Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material పద్య భాగం 5th Poem కర్మభూమిలో పూసిన ఓ పువ్వా….! Textbook Questions and Answers, Summary.
AP Inter 2nd Year Telugu Study Material 5th Poem కర్మభూమిలో పూసిన ఓ పువ్వా….!
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!’ పాట ద్వారా కలేకూరి ప్రసాద్ వర్ణించిన స్త్రీల దుస్థితిని వివరించండి.
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ. పువ్వా! అను పాఠ్యభాగం కలేకూరి ప్రసాద్ చే వ్రాయబడిన పాట ఇది. ఇది మహిళలపై జరుగుతున్న గృహహింసలు, స్త్రీల వరకట్నపు చావులపై స్పందన. ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే కొత్త పెళ్ళికూతురు వరకట్నపు హత్యకు బలి అయింది. ఆ విషాద సంఘటనే ఈ పాటకు ప్రేరణ అయింది.
స్త్రీలు వరకట్నపు దురాచారానికి బలి అవుతున్నారు. దేశంలో కొత్త పెళ్ళికూతుళ్ళు కోటి ఆశలతో అత్తింట అడుగు పెట్టగానే కట్నం దురాచారం వారిని కాటు వేస్తుంది. పాదాలకు పెట్టిన పారాణి ఆరకముందే, మామిడి తోరణాలు వాడకముందే, పెళ్ళిపందిరి తీయకముందే, పెళ్ళికి వచ్చిన బంధువులు వారివారి ఇళ్ళకు చేరకముందే, మంగళ వాయిద్యాల ధ్వనులు ఆగకముందే, అప్పగింతలు జరుగకముందే కొత్త పెళ్ళికూతుళ్ళు శ్మశాన కాపురానికి తరలిపోతున్నారు.
స్త్రీలకు స్త్రీలే శత్రువులవుతున్నారు. సంఘంలో రాక్షసత్వం రాజ్యమేలుతుంది. అత్తల కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఆడపడుచులు ఆరళ్ళు (బాధలు) పెడుతున్నారు. కోడళ్ళను వేధించే అత్తలకు వారి ఆడపిల్లల వలన గర్భశోకం మిగులుతున్నది. అత్తమామలు వరకట్న పిశాచులై మారణ హోమం సాగిస్తున్నారు. ఆడబిడ్డల జీవితాలు ఆర్తనాదాలతో నిండిపోతున్నాయి. వారి కళ్ళనుండి దుఃఖపు సెలయేరులు ధారలుగా కారుతున్నాయి. పేరుకు మాత్రమే కర్మభూమి మనది అని కలేకూరి ప్రసాద్ “కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా….” పాటలో వరకట్న పిశాచికి బలైపోతున్న ఆడపడుచుల జీవితాల పట్ల ఆవేదనను వ్యక్తం చేశాడు.
ప్రశ్న 2.
‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!’ పాఠం ద్వారా కవి వివరించిన వరకట్న దురాచారాన్ని విశ్లేషించండి.
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్ చే వ్రాయబడింది. ఇది మహిళలపై జరుగుతున గృహహింసలు, స్త్రీల వరకట్నపు చావులపై స్పందన. ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే కొత్త పెళ్ళికూతురు వరకట్న దురాచారానికి బలి అయింది. ఆ విషాద సంఘటనే ఈ పాటకు ప్రేరణ అయింది.
దేశంలో ఆడదాని కన్నా అడవిలో చెట్టుకు ఎక్కువ విలువనిస్తున్నారు. ఆడ పిల్లలకు పెళ్ళి చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. వరకట్న దురాచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. కట్న పిశాచాలు జీవనం సాగిస్తున్న ఈ నరకంలాంటి సంఘంలో రాక్షసత్వం రాజ్యమేలుతుంది. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారుతున్నది. అడిగినంత కట్నం ఇవ్వలేదని, ఇచ్చినా లాంఛనాలు, అదనపు కట్నాలు ఆశించి అత్తింటివారు సాధింపులు పెడుతున్నారు. కొందరు దుర్బుద్ధితో కట్నం కోసం ఇంటికి వచ్చిన నవవధువులను కడతేర్చి ఇంకో పెళ్ళికి సిద్ధం చేస్తున్నారు. అత్త ఒకింటి కోడలే నన్న జ్ఞానం లేకుండా ఆడపిల్లలతో ఆటలాడుకుంటున్నారు.
పిశాచాల వంటి అత్తమామల ఆనందం కోసం నవ వధువులు ఆత్మ బలిదానాలు చేయవలసివస్తుంది. స్త్రీల జీవననాదం ఆర్తనాదమయ్యింది. వారి కళ్ళలో నీరు సెలయేరులై పారుతున్నాయి. స్త్రీలంతా ఈ వరకట్న దురాచారంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయాలి. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు. మంచి మనసుతో ఆలోచన చేసి నవ వధువుల ఆత్మహత్యలను ఆపవలసి వుంది.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కలేకూరి ప్రసాద్ ను గురించి రాయండి.
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్ చే రచించబడింది. ఇది స్త్రీలపై జరుగుతున్న వరకట్న దురాచారం కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందన.
కలేకూరి ప్రసాద్ కృష్ణాజిల్లా, కంచికచర్లలో అక్టోబరు 25, 1964న లలిత సరోజిని, శ్రీనివాసరావులకు జన్మించాడు. ఏలూరులో ప్రాథమిక విద్యను పూర్తిచేసి గుంటూరు ఏ.సి.కళాశాలలో ఇంటర్ మీడియట్ పూర్తి చేశాడు. విద్యార్థి దశలోనే వివిధ సామాజిక రాజకీయ ఉద్యమాల పట్ల ఆకర్షింపబడ్డాడు. మహబూబ్ నగర్ పరిధిలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టుకు ఛైర్మన్ గా పనిచేశాడు. సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకునిగా కొంతకాలం ఉన్నాడు. సమాజంలో జరుగుతున్న భూస్వాముల దౌర్జన్యాలు ప్రసాద్ ను కవిని చేశాయి. కంచికచర్లలో దళితుడైన ‘కోటేశును’ అగ్రవర్ణ భూస్వాములు సజీవదహనం చేస్తే ప్రసాద్ గుండె రగిలిపోయింది. ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే కొత్త పెళ్ళికూతురు వరకట్నానికి బలైపోతే ప్రసాద్ లో కలిగిన స్పందనే ఈ పాటైంది.
యువక, శబరి, సంఘమిత్ర, నవత వంటి కలం పేర్లతో ప్రసాద్ రచనలు సాగించాడు. దళిత సాహిత్యం , దళిత సాహిత్యోద్యమం, పిడికెడు ఆత్మగౌరవం కోసం, అంటరాని ప్రేమ వంటి. కవితా సంపుటాలు రచించాడు. రైతుల ఆత్మహత్యల నేపథ్యంగా “భూమికి పచ్చాని రంగేసినట్టు” అనే పాటను వ్రాశాడు. 70కి పైగా అనువాదాలు వాటిలో మహాశ్వేతాదేవి, ఫ్లోబోనెరూడా వంటి ప్రసిద్ధ రచనలను తెలుగునకు అను వదించాడు. ఆయన “నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి. చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై వ్యాపిస్తాను. మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను” అని చెప్పిన ప్రసాద్ మే 7, 2011న కాలం చేశాడు.
ప్రశ్న 2.
కలేకూరి ప్రసాద్ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి ?
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను.పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్ చే రచించబడింది. ఇది స్త్రీలపై జరుగుతున్న వరకట్న దురాచారం కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందన.
ఈ దేశంలో స్త్రీ జాతికన్నా అడవిలో పుట్టిన చెట్టుకే విలువ ఎక్కువ. స్త్రీకి స్త్రీయే. శత్రువు అవుతుంది. స్త్రీలలో నవచైతన్యం రావాలి. కట్నకానుకల కోసం పీడించే ఈ సమాజాన్ని స్త్రీలే మార్చుకోవాలి. స్త్రీ, పురుష వివక్షత లేకుండా అందరూ సమానమనే భావన రావాలి. ఇంటికి వచ్చిన నవవధువును మాటలతో, చేతలతో వేధించే ఆడపడుచులు తమకు కూడా అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితే ఎదురౌతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోడలి బ్రతుకులో నిప్పులు పోసే అత్తగారు తన కూతురికి కూడా అత్తవారింట్లో ఇలాంటి బాధలే కలుగుతాయేమోనన్న ఆలోచన రావాలి. స్త్రీ జాతి అంతా తమని తాము సంస్కరించుకోవాలి. నవవధువులను అత్తమామలు, ఆడపడుచులు రాక్షసుల వలే పీడిస్తున్నారని, ఈ దుస్థితి బావితరాలకుండకూడదని, స్త్రీ జాతి ఏకమై తమకు తాము చేసుకుంటున్న ద్రోహాన్ని ఎదిరించాలని కలేకూరి ప్రసాద్ ఆశించాడు.
ఏకవాక్య పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ….. గేయ రచయిత ఎవరు ?
జవాబు:
కలేకూరి ప్రసాద్.
ప్రశ్న 2.
కలేకూరి ప్రసాద్ ఎపుడు, ఎక్కడ జన్మించాడు ?
జవాబు:
అక్టోబరు 25, 1964 సం||లో కృష్ణాజిల్లా, కంచికచర్లలో జన్మించాడు.
ప్రశ్న 3.
కలేకూరి ప్రసాద్ తల్లిదండ్రులెవరు ?
జవాబు:
లలిత సరోజిని, శ్రీనివాసరావులు.
ప్రశ్న 4.
కలేకూరి ప్రసాద్ నిర్వహించిన ఉద్యోగ బాధ్యతలేవి ?
జవాబు:
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టు ఛైర్మన్ గాను, సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ (ఎన్.జి.ఓ) సంచాలకునిగా బాధ్యతలను నిర్వహించారు.
ప్రశ్న 5.
కలేకూరి ప్రసాద్ ను కవిగా మలచిన సంఘటన ఏది ?
జవాబు:
కంచికచర్లలో “కోటేశు” అనే దళితుడిని అగ్రవర్ణ భూస్వాములు సజీవదహనం చేయటం.
ప్రశ్న 6.
కలేకూరి ప్రసాద్ కలం పేర్లేమిటి ?
జవాబు:
యువక, శబరి, సంఘమిత్ర, నవత.
ప్రశ్న 7.
కలేకూరి ప్రసాద్ రచనలేవి ?
జవాబు:
దళిత సాహిత్యం, దళిత సాహిత్యోద్యమం, పిడికెడు ఆత్మగౌరవం కోసం, అంటరాని ప్రేమ.
ప్రశ్న 8.
రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ప్రసాద్ వ్రాసిన పాట ఏది ?
జవాబు:
భూమికి పచ్చాని. రంగేసినట్టు.
ప్రశ్న 9.
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! రచనకు ప్రేరణ ఏది ?
జవాబు:
ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే నవవధువు వరకట్న చావుకు బలి కావటం.
ప్రశ్న 10.
కలేకూరి ప్రసాద్ అనువాదం చేసినవి ఎవరి రచనలు ?
జవాబు:
మహాశ్వేతాదేవి, అరుంధతీ రాయ్, స్వామి ధర్మ తీర్థ, ప్లోబోనెరూడా మొదలగు వారి రచనలు తెలుగునకు అనువదించాడు.
ప్రశ్న 11.
నవవధువుల ఆత్మహత్యలకు కారణమేమిటి ?
జవాబు:
వరకట్నం , అత్తమామల, ఆడపడుచుల ఆరళ్ళు.
ప్రశ్న 12.
మనిషి మనిషికి మధ్య సంబంధాలు ఏమైనాయి ?
జవాబు:
మార్కెట్లో సరుకులయ్యాయి.
ప్రశ్న 13.
మానవత్వం మంటగలసిందని చెప్పటానికి కారణం ఏమిటి ?
జవాబు:
ఇందిర అనే నవవధువు ఆత్మహత్య చేసుకోవటం.
ప్రశ్న 14.
సమసమాజం కావాలంటే ఏం చేయాలి ?
జవాబు:
స్త్రీలలో చైతన్యాన్ని తీసుకురావాలి.
ప్రశ్న 15.
కలేకూరి ప్రసాద్ మొత్తం ఎన్ని గ్రంథాలు, వ్యాసాలు రాశాడు ?
జవాబు:
70 కి పైగా.
సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
మానవత్వమే మంటగలిసెనా!
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ . . పువ్వా! అనే పాట నుండి గ్రహించబడింది.
సందర్భము : ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే పేరుగల నవవధువు పాదాల పారాణి ఆరకముందే వరకట్నానికి బలి అయింది. ఆ సంఘటనను వివరించు సందర్భంలో కవి వ్రాసిన వాక్యమిది.
భావము : మానవత్వం మంట కలిసినదా ? మమతాను బంధాలకు అర్థం లేకుండా ‘ పోయిందా ? వివాహంలో చదివిన వేదమంత్రాలకు విలువ లేకుండా పోయిందా? పెళ్లి ప్రమాణాలు ఎగతాళి చేశాయా ? ప్రేమ బంధంగా కట్టిన తాళి ఉరితాడయ్యిందా? పాదాల పారాణి ఆరకముందే శవంగా మారావా? అని ఇందలి భావం.
ప్రశ్న 2.
‘మార్కెట్లోన సరకులాయెనే’.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ ‘ పువ్వా! అను గేయం నుండి గ్రహించబడింది.
సందర్భము : అత్తింటివారు కట్నం కోసం ప్రకాశం జిల్లా టంగుటూరులో ‘ఇందిర’ అనే నవవధువును హత్య చేశారు. ఆ విషయాన్ని విన్న గేయ రచయిత మానవత్వానికి విలువ లేకుండా పోయిందాయని ఆవేదన చెందిన సందర్భంలోనిది.
భావము : కుటుంబ సంబంధాలు, ప్రేమానుబంధాలు బజారులో “సరుకుల వలే అమ్ముడుపోతున్నాయని భావించాడు. మన సమాజంలో రాక్షస విలువలు రాజ్యమేలు తున్నాయని, ధనదాహానికి మనిషికి మనిషికి మధ్య ఉన్న విలువలు నానాటికి పతనమౌతున్నాయని ఇందలి భావం.
ప్రశ్న 3.
కోకిల మేధం సాగుతున్నది.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను గేయం నుండి గ్రహించబడింది.
సందర్భము : అత్తింటివారు కట్నం కోసం ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే నవవధువును హత్య చేశారు. ఆ విషయాన్ని గురించి తెలుసుకున్న కవి ఈ గేయం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భంలోనిది.
భావము : ఆడదానికంటే అడవిలో మానుకే విలువనిస్తున్న సమాజం మనది. కట్నం కోసం కోడలి బ్రతుకును నాశనం చేసిన అత్తమామలు రాక్షసులా? పిశాచాలా? ఆకలి తీర్చుకోవటానికి లేళ్ళను చంపే పులులున్న ఈ దేశంలో, కట్నం కోసం కోకిలల వంటి కోడళ్ళను పొట్టన పెట్టుకుంటున్నారని ఇందలి భావం.
ప్రశ్న 4.
రాక్షస పీడన నెదిరించాలె.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ చే రచించబడిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అనే పాట నుండి గ్రహించబడింది..
సందర్భము : కట్నం కోసం స్త్రీలను పీడించే దుర్మార్గులను ఎదిరించాలని, స్త్రీ, పురుష భేదంలేని నవసమాజ నిర్మాణం జరగాలని కవి ఆశించిన సందర్భంలోనిది.
భావము : అక్కల్లారా! చెల్లెళ్ళారా! అబలల్లా వ్యవస్థ చేత మార్చబడిన వనితల్లారా! వరకట్నపు చావు ఉదంతాలు మీకు కన్నీటిని మిగిల్చాయా! స్త్రీ, పురుషులు ఈ సమాజంలో సమానమనే నినాదాన్ని బలపరచండి. అలాంటి భేదం లేని సమాజం కొరకు ప్రయత్నించమని ఇందలి భావం.
కవి పరిచయం
కవి పేరు : కలేకూరి ప్రసాద్.
పుట్టిన తేదీ : అక్టోబరు 25, 1964.
పుట్టిన ఊరు : కృష్ణాజిల్లా, కంచికచర్ల.
విద్యాభ్యాసం : ఇంటర్మీడియట్.
తల్లిదండ్రులు : లలిత సరోజిని, శ్రీనివాసరావు.
ఉద్యోగం : మహబూబ్ నగర్, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టు ఛైర్మన్‌గా కొంతకాలం. సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకునిగా కొంత కాలం పనిచేశారు.
రచనలు : దళిత సాహిత్యం , దళిత సాహిత్యోద్యమం పిడికెడు ఆత్మగౌరవం కోసం, అంటరాని ప్రేమ.
పాటలు :
- రైతుల ఆత్మహత్యలపై “భూమికి పచ్చాని రంగేసినట్లు”.
- మహిళలపై జరుగుతున్న గృహ హింసలపై కర్మభూమిలో – పూసిన ఓ పువ్వా!
అనువాదాలు :
మహాశ్వేతాదేవి, అరుంధతీరాయ్, స్వామి ధర్మ తీర్థ, ప్లోబోనెరూడా, మొదలగు వారి రచనలను తెలుగునకు అనువదించారు.
కలం పేర్లు : యువక, శబరి, సంఘమిత్ర, నవత.
మరణం : మే 7, 2011.
కలేకూరి ప్రసాద్ సామాజిక రాజకీయ ఉద్యమాలకు ఆకర్షింపబడి విద్యార్థి ఉద్యమాలలో కూడా పాల్గొన్నాడు. ఈయన అక్టోబరు 25, 1964లో కృష్ణాజిల్లా, కంచికచర్లలో జన్మించారు. తల్లిదండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావులు. వీరిద్దరూ ఉపాధ్యాయులు. ప్రాథమిక విద్య పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులోను ఇంటర్ మీడియట్ గుంటూరు ఏ.సి.కళాశాలలోను పూర్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టుకు ఛైర్మన్ గాను, సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ (ఎన్.జి.ఓ) సంచాలకునిగా పనిచేశాడు. కంచికచర్లలో భూస్వాములు ఒక దళితుని సజీవదహనం చేశారు. ఆ సంఘటన ప్రసాదు కవిని చేసింది. యువక, శబరి, ‘సంఘమిత్ర, నవత వంటి కలం పేర్లతో ప్రతిఘటనాత్మక రచనలు చేశాడు.
దళిత సాహిత్యం, దళిత సాహిత్యోద్యమం, పిడికెడు ఆత్మగౌరవం కోసం, అంటరాని ప్రేమతో పాటుగా “భూమికి పచ్చాని రంగేసినట్టు, “కర్మభూమిలో పూసినపువ్వా!” అన్న పాటలను కూడా రచించాడు. వీరు దాదాపు 70 దాకా అనువాద గ్రంథాలు, వ్యాసాలు రాశాడు. మహాశ్వేతాదేవి, అరుంధతిరాయ్, స్వామి ధర్మ తీర్థ మొదలగు వారి రచనలకు తెలుగు అనువాదం చేశారు.
ప్రస్తుత పాఠ్యభాగం ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!’ కలేకూరి ప్రసాద్ రచించినది. ఇది మహిళలపై జరుగుతున్న గృహహింసలు, స్త్రీల వరకట్న చావుల నేపథ్యంలో వ్రాయబడింది. ప్రసాద్ మే 7, 2011 న తనువు చాలించారు.
పాఠ్యభాగ సారాంశం
‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా !’ అన్న పాట మహిళలపై జరుగుతున్న గృహ హింసలు, స్త్రీల వరకట్న చావులను ప్రతిబింబిస్తుంది. ఈ పాటకు ప్రకాశం జిల్లా టంగుటూరులో ‘ఇందిర’ అనే పేరుగల కొత్త పెళ్ళికూతురు వరకట్న హత్యకు బలై పోవటం ప్రేరణనిచ్చింది.
కర్మ భూమిగా పేరు పొందిన భారతదేశాన పుట్టిన ఓ. పువ్వు వంటి మహిళా! విరిసీ విరియని చిరునవ్వా! నీవు జీవితంపై పెంచుకున్న ఆశలు అడియాశలై కట్న జ్వాలలకు బలి అయ్యావా! కాళ్ళకు పెట్టిన పారాణి ఆరకముందే, మామిడి తోరణాలు వాడకముందే, పెళ్ళిపందిరి తీయకముందే, బంధువులు వారి వారి ఇళ్ళకు చేరక ముందే, మంగళ వాయిద్యాలు మోతలు ఆగకముందే, అప్పగింతలు ముగియక ముందే పెళ్ళికూతురిగా ముస్తాబుతో శ్మశానానికే కాపురం వెళ్ళావా!
మానవత్వం నశించిందా! మమతలకు అర్థం మారిపోయిందా! వేదమంత్రాలు ఎగతాళి చేశాయా! పెళ్ళి ప్రమాణాలు పరిహాసమాడాయా! ప్రేమ బంధంగా కట్టిన తాళి ఉరితాడయ్యిందా! చీకటి చితిలో శవానివయ్యావా! రాక్షస విలువలతో రాజ్యమేలుతున్న నరకాన్ని గుర్తుకు తెస్తున్న ఈ సంఘంలో మానవ సంబంధాలు మార్కెట్లో సరుకులయ్యాయి. ఆడపడుచులు ఆడవారికే శత్రువులయ్యారు. అత్త కన్నులు నిప్పులు చెరిగి మలమల మాడి బొగ్గయ్యావా!
ఆడవారి కంటే అడవిలో మానుకే ఈ సమాజం విలువను ఇస్తుంది. ఆరడి పెట్టిన ఆడపడుచుకూ అత్తారింటిలో, ఆరళ్ళు తప్పవు. . కోడలి బతుకులో నిప్పులు పోసిన అత్తకు గర్భశోకమే కదా! లేడి పిల్లలను చంపే ఈ లోకంలో ఆడపిల్లల శవయజ్ఞ కొనసాగుతున్నది. అనురాగాలు మాయమై ఆర్తనాదాలు చెలరేగుతున్నాయి.
‘సమాజ వ్యవస్థను మలచిన అక్కల్లారా! చెల్లెళ్ళారా! మండుతున్న కన్నెల గుండెల కమురు వాసన మీ కళ్ళల్లో సెలయేర్లు పారించడం లేదా! స్త్రీ, పురుష సమానత్వంతో సమాజం వర్థిల్లాలి. మనుషులంతా సమానమేనని చాటి చెప్పాలి. గృహహింసలు, స్త్రీల వరకట్నపు చావులు నశించాలి అని కలేకూరి ప్రసాద్ తన ,ఆవేదనను కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా! అన్న పాట ద్వారా వ్యక్తం చేశాడు.
కఠిన పదాలకు అర్థాలు
విరిసీ విరియని = పూర్తిగా విచ్చుకోని
చిరునవ్వు = మందహాసం
నీరై కారగ = కారిపోగా
కట్నపు జ్వా లలో = వరకట్నమను మంటలలో
సమిదై పోయావా! = హోమంలో వేసే కట్టెగా మారావా!
పారాణి = కాళ్ళకు పూసే ఎర్రని రంగు
తోరణాలు = మామిడి తోరణాలు
వాడనేలేదు = వాడిపోలేదు
బంధువులు = చుట్టాలు
అప్పగింతలు = పెళ్ళికూతురును అత్తవారి తరపువారికి అప్పచెప్పటం
సెలయేరు = కొండవాగు
ముస్తాబయి = అలంకరించుకుని
మానవత్వం = మంచి స్వభావం
మంటగలిసెనా = నాశనం అయిందా!
మమతలకు = ప్రేమలకు
వేదఘోష = వేదమంత్రాలు
ప్రమాణాలు = ప్రతిజ్ఞలు
పరిహాసమాడెనా = ఎగతాళి చేశాయా!
తాళి = మంగళసూత్రం
పున్నమి = పౌర్ణమి
కారుమేఘాలు = నల్లని మేఘాలు
చీకటి చితిలో = చీకటనే మంటలలో
రాజ్య మేలెడి = పాలన సాగిస్తున్న
నరక ప్రాయపు = నరకము వంటి
ఆడపడుచులు = భర్త యొక్క సోదరీమణులు
నిప్పులు చెరుగు = కోపంతో రగిలిపోయాయా
శిశిరము = మంచుపడే కాలం (శిశిర ఋతువు)
మాను = చెట్టు
ఆరడిపెట్టు = కష్టాలపాలు చేయు
అత్తారింట = అత్తవారియింట
నిప్పులు పోయు = కోపగించు
గర్భశోకము = బిడ్డ మరణం వలన వచ్చిన దుఃఖము
గణములు = సమూహములు
జీవనరాగం = బ్రతుకుపై తీపి
ఆర్తనాదం = పొలికేక
వ్యవస్థ = సమాజము
మలచిన = తయారుచేసిన
అబలల్లార = బలహీనులైన వనితల్లారా!
కమురు వాసన = కాల్చుతున్నపుడు వచ్చు చెడువాసన
ఏరులు = సెలయేరులు
గాయం = పుండు
రాక్షస పీడన = రాక్షసుల వలే పీడించటం