Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material గద్య భాగం 6th Lesson మాటతీరు Textbook Questions and Answers, Summary.
AP Inter 1st Year Telugu Study Material 6th Lesson మాటతీరు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
యార్లగడ్డ తెలియజేసిన నాలుగు ముఖ్యమైన పదాలను వివరించండి.
జవాబు:
యార్లగడ్డ వారి ‘మాటతీరు’ గ్రంథంలో 200 పదాలకు శాస్త్రీయ విశ్లేషణ ఉంది. అందులో నుంచి స్వీకరించిన ఈ పాఠ్యభాగంలో నాలుగు ముఖ్యమైన పదాలు :
ఏరువాక పున్నమి :
జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పున్నమి అంటారు. ఏరు వాక పదాల కలయిక ఏరువాక. ఏరు అంటే నది. వాక అంటే వారు. వర్షాలు పడడం వలన జ్యేష్ఠ పౌర్ణమి నాటికి ఏరులు, వాగులు ప్రవహిస్తాయి. ఇదే తొలకరి. తొలికారు. అంటే వ్యవసాయ సంబంధంగా మొదటి ఋతువు. ఈ పౌర్ణమికి రైతులు కవుళ్ళు నిర్థారించుకోవటం, పాలేర్లను నియమించుకోవటం జరుగుతుంది.
కొన్ని ప్రాంతాల వారికి తొలకరి శ్రావణ పౌర్ణమి. శాసనాల్లో దీనిని పేరామణి పున్నమి అంటారు. ‘పేర్’ అంటే విత్తులు విత్తటం. ఆమణి అన్నది శ్రావణం నుంచి వచ్చింది. ఇరాంబరము అంటే వడగల్లు. తొలకరి వర్షాలప్పుడే వడగళ్ళు పడతాయి.
కొంగు బంగారం :
అనాయాసంగా కావలసింది లభిస్తే ఈ పదబంధాన్ని వాడతారు. వివాహిత స్త్రీల విషయంలో మాత్రమే వాడే పదబంధమిది.
ప్రథమ సమాగమం సమయంలో వరుడు వధువు కొంగుకు ఒక కాసు బంగారు నాణాన్ని కడతాడు. అది వరుడు వధువుకు చెల్లించే కట్నం. దానిని వాడుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉంటుంది. దానిని తిరిగి ఆమె తన కోడలుకు కట్టటానికి కుమారునికి ఇస్తుంది. అలా అది పరంపరగా వెళుతుంది. కుమారులు ఒకరికన్న ఎక్కువుంటే, వేరే కొని ఇస్తారు. ఆచారం ఇంత కఠినంగా ఉన్నా, ఒక్కొక్కప్పుడు విధిలేని స్థితిలో ఆమెకు ఆర్థికావసరం కలుగవచ్చును. అప్పుడు ఇబ్బంది పడకుండా ఉపయోగించుకోవటానికి వీలవుతుంది. అందుబాటులో ఉన్న ధనంగా కొంగు బంగారమనే మాట వాడుకలోకి వచ్చింది.
ఇప్పుడు పురుషుల విషయంలో కూడ కొంగు బంగారమనే మాట రెడీ మనీ అనే భావనలో వాడుకలోకి వచ్చింది.
పులిహోర :
పుల్లని ఆహారాన్ని పులిహోర అన్నారు. రాయలసీమలో దీన్నే చిత్రాన్నమంటారు. కన్నడంలో పులి దర. ఆహారానికి వికృతి ఓగిరం. ‘గ’ కారం దకారమై పులి ఓదర అయింది. ఇది నిజానికి ప్రత్యేకమైన వంట కాదు. రుచిని బట్టి ప్రత్యేకతను సంతరించు కుంది. మిగిలిపోయిన అన్నాన్ని చెడిపోకుండా నిలువ చేసుకోవటానికి చింతపండు పులుసు కలిపాము. దాని వలన కలిగే దోషాన్ని నివారించటానికి పసుపు వినియోగించాము. రుచికొరకు తాలింపు. పులిహోర సిద్ధమైంది.
అన్నం వృధా చేయకూడదని పెద్దల భావన. నిలువ చేయడం వలన రోగకారకం కారాదు. అందుకని పసుపు, నూనెలు వినియోగించారు. పుల్లని ఆహారం పులిహార వ్యవహారంలో పులిహోర అయింది.
పేదా సాదా :
పేదసాదల పట్ల మన్నన కలిగి ఉండాలి అని పెద్దలు చెపుతారు. సాధారణంగా ఆర్థికశక్తి లోపించిన వారిని పేదలంటారు. ఈ పదబంధం ఈ అర్థంలోనే వాడుతున్నాము ‘పేద’ అనే పదానికి ఇంకా చాలా అర్థాలున్నాయి. వాటికి ఈ పదబంధంతో సంబంధం లేదు. తమిళంలో పదేళ్ళలోపు ఆడపిల్లలను కూడ పేద శబ్దంతో చెపుతారు.
ఇక్కడ మాత్రం : పేదశబ్దం’ ఆర్థిక సంబంధమే ! దీనితో జోడించిన శబ్దం ‘సాద’. ఇది సంస్కృత శబ్దం ‘సాధు’ నుంచి వచ్చింది. వీరి జీవితం సంఘం వితరణపై ఆధారపడి ఉంది. కాబట్టి సాధు శబ్దానికి శాంతము అని కూడ అర్థం ఉంది. సాధు జంతువు అన్నప్పుడు క్రూర స్వభావం కానిది అని చెపుతాము. వాడు పరమ సాధువు అంటే కోపం రాని, లేని వ్యక్తి అన్నమాట.
తిక్కనగారి విరాదిపర్వంలో సాధు శబ్దానికి శాంతమనే అర్థం చెప్పడం జరిగింది. ” నిజానికక్కడ ఉన్నది. ‘సాతు’ అనే పదం. సాతు అనేది ఒక రకం కలుపుమొక్క, కనుక పదాల అర్థాల విషయంలో చాలా మెలకువ వహించాలి.
ప్రశ్న 2.
‘మాటతీరు’ ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
మానవ స్నేహ సంబంధాలు చిరకాలం కొనసాగటానికి మాట్లాడే విధానం ఎంతో ముఖ్యం. మన మాట తీరును బట్టే ఇతరులు.మనతో స్నేహం చేస్తారు. బద్దశత్రువునైనా మన మాటతీరుతో ఆప్తులుగా చేసుకోవచ్చు. మాటతీరుకు ఉండే శక్తి అది.
తెలుగు భాషలో ఎన్నో నుడికారాలు, జాతీయాలు, సామెతలు ఉన్నాయి. ఇవి మన భాషా సంపద. వీటి అర్థం తెలుసుకొని సందర్బోచితంగా, మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తే మన భాషలోని సౌందర్యం, సంస్కృతి, విశిష్టత, చక్కగా వ్యక్తమవుతుంది. భాషా వికాసము జరుగుతుంది. ఈ పదసంపదను ఉపయోగించకపోతే మరుగున పడిపోతాయి. విద్యార్థిలోకానికి మంచి మాటతీరును నేర్పించటం అత్యావశక్యము.
సుదీర్ఘకాలంగా మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటం వెనుక గల అనేక అంశాలలో మాటతీరు బలమైన అంశం.
సమాచారాల చేరవేతలో, మానవ సంబంధాలను మెరుగు పరుచుకోవటంలో మనం అనేక పదాలను అలవోకగా ప్రయోగిస్తూ ఉంటాం. వాటిలో కొన్ని పదాలు పెద్ద పెద్ద పండితులకు కూడ అంతుపట్టకుండా ఉంటాయి. అయినా, మన వ్యవహారంలో సంలీనమై ఉంటాయి. అందువల్ల వాటిని మనం విడిగా గుర్తించం. ఈ పదాలు మన సామాజిక, సాంస్కృతిక చారిత్రక – ఆర్థిక అంశాలతో అవి ముడిపడి ఉంటాయి. వాటి విశేషాలు మనకు తెలిసినపుడు తెలుగు భాష ఎంత గొప్పదో, ఎంత మాధుర్యవంతమైనదో విశదమౌతుంది.
అయితే, ఏ పదాన్నైనా దాని అర్థాన్ని పూర్తిగా తెలుసుకుని ఉపయోగించినప్పుడే దాని సౌందర్యం ఇనుమడిస్తుంది. లేకపోతే, అర్థం మారిపోయి ఆక్షేపణకు గురి. అవుతాము.
ఎవరికైనా కావలసినది అనాయాసంగా లభిస్తే వాడికేమి వాడికది కొంగు బంగారం అంటూ ఉంటారు కాని, విషయం తెలిస్తే పురుషుల పరంగా ఈ పదబంధాన్ని వాడరు. ఇది వివాహిత స్త్రీల విషయంలో వాడే పదబంధం. ప్రథమ సమాగమ వేళ వరుడు వధువు కొంగుకు కట్టే బంగారు కాసు ఇది. ఇది వరుడు, వధువుకు చెల్లించే కట్నం. దీని వెనుక గల నేపథ్యం తెలుసుకుని ఉపయోగిస్తే అర్థవంతంగా ఉంటుంది.
అలాగే ‘పేద సాదల పట్ల మన్నన కలిగి ఉండాలి’ అంటూ ఉంటాము. ఆర్థిక శక్తి లోపించిన వారు పేదలు. దీనికి జోడించిన శబ్దం ‘సాద’ ఇది సంస్కృత శబ్దం ‘సాధు’ నుండి వచ్చినది. వీరి జీవనం సంఘపు వితరణపై ఆధారపడి ఉంది. కనుక పేద సాదల పట్ల ఆదరణ చూపాలి అనే మాట వాడుకలోకి వచ్చింది.
అయితే తిక్కన విరాటపర్వంలో సాదురేగెనేనివ్వను……… అన్న మాటలో సాదు’ శబ్దానికి శాంత స్వభావమని అర్థం చెప్పటం జరిగింది. నిజానికి అక్కడ ఉన్నది ‘సాదు’ కాదు సాతు మాత్రమే. ‘సాతు’ అనేది ఒక రకం కలుపుమొక్క. అది చేలో పడితే దాన్ని నివారింప శక్యం కాదు.
కాబట్టి పదాల అర్థం తెలుసుకుని ఉపయోగిస్తే మాటతీరుకు మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యముంటుంది. మాటతీరు మానవ మనుగడకు భాష మనుగడకు కూడ ఎంతో దోహదం చేస్తుంది.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మాటతీరు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
మాటతీరు అంటే మనం మాట్లాడే విధానం. ఎప్పుడూ సున్నితంగా, మృదువుగా, చిరునవ్వుతో మాట్లాడే వారిని ఎక్కువమంది ఇష్టపడతారు. వారికి ఎక్కువ స్నేహితు లుంటారు. ఎప్పుడూ చిరాకు పడుతూ, పరుషంగా మాట్లాడే వారితో ఎవరూ కలవరు వారితో దూరంగా ఉంటారు. మానవ సంబంధాలన్నీ మనం మాట్లాడే విధానం పైనే ఆధారపడి ఉంటాయి.
సుదీర్ఘకాలంగా మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటం వెనుక గల అనేక అంశాలలో మాటతీరు చాలా బలమైన అంశం. ప్రతి భాషకూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. నుడికారాలు. జాతీయాలు, సామెతలు వంటివి ఆయా భాషల అస్తిత్వాన్ని ప్రతిష్ఠిస్తాయి. ఇవి భాషా సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయి. ఈ విషయంలో మన మాతృభాష తెలుగు ఇతర భారతీయ భాషల కంటే ఇంకా కొంత విశిష్టంగా ఉంటుంది.
సమాచారాలను చేరవేయ నికి మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి భాషలో మనం అనేక పదాలను అలవోకగా ప్రయోగిస్తూ వుంటాం. అవి మన వ్యవహారంలో కలిసిపోయి వుంటాయి. ఈ పదాలు మన సామాజిక – సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక అంశాలతో ముడిపడి వుంటాయి. వీటిని ప్రయోగిస్తూ మాట్లాడు తున్నపుడు మన మాటతీరు ఎటువంటిదో తెలుస్తుంది.
ప్రశ్న 2.
అతలా కుతలాన్ని విశ్లేషించండి.
జవాబు:
అనేక సమస్యలతో సతమతమవుతున్న వాడిని యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా ఉందని అంటాడు. అతలాకుతలం అనే పదబంధం క్రిందు మీదవు తున్నాడనే అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములంటే రెండు ఏడులు పద్నాలుగు లోకములని అర్థం. అవి భూమితో కలిపి పైన ఏడు. భూమి కింద ఏడు. వీటినే ఊర్ధ్వలోకములు, అధో లోకములు అంటారు.
- భూలోక,
- భువర్లోక
- స్వర్లోక,
- మహర్లోక,
- జనర్లోక,
- తపర్లోక,
- సత్యలోకములనేవి ఊర్థ్వలోకములు.
1) అతల
2) వితల
3) సుతల
4) రసాతల
5) తలాతల
6) మహాతల
7) పాతాళ లోకములనేవి అధోలోకములు.
ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువుల్లో ఇది చోటు చేసుకోలేదు. కుతలానికి కింద అంటే భూమికి క్రింద వున్నది అతలము అతలాకుతలమయ్యిందంటే, అతలము పైకి వచ్చిందన్న మాట. అంటే క్రిందు మీదయినదని అర్థం.
ప్రశ్న 3.
పంచామృతాల గురించి తెలియజేయండి.
జవాబు:
పంచామృతాలు అంటే అయిదు అమృతాలు. దేవతలకి, రాక్షసులకి యుద్ధం. మరణం లేకుండా ఉండటానికి అమృతం కావలసి వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు. అమృతం పుట్టింది. అదలా వుంచితే, రుచిపరంగా, ఏదైనా చాలా రుచిగా ఉంది అని చెప్పటానికి అమృతం లాగా వుంది అని చెపుతాము.
ఏదైనా మధురమైన దానికి సంకేతంగా అమృతమనే మాటను ఉపయోగించటం మన అలవాటు. అలాంటి అయిదు మధుర పదార్థాలను కలిపి పంచామృతాలు అంటారు. అవి పాలు, పెరుగు, పంచదార, నేయి, తేనెలు. దేవతారాధనలో, అభిషేకంలో ఇవి ముఖ్యం. పంచామృతాలు ఆరోగ్యాన్నిస్తాయి. కేవలం నేయి, తేనెల మిశ్రమం విషంతో సమానం.
ప్రశ్న 4.
యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణా జిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.
ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటి పేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి. వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది.
తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.
ఏకవాక / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం ఎవరు చేశారు ?
జవాబు:
యార్లగడ్డ బాలగంగాధరరావు గారు.
ప్రశ్న 2.
మానవ సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి ?
జవాబు:
మాటతీరుపై
ప్రశ్న 3.
‘మాటతీరు’ గ్రంథ రచయిత ఎవరు ?
జవాబు:
యార్లగడ్డ బాలగంగాధరరావు గారు.
ప్రశ్న 4.
మొత్తం లోకాలు ఎన్ని ?
జవాబు:
మొత్తం లోకాలు పద్నాలుగు
ప్రశ్న 5.
చేమకూర వేంకట కవి రచించిన కావ్యం ఏది ?
జవాబు:
విజయవిలాసం
ప్రశ్న 6.
అన్నం ఎవరి వల్ల లభిస్తుంది ?
జవాబు:
అన్నం సూర్యుని వలన లభిస్తుంది.
రచయిత పరిచయం
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ‘ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940లో జన్మించారు. వీరి తల్లి దండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన యార్లగడ్డవారు నామ ‘విజ్ఞానం’ పై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు. ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటి పేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందినవే !
ఇవేకాక క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి, వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది.
తాను ధ్రువీకరించదలచుకున్న అంశాన్ని ముక్కుసూటిగా ప్రకటించగల సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు. తెలుగు భాషా సాహిత్యా లకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23-11-2016న కన్నుమూశారు.
ప్రస్తుత పాఠ్యభాగం వీరి ‘మాటతీరు’ గ్రంథం నుంచి ఏర్చి కూర్చినది.
పాఠ్యభాగ నేపథ్యం
మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటంలో గల అనేక అంశాలలో మాటతీరు చాలా ప్రధానమైనది. మాటతీరు అంటే మాట్లాడే విధానం అని అర్థం. మానవ సంబంధాలన్నీ మన మాటతీరు పైనే ఆధారపడి ఉంటాయి.
ప్రతి భాషకూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. నుడికారాలు, జాతీయాలు, సామెతలు వంటివి ఆయా భాషల అస్తిత్వాన్ని ప్రతిష్ఠిస్తాయి. ఈ విషయంలో మన మాతృభాష తెలుగు ఇతర భారతీయ భాషల కంటే మరికొంత విశిష్టంగా ఉంటుంది.
సమాచారాలను చేరవేసుకోవటంలోను, మానవ సంబంధాలను మెరుగు పరుచు కోవడంలోను మనం అనేక పదాలను అలవోకగా ప్రయోగిస్తూ ఉంటాం. వాటిలో కొన్ని పదాలు పెద్ద పెద్ద పండితులకు కూడా అంతుపట్టకుండా ఉంటాయి. అయినా, అవి మన వ్యవహారంలో సంలీనమై ఉంటాయి. అందువల్ల వాటిని మనం విడిగా గుర్తించం. అలాంటి వాటిలో మరికొన్ని పదాలు కొన్ని కొన్ని ప్రత్యేక నేపథ్యాలు కలిగి ఉంటాయి.
మన సామాజిక, సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక అంశాలతో అవి ముడిపడి ఉంటాయి. వాటి విశేషాలు మనకు తెలిసినపుడు మన తెలుగు భాష ఎంత లోతైనదో, మరెంత మహత్తరమైనదో, ఇంకెంత మాధుర్యవంతమైనదో తెలుస్తుంది. మన భాషలోని తీయదనాన్ని, మనందరికీ పంచటానికి, మన అనుభవంలోనికి తీసుకురావటానికి, మనలను ఆలోచింపజేయటానికి, మాటతీరులోని వైవిధ్యాన్ని విశ్లేషిస్తూ యార్లగడ్డ ‘మాటతీరు’ అనే గ్రంథాన్ని ప్రకటించారు. ఇందులో 200కు పైగా విశిష్ట పదాలు శాస్త్రీయంగా విశ్లేషించబడ్డాయి.
వాటిలోంచి మచ్చుకు కొన్ని పదాలలో ఈ పాఠ్యాంశం రూపొందించబడింది. తెలుగు భాషలోని మాధుర్యాన్ని విద్యార్థిలోకం గ్రహించటానికి ఈ పాఠ్యాంశం బాగా ఉపకరిస్తుంది. మన తెలుగు భాష విశిష్టతను విదార్థులకు రుచి చూపించటమే ఈ పాఠ్యభాగం ఉద్దేశం.
పాఠ్యభాగ సారాంశం
అతలాకుతలం : అనేక సమస్యలతో సతమతమవుతున్నవాడిని. యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా వుందనటం తెలిసిందే. అంటే క్రిందు మీదవుతున్నాడని చెప్పడం. అతలాకుతలం ఆ అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములనే మాట వినే ఉంటారు. అంటే రెండు ఏడులు పదునాలుగు లోకములన్నమాట. అవి భూమితో కలిపి పైన ఏడు భూమి క్రింద ఏడు. వీటినే ఊర్ధ్వలోకములు, అధోలోకములు అంటారు.
ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువులలో ఇది చోటు చేసుకోలేదు. కుతలమనే పదాన్ని కవులు ఉపయోగించారు. కుతలానికి క్రింద అంటే భూమికి క్రింద ఉన్నది అతలము.. అతలాకుతలమయ్యిందంటే అతలము పైకి వచ్చిందన్నమాట. అంటే క్రిందు మీదయినదన్నమాట.
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి :
ఆదాయానికి వ్యయానికి పొంతన లేని స్థితిలో, తన నిరాశా నిస్పృహలను అశక్తతను రైలు పై విధంగా వ్యక్తీకరిస్తాడు. ఇందులో అడవి, కొరివి పదాలు ఎలా చోటు చేసుకున్నాయి ? అంటే వస్తువులను వాటి అవసరమున్న జనాలకు అమ్మాలి. జనం ఉన్నారు. కాని కొనేవారు లేరు అడవిలో మనుషులుండరు. నిజంగా అడవి కాకపోయినా వస్తువును కొనేవారు లేక అతగాడికి అది అడవిని తలపిస్తోంది. తనకు కావలసిన వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కొరివి లక్షణం మండటం.
అలా తనకు కావలసిన వస్తువుల ధరలు అధికంగా ఉండి, తాను అమ్మజూపిన వాటికి ధరలేక కొనేవారు కరువైనపుడు ఈ పదబంధాన్ని వాడడం జరుగుతుంది.
ఏరువాక పున్నమి :
జ్యేష్ఠ పూర్ణిమ అంటే ఏరువాక పున్నమి అనటం తెలిసిందే. ఏరు అంటే నది. వాక అంటే వారు. అంటే పౌర్ణమి నాటికి ఏరులు, వాగులు, వర్షాలు పడటం వలన ప్రవహిస్తాయన్నమాట. అదే తొలకరి వ్యవసాయ పనులు ఆరంభించమని చెప్పడం అన్నమాట. కొన్ని ప్రాంతాల వారికి శ్రావణ పౌర్ణమి తొలకరి. దానిని శాసనాల్లో పేరామణి పున్నమి అన్నారు.
కొంగు బంగారం :
ఎవరికైనా కావలసినది అనాయాసంగా, సిద్ధమై లభిస్తూ వుంటే – వాడికేమి వాడికది కొంగుబంగారం అంటూ ఉంటారు. కాని విషయం తెలిస్తే పురుషుల విషయంలో వాడరు. వివాహిత స్త్రీల విషయంలో వాడే పదబంధమిది.
ప్రథమ సమాగమవేళ వరుడు వధువు కొంగుకు ఒక బంగారు నాణాన్ని కడతాడు. దానికి వాడుకునే హక్కు ఆమెకే ఉంటుంది. దానిని తిరిగి ఆమె తన కోడలుకి కట్టటానికి కుమారునికి ఇస్తుంది. అది పరంపరగా సాగుతుంది. ఆచారం ఇలా ఉన్నా విధి లేని స్థితిలో ఆమెకు ఇది ఆర్థికావసరానికి అడ్డుపడుతుంది.
చెట్టు, చేమ :
వృక్షమని సంస్కృతంలో దేనినంటామో అది మనకు చెట్టు. చేమ అంటే పచ్చదనం. చెట్టు చేమ లేని చోటంటే చెట్లు లేకపోవడమే కాక కనీసం అక్కడ గడ్డి కూడా లేదన్న మాట. గడ్డివుంటే భూమి పచ్చగా ఉంటుంది కదా !
పంచామృతాలు :
ఏదైనా మధురమైన దానికి అంటే తీపికి సంకేతంగా అమృతమనే మాటను ఉపయోగించటం మన అలవాటు. అలాంటి అయిదు మధుర పదార్థాలను పంచామృతాలు అంటారు. అవి పాలు, పెరుగు, పంచదార (శక్కర), నేయి, తేనెలు, దేవతారాధనలో అభిషేకంలో ఇవి ముఖ్యం. ఈ అయిదింటి సమ్మిశ్రమం ఆరోగ్యాన్నిస్తుంది.
పులిహోర :
పుల్లని ఆహారం కనుక పులిహోర. ఆహారానికి వికృతి ఓగిరం. ‘గ’ కారం దకారమై పులి ఓదర అయింది. ఇది నిజానికి ప్రత్యేకమైన వంటకాదు. రుచిని బట్టి ప్రత్యేకతను సంతరించుకుంది. మిగిలిన అన్నాన్ని చెడిపోకుండ నిలువ చేసుకోవటానికి చింతపండు పులుసు కలిపాము. దాని ఆధిక్యం వలన కలిగే దోషాన్ని నివారించటానికి పసుపు వినియోగించాము. రుచి కొరకు తాలింపు. ఇంకేం ! పులిహోర సిద్ధమైంది. అన్నం వృధా చేయరాదు. నిలువ చేయడం వలన రోగకారకం కారాదు. అందుకని పసుపు నూనెల వినియోగం.
పేదా సాదా :
సాధారణంగా ఆర్థికశక్తి లోపించినవారిని పేదలనటం కద్దు. దీనితో జోడించిన శబ్దం ‘సాద’. సంస్కృత శబ్దం ‘సాధు’ నుండి వచ్చింది. వీరి జీవితం సంఘపు వితరణ పై ఆధారపడి ఉంది కనుక పేదసాదల పట్ల ఆదరణ చూపాలి అనే మాట వాడుకలోకి వచ్చింది అయితే సాధు శబ్దము శాంతత్వానికి మారుగా కూడా ఉపయోగిస్తాము.
యోగక్షేమాలు :
యోగ క్షేమాలనటంలో మనం ఉద్దేశిస్తోంది. ఎదుటివారి కుశలాదికాన్ని లేక వారి సుఖసంతోషాలను, లేక రెంటినీ.
కాని యోగక్షేమాలనే రెండు మాటలకు గల అర్థాలు వేరు. యోగం అంటే కూడిక, క్షేమం శుభమనే అర్థాన్నిస్తుంది. ఇది మొత్తమ్మీద సుఖసంతోషాలు, కుశలాదికము అనే అర్థాల్లో రూఢమైంది. శుక్లయజుర్వేదం దేనినైనా క్రొత్త దాన్ని పొందటం యోగం, దానిని కాపాడుకోవటం క్షేమం అని ప్రతిపాదించింది. నిజానికివే సరియైన అర్థాలు. కాని మనకు ఆ రెండు పదాలు కలసి, ఒక పదబంధమై వాడుకలో సుఖసంతోషాలకు మారుగా నిలిచింది.
రామాయణంలో పిడకల వేట :
అసంగతమైన విషయాన్ని చెప్పటం అన్నమాట. పిడకలు తెలుసు కదా ! పేడతో వంట కొరకు తయారు చేస్తారు. వాటికి రామాయణంతో సంబంధం ఏమిటి ? ఏమీ సంబంధం లేదు కనుకనే ఈ విధమైన ఆక్షేపణ వచ్చింది. దీని వెనుక ఏదో చరిత్ర ఉండాలి. అదేమిటంటే – బౌద్ధ, జైనాలు బాగా ప్రాచుర్యంలో వున్న కాలంలో ఆ మతస్థులు రామాయణ, మహాభారతాల్లో తమకు అనుగుణమైన గాథల్ని ప్రవేశపెట్టారు.
అసలు వృత్తాంతాన్ని తమకు అనుకూలించే రీతిలో మలచుకున్నారు. అందులో భాగంగా బౌద్ధ త్రిపిటకాలను రామాయణ కథలో ప్రవేశపెట్టటం జరిగింది. ఆ పిటకాలు వ్యవహారంలో పిడకలయ్యా యి. మరి, వేట సంగతేమిటంటే, అది వేట కాదు, వేటు. వేటు అంటే దెబ్బ. అంతేకాక దారి (సంభాషణను, వృత్తాంతాన్ని) మళ్ళించటం. అది వేటగా మారి, రామాయణంలో పిడకలవేటగా జన వ్యవహారంలో రూఢమైంది.
కఠిన పదాలకు అర్థాలు
ఆతలా కుతలం = క్రిందు మీదవటం
ఈరేడు లోకాలు = రెండు ఏడులు – పద్నాలుగు లోకాలు
కుతలము = భూలోకము
ఊర్థ్వలోకములు = భూమితో కలిపి పైన ఉండే ఏడు లోకాలు
అధోలోకములు = భూమి క్రింద ఉండే ఏడు లోకాలు
కొరివి = మంట
వ్యయం = ఖర్చు
ఏరు = నది
వాక = వాగు
తొలికారు = మొదటి ఋతువు (వ్యవసాయ సంబంధంగా)
ఇరాంబరము = వడగళ్ళు
పరంపర = వారసత్వంగా
చేమ = పచ్చదనం
చిత్రాన్నం = పులిహోర
సాతు = ఒక రకం కలుపు మొక్క
యోగం = కూడిక
యోగికార్థం = శబ్దగతమైన నిజమైన అర్థం
రూఢ్యర్థం = లోకంలో ప్రసిద్ధి పొందిన అర్థం