AP 10th Class Telugu Question Paper April 2023 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers and AP 10th Class Telugu Question Paper April 2023 can significantly boost overall exam scores.

AP SSC Telugu Question Paper April 2023 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

 1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
 2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
 3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
 4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I (32 మా)

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (32 మా)

వఱదైన చేను దున్నకు (8 మా)
కరవైనను బంధుజనులకడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పకు
ప్రిఱికికి దళవాయితనముఁబెట్టకు సుమతీ!

ప్రశ్నలు :

అ) ఏ సమయంలో బంధువుల ఇండ్లకు వెళ్ళకూడదు ?
జవాబు:
కరవు సమయంలో బంధువుల ఇండ్లకు వెళ్ళకూడదు.

ఆ) వరద వచ్చినపుడు దేనిని దున్నకూడదు?
జవాబు:
వరద వచ్చినపుడు పొలాన్ని దున్నకూడదు.

ఇ) పిరికివానికి ఏది ఇవ్వకూడదు?
జవాబు:
పిరికివానికి సేనా నాయకత్వం ఇవ్వకూడదు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఎవరికి రహస్యాలు చెప్పకూడదు ?

(లేదా)

ఆ పరమ పురంధ్రులయం
దే పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా!
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో?

ప్రశ్నలు :

ఉ) భిక్ష సమర్పించనిది ఎవరు?
జవాబు:
కాశీనగరంలోని స్త్రీలు భిక్ష సమర్పించలేదు.

ఊ) భిక్ష దొరకలేదని వ్యాసుడు ఏమనుకున్నాడు?
జవాబు:
భిక్ష దొరకలేదని వ్యాసుడు ‘ఈ రోజు ఉదయమే లేచి, ఏ పాపిష్టివాని ముఖం చూశానో అనుకున్నాడు.

ఋ) ఏ నగరంలో స్త్రీలు భిక్ష ఇవ్వలేదు?’
జవాబు:
కాశీనగరంలోని స్త్రీలు భిక్ష ఇవ్వలేదు.

ౠ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
వ్యాసునికి ఏ నగరంలో భిక్ష దొరకలేదు?

AP 10th Class Telugu Question Paper April 2023 with Solutions

2) కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

మే నెల ఇంకా కొద్దిరోజుల్లోనే ముగుస్తుంది అనగా తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పే పని చేపట్టింది. ఆ రోజు అప్పటిదాకా. బలంగా వీచి ఊరును చల్లబరచిన ఉత్తరపు గాలి సన్నగిల్లి మందంగా సాగుతోంది. ఆకాశం కడిగిన నీలిముత్యంలా నిర్మలంగా ఉంది. దుమ్మూ, ధూళీ లేకుండా వాతావరణం స్వచ్ఛంగా ఉంది. ఊళ్ళోని ఇళ్ళ పైకప్పులూ, దూరాన ఉన్న పంటపొలాలూ – అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలవేళ. చిత్రగ్రీవం మేడ పిట్టగోడమీద కూర్చుని ఉంది. అప్పటిదాకా చుట్టుపక్కల గిరికీలు కొడుతున్న తండ్రిపక్షి వచ్చి ఎండకాగుతున్న చిత్రగ్రీవం పక్కన వాలింది. వాలి చిత్రగ్రీవం కేసి ఓ చూపు చూసింది.

ప్రశ్నలు :

అ) చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పేపని చేపట్టింది ఎవరు?
జవాబు:
తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పేపని చేపట్టింది.

ఆ) ఆకాశం ఎలా ఉంది ?
జవాబు:
ఆకాశం కడిగిన నీలిముత్యంలా నిర్మలంగా ఉంది.

ఇ) ఏవేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి ?
జవాబు:
ఊళ్ళోని ఇళ్ళ పైకప్పులూ, దూరాన ఉన్న పంటపొలాలూ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
చిత్రగ్రీవం ఎక్కడ కూర్చుని ఉంది?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి.

అ) రావణుడు.సీతతో లంకకు చేరాడు. తన అంతఃపురంలో సీతనుంచాడు.
జవాబు:
అరణ్యకాండ

ఆ) శ్రీరామచంద్రాదులు వానరసైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
జవాబు:
యుద్ధకాండ

ఇ) అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు.
జవాబు:
అయోధ్యాకాండ

ఈ) దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు.
జవాబు:
బాలకాండ

4. క్రింది లేఖను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)

విజయవాడ,
25. 11, 2023.

గౌరవనీయ స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రి గారికి నమస్కారములు.
అయ్యా !

భారతీయ సంస్కృతి స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ సిరిసంపదలు పెంపొందుతాయి” అని పెద్దలమాట. నేటి సమాజంలో స్త్రీలు వివక్షకు, దాడులకు గురౌతున్నారు. నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలున్నా ఉన్మాదుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. మీరు మంత్రిగా స్త్రీల సంక్షేమం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. స్త్రీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి చట్టాలను కఠినంగా అమలుపరిచేలా చూడవలసినదిగా అభి అభ్యర్థిస్తున్నాము.

అభివందనములతో,
ఇట్లు,
అభ్యుదయ మహిళామండలి,
పటమటలంక,
విజయవాడ.

ప్రశ్నలు :

అ) ఈ లేఖ ఏ తేదీన, ఎవరికి రాయబడింది ?
జవాబు:
ఈ లేఖ 25.11.2023న స్త్రీ, శిశు, సంక్షేమ శాఖామంత్రి గారికి రాయబడింది.

ఆ) స్త్రీల రక్షణకు ఉద్దేశించబడిన చట్టాలేవి ?
జవాబు:
నిర్భయ, దిశ చట్టాలు స్త్రీల రక్షణకు ఉద్దేశించబడినవి.

ఇ) భారతీయ సంస్కృతి స్త్రీలకు ఇచ్చిన స్థానం ఎలాంటిది ?
జవాబు:
భారతీయ సంస్కృతి స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది.

AP 10th Class Telugu Question Paper April 2023 with Solutions

ఈ) లేఖ ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
అర్థవంతమైన ఏ ప్రశ్న రాసినా మార్కులు ఇవ్వాలి.

విభాగము II (36 మా)
వ్యక్తీకరణ – సృజనాత్మకత: (3 × 4 = 12 మా)

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

5. “సముద్రలంఘనం” పాఠ్యభాగ కవి గురించి రాయండి.
జవాబు:
“సముద్ర లంఘనం” పాఠ్యభాగ కవి గురించి రాయండి.
జవాబు:

 • సముద్రలంఘనం పాఠ్యభాగ కవి “అయ్యలరాజు రామభద్రుడు. ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు.
 • ఈయన కాలం 16వ శతాబ్దం.
 • రచనలు : రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం.
 • బిరుదులు : చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన.
 • విశేషాంశాలు : ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. వీరి కవితా సామర్థ్యం చమత్కారంతో కూడినదని వర్ణనల ద్వారా స్పష్టమౌతున్నది.

6. “జానపదుని జాబు” పాఠ్యభాగ నేపథ్యాన్ని వివరించండి.
జవాబు:
“జానపదుని జాబు’ పాఠ్యభాగ నేపథ్యాన్ని వివరించండి.
జవాబు:

 • భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. గ్రామంలోని ప్రతి ఇల్లూ విద్యా గంధంతో గుబాళించి, అభివృద్ధి చెందితేనే మనదేశం సుసంపన్నంగా, సస్యశ్యామలంగా ఉంటుంది.
 • గ్రామాలెలా ఉన్నాయి ? గ్రామ ప్రజల జీవితాలెలా ఉన్నాయి ? అనే విషయాలను వివరిస్తూ దళితుల, పేదల, జీవితాలను చిత్రిస్తూ, పల్లెటూరి లేఖలు జానపదుని జాబులు అనే పేరుతో బోయి భీమన్న గారు కొన్ని లేఖలు పత్రికలలో ప్రచురించారు.
 • చదువుకొని బీదతనం వలన చదువు కొనసాగించలేక, స్వగ్రామానికి పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జానపదుడు, పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి లేఖలు రాస్తాడు.
 • గ్రామంలో తాము పడుతున్న అవస్థలను, గ్రామాల పరిస్థితులను గురించి తెలపడమే ఈ పాఠ్యభాగ నేపథ్యం.

7. “మారీచుడు” పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:

 • రావణుని అనుచరుడు, తాటకి అనే రాక్షసి కుమారుడు
 • మాయలేడిగా మారడం, ఇతరుల గొంతును అనుకరించడం వంటి విద్యలలో ఆరితేరినవాడు.
 • విశ్వామిత్రుని యజ్ఞవేదికపై దాడిచేసి, రామబాణపు శక్తిని రుచి చూసినవాడు.
 • రావణుని ఆజ్ఞతో మాయలేడి రూపంలో ఎందరో రాజులను మోసగించి పొట్టనబెట్టుకొన్న మాయావి.
 • సీతాపహరణం విషయంలో రావణునికి హితబోధ చేసి “రామో విగ్రహవాన్ ధర్మః” అని చాటినవాడు.
 • రావణుని చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో మరణించడం మంచిదని భావించి విధిలేని పరిస్థితిలో బంగారు జింకగా మారి సీత దృష్టిని ఆకర్షించిన అసురుడు.
 • రాక్షసుడైనప్పటికీ ధర్మాధర్మాలు తెలిసిన, మంచిచెడులు గ్రహించిన ధర్మమూర్తి.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి.

8. మాణిక్యవీణ కవితాసారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
పద్యభావాలను ఆధారంగా చేసుకొని ‘వెన్నెల’ పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
జవాబు:
పరిచయం : ‘మాణిక్య వీణ’ అనే పాఠ్యభాగం విద్వాన్ విశ్వం రచించిన ‘మాణిక్య వీణ’ అనే వ్యాసాల, కవితల సంపుటి లోనిది. మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, కృషిని, సాధన సంపత్తిని, తాత్త్వికతను కవి ఈ వచన కవితా ఖండికలో ఎంతో హృద్యంగా వర్ణించారు.

కవితా సారాంశం

వాస్తవిక దృష్టి అవసరం : మంత్రాలతో చింతకాయలు రాలవు. అట్లాగే పద్య రచనలు చింతలను దూరం చేయలేవు. సామాజిక సమస్యలు వాస్తవిక దృష్టి, నిబద్ధత, అంకితభావంతో కూడిన కార్యాచరణతో మాత్రమే పరిష్కారమౌతాయి.

సామాజిక అసమానతలు ప్రమాదకరం : మనిషి తన మేధస్సుతో అంతరిక్షంలో ప్రయాణించే స్థితికి చేరినా కడుపులో రాచపుండులా సామాజిక అసమానతలు రోజురోజుకీ పెరుగుతూ ఉండడం విచారించదగినది. అసమానతలు తొలగించకుండా విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా ప్రయోజనం ఉండదు.

ప్రకృతి – కళలతో సంబంధం : తాను కన్ను తెరవగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశించిన మనిషి దానిని తన వశం చేసుకొనే ప్రయత్నం కూడా ప్రారంభించాడు. మానవుడు గుహలలో జీవించే ఆదిమ కాలంలోనే గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జె కట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు. కళలను తన జీవితంలో ఒక భాగంగా చేసుకొన్నాడు.

మానవ మేధస్సు – ఆవిష్కరణలు : చక్రం కనుగొన్న రోజు, లిపిని కనుగొన్న రోజు చాలా గొప్ప రోజులు. వినూత్న ఆవిష్కరణల కారణంగానే మనిషి రాతియుగపు చీకటి నుంచి నవీన విజ్ఞానం అనే వెలుతురులోకి ప్రవేశించాడని కవి భావన.

ముగింపు : మనిషి కాలగర్భంలో కలిసిన అతని మేధస్సులో నుంచి ఆవిష్కృతమైన కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికీ దిశా నిర్దేశం చేస్తాయి. మానవుణ్ణి శాశ్వత యశస్కుణ్ణి చేస్తున్నాయి.

(లేదా)

పద్యభావాలను ఆధారంగా చేసుకొని ‘వెన్నెల’ పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
జవాబు:
వర్ణనలకు ఆద్యుడని పేరు పొందిన ఎఱ్ఱన వెన్నెలను ఎంతో మనోహరంగా వర్ణించాడు. దిక్కులు అనే కొమ్మలతో, వెలుగులీనే చుక్కలు అనే పూలతో ఆకాశం పెద్ద చెట్టులాగా కనిపిస్తున్నది. ఆ పూలను అందుకోడానికి కిరణాలు అనే తన చేతులను పొడవుగా జాపుతూ చంద్రుడు పైపైకి వచ్చాడు.

పాల సముద్రం నుంచి పుట్టిన వెన్నెల ఉప్పొంగి దిక్కులన్నిటినీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం శేషపానుపులాగా ఉన్నది. చంద్రునిలోని మచ్చ ఆ పాన్పుమీద పడుకున్న విష్ణువులాగా ఉన్నది.

వెన్నెలలో కలువ పూలు రేకులు విచ్చుకొని వాలిపోయిన కేసరాలు తిరిగి బలంగా నిలుచున్నాయి. పుప్పొడి మీద తేనెలు పొంగిపొరలి తుమ్మెదలకు విందుచేశాయి. కమ్మని సువాసనలు చుట్టూ వ్యాపించాయి.

వెన్నెల వర్షంలో చంద్రకాంత శిలలు కరిగిపోయాయి. ఎగిరే చకోర పక్షుల రెక్కలను తాకుతూ కలువపూలపై వ్యాపించింది వెన్నెల. స్త్రీల మనోహరమైన చిరునవ్వులను అధికం చేస్తూ దిక్కులను ముంచెత్తుతూ అంతటా వ్యాపించింది వెన్నెల.

అందంగా, గంభీరంగా, సమున్నతంగా విస్తరించింది వెన్నెల. రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి ఎక్కడా కనబడనీయక కళ్ళకు అమృతపు జల్లులాగా, శరీరానికి మంచి గంధం పూతలాగా, మనసుకు ఆనంద తరంగంలాగా వెన్నెల హాయిని కలిగించిందని వర్ణిస్తూ కవి ఎఱ్ఱన వెన్నెలను చూసి స్పందించాడు.

AP 10th Class Telugu Question Paper April 2023 with Solutions

9. సీతాపహరణం గురించి రాయండి.
(లేదా)
వాలి సుగ్రీవుల మధ్య విరోధానికి గల కారణాన్ని వివరించండి.
జవాబు:

 • పంచవటిలో శ్రీరాముని చేత పరిహసింపబడి లక్ష్మణుని చేత విరూపిగా మారిన శూర్పణఖ రావణుడి వద్ద తన గోడును వెళ్ళబోసుకుంది.
 • అయినా రావణుడు చలించకపోవడంతో సీత అందచందాలను వర్ణించి నీవే తనకు తగిన భర్తవని కొత్త ఆశలను రేపింది.
 • శ్రీరాముని బలాన్ని, తన బలాన్ని పోల్చుకున్న రావణుడు సీతాపహరణకు సిద్ధమై బంగారు లేడిగా మారి సహకరించమని మారీచుడిని కోరాడు.
 • గత్యంతరంలేక బంగారు జింకగా మారిన మారీచుడు శ్రీరామ ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించాడు.
 • ఆ జింక తనకెంతో నచ్చిందని, దానిని తీసుకురమ్మని సీత కోరగా ఆమె ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని బంధించి తీసుకురావడానికి రాముడు సంసిద్ధుడయ్యాడు.
 • మాయాలేడిని ప్రాణాలతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించి, లాభం లేకపోవడంతో శ్రీరాముడు బాణాన్ని సంధించాడు. రామబాణపు దెబ్బకు ఎగిరి కిందపడ్డ మారీచుడు శ్రీరాముని గొంతుతో ‘అయ్యో సీతా ! అయ్యో లక్ష్మణా !’ అంటూ భయంకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు.
 • ఆందోళన చెందిన సీత రాముడికి సహాయంగా వెళ్ళమని లక్ష్మణుని కోరింది. నిష్ఠూరంగా మాట్లాడింది. లక్ష్మణుడు రాముడు వెళ్ళిన దిశగా విధిలేని పరిస్థితిలో వెళ్ళాడు.
 • ఇదే అదనుగా భావించిన రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చి, సీత వివరాలడిగి, తన వివరాలు తెలిపి, తనను పతిగా స్వీకరించమని కోరాడు.
 • అందుకు తృణీకరించిన సీత నన్ను అపహరించడానికి ప్రయత్నించి, నీ చావు నువ్వు కొనితెచ్చుకోకు అని హెచ్చరించింది.
 • రావణుడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తూ, అడ్డుపడిన జటాయువును నేలకూల్చి సీతను అపహరించుకొని వెళ్ళాడు.

(లేదా)

వాలి సుగ్రీవుల మధ్య విరోధానికి గల కారణాన్ని వివరించండి.
జవాబు:

 • వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు. తండ్రి తరువాత ‘కిష్కింధ’కు వాలి రాజు అయ్యాడు.
 • మాయావి అనే రాక్షసునికి, వాలికి విరోధం ఉంది. ఒకనాడు మాయావి యుద్ధానికి పిలిచినపుడు వెంటపడి గుహలోకి ప్రవేశించాడు వాలి.
 • బిల ద్వారం వద్ద సుగ్రీవుడిని కాపలా ఉండమని చెప్పాడు వాలి. సంవత్సరకాలం గడిచిన తర్వాత గుహలోపలి నుండి అరుపులు వినిపించాయి.
 • ఆ గుహ లోపలి నుండి రక్తం నురగలుగా బయటకు వచ్చింది. మాయావి చేతిలో తన అన్న వాలి మరణించాడని అనుకుని సుగ్రీవుడు బిల ద్వారాన్ని బండరాతితో మూసివేసి కిష్కింధకు వచ్చాడు.
 • మంత్రులు బలవంతంగా సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశారు. కొన్నాళ్ళ తరువాత తిరిగి వచ్చిన వాలి రాజుగా ఉన్న సుగ్రీవుని చూసి, మండిపడ్డాడు.
 • సుగ్రీవుని కుమారులను చెరసాలలో బంధించి అతని భార్యయైన రుమను అపహరించాడు. అతడిని రాజ్యభ్రష్టుడిని చేశాడు.
 • సుగ్రీవుడు ప్రాణభయంతో పరుగుతీస్తూ భూమండలం అంతా తిరిగి ఋష్యమూక పర్వతం చేరాడు.
 • మతంగముని శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతంపై అడుగుపెట్టలేడు. కనుక సుగ్రీవుడు తన అనుచరులతో కలిసి అక్కడ జీవించసాగాడు.

10. చూడాకర్ణుడు – వీణాకర్ణుడు మధ్య జరిగిన మాటలను సంభాషణ రూపంలో రాయండి.
(లేదా)
విద్వాన్ విశ్వం గారి కవిత్వాన్ని ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి..
జవాబు:
వీణాకర్ణుడు : మిత్రమా ! చూడాకర్ణా! ఏమిటి? పైకి చూస్తూ నేలమీద కఱ్ఱతో కొడుతున్నావు?
చూడాకర్ణుడు : ప్రతి రోజూ ఒక ఎలుక చిలుకకొయ్యమీద ఉన్న పాత్రలోని అన్నాన్ని తినిపోతోంది. నాకు దీనివల్ల చాలా కష్టంగా ఉంది.
వీణాకర్ణుడ : ఎక్కడ ఎలుక? ఎక్కడ చిలుకకొయ్య? ఇంత చిన్న జంతువుకు, అంత ఎత్తు ఎగరడానికి బలం ఎక్కడ నుండి వచ్చింది? దీనికి కారణం ఏదో లేక మానదు.
చూడాకర్ణుడు : ఈ ఎలుక చాలా కాలం నుండి ఇక్కడ స్థానం ఏర్పాటు చేసికొని నివసిస్తున్నది. ఇక్కడనివసించడానికి కారణం తెలియడం లేదు.

(లేదా)

విద్వాన్ విశ్వంగారి కవిత్వాన్ని ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

నిమ్మకూరు,
తేది: XX.XX.XXXX,

ప్రియ మిత్రుడు గోపాలు రాయునది,

ఈ మధ్య మా తెలుగు ఉపాధ్యాయులు విద్వాన్ విశ్వం గారు రచించిన ‘మాణిక్య వీణ’ పాఠం వివరించి చెప్పారు.

అందరికీ తెలిసే సరళమైన వాడుక భాషలో ఎంతో అందంగా ఈ కవితను విశ్వంగారు రచించారు. ఇందులో తేట తెలుగు నుడికార ప్రయోగాలు చాలా బాగున్నాయి. మంత్రాలతో చింతకాయలు రాలవనడం, పొట్టలోని పుట్టకురుపు మొదలైన నానుడులు కవితకు ఎంతో అందాన్ని ఇచ్చాయి.

మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, మానవ మేధస్సును; మానవ జీవితానికి, కళలకు, విజ్ఞానాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని కవి తాత్త్వికతతో హృద్యంగా వర్ణించారు. అందుకే ఈ పాఠం నాకు బాగా నచ్చింది. నువ్వు కూడా నీకు నచ్చిన పాఠం గురించి, కవి గురించి లేఖ రాయగలవు.

ఇట్లు
నీ మిత్రుడు,
మార్కండేయశర్మ
S/o. ఆంజనేయులు,
నిమ్మకూరు, కృష్ణాజిల్లా,

చిరునామా:
శనగల శేషాంజనేయ గోపాల్,
S/o. నరసింహశాస్త్రిగారు,
దక్షిణ గాలి గోపురం ఎదురుగా,
మంగళగిరి, గుంటూరు జిల్లా.

విభాగము – III (32 మా)
భాషాంశాలు : (పదజాలం – వ్యాకరణాంశాలు) (9 × 2 = 18 మా)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

11. చందన ముఖం చంద్ర బింబము వలె అందంగా ఉంది. (ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించి రాయండి.) (2 మా)
జవాబు:
ఉపమాలంకారం (అలంకారాన్ని గుర్తిస్తే చాలు. లక్షణం రాయనవసరం లేదు.)

12. కింది పద్యానికి గురు లఘువులు గుర్తించి, గణ విభజన చేసి, పద్యం పేరు రాయండి. (2 మా)
తన చూపంబుధి మీద జాచి శ్రవణ ద్వంద్వంబు రిక్కించి వం.
జవాబు:
AP 10th Class Telugu Question Paper April 2023 with Solutions 1
పై పద్యపాదం “మత్తేభము”నకు చెందినది.

13. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (2 మా)

అ) విద్యార్థులంతా పరీక్షలకు ఆయత్తం అవుతున్నారు. (గీతగీసిన పదానికి అర్థం రాయండి)
జవాబు:
సిద్ధం

ఆ) ఉత్తములు ధనిక పేద భేదాలు చూపరు.
(గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించి, విడిగా రాయండి)
అ) మిత్రులు
ఆ) బంధువులు
ఇ) గొప్పవారు
ఈ) వారసులు
జవాబు:
ఇ) గొప్పవారు

14. అ) నేడు స్త్రీలు అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.)
జవాబు:
మహిళ, పడతి, వనిత

ఆ) పున్నమి చంద్రుని రాకతో వెన్నెల అంతటా వ్యాపించింది. (2 మా)
(గీత గీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించి, విడిగా రాయండి.)
అ) రేయి, నిశి
ఆ) చీకటి, అంధకారం
ఇ) నింగి, మిన్ను
ఈ) కౌముది, చంద్రిక
జవాబు:
ఈ) కౌముది, చంద్రిక

AP 10th Class Telugu Question Paper April 2023 with Solutions

15. అ) చిత్రగ్రీవము అందమైన పక్కి (గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి) (2 మా)
జవాబు:
పక్షి

ఆ) మంచి గుణములు మనిషికి చక్కని ఆభరణాలు.
(గీత గీసిన పదానికి సరైన వికృతి పదం గుర్తించి విడిగా రాయండి)
అ) గొనము
ఆ) రణము
ఇ) కణము
ఈ) జనము
జవాబు:
అ) గొనము

16. అ) వెల్లి వంటి వెన్నెల వెల్లి దిక్కులన్నీ ముంచేసింది. (గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి.) (1 మా)
జవాబు:
తెలుపు, ప్రవాహం

ఆ) అన్ని కళలతో చంద్రుడు అలరారుతున్నాడు. చెక్కిన కళలాగా కనిపించాడు. (1 మా)
(గీతగీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.)
అ) చంద్రునిలో పదహారో వంతు, శిల్పం
ఆ) స్నేహితుడు, సూర్యుడు
ఇ) పాదము, కిరణము
ఈ) పండు, ప్రయోజనం
జవాబు:
అ) చంద్రునిలో పదహారో వంతు, శిల్పం

17. అ) హనుమంతుడు ధరాధరం పైకి ఎక్కి సముద్రాన్ని దాటాడు. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్ధం రాయండి.) (1 మా)
జవాబు:
ధరను ధరించునది (కొండ)

ఆ) వానరులు పయోనిధి పైన వారధి నిర్మించారు. (గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.) (1 మా)
అ) నీటికి నిధి వంటిది (సముద్రం)
ఆ) కాలక్రమంలో స్వల్పమై పోయేది (ప్రవాహం)
ఇ) వనంలో పుట్టినది (పద్మం)
ఈ) తొండము కలది (ఏనుగు)
జవాబు:
అ) నీటికి నిధి వంటిది (సముద్రం)

18. మా నాన్నగారి మాట నాకు సుగ్రీవాజ్ఞ వంటిది. (ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయండి.) (2 మా)
జవాబు:
సుగ్రీవాజ్ఞ

19. “ఉన్నదంతా ఊడ్చుకుపోవటం” అనే జాతీయం ఏ సందర్భంలో అర్థంలో ఉపయోగిస్తారో రాయండి.
జవాబు:
అంతా కోల్పోవడం / ఏమీ మిగలకుండా పూర్తిగా నశించడం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

20. మేమంతా విహార యాత్రకు వెళ్ళాము. (1 మా)
(గీత గీసిన పదాన్ని విడదీయండి)
జవాబు:
మేము + అంతా

21. మహా + ఉపకారం – ఈ సంధి పదాలను కలిపి రాయండి. (1 మా)
జవాబు:
మహోపకారం.

22. కాశీ క్షేత్రం పుణ్యాంగనలకు నిలయం. (1 మా)
(గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించి, విడిగా రాయండి.)
అ) గుణ సంధి
ఆ) సవర్ణ దీర్ఘ సంధి
ఇ) యణాదేశ సంధి
ఈ) ఇత్వ సంధి
జవాబు:
ఆ) సవర్ణ దీర్ఘ సంధి

23. మహాత్ములను సేవించుట ఒక మహాభాగ్యం. (గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి.) (1 మా)
జవాబు:
గొప్పదైన భాగ్యం

24. రామలక్ష్మణులు అన్నదమ్ములు (గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.) (1 మా)
అ) ద్విగు సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) అవ్యయీభావ సమాసం
జవాబు:
ఇ) ద్వంద్వ సమాసం

క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (8 × 1 = 8 మా)

25. లోభము మోహమును బుట్టించును. (1 మా)
– ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనమును గుర్తించి విడిగా రాయండి.
అ) లోభము మోహమును పుట్టించును
ఆ) లోభము మొహాన్ని పుట్టించును
ఇ) లోభం మోహాన్ని పుట్టిస్తుంది.
ఈ) లోభము మోహము చేత పుట్టదు.
జవాబు:
ఇ) లోభం మోహాన్ని పుట్టిస్తుంది.

26. చిత్రగ్రీవం ఆకాశానికి ఎగిరింది. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి)
జవాబు:
చిత్రగ్రీవం ఆకాశానికి ఎగరలేదు.

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి, విడిగా రాయండి.
అ) వెళ్ళి
ఆ) వెళ్ళక
ఇ) వెళ్తూ
ఈ) వెళ్తే
జవాబు:
ఆ) వెళ్ళక

28. వానలు కురిస్తే పంటలు పండుతాయి. (ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యమో రాయండి.)
జవాబు:
చేదర్థక వాక్యం

AP 10th Class Telugu Question Paper April 2023 with Solutions

29. శ్రీనాథుడు కాశీఖండం రాశాడు. (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.)
అ) కాశీఖండం అనేది శ్రీనాథుడు రాసినదే
ఆ) శ్రీనాథుడు కాశీఖండం రాయగలిగాడు
ఇ) కాశీఖండం చేత శ్రీనాథుడు రాయబడ్డాడు.
ఈ) శ్రీనాథుడి చేత కాశీఖండం రాయబడింది
జవాబు:
ఈ) శ్రీనాథుడి చేత కాశీఖండం రాయబడింది

30. నేను తప్పక వస్తాను. (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి)
జవాబు:
నిశ్చయార్థక వాక్యం

31. ఫోన్ను ఎక్కువసేపు వాడవద్దు.’ (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి)
అ) ప్రార్థనార్ధకం
ఆ) నిషేధార్థకం
ఇ) ఆశీరర్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఆ) నిషేధార్థకం

32. మీరెక్కడికి వెళ్తున్నారు ? (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి)
జవాబు:
ప్రశ్నార్ధక వాక్యం

33. దయచేసి నన్ను కాపాడండి.
(ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి, విడిగా రాయండి)
అ) ఆశ్చర్యార్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) ప్రార్థనార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఇ) ప్రార్థనార్థకం

Leave a Comment