Access to the AP 9th Class Telugu Guide 9th Lesson రంగస్థలం Questions and Answers are aligned with the curriculum standards.
రంగస్థలం AP 9th Class Telugu 9th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి :
పాట
గట్టునో పుట్టనో
ఊరిలోనో దారిలోనో
ఎక్కడైనా కావొచ్చు
మొక్కె చిగురించి
పాట నన్ను ‘మట్టి’ని చేస్తుంది.
ముళ్ళలోనో రాళ్లలోనో
తోటలోనో అడవిలోనో
ఎక్కడైనా కావొచ్చు.
పరిమళమై వ్యాపించి
పాట నన్ను పువ్వును చేస్తుంది.
ఏటిలోనో ఊటగెడ్డలోనో
ఏ వాగులోనో వంకలోనో
ఎక్కడైనా కావొచ్చు
కెరటమై ఎగిసి
పాట నన్ను సముద్రాన్ని చేస్తుంది.
దుక్కిలోనో ఏ రోడ్డు పనిలోనో
పొలంలోనో ఫ్యాక్టరీలోనో
ఎక్కడైనా కావొచ్చు.
చెమట చుక్కె జారి
పాట నన్ను ‘మనిషి’ని చేస్తుంది.
గుడిశెల్లోనో గూడల్లోనో
పల్లెల్లోనో పట్నాల్లోనో
ఎక్కడైనా కావొచ్చు
ఉద్యమమై ఉప్పొంగి
పాట నన్ను ‘ప్రజ’ ను చేస్తుంది.
నేల చీలిపోతున్నప్పుడు
జాతి శకల శకలాలుగా చెదిరిపోతున్నపుడు
ఎక్కడైనా ఎప్పుడైనా
గుండెల్ని కలిపికుట్టి
పాట నన్ను ‘జండా’ను చేసి ఎగరేస్తుంది.
ఆలోచనాత్మక ప్రశ్నలు :
ప్రశ్న 1.
‘పాట నన్ను మనిషిని చేస్తుంది’ అని కవి ఎందుకు అన్నాడో ఆలోచించి చెప్పండి.
జవాబు:
కర్షకులు, కార్మికులు దేశ అభివృద్ధి కోసం విపరీతంగా కష్టపడతారు. కర్షకులు అంటే రైతులు పగలనక రాత్రనక ఎల్లకాలం చేలో పని చేస్తారు. కష్టనష్టాలను చాలా ఓర్పుగా భరిస్తారు. ప్రకృతి కరుణిస్తే పంట చేతికి వస్తుంది. ప్రకృతి కరుణించకపోయినా పంట చేతికి రాకపోయినా రైతు నిరాశపడడు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు. పంటలు పండిస్తాడు. తను వస్తున్నా అందరి కడుపులు నింపుతాడు.
రోడ్డు పనిచేసే శ్రామికులు కానీ, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు గాని శరీరమంతా చెమట కాలువలుగా పడుతున్నా. పట్టించుకోరు. విశ్రాంతిని ఆశించరు. ప్రజాసౌకర్యాలే వారికి ముఖ్యం. ఆ కర్షక శ్రామిక కార్మిక వర్గాలు చిందించిన చెమట తనలోని బద్ధకాన్ని వదిలించింది. తనలోని కష్టపడేతత్వాన్ని మేలుకొలిపింది. తనను నిజమైన మనిషిని చేసిందని కవి అభిప్రాయము.
ప్రశ్న 2.
పాట విన్నా, పాడుకున్నా మనసుకు సాంత్వన కలుగుతుంది అంటారు కదా ! అలా నీకు ఎపుడైనా అనిపించిందా ?
ఆ సంఘటనను గురించి చెప్పండి.
జవాబు:
పాట విన్నా, పాడుకున్నా మనసుకు సాంత్వన కలుగుతుంది. ఎందుకంటే మనసును ఉత్తేజపరిచే లక్షణం పాటకు ఉంది. నా అనుభవంలో చాలాసార్లు అలా జరిగింది. నాకు గతంలో ఫిట్స్ వచ్చేవి. మనసును అదుపులో ఉంచుకుంటే ఫిట్స్ రావని డాక్టరుగారు చెప్పారు. ఒకసారి టాబ్లెట్లు కొనుక్కుందుకు షాపుకి వెళ్ళాను. ఇవి ఎవరికీ అన్నాడు. నాకే అన్నాను పైకి ఇంత బావున్నావు కదా ! నీకింత రోగం ఉందా ? అన్నాడు దానితో నా బుర్రలో హెూరు మొదలయ్యింది. మళ్ళీ ఫిట్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. కొండవీటి దొంగ సినిమాలోని నాకిష్టమైన “జీవితమే ఒక ఆట సాహసమే పూబాట”, అని పాడుకుంటూ నన్ను నేను ఉత్తేజ పరుచుకున్నాను. హాయిగా ఇంటికి వచ్చేసాను. ఈ విషయం చెబితే మా నాన్నగారు చాలా మెచ్చుకున్నారు. నిరాశా నిరుత్సాహం కలిగినపుడు పాటలు పాడుకుంటూ నన్ను నేను ఉత్సాహపరుచుకుంటాను.
అవగాహన – ప్రతిస్పందన
ఇవి చేయండి
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
నాటకం అంటే ఏమిటో చెప్పండి.
జవాబు:
ప్రజల వినోదం కోసం సంభాషణ, సంగీతం, నృత్యం, వీటన్నింటి సమాహారమే నాటకం, అది ఒక కళాత్మక ప్రక్రియ.
ఇది ప్రదర్శన యోగ్యమైనది. కవి రాసిన వాక్యాలకు, సృష్టించిన పాత్రలకు నటీనటులు జీవం పోస్తారు. విస్తృతమైన లోకానుభవం, లోతైన మానవ సంబంధాలు, మానవ స్వభావాలు, నటీనటుల అభినయాలు కలగలిసి జీవితానికి సమాంతరంగా సాగేది నాటకం. అందుకే నాటకాన్ని కొందరు కవిత్వం అంటే మరికొందరు ఉద్యమం అన్నారు.
ప్రశ్న 2.
పౌరాణిక నాటకాల విశేషత గురించి రాయండి.
జవాబు:
పౌరాణిక నాటకాలలో మంచి మంచి సంభాషణలు, పద్యాలు ఉండేవి. ఆ సంభాషణలు, పద్యాలు ఉద్దండ పండితులను కూడా ఆకర్షించాయి. చదువుకోని నిరక్షరాస్యులను కూడా సమానంగా ఆకర్షించేవి. అందరికీ ఆ పద్యాలు నోటికి వచ్చేవి. వాటి అర్థాలు తెలియని వారు కూడా వాటిని చక్కగా రాగయుక్తంగా, భావ గంభీరతతో, స్పష్టంగా పాడుకొనేవారు. చాలా సంతోషించేవారు. అదే పౌరాణిక నాటకాల విశేషం.
ప్రశ్న 3.
ఏకపాత్రలో నటించాలంటే నటుడు ఏ ఏ అంశాలపై దృష్టి పెట్టాలి ?
జవాబు:
ఏకపాత్రలో నటించాలంటే నటుడు చాలా అంశాలపై దృష్టి పెట్టాలి. ఎవరి పాత్ర చేస్తున్నాడో ఆ పాత్ర స్వభావాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. తను మాట్లాడే మాటతీరు, హావ భావాలు ఆ పాత్రకు తగినట్లు ఉండాలి. దుస్తులు, ఆహార్యం కూడా సరిపోవాలి. నడక, నడత, ఆంగిక విన్యాసం అన్నీ ఆ పాత్రను గుర్తు తేవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే రంగస్థలం మీద ఆ పాత్ర ప్రత్యక్షం కావాలి తప్ప నటుడు కనిపించకూడదు. నవరసాలూ ఒలికించ ాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఏకపాత్ర విజయం సాధిస్తుంది.
ప్రశ్న 4.
వీధి నాటకానికి, వేదిక నాటకానికి తేడాలు రాయండి.
జవాబు:
వీధి నాటకానికి వేదిక నాటకానికి తేడాలున్నాయి. వీధి నాటకాలంటే ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిచ్చేవారు. వీధి చివర కాగడాలు వెలుతురులో నాటకం ప్రదర్శించేవారు. నటులు ముతక వస్త్రాలు ధరించేవారు. నటులు చెక్క నగలు ధరించేవారు. స్త్రీల పాత్రలను కూడా పురుషులే ధరించేవారు. నటులు వలయాకారంగా నిలబడి ప్రదర్శిస్తారు.
వేదిక నాటకాలలో ఒకచోట వేదిక ఏర్పాటు చేసి నాటకం ప్రదర్శించేవారు. ప్రేక్షకులు అక్కడికే వచ్చేవారు. టిక్కెట్ కొనుక్కొని నాటకం చూసేవారు. స్త్రీ వేషాలు, స్త్రీలే ధరించేవారు. గాజు దీపాలు ఏర్పాటు చేసేవారు. నటులు హారాలు ధరించేవారు. వేదికకు ముందు, వెనుక, రెండు ప్రక్కలా తెరలు కట్టేవారు. నాటకరంగంలో కీలక మార్పులు వచ్చాయి.
ఆ) కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఒక కుర్రాడు 23 దేశాల నుంచి వచ్చిన 120 చిత్రాలతో పోటీకి నిలిచి ఎంపికైన 35 చిత్రాలలో ఒక దానికి దర్శకత్వం వహించి గుర్తింపు సాధించాడు. ఆ కుర్రాడు ఆషికుల్ ఇస్లాం. వయస్సు 11 సంవత్సరాలు. ఆషికుల్ జీవితంలోకి తొంగి చూస్తే 11 ఏళ్ళలోనే ఎన్నో అనుభవాలు కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్లో ఓ మారుమూల గ్రామంలో ఆషికుల్ పుట్టేటప్పటికి తండ్రి లేడు. నాలుగేళ్ళకే తల్లి కూడా చనిపోతే అమ్మమ్మ వాడికి నేర్పిన విద్య అడుక్కోవడం.
కడుపు నింపుకోవడం కోసం ఏదో ఒకటి పెట్టండి అని అడుక్కున్న ఆషికుల్కు అది కూడా సులువుగా సాగలేదు. సాటి ముష్టి వాళ్ళు తన్ని తరిమేవారు. ఫుట్ పాత్ మీద కూడా చోటు లేక పోయింది. కాస్త వయసు పెరిగే సరికి బాల కార్మికుడిగా మారాడు. మధ్యగ్రామ్ అనే ఊరిలో ‘ముకనీర్’ అనే సంస్థ ఉంది. వీధి బాలలను, బాల కార్మికులను ఆదుకోవడం దాని ఆశయం. ఆ సంస్థ ప్రతినిధుల దృష్టిలో పడ్డాడు ఆషికుల్.
అలా అక్కడి నుంచి 120 పడకలు ఉన్న అనాథాశ్రమంలో ఒక బాలుడు అయ్యాడు. ఆషికుల్ చదువుకునే స్కూల్లో ఒకసారి శిక్షణ శిబిరం నిర్వహించారు. మీకే గనుక సినిమా తీసే అవకాశం వస్తే మిగతా పిల్లలకి ఏం చూపిస్తారు ? అని అడిగారు. మా కథే చూపిస్తానన్నాడు ఆషికుల్. అనాథ పిల్లలతో కలిసి ఆషికుల్ తీసిన 20 నిమిషాల బెంగాలీ లఘుచిత్రం పేరు ‘ఆమి-ఐయామ్’. అందులో వాళ్లందరి జీవితాల్లో కలిగిన కష్టాలు, వాటితో పాటు వాళ్ళు ఆనందంగా గడిపిన సందర్భాలు, బాల కార్మికుల బాధలు, వాళ్ల సందేహాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఉన్నాయి.
అంతేకాదు పక్షులు ఎలా ఎగురుతాయి, చేపలు ఎలా ఈదుతాయి, నక్షత్రాలు రాత్రి కనబడి పగలు ఎందుకు మాయమైపోతాయి? – నిరుపేద కుటుంబాల్లో పిల్లల్ని పెద్దయ్యాక ఏమవుతావు ? అని అడిగితే ఏం చెబుతారు అనే విషయాలన్నీ ఆ చిత్రంలో ఉన్నాయి. రైలు వెళ్ళిపోతుంటే చేతులు వూపుతూ టాటా చెప్పడం, చెట్టులెక్కడం, డాక్టర్ ఆట, టీచర్ ఆటలు ఆనటం లాంటి చిన్న చిన్న సరదాలు కూడా ఉన్నాయి. ఆ చిన్న చిత్రం వేలాది పేద బాలల అనాథల బాలకార్మికుల జీవితాలకు ప్రతిబింబమైంది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఆషికుల్ సాధించిన ఘనత ఏమిటి ?
జవాబు:
అనాథబాలల జీవిత కథగా ‘ఆమి-ఐయామ్’ అనే లఘు చిత్రం రూపొందించడమే ఆషికుల్ సాధించిన ఘనత.
ప్రశ్న 2.
బాల కార్మికుల జీవితాలు తెలిపే లఘు చిత్రం పేరు ఏమిటి ?
జవాబు:
బాలకార్మికుల జీవితాలు తెలిపే లఘుచిత్రం పేరు “ఆమి-ఐయామ్”.
ప్రశ్న 3.
దృష్టిలో పడడం అంటే ఏమిటి ?
జవాబు:
దృష్టిలో పడడం అంటే మనసును ఆకర్షించి, తన గురించి ఆలోచించేలా చేయడం.
ప్రశ్న 4.
ముకనీర్ సంస్థ ఉన్న ప్రాంతం ఏది ?
అ) బెంగాల్
ఆ) మధ్యగ్రామ్
ఇ) ధార్వాడ
ఈ) హైదరాబాద్
జవాబు:
ఆ) మధ్యగ్రామ్
ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఎన్ని చిత్రాలు పోటీకి వచ్చాయి ?
ఇ) కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
స్థానం నరసింహారావు స్త్రీ పాత్రలు ధరించడంలో దిట్ట. దాదాపు 1500 పైగా నాటకాలలో నటించిన ఆయన చిత్రాంగి, మధురవాణి, రోషనార మొదలైన స్త్రీ పాత్రలలో ఒదిగిపోయేవారు. వీరి నటనా కౌశలానికి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదును ఇచ్చి సత్కరించింది. బందా కనక లింగేశ్వరరావు గారు న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రభ థియేటర్ సమాజాన్ని నడిపేవారు. సారంగధరుడు, బిల్వ మంగళుడు, కాళిదాసు మొదలైన పాత్రలు అద్భుతంగా నటించేవారు. రామాయణం ఇతివృత్తంలో వచ్చిన నాటకాలలో ఆంజనేయుడు అనగానే సి. ఎస్. నటేశన్ గారు గుర్తుకొస్తారు.
ఆయన ఒకసారి ‘లంకా దహనం’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ఒక పెద్ద కోతి ఎక్కడి నుండో రంగస్థలం మీదికి వచ్చి ఆయనతో పాటు భక్తి భావంతో గంతులేసి వెళ్ళిపోయిందట. నక్షత్రకుడు, భవానీ శంకరుడు పాత్రలతో మెప్పించిన పులిపాటి వెంకటేశ్వర్లు గారు తన రెండవ ఏటనే రంగస్థలం ఎక్కి నాలుగువేల పైచిలుకు నాటకాలలో నటించారు. సత్య హరిశ్చంద్ర పాత్రలో అసమాన ప్రతిభ ప్రదర్శించిన డి.వి. సుబ్బారావు గారు హిందీ నాటకాలలో కూడా నటించారు.
ఉప్పులూరు సంజీవరావు గారు వీరితో కలిసి ‘చిత్రాంగిగా నటించేవారు ఆయన చంద్రమతిగా, శకుంతలగా, సావిత్రిగా నటిస్తున్నారంటే మూడు రోజుల ముందుగానే టికెట్లన్నీ అమ్ముడు పోయేవి. కంసుడు, యముడు, రావణుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి రౌద్ర పాత్రలకు వేమూరి గగ్గయ్య పెట్టింది పేరు. నటుడిగా ధ్వని అనుకరణలో విశేష ప్రతిభ చూపిన నేరెళ్ళ వేణుమాధవ్ గారు తెలుగు ప్రజలకు ‘వెంట్రిలాక్విజమ్’ అనే నూతన కళను పరిచయం చేశారు..
(- ఆంధ్ర నాటక రంగ చరిత్ర. డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి)
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
పై పేరాలో స్త్రీ పాత్రలు పోషించిన పురుష నటుల పేర్లు రాయండి.
జవాబు:
స్థానం నరసింహారావు గారు, ఉప్పులూరు సంజీవరావు గారు అనేవారు స్త్రీ పాత్రలు పోషించిన పురుష నటులు.
ప్రశ్న 2.
వేమూరి గగ్గయ్య గారి నటనా విశేషం ఏమిటి ?
జవాబు:
వేమూరి గగ్గయ్య గారు రౌద్ర పాత్రలు నటించడంలో విశేష ప్రతిభ కలవారు.
ప్రశ్న 3.
సత్యహరిశ్చంద్ర పాత్ర ద్వారా విశేష గుర్తింపు పొందిన నటుడు.
అ) స్థానం నరసింహారావు
ఆ) డి.వి. సుబ్బారావు
ఇ) బందా కనక లింగేశ్వర రావు
జవాబు:
ఆ) డి.వి. సుబ్బారావు
ప్రశ్న 4.
పాత్రలో ఒదిగి పోవడం అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు ?
జవాబు:
నటుడు తనను తాను మరిచిపోయి నటనలో లీనమై తను చేసే పాత్ర మాత్రమే కనబడేలా చేయడాన్ని నటనలో ఒదిగిపోవడం అంటారు.
ప్రశ్న 5.
మిమిక్రీ అనే ఇంగ్లీషు పదానికి సమానార్థక తెలుగు పదం ఏది ?
జవాబు:
మిమిక్రీకి సరైన తెలుగు పదం ‘ధ్వన్యనుకరణ’.
ఈ) మీ ఉపాధ్యాయుడిని అడిగి కింది నాటికలను, వాటిని రాసిన రచయితలతో జతపరచండి.
జవాబు:
1-ఎ, 2-ఊ, 3-6, 4-ఈ, 5-ఇ, 6-ఆ, 7-అ
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సాంఘిక నాటకాలు సమాజాన్ని చైతన్య పరచడానికి ఏ విధంగా కృషి చేస్తున్నాయి ?
జవాబు:
సాంఘిక నాటకాలు సమాజాన్ని చైతన్యపరిచాయి. సమాజంలోని లోపాలను సవరించాయి. వ్యావహారిక భాషలో నాటకం నడిచేది. వేదం వేంకటరాయశాస్త్రిగారు రచించిన ప్రతాపరుద్రీయం నాటకంలో రెండు పాత్రలు వ్యవహారిక భాషలోనే సంభాషిస్తాయి.
గురజాడ అప్పారావుగారు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం పూర్తి వ్యవహారిక భాషలోనే సాగింది. అలా వ్యావహారిక భాషలోనే పూర్తిగా నడిచిన నాటకాలలో మొట్టమొదటిది కన్యాశుల్కం. ఇందులోని పాత్రలూ, సన్నివేశాలు, సంభాషణలూ అన్నీ సహజంగా ఉంటాయి. గిరీశం, మధురవాణి, కరటకశాస్త్రి, అగ్నిహోత్రావధాన్లు మొదలైన పాత్రలు పలికే సంభాషణలు జనరంజకంగా ఉంటాయి. అప్పటి సమాజంలోని అనవసరమైన ఆచారాలను ఈ నాటకం వేళాకోళం చేసింది. కన్యాశుల్కం అనే సంప్రదాయాన్ని తునాతునకలు చేసింది.
భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జనుల వేదనా భరిత జీవితాలను కళ్లకు కడుతూ సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి, భాస్కరరావు కలిసి రచించిన ‘మా భూమి’, బోయి భీమన్నగారి ‘పాలేరు’ మొదలైన నాటకాలు సమాజాన్ని ప్రక్షాళన చేశాయి. ఈనాటికి చాలా నాటకాలు ప్రజలను చైతన్య పరిచాయి.
ప్రశ్న 2.
నాటక రంగంలో రేడియో నాటకాల ప్రత్యేకతను వివరించండి.
జవాబు:
నాటకాలను రంగస్థలం మీదే కాకుండా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా అందించవచ్చని నిరూపించింది రేడియో నాటకం. శ్రవ్య నాటకాలు కూడా శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి. 1967 నుండి రేడియో ద్వారా నాటకాల ప్రసారం ప్రారంభమైంది. చిలకమర్తి వారి ‘గణపతి’ హాస్య నవల 1967 లో హైదరాబాదు కేంద్రం నుండి రేడియోలో ప్రసారమైంది. అది శ్రోతలను విశేషంగా ఆకర్షించింది. రేడియో నాటకానికి సంభాషణలే ప్రాణం.
నండూరి సుబ్బారావు, పుచ్చా పూర్ణానందం, వి.బి. కనకదుర్గ, శారదా శ్రీనివాసన్, చిరంజీవి, రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా పేరు పొందిన న్యాపతి రాఘవరావు, రామేశ్వరి వంటి ఎందరో ప్రముఖులు తమ గొంతులతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. అప్పట్లో రేడియో నాటకాలు వస్తుంటే జనం గుమిగూడి వినేవారుట. రేడియో నాటకానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం చాలా ప్రచారం కల్పించింది. బందా కనకలింగేశ్వరరావు నాటక ప్రయోక్తగా ఎన్నో ఉత్తమ నాటకాలను ప్రసారం చేశారు.
ప్రశ్న 3.
తెలుగు నాటక రంగంలో సంచలనం కలిగించిన నాటకాల గురించి రాయండి.
జవాబు:
తెలుగు నాటక రంగంలో సంచలనం కలిగించిన నాటకాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా పేర్కొనదగినది గురజాడ అప్పారావుగారు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం. ఆనాడు సమాజంలో కన్యాశుల్కం ఉండేది. కన్యాశుల్కం నాటకం ద్వారా సమాజ ప్రక్షాళనకు నడుం బిగించారు. అది వ్యవహారిక భాషలో సాగింది. కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర జనంలో కలిసిపోయింది. ‘నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్’, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది” వంటి గిరీశం డైలాగ్లు జనంలో కలిసిపోయాయి. అలాగే రామప్ప పంతులు డైలాగ్, ‘నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం’ చాలా ప్రాచుర్యం పొందింది.
‘తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి’ అనే అగ్నిహోత్రావధాన్లు డైలాగైతే బాగా వ్యాప్తి చెందింది. ఈ విధంగా కన్యాశుల్కం బాల్య వివాహాలను నిరసించింది. అర్థంపర్థం లేని ఆచారాలను వేళాకోళం చేసింది. వితంతు వివాహాలను ప్రోత్సహించింది. ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం లాంటి నాటకం లేదని శ్రీశ్రీ చేత కితాబు నందుకొంది. అలాగే బోయి భీమన్నగారు రచించిన పాలేరు నాటకం చాలా సంచలనం రేపింది. పాలేరు నాటకం చూసి చాలామంది తమ పిల్లలను భూస్వాముల దగ్గర పాలేరు పని మానిపించి చదువులలో పెట్టారు. వారిలో I.A.S ల వంటి ఉన్నత విద్యలను అభ్యసించినవారు కూడా ఉన్నారు.
పాలేరు నాటకం ప్రభావంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుని అత్యున్నతమైన స్థానాలను అలంకరించారు. వరవిక్రయం నాటకం కూడా ఎంతో పేరు గడించింది. ఈ నాటక రచన ద్వారా కాళ్ళకూరి నారాయణరావు గారు పెద్ద సంచలనం తీసుకుని వచ్చారు. ఈ నాటకంలో వరకట్న దురాచారాన్ని ఎండగట్టారు. అలాగే ఆత్రేయ రాసిన కప్పలు నాటకం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ మూలాలను కదిలించింది. ఇలా తెలుగు నాటక రంగంలో అనేక నాటకాలు సంచలనం కలిగించాయి. కలిగిస్తున్నాయి.
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
మీ ఊరిలో పాటిబండ్ల ఆనందరావు గారు రచించిన ‘అంబేద్కర్ రాజా గృహప్రవేశం’ నాటికను ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
ఆహ్వానం
అత్యద్భుతమైన రచనా శైలితో పాటిబండ్ల ఆనందరావుగారు రచించిన అంబేద్కర్ రాజగృహప్రవేశం నాటిక రామాపురంలో ప్రదర్శించబడుతోంది.
వివరాలు: వేదిక: రామాపురం పెద్ద వీధిలోని రామాలయం వద్ద
ప్రారంభ సమయం: 14.08.2023 రాత్రి 7 గంటలకు
ఆహ్వానం : రసజ్ఞులైన ప్రతివారికీ
ప్రవేశ రుసుము : ఉచితం
ఇట్లు,
ఆహ్వాన కమిటీ.
ప్రశ్న 2.
ఒక నాటికను ప్రదర్శించాలి అంటే నాటిక ఎంపిక దగ్గర నుండి వేదిక మీద ప్రదర్శించడం వరకు ఎన్నో పనులుంటాయి
కదా ! మీ ఉపాధ్యాయుని / పెద్దలను అడిగి తెలుసుకొని నాటక ప్రదర్శన పై వ్యాసం రాయండి.
జవాబు:
నాటక ప్రదర్శన
ఒక నాటకం ప్రదర్శించాలంటే మంచి నాటకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ నాటక ఇతివృత్తం ఎవరి మనోభావాలను దెబ్బతీసేదిగా ఉండకూడదు. కులాలను, మతాలను, ప్రాంతాలను, విశ్వాసాలను, వ్యక్తులను, వ్యవస్థలను కించపరచేదిగా ఉండకూడదు. నాటకం ద్వారా ప్రజలను చైతన్యపరచగలగాలి. హాస్యనాటిక అయితే జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రదర్శనకు ప్రేక్షకులకు అనువైన ప్రదేశంలో వేదిక నిర్మించాలి. వేదిక కూడా పటిష్టంగా ఉండాలి. లైటింగ్, మైకు, సంగీతవాయిద్యాలు అమర్చుకోవాలి.
ప్రదర్శించే సమయం కూడా అందరికీ అనుకూలంగా ఉండాలి. వర్షాకాలము, శీతాకాలము అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రేక్షకులు పెద్దగా రారు. అంత చలి, అంత వేడి, వర్షం లేని రోజులలో పెట్టుకోవాలి. అది కూడా రాత్రి సమయంలో అయితేనే బాగుంటుంది. రాత్రి 7, 8 మధ్య నాటకం మొదలు పెట్టాలి. 10, 11 గంటలకు పూర్తి అయిపోతే బాగుంటుంది.
నాటకానికి సరిపడ నటులను ఎంపిక చేసుకోవాలి. వారికి ఆ పాత్రలకు, తగిన ఆహార్యం, అలంకరణలను సమకూర్చుకోవాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఉపకరణాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏ పాత్ర డైలాగులు పాత్రను పోషించే వారికి పూర్తిగా నోటికి వచ్చేలా చేయాలి. అవి హావ, భావ, విన్యాసాలతో ప్రదర్శించేలా శిక్షణనివ్వాలి. కనీసం 5, 6 సార్లెనా రిహార్సల్స్ వేయాలి. తెర వెనుక డైరెక్టరు ఉండాలి. వేదిక మీద నటులు డైలాగులు మరచిపోతే తెర వెనుక నుండి గుర్తు చేసే వ్యక్తి ఉండాలి. ఇలా ఎన్ని ఏర్పాట్లు చేసినా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. వాటిని నటులు తమ అనుభవంతో సమయస్ఫూర్తితో నవ్వులపాలు అవ్వకుండా దాటించగలిగితేనే నాటక ప్రదర్శన విజయవంతమవుతుంది.
ప్రశ్న3.
‘ధర్మబోధ’ కథాంశాన్ని తీసుకొని నాటికగా ప్రదర్శించడం కోసం సంభాషణలు రాయండి. ప్రదర్శించండి.
జవాబు:
ధర్మబోధ (నాటిక)
అది దుష్యంత మహారాజు కొలువుదీరియున్న సభ. అక్కడకు శకుంతల కుమారుణ్ణి వెంటబెట్టుకొని వస్తుంది. ఆమె, దుష్యంతుడితో తనకు జరిగిన గాంధర్వ వివాహం గుర్తు చేస్తున్న సందర్భంలో దుష్యంతుడు లోకానికి భయపడి నిజం చెప్పడు. ఆ సమయంలో ………….
శకుంతల : రాజా ! మంచి బుద్ధితో ‘బాగా పరిశీలించు, అనుకూలవతియైన భార్యను తిరస్కరిస్తే ఇహపరాల్లో సుఖాలుంటాయా? ధర్మార్థకామాలను సాధించడానికి భార్య అనువైన సాధనం. వంశవృద్ధికి ఆధారమైనది. భర్త హృదయానికి భార్య మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యా పిల్లలను ఆప్యాయంగా చూసుకొనే వారికి దుఃఖాలు దరిచేరవు.
దుష్యంతుడు : ఓ శకుంతలా ! మహారాజునైన నేనెక్కడ ? ఆశ్రమవాసివైన నీవెక్కడ ? నీ కుమారుడు ఎక్కడ ? ఇంతకు ముందు నిన్ను ఏనాడు నేను చూడలేదు.
శకుంతల : రాజా ! ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగుతుంది. అలాగే నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు. ఈ మీ పుత్రుణ్ణి కౌగిలించుకోండి. ముత్యాల హారాలు, పచ్చకర్పూరపు పొడి మొదలైనవేవీ కూడా ఇంతటి సుఖాన్నీ, గొప్ప చల్లదనాన్ని కలిగించలేవు. అనేక మంచి గుణాలు కలవాడిని, వంశ విస్తారకుడు అయిన పుత్రుణ్ణి కాదనడం తగదు.
దుష్యంతుడు : ఆహా ! స్త్రీలు అసత్యాలు చెప్తారనే మాట, ఇప్పుడు, ఇక్కడ ఋజువైంది. ఇలా మాట్లాడడం నీకు తగునా? మంచి నీటితో నిండిన నూరు చేదుడు బావులకన్నా ఒక దిగుడు బావి, నూరు దిగుడు బావుల కన్నా ఒక యజ్ఞం, నూరు యజ్ఞాల కంటే పుత్రుడు, అటువంటి వందమంది పుత్రుల కన్నా ఒక సత్యవాక్యం చాలా ‘గొప్పది. వేయి అశ్వమేథయాగాలు చేసిన ఫలితం కన్నా సత్యమే గొప్పది. సమస్త తీర్థాలను సేవించడం కంటే, వేదాధ్యయనం కంటే సత్యం గొప్పది. సమస్త జగత్తుకూ సత్యమే మూలం. కనుక కణ్వాశ్రమంలో చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చు. మన పుత్రుణ్ణి స్వీకరించు. (అని ప్రాధేయపడినా దుష్యంతుడు లోకాపవాదుకు భయపడి ఒప్పుకోడు) ఇక పై తనకు దైవమే దిక్కని భావించి శకుంతల బిడ్డతో వెళ్ళిపోతున్న సమయంలో …..)
అశరీరవాణి : ఓ దుష్యంతా ! ఈ భరతుడు నీకూ, శకుంతలకు పుట్టిన బిడ్డ. ఇతణ్ణి పుత్రుడిగా స్వీకరించు. ఉత్తమ ఇల్లాలూ, మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో నిజమే చెప్పింది. (అని ఆకాశం నుంచి దివ్యవాక్కులు వినబడతాయి. సభలోని వారంతా ఆశ్చర్యపోతారు. దుష్యంతుడు సంతోషంగా శకుంతలను, కుమారుణ్ణి దగ్గరకు తీసుకుంటాడు.)
భాషాంశాలు :
పదజాలం
అ) క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాయండి.
1. దూరవాణి వచ్చిన తర్వాత ఉత్తరాలు కనుమరుగు అయ్యాయి.
జవాబు:
కనుమరుగు = అదృశ్యము
2. ఆమె నటనకు ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.
జవాబు:
హర్షధ్వానాలు = చప్పట్లు
3. కొన్ని నాటకాలు ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటాయి.
జవాబు:
నిత్యనూతనంగా = ఎల్లప్పుడూ కొత్తగా
4. అన్నమయ్య కీర్తనలు సంగీత సాహిత్య సమ్మేళనంగా ఉంటాయి.
జవాబు:
సమ్మేళనం = కలయిక
5. గణపతి నాటకం ఆద్యంతం హాస్యం పండిస్తుంది.
జవాబు:
ఆద్యంతం = మొదటి నుండి చివరి దాకా
ఆ) కింది వాక్యాలను పరిశీలించండి, పర్యాయపదాలను గుర్తించి రాయండి.
1. స్త్రీల హక్కుల గురించి తెలిస్తేనే మహిళలు ముందడుగు వేయగలరు.
జవాబు:
స్త్రీలు, మహిళలు
2. ఒక గ్రామంలో నాటక ప్రదర్శన చూసేందుకు చుట్టుప్రక్కల పల్లెటూర్ల నుండి బండి కట్టుకొని వచ్చేవారు.
జవాబు:
గ్రామం, పల్లెటూరు
3. హాస్యకథలు చదివితే నవ్వు తెప్పిస్తాయి.
జవాబు:
హాస్యం, నవ్వు.
4. నృత్య ప్రదర్శనలో శోభా నాయుడు అద్భుతంగా నాట్యం చేసింది.
జవాబు:
నృత్యం, నాట్యం.
5. నాటకం చూడడానికి వచ్చిన వీక్షకులు అందరూ ప్రేక్షకులే.
జవాబు:
వీక్షకులు, ప్రేక్షకులు.
ఇ) కింది వాక్యాలను పరిశీలించండి. ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్థాలు రాయండి.
1. పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది.
జవాబు:
ఉల్లాసం = సంతోషము, ప్రకాశము
2. ఎంచుకున్న మార్గం మంచిది అయితే విజయం చేరువ అవుతుంది.
జవాబు:
చేరువ, సమీపము, సమూహము, సేన
3. కళాక్షేత్రం భవనాన్ని నూతనంగా నిర్మించారు.
జవాబు:
నూతనం, కొత్త, యువ, తాజా
4. కరువు కాలంలో భుక్తి గడవడం కష్టం.
జవాబు:
కాలం = నలుపు, సమయము
5. ఆమె చేసిన కృషి వల్లనే విజయం సాధించింది.
జవాబు:
కృషి = యత్నము, ఉద్యోగము
వ్యాకరణాంశాలు :
సంధులు :
రుగాగమ సంధి:
- పేదరాలు = పేద + ఆలు
- బీదరాలు = బీద + ఆలు
- బాలెంతరాలు = బాలెంత + ఆలు
- మనుమరాలు = మనుమ + ఆలు
పై ఉదాహరణలలో పూర్వపదాలుగా పేద, బీద, బాలెంత, మనుమ అనే పదాలున్నాయి. పరపదంగా “ఆలు” శబ్దం ఉంది.
సూత్రము – 1 : కర్మధారయ సమాసంలో పేదాది శబ్దములకు “ఆలు” శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది.
ఉదా :
- పేద + ర్ + ఆలు = పేదరాలు
- బీద + ర్ + ఆలు = బీదరాలు
- బాలెంత + ర్ + ఆలు = బాలెంతరాలు
- మనుమ + ర్ + ఆలు = మనుమరాలు
(పేదాదులు – పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, గొట్టు, అయిదువ, మనుమ)
సూత్రము – 2 : కర్మధారయ సమాసంలో తత్సమ పదాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వం, రుగాగమం వస్తాయి.
ఉదా :
- ధీర + ఉ + ర్ + ఆలు = ధీరురాలు
- గుణవంత + ఉ + ర్ + ఆలు = గుణవంతురాలు
- విద్యావంత + ఉ + ర్ + ఆలు = విద్యావంతురాలు
- శ్రీమంత + ఉ + ర్ + ఆలు = శ్రీమంతురాలు
- అసాధ్య + ఉ + ర్ + ఆలు = అసాధ్యురాలు
పూర్వపదమైన తత్సమానికి “అకారమునకు” ఉకారం వచ్చింది. దీనిని రుగాగమ సంధి అంటారు.
కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
జవాబు:
- లోకానుభవం : లోక + అనుభవం = సవర్ణదీర్ఘ సంధి
- అత్యుత్తమం : అతి + ఉత్తమం = యణాదేశ సంధి
- మూకాభినయం : మూక + అభినయం = సవర్ణదీర్ఘసంధి
సమాసాలు :
అ) కింది పదాలు చదవండి. విగ్రహవాక్యం తెలిపి, ఏ సమాసమో రాయండి.
జవాబు:
- పార్వతీపరిణయం = పార్వతి యొక్క పరిణయం – షష్ఠీతత్పురుష సమాసం
- పాతిక సంవత్సరాలు = పాతిక సంఖ్య గల సంవత్సరాలు – ద్విగు సమాసం
- యుగకవి = యుగకర్తయైన కవి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
- మయసభ = మయునిచే నిర్మించబడిన సభ – తృతీయా తత్పురుష సమాసం
వాక్యాలు :
ఈ క్రింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1. శైలజ సైకిలు తొక్కుతూ, పాట పాడుతున్నది.
జవాబు:
శైలజ సైకిలు తొక్కుచున్నది. శైలజ పాట పాడుతున్నది.
2. రామారావు అన్నం తిని, పడుకున్నాడు.
జవాబు:
రామారావు అన్నం తిన్నాడు. రామారావు పడుకున్నాడు.
3. సీతమ్మ బట్టలు ఉతికి, ఆరవేసింది.
జవాబు:
సీతమ్మ బట్టలు ఉతికింది. సీతమ్మ బట్టలను ఆరవేసింది.
4. శశిధర్ పరుగెత్తి, అలసిపోయాడు.
జవాబు:
శశిధర్ పరుగెత్తాడు. శశిధర్ అలసిపోయాడు.
అలంకారాలు :
స్వభావోక్తి అలంకారం :
ఉదా : జింకలు బిత్తరు చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.
వివరణ : పై వాక్యంలో జింకల స్వభావసిద్ధమైన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పారు.
లక్షణం : జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు.
ఉదా :
ప్రశ్న 1.
చల్లని గాలికి పూలతోటలోని మొక్కలు తలలూపుతున్నాయి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.
లక్షణం : జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా చక్కని పదజాలంతో చక్కగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి
అలంకారం అంటారు.
సమన్వయం : గాలికి పూలమొక్కలు కదలడాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పారు. కనుక ఇచ్చిన వాక్యంలో స్వభావోక్తి
అలంకారం ఉంది.
ప్రశ్న 2.
ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.
లక్షణం : జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా చక్కని పదజాలంతో చక్కగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి
అలంకారం అంటారు.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో నెమలి నాట్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించారు కనుక ఇచ్చినది స్వభావోక్తి అలంకారం.
ప్రశ్న 3.
కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మరచి గెంతుతున్నాయి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.
లక్షణం : జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా చక్కని పదజాలంతో చక్కగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి
అలంకారం అంటారు.
సమన్వయం : సెలయేటిలో చేపల ఈతను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించారు కనుక ఇచ్చినదానిలో స్వభావోక్తి అలంకారం ఉంది.
ప్రశ్న 4.
మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహరా కాస్తున్నారు.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.
లక్షణం : జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా చక్కని పదజాలంతో చక్కగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో సైనికుల పహారాను ఉన్నది ఉన్నట్లు వర్ణించారు కనుక ఇచ్చిన దానిలో స్వభావోక్తి అలంకారం ఉంది.
ప్రాజెక్టు పని :
క్యూ. ఆర్. కోడ్ను స్కాన్ చేయండి. నార్ల వెంకటేశ్వరరావు రచించిన శకునపక్షి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచించిన ‘ఆవకాయ మహోత్సవం’ నాటికలను చదివి మీ పాఠశాల సారస్వతసంఘ సమావేశంలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
పద్య మధురిమ :
చం|| తెలియని కార్యమెల్లఁ గడ తేర్చుట కొక్క వివేకిఁ జేకొనన్
వలయు నటైన దిద్దుకొన వచ్చుఁ బ్రయోజనమాంద్య మేమియుం
గలుగదు ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు చేత నద్దమున్
గలిగినఁ జక్కఁ జేసికొనుఁ గాదె నరుం డది చూచి భాస్కరా. !
భాస్కర శతకం – మారద వెంకయ్య
భావం : భాస్కరా ! తనకు తెలియని పనిని చక్కగా చేయడానికి తెలివైన వాడి సలహా తీసుకోవాలి. అలా అయితే ఆ పనిలో జాప్యం, కష్టం లేకుండా చేసుకోవచ్చు. ఫలితంలో కూడా కొరత ఏమీ కలగదు. నుదుట బొట్టు పెట్టుకొంటున్నపుడు అద్దం చేతిలో ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు కదా.
రచయిత పరిచయం :
రచయిత : తనికెళ్ళ దశ భరణి శేషప్రసాద్
జన్మస్థలం : పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం.
జననం : 14-07-1956
తల్లిదండ్రులు : లక్ష్మీనరసమ్మ, రామలింగేశ్వరరావు దంపతులు
కవితలు: అగ్గిపుల్ల, ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి – కవితా సంపుటాలు
నాటకాలు : అద్దెకొంప, ‘చల్ చల్ గుర్రం, కొక్కొరోకో, గార్ధభాండం, గోగ్రహణం
భక్తిగీతాలు : శభాష్ రా శంకరా ! ఆట గదరా శివ మకుటంతో
ప్రత్యేకతలు : రచయిత, నటుడు, గాయకుడు, సంభాషణా రచయిత, మిథునం సినిమాకు దర్శకుడు. 320 సినిమాలలో నటుడు. నంది, ఫిలింఫేర్ వంటి అవార్డులెన్నో పొందారు.
ఉద్దేశం :
‘కళారూపాలు’ ఆస్వాదించే వారికి ఆనందాన్ని కల్గిస్తాయి. మానవుడు సంఘజీవి. రకరకాల ఆట పాటలను నేర్చుకొన్నాడు. ఆనందించాడు. వాటిలో ఆనందం అనుభవించాడు. అదే కాలక్రమేణా కళారూపాలుగా మారాయి. హరికథ, బుర్రకథ, చిందు భాగవతం, యక్షగానం మొదలైనవన్నీ ఆ కోవకు చెందినవే, నాటక రంగం కూడా వాటిలోనిదే. నాటకరంగం ఔన్నత్యం తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
నేపథ్యం :
16వ శతాబ్దంలో నాటక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంతోమంది గొప్ప గొప్ప కవులు నాటకాలు రచించారు. నటీనటులు తమ ప్రతిభను ప్రదర్శించారు. అనేక నాటక సమాజాలు ఏర్పడ్డాయి. ఉన్నత శిఖరాలను ‘అధిరోహించిన నాటకరంగం సినిమా రంగానికి భూమిక. నాటకరంగం సమాజంలోని దురాచారాలను ఎత్తి చూపుతుంది. కొత్త పుంతలు తొక్కింది. అత్యంత ప్రాభవం ప్రఖ్యాతి గలిగిన నాటకరంగం గురించి ‘నేటి విద్యార్థులకు తెలియజేయాలనే ఆలోచనే దీని నేపథ్యం.
క్రియ – వ్యాసం :
ఒక విషయాన్ని గురించి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది వ్యాసం. వ్యాసానికి ప్రారంభం, విస్తరణ, లాభనష్టాల, ముగింపు అనేవి ప్రధానంగా ఉంటాయి. ఒక సమాచారాన్ని ఉదాహరణలతో చక్కగా అర్థం అయ్యేలా చెప్పేది వ్యాసం.
పదాలు – అర్ధాలు :
- ఆటవిడుపు = విరామం
- ఆదివాసులు = ఆదిమానవులు
- సొబగు = అందం
- దార్శనికులు = శాస్త్రవేత్తలు
- దృశ్యము = కనిపించేది
- ఘనత = గొప్పదనం
- వినోదం = ఆనందం, ఆహ్లాదం
- నర్తకులు = నాట్యకారులు
- అభినయం = నటన
- కావ్యేషు = కావ్యాలలో
- నాటకం = నాటకం
- రమ్యం = బాగుంటుంది
- ఆలంబన = ఊత
- రక్తి = అందగించడం
- సమన్విత = సమన్వయం
- లోకవృత్తం = లోకంలోని చరిత్రను
- అనుకరణం = అనుకరించేది
- నాట్యం = నాట్యము
- జనరంజకం = జనులను ఆనందింపచేయడం
- భాగవతులు = ప్రదర్శకులు
- జీవం = ప్రాణం
- విస్తృతము = ఎక్కువైనది
- సమాంతరం = అదే వరుసలో
- ఏకోన్ముఖం = ఒకే లక్ష్యం
- సమాహారం = కలయిక
- తొలి = మొదటి
- ఉపాఖ్యానం = చిన్న కథ
- పాదుకలు = పాదరక్షలు
- ఉద్దండులు = చాలా గొప్పవాడు
- నిరక్షరాస్యులు = చదువుకోనివారు
- వాటిక = వీధి
- యుక్తం = కూడి
- హర్షధ్వానం = చప్పట్లు
- వేదన = బాధ
- ఇతివృత్తం = కథ
- దురాచారం = చెడు ఆచారం
- పరిష్కారం = తీర్పు
- ప్రేక్షకులు = చూసేవారు
- కిరీటం = మకుటం
- డైలాగు = మాట
- మెల్లిగా = నెమ్మదిగా
- జోరు = తీవ్రత
- భుక్తి = తిండి
- పీడితజనులు = బాధితులు
- భరితము = నిండినది
- క్రయం = అమ్మకం
- ఆద్యంతం = మొదటి నుంచి చివరి దాకా
- వితంతువు = భర్త చనిపోయిన
- కనుమరుగు = మాయము
- తరచూ = ఎక్కువగా
- ఎడ్యుకేషన్ = విద్య
- ఇహ = ఇక
- సంచలనం = కదలిక
- సున్నితత్వం = సుకుమారం
- ఆకట్టుకొను = ఆకర్షించు
- నిర్వహించడం = నడపడం
- సారథి = నడిపేవాడు
- చైతన్యం = కదలిక
- నిరంతరం = ఎల్లప్పుడూ
- సమ = సమానమైన
- ఆహార్యం = అలంకరణలు
- వలయాకారం = గుండ్రంగా
- ఉత్తేజ = ప్రభావితం
- శ్రవ్యము = వినతగిన
- శ్రోత = వినేవాడు.
- గాత్రము = గొంతు
- గుమిగూడి = గుంపుగా చేరి
- ప్రాచుర్యం =ప్రసారం
- ప్రయోక్త = ప్రయోగించేవాడు
పద్యాలు – ప్రతిపదార్థాలు- భావాలు
పద్యం:
శా॥ ‘బావా ! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే భ్రాతల్పుతుల్ చుట్టముల్?
నీ వాల్లభ్యముబట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే ?
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె ? నీ తేజంబు హెచ్చించుచున్
ప్రతిపదార్థం:
- బావా ! = ఓ బావా ! (ఓ దుర్యోధనా !)
- ఈవు = నీవు
- ఎప్పుడు వచ్చితివి = ఎప్పుడు వచ్చావు ?
- భ్రాతల్ = అన్నదమ్ములు
- సుతుల్ = ‘నీ కొడుకులు
- చుట్టముల్ = మీ బంధువులు
- సుఖులే = సుఖంగా ఉన్నారా ?
- నీవాల్లభ్యము = నీ అభిమానం
- పట్టు = పొందుతున్న
- కర్ణుడును = రాధేయుడును
- మన్నీలున్ = పరిపాలకులు
- సుఖ + ఉపేతులే = సుఖంగా ఉన్నారా !
- మీ = మీ యొక్క
- వంశ = వంశం యొక్క,
- ఉన్నతీ = వృద్ధిని
- కోరు = కాంక్షించే
- భీష్ముడును = గాంగేయుడును
- మీ మేల్ + కోరు = మంచిని కోరే
- ద్రోణ + ఆది = ద్రోణుడు మొదలగు
- ‘భూదేవుల్ = బ్రాహ్మణులను
- నీ తేజంబు = నీ తేజస్సును
- హెచ్చించుచున్ = పెంచుతూ
- సేమము = క్షేమాన్ని
- మై = నీ వైపు
- ఏసంగుదురె = కలిగిస్తున్నారా ?
భావము : బావా ! దుర్యోధనా ! ఎప్పుడొచ్చావు ? నీ అన్నదమ్ములు, పిల్లలు బంధువులు సుఖంగా ఉన్నారా ? నీ అభిమాన పాత్రులయిన కర్ణుడు, పాలకులు సుఖంగా ఉన్నారా? మీ వంశవృద్ధిని కోరు భీష్ముడు, మీ మంచిని కోరే ద్రోణుడు మొదలైనవారు నీ తేజస్సును పెంచుతూ క్షేమాన్ని కల్గిస్తున్నారా? అని శ్రీకృష్ణుడు అన్నాడు.
పద్యం:
ఉ॥ విటలాక్షుండిపు డెత్తివచ్చినను రానీ, యన్నదమ్ములన్ నమన్
విటతాడంబుగ బాసిపోయినను పోనీ, కృష్ణుడే వచ్చి వ
ద్దిటు పార్థా యననీ మరేమయినగానీ, లోకముల్ బెగ్గిలన్
పటుదర్పంబుగ నిల్పి యీ గయుని ప్రాణంబేను రక్షించెదన్
ప్రతిపదార్థం:
- ఇపుడు = ఇప్పుడే
- ఎత్తి = దండెత్తి
- వచ్చినను = వస్తుంటే
- రానీ = రానియ్యి
- అన్న + తమ్ముల్ = నా సోదరులే
- ననున్ = నన్ను
- నిటతోడంబుగ = ఒంటి తాడిచెట్టులా
- పాసిపోయినను = విడిచిపోయినా
- పోనీ = పోనియ్యి
- కృష్ణుడు + ఏ = శ్రీకృష్ణుడే
- వచ్చి = ఏతెంచి
- పార్థా = అర్జునా
- వద్దు + ఇటు =ఈ పని వద్దు
- అననీ = అననియ్యి
- మరి + ఏమి + అయిన + కానీ = ఇంకేదయినా జరగనీ
- లోకముల్ = లోకాలు
- బెగ్గిలన్ = బెదిరేలాగ
- ఏను = నేను
- పటుదర్పంబుగ = మిక్కిలి గర్వంతో
- ఈ గయుని = ఈ గయుడిని
- నిల్పి =ఇక్కడే ఉంచి
- ప్రాణంబు = అతని ప్రాణం
- రక్షించెదన్ = రక్షిస్తాను
భావము: ఆ పరమేశ్వరుడు దండెత్తి వస్తే రానీ, సోదరులే నన్ను విడిచినా, కృష్ణుడే వద్దన్నా, ఏం జరిగినా నేను గయుని కాపాడి తీరతాను. అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు.
పద్యం:
సీ॥ ఇచ్చోట నే సత్కవీంద్రుని కమ్మని
కలము నిప్పులలోన గరగి పోయె
ఇచ్చోట నే భూములేలు రాజమ్యని
యధికార. ముద్రికలంతరించే
ఇచ్చోట నే లేత యిల్లాలి నల్లపూ
సలసౌరు గంగలో గలసి పోయె
ఇచ్చోట నెట్టి పేరెన్నికం గనుగొన్న
చిత్రలేఖకుని కుంచియ నశించె
తే.గీ. ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జె గదలించియాడు రంగస్థలంబు
యిది మరణదూత తీక్షణ దృష్టులొలయ
నవని బాలించు భస్మ సింహాసనంబు !
ప్రతిపదార్థం:
- ఇ + చోటనే = ఇక్కడే (ఈ శ్మశానంలోనే)
- సత్కవి + ఇంద్రుని = మంచి కవీశ్వరుని
- కమ్మని కలము = చక్కని కలం
- నిప్పులలోన = మంటలలో
- కరిగిపోయె = కరిగిపోయింది
- ఈ + చోటనే = ఇక్కడే (ఈ శ్మశానంలోనే)
- భూములు + ఏలు = దేశాలు పాలించే
- రాజన్యుని = మహారాజు యొక్క
- అధికార ముద్రికలు = రాజముద్రికలు
- అంతరించె = నశించిపోయాయి
- ఈ చోటనే = ఇక్కడే (ఈ శ్మశానంలోనే)
- లోత + ఇల్లాలి =చిన్ని గృహిణ యొక్క
- నల్లపూసల సౌరు = నల్లపూసల అందం
- గంగలో కలిసిపోయె = నశించిపోయింది
- ఈ + చోటన్ = ఇక్కడ (ఈ శ్మశానంలోనే)
- ఎట్టి = ఎంతో = కీర్తిని
- పేరు + ఎన్నికన్ = సంపాదించుకొన్న
- కనుగొన్న = సంపాదించుకొన్న
- చిత్రలేఖకని = చిత్రకారుని
- కుంచియ = కుంచె
- నశించె = నశించి పోయింది
- ఇది = ఈ శ్మశానం
- పిశాచులతో = దయ్యాలతో
- నిటల + ఈక్షణుండు = నుదుట కన్ను గల శివుడు
- గజ్జె = కాలిగజ్జె
- కదలించి = చలింపచేసి
- ఆడు = (నాట్యం) తాండవం చేసే
- రంగస్థలంబు = వేదిక
- ఇది = ఈ శ్మశానం
- మరణదూత = యమకింకరుడు
- తీక్షణ = తీవమైన
- దృష్టులు + ఒలయ =చూపులు అతిశయించగా
- అవనిన్ =భూమిని
- పాలించు = పరిపాలించే
- భస్మ = బూడిద అనెడు
- సింహాసనంబు = సింహాసనం
భావము : ఈ శ్మశానంలో గొప్ప కవిగారి కలం నిప్పులలో కాలిపోయింది. ఇక్కడే చక్రవర్తుల రాజముద్రికలు నశించాయి. ఇక్కడే చిన్ని ఇల్లాలి నల్లపూసలు నశించిపోయాయి. ఇక్కడే విఖ్యాతి గడించిన చిత్రకారుని కుంచె కాలిపోయింది. ఈ శ్మశానం శివుడు దయ్యాలతో తాండవం చేసే వేదిక. ఇది యమకింకరుడు తీవ్రమైన చూపులతో భూమిని పాలించే బూడిద .అనెడు సింహాసనం.