Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material పద్య భాగం 6th Poem కపాలమోక్షం Textbook Questions and Answers, Summary.
AP Inter 1st Year Telugu Study Material 6th Poem కపాలమోక్షం
వ్యాసరూప సమాధాన ప్రశ్న
ప్రశ్న 1.
కపాలమోక్షం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
ఏ భావమూ లేని నిశ్చల సమాధి స్థితిలో కన్నులు మూసుకుని వేదములలో చెప్పబడిన వాడైన ఆదిశంకరుడు ధ్యానంలో గాఢంగా లీనమై ఉండగా ఓంకార ప్రణవాక్షరం గట్టిగా హుంకరించింది. సమస్త ప్రకృతిలోని చరాచరములు కంపించిపోయాయి. పంచభూతాలు విజృంభించాయి. కనులకు కాటుక పెట్టనట్లుగా కర్మసాక్షి సూర్యుడు చీకటిని వెదజల్లాడు.
ఆకాశగంగలో ప్రకాశించే అలల నుండి హాలాహలం వెలువడసాగింది. ఆదిశేషువు పడగల మీద ఉండే మణులు కాంతి విహీనమయ్యాయి. పూదోటలు వికసించలేదు. వసంత ఋతువు రావడం లేదు. మూడు లోకాలలోని మునిశ్రేష్ఠులు బాధతో మూలిగారు. అనంతకోటి జీవరాశులు గగ్గోలు పెట్టాయి. హరహర మహాదేవ రక్షించు, రక్షించు అని నమస్కరించాయి.
మహిమాన్వితుడైన ఆ శివుని మనసులో సానుభూతి కలిగింది. అపుడు కనులు తెరచి ఆకలి, ఆకలి అంటూ తన భిక్షాపాత్రయైన బ్రహ్మకపాలం కోసం చేయి చాపాడు. అగ్ని నేత్రుడైన శివుడు ఉగ్రంగా చేసిన తపస్సుకు జన్మించిన వేడిలో జ్ఞాపికగా ఉన్న బ్రహ్మకపాలం కరిగిపోయింది. కోపంతో పళ్ళు పటపట కొరికాడు.
శివుని ఆగ్రహాన్ని చూసిన పంచభూతములు, పిశాచములు సింహనాదం చేసాయి. స్తుతిచేసే వందిమాగధులు వణికిపోయారు. భయపడిన నంది రంకె వేసాడు. భూలోకంలోని మహమ్మదీయ, క్రైస్తవ సమాధులలోని, హిందూ శ్మశానవాటికలోని కపాలములు వికవిక నవ్వాయి. ఆ పుర్రెలు గగుర్పాటు చెందాయి. అస్థిపంజరములు ఘల్లున మోగాయి.
హిమాలయ పర్వత శిఖరాగ్రాన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అగ్నిదేవుడు ధరించిన శివుని వీర్యాన్ని దాచి ఉంచిన బంగారపు కుండ కదిలింది. సువర్ణమే ఉదరంగా కలిగిన అగ్నిదేవుడు జ్వలించి స్థలించాడు. గంగానది ఎద పాలపోటుతో తొట్రుపడింది. గంగ గర్భంలోని శివతేజస్సు మానవరూపం దాల్చడానికి సమాయత్తమైంది. సింధు, గంగానదుల గర్భంలో, సముద్రపు లోతుల్లో బడబాగ్ని అనే శివుని నేత్రాగ్ని సర్దార్ భగత్ సింగ్ రూపంలో జన్మించింది. ఆ తేజస్సుకి భారతభూమి జ్వలించి పోయింది. ఆకాశమంతా ఆ ధూమం వ్యాపించింది.
శివుని నేత్రాగ్నియే తానై జన్మించిన భగత్ సింగ్ కాలంలో భారతమాత ఆంగ్లేయుల కిరాతక పాలనలో అల్లాడుతోంది. ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చివరకు ఆ భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణత్యాగం చేసాడు. ఈ విధంగా జీవితమంతా పోరాటంలోనే గడిపాడు.
తన ప్రాణత్యాగంతో దేశ ప్రజలలో దేశభక్తి అనే అగ్నిని పలికించిన వీణయై, స్వాతంత్ర్య సాధనకు తన శిరస్సును అర్పించినవాడై ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపిన భగ్న గేయమై పరమ పవిత్రమైన ఓంకారంగా మారి, ఆ పరమ శివభక్తుడు (భగత్ సింగ్ నాస్తికుడైనప్పటికీ అతని అసమాన దేశభక్తిని వీరశైవుల భక్తితో కవి పోల్చాడు). మోక్షాన్ని పొందాడు. వీరుడైన భగత్ సింగ్ కపాలం శివుని చేతిలో రివ్వున వాలింది. ఆనందంతో కెవ్వున కేకేసాడు. శివుని నుదుటనున్న మూడవ నేత్రం కంపించింది. అండపిండ బ్రహ్మాండం ఆనందంతో తాండవ నృత్యం చేసింది. కనులలో ఆనందాశ్రువులను నింపింది.
భూభారం వహించే ఆదిశేషువు పడగల మెత్తని శయ్యపై భూమాత వాలింది. ఎడారిలో పూలు పుష్పించాయి. ఈ భూమిపై ఎందరో జన్మించారు. ఇంకెందరో మరణించారు. లోకాలను దహించివేయగల హాలాహలాన్ని అంటిన ఈ పవిత్ర హస్త స్పర్శ, హాలాహలాన్ని మింగిన ఆ పెదవుల స్పర్శ, కపాలమోక్షం అందరికీ లభించదు.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
శ్రీరంగం నారాయణబాబును గురించి రాయండి.
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు 1906వ సంవత్సరంలో రమణమ్మ, నారాయణ దంపతులకు జన్మించాడు. మహాకవి శ్రీశ్రీ ఇతనికి తమ్ముడి వరుస అవుతాడు. నారాయణబాబు అభ్యుదయ కవి. రుధిరజ్యోతి అనే కవితా సంకలనం, ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు రచించాడు.
నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణబాబు కవితా వస్తువులు. విభిన్న పద ప్రయోగం, క్లుప్తత, గాఢతాత్త్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి వీరి కవిత్వంలో కనిపిస్తుంది. వీరు 1961వ సంవత్సరంలో మరణించారు.
ప్రశ్న 2.
భగత్ సింగ్ ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22. 9. 1907న భగత్ సింగ్ జన్మించాడు. 23.3. 1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్ సింగ్ ను 23.3. 1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్ సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్ర్య వీరుడు భగత్ సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.
ఏకవాక్క / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
శ్రీరంగం నారాయణబాబుకు శ్రీశ్రీ ఏమవుతాడు ?
జవాబు:
తమ్ముడు వరుస
ప్రశ్న 2.
కపాలమోక్షం ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది ?
జవాబు:
రుధిరజ్యోతి
ప్రశ్న 3.
కపాలమోక్షం పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు
ప్రశ్న 4.
రుధిరజ్యోతి సంపుటి ఎవరి నేతృత్వంలో వెలువడింది ?
జవాబు:
ఆరుద్ర
ప్రశ్న 5.
స్వాహా వల్లభుడెవరు ?
జవాబు:
అగ్నిదేవుడు.
ప్రశ్న 6.
మానవ రూపం దాల్చిందేమిటి ?
జవాబు:
శివుని నేత్రాగ్ని.
సందర్శ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
భూత పిశాచాల్ బొబ్బరిల్లినవి
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం శ్రీరంగం నారాయణబాబు రచించిన కపాలమోక్షం కవిత నుండి స్వీకరించబడింది.
సందర్భం :
తపస్సమాధి నుండి మేల్కొన్న శివుని ఆగ్రహాన్ని వర్ణించు సందర్భంలోనిది.
అర్థం :
భూతములు, పిశాచములు సింహనాదం చేసాయి.
భావం :
శివుడు చేసిన ఉగ్ర తపస్సుకు కానుకగా ఉన్న బ్రహ్మకపాలం కరిగిపోయింది. ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికాడు. శివుని ఆగ్రహాన్ని చూసిన భూత, పిశాచములు సింహనాదం చేసాయి. వందిమాగధులు వణికారు. భయపడి బసవడు రంకె వేసాడు అని భావం.
ప్రశ్న 2.
మానవ రూపం దాల్చింది.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం శ్రీరంగం నారాయణబాబు రచించిన కపాలమోక్షం కవిత నుండి స్వీకరించబడింది.
సందర్భం :
కవి శివుని నేత్రాగ్ని భగత్ సింగ్ గా జన్మించింది అని తెలిపే సందర్భంలోనిది.
అర్థం :
మానవ జన్మ ఎత్తింది.
భావం :
నదీమతల్లి గంగ ఎద పాలపోటుతో తొట్రుపడింది. సింధునది గర్భంలో, గంగ కడుపులో, సముద్రపు లోతుల్లో దాగిన శివుని నేత్రాగ్ని భారతవీరుడు భగత్ సింగ్ గా జన్మించింది. ఆ తేజస్సుకు ఈ నేల జ్వలించింది. ఆకాశమంతా పొగచూరింది అని భావం.
ప్రశ్న 3.
మంటల్లో పెరిగాడు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం శ్రీరంగం నారాయణబాబు రచించిన కపాలమోక్షం కవిత నుండి స్వీకరించబడింది.
సందర్భం :
కవి భగత్ సింగ్ జన్మించిన కాలం నాటి దేశ పరిస్థితులను తెలుపుతున్న సందర్భంలోనిది.
అర్థం :
తీవ్ర సంఘర్షణ వాతావరణంలో ఎదిగాడు.
భావం :
భగత్ సింగ్ జన్మించిన నాటికి భారతదేశం బ్రిటీష్ వారి కిరాతక పాలనలో అల్లాడిపోతోంది. ఆ వాతావరణంలో జన్మించిన భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్నతనం నుంచి తపించిపోయాడు. జలియన్ వాలాబాగ్ వంటి హింసాత్మక ఘటనలు చూసినవాడు. అటువంటి వాతావరణంలో ఎదిగి పెద్దవాడయ్యాడు.
సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం :
అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును.
- చరాచరమ్ములు = చర + అచరములు = సవర్ణదీర్ఘ సంధి.
- శిఖరాంచలము = శిఖర + అంచలము = సవర్ణదీర్ఘ సంధి
2. గుణ సంధి సూత్రం :
అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనప్పుడు క్రమంగా ఎ, ఒ, అర్లు ఆదేశమగును.
- నయనేంద్రియం = నయన + ఇంద్రియం = గుణ సంధి
3. ఉకార సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
- కపాలమొక్కటి = కపాలము + ఒక్కటి = ఉకార సంధి
4. గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు.
- వీసరవోయినవి = వీసర + పోయినవి = గసడదవాదేశ సంధి
- సూడిదవెట్టిన = సూడిద + పెట్టిన = గసడదవాదేశ సంధి
సమాసాలు
1. ముల్లోకములు – మూడు అను సంఖ్య గల లోకములు – ద్విగు సమాసం
2. బ్రహ్మకపాలం – బ్రహ్మ యొక్క కపాలం – షష్ఠీ తత్పురుష సమాసం
3. కపాలమోక్షం – కపాలమునకు మోక్షం – షష్ఠీ తత్పురుష సమాసం
4. స్వాహా వల్లభుడు – స్వాహా యొక్క వల్లభుడు – షష్ఠీ తత్పురుష సమాసం
5. కంఠేకాలుడు – కంఠం నందు విషం గలవాడు – బహుబ్లిహి సమాసం
6. అగ్నివీణ – అగ్ని అనెడి వీణ – రూపక సమాసం
విశేషాంశాలు
బ్రహ్మకపాలం :
ఇది శివుని భిక్షాపాత్ర. బ్రహ్మకు చతుర్ముఖుడని పేరు. నిజానికి ఆదిలో బ్రహ్మకు ఐదు తలలుండేవి. ఒకనాడు ముల్లోకాలకు అధిపతి ఎవరన్న మీమాంస తలెత్తింది. ఈ విషయమై బ్రహ్మ, విష్ణువు వాదులాడుకుంటుండగా శివుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు బ్రహ్మ శివుని లింగాకృతిలో మొదటి భాగం చూశానని అబద్ధం చెప్పాడు. అంతేకాక, బ్రహ్మ ఐదోతల శివుణ్ణి దూషించింది. అందుకు శివుడు ఆ ఐదో తలను నరికి వేశాడు. అది శివుని చేతికి అతుక్కుపోయింది. అప్పుడు బ్రహ్మ ఆ కపాలంతోనే భిక్షాటన చేసి బతకమని శివుణ్ణి శపించాడు. అదే బ్రహ్మకపాలం అయింది. మిగిలిన నాలుగు తలలతో బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడని ఐతిహ్యం.
గంగానది :
ప్రసిద్ధమైన పవిత్రమైన నది. సాక్షాత్తూ విష్ణుమూర్తి పాదాల దగ్గర గంగానది పుట్టిందని ప్రతీతి.
లవణ సాగరం :
సప్త సముద్రాలలో ఒకటి. ఇక్షు సముద్రం, సురా సముద్రం, సర్పి సముద్రం, దధీ సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం అనేవి తక్కినవి.
తాండవ నృత్యం :
నృత్యరీతుల్లో తాండవ నృత్యం ఒకటి. నృత్యరీతులన్నింటిలోనూ తాండవం ఉద్ధత నృత్యం. పరమశివుని నాట్యం తాండవ నృత్యంగా ప్రసిద్ధం.
చరాచరమ్ములు :
స్థావర జంగమాలు, చరములు, అచరములు; కదిలేవి, కదలనివి. చరములు ఐదు రకాలు. అవి : ఖేచరులు, భూచరులు, వనచరులు, జలచరులు, ధీచరులు. వీటిని చర పంచకం అంటారు. పర్వతాలు వంటివి అచరములు.
ముల్లోకములు :
మూడు లోకాలు – భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం అనేవి ముల్లోకాలుగా ప్రసిద్ధి. మనుష్యలోకం, పితృలోకం, దేవలోకాలను కూడా ముల్లోకాలుగా వ్యవహరించడం ఉంది.
కపర్ది :
శివుని నామాంతరం – రుద్రులు పదకొండుమంది. వీరినే ఏకాదశ రుద్రులు అంటారు. కపర్థి వారిలో ఒకరు.
కనక ఖాండం :
బంగారు కుండ – అగ్ని దేవుని భార్య స్వాహాదేవి. ఒకసారి అగ్ని మునిపత్నులను చూసి మోహించాడు. ఆ విషయం తెలుసుకున్న అగ్ని భార్య మునిపత్నుల వేషాలు ధరించి అగ్నితో సంగమించింది. అతడి వీర్యాన్ని ఒక కనక భాండంలో సేకరించి మంచుకొండ అయిన కైలాస పర్వతం మీద నిక్షిప్తం చేసింది. ఆ కనక భాండమే ఇప్పుడు కదిలిందట.
గంగ వక్షము :
ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారు. వారి ఏకాంతాన్ని భగ్నం చేయాలని దేవతలు భావించారు. వీరి ప్రోద్బలం వల్ల అగ్నిదేవుడు శివపార్వతుల ఎదుట నిలబడ్డాడు. పార్వతి ఇబ్బంది పడింది. అగ్నిని శపించింది కూడా. ఈ శాపం మూలంగా శివుని వీర్యాన్ని అగ్ని ధరించవలసి వచ్చింది. అతడు దానిని భరించలేక, గంగానది గర్భంలో భద్రపరిచాడు. ఇపుడా గంగ వక్షము పాలపోటుతో కళవళ పడుతూంది. అంటే, గంగ గర్భములోని శివుని వీర్యం మానవ రూపం పొందడానికి సమాయత్తమైందట.
నేత్రాగ్ని :
శివుడు ఫాలనేత్రుడు. ఫాలభాగంలో మరో నేత్రం కలవాడు. ఈ మూడోకంటి నుంచి చూపులు ప్రసరించవు. అగ్ని కురుస్తుంది. అది మామూలు అగ్ని కాదు, తీవ్రమైంది. తీక్షణమైంది కూడా. ఎంతటివారినైనా ఇట్టే దహించి వేయగలదు. నేత్రాగ్ని అంటే ఇదే.
ఒకనాడు ఇంద్రుడు శివుణ్ణి ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. ఫాలనేత్రుడికి కోపం వచ్చింది. మూడోకన్ను తెరిచాడు. ప్రజ్వరిల్లిన జ్యోతికి ఇంద్రుడు బూడిదయ్యాడు (వేరే సందర్భంలో ఇంద్రుడు మళ్ళీ బ్రతికాడు). ఇంద్రుణ్ణి భస్మం చేయగా మరికొంత నేత్రాగ్ని మిగిలింది. దానిని శివుడు మూడు భాగాలు చేశాడు. ఒక భాగాన్ని సింధూనది కడుపులో, మరో భాగాన్ని గంగానది గర్భంలో, ఇంకో భాగాన్ని లవణ సాగరం అడుగుభాగాన దాచిపెట్టాడు.
ఇప్పుడు సమిష్టిగా ఆ నేత్రాగ్ని మానవాకృతిని పొందింది. అతడే విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ గా కని ఆవిష్కరించాడు. నిర్వికల్ప సమాధి : నిర్వికల్పం అంటే లోకాతీతమైన అద్వితీయంగా ప్రకాశించే జ్ఞానం. ఒకానొక సమాధి స్థితి. సమాధి అనేది యమం, నియమం వంటి అష్టాంగ యోగాలలో ఆఖరిది. దీనిని ధ్యానిస్తున్నారో దానికి తనకూ భిన్నత్వం నశించడం, అభేదం సిద్ధించడం సమాధి. లోకాతీతమైన జ్ఞాన సముపార్జన కోసం ఏదైనా ఒక విషయంలో తాను లయం కావడం, చిత్తాన్ని ఆ విషయం మీద నిలపడం నిర్వికల్ప సమాధి.
అనగా జీవుడి బాహ్య వృత్తులూ, అంతర వృత్తులూ నశించిపోయి బ్రహ్మ జ్ఞానం కలగడం. ఈ స్థితికి మరో పేరు అసంప్రజ్ఞాత సమాధి. సవికల్ప సమాధి, లేదా సంప్రజాత సమాధి నిర్వికల్ప సమాధి కంటే భిన్నమైంది. అక్కడ ధ్యేయవస్తువు ఎరుకలో ఉంటుంది.
ఓంకారం :
ఓంకారమంటే సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం. నిత్య శుద్ధమైన బీజాక్షరం. పారమార్థిక పరిభాషలో దీనినే ప్రణవం అని వ్యవహరిస్తున్నాం.
భూత పిశాచాలు :
లౌకిక వ్యవస్థలో దెయ్యాలూ, భూతాలూ అనే సామాన్యార్థంలో ఈ పదాలను వ్యవహరిస్తాం. కానీ, ఇక్కడ భూతాలు అంటే పంచభూతాలు. పృధ్వి, ఆకాశం, వాయువు, నీరు, నిప్పు అనేవి. అలాగే పిశాచాలు మూడు – అధోముఖం, ఊర్ధ్వముఖం, తిర్యణ్మఖం అనేవి పిశాచాలు.
అంతఃకరణం :
అంతఃకరణంలో నాలుగు అంశాలుంటాయి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీటినే అంతఃకరణ చతుష్టయం అంటారు. ‘అంతరంగం’ అంతఃకరణలో ఒక భాగం. అది అంతరాత్మకు అంటే మనస్సుకు సంబంధించింది. మనస్సు యుక్తా యుక్తాల గురించీ, ధర్మాధర్మాల గురించి ఆలోచించేటప్పుడు మనిషిని మంచి వైపుకు మరలించే అంతరింద్రియం.
తారకమంత్రం :
‘తారము’ అంటే తరింప చేసేది అని అర్థం. ‘తారకము’ అంటే సంసార బంధాల నుంచి తరింపచేసేది. అంటే, ఓంకారం లేదా ప్రణవం. ‘మంత్రం’ అంటే కొన్ని ప్రత్యేక అక్షరాల సముదాయం . ఈ అక్షరాలకు ఒక అర్థం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మంత్రంలోని ఈ వర్ణాలలో కొన్ని బీజాక్షరాలు కూడా ఉంటాయి. కొన్ని పదాలు కూడా ఉండవచ్చు.
దేవతల అనుగ్రహాన్ని సంపాదించడానికీ, ఆధ్యాత్మిక ఉన్నతికీ ఈ మంత్రాలను జపించడం వేదకాలం నుంచీ ఉన్నదే. ఈ మంత్రాలలో, ఉపకారం చేయడం కోసమే కాక, విధ్వంస సాధనాలుగా వినియోగించేవి కూడా . ఉన్నాయి. ఈ విధ్వంస ఆయుధాలను తాంత్రిక మంత్రాలంటారు. తారక మంత్రాదులు దేవతల అనుగ్రహ సాధనాలు.
పరంజ్యోతి :
‘పరమ’ జ్యోతే పరంజ్యోతి. ‘పరం’ అంటే ఇహం కానిది, మోక్షం. అదే – పరలోకం. ‘పరమం’ అంటే ‘ఓం’కారం. అందుకే పరమాత్మను పరబ్రహ్మ అనీ, పరమ పురుషుడనీ వ్యవహరిస్తాం. ఈ ‘పరమాత్మ సంబంధమైన మోక్షాన్నీ, లేదా కైవల్యాన్ని పొందే ప్రశస్తమైన స్థానాన్ని ‘పరమ పదం’ అని భావిస్తున్నాం. జ్యోతి అంటే వెలుగు, జ్ఞానం, కాలచక్రం, కాలచక్రాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న సూర్యుడు జ్యోతిష్మంతుడు. పారమార్థికంగా ఒక సాత్త్వికమైన చిత్త స్థితిని పొందింపచేసే జ్ఞానం పరంజ్యోతి. అదే – పరమాత్మ. అదే – ప్రణవం. అదే – ఓంకారం.
అండ పిండ బ్రహ్మాండం :
అండమూ, పిండమూ మొదలు బ్రహ్మాండ పర్యంతమూ ఉన్న సమస్తమూ కలిపి అండ పిండ బ్రహ్మాండం. అండం అంటే గుడ్డు. పిండం అంటే మాతృగర్భంలో దేహధారణ చేస్తున్న దశలోని రూపం. బ్రహ్మాండం అంటే భూమి, గ్రహాలూ, నక్షత్రాలూ, వియన్మండలం వంటి సమస్తం ఇందులో అంతర్భవించి ఉంటాయి. ఈ సామాన్యర్థాలే కాక ఈ పదాలకు పారమార్థిక అర్థాలు కూడా ఉన్నాయి. అండం అంటే భూమి. పిండం అంటే స్థావర జంగమాత్మకమైన ప్రపంచం. గుడ్డు, గుడ్డు నుండి బిడ్డ పుట్టడం అనేది పంచమహాభూతాలతో కూడిన ఒక సృష్టి. ఇక్కడ స్థూల శరీరం అండం. జీవాత్మ పిండం. జీవాత్మతో కూడిన పరమాత్మ – అండపిండ బ్రహ్మాండం.
కపాలమోక్షం :
కపాలం అంటే పుర్రె. కొన్ని రకాల యజ్ఞ ద్రవ్యాలను తయారు చేయడానికి వినియోగించే పాత్రను కూడా ‘కపాలం’ అని వ్యవహరించడం ఉంది. బ్రహ్మకపాలధారి శివుడు. అందుకే ‘కపాలమావి’ అన్నది శివునికి మరో పేరు.
‘మోక్షము’ అంటే కైవల్య సిద్ధి. స్వస్వరూపానందాన్ని పొందడమే మోక్షం. ఎవరు కర్తృత్వ భావన లేకుండా; కర్మలను చేసి, సకల ప్రాణుల పట్ల దయగా వ్యవహరిస్తూ; నిత్యానిత్య వస్తు వివేకం; ఐహికాముష్మిక ఫల భోగ విరాగం, శమ దమాది పల్కు సంపత్తి, ముముక్షత్వం అనే సాధన చతుష్టయాన్ని ఎవరు అనుసరిస్తారో వారు మోక్ష సాధనకు అర్హులు. పరమ పురుషుని చేతిలో తాను కపాలంగా మారి కైవల్య సిద్ధిని పొందడం కపాలమోక్షం.
కఠిన పదాలు – అర్ధాలు
ప్రశ్న 1.
నిర్వికల్ప సమాధి
నిమీలితాక్షుడు
వేదసన్నిహితు
ఆదిశంకరు
తపస్సమాధిని
ఓంకారమ్మే
హుంకరించినది
జవాబు:
ప్రతిపదార్థం :
నిర్వికల్ప సమాధి = ఏ భావమూ లేని నిశ్చల స్థితి
నిమీలితాక్షుడు = మూసిన కన్నులు కలవాడు
వేద సన్నిహితుడు – వేదములకు సమీపంగా ఉండువాడు / వేదములలో చెప్పబడినవాడు
తపస్సమాధి = ధ్యానంలో గాఢంగా లీనమగుట
ఓంకారము = అకార, ఉకార, మకార మేర్పడిన బీజాక్షరం
హుంకారము = ‘హుం’ అని అరచుట.
భావము :
ఏ భావమూ లేని నిశ్చల సమాధి స్థితిలో కన్నులు మూసుకున్న, వేదములలో చెప్పబడినవాడైన ఆదిశంకరుడు ధ్యానంలో గాఢంగా లీనమై ఉండగా, ఓంకార ప్రణవాక్షరం గట్టిగా హుంకరించింది.
ప్రశ్న 2.
చలించినవి అని
చరాచరమ్ములు
భూతా లుబ్రేకించినాయి
కాటుక పెట్టిన
నయనేంద్రియమై
చీకటు లురిలాదు
జవాబు:
ప్రతిపదార్థం :
చరాచరములు (చరములు, అచరములు) = కదిలేవి, కదలనివి
చలించినవి = కదిలిపోయినవి / కంపించినవి
భూతాలు = పంచభూతాలు (పృథ్వి, ఆకాశం, వాయువు, నీరు, నిప్పు)
ఉద్రేకించాయి = విజృంభించాయి
కాటుక = కనురెప్పలకు పెట్టునది
నయనేంద్రియం = కన్ను
కర్మసాక్షి = సూర్యుడు
ఉరిలాడు = వెదజల్లాడు
భావం :
సమస్త ప్రకృతిలోని చరములు (కదిలేవి) అచరములు (కదలలేనివి) కంపించి పోయాయి. పంచభూతాలు విజృంభించాయి. కనులకు కాటుక పెట్టుకున్నట్లుగా కర్మసాక్షి సూర్యుడు చీకటిని వెదజల్లాడు.
ప్రశ్న 3.
అభ్ర గంగలో
శుభ్ర వీచికల
హాలాహలమే
తల ఎత్తింది
శేషుని ఫణాల
మణుల కాంతులు
వీసరవోయినవి
జవాబు:
ప్రతిపదార్థం :
అభ్ర గంగ = ఆకాశగంగ
శుభ్ర = ప్రకాశించే
వీచికలు = అలలు
హాలాహలం = విషం
తలఎత్తింది = వెలువడింది
శేషువు = ఆదిశేషుడు (విష్ణుమూర్తి తల్పం)
ఫణము = పడగ
మణులు = నాగమణులు
కాంతులు = ప్రకాశం
వీసరవోయినవి = కాంతి విహీనమయ్యా యి
భావం :
ఆకాశగంగ నదిలో ప్రకాశించే అలల నుండి హాలాహలం వెలువడింది. ఆదిశేషువు పడగలమీద ఉండే మణులు కాంతి విహీనమయ్యాయి.
ప్రశ్న 4.
పూదోటలు
లేనేలేవు
వసంతములు
రానేరావు
ముల్లోకమ్ముల
తబిసి మిన్నలు
ముర్మురించినారు
జవాబు:
ప్రతిపదార్థం :
పూదోటలు = పూల తోటలు
లేనేలేవు = లేవు / వికసించలేదు
వసంతములు = వసంత ఋతువు
రానేరావు = రావడం లేదు
ముల్లోకమ్ముల = మూడు లోకములలో
తబిసిమిన్నలు = మునిశ్రేష్ఠులు
ముర్మురించారు = బాధతో మూలిగారు
భావం :
పూలతోటలు వికసించడం లేదు, వసంత ఋతువు రావడం లేదు. మూడు లోకాలలోని మునిశ్రేష్ఠులు బాధతో మూలిగారు.
ప్రశ్న 5.
అనంతకోటి
జీవరాశులు
హాహాకారం
చేశాయి
జవాబు:
ప్రతిపదార్థం :
అనంతకోటి = లెక్కలేనట్టి
జీవరాశులు = విభిన్న ప్రాణులు
హాహాకారం = గలు
భావం :
అనంతకోటి జీవరాశులన్నీ గగ్గోలు పెట్టాయి.
ప్రశ్న 6.
“హరోం ! ‘హరా !” యని
“పాహి ! పాహి !” యని
ప్రణమిల్లాయి !
జవాబు:
ప్రతిపదార్ధం :
హరోంహరా = శివా
పాహి = రక్షించు
ప్రణమిల్లు = నమస్కరించు
భావం :
హరహర మహాదేవ రక్షించు, రక్షించు అని నమస్కరించాయి.
ప్రశ్న 7.
ఆర్థమైనది
ఆ మహామహుని
అంతఃకరణ
అంతట అక్షులు విప్పి
‘ఆకలి ! ఆకలి’ అంటూ
భిక్షాపాత్రకు
చేయి చాపినాడు.
జవాబు:
ప్రతిపదార్థం :
ఆర్ధము = సానుభూతి / జాలి
మహామహుడు = మిక్కిలి మహిమ గలవాడు శివుడు
అంతఃకరణ = మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
అక్షులు = కన్నులు
భిక్షాపాత్ర = శివుని భిక్షాపాత్రయైన కపాలం
భావం :
మహిమాన్వితుడైన ఆ శివుని మనస్సులో సానుభూతి కలిగింది. అపుడు కన్నులు తెరచి ఆకలి, ఆకలి అంటూ తన భిక్షాపాత్రయైన బ్రహ్మకపాలం కోసం చేయి చాపాడు.
ప్రశ్న 8.
ఉగ్ర తపస్సున
మ్రగ్గినది
వేడికంటికి
సూడిద వెట్టిన
బ్రహ్మకపాలం
పట పట
పళ్ళుకొరికినాడు
నటరాజు
జవాబు:
ప్రతిపదార్థం :
ఉగ్రతపస్సు = తీవ్రంగా చేసిన తపస్సు
మ్రగ్గిన = వేడికి కరిగిపోవుట
వేడికంటికి = అగ్ని నేత్రంగా గల శివునికి
సూడిద = జ్ఞాపికగా ఉన్న
బ్రహ్మకపాలం = బ్రహ్మదేవుని ఐదవతల కపాలం
నటరాజు = నటనలో అద్వితీయుడైన శివుడు
భావం :
అగ్నిని నేత్రంగా కలిగిన శివుడు తీవ్రంగా చేసిన తపస్సుకు జన్మించిన వేడిలో జ్ఞాపికగా ఉన్న బ్రహ్మకపాలం కరిగిపోయింది. కోపంతో పళ్ళు పటపట కొరికాడు.
ప్రశ్న 9.
భూతపిశాచాల్
బొబ్బరిభినవి
వందిమాగధులు
వణికారు
భయపడి బసవడు
రంకె వేసినాడు.
జవాబు:
ప్రతిపదార్థం :
భూతములు = పంచభూతములు
పిశాచములు = అధోముఖం, ఊర్ధ్వముఖం, తిర్యణ్మఖం
బొబ్బరిల్లిట = సింహనాదం చేశాయి
వంది మాగధులు = స్తుతి చేయవారు
బసవడు = నంది
రంకె = అరచుట
భావం :
శివుని ఆగ్రహం’ చూసిన పంచభూతములు, పిశాచములు సింహనాదం చేసాయి. స్తుతి చేసే వందిమాగధులు వణికిపోయారు. భయపడిన నంది రంకె వేసాడు.
ప్రశ్న 10.
భూలోకమ్మున
తురకల గోరీలందున
క్రైస్తవుల సమాధులందున
హిందూ శ్మశానవాటుల
కపాలమ్ములు
విక విక నవ్వినవి
పునుకలు
పులకరించినవి
కంకాళమ్ములు
ఘల్లున మ్రోగినవి
జవాబు:
ప్రతిపదార్థం :
భూలోకం = భూమిమీద
తురకలు = మహమ్మదీయులు
గోరీలు = సమాధులు
క్రైస్తవులు = క్రీస్తును ఆరాధించువారు
కపాలములు = పుర్రెలు
పునుకలు = పుర్రెలు
పులకరించు = గగుర్పాటు చెందుట
కంకాళము = అస్థిపంజరాలు
భావము :
భూలోకంలోని మహమ్మదీయుల, క్రైస్తవుల సమాధులలోని, హిందూ శ్మశాన వాటికలలోని కపాలములు వికవిక నవ్వాయి. ఆ పుర్రెలు గగుర్పాటు చెందాయి. అస్థిపంజరములు ఘల్లున మోగాయి.
ప్రశ్న 11.
శ్వేతపర్వతపు .
శిఖరాంచలముల
కనక భాండమే
కదిలింది
జవాబు:
ప్రతిపదార్థం :
శ్వేతపర్వతం = హిమాలయ పర్వతం
శిఖరం = కొండ
అంచము = అంచు
కనకభాండము = బంగారు కుండ
భావం :
హిమాలయ పర్వత శిఖరం అంచున అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అగ్నిదేవుని వీర్యాన్ని దాచి ఉంచిన బంగారపు కుండ కదిలింది.
ప్రశ్న 12.
స్వాహా వల్లభు
సువర్ణగర్భం
సళుపరించినది
కళవళించినది
జవాబు:
ప్రతిపదార్థం :
స్వాహావల్లభుడు = స్వాహాదేవి భర్త (అగ్ని)
సువర్ణగర్భం = బంగారం ఉదరంగా గలవాడు
సళుపరం = వేడెక్కుట / జ్వలించుట
కళవళం = స్టలించుట
భావం :
సువర్ణమే ఉదరంగా కలిగిన అగ్నిదేవుడు జ్వలించి స్థలించాడు.
ప్రశ్న 13.
గంగ వక్షమే
పాలపోటుతో
కళవళపడ్డాది
జవాబు:
ప్రతిపదార్థం :
గంగ వక్షము = గంగానది ఎద
కళవళపడుట = తొట్రుపాటు
భావం :
గంగానది ఎద పాలపోటుతో తొట్రుపడింది. పార్వతీదేవి శాపంతో శివుని తేజస్సును ధరించిన అగ్ని, దానిని భరించలేక గంగానది గర్భంలో దాచాడు. ఇపుడు గంగ గర్భంలోని శివతేజస్సు మానవరూపం దాల్చడానికి సమాయత్తమైనది.
ప్రశ్న 14.
సింధుగర్భమున
గంగకడుపులో
లవణసాగరపు లోతుల్లో
దాగిన నేత్రాగ్ని
మానవరూపం దాల్చింది
మన్నే వెలిగించింది
మిన్నే పొగచూరింది
జవాబు:
ప్రతిపదార్థం :
సింధుగర్భం = సింధునది లోతుల్లో
గంగ కడుపున = గంగానది గర్భంలో
లవణ సాగరపు = సముద్రపు లోపల
నేత్రాగ్ని = శివుని మూడోకంటి శక్తి
మానవరూపం = మానవునిగా (సర్దార్ భగత్ సింగ్)
దాల్చుట = జన్మించుట
మన్ను = నేల
మిన్ను = ఆకాశం
చూరు = కమ్ముట
భావం :
సింధు, గంగానదుల గర్భంలో, సముద్రం లోపల దాగిన బడబాగ్ని (శివుని నేత్రాగ్ని) మానవ రూపం (సర్దార్ భగత్ సింగ్) లో జన్మించింది. ఆ తేజస్సుకి భారతభూమి జ్వలించిపోయింది. ఆకాశమంతా ఆ ధూమం వ్యాపించింది.
ప్రశ్న 15.
మంటల్లోనే పుట్టాడు
మంటల్లోనే పెరిగాడు
మంటల్లోకి మడిశాడు
జవాబు:
ప్రతిపదార్థం :
మడియుట = మరణించుట
భావం :
శివుని నేత్రాగ్నియే భగత్ సింగ్ గా జన్మించింది. భగత్ సింగ్ కాలంలో భారతమాత ఆంగ్లేయుల కిరాతక పాలనలో అల్లాడుతోంది. ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చివరకు ఆ భారతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణత్యాగం చేశాడు. (ఈ విధంగా జీవితమంతా పోరాటంలోనే గడిపాడు).
ప్రశ్న 16.
అగ్నివీణయై
భుగ్నకంఠయై
భగ్నగీతియై
తారక మంత్రం
పరంజ్యోతిగా
వీరశైవుడు
జవాబు:
ప్రతిపదార్థం :
అగ్నివీణ = నిప్పులు పుట్టించే వీణ (తన త్యాగంతో దేశ ప్రజలలో దేశభక్తి పుట్టించిన భగత్ సింగ్)
భుగ్నకంఠ = విరిగిన శిరస్సు (ప్రాణాలు త్యాగం చేసినవాడై)
భగ్నగీతము = భంగపరచబడిన గేయం
తారకమంత్రం = తరింపచేసే మంత్రం (సంసార బంధం నుంచి తరింపచేయునది) ఓంకారం
పరంజ్యోతి = మోక్షం
వీరశైవుడు = పరమశివభక్తుడు (భగత్ సింగ్ నాస్తికుడైనప్పటికీ కవి అతని అసమాన దేశభక్తిని వీరశైవుల భక్తితో పోల్చాడు)
భావం :
తన ప్రాణత్యాగంతో దేశ ప్రజలలో దేశభక్తి అనే అగ్నిని పలికించిన వీణయై, స్వాతంత్ర్య సాధనకు తన శిరసును అర్పించినవాడై, ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపే భగ్నపరచిన గేయమై పరమ పవిత్రమైన ఓంకారంగా మారి ఆ వీరశైవుడు మోక్షాన్ని పొందాడు.
ప్రశ్న 17.
భారత వీరుని
కపాల మొక్కటి
కపర్ది చేతిని
రివ్వున వాలింది
కెవ్వున కేకేశాడు
కంతేకాలుడు
ఫాల నేత్రమే
స్పందించింది
అండ పిండ బ్రహ్మాండమంతా
తాండవ నృత్యం చేసింది
ఆనందాశ్రుల నుంచింది.
జవాబు:
ప్రతిపదార్థం
భారతవీరుడు = భరతదేశ వీరుడైన భగత్సింగ్
కపాలం = పుర్రె
కపర్థి = శివుడు
కంఠేకాలుడు = శివుడు (కంఠంలో విషం గలవాడు)
ఫాలనేత్రం = నుదుటున ఉన్న కన్ను
స్పందించు = కంపించు
అండము = గుడ్డు / కణం
పిండం = మాతృ గర్భంలో శరీరం రూపొందుకునే దశ
బ్రహ్మాండం = విశ్వం
తాండవనృత్యం = ఆవేశంగా చేసే నృత్యం
ఆనందాశ్రులు = ఆనందంతో కూడిన కన్నీరు
ఉంచింది = కనులలో నింపింది
భావం :
భరతదేశ వీరుడైన భగత్ సింగ్ కపాలం శివుని చేతిలో రివ్వున వాలింది. ఆనందంతో కెవ్వున కేకేసాడు. శివుని నుదుటున ఉన్న మూడవ కన్ను కంపించింది. అండ, పిండ, బ్రహ్మాండమంతా ఆనందంతో తాండవ నృత్యం చేసింది. కనులలో ఆనందాశ్రువులను నింపింది.
ప్రశ్న 18.
శేషుని ఫణాల మెత్తని శయ్య
పుడమి ఒత్తిగిలింది
ఎడారి పుష్పించింది
ఎందరు పుట్టలేదు
ఇంకెందరు గిట్టలేదు
అందరికీ లఖియిస్తుందా
హాలాహల మంటిన
హస్త స్పర్శ
పెదవుల చుంబనం
కపాలమోక్షం
కపాలమోక్షం
జవాబు:
ప్రతిపదార్థం :
శేషు = భూభారం వహించే ఆదిశేషు
ఫణము = పడగ
మెత్తని శయ్య = మెత్తనైన పడకపై
పుడమి = భూమాత
ఒత్తిగిలింది = వాలింది.
ఎడారి = ఇసుకతో నిండిన ప్రాంతం
పుష్పించుట = పూలు వికసించుట
పుట్టుట = జన్మించుట
గిట్టుట = మరణించుట
హాలాహలము = లోకాలను దహించే విషము
అంటిన = ముట్టిన
హస్తస్పర్శ = చేతిస్పర్శ
చుంబనం = పెదవుల స్పర్శ (ముద్దు)
కపాల మోక్షం = కైవల్య ప్రాప్తి
భావం :
భూభారం వహించే ఆదిశేషువు పడగల మెత్తని శయ్యపై భూమాత వాలింది. ఎడారిలో పూలు పుష్పించాయి. ఎందరో జన్మించారు. ఇంకెందరో మరణించారు. లోకాలను దహించివేయగల హాలాహలాన్ని అంటిన ఆ పవిత్ర హస్త స్పర్శ, హాలాహలాన్ని మింగిన ఆ పెదవుల స్పర్శ కపాలమోక్షం అందరికీ లభిస్తుందా ? లభించదు.
కవి పరిచయం
సంప్రదాయ శిఖరాల మీద ఆధునిక కవితా పతాకను ఎగురవేసిన తెలుగు కవి శ్రీరంగం నారాయణబాబు. వీరు ‘17.05. 1906న జన్మించారు. రమణమ్మ, సుందర నారాయణలు తల్లిదండ్రులు. నారాయణబాబుకి మహాకవి శ్రీశ్రీ తమ్ముని వరుస అవుతాడు.
1928 నుండి నారాయణబాబు రచనలు ప్రచురితం అయ్యాయి. 1930 దాకా భావకవిత్వపు ప్రవాహంలో మునిగినా, తరువాత కాలంలో గొప్ప అభ్యుదయ కవిగా స్థిరపడ్డాడు. మాటల్లో మంటలు రగిలించాడు. ‘రుధిర జ్యోతిర్ జ్వలనా లలనా ప్రియుండ, విప్లవ ఋషిని, విద్రోహ కవిని’ అని తనను తాను ప్రకటించుకున్నాడు.
రచనలు : జ్వలిత, రుధిరజ్యోతి, మౌనశంఖం, కపాలమోక్షం, గడ్డిపరక వంటి ఖండికలు; ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు రచించారు.
నారాయణబాబు కవితలన్నీ ‘రుధిరజ్యోతి’ పేరుతో 1972లో ప్రముఖ కవి ఆరుద్ర గారి నేతృత్వంలో సంకలనంగా వెలువడ్డాయి. నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణ బాబు కవితా వస్తువులు. స్వీకరించిన వస్తువును భిన్నంగా చూడడం, విభిన్న పదాలు, పదచిత్రాలు ప్రయోగించడం వీరి ప్రత్యేకత.
క్లుప్తత, గాఢతాత్త్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి నారాయణబాబు కవిత్వంలో చూడవచ్చు. నారాయణ బాబు మంచి గాయకుడు, నటుడు కూడా. 1943లో విడుదలైన ‘భక్త కబీరు’ చిత్రంలో సంభోగమల్లు పాత్రలో నటించారు. సంగీతశాస్త్రంలోనే కాక, మనస్తత్వశాస్త్రంలో విశేష పరిచయమున్న నారాయణబాబు 02.10.1961న మరణించారు.
పాఠ్యభాగ నేపథ్యం
భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సర్దార్ భగత్ సింగ్ (22.9. 1907- 23.3.1930) అసమాన త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. జీవించింది కొద్దికాలమే అయినా, చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోర్ కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్ సింగ్ ను 23.03. 1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది.
ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను తీవ్రంగా కలచివేసింది. వీరిలో ఎంతోమంది భగత్ సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంధాను అనుసరించారు. అలాంటి వారిలో శ్రీరంగం నారాయణబాబు ఒకరు. ఆనాడు దేశంలో. భారతీయ భాషల్లో భగత్ సింగ్ పై అనేక గేయాలు, కవితలు వెలువడ్డాయి. ప్రస్తుత పాఠ్యభాగం కపాలమోక్షం ఆ వరుసలో వెలువడిన ఒకానొక ఖండిక. అయితే ఇది ఇతర స్మృతి కవితల కంటే విలక్షణమైనది.
దేశభక్తి, చైతన్యం, త్యాగం, ధైర్య సాహసాలు వంటి అభ్యుదయకర అంశాలతో కపాలమోక్షం తీర్చిదిద్దబడింది. భగత్ సింగ్ ఒక సామాన్య వ్యక్తిగానే కాక, పురాణ పురుషుడిగా, ఒక కారణజన్ముడిగా ఈ ఖండికలో ఆవిష్కరించబడ్డాడు. పౌరాణిక ప్రవక్తలు అనగా పురాణ పాత్రలను పోలికగా తీసుకోవడం, ఆధునిక కవితా శిల్పరీతులు, అభివ్యక్తి నవ్యతలు ఈ కవితలో సంగమించి ఉంటాయి.
తాత్విక ఆలోచనలు, పారమార్థిక భూమిక ప్రగాఢంగా కలిగిన పదజాలం. ఆధునిక వస్తువును బలంగా ఆవిష్కరించడానికి ఎంతగా వినియోగింపబడుతుందో నిరూపించిన ఖండిక ‘కపాలమోక్షం’. పౌరాణిక అంశాల పట్ల నారాయణబాబు లోతైన అవగాహనకు ఈ ఖండిక ఒక నిలువుటద్దం. 1938లో తొలిసారిగా ప్రచురించబడిన ఈ ఖండిక ‘రుధిరజ్యోతి’ సంకలనం నుండి గ్రహింపబడింది.
పాఠ్యభాగ సారాంశం
శివుడు నిత్యకల్ప సమాధిలో మునిగి ఉన్నాడు. ప్రకృతిలో ప్రకంపనలు మొదలు అయ్యాయి. ఓంకారమే హుంకరించింది. చరాచరాలు చలించాయి. భూతాలు ఉద్రేకించగా, అనంతకోటి జీవరాశులు హాహాకారం చేశాయి. శివుడు తపస్సమాధి నుండి బైటకొచ్చాడు. ఆకలి విపరీతంగా ఉంది. భిక్ష పాత్ర కోసం చేయి సాచాడు. అప్పటికే శివుని ఉగ్ర తపస్సుకి బ్రహ్మకపాలం కాలిపోయి ఉంది. శివునికి కొత్త భిక్షాపాత్ర కావలసి వచ్చింది. అది బ్రహ్మకపాలమంతటిదై ఉండాలి. ఎవరి కపాలానికీ అంతటి శక్తి ఉంటుంది.
భూలోకంలోని సకల శ్మశానాలలోని కపాలాలన్నీ వికవిక నవ్వాయి. శివుని ఆకలి పెరిగిపోతూ ఉంది. మరికొంత ఆలస్యమైతే ప్రకృతి విలయం సంభవించే ప్రమాదం ఉంది. శివుని చేతిలో భిక్షాపాత్రగా ఉండటానికి అర్హత కలిగిన కపాలమొకటి తక్షణం’ కావలసి ఉండగా, అందుకోసం ఒక శక్తి సంపన్నుడైన వ్యక్తి అవతరించబోతున్నాడు. ఆ కారణజన్ముడే సర్దార్ భగత్ సింగ్. ……. అదే కపాలమోక్షం.
పాఠ్యభాగ ఉద్దేశం
ఈ ఖండికలో నారాయణబాబు అనేక పౌరాణిక ఘట్టాలను ప్రస్తావించారు. అవన్నీ అగ్నికీ, శివునికీ, శివుడి నేత్రాగ్నికీ సంబంధించినవి. భగత్ సింగ్ నిప్పులాంటి మనిషి, నిప్పైన మనిషి. కాబట్టే కవి కొన్ని నిప్పుల ప్రతీకల ద్వారా భగత్ సింగ్ ను ఒక కొత్త నిప్పులాంటి పౌరాణిక వీరుడిగా ఆవిష్కరించారు. భగత్ సింగ్ నేపథ్యంలో విద్యార్థి లోకంలో జాతీయతా స్ఫూర్తిని, దేశభక్తిని మరొకసారి నింపాలన్నదే ఈ పాఠ్యభాగం ఉద్దేశం.