AP 10th Class Telugu Model Paper Set 8 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 8 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 8 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

గిరికార్ముకనిర్గతమై
హరిశర మపు డసురవరపురాభిముఖంబై
సురగరుడదురవలోక
త్వరతోఁ జనె నొకమహారవం బుదయింపన్

ప్రశ్నలు :

అ) పద్యంలో కొండను దేనితో పోల్చారు ?
జవాబు:
పద్యంలో కొండను విల్లుతో పోల్చారు.

ఆ) హనుమంతుడిని ఎలా పోల్చి చెప్పారు ?
జవాబు:
హనుమంతుడిని బాణంతో పోల్చి చెప్పారు.

ఇ) హనుమంతుడు ఏవైపునకు ప్రయాణం చేశాడు ?
జవాబు:
హనుమంతుడు అసురుల పట్టణమైన లంకవైపునకు ప్రయాణం చేశాడు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
గొప్పధ్వనితో దూసుకుపోయింది ఎవరు ?

(లేదా)

వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!

ప్రశ్నలు :

ఉ) పొలాన్ని ఎప్పుడు దున్నకూడదు ?
జవాబు:
వరద వచ్చినప్పుడు పొలాన్ని దున్నకూడదు.

ఊ) కరువు సమయంలో ఎక్కడికి వెళ్ళకూడదు ?
జవాబు:
కరువు సమయంలో బంధువుల ఇండ్లకు వెళ్ళకూడదు.

ఋ) ఎవరికి రహస్యాలను చెప్పకూడదు ?
జవాబు:
ఇతరులకు రహస్యాలను చెప్పకూడదు.

ౠ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
సేనానాయకత్వం ఎవరికి ఇవ్వకూడదు ?

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము.

ఈ పనిలో ఎందరో స్త్రీలను కలిశాం. వాళ్ళతో మాట్లాడటమే పెద్ద ఉత్సాహంగా ఉండేది. వాళ్ళ అనుభవాలు వింటూంటే ఉద్వేగం కలిగేది. చరిత్రను మా కళ్ళముందు పరచిన వారి జీవితాలను వినటం ఈ పనిలో మాకు అన్నిటికంటే ఆనందాన్నిచ్చిన విషయం. సరిదె మాణిక్యాంబగారు “అప్పుడు మా కులంవారిని ఆడవద్దన్నారు. తర్వాత అన్ని కులాలవారినీ ఆడవచ్చన్నారు. మా వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు ఇదే జీవనోపాధిగా అన్ని కులాలవాళ్ళు బతుకుతున్నారు” అన్నప్పుడు సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ళముందు మెదిలి కన్నీరు కార్చారు. స్త్రీలేమంటున్నారో వినకుండా, స్త్రీలేం కావాలనుకుంటున్నారో పట్టించుకోకుండా సాగిన ఎన్నో ఉద్యమాలు, వాటిలో ఘర్షణపడి నిగ్గుదేలీ కొత్త చరిత్రను సృష్టించిన స్త్రీలూ- వీళ్ళందరి అనుభవాలతో చరిత్ర కొత్తగా పరిచయమయినట్లనిపించింది.

ప్రశ్నలు :

అ) అన్నిటికంటే ఆనందాన్నిచ్చిన విషయం ఏది ?
జవాబు:
చరిత్రను కళ్ళముందు పరచిన వారి జీవితాలను వినడం అన్నిటికంటే ఆనందాన్నిచ్చిన విషయం.

ఆ) ‘అప్పుడు మా కులంవారిని ఆడవద్దన్నారు…..’ అని చెప్పింది ఎవరు ?
జవాబు:
సరిదె మాణిక్యాంబగారు ‘అప్పుడు మాకులం వారిని ఆడవద్దన్నారు…..” అని చెప్పారు.

ఇ) సరిదె మాణిక్యాంబగారి మాటలు విన్న తర్వాత ఎలాంటి స్త్రీలు కళ్ళముందు కదిలారు ?
జవాబు:
సరిదె మాణిక్యాంబగారి మాటలు విన్న తర్వాత సంస్కరణోద్యమ రథచక్రాలకింద నలిగిన ఎందరో స్త్రీలు కళ్ళముందు కదిలారు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఎవరి అనుభవాలు వింటుంటే ఉద్వేగం కలిగింది ?

AP 10th Class Telugu Model Paper Set 8 with Solutions

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి. (8 మా)

అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడుపయోగించుకొమ్మని సూచించింది. మంథర.
జవాబు:
అయోధ్యాకాండ

ఆ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
జవాబు:
బాలకాండ

ఇ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.
జవాబు:
అరణ్యకాండ

ఈ) సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి,
జవాబు:
సుందరకాండ

4. క్రింది అపరిచిత గద్యాన్ని (సంభాషణ) చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)

పావురం : అసలు అడవులను నాశనం చేయడం వల్లనే వర్షాలు కురవడం లేదు. పంటలు పండడం లేదు. ఎటు చూసినా కరువు. తిండికి, నీటికి అన్నిటికీ కరువే.
కాకి : ఎక్కడ చూసినా కరువే కాదు, కాలుష్యం కూడా పెరిగింది.
పావురం : జనం పెరగడం వల్లనే ఈ కాలుష్యం, కరువు అన్నీ వస్తున్నాయి. వీటివల్లే రోగాలు కూడా వస్తున్నాయి.
నక్క : కొందరు చేసిన ద్రోహానికి అందరూ శిక్ష అనుభవిస్తున్నారు.
మనిషి : అలా అనకూడదు. మంచిది కాదు. ప్రకృతిని, అడవులను సంరక్షించుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.

ప్రశ్నలు :

అ) వర్షాలు ఎందుకు కురవడం లేదు ?
జవాబు:
అడవులను నాశనం చేయడం వలన వర్షాలు కురవడం లేదు.

ఆ) రోగాలు ఎందువల్ల వస్తున్నాయి ?
జవాబు:
జనాభా పెరగడం, కాలుష్యం, కరువు వలన రోగాలు వస్తున్నాయి.

ఇ) ఇందులోని నినాదం రాయండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.

ఈ) పై సంభాషణను అనుసరించి ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?

విభాగము – II (36 మా)
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత: (3 × 8 = 24 మా)

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

5. ‘భిక్ష’ పాఠ్యభాగ కవి పరిచయం రాయండి.
జవాబు:
1. కవి : ‘భిక్ష’ పాఠ్యభాగ కవి శ్రీనాథుడు.
శ్రీనాథుని తల్లిదండ్రులు మారయ, భీమాంబ.
2. కాలం : 1380 – 1470
3. బిరుదు : కవిసార్వభౌమ.
4. రచనలు : మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయవిజయం, క్రీడాభిరామం, శివరాత్రి మాహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్రలు శ్రీనాథుని రచనలు.
5. ఇతర విశేషాలు : శ్రీనాథుని రచనలలో చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవితవిధానానికి అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఉద్దండ లీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచితబంధం, సూక్తి వైచిత్రి తన కవితాలక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు సీసపద్యాలకు ప్రసిద్ధి.

6. చిత్రగ్రీవం పాఠ్యభాగ ప్రక్రియను వివరించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ పాఠ్యభాగం కథా ప్రక్రియకు చెందినది. ఇది అనువాద కథ. ఒక భాషలో ఉన్న రచనను మరొక భాషలోకి మార్చి రాయడాన్ని అనువాదం అంటారు. దీనినే ఆంగ్లంలో ట్రాన్స్లేషన్ (Translation) అని కూడా అంటారు. తర్జుమా, అనువాద్, భాషాంతరీకరణ అని కూడా పిలుస్తారు.

7. సీత పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
మిథిలానగర ప్రభువైన జనకమహారాజు యాగం కోసం భూమిని దున్నుతుండగా దొరికిన పసిపాపే సీత. తల్లిదండ్రులు సీతను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. శివుని విల్లువిరిచి శ్రీరాముడు సీతను వివాహమాడాడు. పట్టుచీరలు వదలి నారవస్త్రాలు ధరించి భర్తతోపాటు అడవులకు వెళ్ళిన పతిభక్తురాలు సీతమ్మ.

రావణుడు సీతమ్మను అపహరించుకుపోయి లంకలో అశోకవనంలో ఉంచగా రాక్షసస్త్రీలు ఆమెను అనేక విధాలుగా బాధించారు. ఆమె వాటిని భరించింది. రాక్షసులు ఎన్నో విధాలుగా చెప్పి రావణుని వివాహం చేసుకొమ్మన్నారు. అయినా వారి మాటలు పెడచెవిన పెట్టింది. సీతకు రామనామస్మరణ తప్ప మరో ఆలోచనే లేదు.

తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేసిన దొడ్డ ఇల్లాలు సీత. చివరికి అగ్నిదేవుడే వచ్చి, శ్రీరామునికి సీతను అప్పగించి ఆమె గొప్పదనం లోకానికి చూపాడు.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 4 = 12 మా)

8. ‘భిక్ష’ పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:

  • విద్యాగురుడైన వ్యాసమహర్షి శిష్యులతో పాటు మండుటెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీథిలో భిక్షకోసం ఇల్లిల్లూ తిరగసాగాడు. ఏ ఇల్లాలూ భిక్ష పెట్టడంలేదు.
  • ఇలా రెండురోజులు జరిగేసరికి, బాధపడి కోపంతో భిక్షాపాత్రను ముక్కలు ముక్కలయ్యేటట్లు నట్టనడి వీథిలో విసిరికొట్టి ఆవేశంతో కాశీని శపించబోయాడు వ్యాసుడు.
  • ఆ సమయంలో పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చి గొంతుదాకా తినడానికి భిక్షదొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా! ఇది నీకు మంచిదా? బాగున్నది. నిజంగా నీవు శాంతస్వభావుడవా? ‘ఉన్నఊరు కన్నతల్లితో సమానం’ అనే నీతి నీకు తెలియదా? శివుని అర్ధాంగ లక్ష్మియైన ఈ కాశీనగరిమీద నీవింత కోపం చూపించడం తగునా? అని మందలించింది.
  • విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువువలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా! అన్నది ఆ ఇల్లాలు.
  • వేదవ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి, స్నాన, ఆచమనాదులు పూర్తి గావించుకొని వచ్చి భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె వడ్డన సాగించింది.

(లేదా)

డా॥ గడియారం వేంకటశేషశాస్త్రి రచించిన ‘మాతృభావన’ పాఠంలో శివాజీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

భారతీయ సంస్కృతి – పరమత సహనం : వ్యక్తిత్వం అంటే మాటలకూ, చేతలకూ తేడా లేనితనం. శివాజీకి హిందూమతం పట్ల, మనదేశ సంప్రదాయాల పట్ల గౌరవం ఎక్కువ. ఇతర మతాల వారినీ, వారి ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించేవాడు. పరమత సహనం కలవాడు. సైనికులకు ఆజ్ఞలను జారీ చేసి, వాటిని సక్రమంగా నిర్వహించేటట్లు చూసేవాడు. ఇతరులకు అపకారం తలపెట్టేవాడు కాదు. తోటివారిపట్ల ప్రేమాదరాలతో మెలిగేవాడు. తన సైనికులు గానీ, అధికారులు గానీ తప్పు చేస్తే సహించేవాడుకాదు.

పరస్త్రీ కూడా కన్నతల్లి లాంటిదే : స్త్రీల విషయంలో శివాజీ ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. పరస్త్రీలను కన్నతల్లిగా భావించేవాడు. ఒకసారి సోన్దేవుడు పుణ్యస్త్రీని బీజాపురం నుండి బందీగా పట్టి తెచ్చినందుకు ఆయనపై కోపాన్ని ప్రదర్శించాడు. దానికి సోన్దేవుడు తన తప్పును క్షమించమని ప్రార్థించగా, మన్నించిన శాంతస్వభావుడు. స్త్రీల పట్ల గౌరవభావంతో ఉండేవాడు. స్త్రీలు పుణ్యదేవతలనీ, వారిని అవమానించడం మన హిందూ సంప్రదాయం కాదని గట్టిగా చెప్పాడు.

స్త్రీలు భారతావని కల్పలతలు : అనసూయ, సావిత్రి, సీత, సుమతి మొదలైనవారు పతివ్రతలనీ, భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన కల్పలతలని కొనియాడాడు. స్త్రీలను అవమానించినవారు వంశంతో సహా నాశనమయ్యారని వివరించాడు.

AP 10th Class Telugu Model Paper Set 8 with Solutions

9. మాయలేడి వలన సీతారాములకు కష్టాలు వచ్చాయని ఎలా చెప్పగలవు ?
(లేదా)
రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయిన విధం, రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధం రాయండి.
జవాబు:
రావణుని హెచ్చరికతో మారీచుడు అయిష్టంగానే బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుచున్నాడు. సీతాదేవి ఆ జింకను చూసి. ఆశ్చర్యపడి తనకు ఆ జింకను తెచ్చి ఇమ్మని కోరింది. లక్ష్మణుడు అది మారీచుని మాయ అని చెప్పినా సీత వినిపించుకోలేదు. సీత ఇష్టాన్ని కాదనలేక శ్రీరాముడు దానిని పట్టి తెచ్చి సీతకు ఇవ్వాలని సంసిద్ధుడయ్యాడు. సీతను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ జింకను వెంటాడుతూ శ్రీరాముడు అడవిలోకి వెళ్ళాడు. ఇక్కడి నుండే సీతారాములకు కష్టాలు వచ్చాయి. శ్రీరాముడు ఎంతసేపటికీ రాకపోవటం, మారీచుడు శ్రీరాముని కంఠధ్వనిని అనుకరిస్తూ ‘హా సీతా ! హా లక్ష్మణా ! అని బిగ్గరగా అరవడం విని సీతాదేవి కలవరపడింది. లక్ష్మణుని వెంటనే వెళ్ళి అన్నను కాపాడమని పురమాయించింది.

శ్రీరామునికి ఏమీ కాదని లక్ష్మణుడు ఎంత చెప్పినా సీత వినిపించుకోక లక్ష్మణుని వెళ్ళి అన్నను కాపాడమని ఆదేశించింది. రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళగా సీత ఒంటరిగా ఆశ్రమంలో ఉండడం, అదే అదనుగా భావించిన రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళుటకు సన్యాసిరూపం ధరించి ఆశ్రమంలో ప్రవేశించడంతో సీతారామలక్ష్మణులకు అసలు కష్టాలు ఎదురయ్యాయి. మాయ ఎటువంటి వారినైనా ప్రలోభ పరుస్తుందని, మాయలేడి విషయం తెలుసుకోలేకపోయినందువల్లనే వారికీ కష్టాలు వచ్చాయని చెప్పగలను. విధి బలీయమైనదని, దాని ముందు అందరు నిమిత్తమాత్రులని, ఇలా మాయలేడి ఉదంతం వలననే సీతను రావణాసురుడు అపహరించుకు పోగలిగాడని చెప్పగలను. సీతారామలక్ష్మణులకు ఆనాటి నుండి అనేక కష్టాలు వచ్చాయని చెప్పగలను.

(లేదా)

నారదాగమనం : నారదమహర్షి ఒకనాడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి నారదుని చూసి ‘లోకంలో గుణవంతుడూ, ధర్మాత్ముడూ, పరోపకారీ, వీరుడూ, అందగాడూ ఇన్ని మంచిలక్షణాలు కలవాడు ఎవరైనా ఉన్నాడా?’ అని అడిగాడు. నారదుడు చిరునవ్వు నవ్వుతూ, ‘అటువంటి మంచిలక్షణాలు కలవాడు శ్రీరాముడు’ అని చెప్పి, రామకథను వినిపించాడు నారదుడు. అక్కడనుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

వాల్మీకి బాధ : వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో కలసి తమసా నదికి స్నానానికి వెళ్ళాడు. నది దగ్గర ఒక చెట్టుమీద క్రౌంచపక్షుల జంటను చూశాడు. ఇంతలో ఒక వేటగాడు మగపక్షిని చంపాడు. ఆడపక్షి బాధపడుతోంది. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి మనసు బాధపడింది. ఆ శోకంలోంచి మానిషాద అనే మాటలు వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వచ్చాయి. ఆ మాటలు సమాన అక్షరాలతో లయబద్ధంగా ఉండడం వాల్మీకిని ఆశ్చర్యపరచాయి.

బ్రహ్మరాక : సృష్టికర్త బ్రహ్మ వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ ఎదురుగా కూర్చున్నాడు. కాని అతని మనస్సులో క్రౌంచపక్షి బాధ మానిషాద శ్లోకం ప్రతిధ్వనిస్తోంది. బ్రహ్మ చిరునవ్వునవ్వి వాల్మీకితో, ‘నువ్వు పలికిన మాటలు శ్లోకమే. ఆ ఛందస్సులోనే రామకథను రాయి. భూమిపై నదులు పర్వతాలు ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు’ అని ఆశీర్వదించాడు. వాల్మీకి బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచన ప్రారంభించాడు. ఇలా శోకం నుండి పుట్టిన శ్లోకం రామాయణ మహాకావ్యానికి కారణమైంది.

10. పల్లెటూరులోని ప్రకృతి అందాలను, మానవ సంబంధాలను వివరిస్తూ మీ మిత్రుడు/ మిత్రురాలికి ఒక లేఖ రాయండి. (లేదా) అవినీతి నిర్మూలన మనకర్తవ్యం అని ప్రజలకు తెలియజేస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

తుని,
తేది : XX.XXXXXX.

నేస్తం హారికకు,
నేస్తమా!

`బాగున్నావా! నేనూ నా కుటుంబం క్షేమం. అక్కడ నువ్వూ, నీ కుటుంబ సభ్యులూ క్షేమమని తలుస్తాను.

నేను ఈ మధ్య సెలవుల్లో మా అమ్మమ్మగారి ఊరు వెళ్ళాను. అదొక పల్లెటూరు. మెట్టప్రాంతం కావడం వల్ల అక్కడ వరిపంటలు వర్షపు నీటితో పండిస్తారు. అక్కడ కొండలపై సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలు ఎంతో అందంగా ఉన్నాయి.

అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యపరచినది ఆ పల్లె మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు. కులం, మతం అనే పట్టింపు లేకుండా ఒకర్నొకరు బాబాయి, మామయ్య, అబ్బాయి, అయ్యా, అమ్మా, అత్తమ్మ, అక్క, తమ్ముడు, బావా వంటి పిలుపులతో పలకరించుకోవడం ఆశ్చర్యమేసింది. ఏ ఇంట్లోనైనా పెండ్లీ, పేరంటం జరిగితే, అది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని వేడుకగానే భావించడం, బాధ్యత పంచుకోవడం ఆనందించాల్సిన విషయం.

నీవు కూడా నీ అనుభవాలు రాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
గగన దీపిక.

చిరునామా :
కె. హారిక,
పురజనులారా!
S/o. కె. రామకృష్ణారావు,
తులసీనగర్, అనకాపల్లి.

(లేదా)

అవినీతి నిర్మూలన – మన కర్తవ్యం

పురజనులారా!

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అన్ని రంగాల్లోమా దేశం బాగా అభివృద్ధి చెందింది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రభావాల వల్ల కూడా మనదేశం పురోగమిస్తుంది. కాని దురదృష్టవశాత్తు అవినీతి కూడా పెచ్చు పెరిగింది. అక్రమ సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారడం వల్ల అన్ని కోణాల్లోనూ అవినీతి విశృంఖల విహారం చేస్తున్నది. చిన్న పంచాయితీ మెంబరు నుండి ఉన్నత స్థాయిలోని నాయకుని వరకూ అవినీతి ఆరోపణలకు గురి అవుతున్నారు. రాజకీయ నాయకులు తమ పార్టీల నిధుల కోసం ఎంతటి అవినీతి పనులకు పాల్పడుతున్నారో మనం తెలుకుంటూనే ఉన్నాం. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తల అక్రమ సంపాదనలు దేశ, విదేశీ బ్యాంకుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలుంటాయన్న వాస్తవం మనకు తెలిసిందే.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు లంచాలు స్వీకరించడం పరిపాటి అయింది. నేడు ప్రజలు కూడా తమ పనులు త్వరగా ముగియడం కోసం లంచాలు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. చౌకధరల దుకాణాల్లో సరుకులను దాచి అక్రమ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విధంగా అవినీతి అన్ని రంగాల్లోనూ తాండవిస్తోంది.

ఈ అవినీతిని అన్ని రంగాల్లోనూ అరికట్టడానికి అందరూ, ముఖ్యంగా విద్యార్థులు, యువత ముందుకు రావాలి. అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. ఉద్యోగుల్లో పనిపట్ల అంకితభావం పెరగాలి. లేకపోతే ఈ దేశం నైతికంగా పతనమౌతుంది.

“అవినీతిని దూరంచేయాలి – ప్రగతిని సాధించాలి”.

కాపీలు : 1000
తేదీ : XXXXX.

ఇట్లు,
ప్రజా హక్కుల పోరాట సమితి,
రాజమండ్రి.

III. భాషాంశాలు: (32 మా)
విభాగము – III (9 × 2 = 18 మా)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

11. ‘నీ వేల వచ్చెదవు’ – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
శ్లేషాలంకారం

12. ఈ క్రింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి.
ఆ యేమీ? యొక రాణివాసమును బుణ్యావాసమున్ దెచ్చినా
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 8 with Solutions 1
ఇందులో మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి కనుక ఇది శార్దూలమునకు చెందిన వృత్త పద్యము.

13. అ) ప్రహ్లాదుడు చదువులలోని మర్మము ను గ్రహించాడు. – గీతగీసిన పదానికి అర్థం రాయండి. (1 మా)
జవాబు:
రహస్యం

ఆ) రోదసి లోకి దూసుకువెళ్తున్న మన శాస్త్రవేత్తల ప్రయోగాలు విజయం సాధిస్తాయి.
– గీతగీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) ఆకాశం
ఆ) ప్రయోగం
ఇ) ఉపగ్రహం
ఈ) అంతరిక్షం
జవాబు:
అ) ఆకాశం

14. అ) సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుంది – గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి. (1 మా)
జవాబు:
సాగరం, కడలి

ఆ) దేహము నకు తగిన వ్యాయామం అవసరం.
– గీతగీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించి విడిగా రాయండి.
అ) శరీరం, కాయం
ఆ) జీవం, ప్రాణం
ఇ) తరువు, తనువు
ఈ) దేహం, మోహం
జవాబు:
అ) శరీరం, కాయం

15. అ) పరీక్షలు సమీపిస్తున్నాయి. నిముసం కూడా వృథాచేయకండి. – గీతగీసిన పదానికి ప్రకృతి రాయండి.
జవాబు:
నిమిషం

ఆ) పుస్తకాలను పుష్పముల వలె జాగ్రత్తగా చూడాలి. – గీతగీసిన పదానికి వికృతిపదం గుర్తించి విడిగా రాయండి
అ) పుష్పము
ఆ) పువ్వు
ఇ) పుసపము
ఈ) పుష్పము
జవాబు:
ఆ) పువ్వు

16. అ) అతడు మంచి సమయము చూసుకొని నాయకుడుగా సమయము చేశాడు.
– గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి. (1 మా)
జవాబు:
కాలము, ప్రతిజ్ఞ

ఆ) ధర్మజ్ రాజ కులం వాడు. వారి కులం దేశంలో గొప్ప స్థాయిలో ఉంది.
– గీతగీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. (1 మా)
అ) వంశం, జాతి
ఆ) స్వభావం, వింటినారి
ఇ) పండు, ప్రయోజనం
ఈ) తోట, అడవి
జవాబు:
అ) వంశం, జాతి

17. అ) మా గురువు గారంటే నాకు చాలా ఇష్టం.
– గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి. (1 మా)
జవాబు:
అంధకారమనే అజ్ఞానమును భేదించువాడు. (ఉపాధ్యాయుడు)

ఆ) రాక్షసులు శివుడు కోసం తపస్సు చేశారు.
గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థం గుర్తించండి. (1 మా)
అ) మౌనందాల్చి ఉండేవాడు. (ఋషి)
ఆ) పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు (కుమారుడు)
ఇ) సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు. (ఈశ్వరుడు)
ఈ) దేహము కలవాడు (ప్రాణి)
జవాబు:
ఇ) సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు. (ఈశ్వరుడు)

18. మా తెలుగు ఉపాధ్యాయులు అన్ని సందర్భాలలో స్థితప్రజ్ఞత కనబరుస్తారు.
– ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయండి. (2 మా)
జవాబు:
స్థిత ప్రజ్ఞత

19. ‘బ్రహ్మాస్త్రం’ ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. (2 మా)
జవాబు:
తిరుగులేని శక్తిని ప్రయోగించడం అని చెప్పే సందర్భం

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (14 × 1 = 14 మా)

20. శబరి శ్రీరాముని గొప్ప భక్తురాలు – గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి. (1 మా)
జవాబు:
భక్త + ఆలు

21. ఆ + విధంబున – సంధిని కలిపి రాయండి. (1 మా)
జవాబు:
అవ్విధంబున

22. ‘ఓ మునీశ్వర ! ఈ పట్టణమును శపించవద్దు’ అని పార్వతి వ్యాసునితో అన్నది. (1 మా)
– గీతగీసిన పదంలోని సంధిని గుర్తించి విడిగా రాయండి.
అ) గుణసంధి
ఆ) యణాదేశసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఈ) సవర్ణదీర్ఘ సంధి

23. సేవావృత్తిలోనే సజ్జనుడు ఆనందం పొందుతాడు. (1 మా)
-గీత గీసిన సమాస పదానికి విగ్రహవాక్యం రాయండి.
జవాబు:
సేవ అనెడి వృత్తి

24. హనుమంతుడు కూటాగ్రముపై కాలుమోపాడు. – గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి. (1 మా)
అ) రూపక సమాసం
ఆ) షష్ఠీతత్పురుష సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) షష్ఠీతత్పురుష సమాసం

25. “గిరి యెగసినట్లు తోచె” – ఈ వాక్యానికి సరియైన ఆధునిక భాషాపరివర్తనమును గుర్తించి రాయండి. (1 మా)
అ) గిరి ఎగిరినట్లు తోస్తోంది.
ఆ) కొండ ఎగిరినట్లు కన్పించింది
ఇ) గిరి ఎగిసిపడ్డట్లు తోచింది
ఈ) గిరి ఎగిరిపోతున్నట్లు కన్పిస్తూ ఉంది
జవాబు:
ఆ) కొండ ఎగిరినట్లు కన్పించింది

26. “జాహ్నవి, యమున తరగతిలో బాగా అల్లరిచేస్తున్నారు” – ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
జవాబు:
జాహ్నవి, యమున తరగతిలో బాగా అల్లరి చేయడం లేదు.

AP 10th Class Telugu Model Paper Set 8 with Solutions

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి.
అ) ఆడుతూ
ఆ) ఆడి
ఇ) ఆడక
ఈ) ఆడితే
జవాబు:
ఇ) ఆడక

28. రావూరి భరద్వాజ కథలు రాశారు. రావూరి భరద్వాజ నవలలు రాశారు.
– ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా రాయండి.
జవాబు:
రావూరి భరద్వాజ కథలు, నవలలు రాశారు.

29. నేను రాసిన కవిత్వం పత్రికలలో ముద్రితమైంది. – సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి. (1 మా)
అ) నేను రాసిన కవిత్వం పత్రికలచేత ముద్రితమైంది
ఆ) నాచే రాయబడిన కవిత్వం పత్రికలలో ముద్రించబడింది.
ఇ) నాచే రాయబడిన కవిత్వాన్ని పత్రికలలో ముద్రించారు.
ఈ) పత్రికలలో ముద్రించిన కవిత్వం నేను రాసినదే
జవాబు:
ఆ) నాచే రాయబడిన కవిత్వం పత్రికలలో ముద్రించబడింది.

30. రమ చక్కగా పాడుతుంది – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.. (1 మా)
జవాబు:
సామర్థ్యార్థకం

31. దయచేసి నన్ను కాపాడు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి.. (1 మా)
అ) సామర్థ్యార్థక వాక్యం.
ఆ) ప్రశ్నార్థక వాక్యం
ఇ) సందేహార్థకవాక్యం
ఈ) ప్రార్థనార్థక వాక్యం.
జవాబు:
ఈ) ప్రార్థనార్థక వాక్యం.

32. మీరంతా క్షేమంగా వెళ్ళిరండి – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. (1 మా)
జవాబు:
ఆశీరర్థకం

33. “ఆహా ! ఈ ప్రకృతి ఎంత బాగుందీ!” – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) అనుమత్యర్థకం
ఆ) సందేహార్థకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఇ) ఆశ్చర్యార్థకం

Leave a Comment