TS 7th Class Telugu Grammar వ్యాసాలు

Telangana SCERT 7th Class Telugu Study Material Telangana Pdf వ్యాసాలు Questions and Answers.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

పాటించాల్సిన నియమాలు:

1. వ్యాసరచనకు ఇచ్చిన విషయాన్ని గురించి బాగా ఆలోచించి, రాయాల్సిన ముఖ్య విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
2. సామాన్యంగా వ్యాసాన్ని ఎ) ఉపోద్ఘాతం బి) వ్యాసవిషయం సి) ఉపసంహారం అనే మూడు భాగాలుగా విభజించాలి.
3. ఉపోద్ఘాతం : వ్యాసము యొక్క శీర్షికను నిర్వచించాలి. ఆ శీర్షికయందలి భావాన్ని చక్కగా వాక్యాలలో తెలపాలి.
4. వ్యాసవిషయం : వ్యాసరచనకై ఇవ్వబడ్డ విషయాన్ని కొన్ని శీర్షికలుగా విభజించాలి. వాటి ననుసరించి కొన్ని పేరాలుగా విభజించాలి.
5. ఉపసంహారం : వ్యాసమందలి ప్రధాన విషయాల్ని సమన్వయించి ముఖ్యమైన అంశాన్ని తెలపాలి. ఇందలి విషయం వ్యాస శీర్షికకు అనుగుణంగా ఉండాలి.
6. పేరాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండేటట్లు చూడాలి.
7. తప్పుడు సంధులు చేయకూడదు. సంధిని విడదీసి రాయవచ్చు. ‘శకటరేఫ (అ) కు బదులు సాధురేఫ (ర) ను వాడవచ్చు. అరసున్నలు పెట్టాల్సిన అవసరం లేదు. అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి.
8. సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు, జాతీయాలు మొదలైనవి రాస్తే వ్యాసం అందంగా ఉంటుంది.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

వ్యాసాలు:

కాలుష్యం – నివారణ

పరిచయం : కాలుష్యం అంటే మురికి. నివారణ అంటే ఆ కాలుష్యాన్ని దూరం చేసే ప్రయత్నం. నేటికాలంలో ఎక్కడ చూసినా ఏదో ఒకరకమైన కాలుష్యం మనిషిని పట్టి పీడిస్తున్నది. అనారోగ్యానికి గురిచేయడమేగాక మరణానికి కూడా సిద్దం చేస్తున్నది.

రకాలు : ఈ కాలుష్యం ఒక రకంగా లేదు. భూమి కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం ఇలా అనేక రకాలుగా మన చుట్టూ ఉండే వాతావరణం కలుషితమైపోతున్నది.

కారణాలు : దీనికి ప్రధానమైన కారణం మనమే, మనుషులమే. విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఎంత వివరించినా వాడటం మానుకోలేం. చెత్తా చెదారంలో కలిపేస్తున్నాం. దానితో భూమి పంటలు పండించే శక్తి కోల్పోతుంది.

ఈ చెత్తను, మనం వాడిన రసాయనిక పదార్థాలు కలిసిన నీటిని నదులు, కాలువలు, చెరువులలోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నాం. నీటి జీవాలను అంతం చేస్తున్నాం.
వాహనాలు, ఫ్యాక్టరీలు మొదలైన వాటినుండి గాలిలోకి చేరే పొగ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి మన ఆరోగ్యాన్ని హరించి వేస్తున్నది.
వినోదం కోసం మైకుల ద్వారా పాటలు పెద్ద ధ్వనితో పెట్టటంవల్ల, కార్ఖానాల నుండి, ప్రార్థనా స్థలాలనుండి వచ్చే శబ్దాలు చెవులకు వినికిడి శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయి. చెవిని ప్రమాదంలో పడేస్తున్నాయి.

నివారణ : అతి ఎప్పుడూ పనికిరాదు. మనం దేనిని వాడినా మితంగా వాడటంవల్ల, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కాలుష్యాన్ని కొంతవరకు అదుపులో పెట్టొచ్చు. చెట్లను బాగా పెంచాలి. సాధన చేస్తే సాధించలేనిది లేదు.

వినోద జానపద కళలు

పరిచయం : కళలు అంటే ఆనందాన్నిచ్చేవి. అలసిపోయిన శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చేవి. పనినైనా నేర్పుతో చేస్తే దానిని కళ అంటారు. జనపదాలు అంటే గ్రామాలు. అక్కడ ఉండేవారు జానపదులు. వారి ప్రత్యేక నైపుణ్యాలు జానపద కళలు.

పూర్వస్థితి : పూర్వకాలంలో తోలుబొమ్మలాట ఒక ప్రధానమైన వినోద ప్రదర్శనగా ఉండేది. మెల్ల మెల్లగా దానిలో మార్పులు చోటు చేసుకొని సినిమాలు బయలుదేరాయి. ఇక నాటకాలు, పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలు అనే భేదాలతో ఉండేవి. రంగస్థలం మీద వేషాలు వేసుకొని నాటకాలు ప్రదర్శించేవారు. ఇంకా ముందు కాలంలో వీధి భాగవతాలు, యక్షగానాలు, బిందు భాగోతాలు, పగటి వేషాలు మొదలైన ప్రదర్శనలు ఉండేవి. అనేక నృత్యాలను ప్రదర్శిస్తూ ఉండేవారు. వీటన్నిటికి చారిత్రక ఘట్టాలు, పౌరాణిక ఘట్టాలు ఇతి వృత్తాలుగా ఉండేవి. కొన్ని సమకాలీన సంఘటనలు కూడా ప్రదర్శనలో చోటు చేసుకొనేవి.

ప్రస్తుతం : రాను రాను ఈ కళలకు ఆదరణ తగ్గిపోతోంది. కొన్ని కళలు పూర్తిగా అంతరించి పోయాయి. ఏవో కొన్నిటికి మాత్రం ప్రభుత్వ ఆదరణ, గుర్తింపు లభించింది. కాని మిగతా కళాకారులు ఇప్పటికీ చెరిగిపోని గుర్తులుగా గ్రామాల్లో కనబడుతున్నారు.

కర్తవ్యం : మన ప్రాచీన వైభవాన్ని కళారూపాలను కాపాడుకోవలసిన బాధ్యత మనకెంతైనా ఉంది. ఇటువంటి కళలను, కళాకారులను మనం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వారికి గుర్తింపు లభించేలా చూడాలి. ఆయా కళలకు మన చేతనైనంత ప్రోత్సాహం ఇవ్వాలి. మన కళలను మనం కాపాడుకోవాలి.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

ఆటలు – వ్యాయామం

శీర్షిక: వ్యాయామం అంటే శరీర భాగాలన్నిటినీ ఒక క్రమపద్ధతిలో కదిలిస్తూ ఒంటికి చెమట పట్టేలా చేసే శరీర సాధన. దీనికోసం కొన్ని అభ్యాసాలుంటాయి. ఆటలు కూడా వ్యాయామంలో ఒక భాగమే. ఆటలు ఆడినందువల్ల కూడా శరీర భాగాలన్నీ కదులుతాయి.

అవసరం : వ్యాయామం చేయటం వల్ల శరీరం చురుకుగా పనిచేస్తుంది. ఈ ప్రయత్నంలో రక్తనాళాలు ఉత్తేజితమవుతాయి. రక్తంలో ఉండే మలినాలు బయటికిపోయి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. బుద్ధికూడా చురుకుగా పనిచేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన పెద్దలు!

ఆటలు – ప్రయోజనాలు : కూర్చొని ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటాం. వీటికి మెదడు చురుకుగా పనిచేయాలి. మైదానంలో ఆడే ఆటలు ఔట్ డోర్ గేమ్స్. వీటివల్ల శరీరం దృఢంగా తయారౌతుంది. రక్తం చక్కగా ప్రసరిస్తుంది. మలినాలు చెమట ద్వారా బయటికి వచ్చేస్తాయి. రక్తం శుభ్రపడుతుంది. శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది.

ఆడే ఆటలో నైపుణ్యం చూపించాలంటే బుద్ధికూడా చురుకుగా పనిచేయాలి. చురుకుదనం, ఏకాగ్రత, దీక్ష ఇవన్నీ ఆటలవల్ల కలుగుతాయి. మెదడు చురుకుగా పనిచేయటం వల్ల చదువుపై కూడా ఏకాగ్రత కలిగి ఏ విషయాన్నైనా తొందరగా నేర్చుకోగలుగుతారు.

ఆడకపోతే : ఊరికే ఇంట్లో కూచుని టి.వి.లు చూస్తూ ఉంటే బుద్ధి మందగిస్తుంది. శరీరం బరువు పెరిగిపోతుంది. కళ్ళు దెబ్బ తింటాయి. సోమరితనం పెరిగిపోతుంది.
కనుక ప్రతివారికీ వ్యాయామం ఎంతో అవసరం. అది ఆటల రూపంలో ఐతే మరీ మంచిది.

ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు

ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. పూర్వకాలంలో ఈ కొండలు, నదులు, అడవులు, సెలయేళ్ళు, అడవి జంతువులు, అడవులలోని ఉత్పత్తులు సమృద్ధిగా లభించేవి. ప్రకృతి ఆనందకరంగా, హాయిగా ఉండేది. సకాలంలో వర్షాలు కురిసేవి. వాతావరణంలో ఋతువుల మార్పులు మంచి సుఖాన్నిచ్చేవి.

రాను రాను జనాభా పెరిగిపోతున్నది. అవసరాలు పెరిగిపోతున్నాయి. అడవులు నరికేస్తున్నారు. అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రకృతి సంపదను కరిగించేస్తున్నారు. తమ తరువాత వచ్చే వారికి ఏమివ్వాలని ఆలోచించటం లేదు.

సాంకేతికంగా అభివృద్ధి సాధించారు. ఆధునిక పరికరాలు వాడుతున్నారు. కర్మాగారాలు, పరిశ్రమలు అధికంగా స్థాపించి వాటి నుంచి వచ్చే వ్యర్థాలను నీళ్ళలోకి వదిలి నీళ్ళను కలుషితం చేస్తున్నారు. పొగతో గాలి కలుషమైపోతున్నది. ప్రజలు అనారోగ్యం పాలౌతున్నారు.

ఇది తప్పు. మానవులు తమ తప్పు తెలుసుకొని పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో కాలుష్యం తప్ప ఏమీ మిగలదు. భావితరాలకు భవిష్యత్తులో కాలుష్యం తప్ప ఏమీ మిగలదు. భావితరాలకు భవిష్యత్తే లేదు.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

మానవులు, పక్షులు, పశువులు…సుఖంగా జీవించాలంటే ప్రకృతి పట్ల మన ఆచరణ

మానవులు, పశువులు, పక్షులు, ఇతర జలచరాలు ప్రకృతిలోని జీవులన్నీ సుఖంగా జీవించాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి.

నీరు : నీటిని వృధా చేయకూడదు. వర్షపు నీటిని నిలవ చేయడానికి ఇంకుడు నీటి గుంటలు తవ్వాలి. నదులు, చెరువులు మొదలైన వాటిలోని నీటిని కలుషితం చెయ్యకూడదు. పశువులను కడగటం, బట్టలుతకటం వంటి పనులు జలాశయాల్లో చెయ్యకూడదు. మురుగునీరు, ఫ్యాక్టరీల నీరు పోవడానికి వేరే ఏర్పాట్లు చెయ్యాలి. వాడుకునే నీటిలోకి వదలకూడదు.

గాలి : ఫ్యాక్టరీలను ఊరికి దూరంగా నిర్మించుకోవాలి. జనావాసాల మధ్య ఉంటే ఆ పొగ, దుమ్ము, ధూళి వలన కాలుష్యం ఎక్కువైపోయి మనుషుల ఆరోగ్యం పాడౌతుంది. మురికి ఇల్లంతా నిండిపోతుంది.

శబ్దం: ఆ శబ్దాల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇంట్లో మనం ఉపయోగించే టి.వి.లు, రేడియోలు వంటివి కూడా తక్కువ శబ్దంతో ఉపయోగించాలి. సెల్ఫోన్ల వాడకం తగ్గించటం వల్ల మనకే కాకుండా ఇతర ప్రాణులకు కూడా ప్రమాదం తప్పుతుంది.

వాహనాల వినియోగం నియంత్రించాలి. దానివల్ల గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గుతుంది.
ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలి. చెట్లను అధికంగా పెంచాలి. ఒక చెట్టునరికే ముందు పది చెట్లను పెంచాలి.
ఇలా చేయటం వల్ల ప్రకృతిని కొంతవరకు కాపాడగలుగుతాం.

చెట్లు మనకు చేసే మేలు

చెట్టు మనకు తల్లి వంటిది. తల్లి మనకు ఊపిరి ఊదుతుంది. మన సంరక్షణ చూస్తుంది. మనకు కావలసినవన్నీ ఇస్తుంది. కడుపు నింపుతుంది. సేదతీరుస్తుంది. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఔషధం ఇస్తుంది.

పైన చెప్పిన సేవలన్నీ మనకు చెట్ల వల్ల లభిస్తాయి. చెట్లవల్ల ప్రాణవాయువు లభిస్తుంది. చెడు వాయువులను కాలుష్యాన్ని చెట్లు పీల్చుకొని మనను బతికిస్తాయి. ఇంటికి కావలసిన కలప, వంటకు కావలసిన కట్టె సమస్తం చెట్ల నుండి లభిస్తాయి. తినడానికి కాయలు, పండ్లు, ఆకులు మొదలైనవన్నీ ప్రేమగా అందిస్తాయి. మన కడుపునింపి ఆకలి తీరుస్తాయి. చల్లని నీడనిచ్చి, గాలినిచ్చి సేదతీరుస్తాయి. ఎన్నో చెట్లలో ఔషధగుణాలుంటాయి. వాటివల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుతాయి. వరదలను ఆపుతాయి. వానలను కురిపిస్తాయి. పశువులకు నీడను, గూడును ఇస్తాయి. ఆహారాన్నిస్తాయి. ఇలా ఎన్నో విధాలుగా చెట్లు మనకు మేలు చేస్తున్నాయి.

విహారయాత్రలు

పరిచయం : విహారయాత్రలు అంటే శారీరక, మానసిక ఆనందం చేసే యాత్రలు. కాని ఇవి అక్కడికే పరిమితం కాదు. అలా తిరుగుతూ అనేక ప్రదేశాలు చూడడంవల్ల వినోదంతో పాటు విజ్ఞానం కూడా పొందాలి.

ఆవశ్యకత : విద్యార్థి దశలో అతి ముఖ్యమైన ఆనందకరమైన ఘట్టం ఈ విహారయాత్రలు. ఇలా విహారయాత్రలకు వెళ్ళటం వల్ల విద్యార్థులలో సంఘీభావం ఏర్పడుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. వివిధ ప్రదేశాలు చూడటంవల్ల వాటిని గురించి చారిత్రక విషయాలు తెలుసుకుంటారు. ఆయా ప్రదేశాలలోని ప్రజల భాష, ఆచార్య వ్యవహారాలు నాగరికత మొదలైన విషయాలు తెలుసుకుంటారు. చదువులు, పరీక్షలు, హోం వర్కులు ఈ దినవారీ కార్యక్రమాలనుండి మార్పు లభిస్తుంది. దానివల్ల మనసు తేలిక పడుతుంది. తిరిగి వచ్చాక మరింత ఉత్సాహంతో చదువు సాగిస్తారు.

ఉపయోగాలు : విద్యార్థులకు రకరకాల ప్రజలతో ఎలా మెలగాలో, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ప్రయాణాలు చేయడం అలవాటు ఔతుంది. తల్లిదండ్రుల నుంచి కొంచెం దూరంగా కొన్నాళ్ళు గడిపినందువల్ల భవిష్యత్తులో చదువులకు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండగలుగుతారు. లోకజ్ఞానం పెరుగుతుంది. ప్రయాణ సమయంలో చేసుకోవలసిన ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుస్తాయి.

ముగింపు : ఇలా ఎన్నో విధాల ప్రయోజనకరమైన విహారయాత్రలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ప్రయోజనం. వీటిని మనం ప్రోత్సహించాలి.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

బాల్య వివాహాల నిషేధం

బాల్యంలోనే చేసే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ప్రతివారి జీవితంలోను బాల్యం ఒక మధురఘటం. శారీరకంగా, మానసికంగా ఎదిగే వయస్సది. చక్కగా చదువుకుంటూ ఆడుకుంటూ కాలంగడపాల్సిన వయస్సది.

దురదృష్టవశాత్తూ మనదేశంలో ఇంకా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా ఆడపిలల్లకు వివాహ వయస్సు రాకుండానే పెళ్ళిళ్ళు చేయడం మూలంగా వారికి జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. ఆడవారికి 18 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు పెళ్ళిళ్ళు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. 18 ఏళ్ళ కన్నా ముందే పెళ్ళిళ్ళు చేయడం వల్ల శారీరక ఎదుగుదలకు అవరోధం ఏర్పడి, ఆడవారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంత చిన్న వయస్సులో పెళ్ళిళ్ళ వల్ల చదువు ఆగిపోయే ప్రమాదముంది. పుట్టే పిల్లలు కూడా సరిగా ఎదగరు. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి. చక్కగా చదువుకోవాలి. 18 ఏళ్ళ వరకు ఆడపిల్లలకు, 25 ఏళ్ళ వరకు మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదు. బాల్య వివాహాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని అందరమూ సక్రమంగా అమలు చెయ్యాల్సిన అవసరం ఉంది.

ఒక పండుగ – ఉగాది

మానవులు బాధలు మరచి సుఖంగా జీవించడానికి ఏర్పడినవే పండుగలు. అన్ని మతాల వారికి పండుగలున్నాయి. హిందువులకు ఉగాది, దసరా, సంక్రాంతి వంటి పండుగలు, క్రీస్టియన్లకు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు, ముస్లిములకు రంజాన్, బక్రీద్ వంటి పండుగలు ఉన్నాయి. ఇవేకాక, భారత ప్రజలందరూ జరుపుకొనే స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ వంటి జాతీయ పండుగలు ఉన్నాయి.

‘ఉగాది’ పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం. తెలుగు వారి తొలిపండుగ ఉగాది. వీటిలో ఆ రోజు భక్తితో దైవాన్ని ప్రార్థిస్తారు. ఆరోగ్యవంతమైన ‘ఉగాది’ పచ్చడిని తింటారు. ఈ పండుగరోజున వినోద కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తారు. ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి వలె జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్నిస్తుంది ఈ పండుగ.

స్వాతంత్య్ర దినోత్సవం

ఒకరికి లొంగిఉండక స్వేచ్ఛగా జీవించగలగటమే స్వాతంత్ర్యం. మనదేశాన్ని సుమారు రెండువందల సంవత్సరాలపాటు ఆంగ్లేయులు పాలించారు. ఆ సమయంలో మనం వారికి బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. భారతమాత దాస్యాన్ని వదిలించడానికి మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్ వంటి ఎంతోమంది మహానాయకులు ప్రయత్నించారు. మహాత్మాగాంధీ నేతృత్వంలో అహింసా మార్గంలో దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం వచ్చింది.

ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజు మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటాం. ఎంతో కష్టించి సంపాదించిన స్వాతంత్ర్యాన్ని మనమందరం రక్షించుకోవాలి.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

బంగారు తెలంగాణ

ఎందరో త్యాగధనుల పుణ్యబలంతో తెలంగాణ సిద్ధించింది. అలుపెరగని ఉద్యమాలు, యువకుల ఆత్మబలిదానాలు, నాయకుల అకుంఠిత కృషి, ఉద్యోగ సంఘాల సమష్టి పోరాటం ఈ త్యాగాలతో నవ తెలంగాణ సిద్ధించింది. త్యాగాల పునాదులపై మన తెలంగాణ సిద్ధించింది.

సాధించుకున్న తెలంగాణ రాష్ట్రమును అన్ని రంగాల్లో ముందుకు తీసుకొనివెళ్ళాలి. పాడిపంటలతో కళకళలాడాలి. పరిశ్రమల స్థాపన జరగాలి. నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించాలి. రైతులు ఆనందంతో పంటలు పండించాలి. విద్యుత్ వెలుగులు నిరంతరం వెలగాలి.

రాష్ట్రంలో ప్రజలందరు సమైక్యంగా పోరాడాలి. మన చెరువులను పునరుద్ధరించుకోవాలి. పచ్చని చెట్లను నాటాలి. అర్హులందరికి సంక్షేమ పథకాలు అందాలి. ప్రతి బాలుడు బడిబాట పట్టాలి. ప్రజలందరిలో కష్టపడే మనస్తత్వం అలవడాలి. అప్పుడే నవతెలంగాణ – అదే మన బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. మన చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.

చెరువులు- పునరుద్ధరణ

మన తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు కొరత లేదు. కాకతీయుల కాలంలో చెరువులు ఎక్కువగా ఉన్నాయి. చెరువుల ద్వారా త్రాగునీటిని, సాగునీటిని అందించే సదుపాయం ఉంది. కాని ఈనాడు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు ఆక్రమణలకు గురి అయ్యాయి. మరికొన్ని పూడికతో నిండిపోయాయి.

ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. సాధించుకున్న తెలంగాణ ప్రాంతాన్ని బంగారు తెలంగాణగా మార్చాలి. అందుకోసం మన ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ అనే పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువులకు పూర్వవైభవం సాధించి పెట్టాలన్నదే మన ప్రభుత్వ ఆశయం. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి, స్వచ్ఛంద సంస్థల నుండి అనూహ్య స్పందన వచ్చింది.

ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలి. మన ప్రాంతాన్ని, మన చెరువులను మనమే అభివృద్ధి చేసుకోవాలి. నిధుల సమీకరణలో ప్రభుత్వంతో సహకరించాలి. ప్రభుత్వ అధినాయకులు కూడా కాకతీయ మిషన్ కార్యక్రమంలో అవినీతి కలగకుండా తగు చర్యలు తీసుకోవాలి. బంగారు తెలంగాణ సాధనలో రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్లో ‘డేటా’ (Data) ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.

కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైన వాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లు ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందనీ కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

పర్యావరణ సంరక్షణ
(పరిసరాల కాలుష్యం – నివారణ)

భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్త, చెదారమేకాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి, సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజి వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్తరోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కాని ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.
యంత్రాలవల్ల, వాహనాలవల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది.

1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. నాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

మొక్కల పెంపకం

‘నేడు మన భారతదేశంలో వృక్ష సంపద బాగా తగ్గిపోతున్నది. పూర్వం ఉన్న అడవులను నరికి ప్రాజెక్టులు నిర్మించడం, వ్యవసాయ భూములుగా మార్చడం, ఇండ్లు కట్టడం చేస్తున్నారు. అందువల్ల సరైన వర్షాలు లేక నదులు ఎండిపోతున్నాయి. కరవులు సంభవిస్తున్నాయి. విద్యుత్తు కొరత ఏర్పడుతున్నది. వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నది.

మానవ మనుగడకే ముప్పువాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మొక్కలను నాటడం అత్యవసరమని ప్రప్రథమంగా గుర్తించిన వ్యక్తి పూర్వపు కేంద్ర మంత్రి K.M మున్నీ. ఆయన మంత్రి పదవి నుండి నిష్క్రమించిన తరువాత ఆ మాట పట్టించుకొన్నవారు కరువయ్యారు.

పచ్చని మొక్కల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి మనం విడిచే బొగ్గుపులుసు వాయువును పీల్చి ప్రాణవాయువును అందిస్తాయి. వాతావరణాన్ని చల్లబరచి ప్రాణికోటికి సుఖాన్ని కలిగిస్తాయి. మనల్ని వాతావరణ కాలుష్యం నుండి కాపాడుతాయి. కొబ్బరి, మామిడి, నారింజ, నిమ్మ వంటి మొక్కల వల్ల ఆదాయం లభిస్తుంది. సర్వీ, యూకలిప్టస్ వంటి మొక్కలను వంట చెరకుగాను, బాదులుగాను ఉపయోగిస్తారు. ఈ విధంగా మొక్కలే మహావృక్షాలై ప్రాణికోటికి వివిధ రీతులలో మేలును చేకూరుస్తాయి.

మొక్కల పెంపకం వల్ల తమకే కాక దేశానికి కూడా ఎంతో ప్రయోజనం ఉంది. అవి మానవులకు గొప్ప సంపద వంటివి. అందువల్ల మొక్కలను పెంచి దేశాన్ని సస్యశ్యామలంగా, సంపన్నంగా చేయడం ప్రతి వ్యక్తి కనీస కర్తవ్యం. “వృక్షో రక్షతి రక్షితః” అన్నారు పెద్దలు. వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని జీవితాంతం రక్షిస్తాయి.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

నదులు – ఉపయోగాలు

నదులు పర్వతాలలో పుడతాయి. అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో ఇంచుమించు నదులు ఉంటాయి. అందులో కొన్ని జీవనదులు, మరికొన్ని వర్షాధార నదులు.

మన దేశంలోని నదులను రెండు విధాలుగా విభజించవచ్చు.

  1. హిమాలయాల గుంపు
  2. దక్కను గుంపు.

హిమాలయపు నదులు దక్కను నదుల కంటే తక్కువ వయస్సు కలవి. హిమాలయపు నదులు మంచు కరగడం వల్ల, వర్షాల వల్ల సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. అందుచేత వీటిని శాశ్వతనదులు అంటారు. హిమాలయపు గుంపులో సింధు, గంగ, బ్రహ్మపుత్ర ముఖ్యమైనవి.

దక్కను నదులు అనేక వేల సంవత్సరాల నుండి ప్రవహిస్తున్నాయి. ఈ నదులలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, మహానది, నర్మద, తపతి మొదలైనవి. ఈ నదులు పూర్తిగా వర్షంపై ఆధారపడినట్టివి. అందువల్లనే వేసవికాలం వచ్చేటప్పటికి నదులు సన్నబడిపోయి చిన్న ప్రవాహాలలాగా ఉంటాయి.

నదుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నదులకు వంతెనలు కట్టి, రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు. కాలువల ద్వారా లక్షలాది ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాలను కలిగించి, పంటలు బాగా పండించుకోవచ్చు. నదిలోని నీటి ద్వారా విద్యుదుత్పాదక శక్తి కలిగించుకొనే థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నదులను రవాణా సౌకర్యానికి ఉపయోగించుకోవచ్చు. ఇతర ప్రాంత ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేయవచ్చు.

కంప్యూటర్ విద్య

ఈనాడు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కంప్యూటర్ మన జీవితంలో ఓ భాగం అయింది. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. ఇంతటి అద్భుతశక్తి కంప్యూటర్కు ఉండబట్టే, విద్యారంగంలో నేడు కంప్యూటర్కు మిక్కిలి ప్రాధాన్యం లభించింది.

నేడు కె.జి. నుండి పి.జి. వరకు ఏదో ఒక రూపంలో కంప్యూటర్ విద్య అభ్యసిస్తూనే ఉన్నారు. కంప్యూటర్ విద్యలో వివిధ కోర్సులు నేర్పడానికి ప్రైవేటు విద్యాసంస్థలు పోటీపడుతున్నాయి. బోధనోపకరణాలలో కంప్యూటర్ ప్రముఖ స్థానాన్ని వహించింది. అభ్యాసకులు తమకు కావాల్సిన నైపుణ్యాలను, విజ్ఞానాన్ని కంప్యూటర్ల ద్వారా పొందుతున్నారు.

కంప్యూటర్ పై విద్యాబోధనవల్ల విద్యార్థులలో సృజనాత్మకత, ఊహాశక్తి పెంపొందుతాయి. ఉపాధ్యాయులకు బోధనాసామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుని బోధనను అందరు విద్యార్థులు సమానంగా గ్రహించలేరు. అటువంటివారికి నిదానంగా అభ్యసనం చేసుకొనే అవకాశం కంప్యూటర్ ద్వారా లభిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకొనే అవకాశం ఉంది. కంప్యూటర్ విద్య అభ్యసించినవారికి వారివారి శక్తి సామర్థ్యాలను, మేధాసంపత్తిని బట్టి దేశవిదేశాలలో మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి విద్యారంగంలో కంప్యూటర్ పాత్ర చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

బాల కార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరువు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళల్లోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

బాల కార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆధునిక సాంకేతిక ప్రగతి

మానవ జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉపయోగం నిత్యకృత్యమయింది. గడియారం, రేడియో, టేప్ రికార్డర్, టివి, టెలిఫోన్, ఫ్రిజ్ ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల జాబితాను చెప్పవచ్చు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల జాబితాకి చెందిన వాటిలో కంప్యూటర్ ముఖ్యంగా పేర్కోదగింది. ఆధునిక సాంకేతిక ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.

ఒకనాడు టెలిఫోన్ కనిపెట్టినందుకు, రేడియో తయారుచేసినందుకు ఆశ్చర్యపోయాం. ఇప్పుడు దేశ విదేశాలకు నేరుగా వెంటనే మాట్లాడే అవకాశం ఏర్పడింది. మూవింగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఫోన్లు, కార్డ్స్ ఫోన్లు, సెల్యులర్ ఫోన్లు ప్రవేశించాయి. ‘పేజర్’ అనే అద్భుత సాధనం అందుబాటులోకి వచ్చింది. ‘దూరదర్శన్’ మనకి ఈనాడు అత్యవసర సాధనమయింది. ఇవన్నీ ఆధునిక సాంకేతిక ప్రగతికి నిదర్శనాలే.

కంప్యూటర్ను కనుక్కోవడంతో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇది కంప్యూటర్ యుగం అనిపించుకుంటోంది. మనిషికన్నా వేగంగా చకచకా శాస్త్రీయంగా కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. “ఇంతింతై వటుడింతయై ……………” అన్నట్లుగా ఈనాడు కంప్యూటర్ అన్ని రంగాలలో విస్తరించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కంప్యూటర్ తప్ప మరోమాట వినిపించదు.

మనిషి కొన్ని రోజుల్లోగానీ అందించలేని సమాచారం కంప్యూటర్ కొన్ని క్షణాల్లోనే అందిస్తుంది. కంప్యూటర్లోని ఇంటర్నెట్ సదుపాయంవల్ల ప్రపంచంలో ఏ మూలనైనా జరిగే వింతలూ విశేషాలూ క్షణాల్లో తెలుసుకోగలం. ఇంటర్నెట్లో ఉన్న గొప్ప సదుపాయం. ఇ మెయిల్ (E-mail). దీని ద్వారా మనం అనుకున్న సమాచారాన్ని కంప్యూటర్లో ఇంటర్నెట్ కలిగి ఉన్న మరొక వ్యక్తికి కొన్ని క్షణాల్లోనే అందజేయవచ్చు. ఈ విధంగా ఆధునిక సాంకేతిక ప్రగతి దినదినాభివృద్ధి చెందుతోంది.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

నదీజలాల సంరక్షణ

నేలలో విత్తనాలు చల్లి నీటి కోసం నింగివైపు చూసే ఎన్నో గ్రామాలు నేటికీ మన దేశంలో ఉన్నాయి. నదీజలాల అదుపు, పొదుపు లేకపోవడం వల్ల అవి సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. దాంతో సాగునీటికీ, తాగునీటికీ తీవ్రమైన కొరత ఏర్పడుతోంది.

నదులకు ఆనకట్టలు కట్టి దేశాన్ని సస్యశ్యామలం చేయాల్సిన పథకాలు రూపొందించారు. కానీ అవి ఆర్థిక, రాజకీయ, పర్యావరణ కారణాల వల్ల నత్తనడక నడవడమో, నీరుకారిపోవడమో సంభవిస్తోంది. దీనికి ఉదాహరణగా నర్మదా ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. నెర్రెలు విచ్చిన భూమినీ, దాహంతో పిడచకట్టుకుపోయిన నోళ్ళనీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.

అందువల్ల నదీజలాల సంరక్షణ చేపట్టి సాగునీటికీ, తాగునీటికీ కొరత లేకుండా చూడాలి. పెరుగుతున్న జనాభాతో పాటు జలవనరులు పెరగడం అసాధ్యం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశానికైనా రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి అందుబాటులో ఉన్న వనరుల్ని పొదుపుగా వాడటం. రెండోది అభివృద్ధిపరచడం సాధ్యం కాకపోయినా, ప్రస్తుత స్థాయిని పరిరక్షించడం. అందువల్ల నదీజలాల సంరక్షణ గావించి, పొదుపుగా వాడుకోవడం సరైన మార్గం.

నదులపైన నిర్మించే ఆనకట్టలు, బహుళార్థక ప్రయోజనాలు సాధించే పథకాలు, నదుల అనుసంధానం, వివిధ రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ లాంటివి, వివిధ కారణాలవల్ల త్వరగా పూర్తికావడం లేదు. అందుమూలంగా మనదేశంలోని వివిధ ప్రాంతాలు వర్షాల మీదే ఆధారపడుతున్నాయి. సకాలంలో వర్షాలు పడక నానా యాతనలు పడాల్సివస్తోంది. కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలంటే నదీజలాలు వృథా కాకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపైనా ఉంది.

ప్రకృతి వైపరీత్యాలు

తుపాను, భూకంపం, వరదలు, సముద్రాలు ముంచెత్తడం, చీడపీడలు వంటి బీభత్సకార్యాలను ‘ప్రకృతివైపరీత్యాలు’ అంటారు. ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చే వైపరీత్యాలకు మానవులు తల్లడిల్లిపోతున్నారు.

తుపానువంటి బీభత్సాలు అన్ని నెలల్లోను వస్తున్నాయి. శాస్త్రజ్ఞులు వీటిని అరికట్టలేకపోయినా, వీటి రాకడను మాత్రం ఒకటి రెండు రోజుల ముందు తెలుసుకోగల్గుతున్నారు. అది కొంతనయం. దీనివల్ల కొంత జాగ్రత్త వహించడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడానికి వీలవుతుంది.

ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం రేడియో, దూరదర్శన్ల ద్వారా చేసే హెచ్చరికలను పాటించి ప్రజలు జాగ్రత్త వహిస్తే మరణాల సంఖ్య, నష్టం పరిమితి తగ్గుతుంది. ప్రజలు ప్రభుత్వంతో సహకరించి ఆయా సూచనలను పాటించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి.

ప్రకృతి వైపరీత్యంలో నష్టపోయినవారికి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పడాలి. చనిపోయినవారి బంధువులకు నష్టపరిహారం ఇవ్వాలి. స్వచ్ఛంద సేవా సంస్థలవారు తమ సహకారాన్ని అందించాలి. సంపన్నులైనవారు ఆపదలో చిక్కుకున్నవారికి ధనం, ఆహారపదార్థాలు, బట్టలు, పాత్రసామగ్రి మొదలైనవి ఇచ్చి వారిని ఆదుకోవాలి.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

మన పండుగలు

మనిషికి ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించే సందర్భమే పండుగ. పండుగ అంటే సంబరం, ఆనందం, ఉత్సాహం అన్న అర్థాలున్నాయి. మనిషి కేవలం ఆహారం వల్లే జీవించడు. మానసికోల్లాసం కూడా అవసరం. మానవునికి మానసికోల్లాసం కలిగించేవి పండుగలు. మానవుడు పండుగలు పబ్బాలు, వేడుకలు, వినోదాలు, ఆటపాటలు మొదలైనవాటి ద్వారా మానసికోల్లాసాన్ని పొందుతాడు.

అన్ని మతాలవాళ్ళకు వారివారి మతాచారాలకు అనుగుణంగా పండుగలు ఉంటాయి. హిందువులు సంక్రాంతి, దసరా, సంవత్సరాది, దీపావళి మొదలైన పండుగలను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. క్రైస్తవులు క్రిస్టమస్ ను, ముసల్మానులు రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఇవికాక ఇంకా ఎన్నో పండుగలను వారు జరుపుకొంటారు. ఒక మతస్థుల పండుగలకు ఇతర మతస్థులు శుభాకాంక్షలు చెప్పడం మంచి సంప్రదాయం.

పండుగల ప్రధాన ఉద్దేశం, ప్రయోజనం, సామూహిక ఆనందం. పండుగలకు ఆడపడచులను, బావగార్లను తీసుకురావడం, వారికి సకలవైభవాలు సమకూర్చి కొత్తబట్టలు, కానుకలు ఇవ్వడం పండుగ రివాజు. ఈ విధంగా బంధుమిత్రులను అందర్నీ ఒకచోట చేర్చే మహత్తర సావకాశం పండుగలవల్ల కలుగుతోంది. నిజానికి పండుగలు మన సంస్కృతిని కాపాడే దివ్యసాధనాలు.

కళలు – ప్రయోజనాలు

వస్తువులను అందంగా, ఆకర్షణీయంగా, నేర్పుగా నిర్మించడాన్నే ‘కళ’ అంటారు. అంటే తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి మానవుడు ప్రతిభతో చేసే పనులకే కళలని పేరు. కుర్చీలు, బల్లలు ధరించే వస్త్రాలు, ఆభరణాలు, కూజాలు, పుష్పాలంకరణ సామగ్రి మొదలైనవన్నీ కళల కిందికే వస్తాయి. మనం ఉపయోగించే వస్తువులను నిర్మించే కళలను ‘ఔపయోగిక
కళలు’ అంటారు.

మన పూర్వులు కళలు ‘అరవై నాలుగు’ అని పేర్కొన్నారు. వీటిలో మనిషి నిత్యజీవితంలో భౌతికంగా ఉపయోగపడేవి ఔపయోగిక కళలు. మనిషికి మానసికానందాన్ని, వికాసాన్ని కలిగించేవి లలిత కళలు. లలిత కళలు ఐదు. అవి : కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనేవి. కొందరు వాస్తువును కూడా లలిత కళ అంటారు.

ఆనందాన్ని కలిగించడమే లలిత కళల పరమ ప్రయోజనమని గుడ్ హార్డ్ లెండల్ మహాశయుడు పేర్కొన్నాడు. భౌతిక ప్రయోజనం అంతగా లేకున్నా మానవ జీవితానికి ఆనందాన్ని కల్గించడమే లలిత కళల ప్రయోజనం. ఇది అనుభవైకవేద్యం. అంటే మనం అనుభవించి తెలుసుకోవలసిందే తప్ప ఇంకొకరు చెప్తే తెలిసేది కాదు అని. అలాగే ఈ కళల వల్ల కలిగే ఆనందం అనిర్వచనీయం. అనిర్వచనీయం అంటే ఇట్లా ఉంటుంది అని మనం వర్ణించి చెప్పలేనిది.

పత్రికలు

“పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు” అన్నారు. నార్ల వెంకటేశ్వరరావు. ప్రజాస్వామ్య సౌథానికి పత్రికలు మూలస్తంభాలు. పత్రికలు జాతికి జీవనాడి వంటివి. సమాజంలో పత్రికలు అతి కీలకమైన స్థానం వహిస్తున్నాయి.

మన రాష్ట్రంలో దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు స్థాపించిన ‘ఆంధ్రపత్రిక’, ముట్నూరి కృష్ణారావుగారు స్థాపించిన ‘కృష్ణాపత్రిక’ మొదటి పత్రికలుగా గుర్తింపు పొందాయి. తరువాత తరువాత చాలా రకాల పత్రికలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ పత్రికలు దిన, వార, పక్ష, మాస పత్రికలుగా వెలుగు చూస్తున్నాయి.

ఈ పత్రికలలో దిన పత్రికలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త, విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి దిన పత్రికలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. పత్రికలు ప్రభుత్వానికీ ప్రజలకీ మధ్య వారధిలా పని చెయ్యాలి. అంటే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని, ప్రకటనల్ని పత్రికలు ప్రజలకు తెలియజేయాలి. అలాగే వాటిని గురించి ప్రజా స్పందన ఎలా ఉందో వివరించే బాధ్యత కూడా పత్రికలపైనే ఉంది.

విశాలదృష్టితో ప్రజల సంక్షేమం ప్రధానంగా భావించటం పత్రికల నైతిక బాధ్యత. సమాజాన్ని మేల్కొలిపే వైతాళికుల లాంటివి పత్రికలు.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

ఒకే అంశంపై వ్యాసం, ప్రకటన, లేఖ ఎలా ఉంటాయో చూడండి.

వ్యాసం: దేశ రక్షకులు – సైనికులు

భారతదేశం ఉపఖండం. అంటే అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల వలె ఖండంగా చెప్పదగినదన్నమాట. ఈ దేశానికి కొన్నివేల ఏండ్ల చరిత్ర ఉంది. అమూల్యమైన ఖనిజ సంపదలు, అపారమైన ప్రకృతి సంపదలు మనదేశంలో ఉన్నాయి. రత్నగర్భ అని దీనికి పేరు. ఈ సంపదలపై కన్నువేసి విదేశీయులు మనదేశంలో పాగావేసి, నక్కజిత్తులతో మనదేశంలో మననే బానిసలు చేశారు.

ఎందరో వీరుల త్యాగఫలంగా మనదేశానికి దాస్యవిముక్తి కలిగింది. ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి మన వీరజవానులు పగలూ రాత్రీ జాగ్రత్తగా కావలి ఉంటున్నారు. శత్రుసైనికులెత్తి వస్తే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కొంతమంది వీరమరణాన్ని పొందుతున్నారు. అటువంటి సైనికులను గౌరవించటం మన కర్తవ్యం.

వారి కుటుంబాలకు స్నేహహస్తాన్ని అందించాలి. వారి కష్టసుఖాలలో భాగం పంచుకోవాలి. జవానులకు మనం తోడుగా ఉన్నామని చెబుతూ వారిని ప్రోత్సహించాలి.

జైహింద్

ప్రకటన : మనకోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులను స్మరిద్దాం

మిత్రులారా!

ప్రపంచంలోనే రత్నగర్భగా ప్రసిద్ధి పొంది ఎన్నో దేశాలవారికి ఈర్ష్య కలిగించి అనంత సంపదలు గల మనదేశాన్ని విదేశీయులు మెల్లమెల్లగా ఆక్రమించుకున్నారు. ఆ సమయంలో దేశభక్తులైన మన నాయకులు ప్రాణాలను తృణపాయంగా ఒడ్డి మాతృభూమి దాస్యాన్ని విడిపించారు.

అటువంటి స్వాతంత్ర్యం పరులపాలు కాకుండా సరిహద్దులో అహర్నిశలూ కావలి కాస్తున్న మన వీరసైనికులకు మన గౌరవ వందనాలు తెలుపుకొనే ఆశయంతో ఈ నెల 9వ తేదీ “సైనిక వందనం” అనే పేరుతో మన పాఠశాలలో ఒక సమావేశం ఏర్పాటు చేశాము. మీలో కొందరు ఆ వీరజవానుల సంతానం ఉన్నారు గదా! ఈ సమావేశానికి వీ కుటుంబ సభ్యులను కూడ తీసుకురండి. మన సైనికులు చేస్తున్న సేవల గురించి, వారి గొప్పదనాన్ని గురించి మాట్లాడుకుందాం.

ఇటీవలి సరిహద్దు పోరాటంలో అమరులైన జవానులకు శ్రద్ధాంజలి సమర్పించుకుందాం. ఇది మనందరి కర్తవ్యం. మీరంతా పూనుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

జైజవాన్ – జైహింద్

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

లేఖ : దేశ రక్షణలో ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాన్ని స్మరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.

వరంగల్,
తేది : XXXX

ప్రియమైన రంగనాథ్కు,

నేను బాగున్నాను. నీవు బాగున్నావు గదా! ఈ మధ్య మా బడిలో ‘సైనిక వందనం’ అనే కార్యక్రమం జరుపుకున్నాము. ఆ సంగతులు నీతో చెప్పాలని ఈ జాబు రాస్తున్నాను.

ఎన్నో యుగాల చరిత్రగల మన భారతదేశం ప్రకృతి సంపదకు ఆలవాలం. ఖనిజ సంపదలకు నిలయం. అన్నపూర్ణగా కీర్తి కెక్కింది. అటువంటి మనదేశంపై కన్నేసిన కొందరు విదేశీయులు చాపకింద నీరులా మనదేశంలో ప్రవేశించి మనదేశానికి ప్రభువులై మనలను బానిసలు చేశారు. ఎందరో వీరుల త్యాగఫలంగా మన స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. దీనిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం కదా!

వీరజవానులు మనందరి తరఫున ఆ బాధ్యతను స్వీకరించి ఎండా వానా, రాత్రీ పగలూ లేకుండా అన్ని కష్టాలూ చిరునవ్వుతో భరిస్తూ సరిహద్దులో కావలి కాస్తున్నారు. శత్రువులు దండెత్తినప్పుడు ప్రాణాలు త్యాగం చేయటానికి కూడా వెనుకాడక పోరాడి దేశాన్ని కాపాడుతున్నారు. అటువంటి వీరజవానులకు గౌరవ వందనం చేయడానికి మేం సమావేశమైనాము. వారి త్యాగాల గురించి చెప్పుకున్నాము. సమావేశానికి వచ్చిన అతిథులకు బిస్కట్లు, తేనీరు ఇచ్చాము.

మీ బడి విశేషాలతో నాకు ఉత్తరం రాస్తావుగా, ఉంటాను.

నీ స్నేహితుడు,
ప్రదీప్.

చిరునామా :
మాడభూషి రంగనాథ్,
7వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల,
మధిర,
ఖమ్మం జిల్లా.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

వ్యాసం : స్వచ్ఛభారత్

పరిచయం : స్వచ్ఛభారత్ అంటే పరిశుభ్రమైన భారతదేశం. ఎవరికి వారు తమ ఇల్లు, పరిసరాలు, తిరిగే ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకుంటే దేశమంతా స్వచ్ఛంగా ఉన్నట్లే. ఏ కాలుష్యాలూ లేకుండా చేసుకుంటే ఏ రోగాలూ మన దగ్గరికి రాకుండా ఉంటాయి.

ఉద్దేశం : మన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అందించిన నినాదం ‘స్వచ్ఛభారత్’. ప్రజలకు వారి బాధ్యతను గుర్తు చేయడానికి స్వచ్ఛత గురించిన అవగాహన వాళ్ళలో కలిగించడానికి ఉద్దేశించినది ఈ స్వచ్ఛభారత్ ఉద్యమం.

ఆచరించాల్సినవి : నీటిని కాచి వడకట్టి శుభ్రమైన పాత్రలలో ఉంచుకొని, చేతులు ముంచి మురికి చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి అనేది ఒక అంశం. ప్రతి ఇంటా మరుగుదొడ్లు ఉండాలని! ఆరుబయట మలమూత్ర విసర్జనం ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు అన్నిటిమీద మూతలుంచి ఈగలు, దోమలు వాలనీకుండా చూడాలి. మన చుట్టుపక్కల మురికి లేకుండా చూసుకోవాలి. మన జీవనంలో భాగమైన నదీజలాలను కాలుష్యం కాకుండా చూసుకోవాలి. బాలలు ‘స్వచ్ఛభారత్’ ను ఒక ఉద్యమంగా చేపట్టాలి.

ముగింపు : పెద్దలను కూడా చైతన్యవంతులను చేయాలి. మన పని మనమే చేసుకుంటే తప్పేంలేదు. రోడ్లు కూడా ఊడ్చి శుభ్రంగా పెట్టుకోవాలి. గాంధీ మహాత్ముడంతటివాడు తాను స్వయంగా ఆశ్రమంలో చీపురుపట్టి ఊడ్చాడు. మనం ఆయన బాటలో నడుద్దాం. మన దేశాన్ని స్వచ్ఛ భారతంగా తీర్చిదిద్దుదాం.

లేఖ : స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి మిత్రునికి లేఖ రాయండి.

డోర్నకల్,
తేది : XXXX

ప్రియమైన శ్రీకాంత్!

నువ్వు బాగా చదువుకుంటున్నావా ? నేను బాగానే చదువుతున్నాను. మా బడిలో మేం పాల్గొన్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గురించి నీకు చెబుదామని ఈ లేఖ రాస్తున్నాను.
మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇవాళ అసెంబ్లీలో స్వచ్ఛభారత్ మిషన్ గురించి వివరించారు. ప్రధానమంత్రి ఆశయం ప్రకారం మా పాఠశాల వారందరం కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుందామనుకున్నాం. మాకందరికీ ఎంతో ఉత్సాహం కలిగింది.

సాయంత్రం బడి అయిపోగానే మా ఉపాధ్యాయులు పిల్లలను జట్లుగా విభజించి వారు నాయకులుగా ఉండి జట్లను నడిపించారు. ఇది మూడు రోజుల కార్యక్రమం. మొదటి రోజు మేమంతా పరిశుభ్రత గురించి నినాదాలిస్తూ రోడ్ల కూడలిలో నిలబడి స్వచ్ఛభారత్ ఆశయాలను వివరించాము. రెండవ రోజు మేమంతా పరిశుభ్రత కార్యక్రమం చేశాం. ప్రజలకు స్ఫూర్తి నిచ్చాము. మూడవ రోజు మాతో కలిసి వచ్చిన ప్రజలతో కలిసి మిగిలిన పనులు పూర్తి చేశాము.

నాకైతే ఎప్పుడెప్పుడు మరల ఈ కార్యక్రమంలో పాల్గొందామా, ఎప్పుడు తెల్లవారుతుందా, అని ఒకటే ఉత్సాహంగా ఉందనుకో. మీ బడిలో కార్యక్రమాల గురించి ఉత్తరం రాయి.

ఉంటాను.
నీ ప్రియమిత్రుడు,
సుశీల్.

చిరునామా :
జె. శ్రీకాంత్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మధిర, ఖమ్మం జిల్లా.

TS 7th Class Telugu Grammar వ్యాసాలు

ప్రకటన: స్వచ్ఛభారత్ నిర్మాణం చేద్దాం

గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. నేటి సమాజంలో పేరుకుపోతున్న కాలుష్యం, దాని ప్రభావం వల్ల ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యలు మీకందరికీ తెలిసినవే.

ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు. దేశమంతా ఇలాగే ఉంది. అందుకే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మనముందొక కార్యక్రమాన్ని ఉంచారు. అదే స్వచ్ఛభారత్. మన ఇల్లు, మన పరిసరాలు, మన వీథి, మన ఊరు ఇలా మన అనే సొంత భావంతో అందరూ కలిసికట్టుగా ఈ పరిశుభ్రత బాధ్యతను పంచుకుంటే మనదేశం ఆనందం ఆరోగ్యంతో విలసిల్లుతుంది.

మనమందరం ఈ కార్యక్రమంలో భాగస్థులం కావాలని ప్రార్థిస్తున్నాము.

ఇట్లు
గ్రామ పంచాయితీ, పాల్వంచ.

Leave a Comment