TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 5th Lesson శతకసుధ Textbook Questions and Answers.

TS 6th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతకసుధ

బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి. (TextBook Page No. 42)

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ 1

ప్రశ్నలు జవాబులు:

ప్రశ్న 1.
ఈ బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.
ఈ బొమ్మలో గురుశిష్యులు ఉన్నారు.

ప్రశ్న 2.
గురువుగారు ఏం చెప్తున్నారు ?
జవాబు.
గురువుగారు శతకపద్యాలు చెప్తున్నారు.

ప్రశ్న 3.
మీకు తెలిసిన ఒక పద్యం చెప్పండి.
జవాబు.
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల ?
చదువ పద్య మరయ చాలదా ఒకటైన
విశ్వదాభిరామ వినురవేమ !

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 46)

ప్రశ్న 1.
ఇతరులు తనను పొగిడితే పొంగిపోకుండా ఉండాలని కవి అన్నాడు కదా ! అట్లా ఎందుకన్నాడో చెప్పండి.
జవాబు.
ఇతరులు తనను పొగిడితే పొంగిపోయేవాడు తాను ఏ పని చేసినా పొగడ్తల కోసమే ఎదురుచూస్తాడు. ఇతరుల మేలు కోసం పని చేయాలనే ఆలోచన ఉండదు. అందుకే ఇతరులు తనను పొగిడితే పొంగిపోకుండా ఉండాలని కవి అన్నాడు.

ప్రశ్న 2.
నూర్గురు కొడుకులున్న ధృతరాష్ట్రునికి మేలు జరుగ లేదు. అదెట్లాగో చెప్పండి.
జవాబు.
కొందరు కొడుకులు పుట్టలేదని బాధపడతారు. కొడుకులు పుడితే మేలు జరుగుతుందని భావిస్తారు. కాని ధృతరాష్ట్రునికి నూర్గురు కొడుకులున్న ఏ మేలూ జరుగలేదు. పాండవులు అయిదుగురే కాని వారు సద్గుణాలు కలిగినవారు. కౌరవులు నూరుగురు అయినప్పటికీ వారు ఈర్ష్య, అసూయ, మాత్సర్యం అనే దుర్గుణాలు కలిగినవారై పాండవులతో యుద్ధం కొని తెచ్చుకొని వంశ నాశనానికి కారకులయ్యారు. శుకమహర్షికి కొడుకులు లేకపోయినా మోక్షాన్ని పొందాడు.

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 47)

ప్రశ్న 1.
చేసిన మేలును చెప్పుకోవద్దని కవి ఎందుకు అని ఉండవచ్చు?
జవాబు.
ఎవరు చేసిన మేలును గురించి వారే చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే గొప్పలు చెప్పుకుంటున్నాడని చులుకనగా చూస్తారు. అదే ఇంకొకరు గుర్తించి చెబితే అందరూ మెచ్చుకుంటారు. అందుకని చేసిన మేలును చెప్పుకోవద్దని కవి అని ఉండవచ్చు.

ప్రశ్న 2.
వాదములాడవద్దని కవి అన్నాడు కదా ! వాదము లాడడం వల్ల కలిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి?
జవాబు.
వాదములాడడం వల్ల ఒకరిపై ఒకరికి కోపం పెరుగుతుంది. భేదభావం ఏర్పడుతుంది. సంతోషం ఉండదు. అందువల్ల వాదములాడవద్దని కవి అన్నాడు.

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 47)

ప్రశ్న 1.
కడుపునిండ విషమున్నవాడు కాలనాగుకన్న ప్రమాదకరమని కవి అన్నాడు కదా ! అది ఎట్లో చెప్పండి.
జవాబు.
కాలనాగును చూస్తే అది ప్రమాదకరమైనదని, కాటు వేస్తుందని దూరంగా ఉంటాం. అంటే విషయం ముందే తెలుసు కాబట్టి జాగ్రత్తపడతాం. కాని కడుపులో శత్రుత్వం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడుతూ మిత్రుని లాగా వ్యవహరించేవాడు చాలా ప్రమాదకారి. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కడుపునిండ విషమున్నవాడు కాలనాగు కన్న ప్రమాదకరమని కవి అన్నాడు.

ప్రశ్న 2.
‘మానవుడే మాధవుడని భావించి ప్రజల సేవ చేయాలి’ అట్లా చేసి గొప్ప పేరు తెచ్చుకున్న కొందరి గురించి చెప్పండి.
జవాబు.
మానవుడే మాధవుడని భావించి ప్రజలకు సేవచేసి గొప్ప పేరు తెచ్చుకున్న వారిలో మహాత్మాగాంధీ, మదర్ థెరిసా, వివేకానందుడు మొదలైనవారు ఉన్నారు.
మహాత్మాగాంధీ కుష్ఠురోగియైన ఒక కార్మికుడిని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి సేవలు చేశాడు. మదర్ థెరిసా ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్’ ద్వారా ఎందరికో తన సేవలు అందించింది. అలాగే వివేకానందునికి కూడా చిన్నప్పటి నుంచి సేవాభావం ఉండేది.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
శతకపద్యాలు చదివారు కదా ! వీటి గొప్పతనం గురించి చెప్పండి.
జవాబు.
శతకపద్యాలలో ఎన్నో నీతులు చోటుచేసుకున్నాయి. వీటిని చదవడం వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందుతాయి. వారు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఈ శతకపద్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ప్రశ్న 2.
ఒకరు పద్యం చదువండి. మరొకరు భావం చెప్పండి.
జవాబు.
విద్యార్థుల కృత్యం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. కింది భావాలకు సరిపోయిన పద్యపాదాలను పాఠం నుండి వెతికి రాయండి.

అ. మనిషే భగవంతుడు అని తెలుసుకొని సేవ చేయాలి.
జవాబు.
“మానవుడె మాధవుండను జ్ఞానంబున ప్రజలసేవ సలుపు”

ఆ. తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు.
జవాబు.
“తప్పును కప్పి పుచ్చువారు కలుషమతులు”

ఇ. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే.
జవాబు.
“గొప్పలు చెప్పిన నదియును దప్పే”

ఈ. మంచివారికి సేవ చేయాలి.
జవాబు.
“సాథుల గనుగొన్న సేవ సల్పుము”

2. కింది పద్యాన్ని చదువండి.

పుత్తడి గలవాని పుండు బాధైనను
వసుధలోన చాల వార్తకెక్కు
పేదవాని యింట పెండ్లిన యెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ !

పై పద్యం ఆధారంగా తప్పు, ఒప్పులను గుర్తించండి.

అ. పుత్తడిగలవాడంటే ఇనుము గలవాడు.
జవాబు.
తప్పు

ఆ. వార్తకెక్కు అంటే వార్తల్లోకి రావటం.
జవాబు.
ఒప్పు

ఇ. పేదవాడి ఇంట్లో పెండ్లి జరిగినా ఎవరికీ తెలియదు.
జవాబు.
ఒప్పు

ఈ. శ్రీమంతులు ఏదిచేసినా అది వార్త అవుతుంది.
జవాబు.
ఒప్పు

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

3. కింది వాక్యాలు చదువండి. మీరు చేసే పనులకు సంబంధించి సరైన జవాబును ‘ తో గుర్తించండి.

అ. నేను తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోను. అవును/కాదు
జవాబు.
అవును

ఆ. ఇతరులకు మేలుచేసి ఆ గొప్పలు చెప్పుకోను. అవును/కాదు
జవాబు.
అవును

ఇ. నాకు అందరు మంచివాళ్ళుగానే కనిపిస్తారు. అవును/కాదు
జవాబు.
అవును

ఈ. నేను ఎవరితోనూ వాదాలు పెట్టుకోను. అవును/కాదు
జవాబు.
అవును

ఉ. నేను మంచివాళ్ళతో స్నేహం చేస్తాను. అవును/కాదు
జవాబు.
అవును

ఊ. ఇతరుల మధ్య గొడవలు పెట్టను. అవును/కాదు
జవాబు.
అవును

ఋ. ఇతరులకు ఏదైనా అవసరముంటే ఇస్తాను. అవును/కాదు
జవాబు.
అవును

ౠ. ఇతరులు నాపై కోపించినా నేను వారిపై కోపించను. అవును/కాదు
జవాబు.
అవును

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. మనం ఇతరులకు మేలు చెయ్యాలి. ఎందుకు ?
జవాబు.
మనం ఇతరులకు మేలు చెయ్యాలి. ఎందుకంటే ఇతరులు కూడా మనలాంటి వాళ్ళే. మనం ఏ విధంగా కష్టాలు లేకుండా సుఖంగా జీవించాలనుకుంటామో ఇతరులు కూడా అలాగే జీవించాలనుకోవాలి. అందువల్ల ఎవరైనా బాధల్లో ఉంటే వారి బాధలు పోగొట్టడానికి మనం మేలు చేయాలి.

ఆ. మంచివారితో స్నేహం చేస్తే మనకూ మంచి గుణాలు అలవడుతాయి. ఎట్లాగో వివరించండి.
జవాబు.
నీళ్లు, కాలిన ఇనుము మీద పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్లే తామరాకు మీద పడితే ముత్యాల్లా ప్రకాశిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలో పడితే మణుల్లా మారుతాయి. అట్లాగే మనిషి అధములతో స్నేహం చేస్తే అధముడౌతాడు. మధ్యములతో స్నేహం చేస్తే మధ్యముడౌతాడు. ఉత్తములతో అంటే మంచివారితో స్నేహం చేస్తే మంచి గుణాలు అలవడుతాయి. కాబట్టి మంచివాళ్ళతోనే స్నేహం చేయాలి.

ఇ. “గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే” అని తెలుసుకున్నారు కదా. దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు.
కొంతమంది ఇతరులకు ఏ చిన్న మేలు చేసినా ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అట్లా గొప్పగా చెప్పుకొన్నందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అది నిన్ను నీవు పొగడుకొన్నట్లు అవుతుంది. దాన్ని ఎవరూ మెచ్చుకోరు. తాను చేసిన మేలును చూసి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి. కాబట్టి ఎవరికి వారు గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పేనని నా అభిప్రాయం.

ఈ. అనవసర వాదాలకు ఎందుకు పోవద్దు ?
జవాబు.
అనవసర వాదాలకు పోతే మనల్ని అందరూ శత్రువులుగా భావిస్తారు. చెడ్డ పేరు వస్తుంది. ఎవరూ మనతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఎవరిపట్ల భేదభావం చూపకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి. మంచివారికి తగిన సేవ చేయాలి. అప్పుడు సంతోషంగా గడపవచ్చు. అందువల్ల అనవసర వాదాలకు పోకూడదు.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

శతక కవుల వల్ల సమాజానికి ఎట్లాంటి మేలు చేకూరుతుంది?
జవాబు.
శతక కవులు నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తూ ఎన్నో శతకాలు రాశారు. వారు రచించిన శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి. మనిషి ఎలా జీవించాలో తెలుపుతాయి. వీటివల్ల సమాజంలో నైతిక విలువల్ని పెంపొందించవచ్చు.

శతకపద్యాలు అందరూ జీవితకాలం గుర్తుంచుకోదగ్గవి. ఇటు పిల్లలకు అటు పెద్దవారికి అందరికీ పనికి వచ్చే విధంగా నీతులనూ, ధర్మాలనూ బోధిస్తూ శతక కవులు మంచిమంచి శతకాలను సమాజానికి అందించారు. ఆ నీతులను కూడా చక్కటి ఉదాహరణలతో చెపుతూ పద్యరచన గావించారు. మన తెలుగు శతక కర్తలు మన తెలుగువారికీ, తెలుగుభాషకూ గొప్ప సేవ చేసి ధన్యులయ్యారు. ఈ విధంగా శతక కవుల వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.

IV. సృజనాత్మకత / ప్రశంస:

శతకపద్యాల ఆధారంగా మనం చేయకూడనివి, చేయవలసినవి పట్టిక తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు.
శతకపద్యాల ఆధారంగా మనం చేయకూడనివి :

  1. ఇతరుల ధనానికి ఆశపడరాదు.
  2. పొగడ్తలకు పొంగిపోరాదు.
  3. ఇతరులు కోపించినా తాను కోప్పడకూడదు.
  4. పుత్రులు పుట్టలేదని బాధపడకూడదు.
  5. ఇతరులకు చేసిన మేలును చెప్పరాదు.
  6. తనను గురించి తాను గొప్పలు చెప్పుకోకూడదు.
  7. అనవసరంగా ఎవరితోనూ వాదులాడరాదు.
  8. ఎవరిపట్ల భేదభావం చూపరాదు.
  9. ఏదైనా తప్పు చేస్తే దాచిపెట్టరాదు.

శతకపద్యాల ఆధారంగా మనం చేయవలసినవి :

  1. స్త్రీలతో సోదరునిలా మెలగాలి.
  2. ఇతరుల మేలు కోరుతూ ఉండాలి.
  3. మంచివారితోనే స్నేహం చేయాలి.
  4. మంచివారికి సేవ చేయాలి.
  5. తాము చేసిన తప్పును ఒప్పుకోవాలి.
  6. ప్రమాదకరమైన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

V. పదజాల వినియోగం:

1. కింది పదాలతో సొంతవాక్యాలను రాయండి.

ఉదా : మోదం మానవునికి మోదమే బలాన్ని కలిగిస్తుంది.
మోదం = సంతోషం

అ. హితం : ____________
జవాబు.
సమాజంలో అందరి హితాన్ని కోరుతుండాలి.
హితం = మేలు

ఆ. హర్షించుట : ____________
జవాబు.
ఉద్యోగులకు జీతాలు పెరిగితే హర్షిస్తారు.
హర్షించుట = సంతోషించుట

ఇ. మోదం : ____________
జవాబు.
ఆటలపోటీలలో గెలిచినపుడు నాకెంతో మోదంగా ఉంటుంది.
మోదం = సంతోషం

ఈ. పరధనం : ____________
జవాబు.
పరధనం దొంగిలించరాదు.
పరధనం = ఇతరుల డబ్బు

ఉ. దుర్గతి : ____________
జవాబు.
కొందరు తగని పనిచేసి దుర్గతి పాలౌతారు.
దుర్గతి = కష్టం

ఊ. మేలు : ____________
జవాబు.
ఇతరులకు మేలు చేయాలి కాని కీడు చేయరాదు.
మేలు = ఉపకారం

ఋ. ప్రజల సేవ : ____________
జవాబు.
ప్రజలసేవ చేసే భాగ్యం అందరికి లభించదు.
ప్రజలసేవ = మానవ సేవ

2. జుట్టుపని :
పద్యాల్లోని పదాల్లో ఏయే పదాలు పుస్తకం చివరి అకారాది పట్టికలో ఉన్నాయో చూసి వాటి కింద గీత గీయండి. అర్ధాలు రాయండి.
జవాబు.
నారి = స్త్రీ
పరముడు = ఉన్నతుడు, గొప్పవాడు
చిత్తము = మనస్సు
తప్తం = కాలిన
నళినీదళం = తామరాకు
తనర్చు = ప్రకాశించు
శుక్తి = ముత్యపు చిప్ప
మోదము = సంతోషం
సాధువు = మంచివాడు
మాధవుడు = విష్ణువు
మాన్య = గొప్పదైన
మనీషి = బుద్ధిమంతుడు

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పేరాలో విభక్తి ప్రత్యయాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.

బతుకమ్మను పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలువడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు. చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక, వర్తమాన సంఘటనలుంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ ! బతుకమ్మ ! సంపదను ఇవ్వమ్మ ! అంటూ పూజలు చేస్తారు. ఆ పూజల వల్ల ఫలితాన్ని పొందుతారు.

పదం = విభక్తి ప్రత్యయం – విభక్తి పేరు
ఉదా : బతుకును = ను – ద్వితీయా విభక్తి
అ. బతుకమ్మను = ను – ద్వితీయా విభక్తి
ఆ. ప్రకృతిని = ని – ద్వితీయా విభక్తి
ఇ. చేతులతో = తో – తృతీయా విభక్తి
ఈ. అందుకొరకు = కొరకు – చతుర్థీ విభక్తి
ఉ.. పూజలవల్ల = వల్ల – పంచమీ విభక్తి
ఊ. పండుగలో = లో – షష్ఠీ విభక్తి
ఋ. పాటలందు = అందు – సప్తమీ విభక్తి

2. కింది ఖాళీలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తులో రాయండి.

ఉదా : చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. (సప్తమీ విభక్తి)

అ. చదువునకు మూలం శ్రద్ధయే. (షష్ఠీ విభక్తి)
ఆ. చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు. (ద్వితీయా విభక్తి)
ఇ. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు. (పంచమీ విభక్తి)
ఈ. ఘటముల్లో నీరు నిండుగా ఉన్నది. (షష్ఠీ విభక్తి)
ఉ. దేశభక్తులు దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. (చతుర్థీ విభక్తి)
ఊ. హింస వల్ల దేనినీ సాధించలేం. (పంచమీ విభక్తి)
ఋ. అతడు కుంచెతో చిత్రాలు గీశాడు. (తృతీయా విభక్తి)
ౠ. వాదాలు పెట్టుకోవడం వల్ల మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది. (పంచమీ విభక్తి)
ఎ. బాలికలు బహుమానాలు తీసుకోవడానికి వేదికపైకి ఎక్కారు. (ప్రథమా విభక్తి)
ఏ. రైతు నాగలితో పొలం దున్నుతాడు. (తృతీయా విభక్తి)
ఐ. చెరువులో బట్టలు ఉతుకొద్దు. (షష్ఠీ విభక్తి)
ఒ. పెద్దల మాటలను గౌరవించాలి. (ద్వితీయా విభక్తి)
ఓ. పసివాడు పాలకోసం ఏడుస్తున్నాడు. (చతుర్థీ విభక్తి)
ఔ. బాలబాలికలు స్వయంకృషితో పైకి రావాలి. (తృతీయా విభక్తి)
క. సుస్మిత కంటే మానస తెలివైనది. (పంచమీ విభక్తి)

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

అవ్యయం:

కింది తరగతులలో భాషాభాగాలలోని నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణాల గురించి తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ‘అవ్యయం’ అంటే ఏమిటో తెలుసుకుందాం.

కింది వాక్యాలను చదువండి.

నిదానమే ప్రధానం. అట్లని సోమరితనం పనికిరాదు.
మనిషికి వినయం అలంకారం. అయితే అతివినయం పనికిరాదు.
ఆహా ! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో !

ఈ వాక్యాల్లో ఉన్న “అట్లని, అయితే, ఆహా!” మొదలైన పదాలను చూశారుకదా! ఇవి పుంలింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే ఇవి విభక్తులు కావు. ఏకవచన, బహువచనమనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను ‘అవ్యయాలు’ అంటారు.

“లింగ, వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు”.

1. కింది వాక్యాల్లో ఉన్న అవ్యయపదాల కింద గీత గీయండి.

అ. ‘ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది.’ అని సీత రాముడితో అన్నది.
ఆ. ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు.
ఇ. ‘శభాష్‘ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు.
ఈ. విజ్ఞానం మరియు వినోదం అందరికి అవసరం.
ఉ. అమ్మో! ఆ కుక్క కరుస్తుంది.
ఊ. ధనం సంపాదించాలి, అయితే అందులో కొంత దానం కూడా చేయాలి.

ప్రాజెక్టు పని:

మీకు బాగా నచ్చిన శతకాల్లోని ఏవైనా 5 పద్యాలను సేకరించి, భావాలు రాయండి. నివేదిక రాసి చదివి వినిపించండి.
జవాబు.
1. కూరిమిగల దినములలో
నేరములెన్నడును కలుగనేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ ! (సుమతీ శతకం)
భావం :
మంచి బుద్ధి గలవాడా! ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్న రోజుల్లో, వారిలో తప్పులు అనేవి కనిపించవు. స్నేహం చెడిపోతే, అన్నీ తప్పులు గానే కనబడుతూ ఉంటాయి.

2. అనువుగానిచోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ! (వేమన శతకం)
భావం :
ఓ వేమనా ! అనుకూలత లేనిచోట మనం గొప్పవాళ్ళం అని చెప్పకూడదు. అణకువగా ఉండడం తక్కువతనం కాదు. కొండ పెద్దదైనా, అద్దంలో చిన్నదిగానే కనబడుతుంది కదా !

3. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్ గాకున్న
విశ్వహిత చరిత్ర వినరమిత్ర ! (మిత్ర సాహస్రి)
భావం :
లోక క్షేమాన్ని కోరే మిత్రమా ! ఒక మాట విను. చదివిన చదువును జీర్ణించుకుంటే మనస్సు పరిపక్వమవుతుంది. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఆ రెండూ జీర్ణం కాకపోతే చెరుపు చేస్తాయి.

4. చేయకుము కాని కార్యము
పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్
చేయకుము రిపు గృహంబున
గూయకు మొరుమనసు నొచ్చుకూత కుమారా ! (కుమార శతకం)
భావం :
ఓ కుమారా ! చెడ్డపనులు చేయవద్దు. మంచి పనులను విడువవద్దు. శత్రువుల ఇంటిలో భోజనం చేయవద్దు. ఇతరుల మనసుకు బాధ కలిగేటట్లు మాట్లాడవద్దు.

5. ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు. పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ! (వేమన శతకం)
భావం :
ఉప్పు, కర్పూరం ఒకే రకంగా ఉంటాయి. కాని వాటి రుచులు వేరుగా ఉంటాయి. అలాగే పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

TS 6th Class Telugu 5th Lesson Important Questions శతకసుధ

I. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం:

1. కింది పద్యాలు చదువండి, భావాలు రాయండి.

అ) కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్
వడిసెం బుత్రులులేని యాశుకునకుం బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా !
భావం :
శ్రీకాళహస్తీశ్వరా! ‘నాకు కొడుకులు పుట్టలేదే’ అని తెలివిలేనివారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు వందమంది కొడుకులున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలూ జరుగలేదు. అదే శుకమహర్షి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంతమాత్రాన ముక్తి లభించకపోవడం జరుగదు.

ఆ) నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
పౌరుష వృత్తు లిట్లధము మధ్యము నుత్తము గొల్చువారికిన్
భావం :
కాలిన ఇనుము మీద నీళ్ళు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్లే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలో పడితే మణులుగా (ముత్యాలుగా) మారుతాయి. మనిషి అధములలో చేరితే అధముడౌతాడు. మధ్యములలో చేరితే మధ్యముడౌతాడు. ఉత్తములలో చేరితే ఉత్తముడౌతాడు.

II. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) గాంధీ గారేమన్నారు?
జవాబు.
మానవుడే మాధవుడని భావించాలి. అదే దృష్టితో ప్రజాసేవ చేయాలి. అదే మానవత్వం. అదే గొప్పతనం అని మహాత్మాగాంధీగారన్నారు. ఆచరించి చూపించారు.

ఆ) తప్పును కప్పిపుచ్చుకోవడం ఎందుకు తప్పు ?
జవాబు.
తప్పు చేయకూడదు. పొరబాటున తప్పుచేయడం సహజం. చేసిన తప్పును ఒప్పుకోవాలి. అలా కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు. కప్పి పుచ్చుకోవడానికి అబద్ధాలు కూడా చెప్పాలి. విచారణలో అవి అబద్దాలనీ తేలతాయి. ఎప్పటికైనా తప్పు దొరకక తప్పదు. అందుకే కప్పి పుచ్చుకోకూడదు.

ఇ) ‘కడుపునిండా విషం’ అంటే మీకేమర్థమయింది ?
జవాబు.
విషం అంటే చెడు. కడుపునిండా విషం అంటే ఆలోచనల నిండా చెడు ఉండడం. ఎప్పుడూ ఎవరికీ చెడు జరగాలని కోరుకోకూడదు. చెడు సలహాలు చెప్పకూడదు. చెడ్డమాటలు మాట్లాడకూడదు. చెడు పనులు చేయకూడదు. ఈ చెడులన్నింటికీ కారణం ఆలోచనలలోని చెడు. అంటే కడుపులో విషం. అందుకే కడుపులో విషం ఉండకూడదు. దాని వలన విషం ఉన్న వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అందుకే కవిగారు కడుపులో విషం ఉన్నవాళ్ళు కాలనాగు కంటే ఎక్కువ ప్రమాదం అన్నారు.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) శతక పద్యాల వలన మీరేం నేర్చుకొన్నారు ?
జవాబు.
పరస్త్రీలను సోదరిలాగ చూడాలి. ఇతరుల ధనాన్ని ఆశించకూడదు. పొగడ్తలకు పొంగకూడదు. ఇతరులు కోపించినా కోప్పడకూడదు. చేసిన మేలు చెప్పుకోకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. వాదులాడకూడదు. సాధువులను సేవించాలి. మనిషిని దైవంగా భావించి సేవించాలి. కడుపులో విషం ఉండకూడదు. చేసిన తప్పును ఒప్పుకోవాలి.

ఆ) శతకపద్యాల పాఠం వలన జీవితంలో ఉపయోగం ఏమిటి ?
జవాబు.
శతక పద్యాల పాఠంలో చాలా మంచి విషయాలు తెలుసుకొన్నాము. చాలా నీతులు తెలిశాయి. వీటిని నిజ జీవితంలో ఆచరించాలి. అప్పుడు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందరూ ఆదర్శవంతుడిగా చూస్తారు. స్నేహితులు పెరుగుతారు. విరోధులు ఉండరు. అన్నిపనులూ సులువుగా జరుగుతాయి. అందరూ ఇవి పాటిస్తే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది. మనదేశ గౌరవం పెరుగుతుంది.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

III. సృజనాత్మకత / ప్రశంస:

ప్రశ్న 1.
శతక పద్యాలు ఆధారంగా కొన్ని నినాదాలు రాయండి.
జవాబు.
స్త్రీలను గౌరవించు, గౌరవంగా జీవించు.
పరధనం కోరుకోకు, స్వధనం వదులుకోకు.
పొగడ్తలకు పొంగకు – తెగడ్తలకు కుంగకు.
చేసిన మేలు చెప్పకు – గొప్పలెప్పుడూ చెప్పకు.
ఉత్తములను సేవించు – ఉన్నతుడుగా జీవించు.
వాదించడం అజ్ఞానం – శోధించడం విజ్ఞానం.
మానవుడే మాధవుడు – మానవత్వమే దైవత్వం.
నొసటితో వెక్కిరించకు – నోటితో నవ్వకు.
కడుపులో విషం పెంచుకోకు – కాలనాగులా జీవించకు.
తప్పును ఒప్పుకో – ఒప్పుగా మసులుకో.

ప్రశ్న 2.
శతక పద్యాలు చదవడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

లేఖ

జూబ్లిహిల్స్,
X X X X X.

ప్రియమిత్రుడు సాయిశ్రీ ప్రసాదు,

ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమమని తలుస్తాను. ఇటీవల జరిగిన పరీక్షల్లో తెలుగులో అత్యధిక మార్కులు తెచ్చుకొన్నందుకు నాకు మా ఉపాధ్యాయుడు ‘సుమతీ శతకం’ బహుమతిగా ఇచ్చారు. దానిలో పద్యాలు ఎంతో బావున్నాయి. “ఉపకారికి నుపకారము ………”, “ఎప్పటికెయ్యది ప్రస్తుత ……..”, “కనకపు సింహాసనము ……..”, “కూరిమి గల దినములలో .” ఇలా ఎన్నో పద్యాలు నేను కంఠస్థము చేసాను. వాటి భావాలు చదివాను. ఎంత బాగున్నాయో తెలుసా ! ఉపకారం చేసేవానికి ఉపకారం చేయడం గొప్పకాదు. అపకారికి కూడా ఉపకారం చేయడం గొప్ప. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి; ఎలా ఉండాలి ఇలా ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను. నీవు కూడా శతక పద్యాలు చదువు. ఉంటాను మరి !

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
యస్. విష్ణుదత్తు.

చిరునామా :
కె. సాయిశ్రీ ప్రసాద్,
S/o ఫణిరామలింగేశ్వర్,
సీతాఫల్ మండి,
హైదరాబాద్.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

IV. భాషాంశాలు:

ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి
ఆశ – ఆస
శ్రీ – సిరి
మౌక్తికము – ముత్యము
సింహము – సింగము
విషము – విసము
మతి – మది
నీరము – నీరు
వాదము – వాదు
వంశము – వంగడము
స్థానము – తానము

పర్యాయపదాలు:

కొడుకు = కుమారుడు, తనయుడు, సుతుడు, పుత్రుడు
కుమారి = కూతురు, కుమార్తె, తనయ, పుత్రి
మోక్షము = ముక్తి, కైవల్యము
ముదము = సంతోషము, హర్షము
నారి = మహిళ, వనిత

సంధులు:

పరులలిగిన = పరులు + అలిగిన – ఉత్వసంధి
పుట్టరటంచు = పుట్టరు + అటంచు – ఉత్వసంధి
చిత్తమందు = చిత్తము + అందు – ఉత్వసంధి
ముత్యమట్లు = ముత్యము + అట్లు – ఉత్వసంధి
స్థానంబనె = స్థానంబు + అనె – ఉత్వసంధి
సోదరుడై = సోదరుడు + ఐ – ఉత్వసంధి
హితుడై = హితుడు + ఐ – ఉత్వసంధి
శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తి + ఈశ్వరా – సవర్ణదీర్ఘ సంధి
కౌరవేంద్రుడు = కౌరవ + ఇంద్రుడు – గుణసంధి

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

సమాసాలు:

సమాసపదం  విగ్రహ వాక్యం  సమాస నామం
పరనారి  పరుని యొక్క నారి  షష్ఠీతత్పురుష సమాసం
పరధనం  పరుల యొక్క ధనం  షష్ఠీతత్పురుష సమాసం
కౌరవేంద్రుడు  కౌరవులలో ఇంద్రుడు  షష్ఠీతత్పురుష సమాసం
భరతవంశ తిలకుడు  భరతవంశానికి తిలకుడు  షష్ఠీతత్పురుష సమాసం
శ్రీకాళహస్తీశ్వరా  శ్రీకాళహస్తియందలి ఈశ్వరా  సప్తమీ తత్పురుష సమాసం

నానార్థాలు:

ప్రశ్న 1.
నారి : ____________
జవాబు.
భార్య, వింటి, అల్లెత్రాడు

ప్రశ్న 2.
హితము : ____________
జవాబు.
లాభం, క్షేమం, మేలు

ప్రశ్న 3.
ఈశ్వరుడు : ____________
జవాబు.
శివుడు, ప్రభువు, భగవంతుడు

ప్రశ్న 4.
సేవ : ____________
జవాబు.
శుశ్రూష, పూజ, అనుసరణ

వ్యాకరణాంశాలు:

వాక్యాలు గుర్తించి రాయండి.

ప్రశ్న 1.
విజ్ఞానం అవసరం, వినోదం అవసరం – సంయుక్త వాక్యంగా రాయండి.
జవాబు.
విజ్ఞానం మరియు వినోదం అవసరం.

ప్రశ్న 2.
ధనం సంపాదించాలి. కొంత దానం చేయాలి సంక్లిష్ట వాక్యం
జవాబు.
ధనం సంపాదించి, కొంత దానం చేయాలి.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

కింది వానిని గుర్తించండి.

ప్రశ్న 1.
‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలు ( )
అ) అచ్చులు
ఆ) పరుషాలు
ఇ) వర్గము
ఈ) ఊష్మాలు
జవాబు.
ఇ) వర్గము

ప్రశ్న 2.
‘య, ర, ల, వ’ లు ……. ( )
అ) అంతస్థములు
ఆ) సరళాలు
ఇ) వర్గము
ఈ) ఓష్ఠ్యములు
జవాబు.
అ) అంతస్థములు

ప్రశ్న 3.
ఉభయాక్షరాలు ( )
అ) ఁ, ౦, న్
ఆ) ఁ, ౦, ః
ఇ) ౦, న్, ఐ
ఈ) ఁ, న్, ః
జవాబు.
ఆ) ఁ, ౦, ః

ప్రశ్న 4.
దీర్ఘాక్షరాలు ( )
అ) జి, జొ
ఆ) భే, ఘా
ఇ) క్ర, ద్ద
ఈ) రో, జా
జవాబు.
ఈ) రో, జా

ప్రశ్న 5.
లింగాలు ( )
అ) గోపి, రమ్య
ఆ) స్వాతి, లక్ష్మి
ఇ) శ్రుతి, నెమలి
ఈ) రాజు, జింక
జవాబు.
ఆ) స్వాతి, లక్ష్మి

ప్రశ్న 6.
పుంలింగాలు ( )
అ) రాణి, రాజు
ఆ) ఆవు, పులి
ఇ) రాముడు, కృష్ణుడు
ఈ) రవి, లీల
జవాబు.
ఇ) రాముడు, కృష్ణుడు

వేరు పదం గుర్తించండి.

ప్రశ్న 1.
సాలె పురుగు, పాము, ఏనుగు, చెట్టు
జవాబు.
చెట్టు

ప్రశ్న 2.
కావ్యం, పుస్తకం, కవచం, గ్రంథం
జవాబు.
కవచం

ప్రశ్న 3.
కొడుకు, పుత్రుడు, బొట్టె, బుట్టె
జవాబు.
బుట్టె

ప్రశ్న 4.
జాతిపిత, మహాత్మ, పద్మశ్రీ, బాపూ
జవాబు.
పద్మశ్రీ.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

పద్యాలు – అర్థాలు – తాత్పర్యాలు:

I. 1వ పద్యం : (కంఠస్థ పద్యం)

కం. పరనారీ సోదరుడై
పరధనమున కాసపడక పరులకు హితుడై
పరులు దనుఁ బొగడ నెగడకఁ
బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ!

అర్థాలు :
సుమతీ = మంచిబుద్ధి కలవాడా !
పరనారీ = ఇతర స్త్రీలకు
సోదరుడు + ఐ = తోబుట్టువు వంటివాడై
పర = ఇతరుల
ధనమునకున్ = ధనమునకు, డబ్బుకు
ఆసపడక = ఆశపడకుండా
పరులకు = ఇతరులకు
హితుడు + ఐ = మేలు చేయువాడై
పరులు = ఇతరులు
తనున్ = తనను
పొగడన్ = స్తుతింపగా
నెగడకన్ = ఉబ్బిపోకుండా
పరులు = ఇతరులు
అలిగినన్ = కోపించినప్పటికీ
అలుగని + అతడు = కోపం తెచ్చుకోనివాడు
పరముడు = గొప్పవాడు, ఉత్తముడు

తాత్పర్యం :
మంచి బుద్ధి కలవాడా ! స్త్రీలకందరికీ సోదరునిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు. ఇతరుల మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు.

2వ పద్యం : (కంఠస్థ పద్యం)

మ. కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్
వడిసెం బుత్రులులేని యాశుకునకుం బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా !

అర్థాలు :

శ్రీకాళహస్తి + ఈశ్వరా = శ్రీకాళహస్తీ క్షేత్రమునందు వెలసిన ఓ ఈశ్వరా !
అవివేకుల్ = తెలివితక్కువవారు
కొడుకుల్ = కుమారులు
పుట్టరు + అటంచున్ = కలుగరని చెప్పుచు
జీవన = బ్రతుకు విషయమై
భ్రాంతులై = భ్రమ చెందినవారై
ఏడ్తురు = దుఃఖింతురు
కౌరవ + ఇంద్రునకున్ = ధృతరాష్ట్రునకు
అనేకుల్ = అనేకులు
కొడుకుల్ = కుమారులు
పుట్టరె = పుట్టలేదా
వారిచేన్ = ఆ కుమారుల చేత
ఏ గతుల్ = ఏ సౌఖ్యములను
పడసెన్ = పొందెను
పుత్రులు లేని = కుమారులు లేనట్టి
ఆ శుకునకున్ = ఆ శుక మహర్షికి
దుర్గతుల్ = కష్టములు (నరకాది లోకాలు)
వాటిల్లెనే = కలిగినవా ? (కలుగలేదని భావం)
అపుత్రకునకున్ (న + పుత్రకునకున్) = కుమారులు లేనివానికి
మోక్షపదంబు = ముక్తి మార్గము
చెడునే = చెడిపోవునా ? (చెడదని భావం)

తాత్పర్యం :
శ్రీకాళహస్తీశ్వరా! ‘నాకు కొడుకులు పుట్టలేదే’ అని తెలివిలేనివారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు వందమంది కొడుకులున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలూ జరుగలేదు. అదే శుకమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంతమాత్రాన ముక్తి లభించకపోవడం జరుగదు.

3వ పద్యం : (కంఠస్థ పద్యం) .

కం. చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినఁగాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పేయని చిత్తమందు దలపు కుమారీ !

అర్థాలు :

కుమారీ = ఓ కుమారీ !
చేసిన మేలు = చేసిన ఉపకారం
ఒకప్పుడు + అయినన్ + కాని = ఎప్పుడైనా కాని
చెప్పకు = చెప్పవద్దు
దాని = దానిని, అట్లు చెప్పడాన్ని
హర్షింపరు = సంతోషింపరు గదా !
గొప్పలు = ఎక్కువలు
చెప్పినన్ = చెప్పినా
అదియును = అది కూడా
తప్పే + అని = తప్పే అని
చిత్తము + అందున్ = మనస్సునందు
తలపు = తలంపుము

తాత్పర్యం :
ఓ కుమారీ ! నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవ్వరూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

II. 4వ పద్యం : (కంఠస్థ పద్యం)

ఉ. || నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
పౌరుష వృత్తు లిట్లధము మధ్యము నుత్తము గొల్చువారికిన్

అర్థాలు :

నీరము = నీరు
తప్తలోహమునన్ = కాలిన లోహము మీద
నిల్చి = పడి, నిలిచి
అనామకము + ఐ = పేరు లేనిదై
నశించున్ = నశించిపోవును
ఆ నీరము + ఎ = ఆ నీరే
నళినీదళ = తామరాకుపై
సంస్థితమై = నిలిచినదై
ముత్యము + అట్లు = ముత్యము వలె
తనర్చున్ = ప్రకాశించును
ఆ నీరము + ఎ = ఆ నీరే
శుక్తిలోన్ + పడి = ముత్యపు చిప్పలో పడి
సమంచిత ప్రభన్ = మంచి కాంతితో
మణిత్వమున్ = మణి లక్షణమును
కాంచున్ = పొందును
అధమున్ = నీచుని
మధ్యమున్ = మధ్యముని
ఉత్తమున్ = ఉత్తముని
కొల్చువారికిన్ = సేవించువారికి
పౌరుషవృత్తులు = పురుష సంబంధమైన దశలు
ఇట్లు = ఈ విధముగా ఉండును

తాత్పర్యం :
కాలిన ఇనుము మీద నీళ్ళు పడితే ఆవిరై పోతాయి. ఆ నీళ్లే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలో పడితే మణులుగా (ముత్యాలుగా) మారుతాయి. మనిషి అధములతో చేరితే అధముడౌతాడు. మధ్యములతో చేరితే మధ్యముడౌతాడు. ఉత్తములతో చేరితే ఉత్తముడౌతాడు.

5వ పద్యం : (కంఠస్థ పద్యం)

వాదంబు లాడకెప్పుడు
మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్
భేదంబు సేయకెన్నడు
సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయా !

అర్థాలు :

తనయా = ఓ తనయా ! ఓ కుమారా !
ఎప్పుడు = ఎప్పుడు, ఏ కాలంలోనైనా
వాదంబులు + ఆడకు = కలహములాడరాదు, పోట్లాడరాదు
ఇకన్ = ఇక
నిన్ను నీవు = నిన్ను నీవే
మురిసి = పరిశీలించుకొని
మోదంబున = సంతోషమున
కనుము = పొందుము, చూడుము
ఎన్నడు = ఎప్పుడు
భేదంబు + చేయకు = భేదభావంబు చూపకు
సాధులన్ = మంచివారిని
కనుగొన్నన్ = కనొనినచో, చూచినచో
సేవ = సేవను
సలుపుము = చేయుము

తాత్పర్యం :
ఓ తనయా ! ఎప్పుడూ అనవసరమైన వాదాలు చెయ్యకు. నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు. ఎవరిపట్లా భేదభావం చూపకు. మంచివారికి సేవ చెయ్యి.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

III. 6వ పద్యం : (కంఠస్థ పద్యం).

మానవుడే మాధవుండను
జ్ఞానంబున ప్రజలసేవ సలుపు మదియె నీ
మానవతలోని మాన్య
స్థానంబనె గాంధీతాత సద్గుణజాతా!

అర్థాలు :

సద్గుణజాతా = మంచిగుణాలు కలవాడా!
మానవుడు + ఎ = మనిషే
మాధవుండు + అను = విష్ణువను (భగవంతుడను)
జ్ఞానంబునన్ = తెలివితో
ప్రజల = ప్రజలకు, మానవులకు
సేవ = సేవను
సల్పుము = చేయుము
అదియె = అదే (అట్లా సేవ చేయడమే)
మానవత్వంలోని = మానవత్వంలోని
మాన్యస్థానంబు = గౌరవించదగిన స్థానమని, ఉన్నత స్థానమని
గాంధీతాత = గాంధీ తాత
అనన్ = అన్నాడు, పలికాడు

తాత్పర్యం:
‘మంచిగుణాలు కలవాడా ! మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ప్రజలకు సేవ చెయ్యి. అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నతస్థానం’ అని గాంధీతాత చెప్పాడు. గమనించు.

7వ పద్యం : (కంఠస్థ పద్యం)

ఆ.వె. నొసట వెక్కిరించి నోట నవ్వును జూపి
కడుపునిండ విషము గలుగువాడు
కాలనాగుకన్న కడు ప్రమాదంబయా
బాలనారసింహ! భరతసింహ !

అర్థాలు :

బాలనారసింహ = బాలనారసింహా !
భరతసింహ = భరతసింహా !
నవ్వును కనబరచి
నోటన్ = నోటియందు
నవ్వును + చూపి = నవ్వును కనబరిచి
నొసటన్ = నొసటితో
వెక్కిరించి = వెక్కిరించి
కడుపునిండ = పొట్టనిండా
విషము + కలుగువాడు = విషాన్ని కలిగియున్నవాడు
కాలనాగుకన్నన్ = కాలనాగు (విషసర్పము) కంటే
కడు = మిక్కిలి
ప్రమాదంబయా = ప్రమాదమైనవాడయ్యా

తాత్పర్యం :
బాలనారసింహా! భరతసింహా! నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్న వారు కాలనాగు (నల్లత్రాచు) కంటే ప్రమాదకరమైన వారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.

8వ పద్యం : (కంఠస్థ పద్యం)

ఆ.వె. తప్పుచేసికూడ తమదగు తప్పును
కప్పిపుచ్చువారు కలుషమతులు
ఒప్పుకొనెడివారు గొప్పమనీషులు
భరతవంశతిలక! భవ్యచరిత !

అర్థాలు :
భరతవంశతిలక = భరతవంశ శ్రేష్ఠుడా!
భవ్యచరిత = యోగ్యమైన నడవడి కలవాడా !
తప్పుచేసికూడ = తప్పుచేసికూడ (దోషం చేసి కూడ)
తమది + అగు = తమదైన
తప్పును = తప్పును
కప్పిపుచ్చువారు = దాచిపెట్టేవారు
కలుషమతులు = పాపపు బుద్ధికలవారు, చెడ్డవారు
ఒప్పుకొనెడివారు = ఒప్పుకొనేవారు
గొప్ప మనీషులు = గొప్ప బుద్ధిమంతులు

తాత్పర్యం:
భరతవంశానికి తిలకం వంటివాడా ! మంచి నడవడిక గలవాడా ! తప్పుచేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు. తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

పాఠం / ఉద్దేశం:

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం “శతక” ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో వందకు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీతాత, భరతసింహ, భవ్యచరిత మొదలైన శతకాల పద్యాలున్నాయి.

కవి పరిచయాలు:

1. సుమతి శతకం – బద్దెన
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం) ఈయన సుమతీ శతకంతోపాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు.

2. శ్రీకాళహస్తీశ్వర శతకం – ధూర్జటి
మహాకవి ధూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతోపాటు ‘శ్రీకాళహస్తి మహాత్మ్యము’ అనే ప్రబంధాన్ని రాశాడు. “అతులిత మాధురీమహిమ” కలిగినవాడని శ్రీకృష్ణ దేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు.

3. కుమారి శతకం – పక్కి వేంకట నరసింహకవి
పక్కి వేంకట నరసింహకవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను | వేంకట నరసింహకవి సులభరీతిలో చెప్పాడు.

4. సుభాషిత రత్నావళి – ఏనుగు లక్ష్మణకవి
సంస్కృతంలో భర్తృహరి రాసిన “సుభాషిత త్రిశతి”ని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణకవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామనివాసి. సుభాషిత రత్నావళితోపాటు రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన, రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి.

5. ప్రభుతనయ శతకం – కౌకుంట్ల నారాయణరావు
కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. | తనయా ! అనే మకుటంతో ఈయన రాసిన ‘ప్రభుతనయ శతకం’ చాలా ప్రసిద్ధి చెందింది.

6. గాంధీతాత శతకం – శిరశినహల్ కృష్ణమాచార్యులు
శిరశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా ‘మోర్తాడ్’లో జన్మించాడు. కోరుట్లలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం అనే రచనలతోపాటు ‘రత్నమాల’ అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు పొందాడు.

7. భరతసింహ శతకం – సూరోజు బాలనరసింహాచారి
సూరోజు బాలనరసింహాచారి నల్లగొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితాకేతనం, బాలనృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. ‘సహజకవి’గా ప్రసిద్ధుడు.

8. భవ్యచరిత శతకం – డాక్టర్ టి.వి. నారాయణ
డా|| టి.వి. నారాయణ హైద్రాబాద్ జిల్లాకు చెందినవాడు. 26-07-1925లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా అనేక సేవలందించాడు. జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం (కవితాసంపుటి) అమరవాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాససంపుటి) మొదలైనవి ఈయన రచనలు.

TS 6th Class Telugu Guide 5th Lesson శతకసుధ

ప్రవేశిక:

జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అట్లా తెలుసుకున్న విషయాల్లో మంచివాటిని భవిష్యత్తు తరాలవారికి అందించాలని కొంతమంది మహాత్ములు కోరుకుంటారు. ఎంతో పెద్ద విషయాన్ని, కూడా కుదించి సులభంగా చెప్పగలిగే అవకాశం శతక పద్యాల్లో ఉంటుంది. శతకపద్యాల రూపంలో కవులు మనకు అందించిన మంచి విషయాలను ఈ పాఠంలో చదివి తెలుసుకుందాం.

నేనివి చేయగలనా ?

  • శతక పద్యాల గొప్పదనం గురించి చెప్పగలను. – అవును/ కాదు
  • అపరిచిత పద్యాన్ని చదివి తప్పొప్పులను గుర్తించగలను. – అవును/ కాదు
  • శతక కవుల వల్ల సమాజానికి కలిగే మేలు గురించి రాయగలను. – అవును/ కాదు
  • శతక పద్యాల్లోని భావాల ఆధారంగా మనం చేయగూడనివి, చేయవలసినవి పట్టిక రూపంలో తయారుచేసి ప్రదర్శించగలను. – అవును/ కాదు

Leave a Comment