AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 5 పద్యరత్నాలు Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Telugu Solutions 5th Lesson పద్యరత్నాలు
9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు Textbook Questions and Answers
చదవండి-ఆలోచించండి-చెప్పండి
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! – బద్దెన
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
పద్యం భావం చెప్పండి.
జవాబు:
భావం:
ఓ వేమనా! ఎవరు చెప్పినా వినాలి. విన్న తరువాత తొందర పడకుండా ఆలోచించాలి. అది నిజమో, అబద్దమో తెలుసుకోవాలి. అలా తెలుసుకొన్న వాడినే లోకంలో నీతిపరుడు అంటారు.
ప్రశ్న 2.
ఇలాంటి పద్యాలను ఏమంటారు?
జవాబు:
నీతి పద్యాలు లేక సుభాషితాలు అని అంటారు.
ప్రశ్న 3.
మీకు తెలిసిన ఇతర శతక పద్యాలు చెప్పండి.
1) కం|| అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ ! – సుమతీ శతకం
2) కం|| కలకొలది ధర్మముండిన
గలిగిన సిరి కదలకుండు కాసారమునన్
గల జలము మడువు లేమిని
గొల గొల గట్టుతెగిపోదె గువ్వలచెన్నా ! – గువ్వలచెన్న శతకం
3) ఆ||వే|| పరుల కొఱకే నదులు ప్రవహించు గోవులు
పాలనిచ్చు చెట్లు పూలుపూచు
పరహితమ్ము కంటె పరమార్థమున్నదా ?
లలిత సుగుణజాల తెలుగుబాల ! – తెలుగుబాల శతకం
4) ఆ||వే|| జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది?
మాతృభాష కంటె మధురమేది?
కన్నతల్లి కంటే ఘనదైవమింకేది?
తెలియుమయ్య నీవు తెలుగుబిడ్డ ! – తెలుగుబిడ్డ శతకం
5) తే॥॥ విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్యభూషిత శస్తమస్త
కంబయిన పన్నగము భయంకరముగాదె ! – భర్తృహరి సుభాషితం
6) ఉ॥ పండితులైనవారు దిగువం దగ నుండగ నల్పు డొక్కడు
దండత పీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొనకొమ్మలనుండగ క్రింద గండభే
రుండ మదేభ సింహనికురుంబములుండవె చేరి భాస్కరా! – భాస్కర శతకం
7) ||వే|| మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ! – వేమన శతకం
8) ఆ॥వె॥ పుస్తకముల నీవు పూవు వోలెను చూడు
చింపఁబోకు మురికి చేయబోకు
పరుల పుస్తకముల ఎరువు తెచ్చితివేని
తిరిగి యిమ్ము వేగ తెలుగు బిడ్డ ! – తెలుగుపూలు శతకం
ప్రశ్న 4.
ఇలాంటి పద్యాలను కవులు ఎందుకు రాసి ఉంటారు?
జవాబు:
నీతిని బోధించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి రాసి ఉంటారు.
ప్రశ్న 5.
వీటి వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది?
జవాబు:
వీటి వల్ల సమాజానికి ఏది నీతో, ఏది అవినీతో తెలుస్తుంది. ఉత్తమ సమాజం ఏర్పడటానికి ఇది దోహదం చేస్తుంది.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ఆ) కింది అంశాల గురించి మాట్లాడండి.
ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో భావయుక్తంగా పాడండి. భావాలు చెప్పండి.
జవాబు:
ఉపాధ్యాయుల సహాయంతో పద్యాలు చదవండి.
భావాలు :
1) శుభాలనిచ్చే రాజశేఖరుడా ! అల్పుడు, దుర్మార్గుడు, మోసకారిని ధనవంతుడు కదా అని కోరి చేరితే, కోరికలు నెరవేరకపోగా హాని కలుగుతుంది. విలువైన మణితో ఉంది కదా అని క్రూరమైన పాముతో కలిసి ఉండటానికి ఇష్టపడరు గదా !
2) ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురై, నాశనమైపోయినా, సముద్రాలు తమ హద్దుల్ని దాటి పొంగుకు వచ్చినా; సూర్యచంద్రులు తమ గతుల్ని తప్పినా ; నీ భక్తుడు మాత్రం చలించడు, గర్వంతో వీడిపోడు. నీతిని, భక్తి మార్గాన్ని వీడిపోడు.
3) ఓ సర్వేశ్వరా ! సత్యవంతుడు, దురాచారుడు కానివాడు, విచక్షణతో మెలిగేవాడు, దుర్జనులతో స్నేహం చేయనివాడు, భక్తులతో స్నేహంగా ఉండేవాడు, కామాతురుడు గానివాడే ఈ మూడు లోకాల్లో నీకు నిజమైన సేవకుడు.
4) ఓ శివా ! పార్వతీపతీ ! గాజుపూస విలువైన రత్నం ఎప్పటికీ కాలేదు. కాకి హంసగాను, జోరీగ తేనెటీగ గాను, దున్నపోతు సింహంగాను, జిల్లేడు చెట్టు కల్పవృక్షంగాను ఎప్పటికి కాలేవు. అట్లే పిసినారి దుర్జనుడు రాజు కాలేడు.
5) ఆభరణాలతో ప్రకాశించేవాడా ! ధర్మపురి అనే గ్రామంలో వెలసినవాడా ! దుష్టులను చంపేవాడా ! పాపాలను దూరం చేసేవాడా ! ఓ నరసింహస్వామీ ! సాధువులతోను, మంచివారితోను తగాదా పెట్టుకుంటే కీడు కలుగుతుంది. కవులతో గొడవ పెట్టుకున్నా, దీనులను పట్టుకొని హింసించినా, బిచ్చగాళ్ళకు కష్టం కలిగించినా, నిరుపేదలను నిందించినా కీడు కలుగుతుంది. ఇంకా పుణ్యాత్ములను తిట్టినా, భక్తులను తిరస్కరించినా, గురువుల ధనాన్ని దోచుకున్నా హాని కలుగుతుంది.
6) ఓ నారాయణా ! నీ పేరును తలవనివాడు, నీ మీద భక్తి లేనివాడు ఎన్ని నదుల్లో స్నానం చేసినా అది ఏనుగు స్నానంలా వృథానే ! మౌనంగా మనస్సులో వేద మంత్రాలను చదివినా అది అరణ్యరోదనే. ఎన్ని హోమాలు చేసినా అది బూడిదలోన వేసిన నెయ్యి మాత్రమే అవుతుంది.
7) భద్రాదిపై వెలసిన ఓ స్వామీ ! దశరథుని కుమారుడైన ఓ రామా ! సముద్రమంత దయగలవాడా ! నీవు యుద్ధంలో శత్రువుల్ని నాశనం చేశావు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నావు. కష్టాలనే కారుచీకట్లను తొలగించగల సూర్యుడవు. హృదయమంతా దయతో నింపుకున్నావు. సీతాదేవి హృదయ కమలానికి తుమ్మెదలాంటివాడవు. రాక్షసులనే కలువలను నాశనం చేయగల మదపుటేనుగువు. చక్కని శరీరం గల వాడవు.
8) శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన ఈశ్వరా ! నీ పేరును తలచుకోవడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఈ భూమిపై “శివ ! శివ !” అని ఉత్సాహంతో పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచు అవుతుంది. సముద్రం కూడ గట్టినేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం అమృతమవుతుంది.
9) ఓ కుమారా ! చదువు చెప్పే గురువును ఎదిరించకు. పోషించే యజమానిని తిట్టకు. ఒక్కడివే పనికి సంబంధించిన ఆలోచనలను చేయవద్దు. మంచి నడవడికను విడవవద్దు.
10) ఓ సుమతీ ! ఉడుము వందేళ్ళు బతుకుతుంది. పాము వెయ్యేళ్ళు ఉంటుంది. చెరువుల దగ్గర కొంగ చాలాకాలం ఉంటుంది. వీటిలో ఎక్కువకాలం ఉండటం వలన ఉపయోగం లేదు. మంచి చేయాలనే ఆలోచనతోను, ధర్మార్థ కామ మోక్షాలను సాధించగలిగినవాడే ఉత్తముడు.
ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది అంశాలను చరించండి.
జవాబు:
i) నడవడిక :
లోకం పట్ల మన ప్రవర్తననే నడవడిక అంటారు. లోకానికి అపకారం చేయకుండా మంచిగా ఉంటూ జీవితాన్ని గడపాలి. లేకుంటే మన వద్దకు ఎవరూ రారు. పాము తన తలపై ఎంత విలువైన మణిని కలిగి ఉన్నా దాని దగ్గరకు ఎవరూ వెళ్ళరు కదా ! ఎక్కడైనా, ఎన్నడైనా గాజుపూస విలువైన రత్నం కాలేదు. అట్లే కాకి హంసగాను, జోరీగ తేనెటీగ గాను, దున్నపోతు సింహంగాను మారలేదు. అలాగే పిసినారి రాజు కాలేడు. అంటే దానగుణం కలవాడు, సత్ప్రవర్తన కలవాడే లోకంలో ఎప్పటికైనా ఉన్నత స్థితిని పొందగలడు.
ii) గుణగణాలు :
కుల పర్వతాలన్నీ చెదురుమదురైనా, సముద్రాలు తమ ఎల్లలను దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు గతి తప్పినా భగవద్భక్తుడు మాత్రం చలించడు. గర్వించడు. నీతి మార్గాన్ని వీడడు. ఎందుకంటే తనను భగవంతుడు రక్షిస్తాడనే ధైర్యం. భగవంతుడు ధర్మాన్ని, ధర్మం ఆచరించేవారిని తప్పక కాపాడతాడు. తాను తన ధర్మాన్ని పాటిస్తున్నాడు గనుక భగవంతుడు తప్పక రక్షిస్తాడని భక్తుని విశ్వాసం.
సత్యాన్ని పాటించడం, మంచి నడవడిక కలిగి ఉండటం, దుష్టులతో స్నేహం వీడడం, భక్తులతో స్నేహం చేయడం, సంసారమోహంలో చిక్కుకోకపోవడం భగవంతుని సేవకుడి లక్షణాలు.
భక్తులు కాకపోయినా లోకంలో చాలామంది మంచి లక్షణాలను కలిగి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏదో ఒక సందర్భంలో లోభం వల్లగాని, భయం వల్లగాని, ప్రలోభాలకు లొంగికాని చెడుమార్గంలో ప్రవేశించడానికి అవకాశాలున్నాయి. భగవద్భక్తులు తమని భగవంతుడు రక్షిస్తాడని భావించడం వల్ల ధర్మానికి తప్ప వేటికీ భయపడరు. కాబట్టి జీవితాంతం సద్గుణాలతో శోభిస్తారు.
iii) మార్గదర్శకం :
లోకంలో మంచిని పాటించేవారు, చెడుని ఆచరించేవారు కోకొల్లలుగా ఉంటారు. అయితే మంచి కోసం ప్రాణం విడిచేవారు, ధర్మానికి కట్టుబడినవారు మిగతావారికి మార్గదర్శకులై నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో చెడ్డవారిని చూసి ఎలా ఉండకూడదో కూడా లోకం తెలుసుకుంటుంది. ఉడుము వందేళ్ళు జీవిస్తుంది. పాము వెయ్యేళ్ళు వృథాగా పడి ఉంటుంది. కొంగ కూడా చెరువుల వద్ద వ్యర్థంగా కాలం గడుపుతుంది. ఇవి ఇలా ఎంతకాలం ఉన్నా లోకానికేమీ ప్రయోజనం ఉండదు. వీటిని చూసి మనం అందరికీ మంచిని చేయాలనే ఆలోచనను, ధర్మార్థ కామ
మోక్షాలను సాధించాలనే పట్టుదలను పెంచుకోవాలి. అలా చేయగలిగినవాడే ఉత్తముడు. అతడే మార్గదర్శి.
iv) నైతిక విలువలు :
నీతికి సంబంధించిన విషయం నైతికం. మానవులు పాటించాల్సిన కనీస ధర్మాలను విలువలంటారు. నీతికి సంబంధించి కనీసం పాటించాల్సిన విషయాలను నైతిక విలువలంటారు.
గురువులను ధిక్కరించకూడదు. వారి మాటలకు ఎదురు చెప్పకూడదు. అలానే తనను పోషిస్తున్న యాజమానిని తిట్టకూడదు. ఒక్కడే చాలా విషయాలు గురించి ఆలోచించకూడదు. పెద్దలు, అనుభవం గలవారి సలహాలనూ, సూచనలనూ తీసుకోవాలి.
ప్రశ్న 3.
పాఠంలో మీకు నచ్చిన పద్యాలేవి? ఎందుకో చెప్పండి.
జవాబు:
పాఠంలో నాకు నచ్చిన పద్యాలు
కం|| ఉడుముండదె నూడేండ్లునుఁ
ప్రోచినదొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
కడునిల( బురుషార్థపరుడు గావలె సుమతీ !
కం॥ ఆచార్యున కెదిరింపకు
బడియుండదె పేర్మిఁ బాము పదినూడేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
మాచారము విడువఁ బోకుమయ్య కుమారా !
నేటి సమాజంలో కొందరిలో నీతిగా జీవించడం తగ్గిపోగా, చాలామందిలో నీతిమంతమైన జీవనమే లోపించింది. అందుకనే అవినీతిపరుల గురించి వార్తలు పత్రికల్లో తరచుగా కన్పిస్తున్నాయి. కుమారశతకంలోని పద్యంలో నైతిక విలువలు చెప్పబడ్డాయి. సుమతీ శతకంలోని పద్యంలో ‘ఎంతకాలం బతికామనే దానికన్నా ఏమి సాధించామనే దానికే ప్రాధాన్యమ’నే నీతి చక్కగా నిరూపించబడింది. అందుకనే నాకు ఈ రెండు పద్యాలంటే చాలా ఇష్టం.
ఆ) 3, 4, 8 పద్యాలకు ప్రతిపదార్థం రాయండి.
జవాబు:
ఈ పాఠంలో ఇచ్చిన 3, 4, 8 పద్యాల ప్రతిపదార్థాలు చూడండి.
ఇ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
దుర్గుణాలు గల ధనవంతునితో చేరితే ఏమవుతుంది?
జవాబు:
దుర్గుణాలు గల ధనవంతునితో చేరితే కోరికలు తీరకపోగా, ఆపదలు కలుగుతాయి. విలువైన మణి పడగపైన . ఉన్నప్పటికీ కూడా ఎవరూ పాముతో కలిసి ఉండటానికి ఇష్టపడరు గదా !
ప్రశ్న 2.
‘కులశైలంబులు’ అనే పద్యంలో అన్నమయ్య ఏం చెప్పాడో రాయండి.
జవాబు:
ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లా చెదురై , నాశనమైపోయినా, సముద్రాలు తమ ఎల్లలను దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు తమ గతులు తప్పినా భక్తుడు మాత్రం చలించడు. గర్వించడు. నీతి మార్గాన్ని విడచిపోడు కూడా.
ప్రశ్న 3.
ఎలాంటి జీవనం నిష్ప్రయోజనమని బద్దెన అంటున్నాడు?
జవాబు:
ఉడుము వందేళ్ళు వ్యర్థంగా గడుపుతుంది. పాము అవమానాలను సహిస్తూ వెయ్యేళ్ళు జీవిస్తుంది. కొంగ చెరువుల వద్ద తన జీవితాన్ని వృథాగా గడుపుతుంది. అలాగే మానవుడు స్వార్థంతో జీవితాన్ని వ్యర్థంగా గడిపితే ప్రయోజనం ఉండదు. అలాగాక ధర్మాన్నీ, అర్థాన్నీ, కోరికల్ని, మోక్షాన్ని సాధించగలిగినపుడే మానవ జీవితం ప్రయోజనవంతమవుతుందని బద్దెన బోధించాడు.
ప్రశ్న 4.
ధూర్జటి అభిప్రాయం ప్రకారం అన్నీ సులభసాధ్యమయ్యేలా చేసేది ఏది?
జవాబు:
ఈ లోకంలో “శివ ! శివ ! ” అని ఉత్సాహంగా పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచు అవుతుంది.
సముద్రం కూడా గట్టి నేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం కూడా అమృతంగా పరిణమిస్తుంది. కాబట్టే ఈశ్వరుని పేరు తలచుకోవడం వల్ల అన్నీ సులభసాధ్యాలవుతాయి. 5. భగవంతుని సేవకుని లక్షణాలను తెలపండి. జ. కులపర్వతాలన్నీ చెదురుమదురైనా, సముద్రాలు తమ ఎల్లలు దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు తమ గతుల్ని
తప్పినా భగవంతుని భక్తుడు చలించడు. నీతిమార్గాన్ని వీడిపోడు. ఇంకా సత్యాన్ని పాటించడం, మంచి నడవడిక కలిగి ఉండడం, దుష్టులతో స్నేహం వీడడం, భక్తులతో స్నేహం చేయడం, సంసారమోహంలో చిక్కుకోకపోవడం భగవంతుని
సేవకుడి లక్షణాలు.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘లోభియైనవాడు రాజుగా తగడు’ ఇది సమర్ధనీయమేనా ?ఎందుకు ? (లేదా) “పిసినారియైన వాడు రాజుగా తగడు” అనే విషయం సమర్థించ తగినదేనా పద్యరత్నము ఆధారంగా వివరించండి.
జవాబు:
పిసినారి రాజుగా ఉండటానికి తగడు. ఎందుకంటే రాజువద్దకు పేదవారు, దరిద్రులు ఇంకా ధనం అవసరమైన వారు
సహాయార్థులై వస్తారు. రాజు సహృదయతతో వారి కష్టాల్ని, బాధల్ని విని తగిన సహాయం చేయాలి. పిసినారి ఆ పని చేయలేడు.
దానితో వచ్చిన వారు రాజు పై ద్వేషంతో సంఘ విద్రోహులుగా, దొంగలుగా మారే ప్రమాదం ఉంది. కాలం ఎప్పుడూ అనుకూలంగానే ఉండదు. ఒక్కొక్కసారి అతివృష్టి వలన గాని, అనావృష్టి వలన గాని రాజ్యంలో పంటలు దెబ్బతినడం గాని, సరిగా పండకపోవడం గాని జరగవచ్చు. అలాంటి సమయంలో రాజు ప్రజలకు అండగా నిలచి పన్నులను రద్దు చేయాలి. కాని లోభి ధన వ్యామోహంతో ప్రజలకు పన్ను మినహాయింపులివ్వక
బాధిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను లోభి రాజుగా తగడు.
ప్రశ్న 2.
నరసింహ శతకపద్యంలో గల విషయాలు నేటి సమాజానికి ఎంతవరకు అవసరమో వివరించండి.
జవాబు:
నరసింహ శతక పద్యంలో గల విషయాలు నేటి సమాజానికి బాగా ఉపయోగపడతాయి. మంచివారితో తగవు పెట్టుకుంటే హాని కలుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకొంటే, దీనులయిన వారిని పట్టుకొని కొడితే, ముష్టివారిని ఏడిపిస్తే, పేదలను నిందిస్తే కీడు జరుగుతుంది. పుణ్యాత్ములను తిడితే, మంచి భక్తులను తిరస్కరిస్తే, గురువుగారి సొమ్మును దోచుకుంటే కీడు జరుగుతుంది. ఈ విధంగా చెడుపనులు చేసే వారికి నరకం తప్పదు. వీరికి నరకం భద్రంగా కట్టుకొన్న మూటే.
ప్రశ్న 3.
‘ధనంపై కోరికతో అల్పుని దగ్గరికి చేరితే హాని కలుగుతుంది’ దీనికి సంబంధించి మీకు తెలిసిన సంఘటనను వివరించండి.
జవాబు:
మా వీధి చివరలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడికి భార్యాబిడ్డలు లేరు. అతనికి బీదవాళ్ళంటే తేలిక భావం. ఎవరైనా బీదవాళ్ళు డబ్బు కావాలని అతని వద్దకు వెడితే అతడు వారికి సహాయం చేయడు. వారిని అవమానిస్తాడు. అత్యవసరంగా డబ్బు కావాలని ఎవరైనా అతణ్ణి అడిగితే మంగళ సూత్రాలూ, చెవి దుద్దులూ వగైరా తాకట్టు పెట్టుకుంటాడు. తిరిగి వారు డబ్బు ఈయలేకపోతే, ఆ నగలను తానే సొంతం చేసుకుంటాడు. వారికి ఉన్న చిన్న ఇంటిని లేక పాకను బాకీలు పేరు చెప్పి స్వాధీనం చేసుకుంటాడు. – కనుక అల్పబుద్ధి గల ధనవంతులను ధనం కోరి చేరితే హాని కలుగుతుందని తెలుస్తోంది.
ప్రశ్న 4.
‘పవి పుష్పంబగు’ పద్యభావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన ఈశ్వరా ! నీ పేరును తలచుకోవడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఈ భూమిపై “శివ ! శివ !” అని ఉత్సాహంతో పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచవుతుంది. సముద్రం కూడా గట్టినేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం అమృతమవుతుంది.
ప్రశ్న 5.
‘అరణ్యరోదనం’ అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాల్లో వాడతారు?
జవాబు:
అడవి మధ్యలో ఉండి ఏడిస్తే ఆదుకొనేవారు, ఓదార్చేవారు ఎవరూ ఉండరు. ఏడ్చినా ఎవరూ పట్టించుకోకపోతే ఆ ఏడుపు వృథానే. వ్యర్థంగా ఏడిచే ఏడుపునే ‘అరణ్యరోదనం’ అంటారు. మనసులోని బాధను ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరూ పట్టించుకోకపోయినప్పుడు, బాధను తీర్చేవారు ఎవరూలేని సందర్భాల్లో దీన్ని వాడతారు.
ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
నిజమైన భక్తునికి ఉండదగిన లక్షణాలను గురించి రాయండి.
జవాబు:
భక్తులకు ఇంద్రియ నిగ్రహం, సర్వజీవుల హితం కోరే గుణం ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషించకూడదు. అన్ని ప్రాణులను ప్రేమించాలి. సుఖదుఃఖాలకు చలించకుండా స్థిరంగా ఉండగలగాలి. మమతను, అహంకారాన్ని వీడాలి. క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. భగవంతుని యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరినీ ఉద్రేకపరిచేలా ప్రవర్తించకూడదు. తాను కూడా ఎవరి చేష్టలకూ ఉద్రేకపడకూడదు. ఏమాత్రం కోరిక లేకుండా చేసే పనులన్నీ భగవంతుని పూజలా భావించి శ్రద్ధగా చేయాలి. శుచిగా ఉండాలి. పక్షపాత ధోరణిని వీడాలి. శత్రువుల యెడ, మిత్రుల యెడ సమభావంతో ఉండాలి. నిందకు కుంగిపోకుండా, పొగడ్తకు పొంగిపోకుండా ఉండగలగాలి. ఫలితాన్ని ఆశించకుండా పనులను చేయగలగాలి.
ప్రశ్న 2.
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు :
మంచి విద్యార్థికి గురువులను గౌరవించే లక్షణం ఉండాలి. ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. క్రమశిక్షణతో మెలగాలి. విద్యలలోనే పోటీతత్త్వం ఉండాలి కాని ఇతర విషయాలలో పోటీ పడకూడదు. తోటి విద్యార్థులు స్నేహంగా ప్రవర్తించాలి. అందరితోనూ కలసిపోయే గుణం పెంచుకోవాలి. జ్ఞానార్జనకు సన్నద్ధులై ఉండాలి. మందమతులైన విద్యార్థులకు విద్యాభ్యాసంలో సహకరించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి.
మంచి విద్యార్థికి ఉండకూడని లక్షణాలు :
విద్యార్థులకు అసూయాద్వేషాలు పనికిరావు. అంగవైకల్యం గల విద్యార్థులను పరిహసించకూడదు. మందమతులైన విద్యార్థులను హేళన చేయకూడదు. గురువుల మాటలకు ఎదురు చెప్పకూడదు. అహంకారంతో ప్రవర్తించకూడదు, చెడు ప్రవర్తన కలిగి ఉండకూడదు.
ఇ) సృజనాత్మకంగా రాయండి.
ధనమున్నవాళ్ళు తమధనాన్ని దానం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడాలని ఈ పాఠంలో చదువుకున్నాం కదా!ఈ భావం వచ్చేటట్లు అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వదాన్యులకు ఒక ‘కరపత్రం’ ద్వారా విజ్ఞప్తి చేయండి.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ఇవ్వమని ధనవంతులను కోరుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
కరపత్రం
అన్నదానాన్ని మించిన దానం లేదు
దాతను మించిన చిరంజీవి లేడు
దానం చేయడమే ధనార్జనకు సార్థకత. దాచుకోవడం కాదని భారతీయ ధర్మం బోధిస్తుంది. పుట్టడంతోనే తల్లిదండ్రులకు దూరమయ్యే అభాగ్యులు, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారిచే నిరాదరణకు లోనైన అదృష్టహీను లెందరో ఈ దేశంలో ఉన్నారు. వారు సమాజంపై ద్వేషాన్ని పెంచుకొని సంఘ విద్రోహులుగా మారుతున్నారు. అలానే అనేక కష్టాలను, నష్టాలను భరించి, అపురూపంగా పెంచుకున్న తమ పిల్లలే ముసలితనంలో తమని వీధుల్లో విడిచి పెడితే ఏం చేయాలో తోచని అమాయక వృద్ధులు ఎందరో బిచ్చగాళ్ళ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. వీరేగాక రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో నిరుపేదలు ఉన్నారు. వందల ఎకరాల పొలం గల వ్యక్తి ఉన్న ఊరిలోనే ఒక సెంటు భూమి కూడా లేనివారు జీవిస్తున్నారు. పెద్ద పెద్ద బంగళాలు గల ప్రాంతంలోనే రోడ్ల ప్రక్కన ప్రమాదకర స్థలాల్లో పూరిగుడిసెలలో జనాలు జీవిస్తున్నారు. కొందరు తిండి ఎక్కువై జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే, మరికొందరు తినడానికి ఏమీలేక బాధపడుతున్నారు.
ఇలాంటి విచిత్ర పరిస్థితుల్ని మనం నిత్యజీవితంలో దాదాపు రోజూ చూస్తూనే ఉంటాం. ఈ అసమానతలు ఇలా కొనసాగాల్సిందేనా ? వీటిని సరిచేయలేమా? అని ఆలోచిస్తాం. మన పనుల్లో పడి మర్చిపోతుంటాం. తీరికలేని పనుల్లో పడి సామాజిక బాధ్యతల్ని విస్మరిస్తాం.
మిత్రులారా ! మనకందరికి సమాజసేవ చేయాలనే కోరిక ఉన్నా తీరికలేక చేయలేకపోతున్నాం. మనం స్వయంగా సేవ చేయలేకపోయినా సమాజసేవలో మనవంతు కృషిచేసే అదృష్టం మనకందుబాటులోనే ఉంది. అదెలా అంటే మనం మన దగ్గర ఉన్న ధనాన్ని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఆ ఆశ్రమాల నిర్వాహకులు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే మనవద్ద అదనంగా ఉన్న వస్త్రాలను, బియ్యం వంటి ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను సేకరించి బీదలుండే ప్రాంతాలలో పంచిపెట్టే ఎన్నో సేవాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఆయా సేవాసంస్థలకు మనవద్ద ఉన్నవి అందివ్వడమే. అంతర్జాలంలో సేవాసంస్థల చిరునామాలు ఉంటాయి. డబ్బును కూడా ఉన్నచోటు నుండి కదలకుండా ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలకు పంపించే సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్ చేస్తే వారే వాహనాలతో వచ్చి మనవద్ద ఉన్న ధాన్యం, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకొని వెళ్తారు.
సోదరులారా ! మనకు ఎక్కువైన వాటితోనే కొన్ని కుటుంబాలు ఒకపూటైనా చక్కని, భోజనాన్ని, మంచి వస్త్రాన్ని పొందగలుగుతాయి. కాబట్టి మనకున్న ఈ సౌకర్యాన్ని వినియోగిద్దాం. మన సహృదయతను పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటించడం ద్వారా, ధాన్య వస్త్రాలను ఇవ్వడం ద్వారా చాటుకొందాం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.
పేదలకు సాయం చేద్దాం
పేదరికాన్ని రూపుమాపుదాం
(లేదా)
మీ పాఠం ఆధారంగా కవుల భావాలను నీతివాక్యాల రూపంలో రాయండి.
(లేదా)
పద్యరత్నాలు పొఠం ఆధారంగా కొన్ని నీతివాక్యాలు రాయండి.
జవాబు:
- దుర్గుణాలు గల ధనవంతునితో చేరిక ; మణిగల నాగుపాముతో కలయిక.
- ప్రకృతి ప్రకోపించినా వేయకు వెనుకడుగు ; దేవుని చేరడానికి వేయి ధర్మపథాన ముందడుగు.
- గుణవంతుడు, కాంక్షారహితుడు, సత్యవంతుడు కాగలడు భగవద్భక్తుడు.
- పిసినారి కాలేడు ఎన్నటికీ ఉన్నతాధికారి ; విలువలేనివి చేరి పొందవుగా ఉన్నతి మరి.
- చేస్తే సమాజానికి హాని ; పడతాడు దేవుడు నీ పని.
- చేయకుండా భగవంతుని స్మరణం ; చేసిన పనులన్నీ అవుతాయి (శూన్యం) వ్యర్థం.
- నిరంతరం భగవంతుని స్మరణం ; అనవరతం కష్ట కార్యహరణం.
- గురువుల మాటకు ఎదురు చెప్పకు’ ; పోషించే యజమానిని నిందించకు.
- ఒక్కడివే కార్యాలోచన చేయవద్దు ; మంచి నడవడికను ఎన్నడు వీడవద్దు.
- ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం ; ఎంతమందికి మంచి చేశామన్నది ముఖ్యం.
(లేదా)
పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్యానికి తగిన గేయాన్ని గాని, కవితను గానీ రాయండి.
జవాబు:
భగవంతునిపై భక్తి
పెంచుతుందెంతో ధీశక్తి
సమాజ సేవలపై కలిగిస్తుంది ఆసక్తి
చెడు స్నేహాల నుండి కల్పిస్తుంది విముక్తి
మంచి కార్యాలపై పెంచుతుంది అనురక్తి
దురలవాట్లపై కలిగిస్తుంది విరక్తి
సర్వానర్థాల నుండి కలుగుతుంది ముక్తి.
ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
“మంచి గుణాలు గల వ్యక్తికి రూపం, ధనం లేకపోయినప్పటికీ, వాణ్ణి బుద్ధిమంతులు చక్కగా గౌరవిస్తారు.” అని చదువుకున్నాం కదా ! అటువంటి వ్యక్తులెవరైనా మీకు తెలిసిన వారున్నారా? వారి గురించి తెలపండి.
జవాబు:
ఆంగ్ల సాహిత్యంలో “జార్జ్ బెర్నార్డ్ షా” సుప్రసిద్ధుడు. కానీ ఆయన అందవికారి. అయితే అతని అందవికారం అతనికి మహాకవిగా, గొప్ప విమర్శకునిగా కీర్తి రావటంతో ఏమాత్రం అడ్డంకి కాలేదు. అతనికి మంచి రూపం లేకపోయినప్పటికి బుద్ధిమంతులతని సాహిత్యాన్ని, విమర్శలను గొప్పవిగా గుర్తించి, గౌరవించారు. కాబట్టి రూపం ఎప్పుడూ మంచిగుణాలు గల వారికి అడ్డంకి కాలేదు.
మన తెలుగు సాహిత్యంలో మహాకవులుగాను ప్రసిద్ధులైన వారిలో చాలామంది పేదరికాన్ని అనుభవించారు. ఉదాహరణకు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడైన “శ్రీరంగం శ్రీనివాసరావు”. ఈ మహాకవి “ఈ యుగం నాది” అని సగర్వంగా చాటుకొన్నాడు. ఇంతటి మహాకవి కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. గుప్పెడు మెతుకుల కోసం చిన్న చిన్న ఉద్యోగాలెన్నో చేశాడు. డబ్బు లేక ప్రపంచాన్ని చుట్టివచ్చే అనేక అవకాశాలను వదులుకున్నాడు. ఎన్నో రోజులు ఆహారం లేకుండా గడిపాడు. అతిసామాన్యుల కష్టాలను బాగా దగ్గరగా పరిశీలించాడు. కాబట్టే ఆయన కవిత్వంలో పీడితులు, బాధితులు, కార్మికులు, కర్షకులు ప్రధానమయ్యారు. ఆయన కవిత్వాన్ని దేశవ్యాప్తంగానే గాక, ప్రపంచవ్యాప్త మేధావులు చదివి మెచ్చుకున్నారు. ఆయన విశ్వనరునిగా ఎదగడానికి ఆయన దారిద్ర్యం ఏమీ అడ్డం కాలేదు.
జరుక్ శాస్త్రిగా సుప్రసిద్ధుడైన “జలసూత్రం రుక్మినాథశాస్త్రి” తెలుగు సాహిత్యంలో ‘పేరడీ’ ప్రక్రియకు ఆద్యుడు. ఈయన కూడా భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. కష్టాలను, బాధలను హాస్యంగా మలచి తన ‘పేరడీ’లలో ఆంధ్రులందరినీ కడుపుబ్బ నవ్వించాడు. నవ్వుతోపాటు కన్నీటి చుక్కల్ని కూడా తెప్పించగలిగిన మహామేధావి, కవీశ్వరుడు. ఆయన ఆరంభించిన ‘పేరడీ’ తర్వాత ఆంధ్రసాహిత్యంలో ఒక ప్రక్రియగా ఏర్పడి, నేటికీ అందరిచే ఆదరించబడుతున్నది. బాధని నవ్వుగా మలచగలిగిన బుద్ధిశాలి జరుక్ శాస్త్రి.
(లేదా)
ఈ పాఠంలో చెప్పిన గుణాల్లో ఏయే మంచి గుణాలను మీరు అలవరచుకోవాలనుకుంటున్నారో పట్టిక తయారు చేయండి.
జవాబు:
నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్న మంచిగుణాలు :
- ధనవంతులైనా, కాకపోయినా చెడ్డవారిని ఆశ్రయించకూడదనే మంచి అలవాటు అలవర్చుకోవాలనుకుంటున్నాను.
- ఎన్ని కష్టాలెదురైనా ధర్మమార్గాన్ని వీడను.
- ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలని నిశ్చయించుకున్నాను.
- ఏ పనినైనా ఫలితాన్ని ఆశించకుండా చేయాలనుకుంటున్నాను.
- పిసినారితనాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను.
- సమాజానికి హాని కలిగించే పనుల్ని చేయకూడదని నిర్ణయించుకున్నాను.
- గురువుల మాటకు ఎదురుచెప్పకూడదని అనుకుంటున్నాను.
- నాకు ఉద్యోగాన్ని ఇచ్చి, జీవనోపాధి కల్పించిన యాజమానిని/సంస్థను నిందించకూడదని అనుకుంటున్నాను.
- చెడు నడతను విడిచి పెట్టాలనుకుంటున్నాను.
- కార్యాలోచన ఒక్కడ్లే చేయకుండా ఆత్మీయుల, మిత్రుల సలహా, సూచనలతో చేయాలనుకుంటున్నాను.
- మంచి నడవడికను ఎప్పుడూ విడిచిపెట్టకూడదని నిశ్చయించుకున్నాను.
- అందరికీ సహాయం చేస్తూ ఆనందంగా బతకాలని నిర్ణయించుకున్నాను.
IV. ప్రాజెక్టు పని
ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు అన్ని తెలుగు పాఠ్యపుస్తకాల్లోని నీతి పద్యాలను సేకరించి, ఒక పుస్తకంలా తయారుచేయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.
III. భాషాంశాలు
పదజాలం
అ) కింద పదాలకు అర్థాలను పాఠ్యపుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’లో వెతికి వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
మడువు = కొలను, మడుగు
కొంగ మడువులోని చేపలను తినాలని చూసింది.
1. అవని = భూమి
అవనిపై పచ్చదనం తగ్గిపోతుందీ మధ్య.
2. కొక్కెర = కొంగ
కొక్కెర నేర్పుగా చేపలను పడుతుంది.
3. భృంగం = తుమ్మెద
పద్మాలపై భృంగం అందంగా తిరుగుతుంది.
4. అనర్ఘం = వెలకట్టలేనిది
మంచి పౌరులు సమాజానికి అనర్ఘ రత్నాల వంటివారు.
5. పవి = వజ్రాయుధం, పిడుగు
1) ఇంద్రునికి ఇష్టమైన ఆయుధం పవి.
2) ఈ సంవత్సరం పవి పతనాల (పిడుగుపాటు) వల్ల మరణాల సంఖ్య పెరిగింది.
6. తురంగం = గుఱ్ఱము
మోటారు వాహనాలు లేని రోజుల్లో తురంగం ప్రయాణాలకు ఉపయోగపడేది.
7. పంచాస్యం – సింహము
వేటగాని దాడివల్ల పంచాస్యం మరణించింది.
8. దురాచారుడు = చెడు ఆచారాలు గలవాడు
దురాచారునితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్నే కలిగిస్తుంది.
9. దివ్యాహారం = అమృతము దేవతలు,
దానవులు పాలసముద్రాన్ని మధించినపుడు దివ్యాహారం పుట్టింది.
ఆ) కింది పదాలకు పదపట్టికలో పర్యాయపదాలు వెతికి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
ఈప్సితం = కోరిక, వాంఛ
అ) కళ్ళారా హిమాలయాలను చూడాలని రవికి చిరకాల వాంఛ.
ఆ) ఎన్నోసార్లు తన కోరికను తల్లిదండ్రుల ముందు బయటపెట్టాడు.
ఇ) మొత్తానికి తన ఈప్సితం తీరేటట్లు తల్లిదండ్రులు అనుమతి ఇచ్చారు.
అవని :
1) భూమి
2) ధరణి
అ) భూమిని రక్షించుకోవడం అందరి బాధ్యత.
ఆ) ఓజోన్ పొర తొలగిపోవటం వల్ల అవనికి ప్రమాదం ఏర్పడింది.
ఇ) సూర్యుని నుండి అతినీలలోహిత కిరణాలు వస్తూండడం వల్ల ధరణి వేడెక్కిపోతున్నది.
2. విపత్తు :
1) ఇడుము
2) ఆపద
అ) ఆడవారికీ మధ్యకాలంలో ఆపదలు పెరిగాయి.
ఆ) ఎటు నుండి విపత్తులు వస్తాయో అని ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ఇ) ప్రభుత్వం ఆడవారికి రక్షణ కల్పించడం ద్వారా ఇడుములు దూరం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నది.
3. ఏనుగు :
1) కరి
2) మత్తేభం ,
అ) ఏనుగులు చెఱకుతోటలపై దాడిచేస్తాయి.
ఆ) కరుల సమూహాన్ని దూరంగా పంపడం కష్టంతో కూడిన పని.
ఇ) కొన్నిసార్లు మత్తేభాల కాళ్ళు కిందపడి జనాలు మరణిస్తూ ఉంటారు.
4. భుజంగం :
1) వాతాశనం
2) సర్పం
అ) సర్పాలలో విషం కలిగినవి కొన్నే. కాని మనం వాతాశనాన్ని చూడగానే చంపుతాం.
ఆ) కాబట్టే భుజంగాల సంఖ్య బాగా తగ్గిపోయిందీ మధ్యకాలంలో,
5. తురంగం :
1) అశ్వం
2) వాజి
అ) జంతువులలో బాగా వేగంగా పరుగెత్తగలవి అశ్వాలు.
ఆ) తురంగాల కాళ్ళు ఇసుకలో కూరుకుపోవు.
ఇ) కాబట్టే వాజులను ఎడారులలో ప్రయాణించడానికి వినియోగించేవారు పూర్వకాలంలో.
6. సత్యం :
1) నిజం
2) ఋతం
అ) పిల్లలు నిజం పలికేలా చూడాలి.
ఆ) సత్యం చెప్పడం వల్ల మంచి జరుగుతుందని వారికి నచ్చచెప్పాలి.
ఇ) ఋతాన్ని పలకడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి.
ఇ) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
1. దాశరథి : దశరథుని కుమారుడు (రాముడు)
2. గురువు : అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు
3. జలజాతం : నీటి నుండి పుట్టినది
4. పంచాస్యం : విస్తరించిన ముఖం గలది (సింహం)
5. మధువ్రతం : తేనె సేకరించడమే వ్రతంగా గలది (తుమ్మెద)
6. అబ్దం : నీటి నుండి పుట్టినది (అప్ అంటే నీరని అర్థం)
7. ధూర్జటి : పెద్ద జడలు కలిగినవాడు (శివుడు)
8. ధర : అన్నింటినీ ధరించునది (భూమి)
ఈ) పాఠార్యశం ఆధారంగా కింది నానార్థాలకు సంబంధించిన మూలపదాలను వెతికి రాయండి.
1. నీరు, గరళం, తామరతూడు = విషం
2. చీకటి, తమోగుణం, దుఃఖం = తమం
3. ఏనుగు, మూడడుగుల కొలత, ఎనిమిది అనే అంకె = గజం
4. అవయవం, ఒక దేశం, భాగం = అంగం
ఉ) కింది జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. గజస్నానం : వ్యర్థమైన స్నానం
చిన్న పిల్లలకు స్నానం చేయించినా అది గజస్నానమే.
2. అరణ్యరోదనం : ఏడుపు వల్ల ప్రయోజనం లేకపోవడం.
నగరాలు విస్తరిస్తున్న నేటి కాలంలో ప్రకృతి ప్రేమికుల అరపులు అరణ్యరోదనలే అవుతున్నాయి.
3. బూడిదలో పోసిన నెయ్యి : వ్యర్థమైపోవడం
మా అన్నయ్య ఇంజనీరింగ్ లో తప్పడంతో అమ్మానాన్నల శ్రమ అంతా బూడిదలో పోసిన నెయ్యి అయింది.
వ్యాకరణం
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
ఉదా:
ఫణాగ్రము – ఫణ + అగ్రము : సవర్ణదీర్ఘ సంధి
పదం | విసంధి రూపం | సంధి పేరు |
1. పరమాన్నం | పరమ + అన్నం | సవర్ణదీర్ఘ సంధి |
2. పంచాస్యం | పంచ + ఆస్యం | సవర్ణదీర్ఘ సంధి |
3. పదాబ్దం | పద + అబ్దం | సవర్ణదీర్ఘ సంధి |
4. ధనాఢ్యుడు | ధన + ఆఢ్యుడు | సవర్ణదీర్ఘ సంధి |
5. మధువ్రతేంద్రం | మధువ్రత + ఇంద్రం | గుణసంధి |
6. సర్వేశ్వరా | సర్వ + ఈశ్వరా | గుణసంధి |
ఆ) కింది పదాలను కలిపి, ఏ సంధులో గుర్తించండి.
ఉదా:
పలాయనంబు + అగుట = పలాయనంబగుట = ఉకారసంధి
విసంధి రూపం | పదం | సంధి పేరు |
1. అభోజ్యములు + ఔట | అభోజ్యములౌట | ఉకారసంధి |
2. కోపంబు . + ఎక్కువ | కోపంబెక్కువ | ఉకారసంధి |
3. భృత్యుండు + అతడు | భృత్యుండతడు | ఉకారసంధి |
4. ప్రాప్తము + అగు | ప్రాప్తమగు | ఉకారసంధి |
5. రాజు + ఔనా | రాజానా | ఉకారసంధి |
ఇ) పాఠం చదివి, కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి. ఆ సంధి పదాలను విడదీసి, సూత్రాలను నోటుబుక్కులో రాయండి.
1. యణాదేశ సంధి :
య్, వ్, ర్ – అనే వర్ణాలకు యణ్ వర్ణాలని పేరు. సంధిలో యణ్ వర్ణాలు ఆదేశంగా వస్తాయి. గనుక ఇది యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరమైతే వాటి స్థానంలో క్రమంగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఇతి + ఆభాషణ = ఇత్యాభాషణ = యణాదేశ సంధి
2. గుణసంధి :
ఏ, ఓ, అర్ అనే వర్ణాలకు గుణవర్ణాలని పేరు. సంధిలో గుణవర్ణాలు ఏకాదేశంగా వస్తాయి గనుక ఇది గుణసంధి.
సూత్రం :
అకారమునకు ఇ, ఈ లు పరమైతే ఏ కారం, ఉ, ఊ లు పరమైతే ఓ కారం ; ఋ, ౠలు పరమైతే ‘అర్’ అనేవి ఏకాదేశంగా వస్తాయి.
1) సర్వ + ఈశ్వరా = సర్వేశ్వరా = గుణసంధి
2) శివ + ఇతి = శివేతి = గుణసంధి
3) ఆభాషణ + ఉల్లాసికిన్ = ఆభాషణోల్లాసికిన్ = గుణసంధి
4) మధువ్రత + ఇంద్రం = మధువ్రతేంద్రం = గుణసంధి
5) పరంపర + ఉత్తుంగ = పరంపరోత్తుంగ = గుణసంధి
6) నామ + ఉక్తి = నామోక్తి = గుణసంధి
3. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఆ అనే అచ్చులు ఒకేచోట పుట్టి, ఒకే ప్రయత్నంతో పలకబడతాయి. ఇలా ఒకేచోట పుట్టి, ఒకే ప్రయత్నంతో పలకబడే వర్ణాలను సవర్ణాలు అంటారు. సవర్ణాలకు సంధిలో దీర్ఘం వస్తుంది గనుక ఇది సవర్ణదీర్ఘ సంధి.
సూత్రం :
అకార – ఇకార – ఉకారములకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.
ఉదాహరణలు :
1) ధన + ఆఢ్యుడు = ధనాఢ్యుడు = సవర్ణదీర్ఘ సంధి
2) ఫణ + అగ్రభాగము = ఫణాగ్రభాగము = సవర్ణదీర్ఘ సంధి
3) పంచ + ఆస్యము = పంచాస్యము = సవర్ణదీర్ఘ సంధి
4) సుర + అవనీజము = సురావనీజము = సవర్ణదీర్ఘ సంధి
5) పద + అబ్ద = పదాబ్ద = సవర్ణదీర్ఘ సంధి
6) దయ + అంతరంగ = దయాంతరంగ = సవర్ణదీర్ఘ సంధి
7) ధరా + ఆత్మజ = ధరాత్మజ = సవర్ణదీర్ఘ సంధి
8) నిశాచర = అబ్జ = నిశాచరాబ్జ = సవర్ణదీర్ఘ సంధి
9) శుభ + అంగ = శుభాంగ = సవర్ణదీర్ఘ సంధి
10) దివ్య + ఆహారము = దివ్యాహారము = సవర్ణదీర్ఘ సంధి
11) శ్రీకాళహస్తి + ఈశ్వరా = శ్రీకాళహస్తీశ్వరా = సవర్ణదీర్ఘ సంధి
12) కార్య + ఆలోచనము = కార్యాలోచనము = సవర్ణదీర్ఘ సంధి
13) పురుష + అర్థపరుడు = పురుషార్థపరుడు = సవర్ణదీర్ఘ సంధి
4. ఉత్వ సంధి :
హ్రస్వమైన ఉకారానికి జరిగే సంధిని ఉత్వసంధి అంటారు. .
సూత్రం :
హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.
ఉదాహరణలు :
1) వారలు + ఈప్సితము = వారలీప్సితము
2) కాంతురు + ఆ = కాంతురా
3) తలకండు + ఉబ్బడు = తలకండుబ్బడు
4) సత్యంబు + ఎప్పుడు = సత్యంబెప్పుడు
5) తప్పడు + ఏనియు = తప్పడేనియు
6) కాడు + పని = కాడేని
7) ఔచిత్యంబు + ఏమరడు = ఔచిత్యంబేమరడు
8) పొందడు + ఏ = పొందడే
9) సాంగత్యంబు + ఆదట = సాంగత్యంబాదట
10) పాయడు + ఏని = పాయడేని
11) భృత్యుండు + ఆతడు = భృత్యుండాతడు
12) రత్నము + అగునా = రత్నమగునా
13) జోరు + ఈగ = జోరీగ
14) మధువ్రతేంద్రము + అగునా = మధుప్రతేంద్రమగునా
15) పంచాస్యము + ఔనా = పంచాస్యమౌనా
16) అవనీజము + అగునా = అవనీజమగునా
17) రాజు + ఔనా = రాజౌనా
18) కార్యములు + ఒనరించు = కార్యములొనరించు
19) ఘనతరంబు + ఐన = ఘనతరంబైన
20) చందంబు + అగున్ = చందంబగున్
21) మౌనంబు + ఒప్పన్ = మౌనంబొప్పన్
22) వేదము + అటవీ మధ్యంబులో = వేదమటవీ మధ్యంబులో
23) ఏడ్పు + అగున్ = ఏడుగున్
24) హోమములు + ఎಲ್ಲ = హోమములెల్ల
25) విడువబోకుము + అయ్య = విడువబోకుమయ్య
26) పుష్పంబు + అగు = పుష్పంబగు
27) మంచు + అగు = మంచగు
28) స్థలంబు + అవు = స్థలంబవు
29) శత్రుండు + అతి = శత్రుండతి
30) మిత్రుడు + ఔ = మిత్రుడా
31) దివ్యాహారము + ఔ = దివ్యాహారమౌ
32) సర్వవశ్యకరము + ఔ = సర్వవశ్యకరమౌ
33) ఆచార్యునకు + ఎదురు = ఆచార్యునకెదురు
34) చేయకుము + ఆచారము = చేయకుమాచారము
35) పోకుము + అయ్యా = పోకుమయ్య
36) ఉండుము + ఉండదె = ఉండుముండదె
37) నూఱు + ఏండ్లు = నూడేండ్లు
38) ఉండదు + ఏ = ఉండదే
ఈ) నూతన పరిచయం :
జశ్వ సంధి :
జశ్ వరాలకు (క, చ, ట, త, ప, ఖ, ఛ, ఠ, థ, ఫ, శ, ష, స) జరిగే సంధి కాబట్టి ఇది జశ్వ సంధి. ఉదాహరణలు :
1) సత్ + భక్తి = సద్భక్తి
2) దిక్ + అంతము = దిగంతము
3) సముత్ + అంచత్ + సముదంచత్
4) మృత్ + ఘటము = మృద్దటము
5) వాక్ + ఈశుడు = వాగీశుడు
6) వాక్ + యుద్ధం = వాగ్యుద్ధం
7) వాక్ + వాదం = వాగ్వాదం
8) తత్ + విధం = తద్విధం
జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.
4) సమాసాలు – ఖాళీలను పూరించండి.
సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1. సాధుసజ్జనులు | సాధువులైన సజ్జనులు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
2. ధనాఢ్యుడు | ధనము చేత ఆడ్యుడు | తృతీయా తత్పురుష సమాసం |
3. నూడేండ్లు | నూటైన సంఖ్య గల ఏండ్లు | ద్విగు సమాసం |
4. దుష్టచిత్తుడు | దుష్టమైన చిత్తము గలవాడు | బహుబీహి సమాసం |
5. క్రూర భుజంగం | క్రూరమైన భుజంగం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
6. కార్యాలోచనము | కార్యమును గూర్చి ఆలోచనము | ద్వితీయా తత్పురుష సమాసం |
7. ఫణాగ్రభాగము | ఫణము యొక్క అగ్రభాగము | షష్ఠీ తత్పురుష సమాసం |
8. అనర్ఘ రత్నాలు | అనర్హమైన రత్నాలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
ఊ) కర్మధారయ సమాసాలు
కర్మధారయ సమాసం : విశేషణానికి విశేష్యం (నామవాచకం) తో చేసే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు.
ఉదా : కృష్ణ సర్పం.
‘కృష్ణ’ అనేది విశేషణం. ‘సర్పం’ అనేది విశేష్యం.
I. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
పోలిక చెప్పడానికి ఉపయోగించేదాన్ని ‘ఉపమానం’ అంటారు. కర్మధారయ సమాసంలో మొదటి పదం ఉపమానం అయితే దాన్ని ‘ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
కలువ కనులు.
కలువ వంటి కన్నులు అనే అర్థంలో కర్మధారయ సమాసంలో కన్నులను కలువలతో పోల్చారు. కాబట్టి ‘కలువ’ ఉపమానం. ఉపమానం మొదటి పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం.
II. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
కర్మధారయ సమాసంలో ఉపమానం ఉత్తరపదంగా ఉంటే దాన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
పదాబ్దము
పద్మం వంటి పదం (పాదం) అనే అర్థంలో కర్మధారయ సమాసం చేయగా పదశబ్దం మొదటి పదంగా నిలిచింది. ఉపమానమైన అబ్దం (పద్మం) రెండవ పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం.
సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1. తేనెమాట | తేనెవంటి మాట (తేనె – ఉపమానం; మాట-ఉపమేయం) |
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం |
2. తనూలత | లత వంటి తనువు (తనువు-ఉపమేయం; లత-ఉపమానం) |
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం |
3. చిగురుకేలు | చిగురు వంటి కేలు (చిగురు-ఉపమానం; కేలు-ఉపమేయం) |
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం |
4. కరకమలములు | కమలముల వంటి కరములు కరములు-ఉపమేయం: కమలములు-ఉపమానం |
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం |
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1) సుధామధురం
2) జుంటిమోవి
3) ముఖారవిందం
4) కాంతామణి
జవాబు:
సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1. సుధామధురం | సుధలా మధురమైనది (సుధ = అమృతం) |
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం |
2. జుంటిమోవి | జున్ను వంటి మోవి | ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం |
3. ముఖారవిందం | అరవిందం (పద్మం) వంటి ముఖం | ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం |
4. కాంతామణి | మణి వంటి కాంత | ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం |
ఋ) రూపక సమాసం:
“విద్యాధనం” దీనిలో విద్య, ధనం అనే రెండు పదాలు ఉన్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం. కనుక, ఈ విధంగా ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడాన్ని – రూపక సమాసం అంటారు. విగ్రహవాక్యంలో ‘అనెడి’ అనే మాట చేరుతుంది.
ఉదా :
1) హృదయసారసం – హృదయమనెడి సారసం (సరస్సు) .
2) సంసారసాగరం – సంసారమనెడి సాగరం
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1) జానజ్యోతి -జ్ఞానమనెడి జ్యోతి – రూపక సమాసం
2) అజ్ఞానతిమిరం అజ్ఞానమనెడి తిమిరం – రూపక సమాసం
3) వచనామృతం — అమృతమనెడి వచనం – రూపక సమాసం
ఋ) ఛందస్సు – మత్తేభం :
1) ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
2) ప్రతి పాదానికి స. భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
3) ప్రాసనియమం ఉంది.
4) 14 వ అక్షరం యతిస్థానం.
5) ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
యతి : ప – పా.
మీరు కూడా పాఠంలోని పై పద్యంలో మిగిలిన మూడు పాదాలకూ, గణవిభజన చేసి, పై మత్తేభ పద్య లక్షణాలు సరిపోయాయో లేదో చూడండి.
యతి : ప – ఆ.
యతి : అ – ఆ.
య యతి : శి – శ్రీ.
ఎ) అలంకారాలు :
గతంలో మీరు నేర్చుకున్న రూపక, ఉపమాలంకారాలు 6, 7 పద్యాల్లో ఉన్నాయి. ఏ పద్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించి, లక్ష్య లక్షణ సమన్వయం చేయండి.
గమనిక (1):
6వ పద్యంలో ‘ఉపమాలంకారాలు’ ఉన్నాయి పరిశీలించండి.
1. స్నానంబుల్ నదులందు జేయుట గజ స్నానంబు చందంబగున్”
ఇందులో ఉపమాలంకారం ఉంది.
లక్షణము : దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) గజస్నానంబు – ఉపమానం
2) నదులందుచేయుట – ఉపమేయం
3) చందంబు – ఉపమావాచకం
4) అగున్ – సమానధర్మం
2. మౌనంబొప్ప జపించు వేద ‘మటవీ మధ్యంబులో నేడ్పగున్’
ఇందులో ఉపమాలంకారం ఉంది.
లక్షణము :
దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) అటవీ మధ్యంలో ఏడుపు – ఉపమానం
2) మౌనంతో వేదం జపించడం – ఉపమేయం
3) (లోపించింది) – ఉపమావాచకం
4) అగున్ – సమానధర్మం
3. ‘నానాసూమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యె చనున్’
ఈ పాదంలో ఉపమాలంకారము ఉంది.
లక్షణము :
దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) బూడిదలలోవేల్చు నెయ్యి – ఉపమానం
2) నానా హోమములు – ఉపమేయం
3) (లోపము) – ఉపమావాచకం
4) చనున్ – సమానధర్మం
గమనిక (2) :
ఏడవ పద్యంలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. పరిశీలించండి.
1. ‘విపత్పరంపరోత్తుంగ తమః పతంగ’
ఈ వాక్యంలో రూపకాలంకారము ఉంది.
భావం :
కష్టాలు అనే కారుచీకట్లను తొలగించే సూర్యుడు అని భావం.
రూపకాలంకార లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడం రూపకాలంకారం.
సమన్వయము :
1) తమము (తమస్సు) – ఉపమానం
2) విపత్పరంపరలు – ఉపమేయం
ఉపమానమైన చీకటికీ, ఉపమేయమైన విపత్తులకూ భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ‘రూపకాలంకారం’.
2. ‘ధరాత్మజాహృదయసారసభృంగ’
ఈ వాక్యంలో ‘రూపకాలంకారం’ ఉంది.
భావం :
సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెద వంటివాడవు. రూపకాలంకార
లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం.
సమన్వయం:
1) సారసము (పద్మము) – ఉపమానం
2) హృదయము – ఉపమేయం
ఉపమానమైన సారసమునకూ, ఉపమేయం అయిన హృదయమునకూ భేదం ఉన్నా, లేనట్లు చెప్పడం జరిగింది. కాబట్టి ‘రూపకాలంకారం’.
3. ‘నిశాచరాప్తమాతంగ’
ఈ వాక్యంలో రూపకాలంకారము ఉంది.
భావం :
రాక్షసులు అనే కలువలను నాశనం చేసే ఏనుగువంటివాడు.
రూపకాలంకార లక్షణం :
ఉపమాన – ఉపమేయములకు అభేదం చెప్పడం, లేక ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం రూపకాలంకారం.
సమన్వయం:
1) అబ్జము (కలువ) – ఉపమానం
2) నిశాచరులు – ఉపమేయం
ఉపమానమైన అబ్దమునకూ, ఉపమేయం అయిన నిశాచరులకూ భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కా.ట్ట ‘రూపకాలంకారం’ ఉంది.
ఏ) దృష్టాంతాలంకారం :
లక్షణం :
ఉపమేయ వాక్యానికి, ఉపమాన వాక్యానికి బింబ ప్రతిబింబ భావం వర్ణించబడితే దాన్ని దృష్టాంతాలంకారం అంటారు.
లక్ష్యం (ఉదాహరణ) :
ఓ రాజా నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.
సమన్వయం :
ఇందు రాజు ఉపమేయం. చంద్రుడు ఉపమానం. ఉపమేయ వాక్యానికి, ఉపమాన వాక్యానికి బింబ ప్రతిబింబ భావం చెప్పబడింది గనుక ఇది దృష్టాంతాలంకారం. దృష్టాంతాలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.
1) రాజే ధర్మపరుడు, బుద్ధుడే అహింసాపరుడు.
2) బాబా ఆమేనే విజ్ఞాని, రమణ మహర్షియే జ్ఞాని.
9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు కవుల పరిచయం
ఈ పాఠంలోని ప్రతి పద్యమూ ఒక విలువైన రత్నమే. ఈ పద్యాలన్నీ వేర్వేరు కవులు రాసిన శతకాల్లోనివి. ఆయా కవుల వివరాలు చదవండి.
1. ‘శ్రీకర రాజశేఖరా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘రాజశేఖర శతకం’ లోనిది. దీని కర్త ‘సత్యవోలు సుందరకవి.” 20వ శతాబ్దానికి చెందినవారు. భక్తిభావం ఉట్టిపడేటట్లు సులభ శైలిలో శతకాన్ని రచించారు.
2,3. ‘సర్వేశ్వరా ! అనే మకుటంతో ఉన్న పద్యాలు ‘సర్వేశ్వర శతకం’లోనివి. వీటిని ‘యథావాక్కుల అన్నమయ్య’ రచించారు. ఇతడు 12వ శతాబ్దానికి చెందిన శివకవి. భక్తిభావబంధురమైన కవిత్వం చెప్పగల దిట్ట.
4. ‘భర్గా ! పార్వతీ వల్లభా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కూచిమంచి తిమ్మకవి’ రచించిన ‘శ్రీ భర్గశతకం’ లోనిది. ఈయన 17వ శతాబ్దానికి చెందిన వారు. ‘నీలాసుందరీ పరిణయం’ అనే ప్రబంధాన్ని కూడా రచించారు.
5. ‘భూషణ వికాస శ్రీధర్మ పురనివాస ! దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కాకుత్సం శేషప్ప కవి’ రాసిన ‘నరసింహ శతకం’లోనిది. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. గోదావరీ తీరంలో కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి గ్రామంలో వెలసిన నరసింహస్వామిని ప్రస్తుతిస్తూ రాసిన శతకం ఇది.
6. ‘నారాయణా !’ అన్న మకుటంతో ఉన్న పద్యం నారాయణ శతకం లోనిది. రాసింది బమ్మెర పోతన. 15వ ఆ శతాబ్దానికి చెందిన భక్త కవి. మనస్సుకు ఆహ్లాదకరమైన, అందమైన పద్యాలు చెప్పిన సహజపండితులు.
7. ‘దాశరథీ ! కరుణాపయోనిధీ !’ అనే మకుటంతో ఉన్న పద్యం దాశరథి శతకం లోనిది. దీన్ని రచించిన కవి కంచర్ల గోపన్న. 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయనకే రామదాసు అనే పేరుంది.
8. ‘శ్రీకాళహస్తీశ్వరా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘ధూర్జటీ’ కవి రచించిన ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోనిది. వీరు 17వ శతాబ్దానికి చెందినవారు.
9. ‘కుమారా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కుమార శతకం’ లోనిది. కవి ‘పక్కి అప్పలనర్సయ్య’. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు.
10. ‘సుమతీ !’ అన్న మకుటంతో ఉన్న పద్యం ‘సుమతీ శతకం’ లోనిది. కవి బద్దెన. వీరు 13వ శతాబ్దానికి ! చెందినవారు.
పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు
1వ పద్యం : – కంఠస పదం
*ఉ॥ కోరికతో ధనాఢ్యుఁడని కుత్సితు నల్పుని దుష్టచిత్తునిన్
జేరినవార లీప్సితముఁ జెంది సుఖింపరు హానిఁ గాంతు రా
చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము గల్గి వెళ్లినన్
గ్రూర భుజంగమున్ గవయఁ గూడునె శ్రీకర రాజశేఖరా !
ప్రతిపదార్థం:
శ్రీకర = శుభాన్ని కలిగించే
రాజశేఖరా = చంద్రుని శిరస్సున ధరించే ఈశ్వరా !
కోరికతోన్ = కోరుకొని
ధనాఢ్యుడు + అని = అధిక ధనవంతుడని
కుత్సితున్ = మోసకారియైన
అల్పునిన్ = తక్కువవాడైన
దుష్టచిత్తునిన్ = చెడ్డబుద్ధికలవాణ్ణి
చేరినవారలు = చేరినవారు (ఆశ్రయించినవారు)
ఈప్సితమున్ = కోరిన కోరికను
చెంది = పొంది
సుఖింపరు = సుఖపడరు
హానిన్ = కీడును
కాంతురు = పొందుతారు
చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము ; చారు = అందమైన
అగ్రభాగ = పై భాగము నందు
ఫణ = పడగయొక్క
విలసత్ = ప్రకాశించే
మణిరాజము = శ్రేష్ఠమైన మణిని
కల్గి = కలిగియుండి
వెల్గినన్ = ప్రకాశించినప్పటికీ (ఒప్పియున్నా)
క్రూర భుజంగమున్ = క్రూరమైన సర్పాన్ని
కవయఁగూడును + ఎ = కలిసి ఉండవచ్చా? (కలిసి ఉండరాదు)
భావం :
శుభాన్ని కల్గించే రాజశేఖరా ! మోసకారియైన ధనవంతుణ్ణి కోరి చేరితే, కోరికలు తీరకపోగా కీడు కూడా కలుగుతుంది. పడగ మీద విలువగల మణి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ, భయంకరమైన పాముతో కలిసి యుండరు కదా !
2వ పద్యం: కంఠస్థ పద్యం
* మ॥ కుల శైలంబులు పొదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినం
జలధు ల్మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్
జలజాతప్రియ శీతభానులు యథా సంచారముఱ్ఱప్పినం
దలకం డుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా !
ప్రతిపదార్థం:
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామి !
కుల శైలంబులు = కుల పర్వతాల
పాదు = మూలం (ఆలవాలం)
పెల్లగిలి = నశించి, ఊడిపోయి
దిక్కూలంబునన్ = దిక్కుల దగ్గర
(దిక్ + కూలంబునన్) (దిగంతముల వద్ద)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రాలు
మేరలన్ = సరిహద్దులను
ఆక్రమించి = దాటి (చేరి)
సముదంచత్ + భంగిన్ = మిక్కిలి చెలరేగిన విధంగా
ఉప్పొంగినన్ = పైకి పొంగినా
జలజాతప్రియ, శీతభానులు; జలజాతప్రియ = పద్మ బాంధవుడైన సూర్యుడూ,
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడూ
యథాసంచారముల్ = వారు నిత్యం తిరిగే దారిలో తిరగడం
తప్పి నన్ = తప్పిపోయినా (ప్రక్కదారిలో తిరుగుతున్నా)
భవద్భక్తుండు (భవత్ + భక్తుండు) = నీ యొక్క భక్తుడు
తలకండు = చలింపడు
ఉబ్బడు = గర్వపడడు
చొప్పు = నీతిమార్గాన్ని
తప్పడు = విడువడు (తప్పి సంచరింపడు)
భావం : సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురై దిగంతాలలో కూలినా, సముద్రాలు హద్దులను దాటి ఉప్పొంగినా, సూర్య చంద్రులు గతులు తప్పి చరించినా, నీ భక్తుడు అణుమాత్రం గర్వపడడు. నీతిమార్గాన్ని తప్పి సంచరింపడు.
3వ పద్యం: కంఠస్థ పద్యంగా
* శా॥ సత్యం బెప్పుడు దప్పుడేనియు దురాచారుండు ‘గాడేని యౌ
చిత్యం బేమరడేని దుర్జనుల గోష్ఠిం బొందడే భక్తి సాం
గత్యం బాదట బాయడేని, మదనగ్రస్తుండు గాడేని నీ
భృత్యుండాతడు మూడు లోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా !
ప్రతిపదార్థం :
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వరా !
సత్యంబు = సత్యాన్ని
ఎప్పుడు = అన్నివేళలా
తప్పుడు + ఏనియున్ = తప్పకుండా ఉన్నట్లయితే
దురాచారుండు = చెడు నడతగలవాడు
కాడు + ఏనిన్ = కాకుండా ఉన్నట్లయతే
ఔచిత్యంబు = తగిన విధాన్ని (ఉచితత్వము)
ఏమరడు + ఏనిన్ = మరువనట్లయితే ఆ
దుర్జనులు = దుష్టుల (చెడ్డవారి యొక్క)
గోష్ఠిన్ : = కొలువును (సంఘమును)
పొందడు + ఏన్ – చేరనట్లయితే
భక్తిసాంగత్యంబు = భక్తులతో చెలియన
ఆదటన్ = వదలక
పాయడు + ఏని = విడువడేని
మదనగ్రస్తుండు = మన్మథీమోహాంలో చిక్కుకొన్నవాడు
కాడెనిన్ = కానివాడయితే
ఆతడు = అతడు
నీ భృత్యుండు = నీకు సేవకుడు అవుతాడు
మూడు లోకములలోన్ = ముల్లోకాలలోనూ
పెంపొందున్ = అభివృద్ధి పొందుతాడు.
భావం :
ఓ సర్వేశ్వరా ! ఈ మూడు లోకాల్లోనూ సత్యము తప్పనివాడు, చెడు నడతలేనివాడు, తగిన విధంగా మెలిగేవాడు, చెడ్డవాళ్ళతో చేరనివాడు, భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టనివాడు, సంసారమోహంలో చిక్కుకోనివాడూ ఎవడున్నాడో అతడే నీ సేవకుడు.
4వ పద్యం : కంఠస్థ పద్యం
* శా॥ గాజుంబూస యనర్ఘ రత్న మగునా ? కాకంబు రాయంచ’
నా ? జోరీగ మధువ్రతేంద్ర మగునా ? నట్టెన్ము పంచాస్యమౌ
నా ? జిల్లేడు సురావనిజమగునా ? నానాదిగంతంబులన్ ,
రాజౌనా ఘనలోభి దుర్జనుడు ? భర్గా ! పార్వతీ వల్లభా!
ప్రతిపదార్థం :
పార్వతీవల్లభా = పార్వతీపతీ !
భర్గా = ఓ ఈశ్వరా !
నానా దిగంతంబులన్ = అన్ని దిక్కుల చివరలలోనూ (ప్రపంచంలో ఎక్కడయినా)
గాజుంబూస (గాజున్ + పూస) = గాజుపూస
అనర్ఘ = వెలకట్టలేని
రత్నము = రత్నం
అగునా = అవుతుందా? (కాలేదు)
కాకంబు = కాకి
రాయంచ = రాజహంస
ఔనా ? = అవుతుందా ? (కాలేదు)
జోరీగ = పశువుల రక్తాన్ని త్రాగే ఒక జాతి ఈగ
మధువ్రతేంద్రము (మధువ్రత + ఇంద్రము) = శ్రేష్ఠమైన తుమ్మెద
అగునా = అవుతుందా ? (కాలేదు)
నట్టెను = దున్నపోతు
పంచాస్యమ = సింహం
ఔనా = అవుతుందా ? (కాలేదు)
జిల్లేడు = జిల్లేడు చెట్టు
సుర + అవనీజము = దేవతల వృక్షమైన కల్పవృక్షం
అగునా = అవుతుందా ? (కాదు)
ఘనలోబి = గొప్ప పిసినారి అయిన
దుర్జనుడు = దుర్మార్గుడు
రాజు + ఔనా = రాజు అవుతాడా ? (కాలేడు)
భావం :
భర్గా ! పార్వతీపతీ ! ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పటికీ గాజుపూస విలువైన రత్నం కాజాలదు. కాకి రాజహంస కాజాలదు. జోరీగ తేనెటీగ కాజాలదు. దున్నపోతు సింహం కాజాలదు. జిల్లేడు చెట్టు కల్పవృక్షం కాజాలదు. అలాగే పిసినారి యైన దుర్మార్గుడు రాజు కాలేడు.
5వ పద్యం :
సీ॥ సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు
కవులతో వైరంబు గాంచఁగీడు,
పరమదీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు,
భిక్షగాండ్రను దుఃఖపెట్టఁగీడు ”
నిరుపేదలను చూచి నిందఁ జేసినఁగీడు
పుణ్యవంతులఁ దిట్టఁ బొసగుఁగేడు
సద్భక్తులను దిరస్కారమాడివఁ గీడు,
గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు
తే॥గీ॥ దుష్టకార్యము లొనరించు దురమలకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె
భూషణ వికాస ! శ్రీధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర!
ప్రతిపదార్థం :
భూషణ = అలంకారాల చేత
వికాస = శోభిల్లేవాడా !
శ్రీధర్మపుర = ధర్మపురి అనే గ్రామంలో
నివాస = నివసించేవాడా ! (వెలసినవాడా !)
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా!
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహ = ఓ నరసింహస్వామీ !
సాధుసజ్జనులతోన్ = మంచివారితో
జగడము + ఆడినన్ = కలహం పెట్టుకొంటే
కీడు = హాని (చెడుపు
కవులతోన్ = కవులతో
వైరంబు = శత్రుత్వం
కాంచన్ = పొందగా
కీడు = హాని
పరమదీనులన్ = మిక్కిలి దీమలను
(చిక్కఁబట్టి) చిక్కన్ + పట్టి = కట్టివైచి
కొట్టినన్ = కొడితే
కీడు = హాని
భిక్షగాండ్రను = ముష్టివారిని
దుఃఖ పెట్టన్ = ఏడ్పిస్తే
నిరుపేదలను = మిక్కిలి పేడవారిని
చూచి = చూచి
నిందన్ + చేసినన్ = తిట్టితే (నిందిస్తే)
కీడు = హాని
పుణ్యవంతులన్ = పుణ్యాత్ములను
తిట్టన్ = తిడితే
కీడు = హాని
పొసగున్ = సంభవిస్తుంది (సత్ + భక్తులను) = మంచి భక్తులయినవారిని
తిరస్కారము + ఆడినన్ = తిరస్కరిస్తే
కీడు = హాని
గురుని = గురువుగారి యొక్క
ద్రవ్యమున్ = సొమ్మును
దోచుకొనినన్ = దొంగిలిస్తే
కీడు = హాని
దుష్టకార్యములు = చెడ్డపనులు
ఒనరించు = చేసే
దుర్జనులకు = దుష్టులకు
ఘనతరంబు + ఐన = గొప్పదైన
నరకంబు = నరకలోకం
గట్టి ముల్లె = భద్రముగా కట్టుకొన్న మూట
భావం :
అలంకారాలచేత శోభించేవాడా ! ధర్మపురి గ్రామంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా ! నరసింహా ! మంచివారితో తగవు పెట్టుకుంటే హాని కలుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకొంటే, వారిని పట్టుకొని కొడితే, ముష్టివారిని ఏడిపిస్తే, పేదలను నిందిస్తే కీడు జరుగుతుంది. పుణ్యాత్ములను తిడితే, మంచి భక్తులను తిరస్కరిస్తే, గురువుగారి సొమ్మును దోచుకుంటే కీడు జరుగుతుంది. ఈ విధంగా చెడు పనులు చేసేవారికి నరకం తప్పదు. (వారికి నరకం, భద్రంగా కట్టుకొన్న మూట వంటిది.)
6వ పద్యం : కంఠస్త పద్యం
* శా॥ స్నానంబుల్ వదులందుఁ జేయుట గజ స్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించు వేద మటవీ మధ్యంబులో నేడుగున్
నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యి చను
న్నీ నామోక్తియు నీ పదాబ్దరతియున్ లేకున్న వారాయణా !
ప్రతిపదార్థం :
నారాయణా = ఓ విష్ణుమూర్తీ ! నారాయణా!
నీ = నీ యొక్క
నామోక్తియున్ కీడు (నామ + ఉక్తియున్) = నామాన్ని స్మరించుటయు
నీ = నీ యొక్క
పదాబ్జ (పద + అల్ల) = పద్మముల వంటి పాదాల యందు
రతియున్ = ఆసక్తియును (అనురాగమును)
లేకున్నన్ (లేక + ఉన్నన్) = లేకుంటే (లేకపోతే)
నదులందున్ = నదులలో (గంగ, గోదావరి వంటి పుణ్యనదులలో)
స్నానంబుల్ = స్నానములు
చేయుట = చేయడం
గజస్నానంబు = ఏనుగు చేసే స్నానం
చందంబు = వంటిది (పోలినది)
అగున్ = అవుతుంది.
మౌనంబు +ఒప్పన్ = పైకి ధ్వని వినబడకుండా
జపించు = జపించే
వేదము = వేదపారాయణం
అటవీ మధ్యంబులోన్ = అడవి మధ్యభాగంలో
ఏడ్పు + అగున్ = ఏడుపు వంటిది అవుతుంది.
నానాహోమములు = అనేక రకాలైన పుణ్యహోమాలు
ఎల్లన్ = అన్నియును
బూడిదలలోనన్ = బూడిద రాశులలో
వేల్చు = హోమం చేసే
నెయ్యె – (నెయ్యి + ఐ) = నేయివలె
చనున్ = పోతుంది (వ్యర్థం అవుతుంది)
భావం :
నారాయణా ! నీ నామం స్మరింపనివాడు, నీ పాదపద్మాలపై భక్తిలేనివాడు ఎన్ని నదులలో స్నానం చేసినా అది ఏనుగు స్నానం వంటిదే అవుతుంది. అతడు మంత్రాలను మౌనంగా జపించినా, అది అరణ్యరోదనమే అవుతుంది. ఎన్ని హోమాలు చేసినా, అది బూడిదలో పోసిన నెయ్యే అవుతుంది.
1) గజస్నానము :
గజస్నానము అంటే ఏనుగు స్నానం. ఏనుగు శుభ్రంగా నదులలో, మడుగులలో స్నానం చేసిన రంగ తరువాత గట్టుపైకి వచ్చి అక్కడ ఉన్న మట్టిని తొండంతో పీల్చి శరీరంపై చల్లుకుంటుంది. అంటే అది స్నానం చేసినా శుద్ధ దండుగ అని భావము.
2) అరణ్యరోదనం :
అరణ్యరోదనం అంటే అడవి మధ్యలో కూర్చుండి ఏడవడం. అడవిలో ఏడిస్తే ఎవరికీ వినబడదు. అందువల్ల ఎవరూ వచ్చి ఓదార్చరు. సాయం చేయరు. అదే జనులు ఉండే పల్లెలోనో, నగరంలోనో ఏడిస్తే ఎవరో ఒకరు వచ్చి ఓదారుస్తారు. అంటే అడవిలో ఏడవడం దండుగ అని భావం.
3) బూడిదలో నేయి హోమం :
సామాన్యంగా దేవతల ప్రీతికై అగ్నిజ్వాలల్లో నేతిని హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు, మంట మండేటప్పుడే హోమం చేయాలి. నిప్పులలో హోమం చేయరాదు. బూడిదలో హోమం చెయ్యడం శుద్ధ దండుగ అని భావం.
4) విష్ణుభక్తి లేనివాడు పుణ్యనదులలో స్నానం చేసినా, మౌనంగా వేదమంత్రాలు పారాయణ చేసినా, బూడిదలో నేతిని హోమం చేసినా దండుగ అని సారాంశం.
విశేషం :
‘జపం’ మూడు విధాలుగా ఉంటుంది.
1) మనస్సులో చేసే జపం ‘మానసికం’
2) పెదవులు కదుపుతూ చేసే జపం ‘ఉపాంశువు’
3) ఇతరులకు వినబడేటట్లు చేసే జపం ‘వాచికం’
ఈ పద్యంలో ‘మానసిక జపం’ గూర్చి చెప్పారు. ఇది జపాలన్నింటిలో ఉత్తమం.
7వ పద్యం : కంఠస్థ పద్యం
* ఉ॥ రంగదరాతి భంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమః పతంగ, పరితోషితరంగ, దయాతరంగ, స
త్సంగ, ధరాత్మజాహృదయసారసభృంగ, నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ!
ప్రతిపదార్థం :
రంగత్ = ప్రకాశించుచున్న
అరాతి = శత్రువులను
భంగ = భంజించువాడా ! (సంహరించేవాడా !)
ఖగరాజ = పక్షిరాజయిన గరుత్మంతుడు అనెడి
తురంగ = గుఱ్ఱము కలవాడా !
విపత్ = ఆపదల యొక్క
పరంపరా = ఎడతెగని వరుస అనెడి
ఉత్తుంగ = మిక్కిలి అధికమైన
తమః = చీకటికి
పతంగ = సూర్యుడయినవాడా !
పరితోషిత = సంతోష పెట్టబడిన
రంగ = రంగస్వామి కలవాడా ! (రంగనాథస్వామి)
దయాంతరంగ (దయ + అంతరంగ) = దయగల మనస్సు కలవాడా!
సత్సంగ = సజ్జనులతో కూడిక కలవాడా!
ధరాత్మజా (ధర + ఆత్మజా) = భూదేవి కూతురైన సీతాదేవి యొక్క
హృదయ = మనస్సు అనెడి
సారస = పద్మమునకు
భృంగ = తుమ్మెద అయినవాడా !
నిశాచర = రాక్షసులనెడి
అబ్జ = తామరలకు
మాతంగ = ఏనుగు అయినవాడా !
శుభ + అంగ (శుభాంగ) = మంగళప్రదమైన
అవయవాలు కలవాడా !
భద్రగిరి = భద్రాచలంలో వెలసిన
దాశరథి = దశరథ పుత్రుడవయిన రామా!
కరుణాపయోనిధీ = దయా సముద్రుడా !
భావం :
భద్రగిరిపై కొలువున్న స్వామీ ! దశరథుని పుత్రుడా! సముద్రమంతటి దయగలవాడా ! నీవు యుద్ధరంగంలో శత్రువులను నాశనం చేసినవాడవు. గరుత్మంతుడినే వాహనంగా కలవాడవు. కష్టాలు అనే కారుచీకట్లను తొలగించే సూర్యుడవు. సంతోష పెట్టబడిన రంగనాథుడు కలవాడవు. దయగల హృదయం కలవాడవు. సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెదవంటివాడవు. రాక్షసులనే పద్మాలను నాశనం చేసే ఏనుగువంటి వాడవు. మంగళప్రదమైన దేహం కలిగినవాడవు.
గమనిక : ఈ పద్యంలో “పరితోషితరంగ దయాంతరంగ” అనే సమాసాన్ని ఏకసమాసంగా తీసుకొని Text లో సంతోషము అనే అలలతో నిండిన దయగల హృదయం గలవాడవు అని భావం రాశారు – కాని ‘పరితోషితరంగ’ అనగా సంతోష పెట్టబడిన రంగనాథుడు కలవాడా అని పూర్వవ్యాఖ్యలలో రాయబడింది.
‘Text లో ఇచ్చినట్లు భావం రాయాలంటే పరితోష తరంగ’ అని ఉండాలి. కాని ఇక్కడ ‘పరితోషితరంగ’ అని ఉంది. కాబట్టి ‘పరితోషతరంగ’ అని దిద్దుకోవాలి. (లేదా) Text లో ఉన్నట్లే ‘పరితోషిత’ అని ఉంటే, పూర్వ వ్యాఖ్యలలో వలె, సంతోషపెట్టబడిన రంగనాథుడు కలవాడని అర్థం చెప్పాలి.
8వ పద్యం : కంఠస్థ పద్యం
*మ|| పవి పుష్పంబగు, నగ్నిమంచగు, నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుం డతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలి లోపలన్ శివశివే త్యాభాషణోల్లాసికిన్
శివ ! నీ నామము సర్వవశ్యకరమౌ ! శ్రీకాళహస్తీశ్వరా !
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా (శ్రీకాళహస్తి + ఈశ్వరా) = శ్రీకాళహస్తీశ్వరా !
శివ = ఓ శివా !
అవనీమండలి లోపలన్ = భూమండలంలో
శివశివేతి (శివశివ + ఇతి) = శివ శివ అని
ఆభాషణోల్లాసికిన్ ఆభాషణ + ఉల్లాసికిన్ = స్మరిస్తూ ఆనందించే వాడికి
పవి = వజ్రాయుధము
పుష్పంబు + అగున్ = పుష్పం అవుతుంది
అగ్ని = కాల్చెడి అగ్ని
మంచు + అగున్ = చల్లని మంచు అవుతుంది
అకూపారంబు = సముద్రము
భూమీస్తలంబు + అవు = నేల అవుతుంది
శత్రుండు = శత్రువు
అతిమిత్రు డౌ (అతిమిత్రుడు + ఔ) : మంచి స్నేహితుడు అవుతాడు
విషము = విషము
దివ్య + ఆహారము = అమృతము
ఔన్ = అవుతుంది
ఎన్నగాన్ = ఎంచి చూడగా
నీ నామము = నీ నామోచ్చారణము
సర్వవశ్యకరము + ఔ = అన్నింటినీ సులభసాధ్యములుగా చేస్తుంది.
భావం :
శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసిన ఓ పరమేశ్వరా! నీ నామస్మరణం వల్ల అన్నీ సాధ్యం అవుతాయి. ఈ భూలోకంలో శివ ! శివ ! అని ఉత్సాహంతో పలికే వానికి వజ్రాయుధం – పుష్పంలా, నిప్పు – మంచులా, సముద్రం – నేలలా, పగవాడు – స్నేహితునిలా, విషం – అమృతంలా సులభసాధ్యాలుగా మారతాయి.
9వ పద్యం :
కం|| ఆచార్యున కెదిరింపకు
ప్రోచినదొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడువఁ బోకుమయ్య కుమారా !
ప్రతిపదార్థం :
అయ్య, కుమారా = ఓ నాయనా ! కుమారా !
ఆచార్యునకున్ , = చదువు చెప్పే గురువు మాటకు
ఎదిరింపకు = ఎదురు చెప్పవద్దు
ప్రోచిన = నిన్ను పోషించిన
దొర = యజమానిని
నింద + చేయన్ + పోకుము = నిందింపవద్దు
కార్యాలోచనములు (కార్య + ఆలోచనములు) = పనిని గూర్చి ఆలోచనలు
ఒంటిన్ + చేయకు = ఒంటరిగా చేయవద్దు.
ఆచారము = మంచి నడవడికను
విడువఁబోకుము (విడువన్ + పోకుము) = వదలిపెట్టవద్దు.
భావం :
ఓ కుమారా ! చదువు చెప్పే గురువుమాటకు ఎదురు చెప్పవద్దు. నిన్ను పోషించే యజమానిని . నిందించవద్దు. ఒంటరిగా కార్యమును గూర్చి ఆలోచింపవద్దు. మంచి నడవడికను వదలి పెట్టవద్దు. (ఇలా చేయడం వల్ల నీకు ఎంతో మేలు కలుగుతుంది. అందరూ నిన్ను అనుసరిస్తారు.
10వ పద్యం :
కం|| ఉడుముండదె నూటేండ్లునుఁ
బడియుండదె పేర్మిఁ బాము పదినూడేండ్లున్
జీవించియుండదా? మడువునఁ గొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్థపరుడు గావలె సుమతీ! |
ప్రతిపదార్థం :
సుమతీ = మంచిబుద్ధి కలవాడా !
ఉడుము = ఉడుము
నూఱేండ్లునున్ (నూఱు + ఏండ్లునువ్) – వంద సంవత్సరాలపాటు
ఉండదె = జీవించియుండదా ?
పేర్మిన్ = అభివృద్ధితో
పాము = పాము
పదినూటేండ్లున్ = వేయి సంవత్సరాలపాటు
పడియుండదె = (పడి + ఉండదు + ఎ) = ఉంటుంది కదా !
మడువునన్ = చెఱువులో
కొక్కెర = కొంగ
ఉండదె (ఉండదు + ఎ) = చాలాకాలం
ఇలన్ = భూమిపై
కడున్ = మిక్కిలి
పురుషార్థపరుడు (పురుష + అర్ధపరుడు) – ధర్మార్థ కామ మోక్షములు అనే పురుషార్థములను సాధించేవాడు
కావలెన్ = కావాలి
భావం :
సుమతీ ! వంద సంవత్సరాలు జీవించే ఉడుము, వేయి సంవత్సరాలు జీవించే పాము, చెఱువు నందు చాలాకాలం బతికే కొంగ – ఎన్ని సంవత్సరాలు బతికినా ప్రయోజనం ఉండదు. మంచి చేయాలనే ఆలోచన కలిగి, ధర్మార్థ కామ మోక్షాలను సాధించేవాడే ఉత్తముడు.