TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 2nd Lesson స్నేహబంధం Textbook Questions and Answers.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి: (TextBook Page No.10)

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం 2

ప్రశ్నలు జవాబులు:

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.
బొమ్మలో ఉపాధ్యాయిని, విద్యార్థులు ఉన్నారు.

ప్రశ్న 2.
ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు.
ఆ పిల్లలు ఉపాధ్యాయిని (టీచరు) చెప్పే మాటలను వింటున్నారు. ముగ్గురు పిల్లలు నాల్గవవానిని చూసి తమ వద్ద ఉన్న ‘వస్తువులతో అందరం కలిసి ఆడుకుందామా అంటున్నారు.

ప్రశ్న 3.
పై బొమ్మ చూస్తే మీకే భావన కలిగింది?
జవాబు.
పై బొమ్మ చూస్తే అందరూ స్నేహంగా ఉండాలనే భావన కలిగింది.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.12)

ప్రశ్న 1.
తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారు కదా. మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడుతారో చెప్పండి.
జవాబు.
నేను నాకు కలిసిన కొత్త స్నేహితులతో “స్నేహితులారా!
అందరం కలిసిమెలిసి చదువుకుందాం. కలిసిమెలిసి ఆటలు ఆడుకుందాం. పాటలు పాడుకుందాం. ఒకరికొకరం సహాయం చేసుకుందాం” అని మాట్లాడతాను.

ప్రశ్న 2.
కలిసిమెలిసి ఉండడం వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు.
కలిసిమెలిసి ఉండడం వలన మిత్రభావం ఏర్పడుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అవసరం వచ్చినపుడు ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు.

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 14)

ప్రశ్న 1.
కన్నవాళ్ళకు స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి.
జవాబు.
కన్నవాళ్ళకు, స్నేహితులకు దూరంగా ఉంటే వాళ్ళు గుర్తుకు వస్తుంటారు. లోగడ జరిగిన సంఘటనలు .గుర్తుకు వస్తాయి. ఏదైనా కష్టం కలిగినపుడు చెప్పుకోడానికి కానీ, సలహా ఇవ్వడానికి కానీ అయినవాళ్ళు దగ్గరలేరే అనే బాధ కలుగుతుంది.

ప్రశ్న 2.
రాజకుమారుడు చేసిన పని మంచిదా? చెడ్డదా?. వివరించండి.
జవాబు.
రాజకుమారుడు కొలువుకూటంలోని పెద్దల సూచన ప్రకారం బంధించిన జింకను విడిచిపెట్టించాడు. సేవకులను పంపి దానిని అడవిలో వదిలిపెట్టించాడు. అది స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పించాడు. కాబట్టి రాజకుమారుడు చేసిన పని మంచిది.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 14)

ప్రశ్న 1.
ఎలుక తాబేలును ఎందుకు కోపించి ఉండవచ్చు?
జవాబు.
కాకి, ఎలుక, జింకలాగా తాబేలు వేగంగా పోలేదు. చాలా నెమ్మదిగా పోతుంది. ఏదైనా ఆపద వస్తే అవి వేగంగా పారిపోయి తప్పించుకోగలవు. కానీ తాబేలు అలా తప్పించుకోలేదు. అప్పటికే వలలో చిక్కుకున్న జింకను రక్షించి తీసుకొని వస్తున్న తమకు ఎదురుపడ్డ తాబేలును చూసి ఎలుక కోప్పడి ఉండవచ్చు.

ప్రశ్న 2.
“ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు” ఎట్లాగో చెప్పండి.
జవాబు.
ఒకసారి తాబేలు వేటగానికి చిక్కింది. వేటగాడు దాన్ని వింటికి కట్టుకున్నాడు. ఎలుక చెప్పిన ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చినదానిలా పడి ఉంది. ఆ జింకమీద కాకి వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించింది. జింకను భుజానికెత్తుకుందామని వేటగాడు తాబేలును కింద పెట్టి జింకవైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్ళను కొరికింది. వెంటనే తాబేలు మడుగులోకి జారిపోయింది. ఎలుక కన్నంలోకి దూరింది. కాకి కావ్ కావ్ మంటూ ఎగిరింది. జింక పారిపోయింది. కాబట్టి ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు.

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
ఒక అడవిలో ఒక కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. వాటితో పాటు ఒక జింక కూడా వచ్చి కలిసింది. నాలుగూ స్నేహంగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. ఒకరోజు మేతకు వెళ్లిన జింక వేటగాడి వలలో చిక్కుకుంది. ఇది చూసిన కాకి, ఎలుకను తన వీపుపై ఎక్కించుకొని వచ్చి, జింక వద్ద దింపింది. వెంటనే ఎలుక వలతాళ్ళు కొరికి జింకకు స్వేచ్ఛ కలిగించింది.

జింక, ఎలుక, కాకి మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా తాబేలు ఎదురుపడింది. తాబేలు రావడం చూసి ఎలుక కోప్పడ్డది. ఇంతలో వేటగాడు వచ్చాడు. మిగతావన్నీ తప్పించుకొన్నవి కానీ తాబేలు మాత్రం వేటగానికి చిక్కింది. వేటగాడు దాన్ని వింటికి కట్టుకున్నాడు.

జింక తప్పించుకున్నది అనుకుంటే తాబేలు వేటగాడికి చిక్కిందని మిత్రులు బాధపడ్డారు. అవి ఎలాగైనా తాబేలును కూడా రక్షించాలనుకున్నాయి. ఎలుక చెప్పిన ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్లే దారిలో జింక చచ్చినదానిలా పడి ఉంది. కాకి ఆ జింకమీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించింది.

వేటగాడు జింక చచ్చిపడి ఉందని భావించాడు. తాబేలును కట్టిన విల్లును కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్ళను కొరికింది. వెంటనే తాబేలు మడుగులోకి జారిపోయింది. ఎలుక కన్నంలో దూరింది. కాకి కావ్ కావ్ మంటూ ఎగిరిపోయింది. వేటగాడు తన దగ్గరికి వచ్చే లోపల జింక పారిపోయింది.

ప్రశ్న 2.
మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా సాయపడ్డారా? ఏ విధంగా సాయం చేశారు?
జవాబు.
నేను నా స్నేహితులకు ఒకసారి సాయపడ్డాను. నా స్నేహితులు ఇద్దరూ ఒకే సైకిలుమీద బడికి వెళ్తున్నారు. దారిలో ఒక గేదె అడ్డం వచ్చి వాళ్ళు కిందపడ్డారు. చిన్నచిన్న దెబ్బలు తగిలాయి. నేను వెంటనే వారిని లేవదీసి డాక్టరు వద్దకు తీసుకొనివెళ్ళాను. ప్రాథమిక చికిత్స చేయించి, వాళ్ళ తల్లిదండ్రులకు విషయం తెలియజేశాను.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
కింది పదాలు చదువండి. పాఠంలో ఉన్న పదాలను వెతికి వాటి కింద గీతగీయండి.
అ. మడుగు
ఉ. కానుక
ఎ. కుండపోత
ఆ. రొప్పుతూనె
ఊ. గుటుక్కున
ఏ. ఊపిరిపీల్చుకుంది
ఇ. ఉరుక్కుంటూ ఋ. కంచె
ఈ. గబగబ
ౠ. అంతఃపురం
ఐ. వడివడిగా
ఒ. నివ్వెరపోయారు
జవాబు.
పాఠం జాగ్రత్తగా చదివి ఆయా పదాలను గుర్తించి వాటికింద గీత గీయండి.

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

హెలెన్ హృదయం కరుణరస భరితమయినది. దీనులను, దుఃఖితులను తలచుకొంటేనే ఆమె మనసు కరిగిపోయేది. ప్రకృతిలోని ప్రతి అణువూ ఆమెను పరవశింపజేసేది. మామూలు మనుషులకు కళ్ళు రెండే కాని ఆమెకు శరీరమంతటా స్పర్శ రూప నేత్రాలున్నాయి. ప్రతి స్పర్శకూ ఆమె మనసారా అనుభూతిపొంది, తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది. తనలాంటివాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకే జీవితాన్ని న్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెల. ప్రపంచమంతా తిరిగి ‘ప్రత్యేకావసరాలున్న’ పిల్లలను కలిసి, వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండు, అమెరికా, ఆఫ్రికా దేశాలతో పాటు భారతదేశాన్ని కూడా సందర్శించింది. ఆమె జీవితం, సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయమైనాయి.

అ. హెలెన్ ఎటువంటిది?
జవాబు.
హెలెన్ కరుణరస భరితమైన హృదయం కలది.

ఆ. హెలెన్ ను పరవశింపచేసేది ఏది?
జవాబు.
ప్రకృతిలోని ప్రతి అణువూ హెలెనన్ను పరవశింపచేసేది.

ఇ. ఎవరి జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది?
జవాబు.
ప్రత్యేకావసరాలున్న పిల్లల జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఈ. హెలెన్ ఏయే దేశాలను పర్యటించింది?
జవాబు.
హెలెన్ ఇంగ్లాండు, అమెరికా, ఆఫ్రికా, భారతదేశాలను పర్యటించింది.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఎలుక, తాబేలు, కాకి మంచి మిత్రులని ఎట్లా చెప్పగలరు? వివరించండి.
జవాబు.
ఎలుక, తాబేలు, కాకి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. తమకు పరిచయం లేకపోయినా జింక వచ్చి స్నేహాన్ని కోరగా అవి మంచితనంతో అంగీకరించాయి. ఒకరికి ఏ ఆపద వచ్చినా మిగిలినవన్నీ కలిసి ఉపాయాన్ని ఆలోచించేవి. ఒకే మాటపై నిలబడి పరస్పరం సహాయం చేసుకొనేవి.

ఆ) ఈ కథవల్ల మీరు గ్రహించిన మంచి విషయాలు ఏవి?
జవాబు.
మిత్రులన్నవారు కష్టసుఖాలలో కలిసిమెలిసి ఉండాలి. ఒకరికి ఏ విధమైన ఆపద వచ్చినా మిగతావారు వారిని ఆదుకోవాలి. ఆపదలో ఆదుకొనేవారే నిజమైన మిత్రులు. ఏదైనా అపాయం సంభవించినపుడు అధైర్యపడకూడదు. ఉపాయం ఉంటే ఎటువంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు.

ఇ) సాధారణంగా పిల్లలు ఎట్లాంటి అపాయాలు/ఆపదలు ఎదుర్కొంటారు? ఇందుకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు.
సాధారణంగా పిల్లలు వీధుల్లో తిరుగుతుంటే కుక్కలు వెంటబడతాయి. మరికొన్ని కుక్కలు కరుస్తాయి. కాబట్టి రోడ్లపై పిల్లలు ఒంటరిగా తిరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణ సమయాల్లో బస్టాండులోను, రైల్వేస్టేషన్లోను పిల్లలు తప్పిపోతూంటారు. అలాగే ఉత్సవాలు, తిరునాళ్ళ సమయాలలో కూడా పిల్లలు తప్పిపోతూంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా పోనీయకూడదు. పిల్లల జేబుల్లో చిరునామా కాగితాలను ఉంచడం మంచిది.

ఈ) ఈ కథకు ఇంకేపేరు పెట్టవచ్చు? ఎందుకు?
జవాబు.
ఈ కథకు ‘మిత్రలాభం’ అని పేరు పెట్టవచ్చు. వేటగాడి వలలో జింక చిక్కుకున్నప్పుడు అది మిత్రుల సహాయం వల్లనే బయటపడింది. అలాగే తాబేలు వేటగానికి చిక్కినపుడు కూడా మిత్రుల ఉపాయం వల్లనే అపాయం నుండి బయటపడింది. ఇలా మిత్రులవల్ల లాభం పొందడం జరిగింది కాబట్టి ఈ కథకు ‘మిత్రలాభం’ అని పేరు పెట్టవచ్చు..

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

ప్రశ్న .
కథను క్లుప్తంగా సొంతమాటల్లో రాయండి.
జవాబు.
ఒక అడవిలో ఒక కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. వాటితో పాటు ఒక జింక కూడా వచ్చి కలిసింది. నాలుగూ స్నేహంగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. ఒకరోజు మేతకు వెళ్లిన జింక వేటగాడి వలలో చిక్కుకుంది. ఇది చూసిన కాకి, ఎలుకను తన వీపుపై ఎక్కించుకొని వచ్చి, జింక వద్ద దింపింది. వెంటనే ఎలుక వలతాళ్ళు కొరికి జింకకు స్వేచ్ఛ కలిగించింది.
జింక, ఎలుక, కాకి మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా తాబేలు ఎదురుపడింది. తాబేలు రావడం చూసి ఎలుక కోప్పడ్డది. ఇంతలో వేటగాడు వచ్చాడు. మిగతావన్నీ తప్పించుకొన్నవి కానీ తాబేలు మాత్రం వేటగానికి చిక్కింది. వేటగాడు దాన్ని వింటికి కట్టుకున్నాడు.

జింక తప్పించుకున్నది అనుకుంటే తాబేలు వేటగాడికి చిక్కిందని మిత్రులు బాధపడ్డారు. అవి ఎలాగైనా తాబేలును కూడా రక్షించాలనుకున్నాయి. ఎలుక చెప్పిన ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్లే దారిలో జింక చచ్చినదానిలా పడి ఉంది. కాకి ఆ జింకమీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించింది.

వేటగాడు జింక చచ్చిపడి ఉందని భావించాడు. తాబేలును కట్టిన విల్లును కిందపెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్ళను కొరికింది. వెంటనే తాబేలు మడుగులోకి జారిపోయింది. ఎలుక కన్నంలో దూరింది. కాకి కావ్ కావ్ మంటూ ఎగిరిపోయింది. వేటగాడు తన దగ్గరికి వచ్చే లోపల జింక పారిపోయింది.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

IV. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
జంతువులను, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా ఒక కథ రాయండి.
జవాబు.
చిలుక, పిచ్చుక, ఎలుక, జింక కలిసి ఉండేవి. ఒకనాడు జింక వలలో పడింది. చిలుక, పిచ్చుక చూశాయి. తమ మిత్రుడు వలలో చిక్కుకున్నందుకు చాలా బాధపడ్డాయి. దాని వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పాయి. అవి ఎలుకను తీసుకొని వచ్చాయి. ఎలుక వలను కొరుకుదామని అనుకొంటుండగా అక్కడికి ఒక పిల్లి వచ్చింది. దాన్ని చూసి చిలుక, పిచ్చుక, చెట్టుకొమ్మపైకి పారిపోయాయి. ఎలుక ఒక కన్నంలోకి దూరింది. ఇంతలో ఒక కుక్క అటు వైపుగా పరుగెత్తుతున్నది. తన కోసమే వస్తున్నదనుకొని పిల్లి పారిపోయింది. వెంటనే ఎలుక వచ్చి వలను కొరికి జింకను రక్షించింది.

(లేదా)
ప్రశ్న 2.
‘ కథలో జింక మానవ భాషలో మాట్లాడింది కదా! ఇట్లాగే అడవిలోని జంతువులు మనవలెనే మాట్లాడితే మన గురించి అవి ఏం మాట్లాడుకుంటాయో ఊహించి రాయండి.
జవాబు.
అడవిలోని జంతువులు మనలాగే మాట్లాడితే మన గురించి అవి ఇలా మాట్లాడుకుంటాయి.

“మానవులు గ్రామాలలో, నగరాలలో మంచి మంచి ఇండ్లు నిర్మించుకొని సుఖంగా జీవిస్తారు. వారి కుటుంబాలకు కావలసిన అవసరాలన్నీ తీర్చుకుంటారు. మన అడవి జంతువులలో కొన్నింటిని ప్రేమగా చూస్తారు. మరికొన్నింటిని ద్వేషిస్తారు. మన బాధలను గురించి పట్టించుకోరు. మానవులలో స్వార్థం ఎక్కువ. వారి స్వార్థం కోసం మనల్ని చంపడానికి కూడా వెనుకాడరు” అని అడవి జంతువులు మాట్లాడుకుంటాయి.

V. పదజాల వినియోగం:

1. కింద గీత గీసిన పదాలకు సమానమయిన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి.

అ కృష్ణకుచేలుర చెలిమి గొప్పది.
జవాబు.
స్నేహం

ఆ. తామరలు కొలనులో పూస్తాయి.
జవాబు.
మడుగు

ఇ. ఎలుక కన్నంలో నివసిస్తుంది.
జవాబు.
కలుగు

ఈ. మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మ అవతారం ఒకటి.
జవాబు.
తాబేలు

ఉ. నిప్పుతో చెలగాటం అపాయకరం.
జవాబు.
ప్రమాదం

2. కింది పట్టికలోని ప్రకృతి – వికృతి పదాలను జతపరుచండి. అలా జతపరిచిన ప్రకృతి, వికృతులను పట్టిక రూపంలో రాయండి.

అ. అటవి  1. ఆకాశం
ఆ. స్నేహం  2. సాయం
ఇ. సహాయం  3. రాత్రి
ఈ. రాతిరి  4. నెయ్యం
ఉ. ఆకసం  5. అడవి

జవాబు.

ప్రకృతి వికృతి
అటవి అడవి
స్నేహం నెయ్యం
సహాయం సాయం
రాత్రి రాతిరి
ఆకాశం ఆకసం

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

3. కింది వాక్యాలను చదువండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్థంవచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాలకింద గీత గీయండి.

అ. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి, రంధ్రం వైపు తొంగిచూసి, బిలంలో దూరింది.
జవాబు.
ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి, రంధ్రం వైపు తొంగిచూసి, బిలంలో దూరింది.

ఆ. కొలనులో కమలం వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది.
జవాబు.
కొలనులో కమలం వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది.

ఇ. కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమీ లేదని వాయసం మిత్రులకు చెప్పింది.
జవాబు.
కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమీ లేదని వాయసం మిత్రులకు చెప్పింది.

ఈ. కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది.
జవాబు.
కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది.

4. కింది పదాలు చదువండి. వీటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ. గబుక్కున : ____________
జవాబు.
కుక్కను చూసి పిల్లి గబుక్కున పారిపోయింది.

ఆ. తళుక్కున : ____________
జవాబు.
“ఆకాశంలో మెరుపు తళుక్కున మెరిసింది.

ఇ. చటుక్కున : ____________
జవాబు.
పిల్లిని చూసి ఎలుక చటుక్కున పారిపోయింది.

ఈ. మిరుమిట్లు గొలిపే : ____________
జవాబు.
మిరుమిట్లు గొలిపే మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది.

ఉ. మురిసిపోవడం : ____________
జవాబు.
సుజాతకు వాళ్ళ నాన్న బంగారు గొలుసు కొంటే ఎంతో మురిసిపోయింది.

ఊ. వడివడిగా : ____________
జవాబు.
కొందరు నెమ్మదిగాను, మరికొందరు వడివడిగాను నడుస్తారు.

ఋ. నివ్వెరపోయి : ____________
జవాబు.
బాగా చదివే నా మిత్రుడు పరీక్షలో తప్పినందుకు నివ్వెరపోయాను.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

తెలుగుభాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు.
అవి : 1. అచ్చులు 2. హల్లులు 3. ఉభయాక్షరాలు

అచ్చులు:
అ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ – ౠ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ
ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని రెండు విధాలు.

అ) హ్రస్వాలు : ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చులను ‘హ్రస్వాలు’ అంటారు.
అవి : అ – ఇ – ఉ – ఋ – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్ప పాటు కాలం)

ఆ) దీర్ఘాలు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను ‘దీర్ఘాలు’ అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – ౠ – ఏ – ఐ – ఓ

హల్లులు :
క ఖ గ ఘ ఙ
చ చ ఛ జ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల
శ ష స హ ళ ఱ

ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలు చేశారు.
అ) క, చ, ట, త, ప – పరుషాలు } వీటిని అల్పప్రాణాలు అని కూడా అంటారు.
ఆ) గ, జ, డ, ద, బ – సరళాలు }

ఇ) ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ లు మహాప్రాణాలు, వర్గయుక్కులు అని అంటారు.
ఈ) ఙ, ఞ, ణ, న, మ – అనునాసికాలు.
ఉ) య, ర, ల, వ – అంతస్థాలు.
ఊ) శ, ష, స, హ – ఊష్మాలు.

సూచన : “ఱ” అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు ‘ర’ను వాడుతున్నారు. అట్లే చ, జే లు వాడుకలో లేవు. వీటికి బదులుగా చ, జ లను వాడుతున్నారు.

ఉభయాక్షరాలు : మూడు. అవి సున్న ‘మ్’ (పూర్ణబిందువు), అరసున్న ‘C’, విసర్గ ”. ఈ మూడింటిని అచ్చులతోను, హల్లులతోనూ ఉపయోగించడంవల్ల వీటిని ‘ఉభయాక్షరాలు’ అని వ్యవహరిస్తారు.
సూచన : అరసున్నకు గ్రాంథికభాషలో ప్రాధాన్యమున్నది. విసర్గ సంస్కృతపదాలకు మాత్రమే చేరుతుంది.

1. కింది వాక్యంలో పరుషాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.

కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది.
జవాబు.
ష్టడి దివితే ఫలితం ప్పక ఉంటుంది.
పరుషాలు : క, చ, ట, త, ప

2. కింది మాటల్లో సరళాలతో మొదలయిన మాటలను గుర్తించండి.

బలం, కలం, గాలి, జలం, దళం, తళుకు, కాలు, డబ్బు, గళం
జవాబు.
బలం, కలం, గాలి, జలం, దళం, తళుకు, కాలు, డబ్బు, గళం
బలం, గాలి, జలం, దళం, డబ్బు, గళం
సరళాలు : గ, జ, డ, ద, బ

3. కింది మాటల్లో అంతస్థాలను గుర్తించండి.

యమున, కారం, పాలు, వంకర, వేళ, కల
జవాబు.
మున, కారం, పాలు, వం, వేళ, క
అంతస్థాలు : య, ర, ల, ళ, వ

4. కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.

భాష మనిషికి సహజమైన శక్తి.
జవాబు.
భా మనిషికి సహజమైన క్తి.
ఊష్మాలు : శ, ష, స, హ

ప్రాజెక్టు పని:

పాఠశాల గ్రంథాలయంలోని పంచతంత్రం కథల పుస్తకం చదువండి. దాంట్లో మీకు నచ్చిన కథను రాసి, నివేదికను తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు.
విద్యార్థి కృత్యం

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

TS 6th Class Telugu 2nd Lesson Important Questions స్నేహబంధం

I. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆసియా దేశాల్లో పేదలు తమ రోజువారీ ఆదాయంలో సుమారు 60 శాతం మేరకు ఆహారంపై ఖర్చు చేస్తారు. అందువల్ల ఆహారధరలు పెరిగితే ఆకలి సమస్య తీవ్రం కావడంతోబాటు, తమ పిల్లల విద్య, ఆరోగ్యం పై ఖర్చు చేయగల సామర్థ్యాన్ని కూడా వారు కోల్పోతారు. వాస్తవానికి ఇటీవలి కాలంలో సహస్రాభివృద్ధి లక్ష్యాల్లో ముఖ్యమైన పేదరికాన్ని తగ్గించుకునే దిశగా ఆసియా దేశాలు మంచి ఫలితాలను సాధించాయి. ఇందుకు కారణం ఆర్థికవృద్ధి రేటును పెంచుకోవడమే. కానీ, ఇటీవల భారీగా పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ఈ విజయాలను దెబ్బతీసే అవకాశం ఉంది.

ప్రశ్న 1.
పై పేరాలో ఏ విషయం గురించి చెప్పారు ?
జవాబు.
పై పేరాలో ఆహారం గురించి చెప్పారు.

ప్రశ్న 2.
పేదరికాన్ని తగ్గిస్తున్న దేశాలు ఏవి ?
జవాబు.
ఆసియా దేశాలు పేదరికాన్ని తగ్గిస్తున్నాయి.

ప్రశ్న 3.
ఆకలి సమస్య ఎప్పుడు తీవ్రమౌతుంది ?
జవాబు.
ఆహారపదార్థాల ధరలు పెరిగితే, ఆకలి సమస్య తీవ్రమౌతుంది.

ప్రశ్న 4.
సహస్రాభివృద్ధి లక్ష్యాల్లో ముఖ్యమైనదేమిటి ?
జవాబు.
పేదరికాన్ని తగ్గించడం సహస్రాభివృద్ధి లక్ష్యాల్లో ముఖ్యమైనది.

ప్రశ్న 5.
ఆదాయంలో ‘ఎంత శాతం ఆహారంపై ఖర్చు చేస్తారు ?
జవాబు.
ఆదాయంలో 60 శాతం ఆహారంపై ఖర్చు చేస్తారు.

2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.

ఆచార్యునకెదిరింపకు
బ్రోచిన దొరనింద సేయబోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువ బోకుమయ్య కుమారా !

ప్రశ్న 1.
____________ ఎదిరింపకు.
జవాబు.
ఆచార్యుని

ప్రశ్న 2.
____________ను నిందించకూడదు.
జవాబు.
బ్రోచినదొర

ప్రశ్న 3.
____________ విడువకూడదు.
జవాబు.
ఆచారము

ప్రశ్న 4.
ఒంటరిగా ____________ చేయకూడదు.
జవాబు.
కార్యాలోచనములు

ప్రశ్న 5.
ఇది ____________ శతకంలోని పద్యం.
జవాబు.
కుమార

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

II. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) జింక గొప్పడానికి గల కారణాలేమిటి ?
జవాబు.
ఆ జింక పేరు చిత్రాంగుడు. దానిని ఒక వేటగాడు తరుముతున్నాడు. చాలాదూరం పరుగెత్తింది. జింక చాలా భయపడుతోంది. కాకి, ఎలుక, తాబేలులను చేరింది. చాలా భయంతో వేగంగా పరుగెత్తడం వలన రొప్పుతోంది.

ఆ) చిత్రాంగునికి భయపడవద్దని ఎవరు చెప్పారు ? ఎందుకు ?
జవాబు.
చిత్రాంగునికి భయపడవద్దని తాబేలు చెప్పింది.

కాకి, ఎలుక, తాబేలు స్నేహితులు. ఒంటరితనంలో కష్టాలు వాటికి తెలుసు. స్నేహం వలన కష్టాల నుండి తప్పించుకోవచ్చు. జింక కూడా కష్టంలో ఉంది. తమవంటిదే కనుక, జింక కోరింది కనుక స్నేహానికి అంగీకరించాయి. అందుకే స్నేహితునికి భయపడవద్దని చెప్పాయి.

ఇ) మంథరకాన్ని కాపాడిన విధం రాయండి.
జవాబు.
మంథరకం వేటగాడికి చిక్కింది. దానిని విడిపించడానికి ఎలుక ఒక ఉపాయాన్ని ఆలోచించింది. ఆ ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్ళేదారిలో జింక చచ్చిపోయిన దానిలా పడుకొంది. కాకి, జింక మీద వాలి పొడుచుకొని తింటున్నట్లు నటించింది. వేటగాడది చూసి జింక కూడా దొరికినందుకు ఆనందించాడు. తాబేలును తాడుతో కట్టిన విల్లును కింద పెట్టాడు. ఎలుక దాని తాళ్ళు కొరికింది. తాబేలు దగ్గరలోని మడుగులోకి దూకింది. జింక పారిపోయింది. కాకి ఎగిరిపోయింది. ఎలుక కలుగులో దూరిపోయింది.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) పరాయి భాషలో మాట్లాడాలనే మోజు మంచిదికాదని ‘స్నేహబంధం’ పాఠం ఆధారంగా ఎలా చెప్పగలవు ?
జవాబు.
జింకకు ఆరునెలల వయసులో ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకొంది. వాడు ఆ దేశపు రాజుకు దానిని కానుకగా ఇచ్చాడు. దానిని కోటలోని వారంతా ముద్దుగా చూసేవారు. దానికి పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఇష్టం వచ్చినట్లు తిరిగేది. తినేది. నలుగురూ మాట్లాడుకొంటుంటే కూర్చొని వినేది. మానవ భాషపై మోజు కల్గింది. వాళ్ళలా మాట్లాడడానికి ప్రయత్నించింది.

ఒకరోజు దానిని రాజకుమారుని పడకటింటి దగ్గర కట్టేశారు. వర్షం వచ్చింది. గాలి వేసింది. జింక భయపడింది. తన స్నేహితులతో ఉంటే ఎంత బాగుండునో అని మానవ భాషలో అనుకొంది. రాజుకొడుకు విన్నాడు. పెద్దల సలహాతో జింకను అడవిలో వదిలేశారు. మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. జింకకు మానవ భాషలో మాట్లాడాలనే మోజు వల్ల సుఖవంతమైన జీవితాన్ని కోల్పోయింది. కష్టాల పాలయింది, ఆ పరాయి భాషా వ్యామోహం లేకపోతే దాని జీవితం హాయిగా సాగిపోవును.

ఆ) ‘స్నేహబంధం’ పాఠంలోని స్నేహితులలో చురుకైనవేవి? ఎలా చెప్పగలవు ?
జవాబు.
స్నేహబంధం పాఠంలో కాకి, ఎలుక, తాబేలు, జింక స్నేహితులు. జింక మొదటిసారి పరుగెత్తుకొని కాకి, ఎలుక, తాబేలు ఉన్న చోటకు వచ్చింది. మూడూ భయపడి పారిపోయాయి. కాని, కాకి మాత్రం చెట్టెక్కి చుట్టూ చూసింది. భయపడవలసింది లేదని స్నేహితులకు ధైర్యం చెప్పింది.

జింక ప్రమాదంలో పడినపుడు కూడా కాకి ముందుగా కనిపెట్టింది. వలలోని జింకను విడిపించడానికి ఉపాయం ఆలోచించింది. కాకి వెంటనే ఎలుకను తీసుకొనివచ్చి, వలతాళ్ళు కొరికే ఏర్పాట్లు చేసింది. జింకను విడిపించింది.

మంథరకం వేటగాడికి చిక్కినపుడు ఎలుక చురుగ్గా ఆలోచించింది. మంథరకాన్ని విడిపించారు. స్నేహితులందరిలో కాకి, ఎలుక చాలా చురుకైనవి.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

III. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
జంతువులు, పక్షులలో నీకు నచ్చిన ఒక పక్షి గురించి నీ మిత్రునకు లేఖ రాయి.
జవాబు.

లేఖ

బాసర,
X X X X X.

ప్రియమైన లతకు,

నీ స్నేహితురాలు మాధురి రాయు లేఖ.
నేనీ మధ్య ఒక పుస్తకంలో పిచ్చుక గురించి చదివాను. దాని గురించి రాస్తున్నాను.

పిచ్చుక చాలా చిన్న పక్షి. ఇవి చిన్నగా బొద్దుగా ఉంటాయి. గోధుమ, ఊదా రంగులలో ఉంటాయి. చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగి ఉంటాయి. పిచ్చుకలలో పెద్దగా తేడాలుండవు. ఇవి గింజలను తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటాయి. కొండ పిచ్చుకలు పట్టణాల్లో నివసించి ఏదైనా తింటాయి. ఇది 4.5 అం॥ నుండి 7 అం॥ వరకు పొడవు ఉంటుంది. పిచ్చుకలు శరీర నిర్మాణంలో గింజలను తినే పక్షులలాగే ఉంటాయి. నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.

ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. జీవనశైలిలో పెద్ద వేగంగా వచ్చిన మార్పు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. పచ్చదనం అంతరించిపోవడం, రసాయనాలతో పళ్ళు, ఆహారధాన్యాల ఉత్పత్తి వల్ల పిచ్చుకలు అంతరిస్తున్నాయి. సెల్యులర్ టవర్ల నుండి వచ్చే అయస్కాంత కిరణాలు, ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి.

ఇట్లు,
మాధురి.

చిరునామా :
టి. లత నెం. 18,
6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
లోనికలాన్, మెదక్ జిల్లా,
తెలంగాణ.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

ప్రశ్న 2.
‘స్నేహబంధం’ కథను విన్నారు కదా ! ‘కలిసి ఉంటె కలదు సుఖం’ అనే విషయాన్ని తెలుపుతూ నీ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు.

లేఖ

నాగార్జునసాగర్,
X X X X X.

ప్రియ మిత్రుడు శివదత్తకు,

ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమం అని తలుస్తాను. ఈ రోజు మా మాస్టారు ‘స్నేహబంధం’ అనే పాఠం చెప్పారు. దానిలో జింక, కాకి, తాబేలు, ఎలుక స్నేహితులు. జింక కష్టంలో ఉన్నప్పుడు, అలాగే తాబేలు అపాయంలో చిక్కుకున్నప్పుడు మిగిలిన స్నేహితులు ఎలా ఉపాయంతో, కలిసికట్టుగా తమ స్నేహితుణ్ణి రక్షించుకున్నాయో వింటుంటే ఎంత బాగుందో !

స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. అటువంటి మిత్రులు ఉంటే ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్న సూక్తి అర్థం తెలుస్తుంది. ‘మీ మాస్టారు చెప్పిన మంచి విషయాన్ని నాకు ఉత్తరంగా రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. జస్వంత్.

చిరునామా :
యస్. శివదత్త S/o బాలసుబ్రహ్మణ్యం,
నకిరేకల్,
నల్గొండ.

ప్రశ్న 3.
“ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు” – ఎట్లాగో ఒక కథ రాయండి.
జవాబు.

నక్క – తాబేలు

అనగనగా ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు జీవిస్తోంది. ఒడ్డున ఉన్న చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్న తాబేలును ఒక నక్క చూసింది. దప్పిక కోసం వచ్చిన నక్కకు తాబేలు కనబడటంతో దానిని కాలితో తొక్కిపట్టి తినడానికి ప్రయత్నించింది. తాబేలు ప్రమాదాన్ని ఊహించి తలను, కాళ్ళను ముడుచుకొని కదలకుండా ఉంది. నక్క ఎంత కొరికినా పండ్ల నొప్పులే కాని తాబేలు కొరుకుడు పడలేదు. అప్పుడు తాబేలు “నక్క బావా ! నీవిట్లు ఎంతసేపు కష్టపడతావు. భూమి మీద నన్ను చంపడానికి భగవంతునికైనా చేతకాదు. ఎండవల్ల నా శరీరం గట్టి పడింది. కొంతసేపు నీళ్ళలో నానవేస్తే నేను మెత్తబడతాను. అపుడు నీవు తేలికగా నన్ను చంపి తినవచ్చు” అని చెప్పింది.

నక్కకు ఆ ఉపాయం నచ్చి, వెంటనే దానిని నోట కరచుకుని చెరువు వద్దకు పోయింది. తాబేలును నీటిలో వదిలి, కాలితో నొక్కి పట్టింది. అప్పుడు తాబేలు, నక్కతో “నీవు నా వీపుమీద కాలు నొక్కిపట్టి ఉంచడం వల్ల భయంతో నేను కొయ్యలా బిగిసిపోయాను. కనుక నేను నానలేదు. కొంచెం వదులు చేస్తే త్వరగా నానగలను” అని చెప్పగా నక్క నిజమని భావించి అట్లే చేసింది. తాబేలు గబగబా నీటి లోపలికి వెళ్ళి కంటికి కనుపించలేదు. నక్క తెల్లబోయి “నక్క జిత్తులన్నీ నా వద్ద ఉంటే తప్పించుకొంటివే తాబేటి బుఱ్ఱా” అని అనుకుంటూ నీరు తాగి తన దారిన వెళ్ళిపోయింది. కనుక అపాయాన్ని ఉపాయంతో తొలగించుకోవచ్చని ఈ కథ చెబుతున్నది.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

IV. భాషాంశాలు:

1. భాషాభాగాలు గుర్తించండి.

ప్రశ్న 1.
జింక భయంతో పరుగెత్తింది.
జవాబు.
విశేషణము

ప్రశ్న 2.
తాబేలు మడుగులోకి జారిపోయింది.
జవాబు.
క్రియ

2. కింది వాక్యాలను వ్యతిరేకార్థం వచ్చునట్లు రాయండి.

ప్రశ్న 1.
చిన్న చిన్న దెబ్బలు తగిలాయి.
జవాబు.
చిన్న చిన్న దెబ్బలు తగలలేదు.

ప్రశ్న 2.
తాబేలు వేటగాడికి చిక్కింది.
జవాబు.
తాబేలు వేటగాడికి చిక్కలేదు.

3. కింది వాటికి నానార్థాలు రాయండి.

ప్రశ్న 1.
విద్యార్థులు పొద్దునే నిద్ర లేవాలి.
జవాబు.
ప్రొద్దు, సూర్యుడు

ప్రశ్న 2.
ఎలుక పేరు హిరణ్యకం.
జవాబు.
నామం, ప్రసిద్ధి వ్యాకరణాంశాలు

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

అ) కింది వానిలో దీర్ఘాక్షరాలను గుర్తించండి.

ప్రశ్న 1.
నిప్పుతో చెలగాటం అపాయకరం
జవాబు.
దీర్ఘాక్షరాలు – తో, గా, పా

ఆ) కింది మాటలను కలిపి రాయండి.

ప్రశ్న 1.
భయము + పడు =
జవాబు.
భయపడు

ప్రశ్న 2.
నువ్వు + ఎందుకు =
జవాబు.
నువ్వెందుకు

ప్రశ్న 3.
నన్ను + అందరూ =
జవాబు.
నన్నందరూ

ప్రశ్న 4.
నేను + ఎంతో =
జవాబు.
నేనెంతో

ప్రశ్న 5.
ఇలాంటి + అప్పుడు =
జవాబు.
ఇలాంటప్పుడు

ప్రశ్న 6.
నిండు + వెర =
జవాబు.
నివ్వెర

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

ఇ) విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.

ప్రశ్న 1.
తామరలు కొలనులో పూస్తాయి.
జవాబు.
‘లో’ షష్ఠీ విభక్తి

ప్రశ్న 2.
వాటికి జింకతో స్నేహం కుదిరింది.
జవాబు.
‘తో’ తృతీయా విభక్తి

ఈ) క్రియలను గుర్తించండి.

ప్రశ్న 1.
కష్టపడి చదివి, ఫలితం పొందండి.
జవాబు.
చదివి

ప్రశ్న 2.
పిల్లి కుక్కను చూసి, పారిపోయింది.
జవాబు.
చూసి

ఉ) సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

ప్రశ్న 1.
ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చింది. తొంగిచూసింది.
జవాబు.
ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి, తొంగి చూసింది.

ప్రశ్న 2.
చంద్రుడు రాత్రికి వస్తాడు. వెన్నెల కురిపిస్తాడు.
జవాబు.
చంద్రుడు రాత్రికి వచ్చి, వెన్నెల కురిపిస్తాడు.

సంక్లిష్ట వాక్యం : అంటే ఒక సమాపక క్రియ, ఒకటి గాని, అంతకు మించిగాని అసమాపక క్రియలు ఉన్నది.
సమాపక క్రియ : పని పూర్తి అయినది. ఉదా : చూసింది, కురిపిస్తాడు.
అసమాపక క్రియ : పని పూర్తి కానిది. ఉదా : వచ్చి, చూసి

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

ఊ) కింది వానిలో సంబంధం లేని పదాలు గుర్తించండి.

ప్రశ్న 1.
కాకి, ఎలుక, కుందేలు, తాబేలు
జవాబు.
కుందేలు

ప్రశ్న 2.
స్నేహం, నెయ్యం, మైత్రి, కయ్యం
జవాబు.
కయ్యం

ఎ) బహువచనాలు రాయండి.

1. కమలం – కమలాలు
2. కొలను – కొలనులు
3. అక్షరం – అక్షరాలు
4. ఇల్లు – ఇండ్లు

“ఏ) కింది వానిలో లింగాలను గుర్తించండి.

ప్రశ్న 1.
వేటగాడు తాబేలును వింటికి కట్టాడు.
జవాబు.
పుంలింగము

ప్రశ్న 2.
వృక్షము పై కాకి ఉన్నది.
జవాబు.
నపుంసక లింగము

ప్రశ్న 3.
జింక భయంతో పరుగెత్తింది.
జవాబు.
నపుంసక లింగము

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

పదాలు – అర్థాలు:

I. ఒక అడవిలో ఒక కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం. ఎలుక పేరు హిరణ్యకం. తాబేలు పేరు మంథరకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి.

ఒకరోజు ఒక జింక భయంతో పరుగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టుమీది కెగిరింది. ఒక కొమ్మమీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని, స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులోనుండి బయటికి వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. “నువ్వెవరివి? ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు?” అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది.

జింక మెల్లగా గొంతు సవరించుకొని “నేను చిత్రాంగుణ్ణి” అన్నది. “ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా, నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. కాదనకండి” అని వేడుకొన్నది.

అప్పుడు తాబేలు “చిత్రాంగా! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తియ్యటి మడుగు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏలోటూ ఉండదు. అందరం హాయిగా ఉందాం”, అన్నది.

ఎలుక, కాకి, “ఔనౌను,” అని అన్నాయి.
చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి.

అర్థాలు :

మడుగు = నీటికుంట
కలుగు = రంధ్రం, కన్నం
రొప్పు = ఆయాసపడటం
తరుము = ఒక వ్యక్తి జంతువు మొదలగు వాటి వెంటబడి వడివడిగా పోయేటట్లు చేయడం
పొద = ఒకటితో నొకటి పెనవేసికొన్న చిన్న మొక్కల గుంపు
పచ్చిక = పచ్చని లేతగడ్డి
లోటు = లోపం
హాయిగా = సుఖంగా

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

II. ఒకనాడు పొద్దు వాలుతున్న వేళకు, తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. కాని, మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడికోసం కలతపడుతున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వరత్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎటు పోయి వెదకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తళుక్కున ఒక ఉపాయం మెరిసింది. అప్పుడది రెక్కలు విప్పింది. చటుక్కున లేచింది. గబుక్కున పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటూ, అటూ చూస్తూనే ఉన్నది. ఒకచోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది.

“ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా! నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది. కానీ, ముందుగా నువ్వు ఈ ఆపదనుంచి బయటపడాలి” అన్నది.
వెంటనే జింక, “ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను” అన్నది.

“ఔను! వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి. నువ్వు బయటపడాలి. నేనిప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొస్తాను” అని వెంటనే ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురుచూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వలదగ్గర వాలింది. దాని వీపుమీది నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వల తాళ్లు కొరికింది. ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటికి వచ్చింది.

సంతోషంగా స్నేహితులు ముగ్గురూ తిరుగు ప్రయాణం సాగించారు. “ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా!” అని అన్నది ఎలుక.

ఆ మాటకు జింక, “ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా! నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు ఆరునెలలు వయస్సున్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్నందరూ ముద్దుచేసేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చినచోటికి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్లలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని.

“ఒకనాడు నేను రాజభవనంలోనుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే, కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేనెంతో భయపడ్డాను. ఒక పూలతోట కంచెమీది నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్లు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది.

నామీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను. ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు.

ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను. తరువాతి సంగతి అంతా మీకు తెలిసిందే”.

అర్థాలు :

పొద్దు = ప్రొద్దు, సూర్యుడు
కలత = కలవరం, ఆందోళన
ముసురుకొను = కమ్ముకోవడం, చుట్టూరా ఆవరించు
తళుక్కున = ఒకసారిగా వెలుగు వచ్చేటట్లుగా
చటుక్కున = శీఘ్రంగా
గబుక్కున = వెంటనే, ఉన్నట్టుండి
రివ్వున = వేగంగా
విప్పారిన = వికసించిన, విచ్చుకున్న
హఠాత్తు = ఉన్నట్టుండి, చటుక్కున
నేస్తి = స్నేహితుడు
అపాయం = ప్రమాదం, ఆపద
ఉచ్చు = ఉరి
కంచె = రక్షణగా చుట్టూ పాతిన కంప
అంతఃపుర స్త్రీలు = రాణులూ వారి పరివారమూ
విహరించు = ఆనందంగా తిరుగు
మిరుమిట్లు గొలుపు = కళ్ళు మిక్కిలి చెదురునట్లు చేయు
మెరుపు = కాంతి
ఉరుము = గర్జన
వింత = ఆశ్చర్యం
కొలువుకూటం = రాజదర్బారు
బెదరు = జంకడం, భయపడడం

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

III. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగివస్తూ ఉండగా మంథరకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. “ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు? మేం వస్తూనే ఉన్నాం గదా?” అన్నది.

వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడువండని స్నేహితులను కాకి తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు.

మిగిలిన ముగ్గురు స్నేహితులూ వెంటనే చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంతదూరంలో, వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చినదానిలా పడి ఉంటే కాకి జింకమీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. వేటగాడది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. జింకను .భుజానికెత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింకవైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్ళను కొరికింది. తాబేలు మడుగులోకి జారింది. ఎలుక కలుగులో దూరింది. కాకి కావ్ మంటూ ఎగిరింది. జింక చెంగున ఉరికింది.

అర్థాలు :

వడి = వేగం
కలుగు = కన్నం, రంధ్రం
విల్లు = ధనుస్సు
ఉపద్రవం = ఆపద, పెద్దకష్టం
నివ్వెర = మిక్కిలి భయం, మిక్కిలి ఆశ్చర్య
చురుగ్గా = తీవ్రంగా
మురిసిపోవు = ఆనందించు, సంతోషించు

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

స్నేహమనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. అట్లాంటి స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ‘కథ’ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టుకొనే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణుశర్మ ‘పంచతంత్రం’ ఆధారంగా చిన్నయసూరి తెలుగులోనికి అనువదించిన ‘మిత్రలాభం’లోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం.

ప్రవేశిక :

“చిత్రాంగా! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వుకూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం” అంటూ మంథరకం అన్నది. ఈ మంథరకం ఎవరు? చిత్రాంగుడు ఎవరు? ఈ మాటలను మంథరకం ఎందుకు అనాల్సి వచ్చింది? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

TS 6th Class Telugu Guide 2nd Lesson స్నేహబంధం

నేనివి చేయగలనా?

  • కథను సొంతమాటలలో చెప్పగలను. అవును/ కాదు
  • పాఠం చదివి పాఠంలోని కీలకాంశాలను గుర్తించగలను. అవును/ కాదు.
  • కథను సొంతమాటలలో రాయగలను. అవును/ కాదు.
  • జంతువులు, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా కథ రాయగలను. అవును/ కాదు.

Leave a Comment