AP Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Intermediate 1st Year Telugu Grammar స్థూల అవగాహన Questions and Answers.

AP Intermediate 1st Year Telugu Grammar స్థూల అవగాహన

1. మన తెలుగు

తెలుగు భాషకు ఆంధ్రభాష, తెనుగు భాష అనే పేర్లు కూడా ఉన్నాయి. మన తెలుగు కవులు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని తెలుగును ప్రస్తుతించారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మన తెలుగును ‘సుందర తెలుంగు’ అని కొనియాడారు. క్రీ.శ. 15వ శతాబ్దపు ఇటలీ యాత్రికుడు నికోలో డి కాంటే తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని ప్రశంసించాడు.

తెలుగు అంజంత భాష, కాబట్టి నాద సౌష్ఠవం కలిగి, సంగీతానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా వేనోళ్ళ ప్రస్తుతించబడిన మధురమైన మన తెలుగు భాషను పరభాషా ప్రభావాలతో మనవారే చిన్న చూపు చూడడం చాలా దురదృష్టకర విషయం. తెలుగు భాషను రక్షించుకొని దానికి పూర్వ వైభవాన్ని తీసుకు రావడం తెలుగువారందరి ప్రథమ కర్తవ్యం.

ప్రశ్నలు :
1. నికోలో డి కాంటే ఎవరు ?
2. తెలుగు భాషకు గల ఇతర పేర్లేవి ?
3. తెలుగు భాషను నికోలో డి కాంటే ఏమని కీర్తించాడు ?
4. ‘సుందర తెలుంగు’ అని తెలుగును ఎవరు ప్రశంసించారు ?
5. తెలుగువారి ప్రథమ కర్తవ్యం ఏమిటి ?

AP Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

2. సావిత్రిబాయి పూలే

ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని ప్రగాఢంగా నమ్మిన మహిళ సావిత్రిబాయి ఫూలే. ఈమె సామాజికంగా వెనుకబడిన వర్ణాల, నిమ్నవర్ణాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావ్ ఫూలే భార్య. భర్తతో కలసి ఈమె 1848 జనవరి 1న పూనేలో దేశంలోనే మొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. కులవ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. శూద్రుల, దళితుల, మహిళల సకల హక్కులకోసం పోరాటం చేయటం తమ బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు.

ఈమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831, జనవరి 3న జన్మించారు. సావిత్రిబాయి 1948లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా ప్రకటించింది.

ప్రశ్నలు :
1. సావిత్రిబాయి ఫూలే ఎప్పుడు జన్మించారు ?
2. సావిత్రిబాయి ఫూలే భర్తపేరేమిటి ?
3. సావిత్రిబాయి ఫూలే జన్మదిన ప్రత్యేకత ఏమిటి ?
4. మనదేశంలో మొదటి బాలికల పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది ?
5. స్త్రీ విముక్తి ఎలా సాధ్యపడుతుందని సావిత్రిబాయి ఫూలే భావించారు ?

3. అవయవ దానం

ప్రాణాలను కాపాడేందుకు లేదా పరిశోధనల నిమిత్తం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి శరీర భాగాలను. అమరుస్తారు. బ్రతికి ఉన్న వారి నుంచి కొన్ని శరీర భాగాలను తీయడం ఒక పద్ధతి; చనిపోయిన వారి నుంచి కొన్ని శరీర భాగాలను వెలికితీసి మరొకరికి అమర్చడం ఇంకో పద్దతి. అవయవ దానం ప్రక్రియ కుటుంబ సభ్యుల ఆమోదంతో పూర్తి పారదర్శకంగా జరుగుతుంది.

AP Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రపంచంలో తొలిసారిగా 1954లో అవయవ దానం చేసిన దాత ‘రొనాల్డ్ లీ హెరిక్’. అతి వృద్ధ అవయవ దాతగా స్కాట్లాండ్ దేశానికి చెందిన 107 సంవత్సరాల మహిళ తన కంటోని కార్నియాను దానం చేయడం ద్వారా చరిత్రలో నిలిచారు. అవయవ దానాన్ని వ్యాపారంగా నిర్వహించడం చట్టప్రకారం నేరం. ఆగష్టు 13వ తేదీన అవయవ దాన దినోత్సవంగా ప్రకటించి, ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు :
1. ప్రపంచంలో తొలి అవయవ దాత ఎవరు ?
2. అవయవ దానానికి ఎవరి అనుమతి తప్పనిసరి ?
3. అతివృద్ధ అవయవ దాత ఏ దేశానికి చెందినవారు ? వారి వయస్సు ఎంత ?
4. అవయవ దానాన్ని ఏ విధంగా నిర్వహించరాదు .?
5. ఏ రోజును అవయవ దాన దినంగా ప్రకటించారు ?

4. శంకరంబాడి సుందరాచారి

తెలుగు ప్రజల రాష్ట్ర గీతంగా ప్రసిద్ధి చెందిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే గేయాన్ని రచించి, తెలుగు తల్లి వైభవాన్ని కీర్తించినవారు శంకరంబాడి సుందరాచారి. కమలమ్మ, రాజగోపాలచారి దంపతులకు ప్రథమ సంతానంగా శంకరంబాడి తిరుపతిలో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అనేక రకాల ఉద్యోగాలు చేశారు. బాల్యం నుంచే కవిత్వం పట్ల ఆసక్తి పెంచుకున్న సుందరాచారి అనేక కావ్యాలు, వచన రచనలు, పల్లెపదాలు, నాటకాలు రచించారు.

హెచ్.ఎం. రెడ్డి గారి ‘దీనబంధు’ చిత్రం కోసం శంకరంబాడి ‘మా తెలుగు తల్లికి’ అనే గీతాన్ని రాశారు. అయితే దీన్ని ఆ చిత్రంలో వినియోగించలేదు. 1975లో హైదరాబాద్లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మా తెలుగు తల్లికి’ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించింది. ఆ సభలో టంగుటూరి సూర్యకుమారి లండను నుండి వచ్చి ఈ గీతాన్ని ఆలపించారు.

ఈ గేయ రచనకుగాను రాష్ట్ర ప్రభుత్వం శంకరంబాడి జీవించినంత కాలం నెలకు రెండు వందల యాభై రూపాయల గౌరవవేతనాన్ని మంజూరు చేసింది. 1957లోనే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం శంకరంబాడికి ‘ప్రసన్నకవి’ అని బిరుదునిచ్చి సత్కరించింది.

ప్రశ్నలు :
1. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని మొదటగా ‘ఎవరు ఆలపించారు ?
2. శంకరంబాడి తల్లిదండ్రుల పేర్లేమి ?
3. శంకరంబాడికి గల బిరుదు ఏమిటి ?
4. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి ?
5. శంకరంబాడి సుందరాచారి రచించిన ప్రసిద్ధ గేయమేది ?

5. తోలు బొమ్మలాట

మన జానపద కళల్లో ఒకానొక విశిష్టమైన కళారూపం తోలుబొమ్మలాట. ఇది క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే చాలా ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. తెల్లటి వస్త్రాన్ని తెరగా అమర్చి, దానిపై దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శిస్తారు. ఈ తోలుబొమ్మలు ఆంధ్రదేశంలోని ప్రాచీన ఓడరేవుల ద్వారా భారతీయులతో బాటు విదేశాలకు వెళ్ళాయి.

AP Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

నేడు పాశ్చాత్య దేశాలలో గొప్పగా చెప్పుకొనే ఛాయా ప్రదర్శనలకు ఈ తోలు బొమ్మలే మూలం. మన దేశంలో ఈ ఆటలో భారత, రామాయణ కథలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఈ ఆటలోని అల్లాటప్పగాడు, బంగారక్క జట్టుపోలిగాడు, కేతిగాడు వంటి హాస్యపాత్రలు గ్రామీణుల మనసులపై విశేషమైన ముద్రవేశాయి. వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచే ఇటువంటి కళారూపాలను కాపాడుకోవడం మన ప్రస్తుత కర్తవ్యం.

ప్రశ్నలు :
1. తోలుబొమ్మలాటలో ఏ కథలు ఎక్కువగా ప్రదర్శిస్తారు ?
2. తోలుబొమ్మలాటలు ఎప్పటి నుండి ప్రచారంలో ఉన్నాయి ?
3. .విదేశాలలోని ఛాయా ప్రదర్శనకు మూలమేది ?
4. మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి ?
5. తోలుబొమ్మలాటలోని హాస్యపాత్ర లేవి ?

Leave a Comment