Access to the AP 9th Class Telugu Guide 14th Lesson ఆకుపచ్చశోకం Questions and Answers are aligned with the curriculum standards.
ఆకుపచ్చశోకం AP 9th Class Telugu 14th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి :
ఆకుపచ్చ శోకం

తోటను అమ్మేసుకున్నాను.
తోటకు వీడ్కోలు
తాతల నాటి తియ్యని జ్ఞాపకాల్ని అమ్మేసుకున్నాను.
నా బాల్యాన్ని అమ్మేసుకున్నాను.
నా బాల్యంలో
తోటలో చెట్లంటే నేనే
చెట్ల ఆకుల సవ్వడులంటే నేనే
చెట్లమీద వాలే గువ్వలంటే నేనే
గువ్వల రెక్కల స్వరాల గీతాలు
సంగీతాలంటే నేనే
నన్ను నేను అమ్మేసుకున్నాను.
నా అల్లరి రోజులప్పుడు
నాన్న నన్ను తిట్టినప్పుడు.
చిటారు కొమ్మెక్కి నేను దాక్కొన్న చెట్టేదో
నా మనుమడికి చూపించాలనే ఆశను అమ్మేసుకున్నాను.
తోటలో తువ్వాయితో పాటు గెంతుతూ గెంతుతూ
నేను కాలు విరగ్గొట్టుకున్న చోటేదో
నా మనుమరాలికి చూపించాలనే
మురిపాలను అమ్మేసుకున్నాను ఇన్నాళ్ళూ
మా తోటలోని మామిళ్ళు
మా వంటింటి రంగూన్ జాడీలో
జారిపడి
ఆవకాయగా రుచికరం ఆ రుచులనమ్మేసుకున్నాను
కాలువమీద తాటిపట్టె వంతెనపై గెంతుతూ
కాలువ దాటుతున్న అద్భుత దృశ్యాల్ని
గొప్ప సాహస కృత్యాలుగా
మా తాతయ్య ఊరు ఊరంతా చాటుతూ
మీసాన్ని మెలేయడాన్ని అమ్మేసుకున్నాను
తోటనమ్మినందుకు
బోలెడు సొమ్ములొచ్చాయనుకుంటారు గానీ
పల్లెతో నాకున్న జన్మసంబంధాలన్నీ
ఎండదెబ్బ తగిలిన పిట్టల్లా రాలిపోయాయన్న
బాధల్నెవరు గుర్తిస్తారు ?
నా గుండె కోతల్ని ఎవరు పట్టించుకుంటారు?
తోటకోసమైనా అప్పుడప్పుడు పల్లెకొచ్చేవాడ్ని
ఇప్పుడెవరి కోసం రాను !
తోటనమ్మిన డబ్బుతో మా పిల్లలకోసం
ఒక ఇల్లు కొనగలనేమో గానీ
కొంతైనా పల్లెనివ్వగలనా ?
సమానంగా డబ్బుని పంచగలనేమో కానీ
కొంతైనా పల్లెతనాన్ని వారిలో పెంచగలనా ?
ఎన్ని డబ్బులుంటే మాత్రం ఏం? నేనిప్పుడు ధనవంతుడ్ని కాను
పల్లెను కోల్పోయిన దుఃఖవంతుడ్ని తోటనమ్ము కున్నా నన్న ఇంత బాధలోనూ
ఒక్కటే సంతోషం…!
తోటను చేపల చెరువుగా తవ్వేవాడికో
తోటలో రొయ్యల ఫాక్టరీ కట్టేవాడికో కాకుండా
తోటను తోటగా పెంచే, ప్రేమించే
రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం…!
![]()
ఆలోచనాత్మక ప్రశ్నలు :
ప్రశ్న 1.
మొక్కలు, చెట్లు, పూలు వీటితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి.
జవాబు:
మాది పల్లెటూరు. మొక్కలంటే మాకందరికీ చాల సరదా. మాకు విశాలమైన పెరడు ఉంది. పెరట్లో చాలా రకాల
పూలమొక్కలున్నాయి. ఉదయం, సాయంత్రం వాటికి నేనే నీళ్లు పోస్తాను, కలుపు తీస్తాను. అవి పూలుపూసిన రోజు నాకు పండుగే. ‘తాతా! పూలు, అమ్మమ్మా పూలు’ అంటూ పూజకు నేనే పూలు కోసి ఇస్తాను. అమ్మా ! మిహిరా! బంగారుతల్లి ! పూలేవమ్మా ! అని అందుకొంటారు.
మా తమ్ముడు శింబుగాడున్నాడు, వాడసలు పేరు శ్రీవాత్సవ. వాడైతే చెట్లెక్కేసి జామకాయలు, సపోటాకాయలు, మామిడికాయలు కోసేస్తూ ఉంటాడు. మేం బడి నుండి ఇంటికి వచ్చేక తోటలోనే ఎక్కువగా గడుపుతాం. మా తాత, బామ్మ కూడా మాతోనే గడుపుతారు.
ప్రశ్న 2.
తోటను అమ్మేసుకున్న కవి ఏమేమి కోల్పోయాను అని బాధపడుతున్నాడు ?
జవాబు:
కవి తన తోటను అమ్మేసుకొని చాలా కోల్పోయేడు. తన చిన్ననాటి తియ్యటి జ్ఞాపకాలు అమ్మేసుకొన్నాడు. తనకు చాలా ఇష్టమయిన చెట్ల ఆకుల సవ్వడులను, చెట్లమీద వాలే గువ్వలను అమ్మేసుకున్నాడు. తను చెట్టెక్కిన కొమ్మను తన మనమడికి చూపించాలన్న ఆశను అమ్మేసుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆవకాయ రుచులను అందించిన మామిడిచెట్టును అమ్మేసుకున్నాడు. కాలువమీద తాటిపట్టెవంతెనపై తను గెంతిన దృశ్యానికి గర్వించిన తన తాత పౌరుషాన్ని కూడా అమ్మేసుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే కవి తన ప్రతీ తియ్యటి జ్ఞాపకాన్ని తన అనుభవాలను డబ్బుకోసం కక్కుర్తిపడి కోల్పోయానని బాధపడ్డాడు.
ప్రశ్న 3.
పొలాన్ని రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం అని కవి ఎందుకన్నాడు?
జవాబు:
పొలాన్ని రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం అని కవి ఎందుకన్నాడంటే రైతైతే తోటను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తాడు. పసిపిల్లను పెంచినట్లు జాగ్రత్తగా తోటను పెంచుతాడు. తోటకు నష్టం కలగనివ్వడు. డబ్బుకు ఆశపడడు. తను అప్పులపాలైనా తోటను పెంచడం మానడు.
![]()
పేజి 187లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
అందరికీ చెట్టొక పానకంలో పుడక అని కవి ఎందు కంటున్నాడు ?
జవాబు:
‘పానకంలో పుడక’ అనే జాతీయానికి అర్థం అడ్డుపుల్ల అని. నగరవాసులకు ఆధునీకరణ అనే మాయలో ప్రకృతి సహజ వనరులలో ఒకటైన చెట్టు అడ్డుగా కనబడు తోంది. కరెంటు తీగల ఏర్పాటుకు గాని, రహదారుల విస్తరణకు గాని, పెరిగిపోతున్న పరిశ్రమల వల్లగాని, విరివిగా వెలుస్తున్న ఆకాశాన్నంటే మేడలు గాని, సందుకొకటి అన్నట్లు నిలుస్తున్న సెల్ఫోన్ టవర్లు గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నిటికో అడ్డుగా కనబడుతోంది చెట్టు. అందుకే కవి అందరికి ‘చెట్టొక పానకంలో పుడక’ అని అన్నారు.
ప్రశ్న 2.
నగరంలో చెట్టు ప్రతి దానికి అడ్డమే. దీని గురించి చర్చించండి.
జవాబు:
నగరంలో చెట్టు రహదారుల విస్తరణకు అడ్డంగా నిలబడుతుంది. జనాభాకు సరిపడా భవనాలు కట్టడానికి చెట్టు అడ్డం వస్తుంది. కర్మాగారాలు, ఆఫీసులు, వసతి భవనాలు, ఆసుపత్రులు, బస్టాండులు, ప్రయాణీకుల విశ్రాంతి భవనాలు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, వ్యాపార భవనాలు, మార్కెట్లు, ఫ్లైఓవర్లు, మొదలైన వాటి నిర్మాణానికి నగరంలో చెట్టు అడ్డం వస్తుంది. విద్యాలయాలు, ప్రయోగశాలలు, క్లబ్బులు, పబ్బులు, జూదశాలలు, సారాకోట్లు మొదలైనవాటి నిర్మాణానికి కూడా చెట్టే అడ్డంగా నిలబడుతుంది. నగరంలో ఏం చేయాలన్నా, ఏం నిర్మించాలన్నా అన్నింటికీ అడ్డంగా నిలబడేది పదిమందికీ నీడనిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యాన్ని నిర్మూలిస్తూ ఎవ్వరూ చేయలేనంత ఉపకారం మానవులకు చేస్తూ, అనేక బాధలు భరిస్తూ మౌనయోగిలా నిలబడిన చెట్టే అడ్డం వస్తుంది.
పేజి 188లోని ప్రశ్నలు :
ప్రశ్న 3.
‘గ్లోబల్ వార్మింగ్’ అంటే ఏమిటి ?
జవాబు:
‘గ్లోబల్ వార్మింగ్’ అనేది భూమి యొక్క ఉపరితలంపై ఉష్ణోగ్రతల్లో క్రమంగా పెరుగుదల. గ్లోబల్ వార్మింగ్కు అనేక కారణాలున్నాయి. గృహ మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం మనం అడవులను నాశనం చేస్తున్నాము. ఇది పర్యావరణ అసమతుల్యతకు దారి తీస్తుంది. తద్వారా భూతాపం పెరుగుతోంది. ఇంకా వాహనాల వినియోగం, ఎ.సి.లు ఫ్రిజ్ల వినియోగం ఇలా ఎన్నో మానవ తప్పిదాలు ఈ గ్లోబల్ వార్మింగ్కు కారణమౌతున్నాయి.
![]()
అవగాహన – ప్రతిస్పందన :
ఇవి చేయండి :
కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
ప్రశ్న 1.
‘ఆకుపచ్చ శోకం’ పాఠ్యాంశాన్ని భావయుక్తంగా చదవండి.
జవాబు:
ఉపాధ్యాయుని అనుసరించండి.
ప్రశ్న 2.
మనిషిని కవి ఆక్టోపస్ తో ఎందుకు పోల్చారో చెప్పండి.
జవాబు:
ఆక్టోపస్ వేగంగా విస్తరిస్తుంది. చుట్టుప్రక్కల జీవులను తింటుంది. మనిషి కూడా వేగంగా విస్తరిస్తున్నాడు. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. అందుకే మనిషిని కవి ఆక్టోపస్ తో పోల్చాడు.
ప్రశ్న 3.
‘లెక్కల్లో మునిగిపోయిన మనిషి, మొక్కల్నేం పట్టించుకుంటాడు’ అని కవి ఎందుకు అన్నారు ?
జవాబు:
మనిషికి లాభనష్టాల లెక్కలెక్కువ. ఇలాచేస్తే తనకెంత లాభం వస్తుంది, ఎన్ని తరాలదాకా తనకు ఆ డబ్బు సరిపోతుంది.
ప్రకృతిని ఎలా నాశనం చేయాలి. తనెలా సుఖపడాలి. ఇవే మనిషి స్వార్ధంతో వేసే లెక్కలు.
![]()
ప్రశ్న 4.
పచ్చటి లోకాన్ని ముందు తరాలకు హామీగా ఇవ్వాలంటే మనమేం చేయాలి ?
జవాబు:
చెట్లను నరకకూడదు. చెట్లను పెంచాలి. మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించాలి. ప్రతి మనిషి తన పుట్టినరోజున కనీసం 10 మొక్కలైనా నాటి, వాటిని పెంచాలి. అప్పుడే భావితరాలకు పచ్చటిలోకం అందుతుందని కవి భావన. మొక్కలెక్కువగా నాటితే వర్షాలెక్కువ పడతాయి. పాడిపంటలకు లోటుండదు. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని కవి ఉద్దేశం.
ఆ) కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తులసి గౌడ కర్ణాటక రాష్ట్రంలోని హెన్నాలి గ్రామానికి చెందినది. ఆమె పర్యావరణ రక్షకురాలు. ఆమె పాఠశాల విద్యకు కూడా నోచుకోలేదు. అయినా పర్యావరణ పరిరక్షణకు ఎనలేని సేవ చేస్తూనే ఉంది. ఆమె రూపాయి పావలా జీతంతో ‘వనమాలి” ఉద్యోగంలో చేరింది. మొక్కలతో మమేకమైంది. మొక్కల్ని కన్న బిడ్డలుగా భావించింది. తులసి మూడువందల రకాల అటవీ వృక్షాల సమాచారాన్ని అలవోకగా చెప్పగలదు. మొక్కల పేర్లు, వాటిలోని ఔషధ గుణాల గురించి వివరించగలదు. అందుకే అటవీ విజ్ఞాన సర్వస్వంగా గుర్తింపు పొందింది. అక్కడి స్థానికులు తులసిని ‘వృక్షదేవి’గా పిల్చుకుంటారు. ఒక్క ఏడాది కాలంలో ఆమె 30,000 మొక్కలు నాటింది. ఆమె సేవలను గుర్తించి, భారత ప్రభుత్వం 26 జనవరి 2020న ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
తులసి గౌడను స్థానికులు ఏమని పిలుస్తున్నారు ?
జవాబు:
స్థానికులు తులసి గౌడను ‘వృక్షదేవి’ అని పిలుస్తారు.
ప్రశ్న 2.
తులసి గౌడ మొక్కల్ని ఎలా భావించింది ?
జవాబు:
తులసి గౌడ మొక్కల్ని తన కన్నబిడ్డలుగా భావించింది.
![]()
ప్రశ్న 3.
తులసిగౌడను ఏ అవార్డుతో సత్కరించారు ?
అ) పద్మ
ఆ) భారతరత్న
ఇ) పద్మశ్రీ
జవాబు:
(ఇ) పద్మశ్రీ
ప్రశ్న 4.
ఎన్నో విషయాలు తెలిసి ఉండడం అని అర్థాన్నిచ్చే పదం ఏది?
జవాబు:
ఎన్నో విషయాలు తెలిసి ఉండడం అని అర్థాన్నిచ్చే పదం ‘విజ్ఞాన సర్వస్వం’.
ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఏడాదికి తులసిగౌడ ఎన్ని మొక్కలు నాటింది?
ఇ) కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
నటరాజన్ పుట్టింది తమిళనాడులోని పుదుక్కోటలో, నటరాజనికి రెండేళ్లున్నప్పుడే తల్లి భాగీరధి చనిపోయింది. తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్ కటిక దరిద్రం అనుభవించాడు. చెన్నపట్టణంలో బతకలేని స్థితి. దాంతో కొడుకుని వెంటబెట్టుకొని తెనాలి వచ్చేశాడు అయ్యర్. అప్పటికి తమిళం తప్ప తెలుగు రాని నటరాజన్ కి రోజు గడవడం చాలా కష్టమైపోయింది.
ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలి అనుకున్నాడు. వచ్చే పోయే కస్టమర్లతో లల్లాయి మాటలు మాట్లాడేస్తే ఆ మాత్రం తెలుగు నేర్చుకోవడం ఏమాత్రం కష్టం కాదు. కానీ నటరాజన్ త్వరగా నేర్చుకోవాలనుకున్నాడు. వెంకటేశ్వర్రావు అనే తెలుగు టీచర్ దగ్గరికి వెళ్లేవాడు. అమిత ఆసక్తితో తెలుగుని వంట పట్టించుకున్నాడు. ఇడ్లీ పొట్లాలు కట్టే కాగితం ముక్కను కూడా వదిలిపెట్టేవాడు కాదు, హెూటల్లో పెట్టిన తెలుగు సినిమా పాటల్ని వింటూ పదాల్ని పెదాలపై కూర్చేవాడు.
రామలింగేశ్వరుడి గుడికి ఎదురుగా ఉన్న మునిసిపల్ లైబ్రరీలో మారీస్పేటలోని ఆంధ్రరత్న లైబ్రరీలో దొరికిన పత్రికనల్లా నమిలి మింగేసేవాడు. బావగారి హెూటల్లో పనిచేస్తున్నా నటరాజన్ చూపంతా సాహిత్యం పైనే ఉండేది. హెూటల్లో కాస్త చదువుకున్న వారిలా అనిపించేవారు కనిపిస్తే చాలు ఏవైనా పుస్తకాలు ఉంటే ఇస్తారా అని సిగ్గు విడిచి అడిగేవాడు. నెలరోజుల పాటూ పని చేయించుకుని జీతం అడిగిన పని వాళ్ళని తన్ని బయటకు నెట్టేసిన యజమానులు, తిని పారేసిన విస్తరాకుల దగ్గర కుక్కల్లా సర్వర్లను చూసే హెూటల్ కామందులు, సిద్ధాంతాలు వల్లెవేసే తెల్లటోపి రాయుళ్లు గల లోకాన్ని పచ్చిగా చూసాడు నటరాజన్.
గుండెల్లో సుళ్లు తిరిగిన ఈ భావాలన్నీ అక్షరాలయ్యాయి. ఎక్కడపడితే అక్కడ ఏమొస్తే అది రాసేసేవాడు. గురజాడవారి కన్యాశుల్కంలో బుచ్చమ్మ అంటే నటరాజన్కు ఇష్టం. ఒకసారి అన్నపూర్ణ అనే మళయాళీ వితంతువు తారసపడింది. ఆమెను వివాహం చేసుకున్నాడు. సంసారం నడవడం కోసం సాయంత్రాలు వేడివేడి గారెలు, మిరపకాయ బజ్జీలు అమ్మేవాడు. అదే చేత్తో మంచీ చెడూ, అపస్వరాలు, ఏది సత్యం, చీకటి తెరలు లాంటి నవలలు, 100కి పైగా కథలు రాశాడు. ‘శారద’ అనే కలం పేరుతో రచనలు చేశాడు. ఈయన శారద నటరాజన్ గా ప్రసిద్ధుడు.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
వంట పట్టించుకోవడం అంటే అర్థం ఏమిటి?
జవాబు:
వంట పట్టించుకోవడం అంటే పూర్తిగా అవగాహన చేసుకోవడం అని అర్థం.
ప్రశ్న 2.
నటరాజన్ జీవితంలో మీకు గొప్పగా అనిపించిన అంశం ఏమిటి ?
జవాబు:
తమిళవాడై ఉండీ తెలుగులో వంద కథలు రాయడం నటరాజన్ జీవితంలో నాకు గొప్పగా అనిపించిన అంశం.
![]()
ప్రశ్న 3.
శారద నటరాజన్ రాసిన నవలల పేర్లు రాయండి.
జవాబు:
మంచీచెడూ, అపస్వరాలు, ఏది సత్యం, చీకటి తెరలు ఆయన వ్రాసిన నవలలు.
ప్రశ్న 4.
నటరాజన్ తల్లిదండ్రుల పేర్లు రాయండి.
జవాబు:
భాగీరథి, సుబ్రహ్మణ్య అయ్యర్లు ఆయన తల్లిదండ్రులు.
ప్రశ్న 5.
పై కథనం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
హోటల్ యజమాన్లు సర్వర్లను ఎలా చూస్తారు ?
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘ఆకుపచ్చ శోకం’ అనే పేరు పాఠ్యాంశానికి ఎలా సరిపోతుందో వివరించండి.
జవాబు:
‘ఆకుపచ్చ శోకం’ అనే పేరు పాఠ్యాంశానికి సరిపోతుంది. ఎందుకంటే ఇది చెట్టు యొక్క శోకం. కనుక ఈ పేరు సరిగ్గా సరిపోయింది. కాని ‘నరఘోష’ అనే పేరు పెట్టి ఉంటే ఇంకా బాగుండునని నా ఉద్దేశం.
ప్రశ్న 2.
పర్యావరణ పరిరక్షణకు మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి ?
జవాబు:
పర్యావరణ పరిరక్షణకు మనిషి స్వార్థం వదలాలి. చెట్లను నరకకూడదు. చెట్లు నరికితే దానికి 10 రెట్లు చెట్లు పెంచే పూచీ నరకినవారికి అప్పజెపుతూ చట్టం చేయాలి. కఠినంగా అమలు జరపాలి. ఎన్ని చదరపు గజాలలో ఇల్లుకాని, భవనంకానీ నిర్మించారో అన్ని చదరపు గజాల స్థలంలో ఎక్కడైనా మొక్కలు నాటి పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి మనిషీ తన పుట్టిన రోజున కనీసం 10 మొక్కలు నాటి పెంచాలి. నీటిని, గాలిని, భూమిని కలుషితం చేయకూడదు. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యం, మెత్తమెత్తని కబుర్ల వల్ల, ఉపన్యాసాల వల్ల, ఫ్లెక్సీల వల్ల సాధ్యంకాదు.
![]()
ప్రశ్న 3.
ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదల్చుకున్నారు ?
జవాబు:
ఆకుపచ్చ శోకం పాఠం ద్వారా కవి చాలా విషయాలు చెప్పదలుచుకొన్నారు. చెట్లు కొట్టకండి. మొక్కలు నాటండి. పెంచండి. మనకు చెట్లు నీడనిస్తాయి. ఆహారం ఇస్తాయి. నీటినిస్తాయి. ఆక్సిజన్ ఇస్తాయి. కార్బన్ డయాక్సెడ్ లాంటి విషవాయువులను పీల్చుకొంటాయి. మనకు ఆరోగ్యాన్నిస్తాయి. భూతాపం తగ్గిస్తాయి. కాబట్టి చెట్లను పెంచండి. మానవులను కాపాడండి. భవిష్యత్ తరాలను కాపాడండి. అని కవి చెప్పదలచుకొన్నాడు.
ప్రశ్న 4.
‘అందరికీ చెట్టొక పానకంలో పుడక’ ఈ వాక్యం గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో రాయండి.
జవాబు:
పానకం తియ్యగా ఉంటుంది. అలా త్రాగుతుంటే తియ్యగా, మధురంగా, హాయిగా ఉంటుంది. కానీ మధ్యలో పుడకవస్తే ఆ తీయదనం, మాధుర్యం, హాయి ఆగిపోతుంది. చిరాకు కల్గుతుంది. అసహ్యం వేస్తుంది. అలానే మనిషి తన అభివృద్ధిలో భాగంగా చెట్టును పానకంలో పుడకలా భావించడం అత్యంత దారుణాతి దారుణమైన దురదృష్టం.
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘చెట్టు ఆవేదనను’ ఏకపాత్రాభినయం చేయడానికి ప్రదర్శన పాఠం తయారు చేయండి.
జవాబు:
నేను చెట్టునర్రా ! మీరు ఎప్పుడైనా బాగా మారుమూల పల్లెటూళ్లకు వెళ్ళినా, అడవులకు వెళ్ళినా మా వాళ్లంతా కన్పిస్తారు. పూర్వం ఇళ్లు తక్కువగా ఉండేవి, మనుషులకిన్ని ఆలోచనలుండేవికావు, అందుకే సుఖంగా బ్రతికేదాన్ని
మీకు తినడానికి తిండిస్తాను, మంచి గాలినిస్తాను, విషవాయువులు నేనే పీల్చుకొంటాను, మీకు ఆరోగ్యం ఇస్తాను, నీడనిస్తాను, మీ పిల్లలు నా పైకెక్కుతారు, చుట్టూ పరుగెడతారు, ఆడుకొంటారు, హాయిగా ఉంటారు.
నన్ను నరికేసి రోడ్లు విస్తరిస్తున్నారు. నన్ను చంపేసి భవనాలు నిర్మిస్తున్నారు. నన్ను కూల్చేసి కరెంటులైన్లు వేస్తున్నారు, మీ అభివృద్ధికి నేను అడ్డం అనుకొనే మీ అమాయకత్వానికి నాకు నవ్వు వస్తోంది. మీ అభివృద్ధి నా మరణంతోనే జరుగుతుంది అనుకొంటే నేనానందంగా మరణిస్తాను.
కానీ, మీ జీవితానికి, ఆరోగ్యానికి, ఆనందానికి నేనే కారణమని గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని పెంచండి. సంతోషించండి. మీకు చేతులు (నా కొమ్మలు) ఎత్తి దండం పెడుతున్నాను, మా జాతిని నాశనం చేయకండి. మీ భవిష్యత్తును, మీరే పాడు చేసుకోకండి. మరొకసారి ఆలోచించండి.
![]()
ప్రశ్న 2.
గ్లోబల్ వార్మింగ్ ద్వారా సంభవించబోయే విపత్తుల గురించి రచయిత చేసిన హెచ్చరికలను మీ సొంత మాటలలో
వ్యాసంగా రాయండి.
జవాబు:
గ్లోబల్ వార్మింగ్ వస్తే భూతాపం పెరుగుతుంది. ఆ తాపం తట్టుకోలేక కొంత భూమి ఎడారిగా మారుతుంది. పంటలు సరిగ్గా పండవు, మొక్కలు బతకవు. వర్షాలు తగ్గుతాయి, కరువు పెరుగుతుంది. ధ్రువాల దగ్గర మంచు కరుగుతుంది. నదులు, సముద్రాలు పొంగుతాయి. భూమి ముంపుకు గురౌతుంది. ఆధునికతకు తీరని నష్టం కలగవచ్చు.
ప్రశ్న 3.
పల్లె పట్నం తేడా లేకుండా చెట్లు కనుమరుగు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
స్నేహితురాలికి లేఖ
అప్పాపురం,
X X X X
ప్రియమైన స్నేహితురాలు లలితకు,
నీ స్నేహితురాలు సాత్విక రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవూ బాగా చదువుతున్నావని అనుకుంటున్నాను. ఇటీవల మా ఊళ్ళో రోడ్ల విస్తరణ నిమిత్తం పెద్ద పెద్ద చెట్లన్నీ నరికేశారు. మాది పల్లెటూరు. పచ్చని చెట్లతో అలరారుతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో అభివృద్ధి పేరు మీద మా ఊళ్ళో చాలా మార్పులు వచ్చాయి. పట్నం, పల్లె అనే తేడా లేకుండా ప్రతిచోటా చెట్లకు రంపపు కోత తప్పడం లేదు. అపార్టుమెంటులు, సెల్వర్లు, పరిశ్రమలు చెట్ల జీవాన్ని తీస్తున్నాయి. పర్యావరణం పరిరక్షణ అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నారు కానీ ఆచరణలో శూన్యం. మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారమని తెలుసుకోలేకపోతున్నాం. చెట్లను నరికి ఇంటికి కలపగా వాడుకొనే వారు తెలుసుకోవడం లేదు చెట్ల పెంపకాన్ని. రేపటి రోజున చెట్లు లేకపోతే మన బతుకు ఏంటి అని ఆలోచించే వారెవరు? నిలువ నీడ లేకుండా పోయే పరిస్థితిని మనమే తెస్తున్నాం. చెట్లను నరికి చావును కొని తెచ్చుకుంటున్నాం. మనం బ్రతకాలంటే చెట్లను పెంచాలి. బతికించాలి. ఎప్పటికి సమాజంలో మార్పు వస్తుందో ? ఈ విషయంపై నీ భావాలు తెలియజేయి.
చిరునామా :
కంచిభొట్ల లలిత,
9వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
బాపట్ల, బాపట్ల జిల్లా.
ఇట్లు,
నీ స్నేహితురాలు, అవిరా సాత్విక, 9వ తరగతి.
ఇట్లు,
పర్యావరణ ప్రేమిక కుటుంబం.
![]()
ప్రశ్న 4.
“మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం” అనే అంశం పై కరపత్రం తయారు చేయండి.
జవాబు:
మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం
మా ఇంట్లో కాగితపు సంచులనే వాడతాం.
పర్యావరణ గృహం
మా ఇంట్లో మట్టికుండలను, మట్టి మూకుళ్ళనే వాడతాం.
పెరట్లో అన్నిరకాల మొక్కలు ఉన్నాయి.
కాయలు, పళ్ళు మేము సగం కోసుకుని సగం పక్షులకు విడిచిపెడతాం.
పక్షలకు జంతువులకు ఆహారం, నీళ్ళు అందిస్తాము.
మా ఇంట్లో ఆసనాలు, పాన్పులు తుంగ చాపలే.
మా ఇంట్లో నూలుబట్టలనే వాడతాము
తలంటుకు కుంకుడు కాయలే వాడతాము
మేము ఎరువులు పురుగుమందులు వాడకుండానే పంటలను పండిస్తాం.
మేము బట్టలు, సరుకులు భద్రపరుచుకోవటానికి తాటాకు బుట్టలనే వాడతాం.
మా ఇల్లు కూడా మట్టితో నిర్మించినదే
పై కప్పుకు దుబ్బుగడ్డి వాడతాం
త్రాగటానికి నూతినీరు వాడతాం
కేవలం మా గేదెలను గడ్డి పెట్టే పెంచుతాము
దాణాగా ఉలవలు, తెలగపిండి, చిట్టు, తవుడు, వంటివి పెడతాము.
అందుచేత మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహమని ఖచ్చితంగా చెప్పగలం.
మీరు కూడా పర్యావరణ పరిరక్షణ గృహాలను నిర్మించుకోండి.
భాషాంశాలు :
పదజాలం :
అ) కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాక్య ప్రయోగం చేయండి.
1. పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారు చేసు కుంటాయి.
జవాబు:
హరితము = పచ్చదనం.
ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఇల్లు ఆరోగ్యంతో కలకల లాడుతుంది.
2. గాలి, వాన వలన చాలా ఉపద్రవం కలిగింది.
జవాబు:
ఉపద్రవం = ప్రమాదం
ప్రమాదం జరిగినపుడే ధైర్యంగా ఉండాలి.
3. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి.
జవాబు:
బాహువులు = చేతులు
రాముని చేతులు యాగరక్షణ చేశాయి.
![]()
4. వేసవి కాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు.
జవాబు:
ఛాయ = నీడ
మర్రిచెట్టు నీడలో చాలా మంచి సేద తీరవచ్చు.
5. జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషిత మవుతున్నాయి.
జవాబు:
గరళం = విషం
లేనిపోని మాటలతో ఇతరుల జీవితాలలో విషం జిమ్మ కూడదు.
ఆ) కింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి.
1. చెట్లను రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి.
జవాబు:
చెట్లు = తరువులు, భూజములు’
2. పెళ్లిలో వధూవరులను ముస్తాబు చేశారు.
జవాబు:
ముస్తాబు = అలంకరణ,అందంగా తయారుచేయడం
3. నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు.
జవాబు:
జాడ = గుర్తు, ఆసవాలు
![]()
4. ఏటేటా భూగోళం మీద తాపం పెరుగుతూ ఉంది.
జవాబు:
తాపం = వేడి, ఉష్ణం, సెగ
5. సముద్రాల్లో కూడా కాలుష్యం పెరుగుతూ ఉంది.
జవాబు:
సముద్రం = పయోధి, జలధి
ఇ) కింది నానార్థాలను జతచేయండి.

జవాబు:
1. ఎండ – (ఉ) వెలుగు, ఆతపం
2. కాలం – (ఇ) సమయం, నలుపు
3. కాయం – (ఆ) శరీరం, గురి, స్వభావం
4. జాడ – (అ) విధం, ఆచూకి, దారి
5. దాహం – (ఈ) దప్పిక, కాలుట
ఈ) కింది ప్రకృతి, వికృతులను జతపరచండి.

జవాబు:
1. మనిషి – (ఇ) మానిసి
2. పట్టణం – (ఈ) పత్తనం
3. సముద్రం – (ఆ) సంద్రం
4. ఛాయ – (ఉ) చాయ
5. కథ – (అ) కత
ఉ) కింది వాక్యాలలో జాతీయాలను వివరించండి.
1. అందరికీ చెట్టొక పానకంలో పుడక.
జవాబు:
పానకంలో పుడక :
వివరణ : చాలా ఆనందకరమైన సందర్భంలో సంబంధం లేనిదేదో చెప్పి (తగిలి) ఆ సందర్భానికి ఆటంకం కలిగిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవ్యాకం: నేను మంచి కథ వింటుంటే మా స్నేహితుడు మధ్యలో పానకంలో పుడకలా ఏదేదో అంటుంటాడు.
![]()
2. నగరాల్లో తామరతంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు.
జవాబు:
తామరతంపర :
వివరణ : చెరువులో తామరతీగ తొందరగా విస్తరిస్తుంది. అలాగే ఏదైనా తొందరగా విస్తరిస్తున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంత వాక్యం : ఈ రోజులలో కాన్వెంట్లు తామర తంపరగా పెరిగిపోయేయి.
3. పర్యావరణాన్ని నాశనం చేయడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే.
జవాబు:
కూర్చున్న కొమ్మను నరుక్కోవడం :
వివరణ : కూర్చొన్న కొమ్మను నరుక్కొంటే ఎవడైనా కింద పడతాడు. అలాగే ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టుకొన్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : మా బాబాయి ఉచితంగా ఇల్లిచ్చిన వారితో అనవసరంగా గొడవ పెట్టుకొని కూర్చున్న కొమ్మనే నరుక్కొన్నాడు.
4. కళ్లెదుట చెట్ల బతుకు ఉసూరుమంటుంటే మనిషి నిమ్మకు నీరెత్తినట్లున్నాడు.
జవాబు:
నిమ్మకు నీరెత్తినట్లు :
వివరణ : సాధారణంగా చెట్లకు నీరెక్కువైతే ఊటెక్కి చచ్చిపోతాయి, కాని నిమ్మచెట్టుకు ఎంత నీరెక్కువైతే అంత బలంగా బతుకుతుంది. అలాగే చాలామందికి సమస్యలంటే భయం. కొంతమంది ఎటువంటి సమస్యలు వచ్చినా నిబ్బరంగా ఉంటారు. అటువంటి వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంత వాక్యం వాళ్ల నాన్నగారు ఎన్ని సమస్యలు వచ్చినా నిబ్బరంగా నిమ్మకు నీరెత్తినట్లుంటారు.
![]()
5. ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరు నడుం కట్టాలి.
జవాబు:
నడుం కట్టాలి :
వివరణ : ఒక పని పూర్తిచేయడానికి పూర్తిగా సంసిద్ధం కావలసిన పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంత వాక్యం : అవిద్య నిర్మూలనకు నడుం కట్టాలి.
సంధులు :
వ్యాకరణాంశాలు :
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరు మంటోంది.
2. మనందరికీ చెట్టొక ప్రాణమిత్రుడు.
3. నగరాల్లో చల్లని జానెడు నీడేది ?
4. ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి.
జవాబు:

ఆ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

జవాబు:

ఇ) కింది కర్మణి వాక్యాలను, కర్తరి వాక్యాలుగా మార్చండి.
1. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది.
జవాబు:
చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు.
2. రైతుల చేత పంటలు పండింపబడతాయి.
జవాబు:
రైతులు పంటలను పండిస్తారు.
![]()
3. చెట్ల చేత ప్రాణ వాయువు అందించబడుతుంది.
జవాబు:
చెట్లు ప్రాణ వాయువును అందిస్తాయి.
4. గోపి చేత మొక్క నాటబడింది.
జవాబు:
గోపి మొక్క నాటాడు.
సమాసాలు :
అ) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.

జవాబు:

అలంకారాలు :
కింది వాక్యాలలో అలంకారం గుర్తించండి.
1. ఆక్టోపస్ విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫట్ చేస్తున్నాయి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో ఉపమాలంకారం ఉంది.
లక్షణం : ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక చెబితే అది ఉపమాలంకారం.
సమన్వయం : మనిషి చేతులను ఆక్టోపస్తో పోల్చేరు.
ఉపమేయం : చేతులు
సమాన ధర్మం: హాంఫట్ చేయడం
ఉపమానం : ఆక్టోపస్
ఉపమావాచకం : లా (వలె) కనక ఇచ్చిన దానిలో ఉపమాలంకారం ఉంది.
![]()
2. ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో ఉపమాలంకారం ఉంది.
లక్షణం : ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక చెబితే అది ఉపమాలంకారం.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో ప్లాస్టిక్ కొబ్బరిచెట్లను శవాలతో పోల్చారు. దీనిలో.
ఉపమేయం : ప్లాస్టిక్ కొబ్బరిచెట్లు
సమాన ధర్మం : ముస్తాబు
ఉపమానం : శవాలు
ఉపమావాచకం: లా (వలె) కనుక ఇచ్చిన దానిలో ఉపమాలంకారం ఉంది.
3. ఆమె కేశాలు నల్లని త్రాచా అన్నట్లున్నాయి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది.
లక్షణం : ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం.
ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్షాలంకారం.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో కేశపాశాలను త్రాచుగా ఊహించారు. కనుక ఇచ్చినది ఉత్ప్రేక్షాలంకారం.
4. ఆ ఇటుకుల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలు అన్నట్లున్నాయి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది.
లక్షణం : ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం.
సమన్వయం : ఉపమేయమైన, ఇటుకల బట్టీలను ఉపమానం జన ఉత్ప్రేక్షాలంకారం. ఊహించేరు, కనుక ఇచ్చినది.
![]()
5. ఆ వస్తున్న ఏనుగు నడుస్తున్న కొండా అన్నట్లుంది.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది.
లక్షణం : ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్ధం.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో ఏనుగు (ఉపమేయం)ను ఉపమానమైన నడుస్తున్న కొండగా ఊహించారు. కనుక ఇచ్చినది ఉత్ప్రేక్షాలంకారం.
ప్రాజెక్టు పని :
క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మానవ మనుగడకు ఆధారమైన వృక్షాల గురించిన పాటను సాధన చేయండి.
మీ పాఠశాల సారస్వత సంఘ సమావేశంలో ప్రదర్శించండి. పాట భావాన్ని చార్టు మీద రాసి మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.
పద్య మధురిమ :
ఇంచుక జీవనంబు గ్రహియించి కృతజ్ఞత మిన్నుముట్టగా
నంచిత పుష్ప పల్లవ ఫలావళి నెంతయు వేడ్క సృష్టి గా
వించి సమస్త జీవులకు బ్రీతిగ జూఱలువెట్టు నీ మహోూ
దంచిత దాతృతా మహిమ యబ్బురముం గలిగించు వృక్షమా !
– కవితావైజయంతి – గెద్దాపు సత్యం.
భావం : ఓ వృక్షమా ! కొంచెం నీటిని తీసుకొని ఆకాశమంత కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తావు. లేత చిగుళ్ళు, పూలు, పళ్ళు సంతోషంగా సృష్టించి ఇస్తావు. సమస్త జీవులకు ప్రీతిపాత్రమౌతావు. గొప్పదైన నీ దానగుణ మహిమ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
కవి పరిచయం :

కవి : కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్
జన్మస్థలం : ప్రకాశం జిల్లా, మార్కాపురం.
తల్లిదండ్రులు : సుందర ప్రకాశరావు, రూతమ్మ దంపతులు
ఉద్యోగం : జీవశాస్త్ర అధ్యాపకులు
రచనలు : దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధదృశ్యం, ఆకుపచ్చ శోకం మొదలైన కవితా సంపుటాలు కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం నవల, విశ్వధర్మం – ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు.
ప్రత్యేకత : భావాలలో బలం కవిత్వంలో సరళత్వం ఉంటుంది. పర్యావరణ ఇతివృత్తంగా వచన కవితలు వ్రాయటంలో దిట్ట మానవ తప్పిదాలను విమర్శిస్తూ బాధ్యతలను గుర్తుచేస్తూ దిశానిర్దేశం చేయడానికి చిన్న చిన్న పదాలతో స్పష్టమైన భావాన్ని తన కవిత్వంలో వ్యక్తీకరిస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆకుపచ్చ శోకం కవితా సంకలనంలోనిది.
![]()
ఉద్దేశం :

భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులను ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒక వైపు, అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ – పర్యావరణ కవిత్వం :

తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని దాని వలన కలిగే పర్యవసానాలను తెలియచెప్పడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో, వ్యాసరూపంలో వ్యక్తీకరిస్తారు. అందువలన దీనిని ‘కవితా వ్యాసం’ అని కూడా అంటారు.

పదాలు – అర్థాలు :
- చావు = మరణం
- మురిపెం = లాలన
- మ్రాను = చెట్టు
- తంత్రం = పని
- పొలిమేర = ఊరిచివర
- ఉచితం = తగినది.
- బీభత్సం = భయం కొలిపేది
- అడితి = కలప అమ్మే చోటు
- ఉపద్రవం = ప్రమాదం
- బాహువు = చేయి
- హరితం = పచ్చదనం
- లోగిలి = ఇల్లు
- ఛాయ = నీడ
- సెగ = వేడి
- జాడ = గుర్తు
- నెపము = వంక
- విధ్వంసం = నాశనం
- వల్లించడం = చదవడం
- ఉసూరుమనడం = నీరస పడడం
- మేఘం = మబ్బు
- బొగ్గుపులుసు వాయువు = కార్బన్ డయాక్సైడు
- ఆమ్లజని = ఆక్సిజన్
- తాపం = వేడి
- జలం = నీరు
- వాయువు = గాలి
- మరిగి = మసలి
- ఇరు = రెండు
- ధ్రువాలు = కొనలు
- మీమాంస = సందేహం