Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Intermediate 2nd Year Telugu Grammar అలంకారాలు Questions and Answers.
AP Intermediate 2nd Year Telugu Grammar అలంకారాలు
‘అలంకరోతి ఇతి అలంకారః’ అని అలంకార శబ్దానికి సంస్కృతంలో వ్యుత్పత్తి. అంటే అలంకరించేది అని అర్థం. కావ్యాన్ని కన్యకతో పోలుస్తారు. కన్యకు సొమ్ములు ఏ విధంగా అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయో, కావ్యంలో అలంకారాలు కూడా కావ్యం సొగసుని రెట్టింపు చేస్తాయి. కావ్యంలో అలంకారాలకు రెండు ముఖ్య ప్రయోజనా లున్నాయి. 1. కావ్య సౌందర్యాన్ని ఇనుమడింపజేయడం 2. భావాన్ని సులభంగా అర్థం అయ్యేటట్లు చేయడం. అలంకారాలు రెండు రకాలు.
- శబ్దాలంకారాలు – ఇవి శబ్దం ప్రధానంగా కలవి.
- అర్థాలంకారాలు – ఇవి అర్థాన్ని ఆశ్రయించి ఉంటాయి.
1. శబ్దాలంకారాలు :
శబ్దాలంకారాలు ప్రధానంగా మూడు విధాలు.
- అనుప్రాసాలంకారం
- యమకం
- ముక్త పద గ్రస్తం.
అనుప్రాసాలంకారం
అనుప్రాస అంటే హల్లుల పునరుక్తి. అంటే వచ్చిన హల్లే మళ్ళీ మళ్ళీ రావడం. ఇది వీనుల విందైన శబ్దాన్ని అందిస్తుంది. ఈ అనుప్రాస నాలుగు విధాలు. ఇవి
1. వృత్త్యానుప్రాస :
ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లైతే అది వృత్త్యనుప్రాసాలంకారం.
ఇలా ఒకే హల్లు పలుమార్లు రావడాన్ని ‘ఆవృత్తి’ అంటారు.
ఉదాహరణ :
‘విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు’
ఇందులో ‘ష్ణు’ అనే సంయుక్తాక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాస.
అలాగే
ఉదాహరణలు :
- ‘కాలువలన్నియు గలగల పారెను’ (ల అనే హల్లు ఆవృత్తి అయ్యింది. “
- ‘చిటపట చినుకులు పటపట కురిసెను’. ! – ‘ట’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.
2. ఛేకానుప్రాస :
రెండు హల్లులు లేదా హల్లుల జంట వెంట వెంటనే వస్తూ అర్థభేదం కలిగి ఉంటే దాన్ని ఛేకానుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ :
‘కందర్ప దర్ప హర సుందర దరహాస రుచులు’
ఇందులో ‘దర్ప’ అనే హల్లుల జంట, ‘దర’ అనే హల్లుల జంట అవ్యవధానంగా, .
అంటే వెంట వెంటనే వచ్చాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాస.
ఉదాహరణ :
- సర్వదా విచారింపని పని చేయరాదు.
- నందనందన నీకు వంద వందనాలు.
3. అంత్యానుప్రాస :
‘అంత్య’ అంటే చివర అని అర్థం. పాదం చివరలో లేదా పదం చివరలో అనుప్రాస ఉన్నట్లైతే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు.
1. ఆ లలన గట్టి టోలన్
లీలన్, నవనీత చౌర్య లీలుస్, ప్రియ వా
గ్జాలున్ బరి విస్మిత గో
పాలున్, ముక్తా లలామ ఫాలున్, బాలున్
పై పద్యంలో అంత్యానుప్రాసను గమనించవచ్చు.
2. పొలాల నన్నీ
హలాల దున్నీ
ఇలా తలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ …
ఈ పాఠ్య పుస్తకంలోని శ్రీనాథుడు రచించిన ద్విపదలో అంత్యానుప్రాస చోటు చేసుకుంది గమనించగలరు.
అరుగు భూపతి పుత్ర
అంచిత గాత్ర
వీరకామ నరేంద్ర
విభవ దేవేంద్ర
4. లాటానుప్రాస :
అర్థభేదం లేకుండా, తాత్పర్య భేదం కలిగిన పదాలు వెనువెంటనే వస్తే అది లాటానుప్రాసాలంకారం. అర్థం అంటే పదానికి ఉన్న సామాన్యమైన అర్థం.
తాత్పర్యం అంటే ఆ పదానికి సందర్భానుసారంగా మనం విశేషంగా తీసుకొనే అర్థం. ఈ క్రింది ఉదాహరణలను చూడండి.
‘అమ్మ చూపించే ప్రేమ ప్రేమ !’
మొదటి వాక్యంలో ‘ప్రేమ’ అనే మాట రెండు సార్లు వచ్చినప్పటికీ, మొదటిసారి వచ్చిన ప్రేమ అనే మాటకు ‘ప్రేమ, వాత్సల్యం’ అని అర్థాలు. అదే పదం వెనువెంటనే వచ్చినప్పటికీ, దాన్ని మనం ‘నిజమైన ప్రేమ’ అనే తాత్పర్యాన్ని తీసుకుంటాం. ఇక్కడ ప్రేమ అనే మాటకు అర్థం వేరు, తాత్పర్యం వేరు. దీన్నే మనం లాటానుప్రాసం అని పిలుస్తున్నాం.
మరికొన్ని ఉదాహరణలు :
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
…. … … … …
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి ! హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి ! .
2. అర్థాలంకారాలు :
“అర్థాన్ని ఆశ్రయించి ఉండే ఈ అర్థాలంకారాల సంఖ్యను అనేకమంది అలంకారికులు అనేక రకాలుగా పేర్కొన్నారు. అడిదం సూరకవి తన చంద్రాలోకంలో 100 అర్థాలంకారాలను పేర్కొనగా, కువలయానంద కవి గరిష్ఠంగా 124 అర్థాలంకారాలను పేర్కొన్నాడు.
1. ఉపమాలంకారం :
ఉపమాలంకారాన్ని ఉపమానాలంకారం అని కూడా అంటారు. ఉపమ అంటే సామ్యం లేదా పోలిక అని అర్థం. ఉపమేయానికి ఉపమానానికి మనోహరమైన పోలిక చెపితే అది ఉపమాలంకారం. ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోల్చడం. ఇందులో నాలుగు భాగాలుంటాయి.
- ఉపమేయం : మనం దేన్నయితే వర్ణిద్దామనుకుంటామో ఆ వస్తువు. అంటే వర్ణింపబడే వస్తువు.
- ఉపమానం . : ఉపమేయాన్ని వర్ణించడానికి దేన్నయితే పోలికగా తీసుకొస్తామో అది ఉపమానం.
- సమానధర్మం : పై రెండింటిలో అంటే ఉపమేయ ఉపమానాల్లో సమానంగా ఉండే ధర్మం లేదా గుణం సమాన ధర్మం.
- ఉపమావాచకం : ఉపమేయ ఉపమానాల ధర్మ సామ్యాన్ని కలిపే అవ్యయ పదం.
ఉదాహరణ : వలె, పోలె, పట్టే, కైవడి, కరణి, భంగి, చూపె, . క్రియన్, లా/లాగ మొదలైనవి.
‘మా అమ్మ భూదేవిలా గొప్ప. సహనవంతురాలు’
ఈ వాక్యంలో అమ్మ గురించి చెపుతున్నాం కాబట్టి అమ్మ ఉపమేయం. అమ్మని ‘భూదేవితో పోలుస్తున్నాం కాబట్టి భూదేవి ఉపమానం. సహనం అనే విషయంలో చెప్తున్నాం కాబట్టి అది సమాన ధర్మం. (అమ్మలోనూ, భూదేవిలోనూ – ఇద్దరిలోనూ సహనం ఉంది కాబట్టి). ఉపమేయాన్ని, ఉపమానాన్ని అనుసంధానించడానికి వాడిన పదం – లా, ఇది. ఉపమావాచకం. కాబట్టి ఇది. ఉపమాలంకారం. ఈ పాఠ్యపుస్తకంలోని సత్య ప్రాశస్త్యములో ఈ క్రింది పద్యాలలో ఉపమాలంకారం ఉంది.
- ‘విను గార్హపత్యమను నయ్యనలము …… ”
- ‘తాన తననీడ నీళ్ళలలో నేర్పడఁ జూచునట్లు …..’
2. ఉత్ప్రేక్షాలంకారం :
ఊహ ప్రధానంగా గలది ఉత్ప్రేక్ష. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లైతే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది.
ఉదాహరణ :
- ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని నుండి వెలువడిన ధూమమని తలచెదను. ఇక్కడ చీకటి నలుపు. దృష్టి నిరోధకం. పొగ నలుపు. దృష్టి నిరోధకం. కాబట్టి ఈ సమాన ధర్మాలవల్ల కవి చీకటిని పొగలాగా ఊహించుకొన్నాడు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.
- ఆ ఏనుగు నడగొండయో అన్నట్లుంది.
- ఆమె ముఖము పద్మమేమో – అను వాటిల్లో కూడా ఉత్ప్రేక్షాలంకారం ఉంది.
3. రూపకం :
ఉపమేయానికీ, ఉపమానానికీ అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేదని చెప్పినట్లయితే అది రూపకాలంకారం.
‘అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపాగ్నిలో కాలిపోతున్నాడు’.
ఈ ఉదాహరణలో, అతడు తప్పుచేసి, చేసిన తప్పును తెలిసికొని, పశ్చాత్తాపం అనే అగ్నిలో కాలిపోతున్నాడు. ఇక్కడ పశ్చాత్తాపాగ్ని అనే సమాసంలో, పశ్చాత్తాపము అనేది ఉపమేయం, అగ్ని అనేది ఉపమానం. రెండింటికీ భేదం లేదని చెప్పడం వల్ల ఇది రూపకాలంకారం.
- రుద్రమ్మ చండీశ్వరీ దేవి.
- సంసార సాగరం.
4. స్వభావోక్తి :
జాతి గుణ క్రియాదుల చేత ఒక వస్తువును ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం.
‘ఒడలందెల్ల విభూతిపూత, పులితోలొహిణ, మల్లాడు కెం
జడ, లాత్మైక విచార నిశ్చల దృగబా తంబు, లచ్చెన క .
చ్చడ మంసంబున, రుండమాల, గళదేశ స్థాణువుం లగా …….
పై పద్యంలో పరమశివుని రూపం యథాతథంగా వర్ణించబడింది. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.
ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగాల్లో ఈ క్రింది పద్యాలలో గల స్వభావోక్తులను గమనించండి.
1. ‘నీలమేఘచ్ఛాయ బోలు దేహమువాడు – ధవళాబ్జ పత్ర నేత్రములవాడు ……”
ఈ పద్యంలో కవయిత్రి మొల్ల శ్రీరాముని అత్యంత సహజంగా అద్భుతంగా వర్ణించింది.
2. ‘నిడుద పెన్నెరి వేణి జడలుగా సవరించి – మలిన జీర్ణాంబరంబొలియగట్టి ….”
ఈ పద్యంలో సీతాదేవి స్థితి అత్యంత సహజంగా చిత్రించబడింది.
5. అతిశయోక్తి :
ఒక వస్తువు యొక్క స్థితిని, గుణాన్ని లేదా స్వభావాన్ని ఉన్నదాని కంటె ఎక్కువగా వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం.
ఉదాహరణ :
ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగంలో కవయిత్రి మొల్ల ఒక చక్కని అతిశయోక్తిని ప్రయోగించింది. సీతాదేవి కోరిక మేరకు హనుమంతుడు తన చిన్న వానర దేహాన్ని విపరీతంగా పెంచిన సందర్భంలోనిది ఈ పద్యం.
చుక్కలు తలపూవులుగా
నక్కజముగ మేను వెంచి యంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదమునొందె నాత్మ స్థితికిన్
నక్షత్రాలే తన తలపూవులగునట్లుగా, ఆకాశవీధిలో ఆశ్చర్యంగొలిపే విధంగా తన శరీరాన్ని పెద్దది చేసి సీతాదేవికి ఆనందం కలుగజేశాడు హనుమంతుడు. ఇది అతిశయోక్తి అలంకారం.
- ఆలయగోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
- మా వీధిలో ఒకాయన తాటిచెట్టంత పొడవు.
6. అర్థాంతరన్యాసం : సామాన్యాన్ని విశేషంతో గాని, విశేషాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్పినట్లయితే అది అర్థాంతరన్యాసాలంకారం.
ఉదాహరణకు
‘హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదు. ఈ వాక్యాన్ని పరిశీలించండి.
హనుమంతుడు సహజంగా వానరం. అతడు సముద్రాన్ని లంఘించడం ఆశ్చర్యం గొలిపే విషయం . కాబట్టి ఇది విశేషం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు – ఈ వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇది సామాన్యం.
పైన తెలిపిన విశేషాన్ని సామాన్య వాక్యం చేత సమర్థిస్తే అది అర్థాంతర న్యాసాలంకారం.
మరో ఉదాహరణ చూద్దాం.
ఈ పాఠ్య పుస్తకంలోని నన్నయ పాఠ్యభాగంలో క్రింది పద్యాన్ని గమనించండి.
ఏల యెఱుకలేని యితరుల యట్ల నీ
వెఱుగ ననుచుఁ బలికె దెటిఁగి యెటిఁగి
యేనకాని దీని నెఱుఁగరిన్ దొరులని
తప్పఁ బలుకనగునె ధార్మికులకు
శకుంతల దుష్యంతునితో అంటున్నది – ‘అన్నీ బాగా తెలిసి .కూడా నేనెవరో తెలియదని ఇతరుల వలె ఎందుకు మాట్లాడుతావు ? ఇతరులకు తెలియదనే మిషతో ధర్మాత్ములైనవారు అసత్యం పలుకవచ్చునా ?’ ఇక్కడ గొప్పవాడైన దుష్యంతుడు శకుంతల , ఎవరో తెలియదని అబద్దమాడడం విశేషం. ధర్మాత్ములు అబద్దాలు ఆడకూడదు – అనేది సాధారణ లోక ధర్మం. ఇది సామాన్యం.
అభ్యాసం
ఏక వాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు.
ప్రశ్న 1.
ఉపమేయం అంటే ఏమిటి ?
జవాబు:
వర్ణించబడే వస్తువును ఉపమేయం అంటారు.
ప్రశ్న 2.
‘చుక్కలు తలపూవులుగా ……’ పద్యంలో ఉన్న అలంకారమేది ?
జవాబు:
ఈ పద్యంలో అతిశయోక్తి అలంకారమున్నది.
ప్రశ్న 3.
సామాన్యాన్ని విశేషం చేత, విశేషాన్ని సామాన్యం చేత సమర్థించే అలంకారమేది ?
జవాబు:
అర్ధాంతరన్యాసాలంకారము.
ప్రశ్న 4.
అలంకారాల ప్రయోజనమేమిటి ?
జవాబు:
అందంగా, అర్థమయ్యేలా చెప్పటానికి అలంకారాలు ఉపయోగపడతాయి.
ప్రశ్న 5.
విష్ణురోచిష్ణుజిష్ణు సహిష్ణుకృష్ణు – లోని అలంకారమేది ?
జవాబు:
వృత్త్యనుప్రాసాలంకారము.
ప్రశ్న 6.
రెండు హల్లులు వెంటవెంటనే వస్తూ అర్థ భేదం కలిగి ఉండే అలంకారమేది ?
జవాబు:
ఛేకానుప్రాసాలంకారము.
ప్రశ్న 7.
అమ్మ చూపించే ప్రేమ ప్రేమ. – ఇందులోని అలంకారమేది ?
జవాబు:
లాటానుప్రాసాలంకారము.
ప్రశ్న 8.
అంత్యానుప్రాసకు ఒక ఉదాహరణ రాయండి.
జవాబు:
పొలాల నన్నీ
హలాల దున్నీ
ఇలా తలంలో హేమం పిండగ .
జగానికంతా సౌక్యం నిండగ ……
ప్రశ్న 9.
ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. – దీనిలోని అలంకారమేది ?
జవాబు:
అతిశయోక్తి అలంకారమున్నది.
ప్రశ్న 10.
శబ్దాలంకారం అంటే ఏమిటి ?
జవాబు:
శబ్ద ప్రాధాన్యం గల అలంకారాలను శబ్దాలంకారాలంటాము.
ప్రశ్న 11.
వలె, పోలె, అట్లు, లాగ – ఈ పదాలను ఏమంటారు ?
జవాబు:
ఉపమావాచకములంటారు.
ప్రశ్న 12.
అలంకారాలు ఎన్ని రకాలు ? అవి ఏవి ?
జవాబు:
అలంకారములు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని రెండు రకాలు.
ప్రశ్న 13.
ఊహ ప్రధానంగా ఉండే అలంకారమేది ?
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అలంకారం.
ప్రశ్న 14.
సంసార సాగరం – దీనిలోని అలంకారమేది ?
జవాబు:
రూపకాలంకారము.
ప్రశ్న 15.
‘నీల మేఘచ్ఛాయ బోలు దేహమువాడు’ – ఈ పద్యంలోని అలంకారమేది ?
జవాబు:
“స్వభావోక్తి”.