SCERT AP Board 7th Class Telugu Guide Answers 10th Lesson ప్రియ మిత్రునికి Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu 10th Lesson Questions and Answers ప్రియ మిత్రునికి
7th Class Telugu 10th Lesson ప్రియ మిత్రునికి Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రం ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
జవాబు:
పోస్టుబాక్సులోంచి పోస్టుమేన్ ఉత్తరాలు తీస్తున్నాడు. అంటే లేఖలు చాలా వచ్చాయని తెలుస్తోంది. సెల్ ఫోనులో మాటల ద్వారా ఇతరులకు సమాచారం అందించవచ్చు. అలాగే వాట్సాప్, జిమెయిల్, ఎస్.ఎమ్.ఎస్లు, ట్విట్టర్, ఫేస్ బుక్ – ఇవన్నీ సమాచారం పంపే సాధనాలని తెలుస్తోంది.
ప్రశ్న 2.
లేఖల బదులుగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాధనాలు ఏవి?
జవాబు:
ఫోన్ :
ఫోన్ ద్వారా ఇతరులకు సమాచారం చెబుతాం.
వాట్సాప్ :
వాట్సాప్ ద్వారా కొన్ని బృందాలకు కాని, వ్యక్తిగతంగా కాని సమాచారం పంపుతాం.
జిమెయిల్ :
దీని ద్వారా ఒక వ్యక్తికి, లేదా కంపెనీకి సమాచారం పంపుతాం. ఎస్.ఎమ్.ఎస్ : ఇది కూడా జి.మెయిల్ లాగే ఉపయోగిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్లు కూడా సమాచారం పంపడానికి ఉపయోగపడతాయి.
ప్రశ్న 3.
మీ మిత్రులకు, బంధువులకు ఏఏ సందర్భాల్లో లేఖలు రాస్తారు?
జవాబు:
ఆనందం కానీ, బాధ కానీ కలిగినపుడు బంధువులకు లేఖలు వ్రాస్తాం. ఇంట్లో పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు మొదలైనవి చేసుకొనేటపుడు బంధువులకు, మిత్రులకు శుభలేఖలు పంపుతాం. ఏదైనా పిక్ నిక్ లేదా తీర్థయాత్రలకు, పెళ్లిళ్లు మొదలైన వాటికి వెళ్లి వచ్చినపుడు, మిత్రులకు, మామయ్యకు ఉత్తరాలు వ్రాస్తాను. మాకు నచ్చిన, నచ్చని విషయాలు వారితో పంచుకొంటాం.
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
అవగాహన-ప్రతిస్పందన
ప్రశ్న 1.
డబ్బు ముఖ్యమా? ఆనందం ముఖ్యమా? మీ అభిప్రాయం చెప్పండి (వ్రాయండి).
జవాబు:
రెండూ ముఖ్యమే. డబ్బు లేకపోతే తిండి, గుడ్డ, గూడు ఏవీ దొరకవు. మనం బ్రతకడమే జరగదు. అందుచేత డబ్బు ముఖ్యమే. కానీ, అవసరాన్ని మించిన డబ్బు అక్కర్లేదు. మనం జీవించడానికి సరిపడా డబ్బు ఉండాలి. అప్పుడింక డబ్బు సంపాదనకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. అప్పుడు ఆనందమే గొప్పది. ఆనందంగా జీవించాలంటే అందరితో కలిసి మెలిసి ఉండాలి. ఆనందంగా జీవిస్తూనే డబ్బు సంపాదించాలి. డబ్బే ముఖ్యం కాదు. జీవితంలో ఆనందం కూడా ముఖ్యమే.
ప్రశ్న 2.
స్నేహం యొక్క గొప్పతనం గురించి మీ మాటల్లో చెప్పండి (వ్రాయండి).
జవాబు:
స్నేహం అనేది ఒక గొప్ప వరం. ఒక మంచి స్నేహితుడు వంద పుస్తకాల కంటే ఎక్కువ. మనకు బాధ కలిగితే అది స్నేహితునితో చెప్పుకొంటే సగం తగ్గుతుంది. ఆనందం చెప్పుకొంటే రెట్టింపవుతుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే స్నేహితుడే ఇస్తాడు, ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టడు. మనమేమైనా రహస్యాలు చెబితే ఎవ్వరికీ చెప్పడు. మనలో మంచి లక్షణాల గురించి పదిమందికీ చెబుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే స్నేహానికి సాటి వచ్చే సంపద, పదవీ, కావ్యం మొదలైనవేవీ ప్రపంచంలో లేవు. స్నేహంతో స్నేహమే పోల్చగలం.
ప్రశ్న 3.
నిరాశ వలన కలిగే నష్టాలను గురించి తెలపండి.
జవాబు:
ఆశ మనిషిని బ్రతికిస్తుంది. నిరాశ చంపుతుంది అంటారు. నిరాశ వలన ఉత్సాహం పోతుంది. ఆడుకోలేం, పాడుకోలేం, చదువుకోలేము, ఏ పనినీ చేయలేము. దేని గురించి ఆలోచించలేము. ఒక్కొక్కసారి జీవితం మీద కూడా విరక్తి కలుగుతుంది. అందుచేత నిరాశ అతి ప్రమాదకరమైనది, ఒక్కొక్కసారి నిరాశ కలిగినా, కొద్ది సేపటికి కోలుకోవాలి. దాని నుండి బైటపడాలి. ఆశను పెంచుకోవాలి. నిరాశతో అన్నీ కోల్పోతాం. ఆశ ఉంటే దేనినైనా సాధిస్తాం.
ప్రశ్న 4.
కింది గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గార్గి మహాపండితురాలే కాక బ్రహ్మజ్ఞానం గల మహావిజ్ఞాని. ఆనాటి మహర్షులలో అగ్రేసరుడు, బ్రహ్మజ్ఞాని అయిన యజ్ఞవల్క్యునితో పలుమార్లు వాద ప్రతివాదాలు చేసిన మహాపండితురాలు. పురుషులతో పాటు ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతాన్ని (జంధ్యం) ధరించి శాస్త్ర చర్చలు చేసిన విదుషీమణి. ఈమె జనక మహారాజు ఆస్థాన పండితురాలు. పురుషులతో పాటు స్త్రీలకు సమాన ప్రతిపత్తే కాకుండా ఏ విషయంలోనూ స్త్రీలు పురుషులకు తీసిపోరని చాటిన మహిళ గార్డి.
ప్రశ్నలు :
అ) మహర్షులలో అగ్రేసరులు ఎవరు?
జవాబు:
మహర్షులలో యజ్ఞవల్క్యుడు అగ్రేసరుడు.
ఆ) బ్రహ్మ జ్ఞానం గల మహావిజ్ఞాని ఎవరు?
జవాబు:
బ్రహ్మ జ్ఞానం గల మహాజ్ఞాని గార్గి.
ఇ) యజ్ఞోపవీతం అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
యజ్ఞోపవీతం అంటే జంధ్యం అని అర్థం.
ఈ) గార్గి ఎవరి ఆస్థాన పండితురాలు?
జవాబు:
జనక మహారాజుకు గార్గి ఆస్థాన పండితురాలు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
లలిత కళలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
లలితకళలు 5. అవి
- సాహిత్యం
- సంగీతం
- నృత్యం
- శిల్పం
- చిత్రలేఖనం.
ప్రశ్న 2.
ముఖం చూడగానే మానవుని అంతరాత్మ ఎలా తెలుస్తుంది?
జవాబు:
మానవుని ఆత్మకు మానవుని మనసు ప్రతిబింబం. మానవుని మనసుకు మానవుని ముఖం యొక్క ఆకారం ప్రతిబింబం. అందుకనే మానవుని ముఖం చూడగానే అతని అంతరాత్మ తెలుస్తుంది.
ప్రశ్న 3.
మానవులంతా ఒక్కటే అనే భావాన్ని సంజీవదేవ్ ఎలా వివరించారు?
జవాబు:
మైత్రి, ప్రేమ, స్వార్థం లేకపోవడం వంటి లక్షణాలున్న మానవులంతా ఒక్కటే. వారెంత దూరాన ఉన్నా అందరూ దగ్గరివారే. వయసులు వేరైనా వారంతా ఒకటే. కులాలు, రంగులు వేరైనా అందరూ ఒకటే. దేశం, మతం, జాతి వేరైనా అందరూ ఒకటే. మైత్రి, ప్రేమ, నిస్స్వార్థం ఉంటే మానవులు అంతా ఒకటేనని సంజీవదేవ్ చెప్పారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
రచయిత లేఖలో పేర్కొన్న అంశాలను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రచయిత ఈ లేఖను 25.11.64న తన మిత్రుడు నారాయణ రాజుగారికి తుమ్మపూడి నుండి వ్రాశారు.
వారు వ్రాసిన ఉత్తరం చదివి తనూ తన భార్యా ఆనందించినట్లు వ్రాశారు. ఒకనాటి రాత్రి వారు తమ ఇంటికి, . వచ్చినందుకు రచయిత చాలా ఆనందపడినట్లుగా వ్రాశారు.
తమలో ఉన్న ప్రేమ, మైత్రి, నిస్స్వార్థతే తమను కలిపినట్లు వ్రాశారు. అవి ఎవ్వరినైనా కలుపుతాయి అన్నారు. ఒక వ్యక్తి ముఖం చూస్తే ఆత్మ తెలుస్తుందన్నారు. లలితకళల గురించి అవి ఇచ్చే ఆనందం గురించి వ్రాశారు. తనకు నిరాశ, నిరుత్సాహం, విచారం వంటివి ఉండవని రచయిత తన లేఖను ముగించారు.
ప్రశ్న 2.
లలితకళల్లో మీకు నచ్చిన అంశం గురించి రాయండి.
జవాబు:
1) సాహిత్యం :
నాకు లలితకళలలో సాహిత్యమంటే చాలా ఇష్టం. సాహిత్యంలో మంచి మంచి కథలు, కల్పనలు, పాటలు, పద్యాలు, వర్ణనలు మొదలైనవన్నీ ఉంటాయి. చక్కగా అవన్నీ చదువుకోవచ్చు. వినవచ్చు. ఆనందించ వచ్చును.
2) సంగీతం :
సాహిత్యం అయితే చదువుకొన్న వారికే ఆనందం కల్గిస్తుంది. కానీ సంగీతం చదువురాని వారిని కూడా ఆనందపరుస్తుంది. కళ్లు కనిపించని వారు కూడా చెవులతో విని ఆనందించవచ్చు. సంగీతం వింటుంటే బాధలన్నీ మరచిపోతాం. రోగాలను తగ్గించే శక్తి కూడా సంగీతానికి ఉందిట. మనుషులనే కాదు చెట్లను, పాములను, జంతువులను, పక్షులను కూడా సంగీతం ఆనందపరుస్తుంది. అందుకే నాకు సంగీతమంటే చాలా ఇష్టం.
3) చిత్రలేఖనం :
లలితకళలలో నాకు చిత్రలేఖనమంటే ఇష్టం. చదువురాని వారిని, చెవిటి వారిని కూడా ఆకర్షించి ఆనందపరిచేది చిత్రలేఖనం. అందుకే చిత్రలేఖనం అంటే నాకిష్టం. సృష్టిలోని దేన్నైనా చిత్రించి, ఆనందింపచేయగల చిత్రకారులంటే నాకు చాలా గౌరవం. చిత్రలేఖనం కూడా పశువులను, పక్షులను ఆకర్షించి ఆనందింప చేస్తుంది. ఇప్పటి మన సినిమాలకు మూలం చిత్రలేఖనమే కదా.!
4) శిల్పం :
నాకు లలితకళలలో శిల్పమంటే ఇష్టం. ఎందుకూ పనికిరాని బండరాయిని కూడా భగవంతుడుగా తీర్చిదిద్ది, మానవులలో భక్తి భావాన్ని పెంచే శిల్పికి సాటివచ్చేవారు ఎవ్వరూ లేరు. ఈ రోజు దేవాలయాలు, మ్యూజియమ్ లు, అందమైన భవనాలు, రాజభవంతులు నిర్మించేది శిల్పులే. కళ్లు లేకపోయినా, చెవిటి వారినైనా ఆనందింప చేసేది శిల్పకళే. అంధులు కూడా చేతితో తడిమి శిల్పం యొక్క సౌందర్యాన్ని తెలుసుకోగలరు. ఆనందిస్తారు. అందుకే నాకు లలితకళలలో శిల్పకళ అంటే చాలా ఇష్టం.
5) నృత్యం :
నాకు లలితకళలలో నృత్యమంటే ఇష్టం. సంగీతం, సాహిత్యం కళ్ళు, చెవుల ద్వారా ఆనందం కల్గిస్తాయి. చిత్రలేఖనం, శిల్పం – కంటి ద్వారా ఆనందం కలిగిస్తాయి. కాని నృత్యం కళ్లు, చెవులు ద్వారా మనసుకు చాలా ఆనందాన్ని కల్గిస్తుంది. నృత్యంలో సాహిత్యం (పాట), సంగీతం (గానం), అభినయం (శిల్పం), కోపం మొదలైనవి వ్యక్తపరచడం భంగిమ (చిత్రలేఖనం) ఉంటాయి. కనుక దీనిలో అన్ని లలితకళలూ ఉంటాయి. అందుకే నాకు నృత్యం అంటే చాలా ఇష్టం.
(సూచన : పై వానిలో ఏది ఇష్టమైనవారు దాని గురించి వ్రాయాలి.)
ప్రశ్న 3.
ఏదైనా ఒక పండుగ / దర్శనీయ స్థలం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ ప్రియమైన రాజేష్ కు, నీ మిత్రుడు సతీష్ వ్రాయు లేఖ. అక్కడ మా మామయ్య చాలా ప్రదేశాలు చూపించాడు. కనకమహాలక్ష్మి గుడి నాకు చాలా నచ్చింది. విశాఖ ” .. పట్టణానికి కనకమహాలక్ష్మి గ్రామదేవతట. గుడిలో అమ్మవారి విగ్రహంపైన మూయలేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటుందట. అదే ఆవిడకు సంతోషమట. రామకృష్ణా బీచ్ కు వెళ్లాం. సముద్ర కెరటాలతో చాలా సేపు ఆడుకొన్నాం. పూర్తిగా తడిసిపోయాం . చాలామంది జనం వచ్చారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరం తెగతడిసిపోయాం . ఫోటోలు కూడా తీసుకున్నాం. అవన్నీ నీకు వాట్సాప్ లో పంపుతాను. నువ్వు సెలవులలో ఎక్కడికి వెళ్లావో వ్రాయి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలని చెప్పు. ఇట్లు, చిరునామా : |
భాషాంశాలు
అ) కింద గీతగీసిన పదానికి అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : మైత్రి ఉన్న వ్యక్తి ఎంతదూరంలో ఉన్నా దగ్గర ఉన్నట్లే లెక్క
మైత్రి : స్నేహం
ప్రతి విద్యార్థి తోటి విద్యార్థులతో స్నేహంగా ఉండాలి.
1. కళ మానవుని బాధను తాత్కాలికంగా తొలగిస్తుంది.
తాత్కాలికం = అప్పటికి మాత్రమే
సొంతవాక్యం : డబ్బు వలన అప్పటికి మాత్రమే సుఖం కలుగుతుంది.
2. సులోచనా నేను కూడా అమితంగా సంతోషించాము.
అమితంగా = ఎక్కువగా
సొంతవాక్యం : దేనినీ ఎక్కువగా తినకూడదు.
3. ముఖం చూడగానే అంతరాత్మ తేజం– తెలిసిపోతుంది.
తేజం = కాంతి
సొంతవాక్యం : విద్య వలన ముఖంలో తేజం పెరుగుతుంది.
4. నేను జీవితంలో సంకల్పించుకున్న కార్యాలు ఎక్కువగా ఉన్నాయి.
కార్యాలు = పనులు
సొంతవాక్యం : ఎన్ని ఆటంకాలు వచ్చినా మన పనులు మనం మానకూడదు.
5. సఫలం కాకపోయినా కూడా నిరుత్సాహపడను.
సఫలం = ఫలించడం
సొంతవాక్యం : పనిచేస్తే తప్పక ఫలించడం జరుగుతుంది.
ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలను (పర్యాయపదాలు) గుర్తించి రాయండి.
1. పూర్వకాలంలో ఉత్తరాలు రాసేవారు. లేఖలు సమాచారం చేరవేయడానికి ఉపయోగిస్తారు. జాబురాసే అలవాటును అందరూ నేర్చుకోవాలి.
జవాబు:
ఉత్తరాలు, లేఖలు, జాబులు
2. శోకంతో మనసు వికలమవుతుంది. బాధ కలిగినపుడు ఏడుపు వస్తుంది.
జవాబు:
శోకం, ఏడుపు
3. సమాజంలో మంచి సేవచేసిన వారికి కీర్తి కలుగుతుంది. అలాంటి వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
జవాబు:
కీర్తి, పేరు, ప్రఖ్యాతి
ఇ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.
1. కథ | అ) కర్జము |
2. ముఖము | ఆ) విద్దె |
3. కీర్తి | ఇ) కత |
4. విద్య | ఈ) మొగము |
5. కార్యము | ఉ) సిరి |
6. శ్రీ | ఊ) కీరితి |
జవాబు:
1. కథ | ఇ) కత |
2. ముఖము | ఈ) మొగము |
3. కీర్తి | ఊ) కీరితి |
4. విద్య | ఆ) విద్దె |
5. కార్యము | అ) కర్జము |
6. శ్రీ | ఉ) సిరి |
ఈ) కింద ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలను జతపరచండి.
1. సుఖం | అ) అస్పష్టమైన |
2. సఫలం | ఆ) శాశ్వతం |
3. నిస్వార్థం | ఇ) దుఃఖం |
4. స్పష్టమైన | ఈ) విఫలం |
5. తాత్కాలికం | ఉ) స్వార్థం |
జవాబు:
1. సుఖం | ఇ) దుఃఖం |
2. సఫలం | ఈ) విఫలం |
3. నిస్వార్థం | ఉ) స్వార్థం |
4. స్పష్టమైన | అ) అస్పష్టమైన |
5. తాత్కాలికం | ఆ) శాశ్వతం |
ఉ) కింది పదాలకు సొంతవాక్య ప్రయోగం చేయండి.
ఉదా : మా ఊరి గుడిలోని ఉత్సవాలు తాత్కాలికంగా వాయిదా వేశారు.
అమితంగా, అనురాగం, సఫలం, విఫలం, ప్రతిబింబం, ఎండమావులు; ఆనందం, నిస్వార్థం, చింత, కల
1. అమితంగా – = ఎక్కువగా
సొంతవాక్యం : తల్లి పిల్లలను అమితంగా ప్రేమిస్తుంది.
2. అనురాగం = ప్రేమ
సొంతవాక్యం : పక్షులు, జంతువుల పట్ల అనురాగం పెంచుకోవాలి.
3. సఫలం = నెరవేరడం
సొంతవాక్యం : మంచి పనులెప్పుడూ సఫలం అవుతాయి.
4. విఫలం : నెరవేరకపోవడం
సొంతవాక్యం : దేవతలతో యుద్ధంలో ఎప్పుడూ రాక్షసులే విఫలం అయ్యారు.
5. ప్రతిబింబం = ప్రతిమ
సొంతవాక్యం : నూతిలో తన ప్రతిబింబాన్ని చూసి, సింహం మోసపోయింది.
6. ఎండమావులు = మృగతృష్ణలు
సొంతవాక్యం : ఎండమావులు చూసి మోసపోకూడదు.
7. ఆనందం = సంతోషం
సొంతవాక్యం : ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలి.
8. నిస్స్వార్థం = స్వార్థం లేకపోవడం
సొంతవాక్యం : గురువులు నిస్స్వార్థంతో విద్య నేర్పుతారు.
9. చింత = విచారం
సొంతవాక్యం : దేని గురించి చింత పెట్టుకోకూడదు.
10. కల = స్వప్నం
సొంతవాక్యం : కలలలో తేలిపోతే ఏ పనీ పూర్తికాదు.
ఊ) కింది వరుసలో సంబంధంలేని పదాన్ని గుర్తించి సున్నా “O” చుట్టండి. వృత్తంలోని పదాన్ని ఉపయోగించు కొని వాక్యాలు రాయండి.
ఋ) కింద ఇచ్చిన పదపట్టికను గమనించండి. వాటిలో పొడుపుకథలకు సంబంధించిన పదాలు ఉన్నాయి. వాటి ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. అక్కాచెల్లెళ్లు ఏడుస్తారు. అయితే దగ్గర చేరలేరు.
జవాబు:
కళ్లు
2. అరవైకన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్ళు తాగు.
జవాబు:
వల
3. మూత తెరిస్తే ముత్యాల పేరు.
జవాబు:
దంతాలు
4. ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెఱువునిండే.
జవాబు:
టెంకాయ
5. మా తాత రెండుబొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది. ఒకటి ఆడదు.
జవాబు:
తిరగలి
6. ఇల్లు, వాకిలితో కదులుతూ ఉంటుంది. వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది.
జవాబు:
నత్త
7. ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతో చూసేది.
జవాబు:
నెమలి
8. ఒకటే అక్షరం, అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుష్యులే ఉండరు.
జవాబు:
స్త్రీ
వ్యాకరణాంశాలు
వాక్యం
అ) కింది వాక్యాలను చదవండి.
1. సుమేధ పాఠాన్ని చదువుతున్నది.
2. సాహిత్య పూలు కోస్తున్నది.
3. అరుణ వంట చేసింది.
4. సృజన నాట్యం చేసింది.
5. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు.
పై వాక్యాలలోని కర్త – కర్మ – క్రియలను గుర్తించండి.
కర్త | కర్మ | క్రియ |
1. సుమేధ | పాఠం | చదువుతున్నది |
2. సాహిత్య | పూలు | కోస్తున్నది |
3. అరుణ | వంట | చేసింది |
4. సృజన | నాట్యం | చేసింది |
5. బాలకృష్ణ | దినపత్రిక | చదువుతున్నాడు |
పై ఉదాహరణల్లో కర్త – కర్మ – క్రియ ఉన్నాయి. అవి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తున్నాయి. అలా ఇస్తే దానిని వాక్యం అంటారు.
యడాగమసంది
ఆ) కింది వాక్యాలు చదవండి.
1. సెలయేరు పక్కన భరద్వాజమహర్షి ఆశ్రమం ఉంది.
2. రవి స్నేహితుడు పుస్తకాలు ఇంటికి వచ్చియిచ్చాడు.
3. మాయమ్మ నాకు అన్నం పెట్టింది.
4. మాయయ్య నిన్న విజయవాడకు వెళ్లాడు.
5. మాయిల్లు మమతల పొదరిల్లు.
ఇ) గీత గీసిన పదాలను విడదీయండి.
ఉదా : సెలయేరు : సెల + ఏరు
1. వచ్చియిచ్చాడు = వచ్చి + ఇచ్చాడు
2. మాయమ్మ = మా + అమ్మ
3. మాయయ్య = మా + అయ్య
4. మాయిల్లు = మా + ఇల్లు
పై ఉదాహరణలో పూర్వ స్వరంగా ‘అ’ వుంది. పరస్వరంగా ‘ఏ’ ఉంది. సంధి జరిగే అవకాశం లేదు. అందుచేత పరస్వరానికి ముందుగా ‘య్’ ఆగమంగా వచ్చింది. కనుక ఇది ‘యడాగమ’ సంధి.
ఈ) కింది పదాల మధ్య ‘య’ కారం చేర్చిరాయండి.
1. మంచి + అదను = మంచియదను
2. పది + ఆరువేల = పదియారువేలు
3. పాడి + ఆవు = పాడియావు
4. ఏలి + ఉన్న = ఏలియున్న
5. నా + అనుభవం = నాయనుభవం
ప్రాజెక్టుపని
గొప్ప వ్యక్తులు రాసిన లేఖలను సేకరించి, తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
గురజాడ, నెహ్రూ మొదలైన వారి లేఖలు. సుభాషితం కాదు
సభాషితం
పర హితము సేయు నెవ్వడు
పరమ హితుండగును భూత పంచకమునకుం
బర హితమె పరమధర్మము
పర హితునకు నెదురు లేదు పర్వేందుముఖీ !
భావం :
ఓ పార్వతీ ! ఎవరు ఇతరులకు సహాయం చేస్తారో వారు ప్రకృతికి ఇష్టమైన స్నేహితులవుతారు. ఇతరులకు సహాయం చేయడానికి మించిన ధర్మం లేదు. అలా సహాయం చేసేవారు లోకంలో కీర్తిమంతులౌతారు.
ఉపాధ్యాయులకు సూచనలు
1. సంజీవదేవ్ రాసిన ‘సంజీవదేవ్ లేఖలు’, ‘లేఖల్లో సంజీవదేవ్’ రచనలను పరిశీలించండి.
2. విద్యార్థులకు ప్రముఖులు రాసిన లేఖలు పరిచయం చేయండి.
కవి పరిచయం
రచయిత పేరు : సూర్యదేవర సంజీవదేవ్
జననం : గుంటూరు జిల్లాలోని మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో 3.7.1914న జన్మించారు.
రచనలు :
తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు మొదలైనవి.
ప్రత్యేకతలు :
వీరు కవి, రచయిత, తత్త్వవేత్త, చిత్రకారుడు. 14 భాషలు వ్రాయగలరు, చదవగలరు. ప్రకృతి ఆస్వాదన ఆయనకిష్టం. సమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. దేశవిదేశాలలోని చిత్రకారులు, కవులు, మేధావులు సంజీవదేవ్ కోసం తుమ్మపూడి గ్రామానికి వచ్చేవారు.
కఠిన పదాలకు అర్థాలు
1. ప్రియమిత్రులు ……… మీ సంజీవదేవ్
అర్థాలు :
ప్రియము = ఇష్టము
అత్యంత = చాలా ఎక్కువ
ఉత్తరం = లేఖ
సోదరి = చెల్లెలు లేక అక్క (తోబుట్టువు)
అమితం = ఎక్కువ
మించిన = ఎక్కువైన
సుదూరం= చాలాదూరం
దిగంతాలు = దిక్కుల చివరలు
అస్పష్టం = స్పష్టంకానిది
స్వప్నం = కల
అనుభూతి = అనుభవం
మైత్రి = స్నేహం
నిస్స్వార్ధత = స్వార్థం లేకపోవడం
మానవులు = మనుషులు
వర్ణము = రంగు, కులము
ఆత్మ = జీవాత్మ
ముఖము = వదనం
ఆకృతి = ఆకారం
ప్రతిబింబం = ప్రతిమ
దిగులు = స్వల్పమైన మానసిక బాధ
చింత= విచారం
నృత్యం = నాట్యం
చిత్రలేఖనం = బొమ్మలు గీయడం
తాత్కాలికం అశాశ్వతం
ఎండమావి = ఎడారిలో నీరు ఉన్నట్లు కనబడేవి (మృగతృష్ణ)
పరిశీలించండి.
తుమ్మపూడి, డా|| సంజీవదేవ్, D.Lit., అందినాయి మీ ఉత్తరం, జ్ఞాపిక’ కవితా, సంతోషం. అమ్మాయి పేరు “మానసరవళి” అయినందుకు ఆనందం. బాగున్నది. పేరుకు తగినట్లుగా ఆమె రాణించగలదని ఆకాంక్ష. మరోసారి మానసరవళికి మా శుభాకాంక్షలు తెలుపుచున్నాము. తనయతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటున్నందుకు ఆహ్లాదం. ఆరోగ్యంగా ఉండటం మాత్రమే చాలదు, ఆనందంగా కూడా ఉండాలి. అయితే, ఆరోగ్యం లేనిది ఆనందం కూడా జనించదు. ఇక మీ కవిత విషయం . నూతన భావాలతో, అందుకు తగిన పదాలతో మీ కవిత కమనీయ కాంతితో మధుర సరాగాన్ని వెదజల్లుతోంది. ఆనందాన్ని, ఆలోచనను కూడా సమానంగా పంచిస్తూంది అది ! కవిగా జీవించటం మంచిదే కానీ, దానికి తోడు రవిగా కూడా ప్రకాశించాలి. ఆ ప్రకాశంలో స్వల్పంగా చీకటి మరకలున్నా భయపడాల్సిన అవసరం లేదు. స్వల్పంగా అంధకార బిందువులు లేని పూర్ణ ప్రకాశాన్ని మనిషి భరించలేడు. నీడలేని కాంతిలో శాంతి కొంత వెలవెలబోతుంది. అందుకే light and shade కావాలి కొరత గల పూర్ణత్వం కావాలి. Shadow and substance కావాలి. Light and shade మధ్య జీవితం ఈ పల్లె పరిసరాల్లో నలుపు తెలుపుగా సాగిపోతూనే ఉంది. చల్లచల్లగా, వెచ్చవెచ్చగా శీతాకాల శోభ శోభాయమానంగా నిరంతరం అనంతాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. మీ |
సూచన :
పై లేఖను పరిశీలించండి. లేఖల ఆవశ్యకతను గురించి చర్చించండి.
జవాబు:
పై లేఖను పరిశీలిస్తే చాలా విషయాలు తెలిశాయి. సంజీవదేవ్ గారి చేతివ్రాత గురించి తెలిసింది. ఆయనకు ఎందరో ఉత్తరాలు వ్రాసేవారని తెలిసింది. ఉత్తరాలు వ్రాసిన వారందరికీ ఓపికగా జవాబులు వ్రాసేవారు. వారు తనకు వ్రాసిన లేఖలను నిర్మొగమాటంగా విశ్లేషించేవారు. సలహాలు చెప్పేవారు. బాగున్న విషయాలను మెచ్చుకొనే వారని తెలిసింది. ఇది 1989లో నవంబరు, 21న వ్రాసిన లేఖ. అది జాగ్రత్త చేసినందువలన లేఖలోని విషయాలు మనకు తెలిశాయి. ఇలాగే లేఖల వలన చాలా ప్రయోజనాలున్నాయి.