AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

Students get through AP Inter 1st Year Botany Important Questions 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Botany Important Questions 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
పిండకోశంలోని స్త్రీ బీజకణ పరికరంలోని కణాలేవి?
జవాబు:
ఒక స్త్రీ బీజం (అండకణం) మరియు రెండు సహాయకణాలు .

ప్రశ్న 2.
పరాగరేణువు యొక్క అవిరుద్ధ స్థితిని తెలుసుకొనే అండకోశ భాగాన్ని తెలపండి?
జవాబు:
కీలాగ్రము

ప్రశ్న 3.
బీజదళాలు, అండాంతఃకణజాలం నిర్వహించే ఉమ్మడి విధులను పేర్కొనండి?
జవాబు:

  1. బీజదళాలు మరియు అండాంతః కణజాలం ఉమ్మడిగా నిర్వహించే విధి ‘ఆహారపదార్ధాల’ నిల్వ
  2. అండాంతః కణజాలం అభివృద్ధి చెందుతున్న ‘పిండకోశం’ కు ఆహారాన్ని అందస్తుంది.
  3. బీజదళాలు అభివృద్ధి చెందుతున్న ‘పిండం’ కు ఆహారాన్ని అందిస్తాయి.

ప్రశ్న 4.
అండకోశంలోని ఏ భాగాలు ఫలాలు, విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి.
జవాబు:

  1. అండాశయం ఫలంగా అభివృద్ధి చెందుతుంది.
  2. అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 5.
బహుపిండతలో, ఒక పిండం సహాయకణాల నుంచి, మరొకటి అండాంతఃకణజాలం నుంచి ఏర్పడితే, దీనిలో ఏది ఏకస్థితికం, ఏది ద్వయస్థితికం?
జవాబు:

  1. సహాయకణాల నుండి ఏర్పడిన పిండం ఏకస్థితికంగా ఉంటుంది.
  2. అండాంతః కణజాలం నుండి ఏర్పడిన పిండం ద్వయస్ధితకంగా ఉంటుంది.

ప్రశ్న 6.
ఫలదీకరణ జరగకుండా, అసంయోగజన్య పిండకోశం ఒక ద్వయస్థితిక పిండాన్ని ఏర్పరచగలదా? మీ సమాధానం అవును, అయితే ఎలా, వివరించండి.
జవాబు:

  1. అవును. ఫలదీకరణం జరగకుండానే అసంయోగజన్య పిండకోశం ఒక ద్వయస్థితిక పిండాన్ని ఏర్పరచగలదు.
  2. ఇవి ఫలదీకరణం చెందని స్త్రీ బీజం నుండి లేదా ప్రత్యక్షంగా అండాంతః కణజాలం నుండి ఏర్పడతాయి.

ప్రశ్న 7.
మూడు కణాల దశలో విడుదలయ్యే పరాగరేణువులో కనిపించే మూడు కణాలు ఏవి?
జవాబు:
ఒక శాకీయ కణం మరియు రెండు పురుషసంయోగబీజాలు.

ప్రశ్న 8.
స్వయం విరుద్ధత (Self-incompatibility) అంటే ఏమిటి?
జవాబు:
ఒక పుష్పం యొక్క పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినపుడు అది మొలకెత్తలేకపోవడాన్ని ‘స్వయం విరుద్ధత’ అంటారు.

ప్రశ్న 9.
స్వయం విరుద్ధత చూపే మొక్కలలో ఏ రకమైన పరాగ సంపర్కం జరుగుతుంది?
జవాబు:
స్వయం విరుద్ధత ప్రదర్శించే మొక్కలలో పరపరాగసంపర్కం జరుగుతుంది. ఉదా: అబ్యూటిలాన్ (జీనోగమి)

ప్రశ్న 10.
8-కేంద్రకాలు, 7- కణాలతో ఉన్న పక్వ పిండకోశ పటాన్ని గీసి, ఈ కింద పేర్కొన్న వాటిని గుర్తించండి.
ప్రతిపాదకణాలు, సహాయకణాలు, స్త్రీ బీజకణం, కేంద్రకకణం, ధ్రువకేంద్రకాలు.
జవాబు:
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 1

ప్రశ్న 11.
ఒక ఫలదీకరణ చెందిన అండంలో త్రయస్థితిక కణజాలం ఏది? ఈ త్రయస్థితిక స్థితి అనేది ఏ విధంగా సాధించబడింది?
జవాబు:

  1. ఫలదీకరణం చెందిన అండాశయంలో త్రయస్ధితిక కణజాలం పేరు ‘అంకురచ్ఛదం’.
  2. రెండవ ఏకస్థితిక పురుషసంయోగబీజం మరియు ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం జరపడంతో ‘త్రయస్ధితిక ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం’ (PEN) ఏర్పడుతుంది.

ప్రశ్న 12.
పరాగ సంపర్కం, ఫలదీకరణ అనేవి అసంయోగ జననంలో అవసరమా? కారణాలు తెలపండి.
జవాబు:

  1. లేదు. అసంయోగ జననం అనేది ఒకరకపు అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం.
  2. కొన్ని జాతులలో, ద్వయస్థితిక అండకణం క్షయకరణ విభజన జరగకుండానే ఏర్పడుతుంది. ఇది ఫలదీకరణం జరగకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది.
  3. అసంయోగ జననం అనేది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వలన పరాగసంపర్క సహకారులు లేనప్పుడు జరిగే ప్రత్యుత్పత్తి విధానం.

ప్రశ్న 13.
నీటి మొక్కలలో పరాగ సంపర్కం ఏ విధంగా జరుగుతుంది?
జవాబు:
నీటిమొక్కలలో పరాగసంపర్కం రెండు రకాలుగా జరుగుతుంది.

  1. ఊర్ధ్వజలపరాగ సంపర్కం: పరాగ సంపర్కం నీటి ఉపరితలం పై జరుగుతుంది. ఉదా: వాలిస్ నేరియా
  2. అధోజలపరాగ సంపర్కం: పరాగసంపర్కం నీటి ఉపరితలం లోపలివైపు జరుగుతుంది. ఉదా: జోస్టెరా

ప్రశ్న 14.
ఆవృత బీజ మొక్కల పుప్పొడి రేణువు ఏర్పరిచే రెండు పురుష కేంద్రకాల విధులను తెలపండి.
జవాబు:

  1. ఒక పురుష సంయోగబీజం, ఒక స్త్రీబీజకణంతో సంయోగం చెంది ఒక ద్వయస్థితిక సంయుక్త బీజంను ఏర్పరుస్తుంది.
  2. రెండవ పురుష సంయోగబీజం మరియు ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది ‘త్రయస్ధితిక ప్రాధమిక అంకురచ్చద కేంద్రకాన్ని’ (PEN) ఏర్పరుస్తుంది.

ప్రశ్న 15.
ఆవృత బీజ పుష్పంలోని ఏయే భాగాలలో పురుష, స్త్రీ సంయోగ బీజదాలు అభివృద్ధి జరుగుతుంది?
జవాబు:

  1. సూక్ష్మసిద్ధబీజాలు పురుషసంయోగ బీజంగా అభివృద్ధి చెందుతాయి. ఇది ‘పరాగకోశంలో జరుగుతుంది.
  2. స్థూలసిద్ధబీజాలు స్త్రీసంయోగబీజంగా అభివృద్ధి చెందుతాయి. ఇది ‘అండాశయంలో జరుగుతుంది.

ప్రశ్న 16.
ఏక సిద్ధ బీజవర్థకాల (monosporic) స్త్రీ సంయోగ బీజద అభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:
ఒకే ఒక క్రియాత్మక స్థూలసిద్ధబీజం నుండి పిండకోశం ఏర్పడే విధానాన్ని ‘ఏకసిద్ధబీజ వర్ధక అభివృద్ధి’ అంటారు. దీనినే స్త్రీ సంయోగ బీజద అభివృద్ధి అంటారు.

ప్రశ్న 17.
ఆత్మ పరాగ సంపర్కం నివారణకు పుష్పాలు ఏర్పరుచుకొన్న రెండు ముఖ్యమైన అనుకూలన విధానాలను తెలపండి.
జవాబు:
1. భిన్న కాలిక పరిపక్వత: ఈ అనుకూలనంలో పుప్పొడి విడుదల, కీలాగ్రం దాని స్వీకరించుట అనేది భిన్నకాలాలో ఉంటుంది. ఉదా: కోకాస్ (కొబ్బరి)

2. హెర్కోగమీ: ఈ అనుకూలనంలో ‘పుష్పంలోని పరాగ కోశాలు, కీలాగ్రం వేరు వేరు స్థానాల్లో అమరి ఉండటం వల్ల పుప్పొడి కీలాగ్రాన్ని చేరే అవకాశం ఉండదు. ఉదా: మందార

ప్రశ్న 18.
ఫలదీకరణ చెందిన అండంలో, సంయుక్త బీజం ఎందువల్ల కొంతకాలం సుప్తావస్థ స్థితిలో ఉంటుంది?
జవాబు:

  1. సంయుక్త బీజం పిండకోశంగా అభివృద్ధి చెందుటకు ‘పోషణ’ చాలా అవసరం.
  2. కావున అంకురచ్ఛదం ఏర్పడేంత వరకు సంయుక్త బీజం కొంతకాలం వరకు సుప్తావస్థ స్థితిలో ఉంటుంది.

ప్రశ్న 19.
వృద్ధికారక పదార్థాల్ని ఉపయోగించి ప్రేరిత అనిషేకఫలనమును ప్రోత్సహించిన, మీరు ఏ ఫలాలను ఈ ప్రేరిత అనిషేక ఫలనము కొరకు ఎంచుకొంటారు? ఎందువల్ల?
జవాబు:

  1. అరటి మరియు ద్రాక్ష అనిషేక ఫలాలు
  2. వీటి యందు విత్తనాలు లేకుండా ఉండుట మరియు వాటికి గుజ్జు అధికంగా ఉండటం వలన వాటిని రసం తయారీకి మరియు జామ్ తయారీకి వాణిజ్యపరంగా ఉపయోగించవచ్చు.

ప్రశ్న 20.
స్కూటెల్లమ్ అంటే ఏమిటి? ఏ రకం విత్తనాలలో అది ఉంటుంది?
జవాబు:

  1. పిండంలో పెద్దదిగా డాలు ఆకారంలో ఉండే బీజదళాన్ని ‘స్కూటెల్లమ్’ అంటారు.
  2. ఇది ‘ఏకదళ బీజాల’లో ఉంటుంది. ఉదా: ద్రాక్ష, మొక్కజొన్న.

ప్రశ్న 21.
అంకురచ్ఛదయుతం, అంకురచ్ఛదరహిత విత్తనాలను సోదాహరణంగా నిర్వచించండి.
జవాబు:
1. అంకురచ్ఛదయుత విత్తనాలు: ఇవి అంకురచ్ఛదంను వినియోగించుకొని పరిపక్వం చెంది ఏర్పడిన విత్తనాలు. వీటిని అంకురచ్ఛదయుత విత్తనాలు అంటారు.
ఉదా: ఏక దళబీజ విత్తనాలైన కొబ్బరి, ఆముదం.
ద్విదళబీజ విత్తనాలైన ప్రత్తి, కాఫీ.

2. అంకురచ్ఛద రహిత విత్తనాలు: ఇవి అంకురచ్ఛిదం లేకుండా పక్వం చెందిన విత్తనాలు. వీటిని అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటారు.
ఉదా: ద్విదళ బీజాలైన చిక్కుడు, బఠాణి.
ఏకదళ బీజాలైన వాలిన్నేరియా, పోతర్

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఆత్మ పరాగ సంపర్కం (ఆత్మ ఫలదీకరణ) నిరోధించడానికి ఒక వికసించే ద్విలింగ పుష్పం ఏర్పరుచుకొన్న అనుకూలనాలలో మూడింటిని గురించి వ్రాయండి. [AP M-15]
జవాబు:
ఆత్మ పరాగ సంపర్కంను నిరోధించడానికి ద్విలింగ పుష్పాలు చూపే అనుకూలనాలు.

  1. భిన్నకాల పక్వత
  2. హెర్కోగమీ
  3. ఆత్మవంధ్యత్వం.

1. భిన్నకాల పక్వత: ఫలదీకరణ ఆవశ్యక అంగాలు అయిన కేసరావళి మరియు అండకోశం వేరు వేరు సమయాలలో పక్వానికి వస్తే దానిని ‘భిన్నకాల పక్వత’ అని అంటారు. ఇది రెండు రకాలు
a. పుంభాగ ప్రథమోత్పత్తి: స్త్రీ లైంగిక అంగాల కంటే ముందే పురుష లైంగిక అంగాల విడుదల జరుగును. అనగా కీలాగ్రం పక్వదశకు చేరక ముందే పుప్పొడి విడుదల అవుతుంది. ఉదా: సూర్యకాంతం (సన్ఫ్లవర్)

b. స్త్రీ భాగ ప్రథమోత్పత్తి: పురుష లైంగిక అంగాలు కంటే ముందే స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాల విడుదల జరుగును. అనగా కీలాగ్రం పక్వదశకు చేరినా, పుప్పొడి విడుదల అవదు. ఉదా: దతూర

2. హెర్కోగమీ: ఈ అనుకూలనంలో ‘పుష్పంలోని పరాగ కోశాలు, కీలాగ్రం వేరు వేరు స్థానాల్లో అమరి ఉండటం వల్ల పుప్పొడి కీలాగ్రాన్ని చేరే అవకాశం ఉండదు. ఉదా: మందార

3. అత్మవంధ్యత్వం:ఒక పుష్పం యొక్క పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినపుడు అది మొలకెత్తలేకపోవడాన్ని ‘ఆత్మ వంధ్యత్వం’ లేదా ‘స్వయం విరుద్ధత’ అంటారు.
ఉదా: అబ్యుటిలాన్ (తుత్తురు బెండ), ఫాసిఫ్లోరా.

ప్రశ్న 2.
కృత్రిమ సంకరణ పద్ధతిలో ఈ కింది సంభవాలను పరిశీలించడం జరిగింది. సంకరణ పద్ధతిలో పాటించే విధంగా, వీటిని ఒక సరియైన వరుస క్రమంలో అమర్చండి.
a) రీ-బ్యాగింగ్
b) జనకుల ఎంపిక
c) బ్యాగింగ్
d) కీలాగ్రంపై పుప్పొడి చల్లుట
e) విపుంసీకరణం
f) పురుష మొక్క నుండి పొప్పొడిని సేకరించుట.
జవాబు:
b, e, c, f, d, a
b) జనకుల ఎంపిక
e) విపుంసీకరణ
c) బ్యాగింగ్
f) పురుషమొక్కల నుండి పుప్పొడి సేకరణ
d) కీలాగ్రంపై పుప్పొడి చల్లుట
a) రీ – బ్యాగింగ్

ప్రశ్న 3.
అండంలోనికి పరాగనాళం ప్రవేశించే వివిధ పద్ధతులను, పటాల సహాయంతో చర్చించండి. [AP M-22] [TS M-18]
జవాబు:
అండంలోనికి పరాగనాళం మూడు పద్ధతులలో ప్రవేశిస్తుంది. అవి.

  1. రంధ్ర సంయోగం: పరాగనాళం అండంలోని అండద్వారం ద్వారా ప్రవేశించుట. ఉదా: హైబిస్కస్, ఒట్టిలియా
  2. చలాజోగమి: పరాగనాళం, అండంలోని చలజా ద్వారా ప్రవేశించుట. ఉదా: కాజురైనా
  3. మధ్య సంయోగం: పరాగనాళం, అండంలోని అండకవచాల ద్వారా ప్రవేశించుట. ఉదా: కుకుర్బిటా.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 2

ప్రశ్న 4.
సూక్ష్మ సిద్ధ బీజజననం, స్థూల సిద్ధ బీజజననంల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి? వీటిలో ఏ రకమైన కణ విభజన జరుగుతుంది? ఈ రెండు సంఘటనలకు చివరగా ఏర్పడే నిర్మాణాలు ఏవి?
జవాబు:
సూక్ష్మ సిద్ధ బీజజననం

  1. ఇందులో ‘సూక్ష్మసిద్ధబీజాలు’ సూక్ష్మసిద్ధబీజ మాతృకణం నుండి క్షయకరణ విభజన ద్వారా ఏర్పడతాయి.
  2. నాలుగు సూక్ష్మసిద్ధబీజాలు ఏర్పడతాయి.
    ఇవన్నీ క్రియాత్మకం.
  3. ఈ ప్రక్రియ కేశరాల యొక్క పరాగకోశంలో జరుగుతుంది.

స్థూల సిద్ధ బీజజననం

  1. ఇందులో ‘స్థూలసిద్ధ స్థూల సిద్ధ బీజజననం బీజాలు’ స్థూలసిద్ధ బీజమాతృకణం నుండి క్షయకరణ విభజన ద్వారా ఏర్పడతాయి.
  2. నాలుగు స్థూల సిద్ధబీజాలు ఏర్పడతాయి . కాని ఒకటి మాత్రమే క్రియాత్మకం.
  3. ఈ ప్రక్రియ అండాంతః కణజాలం యొక్క అండాశయాలలో జరుగుతుంది.

 

  • వీటిలో క్షయకరణ విభజన జరుగుతుంది.
  • ఈ ప్రక్రియ చివరలో ఏర్పడే నిర్మాణాలు : సూక్ష్మ సిద్ధబీజాలు మరియు స్థూల సిద్ధబీజాలు.

ప్రశ్న 5.
బ్యాగింగ్ పద్ధతి అంటే ఏమిటి? మొక్కల ప్రజనన కార్యక్రమంలో ఈ విధానం ఉపయోగాన్ని తెలపండి?
జవాబు:

  1. బ్యాగింగ్ పద్ధతి:మొదటి దశలో కృత్రిమ సంకరణ పద్ధతిలో ద్విలింగ పుష్పాల నుండి కేసరాలు తొలగించబడతాయి. తరువాత దశలో పుష్పాలను బట్టర్ పేపర్తో తయారైన సంచులతో మూసి వేస్తారు. ఈ ప్రక్రియను ‘బ్యాగింగ్’ అంటారు.
  2. ఈ పద్ధతి వలన అవాంఛనీయ పరాగ కేశాలు కీలాగ్రమును చేరకుండా నిరోధించవచ్చు.

ప్రశ్న 6.
త్రిసంయోగం అంటే ఏమిటి? ఇది ఎక్కడ, ఎలా జరుగుతుంది. ఈ త్రిసంయోగంలో పాల్గొనే కేంద్రకాల పేర్లను పేర్కొనండి.
జవాబు:
త్రిసంయోగం: పిండకోశంలో ఉండే ద్వికేంద్రకానికి, రెండవ పురుష బీజకణం సంయుక్తం చెందడాన్ని త్రిసంయోగం అంటారు. ఫలితంగా త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం (PEN) ఏర్పడుతుంది. ఈ విధానంలో మూడు ఏకస్థితిక కేంద్రకాలు సంయోగం చెందుతాయి.
త్రిసంయోగంలో ఒక పురుష బీజకణం మరియు రెండు కేంద్రకాలు (ద్విధృవ కేంద్రకం) పాల్గొంటాయి.

ప్రశ్న 7.
ఈ క్రింది వాటి మధ్య వ్యత్యాసాన్ని చూపండి.
a) అధోబీజదళం, ఉపరి బీజదళం
b) ప్రాంకుర కంచుకం, మూలాంకుర కంచుకం
c) అండకవచం, బాహ్యబీజ కవచం (టెస్ట్గా)
d) పరిచ్ఛదం, ఫలకవచం
జవాబు:
a) అధోబీజదళం, ఉపరి బీజదళం
అధోబీజదళం

  1. పిండాక్షంలో బీజదళాల క్రింది ఉన్న స్థూపాకార భాగంను అధోబీజదళం అంటారు.
  2. దీని చివరి భాగం ప్రథమ మూలంగా మారుతుంది.

ఉపరి బీజదళం

  1. పిండాక్షంలో బీజదళాలకు పైన ఉన్న భాగాన్ని ఉపరిబీజదళం అంటారు.
  2. ఇది కాండంకొనగా మారుతుంది.

b) ప్రాంకుర కంచుకం, మూలాంకుర కంచుకం

ప్రాంకుర కంచుకం

  • ఉపరిబీజదళం ప్రకాండపు మొగ్గను మరియు కొన్ని పత్ర ఆద్యాలను కప్పుతూ బోలుగా ఉన్న నిర్మాణాన్ని ప్రాంకుర కంచుకం అంటారు.

మూలాంకుర కంచుకం

  • ప్రధమ మూలం మరియు వేరు తొడుగును కప్పుతూ విభేదనం చూపని పొరను మూలాంకుర కంచుకం అంటారు.

c) అండకవచం, బాహ్యబీజ కవచం (టెస్ట్గా)
అండకవచం

  • అండం ఒకటి (లేదా) రెండు రక్షణ కవచాలతో కప్పబడి ఉంటుంది. వాటినే అండకవచాలు అంటారు.

బాహ్యబీజ కవచం (టెస్టా)

  • ఫలదీకరణం తరువాత అండం యొక్క బాహ్య బీజకవచం నుండి ఏర్పడే పొరను టెస్టా అంటారు.

d) పరిచ్ఛదం, ఫలకవచం
పరిచ్ఛదం

  • పక్వం చెందిన విత్తనం లో మిగిలి ఉన్న అండాంతః కణజాలాన్ని పరిచ్ఛదం అంటారు.

ఫలకవచం

  • ఫలదీకరణ తర్వాత ఏర్పడిన ఫలం యొక్క బాహ్య కవచాల్ని ఫలకవచం అంటారు.

ప్రశ్న 8.
విపుంసీకరణ అంటే ఏమిటి? మొక్కల ప్రజనన కర్త ఎప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తాడు? ఎందువలన?
జవాబు:

  1. విపుంసీకరణ:ద్విలింగకపుష్పాలు మొగ్గదశలో ఉండగానే, పరాగకోశాలు స్ఫోటనం చెంది పరాగరేణువులను విడుదల చేయకముందే, పరాగకోశాలను శ్రావణం సహాయంతో తొలగించే విధానాన్ని విపుంసీకరణ’ అంటారు.
  2. ఈ ప్రక్రియ మొగ్గదశలో ఉన్నపుడే జరగాలి.
  3. కీలాగ్రాన్ని పంకిల పరిచే ఇతర అవాంఛనీయ లేదా అవసరం లేని పరాగరేణువులు నుండి ఈ ప్రక్రియ సహాయపడుతుంది.

ప్రశ్న 9.
అసంయోగ జననము అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యతను తెలపండి?
జవాబు:
1. అసంయోగ జననము : ఫలదీకరణం జరగకుండా విత్తనాలు ఏర్పడే విధానాన్ని అసంయోగజననం అంటారు.

  1. ఇది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం
  2. కొన్ని జాతులలో, ద్వయస్థితిక స్త్రీబీజకణం క్షయకరణ విభజనం జరగకుండా మరియు ఫలదీకరణం జరగకుండా పిండముగా అభివృద్ధి చెందుతుంది.
  3. పరాగ సంపర్క వాహకాలు లేని తీవ్రవాతావరణ పరిస్థితులలో ఇది ఖచ్చితమైన ప్రత్యుత్పత్తి విధానం.

2. ప్రాముఖ్యత:

  1. ఫలదీకరణం మరియు క్షయకరణ విభజన జరగదు. కావున వాంఛిత లక్షణాల పృథక్కరణ మరియు జన్యువుల పునఃసంయోజన జరగదు.
  2. దీని వలన వాంఛిత మరియు ఉత్తమ లక్షణాలు కొన్ని తరాల వరకు స్థిరంగా ఉంటాయి.
  3. వాణిజ్య పరంగా సంకరజాతి విత్తనాల ఉత్పత్తిలో అసంయోగ జననానికి విత్తన పరిశ్రమలో ఎంతో ప్రాముఖ్యం ఉన్నది.

ప్రశ్న 10.
వివిధ రకాల అండాల గురించి క్లుప్తంగా వ్రాయండి. [TS M – 19]
జవాబు:
అండాలు మూడు రకాలు

  1. నిర్వక్ర అండం
  2. వక్ర అండం
  3. కాంపైలోట్రోపస్ అండం

1. నిర్వక్ర అండం: ఇది నిటారుగా ఉండే అండం. ఇందులో అండద్వారం, చలాజ మరియు అండ వృంతం అన్ని ఒకే నిలువ రేఖపై అమరి ఉంటాయి. ఉదా: పాలిగోనమ్

2. వక్రఅండం: ఇది తల కిందులుగా ఉండే అండం. దీని అండద్వారం అండవృంతంకు దగ్గరగా అమరి ఉంటుంది. అండవృంతానికి 180° కోణంలో అండ దేహం వంపు తిరిగి ఉంటుంది. ఉదా: ప్రొద్దు తిరుగుడు కుటుంబం

3. కాంపైలో ట్రోపస్ అండం : ఇందులో అండదేహం అండవృంతానికి లంబకోణంలో ఉంటుంది. అండదేహం వంపు అండద్వారం కిందికి వంపు తిరిగి అండ వృంతానికి దగ్గరగా ఉన్నట్లు అమరి ఉంటుంది. దీని వలన పిండకోశం కూడా కొద్ది వంపు తిరిగి ఉంటుంది. ఉదా: చిక్కుడు కుటుంబం
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 3

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ద్విదళ బీజ మొక్కలోని సంయుక్త బీజం నుంచి వివిధ పిండాభివృద్ధి దశలను పటాలుగా గీయండి.
జవాబు:
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 4
a) ఫలదీకరణ చెందిన పిండకోశం సంయుక్త బీజం, ప్రాథమిక అంకురచ్చద కేంద్రకం (PEN)సూచిస్తూ b) ద్విదళ బీజ పిండాభివృద్ధిలోని వివిధ దశలు

ప్రశ్న 2.
వికసించే పుష్పాలలో సాధ్యమయ్యే పరాగ సంపర్క రకాలను తెలపండి. వాటికి కారణాలను తెల్పండి?
జవాబు:
వివృత సంయోగం (ఛాస్మోగమీ): పుష్పించే పుష్పాలలో జరిగే పరాగసంపర్కాన్ని వివృత సంయోగం అంటారు.
అది రెండు రకాలు

  1. ఆత్మపరాగసంపర్కం
  2. పరపరాగసంపర్కం

1. ఆత్మపరాగసంపర్కం(ఆటోగమి): ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరి పరాగసంపర్కం జరపడాన్ని ఆత్మపరాగసంపర్కం అంటారు. ఛాస్మోగమీ పుష్పాలలో పరాగకోశం మరియు కీలాగ్రం రెండూ ఒకే సమయంలో పక్వదశకు వచ్చినపుడే ‘ఆత్మపరాగపసంపర్కం’ జరిగే అవకాశం ఉంది. సంవృత సంయోగం అనేది ఒక రకమైన పరాగసంపర్కం. ఇది పుష్పించని పుష్పాలలలో జరుగుతుంది. ఈ సంవృత సంయోగ పుష్పాలు ఎప్పటికీ వికసించవు. ఈ పుష్పాలలో పరాగకోశాలు మరియు కీలాగ్రం దగ్గరగా ఉన్నప్పుడు పరాగకోశాలు విస్ఫోటనం చెంది పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరి సంపర్కం జరపడం అనేది జరుగుతుంది. పుష్పాలు పుష్పించకపోవడం వలన వీటిలో పరపరాగసంపర్కం జరిగే అవకాశంలేదు. ఆత్మపరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది.

2. పరపరాగ సంపర్కం: ఒక పుష్పంలోని పరాగరేణువులు వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరి సంపర్కం జరపడాన్ని ‘పరపరాగ సంపర్కం’ అంటారు. ఇది రెండు రకాలు
i. ఏకవృక్షపరపరాగసంపర్కం (గైటినోగమి) : ఒక మొక్కలోని ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే మొక్కలోని వేరొక పుష్పం కీలాగ్రాన్ని చేరి సంపర్కం జరపడాన్ని ‘ఏక వృక్షపరపరాగ సంపర్కం’ అంటారు. జన్యుపరంగా ఇది ‘ఆత్మపరాగసంపర్కం’ ను పోలి ఉంటుంది. ఉదా: కొబ్బరి (కొకస్)

ii. భిన్న వృక్ష పరపరాగ సంపర్కం (జీనోగమి): ఒక మొక్క యొక్క ఒక పుష్పంలోని పరాగరేణువులు వేరొక మొక్కలోని వేరొకపుష్పం కీలాగ్రాన్ని చేరి సంపర్కం జరపడాన్ని భిన్న వృక్ష పరపరాగ సంపర్కం అంటారు. ఈ సంపర్కం లో మాత్రమే జన్యుపరంగా వివిధ రకాల పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరతాయి.
ఉదా: తాడి చెట్టు (బొరాసస్)

మొక్కలు ఆత్మపరాగ సంపర్కంను నిరంతరంగా కొనసాగించినట్లయితే, ఆది ప్రజనన మాంద్యంకు దారి తీస్తుంది. కావున అనేక రకాల మొక్కలు పరపరాగసంపర్కం ద్వారా వైవిధ్యాలను ఏర్పరుచుకొని, జన్యుపరంగా వైవిధ్యతను సాధించగలిగాయి.

ప్రశ్న 3.
భాగములు గుర్తించిన చక్కటి పట సహాయంతో ఆవృత బీజ పక్వదశలోని పిండకోశమును వర్ణించండి. సహాయ కణాల పాత్రను సూచించండి? [TS M-19,20,22] [IPE- 14] [AP M-17,19]
జవాబు:
ఆవృత బీజ పక్వదశలోని పిండకోశములో 3 భాగాలుంటాయి.

  1. స్త్రీ బీజ పరికరం
  2. ప్రతిపాదకణాలు
  3. కేంద్రక కణం

1. స్త్రీ బీజ పరికరం:

  1. అండద్వారపు కొన దగ్గర ఉండే 3 కణాల సమూహాన్ని స్త్రీ బీజ పరికరం అంటారు.
  2. స్త్రీ బీజ పరికరంలో ఒక స్త్రీ బీజకణం, రెండు సహాయక కణాలు ఉంటాయి.
  3. అండ ద్వార కొన వైపుగా సహాయ కణాలపైన ప్రత్యేక కణ మండలాలు ఉంటాయి. వీటినే ఫిలిఫారమ్ పరికరాలు అంటారు.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 5
  4. స్త్రీ బీజ పరికరంలోని మధ్యలో ఉండే పెద్ద కణాన్ని స్త్రీ బీజకణం లేదా వూస్పోర్ అని అంటారు.

2. కేంద్రక కణం:

  1. పిండకోశంలో ఇదే పెద్ద కణం.
  2. ఇది రెండు ధ్రువ కేంద్రకాల సంయుక్తంగా ఉంటూ ద్వయ స్థితిక ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది.

3. ప్రతిపాదకణాలు:

  1. పిండకోశంలో చలాజవైపు ఉండే మూడు కణాలను ప్రతిపాద కణాలు అని అంటారు.
  2. ఇవి పిండకోశంలో చిన్నవిగా ఉండి ఫలదీకరణానికి ముందు లేదా తరువాత నశించిపోతాయి.
  3. అందుకే వీటిని పిండకోశంలో శాకీయ కణాలుగా పరిగణిస్తారు.

సహాయక కణాల పాత్ర:

  1. ఇవి అండాంతః కణజాలం నుండి పోషకాలను స్త్రీ బీజ కణానికి అందిస్తాయి.
  2. పిండకోశంలోని అండాంతః కణజాలం అహార పదార్థాలను గ్రహించుటకు ఉపయోగపడతాయి.
  3. స్త్రీ బీజకణంలోనికి పరాగనాళం ప్రవేశించుటకు సహాయపడతాయి.

ప్రశ్న 4.
సూక్ష్మ సిద్ధ బీజాశయ పటం గీసి దానిని ఆవరించిన కుడ్య పొరలను గుర్తించండి. కుడ్య పొరలను గూర్చి క్లుప్తంగా వ్రాయండి. [AP M-18,20,22]
జవాబు:
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 6
సూక్ష్మ సిద్ధ బీజాశయం 4 పొరలను కల్గి ఉండును. అవి:
సూక్ష్మసిద్ధ బీజాశయము ‘కుడ్యపొరలతో విస్తరించబడ్డ దృశ్యం’
1. బాహ్యచర్మం: వెలుపల, ఏకకణ మందంలో ఉండి సూక్ష్మసిద్ధ బీజాశయానికి రక్షణనిచ్చే పొరను బాహ్య చర్మం అంటారు. పుప్పొడి సంచుల మధ్య ఉండే కణాలు పలుచని గోడలతో నిర్మితమై ఉంటాయి.
ఆ ప్రదేశాన్ని ‘స్టోమియం’ అంటారు. ఇవి పుప్పొడి గదుల స్ఫోటనానికి సహాయపడుతాయి.

2. ఎండోథీసియం: ఇది బాహ్య చర్మం క్రింద ఉంటుంది. దీని కణాలు ఆవృతంగా సాగి తంతుయుత మందాలను కలిగి ఉంటాయి. పక్వ దశలో నీటిని కోల్పోయినపుడు అవి కుచించుకొని పుప్పొడి సంచుల స్ఫోటనానికి సహాయపడతాయి.

3. మధ్య వరుసలు: ఎండోథిసియం క్రింద 1 నుండి 5 వరుస పొరలతో, పలుచని కణకవచాలతో ఉండేవే ‘మధ్యవరుసలు’.

4. టపేటమ్: అన్నింటికంటే లోపలగా ఉండే పొర టపేటమ్. ఇది సిద్ధబీజ జనక కణజాలంను గుండ్రంగా ఆవరించి ఉంటుంది. టపేటమ్లోని కణాలు పెద్దవిగా, పలుచటి కణ కవచంతో, ఎక్కువ కణద్రవ్యంతో ఎక్కువ కేంద్రకాలను కల్గి ఉంటాయి. ఇది పరాగ రేణువులకు పోషక పదార్థాలను సరఫరా చేస్తుంది.

ప్రశ్న 5.
ఆవృత బీజ మొక్కలలో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి. [TS M-22][AP,TS M-15]
జవాబు:
ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం: పురుష బీజ కణం, స్త్రీ బీజ కణంతో సంయుక్తం చెందడాన్ని ‘ఫలదీకరణ’ అంటారు. ఆవృత బీజ మొక్కలలో జరిగే ఫలదీకరణలో 5 దశలు కలవు.
1. అండంలోని పరాగ నాళం ప్రవేశించుట: అండంలోనికి పరాగ నాళం 3 విధాలుగా ప్రవేశిస్తుంది.
a. రంధ్ర సంయోగం: పరాగనాళం అండద్వారం ద్వారా అండంలోనికి ప్రవేశించుట.
ఉదా: హైబిస్కస్
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 7

b. ఛలాజోగమి: పరాగనాళం చలాజా ద్వారా అండంలోనికి ప్రవేశించుట.
ఉదా: కాజురైనా

c. మధ్యసంయోగం: పరాగనాళం అండ కవచాల ద్వారా లేదా అండ వృంతం ద్వారా అండంలోనికి ప్రవేశించుట.
ఉదా: కుకుర్బిటా

2. పిండకోశంలోనికి పరాగనాళం ప్రవేశించుట:
పిండకోశంలోనికి పరాగనాళం ప్రవేశించేటప్పుడు, పరాగనాళాలు సహాయకణాలలోనికి ప్రవేశించడానికి ‘ఫిలిఫారమ్ పరికరాలు’ ఉపయోగపడతాయి.
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 8

3. పిండకోశంలో పురుష సంయోగ బీజాలు విడుదల: సాధారణంగా ఎక్కువశాతం పరాగనాళాలు పిండకోశంలోనికి అండ ద్వారం ద్వారా ప్రవేశిస్తాయి. పరాగనాళం ఒక సహాయక కణాన్ని ఛేదించుకొని ప్రవేశించడంతో, పరాగనాళం కొన భాగం విచ్ఛిన్నం అయి సహాయక కణం కణద్రవ్యంలో రెండు పురుష సంయోగ బీజాలను విడుదల చేస్తుంది.

4. సంయుక్త సంయోగం: ఒక పురుష బీజకణం, స్త్రీ బీజకణంతో సంయుక్తం చెంది, ద్వయస్థితిక సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీనినే సంయుక్త సంయోగం లేదా నిజ ఫలదీకరణ అంటారు. దీనిని స్ట్రాస్బెర్గర్ కనుగొన్నాడు.

5. ద్విఫలదీకరణ మరియు త్రిసంయోగం: రెండవ పురుష సంయోగబీజం, రెండు ధ్రువకేంద్రాలున్న కేంద్రక కణం వైపు కదిలి దానితో సంయోగం చెందుతుంది. ఫలితంగా ‘త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛధ కేంద్రకం’ ఏర్పడుతుంది.
దీనినే ద్విఫలదీకరణ అని, ఈ పద్ధతిలో ఒక ఏకస్థితిక పురుష బీజకణం, రెండు ద్వయ స్థితిక కేంద్రక కణాలతో సంయోగం చెందుటను ‘త్రిసంయోగం’ అని అంటారు.
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 9

ప్రశ్న 6.
పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారుల గురించి క్లుప్తంగా వ్రాయండి. [TS M-17]
జవాబు:
పరాగసంపర్కం: పరాగసంపర్కం మొక్కలలో రెండు నిర్జీవ (గాలి,నీరు) మరియు ఒక జీవ (జంతువులు) కారకాల ద్వారా జరుగుతుంది.
1. వాయు పరాగసంపర్కం: పరాగసంపర్కం జరిపే పుష్పాలు పెద్ద మొత్తంలో పరాగరేణువులు ఉత్పత్తి చేస్తాయి. అవి తేలికగాను మరియు జిగురులేకుండా ఉంటాయి.

ఈ పుష్పాలు బహిర్గతమైన కేసరాలను కల్గి ఉంటాయి. కావున పుప్పొడి రేణువులు గాలి ద్వారా సులువుగా వ్యాప్తి చెందుతాయి.. పుష్పాలు పొడవైన ఈకవంటి కీలాగ్రంను కలిగి ఉండి పుప్పొడి రేణువులను పట్టి ఉంచుతాయి. అనేక పుష్పాలు కలసి ఒక పుష్ప విన్యాసంగా ఏర్పడతాయి.
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 10

మొక్కజొన్న కంకి పుష్ప విన్యాసంలో పొడవైన పట్టు దారాల వంటి నిర్మాణాలైన కీలాగ్రాలు మరియు కీలాలు, గాలికి కదులుతూ పుప్పొడి రేణువులను పట్టు కొంటాయి. గడ్డి మొక్కల్లో వాయు పరాగసంపర్కం అనేది సర్వసాధారణమైనది.

2. జలపరాగసంపర్కం (హైడ్రోఫిలి): నీటి ద్వారా జరిగే పరాగసంపర్కంను జలపరాగసంపర్కం అంటారు. ఇది రెండురకాలు

a) ఊర్ధ్వజల పరాగ సంపర్కం (ఎఫిహైడ్రోఫిలి): నీటి ఉపరితలం పై జరిగే పరాగ సంపర్కం ఇది.
ఉదా: వాలిన్నేరియా.
స్త్రీ పుష్పాలు వాటి యొక్క పొడవైన వృంతాల ద్వారా నీటి పై భాగానికి చేరతాయి. పురుష పుష్పాలు లేదా పుప్పొడి రేణువులు నీటి ఉపరితలం పై చేరతాయి.
నీటి ప్రవాహం ద్వారా ఆ పుష్పాలు లేదా పుప్పొడి రేణువులు స్త్రీ కీలాగ్రాన్ని చేరి పరాగసంపరాన్ని జరుపుతాయి.
AP Inter 1st Year Botany Important Questions Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 11

b) అధోజల పరాగ సంపర్కం (హైపోహైడ్రోఫిలి): పూర్తిగా నీటిలో మునిగి ఉండే పుష్పాలలో జరిగే పరాగసంపర్కంను అధోజల పరాగ సంపర్కం’ అంటారు. జోస్టెరా మొక్కలో పుష్పాలు నీటిలో మునిగి ఉంటాయి. పరాగరేణువులు పొడవుగా రిబ్బన్ ఆకృతిలో ఉండి నీటి ప్రవాహంతో కదులుతూ కీలాగ్రాన్ని చేరి పరాగసంపర్కాన్ని జరుపుతాయి. ఉదా: సముద్ర గడ్డిమొక్క జో స్టెరా.

3. జంతుపరాగ సంపర్కం (జూఫిలి): జంతువుల ద్వారా జరిగే సంపర్కంను ‘జంతుపరాగ సంపర్కం’ అంటారు. పుష్పాలు ఆకర్షణీయమైన రంగును లేదా మకరందాన్ని ఉత్పత్తిచేయుట లేదా సువాసన కలిగి ఉండటం జరుగుతుంది. పరాగరేణువులు జిగురును కలిగి ఉండటం జరుగుతుంది.

  • కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కంను ‘కీటకాల పరాగ సంపర్కం’ (ఎంటమోఫిలీ) అంటారు. ఉదా: తేనేటీగలు, చీమలు, పట్టుపురుగులు.
  • పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కంను’ ‘పక్షి పరాగ సంపర్కం’ (ఆర్నిథోఫిలి) అంటారు. ఉదా: సన్బర్డ్స్
  • గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కంను ‘గబ్బిలపరాగసంపర్కం’ (కీరోష్టిరిఫిలీ) అంటారు.
  • ఉడుతల ద్వారా జరిగే పరాగ సంపర్కంను ‘ఉడుత పరాగ సంపర్కం’ (తెరోఫిలీ) అంటారు.
  • సరీసృపాల ద్వారా జరిగే పరాగ సంపర్కంను ‘పాము పరాగసంపర్కం’ (ఒఫియోఫిలీ) అంటారు.

Leave a Comment