AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు – మంగళంపల్లి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material గద్య భాగం 5th Lesson గాన సుధాకరుడు – మంగళంపల్లి Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material 5th Lesson గాన సుధాకరుడు – మంగళంపల్లి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘మంగళంపల్లి బాలమురళికృష్ణ పూర్ణ గాయకుడు’ – వివరించండి.
జవాబు:
చిన్నవయసులో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించేవారిని ప్రాడిజీలంటారు. గానం, గణితం, చిత్రలేఖనం. కవనం మొదలైన విద్యలలో ప్రాడిజీలు కన్పిస్తారు. అయితే ఈ ప్రాడిజీలు యుక్తవయస్కులయ్యేసరికి వాళ్ళు శక్తులన్నీ కోల్పోయి, చాలా మామూలుగా తయారవుతారు. కాని, బాలమురళి ఈ రకం ప్రాడిజీ కాదు. అందుకే తన నలభయ్యో ఏట అత్యుత్తమ కర్ణాటక గాయకుడి హోదాలో ఉండి, ముప్పయ్యేళ్ళుగా పాటకచేరీలు చేసినందుకు జనవరి 11న మద్రాసులో ఘనమైన సన్మానం జరిపించు కున్నారు.

బాలమురళి తండ్రి పట్టాభిరామయ్య సుసర్ల దక్షిణామూర్తిగారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూట్ వాయించటం సాధనచేసి బెజవాడ చేరి సంగీత పాఠాలు చెప్పారు. తల్లి సూర్యకాంతమ్మ కూడ భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని, చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.

పట్టాభిరామయ్య దగ్గర నూకల చిన సత్యనారాయణ వంటి అనేక మంది శిష్యులు సంగీత పాఠాలు నేర్చుకున్నారు. బాలమురళి ఆ పాఠాలు విని పట్టుకున్నాడు. ఏడవ యేటనే అతనికి అనేక గీతాలు, వర్ణాలూ, కొన్ని కీర్తనలూ వచ్చు. అందువల్ల బాలమురళి మొదట గురువు ఆయన తండ్రిగారే.

తరవాత బాలమురళిని పారుపల్లి రామకృష్ణయ్యగారి దగ్గర సంగీత శిక్షణ కోసం చేర్చారు. బాలమురళికి అప్పటికే కొంత సంగీత జ్ఞానం ఉందని ఈ గురువు గారికి తెలియదు.

బెజవాడలో సుసర్ల దక్షిణామూర్తి వారి ఉత్సవాల కార్యక్రమంలో పదిమంది పేర్లలో బాలమురళి పేరు కూడ ఉంది. ఆరోజు బాలమురళి తొమ్మిదో పుట్టినరోజు తొలి ఏకాదశి ఉదయం 8 నుంచి ఓ గంటసేపు బాలమురళిని పాడనివ్వవచ్చు అనుకున్నారు. కాని, తొమ్మిదేళ్ళ బాలమురళి రెండున్నర గంటల సేపు ఆలాపన, కీర్తన, స్వరకల్పనలతో పూర్తిస్థాయి కచేరీ చేయటం’ చూసి పండితుల మతులు పోయాయి.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య ఆనందాశ్రువులు రాల్చి తమగురుత్వాన్ని కొనసాగించారు. బాలమురళి పాట కచేరీలు చేస్తూనే, పారుపల్లి వారి శిష్యరికంలో కీర్తనలు నేర్చుకున్నాడు.

ఈ విధంగా అణుబాంబు పేల్చినట్లు మొదటి పాట కచ్చేరీ చేసినప్పుడు కుర్తాలం స్వాములవారు ఉన్నారు. ఆయన మూలంగా బందరు బుట్టాయి పేటలో బాలమురళి రెండవ కచేరీ జరిగింది. ప్రసిద్ధ విద్వాంసులందరినీ ఆహ్వానించారు. వాగ్గేయకారక హరి నాగభూషణంగారు కూడ కచేరీకి వచ్చారు. ఆయన కొంచెం సేపు విని, మధ్యలో లేచి వెళ్ళి తన భార్యను, పిల్లలను వెంట బెట్టుకుని వచ్చారట.

1942లో తిరువాయూరులో త్యాగరాజ ఉత్సవాలకు రామకృష్ణయ్య పంతులు గారు బాలమురళిని వెంట తీసుకువెళ్ళాడు. గురువుగారికి అస్వస్థత కలిగి ఆయన పాడవలసిన సందర్భంలో బాలమురళికి అవకాశం ఇచ్చారట. అన్ని వేలమంది ప్రజలలో, అంతమంది విద్వాంసుల మధ్య బాలమురళి పాట అద్భుత సంచలనం కలిగించిందట.

అన్ని విధాలా ప్రతిభావంతుడైన వ్యక్తిని పూర్ణ పురుషుడు అంటారు. ఆ మాటకు అందరూ తగరు. ఒకటి రెండు అంశాలలో పరాకాష్ఠ అందుకున్నంత మాత్రాన మనిషి పూర్ణ పురుషుడు కాజాలడు.

బాలమురళికి స్వరమూ, రాగమూ, లయా బానిసలలా ఉంటాయి. వాటిపై అతను చూపే అధికారం అనన్యమైనది అతని సంగీతం అగాధమనిపిస్తుంది. అతడు సంగీతంలో వామన మూర్తిలా ఇంకా ఇంకా పెరిగిపోయాడు.

బాలమురళిని పూర్ణ గాయకుడు అనవచ్చు. ఆ మాట అతనికి పూర్తిగా అతుకు తుంది.

ప్రశ్న 2.
బాలమురళీకృష్ణ సంగీతానికి చేసిన సేవ ఏమిటి ?
జవాబు:
బాలమురళి ఏడవ యేటనే తండ్రి దగ్గర కొన్ని గీతాలు, వర్ణాలు, కీర్తనలూ నేర్చుకున్నారు. తరవాత పారుపల్లి రామకృష్ణయ్యగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు.

తన తొమ్మిదవ యేట మొదటి పాట కచేరీ చేసిన. ఆయన జీవిత పర్యంతమూ ఎన్నో వేల కచేరీలు చేశారు.

సాధారణంగా గానం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు కొంత అభివృద్ధిలోకి వచ్చాక ఇంక పైకి పోవటం అసాధ్యమనుకుని విశ్రాంతిలో పడతారు. మూలధనం మీద వడ్డీతో బతికే వాళ్ళలాగ, తము సాధించుకున్న శక్తి యుక్తులతోనే జీవిత శేషమంతా తమ వృత్తిని కొనసాగిస్తారు.

బాలమురళిలో ఆ విశ్రాంతి ధోరణి కన్పించదు. అతను రోజు రోజుకు, నెలనెలకు పెరుగుతున్నట్లే అన్పిస్తుంది. వామన మూర్తిలా పెరిగిపోయాడు. ఈ పెరగటం డబ్బుకోసమైతే కాదు. ‘ఈ పాట కచేరీలు కాక జరుగుబాటు కావటానికి ఇంకా ఏ మార్గం వున్నా బాగుండును. సంగీతాన్ని అమ్ముకోవటం బాధగా ఉంది’. అన్నారట ఒకసారి.

గాయకుడిగా బాలమురళికి అద్భుతమైన శరీరం ఉంది. అతని సంగీతం అగాధం రాగము, స్వరమూ, లయ అతనికి బానిసల్లా ఉంటాయి. వాటి పైన ఆయన చూపే అధికారం అనన్యమనిపిస్తుంది.

బాలమురళి 72 మేళకర్తల మీద కీర్తనలు రాశాడు. ఇంకా అనేక కీర్తనలు, పదాలు, గీతాలు, వర్ణాలు, తిల్లానాలు రాశాడు. అనేక రాగాల మీద ఇతని రచనలు, అవే రాగాల మీద పూర్వం ఉన్న రచనలకన్న మంచి కాంపోజిషనులని, మోహన, చారుకేశి, .షణ్ముఖప్రియ రాగాలతో వున్న ఇతని గేయాలు సర్వోత్తమమైనవని అనిపిస్తాయి.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

బాలమురళి తిల్లానాలు విన్నాక, మిగిలిన వాళ్ళ తిల్లానాలు విని ఆనందించటం దాదాపు అసంభవం.

బాలమురళి సంగీతంలో త్యాగరాజు హృదయం ఉంది. బాలమురళి గాయకుడూ, వాగ్గేయకారుడే కాదు, నటుడు కూడ. అతడు స్టేజిమీద త్యాగయ్య వేషమూ, ‘ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి వేషం వేశారు. అతని సంగీతంలో నటన, అభినయం ఉంది. సంగీతం అంటే అచ్చంగా పాడటమే కాదు, మాటల ద్వారా భావాలను ప్రేరేపించాలి. అది ముఖంతో అభినయించటం కాదు. గొంతుతో అభినయించాలి. ఈ విద్యలో బాలమురళికి మిగిలిన వాళ్ళు ఎన్నోమైళ్ళ దూరంలో ఉన్నారు.

కీర్తన పాడటంలోనే కాదు ఆలాపనలో కూడ అభినయం చూపగలడు బాలమురళి అతని స్వర కల్పనలో చిత్రలేఖన సూత్రాలు – చిన్న చిన్న ముగ్గులు కాదు, క్లిష్టమైన కాంపోజిషన్లు కనిపిస్తాయి.

మన పెద్ద గాయకులందరూ బాలమురళి వద్ద గానాభినయం నేర్చుకోవలసి ఉంది.

బాలమురళికి తమిళసోదరులు ఎన్నో సన్మానాలు చేశారు. సంగీతానికి మంగళంపల్లి బాలమురళి చేసిన సేవ అనన్య సామాన్యమైనది. అనితర సాధ్యమైనది. ఆయనను ఎన్నెన్నో పురస్కారాలు వరించాయి. గౌరవ డాక్టరేట్లు, డి.లిట్. పట్టాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, యునెస్కో అవార్డు – ఇలా ఇన్ని బిరుదులు, పదవులు, పురస్కారాలు ఆయనను అలంకరించాయి అనటం కంటె ఆ గౌరవాలకే ఆయన అలంకారమయ్యారు. అనటం సముచితం.

ఈ స్వర సామ్రాట్ తనకు ఎన్ని పురస్కారాలు వచ్చినా వాటికంటె ఒకమెట్టు పైనే ఉండేవారు.

‘అపరత్యాగయ్య’ ‘అభినవ అన్నమయ్య’గా ప్రస్తుతించబడిన బాలమురళి తెలుగు వాడు కావటం మనకు గర్వకారణం ఆయన జీవితం సంగీత జీవులందరికీ ఆదర్శప్రాయం.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘ప్రాడిజీ’లను గురించి వివరించండి.
జవాబు:
చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించేవారిని ప్రాడిజీ’ లంటారు. గానం, గణితం, చిత్రలేఖనం, కవిత్వం మొదలైన విద్యలలో ప్రాడిజీలు కన్పిస్తారు. పూర్వజన్మలో విశ్వాసం ఉన్నవాళ్ళు వాళ్ళ శక్తులు సంచితమంటారు.

అయితే, చిన్నతనంలో ఉండే ఈ ప్రజ్ఞాపాటవాలు యుక్తవయస్సు వచ్చేసరికి కనిపించక ప్రాడిజీలు చాలా మామూలుగా తయారవుతారు. ఇంగ్లండులోని రాయల్ ఎకాడమిలో 14 ఏళ్ళ లోపు పిల్లలు వేసిన అద్భుత చిత్రాలు ఉన్నాయట. ఆ చిత్రకారులలో కొందరు పెద్దవాళ్ళు అయ్యాక పిల్లి బొమ్మ కూడ వేయలేక పోయారట!

బాలమురళి మాత్రం ఈ రకం ప్రాడిజీ కాదు. అందుకే తన నలభయ్యవ ఏట అత్యుత్తమ కర్ణాటక గాయకుడి హోదాలో ఉండి, ముప్పయ్యేళ్ళుగా పాటకచేరీలు చేసినందుకు జనవరి 11న మద్రాసులో ఘనమైన సన్మానం జరిపించుకున్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

ప్రశ్న 2.
సూర్యకాంతమ్మగారిని గురించి తెలుపండి.
జవాబు:
సూర్యకాంతమ్మ బాలమురళిగారి తల్లి. ఈమె తండ్రి సుప్రసిద్ధులైన ప్రయాగ రంగదాసుగారు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అద్భుతంగా పాడేవారు. ఆయన కుమార్తె సూర్యకాంతమ్మ కూడ ఆధ్యాత్మ రామాయణం పాడేవారు. ఆమెకు పట్టాభి రామయ్యగారితో వివాహమయింది. ఆయనకు చదువు మీద బుద్ధి నిలవలేదు.

సంగీతం మీద గురి కుదిరింది. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూటు వాయించటం సాధన చేసి, బెజవాడ చేరి, సంగీత పాఠాలు చెప్పసాగారు. భార్యను సంగీతంలో ప్రోత్సహించారు. సూర్యకాంతమ్మగారు. కాపురానికి వచ్చాక భర్త ప్రోత్సాహంతో. వీణ నేర్చుకుని చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.

ఈ దంపతులకు 1930లో తొలి ఏకాదశినాడు బాలమురళి జన్మించారు. మలి ఏకాదశినాడు అంటే బాలమురళి పుట్టిన 15 రోజులకు సూర్యకాంతమ్మగారు మరణించారు.

ప్రశ్న 3.
బాలమురళి మొదటి. సంగీత కచేరిని గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
బెజవాడలో సుసర్ల దక్షిణామూర్తి ఉత్సవాలు జరపటానికి నిశ్చయమయింది. కార్యక్రమానికి పదిమంది పేర్లలో బాలమురళి పేరు కూడ చేర్చారు.

ఆ రోజు తొలి ఏకాదశి బాలమురళి తొమ్మిదవ పుట్టినరోజు. ఉదయం 8 నుంచి బాలమురళి ఏ గంట సేపో పాడనీచ్చి, తరవాత భోజనాల వేళ దాకా ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారి హరికథా కాలక్షేపం అనుకున్నారు. కాని, తొమ్మిదేళ్ళ బాలమురళి రెండున్నర గంటల సేపు పక్కా పాటకచేరీ చేసాడు. ఆలాపనా, కీర్తనా, స్వరకల్పనా సమస్త హంగులతో పాడాడు. వింటున్న పండితులకు మతులు పోయాయి.

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ఆనందాశ్రువులు రాల్చి తన గురుత్వాన్ని కొనసాగించారు. తన దగ్గర సంగీతం నేర్చుకున్న పిల్లవాడు తనతో సమానంగా కచేరీ చేస్తే మరొక గురువైతే ఆగ్రహించటానికి ఎన్ని కారణాలైనా ఉండవచ్చు. కాని, పారుపల్లివారి గొప్ప మనసును మెచ్చుకోవాలి. బాలమురళి ఒక వంకపాట కచేరీలు చేస్తూ, శిష్యరికం చేసి కీర్తనలు నేర్చుకున్నాడు. మా గురువు లాంటి గురువు ‘నభూతో నభవిష్యతి’ అంటాడు బాలమురళి.

ఈ విధంగా అణుబాంబు పేల్చినట్టు బాలమురళి మొదటి పాట కచేరీ చేసినపుడు కుర్తాలం స్వాములవారు విన్నారు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

ప్రశ్న 4.
కొడవటిగంటి కుటుంబరావును గురించి వివరించండి.
జవాబు:
ప్రగతిశీల మేధావి, మహారచయిత కొడవటిగంటి కుటుంబరావు. వీరు గుంటూరు జిల్లా తెనాలిలో 28-10-1909వ తేదీన జన్మించారు. సుందరమ్మ, రామచంద్రయ్య వీరి తల్లిదండ్రులు. బాల్యంలోనే తల్లి దండ్రులు చనిపోగా పెదతండ్రి సంరక్షణలో కొడవటిగంటి బాల్యం జరిగింది.

స్కూలు ఫైనలు వరకు తెనాలిలో ఇంటరు గుంటూరు ఏ.సి. కళాశాలలో, బి.ఎ. (ఫిజిక్సు) విజయనగరం కళాశాలలో చదివారు 1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ (ఫిజిక్సు) చేరినప్పటికీ ఆర్థిక సంక్షోభంతో చదువు మధ్యలో ఆగిపోయింది. స్కూలు ఫైనలు చదివే సమయంలోనే వీరికి సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరిగింది.

కొడవటిగంటి నాలుగువందల కథలు, ఎనభై గల్పికలు, ఇరవై నవలలూ, వందరేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు రచించారు. ఆరేడువందల వ్యాసాలు భిన్నఅంశాలకు సంబంధించి రాశారు. కొన్నాళ్ళు ఆంధ్ర పత్రికలో చేసాక, 1952 నుండి జీవిత పర్యంతం చందమామ సంపాదకులుగా ఉన్నారు. 17-08-1980లో మరణించారు.

ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాడిజీ అంటే ఏమిటి ?
జవాబు:
చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించేవారిని ‘ప్రాడిజీ’లంటారు.

ప్రశ్న 2.
బాలమురళి తల్లిదండ్రుల పేర్లేమి ?
జవాబు:
సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య బాలమురళి తల్లిదండ్రులు.

ప్రశ్న 3.
మంగళం పల్లి నటించిన చలన చిత్రం ఏది ?
జవాబు:
మంగళం పల్లి నటించిన చిత్రం ప్రహ్లాద.

ప్రశ్న 4.
త్యాగరాజ స్వామి ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి ?
జవాబు:
త్యాగరాజస్వామి ఉత్సవాలు తిరువాయూరులో జరుగుతాయి.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

ప్రశ్న 5.
బాలమురళి ఎన్ని మేళకర్తల మీద కీర్తనలు రాశాడు ?
జవాబు:
బాలమురళి 72 మేళ కర్తల మీద కీర్తనలు రాశాడు.

విశేషాంశాలు

స్వరం :
సంగీతంలో ఏడు స్వరాలుంటాయి. అవి – షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషధ, వీటి సంక్షిప్త రూపాలే స – రి – గ – మ – ప – ద – ని అనే సప్త స్వరాలు. వీటిని అనేక రీతుల్లో మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. ప్రతి రాగంలోనూ సప్త స్వరాలు తప్పనిసరిగా ఉండాలన్న నియమం లేదు.

రాగాలు – మేళకర్త రాగాలు :
సంగీత శాస్త్రంలో ‘రాగం’ అనేది ఒక సాంకేతిక పదం. ఏదైనా ఒక మాధుర్యాన్ని పలికించడానికి ఏర్పాటు చేసుకున్న కొన్ని నియమ నిబంధనల సమాహారం రాగం. స – రి – గ – మ – ప – ద – ని అనేవి సప్త స్వరాలు. వీటి ఆరోహణ, అవరోహణలు ఎలా సాగాలి అనే దానిని అనుసరించి ఈ రాగాల అస్తిత్వం ఉంటుంది. కర్ణాటక సంగీతంలో ఈ రాగాల సంఖ్య 72. మేళకర్త రాగాలు అంటే ఇవే. వీటిని సంపూర్ణ రాగాలు అని కూడా వ్యవహరిస్తారు. ఈ మేళ కర్త రాగాల నుంచి పుట్టిన వాటిని జన్య రాగాలు అంటారు. వీటి సంఖ్య అనంతం.

వర్ణం :
సంగీత శాస్త్రంలో రాగ సంచారాన్ని వివరించే సాంకేతిక పదం ‘వర్ణం’. ఈ వర్ణం స్వర ఉచ్చారణనూ, రాగ లక్షణాన్నీ; రాగంలోని ఆరోహణ అవరోహణ క్రమాన్ని వివరిస్తుంది. వర్ణాలలో వివిధ రకాలున్నాయి. పల్లవి – అనుపల్లవి – చరణం – స్వరాలు అనేవి వర్ణంలో సర్వసాధారణంగా ఉండే అంశాలు. అభ్యాసకుడు వేరు వేరు గతుల్లో అభ్యాసం చేయడానికి అనుకూలంగా ఈ వర్ణాలను రచించారు. సాధారణంగా గాత్రకచ్చేరీలలో శ్రోతలను ఉత్తేజ పరచడానికి గాయకులు వర్ణాన్ని ఆలపించడం ద్వారానే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

త్యాగరాజు – తిరువాయూరు :
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో త్యాగరాజు (4.5.1767 – 6.1. 1847) ఒకరు. ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి తక్కిన ఇద్దరు. త్యాగరాజుకు త్యాగయ్య, త్యాగ బ్రహ్మ అనేవి నామాంతరాలు. కర్ణాటక సంగీతానికి త్యాగరాజును మూలస్తంభంగా పరిగణిస్తారు. వీరి జన్మ దినాన్ని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుకుంటారు. వేలాది కీర్తనలను రచించిన త్యాగయ్యకు నివాళిగా అశేష సంగీత కళాకారులు ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమినాడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకుంటారు. ఇవి తమిళనాడులోని తంజావూరు సమీపాన గల తిరువయ్యూరులోని కావేరి నది ఒడ్డున ఉన్న త్యాగయ్య సమాధి వద్ద జరుగుతాయి.

నిజానికి త్యాగరాజు మాతృభాష తెలుగే. వీరి పూర్వీకులది ప్రకాశం జిల్లా, కంభం మండలంలోని కాకర్ల గ్రామం. అక్కడ నుండి తమిళనాడుకు వలసపోవడం వల్ల త్యాగరాజు జీవితం అక్కడ గడిచింది. అయినా త్యాగయ్య కీర్తనలలో అధిక భాగం తెలుగువే. అయినప్పటికీ కర్ణాటక సంగీత ప్రియులు తమిళనాడులోనే అధిక సంఖ్యలో ఉండటం వల్ల వీరి కీర్తనలు అక్కడే అధిక ప్రాచుర్యం పొందడం విశేషం.

లయ :
సంగీత శాస్త్రంలో వినిపించే మరొక సంకేత పదం లయ. శృతి, లయలు సంగీతంలోని మాధుర్యానికి ఆయువు పట్టులు. కొందరు లయ, తాళాలను అభేదంగా పరిగణిస్తారు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

పదం :
కీర్తనకు మరొక పర్యాయపదం – ‘పదం’ అయితే, భక్తితో కూడిన కీర్తనలను పదాలుగా పరిగణిస్తారు. భక్తికి సంబంధించిన పాట అని ఈ ‘పదానికి’ ‘ అర్థం చెప్పుకోవచ్చు.

తిల్లాన :
సంప్రదాయ సంగీతంలో మరో కృతి విశేషం ‘తిల్లాన’. పల్లవి – అనుపల్లవి – చరణం అనే మూడు అంగాలు కలిగిన రచన ‘తిల్లాన’. ఇందులోని సాహిత్యం జతులతోనూ, స్వరాలతోనూ విరాజిల్లుతుంది. ఇతర ప్రక్రియలకంటే తిల్లానా చురుకుగా ఉంటుంది. ఉద్రేకింప చేసే రచనతో శ్రోతలను రసలోకంలో విహరింప చేయడం తిల్లాన ప్రత్యేకత. ఇది కర్ణాటక సంగీతం లోని విశిష్ట రచనే అయినా, హిందూస్థానీ సంగీతంలోనూ వినిపిస్తూ ఉంటుంది. నృత్య నాటికలలో ఈ ‘తిల్లాన’ ప్రక్రియను ఎక్కువగా వినియోగిస్తారు.

తార :
‘తార’ అనేది సంగీత శాస్త్రంలో స్వరస్థాయికి సంబంధించిన ఒక సాంకేతిక పదం. సంగీతం స – రి – గ – మ – ప – ద – ని అనే స్వరాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్వరాలను ఆరోహణ, అవరోహణ క్రమాలలో మూడు స్థాయిల్లో పాడవచ్చు. సాధారణంగా గాత్రంలో కింది స్థాయిని ‘మంద్ర’ అనీ, మధ్య స్థాయిని ‘మధ్య’ అనీ, పై స్థాయిని ‘తార’ అనీ పరిగణిస్తారు. తారలు ఆకాశంలో పైన ఉంటాయి కాబట్టి పై స్థాయిని తారాస్థాయి అని వ్యవహరించి ఉండవచ్చు. తారము అనే పదానికి తరింప చేసేది అనే పారమార్థిక అర్థం కూడా ఉంది.

రచయిత పరిచయం

కొడవటిగంటి కుటుంబరావు గుంటూరు జిల్లా తెనాలిలో 28-10-1909న జన్మించారు. సుందరమ్మ, రామచంద్రయ్య వీరి తల్లిదండ్రులు వీరి బాల్యంలోనే ఆరేళ్ళ వ్యవధిలో తల్లిదండ్రులిద్దరూ మరణించారు. పెదతండ్రి వీరి బాధ్యత వహించారు. వీరు స్కూలు ఫైనలు వరకు తెనాలిలో, ఇంటరు గుంటూరు ఎ.సి. కళాశాలలో, బి.ఎ. (ఫిజిక్స్) విజయనగరం కళాశాలలో చదివారు.

1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ (ఫిజిక్స్) చేరినప్పటికీ ఆర్థిక సంక్షోభంతో చదువు మధ్యలో ఆగిపోయింది. స్కూల్ ఫైనల్ చదివే సమయంలోనే వీరికి సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరిగింది.

కొడవటిగంటి వారు దాదాపు యాభైయేళ్ళ కాలంలో పదిపన్నెండువేల పేజీల మించిన సాహిత్యం అందించారు. నాలుగు వందలకు పైగా కథలు రచించారు… ఎనభై గల్పికలు. ఇరవై నవలలూ, వంద దాకా రేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు రచించారు ఆరేడు వందలకు పైగా సాహిత్య, సాంస్కృతిక, వైజ్ఞానిక వ్యాసాలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు, పుస్తక పరిచయాలు ప్రకటించారు.

కొడవటిగంటి ఇతర సాహితి మిత్రులతో కలిసి కొన్ని పత్రికలను నడిపారు వివిధ రకాల ఉద్యోగాలు చేశారు. చాలా సంవత్సరాలు ఆంధ్రపత్రికలో పనిచేశారు 1952 జనవరి నుండి జీవిత పర్యంతం వరకు చందమామ’కు సంపాదకులుగా వ్యవహరించారు. అభ్యుదయ రచయితల సంఘంలోను, విప్లవ రచయితల సంఘం లోను, సభ్యులుగా ఉన్నారు.

తెలుగునాట ప్రగతి శీల మేధావిగ, మహారచయితగా, సాహిత్యోద్యమ శీలిగ, తెలుగువారి ఆధునిక సామాజిక, సాంస్కృతిక పురోగమనానికి జీవిత పర్యంతం కృషి సల్పిన రచయిత కొడవటిగంటి కుటుంబరావు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

గొప్ప మార్క్సిస్టు మేధావిగా పేరుపొందిన , కొడవటిగంటి కుటుంబరావుగారు 17-8-1980న మరణించారు.

ఈ పాఠ్యభాగం విరసం వారు ప్రచురించిన ‘కొకు రచనా ప్రపంచం 13 (సంస్కృతి, వ్యాసాలు) నుండి గ్రహించబడినది.

పాఠ్యభాగ సందర్భం

చతుషష్టి కళలలో లలితకళలు ప్రత్యేకమైనవి. కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యాలను లలితకళలు అంటారు. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్రిగాన రసం ఫణిః అన్నారు పెద్దలు సంగీతానికి శిశువులు, పశువులు, పాములు సైతం పరవశులౌ తాయని అర్థం. సంగీత, సాహిత్యాలు సరస్వతీ దేవికి సన ద్వయాల్లాంటివి. చంటి బిడ్డల్లా ఆరసామృతాన్ని ఆస్వాదించినపుడు ప్రతి ఒక్కరూ అలౌకికానందాన్ని పొందుతారని పెద్దలు చెపుతారు.

శాస్త్రీయ సంగీతమంటే ఏ కొద్దమందికి మాత్రమే అనే అపోహను తుడిచి పెట్టె – లక్షలాది శ్రోతలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిది వీరు 1930 జూలై 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా శంకర గుప్తం గ్రామంలో జన్మించారు. సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య వీరి తల్లిదండ్రులు చిన్నతనంలోనే సంగీతమేధావిగా, గుర్తింపు పొందారు.

వీరు సూర్యకాంతి, లవంగి, మోహనాంగి, మహతి, ప్రతి మధ్యమావతి లాంటి అనేక రాగాలను సృష్టించారు. వాక్కును, గేయాన్ని సొంతం చేసుకుని బాలమురళి వాగ్గేయకారునిగా ప్రసిద్ధి పొందారు. 430 బాణీలలో 72 మేళ కర్త రాగాలకు — ఒక్కొక్క కృతిని రాసి స్వర పరిచారు. ఇరవై అయిదు వేలకు పైగా కచేరీలు చేశారు.

బాలమురళి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు తెలుగునాట ప్రజాదరణ పొందిన భక్తిరంజని కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. దక్షిణాది భాషలలో అనేక సినీ గీతాలను ఆలపించారు. సినిమాలలో కూడ, నటించారు. గాత్రంతోపాటు వయోలిన్, కంజీర, వేణువు, వీణ, మృదంగం వంటి ఇతర సంగీత వాద్యాల్లోను వీరి ప్రావీణ్యం ఉంది, ప్రముఖ హిందుస్తానీ విద్వాంసులతో కలసి ‘జుగల్ బందీ’ కార్యక్రమాన్ని వీరే ప్రారంభించారు.

బాలమురళిగారికి వచ్చిన పురస్కారాలెన్నెన్నో! ఐదు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు. రెండు విశ్వ విద్యాలయాలనుండి డి.లిట్. పట్టాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ (1971), పద్మభూషణ్, పద్మ విభూషణ్ (1991). పురస్కారాలు. ఫ్రాన్స్ నుండి ‘షెవాలియర్ అవార్డు’. ఐక్యరాజ్యసమితి నుండి.యునెస్కో అవార్డు, మద్రాసు మ్యూజిక్ అకాడమి ద్వారా ‘సంగీత కళానిది’, జాతీయ స్థాయి : ఉత్తమ నేపథ్య గాయకుడు. ఉత్తమ సంగీత దర్శకుడు మొదలైన పురస్కారాలు వీరు అందుకున్నారు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

1994లో మంగళంపల్లి ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రోచాన్సలర్ గా నియమించబడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం శృంగేరి పీఠాలకు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాష్ట్రాలకు ఆస్థాన విద్వాంసులుగా గౌరవించబడ్డారు. ‘అపరత్యాగయ్య’, ‘అభినవ అన్నమయ్య’గా ప్రస్తుతించబడిన బాలమురళి తెలుగువారు కావటం మనకు గర్వకారణం. సంగీత ప్రపంచానికి ఒక దివ్యానుభవాన్ని కలిగించిన ఈ గాన గంధర్వుడు 22-11-2016న ఏ గంధర్వ లోకానికో చేరుకున్నారు.

కొడవటిగంటి కుటుంబరావు 1971లో ఉత్తమ పురుషలో రచించిన ఈ వ్యాసం ద్వారా మంగళంపల్లి వారి సంగీత కౌశలాన్ని విద్యార్థులకు పరిచయం చెయ్యటం, వారిలో కళల పట్ల స్ఫూర్తిని పెంపొందించటం ఈ పాఠ్యభాగం ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

కొడవటిగంటి కుటుంబరావుగారు 1941లో బాలమురళీకృష్ణ పేరు మొదటిసారి విన్నారు. అప్పటికే బాలమురళి వయసు 11 ఏళ్ళు. అప్పటికే రెండు ఏళ్ళుగా పాటకచ్చేరీలు చేస్తునాడు.

తరవాత రెండుమూడేళ్ళకు బొంబాయిలో బాలమురళి కచేరీ కొడవటిగంటి విన్నారు. అతను సమగ్ర గాయకుడని గ్రహించారు. అప్పటికి అతనికి పద్నాలుగో ఏడు. నాలుగైదేళ్ళుగా పాటకచ్చేరీలు చేస్తున్నాడు. నలభై ఏళ్ళుగా కచేరీలు చేస్తున్న ధీమా అతనిలో కనిపించింది.

అంత చిన్నవయసులో అసాధారణ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించేవారిని ప్రాడిజీ లంటారు. గానం, గణితం, కవనం మొదలైన విద్యలలో ప్రాడిజీలు కన్పిస్తారు.

అయితే ఈ ప్రాడిజీలతో తరచు ఒక చిక్కుంటుంది. యుక్త వయస్కులయ్యేసరికి వాళ్ళు శక్తులన్నీ కోల్పోయి చాలా మామూలుగా తయారువుతారు. బాలమురళి ఈ రకం పొడిజీ మాత్రం కాదు. అందుకే తన నలభయ్యో ఏట అత్యుత్తమ కర్ణాటక గాయకుడి హోదాలో ఉండి, ముప్పై ఏళ్ళుగా పాటకచ్చేరీలు చేసినందుకు జనవరి 11న మద్రాసులో ఘనమైన సన్మానం జరిపించుకున్నాడు.

బాలమురళి తండ్రి పట్టాభిరామయ్యగారు చదువు మీద బుద్ధి నిలవలేదు. చివర కాయనకు సంగీతం మీద బుద్ధి కుదిరింది. సుసర్ల – దక్షిణామూర్తి శాస్త్రుల వారి దగ్గర నాలుగు సంవత్సరాలు సంగీతం అభ్యసించి, ఫ్లూట్ వాయించటం సాధన చేసి, బెజవాడ చేరి సంగీతపాఠాలు చెప్పసాగారు. భార్య సూర్యకాంతమ్మ గారు కాపరానికి వచ్చాక భర్త ప్రోత్సాహంతో వీణనేర్చుకుని , చిన్నచిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.

ఈ దంపతులకు 1930 తొలి ఏకాదశినాడు బాలమురళి జన్మించాడు. మలి ఏకాదశినాడు, బాలమురళి పుట్టిన పదిహేను రోజులకు అతని తల్లి కన్నుమూసింది.

బాలమురళి తండ్రి దగ్గరకు వచ్చే నూకల చిన సత్యనారాయణ, అక్కాజీరావు వంటె శిష్యులలో సంగీత పాఠాలు విని నేర్చుకున్నాడు. ఎనిమిదో యేట పారుపల్లి – రామకృష్ణయ్యగారి దగ్గర సంగీతానికి చేర్చారు.

బెజవాడలో సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల ఉత్సవాల కార్యక్రమంలో బాలమురళి పేరు కూడ చేర్చారు. తొమ్మిదేళ్ళ బాలమురళి సమస్త హంగులతో ఆలాపన, కీర్తన, స్వరకల్పనలతో రెండున్నర గంటల సేపు కచేరీ చేశాడు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

ఈ విధంగా బాలమురళి అణుబాంబు పేల్చినట్లు మొదటి కచేరీ చేసినప్పుడు కుర్రాలం స్వాములవారు విన్నారు. ఆయన వల్ల రెండవ కచేరీ బందరు బుట్టెయి పేటలో జరిగింది.

1942లో త్యాగరాజు ఉత్సవాలకు రామకృష్ణయ్య పంతులు గారితో వెళ్ళిన బాలమురళికి గురువుగారికి అస్వస్థత కలిగి ఆయన పాడవలసిన సందర్భంలో, అవకాశం వచ్చింది. అన్ని వేల మంది ప్రజలలో, అందరు విద్వాంసుల మధ్య బాలమురళి పాట అద్భుత సంచలనం కలిగించింది.

బాలమురళిని పూర్ణగాయకుడు అనవచ్చు. సాధారణంగా గానం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు కొంత అభివృద్ధిలోకి వచ్చాక విశ్రాంతిలో పడతారు బాలమురళిలో అవిశ్రాంతి ధోరణి కన్పించదు. అతను వామన మూర్తిలా ఇంకా ఇంకా పెరుగుతున్నాడు.

గాయకుడుగా అతనికి అద్భుతమైన శారీరం ఉంది. రాగము, స్వరమూ, లయ అతనికి బానిసలలా ఉంటాయి. అతని సంగీతం ఆగాధమనిపిస్తుంది.

అతను 72 మేళకర్తలమీద కీర్తనలు రాశాడని, ఇంకా అనేక కీర్తనలు, పదాలు, గీతాలు, వర్ణనలు, తిల్లానాలు రాశాడని అందరికీ తెలిసినదే.

అతను స్టేజి మీద త్యాగయ్యవేషమూ, ‘ప్రహ్లాద’, చిత్రంలో నారదుడి వేషమూ, రేడియో గేయ నాటకాలలో వివిధ పాత్రలు ధరించాడు. అతని సంగీతంలో నటన ఉంది.

కీర్తన పాడటంలోనే కాదు. ఆలాపనలో కూడ అభినయం చూపగలడు బాలమురళి. మన పెద్దగాయకులందరూ బాలమురళి వద్ద గానాభినయం నేర్చుకోవలసివుంది. బాలమురళి తమిళసోదరులు చేసిన సన్మానాలలో ఎన్నో వంతు ఆంధ్రులు చేస్తారో చూడాలి. తమిళులు బ్రహ్మరధం పడుతున్న తెలుగు నాయకులకు తెలుగువాళ్ళు ఎటువంటి సన్మానాలు చేస్తారో అది కూడా చూడవలసి ఉంది.

కఠిన పదాలకు అర్ధాలు

వెలితి = లోపం
ధీమా = ధైర్యం
ప్రజ్ఞాపాటవాలు = తెలివి నైపుణ్యాలు
సంచితం = పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మ నుండి సంక్రమించినది
ప్రశిష్యులు = శిష్యులకు శిష్యులు
పరంపర = వరుస
బొట్టెకాయ = చిన్నపిల్లవాడు
ఆనందాశ్రువులు = ఆనందంతో వచ్చే కన్నీళ్ళు
పామరులు = చదువు లేనివారు
సులభగ్రాహ్యం = సులభంగా గ్రహించటం
వాగ్గేయకారులు = గేయాలు రాసిపాడేవారు

AP Inter 1st Year Telugu Study Material Chapter 5 గాన సుధాకరుడు - మంగళంపల్లి

అస్వస్థత = అనారోగ్యం
పరాకాష్ఠ = ఉన్నతదశ, పై స్థాయి
జీవితశేషం = మిగిలిన జీవితమంతా
అంతస్స్వభావం = మనిషి లోపల ఉండే స్వభావం
డజను = పన్నెండు
క్లిష్ట పరిస్థితి = కష్టపరిస్థితి
అనన్యం = ఇతరులకు సాధ్యంకానిది
యావచ్ఛక్తి = పూర్తి శక్తి
సర్వోత్తమమైన = అందరిలో ఉత్తమమైన
అసంభవం = సంభవం కానిది
గానాభినయం = పాడుతూ అభినయించటం
బ్రహ్మరథం = బ్రాహ్మణులు మోసే పల్లకి, అత్యున్నత గౌరవం.

Leave a Comment