Telangana SCERT 7th Class Telugu Study Material Telangana Pdf లేఖలు Questions and Answers.
TS 7th Class Telugu Grammar నినాదాలు / కరపత్రాలు / పోస్టర్లు / ప్రకటనలు
ప్రశ్న 1.
విద్య మరియు కార్మిక, కర్షకులకు సంబంధించిన నినాదాలు రాయండి.
జవాబు.
విద్య :
- అన్ని దానములకన్నా విద్యాదానము మిన్న.
- విద్య లేనివాడు వింత పశువు.
- విద్యను మించిన ధనము లేదు.
కార్మికులు, కర్షకులు :
- జై జవాన్ …. జై కిసాన్
- శ్రమ జీవుల ఐక్యత – వర్థిల్లాలి.
- కార్మికులే సమాజ సోపానానికి మెట్లు.
- రైతే రాజు.
- దున్నేవాడిదే భూమి.
ప్రశ్న 2.
ఆహార పదార్థాలు వృథా చేయకూడదు. ఈ విషయాన్ని తెలిపేటట్లు నినాదాలు రాయండి.
జవాబు.
- అన్నమే ఆధారం – అన్నమే ఆరోగ్యం.
- ఆహారం వృథా చేస్తే – ముందు ముందు అసలు దొరకదు
- మనం వృథా చేసే ఆహారం – వేల మందికి తీరుస్తుంది ఆకలి.
ప్రశ్న 3.
“పర్యావరణ పరిరక్షణ”లో అందరూ పాలు పంచుకోవాలని కరపత్రం.
జవాబు.
పర్యావరణ పరిరక్షణ
స్నేహితులారా! ఆత్మబంధువులారా!
ప్రస్తుతం పర్యావరణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. అడవులు అంతరించిపోతున్నాయి. కారణం ఎవరు ? మనమే. వానలు పడటం లేదు. కారణం పలచబడుతున్న అడవులు. గాలి చాలటం లేదు. ఆక్సిజన్ కొరవడుతోంది. కలుషపు గాలులు కమ్ముకుంటున్నాయి. గాలినిండా పొగనిండి పోతున్నది. నీటినిండా చెత్తా, మురుగూ, రసాయనాలు చేరి తాగునీరు కరువైపోతోంది.
సెలయేళ్ళులేవు. ఏరులు లేవు. బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. పశు పక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. మనుషులు రోగాల పాలబడి ఊపిరి వదిలేస్తున్నారు. ఈ ప్రమాదాలన్నీ అరికట్టాలంటే అది మనవల్లనే అవుతుంది.
అందరం చేయి చేయి కలుపుదాం. కాలుష్యాలకు మూలాలు తెలుసుకుందాం. వాటిని నిర్మూలిద్దాం. ప్రపంచాన్ని కాలుష్యరహితమైన స్వర్గంగా తీర్చిదిద్దుతాం. ముందడుగేయండి. పర్యావరణ పరిరక్షణలో అందరూ పాలు పంచుకోండి.
ఇట్లు
పర్యావరణ పరిరక్షణ కమిటి
ఆనందపురం
సృజనాత్మక అంశాలు
తేది : XXXX
ప్రశ్న 4.
జీవకారుణ్యం
జవాబు.
మూగజీవాలను ఆదరిద్దాం
మహాజనులారా !
అందమైన ఈ ప్రకృతి, ప్రకృతిలో ఉన్న జీవరాసులు అంతా దేవుని సృష్టి. ఈ జీవరాసులలో ఒకటైన మానవులు మిగిలిన జీవాలను ప్రేమగా చూడాలి. వాటితో స్నేహంగా ఉండాలి. ఇతర జీవరాసులకు మానవులకు ఉన్న తేడా భాష, మాట్లాడగలగటం, మనసులోని ఆలోచనలను చెప్పగలగటం. భాషవల్లే చదువు, సంస్కారం, బుద్ధికుశలత కొత్త విషయాలను కనిపెట్టగలగటం ఇవన్నీ మానవులకు సాధ్యమైనాయి.
కాని ఈ ఆవిష్కారాల పేరుతో ఆ ప్రయోగాలకు మూగ జీవాలను ముందుగా బలి చేస్తున్నారు. ఇది అన్యాయం. కొంతమంది సర్కసులంటూ జంతువులను వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆడించి సొమ్ము చేసుకుంటూ వాటిని బంధిస్తున్నారు. ఆహారం కోసం, వినోదం కోసం జంతువులను బలి చేస్తున్నాం.
కాలుష్యాన్ని పెంచేసి జలచరాలను ఇతర జీవాలను అంతం చేస్తున్నాం. ఎంతో సౌకర్యాన్నందించి ప్రపంచాన్ని ఒకచోట చేర్చిన అంతర్జాలం, సెల్టవర్ల నుండి వచ్చే తరంగాల శక్తికి ఎన్నో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి.
తన నివాసానికి, అవసరాలకు అడవులను నరికేస్తుండటం వల్ల ఎన్నో అడవి జంతువులు ఆవాసాలను కోల్పోతున్నాయి. మనిషి ఈ విచ్చలవిడితనం వదిలేసి జంతువుల పట్ల దయ చూపించాలి. వాటి ఉనికిని కాపాడాలి.
ಇట్లు
వన్యప్రాణి సంరక్షణ శాఖ
తేది : XXXX
ప్రశ్న 5.
పచ్చదనం – పచ్చదనం
జవాబు.
పల్లెపల్లెన చెట్లు ప్రగతికి మెట్లు
ప్రియమైన స్నేహితులారా! శ్రీనగర్ కాలనీ వాసులారా!
మన కాలనీ వాసులందరం కలిసి ఈ ఆదివారంనాడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదాం. మనందరి ఇళ్ళలోను ఇళ్ళబయట కాలనీ రోడ్లు ప్రక్కన చెట్లు నాటుదాం. దీనివల్ల మనకు చల్లనిగాలి, నీడ లభిస్తాయి. పర్యావరణం పచ్చదనంతో అందంగా ఉంటుంది. సాయంకాలాలు చక్కగా నడుస్తూ వ్యాయామం చేసుకోవచ్చు. చెట్లనీడల్లో కూర్చుని కష్టం సుఖం మాట్లాడుకోవచ్చు.
ఎందుకింత శ్రమ పడాలి ? ఇంట్లో ఎ.సి. వేసుక్కూచుంటే సరిపోదా? అంటారేమో! సహజమైన గాలికి కృత్రిమమైన గాలికి తేడా లేదూ! పైగా ఎ.సి.ల వల్ల వేడిగాలి వాతావరణంలో చేరిపోతున్నది. ఆ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. చెట్ల పచ్చదనం రకరకాల పూలరంగులు కళ్ళకు ఎంతో సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఇళ్ళల్లో బందీలం కాకుండా అందరం కాసేపు కలుసుకున్నట్లుగా ఉంటుంది.
కాబట్టి తప్పక మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, మన కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.
ఇట్లు
సెక్రెటరీ,
శ్రీనగర్ కాలనీ.
తేది : XXXX
ప్రశ్న 6.
జల సంరక్షణ
జవాబు.
ప్రతిబొట్టు – ఒడిసిపట్టు
ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేసేదేమంటే –
కలికాలంలో అన్నిటికీ కరువొచ్చినట్లే నీటికి కూడా కరువొచ్చేసింది. సరిపడ వానలు పడకపోవటం, భూమిలో నీరింకిపోయి బావులు, చెరువులు ఎండిపోవటం, నదుల్లోకి నీరు చేరకపోవటం మొదలైన కారణాలవల్ల ఎటుచూసినా నీటి కరువు తాండవిస్తోంది.
ఇది ఇలా ఉంటే రిజర్వాయర్ల నుండి ఇంటింటికి వచ్చే నీరు ఇష్టం వచ్చినట్లు అవసరం ఉన్నా లేకుండా వాడేస్తున్నారు ప్రజలు. కాబట్టి మేము చేసే విన్నపం ఏమంటే – నీటి విలువను గుర్తించండి. పొదుపుగా నీటిని వాడండి. తరువాత తరాల వారికి నీరు మిగిలేలా చూడండి. అంతేకాదు ఇంటింటా ఇంకుడు నీటి గుంటలు ఏర్పాటు చేస్తే నీరు వృథాగా పోకుండా నేలలోకి ఇంకుతుంది. వ్యర్థాలను, రసాయనాలను పారే నీటిలో కలిపి కలుషితం చేయకండి. జీవనమే మనకు జీవనము.
అందరూ ప్రతిజ్ఞ చేయండి. జల సంరక్షణకు నడుం కట్టండి.
ఇట్లు
యువజన సమితి
బయ్యారం.
తేది : XXXX
ప్రశ్న 7.
వృద్ధులకు సేవ
జవాబు.
వృద్ధులకు సేవ – మనకు మనం చేసుకునే సేవ
వృద్ధులు అంటే పెద్దలు. పెద్దలు అంటే అమ్మానాన్నలు, తాతా, నాయనమ్మలు, ఇంకా వయసులో మనకన్నా చాలా పెద్దవారు. మనను చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి విద్యాబుద్ధులు చెప్పించి పెంచి పెద్ద చేస్తారు. వారు మనకు చక్కని జీవితాన్నిస్తారు. అందుకోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. వారి సుఖాలను వదులుకుంటారు. అటువంటి వారికి వారి వృద్ధాప్యంలో మనమేమిస్తున్నాం ? అంతులేని చింతలు, అవమానాల దొంతులు.
ఇది చాలా అన్యాయం. కొంతమంది ఏదో ఋణం తీర్చుకోవడానికన్నట్లు ఇష్టం లేకుండానే ఇంట్లో ఉంచుకుంటున్నారు. కొంతమంది ఆ మానవత్వం కూడా లేకుండా బయటికి గెంటుతున్నారు. ఇంత స్వార్థపరులు, క్రూరులు నిండిపోయి ఉన్న ఈ సమాజంలో వృద్ధులను ఆదరించేదెవరు ? వారి అతీగతీ చూసేదెవరు ?
ఏ పనైనా మనసుతో చెయ్యగలిగేది పిల్లలు మాత్రమే. కాబట్టి మిత్రులారా! మీరు నడిచే దారిలో ముసలివారు కనిపిస్తే పలకరించండి. కబుర్లు చెప్పండి. అవసరమైన సాయం చేయండి. మీకు నాన్న ఇచ్చిన పాకెట్ మనీతో ఒక పండో ఫలమో కొని పెట్టండి. జబ్బుతో ఉంటే వీలైతే డాక్టరుకు చూపించండి. మీ పుట్టిన రోజుకు పెట్టే జలసా ఖర్చుకు బదులు ఆ డబ్బుతో వృద్ధులకు బట్టలు, పళ్ళు, ఆహార పదార్థాలు వంటివి కొనిపెట్టండి. అప్పుడప్పుడూ వృద్ధాశ్రమాలకు వెళ్ళి కాలం గడిపి రండి. వారి మనుమలను చూసుకున్నట్టు సంబరపడి పోతారు ఆ ముసలివారు.
వృద్ధులను గౌరవించుదాం. ఆదరించుదాం. ప్రేమించుదాం.
ఇట్లు
రాష్ట్ర యువజన సంఘం వరంగల్
సృజనాత్మక అంశాలు
తేది : XXXX
ప్రశ్న 8.
ఈ మధ్య కాలంలో పెండ్లిళ్ళు, ఇతర కార్యక్రమాల్లో ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. దీన్ని అరికట్టడానికి నియమావళి రూపొందించి పోస్టర్ తయారుచేయండి.
జవాబు.
ఆహార పదార్థాలు వృథా చేయకండి !
“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అన్నారు. “అన్ని దానములకన్నా అన్నదానమే గొప్ప” అని ఒక మహాకవి అన్నాడు. ఈ మధ్యకాలంలో పెండ్లిండ్లు మరియు ఇతర కార్యక్రమాలు చాలా ఆడంబరంగా చేస్తూ, అది తమ ఘనకార్యంగా భావిస్తూ ఆహారపదార్థాలను వృథా చేస్తున్నారు. మనిషి జానెడు పొట్టను నింపుకోవడానికి ఆహారపదార్థాలు పది నుండి పన్నెండు రకాలు అవసరం ఉండదు. ఏదో నాలుగు రకాలు చాలు. పదార్థాలు కూడ మనం ఎంత తినగలుగుతామో అంతే వడ్డించమనాలి. వడ్డించేవారు కూడ అతిగా వడ్డించకూడదు.
ఆహారపదార్థాలు వృథా కాకుండా ఉండడానికి క్రింది నియమాలు పాటించండి.
- ఆహార పదార్థాలు ఎక్కువ రకాలు చేయించవద్దు. దానిని ఘనంగా భావించవద్దు.
- ఎంతకావాలో అంతే వడ్డించాలి. ఎక్కువగా వడ్డించకూడదు. ఇబ్బంది పెట్టకూడదు.
- వేడుకలకు వచ్చే అతిథులను అంచనా వేసి పదార్థాలు చేయించాలి.
- చిన్న పిల్లలకు పెద్ద వాళ్ళతో పాటు ఎక్కువ వడ్డించకూడదు.
- ఆహారపదార్థాలను వృథాగా పారవేయడం నైతికంగా సమర్థనీయం కాదు.
ప్రశ్న 9.
గ్రామంలో మొక్కలు నాటాలని సూచించేలా ఒక పోస్టరును తయారుచేయండి.
జవాబు.
గ్రామ ప్రజలకు విజ్ఞప్తి
గ్రామ ప్రజలారా! ఒక నిమిషం ఆలోచించండి.
మీకు మొక్కల విలువ తెలుసు. మనం ఎన్ని మొక్కలు నాటితే, అన్నిరకాలుగా మనకు మంచిది. లేకపోతే భవిష్యత్తు బాధపడుతుంది.
- మొక్కలను ఇంటి పెరట్లోను, వీథుల్లోను నాటండి.
- మొక్కలు, చెట్లు మనకు ప్రాణవాయువునిస్తాయి.
- మొక్కలు, చెట్లద్వారా అనేక రకాల ఆహారపదార్థాలు లభిస్తాయి.
- మొక్కలు మనకు చాలావరకు మేలు చేస్తాయి.
- మొక్కలు నాటండి. కాలుష్యాన్ని నివారించండి.
- చెట్లను, మొక్కలను నరికి ప్రకృతిని నాశనం చెయ్యకండి.
- మనం నాటే ప్రతి మొక్క ముందుతరాలవారికి సాయపడుతుంది.
- వృక్షో రక్షతి రక్షితః
ప్రశ్న 10.
మీ గ్రామంలోని దేవాలయంలో లేదా గ్రామంలో జరిగే ఉత్సవం గురించి పోస్టర్ తయారు చేయండి.
జవాబు.
శ్రీ అంకాలమ్మ దేవస్థానం
వెంకటాపురం, మహబూబ్నగర్
జాతర మహోత్సవం
ది ………………. నుండి ……………… వరకు వెంకటాపురం గ్రామంలో అంకాలమ్మ జాతర మహెూత్సవాలు జరుగుతాయి. కాబట్టి చిన్నా, పెద్ద అందరూ భక్తితో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. చివరి రోజున అన్నసంతర్పణ గలదు.
ఇట్లు,
ఉత్సవ కమిటి,
శ్రీ అంకాలమ్మ దేవస్థానం,
వెంకటాపురం.
ప్రశ్న 11.
‘పాఠశాలలో పిల్లలకు ‘పద్యాల తోరణం’ అనే పోటీ పెట్టారు. ఒకరు పద్యం చదివితే ఇంకొకరు ఆ పద్యంలోని చివరి అక్షరంతో లేదా చివరి పదంతో మొదలయ్యే పద్యం చదవాలి. ఈ పోటీలో పిల్లలందరూ పాల్గొనాలని తెలియజేయడానికి ప్రకటన రాయండి.
జవాబు.
ప్రకటన
పోటీ – పద్యాల తోరణం.
వేదిక – జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెదురుపల్లి.
తేదీ – ……………………………..
సమయం – ఉదయం గం|| 10.30 ని॥ నుండి ప్రారంభం.
వివరాలు – ఈ పోటీలో 5వ తరగతి నుండి పదవ తరగతి
వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చును. 5, 6, 7 తరగతులు జూనియర్ విభాగం, 8, 9, 10 తరగతులు సీనియర్ విభాగం.
ఒక జట్టులోనివారు ఒక పద్యం చదివితే ఆ పద్యంలోని చివరి అక్షరంతో మొదలుపెట్టి, రెండవ జట్టులోని వారు మరొక పద్యం చదవాలి.
ఈ పోటీలో పిల్లలందరూ పాల్గొనాలి.
ప్రశ్న 12.
చెరువుల పునరుద్ధరణపై అవగాహన కల్పిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు.
మననీరు జలసంరక్షణ మన చెరువు
కదలిరండి ! కదలిరండి ! మన తెలంగాణ నీటికళతో విరాజిల్లాలి. మన కాకతీయులు త్రవ్వించిన చెరువులను రక్షించుకుందాం ! మన ముఖ్యమంత్రి ప్రకటించిన కాకతీయ మిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ! పలుగు, పార పడదాం ! మన చెరువులను పునరుద్ధరిద్దాం. నీటితో నింపుదాం ! అందరికి ఆదర్శంగా నిలుద్దాం ! నీటికొరతలేని తెలంగాణ సాధిద్దాం ! అందరు ముందుకు కదలిరండి ! బంగారు తెలంగాణ సాధిద్దాం !
ఇట్లు,
రాష్ట్ర జలసంరక్షణ సమితి,
వరంగల్.
వరంగల్,
10.09.2016.