Students get through AP Inter 1st Year Botany Important Questions 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం which are most likely to be asked in the exam.
AP Inter 1st Year Botany Important Questions 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం
Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ఒక మొక్క మెటీరియల్ అడ్డుకోత ఈ కింది అంతర్నిర్మాణ ముఖ్యాంశాలను చూపిస్తుంది.
i) నాళికాపుంజాలు సంయుక్తంగా, చెల్లాచెదురుగా ఉంటాయి. వీటిని ఆవరించి దృఢ కణజాలయుత పుంజపు ఒక ఉంటుంది.
ii) పోషకకణజాల మృదుకణజాలం లోపిస్తుంది. మీరు దీన్ని ఏ విధంగా గుర్తిస్తారు?
జవాబు:
ఏకదళబీజము కాండం యొక్క అడ్డుకోత.
ప్రశ్న 2.
దారువు, పోషకకణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అని ఎందుకు అంటారు?
జవాబు:
దారువు మరియు పోషకకణజాలాలు ఒకటి కంటే ఎక్కువ రకాలైన కణాలతో నిర్మితమై ఉండి మరియు ఒకే వ్యవస్థగా కలిసి పనిచేయుట వలన వాటిని సంక్లిష్ట కణజాలాలు అంటారు.
ప్రశ్న 3.
మొక్కల అంతర్నిర్మాణ అధ్యయనం మనకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది?
జవాబు:
- మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రం మొక్కల యొక్క అంతర్నిర్మాణం మరియు వివిధ కణజాలాల అమరికను అధ్యయనం చేయుటకు ఉపయోగపడుతుంది.
- విభిన్న మొక్కలకు కలిగే వ్యాధులు వాటి నివారణ చర్యలను కనుగొనుటకు ఇది ఉపయోగపడుతుంది.
ప్రశ్న 4.
ప్రథమ దారువు మొదటగా ఏర్పడ్డ దారువు. ప్రథమ దారువు, పోషక కణజాలం పక్కన వ్యాసార్థంగా అమరి ఉంటే ఆ దారువు అమరికను మీరు ఏ విధంగా పిలుస్తారు? ఇది మీకు దేనిలో కనిపిస్తుంది?
జవాబు:
- అటువంటి దారువు అమరికను ‘వ్యాసార్థ నాళికా పుంజం’ అని పిలుస్తారు
- అది వేరు అడ్డుకోతలో కనిపిస్తుంది.
ప్రశ్న 5.
పోషకకణజాల మృదుకణజాలం విధి ఏమిటి?
జవాబు:
పోషకకణజాల మృదుకణజాలం యొక్క ముఖ్య విధి మొక్కలలో ఆహార పదార్థాలను నిల్వ చేయుట. వీటితోపాటు రెసిన్స్, లేటెక్స్, జిగురు లాంటి స్రావక పదర్థాలను కూడా నిల్వ చేస్తుంది.
ప్రశ్న 6.
a) వేరులో లోపించి, పత్రాల ఉపరితలాన ఉండి నీటి నష్టాన్ని నిరోధించేది ఏమిటి?
b) మొక్కలలో నీటి నష్టాన్ని నిరోధించే బాహ్యచర్మకణ రూపాంతరం ఏది?
జవాబు:
a) అవభాసిని
b) ట్రైకోమ్లు
ప్రశ్న 7.
మొక్కలలో ఏ భాగం ఈ కింది వాటిని చూపిస్తుంది?
a) వ్యాసార్థ నాళికా పుంజం
b) బహుప్రథమ దారుకమైన దారువు
c) బాగా అభివృద్ధి చెందిన దవ్వ
d) బాహ్యప్రథమ దారుకమైన దారువు
జవాబు:
a) వేరు
b) ఏకదళబీజవేరు
c) ఏకదళబీజవేరు
d) వేరు
ప్రశ్న 8.
నీటి ప్రతిబలం సమయంలో మొక్కలలో పత్రాలు చుట్టుకొనేటట్లు చేసే కణాలు ఏవి?
జవాబు:
బుల్లిఫామ్ కణాలు ఉదా: మొక్కజొన్న పత్రాలు, గడ్డిమొక్కల పత్రాలు.
ప్రశ్న 9.
నాళికా విభాజ్యకణావళి వలయంలో ఉండేవి ఏమిటి?
జవాబు:
నాళికా విభాజ్యకణావళి వలయంలో పుంజాంతస్థ విభాజ్య కణావళి మరియు పుంజాంతర విభాజ్య కణావళి లు ఉంటాయి.
ప్రశ్న 10.
ఫెల్లోజన్, ఫెల్లోడర్న్ మధ్యన ఉండే ఒక క్రియాత్మక మూల భేదాన్ని తెలపండి
జవాబు:
ఫెల్లోజన్ అనేది బెండువిభాజ్యకణావళి. అది విభాజ్య కణజాలం.
పెల్లోడర్మ్ అనేది ద్వితీయ వల్కలం. అది శాశ్వత కణజాలం
ప్రశ్న 11.
ఒక వృక్షం బెరడును ఎవరైనా తొలగిస్తే, మొక్కలో ఏ భాగాలు తొలగించబడతాయి?
జవాబు:
వృక్షబెరడు తీసినపుడు తొలగించబడే భాగాలు : బాహ్యచర్మం అనగా పై చర్మం మరియు ద్వితీయ పోషకకణజాలం.
Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
వివిధ రకాల విభాజ్య కణజాలాల స్థానాల్ని, విధుల్ని తెలపండి. [TS M-19] [AP & TS M-17,16,15] [AP M-20]
జవాబు:
విధులను బట్టి విభాజ్య కణజాలం రెండు రకాలు:
- ప్రాథమిక విభాజ్య కణజాలం: ఇవి మొక్క పెరుగుదల యొక్క ప్రారంభదశలో ఏర్పడతాయి. మొక్క ప్రాథమిక దేహం ఏర్పడుటకు ఇవి తోడ్పడుతాయి.
- ద్వితీయ విభాజ్య కణజాలం: ఇవి మొక్క పెరుగుదల ద్వితీయదశలో ఏర్పడతాయి. ఇవి మొక్కలు అడ్డంగా పెరుగుటకు తోడ్పడతాయి.
మొక్కలో ఉండే స్థానాన్ని బట్టి విభాజ్యకణాలు మూడు రకాలు.
1. అగ్రస్థవిభాజ్య కణజాలం: ఇవి మొక్క యొక్క చివరి (అగ్ర భాగాలయిన వేరు, కాండం, శాఖల కొనలలో ఉంటాయి. ఇవి మొక్కలు నిలువుగా పెరుగుటకు ఉపయోగపడతాయి. ఇవి మొక్కల వృద్ధి చెందే ప్రారంభదశలోనే ఏర్పడతాయి. కావున ఇవి ప్రాథమిక విభాజ్య కణజాలాలు.
2. మధ్యస్థ విభాజ్య కణజాలం: ఇవి మొక్కల కణుపుల వద్ద, పత్రపు వేరు తొడుగులో ఉంటాయి. ఇవి పరిపక్వం చెందిన శాశ్వత కణజాలంతో కలిసి ఉంటాయి. ఇవి స్వల్ప కాలం మాత్రమే ఉండి తరువాత శాశ్వత కణాజాలంగా మారుతాయి. ఇవి కూడా ప్రాథమిక విభాజ్యకణజాలాలే.
3. పార్శ్వ విభాజ్యకణజాలం: ఇవి ద్విదళబీజాలలో కాండం, వేర్లు మొక్క పార్శ్వభాగాల వద్ద మాత్రమే ఉంటాయి. మొక్కల పరిచర్మం వీటి నుండి ఏర్పడుతుంది. ఇవి మొక్కల కాండం, వేర్లు అడ్డంగా పెరగటానికి దోహదపడతాయి. కావున ఇది ద్వితీయ విభాజ్యకణజాలం.
ఉదా: బెండువిభాజ్యకకణావళి, నాళికా, పుంజాంతరవిభాజ్యకణావళి.
ప్రశ్న 2.
మీ తోట నుంచి తీసుకొన్న ఒక మొక్క లేత కాండం అడ్డుకోత తీసుకొని సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. దీన్ని ఏకదళబీజ కాండమా లేదా ద్విదళబీజ కాండమా అని ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? కారణాలు తెలపండి. ఈ క్రింది భేదాల ద్వారా ఇచ్చిన కాండము ఏకదళబీజకాండమా లేదా ద్విదళబీజకాండమో తెలుసుకోవచ్చు.
జవాబు:
ఏకదళబీజ కాండం
- వీటిలో మూలకేశాలు ఉండవు.
- వల్కలం బాగా క్షీణించి ఉంటుంది
- అధశ్చర్మం దృఢ కణజాలాయుతం
- అంతశ్చర్మం ఉండదు.
- పరిచక్రం ఉండదు.
- నాళికా పుంజాలు అనేకం ఉంటాయి.
- నాళికాపుంజాలు అండాకారంలో ఉంటాయి.
- నాళికాపుంజాలు తంతుయుత పొరతో కప్పబడి ఉంటాయి.
- నాళికాపుంజాలు సంవృతం
- దారునాళాలు స్వల్పంగా ఉంటాయి.
- ప్రథమ దారువు కణాలు ఉంటాయి.
- దవ్వ, దవ్వ రేఖలు ఉండవు.
- దారునాళాలు “Y” ఆకృతిలో ఉంటాయి.
- పోషకకణజాల మృదుకణజాలం ఉండదు.
ద్విదళబీజ కాండం
- వీటిలో మూలకేశాలు ఉండును.
- వల్కలం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది
- అధశ్చర్మం స్థూలకోణ కణజాలాయుతం
- అంతశ్చర్మం పిండితొడుగులా ఉంటుంది.
- పరిచక్రం ఉంటుంది.
- నాళికా పుంజాలు స్వల్పంగా ఉంటాయి.
- నాళికాపుంజాలు శంఖు ఆకారంలో ఉంటాయి.
- నాళికాపుంజాలు తంతుయుత పొరతో కప్పబడి ఉండవు.
- నాళికాపుంజాలు వివృతం.
- దారునాళాలు ఎక్కువగా ఉంటాయి.
- ప్రథమ దారువు కణాలు ఉండవు.
- దవ్వ, దవ్వ రేఖలు ఉంటాయి.
- దారునాళాలు వరుసక్రమంలో ఉంటాయి.
- పోషకకణజాల మృదుకణజాలం ఉంటుంది.
ప్రశ్న 3.
పరిచర్మం అంటే ఏమిటి ద్విదళబీజ కాండంలో పరిచర్మం ఏ విధంగా ఏర్పడుతుంది? [AP, TS M- 18]
జవాబు:
పరిచర్మం: బెండు విభాజ్య కణావళి (ఫెల్లోజన్), బెండు (కార్క్ లేదా ఫెల్లమ్) మరియు ద్వితీయ వల్కలం (ఫెల్లోడర్మ్) ఈ మూడింటిని కలిపి ‘పరిచర్మం’ అంటారు. బెండు విభాజకణజాలం గాయాల కారణంగా ద్వితీయ వల్కలంగా పరిచర్మం ఏర్పడుతుంది.
పరిచర్మం ఏర్పడు విధానం:
- నాళికా విభాజ్య కణావళి క్రియాశీలత వల్ల కాండం చుట్టుకొలత పెరుగుతుంది.
- వెలుపలుగా ఉండే వల్కల కణాలు మరియు బాహ్య చర్మ పొరలు పగలిపోతాయి.
- వాటి స్థానంలో రక్షణ కోసం కొత్తపొరలు ఏర్పాటు అవుతాయి.
- ఇది సాధారణంగా వల్కల భాగం నుంచి ఏర్పడి, రెండు పొరల మందంలో ఉంటుంది.
- వెలుపలి వైపు ఏర్పడిన కణాలు బెండు లేదా ఫెల్లమ్.
- లోపలి వైపు ఏర్పడిన కణాలు ద్వితీయ వల్కలం లేదా ఫెల్లోడర్మ్.
- ఫెల్లోజన్, ఫెల్లమ్, ఫెల్లోడర్మ్ ఈ మూడు కలిసి పరిచర్మంను ఏర్పరుస్తాయి.
- పరిచర్మం మీద అక్కడక్కడ లెంటిసెల్స్ అనే వాయురంధ్రాలు ఏర్పడతాయి. అవి వాయువుల వినిమయంకు తోడ్పడతాయి.
ప్రశ్న 4.
వార్షిక వలయాలు అనే ఏక కేంద్రక వలయాలను ఒక వృక్షం మాను అడ్డుకోత చూపిస్తుంది. ఈ వలయాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఈ వలయాల ప్రాముఖ్యం ఏమిటి? [TS M-20][IPE Mar- 14]
జవాబు:
- సమశీతోష్ణ ప్రదేశంలో పెరిగే మొక్కలలో విభాజ్య కణావళి చర్యల వల్ల రుతువుల్లో వైవిధ్యాలు కన్పిస్తాయి.
- వసంతరుతువులో ఎక్కువ పత్రాలు, పుష్పాలు ఏర్పడుతాయి.
- అందువల్ల మొక్కకు ఎక్కువ పరిమాణంలో నీరు, ఖనిజ లవణాల అవసరం ఉంటుంది.
- అందువల్ల ఈ కాలంలో ఏర్పడే దారువు విశాలమైన అవకాశికలు, అనేక దారు నాళాలను చూపిస్తుంది.
- దీనినే ‘వసంత దారువు’ లేదా ‘తొలి దారువు’ అని అంటారు.
- కాని శరదృతువులో మొక్క ఎక్కువ నీటిని ఉపయోగించుకోదు.
- అందువల్ల, ఈ కాలంలో ఉత్పత్తి అయిన దారువు సన్నని అవకాశికలు కల్గి, తక్కువ దారు నాళాలను చూపిస్తుంది.
- దీనినే ‘శరద్దారువు’ లేదా ‘మలిదారువు’ అని అంటారు.
- ఈ విధంగా ఒక సంవత్సర కాలంలో రెండు రకాల ద్వితీయ దారువులు ఏర్పడుతాయి.
- ఈ రెండు రకాల దారువులు కేంద్రక వలయాలుగా కన్పిస్తాయి. వీటినే వార్షిక వలయాలు అంటారు.
- వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయస్సును సుమారుగా అంచనా వేయవచ్చు.
- ఈ విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని ‘డెండ్రోక్రోనాలజి’ అంటారు.
ప్రశ్న 5.
వాయురంధ్రాలు, పత్రరంధ్రాల మధ్య ఉండే భేదాలు ఏమిటి? [AP Mar-19][AP, TS Mar, May-17]
జవాబు:
వాయు రంధ్రాలు
- వాయు రంధ్రాలు ముదిరిన కాండాల పైన, ముదిరిన వాయుగత వేర్ల పైన వుంటాయి.
- వాయు రంధ్రాలు మృదుకణజాల కణాలతో దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి.
- వాయు రంధ్రాల వల్ల దారుయుత భాగాలలో వెలుపలి వాతావరణం, అంతర కణజాలాల మధ్య వాయు వినిమయం జరుగుతుంది.
- వాయు రంధ్రాలలో తెరుచుకొనే, మూసుకొనే యాంత్రికం ఉండదు.
- వాయు రంధ్రాలు కిరణజన్య సంయోగ క్రియ జరపలేవు.
పత్ర రంధ్రాలు
- పత్ర రంధ్రాలు పత్రాల మీద, లేతకాండాల మీద ఉంటాయి.
- ప్రతి పత్ర రంధ్రం రెండు రక్షక కణాలతో ఏర్పడి, హరిత రేణువులను కల్గి ఉంటాయి.
- పత్ర రంధ్రాల వల్ల భాష్పోత్సేకం, శ్వాసక్రియ జరుగుతాయి.
- పత్ర రంధ్రాలలో తెరుచుకొనే, మూసుకొనే యాంత్రికం ఉంటుంది.
- రక్షక కణాలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి.
ప్రశ్న 6.
వీటి సరియైన విధిని రాయండి.
a) చాలనీ నాళం
b) పుంజాంతర విభాజ్య కణావళి
c) స్థూలకోణకణజాలం
d) దృఢకణజాలం
జవాబు:
a. చాలనీ నాళం: చాలనీ నాళం ఆహారపదార్థాలను ఆకుల నుండి మొక్క ఇతర భాగాలకు రవాణా చేస్తుంది.
b. పుంజాంతర విభాజ్య కణావళి : ఇది పుంజాంతస్థ విభాజ్య కణావళితో కూడిన విభాజ్య కణావళి యొక్క పూర్తి వలయంను ఏర్పరుస్తుంది. ఇలా ఏర్పడిన విభాజ్య కణావళి కణ్వంతర ద్వితీయ పెరుగుదలకు సహాయపడుతుంది.
c. స్థూలకోణకణజాలం: ఇది లేత కాండం, పత్ర వృంతం వంటి పెరుగుదల చూపే మొక్క భాగాలకు సాగేశక్తి మరియు వంగే గుణమును అందిస్తుంది.
d. దృఢకణజాలం: ఇది నిర్జీవ యాంత్రిక కణజాలం. ఇది ముదిరిన భాగాలలో ఉండి మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది.
ప్రశ్న 7.
పత్రరంధ్రాన్ని రక్షిస్తూ రెండు మూత్రపిండాకార రక్షక కణాలు ఉంటాయి. రక్షక కణాలను ఆవరించి ఉండే బాహ్యచర్మ కణాల పేరు తెలపండి. రక్షక కణం ఏ విధంగా బాహ్యచర్మ కణంతో విభేదాన్ని చూపిస్తుంది? మీ జవాబును పటం సహాయంతో విశదీకరించండి.
జవాబు:
- రక్షక కణాలను చుట్టుకొని ఉన్న బాహ్యచర్మ కణాలను అనుబంధ కణాలు అంటారు.
- రక్షక కణాలు ద్విదళబీజాలలో చిక్కుడు గింజ ఆకారంలో మరియు ఏకదళబీజాలలో ముద్గురాకారంలో ఉంటాయి. అవి బాహ్యచర్మకణాలలో స్థూపాకారంలో ఉంటాయి.
- రక్షకణాలలో హరితరేణువులు ఉంటాయి కాని బాహ్యచర్మ కణాలలో హరితరేణువులు ఉండవు.
- రక్షకకణంలో పత్రరంధ్రంవైపు ఉన్న కణకవచం మందంగా ఉంటుంది. కాని దాని బాహ్య కవచం పలుచగా ఉంటుంది.
ప్రశ్న 8.
రావి (ఫైకస్ రిలిజియోసా), మొక్కజొన్న(జియా మేస్) పత్రాలు అంతర్నిర్మాణంలోని భేదాలను సూచించండి. పటాలు గీసి, భేదాలను గుర్తించండి.
జవాబు:
ద్విదళబీజపత్రం
- పత్రరంధ్రాలు క్రింది బాహ్యశ్చర్మంలో ఎక్కువగా మరియు పై బాహ్యశ్చర్మంలో తక్కువగా ఉంటాయి.
- బుల్లిఫామ్ కణాలు ఉండవు.
- పత్రాంతర కణజాలం విభేదనం చెంది ఉంటుంది.
- సాధారణంగా పుంజపు తొడుగు మృదు కణజాలాల నుండి ఏర్పడుతుంది.
- ఒకే నాళికాపుంజము ఉంటుంది.
ఏకదళబీజపత్రం
- పత్రరంధ్రాలు ఇరువైపులా సమానంగా విస్తరించి ఉంటాయి.
- బుల్లిఫామ్ కణాలు ఉంటాయి.
- పత్రాంతర కణజాలం విభేదనం చెంది ఉండదు.
- సాధారణంగా పుంజపు తొడుగు మృదు కణజాలాల నుండి ఏర్పడుతుంది.
- అనేక నాళికాపుంజములు ఉంటాయి.
ప్రశ్న 9.
బెండు విభాజ్య కణావళి బెండును ఏర్పరచే కణజాలాలను ఏర్పరుస్తుంది. ఈ వ్యాఖ్యను మీరు అంగీకరిస్తారా? వివరించండి?
జవాబు:
అవును. బెండు విభాజ్య కణావళి అనేది ద్వితీయ విభాజ్య కణజాలం ఇది రెండు వరుస పొరల మందంతో ఉంటుంది. ఇది విభజన చెందే శక్తిని కల్గి ఉంటుంది. ఇది రెండు వైపుల కణాలను ఏర్పరుస్తుంది. వెలుపలి వైపు ఏర్పడే కణాలు ఫెల్లమ్ లేదా బెండు గాను, లోపలి వైపు ఏర్పడే కణాలు ద్వితీయ వల్కలం లేదా ఫెల్లోడర్మ్ విభేదనం చెందుతాయి.
ప్రశ్న 10.
పుష్పించే మొక్కలలోని మూడు మూల కణజాల వ్యవస్థల పేర్లను తెలపండి. ప్రతి కణజాల వ్యవస్థకు చెందిన కణజాలాల పేర్లను తెలపండి.
జవాబు:
వాటి నిర్మాణం, స్థానం మీద ఆధారపడి కణజాల వ్యవస్థలను మూడు రకాలుగా గుర్తించారు.
- బాహ్యచర్మకణజాల వ్యవస్థ
- సంధాయక లేదా మౌలిక కణజాల వ్యవస్థ
- నాళికా లేదా ప్రసరణ కణజాల వ్యవస్థ
1. బాహ్యచర్మకణజాల వ్యవస్థలోని భాగాలు బాహ్యచర్మం మరియు పత్రరంధ్రాలు.
2. సంధాయక లేదా మౌలిక కణజాల వ్యవస్థలోని భాగాలు మృదుకణజాలం, స్థూలకోణకణజాలం, దృఢ కణజాలం
3. నాళికా లేదా ప్రసరణ కణజాల వ్యవస్థ దారువు మరియు పోషక కణజాలంను కలిగి ఉంటుంది.
Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
పటాల సహాయంతో దారుయుత ఆవృతబీజాల కాండాలలో జరిగే ద్వితీయ వృద్ధి పద్ధతిని వివరించండి. దీని ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
ప్రాథమిక పెరుగుదలతోపాటు అనేక ద్విదళ బీజ మొక్కలు చుట్టుకొలతలో చూపే పెరుగుదలను ద్వితీయ వృద్ధి అంటారు. ఇందులో రెండు రకాల పార్శ్వవిభాజక కణజాలాలు పాల్గొంటాయి. అవి
I. నాళికా విభాజ్య కణావళి
II. బెండు విభాజ్య కణావళి
I. నాళికా విభాజ్య కణావళి :
a) విభాజ్య కణావళి వలయం తయారు కావడం:
- ద్విదళ కాండాలలో ప్రాథమిక దారువు, ప్రాథమిక పోషక కణజాలం నడుమ ఉండే విభాజ్య కణావళి కణాలను పుంజాంతస్థ విభాజ్య కణావళి అంటారు.
- ఈ పుంజాంతస్థ విభాజ్య కణావళికి పక్కనే ఉండే దవ్వ రేఖలలోని కణాలు విభజన శక్తిని సంపాదించుకొని పుంజాంతర విభాజ్య కణావళిని ఏర్పరుస్తాయి. ఆ విధంగా ఒక అవిచ్ఛిన్న నాళికా విభాజ్య కణావళి వలయం ఏర్పడుతుంది.
b) విభాజ్య కణావళి వలయం క్రియాశీలత:
1. విభాజ్య కణావళి వలయం చురుకుగా పని చేయడం మొదలు పెట్టి లోపలి వైపుకు, వెలుపలి వైపుకు కొత్త కణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.
2. దవ్వ వైపు ఏర్పడ్డ కణాలు ద్వితీయ దారువుగా పరిపక్వమవుతాయి. పరిధి వైపు ఏర్పడ్డ కణాలు ద్వితీయ పోషక కణజాలంగా పరిపక్వమవుతాయి.
3. సాధారణంగా విభాజ్య కణావళి క్రియాశీలత వెలుపలి వైపు కంటే లోపలి వైపుకు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ద్వితీయ పోషక కణజాలం కంటే ద్వితీయ దారువు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ ద్వితీయ దారువు క్రమేణా కుదించబడిన ముద్ద లాగా ఏర్పడుతుంది.
4. కొన్ని ప్రదేశాలలో, విభాజ్య కణావళి మృదుకణాలను సన్నని వరుసల రూపంలో ఉత్పత్తి చేస్తుంది. ఇవి వ్యాసార్ధపు దిశలలో ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలాల గుండా వ్యాపించి ఉంటాయి. వీటిని ద్వితీయ దవ్వరేఖలు అంటారు.
II. బెండు విభాజ్య కణావళి :
1. నాళికా విభాజ్య కణావళి యొక్క క్రియాశీలత వల్ల కాండం చుట్టుకొలత పెరుగుతున్నప్పుడు వెలుపల ఉండే వల్కలం, బాహ్యచర్మం పొరలు పగిలిపోతాయి.
2. ఫలితంగా వెంటనే లేదా కొంతకాలం తరువాత వేరొక విభాజ్య కణజాలం అభివృద్ధి చెందుతుంది. దీన్ని బెండు విభాజ్య కణావళి లేదా ఫెల్లోజన్ అంటారు.
3. ఫెల్లోజన్ ఒక జత పొరల మందంతో ఉంటుంది. ఇది సన్నగా, పలుచని కణ కవచాలను కలిగి దాదాపు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న సన్నని కణాలతో నిర్మితమై ఉంటుంది. ఫెల్లోజన్ రెండు వైపులా కణాలను ఏర్పరుస్తుంది.
4. వెలుపలి వైపు ఏర్పడ్డ కణాలు బెండు లేదా ఫెల్లమన్ను లోపలి వైపు ఏర్పడిన కణాలు ద్వితీయ వల్కలం లేదా ఫెల్లోడర్మ్ ను విభేదనం చెందుతాయి.
5. బెండు కణజాలంలోని కణాల కవచంలో సూబరిన్ చేరి ఉండటం వల్ల ఈ కణజాలం నీటికి అపారగమ్యంగా
ఉంటుంది.
6. ద్వితీయ వల్కలం మృదుకణజాలయుతంగా ఉంటుంది.
ప్రశ్న 2.
వీటి మధ్యన ఉండే అంతర్నిర్మాణ భేదాలను తెలిపే పటాలను చిత్రీకరించండి. a) ఏకదళబీజ వేరు, ద్విదళబీజ వేరు
జవాబు:
(a) ఏకదళబీజవేరు
- పరిచక్రం కేవలం పార్శ్వ వేర్లను ఉత్పత్తిచేస్తుంది.
- నాళికా పుంజాలు 6 కంటే ఎక్కువగా ఉంటాయి.
- అంత్యదారువు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.
- ద్వితీయ పెరుగుదల ఉంటుంది.
- వల్కలం పెద్దది
- దవ్వ చాలా పెద్దది
ద్విదళబీజ వేరు
- పరిచక్రం పార్శ్వ వేర్లను మరియు ద్వితీయ పెరుగుదలలో నాళికవిభాజ్యకణావళిని ఉత్పత్తిచేస్తుంది.
- నాళికా పుంజాలు 2-4 మధ్యలో ఉండును.
- అంత్యదారువు అస్పష్టం.
- ద్వితీయ పెరుగుదల ఉండదు.
- వల్కలం సాపేక్షంగా చిన్నది.
- దవ్వ చాలా చిన్నది లేదా ఉండదు.
b) ఏకదళబీజ కాండం, ద్విదళబీజ కాండం మధ్య భేదాలు
ఏకదళబీజ కాండం
- వీటిలో మూలకేశాలు ఉండవు.
- వల్కలం బాగా క్షీణించి ఉంటుంది
- అధశ్చర్మం దృఢ కణజాలాయుతం
- అంతశ్చర్మం ఉండదు.
- పరిచక్రం ఉండదు.
- నాళికా పుంజాలు అనేకం ఉంటాయి.
- నాళికాపుంజాలు అండాకారంలో ఉంటాయి.
- నాళికాపుంజాలు తంతుయుత పొరతో కప్పబడి ఉంటాయి.
- నాళికాపుంజాలు సంవృతం.
- దారునాళాలు స్వల్పంగా ఉంటాయి.
- ప్రథమ దారువు కణాలు ఉంటాయి.
- దవ్వ, దవ్వ రేఖలు ఉండవు.
- దారునాళాలు “Y” ఆకృతిలో ఉంటాయి.
- పోషకకణజాల మృదుకణజాలం ఉండదు.
ద్విదళబీజ కాండం
- వీటిలో మూలకేశాలు ఉండును.
- వల్కలం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది
- అధశ్చర్మం స్థూలకోణ కణజాలాయుతం
- అంతశ్చర్మం పిండితొడుగులా ఉంటుంది.
- పరిచక్రం ఉంటుంది.
- నాళికా పుంజాలు స్వల్పంగా ఉంటాయి.
- నాళికాపుంజాలు శంఖుఆకారంలో ఉంటాయి.
- నాళికాపుంజాలు తంతుయుత పొరతో కప్పబడి ఉండవు.
- నాళికాపుంజాలు వివృతం.
- దారునాళాలు ఎక్కువగా ఉంటాయి.
- ప్రథమ దారువు కణాలు ఉండవు.
- దవ్వ, దవ్వ రేఖలు ఉంటాయి.
- దారునాళాలు వరుసక్రమంలో ఉంటాయి.
- పోషకకణజాల మృదుకణజాలం ఉంటుంది.
ప్రశ్న 3.
సరళ కణజాలాలు అంటే ఏమిటి? వివిధ రకాల సరళ కణజాలాలను వర్ణించండి..
జవాబు:
సరళ కణజాలాలు: ఒకే రకమైనటువంటి కణాలతో తయారైన కణజాలమును సరళకణజాలము అంటారు. మొక్కలలోని వివిధ రకాల సరళకణజలాలు, మృదుకణజాలం, స్థూలకోణకణజాలం మరియు దృఢకణజాలం.
a. మృదుకణజాలం:
- మొక్కల భాగాలలో అధిక భాగం మృదుకణజాలంతో తయారై ఉంటుంది.
- మృదుకణజాలంలోని కణాలు సాధారణంగా సమ వ్యాసంలో ఉంటాయి. ఇవి గోళాకారంగా, అండాకారంగా, గుండ్రంగా, బహుభుజి ఆకారంగా లేదా పొడవుగా ఉండవచ్చు.
- వీటి కణకవచాలు పలుచగా ఉండి సెల్యులోజ్తో నిర్మితమై ఉంటాయి.
- కణాలు దగ్గరగా పేర్చబడి ఉండవచ్చు లేదా చిన్న కణాంతరావకాశాలను కలిగి ఉండవచ్చు.
- మృదు కణజాలం కిరణజన్య సంయోగక్రియ, పదార్థాలను నిలువచేయడం, స్రావాలను స్రవించడం లాంటి వివిధ విధులను నిర్వర్తిస్తుంది.
b. స్థూలకోణకణజాలం:
- స్థూలకోణ కణజాలం ద్విదళ బీజ మొక్కల బాహ్యచర్మం దిగువన పొరలుగా ఉంటుంది.
- ఈ కణాలు మూలాల వద్ద సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్, పెక్టిన్లు అవక్షేపితమై ఉంటాయి.
- స్థూలకోణ కణజాలంలోని కణాలు అండాకారం, గోళాకారం లేదా బహుభుజి ఆకారంలో ఉండి తరచుగా హరిత రేణువులను కలిగి ఉంటాయి.
- కణాల మధ్య కణాంతరావకాశాలు ఉండవు.
- ఇది లేత కాండం, పత్రవృంతం లాంటి పెరుగుదల చూపే మొక్క భాగాలకు యాంత్రిక ఆధారాన్ని అందచేస్తాయి.
c. దృఢకణజాలం:
- దృఢకణజాలంలోని కణాలు నిర్జీవాలు. జీవపదార్థం ఉండదు.
- రూపం, నిర్మాణం, ఉత్పత్తి అభివృద్ధులలో వైవిధ్యాల పరంగా దృఢ కణజాలాలు నారలుగా లేదా దృఢ కణాలుగా ఉంటాయి.
- నారలు మందమైన కణకవచాలను కలిగి పొడవుగా, సన్నగా మొనదేలిన కొనలతో ఉన్న కణాలు. ఇవి సాధారణంగా మొక్కల వివిధ భాగాలలో సమూహాలుగా ఏర్పడి ఉంటాయి.
- దృఢ కణాలు గోళాకారం, అండాకారం లేదా స్థూపాకారంగా ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలు. వీటి కవచాలు మందంగా ఉండి అతి సన్నని అవకాశికల్ని కలిగి ఉంటాయి.
- ఇవి సాధారణంగా నట్స్ ఫలకవచాలలో, జామ, పియర్, సపోటా లాంటి ఫలాల గుజ్జులలో కనిపిస్తాయి. 6. దృఢ కణజాలం మొక్కల భాగాలకు యాంత్రిక ఆధారాన్ని కలుగజేస్తుంది.
II. పోషకకణజాలం: పోషక కణజాలం పత్రాల నుంచి మొక్క. ఇతర భాగాలకు ఆహారపదార్థాల్ని రవాణా చేస్తుంది. ఆవృత బిజాలలోని పోషక కణజాలం చాలనీనాళ మూలకాలు, సహ కణాలు, పోషక కణజాలాల మృదుకణజాలం, పోషక కణజాల నారలను కలిగి ఉంటుంది.
(a) చాలనీనాళ మూలకాలు: ఇవి పొడవుగా గొట్టంలా ఉండే నిర్మాణాలు. ఇవి నిలువు వరుసల్లో మరియు సహ కణాలతో కలిసి ఉంటాయి. వీటి అంతిమ కుడ్యాలు జల్లెడలాగా
రంధ్రయుతంగా ఉండి చాలనీ ఫలకాలను ఏర్పరుస్తాయి.
(b) సహ కణాలు: ఇవి ప్రత్యేకమైన మృదుకణజాల కణాలు. ఇవి చాలనీ నాళా మూలకాలతో అతి దగ్గరగా కలిసి ఉంటాయి. చాలనీనాళ మూలకాలు, సహకణాలు వాటి ఉమ్మడి అనుదీర్ఘాక్ష కవచాలలోని గర్త క్షేత్రాల ద్వారా సంబంధాన్ని కల్గి ఉంటాయి.
(c) పోషక కణజాలాల మృదుకణజాలం:ఇది పొడుగాటి, స్థూపాకార కణాలతో తయారు చేయబడి ఉంటుంది. ఈ కణాల కొనలు సన్నగా, వాడిగా కనిపిస్తాయి. వీటి కణకవచాలు సెల్యులోజ్తో తయారు చేయబడి ఉంటాయి. ఇది ఆహార పదార్థాలతోపాటు రెసిన్స్, లేటెక్స్ లాంటి ఇతర పదార్థాలను నిల్వ చేస్తుంది.
(d) పోషక కణజాల నారలు: ఇవి దృఢ కణజాల కణాలతో తయారు చేయబడతాయి. పరిపక్వమయ్యాక ఈ నారలు జీవ పదర్థాన్ని కోల్పోయి నిర్జీవమవుతాయి.
ప్రశ్న 5.
భాగాలను గుర్తించిన పటం సహాయంతో పృష్టోదర పత్రం అంతర్నిర్మాణాన్ని వర్ణించండి. [AP MAR-19] [TS M-20]
జవాబు:
పృష్టోదర (ద్విదళబీజ) పత్రం అడ్డుకోతలోని మూడు ముఖ్య భాగాలు :
I. బాహ్యచర్మం
II. పత్రాంతరం
III. నాళికాపుంజాలు
I. బాహ్య చర్మం:
- ఇది పత్రం యొక్క పైతలము (ఊర్ధ్వ) మరియు కిందితలము(అధో) పై ఉంటుంది.
- ఇది ఏకకణ మందంతో దీర్ఘచతురస్రాకార కణాలతో ఒత్తుగా అమరి ఉంటుంది.
- దీనిపై మూలకేశాలు ఉంటాయి.
- ఊర్ధ్వ బాహ్యచర్మంపై మందమైన అవభాసిని, అధో బాహ్యచర్మం పై పలుచని అవభాసిని ఉంటుంది.
- అధోబాహ్యచర్మం పై పత్రరంధ్రాలు అధికంగా ఉంటాయి. ఇవి బాష్పోత్సేకమునకు తోడ్పడును.
- బాహ్యచర్మం లోపలి కణజాలానికి రక్షణను ఇస్తుంది మరియు వాయువినిమయంనకు తోడ్పడును.
II. పత్రాంతరం:
- పత్రాంతరము ఊర్ధ్వ మరియు అధోబాహ్యచర్మం పొరల మధ్య ఉంటుంది.
- ఇది రెండు రకాలుగా విభేదనం చెంది ఉంటుంది. పైన స్థంభమృదుకణజాలము మరియు క్రింద స్పంజి మృదుకణజాలము.
- స్థంభమృదుకణజాల కణాలు స్థంభాకృతిలో, నిలువుగా, ఒత్తుగా రెండు వరుసలలో అమరి ఉంటాయి.
- స్పంజి మృదు కణజాలం వదులుగా అమరి ఉన్న అండాకార కణాలను కలిగి ఉంటుంది.
- పత్రాంతర కణాలు అన్నీ హరితరేణువులను కల్గి ఉంటాయి. అవి కిరణజన్యసంయోగక్రియలో పాల్గొంటాయి.
- పత్రాంతరం ప్రధానంగా ఆహార సంశ్లేషణలో ఉపయోగపడుతుంది.
III. నాళికాపుంజాలు:
- నాళికాపుంజాలు పత్రాంతరంలో నడిమ ఈనెలో విస్తరించి ఉంటాయి.
- అవి సంయుక్తం, సహపార్శ్వం మరియు సంవృతం.
- ప్రతి నాళికా పుంజము ‘పుంజపు తొడుగు’తో కప్పబడి ఉంటుంది.
- దారువు ఊర్ధ్వ బాహ్యచర్మం వైపు మరియు పోషక కణజాలం అధో బాహ్యచర్మం వైపు ఉంటుంది.
- నాళికాపుంజాలు ఖనిజలవణాలు మరియు ఆహారపదార్థాల రవాణాకు ఉపయోగపడును.
ప్రశ్న 6.
భాగాలను గుర్తించిన పటం సహాయంతో సమద్విపార్శ్వ పత్రం అంతర్నిర్మాణాన్ని వివరించండి. [TS M-17]
జవాబు:
సమద్విపార్శ్వ (ఏకదళబీజ) పత్రం అడ్డుకోతలో మూడు ముఖ్య భాగాలు:
I. బాహ్యచర్మం
II. పత్రాంతరం
III.నాళికాపుంజాలు
I. బాహ్య చర్మం:
- ఇది పత్రం యొక్క పైతలము (ఊర్ధ్వ) మరియు కిందితలము (అధో) పై ఉంటుంది.
- ఇది ఏకకణ మందంతో దీర్ఘచతురస్రాకార కణాలతో ఒత్తుగా అమరి ఉంటుంది.
- దీనిపై మూలకేశాలు ఉండవు.
- మందమైన అవభాసినిలు ఊర్ధ్వ బాహ్యచర్మం మరియు అధో బాహ్యచర్మం పై ఉంటాయి.
- రెండు తలాల యందు పత్రరంధ్రాలు ఉండును. ఇవి బాష్పోత్సేకమునకు తోడ్పడును.
- బాహ్యశ్చర్మం లోపలి కణజాలానికి రక్షణను ఇస్తుంది మరియు వాయు వినిమయంనకు తోడ్పడును.
- గడ్డిమొక్కలలో బుల్లిఫామ్ కణాలు ఉంటాయి. ఇవి పత్రాలు ముడుచుకొనుటకు సహాయపడతాయి.
II. పత్రాంతరం:
- పత్రాంతరము ఊర్ధ్వ మరియు అధోబాహ్యచర్మం పొరల మధ్య ఉంటుంది.
- పత్రాంతరం స్తంభ మరియు స్పంజి మృదు కణజాలాలుగా విభేదన చూపించదు.
- పత్రాంతరం స్పంజి మృదు కణజాలంతో నిర్మితమై ఉంటుంది.
- ఈ కణజాలం అనేక కణాంతరావకాశాలతో వదులుగా అమరి ఉండును.
- పత్రాంతర కణాలు హరితరేణువులను కలిగి ఉంటాయి. అవి కిరణజన్యసంయోగ క్రియలో పాల్గొంటాయి.
- పత్రాంతరం ప్రధానంగా ఆహార సంశ్లేషణలో ఉపయోగపడుతుంది.
III. నాళికాపుంజాలు:
- అనేక నాళికాపుంజాలు పత్రాంతరంలో సమాంతరంగా విస్తరించి ఉంటాయి.
- అవి సంయుక్తం, సహపార్శ్వం మరియు సంవృతం.
- ప్రతి నాళికా పుంజము ‘దృఢమైన రెండు పొరల పుంజపు తొడుగు’ తో కప్పబడి ఉంటుంది.
- దారువు ఊర్ధ్వ బాహ్యచర్మం వైపు మరియు పోషక కణజాలం అధో బాహ్యచర్మం వైపు ఉంటుంది.
- నాళికాపుంజాలు ఖనిజలవణాలు మరియు ఆహారపదార్థాల రవాణాకు ఉపయోగపడును.
ప్రశ్న 7.
ఈ కింది వాటి మధ్యగల భేదాలను తెలియజేయండి.
a) ప్రథమదారువులోని బాహ్య ప్రథమ దారుక, అంతర ప్రథమ దారుక స్థితి
b) ప్రసరణస్థంభం, నాళికా పుంజం
c) ప్రథమదారువు, అంత్యదారువు
d) పుంజాంతర విభాజ్యకణావళి, పుంజాంతస్థ విభాజ్యకణావళి
e) వివృత, సంవృత నాళికాపుంజాలు
f) కాండకేశం, మూలకేశం
g) అంతర్దారువు, రసదారువు
h) వసంతదారువు, శరద్దారువు
జవాబు:
a. బాహ్య ప్రథమ దారుక స్థితి
- ప్రథమ దారువు వెలుపలి వైపుకు, అంత్య దారువు లోపలి వైపుకు ఉండే స్థితి. ఉదా: వేరు
అంతర ప్రథమ దారుక స్థితి
- ప్రథమ దారువు లోపలి వైపుకు, అంత్య దారువు వెలుపలి వైపుకు ఉండే స్థితి. ఉదా: కాండం
b. ప్రసరణ స్థంభం
- ఇందులో పరిచక్రం, నాళికా పుంజాలు, దవ్వ మరియు దవ్వరేఖలు ఉంటాయి.
నాళికా పుంజం
- ఇందులో దారువు మరియు పోషక కణజాలాలు ఉంటాయి.
c. ప్రథమదారువు
- ప్రాథమిక దారువులో ముందుగా ఏర్పడే దారు మూలకాలు.
- వీటికి సన్నని అవకాశికాలు ఉంటాయి.
అంత్యదారువు
- ప్రాథమిక దారువులో ప్రథమ దారువు తరువాత ఏర్పడే దారు మూలకాలు.
- వీటికి వెడల్పు అవకాశికాలు ఉంటాయి.
d. పుంజాంతర విభాజ్యకణావళి
- ఇది పుంజాతస్థ విభాజ్య కణావళికి పక్కనే ఉండే దవ్వరేఖలోని కణాలు విభజన శక్తిని పొందడం వల్ల ఏర్పడే ద్వితీయ విభాజ్య కణజాలం.
పుంజాంతస్థ విభాజ్యకణావళి
- ఇది నాళికా పుంజంలోని దారువు మరియు పోషక కణజాలాల మధ్య ఉండే ద్వితీయ విభాజ్య కణజాలం.
e. వివృత నాళికాపుంజాలు
- సంయుక్త నాళికా పుంజంలో పోషక కణజాలం, దారువు మధ్య విభాజ్య కణావళి ఉండే స్థితి.
సంవృత నాళికాపుంజాలు
- సంయుక్త నాళికా పుంజంలో పోషక కణజాలం, దారువు మధ్య విభాజ్య కణావళి లేని స్థితి.
f. కాండకేశం
- ఇవి బహుళకణయుతం
- దీని బాహ్యత్వచం అవభాసినితో కప్పబడి ఉంటుంది.
- ఇవి నీటి శోషణను నియంత్రిస్తాయి.
మూలకేశం
- ఇవి ఏకకణయుతం
- దీని బాహ్యత్వచం అవభాసినితో కప్పబడి ఉండదు.
- ఇవి నేలనుండి నీటిని శోషించుకుంటాయి.
g. అంతర్దారువు
- ద్వితీయ దారువులో ముఖ్యభాగం.
- ఇది నీటిని ప్రసరింపచేయదు.
- దీని కాలవ్యవధి ఎక్కువ
- ఇది ముదురుగా, దృఢంగా ఉంటుంది.
రసదారువు
- ద్వితీయ దారువులో అల్పభాగం
- ఇది నీటిని ప్రసరింపచేస్తుంది.
- దీని కాలావ్యవధి తక్కువ
- ఇది లేతగా మరియు మృదువుగా ఉంటుంది.
h. వసంతదారువు లేదా తొలి దారువు
- విశాలమైన అవకాశికలతో వసంత ఋతువులో ఏర్పడే దారువును వసంతదారువు అంటారు.
- ఇది లేత వర్ణంలో ఉంటుంది.
- సంవత్సరంలో ఇది ముందు ఏర్పడుతుంది.
- దీనికి అధిక నీరు, ఖనిజాలు అవసరం
శరద్దారువు లేదా మలి దారువు
- సన్నని అవకాశికలతో శరదృతువులో ఏర్పడే దారువును శరద్దారువు అంటారు.
- ఇది ముదురు వర్ణంలో ఉంటుంది.
- సంవత్సరంలో ఇది చివరలో ఏర్పడుతుంది.
- దీనికి తక్కువ నీరు, ఖనిజాలు అవసరం
ప్రశ్న 8.
పత్రరంధ్ర పరికరం అంటే ఏమిటి? భాగాలను గుర్తించిన పటంతో పత్రరంధ్రం నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
పత్రరంధ్ర పరికరం:పత్రరంధ్రం రక్షక కణాలు, వాటిని చుట్టు ఉండే అనుబంధ కణాలను కలిపి పత్రరంధ్ర పరికరం అంటారు.
పత్రరంధ్రం నిర్మాణం:
- మొక్కల పత్రాలపై ఉండే సూక్ష్మరంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు.
- ద్విదళబీజ ఆకులలో పత్రరంధ్రాలు క్రింది తలంపై ఎక్కువ మరియు పై తలంపై తక్కువగా ఉంటాయి.
- ఏకదళబీజ ఆకులలో పత్రరంధ్రాలు రెండు తలములపై సమానముగా ఉంటాయి.
- ప్రతి పత్రరంధ్రం చిక్కుడు గింజాకార కణాలను రక్షణ కణాలుగా కలిగి ఉంటాయి.
- గడ్డిమొక్కలలో రక్షక కణాలు ముద్గురాకారంలో ఉంటాయి.
- రక్షక కణాలు వెలుపలి కుడ్యాలు పలుచగాను, లోపల కుడ్యాలు మందంగా ఉంటాయి.
- రక్షక కణాలు హరితరేణువును కల్గి ఉంటాయి. ఇవి పత్రరంధ్రాలు మూసుకోవడాన్ని తెరుచుకోవడాన్ని నియంత్రిస్తాయి.
- రక్షక కణాలు చుట్టూ ఉండే బాహ్య చర్మకణాలనుఅనుబంధ కణాలు అంటారు.
ప్రశ్న 9.
ద్విదళబీజ కాండం అడ్డుకోతను వివరించండి. [TS M-15][AP M-17]
జవాబు:
ద్విదళ బీజకాండం అడ్డుకోతలోని మూడు ముఖ్య భాగాలు: I. బాహ్యచర్మం II. వల్కలము III.ప్రసరణ స్తంభము
I. బాహ్య చర్మం:
- ఇది కాండం యొక్క వెలుపలి పొర.
- ఇది ఏకకణమందంతో,దీర్ఘచతురస్రాకార కణాలతో ఉంటుంది.
- దీనిపై ‘మూలకేశాలు’ ఉంటాయి.
- పలుచటి అవభాసిని ఉంటుంది.
- ‘పత్రరంధ్రాలు’ వాయువుల వినిమయానికి తోడ్పడతాయి.
- బాహ్యచర్మం లోపలి కణజాలాలకు రక్షణ కలిగిస్తుంది.
II. వల్కలము: ఇది బాహ్యచర్మం మరియు ప్రసరణ స్తంభానికి మధ్యభాగంలో ఉన్న భాగం. దీనిలోని 3 ఉపభాగాలు:
a) అధశ్చర్మము
- ఇది బాహ్యచర్మం క్రింద ఉంటుంది.
- ఇది స్థూలకోణీయ కణజాలముతో ఏర్పడి ఉన్న పొర.
- ఇది కాండమునకు యాంత్రిక దృఢత్వాన్ని ఇస్తుంది.
b) మృదు కణజాలము (సామాన్య వల్కలము):
- ఇది అధశ్చర్మం కింద మృదుకణజాలంతో ఏర్పడి ఉంటుంది.
- ఇది అనేక గ్రంధులను కలిగి ఉంటుంది.
c) అంతశ్చర్మము:
- వల్కలం లోపల క్రింది వరుసలో ఉండే కణాల పొరను అంతశ్చర్మము అంటారు.
- ఇది పీపా ఆకారం గల కణాలతో, కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉంటాయి.
- ఇది అనేక పిండి రేణువులను కలిగి ఉంటుంది. కనుక దీనిని ‘పిండిపొర’ అంటారు.
- కణాల వ్యాసార్ధ కవచాల పైన, అడ్డు కవచాల పైన ‘కాస్పేరియన్ పట్టీలు’ ఉంటాయి.
III. ప్రసరణ స్తంభము: ఇది కాండం మధ్య భాగంలో కనిపించే స్థూపం వంటి నిర్మాణము.
దీనిలోని భాగాలు: (a) పరిచక్రము (b) నాళికాపుంజాలు (c) దవ్వ (d) దవ్వరేఖలు
(a) పరిచక్రము: ఇది ప్రసరణ స్తంభమును కప్పి ఉంచే పొర. ఇది ఏకకణయుత వలయం.
(b) నాళికాపుంజాలు:
- ప్రసరణ స్తంభములో నాళికాపుంజాలు (7-15) అమరి ఉంటాయి.
- ప్రతి నాళికాపుంజం శుంఖు ఆకారంలో, సంయుక్తం, సమపార్శ్వం, వివృతంగా అమరి ఉంటాయి.
- ప్రతి నాళికాపుంజం పుంజపు తొడుగుతో కప్పబడి ఉంటుంది.
- దారువు, పోషక కణజాలాల మధ్య ‘విభాజ్యకణజాలం’ ఉంటుంది.
(c) దవ్వ:
- ఇది ప్రసరణ స్తంభంలోని మధ్య భాగము.
- ఇది ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది.
(d) దవ్వరేఖలు:
- నాళికాపుంజాల మధ్య ఉన్న కణాలు వ్యాసార్థంగా అమరిన దవ్వ రేఖలు.
- ఇవి ఆహార పదార్థాల పార్శ్వ ప్రసరణకు ఉపయోగపడును.
ప్రశ్న 10.
ఏకదళ బీజకాండం అడ్డుకోతను వివరించండి.
జవాబు:
ఏకదళబీజకాండం అడ్డుకోతలోని నాలుగు ముఖ్య భాగాలు:
- బాహ్యచర్మము
- అధశ్చర్మము
- సంధాయక కణజాలము
- నాళికా పుంజాలు
I. బాహ్య చర్మం:
- ఇది కాండం యొక్క వెలుపలి పొర.
- ఇది ఏకకణమందంతో దీర్ఘచతురస్రాకార కణాలతో ఏర్పడి ఉంటుంది.
- ఇందులో మూలకేశాలు ఉండవు.
- బాహ్య చర్మం పై మందమైన అవభాసిని ఉంటుంది.
- పత్రరంధ్రాలు వాయువుల వినిమయానికి తోడ్పడతాయి.
- బాహ్యచర్మం లోపలి కణజాలాలకు రక్షణ కలిగిస్తుంది.
II. అధశ్చర్మము:
- ఇది బాహ్యచర్మం క్రింద ఉంటుంది.
- ఇది దృఢకణజాలయుతంగా ఉండి కాండంకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
III. సంధాయక కణజాలము:
- నాళికాపుంజాలు తప్ప కాండంలో మిగిలిన భాగాన్ని సంధాయక కణజాలము అంటారు.
- ఇది మృదుకణజాలముతో ఉంటుంది.
- ఇది ఆహార పదార్థాల నిల్వలో తోడ్పడుతుంది.
IV. నాళికా పుంజాలు:
- సంధాయక కణజాలంలో అనేక నాళికా పుంజాలు చెల్లాచెదురుగా అండాకారంలో ఉంటాయి.
- నాళికాపుంజాలు సంయుక్తం, సహపార్శ్వం, సంవృతం.
- నాళికా పుంజాలు పుంజపు తొడుగుతో కప్పబడి ఉంటాయి.
- వీటిలో విభాజ్య కణజాలం ఉండదు.
ప్రశ్న 11.
ద్విదళ బీజ వేరు అంతర్నిర్మాణాన్ని వర్ణించండి. [AP M-15] [AP M-18,22][TS M-18,22]
జవాబు:
ద్విదళ బీజ వేరు అడ్డుకోతలోని మూడు ముఖ్య భాగాలు:
I. బాహ్యచర్మం
II. వల్కలం
III. ప్రసరణ స్తంభం
I. బాహ్యచర్మం:
- ఇది వేరు యొక్క వెలుపలి పొర.
- ఇది ఏకకణమందంతో దీర్ఘచతురస్రాకార కణాలతో ఉంటుంది.
- ఇందులో మూలకేశాలు ఉంటాయి. అవి నీటిని పీల్చుకొనుటకు సహాయపడతాయి.
- ఇందులో అవభాసిని, పత్రరంధ్రాలు ఉండవు.
- బాహ్యచర్మం లోపలి కణజాలాలకు రక్షణ కలిగిస్తుంది.
II. వల్కలం :
ఇది బాహ్యచర్మానికి, ప్రసరణ స్తంభానికి మధ్య గల భాగం. దీనిలోని మూడు ఉపభాగాలు:
a) బాహ్యోపరిచర్మం:
- ఇది 2-3 వరసల సూబరిన్ కణాలతో ఏర్పడి ఉంటుంది.
- వల్కలం నుండి నీరు వెలుపలికి పోకుండా ఇది నిరోధిస్తుంది.
b) మృదు కణజాలము (సామాన్య వల్కలము):
- ఇది అధశ్చర్మం కింద మృదుకణజాలంతో ఏర్పడి ఉంటుంది.
- ఇది అనేక గ్రంధులను కలిగి ఉంటుంది.
c) అంతశ్చర్మం:
- ఇది వల్కలం లోపలి కణాలతో ఏర్పడిన పొర.
- ఇందులో పీపాకార కణాలు దట్టంగా అమరి ఉంటాయి.
- అంతశ్చర్మంలో “కాస్పేరియన్ మందాలు” కనిపిస్తాయి.
III. ప్రసరణ స్తంభం:
- ఇది వేరు మధ్య భాగంలో ఉండే స్థూపాకార భాగం.
- దీనిలోని భాగాలు (a) పరిచక్రం (b) నాళికాపుంజాలు (c) దవ్వ
a). పరిచక్రం:
- ఇది ప్రసరణ స్తంభమును కప్పి ఉంచే ఏకశ్రేణియుతమైన పొర.
- పరిచక్ర కణాల నుండి పార్శ్వ వేర్లు ఏర్పడతాయి. ఇందులో ద్వితీయ వృద్ధి కనబడుతుంది.
b) నాళికాపుంజాలు:
- దారువు మరియు పోషక కణజాలపుంజాలు వేరు వేరు వ్యాసార్ధ రేఖల మీద అమరి ఉంటాయి.
- సాధారణంగా 4 దారువు పుంజాలు మరియు 4 పోషక కణజాలాల పుంజాలు ఉంటాయి.
- ఈ స్థితినే “చతుష ప్రథమదారుకం” అంటారు.
- ఈ దారువు నీటిని సరఫరా చేస్తుంది. పోషక కణజాలం ఆహారాన్ని సరఫరా చేస్తుంది.
c) దవ్వ:
- దవ్వ చిన్నదిగా ఉంటుంది లేదా స్పష్టంగా గోచరించదు.
- ఇది నీరు, ఆహార పదార్థాలను నిల్వ చేయడంలో తోడ్పడుతుంది.
ప్రశ్న 12.
ఏకదళ బీజ వేరు అంతర్నిర్మాణాన్ని వర్ణించండి. [AP M-20]
జవాబు:
ఏకదళ బీజ వేరు అడ్డుకోతలోని మూడు ముఖ్య భాగాలు:
I. బాహ్యచర్మం
II. వల్కలం
III. ప్రసరణ స్తంభం
I. బాహ్యచర్మం:
- ఇది వేరు యొక్క వెలుపలి పొర.
- ఇది ఏకకణమందంతో దీర్ఘచతురస్రాకార కణాలతో ఉంటుంది.
- ఇందులో మూలకేశాలు ఉంటాయి. అవి నీటిని పీల్చుకొనుటకు సహాయపడతాయి.
- ఇందులో అవభాసిని, పత్రరంధ్రాలు ఉండవు.
- బాహ్యచర్మం లోపలి కణజాలాలకు రక్షణ కలిగిస్తుంది.
II. వల్కలం :
ఇది బాహ్యచర్మానికి, ప్రసరణ స్తంభానికి మధ్య గల భాగం. దీనిలోని మూడు ఉపభాగాలు:
a) బాహ్యోపరిచర్మం:
- ఇది 2-3 వరసల సూబరిన్ కణాలతో ఏర్పడి ఉంటుంది.
- వల్కలం నుండి నీరు వెలుపలికి పోకుండా ఇది నిరోధిస్తుంది.
b) మృదు కణజాలము (సామాన్య వల్కలము):
- ఇది అధశ్చర్మం కింద మృదుకణజాలంతో ఏర్పడి ఉంటుంది.
- ఇది అనేక గ్రంధులను కలిగి ఉంటుంది.
c) అంతశ్చర్మం:
- ఇది వల్కలం లోపలి కణాలతో ఏర్పడిన పొర.
- ఇందులో పీపాకార కణాలు దట్టంగా అమరి ఉంటాయి.
- అంతశ్చర్మంలో “కాస్పేరియన్ పట్టీలు” కనిపిస్తాయి.
III. ప్రసరణ స్తంభం:
- ఇది వేరు మధ్య భాగంలో ఉండే స్థూపాకార భాగం.
- దీనిలోని భాగాలు (a) పరిచక్రం (b) నాళికాపుంజాలు (c) దవ్వ
a) పరిచక్రం:
- ఇది ప్రసరణ స్తంభమును కప్పి ఉంచే ఏకశ్రేణియుతమైన పొర.
- దీని నుండి పార్శ్వ వేర్లు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ద్వితీయ వృద్ధి కనబడదు.
b) నాళికాపుంజాలు:
- దారువు మరియు పోషక కణజాలపుంజాలు వేరు వేరు వ్యాసార్ధ రేఖలపై ఉంటాయి.
- సాధారణంగా దారువు పోషకకణజాలం 6 నుండి 8 సంఖ్యలో ఉంటుంది.
- ఈ స్థితిని ‘బహుప్రథమదారువు” అంటారు.
- ఈ దారువు నీటిని సరఫరా చేస్తుంది. పోషక కణజాలం ఆహారాన్ని సరఫరా చేస్తుంది.
c) దవ్వ:
- ఏకదళ వేరులో దవ్వ పెద్దదిగా మృదు కణజాలంతో నిర్మితమై ఉంటుంది.
- ఇది నీరు, ఆహార పదార్ధాలను నిల్వ చేయడంలో తోడ్పడుతుంది.