మంచి ముత్యాలు Questions and Answers Summary Inter 1st Year Telugu

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material పద్యభాగం 3rd Poem మంచి ముత్యాలు Questions and Answers Summary.

Inter 1st Year Telugu మంచి ముత్యాలు Questions and Answers

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘మంచిముత్యాలు’ పాఠ్యభాగ సారాంశాన్ని తెలపండి.
జవాబు:
ఉపోద్ఘాతం : “మంచిముత్యాలు” పాఠ్యభాగం వివిధ శతక కవులచే రచించబడిన వివిధ శతకాల నుండి గ్రహించబడింది.
పాఠ్యభాగ ఉద్దేశం : నీతి శతకాలు విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయి. కావున మహాకవులు చెప్పిన మంచి ముత్యాల వంటి నీతి పద్యాల సారాన్ని గ్రహించి, విద్యార్థులు ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దబడాలనేది ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ విషయం : శతకకవులు బద్దెన, మారదవెంకయ్య, వేమన, ఏనుగు లక్ష్మణకవి, శేషప్ప మొదలగు వారు వ్రాసిన శతక పద్యాలలోని మంచిముత్యాలవంటి పద్యాలను కొన్నింటిని, విద్యార్థులలో నీతి మరియు నైతిక విలువలు పెంపొందించుటకు ఈ పాఠ్యాశం నందు ఈ క్రింది విధంగా యివ్వబడెను.

నీరు త్రాగే గుఱ్ఱం దగ్గరకు, అహంకారంతో విర్రవీగుతున్న మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గరున్న ఆబోతు దగ్గరకు, చదువు నేర్వని అజ్ఞాని వద్దకు వెళ్ళకూడదు. అటువంటి వారితో ఎప్పటికీ స్నేహం చేయడం తగదు. -అంతేకాదు, పాముకు తలలో, తేలుకు కొండెంలో విషం ఉంటే దుష్టుడైన మానవుడికి నిలువెల్లా విషం ఉంటుంది.

కావున అట్టివారితో ఎప్పటికీ ప్రమాదమే. మరియు కవి బద్దెన తన సుమతీ శతకం ద్వారా భార్యతో గొడవ పడుట శ్రేయస్సును కలిగించదని, ఆవిధంగా ఇంటి ఇల్లాలు కంట నీరు పెడితే ఆ ఇంట సిరిసంపదలు (లక్ష్మీదేవి) నిలువవని తన ముత్యాలవంటి పద్యాల ద్వారా చక్కని నీతిని బోధించెను.

భాస్కర శతక కర్త మారద వెంకయ్య చెప్పినట్లుగా మనం ఏవైనా మంచి పనులు తలపెట్టినప్పుడు దుష్టులు ఎన్నో అవరోధాలను కలిగిస్తారు. అదెట్లనగా భోజనం చేసే సమయంలో ఈగ భోజన పదార్థాలపై వాలినప్పటికిని, ఈగను చెదరగొట్టి పదార్థాన్ని భుజిస్తాడు.

దుర్యోధనాదులు గొప్పసైన్యంతో విరాటుని ఆవుల మందని తోలుకుపోతుంటే అర్జునుడొక్కడే వారందరినీ జయించి ఆవులను తిరిగి తెచ్చాడు. కావున దృఢచిత్తం కలవారు ఎంతటి పనినైనా నెరవేర్చగలడు. ‘విశ్వదాభిరామ ! వినురవేమ’ అంటూ వేమనకవి వ్రాసిన వేమన శతకపద్యాలు వేనోళ్ళ సుపరిచితం. వేమన శతకంలోని కొన్ని మంచి మాటలు ఈ పాఠ్యాంశం నందు ఈ విధంగా తెలియజేయబడ్డాయి.

గౌరవం లేనివారితో కలిసి తిరిగే వ్యక్తిని అందరూ గౌరవం లేనివాడిగా భావిస్తారని, తాటి చెట్టు క్రింద కూర్చుని పాలు తాగినా కల్లు సేవిస్తున్నారనే అనుకుంటారని, మరియు చెడ్డ గుణాలు కలిగినవారు తొందరపాటు మాటలు మాట్లాడతారు, కానీ మంచి గుణాలు కలవారు ఆలోచించి మాట్లాడతారు. –

అదెట్లనగా నీటితో నిండి ఉండే నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తుంటే, చిన్నచిన్న సెలయేర్లు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తుంటాయని, అందుకే పరిమళాలు మోసినంత మాత్రాన గాడిద గొప్పది కానట్లే, హీన ప్రవర్తన కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా గొప్పవాడు కాలేడని కవి పలికెను.

కావుననే వేమన శతకం నందలి పద్యాలు నిత్య సందేశాత్మకం అనే మాటలు అక్షర సత్యాలు.

18వ శతాబ్దానికి చెందిన ఏనుగులక్ష్మణకవి రత్నాలవంటి సుభాషితాలను అందించారు. అదేమనగా నీతిమంతులు వారిని ఎవరైనా నిందించినా, మెచ్చుకున్నా, సంపదలున్నా, లేకపోయినా అప్పుడే మరణం సంభవించినా, యుగాంతం సంభవించినా సరే, ధీరులై ఎప్పుడూ నీతిమార్గాన్ని తప్పరని బోధించెను.
నరసింహశతకం వ్రాసిన శేషప్పకవి సీసపద్యాలతో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస ! దుష్టసంహార! నరసింహ ! దురితదూర’ అని ద్విపాద మకుటంతో లోకానికి సందేశాన్నిచ్చే అద్భుతమైన పద్యాలను రచించారు. తల్లిగర్భం నుండి ధనమెవ్వడూ తీసుకురాడు. చనిపోయినప్పుడు వెంటతీసుకుపోడు.

ఎంతడబ్బుగల లక్షాధికారి అయినా ఉప్పుమెతుకులే కానీ (అనగా అన్నమేగాని) మేలిమి బంగారం మింగలేడు. డబ్బు సంపాదించి విర్రవీగడమేగాని, అనుభవించలేడు. రహస్యంగా దాచిన సొమ్ము తరువాత కాలంలో దొంగలపాలు, రాజులపాలు అవుతుంది. అదెట్లనగా తేనెటీగ కష్టపడి తేనెను సేకరిస్తుంది. చివరకు ఆ తేనె బాటసారుల పాలవుతుంది. కావున మనిషి తనకు లభించిన దానితో సంతృప్తినొంది సాటి జీవుల యెడల దయాపరుడై, లోకోపకారియై శాశ్వత కీర్తి నొందాలని శేషప్పకవి తెలిపిన మంచి మాటలను “మంచిముత్యాలు” పాఠ్యాంశం ద్వారా గ్రహింపవచ్చును.

ఉపసంహారం / ముగింపు : కావున నీతి శతకాలను మించిన వ్యక్తిత్వ వికాస పాఠాలు విద్యార్థులకు వేరొకటి ఉండవని, మహాకవులు చెప్పిన నీతిపద్యాల సారాన్ని గ్రహించి, విద్యార్థులు ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దబడి, సమాజశ్రేయోభివృద్ధికై పాటుపడాలి.

ప్రశ్న 2.
శతక ప్రక్రియ విశిష్టతను తెలపండి.
జవాబు:
శతక ప్రక్రియ విశిష్టత నూరు పైచిలుకు పద్యాలు గల కావ్యాన్ని శతకము అంటారు. శతకపద్యాలు వేటికవే స్వతంత్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే శతకపద్యాలను ముక్తకాలు అంటారు. అంతేకాదు శతకపద్యాలకు మకుటనియమం ఉంటుంది. ఈ మకుటనియమం కవి యొక్క కీర్తిని ఎల్లయెడల వ్యాపింపచేసి శాశ్వత యశస్సును కలిగింపజేస్తుంది.

శతక ప్రక్రియ తెలుగుసాహిత్యంలో ప్రత్యేకత కలిగినది. ఇది పండితులు, పామరులే గాక వయోభేదం లేక, అందరిని అలరింపజేసే శక్తివంతమైన ప్రక్రియ. శతక పద్యాలు సులభగ్రాహ్యాలు. ప్రసిద్ధకవులు ఎందరో శతకపద్యాలు వ్రాసారు. అందుకే మన తెలుగు భాషనందు వేలాదిగా శతకపద్యాలు ఉన్నాయి. శతకాలలో కవి ఆత్మానుభం వ్యక్తమవుతుంటుంది. కాబట్టి అవి హృదయానికి అత్యంత సన్నిహితాలై ఆంతరంగిక స్వానుభూతిని కలిగిస్తాయి.

శతక పద్యాలకు గల లక్షణాలు

  1. సంఖ్యానియమం : శతకం అంటే వంద (100) అని అర్థం. శతకంలో వంద గాని, వందకు పైన గాని పద్యాలు ఉంటాయి. సహజంగా శతకంలో 108 లేదా 116 పద్యాలు కూడా ఉండవచ్చు.
  2. మకుట నియమం : శతకంలోని ప్రతి పద్యం చివర ఉండే సంబోధనను ‘మకుటం’ అంటారు.
  3. వృత్త నియమం : తెలుగు శతకాలలో వృత్త’ నియమం ఉంది. శతకంలోని పద్యాలు ఒకే వృత్తంలో గాని, ఛందస్సులో గాని ఉంటాయి.
  4. రస నియమం : శతకంలో ఏ రసం ప్రతిపాదితమవుతుందో అదే రసం అన్ని పద్యాలలో వ్యక్తం కావాలి.
  5. ఆత్మాశ్రయరీతి : శతకాలు ఆత్మాశ్రయ కవిత్వకోవకు చెందుతాయి. కవి తన సొంత భావాలను, అనుభవాలను వ్యక్తీకరిస్తాడు.
  6. ముక్తకం : ముక్తకం అంటే ముత్యం అని అర్థం. శతకంలో పద్యాల మధ్య అనుసంధానం ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉండడమే “ముక్తకం”.

ఈ విధంగా అన్ని లక్షణాలతో వెలువడిన తొలి తెలుగు శతకం పాల్కురికి సోమన రచించిన వృషాధిపశతకం. నాటి నుంచి అనేక శతకాలు వెలువడ్డాయి.

మంచి ముత్యాలు Questions and Answers Summary Inter 1st Year Telugu

II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సుమతి శతక కర్త తెలిపిన నీతిని రాయండి.
జవాబు:
సుమతీ శతకకర్త బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు.
నీరు త్రాగే గుర్రం దగ్గరకు, మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు దగ్గరకు, విద్య నేర్వని అల్పుని దగ్గరకు వెళ్ళకూడదు. వారితో స్నేహం చేయకూడడుద.

భార్యతో ఎప్పుడూ తగువు పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలారోపించవద్దు. ఉత్తమ ఇల్లాలి కంటి నీరు నేలమీద పడితే ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు.

సర్పానికి విషం తలలో ఉంటుంది. తేలుకు కొండెంలో ఉంటుంది. దుష్టునికి నిలువెల్లా ఉంటుందని సమతీశతక కర్త బద్దెన తెలిపెను.

ప్రశ్న 2.
భాస్కర శతక కర్త బోధలను తెలపండి.
జవాబు:
భాస్కర శతకక కర్త మారద వెంకయ్య. ఈయన 16వ శతాబ్దానికి చెందిన కవి.
మనిషి అన్నం తినే సమయంలో ఈగ భోజన పదార్థాలపై వాలినంత మాత్రాన భోజన పదార్థం మానక భుజిస్తాడు. అలాగే మంచి పని చేసేటప్పుడు దుష్టులు దానిని వద్దని చెప్పినా మానకూడదు.

దుర్యోధనాదులు గొప్ప సైన్యంతో విరాటుని ఆవుల మందని తోలుకు పోతుంటే అర్జునుడొక్కడే వారందరినీ జయించి ఆవులను తిరిగి తెచ్చాడు. ఆలాడే దృఢచిత్తం కలవాడు. ఎంతటి పనినైనా నెరవేర్చగలడు అని భాస్కర శతక కర్త బోధించెను.

ప్రశ్న 3.
వేమన పద్యాల సారాన్ని తెలపండి.
జవాబు:
వేమన యోగిగా ప్రజాకవిగా ప్రసిద్ధుడు. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు.
గౌరవం లేనివారితో కలిసి తిరిగే వ్యక్తిని అందరూ గౌరవం లేనివాడిగానే భావిస్తారు. తాటిచెట్టు కింద కూర్చుని పాలుతాగినా కల్లు సేవిస్తున్నారనే అనుకుంటారు.

నీటితో నిండి ఉండే నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తుంటాయి. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తాయి. అదేవిధంగా చెడ్డగుణములు కలిగినవారు తొందరపాటుతో కూడిన మాటలు మాట్లాడతారు. మంచి గుణాలు కలిగిన వారు అలా ఉండరు.

పరిమళాలు మోసినంత మాత్రాన గాడిద గొప్పదౌతుందా ? అలాగే హీన ప్రవర్తన కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా గొప్పవాడు కాలేడని మంచిముత్యాల వంటి నీతులను వేమన కవి బోధించెను.

ప్రశ్న 4.
ఏనుగు లక్ష్మణకవి సుభాషిత సారాన్ని రాయండి.
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన మహాకవి భర్తృహరి సంస్కృతంలో రచించిన ‘సుభాషిత త్రిశతి’ని తెలుగులో “సుభాషిత రత్నావళి’ గా అందించాడు. ఆవిధంగా కవి తెలియజేసిన రత్నాలవంటి పద్యాలను ‘మంచిముత్యాలు’ పాఠ్యాంశంలో ఈ క్రిందివిధంగా పొందుపరచబడెను.

నీతిమంతులు వారిని ఎవరైనా నిందించినా, మెచ్చుకున్నా, సంపదలున్నా, లేకపోయినా అప్పుడే మరణం సంభవించినా, యుగాంతం సంభవించినా, ధీరులు ఎప్పుడు నీతిమార్గం నుండి తొలగరు.

ప్రశ్న 5.
శేషప్ప కవి తెలిపిన హితోక్తులను రాయండి.
జవాబు:
శేషప్పకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన వ్రాసిన రచనలలో నరసింహశతకం ప్రసిద్ధి చెందినది. ఈ శతకంలోని పద్యాలన్నీ సీసపద్యాలు.

శేషప్ప కవి తన నరసింహశతకం ద్వారా తల్లిగర్భం నుండి ధనమెవ్వడూ తీసుకురాడు. చనిపోయినపుడు వెంటరాదు. లక్షాధికారి అయినా ఉప్పు మెతుకులే కాని మేలిమి బంగారం మింగలేడు. డబ్బు సంపాదించి విర్రవీగడమేగాని, ఆ సొమ్ముని అనుభవించలేడు. బాగా రహస్యంగా భూమిలో దాచే ధనం చివరకు దొంగలపాలు, రాజుల పాలవుతుంది. తేనెటీగలు కష్టపడి తేనెను బాటసారులకు ఇచ్చినట్లవుతుంది. అని “మనిషి అశాశ్వతమైన భోగాలకోసం పరుగులు పెట్టకుండా శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోవాలని, వాస్తవ జీవితాన్ని నెఱింగి నడుచుకోవాలని ఈ పద్యం ద్వారా హితము పలికెను.

మంచి ముత్యాలు Questions and Answers Summary Inter 1st Year Telugu

III. ఏకవాక్య/పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సుమతీ శతకాన్ని రచించింది ఎవరు ?
జవాబు:
సుమతీ శతకాన్ని రచించినది 13వ శతాబ్దానికి చెందిన బద్దెన కవి.

ప్రశ్న 2.
భాస్కర శతక కర్త ఎవరు ?
జవాబు:
భాస్కర శతకకర్త 16వ శతాబ్దానికి చెందిన మారద వెంకయ్య.

ప్రశ్న 3.
దుర్యోధనాదులను ఎదుర్కొన్న ఒక్కడెవరు ?
జవాబు:
దుర్యోధనాదులను అర్జునుడు ఒక్కడు ఎదుర్కొన్నాడు.

ప్రశ్న 4.
మనిషికి విషం ఎక్కడుంటుంది ?
జవాబు:
మనిషికి విషం నిలువెల్లా (శరీరం అంతా) ఉంటుంది.

ప్రశ్న 5.
చనిపోయినప్పుడు వెంటరానిదేది ?
జవాబు:
చనిపోయినప్పుడు వెంటరానిది ధనం.

ప్రశ్న 6.
తేనెటీగల కష్టం ఎవరికి స్వంతమవుతుంది ?
జవాబు:
తేనెటీగల కష్టం బాటసారులకు స్వంతమవుతుంది.

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁడు
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం 16వ శతాబ్దానికి చెందిన కవి మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం నుండి గ్రహింపబడినది.
సందర్భం : దృఢ చిత్తం కలవారి శక్తిసామర్థాలు, వివేకం మొదలగు సుగుణాలను గురించి కవి వర్ణిస్తున్న సందర్భంలోనిది ఈ వాక్యము.
భావం : “దుర్యోధనాదులు గొప్ప సైన్యంతో విరాటుని ఆవుల మందను తోలుకుపోతుంటే అర్జునుడొక్కడే వారందరినీ జయించి ఆవులను తిరిగి తెచ్చాడు. కావున దృఢ చిత్తం కలవారు కార్యశూరుడైన అర్జునుని వలె ఎంతటి పనినైనా నెరవేర్చగలరని” కవి తెలిపెనని భావము.

ప్రశ్న 2.
తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ
జవాబు:
కవి పరిచయం.: ఈ వాక్యం 17వ శతాబ్దానికి చెందిన కవి వేమనచే రచించబడిన వేమన శతకం నుండి గ్రహింపబడినది.
సందర్భం : సహవాస సాంగత్యాలను గురించి కవి వర్ణించు సందర్భంలోనిది ఈ వాక్యము.
భావం : “గౌరవం లేని వారితో కలిసి తిరిగే వ్యక్తిని అందరూ గౌరవం లేనివాడిగానే భావిస్తారు. అదెట్లనగా తాటిచెట్టు క్రింద నిలబడి పాలు త్రాగినట్లుగా ఉంటుందని” – అనగా తాటి చెట్టు కింద నిలబడి పాలుతాగినా కల్లు సేవిస్తున్నారనే అనుకుంటారని కవి పలికెనని భావము.

ప్రశ్న 3.
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం 17వ శతాబ్దానికి చెందిన కవి వేమనచే రచించబడిన వేమన శతకం నుండి గ్రహింపబడినది.
సందర్భం : : హీనగుణం కలవాడి ప్రవర్తనను గురించి కవి వర్ణించిన సందర్భంలోనిది ఈ వాక్యము.
భావం : పరిమళాలు మోసినంత మాత్రాన గాడిద గొప్పదౌతుందా ! అన్నట్లుగా హీనప్రవర్తన గలవాడు ఎన్ని విద్యలు నేర్చినా గొప్పవాడు కాలేడు కదా ! యని కవి పలికెనని భావము.

ప్రశ్న 4.
తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం 18వ శతాబ్దానికి చెందిన శేషప్ప కవిచే రచించబడిన “నరసింహశతకం” నుండి గ్రహింపబడినది.
సందర్భం : దానధర్మాలు చేయని లోభిని గూర్చి కవి వివరించిన సందర్భంలోనిది ఈ వాక్యము.
భావం : తల్లి గర్భం నుండి ధనమెవ్వడూ తీసుకురాడు. చనిపోయినపుడు వెంట తీసుకువెళ్ళడు. లక్షాధికారి అయినా అన్నమే తింటాడు గానీ, బంగారం తినడు కదా ! లోభి తాను డబ్బు సంపాదించి విర్రవీగడమే గానీ, ఆ సొమ్ముని అనుభవించలేడు. అలా దాచిన ధనము తేనెటీగ తేనెను బాటసారులు హరించిన విధంగా చివరకు, దొంగలపాలు కావటమో ! రాజులపాలు కావటమో ! జరుగుతుంది. కావున సంపాదించిన సొమ్మును మనిషి తాను అనుభవిస్తూనే దానధర్మాలకు కూడా వినియోగించాలనీ కవి తెలిపెనని భావము.

మంచి ముత్యాలు Questions and Answers Summary Inter 1st Year Telugu

V. సంధులు

1. కన్నీరొలికిన = కన్నీరు + ఒలికిన – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యము.

2. ధీరోత్తములు = ధీర + ఉత్తములు – గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, ఆర్ ఆదేశంగా వచ్చును.

3. యుగాంతం = యుగ + అంతం – సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

4. దొంగలకిత్తురో = దొంగలకు + ఇత్తురో – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యము.

5. బలోన్నతుడు = బల + ఉన్నతుడు – గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, ఆర్ ఆదేశంగా వచ్చును.

6. నిలువెల్ల = నిలువు + ఎల్ల – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యము.

VI. సమాసాలు

1. ధేనుకోటులు – కోటి సంఖ్యగల ధేనువులు – ద్విగు సమాసము (లేదా) విశేషణ సంఖ్యావాచక సమాసము.
వివరణ : సంఖ్యాపూర్వోద్విగుః అని సంస్కృత నియమము. సంఖ్యాపూర్వకమైన కర్మధారయమే ద్విగుసమాసము. ఆచ్ఛిక పదములతో (తెలుగు) పదాలతో గూర్చినదైనచో ద్విగు సమాసము ఏకవచనాంతమై ఉండును. మిశ్రమ సమాసము (కొన్ని సంస్కృత పదములు కొన్ని తెలుగు పదములు) నందు బహువచనము వచ్చును.
సూత్రము. : “ద్విగువున కేక వచనంబు ప్రాయకంబుగానగు, మిశ్రమంబునగాదు.”

2. కలకంఠకంఠి – కలకంఠ వంటి కంఠి – ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము.

3. నిండునదులు – నిండైన నదులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము.

4. దానధర్మములు – దానము మరియు ధర్మము – ద్వంద్వ సమాసము. ‘

VII. కఠిన పదాలకు అర్థాలు

  1. మొదవు = ఆవు
  2. కులకాంత = భార్య
  3. ఖలుడు = దుర్మార్గుడు (మానవుడు)
  4. తెరువులు = బాటసారులు
  5. వదరుపోతు = ఊరక మాట్లాడేవారు

విశేషాంశాలు

శతకం అంటే వందగాని వందకు పైనగాని పద్యాలు ఉండాలి. అని తెలుసుకున్నాం కదా. నూటికి తక్కువగా ఉన్న రచనలకు కూడా ప్రత్యేకమైన పేర్లున్నాయి.

  • ఒక్క పద్యం – ముక్తకం
  • రెండు పద్యాలు – కలకం
  • మూడు పద్యాలు – త్రికం
  • ఐదు పద్యాలు – పంచకం – పంచరత్నాలు
  • ఎనిమిది పద్యాలు – వారణమాల (అష్టకం)
  • తొమ్మిది పద్యాలు – నవరత్నాలు
  • పది పద్యాలు – దశకం
  • పన్నెండు పద్యాలు – భాస్కర మాలిక
  • పదహారు పద్యాలు – శశికళ
  • ఇరవై పద్యాలు – వింశతి
  • ఇరవై ఐదు పద్యాలు – పంచవింశతి
  • ఇరవై ఏడు పద్యాలు – తారావళి
  • నూటెనిమిది పద్యాలు – అష్టోత్తర శతకం

మంచి ముత్యాలు Summary in Telugu

కవుల పరిచయాలు

‘మంచిముత్యాలు’ పాఠ్యభాగం నందలి పద్యాలు వివిధ శతకకవులు వ్రాసిన ‘శతక పద్యాల’ నుండి గ్రహింపబడినవి.

బద్దెన (సుమతి శతకం) :
ఆంధ్రదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నీతిశతకాలలో సుమతి శతకం ఒకటి. సుమతి శతకాన్ని సా.శ. 13వ శతాబ్దానికి చెందిన బద్దెన రచించాడు. ఈ శతకంలోనివన్నీ కందపద్యాలు. ‘సుమతి’ అనేది మకుటం. ఈ శతకంలోని అనేక పద్యాలు జాతీయాలు సామెతలుగా పండిత పామరుల నోళ్ళలో నానుతున్నాయి. ఎన్నో శతాబ్దాలుగా తెలుగువారు తమ పిల్లలకు నీతిని నేర్పడానికి ఈ శతకంలోని పద్యాలను బోధించడమే ఈ శతకం గొప్పదనానికి నిదర్శనం..

మారద వెంకయ్య (భాస్కర శతకం):
మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందిన కవి. నేటి విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాలలో నివసించాడు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి భక్తుడు. సూర్యుని పేర భాస్కర శతకం రచించాడు. ఈ శతకానికి మకుటం ‘భాస్కరా’ ఎంతో ప్రాశస్త్యం పొందిన నీతి శతకాలలో ఇదొకటి. వృత్తాలలో రచించబడిన పద్యాలలో మానవ మనస్తత్వం, నైతిక విలువలు వంటి అనేక అంశాలు ప్రస్తావించబడ్డాయి.

వేమన (వేమన శతకం) :
వేమన యోగిగా, ప్రజాకవిగా ప్రసిద్ధుడు. ఇతడు తన అనుభవాలను అనేక పద్యాలలో అందించాడు. ఇవి ఆశువుగా చెప్పినట్లు అనిపిస్తాయి. చక్కని నీతులతో ధారాశుద్ధితో ఉండటం వల్ల ప్రజల నాలుకలపై చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందుకే, వేమన పద్యం తెలియని తెలుగువాడు లేడనడం అతిశయోక్తి కాదు. వేమన 17వ శతాబ్దానికి చెందిన వాడుగా అనేకమంది చరిత్రకారులు నిర్ధారించారు. వేమన పద్యాలు ఎక్కువగా ఆటవెలది ఛందస్సులో ఉన్నాయి. ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది వేమన శతకానికి మకుటం.

మంచి ముత్యాలు Questions and Answers Summary Inter 1st Year Telugu

ఏనుగు లక్ష్మణ కవి :
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. పేరమ్మ, తిమ్మకవి వీరి తల్లిదండ్రులు. నేటి కాకినాడ జిల్లాలోని పెద్దాడ వీరి జన్మస్థలం. పెద్దాపురం సంస్థానాధీశుల నుంచి లక్ష్మణకవి ముత్తాత ఏనుగును బహుమతిగా పొందడంవల్ల వారి ఇంటి పేరు ఏనుగుగా స్థిరపడిందని జనభావన. భర్తృహరి సంస్కృతంలో రచించిన ‘సుభాషిత త్రిశతి’ని తెలుగులో ‘సుభాషిత రత్నావళి’గా అనువదించాడు. ఇందులో నీతి, శృంగార, వైరాగ్య శతకాలని మూడు భాగాలు. భర్తృహరి సుభాషిత త్రిశతిని ఇతర కవులు అనువదించినప్పటికీ ఏనుగు లక్ష్మణకవి రచన ఎంతో ప్రాచుర్యం పొందింది.

శేషప్ప కవి (నరసింహ శతకం) :
తెలుగులోని ప్రముఖ శతకాలలో నరసింహ శతకమొకటి. నేటి జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చెందిన శేషప్ప కవి ఈ శతకాన్ని రచించాడు. ఇతను 18వ శతాబ్దానికి చెందినవాడని పండిత పరిశోధకుల భావన. ఈ శతకంలోని పద్యాలన్నీ సీసపద్యాలు. ఇవి మృదుమధురంగా సులభశైలిలో ఉంటాయి. ‘భూషణ వికాస శ్రీధర్మపురనివాస ! దుష్ట సంహార ! నరసింహ ! దురితదూర’ అనేది ద్విపాద మకుటం. కవి సామాన్యుడవటం వలన సామాన్య విషయాలను మనోహరంగా చెప్పాడని శతకాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది.

శతక ప్రక్రియ విశిష్టత :
నూరు పైచిలుకు పద్యాలు గల కావ్యాన్ని శతకము అంటారు. శతకపద్యాలు వేటికవే స్వతంత్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే శతకపద్యాలను ముక్తకాలు అంటారు. అంతేకాదు శతకపద్యాలకు మకుటనియమం ఉంటుంది. ఈ మకుటనియమం కవి యొక్క కీర్తిని ఎల్లయెడల వ్యాపింపచేసి శాశ్వత యశస్సును కలిగింపజేస్తుంది.

శతక ప్రక్రియ తెలుగుసాహిత్యంలో ప్రత్యేకత కలిగినది. ఇది పండితులు, పామరులే గాక వయోభేదం లేక, అందరిని అలరింపజేసే శక్తివంతమైన ప్రక్రియ. శతక పద్యాలు సులభగ్రాహ్యాలు. ప్రసిద్ధకవులు ఎందరో శతకపద్యాలు వ్రాసారు, అందుకే మన తెలుగు భాషనందు వేలాదిగా శతకపద్యాలు ఉన్నాయి. శతకాలలో కవి ఆత్మానుభం వ్యక్తమవుతుంటుంది. కాబట్టి అవి హృదయానికి అత్యంత సన్నిహితాలై ఆంతరంగిక స్వానుభూతిని కలిగిస్తాయి.

శతక పద్యాలకు గల లక్షణాలు

  1. సంఖ్యానియమం : శతకం అంటే వంద (100) అని అర్థం. శతకంలో వంద గాని, వందకు పైన గాని పద్యాలు. ఉంటాయి. సహజంగా శతకంలో 108 లేదా 116 పద్యాలు కూడా ఉండవచ్చు.
  2. మకుట నియమం : శతకంలోని ప్రతి పద్యం చివర ఉండే సంబోధనను ‘మకుటం’ అంటారు.
  3. వృత్త నియమం : తెలుగు శతకాలలో వృత్త నియమం ఉంది. శతకంలోని పద్యాలు ఒకే వృత్తంలో గాని, ఛందస్సులో గాని ఉంటాయి.
  4. రస నియమం : శతకంలో ఏ రసం ప్రతిపాదితమవుతుందో అదే రసం అన్ని పద్యాలలో వ్యక్తం కావాలి.
  5. ఆత్మాశ్రయరీతి : శతకాలు ఆత్మాశ్రయ కవిత్వకోవకు చెందుతాయి. కవి తన సొంత భావాలను, అనుభవాలను వ్యక్తీకరిస్తాడు.
  6. ముక్తకం : ముక్తకం అంటే ముత్యం అని అర్థం. శతకంలో పద్యాల మధ్య అనుసంధానం ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉండడమే “ముక్తకం”.

ఈ విధంగా అన్ని లక్షణాలతో వెలువడిన తొలి తెలుగు శతకం పాల్కురికి సోమన రచించిన వృషాధిపశతకం. నాటి నుంచి అనేక శతకాలు వెలువడ్డాయి.

పాఠ్యభాగ ఉద్దేశం

నీతి శతకాలను మించిన వ్యక్తిత్వ వికాస పాఠాలు విద్యార్థులకు ఉండవు. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి. వినకపోతే మనకే నష్టం. మహాకవులు చెప్పిన మంచి ముత్యాల వంటి ఈ నీతిపద్యాల సారాన్ని గ్రహించి, విద్యార్థులందరూ ఉత్తమ సంస్కారవంతులవ్వాలనేది ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ సంగ్రహం

  1. నీరు త్రాగే గుర్రం దగ్గరకు, మదంతో విజృంభించే ఏనుగు దగ్గరకు, ఆవు దగ్గరున్న ఆబోతు దగ్గరకు, విద్య నేర్చని అల్పుని దగ్గరకు వెళ్ళకూడదు, వారితో స్నేహం చేయకూడదు.
  2. భార్యతో ఎప్పుడూ తగువు పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలారోపించవద్దు. ఉత్తమ ఇల్లాలి కంటి నీరు నేల మీద పడితే ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు.
  3. సర్పానికి విషం తలలో ఉంటుంది. తేలుకు కొండెంలో ఉంటుంది. దుష్టునికి నిలువెల్లా ఉంటుంది.
  4. మనిషి అన్నం తినే సమయంలో ఈగ భోజన పదార్థాలపై వాలినంత మాత్రాన భోజన పదార్థం మానక భుజిస్తాడు. అలాగే మంచి పని చేసేటప్పుడు దుష్టులు దానిని వద్దని చెప్పినా మానకూడదు.
  5. దుర్యోధనాదులు గొప్ప సైన్యంతో విరాటుని ఆవుల మందని తోలుకు పోతుంటే అర్జునుడొక్కడే వారందరినీ జయించి ఆవులను తిరిగి తెచ్చాడు. అలాగే దృఢచిత్తం కలవాడు ఎంతటి పనినైనా నెరవేర్చగలడు.
  6. గౌరవం లేనివారితో కలిసి తిరిగే వ్యక్తిని అందరూ గౌరవం లేనివాడిగానే భావిస్తారు. తాటిచెట్టు కింద కూర్చుని పాలుతాగినా కల్లు సేవిస్తున్నారనే అనుకుంటారు.
  7. నీటితో నిండి ఉండే నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తుంటాయి. చిన్న చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తాయి. అదేవిధంగా చెడ్డ గుణములు కలిగినవారు తొందరపాటుతో కూడిన మాటలు మాట్లాడతారు. మంచి గుణాలు కలిగిన వారు అలా ఉండరు.
  8. పరిమళాలు మోసినంత మాత్రాన గాడిద గొప్పదౌతుందా ? అలాగే హీన ప్రవర్తన కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా గొప్పవాడు కాలేడు.
  9. నీతిమంతులు వారిని ఎవరైనా నిందించినా, మెచ్చుకున్నా, సంపదలున్నా, లేకపోయినా అప్పుడే మరణం సంభవించినా, యుగాంతం సంభవించినా, ధీరులు ఎప్పుడు నీతిమార్గం నుండి తొలగరు.
  10. తల్లిగర్భం నుండి ధనమెవ్వడూ తీసుకురాడు. చనిపోయినపుడు వెంటరాదు. లక్షాధికారి అయినా ఉప్పు మెతుకులే కాని మేలిమి బంగారం మింగలేడు. డబ్బు సంపాదించి విర్రవీగడమేగాని, ఆ సొమ్ముని అనుభవించలేడు. బాగా రహస్యంగా భూమిలో దాచే ధనం చివరకు దొంగలపాలు, రాజుల పాలవుతుంది. తేనెటీగలు కష్టపడి తేనైను బాటసారులకు ఇచ్చినట్లవుతుంది.

పాఠ్యభాగం పద్యాలు, భావాలు

1. కం. ఉదకముఁ ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకు జనకుర సుమతీ !

భావం:: నీరు త్రాగే గుర్రం దగ్గరకు, మదంతో విజృంభించే ఏనుగు దగ్గరకు, ఆవు దగ్గరున్న ఆబోతు దగ్గరకు, విద్య నేర్చని అల్పుని దగ్గరకు వెళ్ళకూడదు, వారితో స్నేహం చేయకూడదు.

2. కం. కులకాంత తోడ నెప్పుడుఁ.
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠ కంఠి కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ !

భావం : భార్యతో ఎప్పుడూ తగువు పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలారోపించవద్దు. ఉత్తమ ఇల్లాలి కంటి నీరు నేల మీద పడితే ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు.

3. * కం. తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁకనుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

భావం: సర్పానికి విషం తలలో ఉంటుంది. తేలుకు కొండెంలో ఉంటుంది. దుష్టునికి నిలువెల్లా ఉంటుంది.

4. ఉ. మానవుఁడాత్మకిష్టమగు మంచి ప్రయోజన మాచరించుచో
గానక యల్పుడొక్కఁ డది గాదని పల్కిన వాని పల్కుకై
మానఁగజూడఁ డా పని సమంచిత భోజనవేళ నీఁగ కా
లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా !

భావం : మనిషి అన్నం తినే సమయంలో ఈగ భోజన పదార్థాలపై వాలినంత మాత్రాన భోజన పదార్థం మానక భుజిస్తాడు. అలాగే మంచి పని చేసేటప్పుడు దుష్టులు దానిని వద్దని చెప్పినా మానకూడదు.

మంచి ముత్యాలు Questions and Answers Summary Inter 1st Year Telugu

5. * ఉ. ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి ‘కార్యమైనఁ దాఁ
జక్క నొనర్పఁ గౌరపు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జిక్కఁగ నీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవడంగఁ జేసి తుద ముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా !

భావం : దుర్యోధనాదులు గొప్ప సైన్యంతో విరాటుని ఆవుల మందని తోలుకు పోతుంటే అర్జునుడొక్కడే వారందరినీ జయించి ఆవులను తిరిగి తెచ్చాడు. అలాగే దృఢచిత్తం కలవాడు ఎంతటి పనినైనా నెరవేర్చగలడు.

6. అ. కాని వానితోడ కలసి మెలగుచున్న
కాని వానిగానే కాంతురవని
తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినురవేమ

భావం : గౌరవం లేనివారితో కలిసి తిరిగే వ్యక్తిని అందరూ గౌరవం లేనివాడిగానే భావిస్తారు. తాటిచెట్టు కింద కూర్చుని పాలుతాగినా కల్లు సేవిస్తున్నారనే అనుకుంటారు.

7. ఆ. నిండు నదులు పాఱు నిలచి గంభీరమై
వెర్రి వాగు పాఱు వేగ పొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ ! వినురవేమ !

భావం : నీటితో నిండి ఉండే నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తుంటాయి. చిన్న చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తాయి. అదేవిధంగా చెడ్డ గుణములు కలిగిన వారు తొందరపాటుతో కూడిన మాటలు మాట్లాడతారు.
మంచి గుణాలు కలిగిన వారు అలా ఉండరు.

8. ఆ. హీనుడెన్ని విద్య లిలను నేర్చినగాని
ఘనుడు కాడు హీన జనుడె కాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌ
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం : పరిమళాలు మోసినంత మాత్రాన గాడిద గొప్పదౌతుందా ? అలాగే హీన ప్రవర్తన కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా గొప్పవాడు కాలేడు.

9. *శా. నీతిప్రౌఢవిహారులైన నిపుణుల్ నిందింపనీ మెచ్చనీ
ఖ్యాతింజెందిన సంపదల్ నిలువనీ గాఢంబుగా సాగనీ
ఘాతం బప్పుడ పొందనీ నియతిమైఁ గానీ యుగాంతంబునన్.
నీతిశ్లాఘ్యపదంబు దప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్

భావం : నీతిమంతులు వారిని ఎవరైనా నిందించినా, మెచ్చుకున్నా, సంపదలున్నా, లేకపోయినా అప్పుడే మరణం సంభవించినా, యుగాంతం సంభవించినా, ధీరులు ఎప్పుడు నీతిమార్గం నుండి తొలగరు.

10. సీ. తల్లి గర్భమునుండి ధనముఁ దేఁడెవ్వఁడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని,
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె గాని
కూడఁబెట్టిన సొమ్ముఁ గుడువఁబోడు
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి,
దానధర్మము లేక దాఁచి దాఁచి

భావం : తల్లిగర్భం నుండి ధనమెవ్వడూ తీసుకురాడు. చనిపోయినపుడు వెంటరాదు. లక్షాధికారి అయినా ఉప్పు మెతుకులే కాని మేలిమి బంగారం మింగలేడు. డబ్బు సంపాదించి విర్రవీగడమేగాని, ఆ సొమ్ముని అనుభవించ లేడు. బాగా రహస్యంగా భూమిలో దాచే ధనం చివరకు దొంగలపాలు, రాజుల పాలవుతుంది. తేనెటీగలు కష్టపడి తేనెను బాటసారులకు ఇచ్చినట్లవుతుంది.

Leave a Comment