TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 3rd Lesson బండారి బసవన్న Textbook Questions and Answers.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

చదువండి – ఆలోచింది చెప్పండి. (TextBook Page No.22)

గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తిడిని చేశాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.
గోల్కొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉన్న వ్యక్తే కంచర్ల గోపన్న.

ప్రశ్న 2.
అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జవాబు.
ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడని, సీతారాములకు విలువైన నగలు చేయించాడని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే అభియోగం ఉంది.

ప్రశ్న 3.
గోపన్న ఎట్లా బంధవిముక్తుడయ్యాడు ?
జవాబు.
శ్రీరాముడే స్వయంగా మారువేషంలో తానాషా వద్దకు వచ్చి, గోపన్న చెల్లించాల్సిన డబ్బును చెల్లించాడు. దాంతో గోపన్నకు బంధవిముక్తి కలిగింది.

ప్రశ్న 4.
గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?
జవాబు.
గోపన్న వంటి భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, తుకారాం వంటి వారి గురించి తెలుసు. వారంతా భగవంతుని సేవలో తరించారు.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.24)

ప్రశ్న 1.
‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి’ అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
కల్పవృక్షం, మేరుపర్వతం, కామధేనువు, చింతామణి వంటివి దగ్గర ఉంటే తరగని సంపదలను అనుగ్రహిస్తాయి. అవి దగ్గరుండగా పరులధనముతో పని ఏమి ? పరమేశ్వరుని యందు భక్తి ఉంటే సకల సంపదలు కలుగుతాయని కవి ఆశయం.

ప్రశ్న 2.
‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జవాబు.
భక్తుడు తాను నమ్మిన దైవమునందే నిశ్చలమైన భక్తి కలిగి ఉంటాడు. భగవంతుడే భక్తునికి సకల సంపదలను అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడే అండగా ఉండగా ఇతరుల ధనాన్ని ఎట్లా ఆశిస్తాడు ? ఎన్నటికి ఆశింపడని భావం.

ఆలోచించండి- చెప్పండి: (TextBook Page No.25)

ప్రశ్న 1.
‘శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?
జవాబు.
లోకంలో చిలుక, హంస, చకోరం, తుమ్మెద మొదలైనవి శ్రేష్ఠమైన వాటినే ఆశ్రయిస్తాయిగాని అల్పములైన వాటిని ఆశ్రయింపవు. అట్లే శివభక్తులు కూడా ఉన్నతంగా ఉంటారేగాని అల్పములైన వాటిని కోరరు. అందుకే కవి శివభక్తులను పైవాటితో పోల్చాడు.

ప్రశ్న 2.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?
జవాబు.
ప్రజలు పన్నుల ద్వారా ధనం చెల్లిస్తేనే రాజు దగ్గర ధనం ఉంటుంది. అది రాజు సంపాదించింది కాదు. అది పరుల ధనమే. అందుకే భక్తుడు ఆ ధనాన్ని పరులకే ఇస్తున్నానని చెప్పాడు.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.
“అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” – దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
భక్తులు భగవంతునియందే అచంచలమైన భక్తిని కల్గియుంటారు. భక్తులకు భగవంతుని సేవే ధనం. పేదవానిలో కూడా భక్తులు భగవంతుడిని దర్శిస్తారు. వారికి ఏనాడు ధనాశ ఉండదు. తనకున్న సంపదనంతా దైవానికి అర్పిస్తారు. మనసా, వాచా, కర్మణా దైవసాన్నిధ్యాన్నే కోరుతారు.

రఘుమహారాజు లాంటి మహారాజులు విశ్వజిత యాగాన్ని చేసి సంపదనంతా త్యాగం చేశారు. పోతన వంటి భగవత్ భక్తులు ఏనాడు ధనాశకు లోనుకాలేదు. జీవితాంతం భగవంతుడినే సేవించారు. ఈ రకంగా భగవత్ భక్తులు ఎన్నడునూ ధనాశకు లోను కారని తెలుస్తున్నది.

ప్రశ్న 2.
ద్విపదను రాగయుక్తంగా పాడండి.
జవాబు.

ప్రశ్న 3.
బండారి బసవన్న
జవాబు.
ద్విపదకు రెండే పాదాలు ఉంటాయి. పద్యాలవలె నాలుగు పాదాలు ఉండవు. పాడుటకు వీలుగా ఉంటాయి. -ఉపాధ్యాయుని శిక్షణలో చక్కని రాగంతో పాడేలా ప్రయత్నించండి.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.

అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జవాబు.
బిజ్జలుడు బసవన్నను పిలిపించి ఖజానా ఖాళీ చేస్తున్నందుకు మందలించాడు. తన ధనాన్ని తనకు అప్పగించి వెళ్ళమని బిజ్జలుడు బసవన్నను హెచ్చరించుచున్న సందర్భంలోని వాక్యమిది.

ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?.
జవాబు.
ఈ వాక్యం బసవన్న రాజుతో పలుకుచున్న సందర్భంలోనిది. తాను పరుల ధనాన్ని ఎన్నడునూ ఆశింపనని, ఉన్నతంగా జీవిస్తానని, తామరపూల సువాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను కోరదు కదా ! అని చెప్పాడు.

ఇ) సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా ?
జవాబు.
ఈ వాక్యాన్ని బసవన్న రాజుతో పలికిన సందర్భంలోనిది. తాను పరుల ధనాన్ని కోరనని, ఆ అవసరం కూడా లేదని, సింహం ఎక్కడ గడ్డి మేయదని ఉదాహరణగా చెప్పిన సందర్భంలోనిది.

ప్రశ్న 2.
కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !

అ) ఖరము అంటే _________
జవాబు.
గాడిద

ఆ) కూడు అంటే _________
జవాబు.
తిండి

ఇ) గంగిగోవు పాలను _________ తో పోల్చాడు.
జవాబు.
భక్తి

ఈ) ఈ పద్యాన్ని _________ రాశాడు.
జవాబు.
వేమన

ఉ) ఈ పద్యం _________ శతకంలోనిది.
జవాబు.
వేమన

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బంధారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జవాబు.
బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. లోకంలో శివభక్తే శాశ్వతమైందని నమ్మేవాడు. శివునియందు భక్తి ప్రపత్తులను కల్గియుంటే సకల సంపదలను అనుగ్రహిస్తాడనే విశ్వాసం కలవాడు. ఇతరుల ధనమును ఆశింపనివాడు. తన నిజాయితీని నిరూపించుకోవఁ ‘నికి వెనుకాడని భక్తశిఖామణి. ఈ లోకంలో భక్తి మాత్రమే శాశ్వతమైందని నమ్మిన గొప్ప శివభక్తుడు. దేనికీ, ఎవరికీ చలింపని ధీరగుణసంపన్నుడు.

ఆ) బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు ?
జవాబు.
మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ. అందులోను నిజాయితీగాను, నిర్భయంగాను మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. నిర్భయంగా మాట్లాడే వానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. తాను జీవితంలో తప్పుచేయకపోవడం, ఇతరుల ధనాన్ని ఆశించకపోవడం లేదా దొంగిలించకపోవడం, ఆడిన మాటకు కట్టుబడి ఉండడం, భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కల్గి ఉండడం. ఇటువంటి లక్షణాలు కలిగినవాడు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా నిర్భయంగా మాట్లాడగలుగుతాడు.

ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
జవాబు.
భక్తుడు ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటాడు. భగవంతుని మీద తనకు గల భక్తినే సంపదగా గుర్తిస్తాడు. భక్తినే కల్పవృక్షంగాను, కామధేనువుగాను, చింతామణిగాను భావిస్తాడు. ఇతరుల ధనాన్ని ఎన్నటికీ ఆశింపడు. పరుల సంపదను పాములాగా చూస్తాడు. భక్తినే తగిన ధనంగా తలచుకొని జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా జీవిస్తాడు.

ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
పాలసముద్రంలో క్రీడించే హంస మడుగుల్లోని నీరు త్రాగడానికి ఇష్టపడదు. నిశ్చలమైన భక్తి గల భక్తునికి భక్తి మాత్రమే ధనం. భగవంతునిపట్ల భక్తిని కల్పవృక్షంగాను, చింతామణిగాను, కామధేనువుగాను భావిస్తారు.

అట్లే భక్తుడు కూడా ఉన్నతమైన భక్తిని ఆశ్రయిస్తాడుగాని అల్పమైన పరుల ధనాన్ని ఆశించడు. భక్తుడు హంస లాంటివాడు. జీవితంలో ఉన్నతంగానే జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తాడు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి.
జవాబు.
భగవంతునిపైగల నిశ్చలమైన ప్రేమకే ‘భక్తి’ అని పేరు. ఇది నిష్కల్మషంగా ఉంటుంది. తోటివారికి ఆదర్శంగా ఉంటుంది. భక్తుడు భగవంతుని సేవ చేస్తాడు. భగవంతుని సేవలో తారతమ్యాలు ఉండవు. సంపదలు, చదువు, వైభవము మొదలైనవి భక్తి మార్గంలో కనిపించవు. నిజమైన భక్తునికి కొన్ని మహోన్నతమైన లక్షణాలు ఉంటాయి. వాటిలో కొన్ని –

  1. అన్ని ప్రాణులయందు దయ కలిగి ఉండడం.
  2. ఎవ్వరినీ, ఏదీ, ఎప్పుడూ యాచింపకుండడం.
  3. నాది, నావాళ్ళు అనే మమకారం వీడి, మనది అనే విశాల భావనను కల్గి ఉండడం.
  4. మానవసేవే మాధవసేవగా భావించి పేదలయందు భగవంతుడిని దర్శించి, వారిని సేవించడం.
  5. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. మహిళలను గౌరవభావంతో చూడగలగడం.
  6. దానధర్మాన్ని తాను ఆచరించడం. తన సమాజానికి అంకితభావంతో సేవ చేయడం.
  7. పరిపూర్ణమైన భక్తిని, జ్ఞానమును పొందగలగడం.
  8. ఎవ్వరినీ ద్వేషింపకుండడం; చేసే ప్రతి పనిని భగవంతునికే అర్పిస్తూ చేయడం.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

IV. సృజనాత్మకత / ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.
జవాబు.
బసవన్న : మహారాజా ! మీకు ఇవే నా నమస్కారాలు. మీకు అన్నింట జయం కలుగుగాక.
రాజు : బసవన్నా ! నీకు ఇది తగునా ! ఇంతటి అధర్మానికి పాల్పడతావా !
బసవన్న : రాజా ! నేనేమి చేశాను. నాకు తెలిసి ఏ పాపం చేయదు.
రాజు : బసవన్నా ! నీవు బుకాయించకు. మా ధనాన్ని నాకు అప్పగించి వెళ్ళు.. ఇక నీ ప్రధాని పదవిచాలు. నన్ను ఎవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. పరుల ధనాన్ని అపహరింపదలచావు. ఇది నీకు తగునా ? ఇతరుల ధనాన్ని తీసుకోనని ప్రతిజ్ఞ చేశావు. ఇది నీకు తెలియదా ? ఇక ఇన్ని మాటలు ఎందుకు ? మా ధనాన్ని మాకు అప్పగించి వెళ్ళు.
బసవన్న : రాజా ! మీ ఆరోపణల్లో నిజం లేదు. నేను మీ ధనాన్ని అపహరించలేదు. పరమేశ్వరునిపై భక్తి అనే కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వంటివి నా దగ్గర ఉన్నాయి. అలాంటి నాకు మీ సంపదలతో ఏమవసరం ? పాలసముద్రంలో విహరించే రాజహంస మురికిగుంటలోని నీటిలో విహరించడానికి ఇష్టపడుతుందా ! భగవంతుని ధనాన్ని భగవంతునికే అర్పించాను. నేను అపహరించలేదు. నీవు కాదనుకుంటే ధనాన్ని లెక్కించుకోండి.
రాజు : భటులారా ! బంగారు నాణాలతో కూడిన ఆ పెట్టెలను తీసుకొనిరండి.
భటులు : చిత్తం మహారాజా ! (కొద్దిసేపటి తర్వాత) మహారాజా ! ఇవిగో ఆ పెట్టెలు.
రాజు : ఈ పెట్టెకున్న తాళాలు తీయండి. ధనాన్ని లెక్కించండి. (తెరచిచూస్తారు)
భటులు : మహారాజా ! అద్భుతం ! మహాద్భుతం ! ధనం మొత్తం ఉంది. ఇంకా ఎక్కువగానే ఉంది.
రాజు : బసవన్నా ! నీవు ధన్యుడివి. నీ భక్తికి తిరుగులేదు, నన్ను క్షమించండి.

V. పదజాల వినియోగం:

ప్రశ్న 1.
గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.

అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
జవాబు.
పాలసముద్రం

ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.
సింహం

ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
జవాబు.
రాజులు

ప్రశ్న 2.
కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

అ) ఆశ్చర్యం ఎ) బత్తి
ఆ) భక్తి బి) దెస
ఇ) దిశ సి) పుడమి
ఈ) పృథ్వి డి) అచ్చెరువు

జవాబు.
అ) డి
ఆ) ఎ
ఇ) బి
ఈ) సి

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

VI. భాషను గురించి తెలుసుకుందాం.

ప్రశ్న 1.
కింది పట్టికను పూరించండి.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న 1

జవాబు.

సంధి పదం-విడదీసి రాయండి.-సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధి = క్షీర + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి

1. కనకాచలం = కనక + అచలం – సవర్ణదీర్ఘ సంధి
2. క్షీరాబ్ధి = క్షీర + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
3. నాకొక = నాకు + ఒక – ఉత్వసంధి
4. కాదేని = కాదు + ఏని = ఉత్వసంధి
5. అతనికిచ్చెను = అతనికి + ఇచ్చెను – ఇకారసంధి
6. పుట్టినిల్లు = పుట్టిన + ಇಲ್ಲು – అత్వసంధి
7. ఏమిటిది = ఏమిటి + ఇది – ఇత్వ సంధి
8. నాయనమ్మ = నాయన + అమ్మ – అత్వసంధి

గుణసంధి:

2. కింది పదాలను విడదీయండి.
ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)

ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)

ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)

ఉదా : దేవర్షి = దేవ + ఋషి
(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి
(అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”

  • ‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న 2
    అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’.
  • ”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)
  • ‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
    ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.

‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

ప్రశ్న 3.
కింది పదాలను కలిపి, సంధి ఏర్పడిన విధానాన్ని తెలుపండి.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న 3

జవాబు.
ఉదా : మహా + ఇంద్రుడు = మహేంద్రుడు (అ + ఇ = ఏ) TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న 2
అ) దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ) TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న 2
ఆ) గణ + ఈశుడు = గణేశుడు (అ + ఈ = ఏ) TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న 2
ఇ) నర + ఉత్తముడు = నరోత్తముడు (అ + ఉ = ఓ) (ో)
ఈ) నవ + ఉదయం = నవోదయం (అ + ఉ = ఓ) (ో)
ఉ) బ్రహ్మ + ఋషి = బ్రహ్మర్షి (అ + ఋ = అర్) (ర్షి)

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

భాషాకార్యకలాపాలు/ ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.
జవాబు.
శ్రీకాళహస్తి ప్రదేశములో ‘ఉడుమూరి కన్నప్ప’ అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు ఒకసారి అడవికి వేటకై వెళ్ళి అలసిపోయి నిద్రించగా అతనికి కల వచ్చింది. ఆ కలలో రుద్ర చిహ్నములతో ఉన్న తపసి ఒకడు కన్పించి, “నీవు కొంచెము దూరము వెడితే, ఒక లింగము కన్పిస్తుంది. అది నీకు ప్రాణ లింగము” అని ఉపదేశించాడు. కన్నప్ప మేల్కాంచి తోడి ఎరుకలను విడిచి తానొక్కడే ముందుకు వెళ్ళగా, ఘన లింగమూర్తి కనబడ్డాడు. తన కల ఫలించిందని కన్నప్ప ఆ లింగాన్ని తన ప్రాణనాథునిగా భావించాడు.

ఆ లింగము ఎండలో ఎండిపోతోందని, ఎలాగో బ్రతిమాలి ఆ లింగాన్ని తన ఊరికి తీసికొని వెళ్ళి పాక’ వేద్దామనుకున్నాడు. కన్నప్ప, ముగ్దభావంతో ఈశ్వరుడితో ఇలా అన్నాడు. “ఓ ఈశ్వరా ! నీవు ఒక్కడవే ఇక్కడ ఉన్నావేమి ? మీ ఊరి తమ్ముళ్ళపై అలిగి వచ్చావా ? గొరగలు, ఉమ్మెత పూలతో పూజిస్తే పిచ్చి ఎక్కి పచ్చావా ? పరసల గొడవ పడలేక, వచ్చావా? నన్ను రక్షించడానికి వచ్చావా ? ఎక్కడి నుంచి వచ్చావు ? నీ భార్య, పార్వతి ఏది ? ఈ అడవిలో పాముల, మృగముల భయము ఉంది. మా పల్లెలో ఎంతో సుఖంగా ఉంటుంది. పాయసము, ఇప్ప పూల తేనె, ఫలములూ వగైరా దొరుకుతాయి. నీకు ఇష్టమైతే మాంసము, కఱకుట్లు లభిస్తాయి” అని శివుని పాదాలపై పడి, తనతో రమ్మని కన్నప్ప శివుని బ్రతిమాలాడు.

శివుడు మాట్లాడలేదు. శివునికి ఆహారము లేక నోట మాట రావడం లేదని కన్నప్ప తలపోశాడు. వెంటనే అడవిలోకి వెళ్ళి కందమూలాలు, శాకములు చూశాడు. కాని అప్పటికే శివునికి ఆహారముగా తమ శరీరాలను అర్పించాలని కొందరు రాక్షసులు మృగాలుగా అక్కడ పుట్టారు. తిన్నడు ఒక్కొక్క బాణముతో ఒక్కొక్క మృగాన్ని చంపి, వాటిని కాల్చి, పేల్చి, ముక్కలు చేసి, అందులో రుచికరమైన మాంసాన్ని దొప్పలో పెట్టాడు. చక్కని మారేడు పత్రిని కోసి తలలో పెట్టుకొన్నాడు. సువర్ణముఖీ జలాన్ని పుక్కిళ్ళలో నింపుకున్నాడు. కన్నప్ప శివలింగం వద్దకు వచ్చి, నిర్మాల్యాన్ని చెప్పుకాలితో తుడిచి, పుక్కిటి జలంతో అభిషేకించాడు. నెత్తిపై గల పత్రిని లింగముపై దులిపాడు. దొప్పలోని మాంసాన్ని శివునకు అర్పించాడు.

కన్నప్ప నిత్యమూ శివలింగాన్ని ఇలా సేవిస్తున్నాడు. ఆ లింగాన్ని పూర్వము నుండి పూజించే ఒక తపసి ఆ మాంసాన్నీ, పుక్కిటి జలంతో అభిషేకాన్నీ చూసి అసహ్యించుకున్నాడు. ఒకరోజు అలా అకార్యము చేస్తున్న వాడిని చంపుదామని లింగము వెనుక నక్కి కూర్చున్నాడు. కన్నప్ప వచ్చి యథాప్రకారంగా లింగాన్ని అర్చించాడు. ఈశ్వరుడు, కన్నప్ప ముగ్ధత్వాన్నీ, నిర్మల భక్తినీ, ఆ తపసికి తెలియపరచాలని అనుకున్నాడు.

కన్నప్ప వచ్చేసరికి శివుని కుడికంటి నుండి కన్నీరు కారుతోంది. కన్నప్ప కాలితో శివుని నెత్తిపై గంగను కదపడం వల్ల ఆ గంగనీరూ, కన్నప్ప పుక్కిటినీరూ, శివుని కంటినీరూ ఏకమయ్యింది. శివుని శరీరమంతా కంటి నీరుతో తడిసిపోయింది. అది చూచి, కన్నప్పకు ఆశ్చర్యము కలిగింది. భయంతో చలించిపోయాడు.

శివుని కంటిలో నలుసు పడిందేమో అని కన్నప్ప గట్టిగా ఊదాడు. నాలుకతో శివుని కన్నుగ్రుడ్డుపై రాశాడు. కన్ను కొలుకులు ఒత్తాడు. ఆవిరి పెట్టాడు. ఏమి చేసినా కన్నీరు ఆగలేదు. కంటిరోగమేమో అనుకున్నాడు. పొరవేసిందేమో అనుకున్నాడు. నీరు కారే జబ్బు ఏమో అనుకున్నాడు. అవి ఆనందబాష్పములు, చెమట, నీరు, కావు అనుకున్నాడు. చివరకు తనకు మందులు ఏమీ తెలియవని బాధపడ్డాడు.

కన్నుకు కన్నే మందని నిశ్చయించాడు. శివుని పాడయిన కన్నును, తన కన్నుతో కప్పాలని అనుకున్నాడు. తన కుడి కన్నును తీసి శివుని కుడి కన్నుపై కప్పాడు. శివుని కుడికంటి నీరు ఆగిపోయింది. ఎడమ కంటి నుండి నీరు కారసాగింది. శివుని ముఖముపై తన కన్ను చూసి కన్నప్ప ఆనందించాడు. శివుని ఎడమ కంటికి చికిత్స చేయాలని తన చెప్పు కాలితో శివుని కన్నును గుర్తు పెట్టుకొని, తన ఎడమ కన్నును పెకలించబోయాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై కన్నప్ప చేతులు పట్టుకొని ఆపు చేశాడు.

దేవతలు ప్రత్యక్షమయ్యారు. పుష్పవృష్టి కురిసింది. శివ దుందుభులు మ్రోగాయి. కన్నప్ప కన్నులు శివుని ముఖంపైన, శివుని కన్నులు కన్నప్ప ముఖంపై ప్రకాశించాయి. శివునకు కన్నులు ఇచ్చాడు కాబట్టి, అతడు కన్నప్ప అయి, శ్రీకాళహస్తిలో శివుని సన్నిధిలో ఉండి నేటికీ పూజలు అందుకుంటున్నాడు. కన్నప్ప ముగ్ధభక్తి ప్రశంసింపదగినది.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

TS 8th Class Telugu 3rd Lesson Important Questions బండారి బసవన్న

I. అవగాహన – ప్రతిస్పందన:

పరిచిత గద్యాలు:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి “నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను” అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
బండారి బసవన్న ఎవరి కొలువులో ఉన్నాడు ?
జవాబు.
బిజ్జలుడి కొలువులో

ప్రశ్న 2.
బసవన్న ఎవరి భక్తుడు?
జవాబు.
శివభక్తుడు

ప్రశ్న 3.
జంగమయ్య బసవన్నను ఏమి కోరాడు ?
జవాబు.
ధనం

ప్రశ్న 4.
మాడలు అంటే ఏమిటి ?
జవాబు.
బంగారు నాణేలు

ప్రశ్న 5.
మంత్రులు బసవన్నపై ఏమి అభియోగం చేశారు ?
జవాబు.
రాజద్రోహం

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడిపండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి అయినా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ?

ప్రశ్నలు:

ప్రశ్న 1.
హంస ఎక్కడ క్రీడిస్తుంది ?
జవాబు.
పాల సముద్రంలో

ప్రశ్న 2.
చిలుక వేటిని కన్నెత్తి చూడదు ?
జవాబు.
బూరుగు చెట్టు పండ్లను

ప్రశ్న 3.
వెన్నెలను తాగేదెవరు ?
జవాబు.
చకోర పక్షి

ప్రశ్న 4.
తుమ్మెద ఎక్కడ విహరిస్తుంది ?
జవాబు.
తామరపూల సుగంధంలో

ప్రశ్న 5.
పందిపాలు తాగడానికి ఇష్టపడనిదెవరు ?
జవాబు.
ఏనుగు పిల్ల

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

II. స్వీయరచన:

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
భక్తుడు పరధనాన్ని ఆశించడని చెపుతూ, బండారి బసవన్న ఇచ్చిన ఉదాహరణలు ఏమిటి? (4 మార్కులు)
జవాబు.
శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశించడు అని అంటూ ఉదాహరణలుగా

“పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడిపండ్లను తినే చిలుక బూరుగ చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోర పక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామర పూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా” అని బండారి బసవన్న బిజ్జలునితో చెప్పాడు.

ప్రశ్న 2.
‘పరధనాన్ని ఆశించకూడదు’ ఎందుకు ?
జవాబు.
‘పరధనం పాము వంటిది’ అని పెద్దలమాట. పరధనాన్ని ఆశిస్తే తాత్కాలిక సుఖం పొందవచ్చు. కాని శాశ్వత కష్టాన్ని, అపకీర్తిని పొందుతాము. కనుక పరధనాన్ని ఆశించకూడదు. జీవితంలో ఉన్నతమైన ఆలోచనలతో, ఆచరణలతో జీవించిన వాడే నిజమైన మనిషి. అతడే అందరికి ఆదర్శంగా నిలుస్తాడు. పరధనాన్ని ఆశించడం వల్ల మనిషి పతనాన్ని పొందుతాడు. కల్మషమైన ఆలోచనలతో పరుల సొమ్మును ఆశించడం వల్ల, ఆ పోగొట్టుకున్న వారు ఎంతగా బాధపడతారో గ్రహించాలి. ఆ కష్టం మనకే వస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తే పరధనాన్ని ఆశించాలనే భావన రాదు.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

ఆ) క్రింది ప్రశ్నలకు పడేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)

ప్రశ్న 1.
పాల్కురికి సోమనాథ కవి రచనా విశేషాలను తెల్పండి.
(లేదా)
పాల్కురికి సోమనాథుని గురించి రాయండి.
జవాబు.
పాల్కురికి సోమనాథుడు సంస్కృతాంధ్ర కర్ణాటక భాషల్లో అసమానమైన పాండిత్యాన్ని గడించి ఆయా భాషల్లో శైవమత ప్రచారం కొరకు అనేక గ్రంథాలను రచించిన సాహితీమూర్తి. దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలికవి. బసవేశ్వరుని చరిత్రసు పురాణంగా నిర్మించి, ద్విపద కావ్య గౌరవం కలిగించిన శైవకవి. 12వ శతాబ్దానికి చెందిన ఈయన జనగామ జిల్లా పాలకుర్తిలో జన్మించారు.

రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు సోమన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో ‘మణి ప్రవాళశైలిని’ వాడిన తొలికవి. గురుభక్తి మహిమ, భక్తి స్వరూపం మొదలైన అంశాల అనుభవసారం తెలుగు సాహిత్యంలో శుద్ధమైన దేశి పద్ధతిలో తొలిగా వెలువడిన స్వతంత్ర వీరశైవ పురాణం ‘బసవ పురాణం’.

ప్రాచీనాంధ్ర భాషా విశేషాలు ఛందో విభక్తి సంప్రదాయాలు తెలిపే ‘బసవోదాహరణం’ శతక వాఙ్మయ చరిత్రలో సర్వ లక్షణ సంపన్నమైన మొట్టమొదటి శతకం ‘వృషాధిప శతకం’. శైవానికి సంబంధించిన ముఖ్య విషయాలతో కూడిన ‘చతుర్వేద సారం’, ‘చెన్నమల్లు’ మకుటంతో 32 సీస పద్యాల ‘చెన్నమల్లు సీసాలు’, ‘తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం’గా కీర్తింపబడిన ‘పండితారాధ్య చరిత్రము’ వీరి రచనలలో ప్రముఖమైనవి. గమనిక : మొదటి ప్రశ్న వివరంగా (కవి పరిచయం) విద్యార్థులకు అవగాహనకై వ్రాయబడింది. పరీక్షకు అనుగుణంగా మార్చవచ్చు.

ప్రశ్న 2.
“ఆకలైనంత మాత్రాన సింహం గడ్డి తినదు” దీనిపై మీ అభిప్రాయం తెల్పండి.
‘జవాబు.
మాంసం మాత్రమే తినే సింహం ఏమీ దొరకలేదని గడ్డి తింటుందా? తినదని అందరికీ తెలుసు. అందుకే బసవన్న రాజుతో “ఆకలైనంత మాత్రాన – సింహం గడ్డి తినద”న్నాడు. ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది ?

బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండ నాయకుడుగా ఉన్నాడు. ఒకరోజు జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి ధనాన్ని కోరతాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని బంగారు నాణేలు జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేసాడని చెప్పారు. అప్పుడు బిజ్జలుడు బసవన్నను పిలిచి, “ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు, మరి ఎట్లా దొంగిలించావు?” అన్నాడు.

బసవన్న చిరునవ్వుతో తాను పరుల ధనాన్ని కోరనని, ఆ అవసరం కూడా లేదని, సింహం ఎక్కడా గడ్డి మేయదని అన్నాడు. అంటే శివభక్తుడనైన తాను శ్రేష్ఠమైన వాటినే ఆశ్రయించి ఉన్నతంగా ఉంటానే గాని అల్పమైన వాటిని ఆశ్రయించి అల్పులుగా జీవించనని చెప్పినట్లు అర్థమౌతున్నది. ఇక్కడ తనకు భక్తిని మించిన ధనం వేరే లేదని బసవన్న ప్రకటించాడు.

ప్రశ్న 3.
“బండారి బసవన్న” పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడిగనే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసే వారిని మెచ్చుకుంటాడు.

బిజ్జలుడి మంత్రియైన బండారి బసవన్న తన దగ్గరికి వచ్చి, ధనాన్ని అడిగిన జంగమయ్యకు భక్తితో సమర్పిస్తాడు. ఇది గిట్టని ఇతర మంత్రులు రాజుకు, బసవన్నపై ఫిర్యాదు చేస్తారు. బిజ్జలుడు బసవన్నను పిలిపించి, ఖజానా ఖాళీ చేస్తున్నందుకు మందలించాడు. తన ధనాన్ని తనకు అప్పగించి వెళ్ళమని హెచ్చరించాడు. అప్పుడు బసవన్న చిరునవ్వుతో “పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం, మేరు పర్వతం, కామధేనువు, చింతామణి వంటివి దగ్గర ఉండగా పరుల ధనముతో పని ఏమి ? పరమేశ్వరుడే నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని 4ఆశిస్తాడా? సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా ? అంటే ఎన్నటికీ ఆశించనని తెలియజేసాడు.

మరల లోకంలో చిలుక, హంస, చకోరం, తుమ్మెద మొదలైనవి శ్రేష్ఠమైన వాటినే ఆశ్రయిస్తాయి గాని అల్పములైన వాటిని ఆశ్రయించవు. అట్లే శివభక్తులు కూడా ఉన్నతంగా ఉంటారే గాని అల్పములైన వాటిని కోరనన్నాడు. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో” అని పలికాడు.

బిజ్జలుడు ధనాగారంలోని పెట్టెలు తీసి చూడగా బంగారు నాణేలు లెక్కకు మించి ఉన్నాయి. ఇలా ఈ లోకంలో భక్తి మాత్రమే శాశ్వతమైందని ఋజువైంది.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

ప్రశ్న 4.
పరమ శివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? అని అన్న బసవుని మాటల ద్వారా మీరేమి గ్రహించారు ? వివరించండి.
జవాబు.
“పరమేశు భక్తియన్ సురతరువుండ …………….. పగతుడాసించునే పరధనంబునకు” పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? ఆశించడు కదా ! బసవుని మాటల్లో ‘నిర్భయత్వం, నిజాయితీ, భగవంతుని పట్ల అచంచలమైన భక్తి చక్కగా కనబడుతోంది. బసవన్న లోకంలో శివభక్తి శాశ్వతమని నమ్మేవాడు. పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే అన్ని సంపదలు ఆయనే ఇస్తాడనే నమ్మకం ఉన్నవాడని గ్రహించాను.

భగవంతుని మీద తనకు గల భక్తినే సంపదగా భావించాడు బసవన్న. పరుల సొమ్ము పాముగా భావించాడు. దీనిని బట్టి భక్తుడు ఉన్నతమైన భక్తిని ఆశ్రయిస్తాడుగాని, అల్పమైన పరుల ధనాన్ని ఆశించడని తెలుసుకున్నాను. భక్తినే తగిన ధనంగా తలచుకొని ఉన్నతంగా జీవించే బండారి బసవన్న అందరికి ఆదర్శప్రాయుడు అని గ్రహించాను.

ప్రశ్న 5.
‘బండారి బసవన్న’ పాఠం ఆధారంగా భక్తునికి ఉండవలసిన లక్షణాలు రాయండి.
(లేదా)
బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి.
జవాబు.
భగవంతునిపైగల నిశ్చలమైన ప్రేమకే ‘భక్తి’ అని పేరు. ఇది నిష్కల్మషంగా ఉంటుంది. తోటివారికి ఆదర్శంగా ఉంటుంది. భక్తుడు భగవంతుని సేవ చేస్తాడు. భగవంతుని సేవలో తారతమ్యాలు ఉండవు. సంపదలు, చదువు, వైభవము మొదలైనవి భక్తి మార్గంలో కనిపించవు. నిజమైన భక్తునికి కొన్ని మహోన్నతమైన లక్షణాలు ఉంటాయి. వాటిలో కొన్ని –

  1. అన్ని ప్రాణులయందు దయ కలిగి ఉండడం.
  2. ఎవ్వరినీ, ఏదీ, ఎప్పుడూ యాచింపకుండడం.
  3. నాది, సావాళ్ళు అనే మమకారం వీడి, మనది అనే విశాల భావనను కల్గి ఉండడం.
  4. మానవసేవే మాధవసేవగా భావించి పేదలయందు భగవంతుడిని దర్శించి, వారిని సేవించడం.
  5. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. మహిళలను గౌరవభావంతో చూడగలగడం.
  6. దానధర్మాన్ని తాను ఆచరించడం. తన సమాజానికి అంకితభావంతో సేవ చేయడం.
  7. పరిపూర్ణమైన భక్తిని, జ్ఞానమును పొందగలగడం.
  8. ఎవ్వరినీ ద్వేషింపకుండడం; చేసే ప్రతి పనిని భగవంతునికే అర్పిస్తూ చేయడం.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

III. సృజనాత్మకత:

ప్రశ్న 1.
మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని, మిత్రునికి లేఖ ద్వారా తెలియజేయండి.
జవాబు.

లేఖ

హైదరాబాద్,
X X X X X.

ప్రియమిత్రుడు నాగలక్ష్మణు,

నేను క్షేమం. నీవు క్షేమమని తలుస్తాను. ఈ లేఖలో నేను ఇటీవల మా తాతగారి ఊరు జోగిపేట వెళ్ళి వచ్చాను. ఆ ప్రయాణ వివరాలు ఇప్పుడు రాస్తున్నాను. బస్సు మార్గంలో మేము మా ఊరి నుండి బయలుదేరి తాతగారి ఊరు చేరాము. దాదాపు 7, 8 గం|| ప్రయాణం, విసిగిపోయాం. దారిలో చిరుతిళ్ళు’ కొనుక్కొని కాలక్షేపం చేసామనే గాని, కూర్చొని కూర్చొని కాళ్లు తిమ్మెర్లెక్కాయి. కానీ తాత బామ్మలను చూసిన తర్వాత, వారు చూపిన ప్రేమకు మా అలసట అంతా పోయింది. ఇలాగే నీవు చేసిన ప్రయాణ విశేషాలను తెలియజేయి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కంచిభొట్ల ఫణిరామ్.

చిరునామా :
TS. నాగలక్ష్మణ్,
8వ తరగతి,
Z.P. హైస్కూల్,
ఖమ్మం, ఖమ్మం జిల్లా.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

IV. భాషాంశాలు:

పదజాలం:

పర్యాయపదాలు:

ప్రశ్న 1.
మైత్రి – _________
జవాబు.
స్నేహం, నెయ్యము

ప్రశ్న 2.
హంస – _________
జవాబు.
మరాళం, చక్రాంగనం, మానసారం

ప్రశ్న 3.
అరి – _________
జవాబు.
శత్రువు, వైరి, విరోధి

ప్రశ్న 4.
అబ్ధి – _________
జవాబు.
సముద్రం, సాగరం, అంబుధి

ప్రశ్న 5.
ఆకాంక్ష – _________
జవాబు.
కోరిక, వాంఛ, తలపు

ప్రశ్న 6.
పుడమి – _________
జవాబు.
ధరణి, భూమి, వసుధ

ప్రశ్న 7.
చీకటి – _________
జవాబు.
అంధకారం, ధ్వాంతము

ప్రశ్న 8.
ఇల్లు – _________
జవాబు.
గృహం, సదనం, నికేతనం

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

వ్యుత్పత్త్యర్థాలు:

ప్రశ్న 1.
కామారి – _________
జవాబు.
మన్మథునికి శత్రువు – శివుడు

ప్రశ్న 2.
సోమార్థధరుడు – _________
జవాబు.
అర్థచంద్రుడిని ధరించినవాడు (శివుడు)

నానార్థాలు:

ప్రశ్న 1.
అర్దము – _________
జవాబు.
సంపద, శబ్దార్థము, ప్రయోజనం

ప్రశ్న 2.
ఫలం – _________
జవాబు.
పండు, ప్రయోజనం, ఫలితం

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
తళతళలాడు = _________
జవాబు.
తళతళలాడు = మెరియు
పెట్టెలనిండ బంగారు నాణేలు తళతళలాడుతున్నాయి.

ప్రశ్న 2.
ప్రతిజ్ఞ = _________
జవాబు.
ప్రతిజ్ఞ = ಒట్టు
ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేసాను.

ప్రశ్న 3.
భక్తి పారవశ్యం = _________
జవాబు.
భక్తి పారవశ్యం = భక్తిలో తన్మయత్వం (భక్తిలో మునిగిపోవటం)
అచంచల భక్తి పారవశ్యం గలవారు ధనాశకు లోనుకారు.

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
1. ఆశ్చర్యం – అచ్చెరువు
2. భక్తి – బత్తి
3. పుణ్య – పన్నె
4. మృగము – మెకము

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

వ్యాకరణాంశాలు:

సంధులు:

1) సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును.
ఉదా : హసితాస్యుడు = హసిత + ఆస్యుడు
సోమార్థ = సోమ + అర్థ
కామారి = కామ + అరి
క్షీరాబ్ది = క్షీర + అబ్ధి
పుడమీశ = పుడమి + ఈశ

2) గుణసంధి :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమగును.
ఉదా : పరమేశుడు = పరమ + ఈశుడు
గజేంద్రము = గజ + ఇంద్రము

3) ఉత్వసంధి : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : తప్పేమి = తప్పు + ఏమి
రాదను = రాదు + అను

4) యడాగమ సంధి : సంధి లేనిచోట స్వరంబుకంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా : మాయర్థము = మా + అర్థము
మంత్రియనియె = మంత్రి + అనియె
నీయం = నీ + అంత

5) అత్వసంధి : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : బసవన్న = బసవ + అన్న
కనకాచలం = కనక + అచలం
నాకొక = నాకు + ఒక

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

సమాసాలు:

సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
1. పరధనము – పరుల యొక్క ధనం – షష్ఠీ తత్పురుష సమాసం
2. మృగపతి – మృగములకు పతి – షష్ఠీ తత్పురుష సమాసం
3. జననాథుడు – జనములకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసం
4. అర్థులయిండ్లు – అల యొక్క ఇండ్లు – షష్ఠీ తత్పురుష సమాసం
5. మ్రానిపండ్లు – మ్రాని యొక్క పండ్లు – షష్ఠీ తత్పురుష సమాసం
6. పరమేశుభక్తి – పరమేశుని యందు భక్తి – సప్తమీ తత్పురుష సమాసం
7. చూతఫలం – చూతము అనే పేరు గల ఫలం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
8. పుడమీశుడు – పుడమికి ఈశుడు – షష్ఠీ తత్పురుష సమాసం
9. మాయర్థం – మా యొక్క అర్థం – షష్ఠీ తత్పురుష సమాసం

ఇది ఏ వాక్యం ?

ప్రశ్న 1.
ఇక చాలు మీ ప్రధాని పదవి.
జవాబు.
నిషేధార్థక వాక్యం.

ప్రశ్న 2.
సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా ?
జవాబు.
ప్రశ్నార్థక వాక్యం.

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

I. ప్రతిపదార్థాలు – భావాలు:

బండారి బసవన దండనాయకుని
రప్పించి “మాయర్ద మొప్పించి పొమ్ము
దప్పేమి ? సాలుఁ బ్రధాని తనంబు
‘దండింప రా’ దను తలఁపున నిట్లు
బండార మంతయుఁ బాడు సేసితివి
పరధనం బపహరింపని బాస యండ్రు
పరధనం బెట్లొకో బసవ ! కైకొంటి
వేయు మాటలు నేల వెఱతుము నీకు
మాయర్థ మొప్పించి నీయంత నుండు”
మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగుచు
జననాథునకు బసవన మంత్రి యనియె
“బరమేశు భక్తియన్ సురతరువుండ
హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ
సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ
బగుతుఁడాసించునే పరధనంబునకు
మృగపతి యెద్దె మేయునే పుల్లు ?

ప్రతిపదార్థం :
బండారి = బిజ్జలుడు
దండనాయకుని = దండనాయకుడైన
బసవన = బసవన్నను
రప్పించి = పిలిపించి
మా యర్థము = మా సంపదను
ఒప్పించి = అప్పగించి
పొమ్ము = వెళ్ళు
తప్పు + ఏమి = తప్పు ఏమున్నది ?
ప్రధానితనంబు = ప్రధానమంత్రి పదవి
సాలు = ఇక చాలు
దండింపరాదు = శిక్షింపకూడదను
తలంపున = ఆలోచనతో
ఇట్లు = ఈ విధంగా
బండారము + అంతయు = ఖాజానా అంతా
పాడు చేసితివి = ఖాళీ చేశావు
పరధనంబు = ఇతరుల ధనాన్ని.
అపహరింపని = దొంగిలించనని
బాసయండ్రు = ప్రతిజ్ఞ చేశావు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
బెట్లోకొ = ఎట్లు
బసవా = ఓ బసవా !
కైకొంటి = తీసుకున్నావు.
వేయి మాటలు = వేలకొలది మాటలు
ఏల = ఎందుకు ?
మా అర్ధము = మా సంపద
ఒప్పించి = అప్పగించి
నీయంత నుండు = నీవు వెళ్ళు
అనవుడు = అని పలుకగా
కించిత్ = కొద్దిపాటి
ప్రవసిత = నవ్వబడిన
ఆస్యుడు = ముఖము కలవాడు
అగుచు = అయి
జననాథునకు = రాజుకు
బసవనమంత్రి = బసవ మంత్రి
అనియె = ఇట్లు పలికాడు
పరమేశు = శంకరునిపై
భక్తియన్ = భక్తి అనే
సురతరువు + ఉండ = కల్పవృక్షము ఉండగా
హరుభక్తియన్ = పరమేశ్వరుని యందు భక్తి అనే
కనక = బంగారుమయమైన
అచలము + ఉండ = కొండ ఉండగా
కామ + అరి = మన్మథుని వైరి అయిన శివుని యందు
భక్తి = భక్తి అనే
చింతామణి ఉండ = చింతామణి ఉండగా
సోమార్ధధరు = చంద్రుని శిరసున ధరించిన శివుని యందు
భక్తి = భక్తి
సురధేనువు ఉండ = కామధేనువు ఉండగా
పగతుడు = భక్తుడు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
ఆశించునే = ఆశిస్తాడా ?
మృగపతి = సింహం
ఎద్దె = ఎప్పుడైనా
పుల్లు = గడ్డిని
మేయునే = మేస్తుందా ?

భావం :
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. “మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా! మరి ఎట్లా దొంగిలించావు ? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగు తున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు” అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో ‘పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు -పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా ?

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న

II.
క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగం ?
జూత ఫలంబులు సుంబించు చిలుక
బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గల్గినునె ?
రాకామల జ్యోత్స్నఁ ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ
విరిదమ్మి వాసన విహరించుతేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరులు ?
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపంది చను సీక ? నెఱుఁగవు గాక
యరుదగు లింగ సదర్థుల యిండ్ల
వరవుడ నా కొక సరకెయర్థంబు
పుడమీశ ! మీధనంబునకుఁ జేస్వాప
నొడయల కిచ్చితి నొడయలధనము
పాదిగదఱిఁగిన భక్తుండఁగాను
గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు
దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ
నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

ప్రతిపదార్థం :

క్షీర + అబ్ధిలోపల = పాలసముద్రంలో
క్రీడించు = ఆడే
హంస = హంస
పడియల = మడుగులలోని
నీరు = నీళ్ళు
త్రావంగ = త్రాగడానికి
చుంబించు = తినే
చిలుక = చిలుక
చూత ఫలంబు = మామిడి పండు
బూరుగ మ్రాని = బూరుగ చెట్టు యొక్క
పండ్లు = పండ్లను
కన్గొనునె = చూస్తుందా ?
రాకామల = నిండు పున్నమి యొక్క
జ్యోత్స్న = వెన్నెలను
త్రావు = త్రాగే (అనుభవించే)
చకోరము = చకోరపక్షి
చీకటి త్రావన్ = “చీకటిని ఆస్వాదించడానికి
ఆకాంక్ష = కోరికను
చేయునే = చేస్తుందా ?
విరిదమ్మి = తామర పూల
వాసన = సువాసనల యందు
విహరించు = తిరుగునట్టి
పబ్బిలి విరుల = ఉమ్మెత్త పూలను
పరిగొని = ఆశపడి
సుడియునే = పరుగులు తీస్తుందా ?
దిగ్గజేంద్రంబు = మదగజము
పంది చనుసీక = పంది పిల్ల పాలు త్రాగడానికి
పుడమీశ = ఓ రాజా !
అరుదగు = అరుదైన
లింగ సదర్థుల = శివభక్తుల యొక్క
ఇండ్లన్ = ఇండ్లను గూర్చి
ఎఱుఁగవు గాక = తెలియదు గాక !
మీ ధనంబునకు = మీ ధనానికి
చేసాపన్ = చేయి చాపను
ఒడయల ధనము = ఇతరుల ధనాన్న
ఒడలకు = ఇతరులకు
ఇచ్చితి = ఇచ్చాను
సాదిగతఱిగిన = న్యాయము తప్పిన
భక్తుండగాను = భక్తుడను కాను
కాదేని = అట్లుకాకపోతే
ముడుపు లెక్కలు = ధనము యొక్క లెక్కలు
చూడు = చూడుము
అనుచు = అంటూ
దండ నాయకుడు = దండ నాయకుడు
పెట్టెలు = పెట్టెల్ని
ముందటన్ = ఎదుట
పెట్టి = ఉంచి
తాళములు = తాళాలను
పుచ్చుచుచూడ = తెరచి చూడగానే
అచ్చెరువు = ఆశ్చర్యం
జూడ = కలుగునట్లుగా
మాడలు = బంగారు నాణేలు
లెక్క తగ్గలంబున్న = లెక్కకు తగినట్లుగా
ఉప్పొంగుచున్ = ఉప్పొంగినాయి

భావం :
పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి ? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు ?

స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని ? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో” అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముంగటే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడు తున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.

పాఠం నేపథ్యం, ఉద్దేశం:

బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి “నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను” అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.

బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్త్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.

ప్రక్రియ – ద్విపద:

ద్విపద : లక్షణాలు : (2 పాదాలు)
1. గణాలు : 3 ఇంద్రగణాలు : 1 సూర్యగణం.
2. యతి : 3వ గణం ప్రథమాక్షరం
3. ప్రాస నియమం ఉంది.
4. రెండు పాదాలు ఇందులో ఉంటాయి.
5. ప్రాసయతి దీనికి ఉండదు.
6. ప్రతి ఒక్కపాదం ఈ లక్షణాలు కలిగి ఉంటుంది.
7. రెండు ద్విపదలను కలుపరాదు. విడి విడిగా ఉండాలి. ద్విపదలోని ఏ పాదం ఆ పాదంగా ఉండాలి. పై పాదం క్రింది పాదంతో అతుకరాదు.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని “ద్విపద కావ్యం” అంటారు.

ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘బసవపురాణం’ తృతీయాశ్వాసం లోనిది.

కవి పరిచయం:

కవి : “పాల్కురికి సోమనాథుడు”
పాఠ్యభాగం పేరు : బండారి బసవన్న
దేని నుండి గ్రహింపబడింది : బసవపురాణము తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడింది.
సోమన తల్లిదండ్రులు : సోమన తల్లి ‘శ్రియాదేవి’, తండ్రి ‘విష్ణురామి దేవుడు’.
కవి కాలం : క్రీ.శ. 1160 1240
జన్మస్థలం : సోమన జనగామ జిల్లా పాలకుర్తి (పాలకురికి / పాల్కురికి) లో జన్మించాడు.
వీరశైవమత దీక్ష : బాల్యంలోనే సోమన వీరశైవమతం పట్ల అభిమానంతో ఆ మత దీక్షను తీసుకొని వీరమాహేశ్వరాచార్య వ్రతుడయ్యాడు.
ప్రథమ స్వతంత్ర ఆంధ్రపురాణకర్త : సోమన బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి “ద్విపద” పద్యానికి కావ్యపురాణ గౌరవాన్ని కల్పించిన మొదటి తెలుగు స్వతంత్ర పురాణ కర్త.
వ్యావహారిక భాషలో రచన : సోమన లిఖిత సాంప్రదాయానికీ, మౌఖిక సాంప్రదాయానికీ వారధిలా నిలిచి, వ్యావహారిక తెలుగుభాషను అధికంగా ఉపయోగించి, రచన సాగించాడు.

రచనలు : సోమన, బసవేశ్వరునిపై భక్తి విశ్వాసాలతో అనేక రచనలు చేశాడు.

  1. బసవపురాణము,
  2. అనుభవసారము,
  3. పండితారాధ్య చరిత్రము,
  4. బసవోదాహరణము,
  5. వృషాధిపశతకము,
  6. చతుర్వేదసారము,
  7. చెన్నమల్లు సీసములు,
  8. పండితారాధ్య చరిత్రము మొ||నవి.

వృషాధిప శతకం : ఈ శతకం, శతక లక్షణాలన్నీ నిండిన తొలి తెలుగు శతకం. ఇందులో సోమన అనేక ప్రయోగాలు చేశాడు. మణి ప్రవాళ శైలితో పాటు సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషాపదాలను యద్ధేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు.

ప్రవేశిక :

సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడుగనే నిలబెడుతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసే వారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాఠ్యభాగ సారాంశం:

బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. “మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా ! మరి ఎట్లా దొంగిలించావు ? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగుతున్నది.

మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు” అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో ‘పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా ?

పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ?నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూల కోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి ? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు ?

స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని ? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో” అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముంగటే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడుతున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu Guide 3rd Lesson బండారి బసవన్న 4

Leave a Comment