AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material పద్య భాగం 3rd Poem హనుమత్సందేశము Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material 3rd Poem హనుమత్సందేశము

వ్యాసరూప ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సీతాదేవితో హనుమ ఏమని పలికాడు ?
జవాబు:
శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతుడు సీతకు రామ ముద్రికను ఇచ్చాడు. సీతకు విశ్వాసము కలగడానికి హనుమంతుడు, రాముని వృత్తాంతాన్నీ, తన చరిత్రనూ విస్పష్టంగా వినయముతో ఇలా విన్నవించాడు.

శ్రీరాముని వృత్తాంతము : “అమ్మ ! ‘రావణుడు రాముని మోసగించి, నిన్ను అపహరించుకొని వచ్చిన సమయంలో, నీవు నీ బంగారు నగలను ఋష్యమూక పర్వతంపై పడవేశావు. మేము ఆ నగలను తీసి దాచాము. నీ భర్త రాముడు ఆ ‘ పర్వతం దగ్గరకు వచ్చినపుడు, సుగ్రీవుడు రామునకు ఆ నగలను చూపించాడు. రాముడు వాటిని గుర్తించాడు.

శ్రీరాముడు సుగ్రీవునకు అభయము ఇచ్చాడు. దుందుభి అనే రాక్షసుని శరీరాన్ని దూరంగా తన్ని పారవేశాడు. ఏడు తాడిచెట్లనూ ఒకే బాణంతో ఖండించాడు. వారిని తన అద్భుత శక్తితో కూల్చి చంపాడు. సుగ్రీవునకు తారను భార్యగా ఇప్పించాడు. అంగదుడిని యువరాజుగా చేశాడు.

రామలక్ష్మణులు ఇప్పుడు వానర సైన్యములు తమ్ము సేవిస్తుండగా, మాల్యవంతముపై ఉన్నారు. నిన్ను వెదకడానికి వానరులను అందరినీ అన్ని దిక్కులకూ పంపారు. అంగదుని నాయకత్వంలో మేము కొందరము దక్షిణ దిశకు వచ్చాము. మా వానరులు నన్ను లంకకు పంపారు. నేను సముద్రాన్ని తేలికగా దాటి, ఇక్కడకు వచ్చి లంకను అంతా వెదికి, ఇక్కడ నిన్ను చూశాను. నీతో రావణుడు క్రూరంగా పరుష వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు మీది నేను ఈ చెట్టుమీద ఉన్నాను.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

అమ్మా ! శ్రీరాముని శరీరము నీలమేఘచ్ఛాయలో ఉంటుంది. ఆయన నేత్రములు తెల్లని పద్మపు రేకులవలె ఉంటాయి. కంఠము శంఖమువలె ఉంటుంది. అందమైన చీలమండలూ, పొడవైన బాహువులూ రామునికి ఉంటాయి. ఆయన కంఠస్వరము దుందుభి ధ్వనిని పోలి ఉంటుంది. ఆయన పాదములలో పద్మరేఖలు ఉంటాయి. రాముడు కపటము ఎరుగని సత్యవాక్యములు పలికేవాడు. రాముడు శుభలక్షణములు కలవాడు. లక్ష్మణుడు కూడా రాముని వంటి గుణములు కలవాడే కానీ, అతని దేహచ్ఛాయ మాత్రము బంగారు రంగులో ఉంటుంది.

హనుమ వృత్తాంతము : తల్లీ ! సీతమ్మ మా అమ్మ అంజనాదేవి గొప్ప అరణ్యంలో భయంకరమైన తపస్సును వాయుదేవుడిని ఉద్దేశించి చేసింది. ఆ వాయుదేవుని అనుగ్రహంతో, ఆమె నన్ను కుమారుడిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని. నా పేరు హనుమంతుడు.

అమ్మా ! రాముడు నీకు ఇచ్చిన ఉంగరాన్ని నేను నీకు తెచ్చి ఇచ్చాను. దూత వట్టి చేతులతో వెళ్ళడం సముచితం కాదు. నేను నిన్ను దర్శించినందులకు గుర్తుగా, నీ శిరోరత్నాన్ని నాకు ఇచ్చి పంపించు అని హనుమంతుడు సీతను కోరాడు. సీత విశ్వాసం కల్గించడానికి హనుమ తన శరీరాన్ని, ఆకాశమును తగిలే అంత ఎత్తుకు పెంచాడు. తిరిగి సూక్ష్మరూపం ధరించాడు. సీత తన శిరోరత్నాన్ని హనుమంతునకు ఇచ్చి, రామునికి చెప్పమని తన సందేశాన్ని తెల్పింది. సీత తన వీపుపై కూర్చుంటే, తెల్లవారేలోగా రాముని వద్దకు తీసికొని వెడతానని హనుమ సీతకు చెప్పాడు. దొంగతనంగా తీసికొని వెళ్ళడం, రామునికి కీర్తికరం కాదని సీత చెప్పింది.

హనుమంతుడు సీతను ఊరడించడం : – “అమ్మా ! నీ భర్త రాముడు సముద్రాన్ని దాటి సుగ్రీవ, నుషేణాది వానర వీరులతో వచ్చి, నీచుడైన రావణుని చంపి, రాజసంతో నిన్ను తీసుకొని సైన్యంతో వెడతాడు. నా మాట నమ్ము తల్లీ !” అని, హనుమ సీతకు తన సందేశాన్ని విన్నవించి ఆమెకు ధైరాన్ని కల్గించాడు.

ప్రశ్న 2.
సీతాదేవి తన సందేశాన్ని హనుమతో ఏమని వివరించింది ?
జవాబు:
మొల్ల రామాయణము, తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానంలో అలారుతో మొల్లకు తెలుగు రచనపై మక్కువ ఎక్కువ. “క్రమ్మఱ సంస్కృతము చెప్పగా రుచియగునే ?” అని ప్రశ్నించి, సామన్య ప్రజానీకానికి పఠనయోగ్యమైన కమ్మనైన తెలుగులో రామాయణం రచించింది. తేనె నోటికి తగులగానే నోరు తియ్యనైన విధంగా, మొల్ల రామాయణాన్ని సరళసుందరంగా, సరసాలంకారాలతో రచించింది.

హనుమంతుని ద్వారా సీతమ్మ రామునికి పంపిన సందేశము :
హనుమంతుడు, రాముని దూతగా లంకానగరానికి వచ్చి, సీతమ్మను కలిశాడు. ముని వృత్తాంతాన్నీ, తన చరిత్రను సీతకు చెప్పి తనయందు ఆమెకు విశ్వాసాన్ని కలిగించాడు.
సీత హనుమంతుని నిజరూపాన్ని చూసింది, సంతోషించింది. హనుమంతుడు కోరినట్లుగా తన శిరోరత్నాన్ని హనుమంతునికి ఇచ్చి ఇలా చెప్పింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

సీత సందేశము : “నాయనా ! హనుమా ! సూర్యవంశం అనే సముద్రములో చంద్రుని వంటివాడయిన శ్రీరాముని క్షేమవార్తను నీ వల్ల విన్నాను. నేను అనుభవిస్తున్న కష్టాలను నీ ద్వారా రామునికి చెప్పగలిగాను. నీవు చేసిన ఉపకారానికి నేను నీకు ప్రత్యుపకారం చేయలేను. బ్రహ్మకల్పములపాటు, ఈ భూమండలంలో నీవు చిరంజీవిగా ఉండు” అని హనమను దీవించింది.

“పుణ్మాత్మా హనుమా ! ఎప్పుడూ శ్రీరాముని పాదములు, నా హృదయంలోనే స్థిరంగా నిలుపుకొని ఉన్నానని, నా ప్రభువుకు తెలియజెయ్యి. ఇప్పుడు కపటబుద్ధియైన రావణుడు వచ్చి గర్వముతో నన్ను గూర్చి ఎన్ని, దుష్టవాక్యములు మాట్లాడాడో, నీవు చెవులారా విన్నావు. వాటినన్నింటినీ రాముడికి నా యందు దయ కలిగేటట్లు చెప్పు. నేను పొడవైన నా తలవెంట్రుకలు జడలు కట్టేటట్లు చేసుకున్నాను. మాసిన జీర్ణాంబరాన్ని ధరించాను. నేలపై దుమ్మును విభూతి పూతగా పూసుకున్నాను. రాముడి దివ్యమూర్తిని నా మనస్సులో నిలుపుకున్నాను. అన్నపానాలు విసర్జించి, నేలపై పడుకుంటున్నాను. నిద్రపోవడం మానివేశాను. రామనామాన్ని జపిస్తూ, రాక్షసులనే దుష్ట జంతువులు గల లంకారణ్యంలో రాముని గురించి తపస్సు చేస్తున్నాను. నాకు దర్శనం ఇమ్మని రాముడికి చెప్పు.

లక్ష్మణుడు నన్ను తన తల్లిగానూ, రాముని తన తండ్రిగానూ భావించి సేవించేవాడు. అతడు గుణశాలి. నీతికోవిదుడు. అటువంటి లక్ష్మణుడిని నేను అనరాని, వినరాని మాటలను అజ్ఞానంతో మాట్లాడి, అతణ్ణి బాధ పెట్టాను. దానికి తగిన ఫలితాన్ని నేను అనుభవించానని లక్ష్మణుడికి చెప్పు.

నేనన్న మాటలు తన మనస్సులో ఉంచుకోక, నా గౌరవాన్ని కాపాడమని వినయవంతుడయిన లక్ష్మణునికి చెప్పు అని సీత రామలక్ష్మణులకు తన సందేశాన్ని వివరించింది.

సీత, హనుమ వెంట తాను వెళ్ళడం మంచిది కాదని చెప్పింది. తాను పరపురుషులను అంటనని చెప్పింది. రావణుని చంపి, తనను తీసకొని వెళ్ళడం రామునికి ధర్మమని తెలిపింది. ఆలస్యం లేకుండా రాముని లంకకు తీసుకువచ్చి, . రావణ సంహారం చేయించి, తనను రాముడు తీసికొని వెళ్ళేలా చూడమని హనుమను కోరింది.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
శ్రీరాముని రూపాన్ని హనుమ ఏ విధంగా వర్ణించాడు ?
జవాబు:
హనుమంతుడు సీతాదేవితో శ్రీరాముని రూపాన్ని ఈ విధంగా వర్ణించాడు.

అమ్మా ! శ్రీరాముని శరీరము నీలమేఘచ్ఛాయలో ఉంది. ఆయన కన్నులు తెల్లని పద్మపు రేకుల వలె ఉన్నాయి. కంఠము శంఖము వలే ఉంది. అందమైన ఎత్తైన ఎద కలవాడు, తిన్నని పెద్దవైన పెద్ద భుజములు కలవాడు, భేరీ శబ్దము వంటి కంఠస్వరము గలవాడు, పద్మపు రేకుల వంటి పాదములు కలవాడు. కపటము ఎరుగని సత్య వాక్యములను పలికేవాడు. అమ్మా ! సీతాదేవీ శ్రీరాముడు ఇట్టి శుభలక్షణములు గలవాడు. శరీరము బంగారము వలే మెరిసిపోతోంది అని హనుమ వివరించాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 2.
శ్రీరాముని ముద్రికను చూసి సీత హనుమతో ఏమన్నది ?
జవాబు:
శ్రీరాముని ముద్రికను హనుమ చూపగా, అతనితో సీతాదేవి ఇలా పలికెను. నా భర్త అయిన శ్రీరాముని సమాచారమును నీ వలన తెలుసుకొన్నాను. కానీ నీ నిజరూపమును చూడకుండా నిన్ను నమ్మి నా శిరోరత్నమును నీకివ్వను అని హనుమతో సంశయముగా పలికినది. అప్పుడు హనుమ ఆకాశమును అంటునట్లుగా తన నిజ స్వరూపమును
సీతాదేవి ఎదుట ప్రదర్శించెను.

ప్రశ్న 3.
సీతాదేవి హనుమంతుని ఏమని దీవించింది ?
జవాబు:
సీతాదేవికి నమ్మకము కలిగించుట కొరకు హనుమ తన నిజ స్వరూపమును చూపించి, మరల సూక్ష్మరూపము ధరించి నమస్కరించి నిలబడగా, సీతాదేవి హనుమంతునికి తన శిరోరత్నమును ఇచ్చి ఇలా దీవెనలు పలికినది.

సూర్యవంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు శ్రీరాముని యోగక్షేమాలను నీ వలన తెలుసుకొన్నాను.

నేను అనేక విధాలుగా ఇక్కడ పడుతున్న కష్టాలను నీ ద్వారా ఆయనకు తెలుపుకో గలిగాను. నీ సహాయానికి తగిన విధంగా నేను ఏమి ఇవ్వగలను ? నీవు ఈ భూమండలము నందు బ్రహ్మకల్పముల పర్యంతము చిరంజీవిగా వర్థిల్లు ! అని దీవించెను.

ప్రశ్న 4.
మొల్లను గురించి రాయండి.
జవాబు:
తేనె .నోట్లో వేసుకుంటే తియ్యగా అనిపించే విధంగా తేట మాటలతో తెలుగులో రామాయణం రాసిన గొప్ప కవయిత్రి మొల్ల. మొల్ల రామాయణము తెలుగులో బహుళ ప్రజాదరణను పొందింది. ఈమె పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. కాలం క్రీ.శ. 16వ శతాబ్ది. తండ్రి ఆతుకూరి కేసన.

ఈమె గోపవరపు శ్రీకంఠమల్లేశుని వరప్రసాదంతో కవిత్వం నేర్చుకొంది. మొల్ల తన రామాయణాన్ని శ్రీరామునికే అంకితం చేసిన ధన్యజీవి, కవయిత్రి మొల్ల.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 5.
శ్రీరాముని వీరత్వాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతాదేవిని తన వీపుపై కూర్చుండబెట్టి శ్రీరాముని వద్దకు చేర్చెదను అని ఆమెతో పలుకగా ఆమె శ్రీరాముని వీరత్వమును వర్ణించినది. నేను పరపురుషుని తాకను నన్ను దొంగిలించి తెచ్చిన రావణుని యుద్ధ రంగంలో సంహరించి నా భర్త నన్ను కాపాడగలడు. శ్రీరాముడు మూడు లోకములను జయింపగల జగదేకవీరుడు. కోదండమును మంత్రోపదేశము ద్వారా పొందిన యోధుడు. రాక్షస వంశాన్ని అంతమొందించగల యముడు అని శ్రీరాముని వీరత్వాన్ని సీతాదేవి వర్ణించినది.

ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మొల్ల తన రామాయణాన్ని ఎవరికి అంకితమిచ్చింది ?
జవాబు:
శ్రీరామచంద్రునికి.

ప్రశ్న 2.
‘హనుమత్సందేశము’ అనే పాఠ్యభాగం దేని నుండి గ్రహించబడింది ?
జవాబు:
మొల్ల రచించిన ‘రామాయణం’ లోని సుందరకాండ నుండి.

ప్రశ్న 3.
‘అర్క సంభవుడు’ అంటే ఎవరు ?
జవాబు:
సుగ్రీవుడు.

ప్రశ్న 4.
రాముని గుర్తుగా సీతాదేవికివ్వడానికి హనుమంతుడు ఏమి తెచ్చాడు ?
జవాబు:
నూత్న రత్నాంగుళీయకము (రత్నపుటుంగరము).

ప్రశ్న 5.
తన గుర్తుగా సీతాదేవి హనుమకు ఏమి ఇచ్చింది ?
జవాబు:
శిరోరత్నము.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 6.
శ్రీరాముడు ఉన్న పర్వతం పేరేమిటి ?
జవాబు:
మాల్యవంతము అను పేరుగల పర్వతముపై.

ప్రశ్న 7.
హనుమంతుని తల్లి పేరేమిటి ?
జవాబు:
అంజనా దేవి.

సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. .
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.

సందర్భము : సీత హనుమంతుడిని, రాముని లక్షణాలను గురించి చెప్పమని అడిగింది. హనుమంతుడు రాముని రూపాన్ని, లక్ష్మణుని రూపాన్ని వర్ణించు సందర్భములోనిది.

భావం : రామలక్ష్మణులు రూపురేఖలు అన్నింటిలో సమానులే అనీ, కానీ శరీరకాంతిలో లక్ష్మణుని రంగు మాత్రం బంగారు రంగు అని హనుమంతుడు చెప్పాడు.

ప్రశ్న 2.
వసుధాస్థలి వర్థిల్లు బ్రహ్మకల్పమున్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.

సందర్భము : హనుమంతుడు తనకు చేసిన ఉపకారానికి బదులుగా, సీత హనుమంతుడిని చిరంజీవిగా వర్థిల్లమని ఆశీర్వదించి దీవిస్తూ హనుమంతునితో పలికిన పలుకులివి.

భావం : శ్రీరాముని యోగక్షేమాలను తెలియజేస్తూ, భర్త శ్రీరాముని రత్నపుటుంగరాన్ని తెచ్చి యిచ్చిన హనుమంతుడిని వాత్సల్యంతో ఈ భూమి మీద మరణం లేకుండా చిరకాలం బ్రహ్మకల్పముల పర్యంతము జీవించుమని సీత దీవెనలిచ్చినదని భావం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 3.
విన్న వింపుము సత్వ సంపన్న ! నీవు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.

సందర్భము : శ్రీరాముని సందేశమును తెచ్చి ఉంగరము నిచ్చిన హనుమంతునితో సీత తన సందేశాన్ని శ్రీరామునికి అందజేయమని చెప్పిన సందర్భములోనివీ పలుకులు. క్రూరులైన రాక్షసుల మధ్యలో బాధలనుభవిస్తూ శ్రీరాముని గూర్చి తపస్సు చేయు చున్నాను. శ్రీరాముడిని ప్రత్యక్షము కమ్మని చెప్పవయ్యా హనుమా ! అని సీత పలుకుచున్నది.

భావం : నా భర్తను గూర్చి తపస్సు చేస్తున్నాను. సత్వరము నా సమక్షంలో ప్రత్యక్షము కమ్మని శ్రీరామునికి తెలియజేయి అని సీత హనుమతో పలికినదని భావము.

ప్రశ్న 4.
సౌమిత్రికిఁ జెప్పవయ్య సాహసి వర్యా !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.

సందర్భము : లక్ష్మణుని నేను అవివేకంతో అనరాని మాటలు .అన్నాను. వాటిని మనసులో పెట్టుకొనకుండా నా గౌరవమును కాపాడుమని లక్ష్మణునికి తెలియజేయమని సీత హనుమంతునితో పలికిన పలుకులివి.

భావం : “నేను అన్న మాటలు మనసులో ఉంచుకోవద్దని, నా గౌరవమును కాపాడుమని సుమిత్రాదేవి కొడుకైన శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణునితో చెప్పవయ్యా ! గొప్ప సాహసివయిన ఓ హనుమా !” అని సీత పలికినదని భావము.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 5.
‘దొంగిలి కొనిపోవదగునె దొరలకు నెందున్’.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.

సందర్భము : రాజు అన్నవాడు శత్రువును పూర్తిగా సంహరించి విజయము సాధించాలని సీత పలికిన సందర్భంలోనిది.

భావం : సీత హనుమంతుని వీపు మీద కూర్చొని, లంక నుండి హనుమంతునితో వెడితే, రాముని దొంగ అని అంటారు. అదీకాక సీత తాను రాముని తప్ప, ఇతరుల శరీరాన్ని అంటుకోదు. కాబట్టి హనుమంతునితో తాను వెళ్లడం కుదరదు. అదీకాక సీతను దొంగిలించి తెచ్చిన రావణుని, అతని స్నేహితులనూ, సాహసంతో యుద్ధంలో ముందు చంపాలి. అంతేకాని దొంగతనంగా తీసుకువెళ్ళడం, రాజులకు తగదని, సీత హనుమంతునితో చెప్పిందని భావం.

అలంకారాలు

ప్రశ్న 1.
“నీలమేఘచ్ఛాయ బోలు దేహమువాడు.
జవాబు:
అలంకారము : స్వభావోక్తి. జాతి గుణ క్రియాదులను మనోహరంగా ఉన్నది ఉన్నట్లు వర్ణించి చెప్పినట్లయితే అది ‘స్వభావోక్తి’ అలంకారము.

వివరణ : శ్రీరాముడు గొప్పదైన నల్లని మేఘము వంటి ఛాయ గలిగిన శరీరమును కలిగినవాడు అని శ్రీరాముని శరీర ఛాయను గురించి ఉన్నది ఉన్నట్లు ఇక్కడ వర్ణించటం జరిగింది. కనుక ఇది స్వభావోక్తి అలంకారము.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 2.
“చుక్కలు తల పూవులుగా నక్కజముగ మేను పెంచి యంబర వీథిన్”.
జవాబు:
అలంకారము : అతిశయోక్తి.
ఉన్నదానికి అతిశయించి గోరంతలను కొండంతలుగా పెంచి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారమంటారు.

వివరణ : హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఆకాశానికి అంటు కొంటున్నట్లుగా తన శరీరాన్ని పెంచివేసాడని, అప్పుడు ఆకాశంలోని చుక్కలు అతడు ధరించిన పూలవలే కన్పిస్తున్నాయని అతిశయించి వర్ణించడం జరిగింది. కనుక ఇది అతిశయోక్తి అలంకారం.

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

ప్రశ్న 1.
క. ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
దున్నాఁ డిదె కపులఁ గూడి, యురుగతి రానై
యున్నాండు. నినుఁ గొని పో
నున్నాఁడిది నిజము నమ్ము ముర్వీ తనయా !
జవాబు:
ప్రతిపదార్ధము :
ఉర్వీ తనయా = ఓ సీతాదేవీ !
ఉన్నాడు లెస్స = క్షేమంగా ఉన్నాడు
రాఘవుడు = శ్రీరాముడు
ఇదె కపులన్ + కూడి = వానరములతో కలసి
ఉరుగతి = వేగంగా
రానై యున్నాడు = రావటానికి సిద్ధంగా ఉన్నాడు
నిన్నున్ + కొని = నిన్ను తీసుకొని వెళ్ళటానికి
ఉన్నాడు = రానున్నాడు
ఇది = ఇలా జరుగుట
నిజము = సత్యము
నమ్ము = విశ్వసించు

తాత్పర్యము :
ఓ సీతాదేవీ ! శ్రీరామచంద్రుడు వానరసేనతో కలిసి నిన్ను రక్షించటానికి ఇక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడి నుండి నిన్ను తీసుకొని వెళ్ళడం నిజము. నా మాటలను నమ్ము తల్లీ !

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 2.
సీ. ఆ మాట లాలించి భూమిజ తనలోన
వెఱఁ గంది, శింశుపావృక్ష మరసి
చూడంగ, నప్పుడు సూక్ష్మరూపంబున
నొడికమౌ శాఖల నడుమ నున్న
కపి కుమారుని రూప మపురూపముగఁ జేసి
స్వాంతంబులోన హర్షంబు నొంది,
దనుజ మాయలచేతఁ దఱచు వేఁగుటఁ జేసి
మాజాడ నేరక యూర కున్న

తే. భావ మూహించి, తన్ను నా దేవి యాత్మ
నమ్మకుండుట దెలిసి, యా కొమ్మమీంది
నుండి క్రిందికి లంఘించి, నిండు భక్తి
మ్రొక్కి నిలుచుండి కరములు మోడ్చి పలికె.
జవాబు:
ప్రతిపదార్థము :
ఆ మాటలు = తనకు వినిపించిన పలుకులు
ఆలించి = విని
భూమిజ = సీతాదేవి
తనలోన ఱున్ + కంది = తన లోపల ఆశ్చర్యమును పొంది
శింశుపావృక్షము = అశోక వృక్షము
అరసి చూడంగన్ = తేరిపార చూడగా
అప్పుడు = ఆ సమయంలో
సూక్ష్మ రూపంబునన్ = చిన్న ఆకారంతో
ఒడికమౌ = ఒద్దికగా
శాఖల నడుమన్ + ఉన్న = కొమ్మల మధ్యలో ఉన్న
కపి కుమారుని = వానరము
రూపము = ఆకారము
అపురూపముగన్ + చేసి = ఆశ్చర్యపడే విధంగా కనిపించగా
స్వాంతములోన = మనసులో
హర్షమున్ + ఒంది : సంతోషము పొంది
దనుజ = రాక్షసుల యొక్క
మాయల చేత = = మాయల వలన
తఱచు = ఎక్కువగా
వేఁగుటన్ + చేసి = బాధించబడుట వలన
మాటాడనేరక = సమాధానం ఇవ్వకుండ
ఊరక + ఉన్న = మౌనంగా ఉన్న
భావము = ఆంతర్యాన్ని, లోపలి ఆలోచనను
ఊహించి = విచారించి
తన్నున్ = తనను
ఆ దేవి = సీతాదేవి
ఆత్మ = మనస్సులో
నమ్మకుండుట = నమ్మకపోవటాన్ని
తెలిసి = తెలుసుకొని, గ్రహించి
ఆ కొమ్మమీఁది నుండి = ఆ అశోక వృక్షము యొక్క కొమ్మపై నుండి
క్రిందికి = దిగువకు
లంఘించి = దూకి
నిండుభక్తి = పరిపూర్ణమైన భక్తితో
మ్రొక్కి = నమస్కరించి
నిలుచుండె = నిలబడి
కరములు మోడ్చి = చేతులు జోడించి
పలికె = ఈ విధముగా అన్నాడు (హనుమంతుడు)

తాత్పర్యం :
తనకు వినిపించిన పలుకులుట విని సీతాదేవి తన లోపల ఆశ్చర్యమును పొంది అశోక వృక్షము తేరిపార చూడగా ఆ సమయంలో చిన్న ఆకారంతో ఒద్దికగా కొమ్మల మధ్యలో ఉన్న వానరము ఆకారము ఆశ్చర్యపడే విధంగా కనిపించగా మనసులో సంతోషము పొంది రాక్షసుల యొక్క మాయల వలన ఎక్కువగా బాధించబడుట వలన సమాధానం ఇవ్వకుండ మౌనంగా ఉన్న ఆంతర్యాన్ని, లోపలి ఆలోచనను విచారించి తనను సీతాదేవి మనస్సులో నమ్మకపోవటాన్ని తెలుసుకొని, గ్రహించి ఆ అశోక వృక్షము యొక్క కొమ్మపై నుండి దిగువకు దూకి పరిపూర్ణమైన భక్తితో నమస్కరించి నిలబడి చేతులు జోడించి ఈ విధముగా, అన్నాడు (హనుమంతుడు).

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 3.
ఉ. తమ్ముని గూడి పుణ్య గుణ ధాముఁడు, రాముఁడు వచ్చి మాల్యవం.
తమ్మున సైన్య సంఘము ముదంబునఁ గొల్వఁగ నుండి, భూమిపై
మిమ్ములఁజూచి రండనుచు మేటి కపీంద్రులఁ బుచ్చి, యందు మొ
తమ్ముగ మమ్ముఁ గొందఱను దక్షిణ భాగము చూడఁ బంపుచున్.
జవాబు:
ప్రతిపదార్థము :
తమ్ముని = సోదరుడైన లక్ష్మణునితో
కూడి = కలిసి
పుణ్యగుణధాముడు = పుణ్యగుణములకు నిలయమైన
రాముడు = శ్రీరాముడు
వచ్చి = చేరి
మాల్యవంతమ్మున = మాల్యవంతము అను పర్వతముపై
సైన్య సంఘము = భటుల సమూహం
ముదంబునన్ = ఆనందంతో
కొల్వఁగన్ = సేవిస్తూ
ఉండి = ఉండగా
భూమిపై = భూభాగముపై
మిమ్ములన్ = మిమ్మల్ని
చూచి = వెదకి
రండ + అనుచు = రమ్మని
మేటి = వీరులైన
కపీంద్రులన్ = వానర శ్రేష్ఠులను
పుచ్చి = పంపి
అందు = ఆ వానరముల
మొత్తమ్ముగ = సమూహము లోని
మమ్మున్ = మా వంటి వారిని
కొందఱును = కొందరిని
దక్షిణ భాగము = దక్షిణ దిక్కు వెంబడి
చూడన్ = వెదకుటకు
పంపుచున్ = పంపుతూ (ఇలా పలికాడు)

తాత్పర్యము :
ఓ సీతాదేవీ ! సోదరుడైన లక్ష్మణునితో కలిసి పుణ్యగుణములు కలిగిన శ్రీరాముడు, మాల్యవంతము అనే పర్వతంపై తనను, సైన్యము సంతోషంతో సేవిస్తూ ఉండగా, నిన్ను ఇక్కడి భూభాగములో వెదికి చూచి రండని, శ్రేష్ఠులైన వానరములలో కొందరిని మావంటి వారిని ఈ దక్షిణ దిక్కు వైపు పంపుతూ ఇలా పలికాడు.

ప్రశ్న 4.
క. అంగనంఁ బొడఁగన నీవి తన
య్యంగను గడుఁజాలువాఁడ వంచును, నాచే
నుంగర మంపెను శ్రీ రఘు
పుంగవుఁ, డిదె కొమ్మటంచు భూమిజకిచ్చెన్.
జవాబు:
ప్రతిపదార్థము :
అంగన = సీతాదేవి యొక్క
బొడఁగనన్ = ఆచూకీ తెలుసుకొనటానికి
నీవు + ఇయ్యంగను = ఇవ్వటానికి నీవు
కడుఁ జాలువాఁడవు = సమర్థుడవు
అంచును = అని భావించి
శ్రీరఘరాముడు = శ్రీరాముడు
నాచేన్ = నా చేత
ఉంగరము + అంపెన్ = ఉంగరమును పంపెను
ఇదె = ఇదుగో
కొమ్ము + అటంచు = తీసుకొమ్ము అంటూ
భూమిజకు = సీతాదేవికి
ఇచ్చెన్ = ఆ ఉంగరమును ఇచ్చెను.

తాత్పర్యము :
సీతాదేవిని వెదికి తెలుసుకోగల సమర్థుడవు నీవే ! అని శ్రీరాముడు పలికి నా చేత ఈ ఉంగరమును పంపెను. ఇదిగో అని ఆ ఉంగరమును (హనుమంతుడు) సీతాదేవికి ఇచ్చెను.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 5.
ఉ. ఇచ్చినఁ జూచి, రామ ధరణీశ్వరు ముద్రికగా నెఱిఁగి తా
నిచ్చను మెచ్చి యా కువలయేక్షణ యాత్మ గతంబునందు నీ
వచ్చినదాని భావమును, వల్లభు చందము నేర్పడంగ, నేఁ
జెచ్చెర నంతయుం దెలియఁ జెప్పుము నమ్మిక పుట్టునట్లుగన్.
జవాబు:
ప్రతిపదార్థము :
ఇచ్చినన్ = ఆ ఉంగరమును హనుమంతుడు ఇవ్వగా
జూచి = పరిశీలించి
రామ ధరణీశ్వరు = శ్రీరాముని యొక్క
ముద్రికగాన్ = ఉంగరముగా
ఎటిఁగి = తెలుసుకొని
తాను + ఇచ్చను = సీతాదేవి తన మనసులో
మెచ్చి = సంతోషించి
ఆ కువలయేక్షణ = ఆ సీతాదేవి
ఆత్మగతంబు నందున్ = తన మనసు లోపల
ఈ వచ్చిన దాని భావమును = ఇతడు ఇలా రావటానికి గల కారణము
వల్లభు చందమున్ = భర్తయైన శ్రీరాముని వివరములు
ఏర్పడంగ నేస్ = స్పష్టంగా
చెచ్చెరన్ = వేగంగా
అంతయున్ = అన్నియూ
తెలియఁజెప్పుము = తెలిసే విధంగా చెప్పినట్లయితే
నమ్మిక = నమ్మకము
పుట్టునట్లుగన్ = కలుగుతుంది.

తాత్పర్యము :
హనుమంతుడు తనకా ఉంగరమును ఇవ్వగా, దానిని పరిశీలించి, తన భర్త యొక్క ఉంగరముగా తెలుసుకొన్నది. ఆ సీతాదేవి మనసులో సంతోషించి, ఇతడు వచ్చిన దానికి కారణము తన భర్త వివరములు స్పష్టంగా చెప్పినట్లయితే ఇతడి పట్ల నమ్మకము కలుగును.

ప్రశ్న 6.
వ. అని విచారించి యిట్లనియె.
జవాబు:
ప్రతిపదార్థము :
అని విచారించి = అని సీతాదేవి ఆలోచించి
ఇట్లు + అనియె = ఈ విధముగా పలికినది

తాత్పర్యము :
అని సీతాదేవి ఆలోచించి ఈ విధముగా పలికినది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 7.
క. నిను విశ్వసింపఁ జాలను,
వినుపింపుము నీ తెఱంగు, విభుని తెఱంగు
న్ననపుడుఁ బావని తెలియఁగ
వినయంబున విన్నవించె విస్ఫుట ఫణితిన్.
జవాబు:
ప్రతిపదార్థము :
నిను = నిన్ను
విశ్వసింపన్ + చాలను = నమ్మలేను
నీ తెఱంగు = నీ యొక్క వివరములు
విభుని దెఱంగు = నా భర్త యొక్క వివరములు
వినుపింపుము = నాకు చెప్పు
అన్నపుడు = అని సీతాదేవి పలికినప్పుడు
పావని = హనుమంతుడు
తెలియఁగ = తన గురించి తెలిసే విధంగా
వినయంబున = భక్తితో
విస్ఫుట = స్పష్టమైన
ఫణితిన్ = మాటల తీరుతో
విన్నవించె = తెలియజెప్పెను

తాత్పర్యము :
నిన్ను నమ్మలేను. నీ వివరములు, నా భర్త వివరములు అన్నీ నాకు కూడా వివరించు అని సీతాదేవి పలుకగా, హనుమంతుడు భక్తితో ఆమెకు తను ఎవరో స్పష్టంగా వివరించెను.

ప్రశ్న 8.
ఉ. రాముని దాఁగురించి నిను రావణుఁ డెత్తుక వచ్చువేళ నీ
హేమవిభూణణావళుల నేర్పడ ఋశ్యమహాద్రి వైచినన్
మేమవి తీసి దాఁచితిమి మీ పతి యచ్చటి కేఁగుదేరఁగాఁ
దామరసాప్తనందనుఁడు తానవి సూపినఁజూచి మెచ్చుచున్.
జవాబు:
ప్రతిపదార్థం :
రాముని = శ్రీరాముని
డాఁగురించి = మోసం చేసి
నినున్ = నిన్ను
రావణుడు = రావణుడు
ఎత్తుకవచ్చు వేళన్ = అపహరించి తీసుకొనివచ్చే సమయంలో
నీ = నీ యొక్క
హేమ = బంగారముతో చేసిన
విభూషణ = నగల యొక్క
ఆవళులన్ = రాశిని (బంగారు నగలను)
ఏర్పడన్ = కనబడునట్లుగా
ఋశ్యమహాద్రిన్ = ‘ఋష్యమూకము’ అనే గొప్ప పర్వతమునందు
వైచినన్ = పడవేయగా
మేము = మేము (మా వానరులము)
అవి = ఆ నగలను
తీసి,దాచితిమి = తీసి, దాచాము
మీ పతి = మీ భర్తయైన శ్రీరాముడు
అచ్చటికిన్ = ఆ ఋశ్యమూక పర్వతము పైకి
ఏగుదేరగాన్ = రాగా
తాపరస + ఆప్త = తామరలకు బంధువైన సూర్యుని యొక్క
నందనుడు = కుమారుడైన (సుగ్రీవుడు)
తాను = తాను
అవి = ఆ నగలను
చూపినన్ = రామునకు (చూపింపగా)
చూచి = ఆ నగలను రాముడు చూచి
మెచ్చుచున్ = సంతోషిస్తూ

తాత్పర్యం :
రావణుడు రాముని మోసగించి, నిన్ను అపహరించుకొని వచ్చే సమయంలో నీవు నీ బంగారు నగలను ఋష్యమూకపర్వతంపై పడవేశావు. ఆ నగలను మా వానరులము తీసి దాచాము. నీ భర్త శ్రీరాముడు ఆ ఋశ్యమూక పర్వతానికి రాగా, మా ప్రభువు సూర్యకుమారుడూ అయిన, సుగ్రీవుడు, ఆ నగలను శ్రీరామునికి చూపించాడు. ఆ నగలను చూసి రాముడు సంతోషించాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 9.
సీ. అర్కసంభవునకు నభయంబు దయచేసి
దుందుభికాయమ్ము దూలఁ దన్ని
యేడుతాడుల సర్వమేకమ్ముగాఁ ద్రుంచి
వాలి నద్భుతశక్తింగూల నేసి
సుగ్రీవునకుఁ దార సుదతిగా నిప్పించి
యంగదు యువరా జనంగ నిలిపి
వారలతోడను వానర సైన్యంబు
లెన్నేనిఁ గొలువంగ నేఁగుదెంచి

తే. మాల్యవంతంబునం దుండి మనుజవిభుఁడు
నిన్ను వెదకంగ నందఱ నన్నిదిశలఁ
బనుచునప్పుడు దక్షిణభాగ మరయ
నంగదునితోడఁ గొందఱ మరుగుదేర.
జవాబు:
ప్రతిపదార్థం :
అర్క సంభవునకున్ = సూర్యునికి జన్మించిన సుగ్రీవునకు
అభయంబున్ = అభయ హస్తాన్ని (భయపడకుమని చూపే హస్త ముద్రను)
దయచేసి = ఇచ్చి
దుందుభికాయమ్మున్  =  “దుందుభి” అనే రాక్షసుని శరీరాన్ని
తూలన్ = కదిలేటట్లు
తన్ని = కాలితో తన్ని
ఏడు తాడులన్ = ఏడు తాడిచెట్లను
సర్వము = అన్నింటినీ
ఏకమ్ముగాన్ = ఒక్కసారిగా
త్రుంచి = ఖండించి
వాలిన్ = సుగ్రీవుని అన్న వాలిని
అద్భుత శక్తిన్ = తన అద్భుతమైన శక్తితో
కూలన్ + ఏసి = పడిపోయేటట్లు కొట్టి (బాణంతో కొట్టి)
సుగ్రీవునకున్ = సుగ్రీవునకు
తారన్ = తారను
సుదతిగాన్ = భార్యగా (మంచి దంతములు గలది-సుదతి)
ఇప్పించి = ఇప్పించి
అంగదున్ = వాలికుమారుడైన అంగదుని
యువరాజు = కిష్కింధ రాజ్యమునకు యువరాజు
అనంగన్ = అనేటట్లు
నిలిపి = ప్రతిష్ఠించి
వారలతోడను = వారి అందరితో పాటు
వానర సైన్యంబులు = కోతుల సైన్యములు
ఎన్నేని(ఎన్ని + విని) = లెక్కలేనన్ని
కొలువంగన్ = సేవిస్తుండగా
ఏగుదెంచి = వచ్చి
మాల్యవంతంబునందున్ = మాల్యవంత పర్వతము మీద
ఉండి = ఉండి
మనుజవిభుడు = మనుష్యులకు ప్రభువు అయిన శ్రీరాముడు
నిన్నున్ = నిన్ను(సీతను)
వెదకంగన్ = వెదకడానికి
అందఱన్ = వానరులను అందరినీ
అన్ని దిశలన్ = అన్ని దిక్కులకు
పనుచునప్పుడు = పంపేటప్పుడు
దక్షిణభాగము = దక్షిణ దిశను
అరయన్ = శోధించడానికి
అంగదునితోడన్ = యువరాజు అయిన అంగదునితోపాటు
కొందఱము = మేము కొంతమందిమి
అరుగుదేరన్ = బయలుదేరగా

తాత్పర్యం :
శ్రీరాముడు సుగ్రీవునికి అభయమును ఇచ్చాడు. దుందుభి శరీరాన్ని కాలితో దూరంగా తన్నాడు. ఏడు తాడిచెట్లను ఒకే బాణంతో కూలగొట్టాడు. వాలిని తన అద్భుత శక్తితో పడగొట్టాడు. సుగ్రీవునికి తారను భార్యగా ఇప్పించాడు. అంగదుడిని యువరాజును చేయించాడు. వానర సైన్యములు తనను సేవిస్తుండగా రాముడు మాల్యవంతమునకు వచ్చాడు. నిన్ను వెదకడానికి వానరులను అన్ని దిక్కులకు పంపాడు. అందులో దక్షిణ దిశలో వెదకడానికి, అంగదుడి నాయకత్వంలో మేము కొందరము బయలుదేరాము.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 10.
తే. వారి పంపున నవలీల వార్ధి దాఁటి
వచ్చి సకలంబుఁ జూచి యీవంకఁ గంటి
రావణుఁడు వచ్చి నిన్ను నుగ్రంబు గాఁగఁ
ఐలుకునప్పుడు నున్నాఁడఁ బాదపమున.
జవాబు:
ప్రతిపదార్థం :
వారి పంపునన్ = ఆ దక్షిణ దిశకు నిన్ను వెదకడానికి వచ్చిన వానరులు పంపించగా
అవలీలన్ = చులకనగా
వార్దిన్ = సముద్రాన్ని
దాటి = దాటి
వచ్చి = (లంకకు) వచ్చి
సకలంబున్ = లంకా నగరమును అంతటినీ
చూచి = చూసి
ఈ వంకన్ = ఈ దిక్కున (ఈ అశోకవనం. వద్ద)
కంటిన్ = (నిన్ను) చూశాను
రావణుడు = లంకాధిపతి రావణుడు
వచ్చి = ఇక్కడకు వచ్చి
నిన్నున్ = నిన్ను
ఉగ్రంబు + కాగన్ = భయపెట్టేలా
పలుకువప్పుడు (పలుకు + అప్పుడు). = మాట్లాడినప్పుడు
పాదపమునన్ = శింశుపా వృక్షముపై
ఉన్నాడన్ = (నేను) ఉన్నాను

తాత్పర్యం :
ఆ దక్షిణ దిశకు నిన్ను వెదకడానికి వచ్చిన వానరులు నన్ను పంపిస్తే, సులభంగా సముద్రాన్ని దాటివచ్చి, లంకలో అంతా వెదికాను. నిన్ను ఈ అశోకవనంలో చూశాను. ఇంతక్రితం రావణుడు ఇక్కడకు వచ్చి నిన్ను భయపెట్టేలా కఠినంగా మాట్లాడిన సమయంలో, నేను శింశుపా వృక్షము మీద ఉన్నాను.

ప్రశ్న 11.
వ. ఇవ్విధంబునఁ బలుకుచుండినను నమ్మక యతనిం గనుంగొని రాముఁ
దేరీతివాఁడో యతని చందం బెరింగింపు మనవు డావాయునందనుండు
రఘునందనునకు వందనం బాచరించి భూమినందన కిట్లని చెప్పుచున్నాడు.
జవాబు:
ప్రతిపదార్థం :
ఇవ్విధంబునన్ (ఈ + విధంబునన్) = ఈ విధంగా
పలుకుచుండినను (పలుకుచున్ + ఉండినను) = హనుమంతుడు చెపుతున్నా
నమ్మక = సీతాదేవి హనుమంతుని నమ్మక
అతనిన్ = ఆ హనుమంతుని
కనుంగొని = చూసి
రాముడు = శ్రీరాముడు ఏ రీతివాడో (ఏ రీతివాడు + ఓ) = ఎటువంటి లక్షణములు గలవాడో
అతని చందంబు = అతని రూప లక్షణముల విధమును
ఎఱింగింపుము = తెలుపుము
అనవుడున్ = అని సీత అనగా;
ఆ వాయునందనుండు = ఆ వాయుపుత్రుడైన హనుమ
రఘునందనునకున్ = శ్రీరామునకు
వందనంబు = నమస్కారము
ఆచరించి = చేసి
భూమినందనకున్ = భూమికి పుత్రిక అయిన సీతకు
ఇట్లని(ఇట్లు + అని) = ఈ విధంగా
చెప్పుచున్నాడు (చెప్పుచున్ + ఉన్నాడు) : చెప్పాడు

తాత్పర్యం :
ఈ విధంగా హనుమంతుడు చెపుతున్నా, సీత హనుమంతుని నమ్మలేదు. సీత హనుమంతుని చూసి “శ్రీరాముడు ఏవిధంగా ఉంటాడో, ఆయన రూప లక్షణాలను తెలుపు” మని అడిగింది. అప్పుడు ఆ వాయుపుత్రుడయిన హనుమ రామునకు నమస్కరించి, సీతతో ఇలా చెపుతున్నాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 12.
సీ. నీలమేఘచ్చాయఁ బోలు దేహమువాఁడు
ధవళాఖపత్ర నేత్రములవాఁడు
కంబుసన్నిభ మైనకంఠంబు గలవాడు
బాగైనయట్టి గుల్బములవాఁడు
తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాండు
ఘనమైన దుందుభిస్వనమువాఁడు
పద్మరేఖలు గల్గు పదయుగంబులవాఁడు
చక్కని పీనవక్షంబువాండు

తే. కపట మెఱుఁగని సత్యవాక్యములవాఁడు
రమణి ! రాముందు శుభలక్షణములవాడు
ఇన్నిగుణముల చూపింప నెసంగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు.
జవాబు:
ప్రతిపదార్థం :
రమణి = ఓ సీతమ్మా
రాముడు = శ్రీరాముడు
నీల, మేఘచ్ఛా యన్ = నల్లని, మేఘముల యొక్క కాంతిని
పోలు = పోలిన
దేహమువాడు = శరీరముగలవాడు
ధవళ = తెల్లని
అబ్జపత్ర = పద్మపురేకుల వంటి
నేత్రముల వాడు = కన్నులు కలవాడు
కంబు = శంఖముతో
సన్నిభంబు + ఐన = సమానమైన
కంఠంబువాడు = మెడ గలవాడు(కంఠము గలవాడు)
బాగు + ఐన + అట్టి = చక్కనైనట్టి
గుల్ఫములవాడు = చీలమండలు కలవాడు
తిన్ననై(తిన్నన + ఐ) = చక్కనివై
కనుపట్టు = కనిపించే
దీర్ఘబాహులవాడు = పొడవైన చేతులు కలవాడు
ఘనమైన (ఘనము + ఐన) = గొప్పదైన
దుందుభి = భేరి వంటి
స్వనము వాడు = కంఠ స్వరం గలవాడు
పద్మరేఖలు + కల్గు = పద్మము యొక్క రేఖలు కలిగిన
పదయుగంబులవాడు = పాదముల జంట గలవాడు.
చక్కని = అందమైన
పీన = నిండయిన
వక్షంబువాడు = వక్షస్థలము (ఛాతి) గలవాడు
కపటము = మోసము
ఎఱుగని = తెలియని
సత్యవాక్యములవాడు = సత్యములనే పలుకువాడు
శుభలక్షణములవాడు = మంచి లక్షణములు గలవాడు
సౌమిత్రి = సుమిత్రాదేవి కుమారుడైన, లక్ష్మణుడునూ
ఇన్ని గుణములన్ = పైన చెప్పిన అన్ని గుణాలతోను
చూపింపన్ = చూపించడానికి
ఎసగువాడు = ఒప్పువాడు
వరుస = పోలికకు
బంగారు వన్నెవాడు = బంగారు రంగు గలవాడు

తాత్పర్యం :
సీతమ్మా ! శ్రీరాముడు మంచి లక్షణాలు కలవాడు. నల్లని మేఘముల యొక్క కాంతిని పోలిన శరీరం కలవాడు. తెల్లని పద్మపుటేకుల వంటి కన్నులు కలవాడు. శంఖముతో సమానమైన, కంఠము కలవాడు. అందంగా కనిపించే చీలమండలు కలవాడు. పొడవైన చేతులు కలవాడు. గట్టిభేరి వంటి కంఠ స్వరం కలవాడు. పద్మరేఖలు కల పాదముల జంట కలవాడు. అందమైన వక్షస్థలము(ఛాతి) గలవాడు. కపటము తెలియని సత్యవాక్యములు కలవాడు. లక్ష్మణుడు కూడా పైన చెప్పిన అన్ని గుణములూ కలవాడే, కాని లక్ష్మణుడు బంగారు రంగు దేహము గలవాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 13.
తే. ఉరుతరాటవిలోన మహోగ్రతపము
వాయుదేవుని గుఱియించి వరుసఁ జేసి
యంజనాదేవి గనియె నన్నర్ధతోడ
నర్మజుని మంత్రి హనుమంతుఁడండ్రు నన్ను.
జవాబు:
ప్రతిపదార్థం :
అంజనాదేవి = అంజనాదేవి
ఉరుతరాటవిలోనన్; ఉరుతర + అటవిలోనన్ = గొప్ప అడవిలో
మహోగ్రతపమున్ = గొప్ప భయంకరమైన తపస్సును
అర్థితోడన్ = భక్తితో
వాయుదేవుని గుఱియించి = వాయుదేవుని గురించి
వరుసన్ + చేసి = చాలాకాలం చేసి
నన్నున్ = నన్ను
కనియెన్ = పుత్రునిగా కన్నది
అర్కజుని మంత్రిన్ = (నేను) సుగ్రీవునికి మంత్రిని
నన్నున్ = నన్ను
హనుమంతుడు = హనుమంతుడు
అండ్రు = అంటారు.

తాత్పర్యం :
అంజనాదేవి గొప్ప అరణ్యములో వాయుదేవుడిని గురించి చాలాకాలం భక్తితో గొప్ప తపస్సును చేసి నన్ను పుత్రునిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని, నన్ను ‘హనుమంతుడు’ అని పిలుస్తారు.

ప్రశ్న 14.
వ. అనియిట్లు తాత్పర్యంబునఁ బట్టునట్లుగా విన్నవించి దేవీ ! నీ దేవుండయిన
శ్రీరాముందు నాచేతి కిచ్చి యంపిన నూత్న రత్నాంగుళీయకంబు నీకు సమర్పించితి
నింక వాకు రిక్త హస్తంబులతోఁ జనుట దూతల కుచితమైన కార్యంబు గాదు గావున
నిన్ను దర్శించినందులకు శ్రీరామునకును నమ్మిక పుట్టునట్టులుగా నీ శిరోరత్నంబు
దయచేయవలయు ననుటయు నా కుశేశయనయన యిట్లనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
అని = అని
ఇట్లు = ఈ విధముగా
తాత్పర్యంబునన్ = ఆసక్తితో
పట్టునట్లుగా = గ్రహించేటట్లుగా
విన్నవించి = తెలిపి
దేవి = సీతాదేవి !
నీ దేవుండు + అయిన = నీకు ప్రభువు అయిన
శ్రీరాముండు = శ్రీరాముడు
నీ చేతికిన్ = నీ చేతికి
ఇచ్చి = ఇచ్చి
అంపిన = పంపిన
నూత్న= కొత్తదియైన
రత్న = రత్నములు పొదిగిన
అంగుళీయకంబు = ఉంగరమును
నీకున్ = నీకు
సమర్పించితిని = ఇచ్చాను
ఇంకన్ = ఇక మీదట
రిక్తహస్తంబులతోడన్ = ఏమియూలేని చేతులతో (వట్టి చేతులతో)
చనుట = వెళ్ళుట
దూతలకున్ = దూతలుగా వచ్చినవారికి
ఉచితమైన = తగిన
కార్యంబు = పని
కాదు = కాదు
కావునన్ = కాబట్టి
నిన్నున్ = నిన్ను
దర్శించినందులకున్ = చూసినదానికి గుర్తుగా
శ్రీరామునకున్ = శ్రీరామచంద్రునికి
నమ్మిక = నమ్మకము
పుట్టునట్లుగా = కలిగేటట్లు
నీ శిరోరత్నంబు (నీ, శిరః + రత్నంబు) = నీ తలయందలి రత్నమును
దయ చేయవలయును = ఇమ్ము
అనుటయున్ = అని హనుమంతుడు అనగా
ఆ కుశేశయ నయన = ఆ పద్మము వంటి కన్నులు కలదైన సీత (కుశేశయము నీటిలో వికసించేది-పద్మము)

తాత్పర్యం :
అని ఈ విధంగా ఆసక్తితో, సీత యొక్క మనస్సుకు పట్టేటట్లు హనుమంతుడు చెప్పి, “దేవీ .! నీ ప్రభువు అయిన శ్రీరాముడు నా చేతికి ఇచ్చి పంపిన కొత్త రత్నపుటుంగరాన్ని నీకు ఇచ్చాను. వట్టి చేతులతో వెళ్ళడం, దూతలకు తగిన పని కాదు. కాబట్టి నేను నిన్ను దర్శించినందుకు గుర్తుగా, నీ శిరోరత్నాన్ని నాకు ప్రసాదించు”. అని విన్న వించాడు. అప్పుడు ఆ పద్మనేత్ర అయిన సీత, ఇలా చెప్పింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 15.
కం. నానాథుక్షేమ మంతయు
ధీనిధి ! నీచేత వింటిఁ దెలియఁగ నైనన్
నీ నిజరూపము చూడక
నే నారత్నంబు నమ్మి నీ కీయఁజుమీ.
జవాబు:
ప్రతిపదార్థం :
ధీనిధి = ఓ బుద్ధిమంతుడా !
నా నాథు క్షేమము = నా భర్త క్షేమాన్ని గురించి
అంతయున్ = సర్వమునూ
తెలియగన్ = తెలిసేటట్లు
నీ చేతన్ = నీ చేత
వింటిన్ = విన్నాను
ఐనన్ = ఐనప్పటికీ
నీ నిజ రూపము = నీవాస్తవ రూపాన్ని
చూడక = చూడకుండా
నేను = నేను
ఆ రత్నంబున్ = నా శిరోరత్నాన్ని
నమ్మి = నిన్ను నమ్మి
నీకున్ = నీకు
ఈయఁ జుమీ (ఈయన్ + చుమీ) = ఇయ్యను సుమా !

తాత్పర్యం :
ఓ బుద్ధిమంతుడా ! హనుమా ! నా భర్త క్షేమ వార్తను, పూర్తిగా నీ వలన నేను విన్నాను. అయినా, నీ యథార్థమైన స్వరూపాన్ని నేను చూడకుండా, నిన్ను నమ్మి నీకు శిరోరత్నాన్ని ఇయ్యను.

ప్రశ్న 16.
వ. అనుటయు నా హనుమంతుండు,
జవాబు:
ప్రతిపదార్థం :
అనుటయున్ = సీత అలా అనగా
ఆ హనుమంతుడు : ఆ హనుమంతుడు

తాత్పర్యం :
సీత చెప్పిన మాటలు విని హనుమంతుడు

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 17.
కం. చుక్కలు తలపూవులుగా
నక్కజముగ మేనువెంచి యంబరవీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందు నాతృస్థితికిన్.
జవాబు:
ప్రతిపదార్థం :
అంబరవీధిన్ = ఆకాశవీధిలోనున్న
చుక్కలు = నక్షత్రములు
తలపూవులుగాన్ = తలలో పూవులవలె అయ్యేవిధంగా (అనగా నక్షత్ర లోకం దాకా)
అక్కజముగన్ = ఆశ్చర్యపోయేట్లుగా
మేనువెంచి (మేను + పెంచి) = శరీరాన్ని పెంచి
వెక్కసమై (వెక్కసము + ఐ) = అధికంగా
చూపట్టినన్ = కనబడగా
అక్కోమలి (ఆ + కోమలి) = ఆ సీత
ఆత్మస్థితికిన్ = తన పరిస్థితికి
ముదమున్ = సంతోషాన్ని
ఒందెన్ = పొందినది

తాత్పర్యం :
ఆకాశవీధిలోని నక్షత్రములు తన తలలోని పూవులు అయ్యే విధంగా ఆశ్చర్యం కలిగేటట్లు శరీరాన్ని పెంచి, హనుమంతుడు కనబడ్డాడు. అప్పుడు సీత తన స్థితికి సంతోషపడింది.

ప్రశ్న 18.
వ. ఇట్లు తన మహోన్నత రూపంబు చూపి, యెప్పటియట్ల మరల సూక్ష్మ రూపంబు
గైకొని నమస్కరించిన నా హనుమంతునకు నద్దేవి తన శిరోరత్నంబు ననుగ్రహించి యిట్లనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధముగా
తన = తన యొక్క
మహా = గొప్ప
ఉన్నత = ఎత్తైన
రూపంబున్ = ఆకారమును
చూపి = చూపించి
ఎప్పటియట్ల (ఎప్పటి + అట్ల) = యథాప్రకారంగా
మరలన్ = తిరిగి
సూక్ష్మరూపంబు = చిన్న ఆకారాన్ని
కైకొని = గ్రహించి
నమస్కరించినన్ = నమస్కరింపగా
ఆ హనుమంతునకున్ = ఆ హనుమంతునికి
అదేవి (ఆ + దేవి) = ఆ సీతాదేవి
తన = తన యొక్క
శిరోరత్నంబున్ = శిరస్సునందలి రత్నాన్ని
అనుగ్రహించి = ఇచ్చి
ఇట్లనియె = ఇలా చెప్పింది

తాత్పర్యం :
ఈ విధంగా హనుమ, తన గొప్ప ఎత్తైన రూపాన్ని సీతకు చూపించి, తిరిగి సూక్ష్మ రూపాన్ని పొంది, సీతమ్మకు నమస్కరించాడు. అపుడు సీత హనుమంతునికి తన శిరోరత్నమును ఇచ్చి, ఇలా చెప్పింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 19.
చ. రవికుల వార్షిచంద్రుఁడగు రాముని సేమము ,చాల వింటి నా
వివిధములైనపాట్లు పృథివీపతికిం దగఁ జెప్పఁ గల్గే నేఁ
డవిరళభంగి నీవలన నచ్చుగ నే నుపకార మేమియుం
దవిలి యొనర్చ లేను వసుధాస్థలి వర్ఛిలు బ్రహ్మకల్పముల్.
జవాబు:
ప్రతిపదార్థం :
నేడు = ఈనాడు
నీ వలనన్ = నీవల్ల
అవిరళభంగిన్ = అధికముగా
రవికుల = సూర్యవంశము అనే
వారి = సముద్రమునకు
చంద్రుడగు = చంద్రుని వంటివాడైన
రాముని = శ్రీరాముని యొక్క
సేమము = క్షేమమును
చాలన్ = అధికముగా
వింటిని = విన్నాను
నా = నా యొక్క
వివిధములు + ఐన = అనేక విధములయిన
పాట్లు = కష్టములు
పృథివీ పతికిన్ = భూ భర్తయైన రామునకు
తగన్ = తగు విధముగా
చెప్పగలైన్ (చెప్పస్ + కల్గొన్) = చెప్పగలిగాను;
అచ్చుగన్ = తగిన విధముగా (నీ అర్హతకు తగిన విధంగా)
నేను = నేను
ఉపకారము + ఏమియున్ = ఏ ఉపకారాన్నీ
తవిలి = యత్నము చేసి
ఒనర్నలేను = చేయలేను
వసుధాస్థలిన్ = భూమండలమునందు
బ్రహ్మకల్పముల్ = బ్రహ్మకల్పముల పర్యంతము (కల్పము అంటే బ్రహ్మకు ఒక రోజు)
వర్దిల్లు = అభివృద్ధి నొందుము (జీవించుము )

తాత్పర్యం :
నేడు (నీ ద్వారా) సూర్యవంశానికి చంద్రుని వంటి వాడు అయిన శ్రీరాముని క్షేమాన్ని అధికంగా విన్నాను. నేను పడే పాట్లను, శ్రీరామునకు చెప్పగలిగాను. నీకు నేను ఏమీ ప్రత్యుపకారం చేయలేను. ఈ భూమండలంపై బ్రహ్మకల్పములు చిరంజీవిగా జీవించు.

ప్రశ్న 20.
వ. ఇట్లు దీవించి, మఱియును,
జవాబు:
ప్రతిపదార్ధం :
ఇట్లు = ఈ విధంగా
దీవించి = ఆశీర్వదించి
మఱియును = తిరిగి

తాత్పర్యం :
ఈ విధంగా దీవించి సీత తిరిగి ఇలా చెప్పింది.

ప్రశ్న 21.
కం. ఏ యెడఁజూచిన ధరణీ
నాయకు శ్రీపాదయుగము నాచిత్తములో
బాయ దని విన్నవింపుము
వాయుతనూజుండ పుణ్యవంతుఁడ తెలియన్.
జవాబు:
ప్రతిపదార్థం :
వాయు తనూజుండ = వాయువునకు కుమారుడయిన ఓ హనుమంతుడా !
పుణ్యవంతుడ = ఓ పుణ్మాత్మా !
ఏయెడన్ (ఏ + ఎడన్) = ఎల్లప్పుడూ
చూచినన్ = చూసినా
ధరణీనాయకు = భూమికి ప్రభువయిన శ్రీరాముని యొక్క
శ్రీ పాదయుగము = పవిత్ర పాదముల జంట
నా చిత్తములోన్ = నా మనస్సులో
పాయదు + అని = విడువదని
తెలియన్ = తెలిసేటట్లు
విన్నవింపుము. = తెలుపుము

తాత్పర్యం :
వాయుపుత్రా ! పుణ్యాత్మా ! “నిరంతరం, శ్రీరాముని పవిత్ర పాదముల జంట, నా మనస్సును విడచియుండదు” అని శ్రీరామునకు తెలిసేటట్లు చెప్పు. (శ్రీరాముని పాదములనే నేను నిరంతరం నా మనస్సులో ధ్యానము చేస్తూ ఉంటాను అని భావం.)

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 22.
తే ఇప్పుడు రావణుఁ డేతెంచి కపటబుద్ధి
గర్వమునంజేసి నన్నెన్ని కాలాడె
నన్నియును నీవు చెవులార విన్న తెఱంగు
పఠికి దయ పుట్టంగా విన్నపంబు సేయు..
జవాబు:
ప్రతిపదార్థం :
కపటబుద్ధి = మోసపు బుద్ధికలవాడైన
రావణుడు = రావణుడు
ఇప్పుడు = ఇప్పుడు
ఏతెంచి = వచ్చి
గర్వమునన్ + చేసి = గర్వముతో
నన్నున్ = నన్ను
ఎన్ని= ఎన్ని
కాబులు = పరుష వచనములు
ఆడెన్ = మాట్లాడాడో
అన్నియును = వాటిని అన్నింటినీ
నీవు = నీవు
చెవులార = నీ చెవులతో నీవు
విన్న = వినిన
తెలుగు = పద్దతి
పతికిన్ = నా భర్తకు
దయ = దయ
పుట్టగాన్ = కలిగేటట్లు
విన్నపంబు + చేయు = విన్నవించుము

తాత్పర్యం :
కపటబుద్దియైన రావణుడు ఇప్పుడు వచ్చి, గర్వముతో నాతో ఎన్ని పరుషవచనాలు మాట్లాడాడో, అన్నింటినీ, నీవు చెవులార విన్నావు. నా భర్త రామునకు . దయ కలిగేటట్లు, ఆ విషయమును ఆయనకు విన్నవించు.

ప్రశ్న 23.
సీ. నిడుదపున్నెటివేణి జడలుగా సవరించి
మలినజీర్ణాంబరం బొలియఁ గట్టి
భూమీరజంబు విభూతి పూఁతగంబూసి
తన దివ్యమూర్తి(జిత్తమున నిల్పి
నిరశనస్థితితోడ నిలిచి భూశయ్యను
బవళించి నిదుర యేర్పడఁగ విడిచి
తారకబ్రహ్మమంత్రంబుఁ బఠింపుచుఁ
గఠినరాక్షస దుర్మృగములలోన

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

తే. నహితలం కామహాద్వీపగహన సీమం
దపము సేయుచు నున్నాను తన్నుఁ గూర్చి
నాకుఁబ్రత్యక్ష మగు మని నాథునకును
విన్నవింపుము సత్త్వసంపన్నఁనీవు.
జవాబు:
ప్రతిపదార్థం :
సత్త్వ సంపన్న = శక్తి కలవాడా ! ఓ హనుమా !
నిడుద = పొడవైన
పెన్నెటి = పొడవైన వెంట్రుకలు గల
వేణి = జడ
జడలుగా = అట్టకట్టేట్టుగా ; (జడలు కట్టేటట్లు)
సవరించి = ధరించి (జడ కట్టించుకొని)
మలిన = ముటికియైన
జీర్ణ = పాతదైన (చినిగిన)
అంబరంబు = వస్త్రాన్ని
ఒలియఁగట్టి (ఒలియన్ + కట్టి) = జారి పోయేటట్లు కట్టుకొని
భూమీరజంబున్ = నేలపై దుమ్మును
విభూతి పూతగన్ = విభూతి పూసుకున్నట్లుగా
పూసి = పూసుకొని
తన దివ్యమూర్తిన్ = తన యొక్క ఇంపయిన స్వరూపాన్ని
చిత్తమునన్ = మనస్సునందు
నిల్పి = నిలబెట్టి
నిరశన = ఉపవాసము
స్థితితోడన్ = ఉండడంతో (ఆహారం తీసికోకుండా)
నిలిచి = నిలబడి
భూశయ్యను = నేలపై పడకతో
పవళించి = పరుండి విదుర
విదుర = నిద్ర
ఏర్పడగన్ = వేరు పడునట్లు
విడిచి = విడిచి పెట్టి
తారకబ్రహ్మ మంత్రంబున్ = “ఓం రామాయనమః” అనే ఆఱు అక్షరముల మంత్రాన్ని
పఠింపుచున్ = జపిస్తూ
కఠిన = క్రూరులైన
రాక్షస = రాక్షసులనే
దుర్మృగములలోనన్ = చెడ్డ జంతువులలో
అహిత = శత్రువుల యొక్క
లంకా మహాద్వీప = లంకా ద్వీపము అనే
గహన సీమన్ = అరణ్య ప్రదేశంలో
తన్నున్ + కూర్చి = తనను ఉద్దేశించి(రాముని ఉద్దేశించి)
తపము = తపస్సు
చేయుచున్ + ఉన్నాను = చేస్తున్నాను
నాకున్ = అలా తపస్సు చేస్తున్న నాకు
ప్రత్యక్షము + అగుము + అని – ప్రత్యక్షము కమ్మని (నా ముందు వచ్చి నిలబడమని)
నాథునకున్ = నా భర్తకు
నీవు = నీవు
విన్నవింపుము = మనవి చెయ్యి

తాత్పర్యం :
“శక్తి సంపన్నుడైన ఓ హనుమా ! పొడవైన నా పెద్ద వెంట్రుకల జుట్టును, జడల కట్టేటట్లు చేసి, మురికియైన పాత వస్త్రాన్ని చుట్టబెట్టుకొని, నేలపై దుమ్మును విభూతి పూతగా పూసుకొని, ఆహారం తినకుండా ఉండి, నేలపై పడుకొని, నిద్రను విడిచిపెట్టి, ‘శ్రీరామాయనమః’ అనే మంత్రాన్ని జపిస్తూ, క్రూరులైన. రాక్షసులనే దుష్టజంతువుల మధ్యలో, శత్రువుల లంకాద్వీపము అనే అరణ్యసీమలో ఉండి, శ్రీరాముణ్ణి గూర్చి తపస్సు చేస్తున్నాను. నాకు ప్రత్యక్షము కమ్ము అని, నాభర్తతో నీవు చెప్పు” అని సీత హనుమంతుడితో చెప్పింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 24.
వ. అని చెప్పి, మఱియును,
జవాబు:
ప్రతిపదార్థం :
అని చెప్పి = ఆ విధంగా చెప్పి
మఱియును = తిరిగి

తాత్పర్యం :
సీత ఆ విధంగా చెప్పి తిరిగి ఇలా అంది.

ప్రశ్న 25.
చ. జనకునిభంగి రామనృపచంద్రుని నన్నును దల్లిమాఱుగాఁ
గని కొలువంగ నేర్చుగుణగణ్యుని లక్ష్మణు నీతిపారగున్
వినఁ గన రానిపల్కు లవివేకము చేతను బల్కినట్టి యా
వినుతమహాఫలం బనుభవించితి నంచునుఁజాటి చెప్పుమా.
జవాబు:
ప్రతిపదార్థం :
రామనృపచంద్రునిన్ = రాజశ్రేష్ఠుడైన శ్రీరాముని
జనకుని భంగిన్ = తండ్రి గానూ
నన్నును = నన్ను
తల్లి మాఱుగాన్ = తల్లికి బదులు గానూ
కని = చూచి
కొలువంగన్ = మమ్మల్ని సేవించడానికి
నేర్చు = ఇష్టపడే
గుణగణ్యునిన్ = సద్గుణములచే లెక్కింపదగినవాడునూ
నీతి పారగున్ = నీతి పండితుడునూ అయిన
లక్ష్మణున్ = లక్ష్మణుడిని
వినన్ = వినడానికిని
కనన్ = చూడానికినీ
రాని = తగని
పల్కులు = మాటలు
అవివేకముచేతను = అజ్ఞానము చేత
పల్కి నట్టి = మాట్లాడిన
ఆ = ఆ
వినుత మహాఫలంబు = ప్రసిద్ధమైన గొప్ప ఫలితాన్ని
అనుభవించితిన్ = నేను అనుభవించాను
అంచును = అని
చాటి చెప్పుమా = చాటించి చెప్పుము

తాత్పర్యం :
లక్ష్మణుడు, శ్రీరామచంద్రుని తండ్రి వలెనూ, నన్ను తల్లివలెనూ చూసి మమ్ము సేవించడానికి ఇష్టపడే సుగుణవంతుడు. నీతిపండితుడు. అటువంటి లక్ష్మణుని నేను అవివేకంతో అనరాని, వినరాని మాటలు అన్నాను. ఆ విధంగా లక్ష్మణుడిని అన్నందుకు, మహాఫలితాన్ని నేను అనుభవించాను అని చాటించి చెప్పు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 26.
కం. ఆమాటలు మది నుంచక
నామానముఁ గావు మనుచు నయవినయగుడో
ద్దాముఁడు రాముని తమ్ముండు
సౌమిత్రికిఁ జెప్పవయ్య సాహసివర్యా !
జవాబు:
ప్రతిపదార్థం :
సాహసివర్యా = సాహసము గలవారిలో శ్రేష్టుడవైన ఓ హనుమా !
ఆ మాటలు = నేను లక్ష్మణుడిని అన్న ఆ అవివేకపు మాటలు
మదిన్ = తన మనస్సులో
ఉంచక = పెట్టుకోక
నామానమున్ = నా గౌరవాన్ని
కావుము + అనుచున్ = కాపాడుము అంటూ
నయ = నీతి (మరియు)
వినయ = వినయము అనే
గుణ = గుణముల చేత
ఉద్దాముడు = అధికుడైన
రాముని తమ్ముడు = రామునికి సోదరుడైన
సౌమిత్రికిన్ = లక్ష్మణునికి (సుమిత్ర కుమారుడు)
చెప్పుమయ్య (చెప్పుము + అయ్య) = దయచేసి చెప్పు

తాత్పర్యం :
ఓ సాహసి శ్రేష్ఠ ! హనుమా ! రాముని తమ్ముడైన లక్ష్మణుడు, నీతి వినయ గుణశ్రేష్టుడు. నేను అన్న మాటలు తన మనస్సులో ఉంచుకోకుండా నా గౌరవాన్ని కాపాడమని ఆ లక్ష్మణుడికి దయచేసి చెప్పు.

ప్రశ్న 27.
వ. అని యిట్లు జనకరాజతనయ పలికినపలుకు లాలకించి హనుమంతుం
డాజననితో నిట్లనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
అని = లక్ష్మణుడితో చెప్పుమని
ఇట్లు = ఈ విధంగా
జనకరాజతనయ = జనకమహారాజు కూతురైన సీత
పలికిన = మాట్లాడిన
పలుకులు = మాటలు
ఆలకించి = విని
హనుమంతుడు = ఆంజనేయుడు
ఇట్లనియె = ఇలా చెప్పాడు

తాత్పర్యం :
లక్ష్మణుడితో చెప్పుమని సీత పలికిన పలుకులు విని, హనుమంతుడు ఇలా చెప్పాడు.

ప్రశ్న 28.
క. ఇనుఁ డుదయింపకమున్నే
వననిధి లంఘించి మనుజవల్లభుకడకున్
నినుఁ గొనిపోయెద వీఁపున
జననీ ! కూర్చుండు మనిన సంతోషమునన్.
జవాబు:
ప్రతిపదార్థం :
జననీ = తల్లీ ! సీతమ్మా !
ఇనుడు = సూర్యుడు
ఉదయింపక మున్నే = ఉదయించడానికి ముందే
వననిధిన్ = సముద్రాన్ని
లంఘించి = దాటి
మనుజవల్లభుకడకున్ = మనుష్యులకు ప్రభువైన రామచంద్రుని వద్దకు
నినున్ = నిన్ను
కొనిపోయెదన్ = తీసుకొని వెడతాను
వీపునన్ = నా వీపు మీద
కూర్చుండుము = కూర్చో తల్లీ !
అనినన్ = అని హనుమంతుడు చెప్పగా
సంతోషమున్ = (సీత) సంతోషంతో

తాత్పర్యం :
“తల్లీ ! సూర్యోదయం కావడానికి ముందే సముద్రాన్ని దాటి, నిన్ను రాముని వద్దకు తీసుకొని వెడతాను. నా వీపుపై కూర్చో” అని హనుమంతుడు చెప్పగా, సీత సంతోషించింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 29.
క. “నీవంతవాఁడ వగుదువు
నీ వెంటనే వత్తునేని నెగడవు కీర్తుల్
రావణునికన్న మిక్కిలి
భూవరుఁడే దొంగ యండ్రు
బుధనుతచరితా.
జవాబు:
ప్రతిపదార్థం :
బుధ, నుత, చరితా = పండితులచే, కీర్తించదగిన చరిత్ర కలవాడా! హనుమా
నీవు = నీవు
అంతవాడవు = అంతశక్తి కలవాడవు
అగుదువు = అయిన వాడివే
నీ వెంటనే = నీతో
వత్తునేనిన్ (వత్తును + ఏనిన్) = నేను వచ్చినట్లయితే
కీర్తుల్ = కీర్తులు
నెగడవు = ప్రసిద్ధి కెక్కవు
రావణుని కన్నన్ = రావణుని కంటే
మిక్కిలి = అధికంగా
భూవరుడే (భూవరుడు + ఏ) = రాజయిన రాముడే
దొంగ = దొంగ అని
అండ్రు = అంటారు

తాత్పర్యం :
పండితులచే కీర్తించబడే సచ్చరిత్రుడా ! హనుమా ! నీవు చెప్పినంతటి శక్తి కలవాడనే. నీతో నేను రాముని వద్దకు వస్తే, రాముని కీర్త ప్రసిద్ధికి ఎక్కదు పైగా రావణుని కంటే రాముడే దొంగ అని అంటారు.

ప్రశ్న 30.
వ. అదియునుగాక రామచంద్రునిం దప్ప నితరుల నంటు దానం గాను గావున
నీతో రాఁ దగదు మఱియును.
జవాబు:
ప్రతిపదార్థం :
అదియునుంగాక (అదియునున్ + కాక) = అంతేకాక
రామచంద్రునిన్ = శ్రీరాముని
తప్పన్ = తప్పించి (తక్క)
ఇతరులన్ = ఇతరులైన వ్యక్తులను
అంటుదానన్ = తాకు దానను
కాను = కాను
కావునన్ = కాబట్టి
నీతోన్ = నీవెంట
రాఁదగదు(రాన్ + తగదు) = రావడం ఉచితము కాదు
మఱియును = ఇంకా

తాత్పర్యం :
అంతేగాక శ్రీరామచంద్రుని మినహా ఇతర వ్యక్తులను, నేను తాకుదానను కాదు. కనుక నీ వెంట రావడం ఉచితం కాదు. ఇంకా.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 31.
క. దొంగిలితెచ్చిన రైత్యుని
సంగడు లగువని వారి సాహస మొప్పన్
సంగరముఖమునఁ జంపక
దొంగిలి తానిపోవఁ దగునె దొరలకు నెందున్.
జవాబు:
ప్రతిపదార్థం :
దొంగిలి = దొంగిలించి
తెచ్చిన = తీసుకొని వచ్చిన
దైత్యునిన్ = రాక్షసుడైన రావణుని
సంగడులు + అగు = స్నేహితులగు
వాని వారిన్ = అతని పక్షము వారిని;
సాహసము + ఒప్పన్ = ధైర్యముతో
సంగర ముఖమునన్ = యుద్ధ రంగంలో
చంపక = చంపకుండా
దొంగిలి కొనిపోవన్ = దొంగిలించుకొని వెళ్ళడం
దొరలకున్ = రాజులకు
ఎందున్ = ఎక్కడయినా
తగునె(తగును + ఎ) = ఉచితమా

తాత్పర్యం : దొంగిలించి తెచ్చిన రాక్షసుణ్ణి, అతని మిత్రులయిన వారినీ యుద్ధరంగములో చంపకుండా, దొంగిలించుకొని వెళ్ళడం రాజులకు తగదు.

ప్రశ్న 32.
వ. మఱియు రామచంద్రుండు త్రిజగదేక వీరుండును గోదండ దీక్షా గురుండును
రాక్షసకులాంతకుండును నగుటంజేసి రాణి వాసలోహియగు రావణుని
సంగరరంగంబునఁ బ్రఖ్యాతంబుగాఁ జంపి కొనిపోవుట ధర్మంబు; నీవు
రామచంద్రునకుఁబరమ భృత్యుండవును బుత్ర సముండవును నగుటంచేసి నీ
వెంట నరుగు దెంచుట తప్పు గాకబోయినను బగతీర్చక వచ్చు టుచితంబుగాదు
కావు రాఘవేశ్వరుల కిన్నియుం దెలియ విన్నపంబు సేసి తడయక తోడ్కొని
రమ్మనిన నద్దేవికి నమస్కరించి హనుమంతుండిట్లనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
మఱియున్ = అంతేకాక,
రామచంద్రుండు = చంద్రుని వంటి శ్రీరాముడు
త్రిజగత్ = ముల్లోకాలలో
ఏక = ముఖ్య మైన
వీరుండును = శూరుడునూ
కోదండ = వింటి యొక్క (కోదండము అనే పేరుగల విల్లు యొక్క)
దీక్షా = మంత్రోపదేశమున
గురుండును = గొప్పవాడునూ
రాక్షసకుల = రాక్షస వంశానికి
అంతకుండును = యముడునూ (నాశకుడును)
అగుటం జేసి (అగుటన్ + చేసి) = కావడం చేత
రాణివాస = భార్య విషయమై
ద్రోహి + అగు = ద్రోహము చేసిన వాడైన
రావణుని = రావణాసురుని
సంగరరంగంబునన్ = యుద్ధరంగమందు
ప్రఖ్యాతంబుగాన్ = మిక్కిలి ప్రసిద్ధికలుగునట్లుగా
చంపి = చంపి
కొనిపోవుట . : తీసుకొని వెళ్ళడం
ధర్మంబు = ధర్మము
నీవు = నీవు
రామచంద్రునకున్ = శ్రీరామునికి
పరమ = ముఖ్య మైన
భృత్యుండవును = సేవకుడవునూ
పుత్ర = కుమారుడితో
సముండవును = సమానమైన వాడవునూ
అగుటంజేసి (అగుటన్ + చేసి) = కావడం చేత
నీ వెంటన్ = నీ వెనుక (నీ వీపుపై కూర్చుండి)
అరుగుదెంచుట = వచ్చుట
తప్పు + కాకపోయినను = తప్పుకాదు కాని,
పగతీర్పక = శత్రుత్వాన్ని ప్రతీకారముచే తీర్చకుండా
వచ్చుట = నీ వెంట రావడం
ఉచితంబు + కాదు = తగినది కాదు
కావునన్ = కాబట్టి
నీవు = నీవు
రాఘవ = రఘువంశమువాడయిన
శ్వరులకున్ = ప్రభువులైన శ్రీరామచంద్రునికి
ఇన్నియున్ = ఈ సంగతులు అన్ని
తెలియన్ = తెలిసేటట్లు
విన్నపంబు సి (విన్నపంబు + చేసి) = విన్నవించి చెప్పి
తడయక = ఆలస్యం చేయకుండా
తోడ్కొని రమ్ము = ఆయనను నీవెంటబెట్టుకొని రమ్ము
అనినన్ = అని సీతమ్మ హనుమంతునికి చెప్పగా
అదేవికిన్ = ఆ సీతమ్మ తల్లికి
నమస్కరించి = వందనము చేసి
హనుమంతుండు = ఆంజనేయుడు
ఇట్లనియె(ఇట్లు + అనియె) = ఇలా చెప్పాడు

తాత్పర్యం :
రాముడు, ముల్లోకాలలో మహావీరుడు, కోదండ దీక్షను పొందిన ఘనుడు. రాక్షసవంశ నాశకుడు. అందువల్ల తన భార్య విషయంలో ద్రోహం చేసిన రావణుని యుద్ధరంగంలో కీర్తి కలిగేట్లు చంపి, నన్ను తీసికొని వెళ్ళడం ధర్మము, నీవు శ్రీరామచంద్రునకు ముఖ్య సేవకుడవు. పుత్రునితో సమానుడవు. అందువల్ల నీతో రావడం తప్పు కాకపోయినా, పగ తీర్చకుండా రావడం మాత్రం ఉచితం కాదు. కాబట్టి నీవు శ్రీరామ ప్రభువునకు ఈ విషయాలు అన్నీ చెప్పి, ఆలస్యము చేయకుండా వెంటబెట్టుకొని రా” అని చెప్పగా, సీతకు నమస్కరించి, హనుమంతుడు ఇలా చెప్పాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

ప్రశ్న 33.
ఉ. నీవిభుఁడబ్ది దాఁటి ధరణీతలనాథులు నన్నుతింప సు
గ్రీవసుషేణ ముఖ్య బలబృందముతో నరుదెంచి నీచునిన్
రావణు నాజిలో దునిమి రాజస మొప్పఁగ నిన్నుఁ గొంచు సే
నావళితోడ నీ పురికి నారయ నేగు నిజంబు నమ్ముమా.
జవాబు:
ప్రతిపదార్థం :
నీ విభుడు = నీ ప్రభువైన రాముడు
అభిన్ = సముద్రాన్ని
దాటి = దాటి
ధరణీతలనాథులు = భూభర్తలయిన రాజులు
సన్నుతింపన్ = అతడిని కీర్తించునట్లుగా
సుగ్రీవ = సుగ్రీవుడు
సుషేణ = సుషేణుడు

తాత్పర్యం :
నీ ప్రభువైన రాముడు సముద్రాన్ని దాటి భూభర్తలయిన రాజులు అతడిని కీర్తించునట్లుగా సుగ్రీవుడు, సుషేణుడు.

కవి పరిచయం

పాఠ్యాంశం : ‘హనుమత్ సందేశము’

ఆధార గ్రంథం : మొల్ల రామాయణము సుందరకాండము నుండి గ్రహింపబడింది.

రచయిత్రి : ఆతుకూరి మొల్ల

నివాసం : నెల్లూరు సమీపములోని “గోపవరం” గ్రామంలో ఈమె నివసించేది.

కాలము : . క్రీ.శ. 1581కి ముందు, ఈమె జీవించి యున్నట్లు పరిశోధకుల అభిప్రాయం.

ఘనత : “మొల్ల” తెలుగులో రామాయణం రచించిన ప్రథమ కవయిత్రిగా గుర్తింపు పొందింది.

మొల్ల రామాయణము : మొల్ల రచించిన రామాయణ కథయే, “మొల్ల రామాయణము”గా ప్రసిద్ధి పొందింది.

ప్రేరణ : మొల్ల గోపవరంలోని శ్రీకంఠమల్లేశుని వరముచేత, కవితలు అల్లింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

విశిష్టత : మొల్ల రామయణం, వాల్మీకి సంస్కృత రామాయణానికి అనువాదం కాదు. ఇది స్వతంత్రమైన, సంక్షిప్తమైన రచన. ఈ మొల్ల రామాయణము, రాశిలో చిన్నది. కాని వాసిలో పెద్దది. ఈ గ్రంథంలోని ఆరుకాండలలో 900 పద్యాలున్నాయి.

రచనా శైలి : ఈ రామాయణంలో బాలకాండ నుండి అరణ్యకాండ వరకు కథ వేగంగా నడచింది. సుందరకాండ నుండి మొల్ల రామాయణం, ఉన్నత స్థాయిలో నడిచి, పాఠకుల్ని పరవశుల్ని చేస్తుంది.

దేశీ రచన : మొల్లకు దేశీయమైన తెలుగు రచనపై మక్కువ ఎక్కువ. “క్రమ్మల ఘనమగు సంస్కృతము చెప్పగా రుచియగునే”అని సామాన్య జనులు చదువుకోవడానికి వీలుగా, తన రామాయణ రచన ప్రారంభించానని కావ్య ప్రారంభంలో మొల్ల చెప్పింది.

మొల్ల రామాయణ విశిష్టత : మొల్ల రామాయణం, సరళ సుందరంగా, సరసా లంకారాలతో, పాండిత్య స్ఫూర్తితో, ఔచిత్య రసపోషణతో నిండియుంటుంది. మొల్ల, కందపద్య రచనలో అందె వేసిన చేయి. ఈమె రామాయణం లోని కంద పద్యాలను అన్నింటి నీ, వరుసగా కూర్చితే “మొల్ల కంద రామాయణం” అవుతుందని పరిశోధకులు ప్రశంసించారు. మొల్ల రామాయణం, తెలుగు సాహితీ సరస్వతికి, అమూల్య కంఠాభరణం.

పాఠ్యభాగ సందర్భము

హనుమంతుడు అశోక వనంలో శింశుపా వృక్షముపై సూక్ష్మాకారంలో వానరరూపంలో కూర్చున్నాడు. అది ప్రభాత సమయము. రావణుడు వచ్చి, సీతను తనకు భార్యగా ఉండటానికి అంగీకరించమని బ్రతిమాలాడు. సీత తిరస్కరించింది. సీత అంగీకరించకపోతే, రెండు నెలల్లో ఆమెను చంపివేస్తానని, రావణుడు సీతను బెదిరించి సీతను ఎలాగైనా ఒప్పించమని సీతకు కావలిగా ఉన్న రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించాడు.

సీత ప్రాణత్యాగానికి సిద్ధపడింది. విభీషణుడి కూతురు ‘త్రిజట’ తనకు కల వచ్చిందని, ఆ కలలో రాముడు రావణుని చంపి సీతను తీసుకొని వెళ్ళాడనీ, సీతతోనూ, రాక్షస స్త్రీలతోనూ చెప్పింది. ‘ రాక్షస స్త్రీలు సీతను క్షమించమని కోరి నిద్రించారు.

అప్పుడు హనుమంతుడు చెట్టుమీద నుండి, క్రింద జరిగినదంతా చూశాడు. హనుమంతుడు చెట్టు మీద నుండే సీతకు వినిపించేలా “తల్లీ ! రాముడు క్షేమంగా ఉన్నాడు. వానర సైన్యంతో వచ్చి రావణుని చంపి, నిన్ను తీసుకొని వెడతాడు. నా మాట నమ్ము” అన్నాడు.

ఆ మాటలు సీత విన్నది. ఆమె చెట్టు పైకి చూసింది. ఆమెకు చెట్టు మీద సూక్ష్మరూపంలో ఒక కోతి కనిపించింది. ఆమెకు సంతోషం కలిగింది. కాని, అది రాక్షస మాయ ఏమో అని అనుకుంది. సీత తన్ను నమ్మడం లేదని, హనుమ చెట్టు దిగి వచ్చి, ఆమెకు నమస్కరించి ఇలా అన్నాడు.

“అమ్మా ! రాముడు తమ్ముడు లక్ష్మణునితో మాల్యవంత పర్వతంపై సైన్యములతో ఉన్నాడు. మిమ్మల్ని చూసి రమ్మని అన్ని దిక్కులకూ వానరులను పంపాడు. మమ్మల్ని కొంతమందిని దక్షిణ దిక్కుకు పంపాడు. నాచేత నీకు తన ఉంగరాన్ని గుర్తుగా పంపాడు. ఇదిగో తీసుకో” అంటూ హనుమ, సీతకు రాముని ఉంగరాన్ని ఇచ్చాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

సీత ఆ ఉంగరము, రామునిదని గ్రహించింది. హనుమంతుడి రాకకు గల కారణాన్నీ, రాముని వృత్తాంతాన్నీ, తనకు నమ్మకము కలిగేటట్లు చెప్పమని, సీత హనుమంతుడిని అడిగింది.

హనుమంతుడు సీతకు రామ వృత్తాంతాన్ని చెప్పడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది.

పాఠ్యభాగ సారాంశం

హనుమ సీతకు రాముని గూర్చి, తనను గూర్చి చెప్పడం :”అమ్మా ! రావణుడు నిన్ను అపహరించుకొని వచ్చేటప్పుడు, నీవు నీ బంగారు నగలను ఋష్యమూక పర్వతంపై పడవేశావు. వాటిని మేము తీసి దాచాము. రాముడు అక్కడకు వచ్చినపుడు వాటిని సుగ్రీవుడు చూపించాడు. రాముడు సుగ్రీవుడికి అభయమును ఇచ్చాడు. వాలిని చంపాడు. ప్రస్తుతం రాముడు వానర సైన్యంతో మాల్యవంతముపై ఉన్నాడు. నిన్ను వెదకడానికి వానరులను అన్ని దిక్కులకూ పంపాడు. మేము అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు వచ్చాము. నేను సముద్రం దాటి వచ్చి, నిన్ను చూశాను. రావణుడు నిన్ను పరుషంగా మాట్లాడినపుడు నేను చెట్టుమీద ఉన్నాను” అని హనుమ సీతకు చెప్పాడు.

రాముడు నీలమేఘచ్ఛాయలో ఉంటాడు. ఆయన కన్నులు తెల్లని పద్మదళముల వలె ఉంటాయి. అతడు శంఖంవంటి కంఠమూ, పొడవైన భుజాలు కలిగి కపటం లేని శుభ లక్షణాలు కలవాడు. లక్ష్మణుడు మాత్రం బంగారు రంగు దేహం కలవాడు.

మా తల్లి అంజనాదేవి వాయుదేవుని గురించి తపస్సు చేసి, నన్ను పుత్రునిగా పొందింది. నేను సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. రాముడిచ్చి పంపిన ఉంగరాన్ని నేను నీకు ఇచ్చాను. దూత, వట్టి చేతులతో వెళ్ళడం ఉచితం కాదు. నీ శిరోరత్నాన్ని నాకు ఇయ్యి అని హనుమ సీతను అడిగాడు.

సీత హనుమంతుని యథార్ధ రూపాన్ని చూస్తేనేగాని తాను అతణ్ణి నమ్మి, తన శిరోరత్నాన్ని ఈయనని చెప్పింది. హనుమంతుడు ఆకాశం ఎత్తు వరకూ, తన శరీరాన్ని పెంచాడు. సీత చూసి సంతోషించింది. హనుమ తిరిగి సూక్ష్మరూపం ధరించాడు. హనుమంతునికి సీతను తన శిరోరత్నాన్ని ఇచ్చింది.

సీత ఆశీస్సులు : “నాయనా ! హనుషి.. ! నీవల్ల శ్రీరాముని క్షేమవార్తను విన్నాను. నా కష్టాలు అన్నీ రామునికి తెలిసేటట్లు చెప్పగలిగాను. అయితే, నేను నీకు తిరిగి ఉపకారం ఏమి చేయలేను. నీవు బ్రహ్మకల్పముల పర్యంతమూ చిరంజీవిగా ఉండు” అని హనుమను సీత దీవించింది.

సీత రామునకు పంపిన సందేశము : “ఎప్పుడూ రాముని పాదములు నా హృదయములోనే ఉన్నాయి. ఈ విషయం శ్రీరామునికి చెప్పు. నీవు వింటూ ఉండగా, రావణుడు నాతో మాట్లాడిన పరుష వాక్యములను అన్నిటినీ నాయందు దయ కలిగేటట్లు రామునికి చెప్పు. నేను ఈ లంకా నగరం అనే అడవిలో జడలు కట్టిన జుట్టుతో మలిన వస్త్రం ధరించి, నేలపై నిద్రిస్తూ, తారకమంత్ర జపం చేస్తున్నాను. రాముణ్ణి నాకు ప్రత్యక్షం కమ్మని చెప్పు. లక్ష్మణుడు గుణవంతుడు. అతణ్ణి నేను అవివేకంతో అనరాని మాటలు అన్నాను. దాని పాప ఫలితం అనుభవించానని లక్ష్మణుడితో చెప్పు నేను అన్న మాటలు తన మనస్సులో ఉంచుకోకుండా, నా మానాన్ని కాపాడమని లక్ష్మణుడికి చెప్పు” అని సీత రామలక్ష్మీణులకు సందేశం చెప్పింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 3 హనుమత్సందేశము

హనుమ సీత మాటలు విన్నాడు. సీతను తన వీపుపై కూర్చోమన్నాడు. సూర్యోదయం అయ్యేటప్పటికి రాముడు వద్దకు సీతను తీసుకొని వెడతానన్నాడు. హనుమంతుడు అంతటి సమర్థుడే అని, సీత అంగీకరించింది. కానీ తాను హనుమంతునితో వెడితే, రాముణ్ణి దొంగ అని లోకులు అంటారని చెప్పింది. రావణుడినీ, అతడి మిత్రులనూ చంపకుండా, దొంగతనంగా తీసికొని వెళ్ళడం రాజులకు తగిన పని కాదని చెప్పింది. రాముడు ముల్లోకాలలో మహావీరుడు. కాబట్టి రావణుని చంపి, తనను తీసుకొని వెళ్ళడమే ధర్మం అని తెలిపింది.

హనుమంతుడు పుత్రుడితో సమానుడు కాబట్టి, అతని వెంట వెళ్ళడం తప్పు కాకపోయినా, శత్రుసంహారం జరగాలి అన్నది. రామునికి ఈ విషయాలు అన్నీ చెప్పి, ఆలస్యం లేకుండా లంకకు శ్రీరాముని వెంటపెట్టుకొని రమ్మని, హనుమకు సీత చెప్పింది. హనుమ, సీతను ఊరడించడం : “అమ్మా ! నీ భర్త సముద్రాన్ని దాటి, సుగ్రీవ . సుషేణాది వానరవీరులతో లంకకు వచ్చి, నీచుడైన రావణుని యుద్ధంలో చంపి, .. నిన్ను అయోధ్యకు తీసుకొని వెడతాడు. ఇది నిజము, నమ్ము” అని సీతకు హనుమంతుడు చెప్పి, ఆమెను ఊరడించాడు.

Leave a Comment