AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material గద్య భాగం 4th Lesson కలవారి కోడలూ కలికి కామాక్షి Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material 4th Lesson కలవారి కోడలూ కలికి కామాక్షి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లోని గ్రామీణ సంస్కృతిని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి అన్నది జానపద బాణీలో సాగిన పాట. ఇది ఒకనాటి గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. అత్తాకోడళ్ళు, తోటికోడళ్ళు, వదినామరదళ్ళు వారి మధ్య పెను వేసుకున్న బంధాలు, చిన్న చిన్న ఆరళ్ళు, అలకలు, చతురోక్తులు, ఒదిగి వుండటాలు, ఎగిరి పడటాలు ఇలాంటివన్నీ ఎంతో హృద్యంగా ఉండేవి. ఇవన్నీ నాటి తరానికీ నేడు మిగిలిన మధుర జ్ఞాపకాలు.

ఈ పాటలో పాతకాలపు సంపన్నమైన తెలుగు ఉమ్మడి కుటుంబం తాలూకా కట్టుబాట్లు, నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, చిత్రించబడి ఉన్నాయి. వెనకటి రోజుల్లో కలవారంటే పంటచేలు, పైరుపచ్చ, గొడ్డు గోదా ఎడతెగని పాడి ఉన్నవారని లెక్క గ్రామీణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన చుట్టానికి గుమ్మంలోనే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళివ్వటం ఆచారం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న కోడలిని చూడటానికి ఆమె పుట్టింటివారు అరుదుగా వస్తారు. ఇప్పటిలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవటం, పుట్టింటి వారు వచ్చెయ్యటం నాడు లేదు. అన్నను చూడగానే కామాక్షి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

బిడ్డ పుట్టాక ఏడాది లోపల పురిటి మంచాన్ని చూడటం ఒక ఆచారం పుట్టింట్లో పురుడు పోసుకుని, అత్తవారింటికి బిడ్డతో వచ్చిన స్త్రీని, ఏడాది లోపల తండ్రో, అన్నలో వచ్చి పురిటి మంచం చూడటానికి పుట్టింటికి తీసుకువెళ్ళాలి. కామాక్షి అన్నయ్య ఇందుకోసమే వస్తాడు. వస్తూ పల్లకి కూడ తెస్తాడు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

అత్తవారింట్లో, ఉమ్మడి కుటుంబంలో ఉన్న స్త్రీ, పుట్టింటికి వెళ్ళాలంటే అది తేలికైన విషయం కాదు. ముందు అత్తగారిని అనుమతి అడగాలి. మామగారిని కాదు. తెలుగు వారిలో అత్తవారిల్లు అంటాం కాని మామగారిల్లు అనం. ఇంటి పెత్తనం, యజమానిగా ఉండటం అంతా మామగారిదే అయినా అత్తగారిల్లే అంటాం. కోడళ్ళను ఆరళ్ళు పెట్టినా, అవసరమైనపుడు అనునయించినా అత్తగారే చేస్తుంది.

ముందు అత్తగారి అనుమతి తీసుకున్నాక, మామగారినడగాలి. తరవాత బావగారిని, తోటికోడలుని అడగాలి. ఆ తరవాత చివరగా భర్త అనుమతి పొందాలి. ఇంకా ఆడబడుచులు, మరుదులు ఉంటే వారి అనుమతి పొందాలి. కామాక్షి అందరినీ, పుట్టింటికి పంపమని అనుమతి అడుగుతుంది.

తోటికోడళ్ళు మధ్య అసూయలు, పనుల విషయంలో వంతులు ఉండటం సహజం. కాని, వారి మధ్య ఆప్యాయతలు, అనురాగాలు కూడ ఉంటాయి. ఇంటికి పెద్దకోడలు అయిన స్త్రీ, తరువాత కోడళ్ళుగా వచ్చిన వాళ్ళకు ఇంట్లో వారి స్వభావాలు, ఎవరెవరితో ఎలా మాట్లాడవలసి ఉంటుంది వంటి విషయాలు తన అనుభవంతో చెపుతుంది. కామాక్షికి వాళ్ళ తోటికోడలు అలాగే చెపుతుంది.

ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రతి యింటా వ్యవసాయమే ప్రధానంగా ఉండేది. ఇంటికి పెద్ద అయిన వ్యక్తి పిల్లలు ఎదిగి వచ్చే దాకా వ్యవసాయం చేసి, తరువాత బాధ్యతలు వారికి అప్పజెప్పేసి అవసరమైన సలహాలు ఇస్తూ వుంటాడు.

ఇప్పుడు లేవుగాని ఆ రోజుల్లో సంపన్నులైన వారి ఇళ్ళలో పట్టెమంచాలు ఒకటో రెండో సాధారణంగా ఉండేవి. అవి ఠీవికి, సంపదకూ, గౌరవానికి గుర్తుగా భావించ బడేవి.

జానపద గేయాల్లో ఎంతో గ్రామీణ సంస్కృతి వ్యక్తమవుతుంది.

ప్రశ్న 2
‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లోని సారాంశాన్ని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి ఒక జానపదగేయం. ఉమ్మడి కుటుంబంలోని కట్టుబాట్లు నమ్మకాలు, ఆచారాలు అలవాట్లు ఈ పాటలో చక్కగా ప్రతిబింబించాయి.

కామాక్షి కలవారి కోడలు’ అనటంలో ఆమె పుట్టింటి వారు పేదవారై వుంటారని సులభంగానే అర్థమవుతుంది. కామాక్షి అత్తగారువాళ్ళు చాలా సంస్కార వంతులు. లేనింటి పిల్ల అని తక్కువగా చూడలేదు. ఆమె అందాన్ని చూసి కోడలుగా తెచ్చుకున్నారే గాని, ఆస్తులు, అంతస్తులు చూసి కాదు.

కామాక్షికి వాడిన కలికి అనే విశేషణం వల్ల కామాక్షి అందాల బొమ్మ అని తెలుస్తోంది.

పురిటి మంచం చూడటానికి, కామాక్షి పెద్దన్నయ్య ఆమెను పుట్టింటికి తీసుకు వెళ్ళటానికి వస్తాడు. అప్పుడు కామాక్షి పప్పు కడుగుతోంది. గబగబా చేతులు కడుక్కుని అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. నీళ్ళిస్తుంటే ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి అన్న గమనించాడు. ఆ కన్నీళ్ళకెన్నో అర్థాలు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

చెల్లెలి కంటతడి చూసిన అన్న గుండే కరిగింది. పేద యింటి పిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతోందో అని ఆరాట పడిపోయాడు. ‘తన ఉత్తరీయపు కొంగుతో కళ్ళు తుడిచాడు. పుట్టింటికి ప్రయాణం కమ్మన్నాడు. పల్లకి తెచ్చాడు.

ఇంట్లో అందరూ తలో విధంగా కామాక్షి అన్నను పలకరించారు. వియ్యంకుడు అంటే కామాక్షి తండ్రి రానందుకు మామగారు రుసరుసలాడారు. ఎవరో ఒకరు వచ్చినందుకు అందరూ సంతోషించారు.
కామాక్షి అన్న తను వచ్చిన పని చెప్తాడు. ఆచారాన్ని పాటించటం కోసం అతను రావటం చూసి అందరూ సంతోషించారు.

కామాక్షి వినయంగా అత్తగారిని తన అన్న వచ్చాడు పుట్టింటికి పంపమని అనుమతి అడిగింది. ఆమె మనసులో మురిసిపోతూ మామగారిని అడగమంది అలా అనటంలో ఆమె అనుమతి, అంగీకారం కామాక్షికి ఆనందాన్ని కలిగించాయి.

కామాక్షి’ మామగారిని అడిగింది. ఆయన బావగారిని అడగమన్నాడు. అంటే మామగారి అనుమతి లభించినట్లే! కామాక్షి బావగారిని అడిగింది. అడుగుతున్నప్పుడు తల్లిలాంటి తోటికోడలు గుర్తు వచ్చి గొంతు గద్గదమైంది. ఆమె, కామాక్షి చేసిన చిన్న. చిన్న పొరపాట్లు కప్పి పుచ్చి, రహస్యంగా తనకు బుద్ధులు చెప్పిన తల్లి.

ఆమె కామాక్షితో నీ భర్త నడుగమంటుంది. స్నేహితుల మధ్యలో ఉన్న భర్తను సైగ చేసి పిలిచి అడిగింది. అతడు చాలా సరదా మనిషి, నగలు పెట్టుకుని, సుఖంగా పుట్టింటికి వెళ్ళుమంటాడు. కామాక్షి పల్లకిలో వెళుతుంటే ఎల్లుండీ పాటికి నేను మీ పుట్టింట్లో ఉంటాను ఎందుకు , బెంగ అని కూడ అనుంటాడు.

ఈ పాటలో చెప్పిన విషయాలెనోన్నాయి. చెప్పకుండా మన ఊహకు వదిలినవీ ఉన్నాయి.

చెప్పినవి క్లుప్తంగా, అందం!! చెప్పటమూ ఉంది.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లోని అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేయండి ?
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షిలోని అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఆదర్శవంతం స్ఫూర్తి’ … వంతం.

కామాక్షి అన్నయ్య గుమ్మం దాటి లోపలికి వచ్చేదాకా కామాక్షి చూడనేలేదు. ఆమె న . . పప్పు కడుగుతోంది. అన్నను చూసీ చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. గబగబ . . వచ్చి అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. ఆమెకు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అన్నకు కనబడకుండా ముఖం పక్కకు తిప్పుకుంది అన్న చెల్లెలిని గమనించాడు.

ఆ కన్నీళ్ళలో ఎన్ని భావాలు దాగివున్నాయో మన ఊహకందవు. ‘తాను బిడ్డ నెత్తుకు అత్తవారింటికి వచ్చి ఇన్ని నెలలైనా వచ్చి చూడలేదేమనే నిష్ఠూరము ఆ కన్నీళ్ళలో ఉంది. ఇంత కాలానికైనా వచ్చాడనే నిస్సహాయమైన తృప్తి కూడ ఆ కన్నీళ్ళలో ఉంది. ఏడాది లోపల పురిటి మంచం చూడాలి. కాబట్టి తననిప్పుడు తీసుకువెళ్ళటానికి వచ్చాడు కాని లేకపోతే ఇప్పుడు వస్తాడా అనే కోపం కళ్ళలో ఉంది. ఏవో పనులుండి నాన్న రాలేకపోయినా చిన్నన్నయ్యలను పంపించకుండా పెద్దన్నయ్యను పంపించటంలోని గౌరవమూ, నిండుతనమూ, అర్థం చేసుకోవటం వల్ల కలిగిన సంతోషమూ కన్నీళ్ళుగా మారింది. ఆ కన్నీటికి కొన్ని అర్థాలున్నాయి.

చెల్లెలి కంటతడి చూసి అన్న గుండె కరిగింది. పేద ఇంటి పిల్ల. కలవారింట్లో ఎన్ని . కష్టాలు పడుతున్నదో అని ఆరాటపడుతూ చెల్లెల్ని దగ్గరకు తీసుకుని తన ఉత్తరీయపు కొంగుతో కన్నీళ్ళు తుడిచాడు. ఓదార్చి పుట్టింటికి ప్రయాణం అవమన్నాడు. పల్లకి తెచ్చాడు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

ప్రశ్న 2.
‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లోని అత్తాకోడళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి లోని అత్తాకోడళ్ళ అనుబంధం హృద్యంగా ఉంటుంది.

తెలుగు వారికి అత్తవారిళ్ళే కాని మామగారిళ్ళు లేవు. ‘కోడళ్ళను ఆరళ్ళు పెట్టేది. అవసరమైనప్పుడు అనునయించేది అత్తగారే! అల్లుళ్ళకి పెట్టుపోతలు జరిపేది అత్తగారే! కామాక్షి అన్నతో పుట్టింటికి వెళ్ళటానికి మొదట అత్తగారినే అనుమతి అడిగింది. మామగారిని కాదు.

వినయంగా, భయంగా కామాక్షి కుర్చీపీట మీద కూర్చున్న అత్తగారిని అన్నతో తనను పుట్టింటికి పంపమని అనుమతి అడిగింది. అత్తగారు .లోలోపల మురిసిపోయింది. మీ మామనడుగమంది. అంటే అత్తగారి అనుమతి దొరికినట్లే. , అత్తగారి మాటల్లో అంగీకారము, మర్యాద ఉంది. తనకు సూచన కూడ ఉందని కామాక్షి గ్రహించింది.

అత్తగారంటే కోడలుకు గౌరవం, కోడలంటే అత్తకు గల అభిమానం, ప్రేమ ఈ పాటలో తెలుస్తాయి.

ప్రశ్న 3.
ద్విపద ప్రక్రియ ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేయండి ?
జవాబు:
ద్విపద తెలుగువారి చిరంతనమైన ఆస్తి. తెలుగువారి పల్లెపదాలూ, స్త్రీల పదాల వంటివి ద్విపద గణాలను అటూ ఇటూ మారిస్తేనో, ముందూ వెనకా కొన్నిటిని కత్తిరిస్తేనో, మరికొన్ని చేరిస్తేనో పుట్టేవే. దేశి కవితకు ఒరవడి దిద్దటంలో పాల్కురికి సోమనాథుడు ద్విపదనే అపురూపంగా ఎన్నుకున్నాడు.

ద్విపద సామాన్యులకు కూడ సులభంగా అర్థమయ్యే చక్కని ఛందస్సు. చిరకాలంగా తెలుగువారు తమ సంతోషాలు, కష్టాలు, ఆనందాలు కన్నీళ్ళు ద్విపదలోనే చెప్పుకున్నారు. కలవారి కోడలు కలికి కామాక్షి పాటలో కూడ ద్విపద ఛందస్సే ఉంది.

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

ప్రశ్న 4.
యస్వీ భుజంగరాయశర్మ జీవిత విశేషాలను తెలపండి ?
జవాబు:
యస్వీ భుజంగరాయశర్మ ఉత్తమ అధ్యాపకులు. తమ విద్యాబోధన ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.

వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వున్న కొల్లూరు గ్రామంలో 15-12-1925న జన్మించారు. రామలక్ష్మమ్మ, రాజశేఖరం వీరి తల్లిదండ్రులు. వీరు స్వగ్రామంలోను, నెల్లూరు వి.ఆర్.కళాశాలలోను, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటిలోను విద్యనభ్య సించారు. కొంతకాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పని చేశారు.

తెలుగు సాహిత్యం , తెలుగు సంస్కృతికి సంబంధించి వీరు అనేక వ్యాసాలు, కవితలు, నృత్య నాటికలు రచించారు. వీరు 7-8-1997న కన్ను మూశారు.

ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కలవారి కోడలు కలికి కామాక్షి పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి పాఠ్యభాగ రచయిత యస్వీ భుజంగరాయశర్మ. .

ప్రశ్న 2.
కలవారి కోడలు పేరేమి ?
జవాబు:
కలవారి కోడలు పేరు కామాక్షి.

ప్రశ్న 3.
కలవారంటే ఎవరు ?
జవాబు:
కలవారంటే పంటసిరి ఉన్నవారు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

ప్రశ్న 4.
కామాక్షి పెద్దన్నయ్య తనతో పాటు దేనిని వెంట బెట్టుకు వచ్చాడు ?
జవాబు:
కామాక్షి పెద్దన్నయ్య తనతో పాటు మేనాని వెంట బెట్టుకు వచ్చాడు.

ప్రశ్న 5.
పురుడు పోసుకున్న ఆడపడుచు ఏడాది లోపల మళ్ళీ దేన్ని చూడాలి ?
జవాబు:
పురుడు పోసుకున్న ఆడపడుచు ఏడాది లోపల పురిటి మంచాన్ని చూడాలి.

ప్రశ్న 6.
కుర్చీ పీట మీద కూర్చున్న వారెవరు ?
జవాబు:
కుర్చీ పీట మీద కూర్చున్న వారు కామాక్షి అత్తవారు.

ప్రశ్న 7.
కామాక్షి బావగారు చదువుతున్న గ్రంథం ఏమిటి ?
జవాబు:
కామాక్షి బావగారు చదువుతున్న గ్రంథం భారతం.

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

ప్రశ్న 8.
దేశి కవితకు ఒరవడి దిద్దింది ఎవరు ?
జవాబు:
దేశి కవితకు ఒరవడి దిద్దింది పాల్కురికి సోమనాథుడు.

ప్రశ్న 9.
పాల్కురికి సోమనాథుడు ఏ కవితా ప్రక్రియను ఆదరించాడు ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు ద్విపద కవితా ప్రక్రియను ఆదరించాడు.

రచయిత పరిచయం

యస్వీ భుజంగరాయశర్మ గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర ఉన్న కొల్లూరు గ్రామంలో 15-12-1925న జన్మించారు. రామలక్ష్మమ్మ, రాజశేఖరం వీరి తల్లిదండ్రులు. వీరు కొల్లూరులోను, నెల్లూరు వి. ఆర్. కళాశాలలోను, విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను చదువు సాగించారు.

కొంతకాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆ తరువాత కావలి జవహర్ భారతి కళాశాలలో అధ్యాపకులుగా చేరి, చాలాకాలం అక్కడే పనిచేశారు. విద్యాబోధన ద్వారా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఉత్తమ అధ్యాపకులు ఎస్.వి. భుజంగరాయశర్మ గారు.

భుజంగరాయశర్మ గారు పద్యాన్ని గొప్పగా పాడి వినిపిస్తారని, పాఠం గొప్పగా బోధిస్తారని పేరు పొందారు. తెలుగు సాహిత్యం , తెలుగు సంస్కృతికి సంబంధించి వీరు అనేక వ్యాసాలు, కవితలు, నృత్య నాటికలు రచించారు. వ్యాసానికి ఎంపిక చేసుకున్న వస్తువు, దానిని విశ్లేషించిన తీరు ఎంతో ఉదాత్తంగా ఉండటం వీరి రచనల్లో విశిష్టత. ఈ కవి .07-08-1997న కీర్తిశేషులయ్యా రు.

పాఠ్యభాగ సందర్భం

‘కలవారి కోడలు కలికి కామాక్షి’ అనే ప్రస్తుత పాఠ్యభాగం ‘అక్షర’ (డి.’ ఆర్. అభినందన సంపుటి, కావలి) నుంచి స్వీకరించబడినది. ఇది ఒక జానపద గేయం. ఈ పాట వెనకతరాలకు సుపరిచితమైనదే! ఈ పాట గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. ఇంట్లో నవారు మంచాలు. వీధి అరుగులు, గ్రామాలలో రచ్చబండలు ఉన్న ఒకనాటి పల్లె సంస్కృతిని ఈ పాట ఆవిష్కరిస్తుంది. ఈ పాట ఆధారంగా భుజంగరాయశర్మ రచించిన వ్యాసం ఈ పాఠ్యభాగం.

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

ఈనాడు చదువులు, ఉద్యోగాలు ఇంకా అనేక కారణాల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరిస్తోంది. ఆ కుటుంబ సంబంధాలు, ఆ మనుషుల మధ్య ఉండే ప్రేమలూ, ఆప్యాయతలు, గౌరవాలు ఇప్పుడు కనిపించటం కష్టం. అత్తా కోడళ్ళు, తోటి కోడళ్ళు, వదినా మరదళ్ళు వారి మధ్య పెనవేసుకున్న ఆత్మీయతాబంధాలు, చిన్న చిన్న ఆరళ్ళూ, అలకలూ, చతురోక్తులు, ఎగిరి పడటాలు, ఒదిగి వుండటాలు వంటివి ఎంతో హృద్యంగా ఉంటాయి. అవన్నీ మధురమైన జ్ఞాపకాలు. వీటన్నింటినీ ఇప్పుడు మనం పొందగలిగినా, పొందలేకపోయినా, జీవితంలో మనం ఏం పోగొట్టుకున్నామో నేటి తరానికి తెలియ జేయటం. ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం భుజంగరాయశర్మ ‘గారు రెండో తరగతి తెలుగు వాచకంలో జానపదుల పాట చదివారు. అప్పటి నుండి అప్పుడప్పుడూ అది జ్ఞాపకం వచ్చి ఆయన్ను మరో లోకంలోకి తీసుకుపోతోంది. సహజంగా జానపదుల పాటలమీద ఉండే యిష్టం వల్లనో, ఆ పాటలో పాతకాలపు సంపన్నమైన తెలుగు ఉమ్మడి కుటుంబం – తొలూక కట్టుబాట్లు, నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు చిత్రించబడి ఉండడం వల్లనో ఆ పాట గుర్తొచ్చినప్పుడల్లా రచయితకు శరీరం పులకిస్తుంది.

ఈ పాఠంలో కథ రేఖా చిత్రంలా ఉంది. ఎన్నో పదాలూ, వ్యాఖ్యలూ ‘చేర్చుకుని దానిని వర్ణచిత్రంగా మార్చుకోవాలి. అప్పుడది సజీవంగా బొమ్మకడుతుంది మనసుకు.

కామాక్షి కలవారి కోడలు అనటం వల్ల ఆమె పుట్టింటి వారు పేదవారై ఉంటారని అర్థమవుతుంది. లేనివారితో ఉన్నవారు వియ్యమందటం అరుదుగా జరుగుతూ . . . . వుంటుంది. కాని, కామాక్షి అత్తగారు చాలా సంస్కారవంతులు. ఆ పిల్ల అందాన్ని .. చూసి కోడలుగా తెచ్చుకున్నారే గాని ఆస్తులూ, అంతస్తులూ చూసి కాదు.

కలికి అనే పదం వాడటం వల్ల కామాక్షి అందాల బొమ్మ అని తెలుస్తుంది. కలవారంటే పంట సిరి కలవారనే అర్థం. ఆ రోజుల్లో డబ్బు’ లెక్కకాదు. పంటచేలూ, పైరు పచ్చా, గొడ్డుగోదా, ఎడతెగని పాడీ, ఇవే సంపద.

పెద్దన్నయ్య వచ్చే సమయానికి కామాక్షి పప్పు కడుగుతోంది. గుమ్మం దాటి లోపలికి వచ్చే దాకా అన్నను చూడలేదు. అన్నను చూసీ చూడగానే ప్రాణం లేచి వచ్చింది. కడవ అక్కడే వదిలేసి, అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ళకు నీళ్ళిచ్చి ముఖం పక్కకు తిప్పుకున్న చెల్లెలి కళ్ళను అన్న గమనించక పోలేదు. ఆ కన్నీళ్ళలో ఎన్నో భావాలు దాగి ఉన్నాయి.

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

చెల్లెలి కంటతడి చూసిన అన్న గుండె కరిగింది. పేద ఇంటి పిల్ల. కలవారింట్లో . ఎన్ని కష్టాలు పడుతోందో అని ఆరాట పడిపోయాడు. చెల్లెల్ని దగ్గరకు తీసుకుని తన ఉత్తరీయపు కొంగుతో కన్నీళ్ళు తుడిచాడు. పుట్టింటికి ప్రయాణం కమ్మన్నాడు. పల్లకిని . – కూడ తెచ్చాడు. పల్లకిని దింపిన బోయీలు బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు.

అన్నను లోపలికి తీసుకువెళ్ళింది కామాక్షి. అందరూ పలకరించారు. ‘కామాక్షి తండ్రి రానందుకు మామగారు రుసరుసలాడారు. మొత్తానికి ఎవరో ఒకరు వచ్చినందుకు అందరూ సంతోషించారు.

పురుడు పోసుకున్న ఆడపడుచు ఏడాది లోపల పురిటి మంచాన్ని చూడటం ఆచారం. ఈ ఆచారాన్ని పాటించి చెల్లెల్ని తీసుకు వెళ్ళటానికి అన్న రావటం అందరికీ ఆనందం కలిగించింది.

కామాక్షి అత్తగారికి అల్లంత దూరంలో వినయంగా నిలబడి
‘కుర్చీపీట మీద కూర్చున్న అత్త’
మా అన్నలొచ్చారు మమ్మంపుతార?”

అనడిగింది మామగారు అక్కడే ఉన్నారు కాని ముందు మామగారినడగలేదు అత్తగారినే అడిగింది కామాక్షి. తెలుగు వారిలో అత్తగారిళ్ళేకాని మామగారిళ్ళు లేవు.

అత్తగారు లోలోపల మురిసిపోయి మామగారి నడగమంది.

పుట్టింటికి వెళ్ళటానికి అత్తగారి అనుమతి దొరికినందుకు కామాక్షి అత్తగారికి లోలోపలే దణ్ణం పెట్టుకుంది.

మామగారి దగ్గరకు పోయి
పట్టె మంచము మీద పడుకున్న మామ
మా అన్నలొచ్చారు మమ్మంపుతార అనడిగింది.

మామగారు వ్యవసాయ బాధ్యతలన్నీ కొడుకులకప్పగించి విశ్రాంతిగా పట్టె మంచమెక్కి పడుకుని ఉన్నాడు.

ఆయన బావగారినడగమన్నారు.
మామగారి అనుమతి దొరికినట్లే అని భావించి
భారతం చదివేటి బావ పెదబావ
మా అన్నలొచ్చారు మమ్మంపుతార’

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

అంది తోటికోడలు కామాక్షికి తల్లి లాంటిది. కొత్తలో తనకు ఎవరితో ఎలా మెలగాలో చక్కగా చెప్పింది. ఆమెను వదిలి పుట్టింటికి వెళుతున్నందుకు కామాక్షికి బాధగా ఉంది.

అక్కగారు కామాక్షితో మీవారి నడుగమంటుంది.
స్నేహితుల మధ్యలో ఉన్న భర్తకు సైగ చేసి కామాక్షి అనుమతి అడుగుతుంది.
అతడు చాలా సరదా మనిషి.
పెట్టుకో సొమ్ములు, కట్టుకో చీరలు
పోయిరా సుఖముగా పుట్టింటికి’ అంటాడు.

కామాక్షి బిడ్డ నెత్తుకుని మేనాలో కూర్చున్నప్పుడు ఎల్లుండిపాటికీ నేను మీ పుట్టింట్లో ఉంటాను. ఎందుకు బెంగా’ అని కూడ అనుంటాడు.

ఈ పాటలో చెప్పిన విషయాలెన్ని ఉన్నాయో చెప్పనివి కూడ అన్ని ఉన్నాయి. ‘ చెప్పనివి మనకు ఊహకు వదిలిని జాడలున్నాయి చెప్పినవి క్లుప్తంగా, అందంగా ఉన్నాయి.

చిరకాలంగా తెలుగువారు తమ సంతోషాలు, కష్టాలు, ఆనందాలు ద్విపదలోనే చెప్పుకున్నారు. ఈ కథ కూడ ద్విపదలోనే నడిచింది. ద్విపద తెలుగువారి చిరంతనమైన ఆస్తి.

కఠిన పదాలకు అర్ధాలు

వెర్రి యిష్టం = బాగా యిష్టం
ఉమ్మడి కుటుంబం = అమ్మనాన్నలు, కొడుకులు,కోడళ్ళు అందరూ కలిసి ఉండే కుటుంబం
వర్ణ చిత్రం = రంగుల చిత్రం
కడవ = కుండ
వియ్యమందటం = సంబంధం కలుపుకోవటం
కలికి = అందాల బొమ్మ
పంటసిరి = వ్యవసాయ సంపద
పైరుపచ్చా = పచ్చని పొలాలు
గొడ్డు గోదా = పశు సంపద
అందలము = పల్లకి
మేనా = పల్లకి
పరామర్శలు = పలకరింపులు
ఆహ్లాదం = సంతోషం
ఒదిగినిలబడు = వినయంగా నిలబడు

AP Inter 1st Year Telugu Study Material Chapter 4 కలవారి కోడలూ కలికి కామాక్షి

ఆరళ్ళు = కష్టాలు
పట్టె మంచము = నవారు మంచం
రికామిగా = ఖాళీగా, పనిలేకుండ
సేద్యప్పనులు = వ్యవసాయపు పనులు
వ్యాస పీఠం = రామాయణ మహాభారతాది గ్రంథాలు పెట్టుకుని చదువుకునే చెక్కపీఠం
గద్గదం = దు:ఖంతో పూడుకు పోవటం
సంజ్ఞ = సైగ
కలకలం = సందడి
జాడలు = గుర్తులు
చిరంతనమైన = శాశ్వతమైన

Leave a Comment