Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material గద్య భాగం 1st Lesson హాసము – హాస్యము Textbook Questions and Answers, Summary.
AP Inter 1st Year Telugu Study Material 1st Lesson హాసము – హాస్యము
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
హాస్యం యొక్క లక్షణాలను తెలపండి.
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము. నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలిసిన సహృదయునికి నవ్వు పుట్టించేది నిజమైన హాస్యం. హాస్యానికి కొన్ని లక్షణాలున్నాయి. అవి :
అసహజత్వం :
ఒక విషయంలో వుండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. మనిషి రెండు కాళ్ళతో నడవటం సహజము. ఒంటికాలుతో నడవటం అసహజం. మనుషులు గుట్టాలను ఎక్కితే బాగుంటుంది. కాని, గుఱ్ఱం మనుషులపైకెక్కితే విపరీతంగా నవ్వు వస్తుంది. పత్నికి పతి దైవ సమానం అనే మాట సహజం. పత్నియే పతికి దైవం అంటే నవ్వుకు కారణమవుతుంది.
ఇలాంటివే చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటి వాళ్ళ సంభాషణ, నత్తి వాళ్ళ సంభాషణ, . పానుగంటి వారి బధిర విధవా ప్రహసనం అసహజత్వ హాస్యానికి ఉదాహరణలు.
సహజమైన విషయాన్ని అసహజమైన దానిగా ప్రదర్శించటంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది.
ఆశ్చర్యము (Surprise) :
ఒక కథో, ఉపన్యాసమో వింటున్నప్పుడు దాని ముగింపు ఇలా వుంటుంది అని మనం ఊహిస్తే, అందుకు భిన్నంగా వేరేగా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.
తద్వారా హాస్యం పుడుతుంది. స్వల్ప విషయాన్ని గొప్ప విషయంగా, అద్భుత విషయంగా చెప్పడం వల్ల ఆశ్చర్యం కలిగి నవ్వు వస్తుంది.
ఒక మాటకు ఉన్న అర్థానికి భిన్నమైన వేరొక అర్థాన్ని స్ఫురింపజేస్తూ మృదుమధుర మందహాస పరిమితమైన హాస్యాన్ని సృష్టించటం అసహజ హాస్యం లోకే వస్తుంది.
అసందర్భ శుద్ధి లేకపోవటం :
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (Impropriety) నవ్వు తెప్పిస్తుంది. ఆ నవ్వు నిర్మలంగా ఉండదు. అయినా అదీ హాస్యమే.
అప్రియమును ప్రియముగా మలచుట :
కష్టం కలిగించే విషయాన్ని మెత్తని మాటలతో చెప్పటం వల్ల హాస్యం పుడుతుంది. . అసత్యాన్ని సత్యంగాను, దుఃఖాన్ని సుఖంగాను, సుఖాన్ని దుఃఖంగాను, అప్రియ విషయాన్ని ప్రియమైన
దానిగాను మలచటం, నేర్పుతో హాస్యాన్ని సృష్టించట మవుతుంది. దీన్ని distortion అంటారు.
అతిశయోక్తి :
అతిశయోక్తి (Exaggaration) కూడ ఒక ముఖ్య హాస్య లక్షణం. అయితే విషయం నిజంగా అతిశయోక్తి అయితేనే హాస జనకం అవుతుంది. పరమ సత్యం అయితే నవ్వురాదు. అతిశయోక్తుల్లా కనపడేవి నిజంగా అతిశయోక్తులా సత్యమైన గాథలా అని నిశిత దృష్టితో పరీక్షించాలి.
అతిశయోక్తి హాస్య జనకం కావాలంటే దాని పునాదులు అసత్యం మీద వేయాలి. ఈ అప్పుడే అది నవ్వు పుట్టించే శక్తిగల అతిశయోక్తి అవుతుంది. ఇవి ముఖ్యమైన హాస్య లక్షణాలు.
ప్రశ్న 2.
హాస్యం అంటే ఏమిటో తెలిపి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
హాసమునకు కారణ భూతమైనది హాస్యం, నవ్వించేది హాస్యం. సహృదయుడు, ఆరోగ్య వంతుడు, నాగరికుడు అయిన వానిని నవ్వించేది ఉత్తమ హాస్యం. అయితే, అనాగరికులను నవ్వించే విషయాలు కూడ ఉన్నాయి.
ఉదాహరణకు:
మనిషికి సహజంగా కుంటితనము, గుడ్డితనము, అనాకారితనము, ముక్కు వంకర, మూతివంకర వంటి అంగవైకల్యాలు ఉంటాయి. వీటిని చూసి నవ్వటం సభ్యత అనిపించుకోదు. అది నాగరిక లక్షణం కాదు. అయితే, కుంటిగా నడవాలని ” చూసే నటుణ్ణి చూసి నవ్వవచ్చు. కాలు జారి పడ్డ వాణ్ణి చూసి నవ్వటం సభ్యత కాదు. కడుపు నొప్పితో బాధపడుతూ ముఖం వికృతంగా పెట్టిన వాణ్ణి చూసి నవ్వేవాడు సంస్కారి కాడు.
ఒక విషయంలో వుండే అసహజత్వం నవ్వుకు కారణమవుతుంది. ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా విరగబడి నవ్వాలనిపిస్తుంది.
పత్నియే పతికి దైవం అంటే అందులోని అసహజత్వానికి తప్పక నవ్వు వస్తుంది. అర్థరాత్రి దొంగలు కన్నం వేసి లోపల ప్రవేశించారు అనే సామాన్య విషయానికి అతి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అర్థరాత్రా! అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చారన్న మాట! దొంగలు! అందులో కన్నంలో నుంచి! అని ఒక మనిషి అంటే అతని అత్యాశ్చర్యాన్ని చూసి నవ్వుతాము.
ఒక కథకు ముగింపు మనం ఒక విధంగా ఊహిస్తే, దానికి భిన్నంగా ఆశ్చర్య కరంగా వేరే, ముగింపు వుంటే ఆ ఆశ్చర్యంలో నుంచి హాస్యం పుడుతుంది. అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు గురించి గంభీరంగా గొప్పగా పాఠం చెప్పి చివరకు, ‘ఆయన ఏం చేశారంటే’ అని ఒక్కక్షణం ఆగిపోతే విద్యార్థులంతా చక్రవర్తి ఏదో గొప్పపని చేసివుంటాడని ఆశ్చర్యంతో చూస్తూ వుంటే అధ్యాపకుడు ‘ఆ చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా ఢాం అని చచ్చాడు’ అని చెప్పేటప్పటికి క్లాసంతా గొల్లుమంది హాస్యం పుట్టించే పద్ధతుల్లో ఇది ఒకటి.
తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా ‘అంటే దూడకు పచ్చగడ్డి కోసం’ అంటే వెంటనే నవ్వువస్తుంది. శుభంగా పెళ్ళి జరుగుతున్న సమయంలో వచ్చిపోయెడివారు . వక్కలాకుల కేడ్వ, గుగ్గిళ్ళకై పెళ్ళి గుఱ్ఱమేడ్వ, పెద్ద మగడని పెళ్ళి కూతురు ఏడ్వ, కట్నంబుకై గ్రామ కరణమేడ్వ వంటి అవాకులు, చవాకులూ వింటే నవ్వు రాకుండా ఉండదు. సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడటం వల్ల ఇలా హాస్యం పుడుతుంది.
తన ఊళ్ళో భూకంపాలు తరచుగా వస్తున్నప్పుడు, ఒక ఆసామి పిల్లలను మరోగ్రామంలోని స్నేహితుని ఇంటికి పంపాడు. నాలుగు రోజుల తరవాత ఆ స్నేహితుడు పిల్లలను పంపిస్తున్నాను. భూకంపాలను మా ఊరు తోలేసెయ్యి, అని టెలిగ్రాం ఇచ్చాడట. ఇందులోని హాస్యం మనకు స్పష్టమే! పిల్లలను భరించటం : – కన్న భూకంపాలను భరించటం నయమని ఉద్దేశం. ఎంతో అప్రియమైన విషయాన్ని సున్నితంగా చెప్పాడా స్నేహితుడు.
‘ఒకామె నల్లని నలుపు. ఎంత నలుపంటే ఆమెకు చెమట పోసినపుడు గుడ్డతో అట్టి గాజు బుడ్డిలో పిండి కావలసినంత సిరా తయారు చేసుకోవచ్చునట. ఇది అతిశయోక్తి. అభూతకల్పన, విషయం. అతిశయోక్తి అయితే హాస్యం పుడుతుంది. నవ్వు వస్తుంది. ఇవి హాస్యానికి కొన్ని ఉదాహరణలు.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సందర్భ శుద్ధి లేకపోవటం వల్ల కలిగే హాస్యం గురించి తెలపండి.
జవాబు:
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (impropriety) హాస్యానికి కారణ మవుతుంది.
‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా’ అంటే దూడ గడ్డి కోసం అన్నాడుట’. ఇక్కడ సందర్భ శుద్ది లేదు. ప్రశ్నకు సమాధానానికి పొంతన లేదు. ఇది వింటే తప్పక నవ్వు వస్తుంది.
శుభమైన పెళ్ళి జరుగుతున్న సమయంలో ‘వచ్చిపోయెడు వారు వక్కలాకుల కేడ్వ, గుగ్గిళ్ళకై పెళ్ళి గుఱ్ఱమేడ్వ, పెద్ద మగడని పెళ్ళి కూతురు ఏడ్వ, కట్నంబుకై గ్రామ కరణంబు ఏడ్వ’ వంటి సందర్భ శుద్ధి లేని అవాకులు, చవాకులు వింటే నవ్వు వస్తుంది.
ఈ నవ్వు నిర్మలము కాదు. అయినా అదీ హాస్యమే. సందర్భ శుద్ధి లేకపోవటం, అసందర్భంగా మాట్లాడటం ఇక్కడ హాస్యానికి కారణం.
ప్రశ్న 2.
హాస్యమునకు ఒక ముఖ్య కారణం ఆశ్చర్యం వివరించండి.
జవాబు:
స్వల్ప విషయాన్ని అద్భుతమైన విషయంగా, గొప్ప విషయంగా చెప్పటం వల్ల కలిగే ఆశ్చర్యం నుండి హాస్యం పుడుతుంది.
ఒక అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు గురించి గంభీరంగా పాఠం . చెప్పి చివరలో ఆ చక్రవర్తి ఏం చేశాడంటే అని ఆ పేటప్పటికి విద్యార్థులంతా చక్రవర్తి ఏదో గొప్ప పని చేసివుంటాడని అనుకుంటారు. ‘ఆ చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా ‘ఛాంం అని చచ్చాడు’ అని అధ్యాపకుడు చెప్పే సరికి ఆశ్చర్యంతో క్లాసంతా గొల్లుమంటుంది.
ప్రసంగంలో పూర్వ భాగానికి భిన్నమైన ముగింపు ఆశ్చర్యాన్ని కలిగించి నవ్వు పుట్టిస్తుంది.
క్షురకుడు క్షవరం చేస్తున్నప్పుడు గాట్లు పడుతుంటే ఆ వ్యక్తి బాధ తగ్గించటానికి మాటల్లోకి దించుతూ ‘ఇదివరకు ఈ షాపుకు వచ్చారా’ అంటాడు. ఆ వ్యక్తి లేదు, ఆ చెయ్యి యుద్ధంలో తెగిపోయిందయ్యా అన్నాడు. ఈ సమాధానం క్షురకుడికి తలవంపులు కలిగించినా, అనుకోని ఆ సమాధానం ఆశ్చర్యం కలిగించి నవ్వు పుట్టిస్తుంది.
ఆశ్చర్యం కూడ హాస్యానికి ఒక ముఖ్యకారణమే!
ప్రశ్న 3.
అసహజత్వం వల్ల కలిగే హాస్యాన్ని గురించి తెల్పండి.
జవాబు:
ఒక విషయంలో ఉండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. ఒక పరమ సత్యాన్ని, ఒక సామాన్య విషయాన్ని విపరీత విషయంగా పరామర్శ చేస్తే, ఆ కథనం అసహజమై హాస్య జనకం అవుతుంది.
మనిషి ఒంటికాలు మీద నడవటం అసహజం. ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా, తలకింద పెట్టి, కాళ్ళు పైకెత్తినా చూసే వాళ్ళకు నవ్వు వస్తుంది. మనుషులు గుత్థాలు ఎక్కటం సహజం. కాని గుఱ్ఱం మనుషుల పైకెక్కటం అసహజం. ఇది నవ్వు పుట్టిస్తుంది.
మన సంఘంలో పత్నికి పతి దైవ సమానం అన్నమాట బహుజన నమ్మకం అయిపోయింది. పత్నియే పతికి దైవం అంటే నవ్వు ఉదయిస్తుంది. ఇది అసహజం కాబట్టి.
‘అర్థరాత్రి దొంగలు కన్నం వేసి లోపల ప్రవేశించారు’ అన్నది సామాన్య విషయం. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. అయినా ఒకడు అతి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అర్థరాత్రా! అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చారన్న మాట దొంగలు! ఇలా అంటుంటే ఆ మనిషి ఆశ్చర్యాన్ని చూసి నవ్వు వస్తుంది.
సహజమైన విషయాన్ని అసహజమైన వృత్తాంతంగా ప్రదర్శించటంలో రచయిత ప్రతిభ కనబడుతుంది. చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటివాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, ఇంకా పానుగంటి వారి ‘బధిర విధవా ప్రహసనము’ ఇత్యాదులలో హాస్యం ఆ సంభాషణలలో అసహజత్వం వల్ల వచ్చినదే!
ప్రశ్న 4.
ముని మాణిక్యం నరసింహారావును గురించి రాయండి.
జవాబు:
ముని మాణిక్యం నరసింహారావు గారు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన హాస్యరచయిత. వీరి ‘కాంతం కథలు’ తెలుగు సాహిత్యంలో ఒక మణిహారం.
వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వున్న సంగం జాగర్లమూడిలో 15-03-1898 లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణలు. ఇంటరు విద్య తెనాలిలో చదివారు. డిగ్రీ, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి సహాయంతో చదివారు. ఉపాధ్యాయుడుగాను, ఆకాశవాణిలోను ఉద్యోగాలు చేశారు.
దాంపత్యోపనిషత్తు, గృహప్రవేశం, తెలుగుహాస్యం, రుక్కుతల్లి, తిరుమాళిగ, కాంతం కైఫీయత్తు వంటివి వీరి రచనలు. ‘టీ కప్పులో తుఫాను’ వీరి మొదటి నవల.
కాంతం కథలకు వీరి భార్యే స్ఫూర్తి. నిజ జీవితంలోని చిన్న చిన్న సంఘటనల ఆధారంగా రచించిన ‘కాంతం కథలు’ నేటికీ నిత్య నూతనంగా ఉన్నాయి. నిత్యజీవితంలో హాస్యం అవసరాన్ని వీరు తమ రచనలలో హృద్యంగా చెప్పారు.
ముని మాణిక్యం నరసింహారావుగారు 4.2.1973లో కీర్తిశేషులయ్యారు.
ప్రశ్న 5.
అపహాస్యం గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
అపహాస్యం అంటే వెక్కిరింత. సహృదయుడు, ఆరోగ్యవంతుడు అయినవాణ్ణి నవ్వించేది ఉత్తమహాస్యం. కానిది అపహాస్యం.
మనిషిలో సహజంగా ఉండే అంగవైకల్యం కుంటితనం, గుడ్డితనం, అనాకారితనం, ముక్కువంకర, మూతివంకర వంటి వానిని చూసి నవ్వటం సభ్యత అన్పించుకోదు. ఇది అపహాస్యం చేయటమే అవుతుంది.
కాలు జారి పడ్డ వాడిని చూసి జాలిపడాలి కాని నవ్వి అపహాస్యం చేయకూడదు. కడుపు నొప్పితో బాధపడుతూ వికృతంగా ముఖం పెట్టి మెలికలు తిరుగుతున్న వ్యక్తిని చూసి నవ్వితే అపహాస్యం చేయటమే !
నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలుసుకున్న వారే సహృదయులు. . వారు ఎవరినీ అపహాస్యం చేయరు.
ఏకవాక్క / పదరూప సమాధాన పనులు
ప్రశ్న 1.
కాంతం కథలు రాసిందెవరు ?
జవాబు:
ముని మాణిక్యం నరసింహారావుగారు.
ప్రశ్న 2.
హాసము అనగా నేమి ?
జవాబు:
హాసము అనగా నవ్వు.
ప్రశ్న 3.
హాస్యము అంటే ఏమిటి ?
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము.
ప్రశ్న 4.
సప్త సముద్రాలను అపోశన పట్టిందెవరు ?
జవాబు:
అగస్త్యుడు.
ప్రశ్న 5.
రామాయణంలో సంజీవి పర్వతాన్ని తెచ్చిందెవరు ?
జవాబు:
ఆంజనేయుడు.
ప్రశ్న 6.
నారదుని వీణ పేరు ఏమిటి ?
జవాబు:
మహతి.
ప్రశ్న 7.
హాసము – హాస్యము పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
ముని మాణిక్యం నరసింహారావుగారు.
రచయిత పరిచయం
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ హాస్య రచయితలలో ముని మాణిక్యం – నరసింహారావు ఒకరు.
వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉన్న సంగం జాగర్లమూడిలో 15-03-1898 సం||లో జన్మించారు.
వీరి తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణ. ఈ రచయిత ఇంటర్మీడియట్ విద్య వరకు తెనాలిలో చదివారు.
డిగ్రీ చదవటానికి ఆర్థిక స్తోమత లేకపోతే, దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి సహాయంతో బి.ఎ., పూర్తి చేశారు.
వీరి భార్య పేరు కాంతం. ‘కాంతం కథలు తెలుగు సాహిత్యంలో ఎంతో హాస్యాన్ని సృష్టించాయి. వీరికి ఎంతో పేరు తెచ్చాయి.
ముని మాణిక్యం గారు ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉపాధ్యాయుడుగాను, ఆకాశవాణిలోను ఉద్యోగాలు చేశారు.
మధ్య తరగతి సంసార జీవితంలోని మధురిమలను, ముని మాణిక్యంగారు ఎంతో హృద్యంగా తన రచనలలో పొందుపరిచారు.
కాంతం కథలు, రచనకు వీరి భార్యే ప్రేరణ. దాంపత్యోపనిషత్తు, గృహప్రవేశం, హాస్య కుసుమావళి, తెలుగుహాస్యం, రుక్కుతల్లి, తిరుమాళిగ, దీక్షితులు, కాంతం కైఫీయత్తులు, మొదలైనవి వీరి ఇతర రచనలు.
నిజ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రచించిన వీరి ‘కాంతం కథలు’ ఇప్పటికీ నిత్య నూతన మనిపిస్తాయి.
‘మన హాస్యం’ గ్రంథంలో జీవితంలో హాస్యం అవసరాన్ని, హాస్యం వల్ల కలిగే ఆనందాన్ని, అనుభూతిని హృద్యంగా వివరించారు.
ఆరోగ్యకరమైన హాస్యంతో తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన ముని మాణిక్యం నరసింహారావుగారు 4.2.1973న మరణించారు.
ప్రస్తుత పాఠ్యభాగం హాసము – హాస్యము. అనే వ్యాసం డా|| వెలగా వెంకటప్పయ్య గారి సంపాదకత్వంలో వెలువడిన ‘హాస్యభారతి’ గ్రంథంనుండి గ్రహింపబడినది.
పాఠ్యభాగ సందర్భం
నేడు సమాజంలో జనులు ఎన్నో సమస్యలకు, ఒత్తిడులకు గురవుతూ మనసారా నవ్వుకోలేకపోతున్నారు. జీవితంలో సహజంగా ఉండవలసిన నవ్వుకు, నవ్వు సంఘాలు (laughing clubs) ఏర్పడుతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. మనస్ఫూర్తిగా నవ్వటం ఆరోగ్యానికి హేతువు. ఆరోగ్యకరమైన హాస్యానికి సాహిత్యంలో నేడు కొరత ఉంది.
నవరసాలలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అసందర్భంగా నవ్వితే పెద్దలు ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనేవారు. సందర్భోచితమైన హాస్యం అయితే నవ్వు నాలుగు విధాల మంచిది అనాలి. నవ్వు వల్ల మనసు తేలిక పడుతుంది. మానవ జీవితంలో నవ్వుకు ప్రధాన పాత్ర ఉంది. నవ్వు, ఆనందం లేకపోతే నిరాశా, నిస్పృహలు ఆవరించి జీవితం అంధకార బంధుర మయ్యే ప్రమాదముంది.
అసలు హాస్యమంటే ఏమిటి ? హాస్యంలోని రకాలను, అపహాస్యం గురించి ఈ . పాఠ్యభాగం తెలియజేస్తుంది.
విపరీతమైన ఒత్తిడికి గురవుతున్న నేటి విద్యార్థుల జీవితాల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించటం, తద్వారా వారిలో జ్ఞాపక శక్తిని పెంపొందింపజేయటం ఈ పాఠ్యాంశం ఉద్దేశం.
పాఠ్యభాగ సారాంశం
హాసము :
హాసము అంటే నవ్వు. నవ్వు పుట్టించేది హాస్యము. అసహజము, విపరీతము అయినదేదైనా నవ్వు పుట్టిస్తుంది. వేషము కాని, చేష్టలు కానీ విపరీతంగా వుంటే నవ్వుతాము. వంకరగా మాట్లాడినా నవ్వుతాము. ఏడుపు ఎంత సహజమో నవ్వు అంతే !
బ్రహ్మదేవుడు తను సృష్టించిన పక్షులు, జంతువులు చెట్లు, రకరకాల పువ్వులను చూసి నవ్వుకుని వుంటాడు. గాడిద, ఒంటె ఏనుగు మొదలైన జంతువులలో గల రూప వైవిధ్యం చూసి ఆయనకే నవ్వు వచ్చి ఉంటుంది. కుక్క మొరగటం, గాడిద ఓండ్ర పెట్టటం, ఏనుగు గీపెట్టటం – వీటిలోని శబ్ధ వైవిధ్యం చూసి మళ్ళీ నవ్వుకుని ఉంటాడు. యాడం, ఈవులు కూడ ఒకరిని చూసి ఒకరు నవ్వుకునే ఉంటారు.
బ్రహ్మకు సృష్టిలోని పరిమళ భరితమైన పువ్వులను, పక్షుల మధుర ధ్వనులను, నెమళ్ళు నాట్యాలను చూసి శరీరం ఆనందంతో గగుర్పాటు చెంది ఉంటుంది. అన్ని కళలూ ఆనందంలో పుట్టినవే. ఆనందం బాహ్య రూపమే హాస్యం.
హాస్యము :
సహృదయుడు, ఆరోగ్యవంతుడు, సంస్కారి, నాగరికుడు అయినవాణ్ణి నవ్వించేది హాస్యము. అదే ఉత్తమ హాస్యం. ఆ సంస్కృతుణ్ణి, అనాగరికుణ్ణి నవ్వించే విషయాలు కూడా ఉంటాయి.
మనిషిలో సహజంగా ఉండే కుంటితనము, గుడ్డితనము, అనాకారి తనము, ముక్కొంకర, మూతివంకర వంటి అంగవైకల్యాన్ని చూసి నవ్వటం సభ్యతకాదు. కాని, కుంటిగా నడవాలని నడిచే నటకుని చూసి నవ్వవచ్చు, కాలుజారి పడ్డవానిని, కడుపు నొప్పితో మెలికలు తిరుగుతూ ముఖం వికృతంగా ఉన్నవానిని చూసి నవ్వటం సభ్యతకాదు.
హాస్య లక్షణాలు :
నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని వేవో తెలిసినవాడు సహృదయుడు.
అసహజత్వము :
మనిషి రెండు కాళ్ళతో నడవటం సహజం. విధివశాత్తు ఒకకాలు యుద్ధంలో పోయి ఒక కాలుతో నడిస్తే నవ్వరాదు కాని, ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా, తలకింద పెట్టి కాళ్ళు పైకెత్తినా చూసే వాళ్ళకు నవ్వువస్తుంది. సహజంగా జరగవలసిన పని అలా జరగక ఇంకో విధంగా జరిగితే నవ్వుతాము. పత్నియే పతికి దైవము అంటే సహజ విరుద్ధం కాబట్టి నవ్వువస్తుంది.
అర్థరాత్రి దొంగలు కన్నంవేసి లోపలికి ప్రవేశించారు అన్న సామాన్య విషయాన్ని ఒకడు అతి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ వ్యక్తం చేస్తే నవ్వు వస్తుంది.
సహజమైన విషయాన్ని అసహజమైన దానిగా ప్రదర్శించటంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది. చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటివాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, హాస్య జనకం కావడానికి కారణం. అది అసహజంగా ఉండటమే, అలాగే పానుగంటి వారి బధిర విధవా ప్రహసనం కూడా !
ఆశ్చర్యము :
మనం ఒక కథో, ఉపన్యాసమో వింటున్నప్పుడు దాని ముగింపు ఇలా ఉంటుంది అని ఊహిస్తాం . కాని, చివరలో మనం అనుకున్నట్లు కాక దానికి వ్యతిరేకంగా ఊహించని రీతిలో ముగింపు ఉంటుంది. ఆ ఆశ్చర్యంలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందానుభూతి వలన నవ్వు వస్తుంది. ఒక అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరును గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు.
చక్రవర్తి గ్రీసు మొదలుకొని, బియాస్ నది వరకు గల దేశాన్ని జయించాడని, ఆయన మెట్టని దేశం లేదని, ఆయనకు తలవంచని భూపతి లేడని, కొండవీటి జలపాతం లాగ ఉపన్యాసమిచ్చి ‘చివరకు ఆయన ఏం చేశాడంటే, అని ఆగే సరికి విద్యార్థులంతా ఆ చక్రవర్తి ఏదో మహత్కార్యం చేసి వుంటాడని నోరు తెరచుకుని చూస్తూ వుంటే ఒక వాక్యంతో ఆ ఉపన్యాసాన్ని ముగించాడు. ఆ వాక్యం ఏమిటంటే ఆ మహా చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా. థాం. అని చచ్చాడు. క్లాసంతా గొల్లుమంది.
ఇక్కడ చిన్న విషయాన్ని గొప్ప విషయంగా, అద్భుత విషయంగా చెప్పటం వల్ల ఆశ్చర్యం కలిగి నవ్వు వచ్చింది. ఆయన ఉపన్యాసం ఇస్తున్నంత సేపు ఆ క్రమమూ, ఉద్వేగము, తీవ్రత మొదలైన భావాలతో గాంభీర్యం స్థాయి అయి వుండగా హఠాత్తుగా ఆ భావాలకు భిన్నమైన పేలవమైన భావాన్ని ఆ వరసలో నిలిపే సరికి, ఆ వృత్తాంత మంతా వికృతమై, అసహజమై ఫక్కున నవ్వు వస్తుంది. ఎక్కడ వికృతము, అసహజత్వం ఉంటుందో అక్కడ హాస్యజనక వృత్తాంతము ఉంటుంది.
ఒక మాటకు ఉన్న అర్థానికి భిన్నమైన వేరే అర్థాన్ని స్ఫురింపజేసి మృదుమధుర మందహాస పరిమితమైన హాస్యాన్ని సాధించవచ్చు.
క్షురకుడు క్షవరం చేస్తున్నాడు. ముఖం మీద గాట్లు పడి రక్తం వస్తున్నది. బాధ తగ్గించటానికి క్షురకుడు ఆ మనిషిని మరో సంభాషణలోనికి దించుతాడు. కాని, క్షురకుడి అసమర్థత వలన ఆ మనిషికి కలిగిన మనఃక్లేశము ధ్వని నిక్షిప్తమై క్షురకుడికి తలవంపులు కలిగించినా, ఇందులో కూడ కొంత ఆశ్చర్యం కలిగి నవ్వువస్తుంది.
సందర్భ శుద్ధి లేకపోవడం :
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో వికృతి నవ్వుకు కారణ మవుతుంది. ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డికోసం అన్నట్లు, ఇలాంటివి కొన్ని.
అప్రియమును ప్రియముగా మలచుట :
కష్టం కలిగించే విషయాన్నీ మెత్తని మాటలతో చెప్పటం వల్ల వికృతి జనిస్తుంది. అప్రిమమూ, సౌకుమార్యము భిన్న భిన్న విషయాలు. ఇవి ఒక చోట చేరటం వల్ల హాస్యానికి ఆలంబన అవుతుంది.
అతిశయోక్తి :
ఒకామె నల్లని నలుపట. ఆమెకు చెమట పోసినపుడు ఆ చెమటను గుడ్డతో అద్ది గాజు బుడ్డిలో పిండి కావలసినంత నల్లసిరా తయారు చేసుకోవచ్చుట. ఇది అతిశయోక్తి అంటే అభూత కల్పన అతిశయోక్తి హాస్య జనకం కావాలంటే దాని పునాదులు అసత్యం మీద వేయాలి. అప్పుడే అది నవ్వు పుట్టించే శక్తిగల అతిశయోక్తి అవుతుంది.
ఏది హాస్యంకాదు :
భయంకరమైన దృశ్యాలు, జుగుప్సాకరమైనవి దుఃఖ హేతువులు అయిన వృత్తాంతాలు అసందర్భమైన వర్ణనలు హాస్యవంతాలు కావు. తాటకి ముక్కూ చెవులు కోయటం భీభత్స రసాన్ని పుట్టిస్తుంది కాని, హాస్య జనకం కాదు. అది నవ్వు పుట్టించే విషయంగా భావించేవాడు పసిపిల్లవాడయినా అయి వుండాలి, పిచ్చివాడయినా అయి వుండాలి.
కఠిన పదాలకు అర్ధాలు
రూప వైవిధ్యం = అనేక రకాల రూపాలు (భిన్నరూపాలు)
స్వర వైవిధ్యం = అనేక రకాల స్వరాలు (భిన్న స్వరాలు)
ఒడలు = శరీరం
చతుర్ముఖుడు = నాలుగు ముఖాలు కలవాడు – బ్రహ్మ
మహతి = నారదుని వీణ పేరు
స్తుతించటం = పొగడటం
ఆవిర్భవించు = పుట్టు
నటకుడు = నటుడు
సభ్య త = సంస్కారము
బహుజన నమ్మకం = ఎక్కువ మంది జనుల నమ్మకం
పర్యవసానము = ఫలితం, ముగింపు
కథాంతం = కథ చివరలో
ధరణీపతులు = రాజులు
నిర్దూమధామం చేయు = పూర్తిగా ధ్వంసం చేయు
మెట్టని = అడుగు పెట్టని
భూపతి = రాజు
మహత్కార్యము = గొప్పపని
మహద్విషయము = గొప్ప విషయము
స్వల్ప విషయం = చిన్న విషయము
ఉత్సుకత = కుతూహలం, తహతహ
ఉద్వేగము = వణుకు, కలత చెందు
పేలవము = రసహీనము
హాసజనకము = నవ్వుపుట్టించేవి
సాధికమైన = సాధించబడిన
నిర్దేతుకము = సరైన కారణము లేని
నిర్నిరీక్షితము = ఎదురు చూడలేని
క్షురకుడు = మంగలి
క్షవరితుడు = క్షురకర్మ చేయించుకునేవాడు
మనః క్లేశము = మనసుకు కలిగిన కష్టము
ధ్వని నిక్షిప్తము = ధ్వనిలో ఉంచిన
అవాకులు చవాకులు = అసందర్భమైన మాటలు
అతిశయోక్తి = ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పటం
అభూతకల్పన = లేనిది కల్పించటం
సప్తసముద్రాలు = ఏడు సముద్రాలు
ఆపోశన పట్టటం = భోజన సమయంలో పుడిసిట పట్టిన నీళ్ళు మంత్ర పూర్వకంగా తాగటం
వైపరీత్యుక్తులు = విపరీతమైన మాటలు
జుగుప్సాకరమైనవి = అసహ్యకరమైనవి
భీభత్సరసము = నవరసాలలో ఒకటి
హాస్యజనకం = నవ్వు పుట్టించేది
లంకా దహన దృశ్యం = లంకను కాల్చే దృశ్యం
రాక్షసుల గృహాలు = రాక్షసుల ఇళ్ళు
విరోధులు = శత్రువులు
దుఃఖ హేతువులు = దుఃఖమునకు కారణములు