TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 6th Lesson పోతన బాల్యం Textbook Questions and Answers.

TS 6th Class Telugu 6th Lesson Questions and Answers Telangana పోతన బాల్యం

బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి. (TextBook Page No. 54)

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం 1

ప్రశ్నలు జవాబులు:

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు.
బొమ్మలో పదిమంది పిల్లలు ‘కబడ్డీ’ ఆట ఆడుతున్నారు. ఇద్దరు ‘కర్రాబిళ్ళ’ ఆట ఆడుతున్నారు. ముగ్గురు గోలీలాట ఆడుతున్నారు. ఇద్దరు పిల్లలు (ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) జారుడు బల్ల ఎక్కి ఆడుతున్నారు. ఇద్దరమ్మాయిలు వామన గుంటలాట ఆడుతున్నారు.

ప్రశ్న 2.
వాటిలో మీరు ఆడేవేవి? ఆడనివేవి ?
జవాబు.
వాటిలో నేను జారుడు బల్ల, గోలీలాట ఆడతాను. కర్రాబిళ్ళ కూడా ఆడతాను.
నేను ఆడని ఆటలు : కబడ్డీ, వామన గుంటలు.

ప్రశ్న 3.
మీకు ఏ ఆట అంటే ఇష్టం ? ఆ ఆటను ఎట్లా ఆడతారో చెప్పండి.
జవాబు.
నాకు బొంగరాలాట అంటే ఇష్టం. ఈ ఆట ఆడటానికి ఒక బొంగరం, ఒక సన్నని తాడు అవసరం. బొంగరానికి అడుగున ఒక మేకు ఉంటుంది. ఆ మేకు చుట్టూ సన్నని తాడు చుడతాను. తాడును చేతితో పట్టుకొని బొంగరాన్ని నేలపైకి విసిరివేస్తాను. అది గిరగిర తిరుగుతుంది. తిరుగుతున్న బొంగరాన్ని నేర్పుగా అరచేతిలోకి తీసుకొని, అది అరచేతిలో కూడా గిరగిర తిరుగుతుంటే చూసి ఆనందిస్తాను.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 56)

ప్రశ్న 1.
“తమ్మునిమీద ఈగను వాలనీయడు” అంటే మీకేమర్థమయింది ?
జవాబు.
తిప్పనకు తన తమ్ముడు పోతన అంటే అమితమైన ప్రేమ అని నాకర్థమయింది. ఆయన పోతనను ఎంతో గారాబంగా చూస్తుండేవాడని కూడా నాకర్థమయింది.

ప్రశ్న 2.
అన్న తన తినుబండారాలు తమ్మునికి ఇచ్చాడు. ఇట్లా తమ్ముని కోసం అన్న ఇంకా ఏమేమి చేయవచ్చు ?
జవాబు.
తమ్ముని కోసం అన్న ఆటవస్తువులు తెచ్చి ఇవ్వవచ్చు. . పుస్తకాలు, కలాలు, పెన్సిళ్ళు తెచ్చి ఇవ్వవచ్చు.

ప్రశ్న 3.
‘తిప్పన పోతన’లకు తగువులాట అంటే ఏమిటో తెలియదట. మరి మీ ఇంట్లో మీరు మీ అన్నదమ్ముళ్ళ తోటి లేదా అక్కజెల్లెళ్ళతోటి ఎట్లా ఉంటారు ?
జవాబు.
నేను మా ఇంట్లో మా అన్నదమ్ముళ్ళతోటి, అక్క జెల్లెళ్ళతోటి కలిసిమెలిసి ఉంటాను. వాళ్ళతో కలిసి ఆడుకొంటాను. తగవులాడను. నాకు తెలియని విషయాలను గురించి అడిగి తెలుసుకుంటాను.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 57)

ప్రశ్న 1.
పోతనను ‘ఉక్కు బాలుడు’ అని కవి ఎందుకు అనవలసి వచ్చింది ?
జవాబు.
‘ఉక్కు’ దేని మీదనైనా పడితే అది ముక్కలు కావలసిందే కాని ఉక్కుకు మాత్రం ఏంకాదు. అలాగే పోతన కిందపడ్డా ఆయనకు ఏమీ కాలేదని, లేచి వెంటనే పరుగెత్తాడని కవి తెలిపాడు. పోతన పడితే భూమి ముక్కలయిందంటూ చెబుతూ కవి పోతనను ‘ఉక్కు బాలుడు’ అన్నాడు.

ప్రశ్న 2.
పాడటంలో పోతనను కోకిలతో పోల్చాడు కదా ! ఇంకా వేటిని వేటితో పోల్చవచ్చు?
(ఉదా : నడకను, మాటను, కళ్ళను, మనస్సును, ముఖాన్ని, చేష్టలను)
జవాబు.
నడకను హంస నడకతోను; మాటను చిలుక పలుకుతోను; కళ్ళను కలువలతోను, పద్మాలతోను; మనస్సును వెన్నతోను; ముఖాన్ని చంద్రునితోను; చేష్టలను కోతులతోను పోల్చవచ్చు.

ప్రశ్న 3.
‘వీడు అసాధ్యుడు!’ అని ఎవరినైనా, ఏయే సందర్భాల్లో అంటారు ?
జవాబు.
ఒక కష్టమైన పనిని లేదా నెరవేరదనుకున్న కార్యాన్ని సాధించుకొని వచ్చినవాణ్ణి చూసి ‘వీడు అసాధ్యుడు’ అంటారు. ఒక్కొక్కసారి ఎవరికీ లొంగనివాణ్ణి చూసి కూడా ‘వీడు అసాధ్యుడు’ అంటారు.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.58)

ప్రశ్న 1.
“దూకుతున్నాడ”న్నారు కదా ! ఇవికాక ఇంకా పిల్లలు, ఏయే చేష్టలు చేస్తారో చెప్పండి.
జవాబు.
పిల్లలు గంతులేస్తారు. కుంటుతారు. పరుగెత్తుతారు.

ప్రశ్న 2.
‘పెరుగసాగె వేరొక ప్రక్క బిడ్డ యెడద’ అంటే మీకేమి అర్థమయింది ?
జవాబు.
చిన్నవాడైన పోతన, ఒక ప్రక్క ఆటపాటల్లో, చదువులో మేటి. ఆయనకు వేరొక ప్రక్క చిన్నతనం నుండే దైవచింతన, దైవభక్తి మనసులో పెరుగ సాగాయని నాకు అర్థమయింది.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న .
ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ ఎట్లా ఉంటున్నదని మీరు అనుకుంటున్నారు ? విశ్లేషించండి.
జవాబు.
ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ పూర్వం లాగా ఉండడం లేదు. ప్రతి విషయం డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బు కోసమో లేదా ఆస్తి కోసమో వాదులాడుకుంటూ ఉంటారు. రక్తసంబంధం కంటే ధనమే ప్రధానంగా భావిస్తున్నారు. అందువల్ల అన్నదమ్ముల అనుబంధం దూరమైపోతున్నది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
ఈ చిన్నబాలుడు అసాధ్యుడు’ అనే భావం వచ్చే పద్యపంక్తి ఏది ? ఆ పద్యాన్ని దాని భావాన్ని రాయండి.
జవాబు.
ఈ ‘చిన్నబాలుడు అసాధ్యుడు’ అనే భావం వచ్చే పద్య పంక్తి :
“చిఱుతఁ డసాధ్యుఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్.”
ఈ ‘చిన్నబాలుడు అసాధ్యుడు’ అనే భావం వచ్చే పద్య పంక్తి :

పద్యం : గురినిడి కొట్టెనేని యొక గోలియుఁ దప్పదు కచ్చగట్టి బొం
గరమును వేయ వ్రేటు కొక కాయ పటుక్కను, బందెమూని తా
నుఱికిన లేడిపిల్లవలె నొక్కని యయ్యకుఁ జిక్కడద్దిరా!
చిఱుతఁ డసాధ్యుఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్.

భావం :
గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీ కూడా గురి తప్పదు. పోటీపడి బొంగరాన్ని విసిరితే వేటువేటుకు ఇతరుల బొంగరాలు ‘పటుక్కని’ పగులవలసిందే. పందెం పెట్టుకొని పరుగెత్తాడంటే లేడిపిల్ల వలె ఏ ఒక్కనికీ చిక్కడు. దాన్ని చూసి అదిరా ! ఈ చిఱుతడు అసాధ్యుడు సుమా ! అంటూ అందరు గుండెల మీద చేయి వేసుకొని ఆశ్చర్యపడుతుంటారు.

2. కింది పద్యం చదువండి. భావంలోని ఖాళీలు పూరించండి.

కందుకము వోలె సుజనుడు.
గ్రందం బడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ !
మందుఁడు మృత్పిండము వలె
గ్రిందంబడి యడఁగి యుండు గృపణత్వమునన్

ఖాళీలు:
అ. కింద పడ్డా పైకి లేచేవాడు ___________
జవాబు.
సుజనుడు

ఆ. అపజయం పాలైనా తిరిగి ___________ సాధిస్తాడు.
జవాబు.
విజయం

ఇ. మందుడు అంటే ___________
జవాబు.
మూర్ఖుడు

ఈ. బంతితో పోల్చబడినవాడు ___________
జవాబు.
సుజనుడు

ఉ. ‘మట్టిముద్ద’ అనే పదానికి పద్యంలో వాడబడిన పదం ___________
జవాబు.
మృత్పిండము

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఊళ్ళోని పెద్దలందరూ అన్నదమ్ములిద్దరినీ మెచ్చుకునేవారట. మీ చుట్టుపక్కలవారు నిన్ను మెచ్చుకునేటట్లుగా నీవు ఏం చేస్తావు?
జవాబు.
నేను నా తమ్ముడిని చాలా ప్రేమగా చూస్తాను. నాకు తినడానికి ఎవరైనా ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండా తినను. ఆట వస్తువులు కూడా నా తమ్మునికి ఏది కావాలంటే అది నా దగ్గరున్నది ఇస్తాను.’ తినేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు కూడా తమ్ముడిని నా పక్కనే ఉంచుకుంటాను. అన్నదమ్ములంటే ఇలా ఉండాలని మా చుట్టుపక్కలవారు నన్ను మెచ్చుకునేటట్లుగా వ్యవహరిస్తాను.

ఆ) ‘కాళ్ళలో పాదరసం’ అంటే మీకు ఏమి అర్థమయింది ?
జవాబు.
పాదరసం ఒకచోట నిలకడగా ఉండదు. అది జారిపోతూ ఉంటుంది. అలాగే కొందరు ఒకచోట స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒకచోటికి తిరుగుతూ ఉంటారు. వారికి భూమి పైన క్షణమైన కాలు నిలువదు. అటువంటి వారీని దృష్టిలో పెట్టుకొని లోకులు ఆ ‘కాళ్ళలో పాదరసం’ ఉందనే జాతీయాన్ని వాడతారని అర్థమయింది.

ఇ) ‘తిప్పన – పోతన’ లను రామలక్ష్మణులతో ఎందుకు పోల్చారు ?
జవాబు.
రామలక్ష్మణులు ఆదర్శవంతమైన సోదరులు. ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉండరు. కష్టసుఖాలలో కలిసిమెలిసే ఉంటారు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్పగుణాలు కలవారు. అలాగే ‘తిప్పన – పోతన’లు కూడా ఆదర్శ సోదరులు. ఒకరంటే మరొకరికి గౌరవం, గొప్పగుణాలు కలవారు. రామలక్ష్మణుల వలె వీరు కూడా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో మెలిగేవారు. అందువల్ల ‘తిప్పన పోతన’ లను రామలక్ష్మణులతో పోల్చారు.

ఈ) ఈ పాఠం రాసిన కవి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు.

  1. ‘పోతన బాల్యం’ అనే పాఠం రాసిన కవి డా॥ వానమామలై వరదాచార్యులు.
  2. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం. ఏర్పరచుకున్నారు.
  3. బిరుదులు : అభినవపోతన, అభినవకాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి మొదలైనవి.
  4. ఈయన రచించిన గ్రంథాలు : పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాజి, కూలిపోయేకొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి).
  5. పురస్కారాలు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

పోతన బాల్యాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
పోతనకు తన అన్న తిప్పన అంటే అమితమైన గౌరవం. తిప్పన ఏదైనా పద్యాన్ని చదువుతుంటే, పోతన దానిని ఒక్కసారి వినగానే అర్థం చేసుకొనేవాడు. ఆ పద్యంలోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. ఆయన బాల్యం నుండే గొప్ప తెలివితేటలు గలవాడు.

పోతన ఆటల్లో ఆరితేరినవాడు. చదువులో అతనికి అతడే సాటి. మంచి శక్తిమంతుడు. తియ్యగా పాటలు పాడేవాడు. మొగమాటం, భయం, వెనుకడుగు వేయడమంటూ ఎరుగనివాడు. కోతి వలె చెట్ల కొనకొమ్మలు ఎగబాకేవాడు. పక్షి వలె కిందికి దూకేవాడు. ఆయనకు భూమి మీద కాలు క్షణమైనా నిలిచేది కాదు.

అమ్మ గుడికి పోతుంటే పోతన బడికి పోకుండ అమ్మ వెంట గుడికి పోయేవాడు. గుడిలో దేవుడికి మళ్ళీమళ్ళీ నమస్కారాలు చేసేవాడు. పోతన సాధు సజ్జనులను దర్శించాలనే ఉత్సాహం కలవాడు. హరికథలను, పురాణాలను వినాలనే కోరిక ఆయనకు చిన్నప్పుడే మొదలయ్యింది. శివపూజ చేయాలనే ఆసక్తి కూడా బాల్య నుండే ఏర్పడింది.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

IV. సృజనాత్మకత / ప్రశంస:

ప్రశ్న 1.
పోతన తన బాల్యంలో ఆడుకొనే ఆటలు తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీరు ఆడుకొనే ఆటలు ఏవి ? ఆటలు ఎందుకోసం ఆడాలో, వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
నేను ఆడుకునే ఆటలు :
1) గోలీలాట
2) కబడ్డీ
3) రింగ్ ఆట (టెన్నికాయిట్)
4) క్యారమ్స్
5) భో-ఖో
ఆటలు ఎందుకోసం ఆడాలంటే : మనోవికాసానికి అవి బాగా సహకరిస్తాయి. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సమయస్ఫూర్తి అలవడుతుంది.
ఆటల ప్రాముఖ్యత : ఆటలు, నాయకత్వ లక్షణాలను పెంచుతాయి. ఆటల వల్ల సహనం, పట్టుదల, పరస్పర సహకారం,. పోటీతత్త్వం, సమష్టి బాధ్యత మొదలైన గుణాలు అలవడుతాయి.

(లేదా)
ప్రశ్న 2.
పోతన ఆడుకునేటప్పుడు చూసినవాళ్ళు “ఈ బాలుడు అసాధ్యుడు” అని అనుకునేవారు కదా ! మరి ఇప్పుడు ఆడుకొనే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఊహించి సంభాషణలు రాయండి.
జవాబు.
రామయ్య : కోటయ్యా ! ఆ పిల్లల్ని చూడు. రోడ్డు మీదే కర్రాబిళ్ళ ఆట ఆడుతున్నారు. ఆటస్థలానికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా !
కోటయ్య : అవును. రోడ్డు మీద పోయేవారికి ఆ కర్రాబిళ్ల వచ్చి తగులుతుందని కూడా ఆలోచించరు.
రామయ్య : రోడ్డు మీద వాళ్ళకే కాదు. అది వాళ్ళకు తగిలినా ప్రమాదమే.
కోటయ్య : నిజమే ! మొన్న ఇలాగే ఆడి ఒక పిల్లవాడు కన్ను పోగొట్టుకున్నాడు.
రామయ్య : అది చూసి అయినా మిగతావాళ్ళు ఆ ఆట ఆడటం మానరు కదా !
కోటయ్య : ప్రమాదం లేని ఆటలు చాలా ఉన్నాయి. వాటిని ఆడుకోవచ్చు కదా !
రామయ్య : వాళ్ళు అసాధ్యులు. ఎవరి మాటా వినరు.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ఆదే అర్థం వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి.

ఉదా : భారతీయులు సోదరభావం కలిగి ఉంటారు. – సౌభ్రాత్రము

అ) లక్ష్మి పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది
జవాబు.
పొత్తము

ఆ) అర్జునుడు విలువిద్యయందు అధిపుడు.
జవాబు.
గొప్ప

ఇ) బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు.
జవాబు.
తమ్ముడు

ఈ) ప్రతిరోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
జవాబు.
మై

2. కింది పట్టికలోని ప్రకృతి – వికృతి పదాలను జతపరుచండి.

అ) భోజనం  క) నిద్ర
ఆ) నిదుర  ఖ) పుస్తకం
ఇ) పొత్తం  గ) బోనం

జవాబు.
అ) – గ
ఆ) – క
ఇ) – ఖ

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

3. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) అనుజుడు : ___________
జవాబు.
మా అనుజుడు చిత్రలేఖనంలో ఆరితేరినవాడు.

ఆ) గొంకుజంకులు : ___________
జవాబు.
కొందరు గొంకుజంకులు లేకుండా ధైర్యంగా అడవుల్లో విహరిస్తారు.

ఇ) మేటి : ___________
జవాబు.
మా సోదరి నృత్య ప్రదర్శనలో మేటి.

ఈ) ఆసక్తి : ___________
జవాబు.
నాకు హాస్య నాటికలంటే ఆసక్తి ఎక్కువ.

ఉ) వెత : ___________
జవాబు.
దేశ రక్షణ కోసం సైనికులు ఎన్నో వెతలు ఎదుర్కొంటారు.

ఊ) అసాధ్యుడు : ___________
జవాబు.
అసాధ్యుడైన ఆ అధికారి ఎవరి మాటా వినడు.

4. కింది వాక్యాలను చదువండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి.

అ) అరుణాస్పదమనే పురంలో ప్రవరుడు నివసించేవాడు. ఆ పట్టణం చాలా అందమైనది. ఆ నగరంలో ఆకాశాన్ని తాకే మేడలున్నాయి.
జవాబు.
అరుణాస్పదమనే పురంలో ప్రవరుడు నివసించేవాడు. ఆ పట్టణం చాలా అందమైనది. ఆ నగరంలో ఆకాశాన్ని తాకే మేడలున్నాయి.
పురం = పట్టణం, నగరం

ఆ) సకాలంలో వర్షాలు పడితే ధరణి పులకరిస్తుంది. అప్పుడు రైతు పుడమిని దున్ని విత్తనాలు చల్లుతాడు. పచ్చని పంటలతోటి అవని శోభిస్తుంది.
జవాబు.
సకాలంలో వర్షాలు పడితే ధరణి పులకరిస్తుంది. రైతు పుడమిని దున్ని విత్తనాలు చల్లుతాడు. పచ్చని పంటలతోటి అవని శోభిస్తుంది.
ధరణి = పుడమి, అవని

ఇ) కార్తీక్ ఇంటి మీద కోతి కూర్చున్నది. ఆ కపి చేతిలో కొబ్బరి చిప్ప ఉన్నది. అది చూసి మరో వానరం ఉరికొచ్చింది.
జవాబు.
కార్తీక్ ఇంటిమీద కోతి కూర్చున్నది. ఆ కపి చేతిలో కొబ్బరి చిప్ప ఉన్నది. అది చూసి మరో వానరం ఉరికొచ్చింది.
కోతి = కపి, వానరం

ఈ) మా గ్రామంలో గుడి చాలా పెద్దది. నేను ప్రతినిత్యం ఆ కోవెలకు పోతాను. ఆ దేవాలయంలో ఎంతో ప్రశాంతత
జవాబు.
లభిస్తుంది.
మా గ్రామంలో గుడి చాలా పెద్దది. నేను ప్రతినిత్యం ఆ కోవెలకు పోతాను. ఆ దేవాలయంలో ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
గుడి = కోవెల, దేవాలయం

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది పట్టికలోని పదాలను చదివి, పురంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలను, ఏకవచన – బహువచనాలను. అవ్యయాలను గుర్తించండి.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం 2

అ. పుంలింగ పదాలు : ___________
జవాబు.
బాలుడు, బాలురు, సుధాకర్, బలరాం, అతడు

ఆ. స్త్రీలింగ పదాలు : ___________
జవాబు.
సీత, మహిళలు రచయిత్రి, ఆమె

ఇ. నపుంసకలింగ పదాలు : ___________
జవాబు.
పుట్ట, బొమ్మ, ఆకాశం, చంద్రుడు, చెట్టు, డబ్బ, పత్రిక, బల్ల, పర్వతం

ఈ. ఏకవచనం : ___________
జవాబు.
బాలుడు, బొమ్మ, నటి, చంద్రుడు

ఉ. బహువచనం : ___________
జవాబు.
బాలురు, ఆటలు, మహిళలు, రచనలు

ఊ. అవ్యయం : ___________
జవాబు.
ఆహా, అమ్మో, శభాష్, అట్లాని

2. కింది వాటిని జతపరచండి.

అ. నామవాచకం  క. చదివింది
ఆ. సర్వనామం  ఖ. కాని
ఇ. విశేషణం  గ. ఆమె
ఈ. క్రియ  ఘ. ఎర్రని
ఉ. అవ్యయం  జ్ఞ. హైదరాబాదు

జవాబు.
అ. – జ్ఞ
ఆ. – గ
ఇ. – ఘ
ఈ. – క
ఉ. – ఖ

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

3. కింది ఖాళీలను పూరించండి.

అ. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ___________
జవాబు.
విశేషణం

ఆ. నామవాచకానికి బదులుగా వాడేది ___________
జవాబు.
సర్వనామం

ఇ. పనిని తెలిపే మాట ___________
జవాబు.
క్రియ

ఈ. లింగ వచన విభక్తులు లేనివి ___________
జవాబు.
అవ్యయాలు

ఉ. పేరును తెలిపే పదం ___________
జవాబు.
నామవాచకం

ప్రాజెక్టు పని:

మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన కుటుంబంలో మంచిగా కలిసి ఉన్న అన్నదమ్ముల గురించి రాయండి. వారి గురించి మీకు ఏమనిపించిందో మీ ఆనుభూతుల్ని తెలుపుతూ నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జవాబు.
మా గ్రామంలో సోమయ్య అనే రైతు ఉన్నాడు. ఆయనకు ధీరజ్, మనోజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ సోదరులు ఎంతో మంచి లక్షణాలు కలవారు. ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కలవారు. ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఇలా ఏ పని చేసినా ఆ అన్నదమ్ములు కలిసే చేస్తారు. ఇద్దరూ కలిసే బడికి వెళ్తారు. ఇంట్లో తల్లిదండ్రులకు సహాయపడతారు. కొట్లాటలంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. వారిని చూస్తే నాకు చాలా ముచ్చట వేస్తుంది. అన్నదమ్ముల అనుబంధం అంటే ఎలా ఉండాలో వారిని చూసి నేర్చుకోవచ్చు.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

TS 6th Class Telugu 6th Lesson Important Questions పోతన బాల్యం

I. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. క్రింది పద్యాలు చదువండి, భావం రాయండి.

అ) తిప్పన చదివెడు పద్యముఁ
జప్పున నొకసారి వినిన సరి పోతన తా
విప్పక పొత్తము నొప్పం
జెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్.
జవాబు.
భావం : తిప్పన ఏదైన పద్యాన్ని చదువుతుంటే, పోతన దానిని ఒక్కసారి వినగానే అర్థం చేసుకొని, దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అంత గొప్ప తెలివిగలవాడు పోతన.

ఆ) ఆటల మేటి విద్దియల యందున వానికి వాఁడే సాటి కొ
ట్లాటను బాలు రంద తొకటైన నెదిర్చెడి ధాటి, తీయగా
బాటలు పాడుటందుఁ బికవాణికి వానికిఁ బోటి యెందు మో
మోటముఁ గొంకుజంకులను బొత్తుగ వీడి చరించు నాతఁడున్.
జవాబు.
భావం : ఆటల్లో ఆరితేరినవాడు. చదువులో అతనికి అతడే సాటి. కొట్లాటలలో పిల్లలందరూ ఒక్కటైనా ఎదిరించి నిలబడగల శక్తిమంతుడు. తియ్యగా పాటలు పాడటంలో కోకిలకు పోతనకు పోటి. మొగమాటం, భయం, వెనకడుగు వేయడమంటూ ఎరుగడు.

2. కింది పేరా చదువండి. 5 ప్రశ్నలు తయారు చేయండి.

సుశీల్, సునీత, సాగర్లకు సెలవులు ఇచ్చారు. సెలవుల్లో ఏమి చేయాలో వారికి తోచలేదు. వాళ్ళు ముగ్గురూ తోటకు వెళ్ళి పూలుకోసి పూలగుత్తులు తయారుచేశారు. వాళ్ళకు దగ్గరలో ముసలివాళ్ళు ఉండే వృద్ధాశ్రమం ఉంది. ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళారు. ఆ పూలగుత్తులను అక్కడి ముసలివారికిచ్చారు. వాళ్ళు సంతోషించారు. అక్కడి ముసలివాళ్ళు కాలక్షేపానికి టీ.వీ. కానీ, రేడియో కానీ కొని ఇద్దామని ఆ పిల్లలు అనుకొన్నారు.
జవాబు.
ప్రశ్నలు :

  1. పిల్లలెంతమంది ?
  2. వాళ్ళకెందుకు తోచలేదు ?
  3. వృద్ధులు ఎక్కడ ఉన్నారు ?
  4. వృద్ధులకేమి కొనివ్వాలనుకొన్నారు ?
  5. పిల్లలు వృద్ధులకేమిచ్చారు ?

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

II. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) పోతన గట్టివాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
పోతన చిన్నతనంలో దూకేటపుడు పడిపోయేవాడు. ఎగిరేటపుడు కూడా పడిపోయేవాడు. దెబ్బలు తగిలినా లెక్క చేసేవాడు కాదు. వెంటనే లేచేవాడు, మళ్ళీ పరుగెత్తేవాడు. చూసినవారు పోతనను ఉక్కుబాలుడనేవారు. పిల్లలంతా ఒక్కటై కొట్లాటకు వచ్చినా ఎదిరించి నిలబడేవాడు. పోతనకు మొగమాటం లేదు. జంకూ గొంకూ లేదు. కాబట్టి గట్టివాడని చెప్పవచ్చు.

ఆ) పోతన క్రీడా నైపుణ్యాన్ని వివరించండి.
జవాబు.
పోతన ఆటలలో మేటి, గోలీలాడడంలో తనకు తానే సాటి. గురి చూసి కొడితే గోలీ గురి తప్పదు. బొంగరాలాట చాలా బాగా ఆడేవాడు, బొంగరం విసిరితే పోటీకి దిగిన బొంగరం ముక్కలు కావలసిందే. పందెం కాసి పరుగెడితే లేడిపిల్లలా పరుగెత్తేవాడు. ఎవరికీ దొరకడు. పోతన ఆటల తీరుని చూసినవారు ఆశ్చర్యపడేవారు.

ఇ) పోతన భక్తిని వివరించండి.
జవాబు.
పోతనకు దైవభక్తి ఎక్కువ. వాళ్ళమ్మ గుడికి వెడుతుంటే వెంటబడి వెళ్ళేవాడు. పోతనకు బడి అంటే ఇష్టం. కాని, బడి కంటే గుడి అంటే ఇంకా ఇష్టం. అందుచేత బడిని మానేసి అయినా గుడికి వెళ్ళేవాడు. అక్కడ పడిపడి దండాలు పెట్టేవాడు. భక్తిగా నమస్కరించేవాడు. సిగ్గుపడేవాడు కాదు. పోతనకు దైవభక్తి విషయంలో ఏ పట్టింపులూ లేవు.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) పోతన తనకు తానే సాటి ఎలా చెప్పగలవు ?
జవాబు.
పోతన అన్నిటిలోనూ తనకు తానే సాటి, ఆటలలో మేటి. అన్నగారిని గౌరవించడంలో లక్ష్మణుడే – ఏదైనా ఒక్కసారి వింటే నోటికి వస్తుంది. అంత తెలివైనవాడు పోతన. దూకడం, ఎగరడంలో పడిపోయినా లెక్కచేయడు. పిల్లలంతా కలిసి ఎదిరించినా భయపడడు. పాటలు పాడడంలో కోకిలతో పోటీ.

గోలీలాటలో గురి తప్పదు. బొంగరం విసిరితే పోటీ బొంగరం పగిలిపోతుంది. పందెం కాసి పరుగెడితే లేడిపిల్లలా పరుగెడతాడు. చెట్లెక్కడంలో కోతితో సమానం. పక్షిలా కిందకు దూకుతాడు. భక్తిలో దేనినీ పట్టించుకోడు. అందుచేత పోతనను దేనిలోనైనా పోల్చడానికి మానవులెవరూ సరిపోరు. కనుక తనకు తానే సాటి.

ఆ) నేటి సమాజంలో పోతన వంటి భక్తులుండే అవకాశం ఉందా ? వివరించండి.
జవాబు.
నేటి సమాజంలో కూడా పోతన వంటి భక్తులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా చాలామంది గుడులకు వెడుతున్నారు. భక్తితో నమస్కరిస్తున్నారు. భజనలు చేస్తున్నారు. సంకీర్తనలు పాడుతున్నారు. నాట్యాలు చేస్తున్నారు. పరిసరాలను పట్టించుకోకుండా భక్తిలో లీనమౌతున్నారు. గుడుల వద్ద సేవలు చేస్తున్నారు. తలనీలాలిస్తున్నారు. నిలువు దోపిడీలు ఇస్తున్నారు. భక్తిగా పుస్తకాలు రాస్తున్నారు. అందుచేత ఏ కాలంలోనైనా భక్తులు ఉంటారు. కాని, అందరికీ గుర్తింపురాదు.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

III. సృజనాత్మకత / ప్రశంస:

ప్రశ్న 1.
ఆటలు మంచిదా ? చదువు మంచిదా ? ఇద్దరి మధ్య సంభాషణ రాయండి..
జవాబు.
కిరణ్ : చక్కగా ఆటలాడుకొంటే హాయిగా ఉంటుంది రా !
తరుణ్ : చక్కగా చదువుకొంటే హాయిగా బతకొచ్చు.
కిరణ్ : ఆటలాడుకోకపోతే రోగాలు మనతో ఆడుకొంటాయి.
తరుణ్ : చదువుకోకపోతే దరిద్రం మనను వదలదు.
కిరణ్ : ఆరోగ్యం లేని తెలివీ, ఐశ్వర్యం ఎందుకు ?
తరుణ్ : తెలివీ, ఐశ్వర్యం లేకపోతే ఆరోగ్యం వల్ల లాభమేమిటి ?
కిరణ్ : మరి, ఏది మంచిదంటావు ?
తరుణ్ : నువ్వేది మంచిదంటావు ?
కిరణ్ : తరుణ్ (ఒకేసారి) ఆటలు, చదువూ రెండూ మంచివే, కొంతసేపు ఆడుకొందాం. కొంతసేపు చదువుకొందాం.

ప్రశ్న 2.
అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే రామలక్ష్మణుల తోటి పోలుస్తారు. మరి మీ అన్నయ్య / తమ్ముడు మంచి లక్షణాల గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

లేఖ

జోగిపేట,
X X X X X.

ప్రియమిత్రుడు బ్రహ్మదత్తకు,

ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమమని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో ‘రామాయణం’ పై ఉపన్యాసం చెప్పారు. ఆ కథ ఎంత బాగుందో కదా ! రాముని తమ్ముల వంటి వారు ఈ లోకంలో ఎవరూ ఉండరేమో అనిపించింది. అలాంటి లక్షణానికి కొంత దగ్గరగా నా తమ్ముడిలో కూడా నా పట్ల అనురాగం ఉంది. నన్ను విడిచి క్షణం కూడా ఉండడు. తనేమి కొన్నా నాకూ తెస్తాడు. నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. అలాంటి తమ్ముడు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడి మీ సంగతులను ఉత్తరంగా రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. జస్వంత్.

చిరునామా :
యస్. బ్రహ్మదత్త,
S/o బాలసుబ్రహ్మణ్యం,
లోనికలాన్,
మెదక్ జిల్లా.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

IV. భాషాంశాలు:

పదాలు – అర్థాలు:

సౌబ్రాత్రం = సోదరభావం, మంచి తోడబుట్టుదనం
అనుజుడు = తమ్ముడు
అవరజుడు = తమ్ముడు
మై = దేహం, శరీరం
పొత్తము = పుస్తకము
వ్రేటు = దెబ్బ
విస్మయము = ఆశ్చర్యము
ఎడద = హృదయం
అనుజన్ముడు = తమ్ముడు
యవీయసుడు = తమ్ముడు
వెత = బాధ
పికము = కోకిలము
చిఱుతడు = చిన్నవాడు
ఎద = హృదయం
జేజేలు = నమస్కారాలు

సంధులు:

ఎవ్వరేమనిన = ఎవ్వరు + ఏమనిన – ఉత్వసంధి
పెద్దలందరికి = పెద్దలు + అందరికి – ఉత్వసంధి
బాలురందఱు = బాలురు + అందఱు – ఉత్వసంధి
ప్రక్కలయ్యె = ప్రక్కలు + అయ్యె – ఉత్వసంధి
చిక్కడద్దిరా = చిక్కడు + అద్దిరా – ఉత్వసంధి
వేఱొక = వేఱు + ఒక – ఉత్వ సంధి
అడిగినయంత = అడిగిన + అంత – యడాగమం
శ్రవణాభిరతి = శ్రవణ + అభిరతి – సరోజార దర్శనోత్సాహము
సరోజార్చన = సరోజ + అర్చన – సవర్ణదీర్ఘ సంధి సవర్ణదీర్ఘ సంధి
దర్శనోత్సాహము = దర్శన + ఉత్సాహము – గుణసంధి

సమాసాలు:

సమాసపదం విగ్రహ వాక్యం సమాస నామం
రామలక్ష్మణులు రాముడు, లక్ష్మణుడు ద్వంద్వ సమాసం
పోతన బాల్యం పోతన యొక్క బాల్యం షష్ఠీ తత్పురుష సమాసం
పాదయుగళి పాదముల యొక్క యుగళి షష్ఠీ తత్పురుష సమాసం
హరికథ హరి యొక్క కథ షష్ఠీ తత్పురుష సమాసం
శంభుపదము శంభువు యొక్క పదము షష్ఠీ తత్పురుష సమాసం
ఆటల మేటి ఆటలలో మేటి షష్ఠీ తత్పురుష సమాసం
శ్రవణాభిరతి శ్రవణమునందు అభిరతి సప్తమీ తత్పురుష సమాసం
దర్శనోత్సాహము దర్శనమునందు ఉత్సాహము సప్తమీ తత్పురుష సమాసం

నానార్థాలు:

పెద్ద = వృద్ధుడు, జ్యేష్ఠుడు, ముఖ్యుడు
ఉక్కు = ఒక లోహం, శౌర్యం, వేగం
గతి = త్రోవ, విధం
గుణం = స్వభావం, అల్లెత్రాడు, విద్య, దయ
పాదం = కాలిపాదం, పద్యపాదం

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

వ్యాకరణాంశాలు:

వాక్యాలు :

ప్రశ్న 1.
లక్ష్మి పుస్తకాన్ని తెరిచింది. పాఠం చదివింది – సంక్లిష్ట వాక్యంగా రాయండి.
జవాబు.
లక్ష్మి పుస్తకాన్ని తెరిచి, పాఠం చదివింది.

ప్రశ్న 2.
రైతు నేలను దున్ని, విత్తనాలు చల్లుతాడు – ఏ వాక్యం ?
జవాబు.
సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 3.
బలరాముడు సుభద్రకు అన్న. కృష్ణుడు సుభద్రకు అన్న – సంయుక్త వాక్యంగా రాయండి.
జవాబు.
బలరామకృష్ణులు సుభద్రకు అన్నలు.

ప్రశ్న 4.
కార్తీక్ ఇంటి మీద కోతి ఉంది – వ్యతిరేకార్థక వాక్యంగా మార్చండి.
జవాబు.
కార్తీక్ ఇంటి మీద కోతి లేదు.

కింది వాటిని గుర్తించండి.

ప్రశ్న 1.
మహా ప్రాణాక్షరాలు
అ) క ఖ గ ఘ
ఆ) చ ఛ జ ఝ
ఇ) ఙ ఞ ణ న మ
ఈ) ఖ, ఘ, ఛ, ఝ
జవాబు.

ప్రశ్న 2.
ఊష్మాలు –
అ) ఐ, ఔ
ఆ) ఋ, ౠ
ఇ) శ, ష, స, హ
ఈ) య, ర, ల, వ
జవాబు.

ప్రశ్న 3.
బహువచనం –
అ) కాలు
ఆ) చాలు
ఇ) వేలు
ఈ) జైలు
జవాబు.

ప్రశ్న 4.
ద్విత్వాక్షరాలు
అ) త్మ, క్క
ఆ) ద్ర, య్య
ఇ) ర వ్వ
ఈ) క్క య్య, వ్వ
జవాబు.

ప్రశ్న 5.
సంయుక్తాక్షరం
అ) ర్య, ద్ర
ఆ) త్త య్య
ఇ) మ్య, ల్ల
ఈ) బ్బ, ద్ద
జవాబు.

సంబంధం లేని పదాలు గుర్తించండి.

ప్రశ్న 1.
మెప్పు, ప్రీతి, ప్రేమ, తిప్పు
జవాబు.
తిప్పు

ప్రశ్న 2.
తఱి, మఱి, సమయం, కాలం
జవాబు.
మఱి

ప్రశ్న 3.
పాట, గీతం, గేయం, గాయం
జవాబు.
గాయం

ప్రశ్న 4.
గతి, యతి, త్రోవ, విధం
జవాబు.
యతి

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

పద్యాలు – అర్థాలు – తాత్పర్యాలు:

1వ పద్యం :

కం. తిప్పన సౌభ్రాత్రమ్మన
న ప్పురిఁ గల చిన్న పెద్ద లందరికిఁ గడున్
మెప్పనుజునకన్న యనన్
గొప్పగుఁ దమ్ముఁ డన నన్నకున్ బ్రాణంబౌ.

అర్థాలు :

సౌభ్రాత్రం = సోదరభావం
అప్పురి (ఆ + పురి) = ఆ పట్టణం
కడు = మిక్కిలి
మెప్పు = ప్రీతి, ప్రేమ
అనుజుడు = తమ్ముడు
ప్రాణంబు = ప్రాణము

తాత్పర్యం :
తిప్పన, పోతనలు అన్నదమ్ములు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ. తిప్పన తన తమ్ముడైన పోతన మీద చూపే సోదరభావంతో ఊరిలో అందరికి ఆదర్శంగా నిలిచాడు. అన్న అంటే పోతనకూ గౌరవం.. తమ్ముడంటే అన్నకు పంచప్రాణాలు. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉండేవారు.

సీ. తన కెవ్వ రేదేని తినుబండ మిడిరేని
యనుజుని కిడక తిప్పన తినండు
అనుజన్ము నెవ్వ రేమనిన తా నడ్డమ్ము
వచ్చు మై నీఁగను వ్రాలనీఁదు.
గడియసేపింటఁ దమ్ముఁడు గానరాకున్న
వెదకుఁ గన్పడుదాఁక వెతనుజెందుఁ
తన ప్రాణమున కెంతయును గూర్చు వస్తువే
నవరజుం డడిగినయంత నొసఁగు.

తే. భోజన మొనర్చు తఱి నిద్రబోవు వేళ
లందును యవీయసుఁడు తన యండ నుండ
వలెను దగవులాటననేమొ తెలియ రనఘ
గుణులు సోదరుల్ రామలక్ష్మణులు మణులు.

అర్థాలు :
ఏదేని (ఏది + ఏని) = ఏదైనా
ఇడిరేని (ఇడిరి + ఏని) = ఇచ్చినచో
అనుజుడు = తమ్ముడు
ఇడక = ఇవ్వకుండ
అనుజన్ముడు = తమ్ముడు
మై = దేహం, శరీరం
వెత = బాధ
అవరజుడు = తమ్ముడు
తఱి = సమయం
యవీయసుడు = తమ్ముడు
అనఘ గుణులు = నిర్మలమైన గుణాలు కలవారు, పుణ్యగుణులు

తాత్పర్యం:
తనకెవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండా తిప్పన తినడు. తమ్ముణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వస్తాడు. తమ్ముడి మీద ఈగను కూడా వాలనీయడు. కొంచెంసేపు తమ్ముడు కనబడకపోతే వెతకడం మొదలుపెడ్తాడు. కనిపించిందాకా ఆందోళన పడుతూనే ఉంటాడు. తనకు ప్రాణంతో సమానమైన వస్తువైనా తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చి వేస్తాడు. తినేటప్పుడు నిద్రపోయే టప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి. కొట్లాటలంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు కలవారు. వారు మణులు, రామలక్ష్మణుల వంటివారు.

3వ పద్యం : (కంఠస్థ పద్యం)

కం. తిప్పన చదివెడు పద్యముఁ
జప్పున నొకసారి వినిన సరి పోతన తా
విప్పక పొత్తము నొప్పం
జెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్.

అర్థాలు :

తిప్పన = తిప్పన
చదివెడు = చదువునట్టి
పద్యమున్ = పద్యాన్ని
చప్పునన్ = వెంటనే, పూర్తిగా
ఒకసారి = ఒకమారు
వినిన సరి = వింటే సరి, వినగానే
పోతన = పోతన
తాన్ = తాను
పొత్తమున్ = పుస్తకాన్ని
విప్పక = తెరవకుండానే
అద్దానిని (ఆ + దానిని) = ఆ పద్యాన్ని
ఒప్పుంజెప్పును = అప్పగిస్తాడు.
తెలివిన్ = పోతన జ్ఞానాన్ని గూర్చి
ఏమి చెప్పుట = ఏమని చెప్పవచ్చు

తాత్పర్యం :
తిప్పన ఏదైన పద్యాన్ని చదువుతుంటే, పోతన దానిని ఒక్కసారి వినగానే అర్థం చేసుకొని, దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అంత గొప్ప తెలివిగలవాడు పోతన.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

II. 4వ పద్యం :
దూఁకు లెగురు లందుఁ దొండు మెండుగఁబడి
సరకుఁగొనఁడు లేచి యుఱుకు నపుడె
యరరె! భూమి ప్రక్కలయ్యే నండ్రా యుక్కు
బాలు పాటుగాంచి ప్రక్కవారు.

అర్థాలు :
మెండుగన్ + పడి = ఎక్కువగా పడి
సరకుగొనడు = లక్ష్యపెట్టడు, లెక్కచేయడు
ఉఱుకు = పరుగెత్తు
ప్రక్కలయ్యే = ముక్కలయింది
అండ్రు = అంటారు
ఉక్కు బాలు = ఉక్కు లాంటి పిల్లవాడు.
పాటుగాంచి = పడుట చూసి

తాత్పర్యం :
పోతన ఆటలాడుతు, దుంకుతు, ఎగురుతు ఉన్నప్పుడు కిందపడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరుగెత్తుతాడు. పక్కన ఉండే పిల్లలు అది చూసి ‘అరెరే … ఈ ఉక్కులాంటి పిల్లగాడు పడితే భూమియే ముక్కలయిందే!’ అని అంటారు.

5వ పద్యం : (కంఠస్థ పద్యం)
ఉ. ఆటల మేటి విద్దియల యందున వానికి వాఁడె సాటి కొ
ట్లాటను బాలు రంద తొకటైన నెదిర్చెడి దాటి, తీయగా
బాటలు పాడుటందుఁ బికవాణికి వానికిఁ బోటి యెందు మో
మోటముఁ గొంకుజంకులను బొత్తుగ వీడి చరించు నాతఁడున్.

అర్థాలు :

ఆతడున్ = ఆ పోతన
ఆటలమేటి = ఆటల్లో గొప్పవాడు
విద్దియల యందున = చదువుల్లో
వానికివాడె
సాటి = సమానం
కొట్లాటను = కొట్లాటలో
బాలురు + అందఱు
ఒకటైనన్ = ఒక్కటైనా
ఎదిర్చెడి ధాటి = ఎదిరించగల శక్తిమంతుడు
తీయగా = తియ్యగా
పాటలు పాడుట + అందున్ =
పాటలు పాడుటలో
పికవాణికి = కోకిల పలుకుకు
వానికి = ఆ పోతనకు
పోటి = పోటి
ఎందు = ఎక్కడైనా
మోమోటమున్ మొగమాటాన్ని
కొంకుజంకులను = భయ సంకోచాలను
బొత్తిగ = మొదలంట
వీడి = వదలిపెట్టి
చరించున్ = ప్రవర్తించును, తిరుగును

తాత్పర్యం:
ఆటల్లో ఆరితేరినవాడు. చదువులో అతనికి అతడే సాటి. కొట్లాటలలో పిల్లలందరూ ఒక్కటైనా ఎదిరించి నిలబడగల శక్తిమంతుడు. తియ్యగా పాటలు పాడటంలో కోకిలకు పోతనకు పోటీ. మొగమాటం, భయం, వెనకడుగు వేయడమంటూ ఎరుగడు.

6వ పద్యం :

చ. గురినిడి కొట్టెనేని యొక గోలియుఁ దప్పదు కచ్చగట్టి బొం
గరమును వేయ వ్రేటు కొక కాయ పటుక్కను, బందెమూని తా
నుఱికిన లేడిపిల్లవలె నొక్కని యయ్యకుఁ జిక్కడద్దిరా!
చిఱుతఁ డసాధ్యుఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్.

అర్థాలు :

గురినిడి = గురి ఉంచి
వ్రేటు = దెబ్బ
పందెము + ఊని = పందెం వహించి
ఉఱికిన = పరుగెత్తి
ఒక్కని + అయ్యకున్ = ఒక్కనికినీ (‘అయ్య’ అనేది గౌరవవాచకం)
చిక్కడు = దొరకడు
అద్దిరా = ఔరా
చిఱుతడు = చిన్నవాడు
అసాధ్యుడు = సాధ్యం కానివాడు
ఎద = హృదయం, గుండె
విస్మయము = ఆశ్చర్యము

తాత్పర్యం : గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీ కూడా గురి తప్పదు. పోటీపడి బొంగరాన్ని విసిరితే వేటువేటుకు ఇతరుల బొంగరాలు ‘పటుక్కని’ పగులవలసిందే. పందెం పెట్టుకొని పరుగెత్తాడంటే లేడిపిల్ల వలె ఏ ఒక్కనికీ చిక్కడు. దాన్ని చూసి అదిరా ! ఈ చిఱుతడు అసాధ్యుడు సుమా ! అంటూ అందరు గుండెల మీద చేయి వేసుకొని ఆశ్చర్యపడుతుంటారు.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

III. 7వ పద్యం :

ఆ.వె. కోఁతివోలెఁ జెట్ల కొనఁగొమ్మ లెగబ్రాకుఁ
బక్షివోలెఁ గ్రిందఁబడఁగ దూఁకుఁ
గాలు భూమిపైన గడియైన నాఁగదు
పాదరసము గలదొ పాదయుగళి!

అర్థాలు :

కొనకొమ్మలు = కొమ్మల యొక్క చివరలు
గడియ + ఐన = అల్పకాలమైన, క్షణమైన
పాదయుగళి = పాదముల జంట, రెండు కాళ్ళు

తాత్పర్యం:
కోతి వలె చెట్ల కొనకొమ్మలు ఎగబాకుతాడు. పక్షి వలె కిందికి దుంకుతాడు. భూమి మీద కాలు క్షణమైన నిలువదు. ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏమో ? (పాదరసం నిలకడగా ఉండదు.)

8వ పద్యం :

కం. గుడికిఁ జను జననిఁ గని వెం
బడిఁబడి చను జదువుకొనెడి బడి విడియైనన్
బడి పడి జేజే లిడు న
య్యెడ నెడమయుఁ గుడియు ననక నెంతయు భక్తిన్.

అర్థాలు :

చను = వేళ్ళు
జనని = తల్లి
కని = చూసి
బడి విడియైనన్ = బడి వదలియైనా, బడికి పోకుండా
జేజేలు + ఇడున్ = నమస్కారాలు చేయును
అయ్యెడన్ (ఆ + ఎడన్) = ఆ సమయంలో
ఎంతయు = మిక్కిలి

తాత్పర్యం :
అమ్మ గుడికి పోతుంటె, పోతన బడికి పోకుండ అమ్మవెంట గుడికి పోతాడు. గుడిలో మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. అట్లా నమస్కారాలు చేసేటప్పుడు కుడి ఎడమలు కూడా చూసుకోడు. (తన పరిసరాలను పట్టించుకోకుండా దేవునిపైనే దృష్టిపెడుతాడని భావం. )

9వ పద్యం : (కంఠస్థ పద్యం)

తే.గీ.. సాధుసజ్జన దర్శనోత్సాహ గతియు
హరికథాపురాణ శ్రవణాభిరతియు
శంభుపద సరోజార్చ నాసక్తమతియుఁ
బెరుగసాగె వేరొకప్రక్క బిడ్డ యెడద.

అర్థాలు :

గతి = త్రోవ, విధం
శ్రవణాభిరతి (శ్రవణ + అభిరతి) = వినాలనే కోరిక
శంభుపదములు = శివుని పాదాలు
సరోజము = పద్మం
అర్చన = పూజ
ఎడద = హృదయం

తాత్పర్యం:
మరోవైపు పోతన మనసులో సాధుసజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరుగసాగింది. హరికథలను, పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యింది. శివుని పాదాలను పువ్వులతో పూజించాలనే ఆసక్తి పెరుగసాగింది.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

తిప్పన, పోతన ఇద్దరూ అన్నదమ్ములు. చిన్నప్పటినుంచి వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమతో మెలిగేవారు. వారిద్దరి మధ్య ప్రేమ ఎట్లా ఉండేది ? వారి బాల్యమెట్లా గడిచింది? మొదలైన విషయాలు ప్రస్తుత పాఠ్యభాగంలో చూడవచ్చు. పిల్లల అభిరుచులను, ఆసక్తులను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం “కావ్య” ప్రక్రియకు చెందినది. కావ్యం అనగా వర్ణనతో కూడినది అని అర్థం. మహాకవి పోతన జీవితం ఆధారంగా డా॥ వానమామలై వరదాచార్యులు రచించిన ‘పోతన చరిత్రము’ అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది.

కవి పరిచయం:

పాఠ్యభాగ రచయిత : డా॥ వానమామలై వరదాచార్యులు.
కాలం : 1912-1984 మధ్య కాలంలోనివాడు.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామం.
స్థిరనివాసం : నేటి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు.
బిరుదులు : అభినవపోతన, అభినవకాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి మొదలైనవి.
రచనలు : పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయేకొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి) మొదలైనవి.
పురస్కారాలు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైనవి.
ఇతర విశేషాలు : సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు.

ప్రవేశిక :
అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే రామలక్ష్మణులతోటి పోలుస్తారు. తిప్పన, పోతనలను కూడా రామలక్ష్మణులని అనేవాళ్ళు. వీళ్ళలో పోతనకు ఆటలంటే చాలా ఇష్టం. బాల్యంలో ఆ అన్నదమ్ములిద్దరినీ రామలక్ష్మణులని ఎందుకనేవాళ్ళో పోతన ఏయే ఆటలు ఆడేవాడో అతణ్ణి చూసినవాళ్ళు ఏమనుకునేవాళ్ళో వానమామలై వరదాచార్యులు రాసిన పద్యాలను
చదివి తెలుసుకొండి.

TS 6th Class Telugu Guide 6th Lesson పోతన బాల్యం

నేనివి చేయగలనా?

  • సోదరుల మధ్య ప్రేమ తగ్గడానికి గల కారణాలను చెప్పగలను. – అవును/ కాదు
  • అపరిచిత పద్యాన్ని చదివి అర్థంచేసుకొని భావంలోని ఖాళీలను పూరించగలను. – అవును/ కాదు
  • పోతన బాల్యాన్ని గురించి సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • పాఠం ఆధారంగా వ్యాసం/ సంభాషణను రాయగలను. – అవును/ కాదు

Leave a Comment