AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 2 అంపకం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 2nd Lesson అంపకం Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 2nd Lesson అంపకం

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘అంపకం’ ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్య భాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు.

శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటినుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్కక్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు.

బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 2 అంపకం

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితపిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రి పాదాలు పట్టుకొని వదల్లేకపోయింది.

శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దు:ఖం ఆగలేదు శివయ్యకు. కన్నీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. “నాకు కూతుర్ని ఇచ్చి ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు.

ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనే వస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం చేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

ప్రశ్న 2.
అంపకాలు పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శివయ్య, పార్వతమ్మల గారాల బిడ్డ సీత. పుట్టినప్పటినుండి తండ్రి చేతుల్లో పెరిగింది. బళ్ళో వేసినప్పుడు శివయ్య ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడు. ‘కూతురు చెప్పే కబుర్లు విని ఆనంద పడిపోయేవాడు. సీతకు ఏ కూర ఇష్టమో అడిగి అదే కలిపి పెట్టేవాడు. భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటు చేరి సీత కథలు చెప్పమని వేధించేది. శివయ్య తోచిన కథ చెప్తూ ఉంటే మధ్యలోనే నిద్రలోకి జారుకునేది. నిశ్చింతగా నిద్రపోతున్న కూతుర్ని చూసి మురిసిపోయేవాడు శివయ్య.

పదహారేళ్ళ వయసు వచ్చే సరికి మంచి సంబంధం కుదిరింది సీతకు. కన్యాదానం చేసేటప్పుడు శివయ్య తన బ్రతుకుని ధారపోస్తున్నట్లుగా భావించాడు. అత్తగారింటికి పంపడానికి అన్నీ సిద్ధమయ్యాయి. కాలుగాలిన పిల్లిలా ఇళ్ళంతా తిరుగుతూ హైరానా పడిపోతున్నాడు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 2 అంపకం

పొద్దున్నే ఇక ఎవరిని పిలవాలి ? పూజలో హారతి ఎవరికి అద్దాలి ? తన ప్రాణంలో ప్రాణం అయిన కూతురు తనను విడిచి వెళ్ళి పోతున్నదనే ఆలోచనలతో కుమిలి పోతున్నాడు శివయ్య. “తన ఇంటి దీపం. తన కంటి వెలుగు వెళ్ళిపోతోందని బెంబేలు పడిపోతున్నాడు. అందరి కంటే ఆఖరున వచ్చింది సీత పట్టుచీర, నగలు మెళ్ళో గంధం, కాళ్ళకు పసుపు నడుముకు వడ్డాణం, తండ్రి పాదాలకు నమస్కరించి పాదాలను వదలలేక వదలలేక వదిలింది. తండ్రి శివయ్య కూలబడిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వెళ్ళిపోతున్నందుకు నోటమాట రాలేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించలేదు. బంధువుల్లో ఒకరు ఇదంతా సహజమేనని ఓదార్చారు.

శివయ్య కళ్ళు తుడుచుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని బళ్ళ వెంట నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మని దర్శించుకున్నారు తండ్రీ కూతుళ్ళు. ఊరిపొలిమేరలు దాటుతుండగా బండి ఆపి అల్లుడితో నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేస్తే మందలించండి. బాగా కోపం వస్తే నాకు ఓ కార్డు వ్రాయండి. కాకి చేత కబరు పెట్టినా వచ్చి వాలిపోతాను. మీ కోపం తీరే దాక నన్ను తిట్టండి కొట్టండి అని బావురమన్నాడు శివయ్య. శివయ్య వేదనకు అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. చుట్టూ ఉన్నవాళ్ళు ఓదార్చారు.

కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గర స్తంభానికి ఆనుకొని ఉంది. పార్వతమ్మ. ఇల్లంతా బోసి పోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. శివయ్యకు అన్నం ముట్టబుద్ది కాలేదు. అదిచూసి పార్వతమ్మ “నన్ను మా అయ్య ఈ ఇంటికి పంపించినప్పుడు ఇలాగే బాధ పడలేదా ? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా ? అలాగే నీ కూతురు కూడా” అని అన్నది.

ఆ మాటలకు శివయ్యకు కొంత ధైర్యం వచ్చింది. నీ కూతురికి ఇష్టమైన కూర కలుపుకో అనగానే గబగబ కలిపాడు కాని ముద్ద గొంతులో దిగలేదు దు:ఖంతో ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రుల్లో ఇటువంటి భావోద్వేగాలు సహజంగానే ఉంటాయని రచయిత ఈ కథ ద్వారా అందించాడు.

రచయిత పరిచయం

1. అంపకం పాఠ్యభాగ రచయిత సత్యం శంకరమంచి.

2. వీరు 03-03-1937 వ తేదీన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. శేషమ్మ, కుటుంబరావులు వీరి తల్లి దండ్రులు.

3. మానవ జీవితంలో సహజమైన అనుభవాలను, అనుభూతులనూ ఉదాత్త కథలుగా మలచగల రచయిత శంకరమంచి.

4. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టా పొందిన సత్యం శంకరమంచి అనేక రచనలు చేసారు.

5. ‘అమరావతి కథలు’ సంపుటం ద్వారా మంచి కథకులుగా పేరు పొందారు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 2 అంపకం

6. అనేక సాహిత్య ప్రక్రియల్లో కూడా సామర్థ్యం గలవారు.

7. రేపటి దారి, సీతస్వగతాలు, ఆఖరి ప్రేమ లేఖ, ఎడారి కలువపూలు, కార్తీక దీపాలు, హరహర మహాదేవ అనేవి ఇతర రచనలు.

8. ఇంతేకాక ఇంతేసంగతులు, తథ్యము సుమతీ ఎందరో మహానుభావులు శీర్షికలతో పత్రికా రచనలు చేసారు.

9. షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాధ్, సాయిరాం అనేవి శంకరమంచి కలం పేర్లు.

10. శంకరమంచి రచనల్లో అమరావతి కథలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు 1979 లో ఈ కథలకు అవార్డును ప్రధానం చేసారు.

11. భారతీయ చలన చిత్ర దర్శకులు శ్యామ్ బెనగళ్ అమరావతి కథలను ధారావాహికగా ప్రదర్శన కోసం చిత్రించారు.

12. ప్రస్తుత పాఠ్య భాగం ‘అంపకం’ ‘అమరావతి కథలు’ సంకలనం నుండి గ్రహించ బడింది.

పాత్రల పరిచయం

శివయ్య :
సీత తండ్రి. ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాడు. ప్రాణానికి ప్రాణంగా సాకాడు. తన ఇంటి దీపం తన కంటి వెలుగు ఆ ఇంటి మహాలక్ష్మి అనుకున్నాడు. బడిలో వేసినప్పుడు ఊర్లో అందరికి పలకలు, బలపాలు, మిఠాయిలు పంచాడు. ప్రతిరోజు బడినుండి తీసుకొచ్చేటప్పుడు సీత చెప్పే కబుర్లు ఆనందంతో వినేవాడు.

కూతురితో కలిసే భోజనం చేసేవాడు. రోజు కథలు చెప్పమని తండ్రిని వేధించేది సీత. తోచిన కథ చెప్పేవాడు. కూతురు పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించే సందర్భంలో తీవ్ర మనోవేదన పడతాడు. సీతను కన్యాదానం చేసేటప్పుడు తన బ్రతుకునే ధార పోస్తున్నట్లు భావించాడు.

కూతురు అత్తగారింటికి ప్రయాణమై వెళ్ళిపోతుంటే శివయ్య పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. సీత తండ్రి పాదాలకు నమస్కరించడానికి వచ్చినప్పుడు శివయ్య తన ప్రాణం పోతున్నంత బాధపడ్డాడు. బంధువులు శివయ్యను ఓదార్చారు. బండి వెనకాతలే ఊరి పొలిమేరలు దాటి దిగబెట్టాడు.

జ్వాలమ్మ గుడి దగ్గర కూతురిని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. ఊరు దాటిపోయినా బళ్ళ వెనకాలే వెళ్ళి అల్లుడిని పిలిచి తనకూతుర్ని ఎలా పెంచిందీ వివరించాడు. శివయ్యను అల్లుడు అర్థం చేసుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చిన శివయ్య తిండి కూడ తినలేకపోయాడు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 2 అంపకం

పార్వతమ్మ :
శివయ్య భార్య సీత తల్లి. సీతని గారాభంగానే పెంచింది. పెళ్ళీడు కొచ్చిన సీతను అలంకరించి పెళ్ళి చేసారు. పార్వతమ్మ కొంచం ధైర్యంగానే ఉండేది. ఒక ఆడపిల్ల తల్లిగా ఇల్లాలిగా తన బాధ్యతలను నిర్వర్తించే స్త్రీ మూర్తి. మమకారం, ప్రేమ కలిగిన తల్లి, కాని ఆడపిల్ల పెళ్ళి చేసి పంపించాల్సిన బాధ్యతను గుర్తెరిగిన మాతృహృదయం ఆమెది. ఇంట్లో నడయాడే పిల్ల పెళ్ళి అయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏ తల్లి అయినా మదన పడక తప్పదు అని భర్తకు ధైర్యాన్ని ఇస్తుంది.

సీత :
శివయ్య, పార్వతమ్మల ఒక్కగానొక్క కూతురు సీత. పుట్టినప్పుడు పార్వతమ్మ పాలు పట్టి తండ్రి శివయ్య చేతుల్లో పెట్టింది. అప్పటినుండి తండ్రి దగ్గరే పెరిగింది. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలోకి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు తినేది. నిద్రపోయేది. తండ్రిని విడిచి ఒక్క క్షణం బ్రతకలేని చిన్నారి సీత. పదహారేళ్ళ ప్రాయంలో పట్టుచీరతో, పాదాలకు పసుపు పూసుకొని పారాణి పెట్టిన అందంగా నుదుట బొట్టు, బుగ్గన చుక్కతో పెళ్ళిపీటలపై తలవంచుకు కూర్చుంది సీత.

తోటివాళ్ళ ఆటపాటలతో తిరిగే సీత తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుందనే ఆలోచనల్లో మునిగిపోయింది. వెళ్ళేముందు తండ్రి పాదాలను పట్టుకొని వదల్లేక పోయింది. అపురూపంగా పెంచిన సీతను ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా అన్నట్లు పెళ్ళి వారి వెంట పెళ్ళి కొడుకుతో బండి ఎక్కింది.

పాఠ్యభాగ సారాంశం

సీత అల్లారు ముద్దుగా పెరిగిన గారాల పట్టి శివయ్య, పార్వతమ్మల ఏకైక పుత్రిక పుట్టినప్పటి నుండి శివయ్య చేతుల్లో మెరిగింది. నాలుగేళ్ళ వయసులో బడిలో వేసారు. శివయ్య ఊర్లో అందర్ని పిలిచి మిఠాయిలు పంచి పెట్టాడు.

బళ్ళో అందరికి పలక-బలపాలు ఇచ్చాడు బడి నుండి సీత రావటం ఒక్క నిముషం ఆలస్యం అయినా పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని వచ్చేవాడు శివయ్య. బళ్ళో కబుర్లన్నీ సీత తండ్రితో చెప్పేది. శ్రద్ధగా వినేవాడు శివయ్య.

తండ్రీ కూతుర్లిద్దరూ కలసి భోజనం చేసేవాళ్ళు. సీతకి ఏ కూర ఇష్టమో కనుక్కొని అదే కలిపేవాడు. భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి క్రింద శివయ్య ప్రక్కనే పడుకొనేది సీత. కథలు చెప్పమని వేధించేది. శివయ్య ఏదో తోచిన కథ చెప్తుంటే నిద్రలోకి జారుకునేది. నిశ్చింతగా నిద్రపోతున్న సీతను చూస్తూ శివయ్య కళ్ళ నీళ్ళు పర్యంతమై పోయేవాడు.

పదహారేళ్ళ వయసులో సీతకు మంచి సంబంధం కుదిరింది. పెళ్ళి చేసినప్పుడు శివయ్య కన్యాదాన సమయంలో తన బ్రతుకునే ధారపోస్తున్నట్లు భావించాడు. సీతను అత్తగారింటికి పంపించే సమయంలో కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగాడు శివయ్య. సీత పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయిన శివయ్య ఇప్పుడు పెళ్ళి చేసి అత్తగారింటికి పంపిస్తూ తన ఇంటి వెలుగు తన కంటి దీపం వెళ్ళిపోతున్నట్లు భావోద్వేగానికి గురి అయ్యాడు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 2 అంపకం

ఇంకా ఆలస్యం ఏమిటని ఎవరో అనగా శివయ్య బళ్ళలో సామానులు ఎక్కించాడు. చివరగా సీత వచ్చి తండ్రి పాదాలను పట్టుకొని వదలలేకవదలలేక వదిలింది. తల్లి పార్వతమ్మ కళ్ళు ఒత్తుకుంటూ కూతుర్ని సాగనంపింది. ఆవిడకు తిరిగే ఓపిక లేదు. లోకంలో ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు ఇది సహజమేనని ఎవరో సర్దిచెప్పారు.

శివయ్య కళ్ళు తుడుచుకొని బళ్ళ వెంట నడుస్తూ వెళ్ళాడు. ఊరి పొలిమేర దాటినా ఇంకా వెళ్ళాడు. మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని గుడికి తీసుకొని వెళ్ళి మొక్కించాడు. ఊరి దాటింది. ఇక ఆగిపోమని చెప్పినా వినకుండా నడుస్తూనే ఉన్నాడు శివయ్య. ఒక చోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకొని వెళ్ళాడు “అయ్యా నా కూతుర్ని పువ్వుల్లో పెట్టి పెంచాను.

గుండెల్లో పెట్టుకొని సాకాను. చిన్నతనం వల్ల ఎప్పుడైనా తెలిసో తెలియకో ఏదైనా తప్పుచేస్తే కోపగించుకుంటారు. ఫర్వాలేదు కొట్టాలనిపిస్తుంది అలాంటప్పుడు తనకి ఒక కార్డు ముక్క రాయమన్నాడు. కాకి చేత కబురు పెట్టినా వాలిపోతానని అన్నాడు ఆ తిట్లు కోపం తీరేదాకా తనని తిట్టమని కసితీరే దాకా కొట్టండి అని అంటూ బావురుమన్నాడు. ఆ మాటలకు అల్లుడు కళ్ళు చెమర్చాయి చుట్టూ ఉన్నవాళ్ళు సర్ది చెప్పి పంపించేసారు.

తిరిగి ఇంటికి వచ్చిన శివయ్య నోట మాట రాక ఉండిపోయాడు. భార్య పార్వతమ్మ తనను వాళ్ళ అయ్య ఇలాగే ఈ ఇంటికి పంపించాడు. నువ్వు నన్ను చల్లగా చూసుకున్నావు కదా అలాగే నీ కూతురు అని అనగా కొంత ధైర్యం వచ్చింది శివయ్యకు. కూతురికి ఇష్టమైన కూర కలుపుకోమన్న పార్వతి. శివయ్య గబగబా కలిపాడు కాని నోట్లోకి ముద్ద దిగలేదు.

కఠిన పదాలకు అర్ధాలు

అంపకం = పంపించుట
కాలుగాలిన పిల్లి = ఇది ఒక జాతీయం – హడావిడిగా ఇటు అటు తిరిగే సందర్భంలో జాతీయాన్ని వాడతారు.
కదం తొక్కు = ఇది ఒక జాతీయం – ఇటు అటు పచార్లు చేస్తూ ఎక్కడికో ప్రయాణానికి సంసిద్ధం అయ్యే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
హైరానా = హడావిడి
బెంబేలు = గాభరాపడిపోవు
లంకె = బంధం
దర్పం = గాంభీర్యం
ఉత్తరీయం = భుజాన వేసుకునే తువ్వాలు
సాకుట = పెంచుట
విడ్డూరం = వింత
అమ్మలక్కలు = ముత్తైదవలు, స్త్రీలు

Leave a Comment