AP 10th Class Telugu Question Paper June 2023 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers and AP 10th Class Telugu Question Paper June 2023 can significantly boost overall exam scores.

AP SSC Telugu Question Paper June 2023 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I (32 మా)
I. అవగాహన – ప్రతిస్పందన: (1 × 8 = 8 మా)

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము.

పొదలి యొండొండ దివియును భువియు దిశలుఁ
బొదివికొనియుండు చీఁకటిప్రోవు వలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
కరవటంబన జగదండఖండ మమరె.

ప్రశ్నలు :

అ) పద్యంలో చీకటిని దేనితో పోల్చారు?
జవాబు:
పద్యంలో చీకటిని బాగా కాటుక నింపిన బరిణెతో పోల్చారు.

ఆ) చీకటి వ్యాపించడం వలన విశ్వమంతా ఎలా కనిపించింది?
జవాబు:
చీకటి వ్యాపించడం వలన విశ్వమంతా నల్లగా కనిపించింది.

ఇ) చీకటి ఎక్కడెక్కడ వ్యాపించింది?
జవాబు:
చీకటి, ఆకాశం, భూమి దిక్కులలో వ్యాపించింది.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పై పద్యంలో దేనిని వర్ణించారు?

(లేదా)

గిరి గ్రుంగఁద్రొక్కి చెంగున
హరి నింగికి దాఁటుగొనిన హరిహరి యపుడా
హరి యెగసినట్లు దోఁచక
యెగసినయట్లు తోఁచెఁ గెళవుల కెల్లన్.

ప్రశ్నలు :

ఉ) పద్యంలో హనుమంతుడిని సంబోధించిన పేరు ఏది’?
జవాబు:
పద్యంలో హనుమంతుడిని ‘హరి’ అని సంబోధించారు.

ఊ) దేనిని దాటడానికి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు ?
జవాబు:
సముద్రాన్ని దాటడానికి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు.

ఋ) హనుమంతుడు ఎగిరినపుడు దూరం నుండి చూసేవారికి గిరి ఏమని అనిపించింది?
జవాబు:
దూరం నుండి చూసేవారికి హనుమంతుడు ఎగిరినట్లుకాక ఒక పర్వతం ఎగిరినట్లు అనిపించింది.

ౠ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఆంజనేయుడు దేనిని అణగదొక్కి పైకి ఎగిరాడు?

AP 10th Class Telugu Question Paper June 2023 with Solutions

2) కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము (8 మా)

స్త్రీల చైతన్య ప్రవాహపు వేగం, జీవం, ఆ ప్రవాహక్రమంలోని మార్పులూ అన్నీ ఒక కొత్త విషయాన్ని మాకు చెబుతున్నట్లనిపించింది. సామూహికమైన ఉనికి, చైతన్యం ఇవే చరిత్రను రూపుదిద్దుతాయనే విషయం స్పష్టమైంది. ఇంత మంచి సాంఘిక, రాజకీయ సాంస్కృతిక వారసత్వం మనకుందని పొంగిపోయాం. ఈ స్త్రీలందరూ ఈ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తలచుకుంటే మా గుండెలు బరువెక్కాయి. వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ వారు కొత్త కలలు కనటానికీ, కొత్త జీవిత విధానాలను కనుక్కోటానికీ ఎన్ని కఠిన పరీక్షలకు గురయ్యారో తల్చుకుంటే ఆ సామాన్యుల సాహసం అసామాన్యమనిపించింది. సమాజంలో ప్రతిదాన్నీ మార్చటానికి సమాయత్తమైన స్త్రీల సమూహం మాకు గొప్ప ప్రేరణ నిచ్చింది.

ప్రశ్నలు :

అ) చరిత్రను రూపుదిద్దిన విషయాలు ఏవి ?
జవాబు:
సామూహికమైన ఉనికి, చైతన్యం అనేవి చరిత్రను రూపుదిద్దిన విషయాలు.

ఆ) రచయిత్రులు పొంగిపోవడానికి కారణం ఏమిటి?
జవాబు:
ఇంతమంచి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక వారసత్వం మనకు ఉందని రచయిత్రులు పొంగిపోయారు.

ఇ) ఏ విషయాన్ని తలచుకుంటే రచయిత్రుల గుండెలు బరువెక్కాయి ?
జవాబు:
స్త్రీలందరూ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో అనే విషయాన్ని తలచుకుంటే రచయిత్రలు గుండెలు బరువెక్కాయి

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఏ విషయం రచయిత్రులకు ప్రేరణనిచ్చింది?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి.

అ) మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు.
జవాబు:
అరణ్యకాండ

ఆ) మరునాడు ప్రాతఃకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు.
జవాబు:
బాలకాండ

ఇ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
జవాబు:
సుందరకాండ

ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు.
జవాబు:
కిష్కింధాకాండ

4. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (8 మా)

పంజాబ్ రాష్ట్రానికి చెందిన “బల్బీర్సింగ్ సిచేవాల్” ఒక ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు. ఈయన బియాస్ నదికి ఉపనది అయిన “కాలీబీన్”ను 20 సంవత్సరాలు కష్టపడి నిర్మల జలవాహినిగా మార్చాడు. అప్పటి నుండి ఈయనను అందరూ “ఎకోబాబా” గా పిలువసాగారు. 2017లో భారత ప్రభుత్వం ఈయనకు “పద్మశ్రీ” బిరుదునిచ్చి గౌరవించింది. “శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందనే” సూక్తికి ఈయన జీవితం ఒక చక్కని ఉదాహరణ. ఈయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా నదీజలాల పరిశుభ్రతకై నడుం బిగించాలి:

ప్రశ్నలు :

అ) బల్బీర్సింగ్ సిచేవాల్ ఎవరు?
జవాబు:
పంజాబు రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు.

ఆ) బియాస్ నదికి ఉపనది ఏది?
జవాబు:
బియాస్ నదికి ఉపనది కాలీబీన్.

ఇ) భారతప్రభుత్వం సిచేవాల్ను ఎలా గౌరవించింది?
జవాబు:
2017లో భారతప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ బిరుదునిచ్చి గౌరవించింది.

ఈ) పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
“ఎకోబాబా” అని ఎవరిని పిలిచేవారు ?

విభాగము – II (36 మా)
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత: (3 × 4 = 12 మా)

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

5. “సముద్ర లంఘనం” పాఠ్యభాగ కవిని గురించి రాయండి.
జవాబు:

  • సముద్ర లంఘనం పాఠ్యభాగ కవి “అయ్యలరాజు రామభద్రుడు, ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు.
  • ఈయన కాలం 16వ శతాబ్దం.
  • రచనలు : రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం
  • బిరుదులు : చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన.
  • విశేషాంశాలు : ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. వీరి కవితా సామర్థ్యం చమత్కారంతో కూడినదని వర్ణనల ద్వారా స్పష్టమౌతున్నది.

AP 10th Class Telugu Question Paper June 2023 with Solutions

6. “చిత్రగ్రీవం” పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జవాబు:
మనదేశంలో వృక్షసంపద, పక్షిసంపద అపారం. ఐతే వీటిని గురించి తెలియజేసే మంచి పుస్తకాలు అరుదుగా ఉన్నాయి. పూర్వకాలంలో సమాచారాన్ని చేరవేయడానికి పావురాలను ఉపయోగించేవారు. పావురాల పుట్టుక, వాటి జీవన వివరాలకు సంబంధించిన కథనాలతో కూడిన పుస్తకం చిత్రగ్రీవం.

కలకత్తాలో ఓ పెంపుడు పావురం, దాన్ని పెంచే ఓ బాలుడూ, వాళ్ళ కథను మనసుకు హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. చిత్రగ్రీవం పిల్లల కోసం రాసిన పుస్తకమే ఐనా దీనికి ప్రకృతి పరిశీలకులను కూడా అలరించే శక్తి ఉంది.

పావురాల జీవనానికి సంబంధించిన అతిసూక్ష్మ వివరాలు తెలియజెప్పటమే ఈ పాఠం నేపథ్యం.

7. “కైక” పాత్ర స్వభావం రాయండి.
జవాబు:

  • ఈమె దశరథుని భార్య. భరతుని తల్లి. దేవాసుర సంగ్రామంలో దశరథునికి సాయపడి వరాలు పొందిన వీరవనిత.
  • భరతుని కన్నా రాముని పట్ల అమితమైన వాత్సల్యం కలిగినది.
  • మంథర చేసిన దుర్బోధకు లోనైనది.
  • సీతారాముల వనవాసానికి కారకురాలైంది.
  • తాను చేసిన పనికి భరతునిచేత నిందలు పొందిన మాతృమూర్తి.
  • దశరథుని మరణానికి పరోక్షంగా తానే కారకురాలైన కఠిన హృదయురాలు.
  • భరతుని మందలింపుతో తన తప్పును తెలుసుకుంది.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 8 = 24 మా)

8. ‘మాతృభావన’ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
కోపం కారణంగా వ్యాసుడు కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు కదా! ‘కోపం-మనిషి విచక్షణను నశింపజేస్తుంది’ అనే అంశం గురించి రాయండి.
జవాబు:
డా|| గడియారం వేంకటశేషశాస్త్రి రచించిన ‘మాతృభావన’ పాఠంలో శివాజీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

భారతీయ సంస్కృతి – పరమత సహనం :

వ్యక్తిత్వం అంటే మాటలకూ, చేతలకూ తేడా లేనితనం. శివాజీకి హిందూమతం పట్ల, మనదేశ సంప్రదాయాల పట్ల గౌరవం ఎక్కువ. ఇతర మతాల వారినీ, వారి ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించేవాడు. పరమత సహనం కలవాడు. సైనికులకు ఆజ్ఞలను జారీ చేసి, వాటిని సక్రమంగా నిర్వహించేటట్లు చూసేవాడు. ఇతరులకు అపకారం తలపెట్టేవాడు కాదు. తోటివారిపట్ల ప్రేమాదరాలతో మెలిగేవాడు. తన సైనికులు గానీ, అధికారులు గానీ తప్పు చేస్తే సహించేవాడుకాదు.

పరస్త్రీ కూడా కన్నతల్లి లాంటిదే :

స్త్రీల విషయంలో శివాజీ ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. పరస్త్రీలను కన్నతల్లిగా భావించేవాడు. ఒకసారి సోన్దేవుడు పుణ్యస్త్రీని బీజాపురం నుండి బందీగా పట్టి తెచ్చినందుకు ఆయనపై కోపాన్ని ప్రదర్శించాడు. దానికి సోన్దేవుడు తన తప్పును క్షమించమని ప్రార్థించగా, మన్నించిన శాంతస్వభావుడు. స్త్రీల పట్ల గౌరవభావంతో ఉండేవాడు. స్త్రీలు పుణ్యదేవతలనీ, వారిని అవమానించడం మన హిందూ సంప్రదాయం కాదని గట్టిగా చెప్పాడు.

స్త్రీలు భారతావని కల్పలతలు :

అనసూయ, సావిత్రి, సీత, సుమతి మొదలైనవారు పతివ్రతలనీ, భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన కల్పలతలని కొనియాడాడు. స్త్రీలను అవమానించినవారు వంశంతో సహా నాశనమయ్యారని వివరించాడు.

(లేదా)

కోపం మనిషిలోని వివేకాన్ని, విచక్షణని పోగొట్టి ఉద్రేకం కలిగిస్తుంది. ఆ ఉద్రేకంలో తామేం చేస్తున్నారో తెలియక ఒళ్ళుమరచి ప్రవర్తిస్తారు. తరువాత ఆలోచించి పశ్చాత్తాప పడినా ఉపయోగం ఉండదు. కోపస్వభావం కలవారిని ఎవరూ ఇష్టపడరు. బంధుమిత్రులు దూరంగా ఉంటారు. వెలివేసినట్లు అందరికీ దూరంగా ఉండాల్సివస్తుంది. తన మనోభావాలు పంచుకునే ఆప్తుడు ఉండడు. అందుకే మన పెద్దలు ‘తన కోపమే తన ‘శత్రువు’ అని చెప్పారు. కోపంతో ఎవరినీ ఏ విషయంలోనూ ఒప్పించలేం కాని మెత్తగా, అనునయంగా మాట్లాడి ఎవరినైనా ఒప్పించవచ్చు.

కోపావేశంలో ఉన్నప్పుడు శరీరంలోని గ్రంథులు, నాడులు ఉద్రేకం చెంది రక్తపోటు పెరిగే ప్రమాదం కూడా ఉందట. ఈ విధంగా మన కోపం మన శారీరక అనారోగ్యానికి కూడా కారణమవుతోంది. కోపంవల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టే ‘కోపమున ఘనత కొంచెమై పోవును’ అన్నారు.

ఇన్ని నష్టాలను తెచ్చిపెట్టే కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అందుకే మన వాళ్ళు కోపం వచ్చినప్పుడు పది అంకెలు లెక్కపెట్టమని, గ్లాసెడు మంచి నీళ్ళు త్రాగమని చెప్పారు. మనకు హాని చేసే ఈ కోపాన్ని తగ్గించుకొని, శాంత స్వభావాన్ని అలవరచుకొన్నవారు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు.

9. సీతాపహరణం గురించి రాయండి.
(లేదా)
“లంకా దహనం” గురించి వర్ణించండి.
జవాబు:

  • పంచవటిలో శ్రీరామునిచేత పరిహసింపబడి లక్ష్మణుని చేత విరూపిగా మారిన శూర్పణఖ రావణుడి వద్ద తన గోడును వెళ్ళబోసుకుంది.
  • అయినా రావణుడు చలించకపోవడంతో సీత అందచందాలను వర్ణించి నీవే తనకు తగిన భర్తవని కొత్త ఆశలను రేపింది.
  • శ్రీరాముని బలాన్ని, తన బలాన్ని పోల్చుకున్న రావణుడు సీతాపహరణకు సిద్ధమై బంగారు లేడిగా మారి సహకరించమని మారీచుడిని కోరాడు.
  • గత్యంతరం లేక బంగా జింకగా మారిన మారీచుడు శ్రీరామ ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించాడు.
  • ఆ జింక తనకెంతో నచ్చిందని, దానిని తీసుకురమ్మని సీత కోరగా ఆమె ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని బంధించి తీసుకురావడానికి రాముడు సంసిద్దుడయ్యాడు.
  • మాయాలేడిని ప్రాణాలతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించి, లాభం లేకపోవడంతో శ్రీరాముడు బాణాన్ని సంధించాడు. రామబాణపు దెబ్బకు ఎగిరి కిందపడ్డ మారీచుడు శ్రీరాముని గొంతుతో ‘అయ్యో సీతా! అయ్యో లక్ష్మణా!’ అంటూ భయంకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు.
  • ఆందోళన చెందిన సీత రాముడికి సహాయంగా వెళ్ళమని లక్ష్మణుని కోరింది. నిష్ఠూరంగా మాట్లాడింది. లక్ష్మణుడు రాముడు వెళ్ళిన దిశగా విధిలేని పరిస్థితిలో వెళ్ళాడు.
  • ఇదే అదనుగా భావించిన రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చి, సీత వివరాలడిగి, తన వివరాలు తెలిపి, తనను పతిగా స్వీకరించమని కోరాడు.
  • అందుకు తృణీకరించిన సీత నన్ను అపహరించడానికి ప్రయత్నించి, నీ చావు నువ్వు కొనితెచ్చుకోకు అని హెచ్చరించింది.
  • రావణుడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తూ, అడ్డుపడిన జటాయువును నేలకూల్చి సీతను అపహరించుకొని వెళ్ళాడు.

(లేదా)

  • సీతాదేవి దర్శనంతో ప్రధానకార్యం ముగిసింది హనుమంతునికి. కానీ అంతటితో ఆగక రావణుడి యొక్క అతని సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలుసుకోవాలనుకొన్నాడు.
  • అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు హనుమంతుడు.
  • రాక్షస స్త్రీల ద్వారా లంకేశునికి ఈ విషయం తెలిసి ఎనభైవేలమంది రాక్షసులను పంపగా హనుమంతుడు వాళ్ళనందరిని మట్టుపెట్టాడు.
  • తనపై దాడికి దిగిన జంబుమాలిని, మంత్రి పుత్రులు ఏడుమందిని, రావణుని సేనాధిపతులను ఐదుమందిని, రావణుని కుమారులలో ఒకడైన అక్ష కుమారుణ్ణి అంతమొందించాడు హనుమ.
  • ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి బందీ అయినట్లు నటించాడు ఆ కపివీరుడు. బ్రహ్మ వర ప్రభావం వలన అది అతనిపై క్షణకాలమే పనిచేస్తుంది.
  • రావణుని ముందు ప్రవేశపెట్టగా తాను రామదూతనని చాటాడు. శ్రీరాముని పరాక్రమం గురించి వివరించాడు.
  • దూతను చంపడం భావ్యం కాదన్న విభీషణుని మాటలతో ఏకీభవించిన రావణుడు “హనుమంతుడి తోకకు నిప్పంటించి లంకంతా కలయదిప్ప”మన్నాడు.
  • రాక్షసులు హనుమంతుని తోకను బట్టలతో చుట్టి, నూనెలో తడిపి, నిప్పంటించి ఊరేగిస్తుండగా, అతను ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి, విభీషణుడి భవనం తప్ప, లంకనంతా తగులబెట్టాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు.
  • లంకలో హాహాకారాలు మిన్నంటాయి. సముద్రంలో తోకను చల్లార్చుకొన్న హనుమంతుడు శాంతించాడు. తప్పు చేశానని, సీతమ్మ తల్లికి ఏమయిందోనని చింతించాడు.
  • చారణుల మాటల ద్వారా సీతాదేవి క్షేమంగా ఉందని తెలుసుకొని సంతోషించి ఆమె దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశాడు.

10. విద్వాన్ విశ్వం కవిత్వాన్ని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
(లేదా)
“గోరంతదీపాలు” పాఠంలోని “విద్యాలయం” ఆవరణ గురించి చదివారు కదా! మీరు మీ పాఠశాల గురించి వర్ణించండి.
జవాబు:

నిమ్మకూరు,
తేది: XX,XX.XXXX.

ప్రియ మిత్రుడు గోపాలు, రాయునది,

ఈ మధ్య మా తెలుగు ఉపాధ్యాయులు విద్వాన్ విశ్వం గారు రచించిన మాణిక్య వీణ’ పాఠం వివరించి చెప్పారు.

అందరికీ తెలిసే సరళమైన వాడుక భాషలో ఎంతో అందంగా ఈ కవితను విశ్వంగారు రచించారు. ఇందులో తేట తెలుగు నుడికార ప్రయోగాలు చాలా బాగున్నాయి. మంత్రాలతో చింతకాయలు రాలవనడం, పొట్టలోని పుట్టకురుపు మొదలైన నానుడులు కవితకు ఎంతో అందాన్ని ఇచ్చాయి.

మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, మానవ మేధస్సును; మానవ జీవితానికి, కళలకు, విజ్ఞానాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని కవి తాత్త్వికతతో హృద్యంగా వర్ణించారు. అందుకే ఈ పాఠం నాకు బాగా నచ్చింది. నువ్వు కూడా నీకు నచ్చిన పాఠం గురించి, కవి గురించి లేఖ రాయగలవు.

ఇట్లు,
చిరునామా:
మార్కండేయశర్మ
S/o. నరసింహశాస్త్రిగారు,
నిమ్మకూరు, కృష్ణాజిల్లా,

చిరునామా:
శనగల శేషాంజనేయ గోపాల్,
S/o. ఆంజనేయులు,
దక్షిణ గాలి గోపురం ఎదురుగా,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
నీ మిత్రుడు,

(లేదా)

“గోరంత దీపాలు” పాఠంలోని “విద్యాలయం” ఆవరణ గురించి చదివారు కదా! మీరు మీ పాఠశాల గురించి వర్ణించండి.
జవాబు:
మాది జిల్లా పరిషత్ హైస్కూలు. మా పాఠశాల చాలా చక్కగా ఉంటుంది. ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించింది. మా పాఠశాలలో చుట్టూ తరగతి గదులు (క్లాసు రూములు), మధ్యలో ఖాళీ స్థలముంటుంది. ఆ ఖాళీ స్థలంలో అనేక పూల మొక్కలు, చెట్లు కనువిందు చేస్తాయి. తరగతి గదులన్నిటినీ కలుపుకొని వరండా ఉంటుంది. మా ఉపాధ్యాయులు విద్యార్థులను కన్నబిడ్డల్లా చూస్తారు. మాకు కూడా వారంటే ఎంతో ఇష్టం.

మా పాఠశాలలో వెనుక వైపు పెద్ద క్రీడా స్థలం కూడా ఉంది. చుట్టూ ప్రహరీ గోడలా పొడుగైన పెద్ద పెద్ద చెట్లను నాటారు. వాలీబాల్, క్రికెట్, ఆడపిల్లల ఆటలకు సంబంధించిన గ్రౌండ్లు వేరువేరుగా ఉంటాయి. మా పాఠశాల మాకిచ్చిన క్రమశిక్షణ ఎలాంటిదంటే, ఏ విద్యార్థి కూడా పాఠశాలలో ఎక్కడా ఏ కాగితం ముక్క కూడా వేయరు. అందరూ చెత్తబుట్టల్లోనే వేస్తారు. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా కాగితం ముక్క కనిపిస్తే, దాన్ని చూసినవారు వెంటనే తీసి చెత్తబుట్టలో వేస్తారు. అందుకే మా పాఠశాలంటే మాకేకాదు, మా తల్లిదండ్రులకూ చాలా ఇష్టం.

విభాగము – III (32 మా)
III. భాషాంశాలు : (పదజాలం-వ్యాకరణాంశాలు) (9 × 2 = 18 మా)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

11. మిమ్ము మాధవుడు రక్షించుగాక (ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.)
జవాబు:
శ్లేషాలంకారం కలదు. (అలంకారాన్ని గుర్తిస్తే చాలు. లక్షణం రాయనవసరం లేదు.)

AP 10th Class Telugu Question Paper June 2023 with Solutions

12. కింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి, పద్యం పేరు రాయండి.
దెసలను కొమ్మలొయ్యనతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం.
జవాబు:
AP 10th Class Telugu Question Paper June 2023 with Solutions 1
పై పద్యపాదం “చంపకమాల”నకు చెందినది.

13. అ) కష్టాలనే ఉపద్రవములు ఎదురైనపుడు ఆదుకొనే వాడు నిజమైన స్నేహితుడు.
(గీతగీసిన పదానికి అర్థం రాయండి.)
జవాబు:
ఆపదలు

ఆ) హనుమంతుడెగిరితే ధూళి సభమునకు ఎగిసింది.
(గీతగీసిన’ పదానికి సరియైన అర్థాన్ని గుర్తించి విడిగా రాయండి.)
అ) కొండ
ఆ) మబ్బు
ఇ) ఆకాశం
ఈ) నది
జవాబు:
ఇ) ఆకాశం

14. అ) కొండలను సైతం పిండి చేయగల యంత్రాలు నేడు అందుబాటులో ఉన్నాయి. (1 మా)
(గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.)
జవాబు:
గిరి, పర్వతం

ఆ) పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలో చెట్టుకు గల ప్రాధాన్యత సాటిలేనిది. (1 మా)
(గీతగీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించండి.)
అ) కొలను, కాసారము
ఆ) వాయువు, గాలి
ఇ) వృక్షము, తరువు
ఈ) నది, ఏరు
జవాబు:
ఇ) వృక్షము, తరువు

15. అ) నిదుర చాలకపోతే రోగాలు వస్తాయి. (గీతగీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి)
జవాబు:
నిద్ర

ఆ) శాస్త్రవిజ్ఞానం కొత్తదారులలో ముందుకు వెళ్తుంది. (గీతగీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
అ) విన్నాణం
ఆ) వినయం
ఇ) విన్నపం
ఈ) వినతి
జవాబు:
అ) విన్నాణం

16. అ) ఇల్లాలు కంకణం ఉన్న చేతితో పిల్లలకు కంకణం కట్టింది.
(గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి.) (1 మా)
జవాబు:
స్త్రీలు చేతికి ధరించే ఆభరణం, తోరం

ఆ) కొండ ముద్రతో ఇంటికి చేరిన రాము కాగితం పై ముద్ర వేశాడు.
(గీతగీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.) (1 మా)
అ) తోట, అడవి
ఆ) గుర్తు, అచ్చువేయడం
ఇ) కొమ్మ, చెయ్యి
ఈ) కోరిక, దిక్కు
జవాబు:
ఆ) గుర్తు, అచ్చువేయడం

17. అ) చూడాకర్ణుడి ఇంటికి అతిథి వచ్చాడు. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్ధం రాయండి.)
జవాబు:
తిథి, వార నియమాలు లేకుండా ఇంటికి వచ్చేవాడు (బంధువు)

ఆ) దానవులు మానవులను కష్టాలకు గురి చేశారు. (గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.)
అ) దనువు అనే స్త్రీయందు పుట్టినవాళ్ళు (రాక్షసులు)
ఆ) అపారమైన తీరం కలది (సముద్రం)
ఇ) మరణం లేనివారు (దేవతలు)
ఈ) అన్నాదులను దొంగిలించేది (ఎలుక)
జవాబు:
అ) దనువు అనే స్త్రీయందు పుట్టినవాళ్ళు (రాక్షసులు)

18. పంటల దిగుబడి తగ్గినందున రైతుల గుండెలు బరువెక్కాయి. (ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించండి.)
జవాబు:
గుండెలు బరువెక్కాయి

19. “శ్రీరామరక్ష” – ఈ జాతీయాన్ని ఏ అర్థంలో, సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.
జవాబు:
“ఎల్లప్పుడూ వెంట ఉండి కాపాడేది / చిరకాల రక్ష అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

20. అత్యంత విలువైనది కోహినూరు వజ్రం. (గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.) (1 మా)
జవాబు:
అతి + అంత

21. పుస్తకములు (ఈ సంధి పదాలను కలిపి రాయండి.) (1 మా)
జవాబు:
పుస్తకాలు

22. ఈశతాబ్దంలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. (గీతగీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.) (1 మా)
అ) వృద్ధి సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) గుణ సంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

23. విద్యార్థులు ప్రతిదినం ఒక కొత్త విషయాన్ని తెల్సుకోవాలి. (గీతగీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.) (1 మా)
జవాబు:
దినము దినము

24. గంగానది ఒక జీవనది. (గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)
అ) షష్ఠీ తత్పురుషసమాసం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఇ) సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

25. వివేకహీనుడయిన ప్రభువును సేవించుటకంటే వనవాసముత్తమము.
(ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించి రాయండి.)
అ) తెలివి తక్కువవాడైన రాజును సేవించడం కన్నా అడవులలో కాలం గడపడం మంచిది.
ఆ) బుద్ధిశాలియైన ప్రభువును కొలవడం కన్నా వనవాసము ఉత్తమము.
ఇ) అవినీతిపరుడైన రాజును గౌరవించడం కంటే అడవులకు వెళ్ళడం మంచిదేమో!
ఈ) బుద్ధి కలవాడైన రాజును ఆదరించడం కంటే వనవాసం చేయడం ఉత్తమం.
జవాబు:
అ) తెలివి తక్కువవాడైన రాజును సేవించడం కన్నా అడవులలో కాలం గడపడం మంచిది.

26. చిత్రగ్రీవం చీమను ముక్కుతో పొడిచింది. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.)
జవాబు:
చిత్రగ్రీవం చీమను ముక్కుతో పొడవలేదు.

AP 10th Class Telugu Question Paper June 2023 with Solutions

27. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి. ()
అ) తిని
ఆ) తినక
ఇ) తింటూ
ఈ) తింటే
జవాబు:
ఆ) తినక

28. సాంబయ్య పాడతాడు. సాంబయ్య ఆడతాడు. (ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా రాయండి.) (1 మా)
జవాబు:
సాంబయ్య పాడతాడు, ఆడతాడు.

29. కోటయ్య కుప్పవేశాడు. (సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (1 మా)
అ) కుప్ప వేసినది కోటయ్యే
ఆ) కుప్పవేయడం చేత కోటయ్య అయ్యాడు
ఇ) కుప్పచేత కోటయ్య వేయబడ్డాడు.
ఈ) కోటయ్య చేత కుప్ప వేయబడింది
జవాబు:
ఈ) కోటయ్య చేత కుప్ప వేయబడింది

30. మీరు రావద్దు. (ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.) (1 మా)
జవాబు:
నిషేధార్థక వాక్యం.

31. భళా! ఎంతటి ఘన విజయం! (ఇది ఏరకమైన వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) సామర్థ్యార్థక వాక్యం
ఆ) ప్రార్థనార్థక వాక్యం
ఇ) ఆశ్చర్యార్థక వాక్యం
ఈ) అనుమత్యర్థక వాక్యం
జవాబు:
ఇ) ఆశ్చర్యార్థక వాక్యం

32. దయచేసి నా మాట ఆలకించండి. (ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.)
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం.

33. మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) ప్రార్థనార్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) సందేహార్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
ఆ) ప్రశ్నార్థకం

Leave a Comment