Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material గద్య భాగం 3rd Lesson మహిళోద్యమ జనకుడు : కందుకూరి Textbook Questions and Answers, Summary.
AP Inter 1st Year Telugu Study Material 3rd Lesson మహిళోద్యమ జనకుడు : కందుకూరి
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వారు చేసిన కృషిని తెలుపండి.
జవాబు:
కందుకూరి వారి సంఘ సంస్కరణ కార్యకలాపాలన్నీ స్త్రీల సమస్యలతో ముడిపడి వున్నవే. తన వనరులను శక్తి యుక్తులను అంటే మానసిక భౌతిక శక్తులను, ద్రవ్యాన్ని చివరకు ప్రాణాన్ని సైతం స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తానని వారు సత్యవాది పత్రికలో ప్రకటించారు. బాల వితంతువుల దీన స్థితి, అవిద్య, మూఢ విశ్వాసాల నిర్మూలన, స్త్రీలు సభలలోకి రాకూడదు వంటి సాంఘిక నియమాలు లాంటి సమస్యలను పరిష్కరించటానికి ఆయన పూనుకున్నారు.
కందుకూరి సంస్కరణల్లో శాశ్వత చరిత్ర గలది స్త్రీ జనోద్ధరణ. అందుకే వారిని మహిళోద్యమ జనకులు, మహిళాభ్యుదయ పితామహుడు అని అభినందించటం అతిశయోక్తి కాదు. వారు కన్యాశుల్కాన్ని వ్యతిరేకించారు. ఆనాడు అతినిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను బలపరచారు. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలోను బాలికా పాఠశాలలను స్థాపించారు. ముందుగా తన భార్యకు విద్య నేర్పి ఆమెనొక ఉపాధ్యాయినిగా తయారు చేశాడు. ఆచరించి ప్రబోధం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.
శాస్త్రాల ఆధారంతో బాల్య వివాహాలను నిరసించాడు. బాల్య వివాహ నిషేధ శాసనం కావాలని ఆందోళన జరిపించాడు. కందుకూరి వితంతువులకు వివాహాలు చేయటానికి అయిదుగురు అనుచరులతో 1879లో రాజమండ్రిలో వితంతు వివాహ సంఘాన్ని స్థాపించాడు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు ఆశ్రమాలు నెలకొల్పాడు. పునర్వివాహితులకు పురుళ్ళు పోశాడు.
వీరు, 11-12-1880 సం||లో రాజమండ్రిలో అర్ధరాత్రి వధువును రహస్యంగా తెచ్చి ప్రథమ వితంతు వివాహాన్ని జరిపించారు. సనాతనులు కందుకూరిని బహిష్కరించారు. పీఠాధిపతులు ఆంక్షలు విధించారు. రాజమండ్రిలో, మద్రాసులో వితంతు వివాహ వ్యతిరేక సంఘాలు వెలిశాయి. అయినా మొక్కవోని ధైర్యంతో కందుకూరి వారు పైడా రామకృష్ణయ్య ఆర్థిక తోడ్పాటుతో 1884 నాటికి 10 పెళ్ళిళ్ళు చేశారు.
భోగం మేళాల నిషేధానికి కందుకూరి ఎన్నో పాట్లు పడి మార్గ దర్శకులయ్యారు.
సంస్కృతి పేరుతో భోగం మేళాలను, . భోగపు స్త్రీలను ఆదరించిన పెద్దలపై తన హాస్యాన్ని కుమ్మరిస్తూ ఎగతాళి చేశారు.
19వ శతాబ్దంలో మహిళా ఉద్యమం స్త్రీలకు న్యాయం కావాలనే భావంతో ఉదయించింది. కందుకూరి కృషితో బాల వితంతువుల పట్ల జాలి, కరుణ, స్త్రీ విద్య పట్ల అభిమానం ఆనాడు వెల్లివిరిశాయి. ఆ కాలంలో ప్రజల మానసిక క్షేత్రాలలో ఈ భావాల విత్తనాలు నాటిన మహనీయుడు. మహిళోద్యమ జనకుడు కందుకూరి వీరేశలింగం.
ఈనాడు సభలలో – స్త్రీ పురుషుల సభలలో మహిళలు పాల్గొంటున్నారంటే దానికి కారణ భూతుడు కందుకూరి. తను ఏర్పాటు చేసిన సభలలో పురుషులు తమ సతీమణులతో, తల్లులతో, అక్కచెలెళ్ళతో రావాలని నియమం పెట్టారు. అది ఆనాటికి గొప్ప విప్లవ చర్య. ఆయన మాటననుసరించి పురుషులు అలాగే స్త్రీలతో వచ్చేవారట. కందుకూరి స్త్రీ జనోద్ధరణ కాలం పందొమ్మిదో శతాబ్దం అని గుర్తు పెట్టుకుంటే గాని దాని ప్రాముఖ్యం గోచరించదు.
ప్రశ్న 2.
పంతులుగారు పత్రికల ద్వారా సంఘ చైతన్యానికి చేసిన కృషిని వివరించండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగంగారు సత్యవాది, చింతామణి, వివేక వర్ధని అనే మూడు పత్రికలను స్థాపించి తద్వారా సంఘంలో చైతన్యానికి దోహదం చేశారు.
తన శక్తి యుక్తులను, భౌతిక మానసిక శక్తులను ద్రవ్యాన్ని చివరకు తన ప్రాణాన్ని స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తానని కందుకూరి వారు ‘సత్యవాది’ పత్రికలో ప్రకటించారు.
‘స్త్రీలు విద్యకు తగరు’ అని వ్యతిరేకులు అన్నప్పుడు ‘పురుషులు విద్యకు తగరు’ అని ఎగతాళి చేస్తూ వీరు ‘వివేక వర్ధని’ లో రాశారు.
దేవదాసీల గురించి వ్యభిచార వ్యక్తిని గురించి తన పత్రికలైన వివేక వర్ధని, చింతామణి, సత్యవాదిలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించటం వల్ల ఈ వృత్తి పై ప్రజలలో జుగుప్స కలిగింది. ఆయన స్థాపించిన వివేక వర్ధని చాలా కాలం నిరాటంకంగా పని చేసింది.
తను స్థాపించిన పత్రికలను సంఘ చైతన్యం కోసమే వీరేశలింగం వినియోగించారు. తరతరాలుగా ప్రజల మనసుల్లో మూఢ నమ్మకాల రూపంలో పాతుకుపోయిన భావాలను పత్రికలలో తన వ్యాసాల ద్వారా మార్చటానికి వీరేశలింగంగారు ఎంతో కృషి చేశారు. పత్రికలను నడపటానికి ఎన్నో వ్యయ ప్రయాసలు కోరారు.
కందుకూరి మహా నిరాడంబర జీవి తన కోసం ఖర్చుల విషయంలో ఆయనది పిసినారి దృష్టి. తనకున్నదంతా పత్రికల నిర్వహణ, సంఘ సంస్కరణ కార్యక్రమాలకే వినియోగించిన వితరణ శీలి.
వీరు తన పత్రికల్లోనే కాక ఇతర పత్రికల్లోను అనేక వ్యాసాలు రచించారు. తన పత్రికలను సంఘ సంస్కరణకు ప్రధాన సాధనంగా చేశారు. పత్రికలలో సృజనాత్మక రచనలు చేశారు. చర్చా వేదికలు నిర్వహించారు.
వీరేశలింగం గారు తాను పత్రికలలో రాసిన వ్యాసాలను ఉపన్యాసం అనే పేరుతో పిలిచారు. అయితే తరవాత ఈ పదం ఎక్కువ కాలం వ్యవహారంలో లేదు.
పత్రికలను సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించాలో, పత్రికల ద్వారా సంఘ చైతన్యం ఎలా తీసుకురావచ్చో వీరేశలింగం తన పత్రికల ద్వారా తెలియబరిచారు.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కందుకూరి రచనలను తెల్పండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ సంక్షేమం కోరే ఆరు ఉత్తమ స్త్రీ చరిత్రలు రాశారు. ప్రహసనాలను రాసి సనాతన ఛాందస ఆచారాలను ఎగతాళి చేశారు. సత్యవతీ చరిత్ర లాంటివి పదమూడు స్త్రీల కథలు రచించి అందులో ఆనాటి స్త్రీల దీనస్థితి వర్ణించారు. ఆరోగ్య ప్రబోధం కోసం శరీర శాస్త్రంపై గ్రంథం వ్రాశాడు. సమాజంలో పేరుకొని పోయిన అవినీతిని తన రచనల ద్వారా బైట పెట్టాడు.
కందుకూరి తన పత్రికలైన వివేక వర్ధని, చింతామణి, సత్యవాదిలలో దేవదాసీల గురించి, వ్యభిచార వృత్తి గురించి అనేక వ్యాసాలు రాశారు.
తన జీవితానుభవాలు, సమకాలీన సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తూ కందుకూరి స్వీయచరిత్రను రచించారు. అనేక నాటకాలను, ప్రహసనాలను రచించారు. కందుకూరి రచించిన రాజశేఖర చరిత్ర మొదటి నవలగా చెప్పబడుతోంది. ఎన్కో అనువాద నాటకాలు రచించారు. ఈయన చేపట్టని ప్రక్రియ లేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేశారు.
కేవలం మెట్రిక్యులేషన్ చదువుతో 150 రచనలు చేసిన సాహితీ పిపాసి, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న ఘనుడు కందుకూరి.
ఆరుద్ర గద్య తిక్కన అని కందుకూరిని ప్రశంసించారు.
ప్రశ్న 2.
కందుకూరి సంస్కరణలను వివరించండి.
జవాబు:
కందుకూరి బాల్యవివాహాలను నిర్మూలించటం, వితంతువులకు పునర్వివాహం జరిపించటం, స్త్రీలకు విద్య మొదలైన విషయాలకు సంబంధించి సంస్కరణలకు పూనుకున్నారు. ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను కందుకూరి ప్రోత్సహించాడు. శాస్త్రాల ఆధారంతో బాల్యవివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండించారు.
కన్యాశుల్క విధానాన్ని ఘాటుగ విమర్శిస్తూ కందుకూరి దానిని నరమాంస విక్రయంగా అభివర్ణించారు. బాల్యవివాహ నిషేధ చట్టం కావాలని ఆందోళన జరిపించారు. వితంతు వివాహాలు చేయటానికి సంఘాలు పెట్టారు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు నివాసాలు ఏర్పరచారు. వితంతు వివాహాలకు అహరహం శ్రమించారు.
కందుకూరి సంస్కరణలలో శాశ్వత చరిత్ర కలది స్త్రీ జనోద్ధరణ. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలో బాలికా పాఠశాలను స్థాపించి, స్త్రీ విద్యను బలపరిచారు. కందుకూరి భోగం మేళాల నిషేధానికి కూడ పడరాని పాట్లు పడి మార్గదర్శకుడైనాడు. వ్యభిచార వృత్తిని ఖండిస్తూ తన పత్రికలైన వివేక వర్ధని, సత్యవాది, చింతామణి పత్రికలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించారు.
ప్రశ్న 3.
మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి.
జవాబు:
నేను ‘ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని తనకు తాను గర్వంగా ప్రకటించుకున్న రచయిత్రి మల్లాది సుబ్బమ్మ. ఈమె ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రిగాను, స్త్రీ హక్కుల ఉద్యమ నేతగాను ప్రసిద్ధి కెక్కారు. ఆంధ్రదేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఈమె చురుకుగా పాల్గొన్నారు. సారాను నిషేధించే వరకూ వీరు విశ్రమించలేదు. ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ ను స్థాపించి ఆమె తన స్థిరాస్తులను తన పిల్లలకు కాకుండా ఆ ట్రస్టుకు రాసిచ్చారు.
సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పదకొండేళ్ళకే వివాహం జరిగిన మల్లాది సుబ్బమ్మ అటువంటి వాతావరణం నుంచి ఒక సామాజిక ఉద్యమకారిణిగా తనను తాను మలచుకోవటం విశేషం తన ఆస్తినంతా సామాజిక సేవకు అంకితం చేశారు.
మల్లాది సుబ్బమ్మగారికెప్పుడైనా మనస్తాపం కలిగితే వీరేశలింగంగారి ఆత్మకథ చదువుతారట. ఒంటరివాడు, అనారోగ్యవంతుడు, కేవలం బడి పంతులు ఒక్కడు అన్ని ఘనకార్యాలు చేస్తూ ధైర్యంగా నిలబడ్డాడంటే మనం ఇలా ఇన్ని సౌకర్యాలుండి ఇలా వ్యధ చెందటం ఎందుకు ? అని అడుగు ముందుకేస్తారట. వీరేశలింగం సంస్కరణల స్ఫూర్తితో వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కందుకూరి వితంతు వివాహ సంఘాన్ని రాజమండ్రిలో ఎప్పుడు స్థాపించారు ?
జవాబు:
కందుకూరి వితంతు వివాహ సంఘాన్ని 1879లో రాజమండ్రిలో స్థాపించారు.
ప్రశ్న 2.
కందుకూరి గద్యతిక్కన అని ఎవరు శ్లాఘించారు ?
జవాబు:
కందుకూరి గద్యతిక్కన అని ఆరుద్ర శ్లాఘించారు.
ప్రశ్న 3.
మల్లాది సుబ్బమ్మ గారు ఎక్కడ జన్మించారు ?
జవాబు:
మల్లాది సుబ్బమ్మ గారు గుంటూరు జిల్లా పోతర్లంకలో జన్మించారు.
ప్రశ్న 4.
కందుకూరి సతీమణి పేరేమిటి ?
జవాబు:
కందుకూరి సతీమణి పేరు రాజ్యలక్ష్మీ.
ప్రశ్న 5.
కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెల్పండి.
జవాబు:
కందుకూరి స్థాపించిన ఒక పత్రిక ‘వివేక వర్ధని’.
ప్రశ్న 6.
నేను ‘ఫెమినిస్టుని, హ్యూమనిస్టుని’ అని ప్రకటించుకున్నది ఎవరు ?
జవాబు:
నేను ‘ఫెమినిస్టుని, హ్యూమనిస్టుని’ అని మల్లాది సుబ్బమ్మ ప్రకటించుకున్నారు.
అశేషాంశాలు
రనెడె – మహదేవ గోవింద రనడె (1842 – 1901) :
భరతజాతి అభివృద్ధికి కృషి చేసిన విద్యావేత్త, సంఘ సంస్కర్త, అర్ధశాస్త్ర ప్రవీణుడు, న్యాయమూర్తి. మహిళాభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు.
పౌలు నియమాలు :
క్రైస్తవ మతానికి చెందిన ప్రముఖుల్లో సెయింట్ పాల్ ఒకరు. ఈతనినే మనం ‘పౌలు’ అని వ్యవహరిస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలుగురించిన వివరాలు పొందుపరిచి ఉన్నాయి.
సెయింట్ పాల్ అనేక ఎఫిసిలను రచించాడు. వీటినే మనం పౌలు ‘లేఖలు’ గా వ్యవహరిస్తున్నాం. ఈ లేఖల్లో అనేక నియమాలను పౌలు ప్రస్తావించాడు. వాటిలో మతస్తులకోసం పెట్టిన నియమాలు కొన్ని అయితే; తన కోసం తాను విధించుకున్న నియమాలు మరికొన్ని. భగవంతుడికి భక్తుడు ఏవిధంగా బాధ్యుడుగా ఉండాలో ఈ నియమాలు తెలియ చేస్తాయి.
అంతేకాక పెద్దవారికీ-చిన్నవారికీ; యజమానికీ – పనివారికీ; తల్లిదండ్రులకూ-పిల్లలకూ; ఆడవారికీ-మగవారికీ; భార్యకూ భర్తకూ మధ్య గల సంబంధాలు ఎలా ఉండాలో, వాటి పరిమితులు ఏమిటో ఈ పౌలునియమాలు స్పష్టం చేస్తాయి. ఒకనాటి మానవ సంబంధాలనూ, ఆ సంబంధాల మధ్య పెన వేసుక్ను విధి విధానాలనూ, అణచివేతలనూ, ఆధిపత్య, అనాధిపత్యాలనూ ఈ పౌలు నియమాలు ఆవిష్కరిస్తాయి.
రచయిత పరిచయం
ఒక సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పదకొండేళ్ళకే పెళ్ళి జరిగిపోయిన స్త్రీ, ఆ సంప్రదాయ వాతావరణం నుంచి తనను తాను సామాజిక ఉద్యమకారిణిగా మలచుకోవటం చాలా గొప్ప విషయం. ఆ మహనీయ వ్యక్తీ మల్లాది సుబ్బమ్మగారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రిగాను, స్త్రీ హక్కుల ఉద్యమ నాయకురాలుగాను మల్లాది సుబ్బమ్మ’ ప్రసిద్ధికెక్కారు. వీరు 2-8-1924 సం||లో గుంటూరు జిల్లా పోతర్లంకలో జన్మించారు. వీరికి ఐదుగురు సంతానం. ఆధునిక స్త్రీ వాద ఉద్యమాలకు రాతల్లోను, చేతల్లోను ఆసరాగా నిలిచిన మహోన్నత స్త్రీ మూర్తి మల్లాది సుబ్బమ్మ.
మల్లాది సుబ్బమ్మ ఆంధ్రదేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర. వహించారు. సారాను నిషేధించే వరకు వీరు విశ్రమించలేదు. ఈమె మల్లాది సుబ్బమ్మ ట్రస్టును స్థాపించి తన స్థిరాస్తులను తన పిల్లలకు కాకుండా ట్రస్టుకు రాసిచ్చారు. దానిని సామాజిక సేవకు అంకితం చేశారు.
నేను ఫెమినిస్టును, హ్యూమనిస్టు ఫెమినిస్టును అని తనకు తాను గర్వంగా ప్రకటించు కున్న రచయిత్రి మల్లాది సుబ్బమ్మ.
మల్లాది సుబ్బమ్మ సుమారు అరవైకు పైగా రచనలు చేశారు. వీటిలో వివాహం నేడు రేపు, మాతృత్వానికి మరో ముడి, హైందవ స్త్రీలు, ‘ మనం-మన సంస్కృతి, హేతువాదం, మూఢ నమ్మకాలు నశించేదెలా వంటి సామాజిక, సాంస్కృతిక విమర్శనా గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఇవే కాకుండా చీకటి వెలుగులు, ఈ దేశం నాదేనా, రుద్రమదేవి వెలిగిన జ్యోతి, కాంతి కిరణాలు వంటి అనేక నవలలు కూడా రచించారు.
స్త్రీ స్వేచ్ఛ అనే మాసపత్రికను స్థాపించి సుదీర్ఘ కాలం నిర్వహించారు. ఈ పత్రిక — ద్వారా స్త్రీల చైతన్యానికి బహుముఖాలుగా కృషి చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, స్త్రీ వాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ 15-5-2014 న కన్నుమూశారు.
ప్రస్తుత పాఠ్యభాగం స్త్రీ స్వేచ్ఛ (అక్టోబరు-నవంబరు 1997) పత్రికలోని మహిళోద్యమ జనకుడు స్త్రీ జనోద్ధారకుడు అనే వ్యాసానికి సంగ్రహ రూపం.
పాఠ్యభాగ సందర్భం
19 వ శతాబ్దంలో రాజమహేంద్రవరం కేంద్రంగా బాల్యవివాహం, వితంతు సమస్య. స్త్రీ విద్య వంటి అనేక విషయాలకు సంబంధించిన సంఘ సంస్కరణోద్యమాల్లో కందుకూరి వీరేశలింగం గారిది ప్రముఖ పాత్ర. రాజమహేంద్రవరం అనగానే గుర్తుకు వచ్చే పేరు ఆయనదే !
సంఘసంస్కర్త. ఆధునిక యుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు రాజమహేంద్రవరంలో 16-4-1848 న జన్మించారు. పున్నమ్మ, సుబ్బారాయుడులు వీరి తల్లిదండ్రులు. వీరు చేపట్టిన సంఘసంస్కరణ కార్యక్రమాలు ఎక్కువగా స్త్రీలకు సంబంధించినవే.
కన్యాశుల్కం, బాల్యవివాహాలను రద్దు చేయటం, వితంతువుల పునర్వివాహం ఇత్యాది సంస్కరణల్లో కందుకూరి ప్రధాన పాత్ర వహించారు. స్త్రీ విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆశయ సాధనలో ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా చలించలేదు. పట్టుదల వదలలేదు.
ఈనాడు ఆడపిల్లలు ఇంత బాగా చదువుకొని ఉన్నత శిఖరాధి రోహిస్తున్నారంటే దాని వెనుక వున్న కందుకూరివారి కృషిని మనం మర్చి పోకూడదు. అమూల్యమైన, అసాధారణమైన వీరి వ్యక్తిత్వాన్ని, స్ఫూర్తివంతమైన వీరి జీవితవిధానాన్ని నేటి విద్యార్ధి లోకానికి పరిచయం చెయ్యటం, వారిలో వీరేశలింగం గారి సంఘ సంస్కరణ స్ఫూర్తిని కల్గింపజేయటం, వారికి సమాజం పట్ల బాధ్యత గురించి తెలియజేయటం ఈ పాఠ్యభాగం ప్రధాన ఉద్దేశ్యం.
పాఠ్యభాగ సారాంశం
ఇక నుండి నా వనరులను, నా శక్తి యుక్తులను – అంటే మానసిక, భౌతిక శక్తులను, ద్రవ్యాన్ని చివరవరకు అవసరమైతే నా ప్రాణాన్ని సైతం స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తాను అని సత్యవాది పత్రికలో ప్రకటించిన వీరేశలింగం గారిని యుగకర్తలలో మొట్టమొదటగా చెప్పుకోవాలి. బాల వితంతువుల దీన స్థితి, అవిద్య, అమూఢ విశ్వాసాల నిర్మూలన, స్త్రీలు సభలలోకి రాకూడదనే సాంఘిక నియమాల లాంటి సమస్యలను పరిష్కరించటానికి ఆయన పూనుకున్నారు. కాబట్టి వారిని మహిళోద్యమ జనకులు, మహిళాభ్యుదయ పితామహుడు అని అభివర్ణించటం అతిశయోక్తి కాదు.
కందుకూరి వారి సంస్కరణలలో ముఖ్యమైనది, శాశ్వత చరిత్ర కలది స్త్రీ జనోద్ధరణ. ఆయన కార్యాచరణకు ఒక తాత్విక ప్రాతిపదిక ఉంది. సంకల్ప బలం గల వ్యక్తి కందుకూరి. ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను బలపరిచాడు.
1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలో బాలికా పాఠశాలలు స్థాపించాడు. ముందుగా తన భార్యకు విద్య నేర్పి ఆమెనొక ఉపాధ్యాయినిగా తయారు చేశాడు. తాను ఆచరించి ప్రబోధ చేయటం ఈయన వ్యక్తిత్వం.
కందుకూరి శాస్త్రాల ఆధారంతో బాల్యవివాహాలు నిరసించాడు. బాల వితంతువుల పునర్వివాహానికి ఆయన చేసిన అనన్య కృషి, నిస్సహాయ స్త్రీల రక్షణ, అజ్ఞానంపై, మూఢ విశ్వాసాల పై అంతులేని, ఎడతెగని దాడి తెలుగు స్త్రీల హృదయాలలో ఆయనకు గౌరవ స్థానాన్ని నెలకొల్పాయి.
కందుకూరి స్థిర సంకల్పంతో అయిదుగురు సహచరులతో వితంతు వివాహ సంఘాన్ని 1879లో రాజమహేంద్రవరంలో స్థాపించారు. చల్లపల్లి బాపనయ్య ప్రోత్సాహంతో, పరవస్తు రంగాచార్యుల కరపత్ర దోహదంతో 1879లో రాజమండ్రిలో వేదాల, స్మృతుల,విద్యారణ్య భాష్యాల ఆధారంతో నిర్భంధ వైధవ్యాన్ని నిరసిస్తూ ఉపన్యాసమిచ్చారు.
1879 అక్టోబరు 10వ తేదీన కందుకూరి రెండవ ఉపన్యాసం ప్రజలలో కొత్త ఆలోచన రేకెత్తించింది. వెంటనే వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించి 11-12-1881న రాజమండ్రిలో అర్ధరాత్రి వధువును రహస్యంగా తెచ్చి ప్రథమ వివాహాన్ని జరిపించారు. దీనికి బ్రహ్మాండమైన వ్యతిరేకత వచ్చింది. రాజమండ్రిలో, మద్రాసులో వితంతు వ్యతిరేక సంఘాలు వెలిశాయి. అయినా, మొక్కవోని ధైర్యంతో 1884 నాటికి 10 పెళ్ళిళ్లు చేశారు. బంధువులు వీరి పెరటి ముందు, తలుపుల పైన అశుద్ధం పోశారు. నానా దుర్భాషలాడారు.
కందుకూరి వారు స్త్రీ సంక్షేమం కోరి ఆరు ఉత్తమ స్త్రీ చరిత్రలు రచించారు. సత్యవతీ చరిత్ర లాంటి పదమూడు స్త్రీల కథలు రాసి నాటి స్త్రీల దుస్థితి అందులో వర్ణించాడు. ఆరోగ్య ప్రబోధం కోసం శరీర శాస్త్రంపై గ్రంథం వ్రాశాడు. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యాన్ని ప్రబోధించటానికి నాంది పలికాడు.
కందుకూరి వారి సంస్కరణలలో భోగం మేళాల నిషేధం కూడ ఒకటి. దేవదాసి వ్యవస్థపై విరుచుకుపడ్డాడు. భోగం స్త్రీలను ఆదరించిన పెద్దలపై తన హాస్యాన్ని కుమ్మరించి వారిని ఎగతాళి చేశాడు. దేవదాసీ వ్యవస్థపై విరుచుకుపడ్డాడు.
తన పత్రికలైన వివేక వర్ధని, చింతామణి, సత్యవాదిలలో వ్యభిచార వృత్తి మీద రాయటమే కాకుండా బహిరంగ సభలలో కందుకూరి తీవ్రంగా ఖండించారు.
ప్రతి ప్రతిభావంతుని వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుందనేది అక్షరాలా నిజం. భార్య రాజ్యలక్ష్మి ఇచ్చిన సహకారం అపూర్వమని కందుకూరి తన ఆత్మకథలో రాసుకున్నారు.
ఆమె సమాధి పక్కనే తన సమాధికి చోటుంచి ఆ తోటకు రాజ్యలక్ష్మి ప్రమదావనమని పేరు పెట్టి భార్య పట్ల తన కృతజ్ఞత చాటుకున్నారు.
ఇటు సంఘసంస్కరణ, అటు సాహిత్య సేవలే కాక సమాజ సేవ కార్యభారాన్ని వహించి జీవితాంతం ప్రజల కోసమే బతికిన ధన్యజీవి వీరేశలింగం. ఆరుద్రగారు ఆయనను ‘గద్య తిక్కన’ అని శ్లాఘిస్తే రనడే లాంటి సంఘ సంస్కరణాభిలాషులు దక్షిణాది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని అభివర్ణించారు. కేవలం మెట్రిక్యులేషన్ చదువుతో 150 రచనలు చేసిన సాహితీ పిపాసి కందుకూరి.
19వ శతాబ్దంలో మహిళోద్యమానికి యీనాటి మహిళోద్యమానికి చాలా తేడా ఉంది.
ఈనాడు సభలలో – స్త్రీ పురుషుల సభలలో మహిళలు పాల్గొంటున్నారంటే దానికి కారణభూతుడు కందుకూరి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. తను ఏర్పాటు చేసిన సభలలో పురుషులు తమ సతీమణులతో, తల్లులతో, అక్క చెల్లెళ్ళతో రావాలని ఆయన నియమం పెట్టారు. ఇది ఆనాటికి పెద్ద విప్లవ చర్య.
ఇతరుల కష్టాలను తనవిగా భావించే మనస్తత్వం కందుకూరిది. ఆయన ఆదర్శవాదే కాదు కార్యవాది కూడ. మహా నిరాడంబర జీవి.
ఆయన చివరి కోరికలు గమనించండి. నన్నయభట్టు పేర గ్రంథాలయం, కవుల చరిత్రను పూర్తి చేయటం, సమగ్ర తెలుగు వ్యాకరణ రచన. స్వార్థం తెలియని మహోదాత్తుడు కందుకూరి వీరేశలింగం!
కఠిన పదాలకు అర్ధాలు
మానసిక భౌతిక శక్తులు = మనసుకు, శరీరానికి చెందిన శక్తులు
ద్రవ్యం = డబ్బు
స్త్రీ జన సంక్షేమం = స్త్రీల మంచికోసం
విద్యలేమి = విద్య లేకపోవటం
అవిరళ కృషి = సాటిలేని కృషి
మిక్కుటమైన = అధికమైన
మనస్తాపం = మనసుకు బాధ
వ్యధ = బాధ
మా బోంట్లు = మాలాంటివారు
మార్గదర్శకుడు = మార్గాన్ని చూపేవాడు
అతి నిషేధమైన = బాగా నిషేధింపబడిన
అనన్య కృషి = ఇతరులు చేయలేని కృషి
అహరహం = ప్రతిక్షణం
క్రాంతిదర్శి = కాలం కంటే ముందు చూపు గలవాడు, సర్వజ్ఞుడు
పరహితం = ఇతరుల మేలు
అజ్ఞానపు తిమిరం = అజ్ఞానమనే చీకటి
నిర్బంధ వైధవ్యం = బలవంతపు వైధవ్యం
వధువు = పెళ్ళికూతురు
సంఘ బహిష్కరణ = సంఘం నుంచి వెలివేయటం
కులాతీత విందు = కులభేదాలు లేకుండా అందరూ పాల్గొనే విందు
మొక్కవోని ధైర్యం = సడలని ధైర్యం
కృతఘ్నులు = చేసిన మేలు మరిచిపోయిన వారు
కాసు = డబ్బు
పెరడు = ఇంటి వెనుక భాగం
దుర్భాషలు = చెడ్డ మాటలు
ధీరోదాత్త దంపతులు = ధీరులు, ఉదాత్తులు అయిన దంపతులు
జుగుప్స = అసహ్యము
ఇనాము = బహుమానము
లోకహితం = లోకం మేలు
ఆబాల గోపాలం = బాలుర దగ్గర నుంచి అందరూ, సర్వులు
వదాన్యుడు = మహాదాత, చక్కగా మాట్లాడేవాడు
మౌఢ్యులు = అజ్ఞానులు
నిర్భీతి = భయం లేకుండా
పిపాసి = దాహం కలవాడు
ప్రోది చేసుకోవడం = పెంచుకోవటం, వృద్ధి చేసుకోవటం
కక్షిదారులు = ఇతరులు తన మీద పెట్టిన కేసులో తాను తప్పు చేయలేదని వాదించుకోవలసిన వ్యక్తి
పౌలు = క్రైస్తవ మతానికి చెందిన ప్రముఖులు సెయింట్ పాల్ పెట్టిన నియమాలు
స్త్రీ జన పక్షపాతి = స్త్రీల పక్షం వహించేవాడు
వితరణ శీలి = దాన శీలి