Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Intermediate 2nd Year Telugu Grammar వాక్య విజ్ఞానం Questions and Answers.
AP Intermediate 2nd Year Telugu Grammar వాక్య విజ్ఞానం
ఒక విషయాన్ని బోధించే పదాల సమాహారమే వాక్యం. అంటే, ఒక విషయాన్ని ఇతరులకు చెప్పడానికి నిర్దిష్ట క్రమంలో పదాల చేరిక ఉంటే దాన్ని వాక్యం అని పిలువవచ్చు.
ఉదాహరణకు :
‘పాఠం మాస్టారు చెప్పారు బాగా’ – ఇది పదాల సమాహారమే. కానీ వాక్యం కాదు. ఎందుకంటే పదాలు నిర్దిష్ట క్రమంలో లేవు. దాన్ని సరిచేసి – ‘మాస్టారు పాఠం బాగా చెప్పారు’ అంటే అది మాత్రమే వాక్యం అవుతుంది. వాక్యానికి మూడు నిబంధనలు ఉన్నాయి. అవి –
- యోగ్యత
- ఆకాంక్ష
- ఆసత్తి.
1) యోగ్యత :
‘వాడు మంటల్ని నిప్పుచేత ఆర్పుతున్నాడు’. ఈ వాక్యంలో యోగ్యత లోపించింది. మంటలను నీటిచేత అర్పుతారుగానీ, నిప్పుచేత కాదు కదా. కాబట్టి ఇందులో యోగ్యత లేదు. ఇది వాక్యం కాదు. ‘వాడు మంటల్ని నీటితో ఆర్పుతున్నాడు’ అన్నది వాక్యం అవుతుంది. కాబట్టి యోగ్యత అనగా వాక్యానికి సరైన అర్థం ఉండడం.
2) ఆకాంక్ష :
‘ఇండియా క్రికెట్ మ్యాచ్ లో’ అని చెప్తే అది వాక్యం కాదు. ‘గెలిచిందా ? ఓడిందా ?’ అనే సందేహం వినేవాడికి కలుగుతుంది. దాన్నే ‘ఆకాంక్ష’ అంటారు. ఈ వాక్యంలో వినేవాడి ఆకాంక్ష తీరలేదు కాబట్టి ఇది వాక్యం కాదు. ‘ఇండియా క్రికెట్ మ్యాచ్ లో గెలిచింది’ అంటే వినేవాడికి ఆకాంక్ష తీరుతుంది. కాబట్టి వాక్యం అవుతుంది.
3) ఆసత్తి :
వాక్యంలో పదాలు ఒక నిర్దిష్ట క్రమంలో వెనువెంటనే వస్తే అది ఆసత్తి. రాధ అనే ఆమె, ‘లక్ష్మి’ అని ఒకసారి చెప్పి, కాసేపటి తరువాత ‘నన్ను’ అని చెప్పి, ఇంకోరోజు ‘మరచిపోయింది’ అని చెప్తే, అది వాక్యం కాదు. ‘లక్ష్మి నన్ను మరచి పోయింది’ అని ఆమె స్నేహితురాలు రాధ ఒకేసారి చెపితే అది వాక్యం అవుతుంది. ఈ గుణాన్నే ఆసత్తి అంటారు.
వాక్యాలలో రకాలు : వాక్యాలు స్థూలంగా మూడు రకాలు
- సామాన్య వాక్యం
- సంక్లిష్ట వాక్యం
- సంయుక్త వాక్యం.
1) సామాన్య వాక్యం :
ఒక సమాపక క్రియ మాత్రమే కలిగి ఉంటే అది సామాన్య వాక్యం .
ఉదాహరణ :
‘అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించాడు’ (ఇందులో రచించాడు అన్న క్రియ ఉంది) క్రియ లేకుండా కూడా సామాన్య వాక్యాలు ఉంటాయి. ఆమె ఉపాధ్యాయురాలు. ఆయన పెద్దవాడు.
వీటిలో క్రియ లేదు. అయినా పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇవీ సామాన్య వాక్యాలే.
వీటిని క్రియా రహిత వాక్యాలు అంటారు.
2) సంక్లిష్ట వాక్యం :
కొన్ని అప్రధాన వాక్యాలు ఒక ప్రధాన వాక్యంతో కలిసి ఏర్పడేది సంక్లిష్ట వాక్యం. సంక్లిష్ట వాక్యం అంటే ఒకటి అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు చివర ఒక సమాపక క్రియను కలిగి ఉంటుంది
‘నేను ఉదయాన్నే లేచి ఒక గంట సేపు చదువుతాను’.
ఇందులో ‘లేచి’ అనేది అసమాపక క్రియ. ‘చదువుతాను’ అనేది సమాపక క్రియ. కాబట్టి ఇది సంక్లిష్ట వాక్యం.
మరికొన్ని ఉదాహరణలు :
‘సుజాత టీవీ చూస్తూ, మాట్లాడుతూ భోజనం చేస్తుంది’.
‘రైలు వచ్చినా చుట్టాలు రాలేదు’.
‘అరుణ్ ఇంటికి వెళ్ళి వంట చేశాడు’.
3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యంగల రెండు, అంతకంటే ఎక్కువ వాక్యాలు కలసి ఒక వాక్యంగా ఏర్పడితే అది సంయుక్త వాక్యం అవుతుంది. దీనిలో అసమానత క్రియలుండవు. అన్నీ సమాపక క్రియలే ఉంటాయి.
ఉదాహరణ:
వెంకటాచలం వేషాలు వేస్తాడు.
వెంకటాచలం ఉపన్యాసాలిస్తాడు.
ఈ రెండు సామాన్య వాక్యాలని కలిపితే ‘వెంకటాచలం వేషాలు వేస్తాడు, ఉపన్యాసా లిస్తాడు’ అవుతుంది. ఇది సంయుక్త వాక్యం.
మరికొన్ని ఉదాహరణలు :
ఆ పెళ్ళికి నేనో, మా ఆవిడో వెళ్తాం .
పాపాలరావు అవినీతిపరుడు, కానీ నీతి గురించి మాట్లాడతాడు.
రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్ళారు.
అభ్యాసం
ఏక వాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు.
ప్రశ్న 1.
వాక్యానికి ఉండే లక్షణాలేమిటి ?
జవాబు:
యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి వాక్యానికి ఉండవలసిన లక్షణాలు.
ప్రశ్న 2.
వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు ?
జవాబు:
మూడు రకాలు. సామాన్య వాక్యము, సంక్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము.
ప్రశ్న 3.
సామాన్య వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే సమాపక క్రియ కలిగియున్న వాక్యము సామాన్య వాక్యమంటారు.
ప్రశ్న 4.
కొన్ని అప్రధాన వాక్యాలు ఒక ప్రధాన వాక్యంతో కలసి ఏర్పడే వాక్యమేది ?
జవాబు:
సంక్లిష్ట వాక్యము.
ప్రశ్న 5.
నేను ఉదయాన్నే లేచి ఒక గంట సేపు చదువుతాను. – ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
ఇది ‘సంక్లిష్ట’ వాక్యము.
ప్రశ్న 6.
పాపాలరావు అవినీతిపరుడు. పాపాలరావు నీతి గురించి మాట్లాడతాడు. – సంయుక్త వాక్యం రాయండి.
జవాబు:
పాపాలరావు అవినీతిపరుడు కానీ, నీతి గురించి మాట్లాడుతాడు.
ప్రశ్న 7.
అరుణ్ ఇంటికి వెళ్ళి వంట చేశాడు. – ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
ఇది ‘సంక్లిష్ట వాక్యము.
ప్రశ్న 8.
వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
వాక్యం అంటే అర్థవంతమైన పదముల సమాహారం.
ప్రశ్న 9.
సామాన్య వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గాంధీజీ మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చాడు.
ప్రశ్న 10.
‘వాడు మంటల్ని నిప్పుచేత ఆర్పుతున్నాడు’ – దీనిలో దోషమేది ?
జవాబు:
యోగ్యతాలోపం. నీటిచేత మంటలను ఆర్పుతాం కాని నిప్పుచేత మంటలను ఆర్పడం జరుగదు గదా !
ప్రశ్న 11.
రెండు సమ ప్రాధాన్యం గల వాక్యాలు కలసి ఒక వాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం ?
జవాబు:
సంయుక్త వాక్యం.
ప్రశ్న 12.
యోగ్యత అంటే ఏమిటి ?
జవాబు:
యోగ్యత అంటే ఒక వాక్యానికి సమర్థత ఉండటం. అంటే సరైన అర్థాన్ని ఇచ్చేదిగా ఉండటం.
q 13.
రైలు వచ్చినా చుట్టాలు రాలేదు. – ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
ఇది ‘సంక్లిష్ట’ వాక్యం .
ప్రశ్న 14.
ఆసక్తి అంటే ఏమిటి ?
జవాబు:
ఒక వాక్యంలోని పదాలు నిర్దిష్ట క్రమంలో వ్యవధి లేకుండా వస్తే దానిని ఆసత్తి అంటాము.
ప్రశ్న 15.
క్రియారహిత వాక్యానికి ఉదాహరణ రాయండి.
జవాబు:
అతడు పెద్ద ఉద్యోగి, రాజు అహంకారి.