AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 1.
ఒక ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించుతున్నారో ఆ ప్రశ్నల జాబితా వ్రాయండి.
జవాబు:

 1. స్త్రీ వాదము యొక్క ప్రాముఖ్యం ఏమిటి?
 2. స్త్రీలకు నేడు నిజంగానే స్వాతంత్ర్యం లేదా?
 3. స్త్రీలు నేడు సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి?
 4. స్త్రీలకు పార్లమెంటులో రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉందా?
 5. ‘స్త్రీలను స్త్రీలే కించపరుస్తున్నారు’ అంటే మీరు అంగీకరిస్తారా?
 6. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తే స్త్రీల సమస్యలు పోతాయా?
 7. స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీల వేషభాషలు కారణమా?
 8. పురుషులు వంటగరిట చేతబడితే సమస్య పరిష్కారం అవుతుందా?
 9. స్త్రీలకు ఎటువంటి స్వాతంత్ర్యం కావాలి?
 10. స్త్రీలను భారతీయులు అనాదికాలం నుండి గౌరవిస్తున్నారని మీరు అంగీకరిస్తారా?

ప్రశ్న 2.
అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమలను నివారించాలని తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

దోమలపై దండయాత్ర
యువతీ యువకులారా ! ఆలోచించండి !

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. దోమలను నివారిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిలవ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్లిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. క్యూలెక్స్ జాతికి చెందిన ఆడదోమ వలన ఫైలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ వలన మలేరియా వ్యాపిస్తుంది. డెంగ్యూ కూడా దోమల వలన వస్తుంది. అందుచేత దోమల నివారణకు నడుం బిగిద్దాం – రండి – తరలిరండి.

ఇట్లు,
ఆరోగ్య శాఖ

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 3.
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలను గూర్చి వివరిస్తూ “కరపత్రం” తయారు యండి.
జవాబు:

మహిళాభ్యుదయం – కర్తవ్యం

సోదరులారా ! ఒక్కమాట ! –
మన సమాజంలో అనాది నుండి మహిళలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలను దేవతలగా భావిస్తాం. కాని రోజులు మారాయి. మనుషుల మనసులు మారాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు తగిన గుర్తింపు దొరకడం లేదు. అన్ని విధాలుగా వారిని అణగదొక్కడానికి పురుషులు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం స్త్రీల అభ్యున్నతికి కృషి చేయాలి. వాని కోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అవి :

 • స్త్రీలను అక్షరాస్యులుగా చేయాలి.
 • ఉద్యోగాల్లోను, రాజకీయ పదవుల్లోను తగిన రిజర్వేషన్ కల్పించాలి.
 • వృత్తి విద్యల శిక్షణను అందించాలి. సాంకేతిక విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలి.
 • స్త్రీలను చులకనగా చూడటం మానుకోవాలి.

ఇట్లు,
మహిళా రక్షణ సమితి,
కర్నూలు.

ప్రశ్న 4.
మరుగుదొడ్లు నిర్మించి, వినియోగించాలని కోరుతూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

మరుగుదొడ్లు నిర్మిద్దాం – రోగాలు నివారిద్దాం

సోదరీసోదరీమణులారా !
మన గ్రామంలో మరుగుదొడ్ల వసతి లేక ఎంతోమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. దానిపై ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు వాలతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఆ ఆహారం తినడం వల్ల మన ” ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. అవి ప్రజలను బాగా చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తుంది. కాబట్టి అందరు తమ ఇండ్లలో మరుగుదొడ్లను నిర్మించుకొని, వాటిని వినియోగించాలని కోరుతున్నాం. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొన్నవారమవుతాం. ‘మరుగుదొడ్లు నిర్మించుకొందాం – మంచి ఆరోగ్యంగా బ్రతుకుదాం’.
తేది : x x x x x

ఇట్లు,
ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి,
పాములపాడు.

ప్రశ్న 5.
బాలికల విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

బాలికల విద్య – సమాజానికి ప్రగతి

తల్లిదండ్రులారా !
బాలికలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. బాలికలు విద్యావంతులైనచో ప్రయోజనం ‘ఇంత’ అని చెప్పటానికి వీలులేదు.

ఇటీవలి కాలంలో రాజకీయ దాస్యంతోను, భావ దాస్యంతోను సంఘం మునిగి ఉంది. అందువల్ల బాలికల విద్య , చాలావరకు వెనుకబడి ఉంది.

‘ మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకు గాంధీ ‘మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయం: ప్రధానంగా చేర్చారు. బాలికల విద్యకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఆధునిక కాలంలో వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యక మొట్టమొదటిగా ఒక పాఠశాలను పెట్టి కృషి చేశారు.

సాంకేతిక విద్యలో నైపుణ్యం సంపాదించుటకై బాలికలకు ప్రత్యేకంగా ‘పాలిటెక్నిక్’ కళాశాలను ఏర్పరిచారు. కనుక స్త్రీలు గృహకృత్యాలను నిర్వహించుటలో విద్యావంతులైనచో బహుముఖ ప్రజ్ఞను వెల్లడించి దేశ సేవలోను, సంఘసేవలోను రాణించగలడు. తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుతారు. కనుక బాలికల విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కల్గుతుంది.

ఇట్లు,
బాలికల విద్యా ప్రోత్సాహక సంఘము
శ్రీకాకుళం.

ప్రశ్న 6.
వందేమాతరానికి వందేళ్ళు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“వందేమాతరం” కరపత్రం

సోదర భారతీయులారా ! మనమందరం, పవిత్ర భారతమాత కన్నబిడ్డలం. మన దేశ స్వాతంత్ర్య పరిరక్షణకై మనమంతా మన ప్రాణాల్ని సైతం ధారపోయడానికి సిద్ధం కావాలి.

మన భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికై జరిగిన స్వాతంత్ర్య పోరాటానికి ‘వందేమాతరం’ గీతం శంఖారావం చేసింది. బంకించంద్ర ఛటర్జీ ఆ వందేమాతరం గీతం రాసి నేటికి నూరు సంవత్సరాలు అయ్యింది. ఆనాడు దేశమంతా ఆ గీతాన్ని అంది పుచ్చుకొని, “వందేమాతరం మందే రాజ్యం” అంటూ గొంతెత్తి నినాదం చేసింది. బ్రిటిష్ వారిని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టింది.

ఆనాడు గాంధీజీ, నెహ్రూ, తిలక్, పటేలు వంటి నాయకులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యం భిక్ష పెట్టారు. ఈనాడు మనం హాయిగా వందేమాతరం గీతాన్ని జాతీయగీతంగా గొంతెత్తి పాడుకుంటున్నాము. ఆనాడు ‘వందేమాతరం’ అంటే నేరం.

మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టిన ‘వందేమాతరం గేయం యొక్క స్ఫూర్తిని కాపాడుకుందాం” మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, పాకిస్తాన్ దేశాల పొగరును అణచివేద్దాం. మనమంతా ఒక్కొక్క సైనికునిలా ‘కదంతొక్కుదాం. దేశభక్తియే మనకు జీవం. మరువకండి. మనమంతా భరతమాత వీరపుత్రులం. వీర పుత్రికలం.

‘జైహింద్’.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవలసిన అవసరం ఉంది. నీటిని దుర్వినియోగం చేయకుండా తీసికోవలసిన జాగ్రత్తలు, ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

నీటి పొదుపు – తీసుకోవలసిన జాగ్రత్తలు (కరపత్రం)

సోదర సోదరీమణులారా!
నేడు మన దేశంలో జనాభా పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం వల్ల, వర్షాల రాక తగ్గింది. ప్రతి నీటి బిందువును మనం సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

అడవులు తగ్గిపోతున్నాయి. వర్షాలు బాగా తగ్గాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నదీ జలాలు సముద్రాల పాలవుతున్నాయి. మనం నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి.

వ్యవసాయదారులు బిందు సేద్యాన్ని చేయాలి. ప్రతి ఇంటిలో ఇంకుడు కుంటలు ఏర్పాటు చేయాలి. వృథాగా కారిపోతున్న కుళాయిలను కట్టివేయాలి. నదులు, చెరువులు, కుంటలు లోని నీటిని కలుషితం చేయరాదు. వర్షపు నీటిని సైతం నేలలో ఇంకేటట్లు చేయాలి.

ఒక నీటి చుక్కను పొదుపు చేస్తే, అది మరో ప్రాణి ప్రాణాన్ని నిలుపుతుంది. అనవసరంగా నీటిని వదలి పెట్టరాదు. స్నానం చేసిన నీటిని, మొక్కలకు పోయాలి. ఆ నీటితో అంట్లు తోముకొని, శుభ్రం చేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. దుర్వినియోగం చేయవద్దు. మరువకండి.

ఇట్లు,
యువజన విద్యార్థి సంఘం.

ప్రశ్న 8.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖులు వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి
(లేదా )
మీ పాఠశాలను సందర్శించిన కవి/ కవయిత్రిని ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
‘ప్రశ్నావళి’ – ప్రముఖులతో ఇంటర్వ్యూ : –

 1. పూజ్యులయిన మీకు వందనాలు. సుస్వాగతము.
 2. నేటి పాఠశాల విద్యపై మీ అభిప్రాయం చెప్పండి.
 3. నేటి పాఠశాల విద్యలో మీరు గమనించిన లోపాలను చెప్పండి.
 4. నేటి బాలబాలికల విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచనలు చెప్పండి.
 5. మా విద్యార్థులలో మంచి అలవాట్లు పెంపొందడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
 6. నిరుద్యోగ సమస్య పై మీ అభిప్రాయాలు చెప్పండి.
 7. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను సూచించండి.
 8. మీరు నేడు గొప్ప వారయ్యారు. మీ అభివృద్ధికి కారణమైన సంఘటనలు తెల్పండి.
 9. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందడానికి, మీరిచ్చే సూచనలు తెలపండి.
 10. విద్యార్థులను ఆశీర్వదిస్తూ రెండు మాటలు చెప్పండి.

ప్రశ్న 9.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వస్తున్నారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి, తెలిసికోడానికి పిల్లలు ఇంటర్వూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ప్రశ్నావళి రూపొందించండి. ..
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి

 1. శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
 2. తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
 3. శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
 4. మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
 5. నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
 6. భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
 7. ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
 8. ‘సుమతి శతకం’ ప్రత్యేకత ఎటువంటిది?
 9. వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
 10. మీకు నచ్చిన శతకం ఏమిటి?
 11. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
 12. ఛందోబద్దం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?

ప్రశ్న 10.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.

తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. — పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.

స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపోర్టు చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.

అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలుద్దాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.

ఇట్లు,
వనితా సంఘం.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 11.
‘మహిళల రక్షణ మన కర్తవ్యం’ అనే అంశముపై కరపత్రం రాయండి..
జవాబు:

‘మహిళల రక్షణ – మన కర్తవ్యం’

సోదర సోదరీమణులారా ! చెప్పడానికి సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ రోజూ స్త్రీలపట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై సైతం అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీలపై యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్, మానభంగాలు, హింసాకృత్యాలు నిత్యం జరుగుతున్నాయి.

మన ఇంట్లో మన తల్లిని అక్కచెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాం. అలాగే ప్రతి స్త్రీని మనం కాపాడాలి. మహిళలకులు అన్యాయం జరిగితే ఎవరూ సహించరు అనే విషయం దుండగులకు గట్టిగా తెలియపరచాలి.

మహిళలపట్ల అకృత్యం జరిగితే మీరు ఉగ్రనరసింహరూపం ధరించి దుండగులను చీల్చిచెండాడండి. పోలీసువారికి కబురు అందించండి. ప్రక్కవారి సాయం తీసుకోండి. మన సోదరీమణులను మనమే రక్షించుకుందాం.

స్త్రీలు భారతదేశ భాగ్య కల్పలతలు. ప్రతి ఒక్కడూ స్త్రీల రక్షణకు ఉద్యమిస్తే ఎవరూ వారిపట్ల దుర్మార్గానికి సిద్ధం కారు. లెండి ఉద్యమించండి. దుర్మార్గులను చీల్చి చెండాడండి. మన అక్క చెల్లెండ్రను మనమే కాపాడుకుందాం.

ఇట్లు,
యువజన సంఘం.

12. ఉపాధ్యాయులను గౌరవించాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రాన్ని సిద్ధం చేయండి.
జవాబు:

“ఆచార్య దేవో భవ”

సంఘములో మానవుల అభివృద్ధికి తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధానపాత్ర వహిస్తారు. అందుకే మన ఉపనిషత్తులు ‘ఆచార్య దేవోభవ’ అని గురువును దైవంగా సేవించమని చెప్పాయి.

గురువులు తమకు అప్పగించిన విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను బోధించి, వారిని విజ్ఞానవంతులుగా తీర్చి దిద్దుతారు. అందువల్ల విద్యార్థులు, వారి తల్లితండ్రులూ గురువులను గౌరవించాలి. అందుకే సర్.యస్. రాధాకృష్ణన్ గారు తన పుట్టిన రోజును, అధ్యాపక దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆనాడు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానిస్తాయి.

ఉపాధ్యాయులను ఆ రోజు ప్రతి గ్రామంలో, నగరంలో పెద్దలు సన్మానించాలి. విద్యార్థులు సైతం కృతజ్ఞతా పూర్వకంగా గురువులను అభినందించి సత్కరించాలి. పూర్వకాలంలో సైతం మహారాజులు గురువులకు ఈనాములిచ్చి పెద్ద గౌరవమిచ్చి, వారిని పోషించేవారు. మనది ప్రజా ప్రభుత్వము. అందువల్ల ప్రజలే అధ్యాపకులను “గురుభ్యోనమః” అని వారిని సత్కరించాలి.

ప్రశ్న 13.
‘మొక్కల పెంపకం’ ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:

“వృక్షముల పెంపకం”

చెట్లు జీవన సౌభాగ్యానికి మెట్లు. నేడు నగరాలు, గ్రామాలు కూడా, పర్యావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రజలంతా రోగాలతో డాక్టర్ల వెంట తిరుగుతున్నారు. దీనికి కారణం దేశంలో పచ్చని చెట్లు తక్కువ కావడమే.

చెట్లు బొగ్గుపులుసు వాయువును పీల్చి, ప్రాణవాయువును మనకు అందిస్తాయి. పూలను, పండ్లను ఇస్తాయి. చల్లని నీడను, గాలిని ఇస్తాయి. పర్యావరణ కాలుష్యం నుండి మనలను కాపాడతాయి.

కాబట్టి ప్రతి వ్యక్తి ఒక్కొక్క చెట్టును పాతి పెంచాలి. ప్రభుత్వము మంచి మొక్కలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వాటిని పాతించాలి. మొక్కలను పెంచి, వాటికి రక్షణ కల్పించాలి. దేశంలో సహితం అడవుల విస్తీర్ణం నేడు తగ్గిపోయింది. అందుకే మనకు వర్షాలు లేవు.

ప్రతి పంచాయితీ వారు మునిసిపాలిటీ వారు, మొక్కలను ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. మొక్కలను పెంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గిరిజనులను ప్రోత్సహించి అడవులలో మొక్కలు పెంచాలి. మనమంతా మొక్కలను పెంచుదాం. మన దేశాన్ని సస్యశ్యామలం చేద్దాం.

ఇట్లు,
నగర రక్షణ సమితి.

ప్రశ్న 14.
అనాథ బాలబాలికలను ఆదుకోవాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

“అనాథ రక్షణ”

మిత్రులారా ! దిక్కులేని వారిని మనం అనాథలు అంటున్నాము. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఈనాడు ఎన్నో కారణాల వల్ల కొంతమంది, అనాథలు అవుతున్నారు. తల్లిదండ్రులు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుంది. భయంకర వ్యాధుల వల్ల తల్లిదండ్రులు మరణించవచ్చు.

మానవ సేవయే మాధవ సేవ. మనకు భగవంతుడే సంపదలు ఇస్తున్నాడు. మనకు ఉన్నదానిలో కొంత మొత్తం దీన జన సేవకు వినియోగిద్దాం. మన నగర ప్రజలంతా అనాథ రక్షణ సంఘంగా ఏర్పడదాం.

మనం అన్నం వండుకునే ముందు, రెండు గుప్పిళ్ళు బియ్యం వేరే పాత్రలో ఉంచుదాం. ఆ బియ్యాన్ని పోగుచేసి అనాథలకు భోజనాలు పెడదాం. వారికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేద్దాం. డబ్బున్న వారి నుండి చందాలు వసూలు చేద్దాం. మన నగరం చైర్మెన్ గారి సాయం తీసుకుందాం. అనాథలకు చదువులు చెప్పిదాం. వారికి పుస్తకాలు, బట్టలు ఇద్దాం.

మనం అనాథలను ఆదుకుంటే, భగవంతుడు మనలను రక్షిస్తాడు. సిరిసంపదలిస్తాడు. అనాథలకు మనమంతా తల్లిదండ్రులు అవుదాం. కదలండి. ఒక మంచి పని చేద్దాం.
విజయవాడ,
x x x x x

ఇట్లు,
అనాథ పరిరక్షణ సమితి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 15.
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

‘చెట్టు – నీరు పథకం’

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు చాలాకాలంగా మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయిపోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్రమవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొవాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

ప్రశ్న 16.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారిమీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళలారా! “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” అన్న శ్రీశ్రీ మాట మనం మరచి పోకూడదు. ఈనాడు స్త్రీల విషయంలో సంఘం ఎంతో వివక్ష చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందంటేనే తల్లిదండ్రులు అతలాకుతలం అయిపోతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు. ‘స్త్రీలను గౌరవిద్దాం’ అనే బోర్డులు మాత్రమే కాని, బస్సుల్లో సహితం ఆడవాళ్ళకు సీట్లు దొరకడం లేదు.

స్త్రీలకు ఉద్యోగాల్లోనూ, చదువుకోడానికి సీట్లు ఇవ్వడంలోనూ రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావడం లేదు ‘అభయ’ చట్టం వచ్చినా పసిపిల్లలు సహితం అత్యాచారాలకు గురి అవుతున్నారు.

ఆడపిల్లలందరూ కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేస్తున్న మగవాడి చెంప పగులకొట్టండి. అవమానం జరిగితే నిర్భయంగా అధికారులకు రిపోర్టు ఇవ్వండి. పొరపాటున అన్యాయానికి గురయితే సిగ్గుతో చితికిపోకండి. ధైర్యంగా నిలబడండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి.

ఒక స్త్రీ అన్యాయానికి గురయితే, మిగిలిన ఆడవాళ్ళంతా ఆమెకు అండగా నిలవండి. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లు అని తల్లిదండ్రులు ఆనందించేలా చేయండి. ఉద్యోగం సంపాదించండి. తల్లిదండ్రులకు అండగా నిలవండి. సంఘబలం కూడగట్టి, దుర్మార్గులను శిక్షించండి. ప్రభుత్వం ఆదుకోకపోతే, వనితా సంఘాల, స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోండి. ఝాన్సీలక్ష్మీబాయిలా, రాణి రుద్రమలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలవండి.

దివి. x x x x x

ఇట్లు,
గుంటూరు వనితా సంఘం.

ప్రశ్న 17.
మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:

మా పాఠశాల

మా పాఠశాల ఐదు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. పాఠశాల భవనంలో 12 గదులున్నాయి. గదులన్నింటిలో పంఖాలు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. పిల్లలకు కావలసిన బెంచీలున్నాయి. ప్రతి తరగతి గదిలో గోడమీద నల్లబల్లలు ఉన్నాయి. మా అధ్యాపకులకు వేరుగా ఒక గది ఉంది. అక్కడ మంచినీటి ఫిల్టరు ఉంది. దాని ప్రక్క గదిలో మా ప్రధానోపాధ్యాయులు ఉంటారు. ప్రధానోపాధ్యాయుల గదిలో దేశనాయకుల, దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి.

పాఠశాల ఆఫీసు వారికి వేరే గది ఉంది. అక్కడ గుమాస్తాలు కూర్చుంటారు. పిల్లలందరికీ మంచినీటి సదుపాయం, పాయిఖానా ఏర్పాట్లు ఉన్నాయి. తూర్పు వైపున మంచి పూలతోట ఉంది. ఆ తోటలో మల్లి, మొల్ల, కనకాంబరం, చేమంతి పూలచెట్లున్నాయి. ఈ మధ్యనే గులాబీ మొక్కలు కూడా నాటారు.

ఆటస్థలంలో అన్నిరకాల కోర్టులూ ఉన్నాయి. క్రికెట్ ఆడుకొనే సదుపాయాలు ఉన్నాయి. పాఠశాలకు వేరుగా గ్రంథాలయం ఉంది. అక్కడకు రోజూ 2, 3 పత్రికలు వస్తాయి. విశ్రాంతి సమయంలో మేము అక్కడ కూర్చుని వాటిని చదువుతాము.

మా గ్రామ ప్రజలు పాఠశాల అభివృద్ధికి బాగా సాయం చేస్తారు. మేము పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతాం. ఆ పాఠశాల మాకు రెండవ తల్లి వంటిది.

ప్రశ్న 18.
మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి/ జంతువు గురించి మీరు ఒక కథనాన్ని రాయండి.
జవాబు:

“ధోని” (కుక్కపిల్ల)

మా పక్క ‘ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ. ‘తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క, గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి, దాని తల్లి కుక్క, కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీథిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపైకి దూకి వాడి పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 19.
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రం రాయండి. .
జవాబు:

ప్రపంచశాంతి

మిత్రులారా ! ఈ విషయాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకోసం దెబ్బలాటలకు దిగి, తలలు బద్దలుకొట్టుకోకండి. న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బు తగులబెట్టకండి. మనది గాంధీ, బుద్ధుడు, జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంతి బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. ఇంకా ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు, అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులంతా సోదరుల వలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం మనకు మంచిదారిని చూపిస్తాయి. శాంతి మంత్రాన్ని అంతా జపిద్దాం. సరేనా?

ఇట్లు
ప్రపంచ బాలబాలికల సంఘం.

ప్రశ్న 20.
ధనము ఉన్నవాళ్ళు దానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అనాథశరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకూ, వదాన్యులకూ ఒక కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:

విజ్ఞప్తి

సోదర సోదరీమణులారా ! మనం అందరం భగవంతుని బిడ్డలం. మనలో కొందరు బీదవారుగా, దిక్కులేనివారుగా ఉన్నారు. వారికి మనతోపాటు బతికే హక్కు ఉంది. మనలో డబ్బు ఉన్నవారు ఉన్నారు. మనం పుట్టినపుడు ఈ డబ్బును మన వెంట తేలేదు. రేపు చనిపోయినపుడు ఈ ధనాన్ని మనం వెంట తీసికొని పోలేము.

మనం ఎంత లక్షాధికారులమైనా బంగారాన్ని తినము. డబ్బున్నవారమని గర్వపడడమే కాని, కూడబెట్టిన దాన్ని అంతా మనం తినలేము – ఎవరికీ దానధర్మాలు చేయకుండా బ్యాంకుల్లో దాస్తే ఆదాయం పన్ను వాళ్ళు తీసుకుపోతారు.

కాబట్టి మనతోటి దరిద్రనారాయణులకూ, దిక్కులేని ముసలివారికీ తోడ్పడండి. మీ డబ్బును విరివిగా వృద్ధాశ్రమాలకు చందాలుగా ఇవ్వండి. లేదా మీరే అనాథశరణాలయాలు స్థాపించండి.

‘మానవసేవయే మాధవసేవ’ అని గుర్తించండి. తోటివారికి మనం డబ్బు ఇచ్చి తోడ్పడితే, దైవకృప మనకు తప్పక లభిస్తుంది. లోభిత్వం విడువండి. వదాన్యులై విరివిగా విరాళాలు ప్రకటించండి. భగవంతుడు నాకు మంచిబుద్ధిని ప్రసాదించాలి.

ఇట్లు,
మీ తోడి సోదరసోదరీమణులు.

ప్రశ్న 21.
వివాహాల్లో చేయవలసిన సంస్కరణల గూర్చి కరపత్రం తయారుచేయండి.
జవాబు:

వివాహాలలో చేయవలసిన సంస్కరణలు

మిత్రులారా ! ఈ రోజుల్లో పెండ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు. వేలమందికి విందులు చేస్తున్నారు. కల్యాణ మండపాల అలంకరణలకు, దీపాల అమరికకు, చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కట్నాలు, . బహుమతులు పెరిగిపోయాయి. వధూవరులను వెతకడం, జాతకాలు చూపించడం వంటి వాటికి, ఖర్చులు పెరిగిపోయాయి.

 1. పెండ్లిళ్ళు దేవుని మందిరాలలో అలంకరణల ఖర్చు లేకుండా చేయాలి.
 2. ఎవరింట వారు భోజనాలు చేసి ముహూర్తానికి గుడికి వచ్చి పెళ్ళి పూర్తి చేయాలి. విందులు ఏర్పాటు చేయరాదు.
 3. కట్నాలూ, బహుమతులూ పూర్తిగా మానివేయాలి. ఊరేగింపులు మానుకోవాలి.
 4. విలాసాలకు ఖర్చు చేయరాదు. పెళ్ళికి మంగళసూత్రం, వధూవరులు ముఖ్యం అని గుర్తించాలి.
 5. రిజిష్టర్డు వివాహాలు చేసుకుంటే మరింత కలిసి వస్తుంది. వధూవరులూ వారి తల్లిదండ్రులూ రిజిస్ట్రార్ వద్దకు చేరి, అవసరమైన ఏర్పాట్లతో పెండ్లి తంతు ముగించాలి. పెళ్ళి పేర దుర్వ్యయం చేయకండి.

ఇట్లు,
మిత్ర సమాజం.

ప్రశ్న 22.
మీ పాఠశాలలో ప్రపంచ శాంతి అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ, నిర్వహణకు, విద్యార్థులను ఆహ్వానిస్తూ – కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రపంచశాంతి మిత్రులారా !

“తన సొంతమె తనకు రక్ష’ అని సుమతీశతకకారుడు చెప్పాడు. ఇది వ్యక్తులకే కాదు దేశాలకు అంటే దేశ ప్రజలకు కూడా వర్తిస్తుంది.

మనది గాంధీ, బుద్ధుడు, జవహర్ లాల్ నెహ్రూ వంటి శాంతమూర్తులు పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంత బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇంకా దేశాల మధ్య ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులందరం సోదరులవలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం కలిగి ప్రజలందరం శాంతియుత జీవనం సాగిద్దాం. అందరం ప్రపంచ శాంతికై పాటుపడదాం.

ఇట్లు,
ప్రపంచ శాంతి మండలి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 23.
ఆదర్శ రైతు రామయ్యను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారుచేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా !
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము.

రైతురత్న రామయ్య గారూ!
నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరపున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.
అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,
ఏలూరు,
ప|గో|| జిల్లా,

ప్రశ్న 24.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
తల్లిదండ్రులారా !
మీరు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఏ విధమైన ఫీజు కట్టనవసరం లేదు. పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు. అక్కడ పాఠం చెప్పే ఉపాధ్యాయులు, మెరిట్ ప్రాతిపదికపై ఎన్నిక చేయబడినవారు. చక్కని అర్హతలు కలవారు. మధ్యాహ్నం మీ పిల్లలకు భోజన సదుపాయం ఉంటుంది. హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టలులో మీ పిల్లలకు కావలసిన సదుపాయాలు ఉచితంగా సమకూరుస్తారు.

ప్రభుత్వ పాఠశాలలకు మంచి భవనాలు ఉంటాయి. ఆటలు ఆడుకొనే ఆటస్థలము, పరికరాలు ఉంటాయి. ఆటలు ఆడించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు మంచి అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నడుస్తాయి. ప్రభుత్వము అక్కడి ఉపాధ్యాయులకు చక్కని జీతాలు ఇస్తోంది. అందువల్ల ప్రభుత్వం కల్పించే సదుపాయాలను చక్కగా వినియోగించుకొని మీ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. అక్రమంగా ఫీజులు పిండే ప్రయివేటు కాన్వెంటులలో చేర్చకండి. ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనాలను మీరు పొందండి. ప్రెయివేటు పాఠశాలల్లో పై సదుపాయాలు ఏమీ ఉండవు. దయతో మేల్కోండి.. జాగ్రత్త పడండి.
దివి. x x x x x

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సంఘం.

ప్రశ్న 25.
స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలని ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

‘స్వచ్ఛభారత్’

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మన పెద్దలు ఏనాడో మనకు ఉపదేశించారు. భారతదేశ స్వచ్చతయే, దేశ సౌభాగ్యానికి మొదటిమెట్టు. స్వచ్ఛమైన ప్రదేశంలోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే, దేశంలో మహాలక్ష్మి వెల్లివిరుస్తుంది. అందుకే మన దేశాన్నీ నదులనూ, పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో సుఖ సంపదలతో మనం వర్ధిల్లుదాం.

మన ప్రధాని నరేంద్రమోడీ గారు భారతదేశాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నీ ఇంటితో పాటు, నీ పరిసరాలను, నీ గ్రామాన్ని, నగరాన్ని, దేశాన్ని నిర్మలంగా తీర్చిదిద్దుకోండని మనదేశ ప్రజలకు ఆయన పిలుపును ఇచ్చారు.

కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దేశాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలము ప్రభుత్వం వల్ల కాదు. దేశంలోని 130 కోట్ల ప్రజానీకం ఇందుకు నడుం కట్టుకోవాలి. దీని కోసం . ప్రభుత్వం, ఎంతో ధన సహాయం చేస్తోంది. ఉపయోగించుకుందాం.

ముఖ్యంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని, యువకుడు, యువతి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, ఎక్కడా దేశంలో చెత్త లేకుండా అందంగా ఆరోగ్యవంతంగా మనదేశాన్ని తీర్చిదిద్దుకొందాం. కదలిరండి. నడుం బిగించండి. లేవండి. మనదేశం “స్వచ్ఛభారత్” అయ్యేదాకా, పట్టు విడువకండి. మరువకండి.
దివి. x x x x x

ఇట్లు,
పట్టణ విద్యార్థినీ, విద్యార్థుల సంఘం,
కర్నూలు.

ప్రశ్న 26.
‘ప్రసార మాధ్యమాలు (టి.వి., సినిమాలు) నేటి సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి’ అనే విషయం గూర్చి ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
రవి : ఏరా ! ఈ రోజు సెలవు కదా ! ఏం చేద్దాం?
కృష్ణ : చక్కగా చదువుకుందాం ! ప్రాజెక్టువర్కులు పూర్తి చేద్దాం.
హరి : కాదురా ! ఈ రోజు సెలవు కదా ! మంచి సినిమాకు వెళ్లాం.
కృష్ణ : వద్దురా ! ఈనాటి సినిమాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయి.
ప్రసాద్ : కనీసం టీ.వీ. నైనా చూద్దాం.
కృష్ణ : ఈనాడు టీ.వీలో వచ్చే కార్యక్రమాలు బాగుండటంలేదు.
రవి : ఎందుకలా చెప్తున్నావు? సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయి?
కృష్ణ : ఈనాడు టీ.వీ.లు గాని, సినిమాలు గాని జనానికి ఉపయోగకరంగా లేవు. టీవీల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉపదేశాత్మకంగా లేవు.
ప్రసాద్ : మరి సినిమాల సంగతేమిటి?
కృష్ణ : ఈనాడు సినిమాలు కూడా హింసను, అకృత్యాలను చూపిస్తున్నాయి.
రవి : నీవు చెప్పింది నిజమేరా ! నీవు చెప్పినట్లుగానే చక్కగా చదువుకుందాం.
ప్రసాద్ : మనం సమాజానికి ఆదర్శంగా ఉండాలి కదా ! సరే మనకు సినిమాలు వద్దు, టీ.వీ.లు వద్దు. చదువే ముద్దు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 27.
మీ చుట్టూ ఉండే పరిసరాలను వర్ణిస్తూ పది పంక్తులు మించకుండా ఒక కవిత రాయండి.
జవాబు:
మా చుట్టూ ఉండే పరిసరాలు
మా పల్లెవాసులకు ఆనంద నిలయాలు
ఎటు చూసినా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు
చెట్లపై పక్షుల కిలకిలారావాలు
కొండ కోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ
పరుగెడుతున్న సెలయేటి గలగలలు
చెఱువులలో విరబూసిన అరవిందాలు
తలలాడిస్తూ ఆహ్వానించే పచ్చని పైరులు
జోరుజోరుగా వినిపించే
పశుకాపర్ల జానపద గీతాలు
ప్రకృతి శోభతో కళకళలాడుతుంది మా పరిసరం.

Leave a Comment