Students get through AP Inter 1st Year Botany Important Questions 13th Lesson ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు which are most likely to be asked in the exam.
AP Inter 1st Year Botany Important Questions 13th Lesson ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు
Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ద్వితీయ అనుక్రమంలో ప్రాథమిక అనుక్రమంలో కంటే చరమదశ త్వరగా ఏర్పడుతుంది, ఎందువల్ల? [AP M-16]
జవాబు:
- ద్వితీయ అనుక్రమం ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవ సముదాయాలు నాశనం చేయబడిన తరువాత మొదలవుతుంది.
ఉదా: పాడుబడిన వ్యవసాయ భూములు, నిప్పువల్ల, చెట్లు నరకడం వల్ల నాశనమైన అరణ్యాలు. - ఇటువంటి ప్రదేశాలలో కొంత మృత్తిక ఉండుట వలన ద్వితీయ అనుక్రమం అనేది ప్రాథమిక అనుక్రమం కంటే వేగవంతంగా జరుగుతుంది. కావున దాని చరమదశ కూడా త్వరగా ఏర్పడుతుంది.
ప్రశ్న 2.
బ్రయోఫైట్లు, లైకెన్లు, ఫెర్న్ మొక్కలలో వేటిని జలాభావ క్రమకంలో ప్రారంభపు మొక్కలుగా పేర్కొంటారు?
జవాబు:
జలాభవ క్రమకంలోని ప్రారంభపు మొక్కలు ‘లైకెన్లు’.
ప్రశ్న 3.
జలాభావ క్రమకంకు సంబంధించి ఏవైనా రెండు ఉదాహరణలను పేర్కొనండి.
జవాబు:
జలాభావ క్రమకంకు ఉదాహరణలు: అపుడే చల్లబడిన లావా, నగ్న శిలలు, ఎడారులు
ప్రశ్న 4.
సముద్ర లవణీయత అధికంగా గల ప్రాంతాలలో ఏ రకం మొక్కలు పెరుగుతాయి?
జవాబు:
ఉప్పునీటి మొక్కలు. ఉదా: రైజోఫోరా.
ప్రశ్న 5.
ఎండ మొక్కలు (Heliophytes), నీడ మొక్కల (Sciophytes) ను నిర్వచించండి. మీ ప్రాంతంలోని మొక్కలలో ఒక దానిని ఎండ మొక్కకు కాని, నీడ మొక్కకు కాని ఉదాహరణగా పేర్కొనండి. [IPE -14] [TS M-16]
జవాబు:
- ఎండమొక్కలు (హీలియోఫైట్స్): ఎండలో ప్రత్యక్షంగా పెరిగే మొక్కలను హీలియోఫైట్స్ అంటారు.
ఉదా: చామంతి, గడ్డి మొక్కలు - నీడ మొక్కలు (సీయోఫైట్స్): నీడ ప్రాంతాలలో పెరిగే మొక్కలను సీయోఫైట్స్ అంటారు. ఉదా: ఫెర్న్, మాస్లు
ప్రశ్న 6.
జనాభా, సముదాయాలను నిర్వచించండి [TS M-17,20,22] [AP M-15,17,19] [IPE -13]
జవాబు:
- జనాభా: ఒక ప్రాంతంలో నివసించే ఒకే జాతి జీవుల సమూహన్ని జనాభా అంటారు.
- సముదాయం: ఒక ప్రాంతంలో నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాల సమూహాన్ని సముదాయం అంటారు.
ప్రశ్న 7.
సంఘాలను నిర్వచించండి? మొక్కల సంఘాలను నీటి మొక్కలు, సమోద్బీజాలు, ఎడారి మొక్కలుగా వర్గీకరించింది ఎవరు? [TS M-18]
జవాబు:
- సంఘం(సముదాయం): ఒక ప్రాంతంలో నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాల సమూహాన్ని సంఘం లేదా సముదాయం అంటారు.
- ఎడారి మొక్కల సంఘాలను వర్గీకరించిన శాస్త్రవేత్త ‘యూజెన్ వార్మింగ్’ .
ప్రశ్న 8.
నీటి మొక్కలలో కృశించిన దారువు ఉంటుంది. ఎందుకు? [AP M-17,18,20,22] [TS M-15,19,22]
జవాబు:
- నీటి మొక్కలు (హైడ్రోఫైట్స్) లో నీటి శోషణ అనేది మొక్కదేహంలోని అన్ని భాగాల ద్వారా జరుగుతుంది.
- మునిగి ఉన్న అన్ని భాగాలు నీటి శోషించుకోగలవు కావున దారువు క్షీణించి ఉంటుంది.
- మొక్కలలో దారువు అనే కణజాలం నీరు మరియు ఖనిజ లవణాలను శోషిస్తుంది మరియు సరఫరా చేస్తుంది.
Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
నీటి మొక్కలు అంటే ఏమిటి? వివిధ రకాల నీటి మొక్కలను ఉదాహరణలతో చర్చించండి? [APM-16][TSM–15,17,19]
జవాబు:
నీటి మొక్కలు: పూర్తిగా నీటిలో గానీ, బాగా తడిగా ఉండే నేలలో గానీ పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. నీటిలో పెరిగే విధానాన్ని బట్టి వీటిని 5 రకాలుగా విభజించారు.
1. నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు: ఈ మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా, నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదా: పిస్టియా, లెమ్నా, సాల్వీనియా.
2. లగ్నీకరణ చెంది, నీటి పైతేలే పత్రాలు గల మొక్కలు: ఈ రకం మొక్కలు వేరు వ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై ఉంటాయి. పొడవైన పత్ర వృంతాలు ఉండటం వల్ల వీటి పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఉదా: నింఫియా, విక్టోరియా లిజియా
3. పూర్తిగా నీటిలో మునిగి, అవలంబితంగా ఉండే మొక్కలు: ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి మృత్తికలో నాటుకొని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి.
ఉదా: హైడ్రిల్లా, యుట్రిక్యులేరియా
4. నీటిలో మునిగి ఉండి, లగ్నీకరణ చెందిన మొక్కలు: ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి, వేరు వ్యవస్థ సహాయంతో నీటి అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి. ఉదా: వాలిస్ నేరియా
5. ఉభయచర మొక్కలు: ఈ రకం మొక్కలు పాక్షికంగా నీటిలోను, పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి. ఉదా: సాబిటీరియా, టైపా, లిమ్నోఫిలా
ప్రశ్న 2.
నీటి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను వివరించండి. [TS M-22][AP M-18]
జవాబు:
నీటి మొక్కల స్వరూపాత్మక అనుకూలనాలు:
- వేర్లు ఉండక పోవచ్చు లేదా తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి.
- వేరు తొడుగులు సాధారణంగా ఉండవు.
- కొన్ని ఉభయచర మొక్కలలో వేర్లు, వేరు తొడుగులను కల్గి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
- కొన్ని మొక్కలలో వేరు తొడుగులకు బదులుగా వేరు ఒరలు ఉంటాయి.
- వేర్లు ఉంటే, అవి పీచుగా, పొడువులో కృశించి, శాఖరహితంగా లేదా తక్కువ శాఖలను కల్గి, అబ్బురపు వేర్లుగా ఉంటాయి.
- కాండం పొడువుగా, సున్నితంగా సాగి ఉంటుంది.
- పత్రాలు పలచగా, పొడువుగా, రిబ్బన్ ఆకృతిలోను లేదా సన్నగా, పొడువుగాను లేదా చీలి ఉంటాయి.
- నీటిపై తేలే పత్రాలు పెద్దవిగా, బల్లపరుపుగా, ఊర్ధ్వతలంపై మైనంతో కప్పబడి ఉంటాయి.
ప్రశ్న 3.
నీటి మొక్కల అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలను తెలపండి? [IPE Mar-13]
జవాబు:
- నీటిలో మునిగి ఉండే మొక్కల భాగాలలో ‘అవభాసిని పూర్తిగా ఉండదు’.
- కొన్ని మొక్కల వాయుగత భాగాల ఉపరితలాల మీద ‘అతిపలచని పొరవలె అవభాసిని ఉంటుంది’.
- బాహ్ చర్మకణాలు పలచని కణకవచాన్ని కల్గి ఉండి ‘శోషణ’ చేస్తాయి.
- బాహ్య చర్మకణాలు హరితరేణువులను కల్గి ‘కిరణజన్య సంయోగక్రియ’లో పాల్గొంటాయి.
- పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కలలో ‘పత్ర రంధ్రాలు’ ఉండవు.
- వాయు మార్పిడి నేరుగా ‘విసరణ పద్ధతి’లో పలచని కణ కవచాల ద్వారా జరుగుతుంది.
- నీటిపై తేలే పత్రాలున్న మొక్కలలో పత్రాలు ‘ఊర్ధ్వపత్ర రంధ్రయుతాలు’.
- అన్ని నీటి మొక్కలలో వాయు పూరిత మృదు కణజాలం కల్గి, అది వాయు మార్పిడికి మరియు మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది.
ప్రశ్న 4.
ఎడారి మొక్కల వర్గీకరణ గురించి క్లుప్తంగా వ్రాయండి? [ AP M-20][AP Mar, May-17][TS M-16,18,20,22]
జవాబు:
నీరు లోపించిన జలాభావ పరిస్థితులలో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అని అంటారు.
వీటిని 3 రకాలుగా వర్గీకరించారు:
i. అల్ప కాలిక మొక్కలు:
- ఈ మొక్కలు ఏక వార్షికాలు. ఇవి పొడి (శుష్క ) ప్రాంతాలలో పెరుగుతాయి.
- అతి తక్కువ కాలంలో తమ జీవిత చరిత్రను ముగించుకొంటాయి. ఉదా: ట్రిబ్యులస్
ii. రసభరితమైన మొక్కలు:
- ఈ మొక్కలు వర్షాకాలంలో ఎక్కువ నీటిని శోషించుకుంటాయి.
- శోషించిన నీటిని మొక్క వివిధ భాగాలలో జిగురు లేదా మ్యూసిలేజ్ రూపంలో నిల్వ చేస్తాయి.
- దీని ఫలితంగా మొక్క భాగాలైన కాండం (ఉదా: ఒపన్షియా), పత్రం(ఉదా: అల్లో) 3. వేరు (ఉదా: ఆస్పరాగస్) రసభరితంగా మారుతాయి.
- నీరు దొరకని సమయంలో నిల్వ చేసిన నీటిని వినియోగించుకుంటాయి.
- ఈ మొక్కలను నీటి ఎద్దడిని తట్టుకునే మొక్కలు అని అంటారు.
iii. రసభరితం కాని మొక్కలు: ఇవి దీర్ఘకాలిక జలాభావ పరిస్థితుల్ని తట్టుకోగల బహువార్షిక మొక్కలు.
ఉదా: కాజురైనా- ఈ మొక్కలనే ‘నిజమైన ఎడారి మొక్కలు’ అని అంటారు.
ప్రశ్న 5.
ఎడారి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను తెలపండి? [AP M-19,22]
జవాబు:
ఎడారి మొక్కల స్వరూపాత్మక అనుకూలనాలు:
- ఎడారి మొక్కల వేర్లు బాగా పొడవుగా పెరిగి, అనేక శాఖలతో విశాలంగా విస్తరించి ఉంటాయి.
- వీటి మూలకేశాలు, వేరు తొడుగులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
- వీటి కాండాలు పొట్టిగా, ధృఢంగా, చేవదేరి మందమైన బెరడుతో కప్పబడి ఉంటాయి.
- వీటి కాండాలు సాధారణంగా కేశాలు, మైనం పొరచే కప్పబడి ఉంటాయి.
- వీటి పత్రాలు బాగా క్షీణించి, పొలుసాకులుగా, చిన్నవిగా ఉంటాయి.
- భాష్పోత్సేక వేగంను తగ్గించుట కొరకు పత్రాలు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి.
ప్రశ్న 6.
ఎడారిమొక్కల అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలను తెలపండి? [AP M-15][TS M-17]
జవాబు:
ఎడారిమొక్కల అంతర్నిర్మాణ అనుకూలనాలు:
- ఎడారి మొక్కల బాహ్యచర్మం పై మందమైన అవభాసిని ఉంటుంది. అది భాష్పోత్సేక ఏర్పడిన అనుకూలనం.
- వీటి బాహ్య చర్మ కణాలలో సిలికా స్ఫటికాలు ఉండవచ్చు.
- వీటిలో బహువరసయుత బాహ్య చర్మం ఉంటుంది. ఉదా: నీరియం మొక్క పత్రం
- వీటి పత్ర రంధ్రాలు సాధారణంగా పత్రాల అధోబాహ్య చర్మంలో ఉంటాయి. (అధో పత్రరంధ్రయుతం)
- కొన్ని మొక్కలలో దిగబడిన పత్ర రంధ్రాలుంటాయి. ఉదా: నీరియం
- యాంత్రిక కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
- నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
ప్రశ్న 7.
మొక్కల అనుక్రమంను నిర్వచించండి. ప్రాథమిక అనుక్రమం, ద్వితీయ అనుక్రమం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
ఒక ప్రదేశాన్ని క్రమానుపాతంగా వేరువేరు మొక్కల సంఘాలు ఆక్రమించుకొనడాన్ని మొక్కల అనుక్రమము అంటారు.
ప్రాథమిక అనుక్రమం
- ఎలాంటి జీవ జాతులు లేని చోట నగ్న ప్రదేశాలలో ప్రాధమిక అనుక్రమం మొదలు అవుతుంది. ఉదా: నగ్న శిలలు.
- ఇది జీవుల పరంగా వ్యంధత్వం కల్గినవి.
- ఇది నిదానంగా జరిగే ప్రక్రియ.
- అంతిమ దశకు చేరుకొవడానికి చాలా సమయం (కొన్ని మిలియన్ల సంవత్సరం) తీసుకుంటుంది.
ద్వితీయ అనుక్రమం
- ద్వితీయ అనుక్రమం ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవ సముదాయాలు నాశనం చేయబడిన తరువాత మొదలవుతుంది. ఉదా: నిప్పు వల్ల నాశనం అయిన అరణ్యాలు, వరదలకు గురైన నేలలు.
- ఇది జీవుల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
- ఇది ప్రాధమిక అనుక్రమం కంటే వేగంగా జరుగుతుంది.
- ఇది అంతిమదశ చేరుకొవడాన్ని చాలా తక్కువ సమయం తీసుకుంటుంది.
ప్రశ్న 8.
ఆవరణ వ్యవస్థ లేదా ఆవరణ సంబంధ సేవలను నిర్వచించండి. ఆవరణ సంబంధ సేవలు, పరాగ సంపర్కాన్ని గురించి క్లుప్తంగా వివరించండి?
జవాబు:
ఆవరణ వ్యవస్థ: జీవ,నిర్జీవ అనుఘటకాల మధ్య జరిగే పరస్పర చర్యలను ఆవరణ వ్యవస్థ అంటారు.
ఆవరణ సంబంధ సేవలు: వాతావరణంలోని వివిధ ప్రక్రియల వల్ల ఉత్పత్తి అయ్యే వనరులను మనం చాలా వరకు తేలికగా తీసుకోవడం జరుగుతుంది. నీటి శుద్ధి, కలప మరియు చేపల ఆవాసం, పంట మొక్కల పరాగ సంపర్కం మొదలగు వాటిని ఆవరణ సంబంధ సేవలు అంటారు.
పరాగసంపర్కం: ఒక పుష్పంలోని పరాగకోశంలోని పరాగరేణువులకు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగసంపర్కం అంటారు.
పరాగసంపర్కం దృష్ట్యా ఆవరణవ్యవస్థ:
- పరాగసంపర్కం అనగా పుష్పాల అండాశయాల ఫలదీకరణ.
- ఆరోగ్య వంతమైన ఆవరణ వ్యవస్థలో ఇది అతి ముఖ్యమైన భాగం.
- అధిక శాతం పుష్పించేమొక్కలకు ఫలాలు మరియు విత్తనాల ఉత్పత్తికి పరాగ సంపర్కసహకారకాలు అవసరపడతాయి.
- పరాగసంపర్క సహకారకాలను ప్రపంచంలో ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
- వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో ప్రధాన పాత్ర పోషించు పరాగ సంపర్క సహకారకం ‘తేనెటీగ’.
- తేనెటీగలు,మాత్లు, సీతాకోక చిలుకలు, బీటిల్స్ మరియు ఈగలు ప్రపంచ వ్యాప్తంగా పరాగసంపర్క సహకారకాలుగా సేవ చేస్తున్నాయి.
- ఒక నిర్దిష్ట పరాగసంపర్క సహకారకం నశిస్తే దాని ప్రభావాన్ని అంచనా వేయడం చాలా కష్టం.
- కొన్ని పరాగ సంపర్క కారకాల సముదాయాలు నశించి పోతున్నాయని ఆధారాలు సూచిస్తున్నాయి.
- పరాగసంపర్క సహకారకాలు తగ్గుదల నిరంతరంగా జరుగుతూ ఉంటే కలిగే ప్రభావాలు
(i) సహకారకాల మీద ఆధారపడి పెరిగే పళ్ళు, కూరగాయల ధరల పెరుగుదల
(ii) మొత్తం ఆవరణవ్యవస్థ వినాశనం
ప్రశ్న 9.
ఆవరణ సంబంధ విధులను కొనసాగించడం కోసం తీసుకోవలసిన చర్యలను గురించి వ్రాయండి.
జవాబు:
- వనరుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని తయారగు ఉత్పత్తులను ఎంచుకోవాలి.
- వ్యర్ధాల విడుదలను తగ్గించుకోవాలి మరియు వాతావరణ నష్టం తగ్గించాలి.
- కీటకనాశకాలను ఉపయోగించకుండా తయారైన ఉత్పత్తులను ఎంచుకోవాలి.
- అధిక వినియోగాన్ని మరియు వ్యర్ధ పదార్థాల ఉత్పత్తిని తగ్గించుకోవాలి.
- పునర్వినియోగానికి సంబంధించిన ఇంధన వనరుల ఉపయోగాన్ని బలపరచాలి.
- సహజ వనరులను రక్షించడం కోసం సైకిల్ లేదా నడక వంటి ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించాలి.
- కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్య సంబంధ లాభాలను ఆస్వాదించడం జరుగుతుంది.
- సామూహిక ఉద్యాన వనాలు ఏర్పాటు మరియు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం లాంటివి చేయాలి.
- పురుగుమందుల వినియోగాలను తగ్గించాలి మరియు సహజ పురుగు నివారణ పద్దతులను వినియోగించాలి.
- ఉద్యాన వనాలలో స్థానిక మొక్కలను పెంచడం ద్వారా వన్య ప్రాణులకు ఆవాసాన్ని ఏర్పరచాలి.
ప్రశ్న 10.
పరాగసంపర్క సహకారకాలను రక్షించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు:
పరాగసంపర్క సహకారకాలను రక్షించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:
- స్వంత పరాగసంపర్కకారకాలను ఏర్పరుచుకోవటం కోసం స్థానికంగా పెరిగే పుష్పించే మొక్కలతో సేహ్నపూర్వక పూదోటలను పెంచాలి.
- ఖాళీ ప్రదేశాలలోను మరియు పెద్ద భవంతుల బయట స్థానికంగా పెరిగే పుష్పించే మొక్కలను నాటడంను ప్రోత్సహించాలి.
- ఇళ్లలోను మరియు పరిసరాలలోను వాడబడే కీటక నాశక పదార్థాల స్థాయిని తగ్గించాలి.
- స్థానిక సంస్థలలో సీతాకోకచిలుకల తోటలను, తేనేటీగల ఫలకలు మరియు పెట్టెల వినియోగాన్ని ప్రోత్సహించాలి.
- రైతు కీటకనాశక పదార్థాల వినియోగాన్ని తగ్గించుట కొరకు పరాగ సంపర్క కారక సహాయక పద్ధతులను వాడే వ్యవసాయ సంస్థలను బలపరచాలి.
- వ్యవసాయ సంబంధమైన నేల ఉపయోగానికి సంబంధించిన ప్రభుత్వ ప్రణాళికలలో సహజ పరాగ సంపర్క కారకాల వల్ల లభించే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొనేటట్లు ప్రోత్సహించడం.
- వ్యవసాయ పంటల పరాగ సంపర్క విషయంలో స్థానికంగా ఉండే పరాగ సంపర్క కారకాలను ఉపయోగించుకొనే పద్ధతుల అవసరాన్ని గురించి వక్కాణించడం.
Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు-కర్బన స్థాపన, ఆక్సిజన్ విడుదల గురించి వివరించండి?
జవాబు:
I. ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు- కర్బన (CO2) స్థాపన:
- కర్బన స్ధాపనకు వృక్షాలు అవసరం
- ‘వృక్షాలు’ అధికంగా ఉన్న కర్బనంను వాతావరణంలోకి చేరకుండా శోషిస్తాయి.
- కిరణజన్య సంయోగక్రియ ద్వారా జరిగే CO2 మరియు O2 వినిమయం అడవులకు మరియు వాతావరణానికి మధ్య జరిగే ప్రధాన రసాయన ప్రవాహం.
- అడవులు CO2 యొక్క ప్రధాన బ్యాంకులు. ఇవి పెద్దమొత్తంలో CO2 ను కలప రూపంలో దాచి ఉంచుతాయి.
- ఇవి వాతావరణంలోని CO2 గాఢతను తగ్గిస్తాయి.
- వాతావరణంలోని CO2 మరియు O2 ల సమతుల్యతను కాపాడుటలో ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి.
- కావున CO2 స్ధాపనం ద్వారా వచ్చే పరోక్ష ఆదాయం చాలా విలువైనది.
- ఈ విలువను మిగిలిన కర్బన స్థాపన పద్ధతులతో పోల్చి గణించవచ్చు.
- కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ప్రకారం 180గ్రా॥ గ్లూకోజ్ మరియు 193 గ్రా॥ 02 విడుదలకు మొక్కలు 264 గ్రా॥ CO2, 180 గ్రా॥ నీటిని మరియు 677.2 కిలో కాలరీల సౌరశక్తిని వినియోగించుకుంటాయి.
- 180 గ్రా॥ గ్లూకోజ్ క్రమంగా 162 గ్రా॥ పాలీశాఖరైడ్గా మొక్కలో మార్పు చెందుతుంది.
- కావున మొక్క 162గ్రా॥ పొడి కర్బన సేంద్రీయ పదార్థాన్ని ఉత్పత్తి చేయుటకు 264 గ్రా॥ CO2 స్ధాపన అవసరం.
- ప్రతి ఒక గ్రాము పొడి సేంద్రియ పదార్ధం కోసం 1.63 గ్రా॥ CO2 స్థాపన అవసరం.
- CO2 స్ధాపన యొక్క ఆర్ధిక విలువను వెలగట్టడానికి CO2 స్థాపన మొతాదును నిర్ధిష్టంగా ప్రతి యూనిట్ CO2 స్ధాపనకు కావలసిన ఖర్చుతో గుణించడం జరుగుతుంది.
- సహజ ఆవరణ వ్యవస్థ శీతోష్ణస్థితి పరిస్థితులను స్థిరంగా ఉంచడానికి, భూమి అధిక ఉష్ణతకు లోను కాకుండా ఎక్కువ హరిత గృహ వాయువులు CO2 ను వాతావరణం నుంచి తొలగించడంలో పాత్రవహిస్తాయి.
II. ఆవరణ వ్యవస్ధ సేవలు – ఆక్సిజన్ విడుదల:
- ఆకుపచ్చని వృక్షాల పత్రాలు కిరణజన్యసంయోగక్రియను జరిపి 2 ను సహ ఉత్పన్నంగా విడుదల చేస్తాయి.
- O2 విడుదల అనేది వృక్షం యొక్క జాతి, వయస్సు మరియు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.
- ఇటీవల పరిశోధనల ఫలితంగా తెలిసిందేమింటంటే ఒక సంవత్సరకాలంలో 10 మంది వ్యక్తులు లోపలికి పీల్చడానికి కావలసిన ఆక్సిజన్ను ఒక పత్రయుత ప్రౌఢ మొక్క ఒక రుతువులో విడుదల చేస్తుంది.
- ఒక పూర్తిగా ఎదిగిన మొక్క 48 1bs CO2ను ఒక సంవత్సర కాలంలో శోషించి, విడుదల చేసే ఆక్సిజన్ ఇద్దరు మనుషులకు సరిపోతుంది.
- ఒక ఎకరం భూమిలోని వృక్షాలు 18 మంది ఒక సంవత్సరం పాటు శ్వాసించడానికి కావలసిన ఆక్సిజన్ను అందిస్తుంది.
- పూర్తిగా నీటిలో మునిగి ఉన్న స్థూల మొక్కలు, ఆక్సిజన్ విడుదల చేయడం ద్వారా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను పెంచుతాయి.
- మొక్కలు మరియు వృక్ష ప్లవకాలను ప్రపంచం యొక్క ఊపిరితిత్తులు అని అంటారు.
- కొన్ని సూక్ష్మజీవులు, ప్రధానంగా సయానో బాక్టీరియాలు ‘ఆక్సిజన్ను ప్రత్యక్షం’గా విడుదల చేస్తాయి.
- కొన్ని బాక్టీరీయాలు సెల్యులోస్ సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రక్రియలో విడుదలయ్యే పదార్ధాలు ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడుతాయి.
- ఇటువంటి క్రమబద్ధమైన జీర్ణ ప్రక్రియ ద్వారా వివిధ దశలలో ఆక్సిజన్ విడుదల మరియు వినియోగం జరుగుతుంది.