Telangana SCERT 7th Class Telugu Guide Telangana 3rd Lesson శతక సుధ Textbook Questions and Answers.
TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ
బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి : (TextBook Page No.20)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు ? ఏమి చేస్తున్నారు ?
జవాబు.
పై బొమ్మలో గురువు, ఆయన శిష్యులు ఉన్నారు. శిష్యులు గురువును ఏవో ప్రశ్నలు వేస్తున్నారు.
ప్రశ్న 2.
శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు ?
జవాబు.
శిష్యులు గురువుగారిని శతకాలు అంటే ఏమిటి అని అడిగి ఉండవచ్చు.
ప్రశ్న 3.
గురువుగారు ఏం చెప్తుండవచ్చు?
జవాబు.
గురువుగారు శిష్యులకు నైతిక విలువలతో కూడిన శతకాలను గురించి చెప్తుండవచ్చు.
ప్రశ్న 4.
మీకు తెలిసిన కొన్ని నీతివాక్యాలు చెప్పండి.
జవాబు.
- పరులకు ఉపకారం చేయటంలో ఆనందం ఉంది.
- మంచి గుణాలన్నింటికీ సహనం కిరీటం వంటిది.
- ప్రపంచంలో కనిపించేవన్నీ అందమైనవే. మన చూపుల్లోనే దోషముంది.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.23)
ప్రశ్న 1.
వంశానికి కీర్తి తేవడమంటే మీకేమర్థమైంది ?
జవాబు.
మానవజన్మ ఎంతో దుర్లభమైంది. మానవుడు తన మంచి ప్రవర్తనతో వంశానికి కీర్తిని సాధించిపెట్టాలి. అప్పుడే మానవజన్మకు సార్థకత ఏర్పడుతుంది. తన చెడు ప్రవర్తనతో వంశానికి అపకీర్తి రాకుండా తన వ్యక్తిత్వంతో మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నించాలని అర్థమైంది.
ప్రశ్న 2.
చెడు అలవాట్లకు లొంగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు.
మానవుడు మంచి అలవాట్లకు లోబడి యుండాలి. దాంతో ఉన్నతమైన కీర్తి లభిస్తుంది. ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే ఎన్నో నష్టాలను పొందుతాడు. వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. అనారోగ్యాన్ని పొందుతాడు. చదువు సంధ్యలకు దూరం అవుతాడు. వంశగౌరవం తగ్గుతుంది.
ప్రశ్న 3.
‘భిక్షుకులకు శత్రువు లోభి’ అన్న కవి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా ? ఎందుకు ?
జవాబు.
నిజమే. లోభి అయిన మానవుడు తాను సంపాదించిన ధనాన్ని అనుభవించడు. ఇతరులకు పెట్టడు. ఇతరులు ఏదైనా పెడితే చూసి సహించలేడు. ఇతరులు సుఖంగా ఉండటమనేది నచ్చదు. అందువల్ల ‘భిక్షకులకు శత్రువు లోభి’ అని చెప్పడం యథార్థమే.
ప్రశ్న 4.
చాడీలు చెప్పడం మంచి అలవాటు కాదు. ఎందుకో చెప్పండి?
జవాబు.
ఇతరులపై ఎప్పుడూ చాడీలు చెప్పడం మంచిది కాదు. దీనివల్ల స్నేహం చెడిపోతుంది. మానవత్వ విలువలు దెబ్బతింటాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడుతాయి. శత్రుత్వం పెరుగుతుంది. అందువల్ల చాడీలను చెప్పడం మానుకోవాలి.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.24)
ప్రశ్న 1.
ఏయే గుణాలు అలవరుచుకుంటే మనలోని కపటం తొలగిపోతుంది.?
జవాబు.
ఇతరులకు ఉపకారం చేయడం, సౌశీల్యం, త్యాగం, ఔదార్యం, ప్రియత్వం, లోకశ్రేయస్సు, భూతబలి మొదలైన ఉత్తమ గుణాలను అలవరచుకుంటే మనస్సులో కపటం తొలగిపోతుంది.
ప్రశ్న 2.
సజ్జనుని లక్షణాలు ఏమిటి ?
జవాబు.
- భార్యను మర్యాదగా చూడాలి..
- చిత్తము ఈశ్వరునిపై నిలిపి శివపూజ చేయాలి.
- ప్రజలను గూర్చి మాత్రమే చూడగల చూపులూ, మంచిని మాత్రమే మాట్లాడే నాలుక ఉండాలి.
- ఇతరులు దూషించినా వారిపై కోపగించుకోకూడదు.
- భగవంతుడు మనకు ఇచ్చిన దానిలోనే దీనులకు ఆప్యాయంగా లాలించి అన్నం పెట్టాలి.
- బీదలకు అన్నవస్త్రాలు ఇవ్వాలి. ధర్మాన్ని రక్షించాలి.
- సుఖాల కోసం అబద్ధాలు చెప్పకూడదు.
- హద్దుమీరి ప్రవర్తించి ఎవ్వరితోనూ వాదం పెట్టుకోరాదు.
ప్రశ్న 3.
గేలి చేయడమంటే మీకేమర్థమైంది ?
జవాబు.
గేలి చేయడం అంటే ఎగతాళి చేయడం. సమాజంలో కొందరు పేదలు ఉంటారు. మరికొందరు అందవిహీనంగా ఉంటారు. వారిని చూచి ఎగతాళి చేయకూడదు. తనకున్నదానిలో సహాయం చేసి ఆదుకోవాలి. అలా కాకుండా వారిని కించపరచడం మంచిది కాదు.
ప్రశ్న 4.
ధనమదమ్ము వంటి ఏయే గుణాలు కలిగి ఉంటే దానవులౌతారు ?
జవాబు.
ధనబలంతో పాటు, అధికారకాంక్ష, కులబలం, వంశబలం, సౌందర్యబలం మొదలైన లక్షణాలు ఉంటే మానవులు దానవులుగా మారుతారు.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.25)
ప్రశ్న 1.
‘విజ్ఞానము విశ్వశాంతికొరకు’ దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు.
మానవుడు సాధించుకున్న విజ్ఞానాన్ని విశ్వశాంతి కొరకే వినియోగించాలి. మానవులందరు సుఖంగా జీవించడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికి తోడ్పడాలి. అంతేగాని మానవ వినాశనానికి, విశ్వశాంతికి భంగం కల్గించడానికి మానవ విజ్ఞానం దోహదం చేయకుండా ఉండాలి.
ప్రశ్న 2.
‘జనని, జన్మభూమి స్వర్గం కన్న మిన్న’ అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
కన్నతల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్పవి. ఈ రెండూ మనకు జీవితాన్ని అందించిన ప్రదేశాలు.. వాటిని మనం ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా మరువకూడదు. వాటి ఋణం తీర్చుకోవాలి. అది మానవ ధర్మం.
ఇవి చేయండి:
I. అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
పాఠ్యాంశంలోని పద్యాలలో ఏయే మంచి అలవాట్ల గురించి కవులు చెప్పారు ? వాటిని అలవరచుకోవాలంటే మనం ఏం చేయాలి ?
జవాబు.
పాఠ్యాంశంలోని పద్యాలలో కవులు దానగుణ శీలం గురించి, ఇంద్రియ నిగ్రహాన్ని గురించి చెప్పారు. పిసినారి అయిన వారి దురుసుతనాన్ని, మూర్ఖుల యొక్క స్వభావాన్ని గురించి వివరించారు. మన మనస్సును బట్టి ఎదుటివానిని అర్థం చేసుకోవచ్చని, జననీ, జన్మభూమి గొప్పతనాన్ని వివరించారు. వాటిని మనం అలవరచుకోవాలంటే నీతిని, నైతిక విలువలను తెలుసుకొని ప్రవర్తించాలి.
ప్రశ్న 2.
శతక పద్యాలు ఎందుకు నేర్చుకోవాలో చెప్పండి.
జవాబు.
శతక పద్యాలు మనకు రసానుభూతిని కలిగిస్తాయి. నైతిక విలువలను పద్యాల రూపంలో నేర్చుకొని పెంపొందించుకోవడం ద్వారా జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నీతులను మననం చేసుకోవచ్చు.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
ప్రశ్న 1.
కింద ఇచ్చిన పద్యం చదువండి. అర్థం చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కుఁ జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా ?
విశ్వదాభిరామ వినురవేమ !
అ) సజ్జనుని మాట ఎట్లా ఉంటుంది ?
జవాబు.
సజ్జనుని మాట చల్లగా ఉంటుంది.
ఆ) ఏది మ్రోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది ?
జవాబు.
కంచు మ్రోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది.
ఇ) అల్పుడు …………………… మాట్లాడుతాడు.
జవాబు.
ఆడంబరముగా
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
అల్పుడు – సజ్జనుడు
ఉ) పై పద్యంలో ఎవరెవరిని వేటితో పోల్చారు ?
జవాబు.
పై పద్యంలో అల్పుడిని కంచుతోను, సజ్జనుడిని కనకముతోను పోల్చారు.
2. కింది వాక్యాలను చదువండి. సరైన సమాధానాలు అనుకునే వాటిపై ‘✓’ అనే గుర్తును పెట్టండి.
అ) నేను పక్షులపై / జంతువులపై దయ …………….
ఎప్పుడూ కలిగిఉంటాను / అప్పుడప్పుడు కలిగిఉంటాను / అసలు కలిగిఉండను
జవాబు.
ఎప్పుడూ కలిగిఉంటాను
ఆ) నేను యాచకులకు భిక్ష ………………
ఎప్పుడూ పెడుతాను / అప్పుడప్పుడు పెడుతాను / అసలు పెట్టను
జవాబు.
ఎప్పుడూ పెడుతాను
ఇ) నాకు మనసులో మోసపు ఆలోచనలు ……………………
ఎప్పుడూ వస్తాయి / అప్పుడప్పుడు వస్తాయి / అసలు రావు
జవాబు.
అసలు రావు
ఈ) నేను మంచి దృష్టితో ………………….
ఎప్పుడూ ఉంటాను / అప్పుడప్పుడు ఉంటాను / అసలు ఉండను
జవాబు.
ఎప్పుడూ ఉంటాను
ఉ) నేను మంచివారితోనే స్నేహం …………………..
ఎప్పుడూ చేస్తాను / అప్పుడప్పుడు చేస్తాను / అసలు చేయను
జవాబు.
ఎప్పుడూ చేస్తాను
ఊ) నేను ఓర్పుతో …………………………
ఎప్పుడూ ఉంటాను / అప్పుడప్పుడు ఉంటాను / అసలు ఉండను
జవాబు.
ఎప్పుడూ ఉంటాను
ఋ) నేను అమ్మను, ఊరును …………………….
ఎప్పుడూ గౌరవిస్తాను / అప్పుడప్పుడు గౌరవిస్తాను / అసలు గౌరవించను
జవాబు.
ఎప్పుడూ గౌరవిస్తాను.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) ‘సత్పురుషుల స్నేహం అవసరం’. ఎందుకు ?
జవాబు.
సత్పురుషులు ఎదుటివారు ఎంత మూర్ఖులయినా, గేలి చేసినా వారితో వాదులాడరు. వారి ద్వారా మనము ఎంతో మంచిని నేర్చుకోగలుగుతాము. ఎదుటివారిని ఆదరించే కోణంలోనే సజ్జనులు ఎప్పుడూ ఆలోచిస్తారు. అందువలన మనకు సత్పురుషుల స్నేహం ఎంతో అవసరం.
ఆ) ‘ఉన్న ఊరు, కన్నతల్లి స్వర్గం వంటివి’. ఎందుకు ?
జవాబు.
మనం ఉన్న ఊరు మనను బాగా ఆదరిస్తుంది. మనం పుట్టిన నేల, మన కన్నతల్లితో సమానము. కన్నతల్లి తన బిడ్డను ఎటువంటి లాభం ఆలోచించకుండా ఎలా పెంచుతుందో అలాగే ఉన్న ఊరు కూడా తనబిడ్డను ఆదరిస్తుంది. కాబట్టి ఎవ్వరికైనా ఉన్న ఊరు, కన్నతల్లి స్వర్గం వంటివి.
ఇ) ధనం బాగా ఉంటే ఏమేం మంచిపనులు చేయవచ్చు ?
జవాబు.
ధనం బాగా ఉంటే మనము చాలా మంచిపనులు చేయవచ్చు.
- మన ఊరికి కావలసిన వసతులకు మన చేతనయినంత ధనం మనం సహాయం చేయవచ్చు.
- పేద పిల్లలకు కనీస అవసరాలయిన తిండి, బట్ట, చదువుకు కావలసిన సహాయం చేయవచ్చు. 3. ధనం సంపాదించుకున్న దానికన్నా ఎదుటి వ్యక్తికి మేలు చేసినప్పుడే దాని విలువ తెలుస్తుంది.
ఈ) ‘లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు’. ఎందుకు ?
జవాబు.
లోభి తాను సంపాదించుకున్న ధనాన్ని ఎవరైనా దోచుకుంటారేమోననే భయంతో ఎపుడూ ఉంటాడు. అలాగే తను సంపాదించుకున్న దానిని తాను తినడు, ఇతరులకు పెట్టడు. కాని ఇతరులు పెట్టినపుడు చూసి తాను ఓర్వలేడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. అందువలనే లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
ప్రశ్న 1.
పాఠంలోని శతక పద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడిక ఎట్లా ఉండాలో వివరించండి.
జవాబు.
పాఠంలోని శతక పద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడికలలో చాలా మార్పులు వస్తాయి.
- విసుగులేకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి అని తెలుసుకున్నాను. నేను కూడా నాకున్నంతలో దానం చేయాలి అని అనుకుంటున్నాను.
- మనము ఇంద్రియ నిగ్రహం ద్వారా స్థిరమైన బుద్ధిని పొందగలుగుతామని తెలుసుకున్నాను.
- లోభి తాను సంపాదించుకున్న ధనాన్ని ఇతరుల అవసరానికి ఉపయోగించనపుడు అటువంటి సంపాదన అనవసరం, దానికి విలువ లేదు అని తెలుసుకున్నాను.
- సజ్జనులు అయిన వారు ఎదుటివారు ఎంత గేలిచేసినా వాదులాడబోరని అలాగే మనం కూడా అనవసర విషయాలలో జోక్యం చేసుకోకూడదని తెలుసుకున్నాను.
- మనం మన మనసులో మోసపు ఆలోచనలు నింపుకుంటే అలాగే ఉంటాయి. మనం మోసపూరిత భావాలు తొలగించుకుంటే లోకంలో మనకు మోసగాడే కనిపించడు.
- ధన బలంతో రాక్షసులుగా మారి, పేదవారు బాధపడుతున్నా లెక్కచేయకుండా ఉండకూడదు. వారికి చేతనైన సహాయం చేయాలి అని తెలుసుకున్నాను.
- లోకానికి ప్రపంచ శాంతిని కలిగించే విజ్ఞానాన్ని పొందాలి.
- కన్నతల్లిని, ఉన్న ఊరును విడవకూడదు. వాటికి పూర్వవైభవాన్ని తెచ్చేదానికి మన సాయశక్తులా ప్రయత్నం చేయాలి.
IV. సృజనాత్మకత / ప్రశంస:
ప్రశ్న 1.
పద్యాల ఆధారంగా నీతిని తెలిపే సూక్తులను తయారు చేయండి. రాయండి. ప్రదర్శించండి.
జవాబు.
- దానగుణం కలిగినవాడే వంశానికి వన్నె తెస్తాడు.
- ఇంద్రియ చపలత్వాన్ని వదలి స్థిరమైన బుద్ధిని పొందు.
- లోభితనాన్ని వదులుకో, పరుల బాగోగులు తలచుకో.
- సజ్జనుడు ఎదుటివారి ప్రవర్తనకు బాధపడడు, కృంగిపోడు.
- మన మనసులో మంచి భావాలు ఉంటే ఎదుటివారిలో కూడా మంచి భావాలే కనిపిస్తాయి.
- కష్టాలలో ఉన్నవారిని కలకాలం కాపాడుము.
- మంచితనంతో మెలిగి ప్రపంచశాంతిని కోరే విజ్ఞానాన్ని ప్రసాదించు.
- కన్నతల్లిని, జన్మభూమిని ఎప్పుడూ మరువకు.
- విజ్ఞానం అనే సంపదను విశ్వశాంతి కొరకు ప్రసాదించు.
- జననీ, జన్మభూమి స్వర్గం కన్నా మిన్న.
V. పదజాల వినియోగం:
1. కింద ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి.
అ) నరుడు | 1.అపహాస్యం |
ఆ) గేలి | 2. మోసం |
ఇ) జిహ్వ | 3. మానవుడు |
ఈ) కపటము | 4. భూమి |
ఉ) ధరిత్రి | 5. నాలుక |
జవాబు.
అ) 3
ఆ) 1
ఇ) 5
ఈ) 2
ఉ) 4
2. కింది వాక్యాలను చదువండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి.
అ) ధరిత్రి : భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోతవల్ల పంటలు పండటం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాం.
జవాబు.
ధరిత్రి – అవని, భూమి, నేల
ఆ) తావి : పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. ఆ పరిమళం ఆఘ్రాణించాలని ఎవరికుండదు ? అట్టి సువాసనలు ఎంతో సంతోషాన్నిస్తాయి.
జవాబు.
తావి : పరిమళం, సువాసన
3. కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి.
అ) శ్రీ : సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. పాము కోరల్లో విషం ఉంటుంది. సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరం.
జవాబు.
శ్రీ – సాలెపురుగు, పాము, సంపద
ఆ) ధనము : గోపాలుడు విత్తము తీసుకొని అంగడికి వెళ్ళాడు. పాడిసంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు.’
జవాబు.
ధనము – విత్తము, సంపద
4. కింది పేరాను చదువండి. ఖాళీలలో తగిన పదాలను రాయండి.
(నిజం, ఓర్పు, బాధ, చాడీలు, నీతి)
సిరి, శాంతిది ఒకే తరగతి. సిరి రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో ………………….. పెట్టేది, ………………… చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోటుకు దాచింది. ఈ విషయం తెలిసినా సిరి శాంతిని ఏమీ అనలేదు. అదే రోజు ఉపాధ్యాయిని విద్యార్థినుల నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు.
అందుకని ఉపాధ్యాయిని సిరిని “నోట్బుక్ ఇవ్వలేదేం” అని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయిని తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు కథలను ఉదహరిస్తూ, శతక పద్యాలలో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో వాటి ఆచరణ ఎలా ఉండాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి …………………..ను ప్రశంసించారు.
జవాబు.
సిరి, శాంతిది ఒకే తరగతి. సిరి రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో బాధ పెట్టేది, చాడీలు చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది: ఈ విషయం తెలిసినా సిరి శాంతిని ఏమీ అనలేదు. అదేరోజు ఉపాధ్యాయిని విద్యార్థినుల నోట్ బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు.
అందుకని ఉపాధ్యాయిని సిరిని “నోట్బుక్ ఇవ్వలేదేం” అని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయిని నిజం తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు నీతి కథలను ఉదహరిస్తూ, శతక పద్యాలలో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో వాటి ఆచరణ ఎలా ఉడాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి – ఓర్పును ప్రశంసించారు.
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. కింది వాక్యాలలో భాషాభాగాలను గుర్తించండి. పట్టికలో రాయండి.
అ) మామిడిపండు తియ్యగా ఉంది. ‘
ఆ) అయ్యో ! రమ చదువు ఆగిపోయిందా ?
ఇ) పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు.
ఈ) ఆమె మహా సాధ్వి.
ఉ) కాంచీపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.
ఊ) బాల భానుడు తూర్పున ఉదయిస్తాడు.
ఋ) రాముడు మంచి బాలుడు.
జవాబు.
నామవాచకం | సర్వనామం | విశేషణం | క్రియ | అవ్యయం |
మామిడిపండు రమ చదువు పిల్లలు శతకపద్యాలు కాంచీపురం దేవాలయాలు బాల భానుడు రాముడు బాలుడు |
ఆమె | తియ్యగా మహా సాధ్వి అనేక తూర్పున మంచి |
ఉంది ఆగిపోయిందా ? చదువుతున్నారు ఉన్నాయి ఉదయిస్తాడు |
అయ్యో ! |
సంధి:
కింది పదాలను కలిపిన విధానాన్ని పరిశీలించండి.
నేడు + ఇక్కడ = నేడిక్కడ (డ్ + ఉ) డు + ఇ) = డి (డ్ + ఇ)
వారు + ఇచ్చట = వారిచ్చట (ర్ + ఉ) రు + ఇ) = రి (ర్ + ఇ)
పై మొదటి పదంలో (నేడు) చివరి అచ్చు (పూర్వ స్వరం) ‘ఉ’ ; రెండవపదం (ఇక్కడ)లో మొదటి అచ్చు (పరస్వరం) ‘ఇ. ‘ఉ’ కారానికి ‘ఇ’ కారం కలిసినప్పుడు ‘ఇ’ కారమే నిలబడింది. అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. దీనినే ‘సంధి’ అంటారు.
2. కింది పదాలను కలిపి రాయండి.
అ) దానము + ఒసంగి = ____________
జవాబు.
దానమొసంగి
ఆ) కవితలు + అల్లిన = ____________
జవాబు.
కవితలల్లిన
ఇ) విఘ్నంబు + ఐన = ____________
జవాబు.
విఘ్నంబైన
ఈ) కపటము + ఉండు = ____________
జవాబు.
కపటముండు
ఉ) బదులు + ఆడునె = ____________
జవాబు.
బదులాడు
ప్రాజెక్టు పని:
పాఠశాల గ్రంథాలయం నుండి వివిధ శతకాలను సేకరించి, పరిశీలించి అంశాలవారీగా కింది పట్టికలో రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
క్ర.సంఖ్య | శతకం | మకుటం | కవి పేరు |
1. | నృసింహ శతకం | నృసింహా! | కూర్మపాటి వేంకటకవి |
2. | నరసింహ శతకం | నృసింహా! | కాకుత్థ్సం శేషప్పకవి |
3. | సింహాద్రి నారసింహ శతకం | సింహాద్రి నారసింహ | గోగులపాటి కూర్మదాసుడు |
4. | దాశరథీ శతకం | దాశరథీ కరుణాపయోనిధీ ! | కంచెర్ల గోపన్న |
5. | యాదగిరి లక్ష్మీనరసింహ శతకం | యాదగిరి లక్ష్మీనరసింహా ! | శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య |
6. | వేమన శతకం | వినురవేమ ! | వేమన |
TS 7th Class Telugu 3rd Lesson Important Questions శతక సుధ
I. అవగాహన – ప్రతిస్పందన:
అపరిచిత పద్యాలు:
1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
ప్రశ్న 1.
తేనెటీగ తేనెను ఎవరికి యిస్తున్నది?
జవాబు.
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.
ప్రశ్న 2.
తాను తినక, కూడబెట్టువారి నేమందురు?
జవాబు.
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.
ప్రశ్న 3.
పై పద్యము నందలి భావమేమి?
జవాబు.
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.
ప్రశ్న 4.
కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు.
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది వేమన శతకంలోని పద్యం.
2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
అనగ ననగ రాగ మతిశయిల్లుచు మండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది ?
జవాబు.
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.
ప్రశ్న 2.
తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు.
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.
ప్రశ్న 3.
సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు.
సాధనతో పనులు సమకూరుతాయి.
ప్రశ్న 4.
ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు.
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.
ప్రశ్న 5.
అతిశయిల్లు అంటే ఏమిటి ?
జవాబు.
అతిశయిల్లు అంటే హెచ్చు.
3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల ?
భాండ శుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా ?
విశ్వదాభిరామ వినరవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పాకమునకు దేని శుద్ధి అవసరం ?
జవాబు.
పాకమునకు భాండశుద్ధి అవసరం.
ప్రశ్న 2.
చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు ?
జవాబు.
చిత్తశుద్ధి లేకుండా శివపూజలు (దైవపూజలు) చేయ కూడదు.
ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘శుద్ధి’ (నిర్మలత్వం) పెట్టవచ్చు.
ప్రశ్న 4.
ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు.
ఈ పద్యాన్ని రాసిన కవి వేమన.
ప్రశ్న 5.
‘ఆచారము’ ఎలా ఉండాలి. ?
జవాబు.
‘ఆచారము’ ఆత్మశుద్ధి కలిగి యుండాలి.
4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా! గిట్టదా!
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎవరి మీద దయ కలిగి ఉండాలి?
జవాబు.
తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి.
ప్రశ్న 2.
చెదలు ఎక్కడ పుట్టి గిట్టుతుంది?
జవాబు.
చెదలు పుట్టలో పుట్టి గిట్టుతుంది.
ప్రశ్న 3.
దయలేని కుమారుడిని కవి దేనితో పోల్చాడు?
జవాబు.
దయలేని కుమారుడిని కవి చెదలుతో పోల్చాడు.
ప్రశ్న 4.
ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు?
జవాబు.
ఈ పద్యాన్ని రచించిన కవి వేమన.
ప్రశ్న 5.
‘గిట్టు’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
“గిట్టు అంటే నశించు” అని అర్థం.
5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఏ పాలు గరిటెడు చాలు ?
జవాబు.
గంగిగోవు పాలు గరిటెడు చాలు.
ప్రశ్న 2.
ఖరము అనగానేమి ?
జవాబు.
ఖరము అనగా గాడిద.
ప్రశ్న 3.
పట్టెడు ఎటువంటి తిండి కావాలి ?
జవాబు.
భక్తితో కూడిన తిండి పట్టెడు కావాలి.
ప్రశ్న 4.
ఈ పద్యానికి మకుటం ఏమిటి ?
జవాబు.
“విశ్వదాభిరామ వినురవేమ” అనేది ఈ పద్యానికి మకుటం.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది వేమన శతకంలోని పద్యం.
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
‘కన్నతల్లి ఉన్న ఊరు స్వర్గం కన్న మిన్న’ అని ఎందుకంటారు ?
జవాబు.
కన్నతల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్పవి. ఈ రెండూ మనకు జీవితాన్ని అందించిన ప్రదేశాలు. వాటిని మనం ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా మరువకూడదు. వాటి ఋణం తీర్చుకోవాలి. అది మానవ ధర్మం.
ప్రశ్న 2.
పంచేంద్రియాల కోరికల నుండి ఎలా బయట పడగలమో కారణాలతో రాయండి.
జవాబు.
పంచేంద్రియాలు ఐదు. అవి 1. చర్మం 2. కన్ను 3. నాలుక 4. చెవి 5. ముక్కు. వీటినే జ్ఞానేంద్రియాలు అని కూడా అంటారు.వీటిని నిగ్రహించుకోవడం సామాన్యమైన విషయం కాదు. ప్రతి ప్రాణి వీటిలో ఏదోక ఇంద్రియ చపలత్వం ద్వారా నాశనం పొందుతుంది. ఇంద్రియాలను ఎవరైతే నిగ్రహించుకోగలరో వారు ఆత్మజ్ఞానాన్ని, స్థితప్రజ్ఞతను పొందినట్లే. మనసు చెప్పినట్లు కన్ను, కన్ను చూసిన ప్రతీది మనం కోరుకోకూడదు. ఇంద్రియలోలుడైనవాడు సమాజం చేత హీనంగా చూడబడతాడు. కనుక ఇంద్రియాలను అధీనంలో ఉంచడం వల్ల కోరికల నుండి బయటపడగలం.
ప్రశ్న 3.
మంచి స్వభావం గలవారితో స్నేహం చేయడం వల్ల కలిగే లాభాలను రాయండి.
జవాబు.
మంచి స్వభావం కలవారితో మాట్లాడుటయే సంపదను, కీర్తిని, తృప్తిని కలిగించును. మరియు పాపాన్ని పోగొట్టును. భర్తృహరి సన్మిత్ర లక్షణాన్ని ఇలా వర్ణించారు. చెడును పోగొట్టి మేలు చేకూరుస్తాడు. మంచిగుణాలను నలుగురిలో, లోపాలను రహస్యంగా చెబుతాడు. ఆపదకాలంలో విడిచిపెట్టడు. ఇలాంటి మంచి స్వభావం కలవారితో స్నేహం చేయడం కన్నా వేరే ప్రయోజనాలు కావాలా !
ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
ప్రశ్న 1.
మీరు ధనం బాగా సంపాదిస్తే ఏమేం చేయగలరో తెల్పండి.
జవాబు.
ధనం బాగా ఉంటే మేము చాలా మంచి పనులు చేస్తాము. అవి : మా ఊరికి కావల్సిన కనీస వసతులకు చేతనయినంత ధనసాయం చేస్తాము. పేద పిల్లలకు కనీస అవసరాలయిన తిండి, బట్ట, చదువు ఏర్పాటు చేస్తాము. గ్రంథాలయం ఏర్పాటు చేస్తాము. వార్తాపత్రికలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు తెచ్చి విద్యార్థులకు అందిస్తాము. అనారోగ్యానికి కారణమయ్యే మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తాము. వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తాము. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి అందరికి పని కల్పిస్తాము. ధనిక, పేద అనే భేదభావం కలుగకుండా అంతా సమానమేనని చాటుతాము.
ప్రశ్న 2.
‘జననీ, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి’ – ఎట్లాగో వివరించండి.
జవాబు.
కన్నతల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్పవి. ఈ రెండూ మనకు జీవితాన్ని అందించిన ప్రదేశాలు. మనం ఉన్న ఊరు మనను బాగా ఆదరిస్తుంది. మనం పుట్టిన నేల మన కన్నతల్లితో సమానం. కన్నతల్లి తన బిడ్డను ఎటువంటి లాభం ఆలోచించక ఎలా పెంచుతుందో అలాగే ఉన్న ఊరు కూడా తన బిడ్డను ఆదరిస్తుంది. వాటిని మనం ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా మరువకూడదు. వాటి ఋణం తీర్చుకోవాలి. అది మానవ ధర్మం. కాబట్టి ఎవ్వరికైనా ఉన్న ఊరు, కన్న తల్లి స్వర్గం వంటివి.
కరుణశ్రీ తన తెలుగుబాల శతకంలో ‘కష్టబెట్టబోకు కన్నతల్లి మనసు’ అని మాతృభక్తిని చాటారు. పురిటి బిడ్డకు కన్న తల్లితో పాటు పుట్టిన గడ్డ కూడా తల్లియే అని చెప్పే భారతీయ సంప్రదాయం ఎంతో గొప్పది. గర్వించదగ్గది.
ప్రశ్న 3.
‘శతక సుధ’ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరేమి తెలుసుకున్నారో రాయండి.
(లేదా)
శతక పద్యాలు మనం నైతిక విలువలు పెంచుకోవడానికి ఎలా తోడ్పడతాయి ?
జవాబు.
నూరు కంటే ఎక్కువ పద్యాల సమాహారమే శతకం. మకుట నియమం దీని ప్రధాన లక్షణం. శతకంలోని పద్యాలు దేనికవే నీతిని బోధిస్తాయి.
శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెల్పుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచిచెడుల విచక్షణను నేర్పుతాయి. భావిజీవితాన్ని తీర్చిదిద్దుతాయి. కష్టాలను ఓర్చుకుని జీవించేవాడు మనిషని సుమతీ శతకం ద్వారా తెలుస్తుంది. లోకంలోని ప్రతి ప్రాణీ ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) కు చిక్కి నశిస్తున్నవని దాశరథి శతకం ద్వారా తెలుస్తుంది.
లోభి తాను తినడు, ఇతరులకు పెట్టడు. చివరికి ఇతరులకు కీడు జరగాలని భావిస్తాడని నరసింహ శతకం చెబుతోంది. సజ్జనుల స్వభావం ఎలాంటిదో నృకేసరి శతకం తెలుపుతోంది. మోసపూరిత భావాలు తొలగించుకోవాలని వేమన మనకు చెబుతున్నాడు. ఇతరులను కష్టపెట్టకూడదని నగ్నసత్యాల శతకం చెబుతున్నది. భగవంతుని మనం ఏం కోరుకోవాలి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం బోధిస్తోంది.
కన్నతల్లి, నేలతల్లి స్వర్గంతో సమానమని శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం ప్రబోధిస్తోంది.
ఇలా ఎన్నో శతకాలు హృద్యమైన పద్యాలతో మనలో మనిషిని మేల్కొలిపి మనీషిగా తీర్చిదిద్దుతున్నాయి.
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
“శతక సుధ” పాఠం ద్వారా నీవు నేర్చుకున్న విలువలను తెలుపుతూ, మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.
లేఖ
జోగిపేట,
X X X X X.
ప్రియమైన మిత్రుడు శివదత్తకు,
శుభాకాంక్షలు. ఉభయ కుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవూ బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. ఇటీవల మా పాఠశాలకు ప్రముఖులు సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు వచ్చారు. ఆయన వేమన, సుమతి వంటి శతక పద్యాలను రాగయుక్తంగా ఆలపించి, వివరణ చెప్పారు. శతకంలోని పద్యశైలిని, మాధుర్యాన్ని గూర్చి చెప్పారు. ఆ సందర్భంగా మా పాఠ్యాంశమైన శతకసుధ పద్యాలను మా చేత చెప్పించారు. వాటిలోని నైతిక విలువలను మీరెంతవరకు పాటిస్తున్నారని అడిగారు. నిజమే! ఇంతవరకు పాఠాన్ని పాఠం లాగానే చదివానే తప్ప, దానిలోని కవి ఆంతర్యాన్ని గ్రహించలేకపోయాను.
కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషని, ఇంద్రియ నిగ్రహం ఉండాలని, లోభితనం కూడదని శతకకవులు చెప్పిన తీరు నన్ను, నా ఆలోచనలను మార్చివేశాయి. ఇంకా మూర్ఖులు గేలి చేస్తారని మంచివాళ్ళు తమ నడతను మార్చుకోకూడదు. కష్టాలు కలకాలం ఉండవని, మంచివారితో స్నేహం ఆనందదాయకమని ఇలా ఎన్నో మంచి విషయాలు శతకాలు అందిస్తున్నాయని పాఠ్యాంశం ద్వారా గ్రహించాను. మరియు ఆచరించడం ప్రారంభించాను. నీవు కూడా ఈ కోణంలో పాఠాన్ని చదువు. మీ పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.
ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. జశ్వంత్ సమీర్.
చిరునామా :
యస్. శివదత్త,
S/o బాల సుబ్రహ్మణ్యం,
జూబ్లీహిల్స్,
హైదరాబాద్.
ప్రశ్న 2.
నీతిని తెలిపే పద్యాల వల్ల ఏ విధమైన లాభాలుంటాయో తెలుపుతూ ఒక ‘వ్యాసం’ రాయండి.
జవాబు.
నీతి పద్యాలు
మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిపేది నీతి. అవి పద్యరూపంలో ఉంటే వాటిని నీతి పద్యాలు అంటాం. మనం చదివే ప్రతి కథ చివర ‘నీతి’ అని ఉంటుంది. అంటే ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసినది ‘ఇది’ అని చెబుతుంది.
నీతితో కూడిన ప్రవర్తనకు సమాజం ఎప్పుడూ గౌరవాన్ని, గుర్తింపును ఇస్తుంది. ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయి. అలాగే మంచివాణ్ణి చూసి, చెడ్డవాడు గేలి చేస్తాడు.
అంతమాత్రం చేత ఏనుగు ఎలాగైతే బెదిరిపోదో, మంచివాడు కూడా వెనుకడుగు వేయకూడదని నీతిని ఆ పద్యం తెలుపుతోంది. “అల్పుడెపుడు పల్కు నా అనే పద్యంలో మంచివాని యొక్క మాట తీరు ఎలా ఉంటుందో ఉదాహరణతో సహా చక్కగా చెప్పబడింది.
“ఆఁకొన్న కూడె యమృతం ….” అనే పద్యంతో నిజమైన మనిషి ఎలా ఉంటాడో చెప్పబడింది. నీతిపద్యాలు మనిషిని, ఋషిని చేస్తాయి. మనల్ని సృష్టించిన భగవంతుని మరచి, మనం సృష్టించిన ధనాన్ని విడువలేకపోవడం విచారకరం. సృష్టిలోని ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడమని పెద్దలు చెప్పారు. కాని కొందరు (ఎక్కువమంది) “పైసా మే పరమాత్మహై” అంటున్నారు.
చిన్ననాటి నుండే పిల్లలకు “నీతిపద్యాలు (సుమతి, వేమన మొ॥) నేర్పడం పెద్దల బాధ్యతగా తీసుకుంటే అవే వారిని సరైన దిశలో నడుపుతాయి. ప్రస్తుత కాలంలో కాన్వెంట్ బడులలో తెలుగు తగ్గించి తెగులు పట్టిస్తున్నారు. పెద్దయిన తర్వాత కౌన్సిలింగ్లని, సైకాలజీలని ప్రత్యేకంగా డబ్బులు చెల్లిస్తున్నారు. మానసిక పరిపక్వతను, మంచి చెడులను అందించే పద్యాలను పెద్దలు చదవండి. పిల్లలకు నేర్పండి.
IV. భాషాంశాలు:
పదజాలం:
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
1. సుధా – సుద్ద
2. పద్యము – పద్దెము
3. శాస్త్రం – చట్టం
4. త్రిలింగ – తెలుగు
5. పుస్తకం – పొత్తం
6. కవి – కయి
7. రత్నం – రతనం
8. భాష – బాస
9. కావ్యం – కబ్బం
10. సింహం – సింగం
11. భక్తి – బత్తి
12. వంశం – వంగడం
13. భిక్ష – బిచ్చం
14. దుష్ట – తుంట
15. కేసర – కోస (మెడ జూలు)
16. కష్టం – కసటు
17. భూమి – బూమి.
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
సహాయం = ____________
జవాబు.
సాయం
తనకున్న దానిలో ఇతరులకు సహాయం చేసి, ఆదుకోవాలి.
ప్రశ్న 2.
అబద్ధం = ____________
జవాబు.
అసత్యం
సుఖాల కోసం అబద్ధాలు చెప్పకూడదు.
వ్యుత్పత్త్యర్థాలు:
ప్రశ్న 1.
దాశరథి : ____________
జవాబు.
దశరథుని కుమారుడు = శ్రీరాముడు
ప్రశ్న 2.
దానవులు : ____________
జవాబు.
కశ్యపునకు దనువు నందు పుట్టిన సంతతి = రాక్షసులు
ప్రశ్న 3.
సత్యము : ____________
జవాబు.
సత్పురుషుల యందు పుట్టునది = నిజం.
వ్యాకరణాంశాలు:
అ) కిందివానిలో ప్రత్యయాలు గుర్తించండి.
ప్రశ్న 1.
పూలవాసనకు మైమరచి తుమ్మెద బందీ అవుతున్నది.
జవాబు.
వాసనకు (షష్ఠి)
ప్రశ్న 2.
ధనబలంతో పేదలను బాధపెడుతున్నారు.
జవాబు.
పేదలను (ద్వితీయా) తో (తృతీయా)
ఆ) సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
ప్రశ్న 1.
నేను ఓర్పుతో ఉంటాను. మాట్లాడతాను.
జవాబు.
నేను ఓర్పుతో ఉండి, మాట్లాడతాను.
ప్రశ్న 2.
మంచి దృష్టితో ఉండాలి. ఆలోచించాలి.
జవాబు.
మంచిదృష్టితో ఉండి, ఆలోచించాలి.
ఇ) సంయుక్త వాక్యంగా మార్చండి.
ప్రశ్న 1.
‘నేను అమ్మను గౌరవిస్తాను. నేను ఊరిని గౌరవిస్తాను.
జవాబు.
నేను అమ్మను, ఊరిని గౌరవిస్తాను.
పద్యాలు – అర్థాలు – భావాలు:
1వ పద్యం (కంఠస్థ పద్యం)
కం॥ ఆఁ కొన్న కూడె యమృతము
తాఁ గొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁ కోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ !
అర్థాలు :
సుమతీ ! = ఓ సుమతీ!
ఆఁ కొన్న = ఆకలితో ఉన్నపుడే తిన్న
కూడె = అన్నమే
అమృతము = అమృతం వలె రుచిస్తుంది.
తాఁకొందక = తనకు దాచుకోకుండా
ఇచ్చువాడే = దానం చేసేవాడె
ధరిత్రిన్ = ఈ భూమి మీద
దాత = నిజమైన దాత
తేకువ = ధైర్యం
కలవాఁడె = కలిగినటువంటివాడె
వంశ తిలకుఁడు = వంశానికి వన్నె తెచ్చేవాడు
భావం :
సుమతీ ! బాగా ఆకలి వేసినపుడు తిన్న అన్నమే అమృతంవలె చాలా రుచిగా అనిపిస్తుంది. విసుగు లేకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత, కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి, ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు.
2వ పద్యం (కంఠస్థ పద్యం):
చం॥ వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేదురు (జెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, వైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ ! కరుణాపయోనిధీ !
అర్థాలు :
దాశరథీ ! = దశరథపుత్రా ! శ్రీరామా !
కరుణాపయోనిధీ ! = కరుణాసముద్రుడా !
వనకరి = ఏనుగు
మై = తన శరీరానికి కలిగిన
నసకు = దురదను
చిక్కె = పోగొట్టుకోవడానికి
మీను = చేప
వా = నోటికి
చవికిం = రుచిని ఆశించి
జెడిపోయె = చిక్కిపోయింది,
చిల్వ = పాము
వినికికిఁ = రాగానికి
చిక్కె = లొంగిపోయింది,
లేళ్ళు = జింకలు
కనువేదురు = అందానికి బానిసయై
చిక్కె = చిక్కాయి
తేటి = తుమ్మెద
తావినోమనికి = సువాసనకు మైమరచి
నశించె = నశించిపోతున్నాయి
తరమా = సాధ్యమా !
యిరుమూటిని = ఇటువంటివి గెలవడం
ఐదు = పంచేంద్రియములు అయిన కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శలను
సాధనములను = పై వాటిని
నీవె = నీపై (నీవే)
గావదగు = కాపాడవలెను
భావం :
కరుణాసముద్రుడా ! దశరథపుత్రుడా! శ్రీరామా ! తనమేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, అందానికి బానిస అయి జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలు అవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను ? నీవే నా చాంచల్యాన్ని దూరంచేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించుము.
3వ పద్యం (కంఠస్థ పద్యం):
సీ॥ లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్థికిఁ చేతఁ బెట్టలేడు .
తాను బెట్టకయున్న తగవు పుట్టదుకాని యొరులు పెట్టగఁ జూచి యోర్వలేడు
దాత దగ్గర జేరి తన ముల్లె వొయినట్లు జిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలుసంతసమునందు మేలుకల్గినఁజాల మిడుకుచుండు
తే॥గీ॥ శ్రీరమానాథ ! యిటువంటి కౄరునకును
భిక్షుకుల శత్రువని పేరుబెట్టవచ్చు
భూషణవికాస ! శ్రీధర్మపుర నివాస !
దుష్టసంహార నరసింహ దురితదూర!
అర్థాలు :
భూషణ వికాస = ఆభరణాలచే ప్రకాశించేవాడా!
శ్రీ ధర్మపుర నివాస = శ్రీ ధర్మపురంలో నివసించేవాడా !
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా !
దురితదూర = పాపాలను దూరం చేసేవాడా !
నరసింహ = ఓ నరసింహా !
లోకమందు = ఈ లోకంలో
ఎవడైన = ఎవరైన
లోభి మానవుడన్న = పిసినారి ఉంటే
అర్థికి = యాచకులకు
భిక్ష = భిక్షం
చేతఁ బెట్టలేడు = చేతిలో పెట్టడు
తాను బెట్టకయున్న = తాను పెట్టకపోయినా
తగవు = గొడవ
పుట్టదు కాని = జరుగదు కాని
యొరులు = ఇతరులు
పెట్టగ = పెట్టగా
జూచి = చూచి
యోర్వలేడు = ఓర్చుకోలేడు
దాత = దానం చేసేవాని
దగ్గర జేరి = దగ్గరకు వెళ్ళి
తన = తన యొక్క
ముల్లెవోయినట్లు = సొమ్ముపోయినట్లుగా
జిహ్వ = నాలుకతో (నోటి దురుసుతో)
చాడీలు = చాడీలు
చెప్పుచుండు = చెబుతాడు
ఫలము = దానం చేయటం
విఘ్నంబైన = ఆటంకం కలిగినపుడు
పలు సంతసము = మిక్కిలి సంతోషము
నందు = కలుగును
మేలు కల్గిన = ఇతరులకు మేలు కలిగితే
చాల = ఎక్కువ
ఇడుకుచుండు = బాధ పడతాడు
శ్రీ రమానాథ = శ్రీరమా నాథుడా !
ఇటువంటి = ఇటువంటి
కౄరునకును = దుర్మార్గునకు
భిక్షుకుల = యాచకుల
శత్రువని = శత్రువని
పేరు బెట్టవచ్చు = చెప్పవచ్చును
భావం :
ఆభరణాలచే ప్రకాశించేవాడా ! శ్రీ ధర్మపురంలో నివసించేవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను దూరం చేసేవాడా ! ఓ నరసింహా ! పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు. కాని ఇతరులు పెట్టినపుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తన సొమ్ము పోయినట్లుగా నోటిదురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీరమానాథా ! ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చు కదా !’
II.
4వ పద్యం (కంఠస్థ పద్యం)
ఉ! ఏమగు బోవఁజూచి ధ్వమలెత్తుచుఁగుక్కలు గూయపాగుచో
దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించువే
మానవులందు పజ్జమడు, మత్తులు కొందరు గేలి చేయు చో
ఆ నరుడల్గి వాండ్ర బదులాడునె ధర్మపురీ వృకేసరీ !
అరాలు:
ధర్మపురి నృకేసరీ = ధర్మపురి నరసింహా !
ఏనుగు = ఏనుగు
బోవఁజూచి = పోవుట చూచిన
కుక్కలు = కుక్కలు
ధ్వనులెత్తుచు = కేకలువేస్తూ
కూయ సాగుచో = మొరిగినా
దాని మనసు = ఏనుగు వాటిపై
కోపపడి = కోపగించుకొని
వానిని = ఆ కుక్కలను
దందడి = వెనుదిరిగి
వెంబడించునే = తరుమదు
అట్లే = ఆ విధంగానే
మానువులందు = మానవులలో
సజ్జనుడు = మంచివారు
కొందరు = కొంతమంది
మత్తులు = మూర్ఖులు
గేలిచేయుచో = గేలి చేసినా
ఆ నరుడు = ఆ సజ్జనుడు
అల్గి = కోపించి
వాండ్ర = ఆ మూర్ఖులతో
వాదులాడునె = వాదులాడపోడు
భావం :
ధర్మపురి నరసింహా ! ఏనుగు పోవటం చూచిన కుక్కలు కేకలు వేస్తూ మొరిగిన’. ఆ ఏనుగు వాటిపై కోపగించుకొని వెనుదిరిగి తరుమదు. ఆ విధంగానే మానవులలో మంచివాడు కొంతమంది మూర్ఖులు గేలిచేసినా కోపగించుకొని ఆ మూర్ఖులతో వాదులాడపోడు. ఇది సజ్జనుని స్వభావం.
5వ పద్యం (కంఠస్థ పద్యం):
కం॥ తన మదిఁ గపటము గలిగిన
తన వలెనే కపటముండుఁ దగ జీవులకున్
తన మది కపటము విడిచిన
తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా !
అరాలు:
వేమా ! = ఓ వేమా !
తన = తన యొక్క
మదిన్ = మనసులో
కపటము = మోసపూరితమైన
కలిగిన = ఆలోచనలు ఉంటే
తగ జీవులకున్ = ఇతరులలో కూడా
తన వలెనే = తనలాగానే
కపటముండు = మోసమున్నట్లు కనిపిస్తుంది
తన = తన యొక్క
మదిన్ = మనసులో
కపటము విడిచిన = మోసపూరిత భావాలను విడిచిన
ధరలో = ఈ భూమిలో
తనకెవ్వడు = తనకు ఎవ్వడు కూడా
కపటిలేడు = మోసగాడిగా కనిపించడు గదా ! (కనిపించడు)
భావం :
ఓ వేమా ! తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరులలో కూడా మోసమే కనిపిస్తుంది. తన మనస్సు నుండి అలాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా ! (కనిపించడు).
6వ పద్యం (కంఠస్థ పద్యం):
ఆ.వె|| ధనమదమ్ము చేత దానవుండై పోయి
పేదవాడు పడెడు బాధ గనక
కష్టపెట్టువారు కలకాల ముందురా
కల్లగాదు రావికంటిమాట !
అర్థాలు :
ధనము = డబ్బు
దమ్ము = బలము
దానవుడు = రాక్షసుడు
భావం:
ధనబలంతో రాక్షసులుగా మారి, పేదవారు బాధపడుతున్నా లెక్కచేయక, వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలము నిలువరు కదా ! ఇది నిజం అని కవి భావన.
III.
7వ పద్యం (కంఠస్థ పద్యం):
ఆ.వె|| సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము
విశ్వశాంతికోరు విజ్ఞానమే యిమ్ము
చిద్విలాస భాస ! శ్రీనివాస !
అర్ధాలు:
సత్పురుషులు = మంచివారు
మైత్రి = స్నేహం
విశ్వం = ప్రపంచం
భావం :
ఓ శ్రీనివాస ! జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా! మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు. కమలాల వంటి కన్నులు కలవాడా ! నిన్ను కళ్ళారా చూడనివ్వు. ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానమును ఇవ్వు.
8వ పద్యం (కంఠస్థ పద్యం):
చం॥ జననియు జన్మభూమియుము స్వర్గముకన్న ఘనమ్ములన్న సూ
క్తిని వెలయింప సత్యమని దివ్యపురావిభవైక నవ్య దీ
ప్తిని గలిగింప మాతృపదపీఠి శిరంబు త్యజించు తెంపు నీ
వనిశము గూర్పు యాదగిరివాస ! నృసింహ ! రమావిభో ! ప్రభో !
అర్థాలు :-
యాదగిరి వాస ! = ఓ యాదగిరి వాసా !
నృసింహ ! = నరసింహా !
రమావిభో ! = లక్ష్మీదేవికి భర్త అయినవాడా!
ప్రభో ! = ఓ ప్రభో !
జననియు = జన్మనిచ్చిన తల్లి
జన్మ భూమియు = తాను జన్మించిన భూమి
స్వర్గంబుకన్న = స్వర్గము కంటే
ఘనములు = గొప్పవి (మిన్న)
అన్న = అను
ఈ సూక్తిని = ఈ సూక్తిని
సత్యమని = సత్యము అని
వెలయింప = చెప్పటానికి
దివ్య = దివ్యమైన
పురావిభవైక = ప్రాచీన వైభవాన్ని
నవ్య = క్రొత్తనైన
దీప్తిని = కాంతులను
కలిగింప = కాంతులనుకలిగించటానికి
మాతృ = తల్లి
పదపీఠి = పాదపీఠం మీద
శిరంబు = తలవంచి
త్యజించు = ప్రాణాలను విడుచు
తెంపు = తెగువను
నీవే = నీవే
అని కూర్చు = ప్రసాదించుము
భావం :
ఓ యాదగిరి వాసా ! నరసింహా ! లక్ష్మీదేవికి భర్త అయినవాడా ! ప్రభో ! జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి అను ఈ సూక్తిని సత్యము అని చెప్పటానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని క్రొత్తనైన కాంతులను కలిగించ టానికి, తల్లి పాదపీఠం మీద తలవంచి ప్రాణాలను విడిచిపెట్టు తెగువను (ధైర్యాన్ని) నీవే ప్రసాదించుము.
పాఠం ఉద్దేశం:
శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెల్పుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. భావిజీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అనగా నూరు/నూటికి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి ‘మకుటం’ ఉంటుంది. ఇవి ‘ముక్తకాలు’. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, నరసింహ, నృకేసరి, వేమన, నగ్నసత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీనరసింహ శతకాలలోని పద్యాలున్నాయి.
కవుల పరిచయాలు:
1. సుమతీ శతకం – బద్దెన :
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాలలో ఇమిడ్చి సుమతీ శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం). ఈయన సుమతీ శతకంతో పాటు ‘నీతిశాస్త్ర ముక్తావళి’ అనే గ్రంథాన్ని రాశాడు.
2. దాశరథి శతకం – కంచెర్ల గోపన్న :
రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న “దాశరథీ కరుణాపయోనిధీ !”
అన్న మకుటంతో శతకాన్ని రాసి, భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రామదాసు కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.
3&4. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం – కాకుత్థ్సం శేషప్పకవి :
జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జనవ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహశతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది.
5. వేమన శతకం – వేమన :
వేమన పద్యం రాని తెలుగువాళ్ళు ఉండరు. సహజకవిగా ప్రసిద్ధి పొందాడు. కడపజిల్లాకు చెందిన ఈయన పద్యాలలో – నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహారశైలిలో, తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత.
6. నగ్నసత్యాలు శతకం – రావికంటి రామయ్యగుప్త :
‘కవిరత్న’ ఈయన బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు.
7. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డా॥ ఆడెపు చంద్రమౌళి :
వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు ‘కవిశశాంక’. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం (పద్యకావ్యం) రచించాడు. సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత.
8. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం – శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య :
ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన “యాదగిరివాస ! నృసింహ ! రమావిభో ! ప్రభో !” అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితోపాటు నైతిక విలువలను పెంపొందింపచేస్తాయి.
ప్రవేశిక:
పద్యం రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగయుక్త ఆలాపన (లయ) మానసిక ఆనందాన్నిస్తుంది. నైతిక విలువలను పద్యాల ద్వారా నేర్చుకొని జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా ఆ నీతులను మననం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ? శతక పద్యాల తోటలోకి వెళ్లాం ! నైతిక పరిమళాల్ని ఆస్వాదిద్దాం !
నేనివి చేయగలనా?