AP 10th Class Telugu Model Paper Set 7 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 7 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 7 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

అస్తమింపగఁ జేసినాఁ డహిమకరుడు
శిష్యులేఁగాక యయుతంబు చిగురుఁబోడి
వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు
నేఁడు నిన్నటి మఱునాఁడు నిక్కువంబు ॥

ప్రశ్నలు :

అ) అస్తమిస్తున్నది ఎవరు ?
జవాబు:
అస్తమిస్తున్నది సూర్యుడు.

ఆ) శిష్యులను వదిలి భోజనం చేయను అని చెప్పినది ఎవరు ?
జవాబు:
వ్యాసుడు తన శిష్యులను వదిలి భోజనం చేయను అని చెప్పాడు.

ఇ) ఈరోజు నిన్నటి మరునాడు’ అని వ్యాసుడు ఎందుకు అన్నాడు ?
జవాబు:
నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని చెప్పడానికి వ్యాసుడు ‘ఈరోజు నిన్నటికి మరునాడు’ అన్నాడు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పద్యంలో ‘చిగురుబోడి’ అని వ్యాసుడు ఎవరిని సంబోధించాడు ?

(లేదా)

పొదలి యొండొండ దీవియును భువియు దిశలుఁ
బొదివికొనియుండు చీఁకటిప్రోవు వలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
కరవటంబన జగదండఖండ మమరే.

ప్రశ్నలు :

ఉ) చీకటి ఎక్కడెక్కడ వ్యాపించింది ?
జవాబు:
చీకటి ఆకాశం, భూమి, దిక్కులలో వ్యాపించింది.

ఊ) పద్యంలో చీకటిని దేనితో పోల్చారు ?
జవాబు:
పద్యంలో చీకటిని బాగా కాటుక నింపిన బరిణెతో పోల్చారు.

ఋ) చీకటి వ్యాపించడం వలన విశ్వమంతా ఎలా కనిపించింది ?
జవాబు:
చీకటి వ్యాపించడం వలన విశ్వమంతా నల్లగా కనిపించింది.

ౠ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పద్యంలో దేనిని వర్ణించారు ?

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

ఇంక నాకిక్కడ వసింపఁదగదు. ఇప్పుడు నా వృత్తాంతము పరులతోఁ జెప్పికోలును యుక్తముగాదు. అర్థనాశము, మనస్తాపము గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవమును ప్రకాశింపఁజేయఁదగదని పెద్దలు చెప్పుదురు. దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటె సుఖము లేదు. కుసుమస్తబకము వలె మానవంతుఁడు సర్వజనుల మూర్ధము మీఁదనయిన నుండవలె. లేదా వనమందు సమసిపోవలె. ఇక్కడనే వాసము చేసుకొని యాచనతో జీవించెద నంటినా దానికంటె గర్హితము లేదు. ఒక ముక్కడిని యాచించుకంటె నిప్పులోఁబడి శరీరము తొఱఁగుటమేలు. అనృతమాడుటకంటె మౌనముమేలు. పరధనాపహరణముకంటెఁ దిరియుట మంచిది.

ప్రశ్నలు :

అ) పై పేరాలోని మాటలు ఎవరు అనుకుంటున్నారు ?
జవాబు:
పై పేరాలోని మాటలు హిరణ్యకుడనే మూషికం అనుకుంటున్నవి.

ఆ) ఏయే విషయాలను బయటకు చెప్పకూడదని పెద్దలు అంటారు ?
జవాబు:
అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవము అనే విషయాలను బయటకు చెప్పకూడదని పెద్దలు
అంటారు.

ఇ) అబద్ధం చెప్పడం కంటే ఏది మేలు ?
జవాబు:
అబద్దం చెప్పడం కంటే మౌనం మేలు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఇతరుల ధనాన్ని అపహరించడం కంటే ఏది మంచిది?

AP 10th Class Telugu Model Paper Set 7 with Solutions

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి. (8 మా)

అ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాటిని ధనుస్సు నుంచి వేరుచేశాడు శ్రీరాముడు.
జవాబు:
అరణ్యకాండ

ఆ) మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు.
జవాబు:
బాలకాండ

ఇ) సముద్రం మీదగా సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలచాడు.
జవాబు:
సుందరకాండ

ఈ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు.
జవాబు:
కిష్కింధాకాండ

4. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)

విభిన్న భాషా మత సంప్రదాయాలతో ఉపఖండంగా పేరొందినది ఈ భారతమాత. ఆమె పవిత్ర దేహంలో కర్ణాటక రాష్ట్రం ఒక భాగం.ఆ భాగంలో ‘కూర్గు’ ప్రాంతం కూడా పేరెన్నికగన్నదే. అందు ‘విరాజ్పేట’ గ్రామం అశ్వని జన్మస్థానమై ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. ఈమె క్రీ.శ 21-10-1967న పార్వతి, అప్ప నాచప్ప దంపతులకు కుమార్తెగా జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా కన్నడ భాషా సంస్కృతులకు దూరంగా కలకత్తా నగరంలోని ‘బిర్లా రేయాన్స్’ లో పనిచేస్తున్నాడు. శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందుతున్న అశ్వని తన ఎనిమిదవ ఏటనుండే స్కూల్ పోటీల్లో పాల్గొన్నది. వందమీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్ రెండూ ఆమెకిష్టమైనవే. క్రమేపి లాంగ్జాంప్కు స్వస్తిచెప్పి, పరుగుమీదనే తన దృష్టి కేంద్రీకరించింది. ఇండియన్ లేడీ రన్నర్స్ అందరిలోనూ ఎలాగైనా ఉషను అధిగమించాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉన్న రోజులవి. ఎందుకంటే ఉష ప్రభ పట్టపగటి సూర్యుడిలా వెలిగిపోతున్నది. కాని ఆ ఆకాంక్షను నిజం చేసుకోగల్గింది మాత్రం అశ్వనియే.

ప్రశ్నలు :

అ) భారతదేశం గొప్పతనం ఎటువంటిది ?
జవాబు:
భారతదేశం విభిన్న భాషా, మత, సంప్రదాయాలతో ఉపఖండంగా పేరొందినది.

ఆ) కర్ణాటకలోని ‘విరాజ్పేట’ గ్రామం ఎవరి వల్ల గుర్తింపు పొందినది ?
జవాబు:
కర్ణాటకలోని ‘విరాజ్పేట’ అశ్వనీ నాచప్ప వలన గుర్తింపు పొందింది.

ఇ) అశ్వని నాచప్పకు ఇష్టమైన పరుగు పందెం గురించి తెలుసుకున్నాము కదా! మీకిష్టమైన ఆటలేవో రాయండి.
జవాబు:
నాకు ఇష్టమైన ఆటలు కబడ్డీ, ఖోఖో, క్రికెట్. (సూచన : పిల్లలు తమ కిష్టమైన ఆటలు ఏవైనా రాయవచ్చు).

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
లేడీరన్నర్స్ అందరూ ఎవరిని అధిగమించాలని అనుకొనేవారు ?

విభాగము – II
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత:

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

5. తరిగొండ నృసింహ శతకం రాసిన కవయిత్రి గురించి రాయండి.
జవాబు:

  1. కవయిత్రి : తరిగొండ నృసింహ శతకం రాసింది తరిగొండ వెంగమాంబ.
  2. కాలం : 18వ శతాబ్దం. చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామ నివాసిని. నుంచే భగవద్భక్తురాలు.
  3. రచనలు : తరిగొండ నృసింహశతకంతో పాటు శివనాటకం, నారసింహవిలాస కథ అనే యక్షగానాలు, రాజయోగామృతం అనే. ద్విపద కావ్యం, శ్రీ వేంకటాచల మాహాత్మ్యం, అష్టాంగ యోగసారం, వాశిష్ఠ రామాయణమనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధికెక్కింది.

6. గోరంతదీపాలు పాఠ్యభాగ ప్రక్రియను వివరించండి.
జవాబు:
సాహిత్య ప్రక్రియలలో కథ అనే ప్రక్రియకు చెందింది గోరంత దీపాలు పాఠ్యభాగం. కథ ద్వారా సమాజానికి ఒక ప్రేరణ, సూచన ఇవ్వడం, ఆలోచింపజేయడం కథకు ప్రయోజనం. మానవ సంబంధాలు, సమాజసేవ కళ్ళకు కట్టినట్లుగా మనోభావాలను పలికించేలా ఉంటుంది ఈ పాఠ్యభాగం.

7. సుగ్రీవుని పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
సుగ్రీవుడు మహాబలవంతుడైన వాలికి తమ్ముడు. వానర రాజు. సీతాన్వేషణలో సంచరిస్తున్న రామునికి పరిచయమయ్యాడు. అగ్నిసాక్షిగా మిత్రత్వాన్ని ప్రదర్శించాడు. మిత్రధర్మంగా రామునికి సాయపడడం తన కర్తవ్యమని భావించాడు. సీతాన్వేషణకు వానర సైన్యాన్ని పంపించాడు. హనుమంతుడు సీత జాడ తెలుసుకున్న తరువాత లంకానగరం మీద దండయాత్రకు తన సైన్యాన్ని నడిపించాడు. రామకార్యానికి సాయపడ్డాడు.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 8 = 24 మా)

8. “స్త్రీ రత్నములు పూజ్యలు” అన్న శివాజీ మాటలను మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి.
(లేదా)
మాణిక్యవీణ కవితా సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
తల్లిగా, చెల్లిగా, అక్కగా, అత్తగా, అమ్మమ్మగా, నాయనమ్మగా, గురువుగా, భార్యగా స్త్రీమూర్తి అందించే సేవలు చాలా గొప్పవి.

భారతావనిలో ఎందరో స్త్రీ రత్నాలు జన్మించి ఎన్నో రంగాలలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎయిర్ హెూస్టెస్ నుంచి ఎవరెస్టు శిఖరం ఎక్కడం వరకు, క్రీడాకారిణి నుంచి రక్షణాధికారి వరకు, టీచరు నుంచి సి.ఇ.ఓ స్థాయి వరకూ, సంగీతం నుంచి సాహిత్యరంగం వరకు స్త్రీ ప్రభావం లేని రంగం అంటూ ఏదీ లేదు.

తెలుగు సాహిత్య చరిత్రలో తాళ్ళపాక తిమ్మక్క, రామాయణాన్ని రచించిన మొల్ల గొప్ప విదుషీమణులు. వారి రచనలు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకొన్నాయి. నేటి తరంలో ఓల్గా, కాత్యాయనీ విద్మహే, చిల్లర భవానీదేవి, మహజబీన్, మృణాళిని వంటి రచయిత్రులు తెలుగు కవితామ తల్లికి సేవలందిస్తున్నారు.

క్రీడారంగంలో పి.వి.సింధూ, వీణా మాలిక్, పి.టి.ఉష, కరణం మల్లీశ్వరి, మిథాలి రాజ్, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలా, కోనేరు హంపి, హారిక వంటి వారు విజయాలను సాధించి, మన దేశకీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటి చెప్పారు.

కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి మహిళామణులు అంతరిక్ష రంగంలో ఘన విజయాలు సాధించి ‘స్త్రీ అబల కాదు సబలే’ అని నిరూపించుకున్నారు.

ఈ విధంగా ఎంతో మంది స్త్రీ రత్నాలు వారి వారి రంగాలలో విజయాలు సాధించి మన దేశ గౌరవ ప్రతిష్ఠలు ప్రపంచానికి చాటి చెప్పారు.

(లేదా)

పరిచయం : ‘మాణిక్య వీణ’ అనే పాఠ్యభాగం విద్వాన్ విశ్వం రచించిన ‘మాణిక్య వీణ’ అనే వ్యాసాల, కవితల సంపుటి లోనిది. మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, కృషిని, సాధన సంపత్తిని, తాత్త్వికతను కవి ఈ వచన కవితా ఖండికలో ఎంతో హృద్యంగా వర్ణించారు.

కవితా సారాంశం
వాస్తవిక దృష్టి అవసరం : మంత్రాలతో చింతకాయలు రాలవు. అట్లాగే పద్య రచనలు చింతలను దూరం చేయలేవు. సామాజిక సమస్యలు వాస్తవిక దృష్టి, నిబద్ధత, అంకితభావంతో కూడిన కార్యాచరణతో మాత్రమే పరిష్కారమౌతాయి.

సామాజిక అసమానతలు ప్రమాదకరం : మనిషి తన మేధస్సుతో అంతరిక్షంలో ప్రయాణించే స్థితికి చేరినా కడుపులో రాచపుండులా సామాజిక అసమానత రోజురోజుకీ పెరుగుతూ ఉండడం విచారించదగినది. అసమానతలు తొలగించకుండా విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా ప్రయోజనం ఉండదు.

ప్రకృతి – కళలతో సంబంధం : తాను కన్ను తెరవగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశించిన మనిషి దానిని తన వశం చేసుకొనే ప్రయత్నం కూడా ప్రారంభించాడు. మానవుడు గుహలలో జీవించే ఆదిమ కాలంలోనే గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జె కట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు. కళలను తన జీవితంలో ఒక భాగంగా చేసుకొన్నాడు.

మానవ మేధస్సు – ఆవిష్కరణలు : చక్రం కనుగొన్న రోజు, లిపిని కనుగొన్న రోజు చాలా గొప్ప రోజులు. వినూత్న ఆవిష్కరణల కారణంగానే మనిషి రాతియుగపు చీకటి నుంచి నవీన విజ్ఞానం అనే వెలుతురులోకి ప్రవేశించాడని కవి భావన.

ముగింపు : మనిషి కాలగర్భంలో కలిసిన అతని మేధస్సులో నుంచి ఆవిష్కృతమైన కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికీ దిశా నిర్దేశం చేస్తాయి. మానవుణ్ణి శాశ్వత యశస్కుణ్ణి చేస్తున్నాయి.

AP 10th Class Telugu Model Paper Set 7 with Solutions

9. “రామాయణం” ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో వివరించండి.
(లేదా)
శ్రీరామ కార్యం నిమిత్తం హనుమంతుడు లంకకు ఏ విధంగా చేరాడు ?
జవాబు:
రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో, తెలుసుకొనే అవకాశం ఉంది. రామాయణంలో రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు, వాలి సుగ్రీవులు, రావణ కుంభకర్ణ విభీషణులు అనే మూడురకాల సోదరులు ఉన్నారు. వీరిలో

1. రామలక్ష్మణ భరత శతృఘ్నుల మధ్య ఉండే అనుబంధం ఆదర్శప్రాయమైనది. ఆప్యాయతానురాగాలకు నిలయమైనది.

2. వనవాసంలో అన్నసేవకు అడ్డుకాకూడదని ఊర్మిళను అయోధ్యలోనే విడిచి వచ్చిన లక్ష్మణుడు సోదరప్రేమకు, త్యాగానికి నిదర్శనంగా నిలిచాడు. శ్రీరామ సేవాభాగ్యము ముందు “త్రిలోకాధిపత్యం కూడ చిన్నదేనని భావించి, వనవాసంలో సకలోపచారాలు చేసే ‘ అవకాశం తనకిమ్మని శ్రీరాముణ్ణి కోరిన ఆదర్శమూర్తి లక్ష్మణుడు.

3. లక్ష్మణుడు రామునికి ఆరోప్రాణం. యుద్ధరంగంలో నేలమీద పడిపోయిన లక్ష్మణుడిని చూచి శ్రీరాముడు విలవిలలాడిపోవటం అతనికి తమ్మునిపై గల ప్రేమానురాగాలను చాటుతోంది.

4. భరతుడు కూడ ఆదర్శ సోదరుడే. రామునివలే తానూ వనవాస నియమాలు పాటించి 14 ఏళ్ళు శ్రీరామ పాదుకలపై పాలనాభారం ఉంచి, రాజభోగాలకు దూరంగా నగరం వెలుపల గడిపిన ఆదర్శమూర్తి.

(లేదా)

  1. సుగ్రీవుని ఆజ్ఞమేరకు హనుమంతుడు మిగిలిన వానర వీరులతో దక్షిణ దిక్కుకు శ్రీరామ కార్యం నిమిత్తం బయలుదేరి సముద్రపు ఒడ్డుకు చేరాడు.
  2. జాంబవంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖుల ప్రోత్సాహంతో హనుమంతుడు సముద్ర లంఘనానికి పూనుకున్నాడు.
  3. హనుమంతుడు దేవతలందరికి నమస్కరించి తన శరీరాన్ని పెంచాడు. తోకను ఆకాశం పైకి రిక్కించి నడుం మీద చేతులు ఆనించాడు. గట్టిగా, పాదాలతో పర్వతాన్ని త్రొక్కిపైకి లంఘించాడు.
  4. హనుమంతుడు ఆ విధంగా సముద్రం మీద ఎగురుతుండగా సముద్రగర్భంలోనున్న మైనాకుడు హనుమకు సాయం చేయాలన్న కోరికతో పైకి వచ్చి హనుమంతుని మార్గానికి అడ్డం వచ్చాడు.
  5. హనుమంతుడు మైనాకుణ్ణి చేతితో తాకి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు.
  6. హనుమంతుణ్ణి పరీక్షించాలని “సురస” అనే నాగమాత ప్రయత్నించి అతని సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది.
  7. “సింహిక” అనే రాక్షసి హనుమంతుణ్ణి మింగాలని చూసి అతని చేతిలో మరణించింది.
  8. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకలో కాలుపెట్టాడు.
  9. రాత్రివేళ అన్వేషణకు అనువయిన సమయమని చీకటి పడేదాకా వేచియున్నాడు.
  10. చీకటి పడగానే లంకలో ప్రవేశించబోగా లంకిణి అడ్డగించింది.
  11. లంకిణిని ఒక దెబ్బతో నేలకూల్చాడు.
  12. లంకిణి హనుమంతుని చేతిలో ఓడింపబడి అతనికి దారి వదిలింది.

ఈ విధంగా హనుమంతుడు సీత కొరకు అన్వేషించాలని లంకకు చేరాడు.

10. ఎఱ్ఱన రచనాశైలిని వివరిస్తూ మీ అమ్మగారికి లేఖ రాయండి.
(లేదా)
రైతు దేశానికి వెన్నెముక అని చాటుతూ అటువంటి రైతు నేడు పడుతున్న అవస్థలు ప్రజలందరికీ తెలిసేలా కరపత్రం తయారుచేయండి.
జవాబు:

కొత్తవలస,
తేది. XX.XXXXXX,

ప్రియమైన అమ్మకు మీ కుమార్తె నమస్కరించి రాయు జాబు,

నాకు ఈ మధ్య ప్రతిరోజూ మన ఊళ్ళో రోజూ చూసే సూర్యోదయం, సూర్యాస్తమయం, సంధ్యాసమయం, చీకటి రాత్రులు, మిలమిలమెరిసే నక్షత్రాలు, వెన్నెల కాంతులూ అన్నీ గుర్తుకొస్తున్నాయి. నేను చూసిన ప్రతి అంశాన్నీ ఎఱ్ఱన కవి వెన్నెల అనే పాఠంలో ఎంత చక్కగా వర్ణించాడో తెలుసా!

మనం రోజూ చూసే అంశాలనే ఎఱ్ఱన కొత్తగా వర్ణించాడు. సూర్యుణ్ణి చూసిన కళ్ళతో అల్పతేజస్సు కలిగిన నక్షత్రాలను చూడలేను అన్నట్లుగా పద్మం ముడుచుకొనిపోయిందనడం చాలా బాగుంది. కటిక చీకటితో నిండిన విశ్వమంతా కాటుక బరిణెలాగా నల్లగా ఉందనడం ఎంతో గొప్ప ఊహ. ఇక లోకమంతా వ్యాపించిన వెన్నెలను గురించి ఎంతో మనోహరంగా వర్ణించాడు ఎఱ్ఱన. అందరికీ తెలిసిన ప్రకృతి గురించి కొత్తగా చెప్పడం ఎఱ్ఱన శైలిలోని ప్రత్యేకత.
నీవూ ఒకసారి ఎఱ్ఱన రాసిన వెన్నెల చదివి, నీ అభిప్రాయం రాయకోత్తాను.

ఇట్లు
మీ కుమార్తె
శైలజ.

చిరునామా :
శ్రీ వెన్నెలకంటి జానకి,
10-7-1953,
బృందావన కాలనీ, రామచంద్రాపురం,
ప్రకాశం జిల్లా.

(లేదా)

అన్నదాత అవస్థలు

పురజనులారా ! తెలుసుకోండి.

రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే రాజ్యం లేదు. అందరిచేత గర్వంగా అన్నదాతగా పిలిపించుకుంటాడు రైతు. ఎప్పుడు వర్షం పడుతుందో? అని ఆత్రుతగా ఎదురుచూస్తాడు. కాలువనీటికోసం నిరంతరం ఎదురుచూస్తాడు. దుక్కిదున్ని విత్తనాలు చల్లుతాడు. కూలీలకోసం పోటీపడి ఆకుమడి తయారు చేస్తాడు. ఎండనకా, వాననకా రేయింబవళ్ళు బాడీబందా, వానావరదా అని పట్టించుకోకుండా వరినాట్లు వేస్తాడు. ఆకుమళ్ళు పశువులు తినేయకుండా, తొక్కి పాడుచేయకుండా ఎల్లప్పుడూ కాపలా కాస్తూనే ఉంటాడు. ఆ చేలగట్లపై జర్రి, తేలు, పాము వంటి విషప్రాణులు కరిచినా పట్టించుకోడు. పసిపిల్లను తల్లి కంటిరెప్పలా కాపాడినట్లు పంటను కాపాడతాడు.

ఎరువుచల్లి, పంటనుకోసి, పనలుకట్టి కుప్పవేస్తాడు. కుప్పలు నూర్చి ధాన్యం చేస్తాడు. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు, చేసిన అప్పులు తీర్చడానికే సరిపోవు. అయినప్పటికీ వ్యవసాయం మానడు.

అందరికీ అన్నంపెట్టే అన్నదాతకు తినడానికి అన్నం కరువై నేడు అవస్థలకి గురికావటం జరుగుతోంది. అందరికీ అన్నదాతయై తాను మాత్రం పస్తులుండే పరిస్థితి ఏర్పడుతోంది.

కనుక ప్రభుత్వంవారు రైతులకి తగినంత ప్రోత్సాహమందించి వారి అవస్థలు తొలగించే ప్రయత్నం చేయాలి. అప్పుడే అన్నదాత కళ్ళలో ఆనందం చూడగలం.

అన్నదాతా! సుఖీభవ! అని దీవిద్దాం. అందరం ఆ దిశగా అడుగులువేద్దాం.

తేది : XXXX
కాపీలు : 500

రైతు సంక్షేమసంఘం
అమరావతి.

విభాగము- III
III. భాషాంశాలు :

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (9 × 2 = 18 మా)

11. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు
మహాత్ములకు సాధ్యం కానిది లేదుకదా ! – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
అర్ధాంతరన్యాసాలంకారం

12. ఈ క్రింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. (2 మా)
య్యాదిమ శక్తి సంయమివరా యిటురమ్మని పిల్చె హస్తసం
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 7 with Solutions 1
ఇందులో భరనభభరవ అనే గణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం.

13. అ) భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది. – గీతగీసిన పదానికి అర్థం రాయండి.
జవాబు:
చిరునవ్వుల కాంతి

ఆ) రాజు ప్రకృతి అందాల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు – గీతగీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా, రాయండి.
అ) ఆశ్చర్యంగా
ఆ) అదేపనిగా
ఇ) కోపంగా
ఈ) వినయంగా
జవాబు:
ఆ) అదేపనిగా

14. అ) రాజు ప్రజల కష్టసుఖాలు తెల్సుకోవాలి.- గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి. (1 మా)
జవాబు:
భూపతి, ప్రభువు

ఆ) రాత్రివేళ కౌముది మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. – గీతగీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించి విడిగా రాయండి. (1 మా అ) రవి, చంద్రిక
ఆ) వెన్నెల, చీకటి
ఇ) చంద్రిక, వెన్నెల
ఈ) రాత్రి, నక్షత్రాలు
జవాబు:
ఇ) చంద్రిక, వెన్నెల

15. అ) విద్యార్థులు దోసము లు లేకుండా రాయడానికి కృషిచేయాలి. (గీతగీసిన పదానికి ప్రకృతి రాయండి)
జవాబు:
దోషము

ఆ) పాలకుల ఆజ్ఞ లను ప్రజలు పాటించాలి. (గీతగీసిన పదానికి వికృతిపదం గుర్తించి విడిగా రాయండి)
అ) ఆగ్న
ఆ) ఆనె
ఇ) ఆన
ఈ) ఆశ
జవాబు:
ఇ) ఆన

16. అ) ఎప్పుడూ అనృతం చెప్పకూడదు. అనృతం చేసి రామయ్య పంట పండించాడు. (గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి) (1 మా)
జవాబు:
అసత్యం, సేద్యం

ఆ) ఆ వృక్ష శాఖ చాలా పెద్దది. బాలుడు యజుర్వేద శాఖను పఠించాడు.
(గీతగీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) (1 మా)
అ) కాలము, ప్రతిజ్ఞ
ఆ) వివరణము, రంధ్రము
ఇ) కొమ్మ, వేదభాగము
ఈ) వంశం, ఇల్లు
జవాబు:
ఇ) కొమ్మ, వేదభాగము

17. అ) పసిఫిక్ మహాసముద్రం చాలా లోతైనది. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి) (1 మా)
జవాబు:
చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది (వార్థి)

ఆ) పార్వతి వ్యాసుడికి కలిగిన కోపాన్ని తగ్గించింది. (గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.)

అ) వనంలో పుట్టినది (పద్మం)
ఆ) హిమవంతుడనే పర్వతరాజు కూతురు (పార్వతి)
ఇ) పతిని సేవించుటయే నియమంగా కలిగినది (సాధ్వి)
ఈ) గృహాన్ని ధరించేది (ఇల్లాలు)
జవాబు:
ఆ) హిమవంతుడనే పర్వతరాజు కూతురు (పార్వతి)

18. ఎవరు చెప్పినా వినాలి కానీ గుడ్డిగా నమ్మితే చెప్పుడు మాటలు చేటు కలిగిస్తాయి.
– ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయండి. (2 మా)
జవాబు:
చెప్పుడుమాటలు చేటు

AP 10th Class Telugu Model Paper Set 7 with Solutions

19. అగ్రతాంబూలం ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.
కింది ప్రశ్నలను సూచించిన విధంగా జవాబులు రాయండి. (14 × 1 = 14 మా)
జవాబు:
‘ప్రధానమైన స్థానం ఇవ్వడం’ అనిచెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము.

20. తెలుగు వాఙ్మయం ఎంతో ప్రఖ్యాతి చెందింది. – గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి. (1 మా)
జవాబు:
వాక్ + మయం

21. అక్కడ + అక్కడ – సంధి పదాలను కలిపి రాయండి (1 మా)
జవాబు:
అక్కడక్కడ

22. మనం ఏమిచేస్తున్నామనేది మన అంతరాత్మ కు తెలుసు.
(గీతగీసిన పదంలోని సంధిని గుర్తించి విడిగా రాయండి.)
అ) అనునాసికసంధి
ఆ) విసర్గసంధి
ఇ) గసడదవాదేశసంధి
ఈ) లులనలసంధి
జవాబు:
ఆ) విసర్గసంధి

23. మామిడిగున్న చిన్న కొండలా ఉంది. – గీత గీసిన సమాస పదానికి విగ్రహవాక్యం రాయండి.
జవాబు:
గున్నయైన మామిడి

24. తెలుగుభాష మాట్లాడడం, తెలుగువారిగా పుట్టడం మహాభాగ్యం
(గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) అవ్యయీభావ సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

25. “అనువౌబుద్ధి యొసంగుమీ”. (ఈ వాక్యానికి సరియైన ఆధునిక భాషాపరివర్తనమును గుర్తించి రాయండి.)
అ) తగిన బుద్ధి ఇవ్వు
ఆ) అనువైన బుద్ధి ఇవ్వుము
ఇ) అనువైన బుద్ధి లేదు
ఈ) అనువైన మనసు రాలేదు
జవాబు:
అ) తగిన బుద్ధి ఇవ్వు

26. “చరిత్రను మార్చడానికి అందరూ ప్రయత్నించారు” (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.)
జవాబు:
చరిత్రను మార్చడానికి అందరూ ప్రయత్నించలేదు.

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి.
అ) అంది
ఆ) అందిస్తూ
ఇ) అందక
ఈ) అందితే
జవాబు:
ఇ) అందక

28. కుర్రవాడు పైకి లేచాడు. కుర్రవాడు రెండుచేతులు జోడించాడు. (ఈ వాక్యాలను సంక్లిష్టవాక్యంగా రాయండి.) (1 మా)
జవాబు:
కుర్రవాడు పైకి లేచి, రెండు చేతులు జోడించాడు.

29. మనిషి ప్రకృతిని ఆరాధించాడు. (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (1 మా)
అ) మనిషి చేత ప్రకృతి ఆరాధించబడింది.
ఆ) మనిషి చేత ఆరాధించబడిన ప్రకృతి
ఇ) ప్రకృతిచేత మనిషి ఆరాధించబడ్డాడు.
ఈ) ప్రకృతి మనిషిచేత ఆరాధించెను
జవాబు:
అ) మనిషి చేత ప్రకృతి ఆరాధించబడింది.

30. కోపం తగ్గించుకో (ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.) (1 మా)
జవాబు:
విధ్యర్థకం

AP 10th Class Telugu Model Paper Set 7 with Solutions

31. ఎవరీ కుర్రవాడు? (ఇది ఏ రకమైన సామాన్యవాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) అనుమత్యర్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) సందేహార్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
ఈ) ప్రశ్నార్థకం

32. భగవంతుడా! మంచిబుద్ధిని ప్రసాదించు – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. (1 మా)
జవాబు:
ప్రార్థనార్థకం

33. మొక్కలు నాటితే అవి పర్యావరణాన్ని కాపాడుతాయి. (1 మా)
– ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి.
అ) తద్ధర్మార్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) చేదర్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
ఇ) చేదర్థకం

Leave a Comment