TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 11th Lesson పల్లెటూరి పిల్లగాడా! Textbook Questions and Answers.

TS 6th Class Telugu 11th Lesson Questions and Answers Telangana పల్లెటూరి పిల్లగాడా!

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి. (TextBook Page No. 108)

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా! 1

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో తన సైకిలు బాగు చేయించుకుంటున్న వ్యక్తి, సైకిలు షాపుకు సంబంధించిన పిల్లవాడు ఉన్నారు.

ప్రశ్న 2.
పిల్లవాడు ఏం చేస్తున్నాడు ?
జవాబు.
పిల్లవాడు సైకిలుకు పంచరు వేస్తున్నాడు.

ప్రశ్న 3.
ఆ పిల్లవాడిని చూస్తే మీకేమనిపిస్తున్నది ?
జవాబు.
ఆ పిల్లవాడిని చూస్తే బడికిపోయి చదువుకోకుండా, కష్టపడి పనిచేసుకొని బతుకుతున్నాడనిపిస్తుంది.

ప్రశ్న 4.
ఇట్లాంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు ?
జవాబు.
ఇట్లాంటి వాళ్ళ జీవితం గడవడం చాలా కష్టంగా ఉంటుందని అనుకుంటున్నాను.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 110)

ప్రశ్న 1.
“పాలబుగ్గల జీతగాడు” అంటే నీకు ఏమని అర్థం అయింది?
జవాబు.
ఆనాడు పిల్లలు పాలబుగ్గల పసివయస్సులోనే అంటే అతి చిన్న వయస్సులోనే భూస్వాముల వద్ద జీతానికి పనిలో చేరేవారని నాకు అర్థమయింది.

ప్రశ్న 2.
“దొడ్డికీవే దొరవైపోయావా” అని కవి పిల్లవాడిని ఎందుకు అన్నాడు ?
జవాబు.
యజమాని దొడ్డికి ఈ పిల్లవాడే దొర (యజమాని). తన యజమాని దూడలను తప్ప ఇతరుల పశు వులు అక్కడికి వచ్చి గడ్డి మేయబోతే ఇతడు ఊరుకోడు. ఆ దొంగ పశువులను అడ్డగించి వాటిని తరిమేస్తాడు. అందుకే “దొడ్డికివే దొరవైపోయావా” అని కవి పిల్లవాడిని అన్నాడు.

ప్రశ్న 3.
‘చేతికర్రే తోడయ్యిందా?” అనడంలో అర్థం ఏమిటి ?
జవాబు.
జీతగాడికి పశువులను మంచిదారిలోకి మళ్ళించడానికి చేతికర్రయే తోడుగా అంటే సాయంగా ఉంటుంది. అతనికి పక్కన ఎవరూ లేకపోయినా ఒంటరిగా తన చేతికర్రను సాయంగా చేసుకొని, ఏ దారిలో పడితే ఆ దారిలో నడుస్తూ పశువులను మేపుతాడన్నమాట.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 111)

ప్రశ్న 1.
పంట చేనుకు కాపు ఉంటాడు కదా ! పంటకు కాపు అవసరం ఏమిటి ?
జవాబు.
సామాన్యంగా ఆవుల దూడలు చురుగ్గా ఉంటాయి. అవి చేను చుట్టూ రైతు వేసుకున్న ముండ్ల కంచెలను కూడా దాటి, చేలలో పడి పైర్లను తింటూ ఉంటాయి. అందుకని పంటకు కాపు అవసరం.

ప్రశ్న 2.
“జీతగాని జీవితం వెలుగు లేనిది” అని కవి అన్నాడు. కదా ! అదెట్లాగో చెప్పండి.
జవాబు.
జీతగాని వయస్సు గల పిల్లలందరు బడికి వెళ్ళి చక్కగా చదువుకొంటారు. జీతగాడు ఆ పిల్లలను చూసి వాళ్ళకు చదువు వచ్చుననీ, తనకు చదువు రాదనీ తెల్లబోతాడు. తన జీవితంలో వెలుగు లేదని బాధపడతాడు. అందువల్ల “జీతగాని జీవితం వెలుగు లేనిది” అని కవి అన్నాడు.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.
పాటను విన్నారు కదా ! ఈ పాటను రాగంతో పాడండి.
జవాబు.
ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యాసం చేయండి.

ప్రశ్న 2.
పల్లెటూరి పిల్లగాని బాధలు ఎట్లున్నాయో చెప్పండి.
జవాబు.
పల్లెటూరి పిల్లగాని బాధలు :

  1. దారులతో సంబంధం లేకుండా, తాటిజెగ్గల కాలిజోడు తొడుగుకొని, చేతి కర్రే తోడుగా పశువులను కాస్తూ అడవికి వెళ్ళాలి.
  2. తల్లి చద్ది అన్నం పొద్దున్నే పెట్టకపోయినా పనిలోకి వెళ్ళి ఆకలితో బాధపడుతూ పశువులను కాపలా కాయాలి.
  3. అడవిలో అతడు పశువులను మేపేటప్పుడు అతడిని ఆకుతేల్లు, కందిరీగలు, అడవిలో ఉండే కీటకాలు కాటువేస్తూ ఉంటాయి.
  4. తాను కావలి కాసే ఆవుదూడలు కంచె దూకి అవతలి వాళ్ళ పంట పొలాలను పాడుచేస్తే, ఆ పాలికాపు కొడతాడు.
  5. అతని జీతం కింద ఇచ్చే ధాన్యంలో కల్తీ ఉంటుంది. ఇంటికి వెళ్ళి కొలిస్తే సేరు ధాన్యం తగ్గుతాయి.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. కింది పదాలను చదువండి. తారుమారుగా ఉన్న పదాలను సరిచేసి రాస్తే పాఠంలోని ఒక భాగం అవుతుంది. సరిచేసి రాయండి.

అ) కంచె దుంకి మాటిమాటికి పాడుచేశాయా పంటచేలు
మాయదారి ఆవుదూడలు కొట్టాడా పాలికాపు నిన్నే జీతగాడ ఓ పాలబుగ్గల
జవాబు.
మాయదారి ఆవుదూడలు
మాటిమాటికి కంచె దుంకీ
పంట చేలూ పాడుచేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
పాలికాపు నిన్నే కొట్టాడా

ఆ) వొంపులోకి తరలేగుంపు కూరుచున్నవు
గుండుమీద దొరవైపోయావా
దొడ్డికీవే ఓ పాలబుగ్గల జీతగాడ
నడ్డగించేవా దొంగగొడ్ల
జవాబు.
గుంపు తరలే వొంపులోకి
కూరుచున్నవు గుండుమీద
దొడ్డికీవే దొరవై పోయావా ఓ పాలబుగ్గల జీతగాడ దొంగగొడ్ల నడ్డగించేవా

2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

మదునయ్య చేపల వ్యాపారి. పాలేరు రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడుతాడు. .ఇందుకోసం అతనికో పనిమనిషి కావాలని ఆలోచించి ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్కు పోయి ఆరోతరగతి చదివే గంగయ్య అనే బాలుడి తల్లిదండ్రులతోటి మాట్లాడి పదివేలకు అతడిని పనికి కుదుర్చుకున్నాడు.

గంగయ్యను తనవెంట తీసుకొని పాలేరుకు వచ్చాడు. మదునయ్య చెప్పినట్లు విని గంగయ్య రోజూ నీటి ఒడ్డున కూర్చొని చేపలకోసం నీటిలో వేసిన వలను చూస్తూ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి కూడా అక్కడే పండుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మదునయ్యను శిక్షించారు. గంగయ్యను బడిలో చేర్పించి అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.

అ. మదునయ్య ఎవరు ? ఏం చేసేవాడు ?
జవాబు.
మదునయ్య చేపల వ్యాపారి. పాలేరు రిజర్వాయరులో చేపలు పట్టి అమ్మేవాడు.

ఆ. గంగయ్య ఎవరు ? పాలేరుకు ఎందుకు వచ్చాడు ?
జవాబు.
గంగయ్య ఆరో తరగతి చదివే బాలుడు. అతనిని మదునయ్య పదివేలకు పనిలో కుదుర్చుకున్నందున పాలేరుకు వచ్చాడు.

ఇ. గంగయ్య పనిలో చేరడం వల్ల ఏమేం కోల్పోయాడు ?
జవాబు.
గంగయ్య పనిలో చేరడం వల్ల చదివే చదువును, కన్న తల్లిదండ్రులను కోల్పోయాడు.

ఈ. బాలల హక్కులలో గంగయ్య ఏ హక్కులకు దూరమయ్యాడు ?
జవాబు.
బాలల హక్కులలో గంగయ్య చదువుకొనే హక్కు అభివృద్ధి చెందే హక్కులకు దూరమయ్యాడు.

ఉ. మదునయ్యను ఎందుకు శిక్షించారు ? ఇట్లా చేయడం సరైందేనా ?
జవాబు.
బాలుడైన గంగయ్యను చదువు మాన్పించి, పాలేరు తీసుకొని వచ్చి పనిలో పెట్టినందుకు మదునయ్యను శిక్షించారు. బాలకార్మికుడిని రక్షించేందుకు మదునయ్యను శిక్షించడం సరైందే.

ఊ. గంగయ్య తల్లిదండ్రులు చేసిన పని సరైందేనా ? ఎందుకు ?
జవాబు.
గంగయ్య తల్లిదండ్రులు చేసిన పని సరైంది కాదు. గంగయ్య తల్లిదండ్రులు డబ్బుకు ఆశపడి, అతనిని చదువు మాన్పించి, బాలకార్మికునిగా తయారుచేయడం సరైంది కాదు.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

3. కింది వాక్యాలను చదివి తప్పో, ఒప్పో గుర్తించండి. కారణం రాయండి.

అ. చదువుకోవడం అందరి హక్కు. (తప్పు/ఒప్పు)
జవాబు.
ఒప్పు, కారణం – చదువుకొనే హక్కు

ఆ. బాలికలు కూడా బాలురతోపాటు సమానంగా చదువడం. (తప్పు/ఒప్పు)
జవాబు.
ఒప్పు, కారణం – కులమత వర్గవిచక్షణ లేని బాల్య హక్కు

ఇ. బాలబాలికలకు సమానహక్కులు ఉంటాయి. (తప్పు/ఒప్పు)
జవాబు.
ఒప్పు, కారణం – బాలబాలికల ప్రాథమిక హక్కు

ఈ. బాలబాలికలను భయపెట్టడం, కొట్టడం, తిట్టడం. (తప్పు/ఒప్పు)
జవాబు.
తప్పు కారణం – దౌర్జన్యాల నుండి రక్షణపొందే హక్కు

ఉ. తల్లిదండ్రులు తమ పిల్లలను పనిలో పెట్టడం. (తప్పు/ఒప్పు)
జవాబు.
తప్పు, కారణం – కూలి జీవితం నుండి బయటపడే హక్కు

ఊ. పిల్లలు మంచి ఆహారం పొందడం. (తప్పు/ఒప్పు)
జవాబు.
ఒప్పు, కారణం – ఆరోగ్యం పోషణ హక్కు

ఋ. తెలియని వాటిని, రాని వాటిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం, నేర్చుకోవడం. (తప్పు/ఒప్పు)
జవాబు.
ఒప్పు, కారణం – అభివృద్ధి చెందే హక్కు

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “సగము ఖాళీ, చల్లగాలి” అని కవి ఏ సందర్భంలో అన్నాడు ? ఎందుకు ?
జవాబు.
బాలకార్మికుడైన పాలబుగ్గల జీతగాడు కట్టుకొనే బట్టల గురించి కవి చెప్పిన సందర్భంలోనిది.
చొక్కా బాగా.చిరిగిపోవడం వల్ల అతడి సగం శరీరంపైకి కనబడుతోంది. ఆ చొక్కా పిల్లవాడి శరీరాన్ని పూర్తిగా కప్పడం లేదు. సగం ఖాళీగా ఉంది. చొక్కా చిరిగిపోవడం వల్ల ఆ పిల్లవాడికి చల్లని గాలి తగులుతోందట. అందువల్ల కవి “సగము ఖాళీ, చల్లగాలి” అన్నాడు.

ఆ. పశువుల కాపరి వలె బాల్యాన్ని కోల్పోతున్నవారు ఇంకెవరెవరు ఉండవచ్చు ?
జవాబు.
చిన్నతనంలోనే చాలామంది పిల్లలు తండ్రులకు సాయంగా కూలీలుగా పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలలో తక్కువ జీతాలకు కార్మికులుగా పనిచేస్తున్నారు. అనేక కుటీర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. హెూటళ్లలో సర్వర్లుగా, ప్లేట్లు శుభ్రం చేసేవారిగా, పిండి రుబ్బేవారిగా పని చేస్తున్నారు. ఇటుక బట్టీలలో, రైల్వేస్టేషన్లలో, బస్టాండులలో కూలీలుగా పనిచేస్తున్నారు. కొందరు వీధులలో చిత్తు కాగితాలు, పాల కవర్లు, సీసాలు మొదలైన వాటిని ఏరుకొని, అమ్మి జీవిస్తున్నారు. వీళ్ళంతా కూడా పశువుల కాపరి వలె బాల్యాన్ని కోల్పోతున్నవారే.

ఇ. బడిలోని తోటి పిల్లలను చూసిన పసుల కాసే పిల్లవాడు ఎందుకు బాధపడ్డాడో కారణాలు ఊహించి రాయండి.
జవాబు.
పసుల కాసే పిల్లవాడికి, తన తోడి ఇతర పిల్లలకు వలె, బడిలోకి వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది. వాళ్ళకు చదువు వచ్చనీ, తనకు చదువు రాదని బాధపడతాడు. తన జీవితంలో వెలుగు లేదని బాధపడతాడు. తాను కూడా తన తోటి పిల్లల వలె, బడిలోకి వెళ్ళి చదువుకుంటే తన జీవితంలో కూడా వెలుగురేఖలు ప్రసరించి ఉండేవని బాధపడతాడు. కాబట్టి బడిలోని తోటిపిల్లలను చూసిన పసుల కాసే పిల్లవాడు తనకు బడికి వెళ్ళి చదువుకునే అదృష్టం లేకపోయిందని బాధపడ్డాడు.

ఈ. సుద్దాల హనుమంతు గురించి రాయండి.
జవాబు.

  1. సుద్దాల హనుమంతు రెండో ఫారం వరకు చదువుకున్నారు.
  2. జననం : యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించారు.
  3. తల్లిదండ్రులు : తల్లి లక్ష్మీనరసమ్మ, తండ్రి బుచ్చిరాములు.
  4. ఉద్యోగం : వ్యవసాయశాఖలో గుమస్తాగా పనిచేసి, కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
  5. కళాకారుడైన హనుమంతు అనేక చైతన్యగీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టలదొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు.
  6. ఈయన రచనలు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

2. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి.

ప్రశ్న.
“పల్లెటూరి పిల్లగాడు, పశువుల కాపరి లాంటి వాళ్ళ జీవితాలు చదువుకుంటేనే బాగుపడతాయి” దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
పిల్లలు చిన్నప్పుడు చదువుకోకుండా బాలకార్మికులుగా తయారైతే వారి జీవితమంతా కష్టాలతోనే గడపాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు, అయినవారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎండా, వానా, చలిని తట్టుకుంటూ యజమాని పెట్టే బాధల్ని భరించాల్సి వస్తుంది. సమయానికి ఆహారం ఉండదు. ఇచ్చే కూలీ సరిగా ఇవ్వరు. తన బతుకును తలచుకుంటూ తనకు తాను దుఃఖించాల్సి వస్తుంది.

తన తోటిపిల్లలు బడికి వెళ్ళి చక్కగా చదువుకొంటుంటే, వారిని చూసి బాధతో కుమిలిపోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు చదువుకోకుండా పెద్దయిన తరువాత తన జీవితంలో వెలుగు లేదని ఎంత విచారించినా ప్రయోజనం లేదు. కాబట్టి పల్లెటూరి పిల్లగాడు, పశువుల కాపరి లాంటి వాళ్ళ జీవితాలు చదువుకుంటేనే బాగుపడతాయి.

IV. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
పాఠం ఆధారంగా పిల్లగాని జీవితాన్ని “ఆత్మకథ” గా రాయండి.
జవాబు.

ఆత్మకథ

నేనొక పల్లెటూరి పిల్లగాడిని. చిన్నప్పుడే జీతానికి పశువుల కాపరినయ్యాను. తొడుక్కోడానికి సరైన చొక్కా లేదు. అది కూడా రంధ్రాలతో కూడింది. తాటిజగ్గలే నా చెప్పులు. పశువులను తోలే నా చేతికర్రే నాకు సాయంగా ఉంటుంది.

యజమాని పెట్టే బాధలు, నా కష్టాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుస్తాను. చద్ది అన్నం కూడా తినకుండా అడవిలో తిరిగి తిరిగి అలసిపోతాను. అడవిలో తిరుగుతుంటే ఆకుతేల్లు, కందిరీగలు, కీటకాలు నన్ను ఎన్ని కుడతాయో ఏమి చెప్పను. ఒక్కొక్కసారి నేను కావలి కాసే ఆవు దూడలు కంచె దూకి వెళ్ళి, పక్కవాళ్ళ పంటపొలాలను పాడుచేస్తాయి. అప్పుడు ఆ పొలాల కావలి మనిషి నన్ను కొడుతుంటాడు. ఏం చేస్తాను. అన్నీ భరిస్తాను.

నా యజమాని నాకు కుంచెడు వడ్లు జీతంగా ఇస్తాడు. ఆ వడ్లలో తాలువడ్లు, పొట్టు, కల్తీ వడ్లు ఉంటాయి. కొలత కూడా సేరు తక్కువగా ఉంటుంది. నా యీడు పిల్లలందరు చక్కగా బడికి వెళ్ళి చదువుకుంటుంటే, బడికి పోలేని నా బతుకును తలచుకుంటూ, నా జీవితంలో వెలుగు లేదని బాధపడతాను.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

(లేదా)
ప్రశ్న 2.
కింది బొమ్మను చూడండి. పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి సంభాషణలు రాయండి.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా! 2

జవాబు.

సంభాషణలు

రాజు : సోమూ ! ఏమిటిరా ? బడికి రాకుండా ఇక్కడ రాతిబండ మీద కూర్చున్నావు ?
సోము : రామూ ! నేను బడి మానేశానురా. పశువులను కాస్తున్నా.
రాజు : బడి మానేస్తే ఎలాగురా ?
సోము : ఏమి చేయమంటావురా ? మేం పేదవాళ్ళం. అమ్మానాన్నా కూలీపని చేస్తారు. వాళ్ళకు వచ్చే కూలీ చాలడం లేదు.
రాజు : అయితే ?
సోము : అందుకని మా వాళ్ళు నన్ను పశువుల కాపరిగా జీతానికి కుదిర్చారు.
రాజు : మరి నీవు చక్కగా చదువుకుంటే ఈ కష్టాలన్నీ తీరుతాయి కదా !
సోము : చదువుకోవాలంటే బట్టలకు, పుస్తకాలకు కూడా డబ్బులు లేవురా. చూడు చిరిగిన చొక్కా తొడుక్కున్నా. గోనెసంచిని కొప్పెరగా వేసుకున్నా. తాటిజగ్గలు చెప్పులుగా ధరించా.
రాజు : మరి ఇక్కడ నీకు తోడు ఎవరురా ?
సోము : ఇదిగో ! ఈ చేతికర్రే నాకు తోడు.
రాజు : సోమూ ! నా మాట విను. బడికి వచ్చి చక్కగా చదువుకో. ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి.
సోము : నా జీవితానికి వెలుగు లేదురా. ఏమి చేయను !
రాజు : నాకు బడికి వెళ్ళే సమయమైంది. వెళ్తున్నా.

V. పదజాల వినియోగం.

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ. మా అన్నయ్య బాగా చదివి సర్కారు కొలువు సంపాదించాడు.
జవాబు.
కొలువు = ఉద్యోగం

ఆ. పెందలాడే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
జవాబు.
పెందలాడే = ప్రొద్దు పొడవక మునుపు

ఇ. మా ఊరు పక్కనే ఏరు పారుతున్నది.
జవాబు.
ఏరు = నది

ఈ. నీ ముఖం ఏంటి అట్లా వెలవెలబోయింది ? ఏదైనా బాధ ఉన్నదా ?
జవాబు.
వెలవెలబోవు = వివర్ణమగు, కళ తప్పడం

2. కింది పట్టికలోని ప్రకృతి – వికృతి పదాలను జతపరుచండి.

అ. పసులు క. అడవి
ఆ. అంబ ఖ. గ్రాసం
ఇ. అటవి గ. పశువులు
ఈ. గాసం ఘ. అమ్మ

జవాబు.
అ. గ
ఆ. ఘ
ఇ. క
ఈ. ఖ

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి రాయండి.

ఉదా : నాయనమ్మ = ____________
జవాబు.
నాయన + అమ్మ

అ. నిజాశ్రమంబు = ____________
జవాబు.
నిజ + ఆశ్రమంబు – సవర్ణదీర్ఘ సంధి

ఆ. పోయితివయ్యా = ____________
జవాబు.
పోయితివి + అయ్యా – ఇత్వ సంధి

ఇ. నిజమూహింప = ____________
జవాబు.
నిజము + ఊహింప – ఉత్వసంధి

ఈ. వలయమందు = ____________
జవాబు.
వలయము + అందు – ఉత్వసంధి

ఉ. ముఖారవిందం = ____________
జవాబు.
ముఖ + అరవిందం – సవర్ణదీర్ఘసంధి

2. కింద విడదీసిన పదాలను కలిపి రాయండి.

అ. నిన్ను + అడుగ = ____________
జవాబు.
నిన్నడుగ – ఉత్వసంధి

ఆ. ఇడుమకు + ఓరి = ____________
జవాబు.
ఇడుమకోర్చి- ఉత్వసంధి

ఇ. ఇప్పుడు + ఏమిటి = ____________
జవాబు.
ఇప్పుడేమిటి – ఉత్వసంధి

ఈ. ఎవ్వరు + ఏమనిన = ____________
జవాబు.
ఎవ్వరేమనిన – ఉత్వసంధి = ____________
జవాబు.

ఉ. నిమిషము + ఏని = ____________
జవాబు.
నిమిషమేని – ఉత్వసంధి

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

3. కింద గీత గీసిన పదాలకు విగ్రహవాక్యాలను రాసి, సమాసము పేరు రాయండి.

అ. మనిషి జీవితంలో వెలుగునీడల వలె కష్టసుఖాలు వచ్చిపోతుంటాయి.
జవాబు.
వెలుగు, నీడ – ద్వంద్వ సమాసం.

ఆ. భూమ్యాకాశాలు ఎప్పుడూ కలువవు.
జవాబు.
భూమీ, ఆకాశమూ – ద్వంద్వ సమాసం.

ఇ. ధర్మాధర్మాలు ఆలోచించి పనిచేయాలి.
జవాబు.
ధర్మమూ, అధర్మమూ – ద్వంద్వ సమాసం.

ఈ. శాంత్యహింసలు భారతీయ ధర్మానికి మూలస్తంభాలు.
జవాబు.
శాంతీ, అహింసా – ద్వంద్వ సమాసం.

ఉ. సూర్యచంద్రులు లోకానికి వెలుగునిస్తారు.
జవాబు.
సూర్యుడూ, చంద్రుడూ – ద్వంద్వ సమాసం.

ఊ. జీవితంలో పైకి రావాలంటే నీతినిజాయితీలు చాలా ముఖ్యం.
జవాబు.
నీతీ, నిజాయితీ – ద్వంద్వ సమాసం.

ఋ. జాతరకు చిన్నపెద్దలు అందరూ తరలిపోతారు.
జవాబు.
చిన్నా, పెద్దా – ద్వంద్వ సమాసం.

ప్రాజెక్టు పని:

ప్రశ్న.
మీ ప్రాంతంలో బడికి పోకుండా ఉండే పిల్లల్ని కలువండి. వారెందుకు బడికి రావడంలేదో ‘బడి గురించి’ చదువు గురించి వారేమనుకుంటున్నారో వివరాలు సేకరించి నివేదిక రాయండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

TS 6th Class Telugu 11th Lesson Important Questions పల్లెటూరి పిల్లగాడా!

III. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
మీ ఊరిలోని అందాలను వర్ణిస్తూ రాయండి.
జవాబు.
మా గ్రామం ఎంతో అందంగా ఉంటుంది. చుట్టూరా కొబ్బరితోటలు, మామిడి వృక్షాలు ఎంతో శోభాయమానంగా ఉంటాయి. తెల్లవారుఝాము నుండే కోయిలల కుహూ కుహూ రావాలు, పక్షుల కిలకిలలు చెవులకు విందు చేస్తుంటాయి. గ్రామంలో ఉన్న దేవాలయం నుంచి మనసు పులకరించే మధుర భక్తిగీతాలు వినపడుతుంటాయి.

అదిగో ! మా గ్రామపు ఉన్నత పాఠశాల విద్యార్థులు కేరింతలు కొడుతూ, ఆడుతూ, పాడుతూ ఉత్తమ విద్యాభ్యాసం చేస్తూ పోటీ పరీక్షలలో మా గ్రామానికే వన్నె తెస్తున్నారు. ఇటువైపు చూస్తే చక్కని గ్రంథాలయం. నీడ నిచ్చే చెట్లు, వాటి కింద బల్లలు, బల్లలపై పిల్లలు, పెద్దలు, పుస్తకాలు, వార్తా పత్రికలు చదువుతూ లోక జ్ఞానాన్ని విశేషంగా సంపాదిస్తున్నారు.

అదిగో ! పెద్ద చెఱువు. దానిని పరిశుభ్రంగా ఉంచేందుకు, పశువులు ప్రవేశించకుండా చుట్టూతా ఇనుపకంచె వేశారు. దాని నుండి నీటిని యంత్రాల ద్వారా పరిశుభ్రం చేసి గ్రామం అంతటికీ మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు మా సర్పంచి. మా రైతులు వరి, పొగాకు, ప్రత్తి, మిరప వంటి పంటలు పండిస్తూ దేశానికే తలమానికంగా ఉన్నారు. ఎందరో కళాకారులున్నారు. ఇంతటి సుందరమైన గ్రామానికి రోడ్డు, బస్సు, బ్యాంకు సౌకర్యాలు కూడా ఉండడంతో నేను ఏనాడో ఊహించిన మా అందమైన పల్లెటూరు ఈనాటికి కన్నులపండువగా కనబడుతోంది.

ప్రశ్న 2.
బడికి పోయే తమ ఈడు పిల్లలను చూసి బాల కార్మికులైన పేద పిల్లలు ఎంత బాధకు లోనౌతారో తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

రామాజీ పేట,
X X X X X.

ప్రియమిత్రుడు నాగరాజుకు,

ఇక్కడ మేము క్షేమం. మీరంతా అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. మిత్రులతో కలిసి ఆటల్లో ఎన్నో బహుమతులను పొందాను. అమ్మానాన్నల అనురాగాన్ని పొందుతున్నాను. కాని ఇటీవల ఒక సన్నివేశం నన్ను బాధపెట్టింది. మా ఇంటికి దగ్గరలోని హెూటల్లో సర్వర్గా ఉన్న నా యీడు పిల్లవాణ్ణి యజమాని చితకబాదాడు. కారణం ఆకలికి తట్టుకోలేక ముందుగా టిఫిన్ తిన్నాడని. అతను ఏడుస్తుంటే బాధేసింది. నేను వెళ్ళి ఓదార్చాను.

అప్పుడు ఆ అబ్బాయి తన సంగతులన్నీ చెప్పాడు. తనకూ బాగా చదువుకోవాలని, గొప్పవాడు కావాలని ఉందని, చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం కావడంతో తనకీ కష్టాలు వచ్చాయని చెప్పాడు. అతనికే తల్లిదండ్రులుంటే జీవితం మరోలా ఉండేది. మనలాగే అతను సంతోషంగా ఉండేవాడు కదా ! ప్రభుత్వం చట్టం చేసినా అమలుచేయడంలో లోపం వల్ల బాలకార్మికులు ఇంకా బాధలు పడుతూనే ఉన్నారు. ఈ విషయం మీద నీ ఆలోచనలు వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
యస్. బాలసుబ్రహ్మణ్యం.

చిరునామా :
కె. నాగరాజు,
S/o సూర్యం,
దుద్దెడ,
మెదక్ జిల్లా.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

IV. భాషాంశాలు.

పర్యాయపదాలు:

ప్రశ్న 1.
తరలు = ____________
జవాబు.
ప్రయాణమగు, నడచు

ప్రశ్న 2.
గుండు = ____________
జవాబు.
బండరాయి, పెద్దరాయి

ప్రశ్న 3.
దొర = ____________
జవాబు.
ప్రభువు, అధికారి

ప్రశ్న 4.
తాలు = ____________
జవాబు.
పొల్లు, తప్ప గింజ

ప్రశ్న 5.
వెలవెలబోవు = ____________
జవాబు.
వివర్ణమగు, కళ తప్పు

ప్రశ్న 6.
అడవి = ____________
జవాబు.
అటవి, అరణ్యం, కాన

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

నానార్థాలు:

ప్రశ్న 1.
పశువు = ____________
జవాబు.
ప్రాణి, జంతువు, పశుప్రాయుడు

ప్రశ్న 2.
కవి = ____________
జవాబు.
కావ్యకర్త, శుక్రుడు, వాల్మీకి, పండితుడు

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
గుంపు = ____________
జవాబు.
గుంపు = మంద
ఒక కాకికి కష్టమొస్తే తోటి కాకులన్నీ గుంపుగా చేరతాయి.

ప్రశ్న 2.
కార్మికులు = ____________
జవాబు.
శ్రమజీవులు
కార్మికుల కష్టంతోనే మనం తిండి తింటోంది.

ప్రశ్న 3.
అర్ధాకలి = ____________
జవాబు.
అర్ధాకలి = సగం తీరిన ఆకలి
దేశంలో ఎందరో అర్ధాకలితో జీవిస్తున్నారు.

ప్రశ్న 4.
పంట పొలాలు = ____________
జవాబు.
పంట పొలాలు = పైరుతో నిండుగా ఉన్న పొలాలు
పల్లెటూళ్ళు పాడి పశువులతో, పంట పొలాలతో అలరారుతుంటాయి.

ప్రశ్న 5.
పాలబుగ్గలు = ____________
జవాబు.
పాలబుగ్గలు = లేత బుగ్గలు
పసిపాపలు పాలబుగ్గలతో ముద్దు గొలుపుతారు.

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

వ్యాకరణాంశాలు:

ప్రశ్న 1.
అన్నయ్య బాగా చదివి, ఉద్యోగం సంపాదించాడు – ఇది ఏ వాక్యం ?
జవాబు.
సంక్లిష్ట వాక్యం.

ప్రశ్న 2.
పెందలాడే లేచి, వ్యాయామం చేయాలి – గీత గీసిన పదం ఏ క్రియ ?
జవాబు.
అసమాపక క్రియ

ప్రశ్న 3.
అతడు పనికి కుదిరాడు – ఏ భాషాభాగం ?
జవాబు.
సర్వనామం

ప్రశ్న 4.
బడి, పాఠశాల, గంట, గుడి – వీనిలో సంబంధం లేని పదం ఏది ?
జవాబు.
గుడి

ప్రశ్న 5.
‘పశువులు’ – ఏ వచనం ?
జవాబు.
బహువచనం

ప్రశ్న 6.
‘నేను చదువను’ – వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
జవాబు.
నేను చదువుతాను.

ప్రశ్న 7.
చర్మం, గుడ్డ, అధికం, సస్యం – వీనిలో సంయుక్తాక్షర పదాలేవి ?
జవాబు.
చర్మం, సస్యం

ప్రశ్న 8.
జీతం, పశువు, ధాన్యం, కీటకం – వీనిలో పరుషాక్షర పదాలేవి ?
జవాబు.
జీతం, కీటకం

ప్రశ్న 9.
అంతస్థములేవి ?
జవాబు.
‘య, ర, ల, ‘వ’ లు

ప్రశ్న 10.
నెమలి, వాణి, హంస, కంస వీనిలో నపుంసక లింగాలేవి ?
జవాబు.
నెమలి, హంస

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

పాటకు – అర్థాలు – భావాలు:

1. పల్లెటూరి పిల్లగాడ
పసులగాచే మొనగాడ
పాలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో

అర్థాలు :

పసులు = పశువులు
జీతగాడు = జీతము తీసుకొని పని చేసేవాడు, సేవకుడు, నౌకరు
కొలువు = ఉద్యోగం

భావం:
ఓ పల్లెటూరి పిల్లగాడా ! పశువులను కాపలాకాసే వీరుడా ! నీవు తల్లి దగ్గర పాలు త్రాగడం మాని ఎన్ని రోజులయ్యిందో తెలియదు. ఓ పాలబుగ్గల జీతగాడా ! నీవు పనిచేసే ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళయ్యిందో చెప్పు.

2. చాలి చాలని చింపులంగి
సగము ఖాళీ చల్లగాలి
గోనెచింపు కొప్పెర పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ
దానికి చిల్లులెన్నో లెక్కపెట్టావా

అర్థాలు :
చాలి చాలని = తొడుక్కోడానికి సరిగా సరిపోని
చింపులంగి (చింపులు + అంగి) = చిరిగిపోయిన చొక్కా
కొప్పెర = తలపై నుండి కప్పుకొనే ఒక వస్త్రం
చిల్లులు = రంధ్రాలు

భావం:
పిల్లవాడా ! నీవు వేసుకోడానికి సరిగా సరిపోని చిరిగిపోయిన చొక్కా వేసుకున్నావు. నీ శరీరం సగం పైకి కనబడుతోంది. నీకు అందుకే చలిగాలి తగులుతోంది. నెత్తిపై చిరిగిన గోనె, టోపీగా పెట్టుకొన్నావా ? దానికి ఎన్నో చిల్లులు ఉన్నాయి. చూశావా ?

3. తాటిజెగ్గలా కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడ
చేతికర్రే తోడైపోయిందా

అర్థాలు :

తాటిజెగ్గలు = తాటిచెట్టు మట్టలు మార్గం
బాట = మార్గం

భావం:
తాటిచెట్టు మట్టలతో తయారుచేయించి కాలిజోడు ధరిస్తావు. తప్పటడుగులు అంటే తూలిపోతూ నడుస్తావు. నీకు రోడ్డు మార్గాలతో పని లేకుండా పోయింది. నీ చేతి కర్రే నీకు సహాయంగా ఉన్నది కదా !

4. గుంపు తరలే వొంపులోకి
కూరుచున్నవు గుండుమీద
దొడ్డికీవే దొరవై పోయావా ఓ పాలబుగ్గల జీతగాడ
దొంగ గొడ్ల నడ్డగించేవా

అర్థాలు :

తరలు = ప్రయాణమగు, నడచు
గుంపు = మంద
గుండు = పెద్ద అయి, బండతాయి
దొడ్డి = పశువుల కొట్టం
దొర = ప్రభువు, అధికారి

భావం:
ఓ పిల్లవాడా ! పశువుల గుంపు పోయే వంపులో ఉన్న బండరాయి మీద కూర్చుంటావు. దొంగతనంగా జొరబడే పశువులను నీ దొడ్డిలోకి రాకుండా ఆపుతావు. నీ దొడ్డికి నీవే దొరవు అయ్యావా ?

5. కాలువై కన్నీరుగార
కండ్లపై రెండు చేతులాడ
వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
ఎవ్వ రేమన్నారో చెప్పేవా

అర్థాలు :

జీతగాడు = నౌకరు, సేవకుడు

భావం :
ఓ పాలబుగ్గల పనివాడా ! కన్నీరు కాలువలా ప్రవహించేలా, కళ్ళను చేతులతో నలుపుకుంటూ, వెక్కివెక్కి బాటతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడ ఏడుస్తున్నావా ? నిన్ను ఎవరైన ఏమన్న మాటలతో చేతికర్రే తోడైపోయిందా బాధించారా ?

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

6. పెందలాడ అమ్మనీకు
పెట్టలేదా సద్దికూడు
ఆకలిగొని అడలుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
అడవి తిరిగి అలిసి పోయావా

అర్థాలు :
పెందలాడ = ప్రొద్దుపోవక మునుపు
సద్దికూడు = చద్ది అన్నం

భావం :
ఓ పాలబుగ్గల జీతగాడా ! నీకు మీ అమ్మ ఈ రోజు ఉదయమే చద్ది అన్నం పెట్టలేదా ? అందువల్ల ఆకలి వేసి ఏడుస్తున్నావా ? అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి ఏడుస్తున్నావా ? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు.

7. ఆకుతేల్లు కందిరీగలు
అడవిలో గల కీటకాదులు
నీకేమైన కాటువేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
నిజము దాచక నాతో చెప్పేవా

అర్థాలు :

ఆకుతేల్లు = ఆకులు తినే పురుగులు
కాటు = కరచుట

భావం :
ఓ పాలబుగ్గల జీతగాడా! అడవిలో ఆకు తినే పురుగులో, కందిరీగలో లేదా ఇతర కీటకాలో నిన్నేమైన కుట్టాయా ? నిజం దాచకుండా నీ విచారానికి కారణం ఏమిటో నాకు చెప్పవా?

8. మాయదారి ఆవుదూడలు
మాటిమాటికి కంచె దుంకీ
పంటచేలు పాడుచేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
పాలికాపు నిన్నే కొట్టాడా

అర్థాలు :

దుంకీ = దూకి
పాడుచేయు = నాశనం చేయు
పాలికాపు = పంట కాపరి

భావం:
ఓ పాలబుగ్గల జీతగాడా ! మాయదారి ఆవుదూడలు మాటిమాటికి చేను చుట్టూ వేసిన ముండ్లకంచెపై నుండి దుంకి వేరేవాళ్ళ పంట పొలాలను పాడుచేశాయా ? అది చూసిన ఆ కావలి మనిషి నిన్ను కొట్టాడా ? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు.

9. నీకు జీతం నెలకు కుంచం
తాలు వరిపిడి కల్తీగాసం
కొలువగా పేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ
తలుచుకుంటే దుఃఖ మొచ్చిందా

అర్థాలు :

కుంచం = నాలుగు మానికల కొలమానం (నాలుగు సోలలు) (దాదాపు ఏడున్నర కిలోలకు సమానం)
తాలు = పొల్లు, తప్పగింజ, ఎన్నుతీసి ఎండిపోయిన పైరు (పొల్లు గింజలలో బియ్యం ఉండదు)
తాలువరి = చెత్తరకపు ధాన్యం
పిడి = పిడికెడ
కల్తీగాసం = కల్తీ తిండి (వరిధాన్యం కల్తీవి కొలిచేవారని అర్థం)
సేరు = కొలమానం (కుంచానికి నాలుగు పేర్లు)

భావం :
ఓ పాలబుగ్గల జీతగాడా ! నీకు నెలకు జీతం కుంచెడు వడ్లు. అందులో పొల్లు ధాన్యం పిడికెడు కల్తీ ఉండేది. ఇంటికి తెచ్చి కొలిస్తే పేరు ధాన్యం తక్కువగా వచ్చేవి. అది తలచుకొని ఏడుస్తున్నావా ? చెప్పు. పాఠశాల ముందుచేరి

10. పాఠశాల ముందుచేరి
తోటి బాలుర తొంగి చూసి
ఏటికోయీ వెలవెల బోతావు ఓ పాలబుగ్గల జీతగాడ
వెలుగులేని జీవితమంటావా

అర్ధాలు:

ఏటికోయి = ఎందుకోయి
వెలవెలబోతావు = తెల్లబోతావు

భావం :
ఓ పాలబుగ్గల జీతగాడా ! నీవు బడి ముందర నిలబడి, బడిలో చదివే నీ యీడు పిల్లలను చూసి ఎందుకు అలా తెల్లబోతున్నావు ? నీది కాంతిరేఖ లేని జీవితమని బాధపడుతున్నావా ?

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

పాఠం / ఉద్దేశం:

గ్రామాల్లోని కొంతమంది బీదపిల్లలు బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. కూలి పనులకు పోతున్నారు. ఎండలో, వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు. అర్ధాకలితో జీవిస్తున్నారు. వారు పడే కష్టాలను, కన్నీళ్ళను మనకు తెలియజేస్తూ అటువంటి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనల్ని రేకెత్తింప చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ‘పాట’ అనే ప్రక్రియకు సంబంధించినది. ఒక పల్లవి, కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురించిన “పల్లెటూరి పిల్లగాడ !” అనే పాటల సంకలనం లోనిది.

కవి పరిచయం:

పాఠ్యభాగం : పల్లెటూరి పిల్లగాడా !
పాఠ్యభాగ రచయిత : సుద్దాల హనుమంతు.
కాలం : 1910 – 1982 మధ్యకాలంలోని వాడు.
జన్మస్థలం : యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామం.
తల్లిదండ్రు : తల్లి లక్ష్మీనరసమ్మ, తండ్రి బుచ్చిరాములు.
ఉద్యోగం : వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
ఇతర విశేషాలు : ఈయన హేతువాదిగా పేరు పొందాడు. అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టలదొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు.
రచనాసరళి :
సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి.

ప్రవేశిక :

పల్లెల్లో నివసించే కొందరు బీదపిల్లలు సరైన తిండి లేక, బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. అడవుల్లో తిరుగుతు, అడవి జంతువులతో, కీటకాలతో అపాయాలను ఎదురుకుంటున్నారు. చాలీచాలని జీతం తీసుకుంటూ యజమానుల వేధింపులను భరిస్తున్నారు. బడికి పోయే తమ ఈడు పిల్లలను చూస్తూ ఎంతో బాధకు లోనౌతున్నారు. అటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఈ పాఠంలో చూద్దాం.

సారాంశం:

ఓ పల్లెటూరి పిల్లగాడా ! నిన్నగాక మొన్న పాలు తాగుతూ, చిన్నపిల్లాడిలా తిరుగుతూ కనిపించేవాడివి. అప్పుడే పశువులను కాయడంలో మొనగాడివైపోయావా ? పాలుగారే బుగ్గలతో చిన్న వయసులో జీతానికి పనిచేయవలసిన దుస్థితి నీకు ఎందుకు వచ్చిందో కదా !

నీ ఒంటికి చాలీ చాలని చినిగిపోయిన అంగి చల్లని గాలి నుండి నిన్ను కాపాడటం లేదు కదా ! అందుకే గోనెసంచిని కొప్పెరగా వేసుకున్నవా? మరి దానికున్న రంధ్రాలు ఎన్నో చూశావా ? అది కూడా నిన్ను కాపాడటం లేదు కదా!

తాటిజగ్గలను చెప్పులుగా చేసుకున్నావు. కాని అవి నిన్ను సరిగా నడువనీయడం లేదు కదా ! దాంతో నీకు తొవ్వ అవసరం లేకుండ నీ చేతికర్రే నీకు సహాయంగా ఉన్నది కదా!
మందలు పోయే వంపులో ఉన్న బండరాయి మీద కూర్చుంటావు. దొంగతనంగా జొరబడే పశువులను నీ దొడ్డిలోకి రాకుండా ఆపుతావు. నీ దొడ్డికి నీవే దొరవు అయ్యావా ? ఇంత లేతవయసులో ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నావో కదా!

నిన్ను ఎవరైనా ఏమన్న మాటలతో బాధించారా ? కాలువల్లాగా నీ కండ్ల నుంచి కారే కన్నీళ్లను నీ చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తున్నావు ? నీ కష్టాలు, యజమాని పెట్టే బాధలు గుర్తుకొస్తున్నాయా ?

పొద్దున అమ్మ నీకు సద్ది అన్నం పెట్టలేదా ? అడవిలో తిరిగి తిరిగి ఆకలితో అలసిపోయావా ?
అడవిలో ఆకుతినే పురుగులో, కందిరీగలో లేదా ఇతర కీటకాలో నిన్నేమైన కుట్టాయా ? నిజమేంటో నాకు చెప్పవా? మాయదారి ఆవుదూడలు మాటి మాటికి కంచెపై నుండి దుంకి వేరే వాళ్ళ పంటపొలాలను పాడుచేశాయా ? అది చూసిన ఆ కావలిమనిషి నిన్ను కొట్టాడా ?

నీకు నెలకు జీతం కుంచెడు వడ్లు. నీకు కొలిచిన జీతం వడ్లలో తాలువడ్లు, పొట్టు, కల్తీవడ్లు ఉన్నాయా ? కొలిస్తే సేరు తక్కువగా ఉన్నాయా ? అది తలుచుకొని ఏడుస్తున్నావా ?
బడి ముందర నిలబడి, బడిలో చదివే నీ ఈడుపిల్లలను చూసి, ముఖాన్ని ముడుచుకున్నావు. బడికి పోలేని నీ బతుకును తలుచుకుంటూ ఏడుస్తున్నావా ? జీవితంలో వెలుగు లేదని బాధపడుతున్నావా ?

TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా!

నేనివి చేయగలనా?

  • పాటను రాగంతో, అభినయంతో పాడగలను. – అవును/ కాదు
  • అపరిచిత పేరాను చదివి, జవాబులు రాయగలను. – అవును/ కాదు
  • ‘పిల్లల జీవితాలు చదువుకుంటేనే బాగుపడతాయి’ అనే అంశాన్ని సమర్థిస్తూ రాయగలను. – అవును/ కాదు
  • పల్లెటూరి పిల్లగాని జీవితాన్ని ఆత్మకథగా రాయగలను. – అవును/ కాదు

Leave a Comment