AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 1 శాంతికాంక్ష Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Telugu Solutions 1st Lesson శాంతికాంక్ష
9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష Textbook Questions and Answers
చదవండి-ఆలోచించండి-చెప్పండి
అది 1945 వ సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా అనే నగరం మీద అణుబాంబులతో దాడి చేసింది. దాని ఫలితంగా కొద్ది క్షణాల్లో అరవైఆరు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. డెబ్బై వేలమంది క్షతగాత్రులయ్యారు. నిన్న మొన్నటి వరకూ అక్కడి ప్రజలకు అది పీడకలగా నిలిచిపోయింది.
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
ఈ పేరా చదివాక మీకేమర్థమైంది?
జవాబు:
యుద్ధం వలన జననష్టం ఎక్కువగా జరుగుతుందని అర్థమైంది.
ప్రశ్న 2.
మానవ కళ్యాణానికి ఉపయోగపడాల్సిన సైన్సు దేనికి దారితీసింది?
జవాబు:
మానవ వినాశనానికి దారితీసింది.
ప్రశ్న 3.
ఆధునిక కాలంలో యుద్ధాలవల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి?
జవాబు:
ఆధునిక కాలంలో యుద్ధాలలో రసాయనిక బాంబులను, అణుబాంబులను ఉపయోగించే ప్రమాదముంది. దీనివల్ల ప్రపంచపటంలోని కొన్ని దేశాలు కనుమరుగయ్యే అపాయం ఉంది.
ప్రశ్న 4.
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి?
జవాబు:
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రపంచదేశాలన్నీ అసమానతలను వీడాలి. సోదర భావంతో మెలగాలి.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది అంశాలను గురించి చర్చించండి.
ప్రశ్న 1.
శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు గదా! అలా ఎందుకన్నాడో చర్చించండి.
జవాబు:
పాండురాజు మరణిస్తూ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించమని పాండవులకు సూచించాడు. పాండవులను చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడు అనేక కష్టాల నుండి రక్షించాడు. లక్క ఇంటి ప్రమాదం నుండి, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో, అరణ్యవాస సమయంలో, ఇలా పలు సందర్భాల్లో శ్రీకృష్ణుడు కాపాడటం ధర్మరాజుకు తెలుసు. ధర్మరాజు ధర్మాన్నే ఆశ్రయించినవాడు కాగా శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి. అందుకే ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు.
యుద్ధం లేకుండా, బంధునాశనం కాకుండా, తమ రాజ్యం తమకు రావాలని ధర్మరాజు కోరిక. దాన్ని నెరవేర్చగల సమర్థుడు శ్రీకృష్ణుడని అతని విశ్వాసం. ఒకవేళ యుద్ధం తప్పనిసరి అయితే దానికి కారకుడిగా దుర్యోధనుడినే లోకం నిందించాలి తప్ప తమని నిందించకూడదనేది ధర్మజుడి కోరిక. అలా “కర్ర విరగకుండా పాము చావకుండా” – కార్యం సాధించగల నేర్పరి శ్రీకృష్ణుడు. కాబట్టే కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కృష్ణుణ్ణి కీర్తించాడు.
ఎదుటివారి మనోభావాలను చక్కగా గ్రహించి, తదనుగుణంగా వ్యూహాన్ని పన్నగల మేధావి శ్రీకృష్ణుడు. దక్షుడు కాబట్టే ఈ అసాధ్య కార్యాన్ని సాధించగలడని, రాయబార సమయంలో దుర్యోధనాదులు ఏవైనా ఇబ్బందులు కలిగించినా తప్పుకొనిరాగల ధీరుడని ధర్మరాజు నమ్మకం. పాండవుల హృదయాల్ని లోకానికి తెలియబరచగలిగిన వాక్చాతుర్యం, అవసరమైతే తగిన సమాధానం చెప్పగల నేర్పు, తగినంత ఓర్పు గల మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందుకనే శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు.
శ్రీకృష్ణుడు తాను చిన్నప్పటి నుండే మానవాతీత శక్తుల్ని ప్రదర్శించాడు. పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులను చంపడం, కాళీయుని పడగలపై నాట్యం చేయడం వంటి అతిమానుష శక్తుల్ని కలిగి ఉన్నాడు. గోవర్ధనగిరిని పైకిలేపుట వంటి కార్యాల ద్వారా తాను పరమాత్ముడనే సత్యాన్ని వెల్లడి చేశాడు. కుంతీదేవి కూడా కృష్ణుడిని మేనల్లునిగా గాక భగవంతునిగానే సంభావించింది. కష్టాల నుండి గట్టెక్కించేవాడు, ఎల్లప్పుడు శుభాలను కలిగించేవాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టే కృష్ణునికి శరణాగతుడైనాడు ధర్మరాజు.
ప్రశ్న 2.
యుద్ధాల వల్ల కలిగే నష్టాలు, అనర్దాలు చెప్పండి.
జవాబు:
యుద్దాల వల్ల సంపదలు కలిగినా ప్రాణహాని కూడా జరుగుతుంది. బలహీనులు బలవంతుని చేతిలో చనిపోతారు. ఒక్కొక్కసారి బలవంతులు సైతం బలహీనుల చేతిలో సమసిపోతారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో నిశ్చయించి చెప్పలేము. ఒకవేళ సంగ్రామంలో అపజయం కలిగితే అది చావు కంటే భయంకరమైనది. యుద్ధం అన్ని అనర్థాలకు మూలం. యుద్ధానికి మూలం పగ. పగ కారణంగానే యుద్ధజ్వాల రగులుతుంది. పగ తగ్గితే యుద్ధ ప్రవృత్తి సహజంగానే తొలగిపోతుంది.
ఒకసారి పగ సాధింపునకు దిగితే ఇక దయాదాక్షిణ్యాలు ఉండవు. సంధికి అవకాశం ఉండదు. దారుణమైన క్రూరవృత్తితో శత్రుసంహారమే కొనసాగుతుంది. లక్ష్యం కొద్దిమందికే అయినా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. చాలామంది వికలాంగులవుతారు. భర్తలను కోల్పోయిన స్త్రీలు, వారి కుటుంబాలు వీధినబడతాయి. తమ పిల్లల్ని కోల్పోయిన వృద్ధులు అనాథలవుతారు. దేశంలో కరవుకాటకాలు విలయతాండవం చేస్తాయి.
పూర్వకాలంలోని యుద్ధాలకు నీతినియమాలుండేవి. కానీ ఆధునిక కాలంలో యుద్ధాలకు అవి వర్తించడం లేదు. పూర్వం యుద్ధాలు సూర్యోదయం తర్వాత ఆరంభమై సూర్యాస్తమయంతో ముగిసేవి. నేడు రాత్రివేళల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆధునిక కాలంలో మానవుని విజ్ఞానం బాగా పెరిగి, అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు కనుగొనబడి యుద్ధాల్లో ప్రయోగించబడుతున్నాయి. వీటివల్ల దేశాలకు దేశాలే ప్రపంచ పటం నుండి మాయమయ్యే పరిస్థితులేర్పడుతున్నాయి. యుద్ధంలో పాల్గొనే దేశాలకే కాక ఇతర ప్రపంచ దేశాలకు సైతం నేడు అనర్థాలు కలుగుతున్నాయి.
బాంబుల విస్ఫోటనాల వల్ల జలకాలుష్యం, వాయు కాలుష్యాలేర్పడి ప్రక్కనున్న దేశాలు కూడా నష్టమౌతున్నాయి. పరిసరాల కాలుష్యం వలన యుద్ధం జరిగి కొన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రజలు ఇంకా కోలుకోని దుస్థితులేర్పడుతున్నాయి. గ్రామాలలో, కొండలలో నక్కిన శత్రువులను చంపడం కోసం చేసే వైమానిక దాడుల్లో ఎందరో అమాయక ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. యుద్ధ సమయంలో అరబ్బు దేశాల్లో పెట్రోలు బావుల పై బాంబులు పడి మంటలు రేగి కలిగిన నష్టం ఎప్పటికీ తీర్చలేనిది.
ఆ) గుర్తున్న పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రయును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, సిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీనొందినన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రయును = ఆ కొలదియైనను
చేయన్ = చేయడానికి
చాలడు + ఓ = ఇష్టపడడేమో
కాని = కాని
పెంపు = అభివృద్ధి
ఏదన్ = నశించునట్లుగా
క్రూరతకున్ = క్రౌర్యమునకు
ఓర్వరాదు = సహించగూడదు
సిరి = రాజ్యం (సంపద)
నాకున్ + ఏల = నాకెందుకు
అందున్ + ఏ =అని అందునా
నా + అరయు = నేను బాగోగులు చూసుకోవలసిన
ఈ చుట్టాలకున్ = ఈ ఆశ్రితులకు (పరివారానికి, బంధువులకు)
గ్రాస = తిండికి
వాసః = బట్టకు (నివాసానికి)
దైన్యంబులు = దురవస్థలు
వచ్చు = కల్గుతాయి
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = కౌరవులును
ఏమున్ = మేమును
పొంది = సంధి చేసుకొని
శ్రీన్ = రాజ్యాన్ని
పొందినన్ = పొందినట్లైతే (పంచుకున్నట్లైతే)
మోదంబు = (అందరికీ) సంతోషం
అందుట = పొందుట
కల్గున్ = జరుగుతుంది
అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు.
సూచన : పాఠంలోని పద్యాలు అన్నింటికీ ప్రతిపదార్థాలు, భావాలు ముందు ఇవ్వబడ్డాయి. * గుర్తుపెట్టిన పద్యాల ప్రతిపదార్థాలు చదవండి.
ఇ) కింది పేరాను చదివి ఎలా, ఎందుకు? అనే ప్రశ్న పదాలను మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు తయారుచేయండి.
మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు. కఠినంగా మాట్లాడితే పిల్లలకు నచ్చదు. కాబట్టి అలా మాట్లాడేవారికి దూరంగా ఉంటారు. పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతుంటారు. తమకు స్వేచ్ఛ ఉన్నచోటనే నిర్భయంగా ప్రశ్నిస్తారు. భద్రత ఉందని భావిస్తేనే, స్వేచ్చగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడతారు.
ప్రశ్నలు:
1. మనసుకు నచ్చిన పనులే పిల్లలు ‘ఎలా’ చేస్తారు?
2. కఠినంగా మాట్లాడితే పిల్లలకు ఎందుకు నచ్చదు?
3. కఠినంగా మాట్లాడే వారితో పిల్లలు ఎలా ఉంటారు?
4. పిల్లలు ‘ఏలా’ ఆలోచిస్తారు?
5. కొందరు తల్లిదండ్రులు ‘ఎందుకు’ బాధపడుతూ ఉంటారు?
6. ఎలా ఉన్నచోట పిల్లలు నిర్భయంగా ప్రశ్నిస్తారు?
7. ఎందుకు స్వేచ్ఛగా ఉంటారు?
8. స్వేచ్ఛ ఉన్నచోట పిల్లలు ఎలా మాట్లాడతారు?
ఈ) పాఠం చదవి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ధర్మరాజు రాజ్యసంపద దేనికోసం కోరాడు?
జవాబు:
క్షత్రియ ధర్మాన్ని పాటించడం ఎంతో కష్టం. అలాగని రాజు వేరే ధర్మాలను పాటించకూడదు. కాబట్టి ఆయుధాలను చేపట్టి రాజ్యసంపదను పొందాలి. పోనీ రాజ్యసంపద తనకెందుకని కౌరవులను అడగటం మానితే, తననే ఆశ్రయించుకొని ఉన్న తన తమ్ములకు, బంధుజనాలకు కూటికీ, గుడ్డకు సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టే ధర్మరాజు రాజ్యసంపదను కోరాడు.
ప్రశ్న 2.
శత్రుత్వ భావనను కవి దేనితో పోల్చాడు?
జవాబు:
శత్రుత్వ భావనను కవి పామున్న ఇంటిలో కాపురం ఉండడంతో పోల్చాడు. అంటే పామున్న ఇంట్లో ఎలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తామో అలా శత్రుత్వమున్న చోట కూడా ఏ క్షణం ఏమి జరుగుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవించాలని కవి భావం.
ప్రశ్న 3.
చాకచక్యంగా మాట్లాడమంటూ శ్రీకృష్ణునికి ధర్మరాజు ఎలాంటి సలహా ఇచ్చాడు?
జవాబు:
కృష్ణా ! మా విషయంలో పక్షపాతం చూపించకు ! ధర్మం – నీతి వాటిననుసరించి ఇరుపక్షాలకూ మేలు, అభివృద్ధి జరిగేలా మాట్లాడు. విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేటట్లుగా తగినంత మెత్తదనంతోనూ, అవసరమైనచోట కఠినమైన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. న్యాయం పట్టించుకోకుండా దుర్యోధనుడు పరుష వాక్యాలు పలికితే సహించు. తొందరపాటుతో సభను విడిచిరాకు. పెద్దలమాటను సుయోధనుడు వినలేదనే నింద అతనికే ఉంచు. మనం గౌరవంగా పెద్దలమాటను, ఉద్దేశాన్ని సాగనిస్తున్నామని లోకులు మెచ్చుకునేలా చేయి.
ఆ ధృతరాష్ట్రుడు సుతపక్షపాతియై సూటిగా ఏ అభిప్రాయాన్ని చెప్పక, అవినీతితో ప్రవర్తిస్తే సంధి కుదరదని సాహసించి పలుకకు. సాహసం చేయాల్సివస్తే జనులంతా మెచ్చుకునేటట్లు ధర్మానికి నిలచి, మాకు విచారం లేకుండా చేయి. నీకంతా తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాణ్ణి ? హస్తినాపురానికి వెళ్ళిరా !
II. వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
“పామున్న ఇంటిలో కాపురమున్నట్లే” అంటే ఏమిటి? ధర్మరాజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఇంట్లో పాము ఎప్పుడు కాటువేసి ప్రాణాలు తీస్తుందో తెలియదు కాబట్టి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రతిక్షణం భయంతో గడపాలి.
యుద్ధానికి మూలం పగ. ఎడతెగని పగే యుద్ధాన్మాదంగా మారుతుంది. మాయాద్యూతంలో మోసంతో, రాజ్యాన్ని కాజేశారనే పగతో పాండవులలో యుద్ధజ్వాల రగుల్కొంది. బలవంతులైన పాండవులు బతికి ఉంటే రాజ్యం దక్కదని అసూయాపరులైన కౌరవులు వారి మీద పగతో యుద్ధానికి సిద్ధపడ్డారు. పగ తగ్గితే యుద్ధం చేయాలనే కోరిక అణగారి పోతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. శత్రుత్వం వలన ఎప్పుడూ అశాంతితో ఉండాల్సి వస్తుందని ధర్మరాజు ఈ వాక్యాన్ని చెప్పాడు.
ప్రశ్న 2.
“ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం మంచిది కాదు” దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పగ ఒకసారి ప్రవేశిస్తే ఇక శాంతి ఉండదు. కాబట్టి దాన్ని తగ్గించడం, తొలగించడం తప్ప మరో మార్గం లేదు. ఎక్కువకాలం పగను మనసులో ఉంచుకోకుండా నిర్మూలించడమే మంచిది. ఎందుకంటే మనసు త్వరగా శాంతిస్తుంది. ఉద్వేగం లేకపోవడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది. పగబట్టినవారు ప్రతిరోజూ దుఃఖంతోనే నిద్రిస్తారు. పగ లేకుంటే ప్రశాంత చిత్తంతో సుఖంగా నిద్రిస్తారు. పగ వలన సుఖంలేనివాడు తన సర్వస్వాన్నీ తానే నాశనం చేసుకుంటాడు. అంతకుముందున్న మంచిపేరు కూడా పోతుంది.
దీర్ఘకాల విరోధం వలన కుటుంబాలే గాక వంశాలు కూడా నశించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ విరోధం రెండుగాని అంతకన్న ఎక్కువ దేశాల మధ్యగాని ఉండేటట్లయితే ప్రపంచశాంతికే భంగం కలుగుతుంది. ఆయా దేశాలు నిరంతరం అశాంతితో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాలిక వైరం మంచిది కాదు.
ప్రశ్న 3.
“కార్యసాధన” అంటే అనుకొన్న పనిని సాధించడం. ధర్మరాజు మాటల్ని బట్టి ఈ కార్యసాధనను మనం ఎలా సాధించాలి?
జవాబు:
కార్యాన్ని సాధించదలచుకున్నవాడికి ఎంతో ఓర్పు, తగిన నేర్పు ఉండాలి. ఇతరులను బాధించకుండా, తాను బాధపడకుండా తెలివిగా పనిని సాధించుకోవాలి. ఒకవేళ జనాలు విమర్శించే పని అయినట్లైతే ఆ నింద తనపై పడకుండా అందరూ ఎదుటి వారినే నిందించేలా పనిని చాకచక్యంగా నెరవేర్చుకోవాలి. ధర్మబద్ధంగా, న్యాయసమ్మతంగా కార్యాన్ని సాధించాలి. కోరిన ప్రయోజనాన్ని పాపం రాకుండా, కీర్తి కలిగేలా సాధించుకోవాలి.
ప్రశ్న 4.
మాట్లాడే విధానం అంటే ఏమిటి? కార్యసాధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?
జవాబు:
స్ఫుటంగాను, స్పష్టంగాను, సూటిగాను మాట్లాడాలి. వాదాంశాన్ని క్రమంగా ప్రతిపాదించాలి. నాటకీయ ధోరణిలో మాట్లాడే విధంగా ఉంటే సహజంగా మనసుకు హత్తుకుంటుంది. ఇలా చక్కగా ఆకర్షించేలా పనిని సాధించుకునేలా మాట్లాడటాన్నే మాట్లాడే విధం అంటారు. ఇక కార్యసాధకుడైనవాడు తన శక్తిని, ఎదుటివారి శక్తిని చక్కగా అంచనా వేయగలిగి ఉండాలి. వినయంతో ఉంటూ అవసరమైనప్పుడు తన శక్తియుక్తుల్ని ప్రదర్శించాలి. సమయానుకూలంగా తనని తాను మలచుకోగలిగి ఉండాలి. ధననష్టం, ప్రాణనష్టం వంటివి జరగకుండా తన కార్యాన్ని నేర్పుగా చేయగలిగి
ఉండాలి.
ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ధర్మరాజు శాంతి వచనాలను సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రపంచ శాంతిని కాంక్షించడం అందరి కర్తవ్యం కదా ! అలాంటి శాంతిని కోరుతూ ధర్మజుడు ఏం చెప్పాడో మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ధర్మరాజు కృష్ణనుద్దేశించి శాంతి పట్ల తనకు గల ఆకాంక్షను ఏ విధంగా వెల్లడించాడో మీ స్వంత మాటల్లో రాయండి.
(లేదా )
శాంతిని కోరుకోవడం అందరికి అభిలాష మరి ధర్మజుడు శాంతిని కోరుతూ ఏ విధంగా శ్రీకృష్ణునితో చెప్పాడు?
జవాబు:
ఓ కృష్ణా ! అర్ధరాజ్యం బదులు ఐదూళ్ళు ఇచ్చినా చాలని – నీవు, బంధువులు ఆశ్చర్యపోయేటట్లుగా చెప్పాను. కానీ ఆ ఔదార్యం కూడా కౌరవుల వలన బూడిదలో పోసిన పన్నీరైంది. ఒకవేళ దుర్యోధనుడు ఐదూళ్ళు కూడా ఇవ్వకపోతే సిరిసంపదలకు నెలవైన రాజ్యం అసలు ఉండదు. పోనీ సిరిని కోరకుండా వైరాగ్యజీవితం గడపటానికి సిద్ధమైతే నన్నాశ్రయించుకున్న వారికి కనీస అవసరాలైన కూడు – గుడ్డ – గూడులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది. దానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. చంపాల్సి వస్తే లోకంలో పరాయివారిని, శత్రువులను ఎన్నుకోవడం సహజం. అయినా వారిని కూడా రాజ్యం కొరకు చంపాలనుకోవడం అహింసా ధర్మం కాదు. అది యుద్ధనీతి అవుతుంది గాని ధర్మనీతి కాదు. ఇక బంధుమిత్రులను చంపటం న్యాయం కాదు గదా !
విజయం పొందని యుద్ధం కంటే చావే మేలు. కాని యుద్ధంలో జయాపజయాలను ఎవరూ నిశ్చయించలేము. యుద్ధం వలన అనేక నష్టాలు కలుగుతాయి. ఇక శత్రుత్వమే ఏర్పడితే పామున్న ఇంటిలో కాపురమున్నట్లే. మనశ్శాంతికి చోటే ఉండదు. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాల వైరం పనికిరాదు. విరోధాన్ని అణచివేయడం మంచిది. విరోధం వలన విరోధమెప్పుడూ సమసిపోదు. ఒకడు వైరంతో వేరొకరికి బాధ కలిగిస్తే బాధపడినవాడు ఊరుకోడు. అవకాశం రాగానే పగ సాధిస్తాడు. సాహసించి పగను నిర్మూలించదలిస్తే దారుణకార్యాలు చేయాల్సి వస్తుంది. పగ వలన కీడే గాని వేరొక ప్రయోజనం లేదు.
కృష్ణా ! సంపద కావాలనీ, యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాను. యుద్ధం వలన ధననష్టం, వంశ నాశనం జరుగుతుంది. ఈ రెండూ జరగని ఉపాయంతో ఎలాగైనా బాగుపడటం మంచిది కదా ! ధర్మం, నీతి – వాటిని బట్టి రెండు వర్గాల వారికీ మేలు, అభివృద్ధి జరిగేలా చూడు. విదురుడు మొదలైన మహానుభావులు సమ్మతించేలా తగినంత మెత్తదనంతోను, అవసరమైనచోట కఠిన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు కుమారుడి మీది ప్రేమతో ఏ విషయం తేల్చి చెప్పకుంటే ధర్మబద్ధుడవై తగిన నిర్ణయం తీసుకో. మా ఇరువర్గాలకూ కావాల్సినవాడివి. నీతి తెలిసిన వాడివి, నీకు నేను చెప్పగలవాడినా ? హస్తినాపురానికి వెళ్ళిరా ! … అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో శాంతి వచనాలను పలికాడు.
ప్రశ్న 2.
ధర్మరాజు యుద్ధం వల్ల కలిగే నష్టాలు చెప్పాడు గదా ! ఈ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు రాకుండా ఉండడానికి చేపట్టాల్సిన చర్యలేమిటి?
జవాబు:
నేటి కాలంలో కూడా దారుణమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మన భారతదేశంపై పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మన సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమించడంతో తప్పక “కార్గిల్ యుద్ధాన్ని” చేయాల్సి వచ్చింది. అయినా బుద్ధి తెచ్చుకోక పాకిస్థాన్ మన దేశంలో ఉగ్రవాద చర్యలకు సిద్ధపడుతున్నది. మరొక ప్రక్క చైనా కూడా యుద్ధాన్మాదంతో ఊగిపోతోంది. మన సరిహద్దు రాష్ట్రాలను ఆక్రమించాలని నిరంతరం ప్రయత్నిస్తోంది.
అమెరికా ధన మదంతో, అధికార దాహంతో యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఐక్యరాజ్యసమితి మిగతా దేశాలను కొంతవరకు అదుపు చేయగలిగినా అగ్రరాజ్యా లైన అమెరికా, బ్రిటన్లకు సూచనలను చేయడానికి కూడా సాహసించలేని దుస్థితిలో ఉంది. తమ ఇష్టానుగుణంగా ప్రవర్తిస్తున్న అగ్రరాజ్యాల అహంకారం ముందు ప్రపంచశాంతి కోసం స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి సైతం బానిసలాగా తలొంచుకొని నిలుచుందంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం లేదు.
యుద్దాలను ఆపాలనుకొంటే ముందు ప్రపంచ దేశాలన్నీ చిత్తశుద్ధితో శాంతి ఒడంబడికలు చేసుకోవాలి. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను అన్ని దేశాలూ శిరసావహించాలి. దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను, పరిగణించక సోదరులుగా భావించాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ సమగ్రమైన అభివృద్ధికి అన్ని దేశాలూ సహకరించాలి. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా పొరుగుదేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో కలుగజేసుకోకూడదు. ఇప్పటికే రగులుతున్న సమస్యలైన కాశ్మీర్ సమస్య, వివిధ దేశాల సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. సామ్యవాద భావనలు వెల్లివిరియాలి. స్వార్ధ భావాలను విడిచి పెట్టాలి. ప్రక్క దేశాలపై కవ్వింపు చర్యల్ని కూడా మానాలి. విశ్వశాంతికై చిత్తశుద్ధితో పాటుపడాలి.
ఇ) సృజనాత్మకంగా రాయండి.
పగ, ప్రతీకారం మంచివి కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
గుంటూరు, ప్రియమైన మిత్రునకు / మిత్రురాలికి, నేనిక్కడ క్షేమంగా ఉన్నాను. బాగా చదువుకుంటున్నాను. నీవు క్షేమమని, బాగానే చదువుకుంటున్నావని తలుస్తాను. ఈ మధ్యకాలంలో కుటుంబ కలహాలు, ఇతర వివాదాల వలన చాలామంది చనిపోతున్నారు. గ్రామాలలో కుల వివాదాలు, ఇతర పొలాలు, ఆస్తులకు సంబంధించిన వివాదాల వలన రక్తపాతాలు జరుగుతున్నాయి. వీటి వలన పెద్దవారు, పిల్లలు అనాథలవుతున్నారు. వీటి అన్నింటికి మూలమైన పగ, ప్రతీకారాలు మంచివి కాదు. చదువుకున్నవారు, ఉన్నతస్థితులలో ఉన్నవారు సైతం వీటి ప్రభావానికి లోనవుతున్నారంటే, చదువుకున్న మూర్ఖులులా ప్రవర్తిస్తున్నారంటే ఇవి ఎంత చెడ్డవో తెలుస్తుంది. పగ, ప్రతీకారాల వల్ల ఎల్లప్పుడూ అశాంతితో, భయంతో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. వీటి ద్వారా ఆరోగ్యం దెబ్బతిని, చిన్నవయస్సులోనే మధుమేహ వ్యాధి (షుగర్) వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడే ప్రమాదం ఎక్కువ. పూర్వకాలంలో సమాజాలలో అన్ని కులాలవారు, మతాలవారు ఒకరినొకరు బాబాయ్, చిన్నమ్మ, అన్నయ్య, తమ్ముడూ, చెల్లెమ్మ లాంటి వావి-వరుసలతో పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా మెలగేవారు. ఒక్కడి కోసం అందరూ, అందరికోసం ఒక్కడుగా నిలచేవారు. అటువంటి స్థితి నేడు రావాలి. దానికి ఉమ్మడి కుటుంబాలు ఎంతో సహకరిస్తాయి. ఉమ్మడి కుటుంబ భావన అందరికీ కలిగించాలి. నగరాలలో, పట్టణాలలో బహుళ అంతస్థుల భవనాలు (అపార్ట్ మెంట్స్) పెరిగిపోతున్నాయి. వీటిల్లో నివసించేవారు వేరు వేరు కుటుంబాల నుంచి, ప్రాంతాల నుంచి వస్తారు. కొన్నిచోట్ల వేరు వేరు భాషలు మాట్లాడేవారు సైతం ఒకచోట జేరతారు. అలాంటి చోట అన్ని మతాల పండుగలను అందరూ కలసి జరుపుకోవడం, వంటకాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి ద్వారా కుటుంబ భావన పెరుగుతుంది. దాని ద్వారా పరమత సహనం అలవడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శాంతియుత జీవనం కలుగుతుంది. మానసిక ఉద్వేగాలు అణగారి పోయి, రోగాలు తగ్గుతాయి. ఆరోగ్యం వలన ఆయువు పెరిగి సుఖశాంతులతో జీవించవచ్చు. మీ అమ్మగారిని, నాన్నగారిని ఇతర కుటుంబ సభ్యులను అడిగినట్లు చెప్పు. శాంతియుత సమాజ నిర్మాణాన్ని గూర్చి నీ భావాలను నాకు లేఖ ద్వారా తెలియజేయి. నీ లేఖకై ఎదురుచూస్తూ ఉంటాను. ధన్యవాదములు ఇట్లు, చిరునామా : |
(లేదా)
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేసేలా ఒక ‘కరపత్రాన్ని’ తయారుచేయండి.
(లేదా)
ధర్మరాజు లాగ శాంతిని కాంక్షించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
శాంతి నీవెక్కడ ? (కరపత్రం)
శాంతమే రక్ష
దయ చుట్టము
మనకి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా, ఇంకా దేశంలో అశాంతి పూరిత, ఆందోళనకర వాతావరణమే నెలకొని ఉంది. అగ్రరాజ్యాలే నేటికీ అంతర్జాతీయ అంశాల్ని నిర్ణయించేవిగా ఉన్నాయి. ఉగ్రవాదం ఉరకలు వేస్తోంది. స్థానిక ఉద్యమాలు, కులమత లింగ వివక్షలు, ప్రజావిప్లవాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. స్వార్థపూరితమైన జీవనం, అనారోగ్యకరమైన పోటీతత్వం, ప్రపంచీకరణ విధానాలు అంటువ్యాధుల్లా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి.
కేవలం మన దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. చాలా చోట్ల ప్రచ్ఛన్న యుద్ధాలు, ప్రత్యక్ష యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. అణుబాంబుల్ని మించిన వినాశకర ఆయుధాలెన్నో అగ్రరాజ్యాలు సమకూర్చుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ అశాంతి, అభద్రత, అసంతృప్తి నెలకొంటున్నాయి. ప్రతివారి మనస్సు శాంతికోసం పరితపిస్తుంది. కానీ శాంతి ఎక్కడా కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ వెతుకుతున్నా ఎక్కడా కనిపించడం లేదు.
అవును, ఎక్కడని కనిపిస్తుంది? ‘శాంతిని’ మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, సామ్రాజ్యవాదంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ప్రపంచమంతా అశాంతితో నింపి, ఇప్పుడు శాంతి పాఠాలు వల్లిస్తే మాత్రం వస్తుందా? ‘శాంతి’ నీవెక్కడ ? అని ఆక్రోశిస్తే వచ్చేస్తుందా?
ఎప్పుడైతే మనం పరమత సహనాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే సోదరభావంతో అందరినీ కలుపుకుంటామో, ఎప్పుడైతే సహృదయతను, నిస్వార్థాన్ని అలవరచుకుంటామో, ఎప్పుడైతే పరోపకార పరాయణులమవుతామో, ఎప్పుడైతే పగ – ప్రతీకారాల్ని విడుస్తామో, అంతర్యుద్ధాలను అసహ్యించుకుంటామో, యుద్ధాలను విడిచి పెడతామో, ఆయుధాలను ప్రేమించడం మాని, మానవులను ఇష్టపడతామో, ప్రేమతత్వంతో మెలగుతామో అప్పుడు – సరిగ్గా అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. మనం తనని మనస్ఫూర్తిగా కోరుతున్నామని నమ్మిన రోజున తనకైతానే ప్రత్యక్షమవుతుంది. అంతదాకా మానవజాతి అంతా ‘శాంతి’ నీవెక్కడా ? అని దీనంగా, హీనంగా విలపించక తప్పదు.
ఈ)
ప్రశంసాత్మకంగా రాయండి.
ప్రపంచశాంతి కోసం పాటుపడిన ‘నెల్సన్ మండేలా’, ‘గాంధీ’, ‘యాసర్ అరాఫత్’ వంటి వారి వివరాలు సేకరించి, వారిని అభినందిస్తూ ఒక వ్యాసం రాయండి. దాన్ని చదివి వినిపించండి.
జవాబు:
1) మహాత్మాగాంధీ :
మన దేశ ‘జాతిపిత’గా అందరిచే ప్రేమగా ‘బాపూజీ’ అని పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 1869వ సంవత్సరం అక్టోబరు రెండవ తారీఖున జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేశాక లండన్ వెళ్ళి బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై తిరిగివచ్చాడు. 1893వ సంవత్సరంలో ఒక వ్యాజ్యం విషయంగా దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ భారతీయులు, ఇతర నల్ల జాతీయులు పడే అగచాట్లన్నీ గమనించాడు. రైళ్ళలో మొదటి తరగతిలో ప్రయాణం చేసేందుకు వీలులేదు. శ్వేత జాతీయులు, పెద్ద కుటుంబాలు ఉండే చోట్లకు భారతీయులను, ఇతర నల్లజాతి వారిని అనుమతించరు. చివరకు తలపై టోపీని ధరించి కోర్టులో వాదించడానికి కూడా అనుమతి లభించలేదు.
ట్రాముల్లోనూ, రైళ్ళలోనూ శ్వేత జాతీయులతో కలసి ప్రయాణించే యోగ్యత లేదు. బానిసలుగా చూస్తూ ‘కూలీ’ అని సంబోధించేవారు. ఈ దురాగతాలను ఆపడానికై గాంధీజీ ప్రయత్నించాడు. 1869వ సంవత్సరంలో ట్రాన్స్ వాల్ లో ఇంగ్లీషు, డచ్చి వారికి జరిగిన యుద్ధంలో గాయపడిన బ్రిటిషు వారిని వైద్యశాలలకు చేర్చి చికిత్స చేయించాడు. గాంధీ సేవను గుర్తించక వారు దక్షిణాఫ్రికా భారతీయులకు నాయకుడై, ప్రభుత్వ ఉత్తర్వులను ఎదిరిస్తున్నాడన్న వంకతో ఆయన్ని జైలుకు పంపి, వెట్టిచాకిరీ చేయించారు. కానీ శాంతి, ఓర్పు, అహింసలతో వాటిని ఎదుర్కొని ఐకమత్యంతోను, పత్రికల సహాయంతోను పోరాడి విముక్తిని సాధించాడు. దక్షిణాఫ్రికా వీడి వచ్చేటప్పుడు అక్కడి అభిమానులు తనకు ఇచ్చిన బహుమతులను, ధనాన్ని “దక్షిణాఫ్రికా భారతీయుల సంక్షేమ నిధి”గా ఏర్పాటుచేసిన నిస్వార్థపరుడు, పరోపకార పరాయణుడు, శాంతి కాముకుడు “గాంధీ మహాత్ముడు” !
భారతదేశానికి తిరిగి వచ్చాక భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమం, జైల్ బరో వంటి ఉద్యమాలను సమర్థతతో నిర్వహించి బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి వారు స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోవటం తప్ప మరో మార్గం లేకుండా చేశాడు. అలా భారతదేశం 1947వ సంవత్సరం, ఆగస్టు నెల 15వ తారీఖున స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ ఆ మహాత్ముడు, శాంతమూర్తి, అహింసా పరాయణుడు, నిరంతర కార్యశీలి స్వేచ్ఛావాయువులను పూర్తిగా ఆస్వాదించకుండానే 30-1-1948వ తారీఖున కీర్తిశేషుడయ్యాడు.
2) నెల్సన్ మండేలా :
నెల్సన్ మండేలా మొట్టమొదటి సారిగా దక్షిణాఫ్రికాకు ఎన్నికైన నల్లజాతికి చెందిన ప్రెసిడెంటు. ఈయన పూర్తి పేరు రోలిహలాహలా మండేలా. ‘నెల్సన్’ అనే పేరు ఆయన పాఠశాలలో జేరినప్పుడు ఆంగ్ల ఉపాధ్యాయురాలైన మిసెస్ మిడిగేన్ పెట్టినది. నాటి దక్షిణాఫ్రికాను పాలిస్తున్న బ్రిటిష్ వారి నియమాలలో పేరు మార్చడం ఒకటి. నల్ల జాతీయులను పాఠశాలలో చేర్చేటప్పుడు ఒక ఆంగ్లభాషా పేరు వారికి పెడతారు. ఇది బ్రిటిష్ వారి జాత్యహంకారానికి మచ్చుతునక.
మండేలా దక్షిణాఫ్రికాలోని ఆగ్నేయ ప్రాంతమైన ట్రాన్స్ కి ప్రాంతంలో 18-07-1918వ తేదీన టెంబు జాతికి చెందిన కుటుంబంలో జన్మించాడు. వీరి భాష హోసా. మండేలా పాఠశాల విద్యను పూర్తి చేసుకొని, కళాశాల విద్యకై ఆఫ్రికన్ నేటివ్ కళాశాలలో బి.ఎ. డిగ్రీ. ప్రథమ సంవత్సరంలో చేరాడు. కానీ విద్యార్థి సంఘాలలో చేరి తన ప్రవేశం అధికారులచే రద్దు చేయబడటంతో బయటకు వెళ్ళాల్సివచ్చింది. జోహన్స్ బర్గ్ ప్రాంతాన్ని చేరుకొని దూర విద్య ద్వారా చదివి బి.ఎ. డిగ్రీని పొందాడు. తర్వాత బారిష్టరు విద్య కోసం విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడే ఆయన ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్సులో (A.N.C.) సభ్యునిగా చేరాడు. తన మిత్రులైన వాల్టర్ సిస్లూ, ఆలివర్ టాంబో, విలియమ్ కోమో వంటి వారి సహాయంతో ఏ.ఎన్.సి. విస్తరించడం లోను, కార్యశీలకమైన సంస్థగా మలచడంలోను విశేష కృషి సల్పాడు.
దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశ పౌరులందరినీ మూడు వర్గాలుగా విభజించింది. శ్వేత జాతీయులు మొదటివరం. తల్లిదండ్రులలో ఒకరు శ్వేత జాతీయులు, వేరొకరు నల్లజాతీయులైన వారు రెండవ వర్గం. ఇక నల్ల జాతీయులు మూడవ వర్గం. మూడు వర్గాలకు ప్రత్యేకమైన వసతి ప్రదేశాలుంటాయి. ఎవరికి వారికే ప్రత్యేకమైన మరుగుదొడ్లు. ఉద్యానవనాలు, సముద్రతీర ప్రాంత విహారాలు, పాఠశాలలు, ఉద్యోగాలు ఉంటాయి. శ్వేతజాతీయులకే పూర్తి రాజకీయ అధికారాలుంటాయి. 1960 – 80 ల మధ్య ప్రభుత్వం శ్వేత జాతీయుల కోసం మిగిలిన రెండు వర్గాల వారిని ఖాళీ చేయించి మూరుమూల ప్రాంతాలకు పంపింది. ముప్పై లక్షలమంది తమ నివాస ప్రాంతాలను విడిచి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది.
ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఏ.ఎన్.సి. పోరాటానికి నడుం కట్టింది. ఐతే అహింసాయుత మార్గంలో సహాయనిరాకరణ, ధర్నాలు చేయటం, అధికారుల పట్ల అవిధేయతను ప్రదర్శించడం వంటి వాటి ద్వారా ఉద్యమించింది. పూర్తి పౌరసత్వాన్ని పొందడం, శాసనసభలో చోటు సంపాదించడం, మిగిలిన వర్గాలతో సమానమైన హక్కులను పొందడం లక్ష్యంగా నిరంతరం పోరాటం సల్పింది. మండేలా దేశమంతా సంచరిస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఎంతోమంది మద్దతుదారులను కూడగట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా మద్దతును సాధించగలిగాడు కూడా. దాని ఫలితంగా ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి గురై 27 సంవత్సరాలు కఠిన కారాగారవాసాన్ని అనుభవించాడు.
చివరకు ప్రభుత్వం తలవొగ్గి ఏ.ఎన్.సి కోరిన వాటిని ఆమోదించింది. మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనాడు. 1993వ సంవత్సరంలో మండేలా, అతని సహచరుడైన డిక్లార్క్ లకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1999 సంవత్సరం దాకా అధ్యక్షునిగా ఉండి, తర్వాత రాజకీయ సన్యాసం చేసి, స్వగ్రామానికి చేరుకున్నాడు. హెచ్.ఐ.వి. మరియు ఎయిడ్స్ రోగ విషయంలో తన వారిని జాగరూకులను చేయడానికి పెద్ద పెద్ద శిబిరాలను నడిపాడు. ప్రపంచవ్యాప్త సదస్సులలో పాల్గొన్నాడు.
దారుణమైన వర్ణ వివక్షకు లోనైనా, దృఢసంకల్పంతో ఎన్నో కష్టాలకు, కారాగారవాస శిక్షలకు ఓర్చి తోటివారికై పరిశ్రమించి కృతార్థుడైనాడు నెల్సన్ మండేలా మహాశయుడు.
3) యాసర్ అరాఫత్ :
యాసర్ అరాఫత్ గా ప్రసిద్ధిచెందిన ఆయన అసలు పేరు మొహమ్మద్ యాసర్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రౌఫ్ అరాఫత్ అల్ ఖుద్వా అల్ హుస్సేని. ఈయన 1929వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీన పాలస్తీనాలో జన్మించాడు. అరాఫత్ తన జీవితకాలంలో ఎక్కువ భాగం ఇస్రాయేల్ దేశీయులతో పాలస్తీనీయుల స్వీయ నిర్ధారణ అనే పేరుతో పోరాటం జరిపాడు.
పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (P.L.O) కు చైర్మన్ గాను, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (P.N.A) కి అధ్యక్షునిగాను, ఫాత్ రాజకీయ పార్టీ సభ్యునిగాను పనిచేశాడు. అరాఫత్ తన ఉద్యమాన్ని వివిధ అరబ్ దేశాల నుండి కూడా నిర్వహించాడు. ఇస్రాయేల్ దేశానికి ఇతని ఫాత్ పార్టీ ప్రధాన లక్ష్యం అయింది. ఇస్రాయేల్ దేశీయులు అతన్ని టెర్రరిస్టుగాను, బాంబు దాడులలో వందలమందిని చంపిన దుర్మార్గుడుగాను చిత్రీకరించారు. పాలస్తీనీయులతణ్ణి ఒక గొప్ప దేశభక్తునిగా సంభావించారు. అగ్రరాజ్యాల నెదిరించి, పాలస్తీనాకు సంపూర్ణ స్వేచ్చను సాధించిన ఘనత అరాఫత్ దే. పాలస్తీనాకు మొదటి అధ్యక్షుడుగా చేశాడు. 1994 వ సంవత్సరంలో అరాఫత్ కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి కోసం పోరాడిన ఈ యోధుడు 11 – 11 – 2004వ తేదీన 75 సంవత్సరాల వయస్సులో తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళి మరణించాడు.
ఈ ముగ్గురు మహానుభావులను గమనించినట్లైతే నిస్వార్థంగా ప్రపంచశాంతికై కృషిచేశారని తెలుస్తుంది. కుల – మత – వర్ణ వివక్షలకు లోనైన ఎందరో సామాన్యులకు మానసిక స్టెర్యాన్ని కలిగించడమే కాకుండా వారిని ఆయా బంధనాల నుంచి విముక్తుల్ని చేసిన ఘనులని తెలుస్తుంది. తమ జాతీయుల స్వాభిమానాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు వీరు.
(లేదా)
మీ ఊరిలో ఏవైనా గొడవలు జరిగితే వెంటనే స్పందించి, గొడవలు వద్దు అని సర్ది చెప్పే పెద్ద వాళ్ళ గురించి, ‘నలుగురూ శాంతియుతంగా సహజీవనం చేయాలి’ అని ‘శాంతికోసం’ పాటుపడేవాళ్ళని గురించి అభినందిస్తూ కొన్ని వాక్యాలు రాయండి.
జవాబు:
మా ఊరిలో కుటుంబ కలహాలు గాని, చిన్న చిన్న తగాదాలు గాని, గొడవలు గాని జరిగితే మా ఊరి ప్రెసిడెంటు గారి వద్దకు తీసుకెళ్తారు. ఆయన ఇరుపక్షాల వారి వాదాలను ఓపికగా విని, నేర్పుగా ఎవరివైపు తప్పు ఉన్నదో గ్రహించి, వారి తప్పుని సున్నితంగా తెలియజేస్తారు. తగాదాలు మాని శాంతంగా ఉండాలని ఇద్దరికీ చెప్పి తగవు తీరుస్తారు. రామయ్య తాత ఊర్లో జరుపుకునే అన్ని మతస్థుల పండుగలకు అందరం పాల్గోవాలని, కులమత భేదాలు పట్టించుకోకుండా అందరం కలసి ఉండాలని చెపుతుంటాడు. అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాడు. అంజమ్మ అత్త మాలాంటి పిల్లలకు మంచి మంచి కథలు చెపుతూ ఉంటుంది.
ఆ కథల్లో ఎక్కువ శాంతికి సంబంధించినవే ఉంటాయి. మేము అందరం పాఠశాలలో మిగిలిన విద్యార్థులతో కలసిమెలసి మధ్యాహ్న భోజనం చేయాలని కోరుకుంటుంది. రహీమ్ బాబాయి వాళ్ళ పండుగలకు మాలాంటి పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్ళి మిఠాయిలు పెడతాడు. ఊళ్ళోని ముస్లిం కుటుంబాలకు నాయకత్వం వహిస్తూ, హిందువులతోను, క్రైస్తవులతోను సన్నిహితంగా ఉంటాడు. తనవారు ఇతరులతో గొడవపడకుండా, ఇతరుల వలన తన వారికి ఇబ్బందిరాకుండా చూస్తూ ఉంటాడు. అలాంటివాడు ఉండబట్టే మా ఊళ్ళో కులాల పోర్లు లేవంటే అతిశయోక్తి ఏమీకాదు. ఇక డేవిడ్ అన్నయ్య మంచి ఆటగాడు. ఊళ్ళో పిల్లలందరినీ పోగుచేసి, సాయంత్రం పూట మంచి మంచి ఆటలు ఆడిస్తాడు. అందరూ ఒక్కటే. అందరం ఎప్పుడూ కలసి ఉండాలని దానికి ఆటలు ఎంతో సహకరిస్తాయని ఎప్పుడూ చెపుతుంటాడు. అతని వల్ల పిల్లలం అందరం ధనిక – పేద, కుల-మత, స్త్రీ-పురుష భేదాలు మరచి సంతోషంగా ఆటలు ఆడుతున్నాం . అతను లేకుంటే మాలో ఇలాంటి ఐకమత్యం వచ్చేది కాదు.
ప్రాజెక్టు పని
ప్రపంచశాంతి కోసం కృషిచేసిన వారి వివరాలు సేకరించండి. వారి గురించి ఒక నివేదిక తయారుచేసి ప్రదర్శించండి.
III. భాషాంశాలు
పదజాలం
అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
1. గురువులు శుభంబైన వాటిని సమకూర్చెదరు.
జవాబు:
శుభంబైన = మంచిదైన
పెద్దలు మంచిదైన పనినే చేస్తారు.
2. దీర్ఘ వైరవృత్తి మంచిది కాదు.
జవాబు:
దీర్ఘ వైరవృత్తి : ఎక్కువ కాలం పగతో ఉండడం.
ఎక్కువకాలం పగతో ఉండడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది.
3. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎఱుక గలవాడు.
జవాబు:
ఎఱుక = జ్ఞానం
రాముకు తెలుగుభాషా జ్ఞానం ఎక్కువ.
ఆ) కింది వాక్యాలను పరిశీలించి, గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. రెండు దిక్కుల న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు
దిక్కు: దిశ, శరణం
2. ఒక రాజు దివినేలు నొక రాజు భువినేలు నొక రాజు రాత్రిని యేలు నిజము.
రాజు : ఇంద్రుడు, టేడు, చంద్రుడు
3. వైరి పక్షములోని పక్షి, పక్షమునకు గాయమై, పక్షము రోజులు తిరుగలేకపోయెను.
పక్షము : ప్రక్క, టెక్క 15 రోజులు.
4. పాఠానికి సంబంధించిన మరికొన్ని పదాలకు నానార్థాలను నిఘంటువులో వెతికి, పై విధంగా వాక్యాలలో ప్రయోగించండి.
అ) సమయము లేకున్నా మనము సమయమించక తప్పదు. ఎందుకంటే ఇదే ధర్మమైన సమయము కాబట్టి.
సమయము : కాలము, శపథము, బుద్ధి.
ఆ) మనకు పూర్ణము లేకున్నా జలపాత్ర పూర్ణము ఐనది.
పూర్ణము : శక్తి నిండినది.
ఇ) తగవుకు పోతే తగవు కలిగి, తగవు జరగలేదు.
తగవు : తగిన, తగాదా, న్యాయం.
ఈ) నేను దోష సమయంలో కారులో ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చేవాడి దోషానికి గాయమై, పెద్ద దోషం జరిగింది.
దోషము : రాత్రి, భుజము, తప్పు, పాపం.
ఉ) శరీరాన్ని పాముట వలన ఏర్పడిన మట్టి పాములా ఉంది.
పాము : రుద్దు, సర్పము.
ఇ) కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాసి, వాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : ప్రేమ్, సంతోష్ ప్రాణ స్నేహితులు.
అ) స్రవంతికి సంగీత, రాధికలు మంచి నేస్తాలు.
ఆ) మిత్రులు ఆపద్బాంధవులు.
1. అనుకున్నది సాధించినపుడు మోదం కలుగుతుంది.
అ) పిల్లలు బహుమతులను పొందినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
ఆ) పిల్లల సంతోషమే పెద్దలు కోరుకుంటారు.
2. ధరిత్రి పుత్రిక సీత.
అ) భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహం కోసం శాస్త్రవేత్తలు వెదకుతున్నారు.
ఆ) ధరకు ఉన్న ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు.
3. పోరితము నష్టదాయకం.
అ) తగాదాల వల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతాయి.
ఆ) యుద్ధం మూలంగా ధననష్టం, జననష్టం జరుగుతుంది.
వ్యాకరణం
అ) పాతం చదవండి. కింద తెల్సిన సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెదికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.
1) సవర్ణదీర్ఘ సంధి
2) సరళాదేశ సంధి
3) ఇత్వసంధి
4) యడాగమ సంధి
1. సవర్ణదీర్ఘ సంధి:
1) జనార్ధన : జన + అర్ధన
2) విదురాది : విదుర + ఆది
సూత్రం :అ, ఇ, ఉ, ఋ లకు, అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.
2. సరళాదేశ సంధి సూత్రం:
1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళమునకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు.
ఉదాహరణలు :
1) చక్కన్ = చేయ = చక్కఁజేయ
2) ఇచ్చినను + చాలు = ఇచ్చిననుజాలు
3) చేయన్ + చాలడో = చేయంజాలడో
4) ఏమున్ + పొంది = ఏముంబొంది
5) ఒకమాటున్ + కావున = ఒకమాటుఁగావున
6) పగన్ + పగ = పగంబగ
7) కడున్ + తెగ = కడుందెగ
8) ఏమిగతిన్ + తలంచిన = ఏమిగతిఁదలంచిన
9) శాంతిన్ + పొందుట = శాంతిఁబొందుట
10) సొమ్ములున్ + పోవుట = సొమ్ములుంబోవుట
11) చక్కన్ + పడు = చక్కఁబడు
12) ఒప్పున్ + చుమీ = ఒప్పుఁజుమీ
13) మనమునన్ పక్షపాత = మనమునఁబక్షపాత
14) తగన్ + చెప్ప = తగంజెప్ప
15) తెగన్ + పాఱకు = తెగంబాఱకు
3. ఇత్వ సంధి సూత్రం :
సూత్రం – 1: ఏమ్యాదులందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వైకల్పికంగా వస్తుంది.
సూత్రం – 2 : మధ్యమ పురుష క్రియలందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వికల్పంగా జరుగుతుంది.
1) అదియొప్పది = అది + ఒప్పదె
2) ఊరడిల్లియుండు = ఊరడిల్లి + ఉండు
3) అదియజులు = అది + అట్టులు
4. యడాగమ సంధి సూత్రం :
సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.
ఉదాహరణలు:
1) మా + అంశమగు = మాయంశమగు
2) నా + అరయు = నాయరయు
3) అది + ఒప్పదే = అదియొప్పది
4) పామున్న + ఇంటిలో = పామున్నయింటిలో
5) ఉన్న + అట్ల = ఉన్నయట్ల
6) పగ + అడగించుట = పగయడగించుట
7) పల్కక + ఉండగ = పల్కకయుండగ
8) అది + అట్టులుండె = అదియట్టులుండె
9) పల్కిన + ఏని = పల్కినయేని
10) పొంది + ఉండునట్లు = పొందియుండునట్లు
అ) కర్మధారయ సమాసం :
వివరణ :
‘నల్ల కలువ’ అనే సమాసపదంలో నల్ల, కలువ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది విశేషణం. రెండో పదం ‘కలువ’ అనేది నామవాచకం. ఈ విధంగా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే దాన్ని ‘కర్మధారయ సమాసం’ అంటారు.
1) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు. ఉదా : తెల్లగుర్రం – తెల్లదైన గుర్రం తెల్ల – విశేషణం (పూర్వపదం – మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం – రెండోపదం)
2) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం.
‘మామిడి గున్న’ అనే సమాసంలో మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ – నామవాచకం. రెండోపదం (ఉత్తరపదం) ‘గున్న’ విశేషణం. ఐతే విశేషణమైన ‘గున్న) ‘ఉత్తరపదం’గా (రెండోపదంగా) ఉండడం వల్ల దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.
కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచివాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) కార్మికవృద్ధుడు – వృద్ధుడైన కార్మికుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) తమ్ముగుజ్జలు – తమ్మువైన గుజ్జలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) ఛందస్సు:
1. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో తెల్పి, లక్షణాలను రాయండి.
i) కావున శాంతిఁబొందుటయ కర్జము దానది యట్టులుండె శ్రీ
ఇది “ఉత్పలమాల” పద్యపాదము.
ఉత్పలమాల – లక్షణం:
- ఈ పద్యానికి నాలుగు పాదములు ఉంటాయి.
- ప్రతి పాదములో భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు ఉంటాయి.
- ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు పదవ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
- ప్రాస నియమము ఉంది.
- ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
ii) పగయడగించు టెంతయు శుభం బదిలెస్సయడంగునే పగం
ఇది ‘చంపకమాల’ పద్యపాదం.
చంపకమాల – లక్షణం :
- చంపకమాల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
- ప్రతిపాదములోనూ న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉంటాయి.
- ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు 11వ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
- ప్రాస నియమం ఉంది.
- ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
2. శార్దూలం:
పై గణవిభజనను పరిశీలించండి. ఇలా మ-స-జ-స-త-త-గ అనే గణాలు వరుసగా ప్రతి పాదంలోనూ వస్తే అది ‘శార్దూల’ పద్యం అవుతుంది. అన్ని వృత్త పద్యాలలాగా దీనికి ప్రాసనియమం ఉంటుంది. ‘యతి’ 13వ అక్షరానికి చెల్లుతుంది (ఆ-య).
మిగిలిన పాదాలకు గణ విభజన చేసి లక్షణాలను సరిచూడండి.
1) దీనిలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘పే’ లోని ఏ కారానికి 13వ అక్షరమైన ‘కే’ లోని ఏ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘సో’ లోని ఓ కారానికి, 13వ అక్షరమైన ‘చు’ లోని ఉ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘మో’లోని మకారానికి, 13 వ అక్షరమైన ‘ము’ లోని మ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.
ఈ) అలంకారాలు :
I. ఇంతకుముందు తరగతులలో ‘ఉపమాలంకారం’ గురించి తెలుసుకున్నారు కదా ! ఈ పాఠంలోని ఉపమాలంకారానికి సంబంధించిన ఉదాహరణను రాసి, వివరించండి.
ఉపమాలంకార లక్షణం :
ఉపమానానికి, ఉపమేయానికి మనోహరమైన పోలిక వర్ణించినట్లైతే దాన్ని ఉపమాలంకారం అంటారు.
ఉదాహరణ :
పగ అంటూ ఏర్పడితే పామున్న ఇంట్లో కాపురమున్నట్లే.
సమన్వయం :
‘పగ’ ఉపమేయం. పామున్న ఇల్లు ఉపమానం ఉండటం సమాన ధర్మం. ఉపమావాచకం లోపించడం.
II. గతంలో తెలుసుకున్న ‘వృత్త్యనుప్రాస’ను గూర్చి ఆ అలంకార లక్షణం రాసి, ఉదాహరణలు రాయండి.
వృత్త్యనుప్రాసాలంకారం లక్షణము : ఒక పద్యంలో గాని, వాక్యంలో గాని ఒకే అక్షరం పలుమార్లు వచ్చేలా ప్రయోగించడాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ -1:
1) లక్ష భక్ష్యములు భక్షించు ఒక పక్షి కుక్షికి ఒక భక్ష్యము లక్ష్యమా?
పై వాక్యంలో ‘క్ష’ కారము ‘క్ష్య’ వర్ణము పలుమార్లు ప్రయోగించబడి ఒక అద్భుతమైన సౌందర్యము తీసుకురాబడినది కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.
ఉదాహరణ – 2:
2) కాకి కోకిల కాదు కదా !
పై వాక్యంలో ‘క’ కారం పలుమార్లు ప్రయోగించబడి, వినసొంపుగా ఉంది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.
ఉదాహరణ – 3:
3) లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది.
పై వాక్యంలో ద్విత్వచకారం పలుమార్లు అందంగా ప్రయోగింపబడినది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.
9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష కవిపరిచయం
మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు (ముగ్గురు కవులు) రచించారు. వారిలో తిక్కన రెండోవారు. వీరు 13వ శతాబ్దానికి చెందిన మహాకవి. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉన్నారు. తిక్కన మొట్టమొదట ‘నిర్వచనోత్తర రామాయణము’ను రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చారు. తిక్కన రెండో గ్రంథం ‘మహాభారతం’. విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించి హరిహరనాథునికి అంకితం ఇచ్చారు.
మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. వీరి శైలిలో ‘నాటకీయత’ ఉంటుంది. సందర్భానుగుణంగా వీరు ప్రయోగించిన పదాలు సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి. ఆ ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలడాన్ని ‘రసాభ్యుచిత బంధం’ అంటారు. ఇందులో తిక్కన సిద్ధహస్తుడు. సంస్కృతాంధ్రాలలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి కాబట్టి ‘ఉభయకవి మిత్రుడు’ అనీ, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు ‘కవి బ్రహ్మ’ అనీ బిరుదులు పొందారు.
పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు
1వ పద్యం :
తే॥ సమయమిది మిత్రకార్యంబు చక్కఁజేయ
నీకతంబున నే మవినీతుఁడైన
యా సుయోధను తోడి పోరాట దక్కి
యనుభవింతుము మా యంశమగు ధరిత్రి.
ప్రతిపదార్థం :
మిత్రకార్యంబున్ = స్నేహితుల పనిని
చక్కన్ + చేయన్ = చక్కబెట్టడానికి
సమయము + ఇది = తగిన కాలమిది
నీ కతంబునన్ = నీ మూలంగా
ఏము = మేము
అవినీతుడు + ఐన = అయోగ్యుడైన
ఆ సుయోధను = ఆ దుర్యోధనునితో
తోడి పోరాట = యుద్ధం
తక్కి = మాని
మా + అంశము + అగు ధరిత్రిన్ = మా వంతు రాజ్యాన్ని
అనుభవింతుము = మేము అనుభవిస్తాము.
భావం :
కృష్ణా ! మిత్రులమైన మా పనిని చక్కబెట్టడానికి నీకు ఇదే తగిన కాలం. నువ్వే రాయబారానికి వెళితే, అయోగ్యు డయిన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన పని లేదు. మా వంతు రాజ్యం మాకు వస్తుంది.
2వ పద్యం :
కం॥ ఇచ్చటి బంధులు నీవును
నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా
కిచ్చినను జాలునంటిని
బొచ్చెముగా దింతపట్టు పూర్ణము సుమ్మీ !
ప్రతిపదార్ధం :
ఇచ్చటి = ఇక్కడ ఉన్న
బంధులు = చుట్టాలు
నీవును = నీవు కూడ
అచ్చెరువడి = ఆశ్చర్యంతో
వినుచున్ + ఉండన్ = వింటూ ఉండగా
మాకున్ = అన్నదమ్ములమైన మాకు
అయిదు + ఊళ్ళును = ఐదు గ్రామాలను
ఇచ్చినను = ఇచ్చినప్పటికీ
చాలున్ + అంటిని = సరిపోతాయని అన్నాను
పొచ్చెము + కాదు = తక్కువ కాదు
ఇంతవట్టు = నే పల్కిన ఈ మాట
పూర్ణము సుమ్మీ ! = సంపూర్ణమైనది (నిజమైనది) సుమా !
భావం :
ఓ కృష్ణా ! ఇక్కడున్న చుట్టాలూ, నీవూ ఆశ్చర్యంతో వింటూండగా, ‘సక్రమంగా మాకు అర్ధరాజ్యం ఇవ్వడానికి మా తండ్రికి మనసొప్పకపోతే మేముండటానికి ‘ఐదూళ్ళిచ్చినా చాలు’ అని సంజయుడితో నేనింతవరకూ చెప్పిన మాటలలో దాపరికం లేదు. అంతా నిజమే సుమా!
విశేషం :
పాండవులు కోరిన ఐదూళ్ళ పేర్లను సంస్కృత మహాభారత కర్త వ్యాసుడు ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం అని పేర్కొన్నాడు. కానీ తెలుగు మహాభారత కర్తలలో ఒకడైన తిక్కన అవస్థలం, వృక (కుశ) స్థలంగాను, మాకంది (వాసంతి), వారణావతంతో మరొక ఊరేదైనా పేర్కొన్నాడు. బహుశా తిక్కన కాలానికి ఆయా నగరాల పేర్లు మారి ఉండవచ్చు లేక ఇంకేదైనా కారణం ఉండవచ్చు.
3వ పద్యం : కంఠస్థ పద్యంలో
శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రమును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, పిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీపొందివన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రమును = అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా)
చేయన్ + చాలండో = ఇస్తాడో, ఇవ్వడో
కాని = కాని
పెంపు + ఏదన్ = గౌరవం చెడేటట్లు
క్రూరతకున్ + ఓర్వన్ రాదు = క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను
సిరి = రాజ్యసంపద
నాకున్ + ఏల + అందునేన్ = నాకెందుకని విడిస్తే
నా + అరయు = నేను చూసే
ఈ చుట్టాలకున్ = ఈ బంధువులకు
గ్రాసవాసః + దైన్యంబులు= తిండికీ, బట్టకూ కరవు
వచ్చున్ = ఏర్పడుతుంది
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = దుర్యోధనాదులు
భావం :
ఆ సుయోధనుడు అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా) ఇస్తాడో ? ఇవ్వడో ? కాని గౌరవం చెడేటట్లు క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను. రాజ్యసంపద నాకెందుకని విడిస్తే నేను చూసే ఈ బంధువులకు తిండికీ, బట్టకూ కరవు ఏర్పడుతుంది. కాబట్టి దుర్యోధనాదులు, మేము కలిసి సంపదలను పొందితే సంతోషం కలుగుతుంది.
విశేషం :
తన కుమారుల, బంధువుల పోషణ, రక్షణ ధృతరాష్ట్రునికి ఎంతముఖ్యమో తన తమ్ముల, ఆశ్రయించిన వారి పోషణ, రక్షణ తనకు ముఖ్యం అని ధర్మరాజు గడుసుగా సమాధానమిచ్చాడు. ఈ పద్యంలో చక్కని మనోవిశ్లేషణ చేయబడింది.
4వ పద్యం : -కంగస్థ పద్యం
ఉ॥ అక్కట ! లాతులైనఁ బగజైనను జంపన కోరనేల ? యొం
డొక్క తెలుగు లేదె ? యది యొప్పదె ? బంధు సుహృజ్జనంబు లా
దిక్కున మన్నవారు, గణుతింపక సంపదకై వధించి దూ
ఱెక్కుట దోషమందుటను నీ దురవస్థల కోర్వవచ్చునే ?
ప్రతిపదార్థం :
అక్కట ! = అయ్యో !
లాంతులు + జనన్ = పరాయివారైనా
పగఱు + ఐనన్ = విరోధులైనా
చంపన్ + అ + కోరన్ + ఏల = చంపాలనే ఎందుకు కోరాలి?
ఒండు + ఒక్క + తెఱంగులేదే ? = మరొక మార్గం లేదా?
అది + ఒప్పదా? = ఆ మార్గం సరైంది కాదా ?
ఆ దిక్కునన్ = ఆ కౌరవులలో
బంధుసుహృద్ + జనంబులు = చుట్టాలు, మిత్రులు
ఉన్నారు = ఉన్నారు
గణుతింపక = ఆ వైపున ఉన్న మా బంధువులను లెక్కించక
సంపదకై = రాజ్య సంపద కోసం
వధించి = చంపి
దూఱు + ఎక్కుట = నిందల పాలవటం
దోషము + అందుట = పాపం పొందటం
అను = అనే
దుర్ + అవస్థలకున్ = చెడు స్థితిని
ఓర్వన్ + వచ్చునే – సహింపదగునా?
భావం :
అయ్యో ! పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి ? మరొక మార్గం లేదా ? ఆ మార్గం సరైంది కాదా ? ఆ కౌరవులలో చుట్టాలు, మిత్రులు ఉన్నారు. ఆ వైపున ఉన్న బంధువులను లెక్కించక రాజ్యసంపద కోసం చంపి, నిందల పాలవటం, పాపం పొందడమనే చెడు స్థితిని సహింపదగునా ? (కూడదని భావం).
5వ పద్యం :
ఆ||వె|| పగయ కలిగినేనిఁ బామున్న యింటిలో
నున్న యట్ల కాక యూజడిల్లి
యుండునెట్లు చిత్త మొకమాటుగావున
వలవ దధిక దీర్ఘ వైరవృత్తి
ప్రతిపదార్థం :
పగ + అ + కలిగెనేనిన్ = శత్రుత్వమే ఏర్పడితే
పాము + ఉన్న + ఇంటిలోన్ = సర్పమున్న ఇంటిలో
ఉన్న + అట్ల + కాక – ఉన్నట్లే గాని
ఒక మాటున్ = ఒకసారి అయినా
చిత్తము = హృదయం
ఊఱడిల్లి = ఊరట పొంది
ఎట్లు + ఉండున్ = ఎట్లా ఉండగలదు?
కావునన్ = కాబట్టి
అధిక దీర్ఘ వైర వృత్తి = చిరకాల విరోధంతో మెలగటం
వలవదు. = కూడదు
భావం :
శత్రుత్వము ఏర్పడితే, పాము ఉన్న ఇంటిలో ఉన్నట్లే గాని, ఒకసారైనా హృదయం ఊరట పొందదు. కాబట్టి చిరకాలం విరోధంతో ఉండకూడదు.
6వ పద్యం : కంఠస్థ పద్యం
చం|| పగయడఁగించు టెంతయు శుభం, బది లెస్స, యడంగునే సగం
బగ ? పగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే ? కడుం
చెగ మొదలెత్తి పోవఁ బగ దీర్పగ వచ్చినఁ శౌర్యమొందు, నే
మిగతిఁ దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు దేశవా!
ప్రతిపదార్థం :
కేశవా = శ్రీ కృష్ణా !
పగ + అడంగించుట = శత్రుత్వాన్ని అణచి వేయడం
ఎంతయున్ శుభంబు = ఎంతో మేలు
అది లెస్స = అదే మంచిది
పగన్ = పగతో
పగ + అడంగునే = పగ సమసిపోదు
పగ + గొన్నన్ = (ఒకరి) పగవలన (మరొకరు) బాధపడితే
మార్కొనక = అతడిని ఎదిరించక
పల్కక + ఉండగన్ = ఊరక ఉండడం
వచ్చునే = సాధ్యమా?
కడున్ + తెగన్ = గొప్ప సాహసంతో
మొదలు + ఎత్తిపోవన్ = తుదముట్టే విధంగా
పగన్ + తీర్పగన్ = విరోధాన్ని రూపుమాపడానికి
వచ్చినన్ = సిద్ధపడితే
క్రౌర్యము + ఒందున్ = దారుణమైన పనులు చేయాల్సివస్తుంది
ఏమిగతి + తలంచినన్ = ఏ విధంగా ఆలోచించినా
పగకున్ = విరోధం వలన
మేలిమిలేమి = మంచి జరగదు
ధ్రువంబు = ఇది నిజం
భావం :
శ్రీ కృష్ణా ! శత్రుత్వాన్ని అణచివేయడం ఎంతో మేలు. అదే మంచిది. పగతో పగ సమసిపోదు. ఒకరి పగ వలన మరొకరు బాధపడితే అతడిని ఎదిరించక ఊరకుండటం సాధ్యమా ? గొప్ప సాహసంతో తుదముట్టే విధంగా విరోధాన్ని రూపుమాపడానికి సిద్ధపడితే దారుణమైన పనులు చేయాల్సి వస్తుంది. ఏ విధంగా ఆలోచించినా విరోధం వలన మంచి జరగదు. ఇది నిజం.
7వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ॥ కావున శాంతిఁ బొందుటయ కర్ణము, దా నది యట్టులుండె, శ్రీ
గావలెనంచు, బోరితము గామియుఁ గోరెద, మెల్ల సొమ్ములుం
బోవుటయుం గులక్షయము పుట్టుటయున్ వెలిగాఁగ నొండుమై
వేవిధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁజుమీ జనార్థవా !
ప్రతిపదార్థం :
కావునన్ = కాబట్టి
శాంతిన్ = శాంతిని
పొందుట + అ = పొందుటే
కర్ణము = చేయాల్సిన పని
తాన్ + అది = ఆ విషయం
అట్టులు + ఉండెన్ = అలా ఉండనీ
శ్రీ = సంపద
కావలెన్ + అంచున్ = కావాలని
పోరితము = యుద్ధం
కామియున్ = వద్దని
కోరెదము = కోరుతున్నాం
ఎల్ల = అన్ని
సొమ్ములున్ = సంపదలు
పోవుటయున్ = నశించడం
కులక్షయము = వంశనాశనం
వుట్టుటయున్ = కలగడం
వెలికాగన్ = జరగకుండ
ఒండుమైన్ = వేరొకవిధంగా
ఏ విధిన్ + ఐనన్ = ఎలాగోలా
చక్కన్ + పడుట = బాగుపడుట
ఎంతయున్ = మిక్కిలి
ఒప్పున్ + చుమీ = తగినది గదా !
భావం :
కాబట్టి శాంతిని పొందుటీ చేయాల్సిన పని. ఆ విషయం అలా ఉండనీ. సంపద కావాలని, యుద్ధం వద్దని కోరుతున్నాం. అన్ని సంపదలు నశించడం, వంశ నాశనం కలగడం జరగకుండా వేరొక విధంగా ఎలాగోలా బాగుపడుట మిక్కిలి తగినది గదా!
8వ పద్యం : కంఠస్థ పద్యంగా
చం॥ మనమువఁ బక్షపాతగతి మాడెన మామము ధర్మనీతి వ
రవముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ
ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రామచితంబు తోడి మె
ల్పునఁ బరుసందనంబువను భూపతులెల్ల వెఱుంగ వాడుమీ !
ప్రతిపదార్థం :
మనమునన్ = నీ మనస్సులో
మాదెసన్ = మాపై
పక్షపాతగతిన్ = అభిమానం చూపడం
మానుము = విడిచిపెట్టు
ధర్మనీతివర్తనములన్ = ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో
రెండు దిక్కులన్ = ఇరువురికి
హితంబును = మేలును
పెంపును = అభివృద్ధియు
కల్గునట్టి = కలిగే
చొప్పునన్ = విధంగా
విదుర + ఆది = విదురుడు మొదలయిన
సజ్జనుల = మంచివారి
బుద్ధికిన్ + రాన్ = మనస్సులకు అంగీకారమయ్యేలా
ఉచితంబు తోడి = అనువుగా
మెల్పునన్ = మెత్తగా
పరుసందనంబునన్ = పరుషంగా
భూపతులు = రాజులు
ఎల్లన్ = అందరూ
ఎఱుంగన్ = తెలుసుకొనేలా
ఆడుము = మాట్లాడు
భావం :
నీ మనస్సులో మాపై అభిమానం చూపడం విడిచి పెట్టు, ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో ఇరువురికీ మేలు, అభివృద్ధి కలిగే విధంగా, విదురుడు మొదలైన మంచివారి మనస్సులకు అంగీకారమయ్యేలా అనువుగా, మెత్తగా, పరుషంగా రాజులందరూ తెలుసుకునేలా మాట్లాడు.
9వ పద్యం :
మ॥ సుతువాఁడై వినయంబు పేకొనక యే చొప్పుం దగం జెప్ప కా
ధృతరాష్ట్రుం డవినీతిఁ జేసినను సంధింపంగ రాదంచు వే
గ తెగంబాలకు చెంపు సేయునెడ లోకం బెల్ల మెచ్చం బ్రకా
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగాఁ జేయుమీ !
ప్రతిపదార్థం :
ఆ ధృతరాష్ట్రుండు = ఆ ధృతరాష్ట్ర మహారాజు
సుతువాడు + ఐ = కొడుకు మాటే వినేవాడై
వినయంబు = విధేయతను
చేకొనక = చూపక
ఏ చొప్పుం = ఏ మార్గాన్ని
తగన్ + చెప్పక = తేల్చి చెప్పక
అవినీతిన్ చేసినను = అవినీతితో ఉన్నట్లయితే
సంధింపగన్ = సంధి చేయటం
రాదు + అంచున్ = కుదరదని
వేగ = వెంటనే
తెగన్ + పాలుకు = సాహసించకు
తెంపు + చేయు + ఎడన్ = సాహసించాల్సి వస్తే
లోకంబు + ఎల్లన్ = లోకమంతా
మెచ్చన్ = మెచ్చుకునేలా
ప్రకాశిత ధర్మస్థితిన్ = ధర్మానికి నిలచి
మా మనమున్ = మా మనస్సుల్ని
నిశ్చింతంబుగాన్ = విచారం లేనట్టివిగా
చేయుమీ = చేయాల్సింది
భావం :
ధృతరాష్ట్ర మహారాజు కొడుకుమాటే వినేవాడై | విధేయతను చూపక, ఏ మార్గాన్ని తేల్చి చెప్పక, అవినీతితో – ఉన్నట్లయితే సంధిచేయటం కుదరదని వెంటనే సాహసించి వచ్చేయకు. సాహసించాల్సి వస్తే ధర్మానికి నిలచి లోకమంతా మెచ్చుకునేలా, మా మనస్సుల్ని విచార రహితంగా చేయి.
10వ పద్యం :
కం॥ మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు
నెమ్మి యెటుఁగు దగ్గ సిద్ది నెట్ యెటుఁగుదు నా
క్యమ్ముల పద్ధతి వెఱుఁగుదు
పొమ్మోవ్వఁడ నేను నీకు బుద్ధులు సెప్పవ్.
ప్రతిపదార్థం :
మమ్మున్ + ఎఱుఁగుదు = మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడవు
ఎదిరిన్ = కౌరవులను గూర్చి
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నెమ్మిన్ + ఎఱుఁగుదు : కూర్మి అంటే ఎలాంటిదో తెలిసినవాడవు
అర్ధ సిద్ధి నెటి + ఎఱుగుదు = కార్యసాధన పద్ధతి తెలిసినవాడవు
వాక్యమ్ముల పద్ధతిన్ = మాటలాడే విధం
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నీకున్ = నీకు
బుద్ధులు + చెప్పన్ = ఉపాయాలు చెప్పడానికి
నేను + ఎవ్వడన్ = నేనేమాత్రం వాడిని
పొమ్ము = హస్తినాపురానికి వెళ్ళిరా !
భావం:
మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడివి, కౌరవులను గూర్చి తెలుసు. కూర్మి అంటే ఏమిటో తెలుసు. కార్యసాధన పద్ధతి కూడా తెలుసు. మాటలాడే విధం తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాడిని ? హస్తినాపురానికి వెళ్ళిరా !