SCERT AP State 7th Class Telugu Textbook Solutions 12th Lesson అసామాన్యులు Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu Solutions 12th Lesson అసామాన్యులు
7th Class Telugu 12th Lesson అసామాన్యులు Textbook Questions and Answers
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
“ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు” దీన్ని వివరించండి.
జవాబు:
ఆహారం లేకపోతే ఎవరూ బతకరు. ఆహారం గురించి మనకు ఆదివాసులే తెలిపారు. ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా, కొండకోనలే తోడునీడగా జీవిస్తారు. వారు రాత్రింబగళ్ళు ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏమి తినాలో, ఏమి తినగూడదో, మనకు ఆదివాసులే చెప్పారు. ఇందుకోసం వారు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలలో కొందరు ఆదివాసులు ప్రాణాలు కూడా వదిలారు. జంతువుల మాంసం తినేముందు, వారు ఆ జంతువులనూ, వాటి ఆహారం అలవాట్లనూ, పరిశీలించారు. తర్వాతనే ఫలానా జంతువు. మాంసం తినవచ్చునని వారు తేల్చి చెప్పారు.
కోయలు, గోండులు, చెంచులు వంటి గిరిజనులకు ఉన్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వారికి తెలిసినంతగా, ఇతరులకు తెలియదు. ఆదివాసులు కూడా, శాస్త్రజ్ఞులే, వారికి రోగాలు వస్తే, చెట్ల మందులతోనే వారు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారు. అందువల్ల ఆదివాసులే గురువులై మనకు మార్గదర్శకులయ్యారు.
ప్రశ్న 2.
కుమ్మరివారి గొప్పతనాన్ని గురించి వివరించండి.
జవాబు:
కుమ్మరి వాని చక్రం నుంచి, బంకమట్టి నుంచి, మనం నిత్యం ఉపయోగించే కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, ప్రమిదలు వస్తున్నాయి. మెత్తటి మట్టి, బూడిద లేదా రంపం పొట్టు, సన్న ఇసుకను కలిపి, బంకమట్టిని తయారుచేస్తారు. వారు కాళ్ళతో తొక్కి, చెమటోడ్చి సిద్ధం చేసిన బంకమట్టిని కుమ్మరిసారెపై పెడతారు.
కుమ్మరి చక్రం తిప్పుతూ, చక్రం మీద పెట్టిన బంకమట్టిని తన చేతివేళ్ళ కొనలతో నేర్పుగా నొక్కుతాడు. ఆశ్చర్యంగా అనుకున్న రూపాలు వస్తాయి. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత ‘కుమ్మర ఆము’లో పెట్టి, బురదమట్టితో కప్పుతారు. కొలిమిని మండిస్తారు. వేడి అన్ని పాత్రలకూ సమానంగా అందుతుంది. మట్టి పాత్రలన్నీ కాలి, గట్టిగా తయారవుతాయి. వేసవికాలంలో వీరి కూజాలకు, కుండలకు మహాగిరాకీ. వీరు చేసే ప్రమిదలు భక్తి జీవితంలో ప్రధాన భాగం.
ప్రశ్న 3.
“వడ్రంగివారు నేటి ఆధునిక ఇంజనీర్లు” – దీన్ని సమర్థిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:
వడ్రంగుల పనిలో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం ఉంది. మనకు వ్యవసాయానికి కావః పిన నాగలి, గుంటక, గొర్రు వంటి పనిముట్లను అన్నింటినీ వడ్రంగులే తయారుచేస్తారు. ఆ పనిముట్ల ఈ రీకి ఏ చెట్టు కలప సరిపోతుందో వారు పరిశీలిస్తారు. చెట్టును చూస్తే సరిపోదు.
చెట్టును కొట్టి, దాన్ని కోసి, చిత్రిక పట్టాలి. తొలి కొట్టాలి. అందులో బిగించాలి. ఇలా వడ్రంగులు ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం చూపించాలి.
వ్యవసాయానికీ, ప్రయాణానికీ ఉపయోగించే బండి సౌకర్యాన్ని వడ్రంగులు సమాజానికి అందించారు. ఇంటి తలుపులు, వాసాలు, కిటికీలు, ఇళ్ళు, వడ్రంగుల పనితనం వల్లే, అందంగా తయారవుతున్నాయి. మనం వాడుకొనే మంచాలు, కుర్చీలు, బెంచీలు, టేబుళ్ళు అలమారలు సైతం వడ్రంగుల చేతుల్లోనే తయారవుతున్నాయి. వడ్రంగులు
“దారు శిల్పులు”. వారు నేటి కాలం “ఇంజినీర్లు”.
ప్రశ్న 4.
“రైతులు మన అన్నదాతలు” – వివరించండి.
జవాబు:
రైతులు మనకు అన్నదాతలు. రైతు దేశానికి వెన్నెముక. అతనికి కోపం వస్తే, మనకు అన్నం దొరకదు. రైతు నడుంవంచి కష్టించి పాడిపంటలు పెంచుతున్నాడు. తాను పస్తులు ఉండి, మన కడుపులు చల్లగా ఉండేటట్లు మనకు రైతు తిండి పెడుతున్నాడు. రైతు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తాడు. తాను ఎండకు ఎండినా, వానకు ‘ తడిసినా, చలికి వణకినా ధైర్యంతో కష్టపడి, రైతు పంటలు పండించి మన పొట్టలు నింపుతున్నాడు.
మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు అనేవి, రైతులు చెమటోడ్చి పనిచేసిన కృషికి ఫలాలు. రైతు రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని, శ్రమిస్తేనే మనం హాయిగా తింటున్నాము. అందుకే లాల్ బహదూర్ శాస్త్రిగారు “జై జవాన్, జై కిసాన్” – అన్నారు.
కాబట్టి రైతులు మనకు అన్నదాతలు. రైతుల త్యాగం, కృషి అపూర్వమైనవి.
ప్రశ్న 5.
“దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవారు అంత అవసరం” – దీన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
(లేదా)
“సమాజ నిర్మాణానికి అన్ని వృత్తుల వాళ్లూ అవసరమే” దీన్ని సమర్థిస్తూ రాయండి.
అన్ని వృత్తుల వారు పరస్పరం సహకరించుకుంటేనే సమాజ గమనం సాగుతుందని అసామాన్యులు పాఠంలో. చదివారు కదా ! మన సమాజంలోని వృత్తులను, వాటి ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
కులవృత్తుల – ప్రాముఖ్యం
మన శరీరంలో కళ్లు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు వంటి అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు అన్నీ. సరిగా పనిచేస్తేనే మన శరీరం పనిచేస్తుంది. శరీరానికి ఈ అవయవాలు అన్నీ ముఖ్యమే. సంఘంలో అనేక వృత్తులవారు ఉన్నారు. కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, మంగలి, చర్మకారుడు, సాలె, కురుమలు, రజకుడు వంటి ఎందరో వృత్తి పనివారలు ఉన్నారు.
ప్రతి వృత్తి పవిత్రమైనదే. ఏ వృత్తినీ మనం చిన్న చూపు చూడరాదు. మన ఇంట్లో శుభకార్యం జరగాలంటే, మంగళ వాద్యాలు వాయించేవారు కావాలి. కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు అన్నీ కావాలి. అంటే అన్ని వృత్తులవారు సహకరిస్తేనే ఏ పనులయినా జరుగుతాయి. ఒకరికొకరు తోడ్పడితేనే, సమాజం నడుస్తుంది.
రైతులు పొలం దున్నాలంటే నాగలి కావాలి. దాన్ని వడ్రంగి చెక్కాలి. కమ్మరి దానికి గొర్రు తయారుచేయాలి. రైతుకు. చర్మకారులు చెప్పులు కుట్టాలి. సాలెలు బట్టలు వేయాలి. కంసాలి, వారికి నగలు చేయాలి. కుమ్మరి కుండలు చేయాలి. ఇలా అన్ని వృత్తులవారూ సహకారం అందిస్తేనే, సమాజం సక్రమంగా నడుస్తుంది.
ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను, అన్ని వృత్తులవారు కలిసి మెలిసి తయారుచేసుకొనేవారు. వారు తమ కులాలను మరిచిపోయి, అక్క బావ, మామ, అత్త, అన్న అని పిలుచుకొనేవారు. .. తిరిగి గ్రామాల్లో అటువంటి తియ్యని జీవితం రావాలి. శరీరం నడవడానికి అవయవాలు అన్నీ ఎంత ముఖ్యమో మనిషి జీవనానికి అన్ని వృత్తులవారి శ్రమ కూడా అంత ముఖ్యం అని గుర్తించాలి.
ప్రశ్న 6.
‘ఒకరిమీద ఒకరు ఆధారపడడం’. అనేది మన సంస్కృతిలో చాలా గొప్పది. ఎందుకు? దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
నిత్య జీవితంలో మనిషి ప్రక్కమనిషి మీద ఆధారపడి బతకక తప్పదు. పరస్పరం ఒకరిపై ఒకరు. ఆధారపడటం అనేది మన సంస్కృతిలో గొప్ప విషయం.
ఈ మన ఇంట్లో పెళ్ళి అయితే మంగళవాద్యాలు కావాలి. కుండలు, ప్రమిదలు కావాలి. నగలు కావాలి. వంటల వారు కావాలి. పెండ్లి చేయించేవారు కావాలి. బట్టలు కావాలి. లైటింగ్ ఏర్పాట్లు కావాలి. అలంకరణ చేసేవారు కావాలి. ఈ పనులన్నీ చేసేవారు ఉంటే తప్ప, మన వద్ద డబ్బు ఉన్నా పెళ్ళి జరుగదు. దీనిని బట్టి మనం సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నాం అని గ్రహించాలి.
రైతు పంటలు పండించాలి. ఆ పంటలను బజార్లకు తీసుకురావాలి. వాటిని వర్తకులు అమ్మాలి. అప్పుడే మనం వాటిని కొని, అనుభవించగలం. రోగం వస్తే వైద్యులు కావాలి, ఇళ్ళు కట్టడానికి, తాపీ పనివారు, వడ్రంగులు, ఇనుప పనివారు, విద్యుచ్ఛక్తి పనివారు, కుళాయిలు అమర్చేవారు కావాలి. ఇండ్లలో పనిచేసే పనివారు కావాలి.
దీనిని బట్టి మనం ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్నాం అనీ, పరస్పరం ఆధారపడటం మన సంస్కృతిలో గొప్ప విషయం అని గ్రహిస్తాము.
కఠిన పదములకు అర్థములు
అసామాన్యమైన = సాటిలేనిదైన
ప్రతిభ = తెలివి
క్షణాలలో = నిమిషాలలో
సారించామా? = ప్రసరింపజేశామా?
కృషి = పరిశ్రమ; ప్రయత్నము
త్యాగాన్ని = దానాన్ని
జీవమ్ములు = ప్రాణులు
జీవకోటి = ప్రాణికోటి
ఆదివాసులు = మొదట నివసించిన వారు
కొండకోనలు = కొండలు, అరణ్యాలు
రేయింబవళ్ళు = రాత్రింబవళ్ళు
ఆహారపుటలవాటు = ఆహారం, అలవాట్లు
అతిశయోక్తి = ఎక్కువగా చెప్పినమాట
జానపదులు = గ్రామీణులు
ప్రాచుర్యం = విస్తారం
సజావుగా = సరియైనరీతిలో
మురిసిపోతాం = ఆనందిస్తాము
గిరాకీ = అలభ్యత (దొరకకపోవడం)
అటికెలు = చిన్నకుండలు
గురుగులు = చిన్న పిడతలు
చకచకా = వేగంగా
సమాజగతిని = సంఘపు నడకను
ఆము = కుమ్మరి కుండలు కాల్చే నిప్పుల గుంట
తతంగము = కార్యక్రమము
కొలిమి = కమ్మరి ఇనుప పనిముట్లు కాల్చే నిప్పుల గుంట
కమ్మలు = చెవుల ఆభరణాలు (దుద్దులు)
ఆపాదమస్తకం = పాదాలనుండి తలవఱకు
సొమ్ములు = నగలు
మూస = బంగారం మున్నగువాటిని కరిగించే పాత్ర
అనారోగ్యము = ఆరోగ్యం చెడిపోవడం
నైపుణ్యం = నేర్పు
పొదగడం = అతకడం
గడ్డపార = గునపము
సెగ = వేడి
కీలకము = ముఖ్యము
గుంటక = విత్తనాలు చల్లడానికి నేలను చదును చేసే సాధనము
కొయ్య = కఱ్ఱ
దారు శిల్పులు = కఱ్ఱపై చెక్కే శిల్పులు
ఆవేదన = పెద్దనొప్పి
ఒడుపుగా = వీలుగా
ఔదార్యాన్ని = దాతృత్వాన్ని
కలిమిన్ కబళించి = సంపదను మ్రింగి
భరతావని = భారతభూమి
వక్కాణించారు = చెప్పారు
ముప్పు ఘటించి పద్యమునకు భావము
భావం :
చెప్పులు కుట్టి జీవించే వారి కులానికి కీడు చేసి, వారి సంపదను దోచుకొని, వారి శరీరాన్ని పిప్పి చేసిన భారతవీరుల యొక్క పాదాలు కందిపోకుండా వారికి చెప్పులు కుట్టి, చెప్పులుకుట్టేవారు జీవనాన్ని సాగిస్తారు. కాదని చెప్పరు. భరతభూమి చెప్పులు కుట్టేవారి సేవకు ఋణ పడింది.
కాటికి = శ్మశానమునకు
బొక్కెనలు = చేదలు
క్షురకులు = మంగలులు
భాగస్వామ్యం = వాటా
అవగాహన = తెలిసికోవడం
గాట్లుపడటం = పుండ్లు పడడం
చిట్కాలు = సూక్ష్మరహస్యాలు
శరీరమర్ధనం = శరీరాన్ని పిసకడం; (మాలిష్ చేయడం)
ఆషామాషీ = అశ్రద్ధ
సుదీర్ఘము = మిక్కిలి పొడవైనది
శుభాశుభకార్యక్రమాలు = మంచి చెడుపనులు
ప్రమేయం = సంబంధము
ఆవిష్కరణలు = కొత్త వస్తువులను కనుక్కోడాలు
తల్లడిల్లుతాం = ఆవేదన చెందుతాము
నినాదము = కేక
పస్తులుండి (పస్తులు + ఉండి) = తిండితినకుండా ఉండి
సడలని స్టైర్యం = జారని (తొలగని) ఓర్పు (నిలుకడ)
పునీతుడు = పవిత్రుడు
పరస్పరం = ఒకరికొకరు
సహకరించుకుంటే = సాయం చేసుకుంటే
స్వయం సమృద్ధంగా = తనంతట తాను నిండుగా
చేదోడు వాదోడుగా = పనిలో మాటలో సాయముగా
ఆత్మీయ సంబంధం = తనవారనే సంబంధము
శ్రమైక జీవన సౌందర్యము = శ్రమించడమే ముఖ్యమైన
అందం పాటించడం = ఆచరించడం