Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 9 can significantly boost overall exam scores.
AP SSC Telugu Model Paper Set 9 with Solutions
సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100
సూచనలు :
- ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
- ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
- అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
- సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.
విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:
1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము.
గొడుగు గల గిలకలు గులకరింప
నిందుబింబాస్య యెదురుగా నేగు దెంచి
ఛాత్ర సహితంబుగాఁ బరాశరతనూజు.
బంతిసాగించె భుక్తిశాలాంతరమున
ప్రశ్నలు :
1 ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి.
అ) గొడుగు పావుకోళ్ళు ధరించినది ఎవరు ?
జవాబు:
ఇల్లాలి వేషంలో ఉన్న పార్వతీదేవి గొడుగు పావుకోళ్ళు ధరించింది.
ఆ) ఇల్లాలు ఎవరికి భోజనాన్ని సిద్ధం చేసింది ?
జవాబు:
ఇల్లాలు వ్యాసుడికి, తన శిష్యులకు భోజనాన్ని సిద్ధం చేసింది.
ఇ) భోజనాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జవాబు:
భోజనాన్ని భోజనశాలలో ఏర్పాటు చేశారు.
ఈ) పద్యంలో ‘ఇందుబింబాస్య’ అని వర్ణించినది ఎవరిని ?
జవాబు:
పద్యంలో ఇందుబింబాస్య అని వర్ణించినది ఇల్లాలి వేషంలో ఉన్న పార్వతీదేవిని.
(లేదా)
యవన పుణ్యాంగనామణి వగుదుగాక
హైందవుల పూజ తల్లియట్లందరాదె?
నీదురూపము నాయందు లేద యైనఁ
గనని తల్లివిగా నిన్ను గారవింతు
ప్రశ్నలు :
ఉ) సోన్దేవుడు ఏ జాతి స్త్రీలను బందీలుగా తెచ్చాడు ?
జవాబు:
సోన్దేవుడు యవనజాతి స్త్రీలను బందీలుగా తెచ్చాడు.
ఊ) హైందవుల పూజ అందుకోమన్నది ఎవరు ?
జవాబు:
హైందవుల పూజ అందుకోమని శివాజీ అన్నాడు.
ఋ) శివాజీ యవనస్త్రీని ఏ విధంగా గౌరవిస్తానన్నాడు ?
జవాబు:
శివాజీ యవనస్త్రీని కనని తల్లిగా గౌరవిస్తానన్నాడు.
బూ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
శివాజీ యవనకాంతను ఏమని ప్రార్థిస్తున్నాడు?
2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము.
“ఆ పదేండ్ల బుడతడు ఆ పెట్టెను ఈ చివరి నుండి ఆ చివరిదాకా తుడుస్తాడు. ఆపై ఒక్కొక్కరి ముందు చేయి చాస్తూ… ఇచ్చినవాడికి ఓ నమస్కారం పడేస్తూ… లేదన్న వాళ్ళవైపు దీనంగా చూస్తూ … ఓ వ్యక్తి ముందు నిలబడతాడు. నిలబడి మామూలుగా చేయి చాస్తాడు. ఆ వ్యక్తి వాణ్ణి దగ్గరికి పిలుస్తాడు. ఆ పిలుపులోని ఆప్యాయత ఎంతో ఆశను రేకెత్తిస్తుంది. కుర్రవాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళతాడు. “నీ పేరేమిటి బాబూ!” అని ఆరంభిస్తాడు. పైసలిచ్చే ప్రయత్నం చేయకుండా! ఆ కుర్రవాడు ఏమనుకొన్నాడో ఏమో? ఓ నిర్లక్ష్యమైన చూపు విసిరేసి ‘నా పేరు దొరైరాజ్’ అని అంటూ చేతిలోని పైసల్ని అలా ఎగరేస్తుకొంటూ దూరంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న కుర్రవాడి ధోరణికి మొదట ఆశ్చర్యపడి ఆ తరువాత ఆలోచనలో పడతాడా వ్యక్తి! ఇదీ కథ!!
ప్రశ్నలు :
అ) పదేండ్ల బుడతడు ఏ పని చేస్తున్నాడు ?
జవాబు:
పదేండ్ల బుడతడు రైలుపెట్టెను ఈ చివరి నుండి ఆ చివరిదాకా తుడుస్తున్నాడు.
ఆ) కుర్రవాడిని దగ్గరకు పిలిచిన వ్యక్తి ఏమని ప్రశ్నించాడు ?
జవాబు:
కుర్రవాడిని దగ్గరకు పిలిచిన వ్యక్తి ‘నీపేరేమిటి బాబూ!’ అని ప్రశ్నించాడు.
ఇ) కుర్రవాడు చెప్పిన సమాధానం ఏమిటి?
జవాబు:
కుర్రవాడు “నాపేరు దొరైరాజ్!” అని సమాధానం చెప్పాడు.
ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
బుడతడు చేయి చాపినపుడు లేదన్న వాళ్ళవైపు. ఎలా చూస్తాడు?
3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి. (8 మా)
అ) తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళినవాళ్ళు తీవ్రంగా వెదికి వెదికి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
జవాబు:
కిష్కింధాకాండ
ఆ) స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు.
జవాబు:
బాలకాండ
ఇ) శ్రీరాముడు అడిగినమీదట హనుమంతుడు లంకానగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు.
జవాబు:
యుద్ధకాండ
ఈ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్ళాడు.
జవాబు:
అరణ్యకాండ
4. క్రింది కరపత్రాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)
ప్రతిభకు పురస్కారం
విద్యార్థులారా ! తల్లిదండ్రులారా !
ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల విజయానికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ఒక మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నది. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో నియోజకవర్గం, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు అందజేస్తుంది. దీనిని “జగనన్న ఆణిముత్యాలు” పేరుతో మన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. క్రింది విధంగా నగదు పురస్కారం అందించబడుతుంది.
రాష్ట్ర స్థాయి | జిల్లా స్థాయి | నియాజకవర్గస్థాయి | |
మొదటి స్థానం | 1,00,000/- | 50,000/- | 15,000/- |
రెండవ స్థానం | 75,000/- | 30,000/- | 10,000/- |
మూడవ స్థానం | 50,000/- | 15,000/- | 5,000/- |
విద్యార్థులు వారి చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.
కమీషనర్,
రాష్ట్ర విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్.
ప్రశ్నలు :
అ) ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి ?
జవాబు:
ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమం పేరు ‘జగనన్న ఆణిముత్యాలు’.
ఆ) ఏ పరీక్షలలో ర్యాంకులు సాధించినవారికి నగదు పురస్కారం లభిస్తుంది ?
జవాబు:
పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ర్యాంకులు సాధించిన వారికి నగదు పురస్కారం లభిస్తుంది.
ఇ) రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించిన వారికి నగదు పురస్కారం ఎంత ?
జవాబు:
రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించిన వారికి 1,00,000/- నగదు పురస్కారం.
ఈ) కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
కరపత్రాన్ని ప్రచురించినది ఎవరు ?
విభాగము – II
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత: (36 మా)
క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 8 = 24 మా)
5. నీతిశతక కర్త ఏనుగు లక్ష్మణకవి గురించి రాయండి.
జవాబు:
కవి : ఏనుగు లక్ష్మణ కవి తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు.
కాలం : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయం.
రచనలు : భర్తృహరి సంస్కృతంలో రచించిన ‘సుభాషిత త్రిశతి’ ని తెలుగులోకి అనువదించారు. దాని పేరు సుభాషిత రత్నావళి. రామేశ్వర మాహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగామాహాత్మ్యం, రామవిలాసం వీరి ప్రసిద్ధ రచనలు.
6. ‘చిత్రగ్రీవం’ పాఠ్యాంశ నేపథ్యం వివరించండి.
జవాబు:
మనదేశంలో వృక్షసంపద, పక్షిసంపద అపారం. ఐతే వీటిని గురించి తెలియజేసే మంచి పుస్తకాలు అరుదుగా ఉన్నాయి. పూర్వకాలంలో సమాచారాన్ని చేరవేయడానికి పావురాలను ఉపయోగించేవారు. పావురాల పుట్టుక, వాటి జీవన వివరాలకు సంబంధించిన కథనాలతో కూడిన పుస్తకం చిత్రగ్రీవం. కలకత్తాలో ఓ పెంపుడు పావురం, దాన్ని పెంచే ఓ బాలుడూ, వాళ్ళ కథను మనసుకు హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. చిత్రగ్రీవం పిల్లలకోసం రాసిన పుస్తకమే ఐనా దీనికి ప్రకృతి పరిశీలకులను కూడా అలరించే శక్తి ఉంది. పావురాల జీవనానికి సంబంధించిన అతిసూక్ష్మ వివరాలు తెలియచెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
7. శ్రీరాముని పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
శ్రీరాముడు కౌసల్య, దశరథమహారాజుల కుమారుడు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించాడు. తల్లిదండ్రుల మాట జవదాటనివాడు. సోదరప్రేమ కలవాడు. దుర్మార్గులైన దుష్టరాక్షసులను చంపి, అమాయకులను రక్షించినవాడు. శరణన్నవారిని కాపాడేవాడు. కోపం, గర్వం లేనివాడు. ఇటువంటి మంచిగుణాలు కలిగిన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ కూడా ప్రీతిపాత్రుడు. జననీ జన్మభూమి స్వర్గము కంటే గొప్పదని చెప్పిన మహోన్నతమూర్తి శ్రీరాముడు.
కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి.
8. హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి. (లేదా)
పద్యభావాలను ఆధారంగా చేసుకొని వెన్నెల పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
జవాబు:
అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం గ్రంథంలో సముద్రలంఘన సన్నివేశంలో హనుమంతుణ్ణి గురించి బాగా వర్ణించాడు. హనుమంతుడు మహా బలవంతుడైన వాయుదేవుని కుమారుడు. అంత బలవంతుడు కనుకనే ఆయన అడుగులు వేసినపుడు కొండరాళ్ళు పిండిఅయ్యాయి. తోకను వేగంగా తిప్పినపుడు వచ్చిన గాలికి పెద్ద అడవులే చెదరగొట్టబడినట్లు కూలిపోయి బయళ్ళు. ఏర్పడ్డాయి. చేతితో చరచినపుడు కర్రతో కొట్టినట్లుగా ఏనుగులు, సింహాలు పారిపోయాయి. ఆయన కేకకు కొండ గుహలు ప్రతిధ్వనించాయి.
చూస్తూనే దూరం అంచనా వేయగలడు. తీక్షణమైన చూపులు కలవాడు హనుమంతుడు. కొండంత శరీరంతో హనుమంతుడు పైకెగిరితే చూసేవారు కొండ ఎగురుతోందనుకున్నారట. అందుకే ఆయనను ‘హరిహరి’ అని వర్ణించాడు. అంటే హనుమంతుడు కోతులలో శ్రేష్ఠుడు అన్నమాట. ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుణ్ణి చూసి దేవతలు సూర్యుడు రథం మీద అటుగా వచ్చినట్లుందని అనుకున్నారట. అంటే హనుమంతుడు సూర్యునితో సమానమైన తేజస్సు గలవాడని అర్థం.
ఆ విధంగా వాయువేగంతో సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు.
(లేదా)
వర్ణనలకు ఆద్యుడని పేరు పొందిన ఎఱ్ఱన వెన్నెలను ఎంతో మనోహరంగా వర్ణించాడు. దిక్కులు అనే కొమ్మలతో, వెలుగులీనే చుక్కలు అనే పూలతో ఆకాశం పెద్ద చెట్టులాగా కనిపిస్తున్నది. ఆ పూలను అందుకోడానికి కిరణాలు అనే తన చేతులను పొడవుగా జాపుతూ చంద్రుడు పైపైకి వచ్చాడు.
పాల సముద్రం నుంచి పుట్టిన వెన్నెల ఉప్పొంగి దిక్కులన్నిటినీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం శేషపానుపులాగా ఉన్నది. చంద్రునిలోని మచ్చ ఆ పాన్పుమీద పడుకున్న విష్ణువులాగా ఉన్నది.
వెన్నెలలో కలువ పూలు రేకులు విచ్చుకొని వాలిపోయిన కేసరాలు తిరిగి బలంగా నిలుచున్నాయి. పుప్పొడి మీద తేనెలు పొంగిపొరలి తుమ్మెదలకు విందుచేశాయి. కమ్మని సువాసనలు చుట్టూ వ్యాపించాయి.
వెన్నెల వర్షంలో చంద్రకాంత శిలలు కరిగిపోయాయి. ఎగిరే చకోర పక్షుల రెక్కలను తాకుతూ కలువపూలపై వ్యాపించింది. వెన్నెల. స్త్రీల మనోహరమైన చిరునవ్వులను అధికం చేస్తూ దిక్కులను ముంచెత్తుతూ అంతటా వ్యాపించింది వెన్నెల.
అందంగా, గంభీరంగా, సమున్నతంగా విస్తరించింది వెన్నెల. రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి ఎక్కడా కనబడనీయక కళ్ళకు అమృతపు జల్లులాగా, శరీరానికి మంచి గంధం పూతలాగా, మనసుకు ఆనంద తరంగంలాగా వెన్నెల హాయిని కలిగించిందని వర్ణిస్తూ కవి ఎఱ్ఱన వెన్నెలను చూసి స్పందించాడు.
9. పంచవటిలో సీతారామలక్ష్మణుల జీవితం ఎలా సాగిందో వివరించండి.
(లేదా)
‘చెప్పుడు మాటలు చేటుకు కారణం’ అని రామాయణం ఆధారంగా ఎలా సమర్థిస్తావు ?
జవాబు:
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో వనవాసం ఆరంభించి, దండకారణ్యంలోని మునుల ఆశ్రమాల్లో అక్కడక్కడ ఉంటూ చాలా కాలం గడిపాక తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యమహామునిని అడిగాడు. గోదావరీ నదీ తీరంలోని పంచవటిలో నివసించమని సూచించాడు అగస్త్యుడు.
శ్రీరాముని ఆజ్ఞమేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. పంచవటిలో ప్రశాంతంగా జీవించసాగారు. ఇంతలో రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ రాముని చూసి, పెళ్ళాడమంది. శ్రీరాముడు నిరాకరించడంతో, సీతపై దాడికి దిగింది. అన్న ఆజ్ఞమేరకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. రాముని మీదకు దండెత్తి వచ్చిన ఖరదూషణులను రాముడు సంహరించాడు. శూర్పణఖ చెప్పుడు మాటలు విని రావణుడు సీతను అపహరించదలచాడు. రావణుడు మారీచుని బంగారులేడిగా మారి, సీతాపహరణకు సహకరించమన్నాడు. మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమప్రాంతంలో తిరగసాగాడు, బంగారు లేడిని చూసిన సీత, దానిని తెచ్చిపెట్టమని పట్టుపట్టింది. సీత ఇష్టాన్ని తీసివేయలేక, ఆ మాయలేడిని పట్టుకోవడానికి రాముడు బయల్దేరాడు. సీతాదేవి రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణునికి చెప్పాడు.
మృగాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన రాముడు చివరగా బాణంతో కొట్టాడు. ఆ దెబ్బకు మారీచుడు పడిపోతూ రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ ‘అయ్యో సీతా ! అయ్యో లక్ష్మణా ! అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని భయపడిన సీత, ఆదుకోవడానికి లక్ష్మణుని వెళ్ళమంది. లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించిన రావణుడు బలవంతంగా సీతను అపహరించాడు. పంచవటిలో వెనుకకు వచ్చిన రామలక్ష్మణులు సీత జాడ తెలియక కన్నీరు మున్నీరు అయ్యారు. ఇట్లా మొదట, ఎంతో ప్రశాంతంగా జీవించిన సీతారామలక్ష్మణులు రావణాసురుడు, శూర్పణఖ వల్ల దుఃఖితులయ్యారు.
(లేదా)
మంథర దుర్బుద్ధి : రాముని పట్టాభిషేకంకోసం అయోధ్యను అందంగా అలంకరిస్తున్నారు. మంథర అనే దాసి అది చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంది. ఆమె కైకేయి అరణపుదాసి. మంథర రాముని పట్టాభిషేకవార్తను కైకకు చెప్పింది. కైక ఆనందించింది. కాని మంథర కైక మనసు మార్చివేసింది. రాముడు రాజైతే భరతుడు సేవకుడవుతాడని, నువ్వు దాసివవుతావని అంది. మంథర చెప్పుడు మాటలు విని కైక మనసు మారింది. మంథరను ఉపాయం చెప్పమంది. మంథర గతంలో దశరథుడిచ్చిన రెండు వరాలను ఉపయోగించుకోమని కైకేయికి చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు రాగానే రెండు వరాలు కోరింది. అవి:
- రాముని 14 సంవత్సరాల వనవాసం
- భరతునికి పట్టాభిషేకం.
దశరథుని (ఆక్రందన) విలాపం : రాముని అడవులకు పంపవద్దని దశరథుడు కైకను బ్రతిమాలాడు. కైక మారలేదు. రాముని పిలిచి వనవాస విషయం చెప్పింది. ‘తండ్రి మాటను తీరుస్తాను, అడవులకు వెళ్తాను’ అని రాముడు అన్నాడు. కౌసల్య, లక్ష్మణుడు రాముని అడవులకు వెళ్ళవద్దని బతిమాలారు. కాని రాముడు వినలేదు. తండ్రిమాటనే గౌరవిస్తానన్నాడు. కౌసల్య రామునితో తానూ వస్తానంది. రాముడు భర్తను వదలి రావడం ధర్మం కాదని అన్నాడు. సీత పతిని అనుసరించడమే సతికి ధర్మం అంటూ రామునివెంట అడవులకు బయలుదేరింది. లక్ష్మణుడు’ కూడా అడవులకు బయలుదేరాడు. సీతారామలక్ష్మణులు దశరథుని దగ్గరకు వెళ్ళారు. కైకేయి ఇచ్చిన నారచీరలను ధరించి అడవులకు బయలుదేరారు. ఇలా మంథర చెప్పుడు మాటలవలన కైక బుద్ధి చెడింది. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి లోకానికి తెలిశాయి.
10. సముద్ర లంఘనం పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి లేఖ రాయండి.
(లేదా)
శతకాలను చదవమని ప్రేరేపిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
ధర్మవరం,
తేదీ : XX.XX.XXXX.
ప్రియమైన సతీష్,
మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మధ్యే హనుమంతుడి గొప్పదనాన్ని వర్ణించే పాఠం వినడం జరిగింది. సముద్రలంఘనం అనే పాఠం రామాభ్యుదయం అనే గ్రంథంలోనిది. దీనిని రచించిన కవి అయ్యలరాజు రామభద్రుడు.
చక్కనైన వర్ణనలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఈ కావ్యం చదివే వారిని ఆకట్టుకుంటాయి. ప్రతి పద్యంలోను కవి కల్పనాచాతుర్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
నీవు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదువు. నీకు బాగా నచ్చుతుంది. అలాగే ఈ కవి రచించిన మరొక రచన ‘సకల కథాసార సంగ్రహం’. అది కూడా నువ్వు చదివి తీరాలి. మరి ఉంటాను. నీ జాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
ఇట్లు
నీ ప్రియ స్నేహితుడు,
జగదీష్
చిరునామా :
సతీష్,
వారణాసి రామారావుగారి కుమారుడు,
గాంధీనగర్ 2వ లైను,
తాడిపత్రి, అనంతపురం జిల్లా.
(లేదా)
శతకాలను చదువుదాం …. సన్మార్గంలో నడుద్దాం !
విద్యార్థినీ, విద్యార్థులారా !
శతకాలు విలువలను నేర్పుతాయి.
మంచిని పెంచుతాయి.
చెడును త్రుంచుతాయి.
వేమన శతకం చదివితే – మూఢనమ్మకాలను ప్రశ్నిస్తావు.
సుమతి శతకం చదివితే మంచి నడవడి పెంచుకుంటావు.
దాశరథి శతకం చదివితే – భగవంతుడి సేవ అంటే సాటి మానవుడి సేవ అని తెలుసుకుంటావు.
తెలుగు వారికి మాత్రమే సొంతం – పద్యాలు.
పద్యాలకే మకుటాలు శతకాలు
తెలుగు నేలలో పుట్టినందుకు గర్విద్దాం ! –
శతక పద్యాలు చదువుదాం !!
ప్రతులు : 1000,
తేది : XX.XX.XXXX.
ప్రచురించింది
పద్యసాహిత్య పరిషత్,
నెల్లూరు.
విభాగము – III
III. భాషాంశాలు: (32 మా)
11. ‘హరిభజియించు హస్తములు హస్తములు’ ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి. (1 × 2 = 2 మా)
జవాబు:
లాటానుప్రాసాలంకారం
12. ఈ క్రింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. తనదేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్ (1 × 2 = 2 మా)
జవాబు:
ఇది మత్తేభం పద్యపాదం.
ఈ క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
13. అ) విద్యార్థులంతా పరీక్షలకు ఆయత్తమవుతున్నారు.– గీతగీసిన పదానికి అర్థం రాయండి. (1 మా)
జవాబు:
సిద్ధమవుతున్నారు
ఆ) లత పాఠాన్ని చక్కగా ఆకళింపు చేసుకుంది. – గీతగీసిన పదానికి అర్థాన్ని గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) ప్రతిస్పందన
ఆ) వ్యక్తీకరణ
ఇ) అర్థం చేసుకొను
ఈ) ఆక్రమించు
జవాబు:
ఇ) అర్థం చేసుకొను
14. అ) శ్రీ ని కష్టపడి న్యాయంగా సంపాదించాలి. – గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి. (1 మా)
జవాబు:
సంపద, ధనం
ఆ) మన రాష్ట్రంలో పురముల అభివృద్ధి కొరకు పురపాలకశాఖ పనిచేస్తున్నది.
– గీతగీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) నగరం, పట్టణం
ఆ) జనపదం, ఆరామం
ఇ) పల్లె, నగరం
ఈ) గ్రామం, పురం
జవాబు:
అ) నగరం, పట్టణం
15. అ) సూర్యుడు తూర్పు దెసన ఉదయిస్తాడు. – గీతగీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. (1 మా)
జవాబు:
దిశ
ఆ) తుపాను సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.
– గీతగీసిన పదానికి వికృతిపదం గుర్తించి విడిగా రాయండి
అ) సాగరం
ఆ) సముదరం
ఇ) సదర
ఈ) సంద్రం
జవాబు:
ఈ) సంద్రం
16. అ) మహిళా రత్నము విలువైన రత్నము ధరించింది. – గీతగీసిన పదాలకు నానార్థాలు రాయండి. (1 మా)
జవాబు:
శ్రేష్ఠము, మణి
ఆ) వేపచెట్టు కొమ్మ కింద ఒక కొమ్మ నిలబడింది.- గీతగీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి. (1 మా)
అ) వంశం, జాతి
ఆ) శాఖ, స్త్రీ
ఇ) చెయ్యి, వేదభాగం
ఈ) తోట అడవి
జవాబు:
ఆ) శాఖ, స్త్రీ
17. అ) క్షీరసాగర మథనంలో అమరులు, రాక్షసులు పాల్గొన్నారు. – గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి. (1 మా)
జవాబు:
మరణము లేనివారు (దేవతలు)
ఆ) అందరూ అక్షరం విలువ తెలుసుకోవాలి. – గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి. (1 మా)
అ) నాశనం కానిది (వర్ణం)
ఆ) దేహము కలవాడు (ప్రాణి)
ఇ) మౌనందాల్చి ఉండేవాడు (ఋషి)
ఈ) పక్షములు కలది (పిట్ట)
జవాబు:
అ) నాశనం కానిది (వర్ణం)
18. భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న అవినీతిని రూపుమాపాలి.
– ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయండి. (2 మా)
జవాబు:
రూపుమాపడం
19. ‘నీరుకారిపోవడం’ – ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. (2 మా)
జవాబు:
“నిరుత్సాహపడటం, శక్తిహీనుడవడం” అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
కింది ప్రశ్నలను సూచించిన విధంగా జవాబులు రాయండి. (14 × 1 = 14 మా)
20. రవికి పాల మీగడ అంటే చాలా ఇష్టం. – గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి.
జవాబు:
మీదు + కడ
21. మహా + ఉపకారం – సంధి పదాలను కలిపి రాయండి. (1 మా)
జవాబు:
మహోపకారం
22. అక్కొండ ఎంత ఎత్తుగా ఉన్నదో! – గీతగీసిన పదంలోని సంధిని గుర్తించి విడిగా రాయండి. (1. మా)
అ) అత్వసంధి
ఆ) యణాదేశసంధి
ఇ) విసర్గసంధి
ఈ) త్రికసంధి
జవాబు:
ఈ) త్రికసంధి
23. విద్యాధికులు అందరిచేత గౌరవింపబడతారు. – గీత గీసిన సమాసపదానికి విగ్రహవాక్యం రాయండి. (1. మా)
జవాబు:
విద్యచేత అధికులు
24. జాతీయ పండుగలు ప్రముఖదినములుగా జరుపుకుంటాం. – గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
25. మనిషి కన్నువిచ్చినప్పుడే అందచందాలను చవిగొన్నాడు
– ఈ వాక్యానికి సరియైన ఆధునిక భాషాపరివర్తనమును గుర్తించి రాయండి.
అ) మనిషి కన్నువిప్పినపుడే అందచందాలు చవిగొన్నాడు
ఆ) మనిషి కళ్ళు విప్పినపుడే అందచందాలు చూశాడు
ఇ) మనిషి కళ్ళు తెరిచినపుడే అందచందాలు చవిచూశాడు.
ఈ) మనిషి కళ్ళు తెరవగానే అందచందాలు రుచి చూశాడు.
జవాబు:
ఈ) మనిషి కళ్ళు తెరవగానే అందచందాలు రుచి చూశాడు.
26. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
జవాబు:
మంత్రాలకు చింతకాయలు రాలవు.
27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి.
అ) చూసి
ఆ) చూస్తూ
ఇ) చూస్తే
ఈ) చూడక
జవాబు:
ఈ) చూడక
28. ఆయన కవి. ఆయన గాయకుడు. ఆయన విద్యావేత్త. – ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా రాయండి.
జవాబు:
ఆయన కవి, గాయకుడు, విద్యావేత్త
29. మహాత్ములు ధర్మాన్ని ఆచరిస్తారు. – సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
అ) మహాత్ముల చేత ధర్మం ఆచరించబడుతుంది
ఆ) ధర్మంచేత మహాత్ములు ఆచరించబడ్డారు
ఇ) మహాత్ములు ధర్మంచేత ఆచరించారు.
ఈ) మహాత్ములు ఆచరించినదే ధర్మం.
జవాబు:
అ) మహాత్ముల చేత ధర్మం ఆచరించబడుతుంది
30. వారందరికీ ఏమైంది? – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. (1 మా)
జవాబు:
ప్రశ్నార్థకం
31. ఆహాహా! ఎంత వైపరీత్యము! – ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. (1. మా)
అ) సామర్థ్యార్థక వాక్యం
ఆ) అనుమత్యర్థక వాక్యం
ఇ) ప్రార్థనార్థరక వాక్యం
ఈ) ఆశ్చర్యార్థక వాక్యం
జవాబు:
ఈ) ఆశ్చర్యార్థక వాక్యం
32. “గాయత్రీ! క్రీడా మైదానంలోకి వెళ్ళి ఇప్పుడు ఆడుకోండి”,
– ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.
జవాబు:
అనుమత్యర్థకం
33. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) అప్యర్థకం
ఆ) చేదర్థకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
ఆ) చేదర్థకం