AP 10th Class Telugu Model Paper Set 1 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 1 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 1 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము.

పొదలి యొండొండ దివియును భువియు దిశలుం
బొదివికొనియుండు చీఁకటిప్రోవు వలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
కరవటంబన జగదండఖండ మమరె.

ప్రశ్నలు :
అ) పై పద్యంలో దేనిని వర్ణించారు ?
జవాబు:
పై పద్యంలో చీకటిని వర్ణించారు.

ఆ) చీకటి ఎక్కడేక్కడ వ్యాపించింది ?
జవాబు:
చీకటి ఆకాశం, భూమి, దిక్కులలో వ్యాపించింది.

ఇ) పద్యంలో చీకటిని దేనితో పోల్చారు ?
జవాబు:
పద్యంలో చీకటిని బాగా కాటుక నింపిన బరిణెతో పోల్చారు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
చీకటి వ్యాపించడం వలన విశ్వమంతా ఎలా కనిపించింది ?

(లేదా)

ఒడలు వడసిన తమతండ్రి వడువు దోప
రయమునకుఁ గూటకోటులన్నియుఁ జలింపఁ
బెరిఁగి గిరి గాడ్పుకొడు కెక్కి తిరిగి తిరిగి
యొక్క చో నిల్చి దక్షిణదిక్కుఁ జూచి.

ఉ) శరీరాన్ని బాగా పెంచినది ఎవరు ?
జవాబు:
శరీరాన్ని బాగా పెంచినది హనుమంతుడు.

ఊ) హనుమంతుడు ఎవరి పుత్రుడుగా పద్యంలో చెప్పారు?
జవాబు:
హనుమంతుడు వాయుపుత్రుడుగా పద్యంలో చెప్పారు.

ఋ) హనుమంతుడు ఎక్కడ నిలబడ్డాడు ?
జవాబు:
హనుమంతుడు కొండపైన నిలబడ్డాడు.

ౠ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
హనుమంతుడు కొండపైకెక్కి ఏ దిక్కువైపు చూశాడు ?

AP 10th Class Telugu Model Paper Set 1 with Solutions

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము..

మిత్రమా! చదువుకొన్నవాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తూ కులుకుతూ ఉండడం చూసి పల్లెటూళ్ళు కన్నీరు విడుస్తున్నవి.

గ్రామోద్ధరణం అంటూ పత్రికల్లో రాసుకొంటే పనికాదు. ఉపన్యాసాలిస్తే పనికాదు. రోడ్లవెంట మోటారు కార్లలో నాలుగుసార్లు తిరిగి నాలుగు వందలు భత్యాలు కొడితే పనికాదు. అవన్నీ రూపాయిని పదహారు చేత గుణించినట్లే వ్యర్థాలు. కాగితం మీద కోట్లు కోట్లు సంఖ్యలు వేసుకొని ‘ఇంత ధనం ఉందినాకు’ అని సంతోషించడం ఎలాగో అవన్నీ అలాగే.

ప్రశ్నలు

అ) పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నది ఎవరు ?
జవాబు:
చదువుకున్నవాళ్ళు పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారు.

ఆ) కన్నీరు విడుస్తున్నవి .ఏవి ?
జవాబు:
పల్లెటూళ్ళు కన్నీరు విడుస్తున్నవి.

ఇ) పత్రికల్లో ఏమి రాసుకోవడం వలన ప్రయోజనం లేదు ?
జవాబు:
గ్రామోద్ధరణం అంటూ పత్రికల్లో రాసుకోవడం వలన ప్రయోజనం లేదు.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పేరాలో స్నేహితుడు అని అర్థం వచ్చే పదం ఏది?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి. (8 మా)

అ) శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
జవాబు:
అయోధ్యాకాండ

ఆ) శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
జవాబు:
కిష్కింధాకాండ

ఇ) మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
జవాబు:
అరణ్యకాండ

ఈ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి.
జవాబు:
సుందరకాండ

4. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)

“దేశభాషలందు తెలుగు లెస్స” అని కీర్తించిన ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన కొలువులో ‘అష్టదిగ్గజములు’గా పేరు పొందిన ఎనిమిది మంది కవులు ఉండేవారు. వారిలో ‘ఆంధ్రకవితా పితామహుడు’ అనే బిరుదుపొందిన కవి అల్లసాని పెద్దన. “వికటకవి”గా ఖ్యాతి గాంచినవారు తెనాలి రామకృష్ణుడు. శ్రీకృష్ణదేవరాయలు రాజుగానే గాక, కవిగా కూడా ప్రసిద్ధుడు. ఈయన ”ఆముక్తమాల్యద’ అనే ప్రబంధాన్ని రాశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగుభాష సాహితీ పరిమళాలను విరజిమ్మి సుసంపన్నమైనదిగా రూపొందింది.

ప్రశ్నలు :

అ) శ్రీకృష్ణదేవరాయలు తెలుగుభాష గొప్పతనాన్ని గురించి ఏమని కీర్తించాడు ?
జవాబు:
“దేశభాషలందు తెలుగు లెస్స” అని రాయలు కీర్తించాడు.

ఆ) శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఎంతమంది కవులుండేవారు ?
జవాబు:
ఎనిమిది మంది కవులు ఉండేవారు.

ఇ) ‘వికటకవి’గా ఖ్యాతి పొందిన వారెవరు ?
జవాబు:
“వికటకవి”గా ఖ్యాతి గాంచినవారు తెనాలి రామకృష్ణుడు.

ఈ) గద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
ఆంధ్ర కవితాపితామహుడిగా బిరుదు పొందిన కవి ఎవరు ?

విభాగము – II
వ్యక్తీకరణ – సృజనాత్మకత: (36 మా)

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి. (3 × 4 = 12మా)

5. ‘మాణిక్యవీణ’ పాఠ్యభాగకవి ‘విద్వాన్ విశ్వం’ గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
1. కవి, కాలము : ‘మాణిక్య వీణ’ కవి విద్వాన్ విశ్వం, సాహితీవేత్తగా, రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖీన దర్శనమిచ్చిన విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో లక్ష ్మమ్మ, రామయ్య దంపతులకు జన్మించాడు.
2. కాలం : 1915 1987
3. రచనలు : మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హెూదాల్లో పనిచేస్తూనే సంస్కృత భాషలోని పలుగ్రంథాల్ని తెలుగులోకి అనువదించాడు. పత్రికా సంపాదకునిగా ‘అవి – ఇవి’, ‘తెలుపు నలుపు’, ‘మాణిక్యవీణ’ వంటి శీర్షికలను భాష, సాహిత్యం, సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు, ‘ప్రేమించాను’ అనే నవల, ‘ఒకనాడు’, ‘పెన్నేటి పాట’ అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు.
4. బిరుదులు : డి.లిట్., కళాప్రపూర్ణ.
5. రచనా విధానం: చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితలు రచించాడు.

AP 10th Class Telugu Model Paper Set 1 with Solutions

6. ‘పీఠిక’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఒక గ్రంథాన్ని, ఆ గ్రంథ నేపథ్యాన్నీ, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, వేరే రచయితగాని, విమర్శకుడుగాని రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి.

7. ‘కైక’ పాత్రస్వభావం వివరించండి.
జవాబు:
కైక దశరథుని ప్రియమైన భార్య. రామునికి పినతల్లి. రాముని తన కుమారుడైన భరతునితో సమంగా ప్రేమించేది. రాముని పట్టాభిషేకం వార్త విని ఎంతో ఆనందించింది. కాని దాసి మంథర చేసిన దుర్బోధల వల్ల ఆమె మనసు మారిపోయింది. దశరథునితో కఠినంగా ప్రవర్తించి తన కుమారునికి పట్టాభిషేకము, రామునికి పదునాలుగేళ్ళ వనవాసము అనే కోరికలు కోరింది. రామునికి తండ్రి ఆజ్ఞ వినిపించి అడవులకు పంపింది. దశరథుని మరణానికి కారణమైంది. ఇది సహించలేని కుమారుడు భరతునిచే చీత్కరింపబడింది. అలా సున్నితమైన స్వభావం కలదైనప్పటికీ దుర్బోధల వల్ల కఠినశిలగా మారి అనర్థాలకు కారణమైంది.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 8 = 24మా)

8. ‘భిక్ష’ పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు గదా! దీనినెలా సమర్థిస్తావు?
జవాబు:

  • విద్యాగురుడైన వ్యాసమహర్షి శిష్యులతో పాటు మండుటెండలో కాశీనగరంలోని బ్రాహ్మణవీధిలో భిక్షకోసం ఇల్లిల్లూ తిరగసాగాడు. ఏ ఇల్లాలూ భిక్ష పెట్టడంలేదు.
  • ఇలా రెండురోజులు జరిగేసరికి, బాధపడి కోపంతో భిక్షాపాత్రను ముక్కలు ముక్కలయ్యేటట్లు నట్టనడి వీథిలో విసిరికొట్టి ఆవేశంతో కాశీని శపించబోయాడు వ్యాసుడు.
  • ఆ సమయంలో పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చి గొంతుదాకా తినడానికి భిక్షదొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా! ఇది నీకు మంచిదా? బాగున్నది. నిజంగా నీవు శాంతస్వభావుడవా? ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అనే నీతి నీకు తెలియదా? శివుని అర్ధాంగ లక్ష్మియైన ఈ కాశీనగరిమీద నీవింత కోపం చూపించడం తగునా? అని మందలించింది.
  • విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువువలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను, నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా! అన్నది ఆ ఇల్లాలు.
  • వేదవ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి, స్నాన, ఆచమనాదులు పూర్తి గావించుకొని వచ్చి భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె వడ్డన సాగించింది.

(లేదా)

పరిచయం : మేధావి అయిన మానవుడు భౌతిక సౌఖ్యాల కోసం, బహువిధ సౌకర్యాల కోసం వివిధ శాస్త్ర విజ్ఞానాలను తయారుచేసుకున్నాడు. అలాగే మానసిక సౌఖ్యం కోసం, ఆనందోల్లాసాల కోసం కళ, కవిత విజ్ఞానాలను సృష్టించుకున్నాడు. ఇవి మానవ జీవనంలో విడదీయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయి.

ప్రకృతి – కళలు : మనిషి కళ్ళు తెరవగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు. నాటి నుంచి ప్రకృతిని తన కనుసన్నల్లో ఉంచే ప్రయత్నం చేశాడు. కాలికి గజ్జె కట్టి పాటకు అనుగుణంగా లయాత్మకంగా చిందులు వేశాడు. ఆదిమానవుడు ప్రకృతి ఒడినే పాఠశాలగా చేసుకొని కళాభినివేశాన్ని అలవరచుకొన్నాడు.

మనిషి మేధస్సు : చక్రాన్ని, లిపిని, కనుగొని తన ప్రస్థానంలో విజ్ఞానంవైపు అడుగులు వేశాడు. చక్రం మానవ చలనానికి దోహదపడగా లిపి భావ సంచలనానికి దోహదపడింది. వాటి సహాయంతో మానవుడు రాతియుగపు చీకటిని చీల్చుకొంటూ నవీన విజ్ఞానంవైపు ప్రస్థానం సాగించాడు. నిప్పును కనుగొనడం, వ్యవసాయం ప్రారంభించడం, కళలను ఆవిష్కరించడం మొదలైనవన్నీ అతని ప్రస్థానంలోని గొప్ప సంఘటనలు.

ముగింపు : కళలు, విజ్ఞాన కాంతులతో జీవన ప్రయాణంలో నేల నుండి నింగికెగిరిన మానవుడే శాశ్వతుడయ్యాడు. మనిషి కాలగర్భంలో కలిసిపోయినా అతని మేధస్సులో నుంచి ఆవిష్కృతమైన కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికీ ఎట్లా జీవించాలో చూపించాయి. మానవుణ్ణి శాశ్వతుణ్ణి చేస్తున్నాయి.

9. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణ మేమిటి ?
(లేదా)
వాలి, సుగ్రీవుల నడుమ విరోధం ఏర్పడటానికి గల కారణాలను వివరించండి.
జవాబు:
దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు. అందరూ సంతోషించారు. అయోధ్యానగరంలో పండుగ వాతావరణం చోటుచేసుకున్నది. దశరథుని చిన్నభార్య కైకేయికి ఆమె దాసి మంథర దుర్బోధలు చేసింది. “నీ కొడుకు భరతుడు రాజైతే నీవు పట్టపురాణివి ఔతావు. లేకుంటే నీవు కౌసల్యకు, నీ కొడుకు రామునికి సేవకుల్లా బతకాల్సిందే” అని చెప్పింది.

కైక తన మందిరానికి వచ్చిన దశరథుని రెండు వరాలు కోరింది. రాజు సంతోషంతో ఇస్తానని చెప్పాడు. వెంటనే రామునికి పదునాలుగేళ్ళు వనవాసం, భరతునికి పట్టాభిషేకం అనే రెండు వరాలు కోరింది. దశరథుడు దుఃఖంతో కుప్పకూలిపోయాడు. కైక రామునికి కబురు పంపింది. దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పింది. తండ్రి ఆజ్ఞను శిరసావహించి రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అడవులకు వెళ్ళాడు.

(లేదా)

వాలి,సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. పెద్దవాడు కనుక తండ్రి తరువాత కిష్కింధకు రాజైనాడు. మాయావి అనే రాక్షసుడికి, వాలికి వైరం. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఎవరెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు. మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు. మాయావి ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. సుగ్రీవుని బిలద్వారం దగ్గరే ఉండమని మాయావిని చంపి వస్తానని వెళ్లాడు. సంవత్సరమైంది. వాలి జాడేలేదు. ఇంతలో నురుగుతోకూడిన రక్తం గుహలో నుంచి బయటకు వచ్చింది.

మాయావిచేతిలో వాలి చనిపోయాడనుకుని, రాక్షసుడు బయటకు వస్తాడేమోనని, సుగ్రీవుడు కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాడు. కిష్కింధకు వచ్చాడు. మంత్రులు బలవంతంగా సుగ్రీవుని రాజును చేశారు. కొంతకాలానికి వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుని రాజ్యభ్రష్టుణ్ణి చేయడమేకాక, అతని భార్య రుమను అపహరించాడు. ప్రాణభీతితో సుగ్రీవుడు సమస్త భూమండలం తిరిగాడు. చివరకు ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నాడు. మతంగముని శాపం కారణంగా వాలి అక్కడకు రాలేడు. వాలి దుందుభి అనే రాక్షసుణ్ణి చంపి విసరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటినుండి రక్తబిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి. అందుకు కోపించిన ముని ఋష్యమూక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు’. ఇలా వాలీ, సుగ్రీవుల మధ్య వైరం ఏర్పడింది.

10. “సముద్రలంఘనం” పాఠంలో “హనుమంతుడు” చూపిన శక్తియుక్తులను పొగుడుతూ మిత్రునికి లేఖ రాయండి.
(లేదా)
మహిళలపై దాడులను ఖండిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ధర్మవరం, తేది:
xx.xx.xxxx

ప్రియమైన సతీష్కి,

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మధ్యే హనుమంతుడి గొప్పదనాన్ని వర్ణించే పాఠం వినడం జరిగింది. సముద్ర లంఘనం అనే పాఠం రామాభ్యుదయం అనే గ్రంథంలోనిది. దీనిని రచించిన కవి అయ్యలరాజు రామభద్రుడు.

చక్కనైన వర్ణనలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఈ కావ్యం చదివే వారిని ఆకట్టుకుంటాయి. ప్రతి పద్యంలోను కవి కల్పనాచాతుర్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.

నీవు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదువు. నీకు బాగా నచ్చుతుంది. అలాగే ఈ కవి రచించిన మరొక రచన సకల కథాసార సంగ్రహం’. అది కూడా నువ్వు చదివి తీరాలి. మరి ఉంటాను.

నీ జాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ ప్రియ స్నేహితుడు,
జగదీష్

చిరునామా :
సతీష్,
వారణాసి రామారావుగారి కుమారుడు,
గాంధీనగర్ 2వ లైను,
తాడిపత్రి, అనంతపురం జిల్లా.

(లేదా)

మహిళల్లారా! లేవండి! ధైర్యంగా జీవించండి

మహాజనులారా !
దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించిందని ప్రతి దినం మనం అనుకునే మాటల్లో ఒకటి. అభివృద్ధి అంటే కేవలం సాంకేతికంగానే కాదు. విలువలతో కూడిన అభివృద్ధి కావాలి. దేశ జనాభాలో సగం మంది స్త్రీలున్నారు. సమాజాభివృద్ధిలో స్త్రీలది కీలకమైన పాత్ర. ఎంత చదువుకున్నా నేటికీ స్త్రీలు ఇంటా బయటా కూడా వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు.

దేశరాజధాని నడిరోడ్డులో నిర్భయపై జరిగిన అత్యాచారంగానీ, నిన్నగాకమొన్న ముంబయిలో అనూహ్యపైన జరిగిన అత్యాచారంగానీ చూస్తుంటే ప్రపంచం ముందు భారతదేశం సిగ్గుతో తలవంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఇటువంటి సంఘటనలు చూసి స్త్రీ సమాజం భయపడాల్సిన అవసరం లేదు. నేడు స్త్రీలు ఉన్నత విద్యను చదువుతున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నారు. రాజకీయంగా ఎదిగారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, హెూంమినిష్టర్లు, కలెక్టర్లు, డాక్టర్లు – ఇలా ఎన్నోరంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. మహిళల్లో చైతన్యం రావాలి. చట్టాలు తీసుకురావాలి. వాటిని గట్టిగా అమలుపరచాలి. చట్టాలు చేయడంలో స్త్రీల భాగస్వామ్యం ఉండాలి. ఎందరో స్త్రీలు లాయర్లుగా, న్యాయమూర్తులుగా కూడా ఉ న్నారు. ప్రొఫెసర్లు, మేధావులు ఉన్నారు. వీరంతా కూడా సంఘాలుగా ఏర్పడి మహిళాలోకానికి ధైర్యం చెప్పాలి. పురుషులు కూడా మహిళలకు ధైర్యాన్ని కలుగజేయాలి. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలిగానీ, అధైర్యపడి ఎదుటివాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు.

మహిళల్లారా ! లేవండి ! ధైర్యంతో ముందడుగు వేయండి

ముద్రణ : ఎస్.ఆర్. ప్రింటర్స్, ఒంగోలు,
ప్రతులు : 500

ఇట్లు
ఆంధ్ర మహిళా సమాఖ్య
ఒంగోలు

విభాగము – III
భాషాంశాలు : (పదజాలం- వ్యాకరణాంశాలు)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (9 × 2 = 18మా)

11. శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది. – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి. (1 × 2 = 2మా)
జవాబు:
ఉపమాలంకారం

AP 10th Class Telugu Model Paper Set 1 with Solutions

12. ఈ క్రింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. (1 × 2 = 2మా)
చిక్కని పాలపై మిసిమిఁ జెందిన మీఁగడ పంచదా రతో
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 1 with Solutions 1
ఈ పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యము.

13. అ) వ్యాసునికి కాశీపట్టణముపై ఆగ్రహం కలిగింది. – గీతగీసిన పదానికి అర్థం రాయండి.
జవాబు:
కోపం

ఆ) రాజు ప్రకృతి అందాలను తదేకంగా చూస్తూ నిలబడ్డాడు గీతగీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి.
అ) సందేహంగా
ఆ) అదేపనిగా
ఇ) కోపంగా
ఈ) శాంతంగా
జవాబు:
ఆ) అదేపనిగా

14. అ) మన ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం విను వీధులలో రెపరెపలాడాలి. – గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
జవాబు:
యశస్సు, ఖ్యాతి

ఆ) కౌముది మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. – గీతగీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించి విడిగా రాయండి.
అ) వెన్నెల – చంద్రిక
ఆ) చీకటి – తమము
ఇ) ఆకాశం – నభం
ఈ) నక్షత్రం – తార
జవాబు:
అ) వెన్నెల – చంద్రిక

15. అ) విద్యార్థులు దోసములు లేకుండా రాయడానికి కృషిచేయాలి. – గీతగీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. (1 మా)
జవాబు:
దోషములు

ఆ) శివాజీ ఆజ్ఞను అందరూ పాటించారు. (గీతగీసిన పదానికి వికృతిపదం గుర్తించండి.)
అ) ఆశ
ఆ) ఆస
ఇ) ఆన
ఈ) అమ్మ
జవాబు:
ఇ) ఆన

16. అ) నాకు మొదటి చరణము చదవడం తెలుసు. అతడి చరణము చాలా పెద్దది. (1 మా)
(గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి. )
జవాబు:
పద్యపాదము, పాదము (కాలు)

ఆ) మిత్రుడు రాగానే వెలుగు వచ్చింది. మిత్రుడు మంచి సలహాలనిస్తాడు. (1 మా)
(గీతగీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.)
అ) ప్రభువు, చంద్రుడు
ఆ) సూర్యుడు, స్నేహితుడు
ఇ) కాంతి, జ్యోతి
ఈ) తండ్రి, బ్రహ్మ
జవాబు:
ఆ) సూర్యుడు, స్నేహితుడు

17. అ) ఈశ్వరుడు రాక్షసులకు వరాలు ఇచ్చాడు. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.)
జవాబు:
స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు (శివుడు)
ఆ) వాయుపుత్రుడు సముద్రాన్ని దాటాడు.
(గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.)
అ) సర్వభూతాలపట్ల స్నేహం గలవాడు (సూర్యుడు)
ఆ) మౌనం దాల్చి ఉండేవాడు (ఋషి)
ఇ) అంధకారమనే అజ్ఞానమును భేదించువాడు (ఉపాధ్యాయుడు)
ఈ) పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు (కుమారుడు)
జవాబు:
ఈ) పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు (కుమారుడు)

18. పెద్దల ఆశీస్సులే మనకు శ్రీరామరక్ష. (వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.) (2 మా)
జవాబు:
శ్రీరామరక్ష

19. ‘నీరుగారిపోవుట’ ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. (2 మా)
జవాబు:
ఏదైనా సమస్యను ఎదుర్కోలేని పరిస్థితి ఎదురైందని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

20. పల్లెటూరు దేశాభివృద్ధికి మూలం. – గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి. (1 మా)
జవాబు:
పల్లె + ఊరు

21. మేము + అంతా – సంధి పదాలను కలిపి రాయండి. (1 మా)
జవాబు:
మేమంతా

22. “ఓ మునీశ్వర ! ఇటు రమ్ము” అని పార్వతీదేవి వ్యాసుణ్ణి పిలిచింది.
– గీతగీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణ సంధి
ఇ) వృద్ధి సంధి
ఈ) ఉత్వ సంధి
జవాబు:
అ) సవర్ణదీర్ఘ సంధి

AP 10th Class Telugu Model Paper Set 1 with Solutions

23. చూడాకర్ణుడు చంపకవతి పట్టణంలో నివసించేవాడు. గీత గీసిన సమాసపదానికి విగ్రహవాక్యం
జవాబు:
చంపకవతి అనే పేరు గల పట్టణం

24. నేటి సమాజంలో స్త్రీ, పురుషులు సమానమే. (గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)
అ) ద్వంద్వ సమాసం
ఆ) ద్విగు సమాసం
ఇ) అవ్యయీభావ సమాసం
ఈ) షష్ఠీతత్పురుష సమాసం
జవాబు:
అ) ద్వంద్వ సమాసం

25. “ఆ పరివ్రాజకుడు సెప్పగావిని మిక్కిలి ఖిన్నుడనయితిని” ఈ వాక్యానికి సరియైన ఆధునికభాషా, పరివర్తనమును గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను
ఆ) ఆ యతి చెప్పగా విని బాధపడితిని
ఇ) ఆ ముని సెప్పగా విని కలత చెందితిని
ఈ) ఆ యతీశ్వరుడు చెప్పింది వింటిని.
జవాబు:
అ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను

26. విద్యార్థులు తరగతిలో అల్లరి చేస్తున్నారు. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి).
జవాబు:
విద్యార్థులు తరగతిలో అల్లరి చేయట్లేదు.

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి.
అ) తింటూ
ఆ) తినక
ఇ) తింటే
ఈ) తిని
జవాబు:
ఆ) తినక

28. రాము పాఠం చదివాడు. రాము పాఠం అర్థం చేసుకున్నాడు.
(ఈ సామాన్య వాక్యాలను సంక్లిష్టవాక్యంగా రాయండి.)
జవాబు:
రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు.

29. ‘ఎర్రన హరివంశాన్ని రచించాడు. (సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (1 మా)
అ) ఎర్రనచే హరివంశం రచించాడు.
ఆ) హరివంశం ఎర్రనచే రచించబడింది
ఇ) హరివంశంచే ఎర్రన రచించాడు.
ఈ) ఎర్రన హరివంశంచే రచించబడ్డాడు
జవాబు:
హరివంశం ఎర్రనచే రచించబడింది.

30. ‘దయచేసి నన్ను కాపాడు’.
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం.

31. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? (ఇది ఏకమైన సామాన్య వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) నిషేధార్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఇ. ప్రశ్నార్థకం.

32. “నేను తప్పక వస్తాను” – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. (1 మా)
జవాబు:
నిశ్చయార్థక వాక్యం.

33. “మీరు లోపలికి రావచ్చు”. – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) విధ్యర్థకం
ఆ) నిశ్చయార్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఇ) అనుమత్యర్థకం

Leave a Comment