SCERT AP Board 6th Class Telugu Solutions 6th Lesson సుభాషితాలు Textbook Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 6th Lesson సుభాషితాలు
6th Class Telugu 6th Lesson సుభాషితాలు Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రంలో ఎవరున్నారు?
జవాబు:
చిత్రంలో గురువుగారు, శిష్యులు ఉన్నారు.
ప్రశ్న 2.
గురువుగారు శిష్యులకు ఎటువంటి పద్యాలు చెబుతున్నారు?
జవాబు:
నీతి పద్యాలు, భక్తి పద్యాలు, లోకజ్ఞానం కలిగించే పద్యాలను గురువుగారు శిష్యులకు చెబుతున్నారు.
ప్రశ్న 3.
ఇలాంటి నీతిపద్యాలు మీకు తెలిసినవి చెప్పండి.
జవాబు:
1. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !
2. తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా ! గిట్టవా !
విశ్వదాభిరామ వినురవేమ !
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో, భావానికి తగినట్లుగా పాడండి.
జవాబు:
పద్యాలను స్పష్టంగా, అర్థవంతంగా, భావయుక్తంగా ఉపాధ్యాయుని అనుసరిస్తూ చదవండి.
ప్రశ్న 2.
‘కాలం చాలా విలువైంది’ ఎందుకో చర్చించండి.
జవాబు:
నిజంగానే కాలం చాలా విలువైంది. ఎందుకంటే గడిచిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగిరాదు. పోయిన డబ్బును తిరిగి సంపాదించవచ్చు. పోయిన పదవిని తిరిగి సంపాదించవచ్చు. పోయినదానిని దేనినైనా తిరిగి సంపాదించ * వచ్చు. కానీ కాలం మాత్రం తిరిగి సంపాదించలేం.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోతే చీకటిలో ఏ పనీ చేయలేం కదా ! కాలం దీపం వంటిది. కాలం ఉండగానే పనులు చేయాలి. కాలం వెళ్లిపోయాక ఏమీ చేయలేం. అంటే చిన్నతనంలో చదువుకోకపోతే, సరైన ఉద్యోగం దొరకదు, అందుకే సకాలంలోనే పనులు పూర్తిచేయాలి. ఎప్పటి పనులను అప్పుడు చేసేయాలి.
ప్రశ్న 3.
‘విద్య గొప్పతనం’ నాలుగు వాక్యాల్లో రాయండి.
జవాబు:
విద్య చాలా గొప్పదని నార్ల చిరంజీవిగారు చెప్పారు. విద్యను దొంగలెత్తుకు పోలేరు. ఎవ్వరూ దోచుకోలేరు. అన్నదమ్ములు విద్యను పంచుకోలేరు. విద్య వలననే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది.
ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
చెలిమి శిలాక్షర మెప్పుడు
అలుక జలాక్షరము సుజనులగు వారలకున్
చెలిమి జలాక్షర మెప్పుడు
అలుక శిలాక్షరము కుజనులగు వారలకున్
అ) అలుక ఎవరికి జలాక్షరం?
జవాబు:
మంచివారికి అలుక జలాక్షరం.
ఆ) ‘చెరిగిపోనిది’ అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడాడు?
జవాబు:
శిలాక్షరం అనే పదాన్ని చెరిగిపోనిది అనే అర్థంలో కవిగారు వాడారు.
ఇ) ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది?
జవాబు:
ఈ పద్యంలో ‘లకారం’ ఎక్కువగా 12 సార్లు వచ్చింది.
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
సుజనులు – కుజనులు
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
నీ దృష్టిలో స్నేహం అంటే ఏమిటి?
జవాబు:
స్నేహం అంటే, ఒకరిలో ఒకరు లోపాలు ఎంచుకోకూడదు. తప్పులుంటే సవరించాలి. ఆపదలో ఆదుకోవాలి. ఇద్దరి మధ్యా రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు.
ప్రశ్న 2.
“కోపంగాని, ఆవేశంగాని మంచివి కావు” ఎందుకో వివరించండి.
జవాబు:
కోపం, ఆవేశం రెండూ మంచివి కావు. కోపం వచ్చినపుడు ఆవేశం పెరుగుతుంది. ఆవేశం వస్తే కోపం పెరుగుతుంది. వీటి వలన అనవసరమైన మాటలు మాట్లాడతాం. అసహ్యకరంగా ప్రవర్తిస్తాం. స్నేహాలు చెడిపోతాయి. శత్రువులు పెరిగిపోతారు. లేనిపోని చిక్కులలో ఇరుక్కొంటాం, ఒక్కొక్కసారి ఉపాధిని కోల్పోతాం. జీవితం కూడా నాశనం కావచ్చు.
ప్రశ్న 3.
మనం స్త్రీలను ఎలా గౌరవించాలి?
జవాబు:
స్త్రీల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. గౌరవంగా మాట్లాడాలి. వారి మాటకు విలువ నివ్వాలి. వారి పనులను మెచ్చుకోవాలి. స్త్రీల విద్యను ప్రోత్సహించాలి.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఎటువంటి వారికి సహాయం చేయాలి? ఈ విషయాన్ని కవి ఎలా తెలియజేశారు?
జవాబు:
పేదవారికి సహాయం చేయాలి. ఈ విషయాన్ని కవిగారు చాలా చక్కగా వివరించారు. ధనవంతునికి చేసిన సహాయం వలన ప్రయోజనం లేదు. పేదవారికి చేసిన సహాయం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది. ఎండిపోతున్న చేలమీద వర్షం పడితే ప్రయోజనం ఉంటుంది. అదే వర్షం సముద్రంమీద పడితే ప్రయోజనం లేదు.
అంటే పేదవాడికి డబ్బు అవసరం. వాడిన చేనుకు వర్షం అవసరం. పేదవాడిని ఎండిపోతున్న చేనుతో పోల్చాడు. ధనవంతుని వంటి సముద్రంపై పడిన వాన వృథా అని ధనవంతుని సముద్రంతో పోల్చి చక్కగా చెప్పారు.
ప్రశ్న 2.
మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేవి?
జవాబు:
మంచి నోములు నోచిన తల్లిదండ్రులకు మంచి కుమారుడొక్కడు చాలు. వాడు ఎక్కడా దేనికీ చేయి చాపకూడదు. ఎవరైన తనను చెయ్యిచాపి అడిగితే లేదనకూడదు. వాడు నోరువిప్పితే నిజమే చెప్పాలి. అబద్దాలు చెప్పకూడదు. యుద్ధంలో వెనుదిరగనివాడు కావాలి. ఈ విధంగా మంచి కుమారునికి మంచి లక్షణాలుండాలి.
ప్రశ్న 3.
పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి గుణాలు రాయండి.
జవాబు:
సమయం వృథా చేయకూడదు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసేయాలి. భూమిని నాది నాది అని పాకులాడ కూడదు. ధనాన్ని దానం చేయాలి. యుద్ధరంగంలో భయపడకూడదు.
చదువును దొంగలెత్తుకుపోలేరు, పరిపాలకులు దోచుకోలేరు, అన్నదమ్ములు పంచుకోలేరు. ప్రపంచం అభివృద్ధి చెందాలంటే విద్య కావాలి. విద్యకు సాటి వచ్చే ధనం లేదు. ఎవ్వరి మనసుకూ బాధ కలిగించేలా మాట్లాడకూడదు. కోపం, ఆవేశం పనికిరాదు. వాటివల్ల చాలా తప్పులు జరుగుతాయి. చెడును మరచిపోవాలి. మంచిని గుర్తుపెట్టు కోవాలి. అందరితోనూ మర్యాదగా ఉండాలి. పుస్తకాలు చదవడం కంటే ఇతరుల మనసులు తెలుసుకోవడం గొప్ప విద్య. పేదలకు సహాయం చేయాలి. ఎవరి దగ్గరా చేయి చాపకూడదు. అడిగితే ఇవ్వాలి, నిజాలే చెప్పాలి.
భాషాంశాలు
అ) కింది గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
సిరి కలిగి ఉండటం వలన గర్వించకూడదు.
సిరి = సంపద
సంపద ఎవరి వద్ద స్థిరంగా ఉండదు.
1. ఏ పనినైనా విచక్షణతో చేసేవారే బుధులు.
జవాబు:
బుధులు = పండితులు
పండితులు గౌరవింపదగినవారు.
2. రైతులు ధరణిని నమ్ముకొని జీవిస్తారు.
జవాబు:
ధరణి = భూమి
అన్ని జీవులకూ ఈ భూమిపై జీవించే హక్కు ఉంది.
3. అంబుధి లో నీరు త్రాగడానికి పనికిరాదు.
జవాబు:
అంబుధి = సముద్రం
సముద్రంలో ఓడలు ప్రయాణిస్తాయి.
ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలను (పర్యాయపదాలు) గుర్తించి రాయండి.
1. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. తరువుల రక్షణ మనందరి బాధ్యత.
జవాబు:
వృక్షాలు, తరువులు
2. భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు. లోకానికి వెలుగు నిచ్చేవాడు సూర్యుడు.
జవాబు:
భాస్కరుడు, సూర్యుడు
3. యుద్ధం వలన అనేక నష్టాలు ఉన్నాయి. కాబట్టి రణం లేకుండా కలసిమెలసి ఉండాలి.
జవాబు:
యుద్ధం, రణం
ఇ) కింది గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలు రాయండి.
1. ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.
జవాబు:
అమర్యాద
2. సంతోషం సగం బలం.
జవాబు:
విచారం
3. ఈ ప్రదేశం సహజ సుందరంగా ఉంది.
జవాబు:
అసహజం
కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
1. శ్రీ | అ) రోసం |
2. దీపము | ఆ) సిరి |
3. రోషం | ఇ) దివ్వె |
జవాబు:
1. శ్రీ | ఆ) సిరి |
2. దీపము | ఇ) దివ్వె |
3. రోషం | అ) రోసం |
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను పరిశీలించండి.
మాయమ్మ = మా + య్ + అమ్మ
మీ యిల్లు = మీ + య్ + ఇల్లు
పై పదాల మధ్య ‘య్’ అదనంగా వచ్చి చేరింది. అలా చేరడాన్ని ‘యడాగమం’ అంటారు.
కింది పదాలను విడదీయండి.
ఉదా : మేనయత్త = మేన + య్ + అత్త
ఉన్నయూరు = ఉన్న + య్ + ఊరు
సరియైన = సరి + య్ + ఐన
నాదియన్న = నాది + య్ + అన్న
ఆ) కింది పదాలను విడదీయండి.
ఏమంటివి = ఏమి + అంటివి (మ్ + ఇ + అ = మ) సంధి జరిగితే.
ఏమియంటివి = ఏమి + య్ + అంటివి (య్ + అ = య) సంధి జరగకపోతే.
పై పదాల వలె కింది పదాలను విడదీయండి.
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు (ర్ + ఇ + ఇ = రి) సంధి జరిగితే.
వచ్చిరియిప్పుడు = వచ్చిరి + య్ + ఇప్పుడు (య్ + ఇ = యి) సంధి జరగకపోతే.
పై పదాలను విడదీసినప్పుడు మొదటిపదం చివరన ‘ఇ’ (ఇత్వం) ఉంది. రెండవ పదం మొదట అ, ఇ వంటి అచ్చులు వచ్చాయి. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని ‘వైకల్పికం’ అంటారు.
కింది పదాలను విడదీసి రాయండి.
ఉదా : నాదన్న = నాది + అన్న
నాదియన్న = నాది + య్ + అన్న
అదొకటి = అది + ఒకటి
అదియొకటి = అది + య్ + ఒకటి
లేకున్న = లేక + ఉన్న
లేకయున్న = లేక + య్ + ఉన్న
కింది పదాలను కలిపి రాయండి.
ఉదా : మఱి + ఏమి = మఱేమి = మఱియేమి
ఇది + అంత = ఇదంత = ఇదియంత
రానిది + అని = రానిదని = రానిదియని
అది + ఎట్లు = అదెట్లు = అదియెట్లు
ఇ) కింద ఇచ్చిన పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
కాలమూరక = కాలము + ఊరక – (య్ + ఉ + ఊ = మూ) – (ఉత్వ సంధి)
దీపమున్న = దీపము + ఉన్న – (య్ + ఉ + ఉ = ము) – (ఉత్వ సంధి)
నేరములెన్నడు = నేరములు + ఎన్నడు (ల్ + ఉ + ఎ = లె) – (ఉత్వ సంధి)
కింద ఇచ్చిన పదాలను కలిపి సంధి పేరు రాయండి.
జనములు + – అందరు = జనములందరు (ఉత్వ సంధి)
మేలు + అది = మేలది (ఉత్వ సంధి)
మేఘుడు + ఒక = మేఘుడొక (ఉత్వ సంధి)
ఈ) సమాసం :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తరపదమని అంటారు.
ఉదా : సరస్వతీ మందిరం – సరస్వతి యొక్క మందిరం
పై ఉదాహరణలో సరస్వతి పూర్వపదం, మందిరం ఉత్తరపదం ఇలా సమాసాలు ఏర్పడతాయి.
ఉ) ద్వంద్వ సమాసం :
సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం.
ఉదా :
సూర్యచంద్రులు = సూర్యుడును, చంద్రుడును
తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును
రామలక్ష్మణులు = రాముడును, లక్ష్మణుడును
“ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు” అని సూత్రం.
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
రాత్రింబవళ్ళు = రాత్రియు, పవలును
బంధుమిత్రులు = బంధువులును, మిత్రులును
బాలబాలికలు = బాలురును, బాలికలను
కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి.
రోషమును, ఆవేశమును = రోషావేశములు
అన్నయు, తమ్ముడును = అన్నదమ్ములు
కూరయు, కాయయు = కూరగాయలు
ఊ) కింది వాక్యాలను గమనించండి.
1. స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు.
2. మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది.
3. జీవితంలో జయాపజయాలు ఉంటాయి.
4. రవితో రహీం బడికి వెళ్ళాడు.
పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. అర్థవంతంగా లేవు కదా !
ఉదా :
చెట్లు ఫలాల బరువెక్కాయి.
ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ‘చేత’ అనే ప్రత్యయం ఉపయోగించి చదవండి. చెట్లు ఫలాల చేత బరువెక్కాయి. ఇలా పదాల మధ్య అర్థసంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు.
కింది ప్రత్యయాలను విభక్తులను తెలుసుకోండి.
ప్రత్యయాలు | విభక్తులు |
డు,ము,వు,లు | ప్రథమా విభక్తి |
ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి | ద్వితీయా విభక్తి |
చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్) | తృతీయా విభక్తి |
కొఱకు(న్), కై (కోసం) | చతుర్థి విభక్తి |
వలన(న్), కంటె(న్), పట్టి | పంచమీ విభక్తి |
కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్) | షష్ఠీ విభక్తి |
అందు(న్), న(న్) | సప్తమీ విభక్తి |
ఓ, ఓయి, ఓరి, ఓసి | సంబోధన ప్రథమా విభక్తి |
చమత్కార పద్యం
హరి కుమారుడై యొప్పెడునాతడు హరి
హరికి దక్షిణనేత్రమౌ నాతడు హరి
హరికి శిరముతోడ వరలు నాతడు హరి
హరికి వామాక్షమౌ యొప్పునాతడు హరి
నానార్థాలు :
హరి = కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు
1. సూర్యుని కొడుకు సుగ్రీవుడు.
2. శ్రీహరి కుడికన్ను సూర్యుడు.
3. సింహపు తలతో ఒప్పువాడు శ్రీహరి.
4. శ్రీహరికి ఎడమ కన్ను చంద్రుడు అని ఇలా చెప్పుకోవాలి.
సుభాషితాలు కవుల పరిచయాలు
1. నార్ల చిరంజీవి : 20వ శతాబ్దం
జననం : 1.1.1925, కృష్ణాజిల్లా, గన్నవరం తాలూకా కాటూరులో జన్మించారు.
రచనలు : ఎర్ర గులాబీ, తెలుగుపూలు, కర్రా చెప్పులు, పేనూ – పెసరచేనూ, భాగ్యనగరం (నాటిక) మొ||వి రచించారు. 16. 10. 1971న అనారోగ్యంతో మరణించారు. ఈ పాఠం తెలుగుపూలు శతకంలోనిది.
2. వేమన : 17వ శతాబ్దం
జననం : 1652, రాయలసీమ
వృత్తి : అచలయోగి, కవి, సంఘసంస్కర్త. 1730లో స్వర్గస్తులయ్యారు.
3. కరుణశ్రీ : 20వ శతాబ్దం
పేరు : జంధ్యాల పాపయ్యశాస్త్రి
జననం : 4.8. 1912, గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం, కొమ్మూరు.
వృత్తి : లెక్చరర్,
తల్లిదండ్రులు : మహాలక్ష్మమ్మ, పరదేశయ్య
రచనలు : పుష్పవిలాపం, కుంతీకుమారి, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్ ఖయ్యూం, ఆనందలహరి మొదలైనవి. 21.6. 1992న స్వర్గస్తులయ్యారు.
4. తిక్కన : 13వ శతాబ్దం
రచనలు : నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం 15 పర్వాలు.
బిరుదులు : కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు. మనుమసిద్ధి ఆస్థాన కవి.
5. పక్కి అప్పల నరసింహం : 17వ శతాబ్దం.
రచనలు : కుమారా, కుమారీ శతకాలు.
6. పోతులూరి వీరబ్రహ్మం : 17వ శతాబ్దం
జననం : 1610, కడప.
రచనలు : కాలజ్ఞానం, కాళికాంబా సప్తశతి. 1693లో స్వర్గస్తులయ్యారు.
7. మారద వెంకయ్య : 16వ శతాబ్దం
మారద వెంకయ్య – మారయ వెంకయ్య, మారవి వెంకయ్య అని పేర్లు ఉన్నాయి.
జననం : 1550 శ్రీకాకుళం, విశాఖలలో జీవించారు.
రచన : భాస్కరశతకం
1650లో స్వర్గస్తులయ్యారు.
8. కంచర్ల గోపన్న : 17వ శతాబ్దం.
ఇతర పేర్లు వృత్తి భక్త రామదాసు
జననం : 1620లో ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి.
వృత్తి : తహసిల్దారు – పాల్వంచ పరగణా
తల్లిదండ్రులు : కామాంబ, లింగన్న మూర్తి
భార్య : కమలమ్మ
పిల్లలు : రఘునాథ
రచనలు : రామ కీర్తనలు, దాశరథీ శతకం
పద్యాలు – అర్థాలు – భావాలు
1.ఆ.వె. కడచి పోయి నట్టి క్షణము తిరిగిరాదు
కాలమూర కెపుడు గడపబోకు
దీపమున్న యపుడె దిద్దుకోవలె నిల్లు
విలువ దెలిసి చదువు తెలుగుబిడ్డ !
అర్థాలు :
కడచి పోయిన = జరిగిపోయిన
గడపబోకు = కాలక్షేపం చేయకు
భావం :
తెలుగుబిడ్డా ! జరిగిపోయిన సమయం. తిరిగి రాదు. కాబట్టి కాలాన్ని వృథాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి.
2.ఆ.వె. భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ !
అర్థాలు :
దానహీనుడు = దానము చేయనివాడు
కదనము = యుద్ధము
భీతుడు = భయపడేవాడు, పిరికివాడు
కాలుండు = యముడు
భావం :
ప్రపంచాన్ని సృష్టించి యిచ్చిన రామా ! వేమా ! ఎంతోమంది జన్మించి మరణించిన ఈ భూమి నాది అంటే వాడి అమాయకత్వానికి భూమి నవ్వుతుంది. దానం చేయకుండా ధనాన్ని దాచుకొనే అశాశ్వతుడైన మనిషిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా మరణం తప్పదు కదా ! యుద్ధానికి భయపడే వాడిని చూస్తే యమధర్మరాజు నవ్వుతాడు.
3.ఆ.వె. దొరలు దోచలేరు, దొంగ లెత్తుక పోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా
లలిత సుగుణజాల తెలుగుబాల !
అర్థాలు :
దొరలు = పరిపాలకులు
భ్రాతృజనము = అన్నదమ్ములు
విశ్వం = ప్రపంచం
వర్ధనంబు = అభివృద్ధి చేసేది
విద్యాధనంబు = విద్య అనెడు ధనం
భావం :
తెలుగుబాల ! విద్యా ధనాన్ని దొరలు దోచుకోలేరు. దొంగలు ఎత్తుకుపోలేరు. అన్నదమ్ములు వచ్చి పంచు కోలేరు. ఈ విద్యా ధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం.
4.కం. తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతినిష్టురతన్
మనమున నాటిన మాటలు
వినుమెన్ని యుపాయములను వెడలునే యధిపా
అర్థాలు :
అలుగు = బాణపు చివరి మొన
అనువున = తగిన తెలివితో (ఉపాయంతో)
పుచ్చంగవచ్చు = తీయవచ్చు
మనమున = మనసులో
అతి = ఎక్కువ
నాటిన = దిగిన
తనువున = శరీరంలో
అధిపా = ఓ రాజా !
భావం :
ఓ రాజా ! శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించుకోవచ్చు. కాని అతి పరుషంగా మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చు కుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు. అవి తొలగిపోవు.
5.కం. రోషావేశము జనులకు
దోషము, తలపోయ విపుల దుఃఖకరము నౌ;
రోషము విడిచిన యెడ సం
చూస్తే యమధర్మరాజు నవ్వుతాడు.
తోషింతురు బుధులు హితము దోప కుమారా !
అర్థాలు :
రోషము = కోపం
ఆవేశం = ఉద్రేకం
దోషము = తప్పు
తలపోయ = ఆలోచించగా
విపుల = చాలా
దుఃఖకరము = బాధ కలిగించేది
బుధులు = పండితులు
హితము ఆ = మేలు
భావం :
ఓ కుమారా ! కోపం, ఉద్రేకం కలిగి ఉండడం చాలా తప్పు. ఆలోచించగా అవే బాధలను కలిగిస్తాయి. కోపం విడిచి పెడితే పండితులు సంతోషిస్తారు. మంచి జరుగుతుంది.
6.కం. మఱవ వలెఁ గీడు, నెన్నఁడు
మఱవంగా రాదు మేలు, మర్యాదలతో
దిరుగవలె సర్వ జనముల
దరి, బ్రేమ మెలంగవలయు ధరణి కుమారీ !
అర్థాలు :
కీడు = ఆపద
మేలు = మంచి
సర్వజనములు = అందరు జనులూ
దరి = సమీపంలో
మెలగుట = ప్రవర్తించుట
ధరణి = భూమి
భావం :
ఓ కుమారీ ! ఒకరు చేసిన కీడు మరచిపోవాలి. కాని ఇతరులు మనకి చేసిన మేలును ఎన్నడూ మరచిపోకూడదు. అందరి పట్ల అనురాగంతో, ప్రేమతో ప్రవర్తించాలి.
7.ఆ.వె. పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు
హృదయసంపుటముల చదువవలయు
పారిశుధ్యమొకటే పరమాత్మ చేర్చును
కాళికాంబ ! హంస ! కాళికాంబ !
అర్థాలు :
పూర్ణత్వం = పరిపూర్ణత
అబ్బదు = కలగదు
సంపుటము = (భావాల) సమూహం
భావం :
ఓ కాళికాంబా ! పుస్తకాలు చదివినందు వల్ల పూర్ణత్వం లభించదు, మనసులో ఉండే భావాలను చదవాలి. పరిశుభ్రత మనలను పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది. పుస్తక జ్ఞానం కంటే ఎదుటివారి హృదయాలను చదవటం ముఖ్యం. మనిషి మనసు, వాక్కు, కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం.
8.చ. సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలంబగున్
నెఱిగుఱిగాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్పలంబగున్
వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేల మీఁదటం
గుఱిసినఁ గాక యంబుథులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా!
అర్థాలు :
సిరిగలవాడు = ధనవంతుడు
ఎయ్యెడల = ఏ పరిస్థితులలో నైనా
నిష్ఫలంబు = ఫలితం ఉండదు
నెఱి = నిండైన
గుఱి = లక్ష్యం
సత్పలంబు = మంచి ఫలితం
వఱపున = వర్షం లేనపుడు
అంబుధి = సముద్రం
భాస్కరా ! = ఓ సూర్యదేవా !
భావం : భాస్కరా ! ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేఘుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది గాని సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా !
9.ఉ. నోఁచిన తల్లిదండ్రికిఁ దనూభవుఁ డొక్కడే చాలు మేటి చే
చాఁచనివాడు వేడొకఁడు చాఁచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్
దాఁచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
అర్థాలు :
పయోనిధి = సముద్రం
కరుణాపయోనిధీ = దయాసముద్రుడా !
నోచిన – నోములు చేసిన
తనూభవుడు = కుమారుడు
మేటి = గొప్పవాడు
చేచాచడం = ఇతరులను అడగడం
నోరాచి = నోరు తెరచి
పలుకాడడం = మాట్లాడడం
రణంబు ఆ = యుద్ధము
మేన్ = శరీరం
దాశరథి = దశరథుని
కుమారుడు = రాముడు
గిరి = పర్వతం
భావం :
దయాసముద్రుడవైన ఓ రామా ! ఎవరి దగ్గరా చేయి చాపనివాడు, అడిగితే లేదనకుండా దానం ఇచ్చేవాడు, నోరు తెరచి నిజం తప్ప అబద్దం చెప్పనివాడు. యుద్ధంలో వెన్ను చూపనివాడు అదృష్ట వంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకు ఒక్కడుంటే చాలు గదా !