TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 3rd Lesson వర్షం Textbook Questions and Answers.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

బొమ్మను చూడండి – ఆలోచించండి- మాట్లాడండి: (TextBook Page No.20)

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం 1

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు.
బొమ్మలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. వాళ్ళు వానలో తడుస్తూ గంతులేస్తున్నారు. కాగితం పడవలు చేసి నీళ్ళలో వదులుతున్నారు.

ప్రశ్న 2.
బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో ఊహించండి.
జవాబు.
బాలిక మబ్బును చూస్తూ “వానలు కురవాలి వానదేవుడా” అని పాడుతుండవచ్చు.

ప్రశ్న 3.
వానపడుతుంటే మీరేం చేస్తారు? మీకేం చేయాలనిపిస్తుంది?
జవాబు.
వానపడుతుంటే నేను సరదాగా వానలో తడుస్తూ గంతులు వేస్తాను. నాకు మిత్రులతో కలిసి కాగితం పడవలు చేసి నీళ్ళలో వదలాలనిపిస్తుంది.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.22)

ప్రశ్న 1.
మేఘాన్ని, నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు?
జవాబు.
మొదటి నుండి సిరి లేకుండా మధ్యలో అకస్మాత్తుగా సిరి వచ్చిపడితే ఉబ్బిపోయి గర్వంతో వ్యవహరిస్తారు. అలాగే అంతవరకు లేని మేఘాలు అప్పటికప్పుడు పుట్టీపుట్టగానే గర్వంతో విజృంభిస్తాయి. అందువల్ల మేఘాన్ని, నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి పోల్చి ఉంటాడు.

ప్రశ్న 2.
వర్షం పడడాన్ని కవి వర్ణించాడు కదా! జోరువాన పడుతుంటే మీకెట్లా అనిపిస్తుంది?
జవాబు.
జోరువాన పడుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వర్షధారలను చూస్తుంటే ఆకాశానికి చిల్లుపడిందా అనిపిస్తుంది. పటపటమని వడగండ్లు కూడా పడుతుంటే వాటిని ఏరుకుంటూ వర్షంలో తడుస్తుంటే సంతోషంగా ఉంటుంది.

ఆలోచించండి – చెప్పండి : (TextBook Page No.23)

ప్రశ్న 1.
ప్రజలందరు ఛత్రపతులైనారని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
ఛత్రపతి అంటే చక్రవర్తి అని అర్థం. ఆ పదం రాజులకే తగినది. కాని ఎడతెరిపిలేకుండా కురిసే వర్షంలో తడువకుండా ఉండేందుకు అందరూ ఛత్రాలు (గొడుగులు) పట్టుకొంటారు. అందువల్ల ప్రజలందరు ఛత్రపతులైనారని కవి అన్నాడు.

ప్రశ్న 2.
‘భూసతి రామచిలుకయయ్యె’ అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
వర్షాలకు పులకరించి నేలంతా పచ్చదనంతో కళకళలాడుతున్నది. రామచిలుక పచ్చగా ఉండి చూడటానికి ముద్దు వస్తూ ఉంటుంది. అందువల్ల కవి పచ్చగా ఉండే భూసతి పచ్చని రామచిలుకవలె కనిపిస్తున్నదని అన్నాడు.

ప్రశ్న 3.
వానలు పడడం వల్ల వాతావరణం ఎట్లా మారుతుంది? ఏమేం జరుగుతుంది?
జవాబు.
వానలు పడడం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. నేలంతా తడుస్తుంది. రైతులు నాగలిపట్టి వ్యవసాయానికి సిద్దపడతారు. కానీ పేదల గుడిసెలు మాత్రం వర్షంలో నాని పడిపోవచ్చు.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.23)

ప్రశ్న 1.
మబ్బులను చూసి గుడిసెల కప్పులు, గుంజలు ఎందుకు గడగడలాడినాయి?
జవాబు.
గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయాయి. వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. అందుకని మబ్బులను చూడగానే ఎక్కడ వర్షం కురుస్తుందోనని భయపడి గుడిసెల కప్పులు, గుంజలు గడగడ లాడినాయి.

ప్రశ్న 2.
“శరీరములను రిపులకు అప్పచెప్పడం” అంటే నీకేమి అర్థమయింది ?
జవాబు.
పై కప్పులు సరిగా లేని గుడిసెలలో గాలి చొరబడి దీపాలు ఆరిపోయాయి. అప్పుడు చీకటి ఏర్పడింది. ఆ చీకట్లో దోమలు, తేళ్ళు, పాములు ఏవి కుడతాయో తెలియదు. అందువల్ల ఆ గుడిసెలలో నివసించేవాళ్ళు తమ శరీరాలను శత్రువులకు అప్పగించినట్లు కవి వర్ణించాడని నాకు అర్థమయింది.

ప్రశ్న 3.
పుడిసెడు పేదకాపురము అని కవి అన్నాడు కదా! పేదల కాపురాలు ఎట్లా ఉంటాయి ?
జవాబు.
పేదల కాపురాలు ఉండటానికి సరైన ఇండ్లులేక బాధపడతాయి. ఉన్న ఇండ్లకు సరైన కప్పులు కూడా ఉండవు. ఎండ, వాన, చలి వాళ్ళ గుడిసెలలోనే కాపురం చేస్తాయి. వాటికి తట్టుకోలేక పేదల కాపురాలు నానాబాధలు పడతాయి.

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
నీకు ఏ కాలం అంటే చాలా ఇష్టం? ఎందుకు?
జవాబు.
నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శీతాకాలంలో రాత్రిపూట చలి ఎక్కువగా ఉన్నప్పటికీ పగటి పూట సూర్యకాంతి పెరుగుతున్న కొద్దీ ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్రశ్న 2.
పాఠం చదివారు కదా! కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా? విభేదిస్తారా? ఎందుకు?
జవాబు.
కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే వేసవికాలంలో నేలంతా నెర్రలిచ్చి ఉంటుంది. వర్షాకాలంలో నేలంతా నీటితో పులకరించి పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. అన్ని జీవుల్లో ఆశలు నింపుతుంది.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం:

1. కింది భావం వచ్చే వాక్యాలను పాఠంలో వెతికి రాయండి.

అ. నడుమంత్రపుసిరికి గర్వపడేవారి గర్వం నీరై సముద్రంలో కలిసిపోతుంది.
జవాబు.
“నడుమంతరఫున్ సిరి కుబ్బువారి గర్వోన్నతి నిల్వు నీరయి మహోదధి పాలయి పోదె” (1వ పద్యంలోనిది)

ఆ. నెర్రెలిచ్చిన నేలంతా అద్దంవలె మారి నీడలు కనిపిస్తున్నాయి.
జవాబు.
“నెఱియలు వాఱిన నేలనంతట నద్దములు దాపినట్లు నీడలు కనబడే” (3వ పద్యంలోనిది)

ఇ. పటపటమని వడగండ్లు నేలమీదపడినాయి.
జవాబు.
“పటపట వడగండ్లు పుడమిపై బడె” (2వ పద్యంలోనిది)

ఈ. సంపన్నులు మేడల్లో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు.
జవాబు.
“ఉన్నత సౌధ గోపురపు, టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మునియుండు సంపన్నుల” (4వ పద్యంలోనిది)

ఉ. నల్లని మబ్బులను చూడగానే గుడిసెలు, గుంజలు గడగడలాడుతున్నాయి.
జవాబు.
“గుడిసెల కప్పు లొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత (5వ పద్యంలోనిది)

2. కింది కవితను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

చిటపట చినుకుల వాన – చిరుజల్లై కురిసేనా
నేలంతా తడిపే వాన – హరివిల్లై విరిసేనా
జలజల గలగల పారే – సవ్వడి ఈ వాన
చెరువులు బావులు నిండుగ – నింపే ఈ వాన
పసిడి పంటలను ఇవ్వగా పరుగెత్తే ఈ వాన
పరిసరాలను పచ్చదనంతో నింపేటి ఈ వాన.

అ.. వాన ఎట్లా కురిసింది?
జవాబు.
వాన చిటపట చినుకులతో చిరుజల్లుగా కురిసింది.

ఆ. వాన వేటిని నింపడానికి కురిసింది?
జవాబు.
వాన చెరువులు, బావులు నింపడానికి కురిసింది.

ఇ. వాన వల్ల కలిగే లాభమేమిటి?
జవాబు.
వాన వల్ల పసిడి పంటలు పండుతాయి. పరిసరాలు పచ్చదనంతో నిండి ఉంటాయి.

ఈ. “పసిడి పంటలు” అనే పదంలో పసిడి అనే పదానికి సమానార్థక పదం ఏది ?
జవాబు.
పసిడి అనే పదానికి సమానార్థక పదం – బంగారం.

ఉ. పై కవితలో ఉన్న జంటపదాలు ఏవి?
జవాబు.
చిటపట, జలజల, గలగల.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా! మరి శీతాకాలంలో ఎట్లా ఉంటుంది?
జవాబు.
శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. పగళ్ళు తగ్గిపోతాయి. రాత్రుళ్ళు ఎక్కువవుతాయి. పద్మాల కాంతి చెడిపోతుంది. ఆకాశమంతా మంచు పట్టుతుంది. కొండలన్నీ మంచు కొండలుగా కనిపిస్తాయి. పంటలు పాడైపోతాయి. చలికి తట్టుకోలేక అందరూ వెచ్చదనం కోరుకొంటారు. చలిమంటలు వేసుకుంటారు.

ఆ. “చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా?” అని కవి ఎందుకు అని ఉంటాడు ?
జవాబు.
మేడలలో నివసించేవారిని వర్షం ఏమీ చేయలేదు. వాళ్ళకు ఆ బాధ తెలియదు. తమ గృహాలలో సుఖంగా జీవిస్తారు. పేదవాళ్ళు గుడిసెలలో నివసిస్తారు. ఆ గుడిసెలు జొన్న చొప్పతో కప్పబడి ఉంటాయి. పెద్ద వర్షం కురిస్తే తమ గుడిసెలు ఎక్కడ కూలిపోతాయోనని పేదలు సరిగా నిద్రకూడా పోరు. అందుకని “చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడి కూలగ దాడి చేతువా?” అని కవి అని ఉంటాడు.

ఇ. వర్షాల కోసం ఎవరెవరు ఎదురుచూస్తారు? ఎందుకు?
జవాబు.
వర్షాల కోసం ఆబాలగోపాలం ఎదురుచూస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడుతాయి. ప్రకృతి పులకరిస్తుంది. వర్షాల వల్ల అందరికీ మేలు జరుగుతుంది. చెరువులు, బావులు నీటితో నిండుతాయి. నదులు నిండుగా ప్రవహిస్తాయి. తాగునీటికి, సాగునీటికి కొరత ఉండదు.

ఈ. డా॥ పల్లా దుర్గయ్య గురించి రాయండి.
జవాబు.
డా॥ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన 1914-1983 మధ్యకాలంలోని వాడు. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. “16వ శతాబ్ది యందలి ప్రబంధ వాఙ్మయం – తద్వికాసం” అనే అంశంపైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అప్పటికప్పుడు మేఘాలు ఆకాశంలో పుట్టాయి. చిటపట చినుకులతో వాన మొదలయింది. వడగండ్లు భూమి మీద పడ్డాయి. వర్షం పెద్ద పెద్ద శబ్దాలతో కుండపోతగా కురుస్తోంది.

ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడువకుండా ఉండేందుకు అందరు గొడుగులు పట్టుకున్నారు. వేసవికాలంలో నెర్రలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్లు నీడలు కనిపిస్తున్నాయి. నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తున్నది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది.

పేదలు తమ గుడిసెలకు సరైన పైకప్పులు లేక నానా బాధలు పడుతున్నారు. ఇక వాన కూడా తన ప్రతాపాన్ని . ఎక్కడ చూపిస్తుందోనని కవి ఆవేదన చెందాడు. పేదలను బాధ పెట్టవద్దని కవి వానదేవుని వేడుకున్నాడు.

IV. సృజనాత్మకత/ ప్రశంస.

ప్రశ్న 1.
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
ఆకాశంలో ఎర్రని సంధ్యారాగం, కోయిలల కూతలు, కొండలు, కోనలు, పచ్చని వనాలు, సముద్ర తీరాలు, నదీ ప్రవాహాలు, జలపాతాలు ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు మనకు ప్రకృతిలో కనిపిస్తాయి.

నాకు కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల ప్రకృతి దృశ్యం ఎంతగానో నచ్చింది. అక్కడ కనిపించీ కనిపించనట్లున్న పర్వత శిఖరాలు, మోదుగ చెట్లు, పోక చెట్లు కొండవాగుల్లోని నీరు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలిగింది.

ఎంత దూరం చూసినా రమ్యమైన ప్రకృతే. వినీలమైన ఆకాశం, అందమైన పర్వతశ్రేణి, వృక్ష సంపద, మేఘాల సమూహం, ఝరీ ప్రవాహ సౌందర్యం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. వాటిని చూస్తుంటే ఏ క్షణాన కూడా కంటికి అలసట అనిపించలేదు.

(లేదా)
ప్రశ్న 2.
ఎండాకాలంలోని వాతావరణాన్ని, ప్రజల స్థితిగతులను వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
ఎండాకాలంలో ఎండలు మండిపోతాయి. కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కుతాయి. తలలు మాడిపోతాయి. శరీరమంతా చెమట పట్టుతుంది. వడగాలులు విపరీతంగా వీస్తాయి. ఒక్కొక్కసారి వేగంగా వీచే గాలులకు గుడిసెలు పడిపోతాయి. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. బావులు, చెరువులు, నదులు ఎండిపోతాయి. తాగునీరుకు, సాగునీరుకు ఇబ్బంది పడాల్సివస్తుంది.

ఎండలకు తట్టుకోలేక ప్రజలు ఇండ్లలోనే కాలక్షేపం చేస్తారు. ఒకవేళ బయటికి వెళ్ళవలసి వస్తే ఛత్రాలు (గొడుగులు) ధరిస్తారు. శీతల పానీయాలు ఎక్కువగా సేవిస్తారు. ప్రయాణ సమయంలో చెట్ల నీడలను ఆశ్రయిస్తారు. ‘ఎండలకు అనువైన దుస్తులు ధరిస్తారు. కొందరు బాటసారుల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎండ వేడిమికి తట్టుకోలేక కొందరు ఎయిర్ కండిషన్ గదులలోను, మరికొందరు ఎయిర్ కూలర్ల ముందును విశ్రమిస్తున్నారు.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

V. పదజాల వినియోగం:

1. ముందు చదివిన పాఠాల నుండి కింది గుణింతాలతో కూడిన పదాలను వెతికి పట్టిక ఆధారంగా రాయండి.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం 2

జవాబు.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం 3

2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

అ. సోమనాద్రిరాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది.
జవాబు.
అతికించడం

ఆ. కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు.
జవాబు.
రైతులు

ఇ. ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పయ్యెర హాయిగా వీస్తుంది.
జవాబు.
గాలి

ఈ. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి.
జవాబు.
వేగం

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

3. కింది వాక్యాలు చదువండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి.

అ. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. కాని ఆ ఉదధి రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి.
జవాబు.
సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. కానీ ఆ ఉదధి రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి.
సముద్రం = ఉదధి, పయోధి

ఆ. నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి.
జవాబు.
నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి.
నింగి = అంబరం

ఇ. మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని మనం పుట్టడానికి, నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు.
జవాబు.
మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని మనం పుట్టడానికి, నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు.
భూమి = అవని, పుడమి

4. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ. బొబ్బలెక్కు : ___________
జవాబు.
నిప్పును తొక్కగానే నా కాళ్ళు బొబ్బలెక్కాయి.

ఆ. అశ్రద్ధ : ___________
జవాబు.
అశ్రద్ధతో ఏ పనీ చేయరాదు.

ఇ. పటపట : ___________
జవాబు.
నా మీద కోపం వచ్చి మా నాన్న పళ్ళు పటపట కొరికాడు.

ఈ. ఆశలుప్పొంగు : ___________
జవాబు.
నన్ను కలెక్టరుగా చూడాలని మా తల్లిదండ్రులకు ఆశలుప్పొంగాయి.

ఉ. పులకరించు : ___________
జవాబు.
పొలంలోని పంటను చూడగానే రైతు శరీరం పులకరించింది.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

VI. భాషను గురించి తెలుసుకుందాం:

ప్రశ్న 1.
నాల్గవ పద్యాన్ని చదివి అందులో ఉన్న సరణాక్షరాలను, పరుషాక్షరాలను, మహా ప్రాణాలను, అనునాసికాలను గుర్తించి రాయండి.
జవాబు.
సరళాక్షరాలు : గ, జ, డ, ద, బ
పరుషాక్షరాలు : క, చ, ట, త, ప
మహాప్రాణాలు : ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ
అనునాసికాలు : ఙ, ఞ, ణ, న, మ

నాల్గవ పద్యం ఉన్నత సౌధ …… దాడి చేతువా!
విద్యార్థులు ఈ పద్యంలో అడిగిన విధంగా ఆయా అక్షరాలను గుర్తించి రాయండి.

లింగములు :

కింది వాక్యాలను చదువండి.

గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు.
ప్రదీప్, సందీప్ లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు.
పిల్లి, ఎలుకను వెంబడించింది.
చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి.

పై వాక్యాలలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీత, లత – అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు.
ప్రదీప్, సందీప్, నాన్న – అనేవి పురుషులకు (మగవారికి) చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను ‘పుంలింగ పదాలు’ అంటారు.
పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులను కానీ, స్త్రీలను కానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసక లింగ పదాలు అంటారు.

దీని ప్రకారం పురుష వాచక శబ్దాలను పుంలింగాలనీ స్త్రీ వాచక శబ్దాలను స్త్రీలింగాలనీ
పై రెండు కానటువంటి (మానవ సంబంధం కాని) వాటిని అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్పవచ్చు.

2. కింది పేరాలోని పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలను గుర్తించి రాయండి.

సునీత ఉదయాన్నే నిద్రలేచి సమయానికి బడికి వెళ్ళింది. బడిలో సురేష్ తాను రాసిన కథను సునీతకు వినిపించాడు. ఆ కథలో కుందేలు చెట్టు తొర్రలో తన పిల్లలతో ఆడుకునే సన్నివేశంతో పాటు కుందేలు, ముంగిసతో స్నేహం చేయడం కూడా బాగా నచ్చిందని; సునీత తన స్నేహితురాలితో చెప్పింది. అంతేకాదు ఆ కథను తన అన్నయ్య గోపాల్కు కూడా వినిపించింది. కథ బాగుందని అందరూ సురేశ్ను మెచ్చుకున్నారు.
జవాబు.
స్త్రీలింగ పదాలు – 1) సునీత
పుంలింగ పదాలు – 1) సురేష్ 2) గోపాల్
నపుంసకలింగ పదాలు – 1) కుందేలు 2) చెట్టు 3) ముంగిస

ప్రాజెక్టు పని:

వానకాలాన్ని వర్ణించే రెండు మూడు పాటలు లేదా కవితలు సేకరించండి. నివేదిక రాసి, చదివి వినిపించండి.
జవాబు.

1. వానల్లు కురవాలి – వానదేవుడా
వరిచేలు పండాలి – వానదేవుడా
నల్లానల్లని మేఘాలు – వానదేవుడా
జల్లుగా కురవాలి – వానదేవుడా
చేలన్ని పండాలి – వానదేవుడా
చెఱువులన్నీ నిండాలి – వానదేవుడా
కరువంతా పోవాలి – వానదేవుడా
కప్పలకు పెళ్ళిళ్లు – వానదేవుడా
గొప్పగా చేయాలి – వానదేవుడా

2. చిటపట చినుకుల వాన – చిరుజల్లై కురిసేనా
నేలంతా తడిపే వాన – హరివిల్లె విరిసేనా
జలజల గలగల పారే – సవ్వడి ఈ వాన
చెరువులు బావులు నిండుగ – నింపే ఈ వాన
పసిడి పంటలను ఇవ్వగా – పరుగెత్తే ఈ వాన
పరిసరాలను పచ్చదనంతో – నింపేటి ఈ వాన

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

TS 6th Class Telugu 3rd Lesson Important Questions వర్షం

I. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. కింది పద్యం చదువండి. ‘తప్పు’ లేదా ‘ఒప్పు’ లను గుర్తించండి.

ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే లోభియౌను హీనాత్ముండౌ
మీకుంటే మాకిమ్మా
మాకుంటే మేము రాము మల్కిభరామా !

అ) ఆకులున్నదే వృక్షం
జవాబు.
ఒప్పు

ఆ) అడిగినవారికి లేదనకుండా ఇచ్చేవాడు లోభి
జవాబు.
తప్పు

ఇ) ఈ పద్యంలో కవి ధనం లేనివాడు
జవాబు.
ఒప్పు

ఈ) దానం చేయనివాడు హీనుడు
జవాబు.
ఒప్పు

ఉ) కవి మల్కిభరాముకు డబ్బు ఇస్తానన్నాడు.
జవాబు.
తప్పు

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

2. కింది పేరా చదువండి. 5 ప్రశ్నలు తయారుచేయండి.

భారతదేశంలో 8.7 కోట్లమంది బాలలు పాఠశాలలకు వెళ్ళడంలేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పనిచేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

బాల కార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికితీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జవాబు.

  1. భారతదేశంలో ఎంతమంది బాలకార్మికులున్నారు ?
  2. బాలకార్మికుల వివరాలు తెలిపే అంతర్జాతీయ సంస్థ ఏది ?
  3. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎవరు సహకరించాలి ?
  4. ప్రత్యేక పాఠశాలలెవరి కోసం నెలకొల్పాలి ?
  5. ఎవరిలో ప్రతిభను వెలికితీయాలి ?

II. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) వర్షం రచించిన కవి గురించి రాయండి.
జవాబు.
వర్షం రచించిన కవి పేరు డా॥ పల్లా దుర్గయ్య. ఆయన వరంగల్ జిల్లా మడికొండలో జన్మించాడు. ఆయన సంస్కృతం, తెలుగు, ఆంగ్లభాషలలో పండితుడు. ఆయన పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి రచించారు. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాఙ్మయం – తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశారు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది.

ఆ) మేఘాల గురించి కవి అభిప్రాయమేమిటి ?
జవాబు.
మేఘాలు ఆ రోజుకు ముందు రోజు వరకు ఆకాశంలో లేవు. కానీ, పుట్టీ పుట్టగానే ఆకాశంలోకి ఎగబ్రాకేయి.. మీసాలు దువ్వేయి. నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళలా గర్వపడ్డాయి. ఆ గర్వం అంతా నిలువునా నీరై పోతుంది. సముద్రంలో కలిసిపోతుందని కవి అభిప్రాయపడ్డాడు.

ఇ) వర్షం ఎలా వచ్చింది ?
జవాబు.
చిటపట చినుకులతో మొదలైంది. వడగండ్లు రాలేయి. వర్షపుధార పెరిగిపోయింది. కుండపోతగా వచ్చింది. పేదవారి గుడిసెలు కూలిపోయేటంత గాలితో ఎక్కువైపోయింది.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) వానాకాలం మీ గ్రామంలో ఎలా ఉంటుంది ?
జవాబు.
నేలమీద కాలుపెడితే జారిపోతుంది. రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ నీరు నిలబడిపోతుంది. పగలూ, రాత్రీ కరెంటు ఉండదు. అందరూ గొడుగులతోనే తిరుగుతారు. రైతులు వ్యవసాయపు పనులతో ఉంటారు. చెరువులు నిండుతాయి, పిల్లలు వానలో ఆడతారు. పడవలు తయారుచేసి, వాన నీటిలో వదులుతారు. కొంతమంది వర్షపు నీటిలో జారిపడిపోతారు. చలిచలిగా ఉంటుంది.

ఆ) వానాకాలంలో పేదల పాట్లు ఎలా ఉంటాయి?
జవాబు.
పేదలు చిన్న చిన్న పూరిగుడిసెలలో ఉంటారు. సాధారణంగా అవి పల్లపు ప్రాంతాలలో ఉంటాయి. వర్షం వస్తే మురికి కాలువలు పొంగుతాయి. నీరు ఇళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఇల్లంతా తడిసిపోతుంది. గాలికి పైకప్పులు ఎగిరిపోతాయి. ఇంట్లో వాన కురుస్తుంది. సామాన్లు కూడా తడిసిపోతాయి. కనీసం వంట చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. తినడానికి లేక పస్తులుంటారు. నిద్రపోవడానికి అవకాశం లేక జాగరం చేస్తారు. తేళ్ళు, జెర్రులు లాంటివి కరుస్తుంటాయి. వానాకాలంలో పేదల పాట్లు వివరించడానికి ఏ భాషలోని పదాలు సరిపోవు.

III. సృజనాత్మకత / ప్రశంస:

ప్రశ్న 1.
చలికాలాన్ని వర్ణిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు.
కవిత

దుప్పటీ ముసుగు తీయాలంటే భయం.
కోటు విప్పాలంటే చెప్పలేనంత భయం.
ముఖం కడుక్కోవాలంటే గజగజ
నీరు ముట్టుకోవాలంటే వజవజ
చన్నీటి స్నానం పేరు చెబితే వణుకు
గాలిపేరు వింటేనే వెన్నులో వణుకు
ఇదంతా చలికాలం గొప్పతనం
అందుకే చలికాలం అంటే గుర్తొచ్చేది చిన్నతనం.

ప్రశ్న 2.
చలికాలంలోని వాతావరణాన్ని, ప్రజల స్థితిగతుల్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.

చలికాలం

కాలాలు మూడు –

  1. వేసవి (ఎండా)కాలం
  2. వర్షాకాలం
  3. చలికాలం (శీతాకాలం)

సెగలు పొగలు కక్కే వేసవికాలం ఎండలు మెండుగా ఉండి కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే, వర్షం పడుతుంటే ఆబాలగోపాలం సంతోషిస్తారు. ప్రకృతి పులకరిస్తుంది. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది.

చలికాలం హేమంత, శిశిర ఋతువులతో కూడి ఉంటుంది. ఈ కాలంలో మంచుతో ఆకాశమంతా కప్పబడి ఉంటుంది. ‘చలి ఎక్కువగా ఉండి ప్రాణికోటి ఇబ్బంది పడుతుంది. చెట్లు ఆకులు రాల్చే ఈ కాలంలో పంటలు పాడైపోతాయి. చలికి తట్టుకోలేక అందరూ వెచ్చదనం కోసం చలిమంటలు వేసుకుంటారు. పగళ్ళు తగ్గిపోతాయి. రాత్రుళ్ళు ఎక్కువవుతాయి. పద్మాల కాంతి తగ్గుతుంది.

శీతాకాలంలోనే ముస్లింల ‘మిలాడనబీ’ పండుగ, క్రైస్తవుల ‘క్రిస్మస్’, హిందువుల ‘సంక్రాంతి’ పండుగలతో ప్రజలు భక్తి ప్రపత్తులు కల్గి పూజలు చేస్తారు. ఈ కాలంలోనే పంటలు చేతికి వచ్చి, ప్రతి ఇల్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి.

పిల్లలు, పెద్దలు చలి నుండి రక్షించుకోవడానికి ఉన్ని దుస్తులు, రగ్గులు, కంబళ్ళు, స్వెటర్లు వంటి వాటిని వాడతారు.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

ప్రశ్న 3.
వానలో తడుస్తూ, ఆటలాడే సందర్భాలను గుర్తు చేసుకుంటూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

మంచిర్యాల,
X X X X X.

ప్రియ మిత్రుడు జస్వంత్క,

ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమమని తలుస్తాను. నీకు గుర్తుందా ! గత వానకాలంలో నీవు మా ఊరు వచ్చి మా ఇంట్లోనే ఉన్న రోజులు. వర్షంలో తడవడం, కాగితపు పడవలు చేసి నీటిలో వదలటం, వానలో తడవడం వల్ల జలుబు చేయడం, అమ్మానాన్నలు కేకలు వేయడం – అవన్నీ జ్ఞాపకం చేసుకొంటే ఎంత సరదాగా ఉందో. అల్లరితోపాటు మనం చేసిన పని – వర్షపు నీటిని పట్టి నిల్వచేశాము. అదే బిందెలతో తొట్టెలలోకి, గంగాళంలోకి నీరు పట్టాము. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. నీవు ఏం చేస్తున్నావు. నీవు కూడా ఇలాగే అనుకుంటున్నావా ! అక్కడి విషయాలు ఉత్తరంగా రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
టి. భరద్వాజ్.

చిరునామా :
కె. జస్వంత్, S/o ఫణిరామ్,
నాగార్జునసాగర్,
నల్గొండ.

IV. భాషాంశాలు:

అర్థాలు:

నింగి = ఆకాశం
పుడమి = భూమి
సుషుప్తి = ఒళ్లు మరచిన గాఢ నిద్ర
మిన్ను = ఆకాశం
ఉదధి = సముద్రం
సౌధం = భవనం, మేడ
రిపులు = శత్రువులు
సిరి = సంపద
కృషికుడు = రైతు
మొగుళ్ళు = మేఘాలు
మీసలు = మీసములు
ఛత్రము = గొడుగు
పయ్యెర = గాలి
ఉబ్బు = పొంగిపోవు

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
శ్రీ – సిరి
రాత్రి – రాతిరి, రేతిరి
మేఘము – మొగులు
ఆశ – ఆస
కుండీ – కుండ
దీపము – దివ్వె, దిబ్బెము
పృథివి – పుడమి
నిద్ర – నిదుర

వ్యతిరేకపదాలు:

నవ్వు x ఏడుపు
నీతి x అవినీతి
శ్రద్ద x అశ్రద్ధ
పగలు x రాత్రి
ఆశ x నిరాశ
పేద x ధనిక
దరిద్రులు x ధనవంతులు
చిన్న x పెద్ద

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

సంధులు:

నీర = నీరు + అయి – ఉత్వసంధి
ఆశలుప్పొంగి = ఆశలు + ఉప్పొంగి – ఉత్వసంధి
బొబ్బలెక్కెడి = బొబ్బలు + ఎక్కెడి – ఉత్వసంధి
చుఱుక్కని = చఱుక్కు + అని – ఉత్వసంధి
ప్రజలందఱు = ప్రజలు + అందఱు – ఉత్వసంధి
ఇదేమి = ఇది + ఏమి – ఇత్వసంధి
కాంచినంత = కాంచిన + అంత – అత్వసంధి
మునియుండు = మునిగి + ఉండు – యడాగమ సంధి
వర్షాగమము = వర్ష + ఆగమము – సవర్ణదీర్ఘసంధి
గర్వోన్నతి మ = గర్వ + ఉన్నతి – గుణసంధి
మహోదధి = మహా + ఉదధి – గుణసంధి

నానార్థాలు:

1. కప్పు : కమ్ము, ఇంటి పైకప్పు, చీకటి
2. గగనం : ఆకాశం, శూన్యం, దుర్లభం
3. తిమిరం : చీకటి, గ్రుడ్డితనం
4. సాగరం : సముద్రం, సంఖ్య, ఒక జాతి మృగం

సమాసాలు:

సమాసపదం  విగ్రహ వాక్యం  సమాస నామం
గర్వోన్నతి  గర్వము యొక్క ఉన్నతి  షష్ఠీతత్పురుష సమాసం
వర్షాగమము  వర్షము యొక్క ఆగమము  షష్ఠీతత్పురుష సమాసం
ఛత్రపతులు  ఛత్రములకు పతులు  షష్ఠీతత్పురుష సమాసం
గుడిసెల కప్పు  గుడిసెల యొక్క కప్పు  షష్ఠీతత్పురుష సమాసం

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

వ్యాకరణాంశాలు:

భాషాభాగాలు – 5

1. నామవాచకం :
పేర్లను తెలుపునది. అనగా మనుష్యుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, వస్తువుల పేర్లు – ఇలా పేర్లను తెలిపే పదాలను ‘నామవాచకాలు’ అంటారు.
ఉదా : రాముడు, జింక, చిలుక మొ॥వి.

2. సర్వనామం :
నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాలను ‘సర్వనామాలు’ అంటారు.
ఉదా : రాముడు మంచి బాలుడు, అతడు తండ్రి మాట వింటాడు.
‘ఇక్కడ ‘అతడు’ పదం ‘రాముడు’ అను పదానికి బదులుగా వాడబడింది. కనుక ‘అతడు’ సర్వనామం. ఇలాగే ‘ఆమె’, అది, ఇది మొ॥వి సర్వనామ పదాలు.

3. క్రియ :
నామవాచకం యొక్క, సర్వనామం యొక్క పనిని తెలుపునది.
ఉదా : రవి బడికి వెళ్ళెను.
‘ఇక్కడ ‘వెళ్ళెను’ అనునది క్రియ. రవి ‘నామవాచకం’. క్రియ అనగా పని.

4. విశేషణం : అనగా ‘గుణము’ అని అర్థం. నామవాచకం, సర్వనామం యొక్క గుణాన్ని తెలుపునది.
ఉదా : పాలు తెల్లగా ఉంటాయి. ఇక్కడ ‘తెల్లగా’ అనునది పాలయొక్క గుణం. కనుక ‘తెల్లగా అనునది విశేషణం.

5. అవ్యయం : లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు చేరక ఎట్టి మార్పు పొందనివి.
ఉదా : ఆహా, ఓహో, అయ్యో, ఔర మొదలగునవి.

సమాపక, అసమాపక క్రియలు :

సమాపక క్రియ :
పూర్తి అయిన పనిని సమాపక క్రియ అంటారు. ఉదా : రాజు బడికి వెళ్ళెను. ఇక్కడ వెళ్ళెను అనునది వెళ్ళటం జరిగింది అనే అర్థం ఇస్తున్నది. ఒక పని పూర్తి అయింది. కనుక ‘వెళ్ళెను’ అనునది సమాపక క్రియ.

అసమాపక క్రియ :
పని పూర్తి కానిది. ఉదా : సాయి పాఠం చదివి, కూర్చున్నాడు. ఇక్కడ ‘చదివి’ అనునది పని పూర్తికాని మాట. చదివి ఇంకా ఏదో చేయబోతున్నాడు అనే అర్థాన్ని ఇస్తున్నది. కనుక ఇక్కడ ‘చదివి’ అసమాపక క్రియ. ఇలాగే విని, తిని, వచ్చి, చూసి, రాసి, మాట్లాడి మొదలగునవి.

సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

ప్రశ్న 1.
అల్లరి చేశారు. మాటలు పడ్డారు.
జవాబు.
అల్లరిచేసి, మాటలు పడ్డారు.

ప్రశ్న 2.
వానాకాలం వచ్చింది. రైతుల బాధలు తీర్చింది.
జవాబు.
వానాకాలం వచ్చి, రైతుల బాధలు తీర్చింది.

సంబంధంలేని పదాలు గుర్తించండి.

ప్రశ్న 1.
ఆకాశం, గగనం, మిన్ను, మన్ను
జవాబు.
మన్ను

ప్రశ్న 2.
భూమి, అవని, కాని, పుడమి
జవాబు.
కాని

గీత గీసిన పదాలకు వచనాలు గుర్తించండి.

ప్రశ్న 1.
చెరువులు నిండాలి వానదేవుడా.
జవాబు.
బహువచనం

ప్రశ్న 2.
నేలపై మోపిన కాలు చుఱుక్కన్నది.
జవాబు.
ఏకవచనం

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

పద్యాలు – అర్థాలు – తాత్పర్యాలు:

1వ పద్యం :

I ఉ. నిన్నటిదాక లేవుకద నింగిని, పుట్టియు పుట్టకుండనే
మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే
మన్న! యిదేమినీతి, నడుమంతరపున్ సిరి కుబ్బువారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహెూదధి పాలయి పోదె మేఘమా?

అర్థాలు :

మేఘమా = ఓ మేఘమా!
నిన్నటిదాక = నిన్నటివరకు
నింగిని = ఆకాశంలో
లేవుకద = లేవు కదా (కనిపించవు కదా)
పుట్టియు పుట్టకుండనే = పుట్టీ పుట్టకుండానే
మిన్న = ఆకాశానికి
ఎగబ్రాకినాననుచు = ఎగబాకినానని
మీసలు దువ్వుచు = మీసాలు దువ్వుతూ
నవ్వుచుంటివి + ఏమి + అన్న = నవ్వుతున్నావెందుకు!
ఇది + ఏమినీతి = ఇటుదెవంటి నీతి?
నడుమంతరపు సిరికిన్ = నడుమంత్రపు సిరికి
ఉబ్బువారి = పొంగిపోవువారి
గర్వ + ఉన్నతి = గర్వాధిక్యం
నిల్వునీరు + అయి = నిలువునా నీరై
మహా + ఉదధి + పాలు + అయి = గొప్ప సముద్రం పాలయి
పోదె = పోవుట లేదా?

తాత్పర్యం :
ఓ మేఘమా! నిన్నటివరకు ఆకాశంలో లేనేలేవు కదా! పుట్టీ పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు? ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడేవారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలౌతుందని తెలుసుకో!

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

2వ పద్యం :

కం. చిటపట చినుకులు రాలెను
పటపట వడగండ్లు పుడమిపై బడె, ధారల్
పుటపుటనై కుండలతో
నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్.

అర్థాలు :
పుడమి = భూమి
కనుపట్టెన్ = కనబడ్డాయి

తాత్పర్యం :
చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిమీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్దపెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది.

3వ పద్యం :

సీ. నేలపై మోపిన కాలు చుఱుక్కని
బొబ్బ లెక్కెడి దినమ్ములు గతించె,
నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము
జఱుకుజఱుక్కని జాఱదొడగె
పగలు రాత్రి యనక ప్రభు పాలితులనక
ప్రజలందఱును ఛత్రపతులె యైరి
నెఱియలు వాఱిన నేలనంతట నద్ద
ములు దాపినట్లు నీడలు కనబడె

తే.గీ. పులకరించి భూసతి రామచిలుకయయ్యె
హుంకరించి యాబోతులు అంకెవేసె
నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టె
నాశ లుప్పొంగి పాతె వర్షాగమమున

అర్థాలు :

మోపిన = ఆనించిన
బొబ్బలు = పొక్కులు
దినము = రోజు
ప్రభువు = అధిపతి, రాజు
పాలితులు = పాలింపబడేవారు
ఛత్రపతులు = ఛత్రానికి పతులు
ఛత్రం = గొడుగు
నెఱియ = చీలిక
నెఱియలు వారిన = బీటలు వారిన
అద్దములు తాపినట్లు = అద్దాలు అతికించినట్లు
పులకరింత = గగుర్పాటు
భూసతి = భూమి అనే స్త్రీ
హుంకరించి = హుంకారం చేసి
ఆబోతు = అచ్చుటెద్దు, ఎద్దు
ఱంకె = కేక అఱపు
కృషికుడు = రైతు
ఆశలు = కోరికలు
ఉప్పొంగి = ఉబికి
వర్షాగమము (వర్ష + ఆగమము) = వాన వచ్చుట

తాత్పర్యం :
కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండాకాలం వెళ్ళిపోయింది. అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది. ఎడతెరిపిలేకుండా కురిసే వర్షంలో తడువకుండా ఉండేందుకు అందరు ఛత్రీలు పట్టుకోవడంతో ప్రభువులు పాలితులు (రాజు-పేద) అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులే అయ్యారు. వేసవికాలంలో నెర్రెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి.

వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తున్నది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలిపట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

4వ పద్యం : (కంఠస్థ పద్యం )

ఉ. ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మున్గియుండు సం||
పన్నుల మీదికిన్ జనగ వాటముకామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా!

అర్దాలు:

వానదేవుడా ! = ఓ వానదేవుడా !
ఉన్నత సౌధ గోపురపు = ఎత్తైన మేడలమీద
ఉయ్యెల మంచములందు = ఉయ్యాల మంచాలలో
తిన్నగా = మెల్లగా
కన్నులు మూసి = కళ్ళు మూసి
గుఱ్ఱుమని = గుఱ్ఱుమంటూ (గురక పెడుతూ)
గాఢసుషుప్తిని = ఒళ్ళుమరచిన గాఢ నిద్రలో
మున్గియుండు = మునిగిపోవు
సంపన్నుల మీదికిన్ = ధనవంతుల మీదికి
చనగ = పోవగ
వాటముకామిని = వీలుకాదని
చిన్నని = చిన్నవాళ్ళ (పేదవాళ్ళ)
చొప్పడప్పు = జొన్నచొప్పుతో కప్పులు వేసుకున్న
గుడిసెల్ = గుడిసెలు
వడికూలగ = వేగంతో కూలిపోయేటట్లుగా
దాడి చేతువా = దండయాత్ర చేస్తావా?

తాత్పర్యం :
ఓ వానదేవుడా! ఎత్తైన మేడలమీద, ఉయ్యాల మంచాలలో, గుఱకలు పెడుతూ, గాఢనిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలుకాదని, పేదవాళ్ళు జొన్నచొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు గభాలున కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా? వద్దు అట్లా చేయకు.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

III. 5వ పద్యం : (కంఠస్థ పద్యం)

చం. వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి
గుడిసెల కప్పు లొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత, నీ
పుడిసెడు పేదకాపురము పొల్లొనరింపకు వానదేవుడా!

అర్థాలు :

వానదేవుడా! = ఓ వానదేవుడా!
ఈ గుడిసెల కప్పులు = ఈ గుడిసెలపై గల కప్పులు
వడలకు = ఎండల వేడికి
వాడిపోయి = ఎండిపోయి
వడి = వేగమైన
పయ్యెర ఊపుకు = గాలి ఊపుకు
పట్టువీడి = పట్టు తప్పిపోయి
ఒప్పేడలె = తగనట్లున్నాయి
గుంజలు = స్తంభాలు
పాదులన్ = పాదులతో
ఊగులాడెన్ ఊగులాడుతున్నాయి
కారుమొగుళ్లను = నల్లని మబ్బులను
కాంచినంతన్ = చూసినంతనే
గడగడలాడుచున్నయవి= భయపడుతున్నాయి
ఈ పుడిసెడు = ఈ పుడిసెడంత (ఈ చిన్నదైన)
పేదకాపురము = పేద సంసారం
పోల్లు + ఒనరింపకు = నాశనం చేయకు (వ్యర్థం చేయకు)

తాత్పర్యం : గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి, వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా! ఈ పేదసంసారాన్ని నాశనం చేయకు.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

6వ పద్యం :

చం. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
తెపతెపలాడిపోయె, చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలుపోయినారు, నీ
విపుడె సవారిచేసి యలయింపకు వారిని వానదేవుడా!

అర్థాలు :

చొచ్చివచ్చు = చొరబడి వచ్చు
చెలరేగిన = మిక్కిలి విజృంభించిన
రిపులకు = శత్రువులకు
అప్పజెప్పిన = అప్పగించిన
సవారి చేసి = అధికారాన్ని చెలాయించి
అలయింపకు = బాధపెట్టకు, కష్టపెట్టకు

తాత్పర్యం :
పై కప్పులు సరిగ్గాలేని గుడిసెలలోనికి హఠాత్తుగా గాలి చొరబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. పేదలు ఆ చీకట్లోనే శత్రువులకు (దోమలు, తేళ్ళు, పాములు మొదలైనవాటికి) శరీరాలు అప్పగించి పడుకున్నారు. ఓ వానదేవుడా! ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధపెట్టకు.

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

పొగలు సెగలు కక్కేవేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠ్యభాగం “ఖండకావ్యం” ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డా॥ పల్లా దుర్గయ్య రచించిన “పాలవెల్లి” అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది.

కవి పరిచయం:

పాఠ్యభాగ రచయిత : డా|| పల్లా దుర్గయ్య.
కాలం : 1914 – 1983.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామం.
తల్లిదండ్రులు : నర్సమ్మ, పాపయ్యశాస్త్రి.
రచనలు : పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి.
రచనాశైలి : తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది.
ఇతర విశేషాలు : ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. “16వ శతాబ్ది యందలి ప్రబంధ వాఙ్మయం – తద్వికాసం” అనే అంశం పైన పరిశోధన చేశాడు.

TS 6th Class Telugu Guide 3rd Lesson వర్షం

ప్రవేశిక :

వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాలగోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడుతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులనూ కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు చదువుదాం.

నేనివి చేయగలనా?

  • నాకు ఇష్టమైన కాలం గురించి చెప్పగలను. – అవును/ కాదు
  • అపరిచితమైన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలను. – అవును/ కాదు
  • పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • నాకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయగలను. – అవును/ కాదు

Leave a Comment