Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Intermediate 2nd Year Telugu Grammar ఛందస్సు Questions and Answers.
AP Intermediate 2nd Year Telugu Grammar ఛందస్సు
ఛందస్సు అంటే పద్య లక్షణాలను వివరించే శాస్త్రం. ‘ఛందస్సులో లయ ప్రాధాన్యం అంతర్గతంగా ఉంటుంది. గణాలు గురు లఘువులతో కలసి ఉంటాయి. నిర్ణీతమైన గణాల కూర్పుతో పద్య పాదాలు ఏర్పడతాయి. పద్యాలలో యతి, ప్రాసలు ఉంటాయి.
లఘువు :
ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేది లఘువు. మాత్ర అనగా రెప్పపాటు కాలం లేదా చిటికె వేసినంత కాలం లేదా క్షణంలో నాల్గవ భాగం అని అర్థం. దీనిని అక్షరం పై భాగంలో । గుర్తుతో సూచిస్తారు. “ల” అంటే “లఘువు”.
గురువు :
రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది గురువు. దీనిని అక్షర పై భాగంలో ‘U’ గుర్తుతో సూచిస్తారు. ‘గ’ అంటే ‘గురువు’.
గణాలు :
కొన్ని గురు, లఘువులు కలసి గణాలు ఏర్పడతాయి. ఈ గణాలలో ప్రధాన గణాలనీ, ఉప గణాలనీ ఉన్నాయి. సూర్య గణాలు, ఇంద్ర గణాలు, చంద్ర గణాలు ఉప గణాల కోవలోకి వస్తాయి.
ప్రధాన గణాలు :
- మ గణం – U U U
- భ గణం – U । ।
- జ గణం – । U।
- స గణం – । । U
- న గణం – । । ।
- య గణం – । UU
- ర గణం – U । U
- త గణం – U U ।
సూర్య గణాలు – 2 :
- న గణం – । । ।
- హ గణం – దీనిని గలం అని కూడా అంటారు – U ।
ఇంద్ర గణాలు – 6:
- నల – । । । ।
- నగ – । । । U
- సల – । । U ।
- భ గణం – U । ।
- ర గణం – U । U
- త గణం – U U ।
ఇవి కాక మరో రెండు గణాలు ఉన్నాయి.
- వ గణం దీనిని లగం అని కూడా అంటారు – । U
- గగ – U U
యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. యతిన్ని వళి, వడి, విరతి, విశ్రాంతి, విరామం అనే పేర్లతో కూడా పిలుస్తారు. పద్య పాదంలో మొదటి అక్షరానికి, నియమిత స్థానంలో ఉండే అక్షరానికి ఉండే మైని యతిమైత్రి అంటారు. యతిమైత్రి అచ్చులతోను, హల్లులతోను కలసి ఉంటుంది.
ప్రాస :
పద్య పాదంలో రెండో అక్షర స్థానాన్ని ‘ప్రాస’ లేక ‘ప్రాసము’ అంటారు. పద్యంలోని అన్ని పాదాలలో ఉండే ప్రాస స్థానాలలో, అంటే రెండో అక్షర స్థానాలలో ఒకే హల్లును ప్రయోగిస్తే దానిని ‘ప్రాస నియమం’ అంటారు. .
ప్రాసయతి :
పద్య పాదంలో ప్రాసాక్షరానికి అంటే రెండో స్థానంలో ఉండే అక్షరానికి, నియమిత యతి స్థానం తరువాత అక్షరానికి జరిగే మైత్రిని ప్రాసయతి అంటారు. ఉపజాతి పద్యాల్లో ప్రాస ఉండదు. ప్రాసయతి ఉంటుంది.
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :
- వృత్తాలు
- జాతులు
- ఉపజాతులు.
1. వృత్తాలు
1. ఉత్పలమాల :
ఉత్పలమాల అంటే కలువపూల మాల అని అర్థం. ఈ పద్యం నడక అంత సుకుమారంగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు.
లక్షణాలు :
ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు పాదాల కంటె ఎక్కువ పాదాలు రాస్తే దానిని ‘ఉత్పలమాలిక’ అంటారు). ప్రతి పాదంలోను వరుసగా ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలోను మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, 10వ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. అంటే నాలుగు పాదాల ప్రాసాక్షరాలలో ఒకే హల్లు ఉంటుంది.
యతి మైత్రి : 1 – 10 అక్షరాలైన ‘వి. – వి’ లకు యతి పాటించబడింది.
ప్రాసాక్షరం :
‘ద్య’ అనే సంయుక్తాక్షరం ప్రాసగా ఉంది.
2. చంపకమాల :
చంపకమాల అంటే సంపెంగ పూలమాల అని అర్థం. ఈ పద్యం అంత హృదయంగమంగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు. .. లక్షణాలు : ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు పాదాల కంటే ఎక్కువ పాదాలు రాస్తే దానిని చంపకమాలిక అంటారు) ప్రతి పాదంలోను వరుసగా ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలోను మొత్తం 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, 11వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. అంటే అన్ని పాదాల ప్రాసాక్షరాలలో ఒకే హల్లు ఉంటుంది.
యతి మైత్రి : 1-11 అక్షరాలైన ‘జ’ లోని అ కు – ‘స’ లోని అ కు యతి పాటించారు.
ప్రాసాక్షరం :
‘న’ అనే హల్లు ప్రాసగా ఉంటుంది. 3. శార్దూలం : శార్దూలాన్ని ‘శార్దూల విక్రీడితం’ అని కూడా అంటారు. శార్దూలం అంటే పెద్దపులి అని అర్థం. ఈ ఛందస్సు నడక పెద్ద పులి అరుపులాగా రౌద్రంగా ఉంటుంది. అందువల్ల దీనికా పేరు పెట్టారు. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను వరుసగా మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి. ప్రతిపాదంలో మొత్తం 19 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 1 – 13 అక్షరాలకు ఉంటుంది. ప్రాసనియమం ఉంటుంది.
యతి మైత్రి : 1వ అక్షరం ‘ఏ’ అనే అచ్చుకు, 13వ అక్షరం ‘నీ’ లో గల ‘ఈ’ అనే అచ్చుకు చెల్లింది. దీనిని స్వరమైత్రి అంటారు.
ప్రాసాక్షరం :
‘న్న’ అనే అక్షరం. ద్విత్వ నకారం ప్రాసగా ఉంది.
4. మత్తేభం :
మత్తేభాన్ని ‘మత్తేభ విక్రీడితం’ అని కూడా అంటారు. మత్తేభం అంటే – మదించిన ఏనుగు అని అర్థం. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను . వరుసగా ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 1 – 14 అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది.
యతి మైత్రి : 1వ అక్షరమైన ‘క’ లోని అ కు 14వ అక్షరమైన ‘క్ష’ లోని క కు యతి చెల్లింది.
ప్రాసాక్షరం :
‘డ’ కారం ప్రాసగా ఉంది.
2. జాతులు
1. కందం :
కందం చిన్న పద్యమైనా ఎక్కువ లక్షణాలు గలది. అందుకే ‘కందం రాసినవాడే కవి’ అనే నానుడి వచ్చింది. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ఒకటి, మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు ఐదేసి గణాలు ఉంటాయి. మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, మూడు నాలుగు పాదాలను ఒక భాగంగాను పేర్కొంటారు. కంద పద్యంలో ‘భ, జ, స, న, ల, గ, గ’ అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడాలి.
బేసి సంఖ్య గల గణాలలో (1, 3, 5, 7 గణాలలో) ‘జ’ గణం రాకూడదు. ఆరవ గణం ‘జ’ గణం కానీ ‘నల’ కానీ ఉండాలి. యతి మైత్రి రెండు, నాలుగు పాదాలలో 1 – 4 గణాల మొదటి అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. రెండు, నాలుగు పాదాల చివరి అక్షరం విధిగా గురువై ఉండాలి. మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ గురువుతోనే ప్రారంభం కావాలి. లేదా మొదటి పాదం లఘువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ లఘువుతోనే ప్రారంభం కావాలి.
యతి మైత్రి : రెండో పాదంలో ‘న’ అనే అక్షరం లో సంధిగతంగా ఉన్న ‘అ’ కారానికీ, నాలుగో గణంలో సంధిగతంగా ఉన్న ‘య’లోని ‘అ’ కారానికి చెల్లింది.
ప్రాసాక్షరం :
‘క్క’ అనే అక్షరం అంటే ద్విత్వ కకారం ప్రాసగా ఉంది.
2. ద్విపద :
ద్విపద ఛందస్సు దేశి కవిత్వానికి చెందినది. ‘ద్వి-పద’ అంటే రెండు పాదాలు అని అర్థం. అంటే దీనిలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి. ప్రతి పాదంలో మూడు. ఇంద్ర గణాలు, తరువాత ఒక సూర్యగణం ఉంటాయి. 1-3 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది.
ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు. శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను ‘మంజరీ ద్విపద’లో రాశాడు.
యతి మైత్రి : మొదటి పాదంలో ‘తు – దు’ లకు పాటించబడింది.
రెండో పాదంలో ‘వ – వా’ లకు పాటించబడింది.
3. ఉపజాతులు
1. ఆటవెలది :
ఆటవెలది ఉపజాతి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్ర గణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోను 1 – 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనియమం లేదు. ప్రాసయతిని పాటించవచ్చును.
పై ఉదాహరణలో మొదటి పాదంలో మొదట 3 సూర్య గణాలూ, తరువాత రెండు ఇంద్ర గణాలూ వచ్చాయి. రెండో పాదంలో ఐదూ సూర్య గణాతలు వచ్చాయి. కాబట్టి ఇది ఆటవెలది పద్యం .
యతి మైత్రి మొదటి పాదంలో ‘ఉ’ అనే అచ్చుకు, నాలుగో గణం మొదటి అక్షరం ‘నా’ లో గల ‘ఒ’ అనే అచ్చుకు చెల్లింది. రెండో పాదంలో 1-4 గణాల’ మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లలేదు. కాబట్టి ప్రాసయతిని కవి పాటించాడు. 1వ గణం ప్రాసాక్షరమైన ‘డ’, నాలుగో గణం ప్రాసాక్షరమైన ‘డ’ లకు ప్రాసయతి సరిపోయింది. (చూడ – జాడ)
2. తేటగీతి :
తేటగీతి ఉపజాతి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు ఉండాలి. ప్రతి పాదంలోను 1 – 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. ప్రాసనియమం లేదు. ప్రాసయతి పాటింపవచ్చును.
యతి మైత్రి : 1 – 4 గణాలు మొదటి అక్షరాలైన ‘ప’, ‘బా’ లకు సరిపోయింది.
3. సీసం :
సీసం ఉపజాతి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదానికి వరుసగా ఆరు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు ఉంటాయి. పఠన సౌలభ్యం కోసం ప్రతి పాదాన్ని రెండు చిన్న పాదాలుగా విభజించారు. అంటే పద్యంలో మొత్తం 8 అర్ధ పాదాలు ఉంటాయి. ప్రతి అర్ధపాదంలోనూ, 1-3 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం లేదు. ప్రాస యతిని పాటింపవచ్చును. సీస పద్యం ముగిసిన తరువాత అనుబంధంగా తేటగీతి పద్యం కాని, ఆటవెలది పద్యం కానీ విధిగా ఉండాలి. దీనిని ఎత్తు గీతి అంటారు.
మొదటి పాదంలో ‘ల-లు’లకు ప్రాసయతి పాటించబడింది.
రెండో పాదంలో ‘ధ’లోని ‘అ’కు, ‘త్ర’లోని ‘అ’కు స్వరమైత్రి పాటించబడింది.
ముత్యాలసరం :
గురజాడ అప్పారావు 1910లో ముత్యాలసరాలు అనే ఖండికను ‘ముత్యాల సరాలు’ అనే ఛందస్సులో రాశాడు. ఒక ఫారసీ గజల్ విని స్ఫూర్తి పొంది ముత్యాలసరాలు ఛందస్సును కూర్చినట్టు గురజాడ చెప్పుకున్నారు. వృషభగతి రగడ, భామినీ షట్పది.వంటి ఛందస్సులలోనూ ముత్యాలసరాలకు మూలాలు కన్పిస్తున్నాయి. ముత్యాల సరాలు మాత్రా ఛందస్సుతో కూడిన గేయ ప్రక్రియ.
లక్షణాలు :
- ఇది మాత్రా గణాలతో ఏర్పడుతుంది.
- ఇందులో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోనూ 3 + 4; 3 + 4 క్రమంలో మొత్తం 14 మాత్రలుంటాయి.
- 4వ పాదంలో మాత్రం 7 నుంచి 14 మాత్రలు దాకా ఉండవచ్చు.
- నాల్గవ పాదంతో భావం పూర్తి కావాలి.
- నాలుగు పాదాలలో భావం పూర్తికానపుడు ఒకొక్కసారి ఐదవ పాదం దాకా పెరుగుతుంది.
దీనిని తోక ‘ముత్యాల సరము’ అని వ్యవహరిస్తారు. ‘కన్యక’ ఖండికలోనూ ఈ తోక — ముత్యాలసరాలు కొన్ని ఉన్నాయి. గమనించవచ్చు.
ఉదాహరణ : ముత్యాల సరం
ఉదాహరణ : తోక ముత్యాల సరం
అభ్యాసం
ఏక వాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఛందస్సు అంటే ఏమిటి ?
జవాబు:
పద్య లక్షణాలను చెప్పే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు..
ప్రశ్న 2.
‘చంపకమాల’లోని గణాలు ఏవి ?
జవాబు:
న, జ, భ, జ, జ, జ, ర చంపకమాలలోని గణాలు.
ప్రశ్న 3.
‘మత్తేభం’లోని యతిస్థానం ఏది ?
జవాబు:
మత్తేభంలో 1వ అక్షరంతో 14వ అక్షరానికి యతి చెల్లుతుంది.
ప్రశ్న 4.
కంద పద్యంలో బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు ?
జవాబు:
‘జ’ గణము ఉండకూడదు.
ప్రశ్న 5.
ఉపజాతుల్లో ఏ నియమం ఉండదు ?
జవాబు:
‘ప్రాస’ నియమం ఉండదు.
ప్రశ్న 6.
ముత్యాలసరం నాల్గవ పాదంలో ఎన్ని మాత్రలుంటాయి ?
జవాబు:
7 నుండి 14 మాత్రలు దాకా ఉండవచ్చు.
ప్రశ్న 7.
మత్తేభంలోని గణాలు ఏవి ?
జవాబు:
స, భ, ర, న, మ, య, వ అను గణములుంటాయి.
ప్రశ్న 8.
ఉత్పలమాల పద్యపాదంలో ఎన్నో అక్షరానికి యతిస్థానం ఉంటుంది ?
జవాబు:
10వ అక్షరానికి యతిస్థానం ఉంటుంది.
ప్రశ్న 9.
ఇంద్ర గణాలేవి ?
జవాబు:
నలము, నగము, సలము, భగణము, రగణము, తగణములు ఇంద్ర గణాలు.
ప్రశ్న 10.
సీస పద్యానికి అనుబంధంగా ఏ పద్యం రాస్తారు ?
జవాబు:
తేటగీతి పద్యంగాని, ఆటవెలది పద్యాన్నిగాని రాస్తారు.
ప్రశ్న 11.
ప్రాస అంటే ఏమిటి ?
జవాబు:
పద్యపాదములోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
ప్రశ్న 12.
కంద పద్యంలో వాడే గణాలేవి ?
జవాబు:
కంద పద్యంలో గగ, భ, జ, స, నలము లను వాడతారు.
ప్రశ్న 13.
తేటగీతిలోని గణాలేవి ?
జవాబు:
తేటగీతి పద్యంలో ప్రతిపాదంలో ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మరల రెండు సూర్యగణాలు ఉంటాయి.
ప్రశ్న 14.
ఉత్పలమాలలోని గణాలేవి ?
జవాబు:
భ, ర, న, భ, భ, ర, వ ఉత్పలమాలలోని గణాలు.
ప్రశ్న 15.
శార్దూలంలోని గణాలేవి ?
జవాబు:
మ, స, జ, స, త, త, గ శార్దూలంలోని గణాలు.