TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 1st Lesson అభినందన Textbook Questions and Answers.

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

బొమ్మను చూడండి ఆలోచించండి మాట్లాడండి: (TextBook Page No.2)

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన 1

ప్రశ్నలు జవాబులు:

ప్రశ్న 1.
పై బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు.
పై బొమ్మలో ‘సైనిక దినోత్సవం’ సందర్భంగా పిల్లలు నినాదాలు చేస్తూ ఊరేగుతున్నారు.

ప్రశ్న 2.
పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు?
జవాబు.
‘సైనికులకు వందనం, జై జవాన్, వీరులకు వందనం’ అని పిల్లలు నినాదాలు ఇస్తున్నారు.

ప్రశ్న 3.
జై జవాన్! అని ఎందుకంటున్నారు?
జవాబు.
జవాను దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అందుకే ‘జై జవాన్’ అంటున్నారు.

ప్రశ్న 4.
జవాను దేశానికి సేవ చేస్తాడు కదా! ఇతనివలె దేశం కోసం పాటుపడేవాళ్ళు ఎవరు?
జవాబు.
దేశం కోసం పాటుపడే శ్రామిక కర్మవీరులు ఎందరో ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.4)

ప్రశ్న 1.
రైతులను “శ్రమ దాచని హాలికులని” ఎందుకన్నారు?
జవాబు.
రెక్కాడితే గాని డొక్కాడని వారు రైతులు. వారు ఎండనక, వాననక పొలంలో కాయకష్టం చేస్తేనే మనకు తిండి లభిస్తుంది. అందువల్ల రైతులను “శ్రమ దాచని హాలికులని” అన్నారు.

ప్రశ్న 2.
“భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులు” అనే వాక్యం ద్వారా మీకేమర్థమయింది?
జవాబు.
కష్టాన్ని దాచుకోని రైతులు, ఎవరికీ తలవంచని సైనికులే భారత దేశాభివృద్ధికి మూలాలని నాకు అర్థమయింది.

ప్రశ్న 3.
“రుధిరం స్వేదమ్ము కాగ పసిడిని పండించునట్టి” అంటే మీకేమర్దమయింది?
జవాబు.
రైతులు తమ నెత్తురు చెమటగా మారుతుండగా, దేశం కోసం బంగారు పంటలను పండించే కష్టజీవులని నాకర్థమయింది.

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.5)

ప్రశ్న 1.
కంటికి కనురెప్ప చేనుకు కంచె. ఇట్లా దేనికి ఎవరు రక్ష ఇటువంటివే మరికొన్ని చెప్పండి.
జవాబు.
ఇంటికి కప్పు రక్ష. ఒంటికి బట్ట (వస్త్రం) రక్ష. కాలికి చెప్పు రక్ష. దేశానికి సైనికుడు రక్ష.

ప్రశ్న 2.
“జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు” అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
మన జన్మభూమిని ఇరుగుపొరుగు దేశాలవారు ఆక్రమించాలని చూస్తున్నారు. అలా ఆక్రమించకుండా మన దేశ సైనికులు తమ ప్రాణమానాలను లెక్క చేయకుండా కవచంలా ఉండి కాపాడుతున్నారు. అందువల్ల “జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు” అని కవి అన్నాడు.

ప్రశ్న 3.
“నీతి కర్మశీలురు” అని ఎవరిని అంటారు?
జవాబు.
ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిరంతరం తమ విధిని మరువకుండా, నీతితో ప్రవర్తించే వారిని “నీతి కర్మశీలురు” అంటారు.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
గేయాన్ని పాడుతూ అభినయించండి.
జవాబు.
ఉపాధ్యాయుని సూచనలను పాటిస్తూ పాడండి.

ప్రశ్న 2.
ప్రగతి మార్గదర్శకులని ఎవరినంటారు? ఇట్లాంటి వారి పేర్లు కొన్ని చెప్పండి. సమాజానికి వీరి అవసరం ఏమిటి?
జవాబు.
అభివృద్ధి మార్గాన్ని చూపేవారిని ప్రగతి మార్గదర్శకులు అంటారు. అంటే సమాజం కోసం పాటుపడుతూ దేశాభివృద్ధిని కాంక్షించే వారిని ప్రగతి మార్గదర్శకులని చెప్పవచ్చు.
ఇట్లాంటి వారిలో మహాత్మాగాంధీ, మదర్ థెరిసా, స్వామి వివేకానంద, అన్నాహజారే లాంటి వాళ్ళెందరో ఉన్నారు. సమాజంలో అసమానతలు తొలగిపోయి, సమసమాజ దృష్టి ఏర్పడాలంటే వీరి అవసరం ఎంతైనా ఉంది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
పాఠాన్ని చదువండి. రైతుల, సైనికుల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను గుర్తించి రాయండి.
జవాబు.
రైతుల, సైనికుల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలు :

  1. భరతమాత పురోగతికి ప్రాతిపదికలు
  2. ప్రగతి మార్గదర్శకులు
  3. నిర్మలురు
  4. నీతి కర్మశీలురు
  5. దేశబావుటాను ఎగరేసిన ఘనులు

ప్రశ్న 2.
కింది గేయాన్ని చదువండి. ఖాళీలను పూరించండి.

పల్లెలు మనపాలిటి కల్పతరువులూ – నవభారత గృహసీమకు మణిదీపాలూ
మానవతకు మందిరాలు మమతలకవి పుట్టినిళ్లు – మన సంపద నిలయాలు భరతమాత నయనాలు
ప్రగతికి సోపానాలూ సుగతికి తార్కాణాలు – మనిషి మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు

అ) భరతమాతకు నయనాలు ___________
జవాబు.
పల్లెలు

ఆ) పల్లెలు నవభారత గృహసీమకు ___________
జవాబు.
మణిదీపాలు

ఇ) “ప్రగతికి సోపానాలు”లో సోపానాలు అంటే ___________
జవాబు.
మెట్లు

ఈ) నివాసం అనే అర్థం వచ్చే పదాలు ___________
జవాబు.
మందిరం, నిలయం.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ). “దేశపురోగతి” అంటే ఏమిటి ? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి.
జవాబు.
“దేశపురోగతి” అంటే దేశాభివృద్ధి. దేశం వివిధ రంగాలలో అభివృద్ధి చెందటాన్నే దేశపురోగతి అంటారు. దేశంలోని ప్రజలు ‘కూడు-గూడు-గుడ్డ’ అనే మూడింటికి లోటు లేకుండా జీవించగలిగితే ఆ దేశం పురోగతి చెందినట్లే లెక్క, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, వల్లభబాయి పటేల్, అంబేద్కర్, జాకీర్ హుస్సేన్ వంటి నాయకులెందరో దేశపురోగతికి తోడ్పడినవారే.

ఆ) దేశానికి నీతికర్మశీలుర ఆవశ్యకత ఏమిటి?
జవాబు.
నీతికర్మశీలురు ఏ ప్రలోభాలకు లొంగరు. వారు తమ విధిని తాము సక్రమంగా నిర్వర్తిస్తారు. వారిలో స్వార్థ చింతన ఉండదు. తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడరు. సత్ప్రవర్తనతో, సత్యసంధతతో ధర్మమార్గాన పయనిస్తారు. వారి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేశానికి నీతికర్మశీలుర ఆవశ్యకత ఎంతో ఉంది.

ఇ) అవిశ్రాంత సేద్యంతో ఆకలిమంటలను ఆర్పడమంటే ఏమిటి?
జవాబు.
పంటలు పండితేనే ప్రజలకు ఆహారం లభిస్తుంది. ప్రాణికోటి ఆహారంపైన ఆధారపడి ఉంటుంది. అటువంటి పంటలను పండించే రైతు దేశానికి వెన్నెముక. పంటలు పండకపోతే దేశంలో కరవు ఏర్పడుతుంది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతారు. అందువల్ల రైతు విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలిమంటలను చల్లారుస్తాడని పై వాక్యానికి అర్థం.

ఈ) ఈ గేయ రచయిత గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు.
‘అభినందన’ గేయ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయనకు దేశభక్తి ఎక్కువ. అందుకే దేశంకోసం శ్రమపడే ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ గేయం రచించాడు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు రైతు. మరొకరు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదన్నాడు. వారిని అభినందిస్తూ సరళమైన మాటలతో చక్కని గేయం అందించాడు రచయిత.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

2. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి.
‘అభినందన’ గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్లకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్టుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్ప వలె, చేను చుట్టూ కంచె వలె, ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు.

దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసు గలవారై నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఆకాశం నిండా ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు అభినందనలు.

IV. సృజనాత్మకత / ప్రశంస:

“వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే” అని రైతులు, సైనికుల గురించి గేయం పాడుకున్నారు కదా! అట్లాగే తల్లి, తండ్రి, గురువు, మంచి మిత్రులు, గొప్పవాళ్ళు… ఇట్లా ఎవరి గురించైనా వందనాలు వందనాలు… అని అభినందనలు తెలుపుతూ ఒక చిన్న గేయాన్ని రాయండి.
జవాబు.

‘అమ్మ’కు వందనాలు

వందనాలు వందనాలు
అభినందన చందనాలు
కష్టపడి నవమాసాలు మోసి
కనిపెంచిన మాతృమూర్తికి
కలకాలం కంటికి రెప్పలా
కాపాడే కన్నతల్లికీ

వందనాలు వందనాలు
అభినందన చందనాలు
ఆటపాటల అలరింపజేసి
నేర్పుగ విద్యాబుద్ధులు నేర్పించే
కల్పవృక్షం లాంటి కన్నతల్లికీ
వందనాలు వందనాలు
అభినందన చందనాలు.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి.

అ) స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. ___________
జవాబు.
రక్తం

ఆ) పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. ___________
జవాబు.
బంగారం

ఇ) వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. ___________
జవాబు.
రైతులు

ఈ) కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారుచేస్తారు. ___________
జవాబు.
చెమట

2. కింది వాక్యాలను చదువండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి.

అ) భారత దేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు దేశం ఋణపడి ఉన్నది.
జవాబు.
భారత దేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు దేశం ఋణపడి ఉన్నది.
రైతు = కర్షకుడు, హాలికుడు

ఆ) భారతీయులు స్వాతంత్ర్యం సాధించి విజయ బావుటా ఎగురవేశారు. నాటినుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు.
జవాబు.
భారతీయులు స్వాతంత్ర్యం సాధించి విజయ బావుటా ఎగురవేశారు. నాటినుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు.
బావుటా = పతాకం, జెండా

ఇ) పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు.
జవాబు.
పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు.
ఖడ్గం = అసి కత్తి

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

VI. భాషను గురించి తెలుసుకుందాం.

ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ‘వర్ణమాల’ లేదా ‘అక్షరమాల’ అని అంటారు.
ఉదా : ‘అ’ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు. అంటే అక్షరం.

అ, ఆ, ఇ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు.
క, ఖ, గ, ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారు.
అక్షరమాలలో ఎట్లా ఉన్నా ‘హల్లు’ అనేది పొల్లుగా పలికే ధ్వని. ‘మ్’, ‘అ’ అనే ధ్వనులు కలిసి ‘మ’ అయింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు.

కొన్ని అక్షరాల్లో రెండేసిగాని, మూడేసిగాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మూడు రకాలు.

  1. ద్విత్వాక్షరం
  2. సంయుక్తాక్షరం
  3. సంశ్లేషాక్షరం

1. ద్విత్వాక్షరం : ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని “ద్విత్వాక్షరం” అంటారు.
ఉదా : ‘క్క’ = క్ +్క (క్) + అ = క్క – ఇక్కడ కకారం రెండుసార్లు వచ్చింది.

2. సంయుక్తాక్షరం : ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ‘సంయుక్తాక్షరం‘ అంటారు.
ఉదా : ‘న్య’ = న్ + య్ + అ – ఇక్కడ నకార, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.

3. సంశ్లేషాక్షరం : ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని “సంశ్లేషాక్షరం” అంటారు.
ఉదా : క్ష్మి = క్ + ష్ + మ్ + ఇ – ఇక్కడ కకార, షకార, మకారాలనే హల్లులు మూడు కలిశాయి.

1. కింది అక్షరాల్లో రెండేసి వర్ణాలున్నాయి. వాటిని గుర్తించండి.
ఉదా : గా = గ్ + ఆ = (రెండు ధ్వనులు)

అ) య = య్ + అ = (రెండు ధ్వనులు)
ఆ) కా = క + ఆ (రెండు ధ్వనులు)
ఇ) వొ = వ్ + ఒ (రెండు ధ్వనులు)

2. కింది పదాల్లోని సంయుక్త, ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి.
ఉదా : పద్మ = ద్ + మ్ + అ (మూడు ధ్వనులు)

అ) ఎత్తండి = త్ + త్ + అ = త్త (మూడు ధ్వనులు)
ఆ) దుర్గతి = ర్ + గ్ + అ = ర్గ (మూడు ధ్వనులు)
ఇ) సాధ్వి = ధ్ + వ్ + ఇ = ధ్వి (మూడు ధ్వనులు)

వర్గాక్షరాలు: ‘క’ నుండి ‘మ’ వరకు ఉన్న అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారు. అవి :

క-వర్గం : క – ఖ – గ – ఘ – ఙ్ఞ
చ-వర్గం : చ – ఛ – జ – ఝ – ఞ
టవర్గం : ట – ఠ – డ – ఢ – ణ
త-వర్గం : త – థ – ద – ధ – న
ప-వర్గం : ప – ఫ – బ – భ – మ

3. కింది వాక్యాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గీతగీసి గుర్తించండి.
“బలరాం మంచి ఫలాల కోసం పల్లెలో తోటకు పోయాడు. తోటలో పామును చూసి భయపడ్డాడు”
జవాబు.
లరాం మంచి లాల కోసం ల్లెలో తోటకు పోయాడు. తోటలో పామును చూసి భయపడ్డాడు”.
ప-వర్గం : ప, ఫ, బ, భ, మ

ప్రాజెక్టు పని:

మీ సమీపంలోని రైతులు/విశ్రాంత సైనికులను కలువండి. వారు చేస్తున్న సేవలను గురించి తెలుసుకొని నివేదిక
రాయండి.
జవాబు.
విద్యార్థి కృత్యం

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

TS 6th Class Telugu 1st Lesson Important Questions అభినందన

I. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. కింది పేరా చదువండి. ఇచ్చిన వానిలో సరియైన సమాధానం గుర్తించండి.

రైతు దేశానికి వెన్నెముక వంటివాడు. వ్యవసాయం ఒకప్పుడు స్వయం ఆధారితంగా ఉండేది. ఇంట్లో ఉన్న గొడ్డూ, గోదా రైతుకు కావలసిన ఎరువును అందించేవి. సేంద్రియ ఎరువులతో పంటలు పండేవి. ఆహారధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. రసాయనిక ఎరువులు రాగానే పరిస్థితులు మారిపోయాయి. వాటిలోని విషపదార్థాలు, ఆహారధాన్యాలు, ఆకుకూరలు మొదలైన వాటిలోకి ఇంకి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం క్షీణించిపోతుంది.

ప్రశ్న 1.
దేశానికి వెన్నెముక వంటివాడెవరు ?
అ) జవాను
ఆ) రైతు
ఇ) నీతిమంతులు
ఈ) పై ముగ్గురూ
జవాబు.
ఆ) రైతు

ప్రశ్న 2.
భూసారం ఎందుకు క్షీణిస్తోంది ?
అ) రసాయనిక ఎరువుల వాడకం వల్ల
ఆ) నీరులేక
ఇ) పరిస్థితులు మారడం వల్ల
ఈ) సేంద్రియ ఎరువుల వల్ల
జవాబు.
అ) రసాయనిక ఎరువుల వాడకం వల్ల

ప్రశ్న 3.
పొలానికి ఏ ఎరువు మంచిది ?
అ) రసాయనిక ఎరువు
ఆ) యూరియ
ఇ) నీరు
ఈ) సేంద్రియ ఎరువు
జవాబు.
ఈ) సేంద్రియ ఎరువు

ప్రశ్న 4.
విషపదార్థాలు దేనిలో ఉంటాయి ?
అ) సేంద్రియ ఎరువులలో
ఆ) పచ్చిరొట్టలో
ఇ) రసాయనిక ఎరువులలో
ఈ) పెంటలో
జవాబు.
ఇ) రసాయనిక ఎరువులలో

ప్రశ్న 5.
సేంద్రియ ఎరువులు దేని నుండి లభిస్తాయి ?
అ) పశువుల నుండి
ఆ) చెట్ల నుండి
ఇ) మందుల నుండి
ఈ) నీటి నుండి
జవాబు.
అ) పశువుల నుండి

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

II. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) గేయ రచయితకు దేశభక్తి కలదని ఎలా చెప్పగలవు ?
జవాబు.
మన భారతదేశాన్ని రక్షించేవారు సైనికులు. దేశాన్ని రక్షించే సైనికులకు వందనాలు చెప్పడం ద్వారా కవి తన దేశభక్తిని చాటుకొన్నాడు. దేశ ప్రజలకు తిండిపెట్టేది రైతు. రైతుకు నమస్కారాలు చెప్పడం ద్వారా కవి తన దేశభక్తిని చాటుకొన్నాడు. భారతదేశ పురోగతికి కారకులైన వారందరికీ కవి నమస్కారాలు తెలిపాడు. ఒక్క నిముషం కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడే వారి వల్ల దేశానికి మంచిపేరు వస్తుంది. అందుకే వారికి నమస్కరించి కవి తన దేశభక్తిని వెల్లడించాడు.

ఆ) ప్రగతి మార్గదర్శకులెవరు ?
జవాబు.
నీతి నిజాయితీలతో పనిచేసేవారు. ఒక్క నిముషం కూడా విశ్రాంతి లేకుండా కష్టపడేవారు. దేశం కోసం ప్రాణాలర్పించేవారు. దేశం కోసం జీవించేవారు. దేశం యొక్క పేరు ప్రతిష్ఠలను పెంచేవారు. దేశం కోసం నిరంతరం కష్టపడేవారు మనదేశ ప్రగతికి మార్గదర్శకులు.

ఇ) అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పే దెవరు ? ఎలా ?
జవాబు.
రైతు పొలం దున్నుతాడు. విత్తనాలు నాటుతాడు. నాట్లు వేస్తాడు. కలుపుమొక్కలను తీస్తాడు. ఎరువులు చల్లుతాడు. కంటికి రెప్పలా చేను కాపలా కాస్తాడు. పండిన చేను కోస్తాడు. కుప్ప వేస్తాడు. కుప్ప నూర్చుతాడు. ధాన్యం బస్తాలలోకి ఎత్తుతాడు. అవి బియ్యంగా మరపట్టించుకొంటారు. ‘ఆ అన్నం తిని ఆకలిమంటలను చల్లార్చుకొంటారు. అంటే పొలం దున్నడం నుండి అన్నం కంచంలోకి వచ్చే వరకు రైతుకు విశ్రాంతి లేదు.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) అభినందన ఎవరికి ? ఎందుకు ?.
జవాబు.
కవి రైతులకు, జవాన్లకు, నీతికర్మశీలురకు అభినందన చందనాలందించాడు. రైతులు నిరంతరం కష్టపడతారు. ఎండ, వానలను లెక్కచేయకుండా వ్యవసాయం చేస్తారు. పంటలు పండిస్తారు. దేశ ప్రజల ఆకలి తీరుస్తారు. అందుకే రైతులకు కవి. అభినందనలందించాడు.

జవాన్లు భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తీవ్రవాదులు, శత్రుదేశాల నుండి భారతదేశాన్ని రక్షిస్తున్నారు. దేశ సరిహద్దులను జాగ్రత్తగా కాపాడుతున్నారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడుతున్నారు. అందుకే కవి జవాన్లకు అభినందన చందనాలు సమర్పించాడు.

నీతికర్మశీలురు నిముషం కూడా వృథా చేయరు. ఎటువంటి ప్రలోభాలకు లొంగరు. ఎవరి మాయలోనూ పడరు. అటువంటి నీతి నిజాయితీలు కలవారి వలన దేశ సంపద పెరుగుతుంది. దేశ గౌరవం పెరుగుతుంది. అందుకే వారికి కవి అభినందన చందనాలను అర్పించాడు.

ఆ) భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులెవరు ? ఎందుకు ?
జవాబు.
భారతదేశం అభివృద్ధి చెందాలంటే వీరజవాన్లు కావాలి. రైతులు కావాలి. నీతి నిజాయితీలతో పనిచేసేవారు కావాలి. దేశ సంపద పెంచే ఆర్థిక శాస్త్రవేత్తలు కావాలి. నూతనమైనవి కనిపెట్టే మేధావులు కావాలి. అటువంటి వారంతా మన భారతదేశ పురోగతికి మూలకారకులు. దేశ ప్రజలందరినీ నడిపించే నాయకులు కూడా పురోగతికి కారకులు.

పైన పేర్కొన్న వారిలో ఎవరు లేకపోయినా దేశం అభివృద్ధి చెందదు. అందుకే పైన చెప్పిన వారందరినీ కవి దేశాభివృద్ధికి మూలకారకులుగా పేర్కొన్నాడు. జవాన్లు రక్షణ కల్పిస్తున్నారు. రైతులు తిండి పెడుతున్నారు. ఇదే విధంగా తమ పనిని తాము కచ్చితంగా చేసే వారంతా దేశ అభివృద్ధికి మూలమైన ఘనులే.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

III. సృజనాత్మకత /ప్రశంస:

ప్రశ్న 1.
మీ గ్రామంలోని ఒక రైతును అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు.
శ్రీ జనార్దన్ గారికి సమర్పించు అభినందన పత్రం

పుడమి నుండి పసిడిని పండించే ఆదర్శ కర్షకా !
జనార్దనా ! అభివందనం ! అభివందనం !
నోట్లో పందుంపులతో చేలోకి వెడతావు.
కంటినిండా చేనును చూసుకొంటూ పరవశిస్తావు.

చంటిపాపలా చేనును పెంచే నీకు
సాటి బాలెంతరాలు మాత్రమే !
అందరికంటే ఎక్కువ పండిస్తున్నావు.
మా అందరి ఆకలి మంటలను ఆర్పేస్తున్నావు.

అమ్మకి అమ్మ అమ్మమ్మ
నువ్వు మాత్రం అమ్మలకే అమ్మమ్మవు మూలపుటమ్మవు.
నువ్వు మీసం మెలేసి నాగలి పడితే
జలజలా ధాన్యపురాశులు రాల్తాయి.
ఈ దేశమే నీకు ఋణపడింది.
నీ ఋణం తీర్చుకొందుకు
సమర్పిస్తున్నాం అభివందన చందన మందారాలు.

ఇట్లు,
భావిభారత పౌరుల బృందం.

ప్రశ్న 2.
రైతులు, సైనికులు ఈ దేశానికి ఏ విధమైన సేవలు చేస్తున్నారో వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
(లేదా)
రైతులు, సైనికుల గొప్పదనాన్ని వర్ణిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

కుర్మేడు,
X X X X X.

ప్రియ మిత్రుడు విష్ణుకు,

ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమం అని తలుస్తాను. నేను ఈ లేఖలో రైతులు, సైనికులు ఈ దేశానికి ఏ విధమైన సేవలు చేస్తున్నారో మా గురువుల ద్వారా తెలుసుకున్న విషయాలు రాస్తున్నాను. దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడువాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహుదూర్ శాస్త్రి “జై జవాన్, జై కిసాన్” అన్నాడు.

ఇట్లాగే మీ టీచర్స్ చెప్పిన విషయాలను తెలియజేయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. సాయిశ్రీ ప్రసాద్.

చిరునామా :
యస్. విష్ణు,
S/o నాగలక్ష్మణ శర్మ సిద్దిపేట,
మెదక్.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

ప్రశ్న 3.
రైతులు, సైనికులు గురించి గేయం పాడుకున్నారు కదా ! మరి మీ గురువు గురించి ఒక గేయం రాయండి.
జవాబు.
గురువు (గేయం)

వందనమయ్యా ఓ గురుదేవా
అందుకొను మిదే మా పుష్పాంజలి ॥ 2 ॥
మాలో జ్ఞానము వెలుగ చేయగా ఆకలిదప్పుల మరచితిరి
కన్నబిడ్డలుగ కనుసన్నలలో ప్రేమతో పెంచి విద్యను గరిపిరి ॥వందన ॥
గురు బ్రహ్మ – గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః
అను నానుడికి న్యాయము చేసిన దైవ రూపులగు గురువర్యులకు ॥వందన ॥
మాటలు రావు మిము శ్లాఘింపగ
చేతులు చాలవు మిము సేవింపగ
జీవితకాలము మా హృది యందున
నిలిపి కొలుతుము మము దీవింపగ ॥ వందన ॥
మా జ్ఞానానికి మూలము మీరే
మాదు భవితకు ప్రేరణ మీదే
మీదు ఋణములను తీర్చగ లేము
కన్నీళ్ళతో మీ కాళ్ళు కడిగేదము ॥వందన॥
రచన : కీ.శే. కంచిభొట్ల ప్రసాదరావు గారు, చెరుకూరు.

ప్రశ్న 4.
దేశం కోసం రైతులు, సైనికులు పడిన శ్రమను తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు.

జై జవాన్ – జై కిసాన్

దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటిరెప్పలా కాపాడువాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు ‘ తిండి, దేశానికి రక్షణా ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహుదూర్ శాస్త్రి “జై జవాన్ – జై కిసాన్” అన్నాడు.

ఈ దేశం బాగోగులు కోరుతూ, అందుకోసం నిరంతరం శ్రమించే కర్మ వీరులలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

రెక్కాడితే గాని డొక్కాడని వారు రైతులు. వీరు ఎండనక, వాననక పొలంలో కాయకష్టం చేస్తేనే మనకు తిండి లభిస్తుంది. కష్టాన్ని దాచుకోని రైతులు, తమ నెత్తురును చెమటగా మార్చి, దేశం కోసం బంగారు పంటలను పండించే కష్టజీవులని అర్థమౌతుంది. ‘అందువల్లనే రైతులను “శ్రమ దాచని హాలికుల”ని అంటారు.

ఇంటికి కప్పు రక్ష. ‘ ఒంటికి బట్ట (వస్త్రం) రక్ష. కాలికి చెప్పు రక్ష. దేశానికి సైనికుడు రక్ష. ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిరంతరం తమ విధిని మరువకుండా, నీతితో ప్రవర్తించే సైనికులను “నీతి కర్మశీలురు” అనవచ్చు. మన దేశాన్ని ఆక్రమించాలని చూసే ఇరుగుపొరుగు దేశాల శత్రు సైనికులను ఎదిరిస్తూ మనదేశ సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కవచంలా ఉండి కాపాడుతున్నారు. అందువల్లనే “జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు” అని పెద్దలు అన్నారు.

కష్టాన్ని దాచుకోని రైతులు, ఎవరికీ తలవంచని సైనికులు భారతదేశ అభివృద్ధి మూలాలు అని తెలుస్తున్నది.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

IV. భాషాంశాలు.

ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

1. భూమి – బూమి
2. ఖడ్గం – కగ్గం
3. కీర్తి – కిరితి
4. పృథివి – పుడమి
5. బంటు – భట
6. సేదం – స్వేదం
7. పొన్నం – స్వర్ణం
8. నెత్తురు – రుధిరం

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
వందనాలు = ___________
జవాబు.
వందనాలు = నమస్కారాలు
రైతులకు, సైనికులకు వందనాలు.

ప్రశ్న 2.
మార్గదర్శకులు = ___________
జవాబు.
మార్గదర్శకులు = దారి చూపేవారు
విద్యార్థులకు గురువులే మార్గదర్శకులు.

ప్రశ్న 3.
ప్రగతి = ___________
జవాబు.
ప్రగతి = అభివృద్ధి
ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో ప్రగతి సాధించాలి.

ప్రశ్న 4.
కంటికి రెప్పలా = ___________
జవాబు.
కంటికి రెప్పలా = కాపు (రక్షణ)
తల్లిదండ్రులు బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటారు.

ప్రశ్న 5.
ప్రలోభం = ___________
జవాబు.
ప్రలోభం = దురాశ
మనిషి ప్రలోభానికి పోకూడదు.

ప్రశ్న 6.
దేశభక్తి = ___________
జవాబు.
దేశభక్తి = దేశం పట్ల పూజ్యభావం
ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలి.

ప్రశ్న 7.
బావుటా = ___________
జవాబు.
బావుటా = జెండా
రాకేశ్శర్మ చంద్రునిపై కాలుపెట్టి భారతీయ బావుటా ఎగురవేశాడు.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

భాషాభాగాలు:

కింది గీత గీసిన వాటికి భాషాభాగాలను గుర్తించండి.

ప్రశ్న 1.
రైతు బంగారాన్ని పండిస్తాడు.
జవాబు.
నామవాచకం

ప్రశ్న 2.
స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో వీరులు నెత్తురు చిందించారు.
జవాబు.
క్రియ

వ్యాకరణాంశాలు:

అ) క్రింది పదాలను కలిపి రాయండి.

ప్రశ్న 1.
పడి + పోవని = ___________
జవాబు.
పడిపోవని

ప్రశ్న 2.
నిమిషము + పని = ___________
జవాబు.
నిమిషమేని

ప్రశ్న 3.
కవచము + ఐన = ___________
జవాబు.
కవచమైన

ప్రశ్న 4.
ప్రాతిపదికలు + అగు = ___________
జవాబు.
ప్రాతిపదికలగు

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

ఆ) విభక్తి ప్రత్యయాలను చేర్చండి.

ప్రశ్న 1.
బంగారాన్ని పండిస్తున్న రైతుల ___________ వందనాలు.
జవాబు.
కు (రైతులకు)

ప్రశ్న 2.
నీతి ___________ ప్రవర్తించే వారు నీతి కర్మశీలురు.
జవాబు.
తో (నీతితో)

ఇ) కింది వానిలో అసమాపక, సమాపక క్రియలను గుర్తించండి.

ప్రశ్న 1.
జవాను శత్రు సైన్యాలను చంపి, దేశరక్షణ చేస్తున్నాడు.
జవాబు.
చంపి = అసమాపక క్రియ, చేస్తున్నాడు = సమాపక క్రియ.

ప్రశ్న 2.
రైతు పంట పండించి, ప్రజల ఆకలి తీరుస్తాడు.
జవాబు.
పండించి అసమాపక క్రియ, తీరుస్తాడు = సమాపక క్రియ.

ఈ) సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

ప్రశ్న1.
భారతీయులు స్వాతంత్ర్యం సాధించారు. విజయ బావుటా ఎగురవేశారు.
జవాబు.
భారతీయులు స్వాతంత్ర్యం సాధించి, విజయ బావుటా ఎగురవేశారు.

ప్రశ్న 2.
రాజులు ఖడ్గం ధరించేవారు. యుద్ధరంగంలోకి వెళ్ళేవారు.
జవాబు.
రాజులు ఖడ్గం ధరించి, యుద్ధరంగంలోకి వెళ్ళేవారు.

ఉ) కింది వానిలో సంబంధంలేని పదాలను గుర్తించండి.

1. జెండా, పతాకం, బావుటా, అసి – సంబంధం లేనిది – అసి
2. రైతు, రౌతు, హాలికుడు, కర్షకుడు – సంబంధం లేనిది – రౌతు
3. రుధిరం, రక్తం, ఎఱుపు, నెత్తురు – సంబంధం లేనిది – ఎఱుపు

ఊ) కింది వాటిని గుర్తించండి.

ప్రశ్న 1.
అ నుండి ఔ వరకు గల వర్ణాలు
అ) హల్లులు
ఆ) అచ్చులు
ఇ) పరుషాలు
ఈ) సరళాలు
జవాబు.
ఆ) అచ్చులు

ప్రశ్న 2.
‘భరతమాత’ ఏ లింగం ?
అ) స్త్రీలింగం
ఆ) పుంలింగం
ఇ) నపుంసక లింగం
ఈ) ఏదీకాదు
జవాబు.
అ) స్త్రీలింగం

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

గేయాలు – అర్థాలు – తాత్పర్యాలు:

1. దారిని చూపించేవారు
వందనాలు వందనాలు
అభినందన చందనాలివే
మా అభినందన చందనాలివే ॥వంద||

అర్థాలు :

వందనాలు = నమస్కారాలు
అభినందన = మెచ్చుకోలు, ప్రోత్సాహం
చందనం = గంధం

తాత్పర్యం : రైతులకు, సైనికులకు వందనాలు. వారికి ఇవే మా అభినందన చందనాలు.

2. శ్రమదాచని హాలికులు
తలవంచని సైనికులకు
భరతమాత పురోగతికి
ప్రాతిపదికలగు ఘనులకు ॥వంద||

అర్థాలు :

శ్రమదాచని = కష్టాన్ని దాచుకోని
హాలికులు = రైతులు
తలవంచని = లొంగని
సైనికులు = బంట్లు
పురోగతి = అభివృద్ధి
ప్రాతిపదిక = మూలం, ఆధారం
ఘనులు = గొప్పవారు

తాత్పర్యం :
కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందన చందనాలు.

3. పుడమితల్లి పులకింపగ
రుధిరం స్వేదమ్ము కాగ
పసిడిని పండించునట్టి
ప్రగతి మార్గదర్శకులకు ॥వంద||

పుడమి = నేల, భూమి
పులకింపగ = పరవశింపగ, గగుర్పొడవగ
రుధిరం = రక్తం, నెత్తురు
స్వేదము = చెమట
పసిడి = బంగారం
ప్రగతి = అభివృద్ధి
మార్గదర్శకులు = దారిని చూపించేవారు

తాత్పర్యం:
నేలతల్లి సంతోషపడేటట్టుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. అభినందన చందనాలు.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

II. కంటికి కనురెప్పలాగ
చేనుచుట్టు కంచెలాగ
జన్మభూమి కవచమైన
ఘనవీరులు జవానులకు ॥వంద||

అర్థాలు :

కంచె = రక్షణగా ఏర్పరచిన కంప
కవచం = రక్షణ కొరకు ఒంటిపై ధరించునది
జవాను = బంటు, సైనికుడు

తాత్పర్యం:
కంటికి రెప్ప వలె, చేను చుట్టూ కంచె వలె, ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు. అభినందన చందనాలు.

ప్రలోభాల మాయలోన
పడివోవని నిర్మలురకు
నిమిషమేని విధిమరువని
నీతి కర్మశీలురకు ॥వంద||

అర్థాలు :

ప్రలోభం = దురాశ, ఆశపెట్టడం
పడి + పోవని = పడిపోనట్టి, లోబడని
నిర్మలరు = స్వచ్ఛమైనవారు (మంచి మనసు గలవారు)
విధి = కర్తవ్యం, చేయవలసింది
నీతి కర్మశీలురు = నీతితో ప్రవర్తించేవారు

తాత్పర్యం :
దురాశ అనే మాయకు లోబడకుండా, మంచి మనసు గలవారై, నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. అభినందన చందనాలు.

అవిశ్రాంత సేద్యంతో
ఆకలిమంటలను ఆర్పి
దేశభక్తి ఖడ్గంగా, శత్రుమూకలను దున్ని
దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు ॥వంద||

అర్థాలు :

అవిశ్రాంతి = విశ్రాంతి లేని
సేద్యం = వ్యవసాయం
ఖడ్గం = కత్తి
శత్రుమూకలు = శత్రుసమూహాలు
మూక = సమూహం, గుంపు
తుని = గొప్పతనం, యశస్సు
కీర్తి = చంపి
బావుటా = జెండా

తాత్పర్యం :
విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరులు ఆకలిమంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు వందనాలు. అభినందన చందనాలు.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

ఈ దేశం బాగోగులు కోరుతూ, అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన “స్వరభారతి” అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది.

కవి పరిచయం:

కవి పేరు : శేషం లక్ష్మీనారాయణాచార్య.
కాలం : 1947 1998.
సొంత ఊరు : కరీంనగర్ జిల్లాలోని నగునూర్.
తల్లిదండ్రులు : కనకమ్మ, నరహరిస్వామి.
ఉద్యోగం : రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు.
రచనలు : అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు.
ఇతర విషయాలు : ఈయన రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీ.వీ., రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి.
ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి ‘స్రవంతి’ పత్రికలో ప్రచురించబడ్డాయి.
కవితా నైపుణ్యం : లలితమనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చేయి.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

విద్యార్థులకు సూచనలు:

  • పాఠంలోని బొమ్మను చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠాన్ని చదువండి. అర్థంకాని పదాల కింద గీతలు గీయండి.
  • అర్థంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి.
  • పాఠ్యపుస్తకం చివరన ఉన్న “పదాలు – అర్థాలు” పట్టిక చూసి, తెలియని పదాలకు అర్థాలను తెలుసుకొండి.

ప్రవేశిక:

దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడువాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశప్రజలకు తిండి, దేశానికి రక్షణా ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహుదూర్ శాస్త్రి “జై జవాన్ జై కిసాన్” అన్నాడు. “అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకొండి.

సారాంశం:

రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్టుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు.

కంటికి రెప్ప వలె, చేను చుట్టూ కంచె వలె, ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు. దురాశ అనే మాయకు లోబడకుండా, మంచి మనసు గలవారై నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు.

‘విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరులు ఆకలి మంటలను చల్లారుస్తూ, కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు అభినందనలు.

TS 6th Class Telugu Guide 1st Lesson అభినందన

నేనివి చేయగలనా?

  • గేయాన్ని అభినయంతో పాడగలను. ప్రగతి మార్గదర్శకులను గురించి చెప్పగలను. – అవును/ కాదు
  • అపరిచిత గేయాన్ని చదివి అర్థం చేసుకొని, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలను. – అవును/ కాదు
  • గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • పాఠం ఆధారంగా కొత్త గేయాన్ని రాయగలను. – అవును/ కాదు

Leave a Comment