TS 7th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు

Telangana SCERT 7th Class Telugu Guide Answers Telangana ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు Textbook Questions and Answers.

TS 7th Class Telugu Guide Upavachakam 1st Lesson అద్భుతమైన సెలవులు

పాఠం ఉద్దేశం:

పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ, నిరాదరణకు గురయిన వృద్ధులపట్ల పిల్లల బాధ్యతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠం నేపథ్యం:

చాలామంది పిల్లలు సెలవుల్లో పూర్తిగా ఆటపాటలతో గడిపేస్తారు. కాని, వాటివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరికొంతమంది సెలవులలో ఏదో ప్రత్యేకతను చూపాలని తాపత్రయపడతారు. అదే అంశం ఈ కథకు నేపథ్యం.

పాఠం ప్రత్యేకత:

కథను నాటకీకరణ పద్ధతిలో తెలియజేయడం.
పిల్లలకు ప్రయోజనకరంగా సెలవులని గడపాలని సూచించడం.
వృద్ధులపట్ల గౌరవభావం కలిగి ఉండాలి అని తెలియజేయడం.
పిల్లల్లో పరోపకారం చేయాలనే ఆసక్తిని రేకెత్తించడం.
కార్యక్రమ నిర్వహణా విధానాన్ని తెలియజేయడం.
ఆలోచిస్తే పిల్లలు దేన్నయినా సాధించగలరని నిరూపించడం.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:

కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సుశీల్, సునీత, సాగర్లు ఇంట్లో ఉండడం వల్ల విసుగ్గా ఉందని ఎందుకన్నారు?
జవాబు.
సుశీల్, సునీత, సాగర్లు వేసవిసెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవారు. అక్కడి పిల్లలతో కలిసి ఆడుకునేవారు. కానీ ఈ సంవత్సరం వెళ్ళడానికి కుదరలేదు. ఇంట్లోనే ఈ ముగ్గురే ఉంటున్నారు. ఆడిన ఆటలే, మాట్లాడిన మాటలే, ఉన్న ప్రదేశంలోనే గడపడం వారికి విసుగనిపించింది.

ప్రశ్న 2.
వృద్ధాశ్రమంలో ఏ నాటకం వేయాలనుకున్నారు? ఎలా వేశారు?
జవాబు.
వృద్ధాశ్రమంలో వృద్ధులకు రేడియో కొనివ్వడానికి ‘గుశ్వం’ అనే హాస్యనాటికను వేయాలనుకున్నారు. సావిత్రి పిన్ని, తోటమాలి తాతయ్య సహాయం తీసుకోవాలనుకున్నారు. పాఠశాలలో నాటకాలు వేసే అనుభవమున్న నితిన్ ను కలిసారు. నాటకాన్ని రిహార్సల్ చేసుకున్నారు. ముందురోజు వృద్ధాశ్రమ మేనేజరు అనుమతి తీసుకున్నారు. స్టేజి తయారు చేసుకొని అద్భుతంగా నటించారు.

ప్రశ్న 3.
పిల్లలు వృద్ధాశ్రమానికి ఎందుకు వెళ్లారు? అక్కడ వారు గమనించిన అంశాలేమిటి?
జవాబు.
ఇంట్లో విసుగెత్తిన పిల్లలు తోటమాలి తాతయ్య సలహామేరకు పూలగుత్తిని తయారుచేశారు. దానిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి వెళ్ళారు. అక్కడవారు వృద్ధులతో ముచ్చటలాడారు. అక్కడ వృద్ధులకు కాలక్షేపానికి టి.వీ. రేడియో, టేప్ రికార్డరు వంటివేవీ లేవని గ్రహించారు. వార్తాపత్రికలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలున్నా కాలక్షేపానికి ఏమీ లేక పోవడంతో బాధపడ్డారు.

ప్రశ్న 4.
వృద్ధాశ్రమంలో వృద్ధుల రోజువారీ కార్యక్రమాలను గురించి తెల్పండి.
జవాబు.
వృద్ధాశ్రమంలో వృద్ధులు కొద్దిసేపు కూర్చుంటారు. కొద్దిసేపు దైవప్రార్థన చేస్తారు. కొద్దిసేపు మాట్లాడుకుంటారు. భోజనం చేస్తారు. పండుకుంటారు. అప్పుడప్పుడు వార్తాపత్రికలు చదువుతారు. టీవీ మరమ్మత్తుకు పోకముందు టీవీ చూసేవారు.

ప్రశ్న 5.
వృద్ధాశ్రమానికి ఎలాంటి సహాయాలు చేయవచ్చు?
జవాబు.
వృద్ధాశ్రమాలలో వృద్ధులకు ఎన్నో సహాయ సహకారాలు అవసరమౌతాయి. పడుకోవడానికి మెత్తలు, తినడానికి భోజనంతోపాటు పండ్లు, పాలు వంటి పౌష్టికాహారం, కప్పుకోవడానికి దుప్పట్లు, దోమతెరలు, ఆహ్లాదం పొందడానికి సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి వారికి మనం సమకూర్చవచ్చు. విరాళాలు సేకరించి అనాథలను అక్కడ చేర్పించి వారి సుఖసంతోషాలకు దోహదపడవచ్చు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
‘అద్భుతమైన సెలవులు’ కథ ఎలా ఉంది? దీన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
అద్భుతమైన సెలవుల కథపై నా అభిప్రాయం :

అద్భుతమైన సెలవులకథ పేరుకు తగ్గట్టు ఎంతో అద్భుతంగా ఉంది. చిన్న, పెద్ద అనేది వయసుకు మాత్రమేనని, మనసుకు కాదని ఈ కథ తెలియజేస్తోంది. చిన్నవయసులో ఉన్న సుశీల్, సాగర్, సునీతలు పెద్దమనసుతో ఒక మంచి కార్యాన్ని తలపెట్టారు. ఆ కార్యసాధన కోసం అహర్నిశలు శ్రమించారు. పాఠశాల సెలవుల్ని పిల్లలు సంతోషంగా గడపాలనుకుంటారు. కానీ తమ సెలవులను పదిమందికి సంతోషం కలిగించే పనికి ఉపయోగించాలని వీరు భావించటం నిజంగా అద్భుతమే. ఇది ఎంతోమందికి ఆదర్శనీయం. ఎవరూ చూసే దిక్కులేక కొందరు, అందరూ ఉండి అనాథలుగా ఉన్న మరికొందరు అనాథ ఆశ్రమాల్లో కాలం వెళ్ళదీస్తున్నారు.

ఆవేదనతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఈ కథలోని ఈ చిన్నారులు అనాథ వృద్ధుల ఆవేదనను కొంతమేరకైనా తీర్చాలని కంకణం కట్టుకున్నారు. హాస్యనాటికను ఎంపిక చేసుకొని వృద్ధుల్లో కొంతమేర సంతోషాన్ని, సరదాని నింపారు. ఈ చిన్నారుల చేతిలో డబ్బులేక పోయినా, పెద్దమనసుతో విరాళాలు సేకరించి వచ్చిన డబ్బుతో రేడియో, టేప్ రికార్డర్ అనాథాశ్రమానికి అందించడం నింజగా అభినందనీయం, ఆదర్శనీయం.

ప్రశ్న 2.
సెలవులలో సుశీల్, సునీత, సాగర్లు నాటకం వేశారు కదా! మరి మీరు సెలవులలో ఏమేం చేస్తారు?
జవాబు.
మేము సెలవులలో ఏం చేస్తామంటే….

సెలవులలో సుశీల్, సునీత, సాగర్లు మంచి నాటకం వేసి పదిమందికి సంతోషాన్నిచ్చారు, సహాయాన్నీ అందించారు. ఇప్పటివరకూ మేము సెలవులంటే సరదాగా గడిపేవి మాత్రమే అనుకున్నాం. కానీ ఈ కథ విన్న తర్వాత మా అభిప్రాయాన్ని మార్చుకున్నాం. ఇక నుండి మాకు వచ్చే సెలవులన్నీ మంచి పనులు చేయడానికే ఉపయోగిస్తాం. ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం. అందరూ ఉండి అనాథలుగా బతుకుతున్న పిల్లల్ని వారి తల్లిదండ్రుల వద్దకు చేరేలా చూస్తాం.

ఎవరూ లేని అనాథ వృద్ధుల వద్దకు వెళ్ళి వారితో సరదాగా గడిపి మీకు మేమున్నామంటూ వారిలో ధైర్యాన్ని కలిగిస్తాం. చదువుకోకుండా పనులకు వెళుతున్న బాలలను బడిలో చేర్పించేలా మావంతు కృషి చేస్తాం. పర్యావరణాన్ని రక్షించేందుకు మొక్కల్ని నాటుతాం. ఈ విధంగా మాకు వచ్చే ప్రతి సెలవును ఓ మంచి కార్యానికి ఉపయోగపడేలా చూస్తాం.

ప్రశ్న 3.
సుశీల్, సాగర్, సునీత నాటకం వేసి, దాని ద్వారా డబ్బుపోగుచేసి వృద్ధులకు సహాయపడ్డారుకదా! అట్లాగే ఏఏ మంచి పనులు ఎవరెవరి కోసం చేయవచ్చు?
జవాబు.
ఏఏ మంచి పనులు ఎవరెవరికోసం చేయవచ్చంటే…. :
మంచి పనులు చేయడానికి ముందుగా మంచి మనసుండాలి. మనలోని స్వార్థాన్ని విడిచి పెట్టాలి. అనాథ శరణాలయాల్లో జీవిస్తున్న పిల్లలు, వృద్ధులకు దుస్తులు, పండ్లు అందజేయడం. అంధులకు శారీరక మానసిక వైకల్యం కలిగిన వారికి ప్రత్యేక సదనాలు ఏర్పాటుచేయడం, వారికి అవసరమైన సామాగ్రిని అందజేయడం. అగ్నిబాధిత కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందివ్వడం.

వరద, భూకంప బాధిత కుటుంబాలకు విరాళాలను సేకరించి అందివ్వడం, పేద కుటుంబాల్లో పుట్టి భయంకరమైన జబ్బుల బారిన పడిన వారిని ఆర్థికంగా ఆదుకోవడం. ప్రతిభ కలిగిన పేదరికం అనుభవిస్తున్న వారి చదువుకు ఆసరాగా నిలవడం, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాల్లో క్షతగాత్రులను వైద్యశాలలకు తరలించడం. కేన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధుల బారిన పడిన వారికి మానసిక సంతోషాన్ని అందివ్వడం వంటి మంచి పనులు చేయవచ్చు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు

ప్రశ్న 4.
ఈ కథలో మీకు బాగా నచ్చిన సంఘటన ఏది? ఎందుకు?
జవాబు.
ఈ కథలో మాకు బాగా నచ్చిన సంఘటన :
సెలవులలో ఏం చేయాలో ఎవరికీ తోచట్లేదని సుశీల్ తోటమాలితో చెపుతాడు. అప్పుడు తోటమాలి చక్కటి పూలు కోసి మంచి పూలగుత్తిని మీ అమ్మకివ్వండని అంటాడు. కష్టపడి సుశీల్, సునీత, సాగర్ లు పూలగుత్తులు తయారు చేస్తారు. కానీ వాటిని వాళ్ళ అమ్మకివ్వరు. ఎవరూలేని అనాథలుగా జీవితాన్ని వెళ్ళదీస్తున్న వృద్ధులకు వాటిని అందిస్తారు. ఈ సంఘటన మాకు ఎంతో బాగా నచ్చింది.

ఎందుకంటే… తోటమాలి చెప్పిన మాటలు ఈ చిన్నారుల్లో మంచి ఆలోచనను మొలకెత్తేలా చేశాయి. అమ్మకివ్వడం కంటే ఎవరూ లేకుండా అనాథలుగా బతుకుతున్న వృద్ధులను సంతోషపర్చాలని ఆ చిన్న మనసులు కోరుకోవడం ఎంతో గొప్ప విషయం. అన్నీ ఉండి, అందరూ ఉన్న వారి సంతోషం కన్నా, తమకెవరూ లేరని చింతిస్తున్న అనాథ వృద్ధులను సంతోషపరచాలన్న ఆలోచన మాకెంతో నచ్చింది. అలాగే అమ్మ ప్రేమనూ వీరు మర్చిపోలేదు. ఆశ్రమంలోని వృద్ధులు భోజనం చేయమని అడిగినప్పుడు మా అమ్మ మా కోసం ఎదురుచూస్తుందని చెప్పడం వారికి అమ్మమీదున్న ప్రేమను, గౌరవాన్ని తెలుపుతోంది. అందుకే ఈ సంఘటన మాకు బాగా నచ్చింది.

ప్రశ్న 5.
ఈ కథను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అద్భుతమైన సెలవులు కథ మా సొంతమాటల్లో ….

సుశీల్, సునీత, సాగర్ పాఠశాలకు శీతాకాలపు సెలవులు. వీళ్ళ నాన్నకు పనివత్తిడి వల్ల వీరు సెలవులను సరదాగా గడిపేందుకు ఎక్కడికీ వెళ్ళలేదు. సెలవుల్ని ఎలా గడపాలో వారికి అర్థం కాలేదు. ఈ క్రమంలో తోటమాలి వారికి ఒక మంచి సలహా యిచ్చాడు. పూలగుత్తి తయారుచేసి వాళ్ళ అమ్మకి ఇవ్వమన్నాడు. ఈ సలహా వారిలో ఒక మంచి పనికి నాంది పలికింది. ఈ ముగ్గురూ శ్రమించి పూలగుత్తులు తయారుచేసి వాటిని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అందించారు.

వారిని ఆప్యాయంగా, ప్రేమగా పలకరించారు. వారి అవసరాలు తెలుసుకున్నారు. వారికోసం రేడియో కొనివ్వాలనుకున్నారు. అందుకోసం ఒక ఛారిటీ షో నిర్వహించాలని నిర్ణయించారు. సాగర్ స్నేహితుడు నితిన్తో పాటు అతని చెల్లెళ్ళు తమన్నా, వీణలు కూడా రాత్రింబవళ్ళు శ్రమించారు. విరాళాలు సేకరించి మంచి హాస్యనాటిక ప్రదర్శించారు. వచ్చిన డబ్బుతో రేడియోతో పాటు టేప్లకార్డర్ కూడా వృద్ధాశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా వీరు సెలవుల్ని అద్భుతంగా గడిపి అందరి మన్ననలు పొందారు.

ప్రశ్న 6.
సుశీల్, సాగర్, సునీతల స్థానంలో మీరు ఉంటే, మీ మిత్రులతో కలసి వృద్ధాశ్రమానికి ఎలా సాయపడతారు? ఆలోచించి రాయండి.
జవాబు.
వృద్ధాశ్రమానికి మేము ఎలా సాయపడతామంటే … :

సుశీల్, సాగర్, సునీతల స్థానంలో మేముంటే.. మొదట వృద్ధాశ్రమానికి వెళ్ళి వారితో ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తాం. వారి మంచి, చెడ్డలను ఆరా తీస్తాం. వృద్ధులకు సంబంధించిన కుటుంబీకుల వివరాలను తెలుసుకుంటాం. వారి వద్దకు వెళ్ళి వృద్ధులు పడుతున్న కష్టాలను, బాధలను వారికి వివరిస్తాం. సాధ్యమైనంత మేర వృద్ధులను తిరిగి వారి ఇళ్ళకు పంపే ఏర్పాట్లు చేస్తాం. ఎవరూ లేకుండా అనాథలుగా ఉండిన వారికి మేమే అండగా నిలుస్తాం. వారికి కావల్సిన దుస్తులను, అవసరమైన సామాగ్రిని వారికి అందించేందుకు పెద్దలను కలసి విరాళాలు సేకరించి వాటిని వృద్ధులకు అందజేస్తాం.

పండ్ల వ్యాపారులను కలసి వారానికి ఒకసారి వృద్ధులకు పండ్లు ఇచ్చేలా అభ్యర్థిస్తాం. అనారోగ్యంతో బాధపడేవారిని వైద్యశాలకు తీసుకెళ్ళి వారికి కావల్సిన మందులను ఉచితంగా అందజేస్తాం. సంవత్సరానికి ఒకసారి వారిని మా పెద్దల సహకారంతో విహార యాత్రలకు తీసుకెళ్తాం. వృద్ధాశ్రమం అభివృద్ధికి అందరి సహకారం కోరుతాం. వృద్ధులకు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు అన్ని చర్యలు చేపడతాం.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు

I. అవగాహన – ప్రతిస్పందన:

1. కింది పేరాను చదువండి. దాని క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సెలవుల్లో పిల్లలు వృద్ధాశ్రమంలోని వృద్ధుల కోసం ఒక నాటక ప్రదర్శన చేయాలనుకొన్నారు. సుశీల్ పగలు, రాత్రి కదలకుండా కూర్చొని నాటకానికి సంభాషణలు రాశాడు. మిగతావాళ్ళు ఇంటింటికీ వెళ్ళి, అందరినీ ఆహ్వానించారు. స్కూల్లో నాటకాలు వేయడంలో మంచి అనుభవం ఉన్న నితిన్ ఈ నాటకానికి దర్శకత్వం వహించాడు. నాటక ప్రదర్శనకు రిహార్సళ్ళు మొదలుపెట్టారు. చివరికి ప్రదర్శన రోజు రానే వచ్చింది. పిల్లలు అంతకు ముందురోజు వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజరు దగ్గర అనుమతి తీసుకొనేటందుకు వెళ్ళారు.

ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించాడు. స్టేజీ తయారుచేసుకొన్న తరువాత ప్రేక్షకులు కూర్చోవడం కోసం బల్లలు, కుర్చీలు వేశారు. అవి ఆశ్రమంలో కొన్ని, ఇరుగు పొరుగు ఇళ్ళలో నుండి కొన్ని, తమ ఇళ్ళ,నుండి కొన్ని తెచ్చివేశారు. ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలు తాము సేకరించిన 800 రూపాయల విరాళంతోపాటు, తాము పొదుపు చేసి దాచుకున్న డబ్బులు కలిపి, రేడియోతో పాటు ఒక టేపురికార్డరును కొని వృద్ధాశ్రమానికి ఇచ్చారు. ఆ ఆశ్రమంలోని వృద్ధులంతా పిల్లలను అభినందించారు. అందరినీ దీవించారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పిల్లలు, ఎవరికోసం నాటక ప్రదర్శన చేశారు ?
జవాబు.
వృద్ధుల కోసం

ప్రశ్న 2.
నితిన్ నాటకానికి దర్శకత్వం వహించడానికి గల కారణమేమిటి ?
జవాబు.
నితిన్ స్కూల్లో నాటకాలు వేయడంలో అనుభవం ఉన్నవాడు.

ప్రశ్న 3.
పిల్లలు, ప్రేక్షకుల కొరకు కుర్చీలు ఎట్లా సేకరించారు ?
జవాబు.
ఆశ్రమం నుండి, ఇరుగు పొరుగు ఇళ్ళ నుండి, తమ ఇళ్ళ నుండి సేకరించారు.

ప్రశ్న 4.
పిల్లలు, నాటక ప్రదర్శనకు ఎవరి అనుమతి తీసుకున్నారు ?
జవాబు.
వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజరు దగ్గర నుండి

ప్రశ్న 5.
ఈ నాటక ప్రదర్శన ద్వారా చివరకు పిల్లలు ఏం పొందారు ?
జవాబు.
వృద్ధుల అభినందనలు, దీవెనలు

2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆశ్రమంలో ఉన్న వృద్ధుల గురించి చిన్న పిల్లలు తీసుకుంటున్న శ్రద్ధకు వాళ్ల ముఖాల్లో సంతోషం కనిపించింది. పిల్లలకు వాళ్లందరూ కృతజ్ఞతలు చెప్పారు. వీళ్లు ముగ్గురూ అక్కడే వాళ్లతోపాటు కూర్చొని ముచ్చట్లాడారు. వాళ్లలో కొంతమంది మాట్లాడకుండా కూర్చొని ఉన్నారు. మరికొంత మంది తమ బాధను దాచుకొనేందుకు వాళ్లతో మాట్లాడుతూ, పిల్లలెక్కడుంటున్నారో, ఎక్కడ చదువుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. చివరికి ఆశ్రమంలో భోజనానికి ఉండి పొమ్మని వాళ్లు పిల్లలను బలవంతపెట్టారు. కాని పిల్లలు మాకోసం అమ్మ ఎదురుచూస్తుందని చెప్పారు ?

ప్రశ్నలు:

ప్రశ్న 1.
వృద్ధుల ముఖాల్లో సంతోషం ఎందుకు కనిపించింది ?
జవాబు.
చిన్న పిల్లలు తమ గురించి తీసుకుంటున్న శ్రద్ధకు

ప్రశ్న 2.
పిల్లలకు కృతజ్ఞత చెప్పింది ఎవరు ?
జవాబు.
వృద్ధులు

ప్రశ్న 3.
పై పేరాకు శీర్షికను సూచించండి.
జవాబు.
వృద్ధుల పట్ల గల శ్రద్ధ

ప్రశ్న 4.
పిల్లలు ఆశ్రమంలో ఎందుకు ఉండము అని అన్నారు ?
జవాబు.
వాళ్ళ అమ్మ ఎదురుచూస్తుందని

ప్రశ్న 5.
వృద్ధులందరూ ఒకచోట ఉండే ఆశ్రమాన్ని ఏమంటారు?
జవాబు.
వృద్ధాశ్రమం

TS 7th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు

3. క్రింది గద్యభాగం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

పిల్లలందరూ ఇంట్లోంచి బయటికి వచ్చి లాన్లో గడ్డిని కోస్తున్న తోటమాలి దగ్గరికి వెళ్ళారు. అతను “ఏమిటి సుశీల్ బాబూ! తోటపనిలో మెలకువలు నేర్చుకుంటావా?” అని అడిగాడు సుశీల్ని.
“అది కాదు తాతా,” బాధగా అన్నాడు సుశీల్. “మాకందరికి సెలవులిప్పుడు. ఏం చేయాల్నో ఎవరికీ తోస్తలేదు.” “చక్కటి పూలు తెంపి మంచి పూలగుత్తి చేసి మీ అమ్మకు ఇయ్యండి. ఆమె తప్పకుండ సంతోషిస్తుంది.”

“ప్స్ ….. ఇంకేం చేద్దాం? కొన్ని పూలుకోసి చక్కటి పూలగుత్తి తయారుచేద్దాం పదండి,” అన్నాడు సుశీల్. గులాబిపూలు చాలా బాగున్నవి. చామంతిపువ్వులు తాజాగా, అందంగా ఉన్నాయి. తోట వందలకొద్ది పూలతో కళకళలాడుతూ ఉన్నది. వాటిలో వేటిని తెంపాలో, మొగ్గలుగా ఉన్న కారణంగా వేటిని తెంపగూడదో తోటమాలి తాతయ్య చెప్పాడు. చక్కటి పూలగుత్తి తయారైంది. “దీన్ని చూసి సంతోషించేవాళ్ళుండే చోటికి తీసుకుపోయి ఇద్దాం! సరేనా?” అన్నాడు సాగర్.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
తోటమాలి ఏం చేస్తున్నాడు?
జవాబు.
తోటమాలి లాన్లో గడ్డిని కోస్తున్నాడు.

ప్రశ్న 2.
తాత పిల్లలకిచ్చిన సలహా ఏమిటి?
జవాబు.
“చక్కటి పూలు తెంచి మంచి పూలగుత్తి చేసి అమ్మకు ఇయ్యండి” అని తాత పిల్లలకు సలహా ఇచ్చాడు.

ప్రశ్న 3.
తాజాగా ఉన్న పూలేవి?
జవాబు.
తాజాగా ఉన్న పూలు చామంతి పువ్వులు.

ప్రశ్న 4.
తోట ఎలా ఉంది?
జవాబు.
తోట వందలకొద్ది పూలతో కళకళలాడుతూ ఉంది.

ప్రశ్న 5.
పూలగుత్తిని ఎక్కడివ్వాలి అనుకున్నారు?
జవాబు.
పూలగుత్తిని చూసి సంతోషించే వాళ్ళుండే చోటికి తీసుకుపోయి ఇవ్వాలనుకున్నారు.

4. క్రింది గద్యభాగం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

సునీత ఒప్పుకొంటూ ఇట్లా అన్నది. “మనం దీన్నొక ఛారిటీ షో లాగ చేస్తే బాగుంటుంది. కొన్ని టికెట్లు ఇరుగుపొరుగువాళ్ళకు అమ్ముదాం. ఇట్లా మనం జమచేసే డబ్బుతో కనీసం రేడియోసెట్టయినా కొని ఇవ్వవచ్చుగా!” అంతే, వెంటనే సాగర్ నితిన్ ఇంటికి వెళ్ళాడు. మరో రెండు గంటలకల్లా సాగర్ నవ్వుతూ, తుళ్ళుతూ గర్వంగా ఇంటికొచ్చి నితిన్ సాయంత్రమే తన పిన్ని ఇద్దరు కూతుళ్ళతో పాటు వాళ్ళింటికొస్తున్నాడని ప్రకటించాడు. ఇంక చేయవలసింది చాలా ఉన్నది. “మరి టికెట్లెక్కడ ప్రింట్ చేయిద్దాం?” సునీత అడిగింది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
నాటకాన్ని ఎలాగ చేయాలనుకున్నారు?
జవాబు.
నాటకాన్ని ఛారిటీషో లాగా చేయాలనుకున్నారు.

ప్రశ్న 2.
రేడియోకు డబ్బులు ఎలా జమ చేయాలనుకున్నారు?
జవాబు.
టికెట్లను ఇరుగుపొరుగువారికి అమ్మడం ద్వారా రేడియోకు డబ్బులు జమ చేయాలనుకున్నారు.

ప్రశ్న 3.
నాటకం ద్వారా వచ్చిన డబ్బుతో ఏమి చేయాలనుకున్నారు?
జవాబు.
నాటకం ద్వారా వచ్చిన డబ్బుతో రేడియో కొనాలనుకున్నారు.

ప్రశ్న 4.
సునీత ఏమి అడిగింది?
జవాబు.
టికెట్లను ఎక్కడ ప్రింట్ చేయిద్దాం అని సునీత అడిగింది.

ప్రశ్న 5.
విరాళాలు ఎలా అడగాలనుకున్నారు?
జవాబు.
తెలిసినవాళ్ళను, ఇరుగుపొరుగు వాళ్ళను ప్రదర్శనకు రమ్మని తోచిన విరాళం అడగాలనుకున్నారు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు

5. క్రింది గద్యభాగం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

మూడోరోజున నాటక ప్రదర్శనకు రిహార్సళ్ళు మొదలయినవి. స్కూల్లో నాటకాలు వేయటంలో మంచి అనుభవమున్న నితిన్ ఈ నాటకానికి దర్శకత్వం వహించాడు. ప్రదర్శనకు వారం రోజులు ఎట్లా గడిచిపోయాయో వాళ్ళకే తెలియలేదు. ప్రతిరోజూ కనీసం మూడుగంటలు రిహార్సళ్ళు చేసేవాళ్ళు. తక్కిన రోజంతా స్టేజి ఎట్లా ఉండాలి, దుస్తులెట్లా ఉండాలి, ఇరుగుపొరుగువాళ్ళనెట్లా ఆహ్వానించాలి ఇట్లాంటి విషయాలను గురించిన చర్చలే.

చివరికి ప్రదర్శన రోజు రానే వచ్చింది. అంతకు ముందురోజే వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజరు దగ్గరి నుంచి అనుమతి తీసుకొనేటందుకు పోయారు. ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించాడు. అక్కడి వృద్ధులకు ఆశ్చర్యం కలిగేలా ఒక్కరోజు ముందు మాత్రమే వాళ్ళకోసం తాము వేస్తున్న నాటకాన్ని గురించి చెప్పారు. ప్రదర్శన రోజున పొద్దుటి నుంచే పిల్లలు తమకోసం వేస్తున్న నాటకం కోసం ఆ ఆశ్రమంలోని వాళ్ళంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
నాటకం ఎవరి దర్శకత్వంలో జరిగింది?
జవాబు.
నాటకం నితిన్ దర్శకత్వంలో జరిగింది.

ప్రశ్న 2.
ఎవరి దగ్గరి నుంచి అనుమతి తీసుకొనేటందుకు పోయారు?
జవాబు.
వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజరు దగ్గరి నుంచి అనుమతి తీసుకొనేటందుకు పోయారు.

ప్రశ్న 3.
పిల్లలు అధికంగా దేన్ని గురించి చర్చించేవారు?
జవాబు.
పిల్లలు స్టేజి ఎట్లా ఉండాలి, దుస్తులెట్లా ఉండాలి, ఇరుగుపొరుగువారినెట్లా ఆహ్వానించాలి అనే అంశాలపై అధికంగా చర్చించేవారు.

ప్రశ్న 4.
వృద్ధులకు నాటక ప్రదర్శన గురించి ఎప్పుడు చెప్పారు?
జవాబు.
వృద్ధులకు నాటక ప్రదర్శన గురించి ఒకరోజు ముందు చెప్పారు.

ప్రశ్న 5.
ఆశ్రమంలోని వారు ఎందుకు ఎదురు చూస్తున్నారు?
జవాబు.
తమకోసం వేస్తున్న నాటకం కోసం ఆశ్రమంలోని వారు ఎదురు చూస్తున్నారు.

పాఠ్యభాగ సారాంశం:

సుశీల్, సునీత, సాగర్ కు శీతాకాలంలో సెలవులు ఇచ్చారు. వారు ముగ్గురూ ఇంట్లోనే ఉంటూ కలసి ఆడుకోవడం తప్ప వేరే పనిలేదు. వాళ్ల స్నేహితులు చాలామంది వాళ్ళ అమ్మానాన్నలతో బంధువుల ఊళ్ళకు వెళ్ళారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాలా పని ఉండడం వల్ల ఎక్కడికీ వెళ్ళలేకపోయారు.

వాళ్ళు ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళ పిన్ని- సావిత్రి “ఏమిటిది ? వెళ్ళండి. పనికి అడ్డురాకండి. బయటికెళ్ళి ఆడుకోండి” అంది.

పిల్లలందరూ ఇంట్లోంచి బయటకు వచ్చి లాన్లో గడ్డికోస్తున్న తోటమాలి దగ్గరికి వెళ్ళారు. ఏం చేయాలో తెలియటం లేదని, తమకు సెలవులని తోటమాలితో చెప్పారు. అక్కడ ఉన్న పూలతో పూలగుత్తి తయారుచేసి, మీ అమ్మగారికి ఇవ్వమని తోటమాలి సలహా ఇచ్చాడు. “సరే ఇంకేం చేస్తాం” అనుకుంటూ వాళ్ళు అక్కడున్న అందమైన పూలతో మాలలు కట్టి, “మనకు ఉత్సాహంగా లేకపోయినా, కనీసం అది లేని వాళ్ళకు, ఉత్సాహాన్ని ఇచ్చే పనులు చెయ్యాలి.”

TS 7th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson అద్భుతమైన సెలవులు

కాబట్టి ముసలివాళ్ళు ఉండే వృద్ధాశ్రమానికి వెళ్ళి, ఈ పూలగుత్తి వాళ్ళకు ఇద్దామనుకొని పది నిమిషాల నడక దూరంలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురూ అక్కడే వారితోపాటు కూర్చొని కబుర్లు చెప్పారు. వాళ్ళు రోజంతా ఏ విధంగా గడుపుతారో తెలుసుకున్నారు. వాళ్ళకి కాలక్షేపానికి ఏమీ లేదని తెలుసుకొని బాధపడ్డారు. వాళ్ళకోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

తమ స్నేహితుల సహాయంతో, ఇరుగు పొరుగు వారి ప్రోత్సాహంతో వృద్ధాశ్రమంలోని స్టేజీమీద నాటకాన్ని ప్రదర్శించారు. ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలు బాగా నటించారని అందరూ అభినందించారు. నాటకంలోని హాస్యసన్నివేశానికి అందరూ విరగబడి నవ్వుతూ ఆనందించారు.

నాటక ప్రదర్శన తరువాత 800 రూపాయలు విరాళాల ద్వారా సేకరించామని, దానికి తాము పొదుపుచేసి దాచుకున్న డబ్బులు కలిపి రేడియోతో పాటు ఒక టేప్లకార్డర్ కూడా వృద్ధాశ్రమానికి కొని ఇవ్వగలుగుతామని ప్రకటించారు. ఈ విధంగా సెలవులను పెద్దవాళ్ళ ఆనందం కోసం వినియోగించిన పిల్లలను చూసి వృద్ధులు చాలా ఆనందించారు. అందరినీ
దీవించారు.

Leave a Comment