AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 3 శివతాండవం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 3rd Lesson శివతాండవం

9th Class Telugu 3rd Lesson శివతాండవం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట నా గానపు గతికి జతికి గణపతి నర్తించాడట నా గానపు మధురిమలకు కృష్ణమురళి మోగిందట నా గానపు రసఝరిలో ప్రకృతి నాట్య మాడిందట

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పంక్తులు దేని గురించి చెబుతున్నాయి?
జవాబు:
గాన మహిమ గురించి చెబుతున్నాయి.

ప్రశ్న 2.
ఈ పంక్తులలోని ముఖ్యమైన పదాలేవి?
జవాబు:
తాండవం, నర్తించడం, నాట్యమాడటం.

ప్రశ్న 3.
ఈ పంక్తులు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీరు పొందిన అనుభూతి ఏమిటి?
జవాబు:
గానం యొక్క గొప్పదనానికి ఒళ్ళు పులకరించింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 4.
ఇలాంటి గేయం మీకు తెలుసా?
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు “శివతాండవం” గేయం రాశారనీ, అందులో గేయ పంక్తులు ఇలాగే ఉంటాయనీ మా గురువులు చెప్పగా విన్నాను. శివతాండవంలోని కొన్ని గేయ పంక్తులు ఇవి.
ఉదా :
1) బంగరు పులుగుల వలె మబ్బులు విరిసినవి.
2) వియచ్చర కాంతలు జలదాంగనలై వచ్చిరొయేమో.
3) అలలై బంగరు కలలై.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
మీకు తెలిసిన నాట్యరీతుల గురించి చెప్పండి.
జవాబు:
కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథాకళి, మోహినీ అట్టం.

ప్రశ్న 2.
‘శివతాండవం’ గేయాన్ని లయబద్దంగా పాడండి. ఇది వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
జవాబు:
అచ్చ తెలుగు పదాల అందం తెలిసింది. గేయం వినసొంపుగా ఉండి, తెలియని ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 3.
పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవాన్ని “నల్లకలువలు విచ్చుకొన్నట్లు, నల్లని కొండలు పగిలినట్లు, చీకట్లు వ్యాపించినట్లు” – ఇలా ఎన్నో అంశాలతో పోల్చారు కదా ! ఇలాంటి పోలికల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
ప్రకృతిని కవి చక్కగా వర్ణించాడు. ఈ వర్ణన ద్వారా శివుని తాండవాన్ని మన కన్నులకు కట్టేలా చూపగలిగాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఆ) గేయంలో అంత్యప్రాస పదాలు ఏమున్నాయి? పాఠ్యభాగంలో గుర్తించి కింద గీత గీయండి.
జవాబు:
శివుడు భవుడు; పూయ ఘోయ; విధాన; అట్లు

ఇ) కింది గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

మహాశివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలోని డమరుకాన్ని 14 మార్లు మోగించాడు. ఆ ధ్వని విశ్వవ్యాప్తమైంది. పాణిని అలా వెలువడ్డ శబ్దాలను స్వీకరించి సంస్కృత భాషలో సూత్రమయమైన వ్యాకరణాన్ని రచించాడు. “అ ఇ ఉణ్, ఋ, ఇక్ ……. అంటూ 14 మాహేశ్వర సూత్రాలతో తన వ్యాకరణ రచన ఆరంభించాడు. ప్రపంచ వాజ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమమైనది.

ప్రశ్న 1.
శివుడు డమరుకం ఎందుకు మోగించాడు?
జవాబు:
శివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలోని డమరుకాన్ని మోగించాడు.

ప్రశ్న 2.
పాణిని వ్యాకరణం గొప్పతనం ఏమిటి?
జవాబు:
ప్రపంచ వాజ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమమైనది.

ప్రశ్న 3.
పై సన్నివేశం దేనికి ప్రారంభంగా చెప్పవచ్చు?
జవాబు:
పాణిని సంస్కృత వ్యాకరణ రచనకు ప్రారంభంగా చెప్పవచ్చు.

ఈ) కింది ప్రశ్నలకు పాఠ్యాంశం నుండి సంక్షిప్తంగా సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పాఠంలో గేయంలోని మొదటి చరణం చదవండి. శివతాండవాన్ని కవి ఎలా వర్ణించాడో రాయండి.
జవాబు:
స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా, అందమైన పూలను కుప్పపోసినట్లుగా, తెల్లని విబూదితో పూత పెట్టినట్లుగా, మంచు కుప్పలుగా పేర్చినట్లుగా, మంచి ముత్యాలను ఏర్చికూర్చినట్లుగా, సరిపోల్చలేని అమృతాన్ని పంచి పెట్టినట్లుగా, పచ్చ కర్పూరాన్ని తెచ్చి కలియజల్లినట్లుగా, మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు వెల్లివిరిసేలా, ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మోగుతుండగా ఆడుతూ పాడుతున్నాడు శివుడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
‘తమ్ములై’ – అంటూ సాగిన గేయంలో శివుని నాట్యాన్ని కవి కొన్ని పూలతో పోల్చాడు. వాటిని తెలపండి.
జవాబు:
శివుని తాండవం తామరపూలు విప్పారినట్లుంది. శుభాలనిచ్చేదిగా ఉంది. అప్పుడే విచ్చిన తాజా పూమొగ్గల్లా, వికసించిన పూలలా ఉంది. తుమ్మెదలచే కప్పబడిన తామరలా ఉంది. కొత్త రత్నాల్లాగా ఉంది.

ప్రశ్న 3.
తెల్లదనాన్ని తెలిపే కొన్ని అంశాలతో శివతాండవాన్ని పోల్చారు. ఉదాహరణకు ‘వెన్నెల కురుస్తున్నట్టు’ మొదలైనవి. ఇలాంటి అంశాలను కొన్నింటిని రాయండి.
జవాబు:
శివుని తాండవం స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లు, తెల్లని విబూదితో పూత పెట్టినట్లు ఉంది. జాజిపూలను కుప్పలుగా పోసినట్లు, మంచును కుప్పలుగా పేర్చినట్లుంది. మంచి ముత్యాలను ఏర్చికూర్చినట్లు, పచ్చ కర్పూరం కలియజల్లినట్లుగా ఉంది. ఇంకా ఆనందం కన్నుల నుండి కారుతున్నట్లుగా, అమృతాన్ని పంచినట్లుగా ఉంది.

ప్రశ్న 4.
శివుని నాట్యాన్ని వర్ణించే కొన్ని పంక్తులను రాసి, వాటిని వివరించండి.
జవాబు:
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బికొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బి సేరు విధాన
నల్లకలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
నగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల దీరు విధాన
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు!
పాడెనమ్మా! భవుడు

శివుని తాండవం మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి, అలముకొన్నట్లుగా ఉంది. అద్భుతమైన నీలమణులను ఒకే చోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులంతా వికసించినట్లుగా ఉంది. తుమ్మెదలు ఒక చోట చేరి ముసిరి ఉన్నట్లుగా అందంగా ఉంది. కాటుక కొండ పగలగా కాటుకంతా చెదరిపోయినట్లుగా ఉంది. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకున్నట్లుగా శోభాయమానంగా ఉంది. తనలోని అజ్ఞానమంతా కళ్ళనుంచి కారిపోతున్నట్లుగా, మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కనిపిస్తున్నట్లుగా ఉంది. చురుకు నీలపు కళ్ళలో కాంతులు వికసిస్తుండగా పాదాలకున్న గజ్జెలు మోగుతుండగా ఆడుతూ పాడుతున్నాడు శివుడు.

ఇందులో నలుపే ఎక్కువగా వర్ణించబడింది. సాధారణంగా, నలుపును అశుభసూచకంగా లోకం భావిస్తుంది. కానీ నలుపు కూడా దైవ స్వరూపమే అని కవి చెప్పడం వలన లోకంలో దైవ స్వరూపం కానిదేదీ లేదనే భావన కలుగుతుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వసంతశోభ ఎలా కమ్ముకుందో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వసంత ఋతువు ఆరంభం కాగానే ఎండిన చెట్లకు జీవం వచ్చి క్రమంగా లేజిగురాకులు రాసాగాయి. చెట్లు, తీగలు, పూలతో నిండి కొత్త శోభను వెదజల్లుతున్నాయి. లేజిగురాకుల ఎర్రని సోయగం వింత కాంతిని విరజిమ్ముతుంది. ఎక్కడ చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది. పూలపై నుంచి వచ్చే పరిమళాలతో కూడిన గాలులు జనాలను ఉత్సాహ పరుస్తున్నాయి. మామిడి చిగుళ్ళను తిని మదించిన కోయిలల కుహూ రాగాలతో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
ఈ పాఠ్యభాగంలోని కవి వర్ణనల్లో మీకు బాగా నచ్చిన అంశమేది? అది ఎందుకు నచ్చింది? వివరించండి.
జవాబు:
పాఠ్యభాగంలోని కవి వర్ణనల్లో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే – శివుని తాండవం అలలు కదలినట్లుగా, చిరుగాలికి ఆకులు కదలినట్లుగా ఉంది. తామర పూలు కదలినట్లు, పూలలోని సువాసనలు గాలిలో వ్యాపించినట్లుంది. తెరపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లుంది. కమ్మని కస్తూరి పరిమళ వీణలు మోగినట్లు, నెమలి అందమైన తన పింఛాన్ని విప్పినట్లుంది. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదిలినట్లు, నవ్వులో లేత వలపు జాలువారినట్లుంది. చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరబూస్తుండగా, ఘల్లు ఘల్లుమని పాదాలకున్న చిలిపి గజ్జెలు మోగేలా శివుడు ఆడుతూ పాడుతున్నాడు. నెమలి పురివిప్పి ఆడడం, అలలు కదలడం, సువాసనలు వ్యాపించడం, గాలికి ఆకులు కదలడం, తెరపై బొమ్మలు నటించడం, నవ్వులో ప్రేమ ఒలకపోయడం ఇవన్నీ నిత్య జీవితంలో మన కెదురయ్యే అనుభవాలు. ఇలాంటి వాటితో శివతాండవాన్ని పోల్చడం వలన అది మన కనుల ముందు కన్పిస్తున్న భావన కలుగుతుంది. అందువలన ఈ భాగం నాకు బాగా నచ్చింది.

ప్రశ్న 3.
“శివుని తాండవం కర్పూరం చల్లినట్లుంద”ని కవి భావించాడు. దాని ఆంతర్యాన్ని మీరు ఏమని భావిస్తున్నారు?
జవాబు:
పచ్చకర్పూరం తెల్లగా ప్రకాశిస్తుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇంతేగాక వింత పరిమళాన్ని వెదజల్లుతుంది. శివతాండవాన్ని కవి పచ్చకర్పూరంతో పోల్చడం వలన తెల్లదనం ఎలా అంతా వ్యాపిస్తుందో అలా తాండవం దిక్కులంతా వ్యాపించింది. ఎంతసేపు చూసినా కళ్ళకు అలసట కలుగకుండా చల్లదనాన్ని కలిగిస్తుంది. తాండవ సమయంలో శివుని ఒంటికి పూసుకున్న విబూది ఆ ప్రాంతమంతా రాలిపడడం వలన కవి దాన్ని ‘ఘనసారం’ తో పోల్చి ఉంటాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి పంక్తుల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శివతాండవం గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
సత్వరజస్తమీగుణ ప్రధానంగా సాగిన శివతాండవాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
పుట్టపర్తి వారు శివుని తాండవాన్ని ఏ విధంగా వర్ణించారో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వచ్ఛమైన వెన్నెల విరియబూసినట్లుగా, అందమైన జాజిపూలను కుప్పలుగా పోసినట్లుగా, తెల్లని విభూతి పొరలు పొరలుగా ఉన్నట్లు మంచి ముత్యాలను ఏరి కూర్చినట్లుగా, మంచు కుప్పలుగా పేర్చినట్లుగా, సరిపోల్చలేని అమృతాన్ని పంచిపెట్టినట్లుగా, పచ్చకర్పూరాన్ని తెచ్చి కల్లాపు జల్లినట్లుగా శివతాండవం ఉంది. మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరిసేలా, ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మోగుతుండగా శివుడు ఆడుతూ పాడుతున్నాడు.

శివుని తాండవం మబ్బులన్నీ నీటిఆవిరితో కూడి అలముకొన్నట్లుగా ఉంది. అద్భుతమైన నీలమణులను ఒకేచోట పేర్చినట్లుగా, నల్ల కలువలు దిక్కులంతా వికసించినట్లుగా ఉంది. తుమ్మెదలు ఒకచోట చేరి ముసిరికొన్నట్లుగా అందంగా ఉంది. కాటుక కొండ పగలగా కాటుకంతా చెదరిపోయినట్లుగా ఉంది. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొన్నట్లు శోభాయమానంగా ఉంది. తనలోని అజ్ఞానమంతా కళ్ళ నుంచి కారిపోతున్నట్లుగా ఉంది. మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కన్పిస్తున్నట్లుంది.

తామరపూలు విప్పారినట్లుంది. పూర్వజన్మ పుణ్యం ఆకారం దాల్చినట్లుంది. శాస్త్ర సంపదను పెంచేదై ఉంది. అప్పుడే వికసించిన పూలలా ఉంది. తుమ్మెదలు ముసిరిన పద్మాలలా ఉంది. చక్కని హావ భావాలతో కూడి ఉంది. కొత్త హారాలలాగా, మంచి నవ్వులాగా ఉంది. కనుకొలకుల సోకులా ఉంది. ఎర్రని లేజిగురాకులా ఉంది. అనురాగపు గుర్తులతో కూడి ఉంది. మైమరపును (తంద్రను) కలిగించేదిగా ఉంది.

ఇంకా శివుడు అలలు కదలినట్లుగా, చిరు గాలికి ఆకులు కదిలినట్లుగా పాడుతూ తాండవం చేస్తున్నాడు. శివతాండవం తామర పూలు కదలినట్లు, పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లుంది. కమ్మని కస్తూరి పరిమళాలు వెల్లివిరిసినట్లుంది. నెమలి పురివిప్పి ఆడినట్లుంది. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లు, నవ్వులో ప్రేమంతా ఒలకబోసినట్లుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
శివుడు నర్తించిన విధానంలో ప్రత్యేకతలు ఏమున్నాయి? (లేదా) త్రిగుణాలను తన నాట్యంలో ఆవిష్కరించినట్లు పుట్టపర్తివారిచే వర్ణించబడిన శివతాండవాన్ని గూర్చి రాయండి.
జవాబు:
శివుడు చేసిన ఆనంద తాండవంలో ప్రత్యేకతలను కవి సంకేతాలతో సూచించాడు. ఆ వెన్నెల విరబూసినట్లుందన్నాడు. కాంతికి, చల్లదనానికి ఇది సంకేతం. జాజిపూలు పరిమళానికి, విబూది స్వచ్ఛతకు గుర్తులు. మంచు నిర్మలత్వానికి, మంచి ముత్యాలు అందానికి చిహ్నాలు. పచ్చకర్పూరం రోగనిర్మూలనం కోసం వాడతాం. అమృతం దైవత్వానికి గుర్తు. ఇక -ఇవన్నీ తెల్లదనాన్ని కలిగి ఉన్నాయి. తెలుపు సత్వగుణానికి గుర్తుగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు.

తామరలలో కొన్ని ఎర్రవి ఉంటాయి. చిగురాకులు ఎర్రగా ఉంటాయి. కనుకొలకులు ఎర్రగా ఉంటాయి. మాణిక్యాల వంటి రత్నాలు ఎర్రగా ఉంటాయి. అనురాగం (ప్రేమ) వలన ముఖంలోని బుగ్గలు వంటి భాగాలు ఎర్రబడతాయి. వీటినే “రక్తిచిహ్నాలు” అని అంటారు. తండ్రి అంటే బద్దకంతో కూడిన మైమరపు. ఇది రజోగుణ సంబంధమైనది. ఎరుపు రజోగుణానికి గుర్తు. తాండవం క్రమంగా ఉదృతంగా మారుతుందని చెప్పడం దీని ప్రత్యేకత.

నల్లని మబ్బులు కమ్ముకొన్నట్లుగా, నీలమణులను ఒకేచోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులంతా వికసించినట్లుగా, తుమ్మెదలు ఒకే చోట చేరినట్టుగా తాండవం ఉంది. కాటుక కొండ పగిలిపోగా కాటుకంతా చెదరిపోయినట్లుగా చీకట్లు ఒక్కసారిగా కమ్మినట్లు, అజ్ఞానం కన్నుల నుండి కారినట్లుంది. ఇంకా మనస్సులోని వంకరలు కళ్ళలో కనిపించినట్లుంది. ఇవన్నీ నల్లదనాన్ని కలిగి ఉన్నాయి. నలుపు తమోగుణానికి గుర్తు.

సత్వ – రజ – తమోగుణాల కలయిక వలన సృష్టి ఏర్పడింది. పరమాత్మ పరమశివుడు గనుక ఆయన తాండవంలో ఈ మూడు గుణాలు వ్యక్తమైనట్లు వర్ణించబడటం ఒక ప్రత్యేకతను సంతరించుకొంది.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా కవి శివుని నాట్యాన్ని ఏయే ప్రకృతి అంశాలతో పోల్చాడో వివరంగా రాయండి.
జవాబు:
కవి శివుని నాట్యాన్ని చాలా ప్రకృతి అంశాలతో అందంగా పోల్చాడు. స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా ఉందన్నాడు. జాజిపూలను కుప్పలుగా పేర్చినట్లు, మంచును కుప్పలుగా చేసినట్లుందన్నాడు. మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి ఆకాశమంతా పరచుకొన్నట్లు, నల్ల కలువలు దిక్కులంతా .వికసించినట్లుందన్నాడు. తుమ్మెదలన్నీ ఒకే చోట ముసిరికొన్నట్లు, కాటుక కొండ పగిలినట్లుందన్నాడు. .చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొచ్చినట్లు శోభాయమానంగా ఉందన్నాడు. తామరలు విప్పారినట్లు, అప్పుడే వికసించిన పూలలా ఉందన్నాడు. తుమ్మెదలు ముసిరిన పద్మాలలాగా, ఎర్రని లేజిగురాకులాగా ఉందన్నాడు. సముద్రంలో అలలు కదిలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లుందన్నాడు. తామరపూలు కదలినట్లు, పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లుందన్నాడు. కమ్మని కస్తూరి పరిమళంలా, నెమలి అందంగా తన పింఛాన్ని విప్పినట్లుందన్నాడు. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లుందన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఇ) సృజనాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
ఈ గేయంలో “పొరలు లేచినయట్లు”, “విరులు కదలినయట్లు” మొదలైన అంత్యప్రాసలున్నాయి కదా ! ఇవి చదువుతుంటే లయాత్మకంగా ఉండడం వల్ల ఆనందం కలుగుతుంది. ఇలాంటి వాటిని కొన్నింటిని గ్రహించి వాటితో చిన్న కవిత గాని, గేయం గాని రాయండి.
జవాబు:
కవిత :
తెలుగుభాషా భవిష్యత్తు

తెలుగు భాషా భవిష్యత్తు
చేస్తుందోయి కసరత్తు
ఇతర భాషల సరసన
చూపుతుందా తన సత్తు
పోషకులే కరువై
పీక్కుంటుందా తన జుత్తు
తెలుగు బాలల సహకారంతో
వదిలిస్తుందా పరభాషల మత్తు
చేస్తుందా ఎన్నటికైనా
అన్యభాషలను చిత్తు
కోరుతున్నా దేవుణ్ణి
చేయాలని ఈ గమ్మత్తు!! – యస్. కె. చక్రవర్తి.

గేయం :
(హెచ్చరిక!!)
హెచ్చరిక! ఆంధ్రుడా హెచ్చరిక!
వినకుంటే నీ మనుగడ సాగదిక!
తల్లిపాలను నేలపాలు చేస్తూ
దాదిపాలకై అర్రులు చాపావంటే
నీ భాషా సంస్కృతులను విస్మరిస్తూ
పరభాషా సంస్కృతులకై పరుగులిడినావంటే
|| హెచ్చరిక||

నీ మాన ప్రాణాలను పణంగా పెడుతూ
పరులను పరమోన్నతులుగా పరిగణిస్తే
నీ భాషా జాతులను పరాభవిస్తూ
పరుల పదోన్నతికై పరిశ్రమిస్తే
నీ భాషా జాతీయాలను నట్టేట కలుపుతూ
అన్యభాషా సంస్కృతులతో అద్వైతసిద్ధి సాధిస్తే
|| హెచ్చరిక||

నిన్ను నీవే నిన్నాకరిస్తూ
పరసేవా పరాయణుడవైతే
నీ నీతి నీ జాతిరీతులను నిప్పుల గుండంలో నిలిపితే
నీవనేదీ నీదనేదీ నీకేదీ మిగలదిక || 2 ||
విన్నపము నీకిదే వినుమో వివేక శూన్యుడా !
వినకుంటే నీకిదే మరణశాసన మాంధ్రుడా !!
– యస్. కె. చక్రవర్తి.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అంత్యప్రాసలతో శివతాండవాన్ని, దాని సౌందర్యాన్ని వర్ణిస్తూ రాసిన విధానాన్ని చూశారు కదా ! దీనివల్ల మీరు పొందిన అనుభూతిని మీ ‘దినచర్య’ లో రాయండి. ఉపాధ్యాయులకు చూపండి.
జవాబు:
ఈ రోజు పాఠశాలలో “శివతాండవం” – అనే పాఠం చెప్పారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు “శివతాండవం” అనే గేయకావ్యాన్ని రచిస్తే దానిలో కొద్ది భాగం మాకు పాఠ్యాంశంగా ఉంచారని తెలుగు భాషోపాధ్యాయులు గారు చెప్పారు. గేయాన్ని లయబద్దంగా పాడుతూ మాచేత కూడా పాడించారు.

ఈ గేయం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇందులో వాడిన అచ్చ తెలుగు పదాలు ఊరిన మాగాయ ముక్కల్లా రసవత్తరంగా, రుచికరంగా ఉన్నాయి. ఇందులోని పదాలలో నేను చదవని కొత్త పదాలే ఎక్కువ. కానీ విచిత్రంగా పదాల అర్థం తెలియకపోయినా భావం అర్థమవుతూ తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. సత్త్వ – రజ – తమో గుణాలకు చిహ్నాలైన తెలుపు – ఎరుపు – నలుపు రంగులను తాండవానికి అన్వయిస్తూ చెప్పిన తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. “తమ్ములై, ఘటిత మోదమ్ములై” – వంటి అనుప్రాసలతో కూడిన పదాలు గేయానికి ఒక కొత్త ఊపును ఇచ్చాయి.

అలలు కదలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లు, తామరపూలు కదలినట్లు, సువాసన వ్యాపించినట్లు, తెరపై బొమ్మలు నటించినట్లు, చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లు, నవ్వులో ప్రేమ జాలువారినట్లు – ఇలాంటి ఉపమానాలు మన రోజువారీ జీవితంలో కనిపించేవే, మనల్ని తెలియని లోకాలకు తీసుకెళ్ళేవే. మన శ్రమని, కాలాన్ని మరచేలా చేసేవే. ఇలాంటి వాటితో ‘శివతాండవాన్ని’ పోల్చడం వల్ల మన ఊహకు అందేలా, మనో నేత్రాలకు కనిపించేలా కవి చేయగలిగాడు. ఈ గేయం చదివినప్పుడూ, మిత్రులు చదువుతుంటే విన్నప్పుడూ, శివునిలా తాండవం చేయలేకపోయినా, కనీసం చిందువేయాలనైనా మనస్సుకు బలంగా అనిపిస్తుంది. ఒక చిన్న గేయభాగమే వినే వారిలో లేక చదివే వారిలో ఇలాంటి కదలిక తీసుకురాగలిగిందంటే, వింతైన అనుభూతిని కలిగించిందంటే కవి ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ రాశాడో అని అన్పిస్తున్నది.

కవికి తెలుగు పదాల మీద మంచి పట్టు ఉంది. అచ్చ తెలుగు పదాలతో ఆయన గేయాన్ని నడిపించిన తీరు ‘శివతాండవాన్ని’ తలపిస్తుంది. అందుకనే ఆ మహానుభావుణ్ణి “సరస్వతీ పుత్రుడు” అనే బిరుదుతో గౌరవించారేమో పెద్దలు. ఈ గేయం చదివాక నాలో తెలియకుండానే ప్రకృతి ప్రేమ, తెలుగు భాషాభిరుచి పెరిగాయి. చక్కని పదాలతో గేయాలు అల్లాలనే ఉత్సుకత ఉరకలేస్తున్నది.

IV. ప్రాజెక్టు పని

మీ గ్రామంలో/ పట్టణంలో రకరకాల కళాకారులుంటారు. ఒగ్గు కథ చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, చిందు భాగవతులు, హరికథలు చెప్పేవారు…… ఇలాంటి వారి వివరాలు సేకరించండి. వారి ప్రదర్శనల గురించి వివరాలు అడిగి తెలుసుకోండి, రాయండి.
జవాబు:
1) బుర్రకథలు :
బుర్రకథలను తంబుర కథలని, డక్కీ కథలని వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిలో వీరగాథలకు సంబంధించిన కథలే ఎక్కువ ఉంటాయి. బుర్రకథను చెప్పడానికి ముగ్గురు వ్యక్తులు కావాలి. మధ్య వ్యక్తి కథ చెపుతూ తంబురా వాయిస్తాడు. ఆయనకు రెండు ప్రక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను ‘వంతలు’ అని అంటారు. వంతలు డక్కీలు వాయిస్తారు. కథకునికి ఒక ప్రక్క వ్యక్తి హాస్యంగా మాట్లాడుతుంటే, రెండవవైపు వ్యక్తి కథకు తగిన వివరణ చెపుతుంటాడు.

బుర్రకథలో మొదట కథకుడు సరస్వతిని, మహాలక్ష్మిని, దుర్గనూ ప్రార్థిస్తాడు. దీనిలో సాధారణంగా ‘వినరా భారత వీరకుమారా విజయం మనదేరా ……. తందాన తాన, తందాన, తానే తందనాన’ అంటూ వంతలు పాడుతారు. కథ పూర్తి అయ్యాక మంగళం పాడతారు. బుర్రకథలలో అల్లూరి సీతారామరాజు – ఝాన్సీ లక్ష్మీబాయి – బాలచంద్రుడు మొదలైన కథలు ప్రసిద్ధి పొందాయి. ‘నాజర్’ బుర్రకథా పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు.

జానపదకళల్లో బుర్రకథ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమ పోరాట సమయంలో బుర్రకథ ప్రజలను చైతన్యపరచింది.

2) తోలుబొమ్మలాట :
ఈ ఆటను ఊరి బయట వేదిక పైన రాత్రి సమయంలో ప్రారంభించి తెల్లవారే వరకు ఆడతారు. మూడు వైపుల మూసి ఉన్న పందిరి వేస్తారు. ముందువైపు తెల్లని తెర లాంటి పల్చని గుడ్డను కడతారు. పూర్వం ఈ ఆటలాడేటప్పుడు తెరవెనుక ఆముదపు దీపాలు వెలిగించేవారు. తరువాత పెట్రోమాక్స్ దీపాలు, విద్యుద్దీపాలు వచ్చాయి. ఈ దీపాల కాంతి వల్ల చీకటిలో కూర్చున్న వారికి తోలుబొమ్మలు సజీవంగా ఉన్నట్లు కనబడతాయి.

పురుష పాత్రల వెనుక మగవారు, స్త్రీ పాత్రల వెనుక ఆడవారు ఉండి పాత్రలకు అనుగుణంగా మాట్లాడతారు. రామాయణం, భారతం కథలను ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల నిద్రమత్తు పోవడానికి ఆట మధ్యలో హాస్యగాళ్ళు అయిన జుట్టుపోలిగాడు, బంగారక్క, కేతిగాడు పాల్గొని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు.

ఈ బొమ్మలను తెరమీద సులభంగా ఆడించేందుకు సన్నటి వెదురు బద్దలను బొమ్మల మధ్యలో కడతారు. బొమ్మల సంభాషణకు తగినట్లుగా ఆడించాలంటే ఆ వెదురు బద్దే ఆధారం. ఆ బద్ద సహాయంతో బొమ్మలను అటు ఇటు తిప్పుతూ ఆడిస్తారు.

ముఖ్యంగా ఈ బొమ్మలను తయారు చేసేటప్పుడు రాముడు, కృష్ణుడు, సీత వంటి పవిత్రమైన పాత్రలకు ఒక రకమైన చర్మాన్ని; రావణాసురుడు, కంసుడు వంటి ప్రతినాయక పాత్రలకు వేరొక రకమైన చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ తోలుబొమ్మలాటలు ఆడేవారిని ‘దేశదిమ్మరులు’ అంటారు. వీరు దేశమంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తారు. ‘రామాయణ, మహాభారతాలకు సంబంధించిన కథలనే ఎక్కువగా ప్రదర్శిస్తారు. మన రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా తోలుబొమ్మలాటకు ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ఈ జానపదకళ కనుమరుగైందనే చెప్పవచ్చు.

3) హరికథ :
హరికథ అంటే విష్ణుకథ. హరికథలు భక్తికి సంబంధించినవి. ఈ కథ చెప్పేవారిని భాగవతార్ అని, హరిదాసని పిలుస్తారు. హరికథ చెప్పేవారు పట్టుపంచె కట్టుకొని నుదుట నామం, మెడలో పూలదండ వేసుకుంటారు. చేతిలో చిడతలు పట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. నడుముకు ఉత్తరీయం బిగించుకుంటారు. “శ్రీమద్రమారమణ గోవిందోహరి” అని గోవింద కొట్టించి కథ ప్రారంభిస్తారు. ఎన్నో గంటల పాటు కథకుడు అన్ని పాత్రలలో జీవిస్తూ, అభినయం చేస్తూ ప్రేక్షకులు విసుగు చెందకుండా మధ్యమధ్య పిట్టకథలు చెప్తూ హరికథా గానం చేస్తాడు.

ఆదిభట్ల నారాయణదాసు గారిని “హరికథా పితామహుడ”ని అంటారు.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పదాలకు సమానార్ధక పదాలను పాఠం నుండి గ్రహించి రాయండి. వాటితో వాక్యాలు రాయండి.
1. తామరలై : తమ్ములై, తమ్మివిరులై
1) పగడాలతో చేసిన ఆభరణాలు తమ్ములై (పద్మాలై) భాసిస్తున్నాయి.
2) ఈత కొలనులో అందం కోసం ఉంచిన ప్లాస్టిక్ పూలు నిజమైన తమ్మివిరులై శోభిస్తున్నాయి.

2. సంతోషాలై : సంతసములై, మోదమ్ములై
1) మా ఊరి యువకుడు కలెక్టరుగా ఉద్యోగాన్ని పొందడం, అతడు మా పాఠశాల పూర్వ విద్యార్థి కావడం సంతస – (కారణ) ములైనాయి.
2) అన్నయ్య ప్రభుత్వోద్యోగాన్ని పొందడం, అక్కకు మెడిసిన్లో సీటు రావడం అమ్మానాన్నలకు మోదమ్ములైనాయి.

3. మొగ్గలై : నవకోరకమ్ములై, కోరకములై
1) మల్లె చెట్టుపై ఉన్న మంచు బిందువులు నవకోరకమ్ములై రాజిల్లుతున్నాయి.
2) ప్లాస్టిక్ జాజి తీగకు ఉన్న మొగ్గలు సహజమైన కోరకములై శోభిస్తున్నాయి.

4. హొయల నడకలై : వగలువోయినట్లు
1) గాలికి చిగురుటాకులు వగలు వోయినట్లుగా ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఆ) కింది వాక్యాల్లో ఒకే అర్థానిచ్చే పదాల్ని గుర్తించి, వేరు చేసి రాయండి.

1. వెన్నెల విరగకాస్తే హాయి కలుగుతుంది. ఆ కౌముది చల్లదనాన్నిస్తుంది. మన కవులు అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు.
జవాబు:
వెన్నెల విరగకాస్తే హాయి కలుగుతుంది. ఆ కౌముది చల్లదనాన్ని ఇస్తుంది. మన కవులు. అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు.
వెన్నెల – కౌముది – చంద్రికలు

2. సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది. ఆ కమస్సు భయం కలిగిస్తుంది. అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు.
జవాబు:
సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది. ఆ తమస్సు భయం కలిగిస్తుంది. అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు.
అంధకారం – తమస్సు – చీకటి.

3. ఆహా ! ఏమి తావి! బహుశా ఈ పరిమళం గులాబీతోట నుండి కాబోలు! భగవంతుడు పుష్పాలకు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు.
జవాబు:
ఆహా ! ఏమి తావి ! బహుశా, ఈ పరిమళం గులాబీతోట నుండి కాబోలు! భగవంతుడు పుష్పాలకు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు.
తావి – పరిమళం – సౌరభము

ఇ) కింది పదాలకు పాఠం ఆధారంగా వికృతి పదాల్ని గుర్తించి రాయండి.
1) అపూర్వం – అబ్బురం
2) మౌక్తికం – ముత్తెం
3) సంతోషం – సంతసం

ఈ) కింది పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.
1) చలికొండ – మంచుకొండ, హిమవత్పర్వతం
2) పుష్పం – విరి, కుసుమం, సుమం, పువ్వు
3) మోదం – సంతోషం, ఆనందం, ప్రమోదం
4) కిసలయం – చిగురాకు, లేతాకు
5) తరగలు – అలలు, తరంగాలు

వ్యాకరణం

ఆ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. విడదీసి, సంధి సూత్రం రాయండి.

1. ఉత్వసంధి:
ఆడెను + అమ్మా = ఆడెనమ్మా
పాడెను + అమ్మా = పాడెనమ్మా
1) మబ్బుగములు + ఉబ్బికొని = మబ్బుగములుబ్బికొని
2) తమ్ములు + ఐ = తమ్ములై
3) మోదమ్ములు + ఐ = మోదమ్ములై
4) రూపమ్ములు + ఐ = రూపమ్ములై
5) భాగ్యమ్ములు + = భాగ్యమ్ములై
6) కోరకమ్ములు + ఐ = కోరకమ్ములై
7) పుష్పమ్ములు + ఐ = పుష్పమ్ములై
8) మంద్రమ్ములు + ఐ = మంద్రమ్ములై
9) ఫుల్లమ్ములు + ఐ = ఫుల్లమ్ము
10) హారమ్ములు + ఐ = హారమ్ములై
11) హాసమ్ములు + ఐ = హాసమ్ములై
12) సొమ్ములు + ఐ = సొమ్ములై
13) కిసలమ్ములు + ఐ = కిసలమ్ములై
14) చిహ్నమ్ములు + ఐ = చిహ్నమ్ములై
15) గమనమ్ములు + ఐ = గమనమ్ములై
16) దిక్కులు + ఎల్ల = దిక్కులెల్ల

ఉత్వ సంధి సూత్రం:
హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే సంధి జరుగుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

2. సరళాదేశ సంధి:
1) పూతన్ + పెట్టుట = పూతఁబెట్టుట
2) కనులన్ + జారు = కనులజారు
3) ఘనసారమును + తెచ్చి = ఘనసారమునుదెచ్చి
4) కలయ + చల్లు = కలయజల్లు
5) కనులన్ + తీరు = కనులఁదీరు
6) కండ్లన్ + తళుకు = కండ్లఁదళుకు
7) తళుకున్ + చూపులు = తళుకుఁజూపులు
8) కాళ్ళన్ + చిలిపి = కాళ్ళఁజిలిపి
9) మొల్లముగన్ + తుమ్మెదలు = మొల్లముగఁదుమ్మెదలు
10) గొప్పగన్ + కప్పెడు = గొప్పగఁగప్పెడు
11) కనులన్ + తీరు = కనులఁదీరు
12) గెడన్ + కూడి = గెడఁగూడి
13) తరగలను + చిరుగాలి = తరగలఁజిరుగాలి
14) చిరుగాలిలోన్ + తమ్మివిరులు = చిరుగాలిలోఁదమ్మివిరులు
15) కన్ + కొనల = కల్గొనల

సరళాదేశ సంధి సూత్రం :
1) ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
2) ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.

3. యడాగమ సంధి :
1) వక్రత + ఎ = వక్రతయె
2) లేచిన + అట్లు = లేచినయట్లు
3) కదలిన + అట్లు = కదలినయట్లు
4) పరిఢవించిన + అట్లు = పరిఢవించినయట్లు
5) విరిసిన + అట్లు = విరిసినయట్లు
6) విప్పిన + అట్లు = విప్పినయట్లు
7) పోయిన + అట్లు = పోయినయట్లు
8) జారిన + అట్లు = జారినయట్లు

యడాగమ సంధి సూత్రం :
1) సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

4. గసడదవాదేశ సంధి :
1) పూత + పెట్టుట = పూతబెట్టుట
2) దెట్టులు + కట్టిన = దెట్టులుగట్టిన
3) కుప్పలు + కూర్చిన = కుప్పలుగూర్చిన
4) చూపులు + పూయ = చూపులుబూయ
5) విరులు + కదలిన = విరులుగదలిన
6) వీణా + కడగి = వీణెగడగి
7) నెమ్మి + తన = నెమ్మిదన
8) వగలు + పోయిన = వగలు వోయిన

గసడదవాదేశ సంధి సూత్రం :
1) ప్రథమము మీది పరుషములకు గసడదవలగు.

ఆ) టుగాగమ సంధి : కింది పదాలను పరిశీలించండి.
ఉదా :
1) నిలువు + అద్దం = నిలువుటద్దం
2) తేనె + ఈగ = తేనెటీగ
3) పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా వచ్చి చేరుతుంది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.

అట్లే కింది పదాలను కూడా పరిశీలించండి.
చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

వీటిలో ‘ట్’ అనే వర్ణం సంధి జరిగినపుడు రావచ్చు, రాకపోవచ్చు. ‘ట్’ వస్తే టుగాగమం అవుతుంది. ‘ట్’ రాకుంటే ఉత్వసంధి అవుతుంది.

సూత్రం :
కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమంబగు. కింది పదాలను విడదీసి రాయండి.
1) పడకటిల్లు = పడక + ఇల్లు
2) కరకుటమ్ము = కరకు + అమ్ము
3) నిక్కంపుటుత్తర్వు = నిక్కంపు + ఉత్తర్వు
4) నిగ్గుటద్దం = నిగ్గు + అద్దం

ఇ) లు,ల,న, ల సంధి :
లు – ల – న – లకు జరిగే సంధిని లు, ల, న, ల సంధి అంటారు.

సూత్రం :
లు, ల, న లు పరమైనపుడు, ఒక్కొక్కప్పుడు ము వర్ణానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.
ఉదా :
1) పుస్తకము + లు = పుస్తకాలు
2) దేశము + ల = దేశాల
3) జీవితము + న = జీవితాన
4) గ్రంథము + లు = గ్రంథాలు
5) రాష్ట్రము + ల = రాష్ట్రాల
6)వృక్షము + న = వృక్షాన

మరి కొన్ని ఉదాహరణలు :
1) వజ్రము + లు = వజ్రాలు
2) రత్నము + ల = రత్నాల
3) వాచకము + ల = వాచకాల
4) కేసరము + లు = కేసరాలు
5) గ్రంథము + లు = గ్రంథాలు
6) హారము + న = హారాన
7) విషయము + లు = విషయాలు
8) చుట్టము + లు = చుట్టాలు

ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ప్రస్తుత పాఠంలో వెతికి రాయండి.

కర్మధారయ సమాసం :
విశేషణానికి, విశేష్యానికి (నామవాచకానికి) చేసే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
నల్లకలువ

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
కర్మధారయ సమాసంలో పూర్వ (మొదటి) పదం విశేషణమైతే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
చిలిపి గజ్జెలు – చిలిపివైన గజ్జెలు – చిలిపి (విశేషణం) – గజ్జెలు (నామవాచకం)

ప్రస్తుత పాఠంలోని ఉదాహరణలు :
1) తరితీపు వెన్నెలలు – తరితీపులైన వెన్నెలలు
2) నెరజాజులు – నెరయైన జాజులు
3) తెలిబూది – తెల్లనైన బూది
4) చలికొండ – చల్లనైన కొండ
5) ఘనసారము – ఘనమైన సారము
6) నీలపుగండ్లు – నీలమైన కండ్లు
7) అబ్బురపు నీలములు – అబ్బురమైన నీలములు
8) నల్లకలువలు – నల్లనైన కలువలు
9) లేవలపు – లేతయైన వలపు
10) నవకోరకమ్ములు – నవమైన కోరకమ్ములు
11) వికచపుష్పములు – వికచములైన పుష్పములు
12) నూత్నహారమ్ములు – నూతనమైన హారమ్ములు
13) వల్గుహాసమ్ములు – వల్గులైన హాసమ్ములు
14) రక్తకిసలయములు – రకములైన (ఎర్రనైన) కిసలయములు
15) తంద్రగమనమ్ములు – తంద్రమైన గమనమ్ములు
16) చిరుగాలి – చిరుత (కొంచమైన) యైన గాలి
17) కమ్మకస్తురి – కమ్మనైన కస్తురి
18) చిగురుటాకులు – చిగురులైన ఆకులు

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఉ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘సంభావన’ అంటే ‘సంజ్ఞ’ అని అర్థం. అంటే పేరు మొదలైనవి. కర్మధారయ సమాసంలో మొదటి పదం ‘సంజ్ఞా వాచకమైనట్లైతే దాన్ని సంభావనా పూర్వపదకర్మధారయ సమాసం’ అంటారు.

‘తమ్మి విరులు’ అనే సమాసంలో మొదట పదమైన ‘తమ్మి ‘ ఏ రకం విరులో (తామరపూలు) తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం నదులూ, వృక్షాలూ, ప్రాంతాలూ మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) మర్రిచెట్టు – మర్రి అనే పేరుగల చెట్టు
2) గంగానది – గంగా అనే పేరుగల నది
3) భారతదేశం – భారతం అనే పేరు గల దేశం

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి మరికొన్ని ఉదాహరణలు.
1. వింధ్య పర్వతం – వింధ్య అనే పేరు గల పర్వతం
2. కృష్ణానది – కృష్ణ అనే పేరు గల నది
3. అరేబియా సముద్రం ‘అరేబియా’ అనే పేరు గల సముద్రం
4. విజయవాడ నగరం – విజయవాడ అనే పేరు గల నగరం
5. తెలుగుభాష – తెలుగు అనే పేరు గల భాష
6. హిమాలయ పర్వతం – హిమాలయమనే పేరు గల పర్వతం అని
7. నర్మదానదం – నర్మద అనే పేరు గల నదం.

9th Class Telugu 3rd Lesson శివతాండవం కవి పరిచయం

పుట్టపర్తి నారాయణాచార్యులు (1914 – 1990) స్వస్థలం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు. 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. సంగీత, నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. “సరస్వతీ పుత్ర” వీరి బిరుదు. శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ‘లీవ్స్ ఇన్ ద విండ్’ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే! వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపర్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయ భావాలు, మానవీయ విలువలు తొణికిసలాడతాయి.

గేయాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ గేయం :
ఆడెనమ్మా ! శివుడు
పాడెనమ్మా ! భవుడు
తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన
నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన
తెలిబూది పూత చెట్టులు గట్టిన విధాన
చలికొండ మంచు కుపులు గూర్చిన విధాన
పొసగ ముత్తెపు సరుల్పోహళించు విధాన
అసదృశము నమృతంబు నామతించు విధాన
ఘనసారమును దెచ్చి కలయజల్లు విధాన
మనసులో సంతసము గనుల జారు విధాన
కులుకు నీలపుగండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా ! భవుడు
ప్రతిపదార్థం :
తరితీపు = స్వచ్ఛమైన
వెన్నెలలు = చంద్రుని తెల్లని కాంతులు
విరిసికొన్న విధాన = ఉప్పొంగినట్లు (కురిసినట్లు)
నెరజాజులు + అవి = ఆ అందమైన జాజిపూలు
కుప్ప నెరసికొన్న విధాన = కుప్పలు పోసినట్లుగా
తెలిబూదిపూత = తెల్లని విభూతి (విబూది) పూత
దెట్టులు + కట్టిన విధాన = అతిశయించిన విధంగా (మిక్కిలి ఎక్కువగా ఉన్నట్లు)
చలికొండ = హిమాలయము ( హిమగిరి)న
మంచు = మంచును
కుప్పలు + కూర్చిన విధాన = ప్రోగులు పెట్టినట్లు
పొసగన్ = సరిపడేటట్లు (పొత్తుగా, తగిన విధంగా)
ముత్తెము + సరుల్ = ముత్యాలహారాలు
పోహళించు విధాన = కూర్చినట్లుగా
అసదృశమున్ = అనన్య సామాన్యమైన
అమృతంబున్ = అమృతమును
ఆమతించు విధాన = విందు చేసినట్లు (పంచినట్లు)గా
ఘనసారమును + తెచ్చి = పచ్చ కర్పూరమును తెచ్చి
కలయన్ + చల్లు విధాన = అంతటా చల్లే రీతిగా
మనసులోన = మనస్సులో గల
సంతసము = సంతోషం (ఆనందం)
కనులన్ + జారువిధాన = కన్నుల నుండి జారుతున్నట్లుగా
కులుకు = ఒప్పెన (చురుకైన)
నీలపు గండ్ల (నీలము +కండ్ల) = నీలవర్ణము గల కన్నుల యొక్క
తళుకు + చూపులు = మెఱసే చూపుల కాంతులు
పూయన్ = విరబూయగా
ఘల్లుఘల్లుమని = ఘల్లుఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకు కట్టుకొన్న
చిలిపి గజ్జెలు = చిరుగజ్జెలు; (చిన్నగజ్జెలు)
మ్రోయన్ = ధ్వనింపగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
నిర్మలమైన వెన్నెల కురుస్తున్నట్లుగా, అందమైన జాజిపూలు కుప్పపోసినట్లుగా, తెల్లని విబూది చెట్టులు కట్టి నట్లుగా, మంచుకొండపై మంచు కుప్పలు పోసినట్లుగా, మృదువైన ముత్యాల హారాలను కూర్చినట్లుగా, అనన్య సామాన్యమైన అమృతాన్ని విందు చేసినట్లుగా (పంచినట్లుగా), పచ్చ కర్పూరాన్ని తెచ్చి అన్ని వైపులా చల్లినట్లుగా, మనస్సులోని సంతోషం కళ్ళల్లోంచి జారునట్లుగా, చురుకైన నీలపు కన్నుల తళుకు చూపుల కాంతులు విరబూసినట్లుగా, ఘల్లు ఘల్లుమని చిరుగజ్జెలు మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
దీనిలో చెప్పిన పోలికలన్నీ తెల్లదనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తెలుపు యొక్క సంకేతం స్వచ్ఛతకూ, పవిత్రతకూ నిదర్శనం. శివుడి తాండవం వల్ల ఆనందం అంతటా నిండిందని కవి తలంపు. శివునిలో సత్త్వగుణం వెల్లివిరిసిందని భావం. సత్త్వగుణం. తెలుపు రంగును సూచిస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

2వ గేయం :
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బి కొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన
నల్లకలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
నగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల దీరు విధాన
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు!
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
మబ్బుగములు = మేఘాల యొక్క సమూహాలు
ఉబ్బికొని = అతిశయించి (దట్టముగా)
ప్రబ్బికొన్న విధాన = అలముకొన్న విధంగా
అబ్బురము + నీలములు = అపూర్వమైన ఇంద్రనీలమణులు
లిబ్బి + చేరు విధాన = కుప్ప పోసినట్లుగా (ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా)
నల్ల కలువలు = నల్ల కలువపూలు
దిక్కులు + ఎల్ల = దిక్కులంతటా
విచ్చు విధాన = విచ్చుకున్నట్లుగా (విరిసిన విధంగా)
మొల్లముగ = గుంపుగా (ముసురుకొని)
తుమ్మెదలు = తుమ్మెదలు
మొనసికొన్న విధానన్ = శోభిల్లిన విధంగా
అగలు = పగిలే
కాటుక కొండ = నల్లని కొండ
పగిలి, చెదరు విధాన = బ్రద్దలయి, చెల్లాచెదరయినట్లు
తగిలి = సంభవించి (కలిగి)
చీకటులు = చీకట్లు
గొప్పగ = అధికంగా
కప్పెడు విధాన = వ్యాపించినట్లుగా
తనలోనన్ = తనలోనున్న
తామసము = తమస్సు అనే గుణము
కనులన్ = కన్నుల నుండి
జారువిధాన = జారే విధంగా
తనలోని వక్రతయె (వక్రత + ఎ) = తనలోనున్న వక్రత్వములే
కనులన్ + తీరువిధాన = కళ్ళల్లో కన్పిస్తున్నట్లుగా
కులుకు నీలము + కండ్లన్ = ఒప్పెన (చురుకైన), నీలవర్ణముగల కన్నుల యొక్క
తళుకు + చూపులు = మెఱసే చూపుల కాంతులు
పూయన్ = విరబూయగా
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకున్న
చిలిపి గజ్జెలు = చిరుగజ్జెలు
మ్రోయన్ = ధ్వనింపగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
మేఘాలన్నీ ఒక్కసారిగా అలముకున్నట్లుగా, అద్భుతమైన నీలమణులు ఒకచోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులన్నిటా విచ్చుకున్నట్లుగా, తుమ్మెదలు ముసురుకొని శోభిస్తున్నట్లుగా, నల్లని కొండలు పగిలి ముక్కలయినట్లుగా, ఒక్కసారి చీకట్లు వ్యాపించినట్లుగా, తనలోని తమస్సు కళ్ళల్లోంచి జారుతున్నట్లుగా, తనలోని వక్రతలు కళ్ళల్లో కన్పిస్తున్నట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరబూయగా, పాదాల గజ్జెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
ఇందులో వర్ణించబడినవి అన్నీ నీలవర్ణము గలవి. సృష్టిలో నలుపురంగు కూడా అద్భుతమైనదని కవి చెప్పారు. శివునిలో తమోగుణం (నల్లనిది) వ్యాపించిందని భావం.

3వ గేయం :
తమ్ములై, ఘటిత మోదమ్ములై, సుకృత రూ
పమ్ములై, శాస్త్ర భాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచ పుష్పమ్ములై, తుమ్మెదల
తమ్ములై, భావ మంద్రమ్ములై, హావపు
ల్లమ్ములై, నూత్నహారమ్ములై, వల్గు
హాసమ్ములై, కనల సొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్త కిసలమ్ములై, రక్తి చి
హ్నమ్ములై, తంద్ర గమనమ్ములై, గెడగూడి
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపిగజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
తమ్ములు + ఐ = తామర పూలై
ఘటిత మోదమ్ములు + ఐ = కలిగింపబడిన, సంతోషము కలవై (సంతోషాన్ని కలించేవై)
సుకృత రూపమ్ములు + ఐ = మంగళప్రదమైన రూపము కలవై
శాస్త్ర భాగ్యమ్ములు + ఐ = శాస్త్రంలో చెప్పబడిన విధంగా సంపదతో నిండినవై
నవ కోరకమ్ములు + ఐ = క్రొత్త పూలమొగ్గలై
వికచ పుష్పమ్ములు + ఐ = వికసించిన పుష్పముల వలెనై
తుమ్మెదల తమ్ములు + ఐ = తుమ్మెదలు వాలిన తామరలై
భావ మంద్రమ్ములు+ ఐ = భావ గంభీరములై
హావ ఫుల్లమ్ములు + ఐ = వికసించిన శృంగార భావము కలవై
నూత్న హారమ్ములు + ఐ = క్రొత్త హారాలై
వల్గు హాసమ్ములై = చక్కని నవ్వులై
కల్గొనల సొమ్ములై = కంటికొలకుల సోకులై
విశ్రాంతి దమ్ములై = విశ్రాంతి నిచ్చేవై
రక్త కిసలమ్ములై = ఎఱ్ఱని చివుళ్ళె
రక్తి చిహ్నమ్ములై = అనురాగానికి గుర్తులై
తంద్ర గమనమ్ములై = తూగు నడకలు కలవై
కెడగూడి = జతగూడి
కులుకు నీలపుగండ్ల = చురుకైన, నీలవర్ణంగల కన్నుల
తళుకుచూపులు + పూయ – తళతళ కాంతులు విరబూయగా
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ = కాళ్ళకున్న చిరుగజ్జెలు ధ్వని చేస్తుండగా
ఆడెనమ్మా! శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా! భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
శివుని నాట్యం తామరపూవులవలె గొప్ప సంతోషాన్ని చేకూర్చింది. ఆ నాట్యం శుభప్రదరూపంతో, శాస్త్రీయ సంపదతో నిండి ఉంది. కొత్త పూల మొగ్గల్లా, వికసించిన పువ్వుల్లా, తుమ్మెదలు వాలిన తామరల్లా, భావ గంభీరములై, వికసించిన హావభావములై, కొత్త హారములై, చక్కని నవ్వులై, కనుగొలకుల సోకులై; విశ్రాంతి నిచ్చేవై, ఎఱ్ఱని చిగురులై, అనురాగ చిహ్నాలై, తూగు నడకలతో జతగలసి, చురుకైన నీలపు కన్నుల కాంతులు విరబూయగా, ఘల్లు ఘల్లుమని పాదాలకు ఉన్న చిరు గజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం : ఈ గేయంలో వర్ణించబడినవన్నీ ఎఱుపు రంగుతో నిండినవి. అనగా శివుడు చేసే తాండవ నృత్యం రానురానూ ఉద్ధృతమై, ఆనందాన్ని ఇస్తోందని వర్ణించడం ఈ వర్ణనలోని ప్రత్యేకత. ఎఱుపు రజోగుణానికి ప్రతీక. కవి శివునిలో రజోగుణ ఉద్ధృతిని ఇక్కడ వర్ణించారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

4వ గేయం:
తరగలను జిరుగాలి పొరలు లేచిన యట్లు
చిరుగాలిలో దమ్మి విరులు గదలిన యట్లు
విరులలో నును తావి తెరలు లేచినయట్లు
తెరలపై చిత్రాలు పరిఢవించిన యట్లు
కమ్మ కస్తురి వీణె గడగి విరసిన యట్లు
నెమ్మి దన పింఛమ్ము నెమ్మి విప్పిన యట్లు
చిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు
నగవులో లేవలపు బిగువు జారినయట్లు
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
తరగలను = అలలలో (కెరటములలో నుండి)
చిరుగాలి = నెమ్మదిగా గాలి
పొరలు లేచిన + అట్లు = పొరలు పొరలుగా పైకి లేచిన విధంగా
చిరుగాలిలో = మంద వాయువులో
తమ్మి విరులు = పద్మములు (తామర పద్మములు అనే పూలు)
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకు కట్టబడిన
చిలిపి గజ్జెలు = చిరు గజ్జెలు
తెరలు లేచిన + యట్లు = తెరలు తెరలుగా వ్యాపించినట్లు
తెరలపై = తెరలపై
చిత్రాలు = బొమ్మలు
పరిఢవించిన + అట్లు = అతిశయించిన విధంగా
కమ్మ కస్తురి వీణా = శ్రావ్యమైన పరిమళ వీణ
కడగి విరసిన + అట్లు = మ్రోగిన విధంగా
నెమ్మి = నెమలి
తన పింఛమ్మున్ = తన పింఛాన్ని
నెమ్మి = ప్రీతితో (సంతోషంతో)
విప్పిన + అట్లు = విప్పిన విధంగా
చిగురుటాకులు (చిగురు + ఆకులు) = చిగురాకులు (త ఆకులు)
గాలిన్ = గాలికి
వగలు + పోయిన + అట్లు = ఒయ్యారాలు పోయిన విధంగా
నగవులో = నవ్వులో
లేవలపు = లేత కోరిక
బిగువుజారిన + అట్లు = బింకము తగ్గిన విధంగా
కులుకు = చురుకైన
నీలపుగండ్ల (నీలము +కండ్ల) = నీలికన్నుల
తళుకు + చూపులు = తళతళ కాంతులు
పూయన్ = విరబూయగా
కదలిన + అట్లు = కదలిన విధంగా
విరులలో = పూలలో
నునుతావి = చిరు సువాసన
మ్రోయన్ = ధ్వనిస్తుండగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
అలలపై చిరుగాలి పొరలు లేచినట్లు, చిరుగాలికి పద్మములు కదలినట్లు, పూలలో నుండి సువాసనలు తెరలు తెరలుగా పైకి వ్యాపించినట్లు, తెరలపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లు, శ్రావ్యమైన పరిమళ వీణలు మ్రోగినట్లు, నెమలి తన అందమైన పింఛాన్ని విప్పినట్లు, గాలికి చిగురుటాకులు ఒయ్యారాలు పోయినట్లు, లేత నవ్వులు ఒలికినట్లు, చురుకైన నీలపు కళ్ళు కాంతులు విరబూయగా, ఘల్లు ఘల్లుమని పాదాలకు ఉన్న చిరుగజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
శివతాండవంలో అలలు కదలడం అనేది గంభీరతకు గుర్తు. పరిమళాలు వ్యాపించడం, నెమలి నాట్యం చేయడం, చిగురాకుల ఒయ్యారాలూ సౌకుమార్యానికి ప్రతిబింబాలు. శివుని తాండవంలో గంభీరత, సౌకుమార్యమూ కలగలసి అద్భుతంగా అందాన్ని ఆవిష్కరించడమే ఇక్కడి విశేషం. మొత్తంగా శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది. ప్రకృతి వర్ణన పదాల కూర్పు, అలంకారాలతో కూడి మరింత సౌందర్యాన్ని చేకూర్చింది.

Leave a Comment