AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే…

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material గద్య భాగం 2nd Lesson అప్పుడు పుట్టి ఉంటే… Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material 2nd Lesson అప్పుడు పుట్టి ఉంటే…

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాయలవారి భువన విజయం విద్వజ్జనుల నిలయం’ అని నిరూపించండి.
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ‘అప్పుడు పుట్టి వుంటే’ వ్యాసం ద్వారా కృష్ణదేవరాయల కాలంనాటి సాహిత్య కళా వైభవాన్ని మన కళ్ళముందు నిలిపారు.

రాయలవారి సభా భవనం భువన విజయం సాహిత్య, సంగీత, నృత్య కళా నిలయం దేవేంద్రుని సుధర్మ సభాస్థలితో పోల్చదగినది. భువన విజయం ఎప్పుడూ కవి, పండితుల గోష్ఠులతో అలరారుతూ ఉంటుంది. కృష్ణదేవరాయలను భోజరాజుతో పోలుస్తారు. భువన విజయంలో విద్వత్కవులకు గౌరవ, సన్మానాలు, కావ్య అంకిత మహోత్సవాలు, బిరుదు ప్రధానాలు వంటి ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కృష్ణదేవరాయల పాలనాకాలం స్వర్ణయుగంగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది.

రాయలవారి భువన విజయం సభా భవనంలో పెద్దనగారి మను చరిత్ర స్వీకరించ డానికి నిశ్చయమయింది. వివిధ ప్రాంతాల నుంచి జనులు కొన్ని రోజుల ముందే వచ్చేసి విడిది చేశారు. వీరి చర్చలు, గోష్ఠులతో విజయనగరం పులకించి పోయింది.

మను చరిత్ర స్వీకార మహోత్సవానికి పింగళి సూరన వచ్చాడు. నంది తిమ్మన, ధూర్జటి మొదలైన కవీశ్వరులు, పెద్దన కూర్చున్న పల్లకీని రాయలవారు ఎత్తటం చూసి ఆ గౌరవం తమకే జరిగినట్లు భావించి, ఆనందిస్తారు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

కోటేసినట్లు చక్కని ముక్కు పండు తమలపాకు వంటి శరీర ఛాయ, కర్పూర తాంబూలం బుగ్గన వుంచుకుని రాయలవారితో నడుస్తున్న కవి తిమ్మన. పక్కనే నిష్కలంకమూ, నిశ్చలమూ, అయిన చల్లని ముఖంతో ధూర్జటి ఆతని వెనకనే మొలలో నుంచి బంగారు పొడుం కాయ తీస్తున్న కవి మాదయగారి మల్లన.

ఆయనకి ఎడమవైపున ఆ అపరంజి కుండలాలు, ఆకుపచ్చ శాలువా గల వ్యక్తి రామభద్రుడు. ఆతనికి కుడివైపున చక్కని జిలుగు పట్టు వస్త్రాలతో, తీర్చిన ముంగురులూ, కురులతో, అలవోక నడకతో యువకవి రామరాజు, ఆతని పక్కనే కందుకూరి రుద్రయ్య.

నడకలో నిర్లక్ష్యంతో, విశాలమైన నుదురు, ఒకసారి మేఘాల్లాగ, ఒకసారి మెరుపుల్లాగ అగుపించే కళ్ళు ‘శారద నీ రూపము’ అన్నట్లు పక్కనున్న యువకునితో మాట్లాడుతూ నడుస్తున్న తెనాలి రామలింగకవి. అప్పటికి ఇంకా రామకృష్ణకవి కాలేదు. అతని వెనక రాధామాధవ కవి ఎల్లన.

వెనక నుంచి తొందర తొందరగా తీసుకొని భట్టుమూర్తి వద్దకు వస్తున్న కవి బండారు లక్ష్మీనారాయణ. ఇతడు రాయలవారి అంతఃపురంలో సంగీత గురువు. అతని చేతిలో ‘సంగీత సూర్యోదయం’ గ్రంథముంది. అతనితో కూడా వచ్చినవాడు బయకారపు రామయామాత్యుడు అనే గాయకుడు.

వీరికి కొంచెం దూరంలో ఏదో ఆలోచిస్తున్నట్లు, వ్యూహం పన్నుతున్నట్లు వేళ్ళు తిప్పుతున్నట్లు వస్తున్న వాడు బొడ్డుచర్ల తిమ్మన. ఇటువంటి చతురంగపుటాటగాడు ఆ దినాల్లో లేడు. కృష్ణదేవరాయలతో చదరంగం ఆడేవాడు. రాయలు ఇతని ప్రతిభను మెచ్చుకొని కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా ఇచ్చాడు.

పొడుగాటి జుట్లు, రంగురంగుల దుస్తుల వాళ్ళు నట్టువ నాగయ్య, నట్టువ తిమ్మయ్యలు రాయలవారు రచించిన సంస్కృత నాటకం ‘జాంబవతీ కళ్యాణం’ భువన విజయంలో ప్రదర్శించటానికి వచ్చారు.

పండిత కూటంలోని వారు గీర్వాణ కావ్యకర్తలు, దైవజ్ఞ విలాస కావ్యకర్తలు కొండవీటి విద్వత్కవి సార్వభౌములు లక్ష్మీధరులవారు వ్యాసతీర్థులు, రాజనాథ డిండిముడు, ఇరుసమయి విళక్కన్’ రచించిన తమిళ కవిరాజు. రాయలవారి ఉత్కళ యాత్రను వర్ణించిన కుమార సరస్వతి.

తేజస్వులిద్దరూ పురందరదాసు, కనకదాసులు, గుబ్బిమల్లనార్యుడు, నంజుడయ్య, లింగమూర్తి వీరు కర్ణాటక కవిరాజులు మొదలైనవారంతా రాయలవారితో భువన విజయానికి వెళ్ళారు.

ఇట్టే ప్రతిభావంతులైన విద్వజ్జనుల నిలయంగా ఆనాడు రాయల భువన విజయం భాసించేది. వీరందరి సమక్షంలో వైభవోపేతంగా మను చరిత్రను రాయలు స్వీకరించాడు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

ప్రశ్న 2.
‘ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు రాయల కాలం స్వర్ణయుగం’ వివరించండి.
జవాబు:
శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగం ! కవి పండిత పోషకుడైన రాయలవారి కాలంలో సాహిత్యం పల్లకి ఎక్కింది. కవులకు అత్యున్నత గౌరవం లభించింది. ఈ కాలంలో ప్రబంధ ప్రక్రియ వికసించి ఎన్నో కావ్య కుసుమాలను పూయించింది.

కృష్ణదేవరాయలు క్రీ.శ. 1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ కాలం మత సామరస్యానికే కాక, కళలకూ, కవులకూ నిలయం.

రాయలు స్వయంగా కవి సంస్కృతంలో నాటకాలను రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప ప్రబంధాన్ని రచించాడు. కవులలోని విద్వత్తును గ్రహించి వారికి ఎన్నో అగ్రహారాలను, భూములను దానంగా, బహుమతిగా ఇచ్చాడు.

పెద్దనగారి మను చరిత్రను రాయలవారు అందుకునే స్వీకార మహోత్సవానికి అన్ని ప్రాంతాల కవులు, పండితులు తరలివచ్చారు. భాషా బేధాలు మత బేధాలు లేని సామరస్య భావన అక్కడ నెలకొని వుంది. రాయలవారి కాలంలో కవులు సుఖ, సంతోషాలతో వుండేవారు. రాయలు పెక్కు ప్రబంధాలు క్షుణ్ణంగా చదివి కవుల గుణ సంపదకు విలువ కట్టిన కవి వతంసుడు.

రాయలవారు పెద్దనగారి మను చరిత్రను స్వీకరిస్తున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది.

ఆంధ్ర, కర్ణాటక, తమిళ ప్రాంతాలనుంచి కవులు, విద్వాంసులు. ఆ వేడుక చూడటానికి ఉత్సాహంగా వచ్చారు. అటు కళింగం నుంచి, గౌతమీ తీరాన్నుంచి, ఇటు కావేరి నుంచి, మధుర నుంచి, కవీశ్వరులు, గాయకులు, విద్వాంసులు, ఎక్కడెక్కడివారు కొన్ని రోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. ప్రభాత సమయంలోను, ప్రదోష కాలంలోను, తుంగభద్రా తీరంలోను, విఠల స్వాముల కళ్యాణ మండపంలోను వీరందరి గోష్టులు ఎంతో సందడి చేశాయి.

వారిలో ఆంధ్ర కవులున్నారు. తమిళ కవులున్నారు, కర్ణాట కవులున్నారు.

పింగళి సూరన, ధూర్జటి, నంది తిమ్మన, రామభద్రకవి, రామలింగకవి, రాధామాధవ కవి, భట్టుమూర్తి వంటి ఉద్దండులైన తెలుగు కవులున్నారు.

రాయలు రచించిన సంస్కృత నాటకం ‘జాంబవతీ కళ్యాణం’ ప్రదర్శించటానికి నట్టువ నాగయ్య, నట్టువ తిమ్మయ్యగారు వచ్చారు.

గీర్వాణ కావ్యకర్తలు దైవజ్ఞ విలాస కావ్యకర్తలు కొండవీటి విద్వత్కవి సార్వభౌములు లక్ష్మీధరుల వారున్నారు. వ్యాస తీర్థులు, రాజనాధ డిండిముడు, ఇరుసమయి విళక్కన్ రచించిన తమిళ కవిరాజున్నాడు. చాటు విఠలనాధుడు కర్ణాటక కవి. ఇంకా పురందర దాసు, కనకదాసులు, కర్ణాటక కవిరాజులు గుబ్బి మల్లనార్యుడు, నంజుడయ్య లింగమంత్రి ఇత్వాది పండితులున్నారు.

ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగమది. దక్షిణా పథం అంతా ‘ఒక సుందర సంస్కార బంధం కట్టి పెట్టిన రోజులవి. అవి కవులకు గొప్పరోజులు. కవి పండితులకన్న రాయలకు ఇష్టులెవరూ లేరు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

సంస్కృతాంధ్ర, కర్ణాట, తమిళ భాషా పండితులను ఆదరించి ఆంధ్ర సాహిత్యంపై విశేష గౌరవం చూపి, ఆంధ్ర భోజుడని పేరు పొందిన – రాజు కృష్ణదేవరాయలు. సాహిత్య, కళా పోషకులలో అగ్రగణ్యునిగా పేరు పొందిన కవి, రాజు కృష్ణదేవరాయలు.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాయలవారు పెద్దన రాసిన మను చరిత్ర అందుకున్న తీరును వివరించండి.
జవాబు:
ఆ సంవత్సరం మహర్నవమినాడు రాయలవారు భువన విజయంలో మను చరిత్ర అందుకుంటున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది. ఎక్కడెక్కడి విద్వాంసులు, గాయకులు కొన్నిరోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. వచ్చిన కవులలో సగం మంది పెద్దన్నగారి యింట్లోనే దిగారు.

ముందు ఇద్దరూ, వెనక శకటంలో అప్పాజీ పెద్దన్న గారింటికి వస్తారు. రాయలవారు అక్కడికి వస్తున్నారని, ఊరేగింపు మహోత్సవం పెద్దన్నగారింటి నుండి కొలువు కూటందాకా సాగుతుందని అప్పాజి అక్కడ వున్న మహా కవులందరితో చెపుతాడు.

కొంచెంసేపట్లో విజయనగర ప్రజలు చేసే జయజయ ధ్వానాలు దగ్గరగా వినబడతాయి. . రాయలవారు అల్లసానివారి గృహంగణానికి మంత్రులతో, సామంతులతో వస్తారు. ముందు అప్పాజి, అచ్యుతదేవరాయలు, నంది తిమ్మన, మాదయగారి మల్లన నడుస్తుంటే, పింగళి సూరన చెయ్యి అందుకుని వచ్చి, బంగారపుటడ్డల పల్లకిలో పెద్దనగారు కూర్చుంటారు.

శ్రీకృష్ణ దేవరాయలు ముందు నిలబడి పల్లకి తన చేతితో ఎత్తుతాడు. తక్షణం కొందరు సామంతులు, కవులు పల్లకి బొంగులకు భుజాలు తగిలిస్తారు. భోజరాజేనా ఇలా చేశాడని విన్నామా ! మహాకవుల గొప్పతనం మహాకవులకే తెలుస్తుందని రాయలను ప్రశంసిస్తూ నంది తిమ్మన, ధూర్జటి మొదలైన కవీశ్వరులు ఆ గౌరవం తమకి జరిగినట్లే సంతోషిస్తారు.

ముందు వందలకొద్దీ రౌతులు తరవాత చల్లగా సాగే తంజావూరు సన్నాయి కూటం. భట్టు కవుల స్తుతి పాఠాలు, ఆ వెనక వేద మంత్రాలు పఠించే వైదిక బృందం, కంచి నుంచి వచ్చిన కామ సుందరి మేళం. ఆ వెంటనే మంత్రులతో సామంతులతో, దండనాధులతో, కవులతో, పండితులతో, గాయకులతో శ్రీకృష్ణదేవరాయలు.

ఊరేగింపు విజయనగర రాజు వీధులలో సాగుతుంటే తోవలో రాయలవారికి, మహాకవికి ప్రజలు హారతులు ఇచ్చారు. శరకోపయతుల మఠం దగ్గర రాయలు, పెద్దన పల్లకి దిగి గురువుగారి పాదాలపై శిరస్సులు ఉంచారు. రాయలవారి నిండు సభలో, మను చరిత్రను పెద్దనగారు పఠిస్తున్నప్పుడు ‘ఆంధ్రకవితా పితామహుడనెవ్వరీడు పేర్కొన నీకున్’ అన్న పద్యం దగ్గరికి వచ్చేసరికి మహాకవి కంఠం రుమై చదవలేకపోయారు. పఠనానంతరం కవి పండితులందరూ మను చరిత్రలో, ఆంధ్ర కవిత్వ చరిత్రలో నవయుగం ప్రారంభమైనదని కీర్తించారు.

ఇంత కన్నుల పండుగగా రాయలవారు మను చరిత్రను అందుకున్నారు.

ప్రశ్న 2.
పెద్దనగారి భార్యను గురించి రాయండి.
జవాబు:
పెద్దనగారి భార్య అణకువ, గర్వము మూర్తీభవించినట్లుండే ఇల్లాలు. తన భర్తకు రాయలవారి నుండి లభిస్తున్న గౌరవాదరాలను చూస్తుంటే ఆమెకు అమితమైన సంతోషము. రాయలవారు నిండు సభలో మను చరిత్ర నందుకున్నప్పటి విశేషాలన్నీ ఆ సాయంకాలం పెద్దన్నగారింట్లో కూర్చున్నవారందరికీ పింగళి సూరన మరీమరీ వివరించి చెపుతుంటే, ఆ ఇల్లాలు అటు ఇటు తిరుగుతూ, ఆగుతూ ఆనందంగా వింటుంది.

మరునాడు అల్లసాని పెద్దన ఇంట్లో కవులందరికీ విందు. పెద్దన భార్య అనుకూలవతి. ఆమెను చూసి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దిటో నతని గృహిణి’ అని ఆమె అతిథి మర్యాదను తెనాలి రామకృష్ణకవి ప్రశంసిస్తాడు. అక్క అని ఆమెను సంబోధిస్తాడు. ఆ అక్కగారు మను చరిత్రలో ప్రవరుని గృహిణి వంటిదని’ ప్రశంసిస్తాడు. అవునా’ అన్నట్లు పెద్దన ఆమెవైపు చూస్తాడు. ఆమె మాట్లాడకుండా చిరునవ్వుతో అందరికీ వడ్డిస్తూనే ఉంటుంది. ఆదర్శ గృహిణి పెద్దన్న గారి భార్య !

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

ప్రశ్న 3.
బొడ్డుచర్ల తిమ్మన గురించి వివరించండి.
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన రాయలకాలం నాటి కవి. కవీశ్వర్ దిగ్దంతులనిపించుకున్న కృష్ణరాయల వారితో చదరంగం ఆడుతూ ఉండేవాడు. చదరంగం ఆటలో నేర్పరి ఈ కవి. పెద్దనగారి మను చరిత్రను రాయలు అంకితంగా అందుకుంటున్న మహోత్సవానికి కవులందరితో వస్తూ, వారికి కొంచెం దూరంగా నడుస్తూ, ఏదో ఆలోచిస్తున్నట్లు, వ్యూహం పన్నుతున్నట్లు వేళ్ళు తిప్పుతూ ఈ కవి వచ్చాడు.
రాయలు ఇతని నైపుణ్యానికి చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా రాసి ఇచ్చాడు.

ప్రశ్న 4.
దేవులపల్లి కృష్ణశాస్త్రిని గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి సుప్రసిద్ధ ‘భావకవి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర వున్న రామచంద్రపాలెంలో 1-11-1897న జన్మించారు. సీతమ్మ, తమ్మన్నశాస్త్రి వీరి తల్లిదండ్రులు.

వీరి విద్యాభ్యాసం పిఠాపురంలోను, విజయనగరంలోను జరిగింది. కొంతకాలం రవీంద్రుని శాంతినికేతన్ లో గడిపారు. వృత్తిరీత్యా వీరు ఉపాధ్యాయులు. రఘుపతి వెంకయ్యనాయుడు ప్రోత్సాహంతో సంఘసంస్కరణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. సంఘసంస్కరణాభిలాషి, హరిజనాభ్యుదయ గీతాలను ప్రచారం చేశారు. 1930లో పిఠాపురంలో వేశ్యావివాహ సంస్థను స్థాపించారు. కొందరు వేశ్యలకు వివాహాలు కూడా జరిపించారు.

కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, పల్లకి వంటి అనేక ఖండకావ్యాలను దేవులపల్లి రచించారు. కొన్ని యక్షగానాలను, భక్తి నాటకాలను ఇంకొన్ని గేయ నాటికలను కూడా కృష్ణశాస్త్రిగారు రచించారు. కేవలం కవిగానే గాక, విమర్శా వ్యాసాలను రచించి విమర్శకునిగా కూడా ప్రసిద్ధిపొందారు.

దేవులపల్లివారు సినిమా కవి కూడా. వారు రచించిన ఎన్నో సినిమా పాటలు బహుళప్రచారం పొందాయి. తెలుగు వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయాయి.

వీరు ఆంధ్రా షెల్లీగా పేరుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, బిరుదునూ, భారత ప్రభుత్వం పద్మభూషణ్ ను ఇచ్చి ఈ కవిని సత్కరించాయి.

భావకవిత్వానికి పర్యాయపదంగా నిలిచిన దేవులపల్లి కృష్ణశాస్త్రి 24-2-1980లో పరమపదించారు.

ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాయలవారి సాహితీ భవనం పేరు తెల్పండి.
జవాబు:
భువన విజయం

ప్రశ్న 2.
రాయలువారు రాసిన నాటకం పేరేమిటి ?
జవాబు:
రాయలవారు రచించిన సంస్కృతనాటకం ‘జాంబవతీ కళ్యాణము’.

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

ప్రశ్న 3.
భారత ప్రభుత్వం కృష్ణశాస్త్రిని ఏ బిరుదుతో సత్కరించింది ?
జవాబు:
పద్మభూషణ్.

ప్రశ్న 4.
రాయలవారి విజయనగరం ఏ నదీ తీరాన ఉంది ?
జవాబు:
తుంగభద్రానదీ తీరాన.

ప్రశ్న 5.
ఎవరి కాలాన్ని ఆంధ్ర, కర్ణాట, తమిళ పాహిత్యాలకు స్వర్ణయుగం అని అంటారు ?
జవాబు:
కృష్ణదేవరాయల కాలం.

ప్రశ్న 6.
రాయలతో చదరంగం ఆడినది ఎవరు ?
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన.

ప్రశ్న 7.
శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం ఏది ?
జవాబు:
శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం క్రీ.శ. 1509-1529 మధ్య.

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

ప్రశ్న 8.
‘ఆంధ్రా షెల్లీ’ అని ఎవరినంటారు ?
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని ‘ఆంధ్రా షెల్లీ’ అని అంటారు.

రచయిత పరిచయం

భావకవిత్వానికి రూపురేఖలు దిద్ది, ప్రాణంపోసి, అనంత ఖ్యాతిని తెచ్చిన కవి’ దేవులపల్లి కృష్ణశాస్త్రి. 1897 నవంబరు 1వ తేదీన పిఠాపురం దగ్గర వున్న రామచంద్ర పాలెంలో జన్మించారు. సీతమ్మ, తమ్మన్న శాస్త్రి వీరి తల్లిదండ్రులు. తండ్రి, పెద్దతండ్రుల ప్రభావంతో చిన్నప్పుడే కవిత్వ రచనకు పూనుకున్నారు. పదేళ్ళ వయసులో దేవులపల్లి నందనందన ఇందిరా నాధ వరదా …….. అనే పద్యం చెప్పారు.

తండ్రి మరణానంతరం కృష్ణశాస్త్రిగారు విజయనగరంలో వున్న తమ పెద్ద బావగారి ఇంట్లో వుండి హైస్కూలు చదువు ప్రారంభించారు. అక్కడ గురజాడ అప్పారావు గారి పరిచయం దేవులపల్లి వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. మానవత్వం వైపు. దృష్టి వెళ్ళింది. రాయప్రోలు సుబ్బారావుగారి గీతాలను కూడా బాగా అవగాహన చేసుకున్నారు.

కళాశాల చదువులో రఘుపతి వెంకటరత్నంగారి సాహచర్యంతో హరిజనోద్దరణ : కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. హరి జనాభ్యుదయ గీతాలను ప్రచారం చేశారు. పిఠాపురంలోను, కాకినాడలోను విద్యాభ్యాసం జరిగింది.

దేవులపల్లివారు కాకినాడ, పెద్దాపురం హైస్కూళ్ళలో ఉపాధ్యాయుడుగా కొంతకాలం పనిచేశారు. మెల్లమెల్లగా భావకవిత్వంవైపు వారి దృష్టి ప్రసరించింది. 1925 సం||లో తాను రచించిన ఖండ కావ్యాలను ఒకచోట చేర్చి ‘కృష్ణపక్షం’ పేరుతో ప్రచురించారు. – తన కవితలనే కాక తోటి కవుల కవిత్వాన్ని కూడా గానం చేస్తూ ఆంధ్రదేశమంతా తిరిగి భావకవిత్వాన్ని వీరు ఉద్యమ స్థాయికి తీసుకువచ్చారు.

దేవులపల్లి తన గళంతో పాటు వేషధారణ, శైలి అంటే గిరజాల జుట్టు, పంచెకట్టుతో భావకవి అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా నాటి యువతను ఆకర్షించారు.

కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, పల్లకి వంటి అనేక ఖండ కావ్యాలను దేవులపల్లివారు రచించారు. కొన్ని యక్షగానాలు, భక్తి నాటకాలు, ఇంకా కొన్ని గేయ నాటకాలను కూడా రచించారు. కేవలం కవిగానే కాక, కొన్ని విమర్శనా వ్యాసాలు రచించి విమర్శకునిగా కూడా పేరు పొందారు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

దేవులపల్లివారు సినీకవిగా కూడా ప్రసిద్ధులు. ఎన్నో సినిమాలకు మధురమైన గీతాలను రచించారు. వీరి గీతాల వల్లే ప్రాచుర్యం పొందిన సినిమాలెన్నో ఉన్నాయి. ” దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వం ప్రతి అక్షరం తేనెలొలుకుతూ పాఠకులను మైమరపిస్తుంది.

1964 సం||లో స్వరపేటికలో వ్యా ధి సోకి, ఆపరేషన్ జరిగి, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గొంతు మూగబోయింది. అయినా, నిరాశ చెందకుండా తన భావాలను, కవిత్వాన్ని కాగితంమీద రాసి చూపిస్తుండేవారు. స్ఫూర్తివంతమైన జీవితం కృష్ణశాస్త్రి గారిది.

వీరు ఆంధ్రా షెల్లీగా ప్రస్తుతించబడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తోను, భారత ప్రభుత్వం ‘పద్మభూషన్’తోను వీరిని సత్కరించాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 24-2-1980 సం||లో స్వర్గస్థులయ్యారు.

పాఠ్యభాగ సందర్భం

ప్రస్తుత పాఠ్యభాగం ‘అప్పుడు పుట్టి ఉంటే …..’ ‘కృష్ణశాస్త్రి కృతులు’ అనే వ్యాస సంకలనంలోని వ్యాసానికి సంక్షిప్త రూపం.

కృష్ణశాస్త్రిగారు గొప్ప భావుకులు.

తెలుగు సాహిత్య చరిత్రలో కృష్ణదేవరాయల పాలనాకాలం స్వర్ణయుగంగా పేరుపొందింది. రాయలు ‘కవి పండిత పోషకుడు. స్వయంగా కవి. ప్రబంధ ప్రక్రియ ఈ కాలంలో వికసించి, విస్తరించింది.

రాయల కాలంలో కవులకు జరిగిన సన్మానాలు చరిత్రలో ఎంతో ప్రసిద్ధి పొందాయి. రాయలు క్రీ.శ. 1509 – 1520 సం||ల మధ్య విజయనగరాన్ని పాలించాడు. రాయల కాలంలో సాహిత్యం ఎలా అందలమెక్కిందో, కవులకు ఎంత గౌరవం దక్కిందో, నాటి సాహితీ వైభవాన్ని మన కళ్ళముందుంచుతూ దేవులపల్లివారు ఈ అద్భుతమైన వ్యాసాన్ని రచించి, పాఠకులను కొంత సేపు రాయలకాలంలో నిలిపి, ఆ కాలపు అనుభూతిని పొందే అవకాశాన్ని కల్పించారు.

పాఠ్యభాగ సారాంశం

మహర్నవమినాడు రాయలవారు భువన విజయంలో మనుచరిత్ర అందులో కుంటున్నారన్న వార్త విజయనగరం సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది.

అటు కళింగం నుంచి, గౌతమీ తీరాన్నుంచీ, ఇటు కావేరి నుంచి, మధుర నుంచి కవీశ్వరులు, గాయకులు, విద్వాంసులు, ఎక్కడెక్కడి వారు విజయనగరానికి కొన్ని రోజుల ముందుగానే వచ్చి విడిది చేశారు. ప్రభాత సమయంలోను, ప్రదోష సమయంలోను, తుంగభద్రానదీ తీరం దగ్గర, విఠల స్వాముల కళ్యాణ మండపంలోను వీరందరి గోష్టులు సందడి చేస్తున్నాయి.

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

వచ్చిన కవులలో కొంతమంది పెద్దన్న గారింటనే దిగారు. పింగళి సూరన ఎప్పుడు వచ్చినా అక్కడే దిగటమూ, తన కవిత్వాన్ని ఆయనకు వినిపించి రంజింపచేయటం అలవాటు.

ముందు ఇద్దరూ, వెనక శకటంలో అప్పాజి, పెద్దన కవి మందిర ప్రాంగణంలో దిగుతారు. గడియకో, మరో గడియకో రాయలవారు. అక్కడికి వస్తారని, ఊరేగింపు మహోత్సవం అక్కడి నుండి మొదలై కొలువు కూటందాకా సాగుతుందని, అప్పాజీ అక్కడ ఉండే మహా కవులతో చెపుతాడు.

బంగారు కుండలాలు, శాలువాలు సవరించుకుని రాయలవారి రాకకై మొగసాలలో అందరూ ఎదురుచూస్తారు. అంతలో వర్షామేఘ గర్జనలా, మహాసముద్ర ఘోషలా విజయనగర ప్రజలు చేసే జయజయ ధ్వానాలు దగ్గరగా వినిపిస్తాయి.

శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన గృహాంగణంలోకి, మంత్రి సామంతులతో వేంచేస్తారు. ముందు అప్పాజి, అచ్యుత దేవరాయలు, నంది తిమ్మన, మాదయగారి మల్లన నడుస్తుంటే, పింగళి సూరన చెయ్యి అందుకొని వచ్చి, బంగారపుటడ్డల పల్లకీలో పెద్దనగారు కూర్చుంటారు.

శ్రీకృష్ణదేవరాయలు ముందు నిలబడి, పల్లకీ తన చేతితో ఎత్తుతాడు. తక్షణం కొందరు సామంతులు, కవులు పల్లకీ బొంగులకు భుజాలు తగిలిస్తారు.

నంది తిమ్మన, ధూర్జటి మొదలైన కవులు ఆ గౌరవం తమకే జరిగినట్లు ఆనందిస్తారు. భోజుడేనా ఇలాగ చేశాడని విన్నామా ? అంటూ అందరూ రాయలవారిని ప్రశంసిస్తారు.

తంజాపురి సన్నాయి కూటం, భట్టుకవుల స్తుతి పాఠాలతో, వేదమంత్రాలు పఠించే వైదిక బృందంతో, సామంతులతో, దండనాధులతో, కవులతో, గాయకులతో, రాయబారులతో సాగుతూ కృష్ణదేవరాయలు వృద్ధ తేజస్వి అప్పాజి రెండు కళ్ళూ వేయికళ్ళుగా నాలుగువైపులా పరికిస్తూ సాగుతున్నారు.

నంది తిమ్మన, ధూర్జటి, మాదయగారి మల్లన, రామభద్ర కవి, యువకవి రామరాజ భూషణుడు, తెనాలి రామలింగ కవి, రాధా మాధవ కవి ఎల్లన, బండారు లక్ష్మీనారాయణ, బయకారపు రామయామాత్యుడు, బొడ్డుచర్ల తిమ్మన, గీర్వాణ కావ్య కర్తలు, కర్ణాట, తమిళ కవీశ్వరులు తరలి వెళుతున్న అపురూప దృశ్యమది.

ఆంధ్ర, కర్ణాట, తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగం అది.

ఊరేగింపు భువన విజయ సభదాకా సాగే దారిలో ప్రజలు రాయలవారికీ, పెద్దన కవికి హారతులు ఇచ్చారు. మనుచరిత్రను పెద్దనగారు పఠిస్తున్నప్పుడు ‘ఆంధ్రకవితా పితామహుడ వెవ్వరీడు పేర్కొననీకున్’ అన్న పద్యం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దన గారికి కంఠం రుద్ధమై చదవలేకపోయారు. ఆంధ్రకవిత్వ చరిత్రలో నవయుగం మను చరిత్రతో ప్రారంభమైందని కవులందరూ కీర్తించారు. తెనాలి రామలింగకవి పెద్దనకు పాదాభివందనం చేశాడు.

ఆ రాత్రి పెద్దనగారొక విశేషం చెప్పారు. భార్య, తాను, పింగళి సూరన ఉన్నపుడు.

ఉదయం సభ అయిపోయాక రాయలవారి రహస్య మందిరంలోకి రమ్మని పెద్దనగారికి పిలుపు వచ్చింది. పెద్దన వెళ్ళే సరికి రాయలవారు నిలబడి ఉంటారు. పెద్దనను తన కౌగిలింతలో గాఢంగా హత్తుకుంటారు. ఇద్దరి కళ్ళలో ఒక్క చినుకు కరిగి బుగ్గల మీదకి జారుతుంది. ఇద్దరూ మాట్లాడుకోలేదు. రాయలవారు అంతః పురంలోకి వెళ్ళిపోతారు. పెద్దనగారు ఇంటికి వచ్చేస్తారు. ఈ గాధ విన్న సూరన బుగ్గలు తడిసిపోయాయి.

మర్నాడు పెద్దనగారింట్లో విందు.

పెద్దనగారి భార్యను చూసి రామకృష్ణకవి ‘వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్ది యో నతని గృహిణి’ అంటాడు. ఆమెను అక్క అంటాడు.

AP Inter 1st Year Telugu Study Material Chapter 2 అప్పుడు పుట్టి ఉంటే...

కవులందరూ పలువిధాలుగా మాట్లాడుకుంటారు. అవి కవులకు గొప్ప రోజులు.

అప్పుడు పుట్టి ఉంటే ఇవన్నీ చూసేవాణ్ణి కదా, ఎందుకు చూడను ? అప్పుడు పుట్టి ఉంటే నేనే పెద్దన్ననై పుట్టి ఉందును ! అనుకుంటారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు.

కఠిన పదాలకు అర్థాలు

ప్రభాత సమయం = వేకువ, ఉదయకాలం
ప్రదోషకాలం = సంధ్యాసమయం
గోష్టులు = సభలు
కాహళ ధ్వనులు = బాకా ధ్వనులు
శకటం = బండి
మొగసాల = ఇంటి ముందు భాగం
బొంగులు = లావుగా, బోలుగ, పొడవుగా ఉండే వెదురు కర్రలు.
నిష్కలంకము = కళంకం లేనిది
అపరంజి = బంగారం
వలువలు = వస్త్రాలు
గీర్వాణం = సంస్కృతం
స్వర్ణయుగం = బంగారు యుగం
గవాక్షం = కిటికీ
చరణాలు = పాదాలు
సుధర్మ = దేవేంద్రుని సభ పేరు
నిండోలగం = నిండు కొలువు కూటం, సభా భవనం
చతురవచో నిధి = చతురమైన మాటలకు నిధి వంటి వ్యక్తి
పఠనానంతరం = చదివిన తర్వాత
వేవురు = వెయ్యిమంది
ఉద్ది = సమానమైన

Leave a Comment