AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ
10th Class Telugu ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
సంఘటనా క్రమం
సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం.
1. అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం. ప్రశాంత ప్రదేశం.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు శ్రీరాముడు.
ఇ) పక్షులు, మృగాలు – సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
జవాబులు
అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం.
ఇ) పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు.
2. అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు. శ్రీరాముడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం.సాహసమని అభినందించాడు.
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం సాహసమని అభినందించాడు.
అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు శ్రీరాముడు.
3. అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
జవాబులు
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.
4. అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షసవీరులు రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. .
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
జవాబులు
అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు .రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది.
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు.
5. అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
జవాబులు
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.
6. అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశమార్గం పట్టాడు.
జవాబులు
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనంమీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
7. అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
జవాబులు
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.
8. అ) మారీచుడు బంగారు లేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
జవాబులు
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
అ) మారీచుడు బంగారులేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.
9. అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
జవాబులు
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.
పాత్ర స్వభావాలు
1. శరభంగ మహర్షి :
శరభంగుడు మహాతపస్వి. దైవసాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామదర్శనం కోసమే తాను వేచివున్నానన్నాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.
2. అగస్త్యుడు :
అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. ‘అగమ్ స్తంభయతీతి అగస్త్యః’ పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు.
3. జటాయువు :
ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఇతనికి సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెడుతుంటే నిరోధించాడు. గాయాల పాలయ్యాడు. శ్రీరామునికి విషయాన్ని వివరించాడు. శ్రీరాముని చేతిలో కన్నుమూశాడు.
4. కబంధుడు :
ఒక రాక్షసుడు. ఇతని చేతిలో చిక్కితే ఎవ్వరూ తప్పించుకోలేరు. రావణుడు అపహరించిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునకు చెప్పాడు.
5. మారీచుడు :
మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడి యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు.
సీతాపహరణకై తనకు సాయం చేయమని రావణుడు మారీచుని కోరాడు. రాముడు సింహం వంటివాడని రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగోక్కోడం వంటిదని, రావణునికి మారీచుడు హితవు చెప్పాడు.
రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచుని బెదిరించాడు.
రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడిగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు. వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు.
6. శబరి :
శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయోవృద్ధురాలు. శ్రీరామదర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది.
సంఘటన ద్వారా గ్రహించుట
ప్రశ్న 1.
“అన్నా! ఈ దైన్యాన్ని వదులు. అదే మనకు మేలుచేస్తుంది” అను లక్ష్మణుని మాటలను బట్టి, మీరేం గ్రహించారో తెలుపండి.
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతావియోగంతో బాధపడుతున్నాడు. రామలక్ష్మణులు సీతను వెదకుతూ, అందమైన పంపాసరస్సు దగ్గరకు వచ్చారు. ఆ అందమైన ప్రకృతిని చూచి, శ్రీరాముడు మరింతగా విరహ బాధపడ్డాడు.
అప్పుడు రాముడు దైన్యాన్ని విడిచిపెడితే, మేలు కలుగుతుందని చెప్పి, లక్ష్మణుడు రాముని ఊరడించాడు. లక్ష్మణుడు చెప్పినట్లు, కష్టాలు వచ్చినపుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ, ఉత్సాహం ఉన్న వాడికి అసాధ్యం ఏమీ ఉండదనీ, ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా, వెనుకడుగు వేయరనీ, నేను గ్రహించాను.
ప్రశ్న 2.
‘నీ చేతిలో చావడం కన్నా, శ్రీరాముని చేతిలో చావడమే నయం’ అన్న మారీచుని మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రావణుడు మారీచుని దగ్గరకు వచ్చి, సీతను అపహరించడానికి తనకు సాయం చేయుమని కోరాడు. రాముడి జోలికి వెళ్ళడం మంచిది కాదని, మారీచుడు రావణునికి హితువు చెప్పి పంపాడు.
కాని రావణుడు మళ్ళీ మారీచుడి దగ్గరకు వచ్చి, బంగారు లేడి రూపం ధరించి, సీతాపహరణానికి తనకు సాయం చెయ్యమని కోరాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే, మారీచుని చంపుతానని రావణుడు చెప్పాడు.
రావణుడు చెప్పినట్లు చేసినా చెయ్యకపోయినా, మారీచుడికి మరణం తప్పని పరిస్థితి వచ్చింది.
అందుకే మారీచుడు మూర్ఖుడయిన రావణుడి చేతిలో చావడం కన్నా, ధర్మాత్ముడూ, మహావీరుడూ అయిన రాముడి చేతిలో చావడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. రాముడి చేతిలో మరణిస్తే తన జన్మ తరిస్తుందని, మారీచుడు అనుకున్నాడు. దీనిని బట్టి దుర్మార్గుని చేతిలో చావడం కన్న, మంచివాడి చేతిలో మరణం పొందడం మంచిదని నేను గ్రహించాను. మారీచుడు రాక్షసుడయినా, మంచి చెడ్డలు తెలిసిన వాడని గ్రహించాను.
ప్రశ్న 3.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికి రాదు’ అని శూర్పణఖ విషయంలో రాముడు పలికిన దానిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
క్రూరులు అత్యంత ప్రమాదకారులు. వారితో పరిహాసం ఎన్నటికీ పనికిరాదు. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. వారు ఎదుటివారిని చులకనగా చూస్తారు. చనువుగా ప్రవర్తిస్తారు. మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు.
క్రూరులతో సహవాసం చేయడం వల్ల వ్యక్తిత్వం నశిస్తుంది. సమాజంలో గౌరవం. అందువల్ల రాముడు చెప్పినట్లుగా క్రూరులతో సహవాసం పనికిరాదు.
ప్రశ్న 4.
“మహాత్ములారా! మీరు నన్ను ప్రార్థించడం తగదు. ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను” అని రాముడు మునులతో అన్న మాటను బట్టి, మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
శ్రీరాముడు వనవాస కాలంలో సుతీక్ష మహర్షిని కలిశాడు. తరువాత అక్కడి మునులు అందరూ రాముడిని కలిసి, రాక్షసులు చేసే అకృత్యాలను గూర్చి చెప్పారు. రాక్షసుల బారినుండి తమ్ము రక్షింపుమని వారు రాముని ప్రార్థించారు.
అప్పుడు రాముడు ఆ మునులతో తన్ను ప్రార్థించడం తగదనీ, ఆజ్ఞాపించమనీ మునులు చెప్పినట్లు రాక్షసులను తాను సంహరిస్తాననీ, మునులకు అభయం ఇచ్చాడు.
దీనిని బట్టి శ్రీరాముడు మునుల మాటలను చాలా గౌరవించేవాడని, మునుల మాటలను ఆజ్ఞగా గ్రహించి వారు చెప్పినట్లు చేసేవాడని గ్రహించాను.
శ్రీరామునకు మునీశ్వరులపై భక్తి గౌరవములు హెచ్చుగా ఉండేవని గ్రహించాను. రాముడు మహావీరుడని గ్రహించాను.
ప్రశ్న 5.
“నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు” అని సీత, రావణుని హెచ్చరించిన మాటలను బట్టి, నీవేమి గ్రహించావో చెప్పు.
జవాబు:
రావణుడు సన్న్యాసి వేషంతో సీతవద్దకు వచ్చి, తనను భర్తగా స్వీకరిస్తే, గొప్ప భోగభాగ్యాలు అనుభవించవచ్చునని సీతకు ఆశచూపాడు.
రావణుని మాటలకు, సీత మండిపడింది. సీత మహా పతివ్రత. రావణుడు సీతను అపహరించి తీసుకొని వెడితే, అతడు తన చావును తాను కోరి తెచ్చుకున్నట్లే అని, సీత నిజాన్ని చెప్పిందని గ్రహించాను. రావణుడు సీతాపహరణం చేయకపోతే అతనికి మరణమే లేదని గ్రహించాను.
సీత మాటలను బట్టి ఆమె మహా ధైర్యం కలదనీ, నిర్భయంగా రావణుని వంటి రాక్షసుణ్ణి తిరస్కరించి మాట్లాడగలదనీ, , సత్యమూ హితమూ ఆమె బోధించిందనీ, నేను అర్థం చేసుకున్నాను.
ప్రశ్న 6.
రావణుడు సీతను అపహరించే సందర్భంలో జటాయువు చేసిన ప్రయత్నం నుండి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి సమీపానికి వచ్చాడు. నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు. లొంగిపొమ్మని బెదిరించాడు. కోపంతో రావణుడు సీతను తీసికొని రథంలో కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు.
అది గమనించిన జటాయువు రావణుని ఎదిరించాడు. వారిద్దరి మధ్య పోరాటం జరిగింది. చివరకు రావణుని చేతిలో మరణించాడు. మిత్రధర్మం కోసం అవసరమైతే ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. ఆపదల్లో ఉన్న వారిని, ముఖ్యంగా స్త్రీలను తప్పక రక్షించాలని గ్రహించాను.
ప్రశ్న 7.
శ్రీరాముడిని భక్తితో సేవించి తరించిన శబరి వ్యక్తిత్వం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు అరణ్యమార్గంలో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో శబరి ఆశ్రమానికి వచ్చారు. శబరి శ్రీరాముని రాకకై ఎదురుచూస్తున్నది. శ్రీరాముని దర్శనంతో ఆనందాన్ని పొందింది. ఫలాలతో శ్రీరాముడిని సేవించింది. పండ్లను పరిశుభ్రం చేసి అందించింది. అగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకొంది. ఊర్ధ్వ లోకాలకు వెళ్ళింది. శబరి వ్యక్తిత్వం వల్ల దైవాన్ని భక్తి, శ్రద్ధలతో సేవించాలని, ఇంటికి వచ్చిన వారిని అతిథి మర్యాదలతో సేవించాలని గ్రహించాను.
విషయాత్మక ప్రశ్నలు
ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి. .
ప్రశ్న 1.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు’ ఈ మాట ఎవరు ఎవరితో ఎప్పుడు అన్నారు?
జవాబు:
పంచవటిలో శూర్పణఖ విషయంలో శ్రీరాముడు లక్ష్మణునితో అన్నాడు. ఆమె రావణుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమంది. తమకు అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్లమన్నాడు. లక్ష్మణుడు కూడా పరిహాసం చేశాడు. సీతపై దాడికి దిగింది.
అప్పుడు క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. శూర్పణఖను విరూపిని చేయమని లక్ష్మణుని రాముడు ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు తన అన్న ఆజ్ఞను అమలుపరిచాడు.
ప్రశ్న 2.
మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’గా ఎందుకు మారింది?
జవాబు:
సీతాపహరణం చేయాలనుకొన్నాడు రావణుడు. మారీచుని బంగారులేడిగా మారమన్నాడు. రామబాణం రుచి తెలిసిన మారీచుడు తిరస్కరించాడు. రావణుడు చంపుతానన్నాడు. బంగారులేడిగా మారితే రాముడు చంపుతాడు. మారకపోతే రావణుడు చంపుతాడు. అప్పుడు మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’గా మారింది. శ్రీరాముని చేతిలో మరణిస్తే జన్మ ధన్యమవుతుందని భావించి బంగారు లేడిగా మారడానికి అంగీకరించాడు. అతని కోరిక తీరింది.
ప్రశ్న 3.
‘ఉత్సాహమున్న వానికి అసాధ్యం లేదు’ అని ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు?
జవాబు:
సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. ఆమె జాడ తెలియక రామలక్ష్మణులు వెతుకుతున్నారు. వెతుకుతూ, వెతుకుతూ పంపా సరోవర ప్రాంతాన్ని చేరుకొన్నారు. ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. దానితో శ్రీరాముని బాధ పెరిగింది. అప్పుడు లక్ష్మణుడు అన్నగారి దైన్యాన్ని పోగొట్టడానికి పలికిన వాక్యమిది.
ప్రశ్న 4.
శూర్పణఖ ఎవరు? ఆమె అవమానం పొందడానికి కారణమేమిటో తెల్పండి.
జవాబు:
శూర్పణఖ ఒక రాక్షసి. ఈమె రావణునికి చెల్లెలు. శ్రీరాముని అందానికి మురిసిపోయి తనను పెళ్ళి చేసుకోమన్నది. అందుకు అడ్డంగా ఉన్న సీతను, లక్ష్మణుని చంపితింటానన్నది. రాముడు ఆమెను పరిహాసంగా లక్ష్మణుని వద్దకు పంపించాడు. లక్ష్మణుడు తాను అన్నగారి సేవకుణ్ణని, తనను పెళ్ళాడితే ఆమెకూడా తనతోబాటే అన్నకు దాస్యం చేయాల్సి వస్తుందని చెప్పి రాముణే పెళ్ళాడమని పంపాడు. సీత ఉండటం వల్లే రాముడు తనను నిరాకరించాడనుకొని సీతను చంపడానికి దాడి చేసింది. ప్రమాదాన్ని గుర్తించిన లక్ష్మణుడు అన్న ఆదేశంపై శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అలా తన రాక్షసత్వం వలన శూర్పణఖ రామలక్ష్మణులను కోరి అవమానం పొందింది.
వ్యాసరూప ప్రశ్నలు
ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పంచవటిలో సీతారామలక్ష్మణుల జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
అగస్త్య మహర్షి మాటపై, సీతారామలక్ష్మణులు, పంచవటికి చేరారు. లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాలను నిర్మించాడు. సీత రక్షణ బాధ్యతను రాముడు, జటాయువుకు అప్పగించాడు. పంచవటిలో వారి జీవితం సుఖంగా సాగుతోంది. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి, రాముడిని తనను చేపట్టమంది. లక్ష్మణుడు అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరుడు 14 వేల మంది రాక్షసులతో రాముడి చేతిలో యుద్ధంలో మరణించాడు.
అకంపనుడు అనే గూఢచారి ఖరుడి మరణవార్త రావణుడికి అందించి రాముని భార్య సీతను అపహరించమని రావణుడికి సలహా చెప్పాడు. శూర్పణఖ వెళ్ళి రావణుడిని రెచ్చగొట్టింది.
రావణుడు మారీచుడిని మాయలేడిగా సీతారాములు ఉన్న పర్ణశాల వద్దకు పంపాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని రాముడిని కోరింది. రాముడు వెళ్ళి మాయలేడిని చంపాడు. మాయలేడి ‘సీతా! లక్ష్మణా! అంటూ అరచి రాముడి చేతిలో మరణించింది.
రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని రాముని వద్దకు పంపింది. అదే సమయంలో సన్యాసి వేషంలో రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలాత్కారంగా తన రథంలో కూర్చోబెట్టి తీసుకువెడుతున్నాడు. సీత, ‘రామా, రామా’ అని కేకలు వేసింది. జటాయువు రావణుడిని ఎదిరించి, అతడి చేతిలో దెబ్బతింది. రావణుడు సీతను తన లంకా నగరానికి తీసుకువెళ్ళాడు.
రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియక వారు దుఃఖించారు.
ప్రశ్న 2.
మాయలేడి వలన సీతారాములకు కష్టాలు వచ్చాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రావణుడు పంచవటిలో ఉన్న సీతాదేవిని అపహరించాలనుకున్నాడు. రావణుడు మారీచుడిని బెదరించి, బంగారులేడి రూపంలో అతడిని రాముడి ఆశ్రమ ప్రాంతానికి పంపాడు. సీత ఆ జింకను చూసి ఇష్టపడింది. లక్ష్మణుడు అది మాయా మృగం అని చెప్పాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని పట్టుపట్టింది.
సీత ఇష్టాన్ని కాదనలేక, ఆ మాయలేడిని చంపి అయినా తేడానికి రాముడు వెళ్ళాడు. రాముడు ఎంత ప్రయత్నించినా లేడి అందకుండా పరుగుదీసింది. దానితో రాముడు లేడిపై బాణాన్ని వేశాడు. ఆ లేడి ‘సీతా! లక్షణా!’ అని అరుస్తూ చచ్చింది.
మాయలేడి కంఠ ధ్వని రాముడిది అని, సీత కంగారుపడి, రాముడికి సాయంగా లక్ష్మణుడిని పంపింది. లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులలో సీతను విడిచి, రాముడి దగ్గరకు వెళ్ళాడు.
అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకు వచ్చి సీతను బలవంతంగా తీసుకుపోయాడు. కాబట్టి సీతారాముల కష్టానికి మాయలేడియే కారణం అని చెప్పగలము.
ప్రశ్న 3.
కబంధుడు అనే రాక్షసుడు శ్రీరామునకు ఉపకారం చేశాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
కబంధుడు క్రౌంచారణ్యంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతడికి తల, మెడ లేవు. ఇతడి కడుపు భాగంలో ముఖం ఉండేది. రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండేది. ఇతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉండేవి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తినేవాడు.
కంబంధుడు రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకొని తినబోయాడు. కబంధుడి చేతులకు చిక్కితే, ఎవరూ తప్పించుకోలేరు. కాని రామలక్ష్మణులు ఖడ్గాలతో కబంధుడి చేతులు నరికారు. అప్పుడు కబంధుడు తనకు శాపం వల్ల రాక్షసరూపం వచ్చిందనీ, తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ రామలక్ష్మణులకు చెప్పాడు.
రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని దహనం చేశారు….ఆ జ్వాలల నుండి కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీత దొరికే ఉపాయాన్ని రామలక్ష్మణులకు చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని వారికి చెప్పాడు. సుగ్రీవుని స్నేహంతో రాముడు సీతను తిరిగి తెచ్చుకున్నాడు. దీనినిబట్టి కబంధుడు రామలక్ష్మణులకు ఉపకారం చేశాడని చెప్పగలం.
ప్రశ్న 4.
సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి. (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు.
వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని వాడు తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధుణ్ణి గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపంవల్ల రాక్షసుడుగా అయ్యానని చెప్పి, శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.
రామలక్ష్మణులు విరాధుణ్ణి పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష మహర్షిని దర్శించమని ఆయన చెప్పాడు.
సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష.. మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు.
సీతారామలక్ష్మణులు అగస్త్య భ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్య మహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.
రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’ లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.
ప్రశ్న 5.
సీతాపహరణం గురించి రాయండి.
(లేదా)
రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
‘సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండాకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.
‘అకంపనుడు’ అనే గూఢచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.
రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.
దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది.
ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రాముని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదన లేక లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా ! హా లక్ష్మణా !” అని అరిచింది.
ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతణ్ణి సీత నిందించింది. లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.
ప్రశ్న 6.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీత జాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు.
రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడని వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పాడు. జటాయువు మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.
రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.
‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.
రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.
రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరారు.