Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 3rd Lesson ఊతకర్ర Textbook Questions and Answers, Summary.
AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 3rd Lesson ఊతకర్ర
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
‘ఊతకర్ర’ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి.
జవాబు:
ఏ మనిషికైనా అరవైయేండ్లు పై బడటమంటే ఊతకర్ర చేతికి రావటమనే అర్థం. జీవిత చరమాంకంలో అడుగుపెట్టినట్లే. ఆ సమయంలో వారికి ఆలనాపాలనా కరువైతే – జీవితం దుర్లభం. ప్రేమానురాగాలు కరువైతే ఒంటరితనం ఒక నరకం. నిస్సహాయత, నిస్సత్తువ దెయ్యంలా పీడిస్తుంటే దినదిన గండమే. అటువంటి వారి జీవితం ఏటికి ఎదురీదుతున్నట్లే.
ఓ తండ్రి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. సుదూర తీరాల్లో పిల్లలు, భార్య కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు వారికి పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఆ తండ్రి ఒంటరివాడిగా జీవితాన్ని గడుపుతాడు. తనకంటూ ఓ ఇల్లు ఉంది. భద్రతకు, వంటావార్పుకు సదుపాయాలున్నాయి. అన్నింటికీ వేర్వేరు గదులున్నాయి. కాని అవి అన్నీ దుమ్ముతో నిండి పీడ కళ కనబడుతోంది.
గుండె అట్టడుగు పొరల్లోని పుట్టేభావం అది అక్కడే ఆగిపోదు. గొంతుదాటి రాడు. అందరిలాగే ఆ తండ్రి కూడా ఈ దేశంలో మేధావిగా పుట్టడం ఒక శాపం అనుకున్నాడు. తన లాగా తన పిల్లలగతి కారాదని తలచాడు. బాగా చదివించాడు కొడుకు ఇంజనీరు. కూతురు డాక్టరు. ఆ తండ్రి ఆశయం నెరవేరిందని సుతోషించాడు.
కూతురు, కొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ గొప్ప మేధావులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా తలచాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు కోరిక మేరకు అమెరికా వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడకి వెళ్ళిన తర్వాత తెలిసింది దూరపు కొండలు నునుపని. వాళ్ళు అక్కడ కేవలం యంత్రాలుగా మిగిలిపోయారు. డబ్బు – పని ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అదే జీవితం.
మన సంస్కృతికి వారి సంస్కృతి చుక్కెదురు. అక్కడ తెల్లవారిన దగ్గర నుండి కాలంతో పోటీపడుతూ పరుగుల జీవితం జీవించాలి. తల్లిదండ్రుల దారి తల్లిదండ్రులది. పిల్లల దారి పిల్లలది. సాయంత్రం వాడిన ముఖాలతో ఇల్లు చేరడం, విశ్రాంతి తీసుకోవడం ఎవరికి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు భోజనం చేయడం. ఇదంతా చూసిన ఆ తండ్రి అక్కడ జైలు జీవితాన్ని ఇష్టపడలేదు.
ఇరుగూ లేదు పొరుగూ లేదు. ఇటు అటు తిరగడానికి లేదు. మాట మంతీ లేదు. గది ఒక బందిఖానా. ఇలా ఎంతకాలం అని భార్య రానని అన్నా ఇక్కడ గాలికోసం, స్వేచ్ఛ కోసం, ఈ మట్టి కోసం వెనుదిరిగి వచ్చేశాడు. ఒక ఏడాదికి పైగా ఏటికి ఎదురీది బాగా అలసిపోయాడు. ఇక ఈదడం తన వల్ల కాని పని అని ఆలోచిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు. వంట మనిషి వచ్చి వంట చేసి టేబుల్ మీద పెట్టి వెళుతుంది.
వ్యాయామానికి రోజు రెండు కిలోమీటర్లు నడుస్తాడు, ఆయన దినపత్రిక చదువుతాడు. కాలకృత్యాలు తీర్చుకొనేసరికి ఆకలి వేస్తుంది. ఎవరినో పిలిచి టిఫిన్ తెప్పించుకుంటాడు. కనీసం లోట మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదని. బాధపడతాడు. అందరూ ఉన్నా ఏకాకి జీవితం. అందులోనూ అరవై నిండిన వృద్ధాప్యం .
మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమై నలిగిపోతుంటాడు. పుట్టిన రోజు కానుకగా తన బిడ్డలు పంపించిన ‘ఊతకర్ర’ ను చూసి ఆనందించాడు. ఆ కర్ర చేతపట్టుకొని మనసులేని మనుషులు పంపించిన ఈ కట్టెలో ఆత్మీయతలు అనుబంధాలు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఇంకెన్నాళ్లో ఈ కట్టె అని అనుకుంటూ ఓ కన్నీటి చుక్క రాల్చాడు. అది ఆ ఊతకర్రపై పడి జారిపోయింది.
ప్రశ్న 2.
“ఊతకర్ర” కథలో రచయితను ఆకర్షించిన తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించండి ?
జవాబు:
జీవితంలో అందరూ ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో వారితో ఇమడలేక తన ఇంట్లో ఒంటరి బ్రతుకు బ్రతుకున్న వ్యక్తి. జీవన పోరాటంలో తన బిడ్డల కోసం తాపత్రయంతో బ్రతికాడాయన. ఎవరైనా తన బిడ్డల గురించి ఆలోచిస్తారే కాని వారు ఒకరికి బిడ్డలమేనన్న స్పృహ ఉండదు. అందుకే తనవంటి అభాగ్యులు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శనిలా మిగిలిపోతున్నారు.
ఇలా ఆలోచనలతో గందరగోళంగా ఉన్న అతను ఒక రోజు బయటకు వచ్చాడు. ఎంతదూరం నడిచాడో అతనికి తెలియదు. ఒంట్లో ఓపిక లేదు. బాట ప్రక్కన ఒక పెద్ద చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఆ చెట్టు నీడన సేదతీరాలని చేరబడ్డాడు ఆ వృద్ధుడు. ఇంతలో అతనికి కొంతదూరంలో ఓ దృశ్యం కంటపడింది. తనను అది బాగా ఆకట్టుకుందని రచయిత భావించాడు.
అక్కడకు కనుచూపు మేరలో ఒక పల్లె అంత ఎండలో అంతదూరం ఎలా వెళ్ళాడో అతనికే ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు చేరాలంటే గుండె గుభేలుమన్నది. కాసేపు అక్కడే “. కూర్చునే ప్రయత్నం చేశాడు అతడు. ఆ చెట్టు పక్కనే బాట. ఆ బాటకు కాస్త దగ్గరలో కొత్తగా కట్టిన ఇల్లు. ఆ ఇల్లు దూలాల మధ్య ఎండుగడ్డితో కప్పుతున్నాడు ఓ వ్యక్తి.
నిప్పులు చెరిగే ఎండలో చెమటలు ధారాపాతంగా కారుతున్నా పనిలో నిమగ్నమయ్యాడు. అది ఆ వ్యక్తి తండ్రి చూశాడు. కన్నపేగు మెలిపడింది. ముసలాడు ఊతకట్టెపై ఆనుకొని తలపైకెత్తి చూశాడు. సూర్యకాంతికి చెయ్యి అడ్డం పెట్టుకొని చూస్తూ పొద్దు తిరిగాక కట్టవచ్చు కదా ! ఇప్పుడు కాస్త అన్నం తిని పడుకోరాదు అని అన్నాడు. పని అయిపోతుంది కాస్తంత కోసం మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి అంటూ తండ్రి మాటను పెడ చెవిని పెట్టాడు.
కన్నతండ్రి మాటను పెడచెవిని పెట్టినందుకు మనసు చివుక్కుమంది. ఇంట్లోకి వెళ్ళి మూడేళ్ళ పసివాడిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి ఇంట్లోకి వెళ్ళాడు తండ్రి. పాలుగారే పసివాడి పాదాలు చుర్రుమనగానే కెవ్వుమన్నాడు. ఇంటి పైకప్పు పని చేస్తున్న తండ్రి చెవుల్లో పడిందా కేక.
అయ్యయ్యో ! పసివాణ్ణి ఇలా వదిలేసారేమిటని గబగబా దిగాడు. బిడ్డను ఎత్తుకున్నాడు. ఇదే విషయాన్ని రచయిత చెప్పాలనుకున్నాడు. కాకిపిల్ల కాకికి ముద్దు అయితే ఆ కాకి ఇంకొక కాకికి పిల్లే కదా ! ఈ సంగతి ఎవరూ గుర్తించరేమని రచయిత అభిప్రాయం. ఈ తండ్రీబిడ్డల సంఘటన అనుబంధానికి ఒక చక్కని నిదర్శనం. ఈ సంఘటనే ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధునికి ఉపదేశ వాక్యమయ్యింది. ఈ ఘటన ద్వారా రచయిత తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించారు.
రచయిత పరిచయం
1. ఊతకర్ర పాఠ్యభాగ రచయిత పులికంటి కృష్ణారెడ్డి.
2. వీరు 30.07.1931 తేదీన చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలంలో జక్కిదాన గ్రామంలో జన్మించారు.
3. పాపమ్మ, గోవిందరెడ్డి వీరి తల్లిదండ్రులు.
4. కృష్ణారెడ్డి గారు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.
5. రాయలసీమ జీవన వెతల్ని కథలుగా మలచిన ప్రముఖ రచయిత కృష్ణారెడ్డి గారు.
6. కృష్ణారెడ్డి గారు కథలే గాకుండా కవితలు, లలిత గేయాలు, జానపద బాణీలో అమ్మి పదాలు కూడా రాసారు.
7. దృశ్య, శ్రవ్య నాటికలు కూడా రాసారు.
8. బుర్ర కథలు, సంగీత రూపకాలు ప్రకటించిన గొప్ప జానపదకళాకారుడు.
9. గూడుకోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథా వాహిని మొదలైనవి కృష్ణారెడ్డి కథా సంపుటాలు.
10. దాదాపు 200 కథలు రచించారు. ‘గూడుకోసం గువ్వలు’ తొలికథ (1960) వీరి కథలు ప్రధాన భారతీయ భాషలోకి అనువదింపబడ్డాయి.
11. రాయలసీమ సిన్నోడుగా తనను తాను చెప్పుకున్నా’ పులికంటి చిన్నోడు కాదు. చేయితిరిగిన రచయిత తలపండిన ఆలోచనాపరుడు.
12. ప్రస్తుత పాఠ్యభాగం ‘ఊతకర్ర’ పులికంటి వారి కథావాహినిలోనిది ‘ తొలిసారి 23-3-1997 ఈనాడు దినపత్రికలో ప్రచురించబడింది.
13. తెలుగువారి జీవితాలను అతి సన్నిహితంగా పరిశీలించిన పులికంటి 19-11-2007న కన్ను మూసారు.
పాఠ్యభాగ సందర్భం
1. తండ్రి :
ఓ సగటు మనిషి. భార్యా పిల్లలు ఉన్నా సుదూర తీరాల్లో ఉన్నారు. ఉండటానికి, తినటానికి అన్ని వసతులున్నా ఏదో వెలితి. ప్రతిరోజు వ్యాయామానికి నడక అలవాటు. కాలకృత్యాలు, దినపత్రికలో విశేషాలు చదవటం దినచర్యలో భాగం. ఆకలి రుచి ఎరుగదన్నట్లు ఏదో టిఫిన్. వంట మనిషి వచ్చి అన్ని వండి పెట్టి వెళుతుంది.
మంచినీళ్ళు కావాలన్నా లేచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఒక ఏడాది పైగా ఒంటరిగా ఏటికి ఎదురీత బ్రతుకు. తన బ్రతుకు తన పిల్లలకు ‘పట్టకూడదని ఆలోచించాడు. తాను ఆశించినట్లుగానే కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టర్ గా స్థిరపడ్డారు. కాని ఆత్మీయులకు దూరంగా మేధోవలసలు. సహించలేకపోయాడు.
2. భార్య :
పిల్లలకు తోడుగా, కొడుకు దగ్గర జీవిస్తున్న ఓ స్త్రీ తల్లి హృదయం. మాతృప్రేమకు మారుపేరు.
3. కొడుకు :
తల్లి దండ్రులపై ప్రేమ అభిమానం ఉన్నవాడు. వాళ్ళ పిల్లలకోసం వలసపోయినవాడు. తమతోబాటు తల్లిదండ్రులను తన దగ్గరకు తీసుకొని వెళతాడు. యాంత్రికమైన జీవితమైనా పిల్లలకోసం తప్పదని రాజీ ధోరణిలో ఉంటాడు.
4. కూతురు :
అమెరికాలో వృత్తిరీత్యా డాక్టరు. తల్లిదండ్రులు అమెరికా వచ్చారని తెలిసి తండ్రిని తనతో తీసుకొని వెళుతుంది. డబ్బు సంపాదనలో తనమునకలై వారు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఎవరికి వాళ్ళే వాళ్ళలోకం అన్నట్లు ఉంటారు.
5. మనవడు :
అమెరికాలో పుట్టిన పిల్లలు. ఏగూటి చిలుక ఆగూటి పలుకులు పలుకుతుందన్నట్లు ఉంటాడు. “చూడు తాతయ్యా మా మమ్మీ డాడీ మా మాతృదేశం చాలా గొప్పది. సంస్కృతీ సంప్రదాయం ఉన్నదేశం. ఆచార వ్యవహారాలు గొప్పవని అంటూ ఉంటారు. అంత గొప్పదేశం వదిలిపెట్టి ఇంతదూరం ఎందుకు వచ్చారు” అని ప్రశ్నిస్తాడు. పిల్లవాడైనా ఆలోచనా విధానానికి ఆశ్చర్యపడతాడు తాతయ్య.
పాఠ్యభాగ సారాంశము
ఓ సగటు మనిషి పిల్లలను బాగా చదివిస్తాడు. కొడుకు ఇంజనీరు. కూతురు డాక్టరు. తనలాగే ఇక్కడే బ్రటకటం ఎందుకని ఆలోచించేవాడు. తన ఆశయం ఫలించింది. అమెరికాలో పెద్ద పెద్ద మేధావులతో కలిసి పనిచేసే భాగ్యం లభించిందని ఆనందపడ్డాడు. తరువాత తెలిసిందేమిటంటే దూరపు కొండలు నునుపని. ఆత్మీయత, అనురాగాలు లేని జీవితాలు. పోటీ ప్రపంచం డబ్బు……డబ్బు. పని, డబ్బు ఒకదానితో ఒకటి ముడిపడిన జీవితం.
యాంత్రికమైన బ్రతుకులు. యాంత్రికమైన ప్రేమలు. ఎవరి దారి వారిది. తెల్లవారిన దగ్గర నుండి ఉరుకులు పరుగులు. సాయంత్రానికి వడిలో పోయిన తోటకూర కాడల్లా ఇంటి ముఖం పట్టడం. తమతో పాటు ఉండవచ్చని తల్లి దండ్రులను రమ్మంటాడు కొడుకు. అంతకంటే భాగ్యం ఏముందని రెక్కలు గట్టుకొని ఎగిరిపోయారు. కొడుకూ, కూతురూ పోటీపడి .ఇద్దరిని పంచుకున్నారు. అక్కడకి వెళితే గాని పరిస్థితి అర్థం కాలేదు వారికి. పంజరంలో చిలుకల్లా పోటీ పడే బ్రతుకులు.
వాళ్ళు భూలోక స్వర్గంలో ఉన్న భావన పోయింది. అది ఒక అందమైన జైలు. ఇరుగు పొరుగు ఎవ్వరూ మాట్లాడరు. గదిలో బందీగా ఎంతకాలం ? చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నా ఎన్ని చదవగలరు ? టీ.వి ఛానళ్ళు ఎన్ని ఉన్నా ఎంతసేపు చూడగలరు? అందుకని తండ్రి స్వదేశానికి తిరిగి వచ్చేసాడు. ఈ మట్టి ఈ గాలి ఈ స్వేచ్ఛ కోసం తను పుట్టి పెరిగిన ఊరు చేరుకున్నాడు. భార్య పిల్లలకోసం అక్కడే ఉండిపోయింది.
ఇక్కడకు వచ్చి ఏడాది పైనే అవుతోంది. కొడుకు పిల్లలు. కూతురు పిల్లలు, భార్య అందరూ ఉన్నా ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఇల్లు ఉన్నా ఒంటరి. ఏకాకి బ్రతుకు మంచినీళ్ళు కావాలన్నా వెళ్ళి తెచ్చుకోవలసినదే. ఉదయాన్నే వ్యాయామం కోసం నడుస్తాడు. ఇంటికొచ్చి కాలకృత్యాలు స్నానం అయ్యాక దిన పత్రిక తిరగేస్తాడు. కడుపులో ఆకలి గుర్తుకొస్తుంది. వీధివైపు చూసి ఎవరినో పిలిచి టిఫిన్ తెప్పించు కుంటాడు.
పిల్లవాడు ఏవి తెచ్చినా రాజీపడాల్సినదే. ఇంతలో వంటమనిషి వస్తుంది. ఇంత అన్నంకూర చేసి టేబుల్ పై సర్థి వెళుతుంది. మధ్యాహ్నానికి రాత్రికి అదే వంట. అరవై ఏళ్ళు దాటాక ఊతకర్ర కావాల్సినదే. జీవిత చరమాంకంలో ఆలనా పాలనా కరువైతే ఆత్మీయానురాగాలు దూరమైతే జీవితం దుర్భరమౌతుంది. ఒక్క రోజు గడవటం భారమవుతుంది. ఒక సంవత్సర కాలం అయింది.
ఒంటరి బ్రతుకు బ్రతుకుతూ ఇక తనవల్ల కాని పని అని ఆలోచనల్లో పడి ఉండగా వంటమనిషి “అయ్యా ఇడ్లీలు ఆరిపోతున్నాయి” అనగానే ఈ లోకంలోకి వచ్చాడు. ఆమె వంటమనిషి చెప్పడం వరకే తనపని. అంతటితో తన బాధ్యత తీరిపోయిందని తన పనిలో పడింది. వంట మనిషి వెళ్ళిపోవడం, బయట రోడ్డుపై వాహనాలు పోటీపడి వెళ్ళడమూ అన్నీ సాగిపోతున్నా ఆయన ఆలోచనలకు అవి పెద్ద అంతరాయం కలిగించటం లేదు.
ఒకప్పుడు ఈ దేశంలో మేధావిగా పుట్టడమే శాపం అని తలిచాడు అతడు. తనపిల్లలకు ఆగతి పట్టకూడదనుకున్నాడు. మేధస్సును గుర్తించి గౌరవించలేని ఈ దేశంలో ఏ పరిస్థితుల్లోనూ అభివృద్ధి సాధించడం అసాధ్యం అనుకున్నాడు. అందుకే తన బిడ్డలను చదివించి తన ఆశయం నెరవేర్చాలనుకున్నాడు. తీరా అక్కడకు వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడ యాంత్రిక జీవితం ఎలా ఉంటుందో అర్థమైంది.
తన జీవితమంతా తన బిడ్డల కోసం తాపత్రయపడ్డాడు. తన ఆరాటపోరాటాలు అన్నీ బిడ్డల కోసమే అన్నట్లు బ్రతికాడు. ఎవరైనా తమ బిడ్డల కోసమే ఆలోచిస్తారు. కాని తాము ఒకరికి బిడ్డలమన్న సంగతి మరచిపోతారు. అందుకే ఎందరో తల్లిదండ్రులు తనలాగే ఆలోచిస్తూ ఉంటారు. తన వంటి అభాగ్యుల జీవితాలు అన్ని ఉండి అల్లుడి నోట్లో శనిలా మిగిలిపోతున్నారని మదనపడతాడు.
ఒక రోజు ఈ ఆలోచనలతో సతమతమై బయటకి వచ్చాడు. ఒక ప్రక్క ఎండగా ఉన్నా నడుస్తూ చాలా దూరం సాగిపోయాడు. ఓపిక లేక ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ ఓ సంఘటన తన దృష్టిని ఆకర్షించింది. పల్లెటూరి వ్యక్తి తన ఇంటికి మట్టితో కప్పుతున్నాడు. ఎండకి వళ్ళంతా చెమటలు ధారాపాతంగా ఉన్నా పనిలో నిమగ్న మయ్యాడు.
తండ్రి వచ్చి కన్నప్రేమని చంపుకోలేక ఇంత ఎండలో ఎందుకంత శ్రమ కాస్త చల్లబడ్డాక పని చేయవచ్చు కదా అని బ్రతిమలాడుతాడు. కాస్తంత పనికోసం మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలా అయిపోతుందిలే అని తండ్రిమాట పెడచెవిని పెడతాడు కొడుకు. కొడుకు మాటకు కన్నప్రేగు అభిమానం దెబ్బతిన్నట్లుంది. కొంచెం సేపు చూసి తల పంకించి ఇంట్లోకి నడిచాడు తండ్రి.
మనవణ్ణి చంకనేసుకొని బయటకు వచ్చాడు. ఆ పిల్లవాణ్ణి ఎండలో వదిలేసి ఇంట్లోకి జారుకున్నాడు ముసలాడు. ఎండకి పిల్లవాడు కెవ్వుమన్నాడు. ఇది చూసి “ఇంట్లో వాళ్ళంతా ఎక్కడ సచ్చారు ?” అని పై నుంచి క్రిందకి దిగి వచ్చాడు ఆ కొడుకు.
“కాకిపిల్ల కాకికి ముద్దు” అయితే ఆ కాకి ఇంకొక కాకికి పిల్లేకదా ! ఈ సంగతి గుర్తించరెందుకో ఈ సంఘటన తండ్రీబిడ్డల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది గమనించిన తండ్రికి ఒక చక్కని ఉపదేశ వాక్యంగా నిలిచింది ఆ సంఘటన. ‘పోస్టు’ అన్న కేకతో బయటకి వచ్చాడు.
ఆ తండ్రికి పార్సిల్ ఇచ్చాడు పోస్టుమేన్. పార్సిల్ విప్పి చూసాడు. ఊతకర్ర. అమెరికన్ ఊతకర్ర అది. తాను మరిచిపోయిన పుట్టిన రోజుని గుర్తుచేస్తూ తనవాళ్ళు పంపిన చేతి కర్ర అది. ఆ కర్ర పట్టుకొని హుందాగా నడిచాడు ఆ తండ్రి. కేవలం అది కట్ట అయినా ఈ కట్టెను నడిపిస్తుంది అని ఆలోచనల్లో మునిగిపోయాడు. ఒక కన్నీటి బిందువు ఆ కట్టెపై పడింది.
కఠిన పదాలకు అర్ధాలు
స్మృతి = గుర్తు
ఆవేదన = బాధ, దుఃఖం
కనుకొలకులు = కంటి చివరి భాగాలు
కొట్టుమిట్టాడు = ఉక్కిరిబిక్కిరి
కూలిసేద్యం = కిరాయికి పనిచేయు
ఊతకర్ర = ఆధారం
జీవిత చరమాంకం = చివరిదశ
ఏటికి ఎదురీదు = అసాధ్యాన్ని సుసాధ్యం చేయుట
చుక్కెదురు = వ్యతిరేకం
ఆశ్వాసం = భాగం
ఊదరగొట్టు = గొప్పలు చెప్పుట
ఇమడలేక సర్దుకోలేక
శాఖోపశాఖలు = బాగా విస్తరించిన కొమ్మలు
అంకణం = రెండు దూలాల మధ్య భాగము
చోదకసవు = గడ్డితో కట్టిన (ఎండుగడ్డి)
ఊతకట్టె = చేతికర్ర