Students get through AP Inter 1st Year Botany Important Questions 9th Lesson కణం: జీవప్రమాణం which are most likely to be asked in the exam.
AP Inter 1st Year Botany Important Questions 9th Lesson కణం: జీవప్రమాణం
Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
వృక్షకణంలో రిక్తిక ప్రాముఖ్యం ఏమిటి? [AP M-16, 17, 22]
జవాబు:
- వృక్షకణాలలో రిక్తికలు ‘ద్రవాభిసరణ చర్యల నియంత్రణ’లో ముఖ్య పాత్ర వహిస్తాయి.
- కొన్ని మొక్కల కణాల రిక్తిక రసంలో మొక్క భాగాలకు రంగులనిచ్చే ఆంథోసయనిన్ లాంటి వర్ణ ద్రవ్యాలు ఉంటాయి.
ప్రశ్న 2.
70S, 80S రైబోసోమ్లో ‘S’ అంటే అర్థం ఏమిటి? [TS M-17,20]
జవాబు:
- ‘S’ అనగా స్వెడ్బర్గ్ ప్రమాణాలలో ఉన్న అవసాధన గుణకము (సెడిమెంటేషన్ కోఎఫిషియంట్)
- ఇది పరోక్షంగా రైబోజోమ్ యొక్క సాంద్రత మరియు పరిమాణము తెలిపే సాధనం.
ప్రశ్న 3.
హైడ్రోలైటిక్ ఎంజైమ్ల (జల విశ్లేషణ)తో నిండి ఉన్న త్వచయుత కణాంగాన్ని పేర్కొనండి. [TS M-15,22]
జవాబు:
లైసోసోమ్
ప్రశ్న 4.
వాయురిక్తికలు అంటే ఏమిటి? వాటి విధులు ఏమిటి?
జవాబు:
1. వాయురిక్తికలు: కణాలలో వాయువులతో నిండిన అంతరవేశనాలను వాయురిక్తికలు అంటారు. ఇవి స్తంభాకారంగా, చిన్నగా మరియు బోలుగా ఉన్న కణసంకలితాలు. ఇవి ‘ఊదా మరియు పచ్చని కిరణజన్య సంయోగక్రియ బాక్టీరియా’ యొక్క జీవపదార్ధంలో తేలియాడుతుంటాయి.
2. విధులు:
- కేంద్రకపూర్వ జీవులలో రిజర్వ్ పదార్థాలను నిల్వ చేస్తాయి.
- బాక్టీరీయాలు నీటి ఉపరితలం పై తేలటానికి సహాయపడతాయి.
ప్రశ్న 5.
పాలీసోమ్ల విధులు ఏమిటి? [TS M-19]
జవాబు:
పాలీసోవ్లోని రైబోసోమ్లు రాయబారి mRNA లోని సమాచారాన్ని ప్రోటీన్లుగా అనువదిస్తాయి.
ప్రశ్న 6.
మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ యొక్క లక్షణం ఏమిటి? [AP M-18]
జవాబు:
మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ ‘మధ్య భాగంలో సెంట్రోమియర్ ఉండటం వల్ల’ అది రెండు సమాన బాహువులను ఏర్పరుస్తుంది.
ప్రశ్న 7.
శాటిలైట్ క్రోమోసోమ్ అంటే ఏమిటి? [AP M-20] [AP,TS May-17]
జవాబు:
- కొన్ని క్రోమోసోమ్లలో ఉండే చిన్న ఖండికలాంటి నిర్మాణాన్ని ‘శాటిలైట్’ అంటారు. ఇది ప్రధాన క్రోమోసోమ్ నుండి ద్వితీయ కుంచనం ద్వారా వేరు చేయబడుతుంది.
- అటువంటి క్రోమోసోమ్లను ‘శాటిలైట్ క్రోమోసోమ్’లు అంటారు.
ప్రశ్న 8.
సూక్ష్మదేహాలంటే ఏవి? వాటిలో ఉన్న పదార్థాలేమిటి?
జవాబు:
సూక్ష్మదేహాలు: పెరాక్సీసోమ్స్ మరియు గై ఆక్సీసోమ్స్ లను సూక్ష్మ దేహలు అంటారు.
- పెరాక్సీసోమ్స్ ఫాటీ ఆమ్లాల విచ్ఛిన్న క్రియకు, కాంతి శ్వాసక్రియకు ఉపయోగపడే ఎన్ఎమ్లను కలిగి ఉంటాయి.
- గైఆక్సీసోమ్స్ నిల్వ ఉన్న లిపిడ్లను కార్బొహైడ్రేట్లుగా మార్చి వేసే గైఆక్సిలేట్ వలయానికి చెందిన ఎంజైమ్లు ఉంటాయి.
ప్రశ్న 9.
మధ్యపటలిక దేనితో ఏర్పడి ఉంటుంది? దాని విధులు ఏ విధంగా ముఖ్యమైనవి? [AP M-15]
జవాబు:
- మధ్య పటలిక కాల్షియం పెక్టేట్తో తయారవుతుంది.
- ఇది ప్రక్కనున్న ఇతర కణాలను బంధించి ఉంచుతుంది.
ప్రశ్న 10.
ద్రవాభిసరణ అంటే ఏమిటి?
జవాబు:
ద్రవాభిసరణ:అధిక గాఢత ప్రాంతం నుండి అల్పగాఢత ప్రాంతంకు పారగమ్య త్వచం ద్వారా అణువులు లేదా అయానులు లేదా నీరు ప్రయాణించు ప్రక్రియను ద్రవాభిసరణ అంటారు.
ప్రశ్న 11.
గ్రామ్ అభిరంజన పద్ధతికి బాక్టీరియమ్ కణంలోని ఏ భాగం గురి అవుతుంది
జవాబు:
కణత్వచభాగం
ప్రశ్న 12.
ఈ కింది వాటిలో ఏవి సరైనవి కావు? [IPE Mar-14]
a) రాబర్ట్ బ్రౌన్ కణాన్ని కనుక్కొన్నారు
b) ప్లీడన్, ష్వాన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
c) కొత్త కణాలు అంతకుముందు ఉన్న కణాల నుంచి (pre-existing cells) ఏర్పడతాయని విర్షా వివరించారు.
d) ఏకకణజీవి జీవ చర్యలన్నింటిని కణం లోపలే నిర్వహిస్తుంది.
జవాబు:
(a) సరియైనది కాదు [కణంను రాబర్ట్ హుక్ కనుగొన్నాడు]
ప్రశ్న 13.
కొత్త కణాలు దీని నుంచి ఉత్పత్తి అవుతాయి.
a) బాక్టీరియల్ కిణ్వనం
b) పాత కణాల పునరుత్పత్తి
c) అంతకుముందు ఉన్న కణాలు (pre-existing cells)
d) నిర్జీవ పదార్థాలు
జవాబు:
c) అంతకుముందు ఉన్న కణాలు
ప్రశ్న 14.
కింది వాటిని జతపరచండి.
i) క్రిస్టే – a) ఆవర్ణికలోని చదునైన త్వచయుత కోశాలు
ii) సిస్టిర్నే – b) మైటోకాండ్రియాలోని అంతర్వలనాలు
iii) థైలకాయిడ్లు – c) గాల్జీ పరికరంలోని బిళ్లల వంటి కోశాలు
జవాబు:
a) ii
b) iii
c) i
ప్రశ్న 15.
ఈ క్రింది వానిలో సరియైనది. [AP M-19]
a) జీవరాశుల కణాలన్నింటిలో కేంద్రకం ఉంటుంది.
b) వృక్ష, జంతు కణాలు రెండింటిలో స్పష్టమైన కణకవచం ఉంటుంది.
c) కేంద్రక పూర్వ జీవులలో త్వచంతో ఆవరించబడిన కణాంగాలు ఉండవు sid) నిర్జీవ పదార్థాల నుంచి (denovo) నవజాతంగా కణాలు ఏర్పడతాయి
జవాబు:
(c) సరియైనది.
Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
పత్రహరితాన్ని కలిగిన కణాంగాన్ని వర్ణించండి. [TS M-16,22]
జవాబు:
- పత్రహరితాన్ని కలిగిన కణాంగం ‘హరితరేణువు’
- ఇది రెండు పొరలచే ఆవరించబడి ఉంటుంది.
- లోపలి పొరచేత ఆవరించబడి ఉన్న ప్రదేశమును ‘ఆవర్ణిక’ లేదా ‘స్ట్రోమా’ అంటారు.
- ఆవర్ణికలో ఉన్న అనేక చదునైన త్వచయుత కోశాలను ‘థైలకాయిడ్స్’ అంటారు.
- థైలకాయిడ్స్ నాణాల రూపంలో ఒకదానిపై మరొకటి దొంతరల వలే అమరి ఉంటాయి. వీటినే ‘గ్రానా’ లేదా ‘పటలికారాశులు’ అంటారు.
- అనేక చదునైన త్వచయుత నాళికలు ఆవర్ణికలో ఉన్న పటలికారాశులను కలుపుతూ ఉంటాయి. వీటినే ‘ఆవర్ణికా పటలికలు’ అంటారు.
- థైలకాయిడ్ లోపలి ప్రదేశాన్ని ‘ఆవకాశిక’ అంటారు.
- హరితరేణువు ఆవర్ణికలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ల సంశ్లేషణకు సంబంధించిన ఎంజైములు ఉంటాయి.
- హరితరేణువులో చిన్న వృత్తాకార, ద్విపోచయుత DNA, రైబోసోమ్లు ఉంటాయి.
- థైలకాయిడ్లో కిరణజన్య సంశ్లేషక వర్ణ ద్రవ్యాలు ఉంటాయి.
విధి: హరితరేణువుల ముఖ్యమైన విధి కిరణజన్యసంయోగక్రియ.
ప్రశ్న 2.
కణశక్త్యాగారాల నిర్మాణం, విధులను వివరించండి. [TS M-17]
జవాబు:
- ‘మైటోకాండ్రియా’ను కణ శక్త్యాగారం అని అంటారు.
- ఇది రెండు పొరలచే ఆవరించబడి ఉంటుంది.
- మైటోకాండ్రియా చిన్న గొట్టాలుగా లేదా స్థూపాకారంగా కన్పిస్తుంది.
- అంతరపొర దానిలోపలి అవకాశికను రెండు స్పష్టమైన ప్రదేశాలుగా విభజిస్తుంది.
- లోపలి గదిని ‘మాత్రిక’ అంటారు.
- మాత్రికలో ఒక వృత్తాకార DNA అణువు, 70S రకం రైబోసోమ్ మరియు RNA ఉంటాయి.
- బాహ్యపొర అవిచ్ఛిన్నంగా ఈ కణాంగానికి హద్దుగా ఉంటుంది.
- లోపలి పొర మాత్రికలోనికి అసంఖ్యాక ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు.
- క్రిస్టేల వల్ల ఉపరితల వైశాల్యం పెరుగుతుంది.
- రెండు పొరలలో, వాటి యొక్క ప్రత్యేక విధులను నిర్వర్తించే విశిష్ట ఎంజైములు ఉంటాయి.
విధులు:
- మైటోకాండ్రియా యొక్క ప్రధాన విధి వాయు సహిత శ్వాసక్రియను జరుపుట.
- ఇవి ATP రూపంలో కణశక్తిని ఉత్పత్తి చేస్తాయి.
- కాబట్టి వీటిని “కణ శక్త్యాగారాలు” అంటారు.
ప్రశ్న 3.
సెంట్రియోల్ యొక్క బండి చక్రం నిర్మాణంపై వాఖ్యానించండి.
జవాబు:
- ‘సెంట్రియోల్స్’ అనే రెండు స్థూపాకార నిర్మాణాలు సెంట్రోసోమ్ అనే కణాంగంలో ఉంటాయి.
- ఇవి రూపరహిత పెరిసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి.
- రెండు సెంట్రియోల్లు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి.
- ప్రతి సెంట్రియోల్ ‘బండి చక్రంలాంటి నిర్మాణాన్ని’ కలిగి ఉంటుంది.
- ఇందులో సమదూరం గల ట్యుబ్యులిన్చే నిర్మించబడిన ‘తొమ్మిది పరధీయ పోచలు’ ఉంటాయి.
- ప్రతి పరధీయ పోచలో త్రికము అనబడే మూడు సూక్ష్మనాళికలు ఉంటాయి
- ప్రక్క ప్రక్కనున్న పరధీయ పోచల త్రికాలు కలుపబడి ఉంటాయి.
- సెంట్రియోల్ కేంద్రభాగం ప్రోటీన్ పదార్థంచే నిర్మితమై ‘హబ్’గా పిలువబడుతుంది.
- హబ్ భాగం ప్రోటీన్ యుతమైన వ్యాసార్థ పోచలతో పరధీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది.
- ఈ సెంట్రియోల్స్ శైలికలు లేదా కశాభాలను మరియు కండె పోగులను ఏర్పరుస్తాయి.
- కణవిభజన సమయంలో జంతుకణాలు కండె పోగుల నుండి కండె పరికరములను ఉత్పత్తి చేస్తాయి.
ప్రశ్న 4.
కణసిద్ధాంతంను సంగ్రహంగా వర్ణించండి. [AP M-22]
జవాబు:
ప్లీడన్ అను జర్మన్ వృక్ష శాస్త్రజ్ఞుడు మరియు ష్వాన్ అను బ్రిటీష్ జంతు శాస్త్రజ్ఞుడు కలిసి ‘కణ సిద్ధాంతం’ను ప్రతిపాదించారు.
కణసిద్ధాంత ప్రతిపాదనలు:
- అన్ని సజీవులు ‘కణాలు మరియు కణ ఉత్పత్తులతో నిర్మించబడి’ ఉంటాయి.
- అన్ని జీవులకు ‘కణం’ ఒక నిర్మాణాత్మక మరియు ‘క్రియాత్మకమైన ప్రమాణం’.
- అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి పుడతాయి.
ప్రశ్న 5.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం (RER) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం (SER) ల మధ్యగల భేదాల్ని తెలపండి. [AP M-17]
జవాబు:
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం (RER)
- అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపైన రైబోసోమ్లు అతుక్కొని వుంటే దానిని ‘గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం’ అంటారు.
- ప్రోటీన్ల నిర్మాణం, స్రావక్రియలు చురుకుగా జరుగుతున్న కణాలలో RER కనిపిస్తుంది.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం (SER)
- అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపైన రైబోసోమ్లు లేకపోతే దానిని ‘నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం’ అంటారు.
- లిపిడ్ సంశ్లేషణకు, లిపిడ్ంటి స్టెరాయిడ్ హార్మోనుల ఉత్పత్తి లో SER కనిపిస్తుంది.
ప్రశ్న 6.
ప్లాస్మాపొర జీవ రసాయనిక నిర్మాణాన్ని తెలపండి. పొర లోపల లిపిడ్ అణువుల అమరిక ఎలా ఉంటుంది?
జవాబు:
- ప్లాస్మాపొర (కణత్వచం) ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లతో నిర్మితమై ఉంటుంది.
- కణత్వచం రెండు వరుసల లిపిడ్ అణువులతో ఏర్పడి ఉంటుంది.
- పొర లోపల లిపిడ్ అణువులు ధృవ (జలాకర్షక) శీర్షాలు వెలుపలి వైపునకు మరియు అధ్రువ (జలవికర్షక)తోక లోపలివైపుకు ఉంటాయి.
- ఈ అమరిక వలన అధృవ సంతృప్త హైడ్రోకార్బన్ తోకలు. జల వాతావరణం నుంచి రక్షింపబడతాయి.
- కణత్వచం యొక్క ప్లూయిడ్ మొజాయిక్ నమూనాను సింగర్ మరియు నికల్సన్లు ప్రతిపాదించారు.
- ఇది స్వర్వత్రా ఆమోదించబడిన నమూనా. దీని ప్రకారం అర్ధ ద్రవ స్థితిలో ఉన్న లిపిడ్ పొర, ప్రొటీన్ అణువుల పార్శ్వ కదలికలకు వీలు కలిగిస్తుంది.
ప్రశ్న 7.
కేంద్రకం నిర్మాణాన్ని వివరించండి. [TS M-15,19]
జవాబు:
కేంద్రక నిర్మాణం: కేంద్రకం ప్రధానంగా నాలుగు భాగాలను కల్గి ఉంటుంది.
I. కేంద్రక త్వచం: ఇది రెండు సమాంతర పొరలను కేంద్రక పదార్థం మట్టు ఆచ్ఛాదనగా ఏర్పరుస్తుంది.
- వెలుపలి పొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, కై బోసోమ్లను కల్గి ఉంటుంది.
- కేంద్రక త్వచాలపైన సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వీటిని కేంద్రక త్వచయుత రంధ్రాలు అని అంటారు.
II. కేంద్రక మాత్రిక లేదా న్యూక్లియోప్లాసం: ఇది కేంద్రకంలో నిండి ఉన్న చిక్కని సమజాతీయ ద్రవ పదార్థం. దీనిలో గ్లైకోప్రొటీన్లు, రైబోన్యూక్లియోప్రొటీన్లు, జల విశ్లేషక ఎంజైమ్లు, DNA, RNA మరియు పాలిమరేజ్లు ఉంటాయి.
III. క్రొమాటిన్ పదార్థం: కేంద్రక రసంలో గాఢవర్ణం కల్గి, చిక్కుపడి ఉన్న దారాల వంటి నిర్మాణాన్ని క్రొమాటిన్ పదార్థం అని అంటారు. దీనిలో DNA మరియు హిస్టోన్ ప్రోటీన్లు ఉంటాయి.
IV. కేంద్రకాంశం: కేంద్రక రసంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉండే గుండ్రటి నిర్మాణాలను కేంద్రకాంశం అని అంటారు.
ప్రశ్న 8.
సెంట్రోమియర్ స్థానం ఆధారంగా క్రోమోసోమ్ల రకాలను గురించి క్లుప్తంగా వ్రాయండి. [TS M-16,18,20]
జవాబు:
సెంట్రోమియర్ ఉన్న స్థానాన్ని బట్టి క్రోమోసోమ్లను నాలుగు రకాలుగా విభజించారు.
- మెటాసెంట్రిక్: ఇందులో సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉంటుంది. ఇది ‘V’ ఆకారంలో ఉండి రెండు సమాన బాహువులను కలిగి ఉంటుంది.
- సబ్-మెటా సెంట్రిక్ : ఇందులో సెంట్రోమియర్ క్రోమోజోమ్ మధ్యలో కాకుండా కొంచెం ప్రక్కగా ఉంటుంది. ఇది ‘L’ ఆకారంలో ఉండి రెండు సమాన బాహువులను కలిగి ఉంటుంది.
- ఎక్రోసెంట్రిక్: ఇందులో సెంట్రోమియర్ క్రోమోజోమ్ ఒక వైపుగా ఉంటుంది. ఇది ‘J’ ఆకారంలో ఉండి, ఒక పొడవు మరియు పొట్టి బాహువులను కలిగి ఉంటుంది.
- టీలోసెంట్రిక్: ఇందులో సెంట్రోమియర్ క్రోమోజోమ్ చివరగా కొనలో ఉంటుంది. ఇది ‘I’ ఆకారంలో ఉండి ఒక బాహువుని మాత్రమే కలిగి ఉంటుంది.
ప్రశ్న 9.
కణ అస్థిపంజరం అనగా నేమి? అది చేసే పనులేమిటి? [AP M-20]
జవాబు:
- కణద్రవ్యంలో ప్రోటీన్యుత నిర్మితాలైన తంతురూప వల లాంటి ఆకారాలను సమిష్టిగా ‘కణ అస్థిపంజరము’ అంటారు.
- ఇది సూక్ష్మ తంతువులు, మధ్యస్థ తంతువులు మరియు సూక్ష్మనాళికలు అనబడే మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది.
- కణ అస్థిపంజరం విధులు: యాంత్రిక ఆధారం, కణరూపాన్ని నిలపడం, కణచలనం, కణాంతర్గ రవాణా, కణం వెలుపలికి సంకేతాలు పంపడం, కేంద్రక విభజన .
ప్రశ్న 10.
అంతరత్వచ వ్యవస్థ అనగానేమి? ఏ కణాంగాలు దీనిలో భాగం కాదు? ఎందుకు?
జవాబు:
- కణంలో ఉన్నటువంటి త్వచయుత కణంగాలు నిర్మాణం మరియు విధులలో భిన్నంగా ఉంటాయి.
- వాటి యొక్క విధుల మధ్య అనుసంధానం ఆధారంగా వీటన్నింటిని కలిపి ‘అంతరత్వచ’ వ్యవస్థగా పేర్కొంటారు.
- అంతరత్వచ వ్యవస్థ అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జి సంక్లిష్టం, లైసోజోమ్లు మరియు రిక్తికలను కలిగి ఉంటుంది.
- మైటో కాండ్రియా, హరితరేణువులు మరియు పెరాక్సిసోమ్ల విధులు అనుసంధానింపబడవు.
- కావున వీటిని అంతరత్వచ వ్యవస్థ యొక్క భాగాలుగా పేర్కొన్నారు.
ప్రశ్న 11.
సక్రియ రవాణా మరియు నిష్క్రియా రవాణాల మధ్య తేడాను గుర్తించండి.
జవాబు:
సక్రియ రవాణా
- అయానులు(లేదా) అణువులు త్వచం ద్వారా జీవక్రియా శక్తిని వినియోగించుకుంటూ వాహక ప్రోటీనుల ద్వారా రవాణా అగుప్రక్రియను ‘సక్రియ రవాణా’ అంటారు.
- ఇది గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా తక్కువ గాఢత నుండి అధిక గాఢతకు జరుగుతుంది.
- ఈ ప్రక్రియ లో జీవక్రియాశక్తి అయిన ATP వినియోగించుకోబడుతుంది.
నిష్క్రియా రవాణా
- అయానులు లేదా అణువులు త్వచం ద్వారా ఎటువంటి జీవక్రియాశక్తి అవసరం లేకుండా రవాణా అగు ప్రక్రియను ‘నిష్క్రియా రవాణా’ అంటారు.
- ఇది గాఢతా ప్రవణతకు అనుకూలంగా అధిక గాఢత నుండి తక్కువగా గాఢతకు జరుగుతుంది.
- ఈ ప్రక్రియ లో ఎటువంటి శక్తి వినియోగించుకోబడదు.
ప్రశ్న 12.
న్యూక్లియోసోమ్లు అంటే ఏమిటి? అవి దేనితో చేయబడతాయి? [AP,TS May-17][APM-16,19]
జవాబు:
- క్రొమాటిన్ మీద ఉన్న పూసల వంటి నిర్మాణాలను న్యూక్లియోసోమ్స్ అంటారు.
- న్యూక్లియోసోమ్ నిజకేంద్రక క్రోమోజోమ్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. అది హిస్టోన్ కోర్లచే చుట్టి ఉన్న ఒక DNA పొడవును కల్గి ఉంటుంది.
- దీనిలో 200 క్షారజతల (bp) పొడవున్న ద్విసర్విల DNA అణువు కోర్ను చుట్టి (2 చుట్లు) ఉంటుంది.
- కోర్ భాగం ఎనిమిది హిస్టోన్ అణువులతో ఏర్పడి ఉంటుంది. ఇవి ఒక్కోక్కటి రెండు నకళ్లుగా ఉండే నాలుగు రకాల హిస్టోన్ ప్రోటీన్లతో ఉంటాయి.
అవి H2A, H2B, H3, H4.
ప్రశ్న 14.
కేంద్రక పూర్వకణం యొక్క లక్షణాలు తెలపండి. [AP M-18]
జవాబు:
- కేంద్రక పూర్వ కణాలు అతి పురాతనమైన కణాలు. అవన్నీ కణకవచాన్ని కలిగి ఉంటాయి.
- వీటిలో నిర్ధిష్టమైన కేంద్రకం ఉండదు. కావున కేంద్రక త్వచం కూడా ఉండదు.
- ఇవి సూక్ష్మ పరిమాణం కలిగి, వేగంగా అభివృద్ధి చెందుతూ ఆకారాలలో, పరిమాణంలో చాలా వైవిధ్యతను చూపిస్తాయి.
- ఇవి వివిధ ఆకృతులను కల్గి విభిన్న విధులను నిర్వర్తించినప్పటికీ మౌలికంగా ఒకేలాగ ఉంటాయి.
- కణం ‘కణద్రవ్య మాత్రిక’తో నిండి ఉంటుంది.
- జన్యు పదార్థం నగ్నంగా, ఏకపోచయుత DNA లేదా వృత్తాకార DNA గా ఉంటుంది.
- చిన్న వృత్తాకార DNAను ‘ప్లాస్మిడ్’ అంటారు. ఇది జీనోమ్క వెలుపల ఉంటుంది.
- ఒక రైబోసోమ్లో తప్ప నిజకేంద్రక జీవులలో ఉండే కణాంగాలు ఏమీ ఉండవు.
- ముడతల రూపంలో ఉండే ప్లాస్మత్వచం మీసోసోమ్ ఉంటుంది.
- బాక్టీరియాలు, నీలి హరిత శైవలాలు, మైకోప్లాస్మా, ప్లూరోనిమోనియాలాంటి జీవులు కేంద్రక పూర్వకణ నిర్మాణంను చూపుతాయి.
ప్రశ్న 15.
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో ఈ కింది శాస్త్రజ్ఞుల పాత్ర గురించి సంగ్రహంగా వివరించండి.
a) రూడాల్ఫ్ విర్షా
b) ప్లీడన్, ష్వాన్
జవాబు:
a.రూడాల్ఫ్ విర్షా :
1. రుడాల్ఫ్ విర్షా అనే శాస్త్రవేత్త కొత్త కణాలు ఏర్పడే విధానం పూర్వపు కణాల ద్వారా జరుగుతుంది అని తెలియజేశాడు. ఇతడు ప్లీడన్ మరియు ష్వాన్ల పరికల్పనలకు రూపాంతరం చేసి కణ సిద్ధాంతానికి పరిపూర్ణత కల్పించాడు.
2. R- విర్షా కణసిద్ధాంత ప్రతిపాదనలు:
- అన్ని జీవులు కణాల మరియు కణసంకలితాలతో ఏర్పడతాయి
- అన్ని కణాలు పూర్వపు కణం నుండి ఏర్పడతాయి.
b. ప్లీడన్ మరియు ష్వాన్:
- ప్లీడన్ ఒక జర్మన్ వృక్షశాస్త్రవేత్త. ఇతడు అనేక రకాల మొక్కలను గురించి పరిశోధనలు చేశాడు.
- “అన్ని మొక్కలు వివిధ రకాల కణాలతో నిర్మితమవుతాయి. ఈ కణాలు అన్ని మొక్కలోని కణజాలలను ఏర్పరుస్తాయి” అని ఇతడు తెలియజేశాడు..
- ష్వాన్ ఒక బ్రిటిష్ జంతు శాస్త్రవేత్త . అతడు వివిధ రకాల జంతుకణాలను అధ్యయనం చేశాడు.
- కణాలు పలుచని పొరలను కలిగి ఉంటాయని ఈయన గుర్తించాడు. దీనినే ‘ప్లాస్మాత్వచం’ అంటారు.
- దీని ఆధారంగా ష్వాన్ కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం వృక్ష మరియు జంతుదేహాలు కణాలు మరియు కణసంకలితాలతో ఏర్పడతాయి..
- ప్లీడన్ యొక్క వృక్ష కణజాలాల అధ్యయనాల ఆధారంగా, ‘కణకవచం ఉండటం’ అనేది వృక్ష కణాల యొక్క ప్రత్యేక లక్షణం అని నిర్ధారించాడు.
Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ఒక కణం సజీవకణంగా పిలువబడడానికి దానిలో ఏ నిర్మాణాత్మక, క్రియాత్మక గుణాలు ఉండాలి?
జవాబు:
- ‘కణం’ జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం.
- కేంద్రకం కలిగిన కణాన్ని ‘జీవకణం’ అంటారు. కేంద్రకం లేనటువంటి కణాన్ని ‘జీవంలేని’ లేదా చనిపోయిన కణం అంటారు.
- ‘కేంద్రకం’ కణం యొక్క ‘కణమెదడు’. ఇది అన్ని కణాంగాల విధులను నియంత్రిస్తుంది.
- కేంద్రకంలోని క్రోమోసోమ్లు జన్యువులను కలిగి ఉంటాయి. కావున కేంద్రకం అనువంశికతలో పాల్గొంటుంది.
- ‘కేంద్రకం’ ఏకకణ జీవులలో కణవిభజన మరియు ప్రత్యుత్పత్తిలో ముఖ్యపాత్రను పోషిస్తుంది.
- కణం యొక్క ద్రవయుత మాత్రికను కణజీవపదార్ధం అంటారు. జీవకణం యొక్క జీవపదార్ధంలో అనేక జీవక్రియలు జరుగుతాయి.
- కణాలు శక్తినిత్యత్వనియమాలను పాటిస్తాయి. కావున అవి శక్తిని బదిలీ చేస్తాయి.
- కణం స్వయం ప్రతిపత్తిని కలిగిన కేంద్రకామ్లాలను, రైబోసోమ్లను కలిగి ఉంటుంది.
- కణం యొక్క ద్రవాభిసరణత ‘రిక్తికలు మరియు నాళికల ద్వారా’ నియంత్రించబడుతుంది.
- గ్లైకోప్రోటీన్ల ద్వారా కణాలు సమాచారాన్ని చేరవేస్తాయి.
- కణాలు సైక్లోసిస్ ద్వారా యానిమేషన్ ను చూపుతాయి.
- కణాలు పెరిగి, విభజన చెంది, విభేదించబడి చివరికి చనిపోతాయి.
ప్రశ్న 2.
నిజకేంద్రక కణాలలోని కణాంగాలుa) త్వచంతో చుట్టబడి ఉండవు b) ఒకే త్వచంతో చుట్టబడి ఉంటాయి c) రెండు త్వచాలతో చుట్టబడి ఉంటాయి.
కణంలోని విభిన్న కణాంగాలను పై మూడు వర్గములలో చేర్చండి.
జవాబు:
a) త్వచంతో చుట్టబడి ఉండని కణాంగాలు : రైబోసోమ్స్, న్యూక్లియోలస్.
b) ఒకే త్వచంతో చుట్టబడి ఉండే కణాంగాలు: లైసోజోమ్లు రిక్తికలు, సూక్ష్మదేహాలు .
c) రెండు త్వచాలతో ఆవరించబడి ఉండే కణాంగాలు: మైటోకాండ్రియా, హరితరేణువు, కేంద్రకం, ER, గాల్జీ సంక్లిష్టం.
ప్రశ్న 3.
కేంద్రకం లోపలి జన్యు పదార్థం ప్రతి ఒక జాతికి స్థిరంగా ఉంటుంది. కాని క్రోమోసోమేతర DNA జనాభాలోని విభిన్న జీవుల మధ్య వైవిధ్యంగా ఉంటుంది. వివరించండి.
జవాబు:
- జీవకణంలోని క్రోమోజోమ్లో ఉన్న ఏకస్థితిక జన్యువుల మొత్తాన్ని ‘జీనోమ్’ అంటారు.
- ఇది ‘ఒక జాతి యొక్క క్రోమోజోమ్ల సంఖ్య స్థిరంగా ఉంటే, వాటి కేంద్రక జన్యుపదార్థం లేదా జీనోమ్ అనేది స్ధిరంగా ఉంటుంది’ అని తెలియజేస్తుంది.
- మైటోకాండ్రియా, హరితరేణువులలో ఉన్న DNA ను అదనపు క్రోమోజోమ్ల DNA అంటారు.
- ఇవి ఈ అదనపు DNA ద్వారా స్వయం ప్రతిపత్తిని జరుపుకుంటాయి.
- ఒకే జాతి జీవులలో ఈ అదనపు క్రోమెజోమ్ల DNA వేరు వేరుగా ఉంటుంది.
- కొన్ని బాక్టీరియాలలో ఈ అదనపు క్రోమోజోమ్ల DNA అనేది ప్లాస్మిడ్ల రూపంలో ఉంటుంది.
- జీవపదార్ధంలో ఇవి స్వతంత్రంగా జీవించగలవు.
- ఈ ప్లాస్మిడ్లు బాక్టీరీయా నిరోధక మందుల తయారీలో వినియోగిస్తున్నారు.
ప్రశ్న 4.
“మైటోకాండ్రియాలు కణశక్త్యాగారాలు” దీన్ని సమర్థించండి. [AP M-15] [TS M-22]
జవాబు:
- మైటోకాండ్రియా అనేది నిజకేంద్రక జీవుల కణాల యొక్క కణాంగం.
- ప్రతి మైటోకాండ్రియా రెండు త్వచాలతో ఆవరించబడి ఉంటుంది.
- బాహ్యత్వచం అవిచ్ఛిన్నంగా, మైటోకాండ్రియా యొక్క నియంత్రణ త్వచం లేదా హద్దు పొరగా ఉంటుంది.
- అంతర త్వచం అనేక సంఖ్యలో ముడతలను కలిగి ఉంటుంది. వీటిని ‘క్రిస్టే’ అంటారు.
- ‘క్రిస్టే’ లో వృంతయుత రేణువులు Fo మరియు F1 లు ఉంటాయి.
- లోపలి పొర ‘మాత్రిక’ తో నిండి ఉంటుంది.
- మాత్రికలో ఒక వృత్తాకార DNA అణువు, కొన్ని RNA అణువులు మరియు 70S రకం రైబోసోమ్లు ఉంటాయి.
- మాత్రిక ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడే గదులను కలిగి ఉంటుంది.
- క్రెబ్స్ వలయం క్రిస్టేలో మరియు ఎలక్ట్రాన్ల రవాణా మాత్రికలో జరుగుతాయి.
- మైటోకాండ్రియా ‘కణాంతర వాయుసహిత శ్వాసక్రియ’లో పాల్గొంటుంది.
- ఈ ప్రక్రియ వలన ఆహార పదర్థాల ఆక్సీకరణ జరిగి శక్తి విడుదలవుతుంది.
- స్ధితిజ శక్తి, గతిజశక్తిగా మారి ATP రూపంలో నిల్వ ఉంటుంది.
- మైటోకాండ్రియా శక్తిని ATPరూపంలో (ఎడినోసన్ ట్రై ఫాస్ఫేట్) తయారు చేస్తుంది. కావున వీటిని కణం యొక్క ‘కణశక్త్యాగారాలు’ అంటారు.
ప్రశ్న 5.
జాతి విశిష్టమైన లేదా ప్రాంత విశిష్టమైన ప్లాస్టిడ్ రకాలున్నాయా? వీటిలో, ఒకదానిని మరొక దాని నుంచి గుర్తించడమెలా?
జవాబు:
ప్లాస్టిడ్లు కొన్ని ప్రత్యేక వర్ణ ద్రవ్యాలను కలిగి ఉంటాయి. ఈ వర్ణాలు మొక్కలలోని వివిధ భాగాలలో ప్రత్యేక రంగులను ఏర్పరుస్తాయి.
ఈ వర్ణ ద్రవ్యాల ఆధారంగా ప్లాస్టిడ్లను మూడు రకాలుగా వర్గీకరించారు. :
- హరితరేణువులు
- క్రోమోప్లాస్ట్లు (వర్ణరేణువులు)
- ల్యూకో ప్లాస్ట్లు (శ్వేతరేణువులు)
1. హరితరేణువులు: ఇవి ఆకుపచ్చని ప్లాస్టిడ్లు. ఇవి కిరణజన్య సంయోగక్రియ ఆహార పదార్థాల సంశ్లేషణకు సహయపడతాయి.ఇది పత్రహరితం మరియు కెరోటినాయిడ్ వర్ణ ద్రవ్యాలను కలిగి ఉంటుంది. ఇవికాంతి శక్తిని శోషణ చేస్తాయి.
2. క్రోమోప్లాస్ట్లు (వర్ణరేణువులు): ఇవి వర్ణయుత ప్లాస్టిడ్లు. ఇవి పసుపు, నారింజ లేదా ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. కొవ్వులను కరిగించే కెరోటిన్ మరియు నారింజ లేదా ఎరుపు, పసుపు రంగులను కలిగించే జాంతోఫిల్ వర్ణద్రవ్యాలను కలిగి ఉంటాయి.
3. ల్యూకోప్లాస్ట్లు : ఇవి వర్ణరహిత ప్లాస్టిడ్లు. ఆకారం మరియు పరిమాణంలో తేడాను కలిగి పోషకాలను నిల్వ చేస్తాయి. నిల్వ పదార్ధం ఆధారంగా ఇవి మూడు రకాలు. అమైలో ప్లాస్ట్లు (పిండి నిల్వలు), క్లయోప్లాస్ట్లు (నూనె నిల్వలు), అలెరియోప్లాస్ట్లు (ప్రోటీన్ నిల్వలు).
ప్రశ్న 6.
ఈ కింది వాని విధులను వివరించండి.
a) సెంట్రోమియర్ b) కణకవచం c) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం d) గాల్జీ పరికరం e) సెంట్రియోల్లు
జవాబు:
a. సెంట్రోమియర్ యొక్క విధులు: ప్రతి క్రోమోజోమ్ ఒక ప్రాధమిక కుంచనంను కలిగి ఉంటుంది. దానినే సెంట్రోమియర్ అంటారు. ఈ సెంట్రోమియర్ క్రోమోజోమ్ను రెండు సమాన (లేకా) అసమాన భాగాలుగా దాని స్ధానం ఆధారంగా విభజిస్తుంది. సెంట్రోమియర్ రెండు వైపులా రెండు బిళ్లల వంటి నిర్మాణాలుంటాయి. వీటిని ‘కైనిటోకోర్లు’ అంటారు. ఇవి కణవిభజనలో పిల్ల క్రోమోజోమ్లు ఏర్పడుటకు సహాయపడతాయి.
b. కణకవచం విధులు : కణకవచం కణంకు ఒక రూపాన్ని ఇస్తుంది. యాంత్రిక నష్టాలనుంచి కాపాడుతుంది. పారాగమ్యతను కలిగి ఉండి పదార్థాలను వెలుపలికి మరియు బయటికి వెళ్ళనిస్తుంది.
c. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం విధి: ఇది లిపిడ్ల సంశ్లేషణ చేస్తుంది. జంతుకణంలో లిపిడ్లు లాంటి ‘స్టిరాయిడ్’ హార్మోనులను సంశ్లేషణం చేస్తుంది.
d. గాల్జిపరికరం విధులు:
- కణ పదార్థాలను కణంలోని విభిన్న గమ్యస్థానాలకు చేర్చడానికి ప్యాకేజింగ్ లేదా కణం వెలుపలికి స్రవించడం అనేవి గాల్జీ సంక్లిష్టం ప్రధానంగా నిర్వర్తించే విధి.
- ఇది కణకవచ పదార్థాల నిర్మాణం మరియు కణవిభజన సమయంలో కణఫలకం ఏర్పాటులో పాల్గొంటుంది.
- ఇది గ్లైకోలిపిడ్లు మరియు గ్లైకోప్రోటీన్లు తయారుచేసే ముఖ్యకేంద్రంగా ఉంటుంది.
- అంతర్జీవ ద్రవ్యజాలం పై ఉన్న రైబోసోమ్ల నుంచి సంశ్లేషించబడే ప్రోటీన్లు, గాల్జీ పరికరం యొక్క సిస్టర్నేలలో
రూపాంతరం చెంది విడుదలవుతాయి.
e. సెంట్రియోల్ విధులు : శైలికలు (లేదా) కశాభాల, ఆధారకణికలను ఏర్పరుస్తాయి. కణవిభజనలో కండెపోగులను ఏర్పరచి వాటి ద్వారా కండె పరికరమును ఏర్పరుస్తాయి.
ప్రశ్న 7.
విభిన్న రకాల ప్లాస్టిడ్లు ఒక రూపం నుంచి వేరొక రూపంలోకి మార్పు చెందగలవా? అయితే ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
- అవును, ప్లాస్టిడ్లు ఒక రూపం నుండి వేరొక రూపంలోకి మారగలవు.
- ప్లాస్టిడ్లు పెరుగుదల దశలలో ఒక వర్ణకం నుండి వేరొక వర్ణకంనకు మారుతుంటాయి.
- ఉదా: బంగాళదుంపలను గాలిలో ఉంచినపుడు ల్యూకోప్లాస్ట్లు క్లోరోప్లాస్ట్లుగా మారతాయి.
- టమాట మరియు పచ్చిమిర్చి ల అండాశయాలు మొదట ల్యూకోప్లాస్ట్లను కలిగి తరువాత క్లోరోప్లాస్ట్లుగా మారతాయి.
- ఫలదీకరణం తరువాత మరియు పక్వదశలో, క్లోరోప్లాస్ట్లు (హరితరేణువులు) క్రోమోప్లాస్ట్లుగా మారతాయి.
ప్రశ్న 9.
సెంట్రోమియర్ అనగా నేమి? క్రోమోజోమ్ వర్గీకరణలో సెంట్రోమియర్ స్థానం ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. విభిన్న రకాల క్రోమోజోమ్లలో సెంట్రోమియర్ స్థానాలను చూపే పటం గీసి వివరించండి.
జవాబు:
సెంట్రోమియర్ క్రోమోజోమ్లో రెండు క్రోమాటిడ్లు అతికి ఉండే భాగం. దీనిచుట్టూ ప్రత్యేక ప్రోటీనులు ఆవరించి ఉండి రెండు బిళ్లల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి. వీటిని ‘కైనిటోకోర్లు’ అంటారు ప్రతిక్రోమోజోమ్ సెంట్రోమియర్లను ఒక ప్రత్యేక స్థానంలో కలిగి ఉంటుంది. సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి క్రోమోజోమ్లు 4 రకాలు
1. మెటాసెంట్రిక్: సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉంటుంది. ఇది ‘V’ ఆకారంలో ఉండి రెండు
సమాన బాహువులను కలిగి ఉంటుంది.
2. సబ్-మెటా సెంట్రిక్: సెంట్రోమియర్ క్రోమోజోమ్ మధ్యలో కాకుండా కొంచె ప్రక్కగా ఉంటుంది.
ఇది ‘L’ ఆకారంలో ఉండి రెండు సమాన బాహువులను కలిగి ఉంటుంది.
3. ఎక్రోసెంట్రిక్: సెంట్రోమియర్ క్రోమోజోమ్ ఒక వైపుగా ఉంటుంది. ఇది ‘J’ ఆకారంలో ఉండి, ఒక పొడవు మరియు పొట్టి బాహువులను కలిగి ఉంటుంది.
4. టీలోసెంట్రిక్: సెంట్రోమియర్ క్రోమోజోమ్ చివరగా కొనలో ఉంటుంది. ఇది ‘I’ ఆకారంలో ఉండి ఒక బాహువుని మాత్రమే కలిగి ఉంటుంది.