరాలో ఉన్న విభక్తి ప్రత్యయాలను, భాషాభాగాలను గుర్తించి పట్టికలో రాయండి.

పూర్వం ఉజ్జయినీ నగరమందు విక్రమార్కుడనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు. ఒకసారి ఆయన దేశసంచారం కొరకు బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుతూ, కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ పవిత్రమైన గంగానదిలో స్నానం చేసి, అక్కడి గుడిలో దేవతలను పూజించి, గుడి నుంచి బయటకు వస్తుండగా చెవులకు ఇంపైన సంగీతం వినబడింది. ఆ మధురమైన సంగీతం వినవచ్చేవైపు నడిచాడు. అక్కడ ఒక తోటలో ఒక స్త్రీ, స్నేహితురాళ్ళతో కలిసి వీణను వాయిస్తూ పాట పాడుతున్నది. ఆ పాటను వింటూ రాజు చాలా ఆనందపడి ఆ స్త్రీకి రత్నాల హారాన్నీ బహుమానంగా ఇచ్చారు.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం 2

జవాబు.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం 3

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

ప్రాజెక్టు పని:

ప్రశ్న .
రామాయణంలో పాత్రల పేర్లు తెలుసుకొని రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
దశరథ మహారాజు : కోసలదేశానికి రాజు.
రాముడు : కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
లక్ష్మణుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
భరతుడు : కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
శత్రుఘ్నుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
జనక మహారాజు : మిథిలానగరానికి ప్రభువు. పీతాదేవి తండ్రి.
సీత (జానకి) : శ్రీరాముని భార్య
ఊర్మిళ : లక్ష్మణుని భార్య
మాండవి : భరతుని భార్య
శ్రుతకీర్తి : శత్రుఘ్నుని భార్య
మంథర : కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి.
రావణుడు : కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకానగరానికి అధీశుడు. సీతను అపహరించి తీసుకొని వచ్చినవాడు.
శబరి : ఒక బోయకాంత తపస్సిద్ధురాలు. పంపాతీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసించింది. శ్రీరామ దర్శనంతో ఈమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను రామునికి అర్పించింది.
హనుమంతుడు : అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. ఇతడు సుగ్రీవుని మంత్రి. ఇతడే సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించాడు. సీత ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంక అంతా కాల్చాడు. కిష్కింధకు వెళ్ళి సీతను చూసిన వృత్తాంతాన్ని తెలియజేశాడు.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

TS 6th Class Telugu 7th Lesson Important Questions ఉడుత సాయం

I. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. కింది పేరా చదువండి. సరియైన సమాధానం గుర్తించండి.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు, వంతెనను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు, అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళను మోసుకు వస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసి పడుతున్నది. నలుని సూచనలననుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతూంది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తయింది.

ప్రశ్న 1.
విశ్వకర్మ ఎవరు ? ( )
అ) నలుడి తండ్రి
ఆ) నలుడి కొడుకు
ఇ) ఉత్సాహం ఉన్నవాడు
ఈ) సమర్థుడు
జవాబు.
అ) నలుడి తండ్రి

ప్రశ్న 2.
సేతువును ఎవరు భరిస్తానన్నారు ? ( )
అ) విశ్వకర్మ
ఆ) నలుడు
ఇ) సముద్రుడు
ఈ) ముగ్గురూ
జవాబు.
ఇ) సముద్రుడు

ప్రశ్న 3.
వానరులకు ఎవరు ఆజ్ఞ ఇచ్చారు ? ( )
అ) నలుడు
ఆ) రాముడు
ఇ) సముద్రుడు
ఈ) విశ్వకర్మ
జవాబు.
ఆ) రాముడు

ప్రశ్న 4.
వంతెన కొలతలు ఎవరు చెప్పారు ? ( )
అ) రాముడు
ఆ) విశ్వకర్మ
ఇ) సముద్రుడు
ఈ) నలుడు
జవాబు.
ఈ) నలుడు

ప్రశ్న 5.
వంతెన ఎన్ని రోజులలో కట్టారు ? ( )
అ) 10
ఆ) 5
ఇ) వంద
ఈ) నెల
జవాబు.
ఆ) 5

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

2. కింది పద్యం చదువండి. ఖాళీలు పూరించండి.

కుక్క గోవు గాదు కుందేలు పులి గాదు
దోమ గజము కాదు దొడ్డదైన
లోభి దాతగాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ ! వినుర వేమ !

ప్రశ్న 1.
గోవును ____________తో పోల్చకూడదు.
జవాబు.
కుక్క

ప్రశ్న 2.
కుందేలు ఎప్పటికీ ____________ కాదు.
జవాబు.
ఫులి

ప్రశ్న 3.
ఈ పద్యం రచించిన కవి ____________
జవాబు.
వేమన

ప్రశ్న 4.
తొండం ఉన్న దోమ ____________ కాదు.
జవాబు.
వేమన.

ప్రశ్న 5.
____________ దాత కాలేడు.
జవాబు.
లోభి

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

II. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) అచ్చపు భక్తి అంటే ఏమిటి ?
జవాబు.
అచ్చపు భక్తి అంటే నిజమైన భక్తి, నిజమైన భక్తి అంటే మనసులో ఉండే భక్తి. అంటే తను నమ్మిన భగవంతుడి గురించి తప్ప మనసులో వేరే ఆలోచన ఉండదు. భగవంతుడుకు సంబంధించిన పనులు మాత్రమే చేస్తాడు. భగవంతుడికి సంబంధించిన పాటలు మాత్రమే పలుకుతాడు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదం మాత్రమే తింటాడు. ఈ విధంగా జీవించడమే అచ్చపు భక్తి.

ఆ) అడుగు తామరలు’ అంటే మీకేమర్థమయింది ?
జవాబు.
అడుగు అంటే పాదం. తామరలు అంటే పద్మాలు. అంటే పద్మాల వంటి పాదాలు. పద్మాలు సున్నితంగా మృదువుగా
ఉంటాయి. అలాగే శ్రీరాముడి పాదాలు కూడా మెత్తగా ఉంటాయి. పద్మాలు గట్టిగా గాలి తగిలితే కందిపోతాయి. శ్రీరాముడి పాదాలు కూడా కొద్దిపాటి కఠినత్వం భరించలేవు. పద్మాలు సూర్యుడిని చూస్తే వికసిస్తాయి. శ్రీరాముడు కూడా సూర్యవంశము వాడు. అందుకే ఆయన పాదాలను కవి పద్మాలతో పోల్చాడు.

ఇ) ‘తానిసుకలో పొరలాడి తడయక చనుదెంచి’ అంటే మీకేమి అర్థమైంది’
జవాబు.
ఉడుత ఇసుకలో పొర్లి ఆలస్యం చేయకుండా వచ్చింది అని అర్థం. ఆలస్యం చేస్తే తన శరీరానికి అంటుకొన్న ఇసుక అక్కడే రాలిపోతుంది. వంతెన నిర్మాణంలో ఇసుకను వేయలేదు. తడి ఒంటిమీద ఇసుక ఆ తడి ఆరే వరకే ఉంటుంది. అందుకే .ఆలస్యం చేయలేదు. అందులోనూ అది ‘ఉడుతకు ఇష్టదైవమైన శ్రీరాముని పనికావడం వల్ల అస్సలు ఆలస్యం చేయలేదు.

2. కింది ప్రశ్నలకు పడేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఉడుత సాయం పాఠం వలన జీవితంలో ఆచరించ వలసినదేమి తెలిసింది ?
జవాబు.
కేవలం బలవంతుల వలన మాత్రమే పనులు పూర్తికావు. బలహీనులు కూడా ప్రయత్నిస్తే ఏ పనినైనా సాధించవచ్చు. గొప్పవారి మన్ననలు పొందవచ్చు. ఎంత చిన్నపని చేయడానికైనా సిగ్గుపడకూడదు. అంకిత భావనతో పనిచేస్తే ఎంత చిన్న పనికైనా గుర్తింపు వస్తుంది. గొప్ప ప్రతిఫలం దక్కుతుంది. “నేను అల్పుడిని. ఏం చేయగలను ?” అని అనుకోకూడదు. “నేను అల్పుడిని కాదు. నేనూ దేనినైనా సాధించగలను” అనే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. భగవంతుని మనసులో స్మరించి పనులు ప్రారంభిస్తే విజయం తప్పక లభిస్తుంది. అందుచేత ఈ విషయాలన్ని నిత్య జీవితంలో ఉపయోగపడేవే.

ఆ) ఈ పాఠం ఆధారంగా శ్రీరాముని గొప్పదనాన్ని వివరించండి.
జవాబు.
శ్రీరాముడు తనను స్మరించే వారిని కాపాడతాడు. తనకోసం పనిచేసేవారిని మెచ్చుకొంటాడు. శాశ్వతమైన ఆనందం కలిగిస్తాడు. శ్రీరాముని కోసం ఎంత చిన్న పనిచేసినా గమనిస్తాడు. ఆనందిస్తాడు. ఎంత అల్పమైన వాటిని ఐనా చేరదీస్తాడు. పొగుడుతాడు. బహుమతి ఇస్తాడు. శ్రీరామునకు గొప్పవాడినని గర్వం లేదు. ఒక్క నిముషం స్థిరంగా ఉండలేని కోతులు కూడా శ్రీరాముడు వారధి కట్టాయి. అంటే ఆయన గొప్పతనం ఊహించవచ్చు. ఉడుత వంటి చిన్నప్రాణి రామునకు సహాయం చేసింది. సముద్రుడు వంటి చాలా గొప్పవాడు కూడా శ్రీరామునకు సహాయం చేశాడు. ఇదంతా శ్రీరాముని గొప్పతనమే.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

III. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
ఉడుత పాత్రను దాని మాటలలో రాయండి.
జవాబు.
అబ్బ ! నా జన్మ ధన్యమైంది. శ్రీరాముడు నిర్మించే వారధిలో నేనూ సాయం చేయాలి. ఏం చేయను ? నేను చిన్నదానిని. రాళ్ళు మోయలేను. చెట్లు మోయలేను. ఏం చేయాలి ? ఇసుక వేయగలను. శ్రీరామా ! ఉపాయం ఏంటయ్యా ? నీకు సాయం చేయడానికి ? ఆఁ మంచి ఆలోచన వచ్చింది. సముద్రంలో మునుగుతాను. ఇసుకలో . దొర్లుతాను. తడి ఒంటికి ఇసుక అంటుకుంటుంది. అది రాళ్ళ మధ్య దులుపుతాను. ఆహా ! వారధికి ఇసుక మోసే కూలీ నయ్యాను.

నేను చేస్తున్నది తప్పు పనేమో ? రాముడెవరినో పంపుతున్నాడు. ఇతడూ రామభక్తుడే కదా ! చూస్తా ఏమవుతుందో? ఆహా! శ్రీరాముని చేతులలో ఉన్నాను. నన్ను పొగుడుతున్నాడు. నన్ను నిమురుతున్నాడు. నా జన్మ ధన్యమైంది. మా ఉడుత జాతి తరించింది.

ప్రశ్న 2.
వారధి నిర్మాణంలో ‘ఉడుత సాయం’ గురించి విన్నారు కదా ! మీరు ఎవరికైనా సాయం చేశారా ? దాని గూర్చి మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

జూబ్లిహిల్స్,
X X X X X.

ప్రియ మిత్రుడు విష్ణుకు,

ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమమని తలుస్తాను. ఇటీవల మా తరగతిలో కథల పోటీలు ఫేట్టారు. మేమంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాం. నేను చెప్పిన ‘ఉడుత సాయం’ కథకు మొదటి బహుమతి వచ్చింది. ఆ కథలో ఉడుత చిన్నప్రాణి. అయినా శ్రీరాముని వారధి నిర్మాణంలో తనవంతు సాయం చేసింది. ఇది నా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఉడుతలాగా మనం కూడా ఎందుకు సాయం చేయకూడదు అనే ఆలోచనతో నేను దాచుకొనే డబ్బులతో కొంత భాగం వికలాంగులు, వృద్ధులకు ఖర్చుపెట్టి పండ్లు కొని ఇస్తాను. వాటితో వారి ఆకలి కొంత అయినా తీరుతుంది. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నేను చేసిన పని బాగుంటే నీవు కూడా ఇలాగే చేయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ప్రసాద్.

చిరునామా :
యస్. విష్ణు,
S/o లక్ష్మణ్.
మిర్యాలగూడ,
నల్గొండ జిల్లా.

ప్రశ్న 3.
‘శ్రీరాముడు’ ఎంతో గొప్పవాడని తెలుసుకున్నావు. మరి నీవు ఏమి గ్రహించావో వ్యాసరూపంలో రాయుము.
జవాబు.

శ్రీరాముడు

“రామో విగ్రహవాన్ ధర్మః” రాముడు రూపుదాల్చిన ధర్మమూర్తి. పరమ సజ్జనుడు, సత్య పరాక్రముడు అని శత్రువు నోట అంతటి ప్రశస్తి పొందినవాడు రాముడు. రామచరితం రసభరితం. శ్రీరాముడు సద్గుణ నిధి. ఆయన ప్రతి చర్య లోకానికి అనుసరణీయం. తల్లిదండ్రుల పట్ల భక్తి, గురువుల పట్ల వినయ విధేయతలు, ఏకపత్నీ వ్రతం, మాతృప్రేమ, స్నేహితుల యెడ అనురాగం, శరణాగత వాత్సల్యం, ప్రజానురాగం ఆయనకు సహజ లక్షణాలు. శ్రీరాముని పితృవాక్య పరిపాలన నిరుపమానమైనది.

యాగ రక్షణకై వెళ్ళేటప్పుడు, దశరథుడు శ్రీరాముణ్ణి గురువు మాట తప్పక పాటింపుమని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి మాటలను తలచుకొని తాటక వధ చేయమన్న గురువు విశ్వామిత్రుని మాటను తు.చ. తప్పక పాటిస్తాడు. భరతుడు . సైన్యంతో చిత్రకూటానికి రావడం చూసి లక్ష్మణుడు అపోహపడతాడు. కాని శ్రీరాముడు భరతుని మనసెరిగిన వాడై లక్ష్మణుని శాంత పరుస్తాడు. ఇలా సోదరప్రేమ కలవాడైన శ్రీరాముడు లోకానికి ఆదర్శనీయుడు.

తండ్రి మాట కోసం పట్టాభిషేకాన్ని విడిచి 14 యేండ్లు వనవాసం చేసిన శ్రీరాముడు రూపంలోను, గుణంలోను, శ్రేష్ఠుడు. మహావీరుడు. ఎంతో వినయంతో ఎదుటవారిని నొప్పించకుండా, మృదువుగా మాట్లాడతాడు. శరణన్న వారిని కాపాడగలిగే గొప్ప గుణం ఆయనది. కోపం, గర్వం లేనేలేవు. నిత్యము సత్యమే పలికేవాడు. సోమరితనం, వీమరుపాటు ఎరుగనివాడు. ఇన్ని మంచి గుణాలు గల వ్యక్తి లోకంలో మరొకరు లేరు.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

IV. భాషాంశాలు.

అర్థాలు:

తలకొను = పూనుకోవడం
తరి = సమయం
సేతువు = వంతెన, వారధి
అడుగు తామరలు = పాదపద్మాలు
వార్ధి = సముద్రం
వనధి = సముద్రం
తరుమూషకంబు = ఉడుత
తృణము = గడ్డి
గొబ్బున = శీఘ్రంగా, వెంటనే
నలినాప్తుడు = సూర్యుడు
వడి = వేగం
తరువు = చెట్టు
గిరి = పర్వతం, కొండ
కపి = కోతి, వానరం
ఇనుడు = సూర్యుడు
కమలాప్తుడు = సూర్యుడు
అంఘ్రి = పాదం
మేను = శరీరం
యుగ్మము = జంట
ముదము = సంతోషము

వ్యతిరేకపదాలు:

ముందఱ x వెనుక
దవ్వు x దగ్గర
సుఖము x దుఃఖము
మునిగి x తేలి
ప్రేమ x ద్వేషం
వేగం x నెమ్మది
వచ్చి x వెళ్ళి
కారణం x అకారణం, నిష్కారణం

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

సంధులు:

కరమొప్పు = కరము + ఒప్పు – ఉత్వ సంధి
ముదమంది = ముదము + అంది – ఉత్వ సంధి
నలినాప్తుడు = నలిన + ఆప్తుడు – సవర్ణదీర్ఘసంధి
కరాగ్రము = కర + అగ్రము – సవర్ణదీర్ఘసంధి
కమలాప్తుడు = కమల + ఆప్తుడు – సవర్ణదీర్ఘసంధి
ఇనకులాధీశుడు = ఇనకుల + అధీశుడు – సవర్ణదీర్ఘసంధి
కపికులాధీశుడు = కపికుల + అధీశుడు – సవర్ణదీర్ఘసంధి
మహాత్ముడు = మహా + ఆత్ముడు – సవర్ణదీర్ఘసంధి
మనుజేశుడు = మనుజ + ఈశుడు – గుణసంధి

సమాసాలు:

సమాసపదం విగ్రహ వాక్యం సమాస నామం
ఉడుతసాయం ఉడుత యొక్క సాయం షష్ఠీతత్పురుష సమాసం
కమలాప్తుడు కమలములకు ఆప్తుడు షష్ఠీతత్పురుష సమాసం
కరాగ్రము కరము యొక్క అగ్రము షష్ఠీతత్పురుష సమాసం
ఇనకులాధిపుడు ఇనకులమునకు అధిపుడు షష్ఠీతత్పురుష సమాసం
నలినాప్తుడు నలినమునకు ఆప్తుడు షష్ఠీతత్పురుష సమాసం
నలినాప్తసుతుడు నలినాప్తుని యొక్క సుతుడు షష్ఠీతత్పురుష సమాసం
కపిలకులాధీశుడు కపిల కులమునకు అధీశుడు షష్ఠీతత్పురుష సమాసం
తరుగిరులు తరువులు గిరులు ద్వంద్వ సమాసం

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

నానార్థాలు:

ప్రశ్న 1.
కారణం : ____________
జవాబు.
హేతువు, సాధనం

ప్రశ్న 2.
కర : ____________
జవాబు.
చేయి, మిక్కిలి, తొండం

ప్రశ్న 3.
శక్తి : ____________
జవాబు.
బలిమి, పార్వతి, బల్లెం

ప్రశ్న 4.
రేఖ : ____________
జవాబు.
హస్తరేఖ, అదృష్టం, గీత

ప్రశ్న 5.
ఆత్మ : ____________
జవాబు. మనస్సు, పరమాత్మ, బుద్ధి.

వ్యాకరణాంశాలు:

వాక్యాలు :

ప్రశ్న 1.
హనుమంతుడు సముద్రం దాటి, లంక చేరాడు – ఏ వాక్యం ?
జవాబు.
సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 2.
రాజేందర్ అడవికి వెళ్ళి, ఉసిరికాయలు తెచ్చాడు – ఏ వాక్యం ?
జవాబు.
సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 3.
రాముడు, సీత అడవికి వెళ్ళారు – ఏ వాక్యం ?
జవాబు.
సంయుక్త వాక్యం

ప్రశ్న 4.
రవి పాఠం చదివాడు – వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.
జవాబు.
రవి పాఠం చదువలేదు

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

కింది వానిని గుర్తించండి.

ప్రశ్న 1.
సరళాలు ( )
అ) క, చ, ట, త, ప లు
ఆ) ఙ, ఞ, ణ, న, మ లు
ఇ) గ, జ, డ, ద, బ లు
ఈ) ఖ, ఛ, ఠ, ధ, ఫ లు
జవాబు.
ఇ) గ, జ, డ, ద, బ లు

ప్రశ్న 2.
ఁ, ం, ః అనునవి ( )
అ) అచ్చులు
ఆ) ఉభయాక్షరాలు
ఇ) హల్లులు
ఈ) ఏవీకావు
జవాబు.
ఆ) ఉభయాక్షరాలు

ప్రశ్న 3.
ఏకవచనము ( )
అ) రారు
ఆ) రాము
ఇ) వారు
ఈ) వస్తాను
జవాబు.
ఈ) వస్తాను

ప్రశ్న 4.
స్త్రీ లింగం ( )
అ) రమ
ఆ) రాముడు
ఇ) శివ
ఈ) చెట్టు
జవాబు.
అ) రమ

ప్రశ్న 5.
దీర్ఘాక్షరాలు ( )
అ) కో, కృ
ఆ) గా, గొ
ఇ) జో, రు
ఈ) చౄ, భౄ
జవాబు.
ఈ) చౄ, భౄ

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

పద్యాలు – అర్థాలు – తాత్పర్యాలు:

I. నలు చేతిఁ కొసగఁ నా నలుఁ డవి పుచ్చి
తలకొని కట్ట నా తరి యొక్క యుడుత
గొబ్బున సేతువు గొనసాగవలయు
నిబ్బలియులకుఁ దోడేసి గావింతు
ననుచు శ్రీరాముని యడుగుఁ దామరలు
మనమునఁ జేర్చి యమ్మనుజేశు నెదుర
నచ్చపు భక్తితో నట వారి మునిఁగి
వచ్చి తా నిసుకలో వడిఁ బొరలాడి

తడయక చనుదెంచి తన మేని యిసుక
వడిగట్టపై రాల్చి వనధిలో మునిఁగి
తేలి గట్టున కేగి తిరుగంగఁ బొరలి
వాలిన భక్తితో వచ్చి విదుల్చె

నివ్విధంబున నుండ నినకులాధిపుఁడు
దవ్వులఁ బొడగాంచి తమ్మునిఁ జూచి
పొందుగా లక్ష్మణ పొర్లదే చూడు
ముందఱ నొక తరుమూషకం బెలమి

అర్థాలు :

నలు చేతికిన్ = ‘నలుడు’ అనేవాని చేతికి
ఒసగన్ = ఇవ్వగా
ఆ నలుడు = ఆ నలుడు
అవి = ఆ రాళ్ళను
పుచ్చి = గ్రహించి
తలకొని కట్టన్ = యత్నించి కట్టగా
ఆ = ఆ సమయంలో
ఒక్క + ఉడుత = ఒకానొక ఉడుత
గొబ్బున = వెంటనే, శీఘ్రంగా
సేతువు = నీటికట్ట, వారధి, వంతెన
కొనసాగవలయున్ = కొనసాగాలి
ఈ + బలియులకు = ఈ బలవంతులైన వానరులకు
తోడేసి కావింతున్ = సాయం చేస్తాను
అనుచు = అనుకొంటూ
శ్రీరాముని = శ్రీరాముని యొక్క
అడుగు + తామరలు = పాదపద్మాలు
మనమునన్ = మనస్సు నందు
చేర్చి = చేర్చుకొని, నిల్పుకొని
ఆ + మనుజ + ఈశున్ = ఆ ప్రభువైన శ్రీరాముని
ఎదురన్ = ఎదురుగా
అచ్చపు = నిజమైన
భక్తితోన్ = భక్తితో
అట = అక్కడ
వార్ధి = సముద్రమునందు
మునిగి = మునిగి
వచ్చి = తిరిగి వచ్చి
తాన్ = తాను
ఇసుకలో పడి = ఇసుకలో పడిపోయి
పొరలాడి = దొర్లి
తడయక = ఆలస్యము చేయక
చనుదెంచి = వచ్చి
తన మేని = తన శరీరమందలి
ఇసుక = ఇసుకను
వడి = వేగంగా
కట్టపై = రాళ్ళ కట్టపై
రాల్చి = విదిల్చి
వనధిలో = సముద్రంలో
మునిగి = మునిగి
తేలి = తేలియాడి
గట్టునకు + ఏగి = గట్టునకు వచ్చి
తిరుగంగ = తిరుగుతూ
పొరలి వాలిన = ఉప్పొంగినటువంటి
భక్తితో = భక్తితో
వచ్చి = వచ్చి
విదుల్చెన్ = ఇసుకను విదిల్చింది
ఇవ్విధంబునన్ (ఈ + విధంబునన్) = ఈ విధంగా
ఉండన్ = ఉండగా
ఇనకుల + అధిపుడు = సూర్యవంశ ప్రభువైన శ్రీరాముడు
దవ్వులన్ = దూరమందు
పొడగాంచి = చూచి (ఉడుతను చూచి)
తమ్మునిన్ + చూచి = తమ్ముడైన లక్ష్మణుని చూచి
లక్ష్మణ = ఓ లక్ష్మణా !
ముందఱన్ = ఎదురుగా
ఒక తరుమూషకంబు = ఒక ఉడుత
ఎలమిన్ = ప్రేమతో
పొందుగా = కలయగ
పొర్లదే = పొర్లాడదా
చూడు = చూడు

తాత్పర్యం :
సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్నారు. ఆ సమయంలో వానరులు నలుని చేతికి రాళ్ళూ, రప్పలూ, కొండలూ తెచ్చి ఇస్తున్నారు. నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు.

ఆ సమయంలో ఒక ఉడుత “తొందరగా సేతువు నిర్మాణం జరగాలి. అందుకోసం ఈ వీరులకు చేయూత నిస్తాను” అంటూ, శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిలుపుకొన్నది. అతని ఎదురుగా నిర్మల భక్తితో సముద్రంలో మునిగివచ్చి, ఇసుకలో పొర్లి, వెంటనే కట్టపైకి వచ్చి తన ఒంటికి అంటిన యిసుకను రాలుస్తున్నది. ఇలాగే మరల మరల చేస్తున్నది. భక్తితో ఉడుత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూశాడు. తన తమ్ముడైన లక్ష్మణుని పిలిచి అతనికి చూపిస్తూ ఇలా అంటాడు.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

II. నామీఁద భక్తి యున్నతగతి బూనిఁ
తా మేను జలముల దడపి గట్టునకు
జని వేగ నిసుకపైఁ జల్లాడి తిరుగఁ
జనుదెంచి కొండల సందున రాల్చి
కరమొప్పుచున్నది కపికులాధీశు
లురుశక్తి దరు గిరు లొగి దెచ్చుచోట
దా నెంత యని మదిదలపక ప్రేమ
బూని సహాయమై పొదలుచున్నదియు
కనుగొంటివే యన గమలాప్త వంశ!
కనుగొంటి భవ దంఘికమల యుగ్మమును
నెవ్వడు మదినిల్పి యెసగుఁ దృణంబు
నవ్వేల్పు గిరిబోలు ననిన గాకున్నె
కావున భక్తియ కారణం బనఘ
ననవుడు ముదమంది నలినాప్తసుతుని
గనుగొని మఱి దాని గనుగొను వేడ్క
బెనగొనుచున్నది ప్రేమ నిచ్చటికి
దెమ్మన్న వేగంబె దెచ్చి సుగ్రీవు ,
డమ్మహాత్ముని చేతి కందియిచ్చుటయు
బలుదెఱంగుల జాల బ్రస్తుతిజేసి
కలిత దక్షిణకరాగ్రమున దువ్వుటయు
నల యుడుతకు వెన్క నమరెఁ ద్రిరేఖ
చులుకనై చూడ్కుల సుఖకరంబుగను

అర్థాలు :

నా మీద = నా పైన
భక్తి = భక్తి
ఉన్నతగతి పూని = గొప్పగా వహించి
తాన్ = తాను
మేను = శరీరం
జలములన్ = నీటియందు
తడిపి = తడుపుకొని
గట్టునకు = ఒడ్డునకు
చని = వెళ్ళి
వేగన్ = వేగంగా
ఇసుకపైన్ = ఇసుక మీద
చల్లాడి = పొర్లాడి
తిరుగ = మరల
చనుదెంచి = వచ్చి
కొండల సందున = కొండరాళ్ళ మధ్యలో
రాల్చి = ఇసుక రాల్చి
కరము = మిక్కిలి
ఒప్పుచున్నది = ప్రకాశించుచున్నది
కపికుల + అధీశులు = వానరశ్రేష్ఠులు
ఉరుశక్తి = గొప్ప శక్తితో
తరుగిరులు = చెట్లు, కొండలు
ఒగి = క్రమముగా
తెచ్చుచోట = తెచ్చే ప్రదేశంలో
తాను + ఎంత + అని = తానెంత అనుకొని
మది = మనసునందు
తలపక = ఆలోచింపక
ప్రేమ + పూని = ప్రేమతో కూడుకొని
సహాయమై = సహాయం చేయదలచినదై
పొదలుచున్నదియు = పొర్లుచున్నదియు
కనుగొంటివే = చూశావా ?
అనన్ = అనగా
కమల + ఆప్తవంశ = సూర్యవంశీయుడవైన శ్రీరామా!
కనుగొంటి = చూశాను
భవత్ = నీ యొక్క
అంఘ్రికమల = పాదపద్మముల
యుగ్మమును = జంటను
ఎవ్వడు = ఎవడు
మదినిల్పి = మనస్సున నిల్పుకొని
తృణంబున్ = గడ్డిపోచైనా
ఒసగున్ = ఇచ్చునో
అవ్వేల్పు (ఆ + వేల్పు) = ఆ దేవుని దయ వల్ల
గిరి పోలున్ = కొండతో సమానం
అనిన = అన్నచో
కాకున్నె = కాకుండునా ?
అనఘ = పుణ్యత్ముడా
కావున = కాబట్టి
భక్తియ = భక్తియే
కారణంబు = హేతువు, సాధనం
అనవుడు = అనగా
ముదము + అంది = సంతోషించి
నలిన + ఆప్తసుతుని = సూర్యుని కుమారుడైన సుగ్రీవుని
కనుగొని = చూచి
మఱి = మరియు
దానిన్ = ఆ ఉడుతను
కనుగొను = చూచు
వేడ్కన్ = కుతూహలముతో
ప్రేమన్ = ప్రేమతో
ఇచ్చటికి = ఇక్కడికి
తెమ్మన్న (తెమ్ము + అన్న) = తీసుకొని రమ్మనగానే
సుగ్రీవుడు = సుగ్రీవుడు
వేగంబె = వేగంగా
తెచ్చి = తీసుకొని వచ్చి
అమ్మహాత్ముని (ఆ + మహాత్ముని) = ఆ మహాత్ముడైన శ్రీరాముని
చేతికిన్ = చేతికి
అంది + ఇచ్చుటయు = అందివ్వగానే
పలుతెఱంగుల = రాముడు అనేక విధాలుగా
చాల = మిక్కిలి
ప్రస్తుతి + చేసి = కీర్తించి
కలిత = పొందబడిన
దక్షిణకర + అగ్రమునన్ = కుడిచేతి చివరి భాగముతో
దువ్వుటయున్ = నిమురగానే
అల ఉడుతకు = ఆ ఉడుతకు
వెన్కన = వెనుక భాగాన
త్రిరేఖ = మూడు గీతలు
చులుకనై = అందంగా
చూడ్కుల = చూపులకు
సుఖకరంబుగను = ఆనందకరంగా
అమరెన్ = ఏర్పడెను.

తాత్పర్యం :
లక్ష్మణా ! ‘నాపై భక్తితో ఉడుత సముద్ర జలాల్లో తడిచి యిసుక నంటించుకొని రాళ్ళ మధ్య విదిలిస్తున్నది. బలవంతులైన వానరులు కొండలను, వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత ? తన శక్తి యెంత ? అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది. చూశావా ?” అని రాముడు అన్నాడు.

అది విన్న లక్ష్మణుడు “నీ పాదాలను మనసులో నిలిపి, భక్తితో గడ్డిపోచంత (కొంచెం) పని చేసినా అది కొండతో సమానం. భక్తే ప్రధానం కదా” అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడుతను తన దగ్గరికి తీసుకుని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడుతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడుతను పలు విధాల పొగడి తన కుడిచేత దాని వీపుపై దువ్వాడు. ఉడుత వీపుపై మూడు రేఖలు చూడడానికి అందంగా ఆనందకరంగా ఏర్పడ్డాయి.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు. సీతను తిరిగి తీసుకొని వచ్చుటకు రావణునితో రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించుమని వానరసైన్యాన్ని ఆదేశించాడు. నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట. అతనికి వానరులు రాళ్ళు. చెట్లు, గుట్టలను తెచ్చి ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడుత ఎట్లా సాయం చేయబూనిందో ఈ పాఠంలో చదువుతాం. ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం, అడుగకుండనే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం “ద్విపద” ప్రక్రియకు చెందినది. ద్విపదలో రెండు పాదాలుంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం “రంగనాథ రామాయణం’లోని ‘యుద్ధకాండ’ లోనిది.

కవి పరిచయం:

కవి పేరు : గోన బుద్ధారెడ్డి
కాలం : 13వ శతాబ్దం
రచన : ‘రంగనాథ రామాయణం’ యుద్ధకాండ వరకు రచించాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు.
కవితా శైలి : సరళం, మధురం
ఇతర విశేషాలు : గోన బుద్ధారెడ్డి కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం (ప్రస్తుతం నందివడ్డెమాన్ నాగర్ కర్నూలు జిల్లాలోనిది) రాజధానిగా పాలించాడు.

ప్రవేశిక:

పరస్పర సహాయసహకారాలు మనుషులకైనా, జంతువులకైనా అవసరం. అయితే సమాజంలో మూడు రకాల వారుంటారు. మొదటి రకం వారు అధములు. వీరు ఎవరైనా సహాయం చేయుమని కోరినా చేయరు. రెండవ రకం వారు మధ్యములు. వీరు ఎవరైనా సహాయం చేయుమని కోరితేనే సహాయం చేస్తారు. మూడవ రకం వారు ఉత్తములు. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు. ఉత్తమ లక్షణం గలిగిన ఉడుత గురించి ఈ పాఠంలో చదువుకుందాం.

సారాంశం:

సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానరభల్లూకాలు నలుని చేతికి రాళ్ళూ, రప్పలూ, కొండలూ తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత “తొందరగా సేతువు నిర్మాణం జరగాలి. అందుకోసం ఈ వీరులకు చేయూతనిస్తాను” అంటూ శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిల్పుకొన్నది. అతని ఎదురుగా నిర్మలభక్తితో సముద్రంలో మునిగి వచ్చి యిసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి, తన ఒంటికి అంటిన యిసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి యిసుక నంటించుకొని వారధిపై విదిలిస్తూ ఉన్నది. భక్తితో ఉడుత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి, లక్ష్మణుని పిలిచి “నాపై భక్తితో ఉడుత సముద్రజలాల్లో తడిసి యిసుకనంటించుకొని రాళ్ళమధ్య విదిలిస్తున్నది.

బలవంతులైన వానరులు కొండలను, వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత ? తన శక్తి యెంత ? అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది. చూశావా ?” అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు “నీ పాదాలను మనసులో నిలిపి, భక్తితో గడ్డిపోచంత (కొంచెం) పని చేసినా అది కొండతో సమానం (గొప్పది). భక్తే ప్రధానం కదా !” అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడుతను తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడుతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడుతను పలువిధాల పొగడి తన కుడిచేత దాని వీపుపై దువ్వాడు. ఉడుత వీపుపై మూడురేఖలు చూడడానికి అందంగా ఆనందకరంగా ఏర్పడ్డాయి.

TS 6th Class Telugu Guide 7th Lesson ఉడుత సాయం

నేనివి చేయగలనా?

  • పాఠాన్ని రాగ, భావయుక్తంగా పాడగలను. అవును/ కాదు
  • అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించగలను. అవును/ కాదు
  • పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. అవును/ కాదు
  • ఇతరుల అవసరానికి సహాయం చేయడంలో గల తృప్తిని వివరిస్తూ వ్యాసం/ గేయం రాయగలను.

Leave a Comment