AP Inter 1st Year Telugu Grammar లేఖారచన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Intermediate 1st Year Telugu Grammar లేఖారచన Questions and Answers.

AP Intermediate 1st Year Telugu Grammar లేఖారచన

లేఖ అంటే జాబు, ఉత్తరం. లేఖ లిఖిత సంప్రదాయానికి చెందింది. ఒక చోట నుండి మరో చోటుకు, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సమాచారాన్ని చేరవేయడానికి ఉపయోగపడే రచనా మాధ్యమం లేఖ. ‘ఉత్తరం’ రాయడం ఒక కళ. ఆత్మీయతకు చిహ్నంగా, మర్యాదస్తుల లక్షణంగా, అవసరానికి బంధువుగా, ఆవేశానికి ఆయుధంగా, ప్రేమకు కానుకగా ఉత్తరాలు ఉపయోగపడుతున్నాయి.

లేఖ స్వరూపాన్ని పరిశీలిస్తే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు ఇవి –

  1. ఉత్తరం రాసే వారి చిరునామా, తేది.
  2. సంబోధన (పిలుపు)
  3. ఉత్తరంలో చెప్పదలుచుకున్న ప్రధాన విషయం
  4. ముగింపు
  5. లేఖ రాసిన వారి సంతకం 6. ఎవరికి రాస్నున్నామో వారి చిరునామా.

1. ఉత్తరం రాసే వారి చిరునామా, తేది :
ఎవరు లేఖను రాస్తున్నారో వారి చిరునామా లేఖ పై భాగంలో కుడి పక్కన రాయాలి. సంక్షిప్తంగా ఉత్తరం ఎక్కడి నుంచి రాస్తున్నామో ఆ ప్రదేశం పేరు రాసినా సరిపోతుంది. లేఖా రచనలో విరామ చిహ్నాలకు ప్రాధాన్యం ఉంటుంది. దాని కింద తేదీని తప్పని సరిగా రాయాలి. చిరునామా రాసేటప్పుడు వారి పేరు తర్వాత కామా, ఊరిపేరు తరువాత కామా, ఆనాటి తేదీ తరువాత ముగింపు చుక్క (ఫుల్ స్టాప్) ఉండాలి.

2. సంబోధన (పిలుపు) :
లేఖ ఎవరికి రాస్తున్నామో వారిని సంబోధిస్తూ ఎడమ వైపు రాయాలి. మనం లేఖ రాస్తున్న వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి సంబోధన మారుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు రాసే సందర్భంలో ప్రారంభంలో భాగంగా –

పూజ్యులయిన నాన్న గారికి / అమ్మగారికి అనీ స్నేహితులకైతే – ప్రియ మిత్రునికి / ప్రాణ స్నేహితునికి / ప్రియమైన రవికి అనీ పరిచయం లేని వారికి, అధికారులకు – అయ్యా / అమ్మా అని సంబోధించాలి. అంతగా పరిచయం లేని మిత్రులకు ఉత్తరం రాసేటపుడు పేరుకు ముందు శ్రీ / శ్రీమతి / కుమారి లాంటివి చేర్చాలి. బంధువుల విషయంలో ‘ప్రియమైన అన్నయ్యకు / తమ్మునికి / అక్కయ్యకు / మామయ్యకు / చెల్లికి అని పేర్కొనాలి.

AP Inter 1st Year Telugu Grammar లేఖారచన

మనం ఉత్తరం రాస్తున్న వారికి మనతో ఉన్న అనుబంధాన్ని బట్టి సంబోధన మారుతూ ఉంటుంది.

వివాహిత స్త్రీలకు ‘శ్రీమతి’, అవివాహిత స్త్రీలకు ‘కుమారి’, చిన్నపిల్లలకు ‘చిరంజీవి’. ఈ అని సంబోధించి రాయాలి. అధికారులకు రాసే లేఖల్లో గౌరవ్యులైన, మహారాజ రాజశ్రీ, మాన్యశ్రీ అనీ సంబోధన అవసరం.

సంబోధన ఉత్తరం ఎడమవైపు ఉంటుంది. దీని తర్వాత కామాను ఉంచాలి.

3. ఉత్తరంలో చెప్పదలచుకున్న ప్రధాన విషయం :
సంబోధన క్రిందుగా కొంచెం కుడివైపు నుంచి ప్రధాన విషయాన్ని ప్రారంభించాలి. వ్యక్తిగత ఉత్తరాల్లో తమకంటే పెద్దలైన వారికి వందనాలు, నమస్కారాలు; చిన్నవారికి దీవెనలు, ఆశీస్సులు తెలియచేయాలి. క్షేమ సమాచారాలు ఇచ్చి పుచ్చుకోవడం తెలుగువారి సంప్రదాయం. అధికారిక ఉత్తరాల్లో అవసరం లేదు.

‘ప్రధాన విషయం ‘ అంశంలో భాష సరళంగా ఉండాలి. విషయం సూటిగా, సంక్షిప్తంగా ఉండాలి. విషయం విస్తారమైనపుడు పేరాలుగా విభజించి రాయాలి.

4. ముగింపు :
లేఖ ముగింపులో కుడివైపున అనుబంధాన్ని, గౌరవాన్ని సూచించే పదం రాయాలి. ఉదాహరణకు స్నేహితునికైతే ప్రియమిత్రుడు /ప్రాణ స్నేహితుడు వంటి పదాలు, తల్లిదండ్రులకైతే ప్రియ పుత్రుడు / ప్రియ పుత్రిక వంటి పదాలు రాయాలి. వ్యాపార, వ్యవహార, అధికారిక లేఖల్లో భవధీయుడు, విశ్వాస పాత్రుడు లాంటి పదబంధాలను ఉపయోగించాలి.

5. లేఖ రాసిన వారి సంతకం :
ముగింపుకి కొంచెం క్రింద ఉత్తరం రాసేవారు సంతకం చేయాలి. అవసరం మేరకు సంతకం క్రింద కుండలీకరణంలో ఉత్తరం రాసే వారి పూర్తి పేరు విడి అక్షరాల్లో రాయాలి.

AP Inter 1st Year Telugu Grammar లేఖారచన

6. ఎవరికి రాస్తున్నామో వారి చిరునామా :
ముగింపు తరువాత ఉత్తరం రాసిన వారి సంతకం ఉంటుంది కదా. దానికి ఒక గీత క్రింద ఎడమ వైపున ఉత్తరం ఎవరికి చేరాలో వారి పూర్తి చిరునామా పిన్ కోడ్ తో సహా రాయాలి. అధికారులకు రాసే ఉత్తరంలో ప్రారంభంలో ఎడమవైపు ఉత్తరం రాసే వాళ్ళ చిరునామా, దాని క్రింద ఎవరికి ఉత్తరం రాస్తామో వారి చిరునామా రాయాల్సి ఉంటుంది.

పరీక్షలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. పరీక్షల్లో భాగంగా లేఖా రచనలో అభ్యర్థుల హాల్ టికెట్ నెంబరు, చరవాణి నంబరు, పేరు, చిరునామాలు వ్రాయకూడదు. వాటి స్థానంలో XXXXX అని రాసి విరామ చిహ్నాలు ఉపయోగించాలి.
  2. ఉద్యోగాల కోసం, పత్రికలకు కథలు, కవితలు రాసేటపుడు జవాబు కోసం స్టాంపులు అంటించిన కవరు జత చేయాలి.

నమూనా లేఖలు :

1. తల్లిదండ్రులకు లేఖ

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

పూజ్యులైన అమ్మకీ, నాన్నకీ,

నమస్కారాలు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను బాగా చదువుకుంటున్నాను. చెల్లెలు ఎలా చదువుతుంది ?

మా గురువులు చెప్పే పాఠాలు క్షుణ్ణంగా చదువుకుంటున్నాను. ప్రతిరోజూ గ్రంథాలయానికి వెళ్ళి దినపత్రికలు చూసిన తరువాత, అక్కడే కూర్చొని మూడు గంటల పాటు తరగతి పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తున్నాను. మార్చిలో పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఎక్కువసేపు కష్టపడుతున్నాను. నాకు మిమ్మల్ని చూడాలనుంది. పరీక్షలు ప్రారంభమయ్యేలోపు మీరు తప్పకుండా రావాలి. నాయనమ్మ, తాతయ్యలకు నా నమస్కారాలు తెలియజేయగలరు. నా స్నేహితులు రాజు, కస్తూరిలను అడిగినట్లు చెప్పగలరు. మీ రాకకోసం ఎదురు చూస్తుంటారు.

నమస్సులతో

మీ కుమారుడు,
XXXXXXXX,

చిరునామా :
XXXXXX.
XXXXXX,
XXXXX,
XXXX.

2. కళాశాల ప్రధానాచార్యులు గారికి లేఖ

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
…………….,
విశాఖపట్నం.
మహోదయులకు !

విషయం : బదిలీ పత్రం (టి.సి.) గురించి విజ్ఞప్తి.

నేను ఈ కళాశాలలో బైపిసి గ్రూపులో 2016 – ’18 విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేశాను. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. విశాఖపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘బియస్సీ’లో ప్రవేశానికి అనుమతినిస్తూ ప్రధానాచార్యుల నుండి ఉత్తరం వచ్చింది. కావున డిగ్రీలో చేరుతున్నందున బదిలీ పత్రం ఇవ్వవలసిందిగా ప్రార్థన.

ధన్యవాదాలు,

భవదీయుడు
XXXXXX.

3. స్నేహితులకు లేఖ

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

ప్రియమైన విద్యకు,

నేను క్షేమం. నువ్వెలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? నేను బాగా చదువుతున్నాను. మా కళాశాలలో కమల, విమల అనే ఇద్దరు ఈ మధ్యనే స్నేహితులయ్యారు. ముగ్గురం కలసి బాగా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటాం; కలిసే. చదువుకుంటాం. మా కళాశాలలో ప్రతి శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటాం. నువ్వు చెప్పినట్లుగా ఎన్.సి.సి.లో చేరాను. మా కళాశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

వక్తృత్వ పోటీలో ప్రథమ బహుమతి లభించింది. క్రీడలలో కూడా 200 మీ. పరుగు పందెంలో రెండవ స్థానం లభించింది. జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఈ బహుమతులు ఇస్తామని ప్రధానాచార్యులు చెప్పారు. ఇటీవలే క్షేత్ర పర్యటనలో భాగంగా మా అధ్యాపకులు ‘అమరావతికి’కి తీసుకువెళ్ళారు. అక్కడ నూతన రాజధాని నిర్మాణం, అమరావతిలోని ‘చారిత్రక ప్రదేశాలను చూసి చాలా విషయాలు తెలుసుకున్నాను.

మనం ఉన్నత విద్య చదవాలని లక్ష్యం పెట్టుకున్న విషయం గుర్తు ఉంది కదా, నేను బాగా కష్టపడుతున్నాను. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. నేను బాగా చదివి నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను. నేను చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకొస్తాను. నీవు కూడా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించగలవని నా నమ్మకం.

ఈ మధ్య మన ఊరికి వెళ్ళావా? మన స్నేహితులు లక్ష్మీ, సరస్వతి ఎలా ఉన్నారు? మీ అమ్మా, నాన్నలను అడిగినట్లు చెప్పు. మీ కళాశాల విశేషాలతో నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తుంటాను.

ఇట్లు
నీ స్నేహితురాలు
XXXXXX.

చిరునామా :
XXXXXXXXX,
XXXXXXX,
XXXXXX,
XXXXX.

4. అధికారికి లేఖ

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

స్థానిక డివిజనల్ ఇంజనీర్ గారికి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ,
కర్నూలు.

విషయం : ఇంటర్ పబ్లిక్ పరీక్షల సమయంలో విద్యుత్ కోత నివారణ గురించి. ఆర్యా / అయ్యా / అమ్మా !

నమస్కారాలు. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మార్చి నెలలో మాకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవబోతున్నాయి. ఇప్పుడే విద్యుత్ కోతలు ప్రారంభించారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మార్చిలో విద్యుత్ కోతలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలప్పుడు విద్యుత్ లేకపోవడం వల్ల చదువుకి అంతరాయం కల్గింది. కనీసం ఈ సారైనా విద్యుత్ కోత లేకుండా చూడగలరు. రాత్రి పూట. అయినా కోతలేకుండా ఉంటే చదువుకోగల్గుతాము. నాలాంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయం తీసుకోగలరని మనవి.

ఇట్లు
తమ విధేయుడు,
XXXXXXXX.

చిరునామా:
XXXXXXXX,
XXXXXXXX,
XXXXXX.

5. ఉద్యోగానికి దరఖాస్తు లేఖ

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

శ్రీయుత గౌరవనీయులైన
………. గారికి

విషయం : ఉద్యోగం కోరకు విజ్ఞప్తి.
ఉటంకింపు : తేది. XXXXXX నాటి ఎంప్లాయిమెంట్
వార్తాపత్రికలో ప్రకటన ప్రకారం.

అయ్యా !

నమస్కారం. తేది. XXXXXXX నాటి ఎంప్లాయిమెంట్ వార్తాపత్రికలోని ఉద్యోగ ప్రకటన ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను. మీరు ప్రకటించినట్లుగా కావలసిన విద్యార్హతలు నాకున్నాయి. విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను ఈ దరఖాస్తుతో జత పరుస్తున్నాను. కావున వాటిని పరిశీలించగలరని విజ్ఞప్తి.

ఉద్యోగం ఇచ్చినట్లయితే మీ సంస్థకు గౌరవం పెరిగేలా విధులు నిర్వర్తిస్తాననీ, సంస్థ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తాననీ, సవినయంగా మనవి చేస్తున్నాను. నాకు ఈ ఉద్యోగ అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను.

కృతజ్ఞతలతో,

భవదీయ,
XXXXXX.

జతచేస్తున్న పత్రాలు :

  1. విద్యార్హతల ధృవీకరణ పత్రాలు,
  2. అనుభవ పత్రం,
  3. నివాస పత్రం,
  4. జనన ధృవీకరణ పత్రం.

Leave a Comment