Telangana SCERT 7th Class Telugu Guide Telangana 7th Lesson శిల్పి Textbook Questions and Answers.
TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి
బొమ్మలను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి: (TextBook Page No.64)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై బొమ్మలను చూడండి. అవి వేటితో తయారైనాయి ?
జవాబు.
పై బొమ్మలు రాతితో, శిల్పాలతో తయారైనాయి.
ప్రశ్న 2.
ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి ? వాటి గురించి మీకు తెలిసింది చెప్పండి.
జవాబు.
ఇవన్నీ శిల్పకళకు సంబంధించినవి. కళలలో (అరవైనాలుగు) శిల్పకళ ఒకటి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
ప్రశ్న 3.
శిల్పాలను తయారుచేసేవారిని ఏమంటారు ? వారి గురించి మీకు తెలిసింది చెప్పండి.
జవాబు.
శిల్పాలను తయారుచేసేవారిని శిల్పులు అంటారు. నిర్జీవమైన రాళ్ళకు జీవం పోసి గొప్ప శిల్పాలుగా తయారుచేసే నైపుణ్యం వారిలో ఉంటుంది.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.66)
ప్రశ్న 1.
భక్తిభావం పెంపొందడానికి శిల్పి ఎట్లా దోహదపడతాడు ?
జవాబు.
శిల్పి పనికిరాని, మూలపడియున్న బండరాళ్ళను తన ఉలిదెబ్బలతో చక్కని దైవరూపాన్ని చిత్రిస్తున్నాడు. దాంతో ఆ శిల్పానికి పసుపుకుంకుమలు పూసి భక్తిభావంతో నమస్కరిస్తున్నాడు. ఈ రకంగా శిల్పి శిల్పాలకు చక్కని రూపాన్ని కల్పించాడు. దాంతో వాటిపై భక్తిభావం కలుగుతుంది.
ప్రశ్న 2.
రాతికంబమునకు “కుసుమ వల్లరులు” కూర్చడమంటే మీరేమనుకుంటున్నారు ?
జవాబు.
రాతి స్థంభాలకు పూలతీగలను కూర్చడమంటే శిల్పి తన ఉలితో, శిల్పికళా నైపుణ్యంతో పూల తీగెలను తీర్చిదిద్దాడని భావం. అనగా శిల్పులు అంతట నైపుణ్యం కలవారని కవి ఆశయం.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.67)
ప్రశ్న 1.
“కంటతడీ పెట్టడం” అంటే ఏమిటి ? శిల్పిని చూసి ఎందుకు కంటతడి పెట్టాల్సి వస్తున్నది?
జవాబు.
‘కంటతడి పెట్టడం’ అంటే కన్నీరు కార్చడం అని అర్థం. శిల్పి విద్యలో నిధి వంటివాడు. ధనంలో దరిద్రుడు. అందువలన శిల్పి దారిద్ర్యాన్ని చూసి కంటతడి పెట్టాల్సి వస్తున్నది.
ప్రశ్న 2.
శిల్పి సంతోషపడేదెప్పుడు ?
జవాబు.
తాను చెక్కిన అద్భుత శిల్పాలను చూచి సహృదయులు, దాతలు మెచ్చుకున్నప్పుడు తాను పడిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరికినప్పుడు శిల్పి సంతోషపడతాడు.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.67)
ప్రశ్న 1.
కవికి, శిల్పికి మధ్యగల పోలికలు చెప్పండి.
జవాబు.
కవి | శిల్పి |
1) కవి కలంలో అలంకార రచన ఉంటుంది. | 1) శిల్పి ఉలిలో అలంకార రచన ఉంటుంది. |
2) కవి పత్రాలపై పద్యాలు రాసి రాజుకు అందిస్తాడు. | 2) శిల్పి శిల్పాలపై రాజు కథను చిత్రించి అందిస్తాడు. |
3) కవి కవిత్వంతో రాజును ఆనందింప చేస్తాడు. | 3) శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో రాజును ఆనందింప చేస్తాడు. |
ప్రశ్న 2.
శిల్పికి శాశ్వతత్వం ఎప్పుడు వస్తుంది ?
జవాబు.
శిల్పాలలోని అద్భుత శిల్ప సంపద ద్వారా శిల్పికి శాశ్వతత్వం వస్తుంది. అట్టి శిల్పి ప్రజల హృదయాల్లో నిలుస్తాడు.
ప్రశ్న 3.
శిల్పిని “మహాపుణ్యుండవయ్యా” అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
శిల్పి బండరాళ్ళలో కూడా జీవకళను నిలుపగలడు. సుత్తిలో నుంచి మానవ విగ్రహాలు పుడతాయి. ప్రతిసృష్టి చేయగల శిల్పి నిజంగా పుణ్యమూర్తి.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
కవి శిల్పిని శాశ్వతుడనీ, ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయుమని చెప్పాడు కదా ! దీనిమీద మీ అభిప్రాయాన్ని చెప్పండి.
జవాబు.
‘శిల్పి’ ఎపుడూ శాశ్వతమైనవాడు. అంటే శిల్పి తాను చెక్కిన శిల్పాలు ఉన్నంతకాలం, ప్రజలు అతడిని గుర్తు చేసుకుంటారు. అతని శిల్పకళాచాతుర్యానికి మెచ్చుకొని జోహార్లు సమర్పిస్తారు. అందువల్ల శిల్పి ఎపుడూ శాశ్వతుడు. గొప్పగా శిల్పాన్ని చెక్కిన శిల్పికి మనము ఈయగలిగిన కానుక ఏముంటుంది ? తలవంచి మనం ఆయన శిల్పకళా గొప్పతనానికి నమస్కారము చేయడము తప్ప.
ప్రశ్న 2.
శిల్పకళ వలె నీకు తెలిసిన ఇతర కళలేవి ? ఆయా కళాకారుల గొప్పదనమేమిటి ?
జవాబు.
శిల్పకళ వలె నాకు తెలిసిన ఇతర కళలు చాలా ఉన్నాయి. కవిత్వం, చిత్రకళ, నాట్యకళ, వాద్య సంగీతం, గాత్ర సంగీతం వంటివి కూడా కళలే. ఆయా కళాకారులు తాము నేర్చుకున్న కళలను ఎంతో నైపుణ్యంతో ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతారు.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
ప్రశ్న 1.
కింది పద్యపాదాలు పాఠంలోని ఏయే పద్యాలలో ఉన్నాయి. వాటి సందర్భమేమిటి ?
అ) బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు.
జవాబు.
ఈ పద్యపాదము “సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి” అనే పద్యంలో ఉంది. శిల్పి తన సుత్తితో బండరాళ్ళను చెక్కగా ఆ రాళ్ళు, దేవుళ్ళుగా మారి పసుపు కుంకుమలతో పూజింపబడ్డాయని కవి జాషువా చెప్పిన సందర్భములోనిది.
ఆ) తారతమ్యంబు లే దబద్ధంబు గాదు.
జవాబు.
ఈ పద్యపాదము ‘ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత’ అనే పద్యంలోనిది. “కవిత్వంలో చిత్రములు కూర్చే కవికి, శిల్పికి తేడా లేదు. ఆ మాట అబద్ధం గాదు” అని కవి జాషువా చెప్పిన సందర్భములోనిది.
ఇ) తాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
జవాబు.
ఈ పద్యపాదము ‘అల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి’ అనే పద్యములోనిది. శిల్పి రాళ్ళల్లో నిద్రించే శిల్పములను లేపి ఉలిని తగిలించి బయటకు పిలుస్తాడనీ, శిల్పి శాశ్వతుడనీ కవి జాషువా చెప్పిన సందర్భములోనిది.
ఈ) శిల్పిజగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో గల
జవాబు.
ఈ పద్యపాదము ‘తెలిఱతిన్ జెలువార’ అనే పద్యంలోనిది. శిల్పి తెల్లని రాతిపై అప్సరస స్త్రీని చెక్కి దాని ప్రక్కన తనను తాను దిద్దుకొని సంతోషిస్తాడు. శిల్పి జగత్తులో అతడు చిరంజీవత్వమును కల్పించుకుంటాడు అని కవి చెప్పిన సందర్భంలోనిది.
ప్రశ్న 2.
కవికి – శిల్పికి మధ్య పోలికలున్న పద్యాలు ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఏయే పద్యాల్లో ఉన్నాయో గుర్తించి వాటిని రాయండి.
జవాబు.
కవికీ – శిల్పికీ మధ్య పోలికలు చెప్పే పద్యాలు ఇవి
1) “కవి కలంబున గల యలంకార రచన
కలదు కలదోయి శిల్పి నీయులి ముఖమున” – అనే పద్యం
2) “గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు” – అనే పద్యం
ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదువండి. ఐదు ప్రశ్నలు తయారుచేయండి.
జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళలను జానపదకళలు అంటారు. యక్షగానం, వీధినాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథ వంటివి కొన్ని జానపదకళారూపాలు. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనపైన ఉన్నది.
చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకునే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీనుల విందుగా ఉండే గానకళ సంగీతం. రాళ్ళను చెక్కి అనేక భావాలను మనసులో కలిగించే కళ శిల్పకళ. రాగ, తాళ, లయలకు తగిన విధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.
జవాబు.
ప్రశ్నలు :
1. ‘జానపద కళలు’ అని వేటిని పిలుస్తారు ?
2. కొన్ని జానపద కళారూపాలను పేర్కొనండి.
3. లలితకళలు ఏవి ?
4. నృత్యకళ అంటే ఏమిటి ?
5. ‘కవిత్వం’ లక్షణం పేర్కొనండి.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) శిల్పి రాళ్లలో ఏయే రూపాలను చూసి ఉంటాడు ?
జవాబు.
శిల్పి రాళ్ళలో దేవతామూర్తులను చూసి ఉంటాడు. అందమైన రాతిస్తంభాలపై పూలగుత్తులను చూసి ఉంటాడు. దేవాలయాలను చూసి ఉంటాడు. ఏనుగునూ, గున్న ఏనుగులనూ చూసి ఉంటాడు. అజంతా చిత్రాలను చూసి ఉంటాడు.
ఆ) నల్లని రాళ్ళకు శిల్పిమీద కృతజ్ఞత ఎందుకుండాలి ?
జవాబు.
నల్లని రాళ్ళు కొండలమీదనే పడి ఉంటే, అవి బండరాళ్ళగానే మిగిలిపోయేవి. కానీ శిల్పి చేతిలోపడి అవి దేవతా మూర్తులు అయ్యాయి. దేవాలయాలు అయ్యాయి. అవి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి నల్లని రాళ్ళు, శిల్పి మీద కృతజ్ఞత చూపాలి.
ఇ) కవికీ, చిత్రకారుడికీ ఉండే పోలికలు, భేదాలు ఏమిటి ?
జవాబు.
కవి కవిత్వంలో మాటలతో చిత్రములు గీస్తాడు. కవి వర్ణనలతో ఎంతటి విషయాన్నైనా పాఠకుల మనస్సులకు హత్తేటట్లు చిత్రములను నిర్మిస్తాడు. కాగా చిత్రకారుడు కాగితంపైననో, కాన్వాసుపైనో రంగులతో చిత్రాలు గీస్తాడు. కవి గీసే చిత్రాలకు కవి మనసే హద్దు. దానికి ఎల్లలు లేవు. కానీ చిత్రకారుడు గీసే చిత్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి.
ఈ) చూసే వాళ్ళకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవని కవి ఎందుకు అన్నాడు ?
జవాబు.
ఒక మహారాజు చరిత్రను శిల్పములుగా చెక్కితే, వాటిని చూసేవారికి ఆ మహారాజు చరిత్ర తెలుస్తుంది. ఆ శిల్పాలను చూసి ఆ రాజు చరిత్రను తెలుసుకోవచ్చు. ఆ శిల్పాలు ఆ రాజుల కథలను కళ్ళకు కట్టిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయ రాజుల వంటి వారి శిల్పాలు చూపరులకు వారి చరిత్రలను గుర్తుకు తెస్తాయి. అందువల్ల చూసేవారికి శిల్పాలు రాజుల కథలను చెప్పగలవని కవి చెప్పాడు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) తెలంగాణ రాష్ట్రంలోని శిల్పకళాసంపదను గురించి వ్యాసం రాయండి.
జవాబు.
రాయి, లోహము, కఱ్ఱ, మట్టి మొదలయిన వాటితో దేవతా విగ్రహాలనూ, మందిరాలను నిర్మించే విద్య శిల్పకళ. తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు. నాటి ఓరుగల్లు, నేటి వరంగల్లులో కాకతీయులు నృత్యం, శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం వంటి కళలను పోషించినట్లు చరిత్ర మనకు చెబుతున్నది. నాటి ఓరుగల్లు కోట, రామప్పగుడి, వేయిస్తంభాలగుడి రుద్రమదేవి కాలంలో వైభవంతో వెలుగొందాయి.
రామప్పగుడి, వేయిస్తంభాలగుడిలో ఒక్కొక్క శిల్పములో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో స్తంభాలన్నీ నేలను తాకకుండా నిర్మించబడి ఉంటాయి. అలాగే హనుమకొండలోని నంది విగ్రహాలు కూడా అందాలు చిందిస్తూ ఉంటాయి. మనం దూరం నుండి చూసినపుడు విగ్రహాలు ప్రాణాలతో కూర్చున్న పెద్ద ఎద్దుల వలె ఉంటాయి.
శిల్పుల ఉలి దెబ్బలచే రాళ్ళు, వివిధ భంగిమలతో అందాలను విరజిమ్మే విగ్రహాలుగా రూపొందుతున్నాయి.
(లేదా)
ఆ) శిల్పి గొప్పదనాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
శిల్పి చిరంజీవి. అతడు చెక్కిన శిల్పాలు జీవకళతో నేటికీ నిలిచి ఉన్నాయి. అతడు సింహాల శిల్పాలను చెక్కితే అవి నిజమైన సింహాలేమో అనే భ్రాంతిని కలిగిస్తాయి. పూర్వం మహారాజులు శిల్పకళను పోషించారు. ఎన్నో దేవాలయాలు కట్టించేవారు. అందువలన ఆనాటి శిల్పులకు దారిద్ర్యము లేదు. ఈ శిల్పాలలో ఒక్కొక్క రాజులు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించారు.
హోయసల రాజులు ‘హళేబీడు’లో అందమైన శిల్పాలు చెక్కించారు. అక్కడే ‘జక్కన’ శిల్పాలున్నాయి. శిల్పాలు గాంగరాజులవి. ఓరుగల్లులో శిల్పము కాకతీయ రాజులది. ఈ శిల్ప విద్య నేర్చుకునే కళాశాలలను స్థాపించాలి. ప్రభుత్వము శిల్పవిద్యకు ప్రోత్సాహం ఇవ్వాలి. శిల్పారామాలు నిర్మించాలి. పూర్వం శిల్పులు చెక్కిన శిల్పాలను రక్షించాలి. లేపాక్షిలోని బసవన్న వంటి విగ్రహ శిల్పులు ఇక పుట్టరని నా నమ్మకం.
IV. సృజనాత్మకత / ప్రశంస:
శిల్పిని గురించి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా ప్రదర్శించండి.
ఉదా : నేను తెలుసా ! నేను రాళ్లను చెక్కె ……………………
జవాబు.
నేను మీకు తెలుసా ? నేను రాళ్ళను బొమ్మలుగా చెక్కే శిల్పిని. నేను రాళ్ళను దేవుడి బొమ్మలుగా చెక్కితే, మీరు వాటిని పసుపు కుంకాలతో పూజిస్తున్నారు. పూర్వం మహారాజులు మాకు ఎంతో డబ్బు ఇచ్చి దేవాలయాలలో శిల్పాలు చెక్కించేవారు. మీరు మేము చెక్కిన నంది విగ్రహాలు, నాట్యప్రతిమలు లొట్టలు వేసుకుంటూ చూస్తారు. చూసినంతసేపూ ఓహో, ఆహా అంటారు. కానీ మీలో ఒక్కరూ నన్ను పోషించరు. మరి నన్ను ఎవరు చూస్తారు ? దేవుడి బొమ్మలు చెక్కే నాకు, ఇంక దేవుడే దిక్కు.
V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాలు మీ పాఠంలోనివే ! వీటిలో గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని వాటితో వాక్యాలను తిరిగి రాయండి.
అ) భయద సింహముల తలలు
జవాబు.
భయము కలిగించే సింహముల తలలు
ఆ) వసుధ గన్పట్టు పర్వతములందు
జవాబు.
భూమి మీద కనిపించే పర్వతములందు.
ఇ) శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను
జవాబు.
నిశ్చయంగా నీవు శాశ్వతుడవు.
ఈ) తెనుగుందేశము నిన్నువంటి పనివానిం జూచి యుప్పొంగుచుండును
జవాబు.
నీవంటి పనిమంతుడిని చూసి తెలుగుదేశం ఉప్పొంగుతుంది.
ఉ) నీ సుత్తెలో మొలుచు న్మానవ విగ్రహంబులు
జవాబు.
నీ సుత్తి నుండి మనుష్య రూపాలు పుడతాయి.
2. కింది వాక్యాల్లో ఉన్న ప్రకృతి – వికృతులను గుర్తించి రాయండి.
అ) సింగం బావిలో తన మొగాన్ని చూసి అది మరో సింహం ముఖమని అనుకొన్నది.
జవాబు.
సింహం
ఆ) కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాగూడదు.
జవాబు.
స్తంభాలు – కంబాలు
ఇ) నిద్ర మనకు అవసరమే కాని మనమే నిద్దుర మొహాలం కాగూడదు.
జవాబు.
నిద్ర – నిద్దుర
ఈ) పేదలకు సహాయం చేయడం పున్నెం. ఆ పుణ్యమే మనను నిలుపుతుంది.
జవాబు.
పుణ్యం – పున్నెం
3. సూచనల ఆధారంగా పాఠ్యాంశంలోని పదాలతో గడులు నింపండి.
(గళ్ళ నుడికట్టు)
ఆధారాలు :
అడ్డం:
1) శిల్పాలు చరిత్రను
2) కవి చేతిలోనిది
3) దేవళంలో ‘ళం’ తీసేస్తే
4) మూడో పద్యం రెండోపాదంలో మొదటి పదం చివరి అక్షరం లోపించింది.
5) శిల్పంగా మారేది
6) శిల్పి ప్రజ్ఞకు మనం సమర్పించేది
నిలువు:
1) ఈ పదం భూమికి మరో అర్థం
2) కవిత్వం చెప్పడాన్ని ఇట్లా అంటారు.
3) రాతికి మరో పదం తలకిందులైంది.
4) “స్వప్నం” పర్యాయపదం
5) శిలను శిల్పంగా మలిచేవాడు.
6) బొమ్మలు అని అర్థమున్న పదంలో మొదటి అక్షరం లోపించింది.
జవాబు.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
సవర్ణదీర్ఘ సంధి:
కింది పదాలను పరిశీలించండి. సంధి జరిగిన విధానం గమనించండి.
అ) శివాలయం శివ + ఆలయం = అ + ఆ = ఆ
ఆ) మునీంద్రుడు = ముని + ఇంద్రుడు = ఇ + ఇ = ఈ
ఇ) భాసూదయం = భాను + ఉదయం = ఉ + ఉ = ఊ
ఈ) మాతౄణం = మాతృ + ఋణం = ఋ + ఋ = ౠ
పై పదాలను విడదీసినపుడు మొదటి (పూర్వ), రెండవ (పర) పదాల్లో ఒకేరకమైన అచ్చులున్నాయికదా ! అట్లా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటివాటి దీర్ఘాలు వచ్చాయి.
అ/ఆ + అ/ఆ = ఆ
ఇ/ఈ + ఇ/ఈ = ఈ
ఉ/ఊ + ఉ/ఊ = ఊ
ఋ/ౠ + ఋ/ౠ = ౠ
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు (సవర్ణాలు) వచ్చి చేరినపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీనినే సవర్ణదీర్ఘసంధి అంటాం.
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
‘ఏకాదేశం’ అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం.
ఒకే రకమైన అచ్చులను ‘సవర్ణాలు’ అంటాం.
1. కింది పదాలను విడదీయండి.
ఉదా : హిమాలయం = హిమ + ఆలయం = (అ + ఆ = ఆ)
1. కిరీటాకృతి = కిరీట + ఆకృతి = (అ + ఆ = ఆ)
2. మహానందం = మహా + ఆనందం = (అ + ఆ = ఆ)
3. మహీంద్రుడు = మహి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ)
4. గురూపదేశం = గురు + ఉపదేశం = (ఉ + ఉ = ఊ)
5. కోటీశ్వరులు = కోటి + ఈశ్వరులు = (ఇ + ఈ ఈ)
6. మాతౄణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ౠ)
ప్రాజెక్టు పని:
మీ గ్రామం / ప్రాంతంలోని కళలను గురించి, కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ గొప్పదనాన్ని గురించి నివేదిక రాయండి.
జవాబు.
మా గ్రామంలో ఎక్కువగా జానపద కళలు – బుర్రకథలు, హరికథలు ఎక్కువ వాడుకలో ఉంటాయి.
మాది వరంగల్ జిల్లా హనుమకొండ ప్రాంతము. మేము వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాము.
మా గ్రామంలో SBPK సత్యనారాయణరావుగారు అనే జమీందారుగారు ఉండేవారు. ఆయనకు ‘హరికథ’ అనే కళారూపం అంటే చాలా ఇష్టము. మా గ్రామంలో హరికథను చెప్పడం, నేర్పే పాఠశాలను ఆయన స్థాపించారు.
బుర్రకథ :
బుర్రకథను తంబుర డక్కీ కథలని వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిలో వీరకథలకు సంబంధించిన కథలే ఎక్కువగా ఉంటాయి. బుర్రకథా పితామహుడు నాజర్, బుర్రకథలో సాధారణంగా “వినరా భారత వీరకుమార విజయం మనదేరా” తందాన తాన అని వంతలు పాడతారు.
TS 7th Class Telugu 7th Lesson Important Questions శిల్పి
I. అవగాహన-ప్రతిస్పందన:
అపరిచిత పద్యాలు:
1. ఈ క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు సమాధానాలు రాయండి.
ఆత్మశుద్ధిలేని యాచారమదియేల?
‘భాండశుద్ధిలేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు :
ప్రశ్న 1.
‘ఆచారము’ ఎలా ఉండాలి?
జవాబు.
ఆచారము ఆత్మశుద్ధి కలిగి యుండాలి.
ప్రశ్న 2.
‘పాకము’ ఎలా ఉండాలి?
జవాబు.
పాకము భాండశుద్ధి కలిగి యుండాలి.
ప్రశ్న 3.
శివపూజకు ఏది ముఖ్యము?
జవాబు.
శివపూజకు చిత్తశుద్ధి ప్రధానము.
ప్రశ్న 4.
ఈ పద్యం, ఏ శతకంలోనిది?
జవాబు.
ఈ పద్యం, వేమన శతకంలోనిది.
ప్రశ్న 5.
“వంటకు పాత్ర పరిశుభ్రంగా ఉండాలి” అనే అర్థం వచ్చే పాదం ఏది?
జవాబు.
రెండవ పాదానికి, పాత్ర పరిశుభ్రంగా ఉండాలి అనే అర్థం వస్తుంది.
2. క్రింది పద్యాన్ని చదివి, దాని కింది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కనకపు సింహాసనమున
శునకముఁగూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగఁ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
కనకపు సింహాసనము అంటే ఏమిటి?
జవాబు.
కనకపు సింహాసనము అంటే బంగారు సింహాసనము.
ప్రశ్న 2.
సింహాసనం మీద ఎవరికి పట్టము గట్టారు?
జవాబు.
సింహాసనం మీద శునకానికి పట్టము కట్టారు.
ప్రశ్న 3.
‘శునకము’ అంటే
ఎ) సింహము
బి) కుక్క
సి) పంది
డి) ఏనుగు
జవాబు.
(బి) శునకము అంటే “కుక్క”.
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకము లోనిది?
జవాబు.
ఈ పద్యము సుమతీ శతకము లోనిది.
ప్రశ్న 5.
వెనుకటి గుణం మాననిది ఏది?
జవాబు.
వెనుకటి గుణం మాననిది ‘శునకము’ అనగా కుక్క
3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గురువు లేక విద్య గురుతుగా దొరకదు
నృపతిలేక భూమి నియతిగాదు
గురువు విద్యలేక గొప్ప పండితుడౌవె
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
విద్య క్షుణ్ణంగా రావాలంటే, ఏమి ఉండాలి?
జవాబు.
విద్య క్షుణ్ణంగా రావాలంటే, “గురువు” ఉండాలి.
ప్రశ్న 2.
‘నృపతి లేని రాజ్యంలో క్రమశిక్షణ ఉండదు’ అనే అర్థం ఇచ్చే పాదం ఏది?
జవాబు.
పై అర్థం వచ్చే పాదము రెండవ పాదము.
ప్రశ్న 3.
ఈ పద్యమును రచించిన కవి ఎవరు?
జవాబు.
ఈ పద్యాన్ని వేమన మహాకవి రచించాడు. ఇది వేమన శతకంలోనిది.
ప్రశ్న 4.
గొప్ప పండితుడు కావాలంటే ఏమి ఉండాలి?
జవాబు.
గొప్ప పండితుడు కావాలంటే, గురువు వద్ద విద్య చదవాలి.
ప్రశ్న 5.
‘నృపతి’ అంటే
ఎ) పండితుడు
సి) మంత్రి
బి) రాజు
డి) సైన్యాధిపతి
జవాబు.
(బి) ‘నృపతి’ అంటే రాజు.
4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పూజకన్న నెంచ బుద్ధి నిదావంబు
మాట కన్న నెంచ మనసు దృఢము
కులము కన్న నెంచ గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినరవేమ!
ప్రశ్నలు :
ప్రశ్న 1.
కులము కంటే ప్రధానమైనది ఏది?
జవాబు.
కులము కంటే ప్రధానము ‘గుణము’.
ప్రశ్న 2.
‘ఆడంబరంగా పూజలు చేయడం కన్న, బుద్ధితో ఉండడం మంచిది’ అనే అర్థం ఇచ్చే పాదాన్ని రాయండి.
జవాబు.
‘ఆడంబరంగా పూజచేయడం కన్న బుద్ధితో ఉండడం మంచిది. అనే అర్థాన్ని మొదటిపాదం “పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు” ఇస్తుంది.
ప్రశ్న 3.
మనస్సు దేనికన్నా ప్రధానము?
జవాబు.
మనస్సు మాటకన్నా ముఖ్యం.
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకంలోనిది?
జవాబు.
ఈ పద్యం, వేమన శతకంలోనిది.
ప్రశ్న 5.
‘నిదానము’ అంటే
ఎ) ప్రధానము
బి) ఐశ్వర్యం
సి) ధ్యానము
డి) ధనాగారము
జవాబు.
(ఎ) నిదానము అంటే ప్రధానము
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
‘ఖండకావ్యం’ ప్రక్రియ గూర్చి రాయండి.
జవాబు.
వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఒక అంశాన్ని విభిన్న కోణాల్లో దర్శిస్తూ సందేశాత్మకంగాను, వర్ణనాత్మకంగాను భావోద్వేగంతో చేసే రచన ఖండకావ్యం. ‘శిల్పి’ పాఠ్యభాగం గుఱ్ఱం జాషువా రచించిన ‘ఖండకావ్యం’ మొదటిభాగంలోనిది.
ప్రశ్న 2.
గుఱ్ఱం జాషువా గూర్చి రాయండి.
జవాబు.
కవి : గుఱ్ఱం జాషువా
కాలం : 24.7.1971 – 28.9.1895
తల్లిదండ్రులు : లింగమాంబ వీరయ్య దంపతులు
రచనలు : గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తుచరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్తలోకం, ఖండకావ్యాలు.
బిరుదులు : కవికోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, కవి దిగ్గజ, విశ్వకవి సామ్రాట్
విశేషం : వీరి ‘క్రీస్తు చరిత్ర’ కావ్యానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
ప్రత్యేకత : సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నారు.
ప్రశ్న 3.
“నమస్కారంబు నీ ప్రజ్ఞకున్” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
దర్శించని, దర్శించలేని సుందర సుకుమార తేజోమూర్తులను శిల్పి తన మనసులో రూపుకట్టి, కఠిన రాళ్ళను కరిగించి, దివ్య దేవతామూర్తులను, అప్సరస భామినులను ఎంతో హృద్యంగా తీర్చిదిద్దుతాడు. కన్ను, ముక్కు, కాలు, చేయి ఇట్లా అన్ని అంగాలు నీ చేతిలో అందంగా కూర్చబడతాయి. తెల్లరాతిలో అప్సరసను సృష్టించి, ఆమె విశాల నేత్రాలకు పక్కగా నిన్ను నీవు మలచుకొని సంతోషపడతావు. శిల్పి ప్రపంచంలో చిరంజీవత్వాన్ని పొందిన నీ ప్రతిభకు నమస్కారాలు అని కవి శిల్పి యొక్క గొప్పతనాన్ని ప్రశంసించాడు.
IV. భాషాంశాలు:
పదజాలం:
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
సింహం = _______, _______
జవాబు.
సింగం, కంఠీరవం, పంచాస్యం
ప్రశ్న 2.
ఏనుగు = _______, _______
జవాబు.
కరి, గజం, మత్తేభం
ప్రశ్న 3.
వసుధ = _______, _______
జవాబు.
భూమి, వసుంధర, ధరణి
ప్రశ్న 4.
తెనుగు = _______, _______
జవాబు.
తెలుగు, త్రిలింగ
ప్రశ్న 5.
నమస్కారం = _______, _______
జవాబు.
ప్రణామం, వందనం
ప్రశ్న 6.
ప్రజ్ఞ = _______, _______
జవాబు.
నేర్పరితనం, నైపుణ్యం, చాతుర్యం
ప్రశ్న 7.
పర్వతం = _______, _______
జవాబు.
గట్టు, అద్రి, గిరి, గ్రావము, అచలం, శిఖరి
నానార్థాలు:
ప్రశ్న 1.
కంఠీరవం = _______, _______
జవాబు.
సింహం, మదగజం, పావురం
ప్రశ్న 2.
నేర్పు = _______, _______
జవాబు.
నేర్పించుట, సామర్థ్యం
ప్రశ్న 3.
ప్రతిమ = _______, _______
జవాబు.
తాతిబొమ్మ, పోలిక, గుర్తు, మాఱురూపు
ప్రశ్న 4.
కవి = _______, _______
జవాబు.
కావ్యకర్త, శుక్రుడు, పండితుడు
ప్రశ్న 5.
శిరము = _______, _______
జవాబు.
తల, కొండ కొన, ముఖ్యము
ప్రశ్న 6.
చిరంజీవి = _______, _______
జవాబు.
వేగిస, విష్ణువు, కాకి, అశ్వత్థామ
ప్రశ్న 7.
విగ్రహం = _______, _______
జవాబు.
శరీరం, బొమ్మ, విస్తారం
వ్యుత్పత్త్యర్థాలు:
ప్రశ్న 1.
అప్సరస : _________________
జవాబు.
ఉదకమునందు జనించినది – దేవవేశ్య
ప్రశ్న 2.
పర్వతం : _________________
జవాబు.
సంధులు కలది – కొండ
ప్రశ్న 3.
కరి : _________________
జవాబు.
కరము (తొండ) కలది – ఏనుగు
ప్రశ్న 4.
ధర : _________________
జవాబు.
సమస్తమును ధరించునది – భూమి
ప్రశ్న 5.
దిశ : _________________
జవాబు.
అవకాశమునిచ్చునది, ప్రార్ధక్షిణాది భేదములచే వ్యపదేశింపబడునది – దిక్కు
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
చాతుర్యం = _________________
జవాబు.
చాతుర్యం = నైపుణ్యం
నా మిత్రునికి వివిధ గొంతులను అనుకరించే చాతుర్యం ఉంది.
ప్రశ్న 2.
చిరంజీవి = _________________
జవాబు.
చిరంజీవి = శాశ్వతుడు
మార్కండేయుడు చిరంజీవి.
ప్రశ్న 3.
ప్రఖ్యాతి = _________________
జవాబు.
ప్రఖ్యాతి = గొప్ప పేరు
భారతీయ శిల్పాలలో ఎల్లోరా శిల్పాలకు ప్రపంచ ప్రఖ్యాతి కలదు.
వ్యాకరణాంశాలు:
సమాసాలు:
tbl 2
భాషాభాగాలు గుర్తించండి.
ప్రశ్న 1.
బుర్రకథా పితామహుడు నాజర్.
జవాబు.
నామవాచకం
ప్రశ్న 2.
పేదలకు సాయం చేయడం పుణ్యం.
జవాబు.
క్రియ
ప్రశ్న 3.
ఆయనకు ‘హరికథ’ అంటే చాలా ఇష్టం.
జవాబు.
‘సర్వనామం
పద్యాలకి అర్థాలు – భావాలు:
I.
1వ పద్యం:
తే.గీ॥ చేత మిగురొత్త నొక నల్లజాతియందు
మలచినాడవు, భయద సింహముల తలలు
వసుధ గన్పట్టు సర్వపర్వతములందు
జిత్రముల నెన్ని గతుల జూచెదవొ నీవు !
అర్థాలు :
చేతము = మనస్సు
ఇగురొత్తన్ (ఇగురు + ఒత్తన్) = చిగురించేటట్లు
ఒక నల్ల జాతియందున్ = ఒక నల్లని అయిపై
భయద సింహముల = భయంకరమైన సింహముల
తలలు = తలలు
మలచి నాడవు = చెక్కినావు
నీవు = నీవు
వసుధన్ = భూమిపై
కన్నట్టు = కనపడే
సర్వపర్వతములందున్ = అన్ని పర్వతాలలోనూ
ఎన్ని గతులన్ = ఎన్ని విధాలుగా
చిత్రములన్ = శిల్పాలను
చూచెదవో = (చూచెదవు + ఒ) = చూస్తావో!
భావం :
ఓ శిల్పీ ! నీవు మనసు చిగురించేటట్లు నల్లరాతిలో భయంకరమైన సింహాల తలలు చెక్కావు. భూమి మీద కనిపించే కొండలలోని చిత్రములను నీవు ఎన్ని విధాలుగా చూస్తావో !
2వ పద్యం : (కంఠస్థ పద్యం)
తే.గీ॥ సున్నితంబైన నీచేతి సుత్తెనుండి
బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
సార్థకము గాని యెన్ని పాషాణములకు
గలిగె నీనాడు పసుపు గుంకాల పూజ !
అర్థాలు :
చేతము = మనస్సు
సున్నితంబు + ఐన = కోమలమైన
నీచేతి = నీ చేతిలోని
సుత్తెనుండి = సుత్తి నుంచి
ఎన్ని = ఎన్నియో
దేవస్థలములు = దేవాలయాలు
బయలుపడు = వెలువడ్డాయి
సార్థకము + కాని = ప్రయోజనము లేని
ఎన్ని పాషాణములకు = ఎన్నో బండరాళ్ళకు
పసుపు కుంకాల పూజ = పసుపు, కుంకుములతో పూజ
ఈనాడు = ఈరోజు
కలిగెన్ = లభించింది
భావం:
మెత్తనైన నీచేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో ! ఒకనాడు వ్యర్థంగా పడియున్న ఎన్నో బండరాళ్ళకు నీవల్లనే పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యము నేడు లభించింది.
3వ పద్యం : (కంఠస్థ పద్యం)
తే.గీ ॥ కవికలంబున గల యలంకార రచన
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున;
గాకపోయిన బెను జాతికంబములకు
గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు ?
అర్థాలు :
ఓయిశిల్పి = ఓ శిల్పీ !
కవి = కవి యొక్క
కలంబున + కల = కలమునందు ఉన్న
అలంకార రచన = అలంకార రచనాశక్తి
నీ + ఉలిముఖమున = నీ ఉలి అనే ఇనుప పనిముట్లు అందుకూడా
కలదు కలదు = నిశ్చయంగా ఉంది
కాకపోయిన = అలా నీ ఉలిలో లేకపోతే
పెను = పెద్ద
జాతికంబములకు = రాతి స్తంభములకు
కుసుమ వల్లరులు = పూలగుత్తులు
ఏ రీతి = ఏ విధంగా
గ్రుచ్చినావు = చెక్కగలిగినావు.
భావం:
కవి కలానికి వర్ణించే శక్తి ఉంది. అటువంటి అలంకార రచనాశక్తి నీ ఉలికి కూడా ఉంది. లేకపోతే కఠినమైన రాతిస్తంభంలో పూసిన లేత కొమ్మలను ఎలా చెక్కగలిగావు ?
II.
4వ పద్యం:
మ॥ మమపుల్ దీర్చి మదంబు చిందిపడ నేనన్ గున్నలన్ జెక్కి వై
చిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెన్నత్కిరీటాకృతిన్;
తెమగుందేశము నిమృవంటి పనివానిం జూచి యుప్పొంగుచుం
డును; నీ లేమి దలంచి కంట దడిబెట్టువ్: శిల్పవిద్యానిధీ !
అర్థాలు :
శిల్పవిద్యానిధీ = శిల్ప విద్యలో గొప్పవాడా !
నునుపుల్ + తీర్చి = అతిని నున్నగా జేసి
మదంబు + చిందిపడన్ = బొమ్మలను మదము ఉట్టిపడేటట్లు
ఏన్గున్ = ఏనుగునూ
గున్న = ఏనుగు పిల్లలనూ
చెక్కివైచిన = చెక్కిన
చాతుర్యము = నేర్పు
నీ శిరోగ్రము = నీ తలపై
సత్కిరీటాకృతిన్ = మంచి కిరీటము యొక్క ఆకారము వలె
నిల్చెన్ = నిలబడింది
తెనుంగుదేశము = తెలుగుదేశము
నిన్నువంటి = నీ వంటి
పనివానిన్ = పనివాడిని
చూచి = చూచి
ఉప్పొంగుచుండును = సంతోషముతో పొంగిపోతూ ఉంటుంది
నీలేమి + తలంచి = నీ దరిద్రాన్ని చూసి
కంట + తడిపెట్టున్ = కన్నీరు కారుస్తుంది
భావం:
శిల్ప విద్యలో నిధి వంటివాడా ! రాతిని నునుపు చేసి మదము చిందేటట్లుగా ఏనుగునూ, దాని పిల్లలునూ చెక్కిన నీ నేర్పు నీ తలపై మంచి కిరీటము వలె నిలిచింది. తెలుగు నేల నీవంటి పనివాళ్ళను చూసి ఉప్పొంగి పోతూ ఉంటుంది. నీ దారిద్ర్యాన్ని చూసి కన్నీరు కారుస్తుంది.
5వ పద్యం:
మ॥ తెలిజాతివ్ జెలువార వచ్చరపడంతిం దిద్ది యా సోగ క
మ్నల పజ్జవ్ నిమ నీవు దిద్దుకొని, సంతోషించుచున్నాడవా
భళిరే ! శిల్పిజగంబులోవ జిరజీవత్వంబు సృష్టించుకో
గల నీకెవ్వడు పాటివచ్చును ? నమస్కారంబు నీ ప్రజ్ఞకున్
అర్థాలు :
తెలితిన్ = తెల్లని చంద్రకాంత శిలపై
జెలువారన్ = అందంగా
అచ్చర పడంతిన్ = అప్సరసలాంటి స్త్రీని
దిద్ది = చెక్కి
ఆ సోగకన్నుల = ఆ అప్సరస యొక్క పొడవైన కన్నుల యొక్క
పజ్జన్ = ప్రక్కన
నినున్ = నిన్ను
నీవు = నీవు
దిద్దుకొని = మలచుకొని
సంతోషించుచున్నాడవా ! = సంతోషిస్తున్నావా !
భళిరే = ఆశ్చర్యము
శిల్పిజగంబులోన = శిల్పి ప్రపంచంలో
చిరజీవత్వంబు = శాశ్వతత్వాన్ని
సృష్టించుకోగల = కల్పించుకోగలిగిన
నీకు = నీకు
ఎవ్వడు = ఎవ్వడు
సాటివచ్చున్ = సాటి రాగలడు
నీ ప్రజ్ఞకున్ = నీ ప్రతిభకు
నమస్కారంబు = నమస్కారాలు
భావం :
ఓ శిల్పీ ! తెల్లని చంద్రకాంత శిలలో అప్సరసలాంటి స్త్రీని చెక్కి ఆమె అందమైన కన్నులకు ప్రక్కగా నిన్ను నీవు మలచుకొని సంతోషపడుతున్నావా ? భళా ! శిల్పి ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కల్పించుకోగలిగిన నీకు ఎవరూ సాటిరారు. నీ ప్రజ్ఞకు నా నమస్కారాలు.
III.
6వ పద్యం : (కంఠస్థ పద్యం)
తే.గీ॥ ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లెవేయింప గలవు చూపరులచేత ;
గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్దంబు గాదు.
అర్థాలు :
ప్రతిమలు = శిల్పములు
రచించి = చెక్కి
ఒక మహారాజు చరిత = ఒక మహారాజు కథను
చూపరులచేత = చూచేవారిచేత
వల్లె వేయించగలవు = చెప్పించగలవు
కవనమునన్ = కవిత్వమందు
చిత్రములు + కూర్చు = బొమ్మలను చూపే
కవికి = కవికీ
నీకున్ = నీకూ
తారతమ్యంబు లేదు = తేడా లేదు
అబద్ధంబు కాదు = ఈ మాట అబద్ధము కాదు
భావం :
నీ శిల్పములు చూచేవారిచేత ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చెక్కే కవికీ, నీకూ ఏ మాత్రము తేడా లేదు. ఇది నిజమైన మాట.
7వ పద్యం:
తే.గీ॥ ఱల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
యులిని పోకించి బయటికి బిలిచినావు ;
వెలికి రానేర్చి, నీ పేర నిలపకున్నె
శాశ్వతుడ వోయి నీవు నిశ్చయముగాను.
అర్థాలు :
ఱాలన్ = రాళ్లల్లో
నిద్రించు = నిద్రపోతున్న (దాగి ఉన్న)
ప్రతిమలను = బొమ్మలను (శిల్పాలను)
ఉలిని = నీ ఉలిని
సోకించి = రాళ్ళకు తగులునట్లు చేసి
బయటికి = వెలుపలికి
పిలిచినావు = ఆ బొమ్మలను పిలిచినావు
వెలికిన్ = బయటకు
రానేర్చి = ఆ చిత్రాలు వచ్చి
నీపేరు = నీ పేరు
నిలుపక + ఉన్నె = నిలబెట్టకుండా ఉంటాయా ?
నీవు = నీవు
నిశ్చయముగా = తప్పకుండా
శాశ్వతుడవు + ఓయి = శాశ్వతము కలవాడివోయి !
భావం :
రాళ్ళలో దాగియున్న బొమ్మలను నీ ఉలిని తాకించి, వాటిని మేల్కొల్పి బయటకు పిలిచావు. ఆ శిల్పములు బయటకు వచ్చి, నీ పేరు నిలబెట్టకుండా ఉండవు. నీవు నిశ్చయముగా శాశ్వతత్వం కలవాడివి.
8వ పద్యం:
మ॥ తలయెత్తెన్ గద, నీదు చాతురి యజంతాగహ్వరశ్రేణి గే
వల పాషాణములందు; జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో
మొలుచు వ్మానవ విగ్రహంబులు, మహాపుణ్యుండవయ్యా ! హరి
త్తులు, నీ బొమ్మలచెంత ముగ్ధగతినందున్ ; శిల్పికంఠీరవా !
అర్థాలు :
శిల్పికంఠీరవా ! =శిల్పులలో సింహము వంటివాడా !
అజంతాగహ్వర శ్రేణిన్ = అజంతా గుహల సముదాయములో
నీదు చాతురి = నీ నైపుణ్యము
తల + ఎత్తైన్ + కద = తల ఎత్తుకొని నిలబడింది కదా !
కేవల పాషాణములందున = వట్టి బండరాళ్ళలో
జీవకళ నిల్పంజాలు = సజీవత్వమును చూపగల
నీ సుత్తెలో = నీ సుత్తిలో నుండి
మానవ విగ్రహంబులు = మనుష్యుల బొమ్మలు
మొలుచున్ = మొలుస్తాయి
అయ్యా ! = ఓ శిలీ!
మహాపుణ్యుండవు = గొప్ప పుణ్యమూర్తివి
నీ బొమ్మల చెంతన్ = నీ బొమ్మల ప్రక్కన
హరిత్తులు = దిక్కులు
ముగ్ధగతిన్ + అందున్ = సంతోషముతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి
భావం :
ఓ శిల్పి శ్రేష్ఠుడా ! అజంతా గుహలలో నీ శిల్ప నైపుణ్యం వెల్లడయింది కదా ! నీ సుత్తి వట్టి బండరాళ్ళలో కూడా జీవకళను నిలుపగలదు. నీ సుత్తిలో నుండి మానవ విగ్రహాలు పుడతాయి. నీవు పుణ్యమూర్తివి. దిక్కులు సైతం నీ శిల్పాలను చూచి సంతోషముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
పాఠం ఉద్దేశం:
అరవైనాలుగు కళలలో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాళ్ళకు జీవం పోసేవాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియా పరిచయం – ఆధునిక పద్యం:
దీనిలో అన్నీ పద్యాలే ఉంటాయి. సరళభాషలోనే ఉంటాయి. వస్తువులో కొత్తదనం కూడా కనిపిస్తుంది.
పాఠ్యభాగ వివరాలు:
ఖండకావ్య ప్రక్రియలో ఆధునిక వస్తువుతో, సులభశైలిలో, దీర్ఘసమాసాలు లేకుండా, సరళంగా రచించబడుతుంది. వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉంటుంది.
కవి పరిచయం:
కవి : గుఱ్ఱం జాషువా
కాలం : 28.09.1895 – 24.7.1971
జన్మస్థలం : గుంటూరు జిల్లా, వినుకొండ గ్రామం
రచనలు : గబ్బిలము, ఫిరదౌసి, ముంతాజ్మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తుచరిత్ర, నాకథ, స్వప్నకథ, కొత్తలోకము, ఖండకావ్యాలు మొ||నవి.
బిరుదులు : కవికోకిల, కవితావిశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొ||నవి.
ప్రవేశిక:
చర్మం భారతదేశం శిల్ప కళకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతిపొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే ! మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్నిస్తాడు శిల్పి. వేయిస్తంభాలగుడి, రామప్ప దేవాలయం, గుప్తుల కాలంనాటి ఏకశిలారథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం.
నేనివి చేయగలనా?